డాన్ నది ప్రశాంతంగా ప్రవహిస్తుంది – భాగం 6

Spread the love

  స్టీఫెన్ గ్రెగరి దగ్గరకు వచ్చి, అతని చేతిలోని పగ్గాలను గట్టిగా పట్టుకుని, గుర్రానికి గట్టిగా తగిలేలా నిలుచున్నాడు.

  ‘గ్రెగరి,ఎలా ఉన్నావు నీవు?’

   ‘దేవుడి దయ వల్ల బాగానే ఉన్నాను.’

     ‘ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావు చెప్పు?’

     ‘నేను ఎందుకు ఆలోచించాలి?’

      ‘నువ్వు పక్కోడి పెళ్ళాన్ని లేపుకొచ్చి ఆమెతో హాయిగా కులుకుతున్నావా?’

     ‘ఆ కళ్ళెం వదిలేయ్.’

      ‘భయపడకు…నేను నిన్ను కొట్టను.’

       ‘నేనేం భయపడటం లేదు. నువ్వు అది వదిలేస్తే మంచిది!’గ్రెగరి చిటిక వేస్తూ,ఎర్రబడిన ముఖంతో అన్నాడు.

     ‘ఈ రోజు నేను నీతో గొడవ పడను.నాకు ఇప్పుడు పడాలని లేదు….కానీ గుర్తు పెట్టుకో గ్రీషా: త్వరలో లేకపోతే ఆ తర్వాతైనా సరే నేను నిన్ను చంపేస్తాను!’

     ‘వేచి చూడండి అని ఓ గుడ్డి వాడు చెప్పాడు.’

   ‘సరే,నీకు అది గుర్తుకు వచ్చింది కదా,ఇది కూడా గుర్తు పెట్టుకో. నువ్వు నా పట్ల చేయకూడని తప్పు చేశావు! నా జీవితంలోని సారం అంతా పీల్చేసి,నన్ను పనికిరాని వాడిలా చేశావు. చూడు!’ స్టీఫెన్ తన చేతులు బయటకు చాచి, గట్టిపడి ఉన్న అరచేతులు చూపిస్తూ, ‘నేను పొలం దున్నుతున్నాను,కానీ అది ఎందుకు చేస్తున్నానో నాకే తెలియడం లేదు. నాకు ఇంకా ఎంత కావాలని? నేను ఈ పనులేమి చేయకుండానే ఈ చలికాలం కూడా హాయిగా గడిచిపోతుంది. కానీ ఈ ఒంటరితనమే నన్ను చంపేస్తుంది…..హే,నువ్వు నా పట్ల చాలా పెద్ద తప్పు చేశావు,గ్రెగరి!’అన్నాడు.

     ‘నా దగ్గరకు ఏడుస్తూ రావద్దు. కడుపు నిండిన వాడికి ఆకలి బాధ అర్థం కాదు.’

     ‘అది నిజమే’, స్టీఫెన్ ఒప్పుకున్నట్టు,గ్రెగరి ముఖంలోకి చూస్తూ,చిన్న పిల్లాడిలా చిరునవ్వు నవ్వాడు,ఆ నవ్వు వల్ల ఆ ముఖం మీద ముడతలు ఇంకా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి.

‘కానీ ఒక్క విషయం గురించి మాత్రం నేను పశ్చాత్తాపపడుతున్నాను……నీకు పోయిన సంవత్సరం కన్నా ముందు సంవత్సరంలో మనం ష్రోవేటైడ్ లో కొట్టుకున్నది గుర్తుందా?’

      ‘ఎప్పుడు?’ గ్రెగరి అడిగాడు.

      ‘అదే ఫెల్టర్ చచ్చిపోయిన సంవత్సరం. అప్పుడు బ్రహ్మచారులు పెళ్ళయిన వారితో గొడవ పడ్డారు,గుర్తుందా? నిన్ను ఎలా వెంబడించానో గుర్తుందా? నాతో పోలిస్తే నువ్వు చాలా తేలికైన బరువుతో ఉన్నావు,అంతే. నేను నిన్ను చూసి జాలిపడ్డాను. ఒకవేళ అలా జాలి పడకుండా ఆ రోజే నిన్ను పట్టుకుని నాలుగు ఇచ్చి ఉంటే,చచ్చి ఉండేవాడివి!భయంతో నువ్వు పరిగెడుతున్నప్పుడు నీ డొక్కల్లో నిజంగా ఇచ్చి ఉంటే,అప్పుడే నీ కథ ముగిసిపోయేది!’

    ‘అంత బాధపడకు,మరలా ఏదో ఒక రోజు మనిద్దరం తలపడాల్సి వస్తుంది.’

    స్టీఫెన్  ఏదో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ గట్టిగా తన నుదురు రుద్దుకున్నాడు.

  అప్పుడే వెనుక గుర్రం మీద వస్తున్న లిస్ట్ నిట్స్కి కదలకుండా ఉన్న గ్రెగరిని చూసి పదమని అరిచాడు.  

   అప్పటికి కళ్ళెంని అలాగే పట్టుకుని అడ్డంగా నిలబడి ఉన్నాడు స్టీఫెన్ కదలకుండా. గ్రెగరి అతని వైపు పరీక్షగా చూశాడు. గుర్రం పై నుండి చూస్తూ ఉంటే అతనికి స్టీఫెన్ బుగ్గల మీద దుమ్ము,క్షవరం చేయని గడ్డం కనిపించాయి. టోపీ ముఖం మీదకు జారిపోతూ ఉంది. దుమ్ము పట్టి,చెమట నిండి ఉన్న ఆ ముఖం ఒక అపరిచితునిదిలా అనిపించింది గ్రెగరికి ఆ క్షణం. గ్రెగరికి ఏదో కొండ మీద నుండి దూరంలో మంచులో తడిసి ఉన్న ఓ మైదానాన్ని చూస్తున్నట్టు అనిపించింది. అతని ముఖం అంతా పాలిపోయి, రక్తం ఇంకిపోయినట్లు ఉంది. కొద్ది నిమిషాల తర్వాత అడ్డు తొలగి,గ్రెగరికి వీడ్కోలు చెప్పకుండానే వెనక్కి తప్పుకున్నాడు. గ్రెగరి కిందకు దిగి గుర్రాన్ని నడిపిస్తూ ఉన్నాడు.

     ‘ఒక్క నిమిషం! అక్సిన్య…అక్సిన్య  ఎలా ఉంది?’

  గ్రెగరి తన బూటుకు అంటుకుని ఉన్న మట్టిని దులుపుకున్నాడు.

  ‘బాగానే ఉంది.’

   తర్వాత గుర్రాన్ని ఒకసారి చూసి,వెనక్కి తిరిగాడు. స్టీఫెన్ తన రెండు కాళ్ళు ఎడం చేసి నిలబడి, చెట్టు కాడను నములుతూ నిలుచుని ఉన్నాడు. ఒక్క నిమిషం గ్రెగరికి అతని పట్ల చెప్పలేనంత జాలి కలిగింది ,కానీ వెంటనే అతని మనసులో ఉన్న అసూయ ఆ జాలిని తరిమేసింది. అతను ఒక్కసారిగా గుర్రం ఎక్కి,దాన్ని వెనక్కి తిప్పి, ‘ఆమె అసలు నీ గురించి ఆలోచించడం లేదు,కాబట్టి బాధ పడకు!’అని అరిచాడు.

  ‘అవునా?’

  గ్రెగరి మరలా గుర్రాన్ని దారిలోకి మళ్లించి,ఏం బదులివ్వకుండానే ముందుకు సాగిపోయాడు.

                               *     *     *

అక్సిన్య తన గర్భం గురించి గ్రెగరికి ఆరవ నెలలోనే,ఇక దాచలేని పరిస్థితిలోనే చెప్పింది. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి గ్రెగరి అన్న విషయాన్ని నమ్ముతాడో లేదో అన్న భయంతో ఆమె అప్పటివరకూ చెప్పలేదు. ఆమె ముఖమంతా ఆ  విషయాన్ని అన్నాళ్ళు దాచే క్రమంలో ఉన్న భయం,దుఃఖాలతో పసుపుగా పాలిపోయి ఉంది.

   మొదటి నెలల్లోనే మాంసాన్ని చూస్తేనే ఆమెకు వికారంగా ఉండేది,కానీ గ్రెగరి ఇదేమి గమనించలేదు,అసలు కారణాన్ని గురించి ఆలోచించనూ లేదు.

   ఆ సంభాషణ ఒక రోజు సాయంత్రం జరిగింది. ఆ విషయం చెప్పాక,అక్సిన్య అతని ముఖంలో ఏవైనా మార్పు సూచనలు కనిపిస్తాయేమోనని ఆతురుతతో చూసింది. కానీ అతను తన తలను కిటికీ వైపుకి తిప్పుకుని,విసుగ్గా దగ్గాడు.

     ‘నువ్వు నాకు ముందు ఎందుకు చెప్పలేదు?’

       ‘నాకు భయం వేసింది,గ్రీషా …….నువ్వు వదిలేస్తావని అనుకున్నాను.’

        గ్రెగరి తన వేళ్ళతో మంచం మీద దరువు వేశాడు.

        ‘ఇంకా ఎంత సమయం ఉంది?’

    ‘ఆగస్టులో అనుకుంటున్నాను.’

      ‘అది స్టీఫెన్ దా?’

        ‘లేదు,నీదే బిడ్డ.’

        ‘అవునా?’

          ‘నీకు నువ్వే ఆలోచించుకో…..చెక్క నరకడం మొదలైనప్పటి నుండి,ఇప్పటికీ ….’

          ‘నువ్వు లేనివి సృష్టించకు. అది స్టీఫెన్ ది అయినా,ఇపుడు చేయగలిగింది ఏమి లేదు. నాకు సూటిగా సమాధానం కావాలి.’

     అక్సిన్య బెంచి మీద కూర్చుని, కోపంతో నిండిన కన్నీళ్ళతో,తనలో తానే గొణుక్కుంటున్నట్టు అంది.

     ‘అతనితో నేను ఎన్నో ఏళ్ళు ఉన్నా,ఏమి జరగలేదు! అది నీకు కనిపించడం లేదా? నాకు ఏ విధమైన అనారోగ్యం లేదు…..అంటే ఇది నీ వల్లే జరిగి ఉంటుంది.’

    గ్రెగరి ఆ విషయం గురించి ఇంకా ఏమి మాట్లాడలేదు. ఓ కొత్త రకమైన ముభావంతో కూడిన జాలి కొత్తగా అక్సిన్య పట్ల కలిగింది గ్రెగరి మనసులో.ఆమె అతని ప్రేమ కోసం పాకులాడలేదు,అలానే తన లోకంలో తాను ఉండిపోయింది. ఆమె చూపుల్లో ఇదివరకటి మెరుపు లేదు కానీ,ఆమె ఆకృతి మాత్రం ఆ గర్భం వల్ల ఏ మాత్రం చెడిపోలేదు. ఒక్క ఆమె పొట్ట నిండుగా ఉంది,ఆమె సన్నటి ముఖంలో ఏ మార్పు లేదు. ఆమె తన పని తాను ఏ ఇబ్బంది లేకుండా చేసుకుంటూ ఉంది. ఆ సంవత్సరం పని వాళ్ళు తక్కువ మంది ఉండటం వల్ల వంట పని తక్కువే ఉంది.

     వృద్ధుడిగా సాష్కా చూపించే ఆపేక్ష వల్ల అక్సిన్యకు అతని పట్ల అనురాగం ఏర్పడింది. బహుశా అతన్ని ఆమె కూతురిలా చూసుకోవడం వల్ల అలా జరిగి ఉండొచ్చు. అతని బట్టలు ఉతికేది,చిరిగిపోయిన చొక్కాలు కుట్టేది, అతను తినడానికి మెత్తగా ఉండే తిండి పెట్టేది.  గుర్రపుశాలలో పని అయిపోయాక,సాష్కా వంటగదిలోకి నీళ్ళు తెచ్చేవాడు, పందుల కోసం ఉడకబెట్టిన బంగాళాదుంపలను మెత్తగా చేసేవాడు,అలాగే అక్కడ ఉన్న చిన్న చిన్న పనులు చేసేవాడు,ప్రతి పని చేస్తూ తన బోసి పళ్ళు బయట పడేలా,చిన్న పిల్లాడిలా గంతులు వేస్తూ చేసేవాడు.

    ‘అమ్మాయి,నువ్వు నాతో చాలా మంచిగా ఉన్నావు.నీ రుణం ఎలా అయినా తీర్చుకుంటున్నాను!నీ కోసం క చక్కటి మగ్గు తెచ్చి పెడతాను. నాకు వీలుంటే నా గుండెల్లో నుండి తీసి ఇచ్చేవాడిని.మంచికో,చెడికో నా జీవితంలో ఏ స్త్రీ నా పట్ల శ్రద్ధ చూపించలేదు!ఈ  ఎలుకలు నన్ను తినేస్తున్నాయి. మీకు ఏమైనా కావాలంటే తప్పకుండా అడుగు!’

      గ్రెగరి కుర్ర యజమాని దయ వల్ల శిక్షణా శిబిరానికి వెళ్ళాల్సిన అవసరం తప్పింది. అతను తనకుతోట పనులు చేసేవాడు,వృద్ధ జనరల్ ని స్టానిట్సా కు తీసుకువెళ్ళేవాడు,మిగిలిన సమయమంతా ఆయనతో కలిసి అడవి పక్షులను వేటాడుతూ,తరుముతూ గడిపేవాడు. ఎంతో సౌకర్యవంతమగా ఉన్న జీవితం అతన్ని పాడు చేసింది. అతను బద్ధకంగా తయారయ్యాడు,బరువు పెరిగి, తన వయసు కన్నా పెద్దవాడిలా కనిపిస్తున్నాడు. అతన్ని భయపెట్టే విషయం ఒకటే-అది సైన్యంలో పని చేయాల్సి రావటం. అతనికి సొంత గుర్రం,అందుకు కావాల్సిన మిగిలిన సామగ్రి కానీ లేదు. తండ్రి ఇస్తాడన్న ఆశ ఎటూ లేదు. అతను తనకు,అక్సిన్యకు వచ్చే జీతాన్ని కూడా అసలు ఖర్చు పెట్టేవాడు కాదు,ఆఖరికి పొగాకు కూడా మానేశాడు,ఎలా అయినా గుర్రాన్ని తండ్రి నుండి అడుక్కోకుండా కొనుక్కోవాలన్న కోరికతో. వృద్ధ జనరల్ కూడా సాయం చేస్తానని మాట ఇచ్చాడు. తండ్రి గురించి గ్రెగరి ఊహ కూడా త్వరగానే తేలిపోయింది. జూన్ నెల చివరిలో పెట్రో తమ్మున్ని చూడటానికి వచ్చాడు. మాటల మధ్యలో ఇంకా తండ్రి అతని చర్య పట్ల కోపంగా ఉన్నాడని,అందువల్ల గుర్రం నుండి ఏది కూడా ఇవ్వడానికి ఇష్టపడటం లేదని, కనుక గ్రెగరి ఏదైనా కాల్బల దళంలో చేరితే మంచిదని అన్నాడు.

    ‘సరే,ఆయన నాకేం ఇవ్వాల్సిన పని లేదు. నా సొంత గుర్రాన్ని నేనే నడుపుతాను’,గ్రెగరి ‘సొంత’అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ అన్నాడు.

 ‘నీకు ఎలా వస్తుంది అది? గాల్లో నుండా?’పెట్రో నవ్వుతూ అన్నాడు.

  ‘నాకు ఎలాగూ దొరక్కపోతే దొంగతనం చేస్తాను.’

    ‘అదే నీకు మంచిది!’

   ‘నా జీతంతో నేను కొనుక్కుంటాను’,గ్రెగరి గంభీరంగా అన్నాడు.

    పెట్రో వసారాలో కూర్చుని, పని గురించి,అక్కడ తిండి గురించి,డబ్బు గురించి అడిగాడు. తమ్ముడు చెప్పే ప్రతి దానికి తల ఆడిస్తూ విన్నాడు. తను తెలుసుకోవాల్సింది అంతా తెలుసుకున్నాక, ‘నువ్వు ఇంటికి రావచ్చు కదా? ఇక్కడ ఈ గుర్రాలను నడుపుతూ ఉండటం వల్ల ప్రయోజనం లేదు. ఇక్కడే ఉంటే నీకు అదృష్టం కలిసి వస్తుందనుకుంటున్నావా?’

   ‘నేను ఏ అదృష్టం కోసం ఇక్కడ ఉండటం లేదు.’

