ఇది చీకటనీ .. యిది దుఃఖమనీ ..
నల్లమబ్బులా కమ్మే ఒకానొక విషాద రుతువులో
మనం బతుకుతున్నామనీ ఎవరు జెబుతారు ?
కవులే చెబుతారు !
దుంఖపూరితులైన మానవులకు
కాసింత ధైర్యాన్నీ .. బతుకుపట్ల యించుక భరోసానీ ..
కన్నీరు తుడిచీ ఓ చిటికెడు ఓదార్పును ఎవరందిస్తారు ?
కవులే అందిస్తారు
భూముల్ని సారవంతం జేసినట్టు
దేశాన్ని పోరువంతం జేసేందుకు ..
మేధోమాగాణీమీద భావజాలవిత్తుల్ని వెదజల్లి
జనాల్ని వీరులుగా పోరాటయోధులుగా ఎవరు జేస్తారు ?
కవులే జేస్తారు !
కవులు .. సమాజ నిర్మాతలు
దేశానికి రుజుమార్గం చూపే చూపుడువేళ్లు
పల్లంవేపు నది ప్రవహించినట్టు
అన్ని వివక్షతలకూ అతీతంగా
పీడిత ప్రజల్లోకి ప్రవహించే జీవనదులు
నదులూ అడవులూ పర్వతాల్లానే .. కవులు
ప్రజల వారసత్వసంపద .. !
కానీ .. రాజ్యం దురహంకారి
ఒకవేపు కాషాయికరణ .. మరోవేపు కార్పోరేటీకరణ
ఏకకాలంలో సంస్కృతినీ సంపదనీ
ధ్వంసం చేస్తున్న శక్తుల చీకటి భాగోతాలని వెలికితీస్తారని
కవుల కలాల్ని నిషేదిస్తుంది .. నిర్బంధిస్తుంది
తన దారికి తెచ్చుకోవాలనీ తాయిళాలిస్తుంది
తన కొలువులో బట్రాజుల్ని జేసీ భజన చేయమంటుంది !
కానీ .. కవులు కొడవళ్లై ప్రశ్నిస్తారు
ప్రతిపక్షమై కతాయిస్తారు
ప్రజాపక్షమై ప్రతిఘటిస్తారు
సరిహద్ధురేఖమీద చూపుడు వేలై హెచ్చరిస్తారు
తక్కెడముళ్లులా న్యాయంవేపు మొగ్గుజూపుతారు
అక్షరాల్ని అగ్నికణికల్నిజేసీ రాజ్యం మీదకు వెదజల్లుతారు
గతితప్పిన వ్యవస్థను గాడిలో పెట్టే పోరుదివిటీలవుతారు !
కవులు భయపడరు నడిచే సూరీళ్లు కనక
తూరుపుకొండల్లోంచి ఎగిసే కాంతి జలపాతాలు కనుక
వాళ్లు వీధుల్లో సదా స్వేచ్ఛాగీతాలు పాడుకుంటూ పోతారు
చీకటిని ధిక్కరిస్తూ అడుగేస్తారు .. ఎవకలపొద్దుల్ని వెలిగిస్తుంటారు
వేమనకు మరణం లేదు .. పోతనకు మరణం లేదు
శ్రీశ్రీ గురజాడలకు చావులేదు .. కవులు చిరంజీవులు
వేనవేల తురాయిపూల కళ్లతో సమాజాన్ని పరికిస్తారు
మానవ సంక్లిష్టతల్ని పొరలు పొరలుగా విప్పిచెబుతూ ..
పరివర్తనల్ని సరిదిద్దుతూ ..
మహా చరిత్రకు మౌన సాక్షులుగా మిగిలిపోతారు వాళ్లంతే ..!!