    ‘ఇప్పటికకైనా ఆమెతో ఉండటం గురించి ఆలోచించావా?’పెట్రో విషయం మార్చాడు.

   ‘ఆమె అంటే?’

   ‘ఇక్కడ ఉన్న ఆమె.’

      ‘ఆమెతోనే ఉండదల్చుకున్నాను. ఎందుకు?’

    ‘ఊరికే అడుగుతున్నాను,అంతే.’

    అన్న ఇంటికి వెళ్ళిపోతున్న సమయంలో,గ్రెగరి అడిగాడు, ‘ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి?’

కట్టేసి ఉన్న గుర్రాన్ని విప్పుతూ,చిన్నగా నవ్వుతూ,’కుందేలుకి ఎన్ని బొక్కలుంటాయో నీకు అన్ని ఇళ్ళు ఉన్నాయి. మేము బాగానే ఉన్నాము. అమ్మ మాత్రం నిన్ను చూడాలని తపించిపోతుంది. ఈ సంవత్సరం ఎంత గడ్డి అనుకున్నాయి,మూడు గడ్డివాములకు సరిపడా!’

   తీవ్రమైన కాంక్షతో పెట్రో నడుపుతున్న ఆ మేలు జాతి ఆడ గుర్రాన్ని చూశాడు.

   ‘ఇంకా ఇది పిల్లల్ని పెట్టలేదా ?’

     ‘లేదు,తమ్ముడు. ఇది ఒట్టి పోయింది. మనం ఖ్రిస్టోన్య నుండి తెచ్చింది పెట్టింది.’

    ‘ఆడ ,మగా?’

   ‘మగది. ఎటువంటి పిల్లనుకున్నావు-బంగారంలా ఉంది!పొడుగైన కాళ్ళు,చక్కటి డెక్కలు,మంచి ఛాతీ,మేలు జాతిది. తప్పకుండా మంచి గుర్రమవుతుంది.’

    గ్రెగరి గాఢంగా నిట్టూర్చాడు.

       ‘నేను ఊరిని చాలా మిస్ అవుతున్నాను,పెట్రో. అలాగే డాన్ ను కూడా. ఇక్కడ ఎక్కడా కూడా ప్రవహించే నీరు కనబడదు. ఇక్కడ ఉండాలంటేనే అదోలా ఉంది!’

   ‘అయితే మా దగ్గరకు రా’,పెట్రో గుర్రం ఎక్కుతూ, తమ్ముడితో ఆప్యాయంగా అన్నాడు.

   ‘ఒకరోజు తప్పకుండా వస్తాను .’

     ‘సరే,గుడ్ బై.’

         ‘జాగ్రత్తగా వెళ్ళు!’

   పెట్రో వాకిట్లో నుండి బయటకు వచ్చేశాక అతనికి హఠాత్తుగా ఏదో గుర్తుకువచ్చి,వాకిట్లోనే నిలబడి ఉన్న గ్రెగరి వైపు చూస్తూ అరిచాడు.

    ‘ఓయ్, నటాల్య గురించి….ఒక్క విషయం …..భయంకర విషయం…’

     అక్కడ బలంగా వీస్తున్న గాలి వల్ల ఆఖరి మాటలు గాలిలోనే కలిసిపోయాయి.అప్పటికే పెట్రో గుర్రం మీద దూరం వెళ్లిపోయాడు. గ్రెగరి గుర్రపుశాలలోకి వెళ్లిపోయాడు.    

     ఎంతో వేడిగా ఉన్న వేసవి కాలం అది. ఒక్క చుక్క  వాన నీరు కూడా లేదు, పంటలు ముందుగానే పక్వానికి వచ్చేశాయి. అప్పుడే వరి చేతులోకి వచ్చింది,బార్లీ పచ్చటి బరువైన ఆకులతో సిద్ధంగా ఉంది. పంట కోతల కోసం నలుగురు పనివాళ్ళను ఎక్కువగా తీసుకోవడం జరిగింది, గ్రెగరి కూడా వాళ్ళతో కలిసి పని చేయడానికి వెళ్తున్నాడు. 

      అక్సిన్య  అ రోజు ముందుగానే  వంట పూర్తి చేసి,తనను కూడా తీసుకువెళ్ళమని పోరు పెట్టసాగింది. 

     ‘నువ్వు ఎందుకు? ఇంటి దగ్గర ఉండొచ్చు కదా? ‘అతను వాదించాడు, కానీ అక్సిన్య పట్టుబట్టి, తన చేతిరుమాలును తలకు కట్టుకునిపని వాళ్ళను తీసుకుని వెళ్ళే బండి గేటు బయట ఉంటే దాని దగ్గరకు  పరిగెత్తింది.

       దేని కోసమైతే అక్సిన్య ఆతురతతో,ఆనందకరమైన అసహనంతో ఎదురుచూసిందో,దేనిని గురించి గ్రెగరి కొద్దిగా భయపడ్డాడో అది కోతల సమయంలో జరిగింది. కోతల తర్వాత ఉండే చెత్తను తొలగిస్తున్న అక్సిన్య,ఏవో సూచనలు శరీరం ఒక్కసారిగా తెలియజేయడంతో,ఆ పని వదిలేసి,ఒక్కసారిగా గడ్డి వాము దగ్గరకు వెళ్ళింది. వెంటనే ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఆమె వెనక్కి వాలి,ఆ నొప్పులు భరించలేక నాలుక కొరుక్కుంటుంది. కోత కోసే యంత్రంతో పనివాళ్ళు గుర్రాలను అదిలిస్తూ పంట కోస్తూ ముందుకు వెళ్ళిపోయారు.అలా వెళ్తున్నప్పుడు ఒక కురవాడు అక్సిన్యను చూశాడు. ‘ఏమైంది? అలా కూలబడిపోయాయి? లే,లేకపోతే అక్కడే కరిగిపోయేలా ఉన్నావు!’

       ఆ మాటలు విన్న గ్రెగరి వెంటనే ఆమె దగ్గరకు వచ్చాడు.

     ‘ఏమైంది?’

      అక్సిన్య  నొప్పితో మూలుగుతూ, ‘నొప్పులు మొదలయ్యాయి’,అంది.

      ‘నిన్ను రావద్దని చెప్పాగా,పనికిమాలినదానా! ఇప్పుడు ఏం చేయాలి?’

        ‘కోప్పడకు గ్రీషా…..ఓ!ఓ! ….గ్రీషా ,వెంటనే బండి కట్టు.నన్ను ఇంటికి తీసుకువెళ్ళు…..ఇక్కడ ఎలా కనను? ఇంతమంది మగవాళ్ళ మధ్య….’నొప్పికి తాళలేక అంది.

     గ్రెగరి వెంటనే గడ్డి మేస్తున్న గుర్రం దగ్గరకు పరిగెత్తాడు. అతను దానికి బండి కట్టి,ఆమె దగ్గరకు వచ్చేసరికి, అక్సిన్య అక్కడ దుమ్ములో కుప్పలా పడి ఉన్న బార్లీ ఆకులలో తన తల పెట్టి కడుపు దగ్గర చేయి పెట్టుకుని నొప్పి దిగమింగుకుంటూ ఉంది. చెప్పలేని బాధతో ఉబ్బిపోయి ఉన్న కళ్ళతో అతని ముఖంలోకి చూస్తూ,నోట్లో తన పైన వేసుకున్న కోటును నోట్లో కుక్కుకుంది,తన అరుపులు బయట పని వాళ్ళకు వినపడకూడదని.

   గ్రెగరి ఆమెను ఎత్తుకుని బండిలో పడుకోబెట్టి వేగంగా ఎస్టేట్ వైపుకి బండిని దౌడు తీయించాడు.

   ‘ఓ…అంత వేగం వద్దు! నేను చచ్చిపోయేలా ఉన్నాను…..!’అక్సిన్య బాధతో తలను కిందకు పైకి అంటూ అరిచింది.

     గ్రెగరి మెల్లగా కొరడాను చేతిలో అందుకుని, వెనక్కి తిరిగి చూడకుండా,ఆ అరుపును పట్టించుకోకుండా గుర్రాలను గట్టిగా అదిలించాడు.

  బుగ్గల దగ్గర చేతులు ఒత్తి పట్టుకుని,సగం మూసిన కళ్ళతో ఆ బండిలో అటూ ఇటూ అక్సిన్య శరీరం ఊగిపోసాగింది,బండి కుదుపులకు. గుర్రం వేగంగా ముందుకు పోతూ ఉంది, గ్రెగరి దృష్టిని గుర్రం మీదే నిలిపాడు. అక్సిన్య అరుపులు ఒక్క నిమిషం ఆగిపోయాయి. చక్రాలు కుదుపులకు పైకి కిందకు ఎగిసిపడటం వల్ల ఆమె తల బండి వెనక్కి తగిలింది. దీనిని గ్రెగరి మొదట గమనించలేదు,ఆ తర్వాత అర్థం అయ్యి తల వెనక్కి తిప్పాడు. ఆమె ముఖం మెలికలు తిరిగిపోయి,ఆమె బుగ్గలు బండి పక్కలకు నొక్కుకుపోయి ఉంది, నీటి బయట పడ్డ చేపలా గిలగిలా కొట్టుకుంటుంది ఆమె. ఆమె నుదురు నుండి చెమట కిందకు కారుతూ ఉంది. గ్రెగరి ఆమె తలను పైకి ఎత్తి, తన చిరిపోయిన టోపిని దాని కింద పెట్టాడు. కళ్ళు అదురుతూ ఉండగా అతని వైపు చూస్తూ, ‘నేను చచ్చిపోతున్నాను,గ్రీషా…. అంతా అయిపోయింది’,అంది.

    అతను ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు,కింద అరికాళ్ళ నుండి ఒళ్ళు చల్లబడ్డట్టు అనిపించింది. ఆమెను ఓదార్చే మాటల కోసం ఆలోచించాడు కానీ ఏమి తట్టలేదు;అతని పెదాలు వంపు తిరిగాయి,ఆమె మీద విరుచుకుపడ్డాడు,’మూర్ఖురాలా!’తన తల అడ్డంగా ఊపి,దాదాపుగా ఆమె మీదకు వంగుతూ,ఆమె కిందకు వచ్చి,మెలి తిరిగి ఉన్న ఆమె కాలును మెల్లగా పట్టి, ‘నా ప్రియమైన అక్సిన్య…’అన్నాడు.

     ఒక్క నిమిషం వరకు తగ్గు ముఖం పట్టిన నొప్పి రెట్టింపు బలంతో వెనక్కి వచ్చింది. ఆమె కడుపు దగ్గర ఏదో చీలుతున్నట్టు అనిపించి,ఆమె ఒక్కసారిగా వెనక్కి వంగి, అరిచింది. గ్రెగరి పిచ్చి ఉన్మాదంతో గుర్రాన్ని అదిలించాడు.

       ఆ చక్రాల చప్పుడులో ఆమె ఆమె ‘గ్రీషా’అని పిలిచింది అతనికి చిన్నగా వినిపించింది.

       గ్రెగరి బండి ఆపి వెనక్కి తిరిగి చూశాడు. అక్సిన్య  రక్తపు మడుగులో ఉంది,ఆమె చేతులు వేలాడబడి ఉన్నాయి;ఆమె గౌను కింద ఏదో ప్రాణి కదులుతున్నట్టు ఉంది.

     గ్రెగరి ఒక్కసారిగా కొరడా దెబ్బ తిన్న గుర్రంలా బండి వెనక్కి దూకాడు. అక్సిన్య మీదకు వంగి,ఆమె నోటి నుండి వస్తున్న వెచ్చటి ఊపిరిలో నుండి అతి కష్టం మీద కొన్ని మాటలు వినబడ్డాయి, ‘ఆ బొడ్డు తాడును విడి చేయి ….నీ చొక్కా దారంతో కట్టు….’     

     వణుకుతున్న వేళ్ళతో గ్రెగరి తన చొక్కా నుండి కొన్ని దారపు పోగులను లాగి, బొడ్డు తాడును తెంచి, ఆ రక్తపు ముద్దను ఆ పోగులతో గట్టిగా కట్టాడు.

    *      *     * 

    లిస్ట్ నిట్స్కి ఎస్టేట్ ఆ విశాలమైన లోయకు, ఎత్తైన చెట్టు బెరడు దగ్గర పెరిగిన నాచులా వేలాడుతున్నట్టు ఉంది. గాలి వీచే దిశలు ఉతర,దక్షిణాలకు మారుతూ ఉన్నాయి; సూర్యుడు ఆ నీలపు ఆకాశంలో గుడ్డు లోపలి పచ్చ సోనలా తేలుతూ ఉన్నట్టు ఉన్నాడు;వసంతకాలం వచ్చేసింది వేసవిని తరిమేస్తూ, చలికాలం మంచుతో ఆహ్వానం పలుకుతోంది.కానీ యాగ్డోనోయ్ మాత్రం ఏ చలనం లేకుండా ఉండిపోయింది. ఆ ఎస్టేట్ లో దినచర్య ఎప్పుడూ ఒకలానే కొనసాగుతూ,మిగతా ప్రపంచంతో ఏ సంబంధం లేకుండా ఉండిపోయింది.

   ఆ వాకిట్లో నల్ల బాతులు ఎర్రటి కళ్ళతో అరుస్తూ తిరుగుతున్నాయి,గినియా పక్షులు ఆ ఆవరణలో అక్కడక్కడా కనిపిస్తూ రంగుల దండలోని పూసల్లా ఉన్నాయి .రంగురంగుల ఈకలతో నిండుగా ఉన్న నెమళ్ళు గుర్రాలశాల కప్పుపై తిరుగుతూ,పిల్లుల్లా ఏడుపులాంటి ధ్వనులతో అరుస్తూ తిరుగుతూ ఉన్నాయి. ఆ వృద్ధుడైన జనరల్ అన్ని రకాల పక్షులంటే ఇష్టం. ఆయన ఆఖరికి గాయపడిన ఓ కొంగను కూడా అక్కడ ఉంచాడు.అది నవంబరు నెలలో మనుషుల గుండెలు కదిలిపోయేలా అరుస్తూ ఉంటుంది, తన తోటి వలస పక్షులతో ఎగిరిపోవడానికి ప్రయత్నిస్తూ,అది గాయపడటం వల్ల సాధ్యం కాక ఆ బాధను అలా ప్రకటిస్తూ ఉంటుంది. జనరల్ తన గది కిటికీలో నుండి అది ఎగరడానికి చేసే ప్రయత్నాన్ని,అది విఫలమవ్వడాన్ని చూస్తూ ఉండేవాడు. నేలమీద నుండి ఎగరడానికి అది గెంతినా మళ్ళీ తిరిగి నేల మీద పడిపోయేది. అలా దాన్ని చూస్తూ ఉంటే ఆయన నోరు పెద్దగా తెరుచుకునేది, ఆయన గట్టిగా నవ్వే నవ్వు ఆ గదిలోనే ప్రతిధ్వనించేది.

  వెనియమిన్  తన తలను ఎప్పటిలాగానే పైకి నిటారుగా ఉంచేవాడు, అతన్ పెద్ద తొడలు మెత్తటి మాంసం ముద్దలా ఊగుతూ ఉండేవి,ఇప్పటికీ అతను హాలులో ఒక పెట్టె మీద కూర్చుని , తనతో తానే రమ్మీ ఆడుకుంటూ గడుపుతున్నాడు. టిఖోన్ ఇంకా ఆ ముఖం మీద మచ్చలతో ఉండే లుకేరియాను ఇష్టపడుతూనే ఉన్నాడు, అలాగే సాష్కా పట్ల,పని వాళ్ళ పట్ల, గ్రెగరి పట్ల,తన యజమాని పట్ల అసూయతోనే ఉన్నాడు. లుకేరియా ఆ గాయపడిన కొంగతో ప్రేమగా ఉండటంతో దాని పట్ల కూడా అసూయ పెంచుకున్నాడు. అప్పుడప్పుడూ సాష్కా రాత్రుళ్ళు తాగి,యజమాని గది కిటికీ దగ్గరకు వెళ్ళి, కోపెక్కులు తెచ్చుకుంటూనే ఉన్నాడు.

     స్థబ్దంగా ఉన్న అక్కడి జీవితాన్ని కదిలించడానికి అక్కడ కేవలం రెండు సంఘటనలు జరిగాయి. అందులో ఒకటి అక్సిన్య బిడ్డకు జన్మనివ్వడం, రెండవది ఎంతో బాగా పెంచిన ఒక మగ బాతు కనిపించకుండా పోవడం. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అక్సిన్య బిడ్డకు బాగా అలవాటు పడిపోయి,ఆ పాపను ముద్దు చేసేవారు. ఎప్పుడైతే ఆ మగ బాతు ఈకలు తోట వెనుక కనిపించాయో (స్పష్టంగా అది నక్క చేసిన పని అని తెలిసిపోయింది),అప్పటి నుండి మళ్ళీ ఆ ఎస్టేట్ ఎప్పటిలా అయిపోయింది.

   ప్రతి రోజు ఉదయం నిద్ర లేవగానే జనరల్ వెనియమిన్ ను పిలిచేవాడు. ‘నీకు ఏమైనా కల వచ్చిందా ?’అని అడిగేవాడు.

   ‘హా,వచ్చింది ,అద్భుతమైన కల.’

    ‘అయితే ఆ కల గురించి చెప్పు’, సిగరెట్ వెలిగించుకుంటూ ఆయన ఆజ్ఞాపించేవాడు.

    అలా అనగానే వెనియమిన్ తన కల చెప్పేవాడు. ఒకవేళ అది నిరాసక్తంగా ఉన్నా లేక భయపెట్టేలా ఉన్నా,ఆయన అతన్ని నాలుగు తిట్టేవాడు.

 ‘ఎంత వెధవ్వి నువ్వు!పనికిమాలినోడా! నువ్వు వెధవ్వి కాబట్టే నీకు ఇలాంటి వెధవ కలలు వస్తున్నాయి.’

  ఇంకేమి చేయాలో పాలిపోక వెనియమిన్ ఉత్సాహభరితమైన,సంతోషాన్ని కలిగించే కలలను తానే సృజించసాగాడు. ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే దీని కోసం అతను తన ఊహా శక్తిని ఉపయోగించాల్సి వచ్చేది. అతను అలా ఊహించడానికి చాలా రోజుల ముందు నుండే కష్టపడేవాడు,ఆ పెట్టె మీద కూర్చున్నప్పుడు,దాని మీద రమ్మీ కార్డులు పరుస్తున్నప్పుడు కూడా కలల గురించే ఆలోచించేవాడు. అతను ఒక వైపు దృష్టి సారించి,అటువైపే చాలా సేపు చూస్తూ ఎంతో కష్టపడి ఆలోచించేవాడు.ఆఖరికి అతనికి నిద్రలో కూడా ఏ కలలు రావడం లేదు.లేచి,గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే అంతా శూన్యంగా అనిపించేది. అతనికి ఒక ముఖం కానీ ,ఏమి కానీ గుర్తుకు వచ్చేది కాదు.

   ఇక వెనియమిన్ సృజనా శక్తి పని చేయని స్థితికి వచ్చింది కలల విషయంలో. కానీ జనరల్ మాత్రం మంచి కలల కోసం అడుగుతూ ఉండేవాడు,కొన్ని సార్లు చెప్పినవే మళ్ళీ చెప్పినట్టు అనిపిస్తే వెంటనే కడిగేసేవాడు.

  ‘వెధవా! ఆ గుర్రం గురించి వచ్చిన కలను పోయిన గురువారం కూడా చెప్పావు కదా!ఏమైంది నీకు?’

   ‘నాకు అది మళ్ళీ నిన్న రాత్రి వచ్చింది, నికోలాయ్ అలెక్సెవిచ్! నిజంగా మళ్ళీ వచ్చింది,ఆ దేవుడే దానికి సాక్షి!’ అవసరానికి తగ్గట్టు వెనియమిన్ వెంటనే అబద్ధాలు కూడా చెప్పేవాడు.

  డిసెంబర్ లో గ్రెగరిని స్టానిట్సా పరిపాలక వ్యవస్థ ముందు వ్యోషేన్ స్కాయా లో హాజరు కావాలని పిలుపు వచ్చింది. అతనికి గుర్రం కొనుక్కోవడానికి వంద రూబుల్స్ ఇచ్చారు. దానితో పాటు క్రిస్టమస్ తర్వాత రెండవ రోజున మాంకోవో పట్టణంలో సైనికులని తీసుకునే కేంద్రం వద్దకు వెళ్ళాలన్న ఆజ్ఞ కూడా ఇవ్వబడింది.

       నిరుత్సాహంతో గ్రెగరి స్టానిట్సా నుండి తిరిగి వచ్చాడు. క్రిస్టమస్ దగ్గర పడినా అతని దగ్గర ఏది సిద్ధంగా లేదు. ఆ పరిపాలక వ్యవస్థ ద్వారా వచ్చిన డబ్బుతో,తను దాచుకున్నది కూడా కలిపి ఒబ్రిస్కీ గ్రామంలో నూట నలభై రూబుల్స్ తో ఒక గుర్రాన్ని కొన్నాడు. సాష్కా అతనితో కూడా వెళ్ళి ఆరేళ్ళ వయసున్న గుర్రాన్ని బేరమాడటంలో సాయంగా ఉన్నాడు .అది బాగానే ఉన్నా కంటి చూపులో మాత్రం చిన్న లోపం ఉంది. సాష్కా తన మీసాన్ని సవరించుకుంటూ,’ఇంతకన్నా మంచివి ఈ ధరలో రావడం కష్టం.అయినా ఇంత చిన్న లోపాన్ని అధికారులు కనిపెట్టడం చాలా కష్టం.వాళ్ళకు అంత తెలివి లేదు’,అన్నాడు.

     గ్రెగరి ఆ గుర్రం మీద ఇంటికి వచ్చాడు,మధ్యలో దాని చేత మామూలు నడక,చిన్నగా పరుగు పెట్టించాడు,దాని పనితనం చూసేందుకు. క్రిస్టమస్ కు ఒక వారం ముందు పాంటెలి  తనకు తానే యాగ్డోనోయ్ కి బండి మీద వచ్చాడు. అతను గుర్రాన్ని కంచెకు కట్టేసి, తన గడ్డం మీద, తన మెడ దగ్గర పట్టిన మంచు బిందువులను విదిలించుకుంటూ, పని వాళ్ళ క్వార్టర్స్ కు కుంటుకుంటూ వెళ్ళాడు.గ్రెగరి కిటికీలో నుండి తండ్రిని చూసి ఆశ్చర్యపోయాడు.

   ‘అటు చూడు….నాన్న!’

   ప్రత్యేకమైన కారణం ఏమి లేకపోయినా అక్సిన్య ఊయల దగ్గరకు వెళ్ళి, బిడ్డను తీసి ఎత్తుకుంది.

    చల్లటి గాలి వీస్తూ ఉంటే పాంటెలి ఆ గదిలోకి ప్రవేశించి,తన టోపీని తీసి, గదిలో ఉన్న దేవుడి పటానికి నమస్కరించి,తర్వాత నెమ్మదిగా ఆ గది అంతటిని పరిశీలించాడు.

 ‘నువ్వు బాగున్నావనే అనుకుంటున్నాను!’ కొడుకుతో అన్నాడు.

  ‘హలో నాన్నా,’గ్రెగరి బెంచి మీద నుండి లేస్తూ స్పందించాడు. ఆయన ఒక అడుగు ముందుకు వేసి,గది మధ్యలో ఆగాడు.

    పాంటెలి చల్లగా ఉన్న తన చేతిని కొడుక్కి అందించి,బెంచికి ఒక మూల కూర్చుని,తన చలి కోటు ముందుకు లాక్కున్నాడు. అతను ఊయల పక్కన నిలబడి ఉన్న అక్సిన్యను పట్టించుకోలేదు.

      ‘సైన్యానికి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నావా?’

       ‘అవును.’

          పాంటెలి ఏమి మాట్లాడకుండా తన కొడుకు వైపు పరీక్షగా చూశాడు.

            ‘ఆ కోటు తీసెయ్యండి నాన్నా.మీకు చలి వేస్తున్నట్టు ఉంది?’

         ‘పర్వాలేదు.’

        ‘సమోవర్ ను వేడి చేస్తాను.’

        ‘ధన్యవాదాలు’, తన కోటు మీద ఉన్న దుమ్మును దులుపుకుంటూ అన్నాడు.

        ‘నేను నీకు అవసరపడతాయని రెండు కోట్లు,రెండు పైజమాలు, ఒక జీను తెచ్చాను.వెళ్ళి తీసుకో….బయట బండిలో ఉన్నాయి.’

      గ్రెగరి బయటకు వెళ్ళి బండిలో పెట్టి ఉన్న రెండు సంచులను లోపలికి తెచ్చాడు.

  ‘నువ్వు ఎప్పటికల్లా వెళ్ళాలి?’తండ్రి లేస్తూ,అడిగాడు.

   ‘క్రిస్టమస్ అయిన తర్వాత రెండో రోజున. అప్పుడే బయల్దేరుతున్నావా,నాన్నా?’

  ‘హా,నేను కొంచెం తొందరలో ఉన్నాను. నేను ఇంటికి చీకటి పడకముందే వెళ్ళాలి.’

     అతను గ్రెగరికి వీడ్కోలు చెప్పి,అక్సిన్యను అసలు పట్టించుకోకుండా తలుపు దగ్గరకు వెళ్ళాడు.

    తలుపు గడియ తీయబోతూ, వెనక్కి తిరిగి ఊయల వైపు చూస్తూ,’మీ అమ్మ నీ మీద బెంగ పెట్టుకుంది,నిన్ను అడిగానని చెప్పమంది. తనకు కాళ్ళ నొప్పులు ఎక్కువయ్యాయి’,అన్నాడు. కాసేపు విరామం ఇచ్చి, అతి కష్టం మీద నోరు పెగుల్చుకుని, ‘నువ్వు వెళ్ళే రోజున నేను కూడా నీతో పాటు మాంకోవో వరకు వస్తాను. సిద్ధంగా ఉండు’,అన్నాడు.

పాంటెలి బయటకు నడిచాడు, చేతులకు ఉన్న గ్లోవులను వెచ్చదనం కోసం చేతులకి ధరించాడు. తనకు జరిగిన అవమానం వల్ల పాలిపోయిన ముఖంతో ఉన్న అక్సిన్య ఏమి మాట్లాడలేదు. గ్రెగరి పక్క నుండి ఆమె వైపు చూస్తూ గది బయటకు నడిచాడు.

   క్రిస్టమస్ మొదటి రోజున గ్రెగరి లిస్ట్ నిట్స్కి ను వ్యోషెన్ స్కాయాకు గుర్రపు బండి మీద తీసుకువెళ్ళాడు.

   అక్కడ ఉన్న ప్రజలను కలిసి, అక్కడ దగ్గరలో ఉన్న ఓ పెద్ద ఎస్టేటుకి యజమానురాలు మరియు తనకు బంధువు అయిన ఓ స్త్రీతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశాడు. ఆ తర్వాత గ్రెగరి ని బండి సిద్ధం చేయమని ఆజ్ఞాపించాడు.

   గ్రెగరి అప్పటికి తను తింటున్న పోర్క్,క్యాబేజీ సూపు తినడం పూర్తి కాకపోయినా,వెంటనే లేచి గుర్రపుశాల దగ్గరకు వెళ్ళాడు. అక్కడ గుర్రపుశాలలో ఉన్న మేలు జాతి గుర్రాన్ని బయటకు తీసుకువచ్చి,బండిని సిద్ధం చేశాడు.

   అప్పటికే చల్లటి గాలి వీస్తూ,చిన్నగా మంచు పడుతూ ఉంది. అప్పటికే తోటలో ఉన్న చెట్ల కొమ్మలపై మంచు పట్టి ఉంది. ఆ గాలి వల్ల,ఆ మంచు కొద్దిగా మెరుస్తూ ఉంది. ఆ ఇంటి కప్పు పైన నుండి వస్తున్న చిమ్ని పొగ వస్తూ ఉంది,అక్కడే కొన్ని కాకులు కూర్చుని అరుస్తూ ఉన్నాయి. అవి అడుగుల చప్పుడుకి అక్కడ నుండి ఎగిరిపోయి ఇంటి చుట్టూ గుండ్రంగా మంచు ముక్కల్లా తిరుగుతూ,అక్కడి నుండి దక్షిణంలో ఉన్న చర్చి వైపుకి వెళ్ళిపోయాయి.

   ‘బండి సిద్ధంగా ఉందని చెప్పు!’ గ్రెగరి అప్పుడే వాకిట్లోకి వచ్చిన ఓ పని మనిషితో అన్నాడు.

  తన మీసాన్ని సవరించుకుంటూ అప్పుడే లిస్ట్ నిట్స్కి ఇంటి నుండి బయటకు వచ్చాడు. గ్రెగరి వెంటనే ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనకు చెప్పులు అందించి,ఆయన కప్పుకున్న రగ్గును జారిపోకుండా సర్దాడు.    

‘త్వరగా పోనీ’,గుర్రం వైపు  చూస్తూ లిస్ట్ నిట్స్కి ఆజ్ఞాపించాడు.

  చలికి వణుకుతున్న చేతులతో కళ్ళెంని పట్టుకుని,గ్రెగరి బండిని నడుపుతూ,మొదటి సారి చలికాలంలో జనరల్ ని తీసుకుని వచ్చినప్పుడు,ఆ బండిని సరిగ్గా నడపలేకపోతున్నప్పుడు వెనుక నుండి జనరల్ గట్టిగా ఒక గుద్దు గుద్దిన విషయం గుర్తుకు వచ్చింది.బ్రిడ్జి కింద నుండి బండిని పోనిస్తున్న గ్రెగరి అంత చలిలో కూడా ఒక్కసారే తన బుగ్గల మీద వెచ్చగా అనుకున్నాడు.

      వాళ్ళు యాగ్డోనోయ్ కి రెండు గంటల్లో చేరుకున్నారు. లిస్ట్ నిట్స్కి ఆ దారంతా మౌనంగానే ఉన్నాడు. మధ్యమధ్యలో తను సిగరెట్ వెలిగించుకోవడానికి బండిని నెమ్మదిగా పోనిమ్మని సంకేతంగా అతని భుజం మీద తట్టడం మినహాయించి.

    వాళ్ళు ఆ ఏటవాలు దారిలో నుండి ఎస్టేట్ దగ్గరకు వచ్చే సమయానికి, ఆయన అడిగాడు, ‘నువ్వు రేపు ఉదయమే వెళ్ళాలి కదూ?’

      గ్రెగరి పక్కకు తిరిగి, గడ్డ కట్టినట్టు ఉన్న తన పెదాల నుండి కేవలం ‘అవును’అని మాత్రమే అనగలిగాడు. చలివల్ల అతని నాలుక ఉబ్బిపోయి,పళ్ళకు అతుక్కుపోయినట్లు ఉంది.

      ‘నీకు రావాల్సిన సొమ్ము అందిందా?’

      ‘అందింది.’

        ‘నీ భార్య గురించి దిగులు పడకు,ఆమె అక్కడే ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండు. మీ తాతయ్య గొప్ప కోసాక్కు. నువ్వు కూడా…’ఆ జనరల్ గొంతు కొద్దిగా కీచుగా ఉంది చలి వల్ల. ‘నువ్వు కూడా మీ తాతయ్య,నాన్నల పేర్లు నిలబెట్టేలా ఉండాలి. 1883లో ఇంపీరియల్ రివ్యూలో జరిగిన ఓ పందెంలో మీ నాన్న  మొదటి బహుమతి గెలుచుకున్నాడు కదా?’

‘అవును.’

   ‘నువ్వు కూడా అలానే ఉండాలి’,దాదాపుగా బెదిరిస్తున్న స్వరంతో అని, ఎస్టేట్ కు చేరుకోవడంతో బండి దిగి లోపలకు వెళ్ళాడు.

   గ్రెగరి ఆ బండిని సాష్కాకు అప్పగించి తన క్వార్టర్స్ కు వెళ్ళిపోయాడు.

    ‘మీ నాన్న వచ్చాడు!’సాష్కా వెనుక నుండి అరుస్తూ అన్నాడు.

      పాంటెలి బల్ల వద్ద కూర్చుని భోజనం చేస్తూ ఉన్నాడు. తండ్రి ముఖాన్ని చూసి అప్పటికే కొద్దిగా తాగి ఉన్నాడని కూడా గ్రెగరి గ్రహించాడు.

   ‘ఓ సైనికుడా,ఇంటికి వచ్చేశావా?’

    ‘హా,గడ్డ కట్టుకుపోయి వచ్చాను’,తన చేతులు రెండు దులుపుకుంటూ గ్రెగరి బదులిచ్చాడు.

  తర్వాత అక్సిన్య వైపు చూస్తూ,’నా పై కోటు తీయి. నా కాళ్ళు,చేతులు చలికి తిమ్మిర్లుపోయాయి’,అన్నాడు.

‘నీ దురదృష్టం,గాలులు బలంగా వీస్తూ ఉన్నాయి’,తండ్రి గొణుగుతూ అన్నాడు.

  ఈ సారి ఇంటికి వచ్చాక ఆయన చాలా మెత్తబడినట్టు ఉన్నాడు. స్నేహపూర్వకంగా అక్సిన్యను పిలిచి ఇంకొద్దిగా బ్రెడ్ ను ముక్కలుగా చేసి తీసుకురమ్మని చెప్పాడు. ‘పీనాసితనంగా ఉండొద్దు,ఎక్కువే తీసుకురా’,అన్నాడు ఆమెతో.

    ఆయన బల్ల దగ్గర నుండి లేచి,మధ్యమధ్యలో సిగరెట్లు వెలిగించుకోవడానికి తలుపు దగ్గరకు వెళ్ళినప్పుడు, ఆ ఊయలను మెల్లగా ఊపాడు.

  ‘కోసాక్కా?’ అని కొడుకుని అడిగాడు.

  ‘అమ్మాయి’,అని గ్రెగరికి బదులు సమాధానమిచ్చింది అక్సిన్య.

ఆ మాట వినగానే ఆ వృద్ధుడి ముఖంలో నిరాశను ఆమె గమనించింది.అయినా ఆ వృద్ధుడు తన గడ్డాన్ని సరిచేసుకుంటూ, ‘అచ్చం గ్రీషాలాగానే ఉంది’,అన్నాడు.

  పాంటెలి ఇంకా దీక్షగా ఊయలలోకి ముఖం పెట్టి ఆ చిన్న పాపను పరిశీలించి, ఒక నిమిషం తర్వాత గర్వంతో, ‘అవును ,ఇది మా రక్తమే…హా..సరే నేను …’

  ‘నువ్వు ఎలా వచ్చావు నాన్నా?’గ్రెగరి తండ్రిని అడిగాడు.

  ‘రెండు గుర్రాల బండి మీద-ఒకటి ఫిల్లి,రెండోది పెట్రోది.’

   ‘ఒకటి తీసుకువస్తే సరిపోయేది. దానికి నా గుర్రాన్ని కట్టే వాళ్ళము.’

  ‘అంత అవసరం లేదు. దాన్ని ఒకదాన్ని తేలికగా వెళ్ళని. నువ్వు తెచ్చిన గుర్రం మరి నాసిరకంగా ఏమి లేదు.’

   ‘నువ్వు దాన్ని చూశావా?’

   ‘చూశాను.’

       వాళ్ళు అనేక అనవసరమైన విషయాల గురించి మాట్లాడుకున్నారు,వాళ్ళ మనసుల్లో వేరేవి మాట్లాడాలని ఉన్నా. అక్సిన్య  ఆ సంభాషణలో అసలు పాలుపంచుకోలేదు, ఆమె పాలిండ్లు జాకెట్టును తడిపేస్తూ ఉంటే అలసటగా మంచం మీద వాలిపోయింది. ఆమె ఆ బిడ్డకు జన్మనిచ్చినప్పటి నుండి ఆమెలో ఒక కొత్త ధైర్యం వచ్చినట్లు కనిపిస్తుంది.

     ఆ రోజు రాత్రి వారు ఆలస్యంగా నిద్ర పోయారు. అక్సిన్య  గ్రెగరిని అల్లుకుపోయింది,అతని చొక్కా మొత్తం ఆమె ఉప్పటి కన్నీళ్ళతోనూ,ఆమె ఎద నుండి ఉప్పొంగుతున్న పాలతోనూ తడచిపోయింది.

  ‘నేను ఇక్కడ ఒంటరితనంతో చచ్చిపోతాను….ఇక్కడ నేను ఒక్కదాన్నే ఎలా ఉండగలను?’

    ‘నువ్వు ఉండగలవు’, గ్రెగరి గుసగుసగా అన్నాడు.

      ‘ఈ ఒంటరి రాత్రుల గురించి ఆలోచించు….పాప నిద్రపోనప్పుడు…..నాకు నువ్వు చాలా గుర్తుకొస్తావు, నేను వాడిపోయిన చెట్టులా అయిపోతాను! గ్రీషా…ఒక్కసారి ఆలోచించు,నాలుగేళ్ళు…’

       ‘పాత కాలంలో పాతిక ఏళ్ళు సైన్యంలో పనిచేసేవారట,తెలుసా?’

‘ఇప్పుడు ఆ రోజు గురించి ఎందుకు!’

        ‘ఇక చాలు.’

         ‘మనల్ని ఇలా విడిపోయేలా చేస్తున్న ఈ సర్వీస్ అంటే నాకు కోపంగా ఉంది.’

     ‘నేను సెలవుల్లో వస్తాను.’

   ‘సెలవల్లోనా, ఆ లోపు డాన్ లో  చాలా మటుకు నీరు కిందకు వెళ్ళిపోతుంది’,బాధతో అంది.

     ‘నస పెట్టకు…నువ్వు వసంతకాలంలో పడే వాన లాంటి దానివి …ఆపకుండా ఉంటావు.’

    ‘నువ్వు నా పరిస్థితుల్లో ఉంటే తెలిసేది!’

    దాదాపుగా తెల్లవారుఝాము అయ్యింది గ్రెగరికి నిద్ర పట్టేసరికి. అక్సిన్య పాపకు పాలిచ్చి, తన మోచేతి మీద మీద తల పెట్టుకుని,కళ్ళు రెప్పార్పకుండా గ్రెగరి ముఖం వైఫ్ చూస్తూ ఉంది.  అతన్ని కుబాన్ కు పారిపోదామని బలవంతం చేసిన రాత్రి ఆమెకు గుర్తుకు వచ్చింది;ఆ రాత్రి వాకిట్లో చంద్ర కాంతి ఉంది.

      ఇప్పుడు కూడా అదే చంద్రుడు ఉన్నాడు,కానీ గ్రెగరి ఇప్పుడు కూడా అలానే ఉన్నట్టు ఉన్నా,అలా లేడు కూడా. రోజులతో పాటు వేయబడిన చక్కటి దారి ఇప్పుడు వారి వెనుక ఉన్నట్టు అనిపిస్తుంది.

    గ్రెగరి ఆ నిద్రలో పక్కకు తిరిగి,’ఒలషాంకి గ్రామంలో….’ఆ వాక్యం పూర్తి కాకముందే ఆ పలవరింత ఆగిపోయింది.

 అక్సిన్య నిద్ర పోవడానికి ప్రయత్నించింది కానీ గట్టి గాలి కుప్పగా పోసి ఉన్న ఎండు గడ్డిని చెదరగొట్టినట్టు,ఆలోచనలు ఆమె నిద్రను కూడా అలానే చెదరగొట్టాయి. ఆ తర్వాతి రోజు సూర్యోదయం వరకు ఆమె అతను సగం పలవరించిన మాటను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది.

    మంచు పట్టిన ఆ గది కిటికీల మీద సూర్యకాంతి ప్రసరించే సమయనికల్లా పాంటెలి నిద్ర లేచి, ‘గ్రెగరి! నిద్ర లే,అప్పుడే బాగా వెలుగు వచ్చేస్తూ ఉంది’,అన్నాడు.

   మంచం మీద మోకాళ్ళ మీద కూర్చుని, తన బట్టలు సరిచేసుకుని,ఓ గట్టి నిట్టూర్పుతో లేచి,అక్సిన్య అగ్గిపుల్లల కోసం వెతికింది.

  వాళ్ళు అల్పాహారం చేసి,అన్ని సర్దుకునేసరికి సూర్యోదయం అయిపోయింది. ఉదయపు సూర్యుడు కొద్దిగా నీలం మెరుపుతో కలిసి ఉన్నట్టు కనిపిస్తున్నాడు. కంచె మీద పట్టిన మంచు కొద్ది కొద్దిగా తొలిగిపోతూ ఉంది,గుర్రపుశాల పైకప్పు అప్పటివరకు చీకటిగా ఉన్నా అప్పుడే వెలుగును చూస్తున్నట్టు ఉంది.

   పాంటెలి గుర్రపు బండిని సిద్ధం చేయడానికి బయటకు వెళ్ళాడు. గ్రెగరి అక్సిన్య విరహపు ముద్దుల నుండి బయటపడి,సాష్కా మరియు మిగిలిన వారికి వీడ్కోలు చెప్పడానికి వెళ్ళాడు.

   అక్సిన్య బిడ్డను గుండెలకు హత్తుకుని,అతనికి వీడ్కోలు చెప్పడానికి బయటకి వచ్చింది.

   గ్రెగరి ఒక్క నిమిషం పాటు తన కూతురి నుదుటిపై ముద్దాడి, గుర్రం దగ్గరకు వెళ్ళాడు.

    ‘బండెక్కు!’పాంటెలి ఆ బండి తోలడానికి సిద్ధమై అన్నాడు.

    ‘లేదు,నేను నా గుర్రం మీద వస్తాను.’

     గ్రెగరి కొద్దిగా సమయం తీసుకుని,ఆ గుర్రం మీద జీను వేసి, ఎక్కి పగ్గాలు అందుకున్నాడు. అక్సిన్య అతని కాలిపై తన చేతి వేళ్ళతో చిన్నగా తడుతూ, ‘నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను…..’వణుకుతూ,అయోమయంగా అంటూ అది గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది.

     ‘సరే,గుడ్ బై! పాపను బాగా చూసుకో……నేను ఇక వెళ్ళాలి. చూడు,నాన్న ఎంత ముందుకు వెళ్ళిపోయాడో’,అన్నాడు.

‘ఆగు గ్రీషా….!’ చల్లగా ఉన్న తన ఎడమ చేతితో పగ్గాలను అతని చేతిని పట్టుకుంటూ, ఇంకో చేతిలో పాపను ఎత్తుకుంటూ, తన ముఖం మీద నుండి జారుతున్న కన్నీళ్ళను తుడుచుకోవడానికి చేతులు ఖాళీ లేక అతని వైపే చూస్తూ ఉండిపోయింది.

   వెనియమిన్ వాకిట్లోకి వచ్చాడు.

   ‘గ్రెగరి,యజమాని నిన్ను చూడాలనుకుంటున్నారు.’

   గ్రెగరి తిట్టుకుంటూ, వేగంగా గుర్రాన్ని అదిలించి,దౌడు తీశాడు. అక్సిన్య తన బూట్లలో పట్టిన మంచును పట్టించుకోకుండా వెనుకే పరుగు తీసింది.

   కొండ సమీపంలో గ్రెగరి తండ్రి బండిని దాటాడు.వెనక్కి తిరిగి చూశాడు. అక్సిన్య బిడ్డను ఎత్తుకుని, ఆమె వేసుకున్న ఎర్ర శాలువా గాలికి అటూయిటూ కదులుతూ ఉంటే, గేటు దగ్గర నిలబడి ఉంది.

    గ్రెగరి ఒక్క నిమిషం ఆగి,తండ్రి బండి దగ్గరకు వచ్చాక ఇద్దరూ నెమ్మదిగా ముందుకు సాగారు. అతని తండ్రి గుర్రాల వైపు చూస్తూ, ‘అంటే నువ్వు ఇక నీ భార్యతో ఉండదలచుకోవడం లేదా?’ అని అడిగాడు.

   ‘అది పాత కథ…ఎప్పుడో జరిగిపోయింది.’

   ‘అంటే నువ్వు ఇక కలిసి ఉండవా?’

   ‘ఉండను.’

    ‘ఆమె తన ప్రాణాన్ని కూడా తీసుకోబోయిందని నీకు తెలుసా?’

   ‘నేను విన్నాను.’

    ‘ఎవరి నుండి?’

      ‘నేను నా యజమానిని స్టానిట్సా దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు అక్కడ మనవాళ్ళను చూశాను.’

   ‘మరి దేవుడి ముందు పాపభీతి మాట ఏమిటి?’

   ‘నాన్నా….ఇక చాలు…జరిగిపోయినదానికి ఇప్పుడు విచారించి ఏం ప్రయోజనం?’

   ‘నాతో అలా మాట్లాడకు. నేను ఇది నీ మంచికే చెప్తున్నాను’, పాంటెలి తన సహనాన్ని కోల్పోతూ,కోపంగా అన్నాడు.

   ‘ఇంకా మాట్లాడాల్సింది ఏముంది? నువ్వు చూసావు కదా,ఇప్పుడు నాకో బిడ్డ కూడా ఉంది. నేను ఇప్పుడు ఏది మార్చలేను.’

   ‘నీకు ఖచ్చితంగా తెలుసా ఆ బిడ్డ నీ బిడ్డేనని?’

   గ్రెగరి ముఖం పాలిపోయింది. అతని తండ్రి మాయని గాయాన్ని మళ్ళీ రేకెత్తించాడు. ఆ బిడ్డ పుట్టిన క్షణం నుండి గ్రెగరి ఎవరికి చెప్పుకోలేని అనుమానంతో బాధ పడుతూ ఉన్నాడు. రాత్రి సమయంలో,అక్సిన్య నిద్ర పోయాక, అతను ఊయల దగ్గరకు వెళ్ళి, ఆ పాప గులాబీ-గోధుమ రంగు కలిసిన ముఖ చాయలోకి తొంగి చూస్తూ,తన పోలికలు ఏమైనా ఉన్నాయేమోనని వెతికేవాడు. అంతకుముందు అనిశ్చితితో ఉండేవాడో పాపను చూశాక కూడా అలాగే ఉండేవాడు. స్టీఫెన్ జుట్టు కూడా దాదాపుగా నలుపుగా,కొద్దిగా గోధుమ వర్ణంతో కలిసి ఉండేది. ఆ చర్మంలో ఉన్న సున్నితమైన నీలి నరాల్లో ఎవరి రక్తం ప్రవహిస్తుందో చెప్పడం ఎలా సాధ్యం? కొన్ని సార్లు తన కూతురు అచ్చం తనలానే ఉన్నట్టు అతనికి అనిపించేది, కొన్నిసార్లు చూస్తే స్టీఫెన్ గుర్తుకువచ్చేవాడు. గ్రెగరికి ఆ పాప పట్ల ఎటువంటి భావం లేదు,అక్సిన్య పురిటి నొప్పులతో ఉన్నప్పుడు ఆమెను బండి మీద తీసుకువెళ్ళడం,అప్పట్లో అతనికి కలిగిన విసుగు,అసహనం,ఆ బిడ్డకు అతని మనసులో ఆహ్వానం లేని మనఃస్థితే అతని మనసులో కొంత నెలకొని ఉంది. ఒకసారి అక్సిన్య వంటగదిలో పనిలో ఉన్నప్పుడు,పాపను ఊయలలో నుండి తీసుకుని,న్యాపి మార్చాడు,అపుడు ఏదో తెలియని ఉద్వేగం కలిగింది. ప్రేమతో కిందకు వంగి గులాబీ రంగులో ఉన్న పాప పాదాలను ముద్దాడాడు.

     పచ్చిగా ఉన్న ఆ గాయం మానకముందే తండ్రి మళ్ళీ దానిలోనే ఇంకో పోటు పొడిచాడు. అతను తన చేతులను జీను మీద ఉంచి, ధృఢ నిశ్చయంతో, ‘ఆ బిడ్డ ఎవరిదైనా సరే,నేను వదిలే ప్రసక్తే లేదు’,అన్నాడు .

   పాంటెలి గట్టిగా తన గుర్రాలను అదిలించాడు,వెనక్కి తిరిగి చూడకుండా.

    ‘నటాల్య రూపమంతా పాడైపోయింది. ….ఆమె మెడ ఇప్పుడు వంగినట్టు ఉంటుంది,ఏదో పక్షవాతం వచ్చినట్టు. ముఖ్య నరం ఒకటి కోసేసుకుంది,మెడ కూడా ఒక వైపుకి వాలిపోయింది.’

    పాంటెలి చెప్పి కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆ బండి ఆ దారి గుండా వెళ్తుంటే వచ్చే శబ్దం,గ్రెగరి గుర్రం డెక్కల చప్పుడు మాత్రమే వినవచ్చింది ఆ కాసేపు.

   ‘ఆమె ఇప్పుడు ఎలా ఉంది?’గ్రెగరి అడిగాడు.

     ‘నాకు తెలిసి ఇప్పుడు పర్వాలేదనుకుంటా. ఆమె మంచం మీదే ఏడు నెలలు గడిపింది. విట్ సన్ రోజుకి ఆమె చచ్చిపోతుందనే అందరం అనుకున్నాము. ఫాదర్ పాంక్రటి ఆమె కోసం ప్రార్థన చేయడానికి వచ్చాడు….కానీ ఆమె ఎలాగో బయటపడింది.అప్పటి నుండి కోలుకుంది. ఇప్పుడు బాగానే ఉంది. ఆమె కొడవలిని సూటిగా గుండెల్లో దించుకోబోయింది,కానీ ఆమె చేయి వణకడం వల్ల అది గురి తప్పింది,లేకపోతే ఆమె అప్పుడే చనిపోయి ఉండేది.’

   ‘కొండ కిందకు వచ్చేస్తున్నాము,వేగంగా పోనివ్వండి’, గ్రెగరి తన గుర్రాన్ని వేగంగా దౌడు తీయించి,తండ్రిని దాటుతూ అన్నాడు. ఆ గుర్రం పరుగెడుతూ రోడ్డు మీద పట్టిన మంచు ముద్దలను గట్టిగా డెక్కలతో తన్నడం వల్ల అవి పాంటెలి బండిలోకి ఎగిరి వచ్చాయి.

   ‘మనం నటాల్యను తిరిగి తీసుకువద్దాము,మనతో కలిసి ఉండటానికి!ఆమెకు తన వాళ్ళతో ఉండటం ఇష్టం లేదు. కొద్ది రోజుల క్రితం నేను ఆమెను ఆహ్వానించాను’,’పాంటెలి అతన్ని దాటుతూ గట్టిగా అరిచాడు.

   గ్రెగరి ఏం సమాధానం చెప్పలేదు. వాళ్ళు మౌనంగానే తర్వాతి గ్రామం వరకు ప్రయాణం చేశారు,మధ్యలో పాంటెలి ఆ విషయం మళ్ళీ ఎత్తలేదు.

    ఆ ఒక్క రోజులోనే వాళ్ళు డెబ్భై వెరస్టుల దూరం ప్రయాణించారు. రెండవ రోజు, ఇళ్ళల్లో దీపాలు పెట్టే వేళకు వారు మాంకోవ్ చేరుకున్నారు.

  ‘వ్యోషేన్ స్కాయా మనుషులు ఎక్కడ ఉన్నారు?’పాంటెలి అక్కడ ఎదురొచ్చిన ఒక వ్యక్తిని అడిగాడు.

   ‘అలా సరాసరి ప్రధాన వీధిలోకి వెళ్ళండి.’

  ఆ రాత్రికి అక్కడ ఉన్న సత్రంలో బస చేయడానికి ఆ తండ్రి కొడుకులు వెళ్తే  మరో అయిదుగురు కూడా తండ్రులతో కలిసి ఉన్నారక్కడ.

    ‘ఏ గ్రామాల నుండి వచ్చారు?’పాంటెలి,గుర్రాలను బయట కట్టేస్తూ అడిగాడు.

   ఆ చీకటిలో అనేక గొంతులు కలిసి చిర్ నది ప్రాంతం నుండి వచ్చామని గట్టిగా అరిచాయి.

    ‘ఏ గ్రామం?’

   ‘కొందరు కార్గిన్ నుండి,ఇంకొందరు నాపోలోవ్ నుండి,మరికొందరు లిఖోవిడోవ్ నుండి. మీరు ఏ గ్రామం నుండి?’

   ‘బుల్బుల్ పిట్ట గూడు నుండి’,గ్రెగరి గుర్రం మీద నుండి దిగుతూ, నవ్వుతూ అన్నాడు.

    తర్వాతి రోజు ఉదయం వ్యోషేన్ స్కాయా స్టానిట్సా అటామన్ అయిన డుడారేవ్ సైన్యానికి వెళ్ళబోతున్న యువకులందరిని వైద్య పర్యవేక్షణా బృందం ముందు నిలబెట్టాడు. తన గ్రామం నుండి వచ్చిన తన వయసు యువకులను అక్కడ గ్రెగరి చూశాడు. ఓ మేలు జాతి గుర్రం మీద ఎక్కి,మిట్కా కోర్షునోవ్ ఆ ఉదయమే అక్కడకు వచ్చాడు. అతను సత్రం గేటు దగ్గరే గ్రెగరిని చూసినా పట్టించుకోనట్టు అతని ముందే గుర్రం మీద వెళ్ళిపోయాడు.

   అందరూ వోలోస్ట్ (వోలోస్ట్,ఒక్రగ్ అనేవి కోసాక్కు  ప్రాంతంలో పరిపాలన కోసం ఉన్న విభాగాలు,ఒక్రగ్ వాటిల్లో పెద్దది)కార్యాలయంలో వంతులవారిగా బట్టలు విప్పి నిలబడ్డారు. ఆ గదిలోకి సైన్యాధికారి,ఒక గుమాస్తా హైరానా పడుతూ అటూఇటూ తిరుగుతూ ఉన్నారు.

  ఒక్రగ్ అటామన్,లెదర్ బూట్లతో ఆ వాతావరణంలో తచ్చాడుతూ ఉన్నాడు; ఆయన ధరించిన ఖరీదైన ఉంగరం,నల్లటి అందమైన కళ్ళు అతని శరీరపు తెలుపు చాయ చూపరులను ఆకట్టుకునేలా ఉంది. లోపలి గదిలో నుండి వైద్యుల మాటలు మధ్యమధ్యలో వినిపిస్తూ ఉన్నాయి.

   ‘అరవై తొమ్మిది.’

   ‘పావెల్ ఇవానోవిచ్, చక్కగా రాసే పెన్సిల్ ఇవ్వు’,తలుపు దగ్గర నుండి ఒక అభ్యర్థన వినిపించింది.

 ‘ఛాతీ కొలత …’

  ‘హా అవును, పూర్వీకుల పోలికలనుకుంటా!’

   ‘సిఫిలిస్ అని  రాసుకో.’

   ‘ఎందుకు అమ్మాయిలా అలా చేతులతో కప్పుకుంటున్నావు?’

   ‘అబ్బా ఏం శరీరం!’

  ……గ్రామంలో ఇదో అంటువ్యాధిలా వ్యాపించింది. ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. నేను ఇప్పటికే ఈ విషయాన్ని హిజ్ ఎక్సలెన్సీ దృష్టికి తీసుకువెళ్ళాను.’

   ‘పావెల్ ఇవానోవిచ్ ఈ వింత రకం మనిషిని చూడు.ఏం శరీరం ఇది!’

   ‘అవును…’

    గ్రెగరి చుకారిన్స్కి గ్రామం నుండి వచ్చిన ఒక కుర్రాడి పక్కన తన బట్టలు విప్పాడు. అప్పుడు అక్కడ నిలబడి ఉన్న గుమాస్తా, ‘పాన్ ఫీలోవ్ సేవాస్త్యాన్, మెలఖోవ్ గ్రెగరి’,అన్నాడు.

   ‘త్వరగా వెళ్ళు’ గ్రెగరి పక్కన ఉన్న అబ్బాయి గుసగుసగా అన్నాడు,తన సాక్సులు చేత్తో పైకి కిందికి అంటూ.

  చలి వల్ల రోమాలు నిక్కబొడుచుకుని ఉన్న గ్రెగరి లోపలికి వెళ్ళాడు. అతను తన శరీరాన్ని,కాళ్ళ దగ్గర ఒత్తుగా ఉన్న నల్లజుట్టుని చూసి సిగ్గుపడ్డాడు. ఒక కుర్రాడు అప్పటికే నగ్నంగా కొలతలు తీసుకునే స్కేల్స్  మీద నిలబడి ఉన్నాడు. అక్కడ సహాయకారిగా ఉన్న వైద్యుడు, ఆ స్కేల్స్ ను  కదిలిస్తూ, ‘నాలుగు,పది. ఇక కిందకు దిగు!’అని అరిచాడు.

   ఆ పరీక్షించే పద్ధతి గ్రెగరికి చాలా అవమానకరంగా అనిపించింది. కొద్దిగా తల నెరిసిన వైద్యుడు అతని ఛాతీ దగ్గర స్టెతస్కోప్ పెట్టి పరీక్షిస్తే,యవ్వనంలో ఉన్న ఇంకో వైద్యుడు అతని నాలుక బయటకు తెరవమని చెప్పి చూశాడు,మూడో వైద్యుడు కళ్ళద్దాలు పెట్టుకుని, తన చేతులు రుద్దుకుంటూ చొక్కా మోచేతి వరకు లాక్కుంటూ, ‘స్కేల్స్ మీదకు ఎక్కు’అన్నాడు గట్టిగా.

     చల్లగా ఉన్నటువంటి ఆ స్కేల్స్ మీదకు ఎక్కాడు గ్రెగరి.

   ‘ఐదు,ఆరున్నర’,సహాయకారి వైద్యుడు అరిచాడు,అతను ఆ స్కేల్స్ ను ముందుకు,వెనక్కి కదిలిస్తూ.

  ‘ఏంటి దయ్యంగాడు!పెద్ద ఎత్తుగా లేడు ….’తల నెరిసిన వైద్యుడు గ్రెగరి చేతిని పట్టుకుని,అతన్ని చుట్టూ తిప్పి చూస్తూ అన్నాడు.

    ‘అద్భుతం!’యవవ్న వైద్యుడు చిన్నగా అన్నాడు.

  ‘ఎంత?’ బల్ల దగ్గర కూర్చున్న వైద్యులు ఆశ్చర్యంతో అడిగారు.

  ‘ఐదు పూడ్లు,ఆరున్నర పౌండ్లు’,తల నెరిసిన వైద్యుడు తన కనుబొమ్మలు పెద్దవి చేసి చూస్తూ,సమాధానం ఇచ్చాడు.

   ‘ఇతన్ని గార్డ్స్ లో పెడదామా?’ఆ ప్రాంతపు మిలిటరీ ప్రధాన అధికారి అడిగాడు,టేబుల్ పక్కన కూర్చున్న పొరుగువాని పై వాలిపోతూ .

       ‘వీడి ముఖం చూడటానికి బందిపోటులా ఉంది….మొరటుగా ఉంది.’

       ‘హే,ఇటు తిరుగు! నీ వెనుక ఏంటది?’బల్ల మీద అసహనంగా కొడుతూ,సైన్యపు హోదాను సూచించే బ్యాడ్జిని  ధరించిన ఓ అధికారి అడిగాడు.

   తల నెరిసిన వైద్యుడు ఏదో గొణిగాడు. గ్రెగరి బల్ల వైపు తిరిగాడు,అతని శరీరం చలికి వణుకుతూ ఉంది, ‘నాకు చలికాలంలో చలి వల్ల పొక్కులు వచ్చాయి’,అని జవాబిచ్చాడు.

   అతని కొలతలన్నీ తీసుకున్నాక, ఆ అధికారులందరూ మాట్లాడుకుని,చివరకు అతన్ని సాధారణ రెజిమెంటుకే పంపించాలని నిర్ణయించుకున్నారు.

   ‘నిన్ను పన్నెండవ రెజిమెంటులోకి తీసుకుంటున్నాము,మెలఖోవ్. నీకు వినబడుతుందా?’

    తర్వాత అతన్ని పంపించేశారు. అతను తలుపు దగ్గరకు వెళ్తున్నప్పుడు వాళ్ళ గుసగుసలు అతనికి వినబడ్డాయి.

   ‘ఓ,అది అసాధ్యం!చక్రవర్తి గారి కళ్ళ ఎదుట ఇటువంటి ముఖం కనిపిస్తే ఒకసారి ఊహించుకోండి? ఆ కళ్ళు…..’

  ‘సంకరజాతి వాడిలా ఉన్నాడు! తూర్పు దేశాల నుండి అనుకుంటా!’

   ‘వాడి శరీరం కూడా శుభ్రంగా లేదు.ఆ పొక్కులు…’

    తమ వంతు కోసం ఎదురుచూస్తున్న ఆ ఊరి కుర్రాళ్ళు గ్రెగరి బయటకు రాగానే అతన్ని చుట్టుముట్టారు.

   ‘గ్రీషా,అక్కడ ఎలా ఉంది?’

   ‘నిన్ను ఎక్కడ పెట్టారు?’

   ‘అటామన్ రెజిమెంటులోనా?’

  ‘స్కేల్స్ మీద ఎంత చూపించింది?’

    ఒక కాలు మీద కుంటుతూ,చలికి వణుకుతూ, తన పైజమాను పైకి లాక్కుంటూ,పళ్ళు బిగించి, ‘నన్ను ఒంటరిగా వదిలేయండి. అసలు ఇదంతా ఎందుకు? నన్ను వాళ్ళు ఎక్కడ పెట్టారు? పన్నెండవ రెజిమెంటులో….’

   ‘కోర్షునోవ్ డ్మిట్రి,కార్గిన్ ఇవాన్.’ గుమాస్తా గట్టిగా పిలిచాడు.

   గ్రెగరి మెట్ల గుండా నడిచాడు,బొత్తాలు పెట్టుకుంటూ.

   ఒక వేడి గాలి వల్ల ఆ వాతావరణం కాస్త వెచ్చగా మారింది. కోక్కో మంటూ కోళ్ళు వీధుల్లో పరిగెడుతూ ఉంటే,కొన్ని బాతులు అక్కడ చిన్న మడుగులా ఉన్న నీటిలో నిలుచుని ఉన్నాయి.ఆ నీళ్ళల్లో గులాబీ రంగులో ఉన్నా వాటి పాదాలు మంచు వల్ల మెరుస్తూ ఉన్నాయి.

       గుర్రాల పరీక్ష తర్వాతి రోజు మొదలైంది. ఆ కూడలి వద్దకు ఎందరో అధికార్లు వచ్చారు. ఒక పశు వైద్యుడు,అతని అసిస్టెంట్ గుర్రాల దగ్గరకు వచ్చారు. అక్కడ ఉన్న గోడ దగ్గర వరుసగా గుర్రాలు నిలబెట్టి ఉన్నాయి. అటామన్ డూడ్రేవ్ స్కేల్స్ నుండి బల్ల వరకు అటూఇటూ తిరుగుతూ ఉన్నాడు. ఒక మిలిటరీ అధికారి అక్కడ నడుస్తూ ఒక కుర్ర లూయిటెంట్ కు ఏదో కోపంగా వివరిస్తున్నాడు.

   వరుసలో 108 సంఖ్యలో ఉన్న గ్రెగరి తన గుర్రాన్ని స్కేల్స్ దగ్గరకు తీసుకువెళ్ళాడు. వాళ్ళు ఆ గురం శరీరంలోని ప్రతి భాగాన్ని కొలిచారు,అది వెళ్ళబోయే ముందు తన అధికార దర్పంతో పశువైద్యుడు మళ్ళీ ఇంకోసారి పరీక్షించాడు. దాని పై పెదవిని పైకి లాగి ,దాని నోటిని చూశాడు,దాని ఛాతీ కండరాల మీద నొక్కి చూశాడు,దాన్ని కాళ్ళను కూడా గట్టిగా పట్టుకుని చూశాడు.అతను దాని మోకాళ్ళ ఎముకలను గట్టిగా నొక్కి, దాన్ని మొత్తం పరీక్షించి,ఆ గుర్రానికి కూడా అనుమానం వచ్చేలా చేసి,చివరకు దర్పంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు.   

   చివరకు ఆ గుర్రం తిరస్కరించబడింది. సాష్కా అన్న మాట అబద్ధమైంది. డేగ కళ్ళతో ఉన్న ఆ పశువుల వైద్యుడికి సాష్కా కనిపెట్టలేరని అనుకున్న లోపాన్ని కనిపెట్టే తెలివి ఉంది.

  గ్రెగరి తండ్రితో కంగారుగా జరిగింది చెప్పాడు,ఓ అరగంట తర్వాత పెట్రో గుర్రం బదులుగా తేబడింది. మొత్తానికి పెట్రో గుర్రం ఎంపికైంది.

 గ్రెగరి పొడిగా ఉన్న ఓ చోటు దగ్గరకు వెళ్ళి ఓ గుడ్డను పరిచి,అందులో సామానులు అన్నీ సర్దాడు. పాంటెలి అతని వెనుక నిలబడి, గుర్రాన్ని పట్టుకుని,తనలాగే కొడుకుని పంపడానికి వచ్చిన ఓ వృద్ధుడితో మాట్లాడుతూ ఉన్నాడు.

   ఖరీదైన బూడిద రంగు కోటును,వెండి రంగులో మెరుస్తున్న అస్ట్రాఖాన్ (మధ్య ఆసియా ప్రాంతంలో పెరిగే గొర్రెల నుండి తీసిన ఊలుతో చేసినది) టోపీ పెట్టుకుని, కొద్దిగా నెరిసిన తలతో ఎత్తుగా ఉన్న జనరల్ వారి ముందు నడుచుకుంటూ వెళ్ళాడు. గ్లోవులు ధరించిన తన చేతులని ఊపుతూ, పెద్ద పెద్ద అంగలతో ముందుకు వెళ్ళాడు ఆయన.

‘ఆయనే ఒక్రగ్ అటామన్. ఆయన చాలా క్రమశిక్షణ కల అధికారి!’

 ఇతర రెజిమెంట్ల నుండి వచ్చిన అధికారులందరూ ఆ అటామన్ వెనుక గుంపుగా నడిచారు. విశాలమైన భుజాలు, బలిష్టమైన తొడలతో ఆయుధాల శాఖలో పని చేసే యూనిఫార్మ్ ను ధరించిన ఓ కెప్టెన్, అటామన్ లైఫ్ గార్డ్స్ లో పని చేసిన ఓ అధికారితో గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు.

  ‘ఏం దెయ్యమది! ఇక్కడ ఈ ఈస్టోనియన్ గ్రామంలో ప్రతి అమ్మాయి మంచి రంగుతో ఉంటే,ఈమె మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంది !ఆమె ఒక్కర్తే మాత్రమే కాదు!మేము చాలా ఊహించాము దాని ప్రకారం ఇరవై ఏళ్ళ క్రితం….’ఆ అధికార్లు నడుస్తూ మాట్లాడుకుంటూ ఉంటే,అక్కడ గాలి వల్ల గ్రెగరి కేవలం ఆ అధికారుల నవ్వులో కలిసిపోయిన ఆఖరి వాక్యం మాత్రమే వినగలిగాడు, ‘…….మీ లైఫ్ గార్డులను ఆ ఊరిలో వేశారు.’

   ఇంకు అంటుకున్న చేతి వేళ్ళతో కోటు బొత్తాలను పెట్టుకుంటూ, మిలిటరీ పోలీసుల అధికారి అరిచిన అరుపుకి గుమాస్తా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు, ‘ట్రిప్లికేట్ లో అని నేను చెప్పాను నీకు! నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది!’

   గ్రెగరి అపరిచితులైన ఆ అధికారుల ముఖం వైపు కుతూహలంతో చూశాడు.అటువైపుగా వెళ్తున్న ఓ సహాయ అధికారి వీరి వైపు చూస్తూ,మళ్ళీ ముందుకు వెళ్ళిపోయాడు. గ్రెగరి వారినే చూస్తూ ఉన్నాడు.

   గ్రెగరి కాళ్ళ ముందు ఉన్న సామాను నిబంధనలను అనుసరించి ఉంది. వాడని ఓ గుర్రపు బట్ట మీద గుర్రపు జీను,ముందు వెనుక తగిలించేందుకు రెండు సంచులు,రెండు కోట్లు, అంగవస్త్రాలు,రెండు పైజమాలు,రెండు జతల బూట్లు, తినడానికి ఒక పౌండున్నర రస్కులు,ఆ డబ్బాలో ఎండబెట్టిన మాంసం,ఇంకా మిగిలిన ఆహార పదార్ధాల వరకు ఓ సైనికుడు తనతో పాటు తీసుకువెళ్ళవచ్చు.తెరిచి ఉంచిన సంచుల్లో నుండి గుర్రపు నాలుగు కాళ్ళకు కావాల్సిన బూట్లు,ఒక నూనె గుడ్డలో చుట్టి ఉన్న మేకులు,సైనికులకు ఇచ్చే చిన్న కుట్టు సామగ్రి అయిన రెండు సూదులు,దారంతో పాటు ఒక తువాలు బయటకు కనిపిస్తూ ఉన్నాయి.

     గ్రెగరి ఆఖరిసారిగా తన వస్తువులన్నింటిని చూసుకుని, ఆ సంచుల చేతుల మీద ఏవో మరకలు ఉండటంతో,తన చొక్కాతో వాటిని తుడవడానికి కిందకు వంగాడు. ఆ వస్తువులను ప్రత్యేకంగా పరిశీలించే అధికారిక బృందం  మెల్లగా వరుసలో ఉన్న కోసాక్కుల వెనుక నుండి వాటిని గమనిస్తూ ఉంది. అక్కడ ఉన్న అధికారులు,అటామన్ వాటిని ప్రత్యేకంగా పరీక్షించే క్రమంలో మోకాళ్ళ మీదకు వంగి,ఆ సంచులను చూస్తూ,కిందకు జారిపోతున్న తమ కోట్లను పైకి లాక్కున్నారు,ఆ వస్తువులను పరీక్షించి, ఆహారపదార్ధాల బరువును తూకం వేసి చూశారు.

    ‘ఆ పొడుగ్గా ఉన్న వాడిని చూడండిరా’, గ్రెగరి పక్క వరుసలో ఉన్న ఒక కోసాక్కు యువకుడు,ఒక్రగ్ మిలిటరీ అధికారి వైపు చూపిస్తూ ఆశ్చర్యంగా అన్నాడు, ‘వాడు అచ్చం కుక్క గుంటలు తవ్వినట్టు వస్తువులను తవ్వుతున్నాడు.’

    ‘దయ్యంగాడు!….వాడు ఆ సంచి మొత్తం కిందకు పడేశాడు.’

    ‘ఏదో తప్పు ఉండి ఉంటుంది లేకపోతే అలా చేయడు.’

    ‘ఒకవేళ మేకులు లెక్కబెడుతున్నాడేమో,అవును కదా?’

    ‘ఊరకుక్క!

 ఆ బృందం దగ్గరకు వచ్చేసరికి ఆ మాటలు ఆగిపోయాయి మెల్లగా. గ్రెగరి వంతు కూడా దగ్గరకు వచ్చేసింది. ఒక్రగ్ అటామన్ తన ఎడమ చేతికి గ్లోవు ధరించి కుడి చేతిని ఊపుతూ ఒక్కొక్కరివి చూస్తూ ఉన్నాడు. గ్రెగరి తన వంతు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వెనుక ఉన్న తండ్రి గొంతు సవరించుకున్నాడు. అక్కడి గాలి గుర్రాల మూత్రం వాసనను,కరిగిపోయిన మంచు వాసనతో మిళితం చేసి ఆ కూడలి అంతా వ్యాపింపచేస్తూ ఉంది. సూర్యకాంతి ఉన్నా పూర్తి తీవ్రతతో లేదు.

     గ్రెగరి పక్క వ్యక్తిది పూర్తి చేసి,అతని ఎదుటకు వచ్చారు.

        ‘ఇంటి పేరు?క్రైస్తవునివా?’

         ‘మెలఖోవ్,గ్రెగరి.’

           పోలీసు అధికారి ఒకరు అందులో ఒక కోటుని ఎత్తి చూసి,దాని లైనింగు వాసన చూశాడు. ఇంకో అధికారి పైజమాల పట్టును పరీక్షించాడు. మూడో అధికారి సంచుల్లోకి వంగి చూస్తున్నాడు. ఆ అధికారి తన బొటనవేలు,చిటికెన వేళ్ళతో అందులో ఉన్న మేకులను తడిమి చూశాడు. వాటిని లెక్క పెడుతూ ఉంటే అతని పెదవులు పైకి కిందకు కదులుతూ ఉన్నాయి.

   ‘ఎందుకు ఇరవై మూడు మేకులే ఉన్నాయి? అంటే ఏంటి?’తన కోటు అంచును పట్టుకుని గట్టిగా అరిచాడు. 

      ‘లేదు,సార్. అందులో ఇరవై నాలుగు ఉన్నాయి.’

        ‘అంటే నేను గుడ్డి వాడినని అనుకుంటున్నావా’

      గ్రెగరి వెంటనే కిందకు వంగి ఆ సంచిని వెనక్కి తిప్పి ఆ మేకును తన చేత్తో పట్టుకున్నాడు,ఆ సందర్భంలో అతని నల్ల చేతి వేళ్ళు ఆ అధికారి తెల్లటి చేతికి తగిలాయి. వెంటనే ఆ అధికారి తన చేతిని ఏదో కుట్టినట్టు వెనక్కి తీసేసుకుని, దాన్ని తన కోటుతో తుడుచుకున్నాడు, ముఖం చిట్లించి ఆ చేతికి గ్లోవు ధరించాడు.

  ఇది గమనించిన గ్రెగరి తనలో తానే నవ్వుకుంటూ పైకి లేచాడు. ఒక్క క్షణం వాళ్ళిద్దరి కళ్ళు కలుసుకున్నాయి, ఆ అధికారి ముఖం కందిపోయినట్టు అయ్యింది. అతను తన గొంతు పెంచాడు.

       ‘ఇదేనా ఓ అధికారిని చూసే పద్ధతి,కోసాక్కు? నీకు ఎంత ధైర్యం ఉంటే నా కళ్ళల్లోకి సూటిగా చూస్తావు! నీ సంచులు ఎందుకు ఇంత మురికిగా ఉన్నాయి? అసలు ఏంటి ఇదంతా?అసలు నువ్వు కోసాక్కువా లేక కూలి వెధవ్వా?అసలు మీ నాన్న ఏడి?’

      వెనక ఉన్న పాంటెలి ప్రోకోఫోవిచ్ వెంటనే ముందుకు వచ్చాడు,మెల్లగా కుంటుతూ.

    ‘నీకు నిబంధనలు తెలియవా?’అప్పటికే రాత్రి పేకాటలో ఓడిపోయిన కోపంతో ఉన్న ఆ అధికారి ఆ వృద్ధుడి మీద విరుచుకుపడ్డాడు. 

      ఒక్రగ్ అటామన్ దగ్గరగా రావడం ఆ అధికారి తగ్గాడు. ఆ అటామన్ జీనును తన కాలి బూటుతో తాకి,చిన్నగా దగ్గి అక్కడ నుండి తర్వాతి కోసాక్కు దగ్గరకు వెళ్ళిపోయాడు. తర్వాత అంతా సవ్యంగానే జరిగిపోయింది.

   తర్వాత రోజు కోసాక్కులను,గుర్రాలను,వారి సామాన్లను,తిండిని ఎక్కించిన వ్యాన్లు  చెర్కోవో స్టేషన్ నుండి లిస్కి,వొరోనేజ్ వైపు పరుగుపెట్టాయి.

   అందులో ఒక వ్యానులో ఒక కడ్డికి ఆనుకుని గ్రెగరి నిలబడి ఉన్నాడు. తెరిచి ఉన్న తలుపుల నుండి ఆ తెలిసిన ప్రాంతం దూరమై,అపరిచిత ప్రాంతంలోకి వెళ్ళడం గమనిస్తూ ఉన్నాడు గ్రెగరి.

      అక్కడ ఉన్న గుర్రాలు గడ్డిని తొక్కుతూ,బండి కుదుపులకు అటుఇటూ కదులుతూ ఉన్నాయి.

     గుర్రాల చెమట,గడ్డి,మాచిపత్రిల వాసనలతో కలగలసిపోయి ఉంది ఆ బండి. రాత్రిని సూచిస్తూ ఆకాశంలో అక్కడక్కడ నక్షత్రాలు మిణుకుమిణుకుమంటున్నాయి.

                                     *      *      *

                             మూడవ భాగం

    1914 మార్చిలో ఒక మంచు కురుస్తున్న రోజున నటాల్య తన అత్తగారింటికి వచ్చేసింది. ఎద్దు విరగ్గొట్టిన కంచెను పాంటెలి బాగు చేస్తూ ఉన్నాడు. ఆ ఇంటి పై కప్పు నుండి బిందువుల్లా పడుతూ ఉన్న మంచు నల్లగా ఉన్న చూరు మీద నుండి కిందకు పడుతూ ఉన్నాయి. 

   అప్పుడే పైకి వస్తున్న సూర్యుడు ఆ ప్రాంతాన్ని ఆప్యాయంగా స్పృశిస్తునట్టు ఉన్నాడు,ఇంకా భూమి తేమగానే ఉంది, ముందే మొలిచిన గడ్డి మోకాలు డాన్ నది ప్రాంతంలో ఉన్న బండరాళ్ళ దగ్గర పచ్చగా ఆ మంచుతో మెరుస్తూ ఉన్నాయి.

   ఇదివరకటి మీద మారిపోయిన ఆకారంతో,పీలగా అయ్యి, వంకర తిరిగిన మెడతో ఉన్న నటాల్య మావయ్య దగ్గరకు వచ్చింది.

   ‘నమస్తే,మావయ్య!’

   ‘బిడ్డా నటాల్య…వచ్చేశావా!’ ఆపుకోలేని సంతోషంతో పాంటెలి వంచుతున్న కొమ్మను కిందకు వదిలేశాడు.కొద్దిగా వంకర తిరిగి ఉన్న ఆ కొమ్మ కింద పడుతూనే మామూలుగా అయిపోయింది.’ఇంత కాలం ఏమైపోయావు? ఇంట్లోకి రా.అత్తయ్య నిన్ను చూసి ఎంతో సంతోషిస్తుంది.’

    ‘మావయ్య,నేను వచ్చేశాను…..’ నటాల్య ఏదో సూచిస్తున్నట్టు అని ఒక నిమిషం ఆగిపోయింది. ‘మీరు నన్ను ఇక్కడ ఉండనిస్తే,ఇక్కడే ఉండిపోవడానికి వచ్చాను’,అన్నది తన మనసును స్పష్టం చేస్తూ.

   ‘అదేం పిచ్చి ప్రశ్న. నువ్వు ఇక్కడ అపరిచితురాలివి కాదు. గ్రెగరి తన ఉత్తరాల్లో నీ గురించి అడుగుతూ రాశాడు. నిజమే,వాడు నువ్వు ఎలా ఉన్నావో అన్న విషయం పట్ల ఆసక్తి కనబరుస్తున్నాడు.’

    ఒక రకమైన ఉద్వేగంతో కుంటుతూ లోపలికి వెళ్తున్న పాంటెలి పక్కనే నడుస్తూ ఆమె లోపలికి వెళ్ళింది.

  నటాల్యను చూడగానే కన్నీరు ఇలినిచ్నబుగ్గల మీదకు జారింది.ఆమెను వాటేసుకుని,తన పై దుస్తులతో ముక్కు తుడుచుకుంటూ ,ఆమె చెవిలో గుసగుసగా, ‘నీ కడుపున ఒక నలుసు పడితే,వాడు ఇక నిన్ను వదిలిపెట్టడు.సరే,ఇక్కడ కూర్చో. నువ్వు తినడానికి ఏదైనా తీసుకువస్తాను,సరేనా?’ 

  ‘దేవుడు నిన్ను దీవించుగాక,అత్తయ్యా.చూడండి, నేను వచ్చేశాను…’

   సూర్యోదయంలా వెలిగిపోతున్న ముఖంతో దున్యాక్ష, వంటగది వెనుక ఉన్న పెరడు నుండి వేగంగా దూసుకువచ్చి,ఒక్క ఉదుటున ఆమె మెడ చుట్టూ చేతులు వేసింది.

    ‘ఓ, సిగ్గులేనిదానా! నువ్వు అసలు మా అందరిని మార్చేపోయావు!’

   ‘కుర్రకుంకా,నువ్వు నోర్ముయ్!’వారిస్తున్నట్టు పాంటెలి కూతురి మీద అరిచాడు.

‘ఎంత పెద్ద దానివి అయిపోయావు!’నటాల్య ఆశ్చర్యపోతూ, మరదలి చేతుల నుండి విడిపించుకుని,ఆమె ముఖంలోకి చూస్తూ అంది.

   ఒకేసారి అందరూ ఒకరి మాటలకు ఇంకొకరు అడ్డు వస్తూ మాట్లాడుతూ,ఒకేసారి మౌనంగా అయిపోయారు. ఇలినిచ్న, తన బుగ్గల మీద చేతులు పెట్టుకుని,బాధగా కోడలి వైపు చూసింది,ఇదివరకు కోడలి పోలికలు ఈ ముఖంలో ఆమెకు కనబడలేదు.

    ‘నువ్వు ఇక్కడ ఉండటానికే వచ్చావా?’దున్యాక్ష తెలుసుకోవాలన్న కుతూహలంతో ఆమె చేతి వేళ్ళు పట్టుకుంటూ అడిగింది.

   ‘అది నేను చెప్పాల్సిన విషయం కాదు.’

    ‘తను ఇక్కడే ఉంటుంది. తను వాడు భార్య. కాదా? తను ఇంకెక్కడ ఉంటుంది ఇక్కడ కాక! మనతోనే ఉంటుంది!’ఇలినిచ్న మట్టిత్ చేసిన  ఒక గిన్నెలో పాన్ కేక్స్ పెట్టి కోడలి వైపు జరుపుతూ స్థిరంగా అంది.

    నటాల్య ఎంతో ఆలోచించుకున్న తర్వాతే తన భర్త ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె తండ్రికి ఆమె వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు,ఆమెను ఈ విషయంలో తిట్టి,వెనక్కి లాగడానికి ఎంత ప్రయత్నం చేసినా ఆమె వెనక్కి తగ్గలేదు. కానీ కొద్దిగా కోలుకున్నాక ఆమె తన సొంత కుటుంబంలో కూడా ఒక అపరిచితురాలిగా అందరూ చూడటంతో అక్కడ ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఆమె చేసిన ఆత్మహత్యా ప్రయత్నం వల్ల ఆమెను ఆ కుటుంబం అంతా వెలి వేసినట్టు చూడసాగింది. కానీ గ్రెగరి సైన్యానికి వెళ్ళినప్పటి నుండి ఎలా అయినా పాంటెలి ఆమెను తన కుటుంబంలో కలుపుకోవాలని చూస్తున్నాడు. ఆమెను ఎలా అయినా తమ కుటుంబానికి తిరిగి వచ్చేలా చేసి,కొడుకుతో కలపాలని తాపత్రయపడుతున్నాడు.

   ఆ రోజు నుంచి మళ్ళీ నటాల్య మేళఖోవుల ఇంట్లో ఒక సభ్యురాలు అయిపోయింది. చర్యల రూపంలో ఎప్పుడూ దర్య ఆమె పట్ల తన విముఖతను ప్రదర్శించలేదు;పెట్రో ఆమెను ఇంట్లో ఒక మనిషిగానే చూసేవాడు,అతని భార్య చూపుల్లో అప్పుడప్పుడు కనిపించే అసహనం కూడా తల్లిదండ్రుల్లా చూసుకునే ఆ ముసలి దంపతుల ప్రేమలోనూ, దున్యాక్ష ఆప్యాయతలోనూ నటాల్య మర్చిపోయేది.

       నటాల్య వచ్చిన మరుసటిరోజే,పాంటెలి దున్యాక్ష చేత గ్రెగరికి ఒక ఉత్తరం రాయించాడు.

     ‘మా ప్రియమైన కుమారుడైన గ్రెగరి పాంటెలేయేవిచ్ కు,

            మీ అమ్మ వాసిలిస్సా ఇలినిచ్నమరియు నేను,తల్లిదండ్రులుగా మా ఆశీస్సులు అందిస్తున్నాము. నీ అన్న ప్యోట్ర్ పాంటెలెయేవిచ్ మరియు అతని భార్య దర్య మాట్వేయెవ్న కూడా వారి ఆశీస్సులు అందిస్తూ నువ్వు ఎల్లప్పుడూ ఆరోగ్యంతో,సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాగే నీ చెల్లి మరియు ఇతర కుటుంబ సభ్యులు కూడా నీకు తమ నమస్కారాలు తెలియజేస్తున్నారు. నువ్వు ఫిబ్రవరి 5 న  పంపిన ఉత్తరం మాకు అందింది,అది పంపించినందుకు నీకు ధన్యవాదములు.

     నువ్వు చెప్పినట్టు ఒకవేళ గుర్రం వేగంగా వెళ్లలేకపోతూ ఉంటే,దాని కాలి చీలమండల వెనుక పందికొవ్వు పూత రాయి.మరి జారిపోయే ప్రదేశాల్లో మాత్రమే దాని వెనుక కాళ్ళకు నాడా కట్టు.నీ భార్య నటాల్య మిరోనోవ్న ఇప్పుడే మాతోనే ఉంటుంది,తను మంచి ఆరోగ్యంతో,క్షేమంగా ఉంది.

   మీ అమ్మ నీ కోసం ఎండిన చెర్రీలు, ఒక జత సాక్సులు, కొంత పంది కొవ్వు, ఇంకా కొన్ని  అవసరమైన వస్తువులు పంపిస్తుంది. మేము బాగానే ఉన్నాము, కానీ దర్య బిడ్డ చనిపోయింది,అదే నీకు మేము తెలియజేస్తున్నాము. తర్వాతి రోజు పెట్రో నాకు ధాన్యపు కొట్టం మీద కొత్త కప్పు వేయడంలో సాయం చేస్తూ,నువ్వు గుర్రాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని అన్నాడు. మన ఆవులు పిల్లలు పెట్టాయి,ముసలి గుర్రం కూడా పిల్లను పెట్టబోతుంది.దాని పొదుగు గట్టిగా ఉంది,దాని కడుపులో బిడ్డ గట్టిగా తన్నుతూ ఉన్నట్టు దాన్ని చూసే చెప్పొచ్చు. దానిని స్టానిట్సా లో ఉన్న మేలైన దోనేట్ అనే గుర్రంతో మెటింగ్ చేయించాము,లెంట్ ఐదవ వారానికి బిడ్డను కంటుందని అనుకుంటున్నాము. నువ్వు ఎంతో చక్కగా సైన్యంలో నీ బాధ్యతలు నిర్వహిస్తూ,అధికారుల మెప్పును పొందుతున్నావని తెలిసి మాకు ఎంతో సంతోషంగా ఉంది. నీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించు. జార్ కు చేసిన సేవ ఎప్పటికీ వృధా పోదు. నటాల్య ఇప్పుడు మాతోనే కలిసి ఉంటుంది కనుక,నువ్వు ఆమె గురించి ఇప్పుడు ఆలోచించు. ఇక్కడ మాకు కూడా ఒక సమస్య వచ్చింది. ష్రోవేటైడ్ దగ్గర ఒక తోడేలు మన మూడు గొర్రెలను చంపేసింది.సరే,జాగ్రత్తగా ఉండు,ఆ దేవుడు ఎప్పుడూ నీతోనే ఉండుగాక! నీ భార్యను గురించి మర్చిపోకు-ఇది నేను నీకు ఇచ్చే ఆజ్ఞ. ఆమె చాలా మంచి స్త్రీ మరియు న్యాయసమ్మతంగా నీతో వివాహం జరిగిన స్త్రీ అని మర్చిపోకు.పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి ఈ తండ్రి చెప్పేది విను.

         నీ తండ్రి, సీనియర్ సార్జెంట్

                                                                                    పాంటెలి మెలఖోవ్.

         రష్యాకు ఆస్ట్రియాకు మధ్య ఉన్న సరిహద్దుకు నాలుగు వెరస్టుల దూరంలో ఉన్న రాడ్జివిలోవో అనే గ్రామంలో గ్రెగరి రెజిమెంట్ ను ఉంచారు. గ్రెగరి ఎప్పుడో ఓ సారి మాత్రమే ఇంటికి ఉత్తరాలు రాసేవాడు. నటాల్య తండ్రి ఇంట్లో ఉంటుందన్న విషయాన్ని తండ్రి ఉత్తరంలో ప్రస్తావించినప్పుడు, గ్రెగరి దాని జవాబులో కేవలం ఆమెను అడిగినట్టు చెప్పమని మాత్రమే రాసి,తా మనసులో ఉన్న భావాన్ని స్పష్టం చేయకుండా ఉన్నాడు. ఎప్పుడూ తన ఉత్తరాల్లో ఆ విషయం గురించి అస్పష్టంగా,పొడిగా రాసేవాడు. పాంటెలి దున్యాక్ష చేత లేదా పెట్రో చేత ఆ ఉత్తరాలను చదివించుకుని,అతను చెప్పని విషయాలను,అతని మనసును ఆ మాటల్లో అర్థం చేసుకునే ప్రయత్నం చేసేవాడు. ఈస్టర్ ముందు రాసిన ఉత్తరంలో పాంటెలి సూటిగా అతనికి సైన్యం నుండి తిరిగి వచ్చిన తర్వాత భార్యతో కలిసి ఉండాలని ఉందా, లేకపోతే అక్సిన్యతోనే ఉండదల్చుకుంటున్నాడా అన్న విషయాన్ని స్పష్టం చేయమని రాశాడు.

    గ్రెగరి దీనికి బదులివ్వడానికి సమయం తీసుకున్నాడు. విట్ సండే తర్వాత ఒక చిన్న ఉత్తరం అతని నుండి వచ్చింది. పదాల చివర అక్షరాలు మింగేస్తూ,దున్యాక్ష గబగబా ఆ ఉత్తరం చదివింది.అన్ని విషయాల తర్వాత చివరకు గ్రెగరి నటాల్యను ఉద్దేశించి ఇలా రాశాడు:

     …… నాకు నటాల్యతో ఉండే ఉద్దేశం ఉందా లేదా అని అడిగారు,నేను మీకు ఒక్కటే చెప్పగలను నాన్న,విరిగిపోయిన అద్దం ఎప్పటికీ అతుక్కోదు.ఇప్పుడు నేను నటాల్యతో కలిసి ఎలా ఉండగలను,నాకే ఒక బిడ్డ ఉన్నప్పుడు. నేను ఈ విషయంలో ఏమి చెప్పలేను,అసలు నాకు ఈ విషయం మాట్లాడాలనే లేదు. తర్వాత రోజు సరిహద్దు దగ్గర ఒక స్మగ్లర్ ను పట్టుకున్నాము. అతని మాటల్లో మాకు తెలిసింది ఏమిటంటే మేము త్వరలోనే ఆస్ట్రియాతో యుద్ధం చేయబోతున్నాము, వాళ్ళ ప్రభువు ఆ సరిహద్దు దగ్గరకు వచ్చి ఎక్కడ యుద్ధం మొదలుపెట్టవచ్చో,ఏ భూములు ఆక్రమించవచ్చో చూసుకుని వెళ్ళాడట.ఒకవేళ  యుద్ధమే జరిగితే,ఆ చివరి వరకు నేనే ఉండకపోవచ్చు,అందుకే ఈ విషయాలన్నీ ముందే మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం లేదు.    

    *       *     *

            నటాల్య తన అత్తారింట్లోనే ఉంటూ,భర్త తిరిగి వచ్చే సమయం కోసం ఎదురుచూస్తూ,ఏదో తెలియని ఆశను గుండెలో నింపుకుంటూ జీవితాన్ని గడుపుతుంది. ఆమె గ్రెగరికి ఎటువంటి  ఉత్తరాలు రాయకపోయినా, అతని రాక కోసం బాధతో,ఆదుర్దాతో ఆమె ఎదురుచూసినట్టు ఎవరూ ఆ ఇంట్లో ఎదురు చూడలేదు.

  ఆ గ్రామంలో జీవిత ప్రవాహం మాములుగానే సాగిపోతూ ఉంది. సైన్యంలో పని చేయటం అయిపోయినవారు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చారు. మామూలు పనులతో వారంలో అన్ని ర్జులు గడిచిపోతే, ఆదివారాలు మాత్రం కుటుంబాలన్నీ చర్చికి వెళ్ళేవి. మగవాళ్ళు మంచి కోట్లు,కింద దుస్తులు వేసుకుంటే,స్త్రీలు రంగురంగుల గౌన్లలో,ఆ గౌన్ల పైన ముదురు రంగుల జాకెట్లతో ముస్తాబై,వారు నడుస్తూ ఉంటే వారి గౌన్లు భూమిని తాకుతూ,వారి అడుగుల సవ్వడితో లయబద్ధంగా చిన్న ధ్వనులు చేస్తూ ఉంటే,చర్చికి వెళ్ళేవారు.

   కూడలి దగ్గర గుర్రపు బండ్లు ఉంచేవారు,ఆ గుర్రాలు సకిలిస్తూ ఉండేవి,ఆ సమయంలోనే ఆ గ్రామంలో ఉన్న అనేక మంది జనాలు అటూఇటూ తిరుగుతూ ఉండేవారు. ఆ దారిలో ఒక పాక దగ్గర బుల్గేరియాలో పెంచిన కూరగాయలను కొందరు చాపల మీద పరిచి అమ్ముతూ ఉండేవారు,వారి వెనుక వదిలేసి ఉన్న ఒంటెల దగ్గర పిల్లలు చుట్టూ చేరి ఆడుకుంటూ ఉండేవారు. అలసతతో అలిసిపోయిన ఒంటెలు వాటికి వేసిన మేతను నెమ్మదిగా తింటూ ఉండేవి. అక్కడే టోపీలు ధరిచిన మగవాళ్ళు,తలకు చేతిరుమాళ్ళు కట్టుకున్న ఆడవాళ్ళు కూడా తిరుగుతూ ఉండేవారు.

     సాయంత్రాలు ఆ గ్రామంలోని వీధులు నర్తిస్తున్న పాదాల ధ్వనితో ప్రతిధ్వనించేవి. వీధుల్లో అక్కడొక చోట,ఇక్కడొక చోట జనాలు గుమిగూడి సంతోషంగా నర్తిస్తూ ఉండేవారు,రాత్రయ్యే వరకు ఇది కొనసాగుతూనే ఉండేది.

      నటాల్య సాయంత్రాలు బయటకు వెళ్ళేది కాదు కానీ దున్యాక్ష చెప్పే కథలను  మాత్రం వింటూ ఉండేది. ఉన్నట్టుండి మెలఖోవుల ఇంట్లో ఉండే చిన్న పిల్ల అందమైన యువతిగా ఎదిగిపోయింది. ముందే పక్వానికి వచ్చిన యాపిల్ పండులా అప్పుడే పరిపూర్ణ యువతిలా మారిపోయింది. ఒకప్పుడు ఆమెను చిన్న పిల్లగా భావించిన స్త్రీల బృందాలు ఆమెను ఇప్పుడు తమతో పాటు చేర్చుకున్నాయి. దున్యాక్ష కు తండ్రి పోలికలు రావడం వల్ల పొట్టిగా,నల్లగా ఉండేది.

           ఆమెకు పదహేనో ఏడు వచ్చినా,అది ఆమె శరీర ఆకృతి నాజూకుతనాన్ని ఎక్కడ చెక్కు చెదరలేదు,లావుగా అవ్వలేదు. ఆమెలో ఇంకా అమాయకత్వం పూర్తిగా పోలేదు, బాల్యపు అమాయకత్వం,యవ్వనపు చిలిపితనం కలగలిపినట్టు ఉండేది. ఒక పిడికిలంత ఉండే ఆమె రొమ్ములు,మెల్లగా ఆమె జాకెట్టు లోపల పట్టు సడలని ఆకృతితో ఉండేవి,క్రమంగా ఆమె భుజాలు విశాలంగా అవుతూ ఉన్నాయి. ఆమె కళ్ళల్లో,నవ్వుల్లో ఉండే మెరుపులో ఇప్పుడు కొంటెతనం ఉంది. సాయంత్రాలు బయట తిరిగివచ్చాక తన రహస్యాలు ఆమె కేవలం నటాల్యతో మాత్రమే చెప్పుకునేది.

        ‘నటాల్య డార్లింగ్, నీతో ఒక విషయం చెప్పాలి.’

         ‘నేను వింటున్నాను.’

            ‘మిష్కా కొషివోయి నిన్న సాయంత్రం అంతా ఓక్ చెట్ల దగ్గర నాతోనే కూర్చుని ఉన్నాడు.’

              ‘నువ్వు ఎందుకు సిగ్గు పడుతున్నావు?’

              ‘నేను అస్సలు సిగ్గు పడటం లేదు.’

           ‘ఒక్కసారి అద్దంలోకి చూడు,నీ ముఖమంతా ఎర్రగా అయిపోయింది.’

         ‘ఒక్క నిమిషం ఆగు.అసలు నువ్వు నన్ను సిగ్గు పడేలా చేసింది.’

        ‘సరే చెప్పు,ఇక నేను ఏమి మాట్లాడను.’

      తన నల్లటి చేతులతో ఎరుపెక్కిన తన చెక్కిళ్ళను రుద్దుకుని,తన చేతి వేళ్ళను ఎదకు ఆనించుకుని,దున్యాక్ష ఆపకుండా అల్లరిగా నవ్వింది.

    ‘ “నువ్వు అచ్చం గడ్డి మైదానాల్లో పూసే తులిప్ పువ్వులా ఉంటావు”. అన్నాడు అతను!’

      ‘సరే,ఆ తర్వాత ఏమన్నాడు?’ నటాల్య ఆమెను పోత్సహిస్తున్నట్టు అంది, అప్పటికే ఇతరుల ఆనందంలో తన ఆనందాన్ని వెతుక్కోవడంలో తృప్తి పడటం ఆమె అలవాటు చేసుకుంది.

  ‘అప్పుడు నేను అతనితో అన్నాను, “ఇక కోతలు కోయకు,మిష్కా!”అని. అప్పుడు అతను దేవుని మీద ప్రమాణపూర్తిగా తను చెప్పేది సత్యమే అన్నాడు.’ దున్యాక్ష నవ్వుల గలగలలు  ఆ చుట్టుపక్కల ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. ఆమె తన తల ఊపుతూ ఉంటే భుజం కూడా ఊగుతూ,ఆమె రెండు జడలు ముందుకు వెనక్కి ఊగుతూ ఉన్నాయి.

‘ఇంకా అతను ఏం చెప్పాడు?’

  ‘నీ జ్ఞాపకంగా నాకు నీ చేతిరుమాలు ఇవ్వు,అని అడిగాడు.’

   ‘మరి ఇచ్చావా?’

    ‘లేదు,నేను ఇవ్వలేదు.’, “నేను ఇవ్వను,కావాలంటే నీ ప్రియురాలిని అడుగు”,అని చెప్పాను.నీకు తెలుసా, అతను యెరోఫెయర్స్ కోడలితో సన్నిహితంగా ఉంటున్నాడు.ఆమె భర్త దూర పంతంలో ఉంటాడు.’

    ‘అయితే నువ్వు అతనికి దూరంగా ఉండాలి.’

    ‘నేను అతనికి ఉండాల్సినంత దూరంలోనే ఉన్నాను’,దున్యాక్ష ఇటువంటి విషయాలు చెప్తున్నాప్పుడు ఓ రకంగా నవ్వడంలో నైపుణ్యం సాధించింది,ఇప్పుడు కూడా అదే చిలిపి నవ్వు ఆమె పెదాలపై తాండవమాడింది. ఆ నవ్వుతోనే ఆమె తన సంభాషణను కొనసాగించింది,”మేము ముగ్గురు అమ్మాయిలము కలిసి ఇంటికి తిరిగివస్తున్నాము,అప్పుడు మిఖే తాతయ్య మాకు ఎదురొచ్చాడు,బాగా తాగి ఉన్నాడు. “నాకు ముద్దు పెటండి అమ్మాయిలు ,మీకు ఓ కోపెక్కు ఇస్తాను”అని వెకిలిగా అన్నాడు. ఆ మాట అంటూనే మా మీద పడబోయాడు,కానీ న్యూయార్కా అక్కడే ఉన్న కర్రతో అతన్ని గట్టిగా బాదింది. అప్పుడు అతని నుండి తప్పించుకుని వచ్చేశాము.’

      అప్పుడే వేసవి కాలం మొదలైంది. కాలం మందకొడిగా నడుస్తున్నట్టు ఉంది. డాన్ లో కొద్దిగా నీటి మట్టం తగ్గింది. ఒకప్పుడు ఎంతో వేగ ప్రవాహంతో నిండుగా ప్రవహించిన ఆ నది ఇప్పుడు నెమ్మదించింది, ఒకప్పుడు అడుగు పెడితే దాదాపుగా మూపురం వైపు మునిగిపోయే ఎద్దుల మూపురాలు ఇప్పుడు పొడిగానే ఉంటున్నాయి.రాత్రుల సమయాల్లో ఓ రకమైన ఉక్కపోత కొండ మీదుగా గడ్డి వాసన నిండిన గాలితో కలిసి గ్రామంలోకి వీస్తూ ఉండేది. అలాగే డాన్ వెనకాల మేఘాలు గుమిగూడినట్టు, ఉరుములతో గర్జించినా సరే,ఏ వాన పడేది కాదు.

               ప్రతి రాత్రి ఒక గుడ్లగూబ ఆ ఊరి చర్చి గోపురం పైన నుండి అరిచేది. ఒక రకమైన విషాదంతో నిండిన దాని అరుపులు ఆ గ్రామంలో ప్రతిధ్వనించాక,అది మెల్లగా శ్మశానానికి వెళ్ళి అక్కడ నుండి అరిచేది.

  ‘ఇది ఏదో కీడుకు సంకేతం’,అని శ్మశానం నుండి దాని అరుపు వినబడినప్పుడు ఆ ఊరి పెద్దలు అనుకుంటూ ఉండేవారు.

  ‘యుద్ధం రాబోతుంది.’

   ‘టర్కీ యుద్ధం జరగబోయే ముందు కూడా ఇది ఇలానే అరిచేది.’

   ‘ఒకవేళ మళ్ళీ కలరా వ్యాపించబోతుందేమో!’

 ‘దాని వల్ల జరిగే మంచి ఏమి లేదు. అది చర్చి నుండి చనిపోయిన వారు ఉండే శ్మశానానికి పోతూ ఉంది.’

  ‘ఓ దయగల దేవుడా,రాబోయే ప్రమాదం నుండి మమ్మల్ని కాపాడు.’

  ఒంటి చేయి అలెక్సి సోదరుడైన షామిలి, కీడును సూచిస్తుందని భావించబడుతున్న ఆ పక్షిని ఆ శ్మశానం దగ్గర మాటు వేసి చంపాలని ప్రయత్నించాడు. కానీ అది నిశ్శబ్దంగా,కనిపించకుండా అతని తల మీద నుండే పైకి ఎగిరిపోయేది.అది ఆ శ్మశానంకు ఉన్న ఇంకో చివరకు ఎగిరిపోయే మరలా అక్కడి నుండి అరిచేది. మార్టిన్ దాన్ని తిట్టుకుంటూ,ఆకాశంలో ఉన్న నల్లటి మేఘాల గుండా ఎగిరిపోయే దాన్ని చూస్తూ ఉండేవాడు. అతను శ్మశానం దగ్గరే నివసిస్తూ ఉండేవాడు. ప్రతి విషయానికి కంగారుపడే అతని భార్య గొప్ప పునరుత్పత్తి శక్తితో ప్రతి సంవత్సరం ఒక బిడ్డను కంటూ ఉండేది. ఈ విషయంలో ఆమె భర్తను కోప్పడేది.

    ‘ఓ,ఎలాంటి వెధవవు నువ్వు! నిజంగా వెధవ్వే! ఆ పక్షి ఏమైనా నీ జోలికి వస్తుందా,చెప్పు? ఒకవేళ దేవుడు ఇలాంటి పని చేసినందుకు మనల్ని శిక్షిస్తే పరిస్థితి ఏమిటి? నేను ఇప్పటికే ప్రసవానికి దగ్గరలో ఉన్నాను, ఒకవేళ నీ వల్ల బిడ్డకు ఏదైనా అయితే ఎలా?’

  ‘నోరు మూసుకో! నీకు అంతా మంచే జరుగుతుంది! ఎందుకలా నస పెడుతూ ఉంటావు? ఎందుకు ఆ పనికిమాలిన పక్షి ఇలా కీడును సూచిస్తూ అరుస్తూ ఉండాలి? దాని వల్లే మనందరికీ సమస్యలు రావచ్చు.  ఒకవేళ యుద్ధం జరిగితే,నేను తప్పకుండా సైన్యానికి వెళ్ళాల్సి వస్తుంది..నువ్వు నాకు ఇచ్చిన ఆ చెత్తను చూడు’,అంటూ ఒక మూలగా చాప మీద పడుకుని ఉన్న పిల్లల వైపు చేయి చూపిస్తూ అన్నాడు.

  ఈ  యుద్ధం విషయం మార్కెట్ దగ్గర వృద్ధులు మాట్లాడుకునే సమయంలో పాంటెలి తనకు తెలిసిన విషయం మీద వాదించేవాడు.

   ‘మా గ్రెగరి మొన్న ఉత్తరంలో ఆస్ట్రియా జారు సరిహద్దు దగ్గరకు వచ్చి,తన సైన్యాలను ఒక చోట చేరి,మాస్కో మరియు పీటర్స్ బర్గ్ మీద యుద్ధానికి సిద్ధంగా ఉండమని చెప్పాడని రాశాడు.’

   ఆ వృద్ధులు అంతకుముందు జరిగిన యుద్ధాల గురించి మాట్లాడుకుని,తమకు తెలిసిన ఊహాగానాలు చేశారు.

  ‘అసలు ఏ యుద్ధం జరగబోవడం లేదు. ఇంత పచ్చగా పెరుగుతున్న పంటను చూస్తే అది చెప్పవచ్చు.’

   ‘అసలు పంటలకు,దానికి సంబంధమే లేదు.’

  ‘నాకు తెలిసి ఈ సమస్యలు అన్నీ కూడా విద్యార్ధుల వల్లే అనుకుంటా.’

   ‘మనకు అసలు ఏం జరుగుతుందో తెలిసే సరికి అంతా అయిపోతుంది.’

    ‘జపాన్ కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలాగా!’

    ‘నీ కొడుక్కి గుర్రం తెచ్చావా?’

     అయినా అంతా హడావుడి ఏమి లేదు….’

  ‘ఇదంతా వట్టి మాటలే!’

   ‘అసలు మనం ఎవరితో యుద్ధానికి వెళ్తున్నాము?’

    ‘ఆ సముద్రం వల్ల టర్కీల మీదకే అనుకుంటా. మనతో వారు ఆ సముద్రాన్ని సక్రమంగా పంచుకోరు.’

   ‘అయినా ఎందుకు వారు అలా ఉంటారు? ఆ పచ్చిక బీడును భాగాలు చేసుకునట్టు,ఆ సముద్రాన్ని కూడా అలా చేసుకుంటే సమస్యే ఉండదు కదా!’

  సాధారణంగా  వారి మాటలు హాస్యంతోనే ముగిసిపోయేవి,తర్వాత వారు వాళ్ళ ఇళ్ళకు వెళ్ళిపోయేవారు.

   ఆ గ్రామంలో ఇంకా పట్టించుకోవాల్సిన అనేక గంభీరమైన విషయాలు ఉన్నాయి. డాన్ కు అవతలి వైపు ఉన్న పచ్చిక బీడుల్లో గడ్డి బాగా పెరిగిపోయింది,దాన్ని కత్తిరించాలి. స్టెప్పి గడ్డి మైదానాల్లో ఉండే గడ్డిలా లేదు అది,ఏ వాసన లేకుండా వాడిపోయినట్టు ఉంది. నేల ఒకటే అయినా, ఆ గడ్డి మాత్రం భిన్నమైన సారాన్ని ఆ భూమి నుండి గ్రహించింది.ఇకపోతే ఇవతల  స్టెప్పి దగ్గరలో కొండ వెనుక నేల అంతా గట్టిగా అయిపోయింది. ఒక గుర్రపు మంద అక్కడ ఒక్క కాలిముద్ర కూడా పడకుండా ఆ బాటలో నడవవచ్చు. నేల గట్టిగా ఉన్నా సరే, అక్కడ పచ్చగా,ఓ రకమైన సువాసనతో బలంగా గడ్డి పెరిగింది. ఎంత ఎత్తు ఆ గడ్డి పెరిగిందంటే గుర్రపు మోపురాలను తాకగల ఎత్తు. కానీ డాన్ కింద ఇంకో వైపు మాత్రం మెత్తగా ఉన్న నేలలో,కొన్ని సంవత్సరాల నుండి ఏ పశువులు కూడా తిననటువంటి గడ్డి పెరుగుతూ ఉంది.

      కొడవళ్ళు మరియు గడ్డి కత్తిరించే పనిముట్లు అన్నిటిని కూడా ఆ గ్రామవాసులు సిద్ధం చేసుకుంటూ ఉన్నారు, స్త్రీలు వాటికి సానపెడుతూ ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలోనే జరిగిన ఒక సంఘటన ఆ గ్రామంలో ప్రకంపనలు సృష్టించింది.ఆ జిల్లా ప్రధాన పోలీసు అధికారి,ఒక పోలీస్ ఇన్స్పెక్టర్,పళ్ళు నల్లబడి ఉన్న ఇంకో చిన్న స్థాయి అధికారి వారి వారి యూనిఫార్మ్స్ ధరించి ఆ ఊరిలో అడుగుపెట్టారు.వారిని ఆ గ్రామస్తులు అంతకుముందు ఎప్పుడు చూడలేదు. వారికి ఎదురుపడిన వారితో తాము అటామన్ ను కలవాలని చెప్పి సరాసరి మెల్ల కన్ను లుకేష్కా ఇంటికి వెళ్ళారు.

    పోలీస్ ఇన్స్పెక్టర్ బాడ్జి కుట్టబడి ఉన్న తన టోపిని తల నుండి తీసి,చేత్తో పట్టుకున్నాడు. ఆ బృందమంతా ఆ ఎడమ వైపు వీధిలోకి వెళ్ళారు;అక్కడ ఉన్న కంచె మీద సూర్యకాంతి పడి ఆ నీడలు వెనుకపడుతూ ఉన్నాయి.ఆ కంచె దగ్గర ఆ ఇన్స్పెక్టర్ కు  అక్కడే ఉన్న అటామన్ కనిపించాడు.

    ‘కొత్తగా వచ్చిన స్టోక్ మాన్ ఇంకా ఉన్నాడా?’

    ‘ఉన్నాడు సార్.’

     ‘అతను ఏ ఉద్యోగం చేస్తూ ఉంటాడు?’

   ‘అతను ఏదో వడ్రంగి పనులు చేస్తూ ఉంటాడని తెలుసు,ఎప్పుడు ఆ రంపంతో ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు.’

       ‘అతను ఎప్పుడైనా భిన్నంగా ప్రవర్తించడం గమనించారా?’

       ‘లేదు సార్.’

        ఆ ఇన్స్పెక్టర్ తన రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ఒక మొటిమను నలిపాడు ; ఊలుతో చేసిన అతని యూనిఫార్మ్ చెమట పట్టి ఉంది. నల్ల పళ్ళు కల అధికారి తన పళ్ళను చిన్న పుల్లతో మధ్యలో పెట్టి తిప్పుతూ ఉంటే,అతని కళ్ల చుట్టూ ఉన్న ముడతలు ఇంకా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి.

   ‘అతన్ని చూడటానికి ఎవరెవరు వస్తూ ఉంటారు?’

   ఇన్స్పెక్టర్ తన ప్రశ్నలను కొనసాగించాడు.

    ‘కొందరు అతని దగ్గరకే వెళ్తూ ఉంటారు.అక్కడ పేకాట ఆడుతూ ఉంటారు.’

    ‘ఎవరు వాళ్ళు?’

    ‘ఎక్కువగా ఆ మిల్లు వాళ్ళే,ఆ మిల్లులో పని చేసే వాళ్ళు.’

     ‘వాళ్ళెవరో ఖచ్చితంగా చెప్పండి?’

     ‘అక్కడ పని చేసే ఇంజిన్ మెన్,స్కేల్స్ మెన్ ,రోలర్ మెన్ దవ్యాడ్క,అలాగే ఇక్కడకు చెందిన ఒకరిద్దరు కోసాక్కులు కూడా వెళ్తూ ఉంటారు.’

    ఇన్స్పెక్టర్ కాసేపు ఆగి, నల్ల పళ్ళ అధికారి స్పందన కోసం చూస్తూ, తన ముక్కు దగ్గర పట్టిన చెమటను టోపితో తుడుచుకున్నాడు. ఆ నల్ల పళ్ళ అధికారి తన యూనిఫారం బొత్తాన్ని పట్టుకుని తిప్పుతూ, ఆ అధికారికి ఏదో చెప్పి,అటామన్ ను దగ్గరకు పిలిచాడు. వెంటనే అటామన్ మునివేళ్ళ మీద పరిగెత్తుతున్నట్టు వచ్చి,ఊపిరిబిగపట్టి నిలుచున్నాడు.

   ‘వెంటనే మీ వాళ్ళలో ఇద్దరిని తీసుకుని ఆ మిగిలిన వారిని అరెస్ట్ చేసి,వారిని ఆఫీసుకు తీసుకురండి. మేము అక్కడికి కాసేపట్లోనే వచ్చేస్తాము.అర్థమైందా?’ అని అటామన్ వైపు తీక్షణంగా చూస్తూ అడిగాడు.

    నిటారుగా నిలబడిన ఆ అటామన్ తన శరీరాన్ని విన్యాపూర్వకంగా ముందుకు వంచి,అర్ధమైనట్లు తల ఊపి,వెంటనే ఆ కంచె గుండా ఆ అధికారులు వచ్చిన మార్గంలో పరుగు వేగంతో వెళ్ళిపోయాడు.

    స్టోక్ మాన్ తన వీపును తలుపు పెట్టుకుని కూర్చుని, రంపంతో ఓ ఫ్లై వుడ్ ముక్కను కోస్తూ ఉన్నాడు. అప్పటికి అతను లో దుస్తులలోనే ఉన్నాడు.

   ‘నిలుచో. నిన్ను అరెస్ట్ చేయాలి.’

     ‘అసలు ఏంటి ఇదంతా?’

     ‘నీవు ఈ రెండు గదుల పోర్షన్ లో ఉంటున్నావా?’

     ‘అవును.’

      ‘అయితే ఇప్పుడు ఇదంతా మేము వెతకబోతున్నాము.’ అక్కడ ఉన్న బల్ల వద్దకు నడుస్తూ,దాని మీద పెట్టి ఉన్న పుస్తకాన్ని తీసుకుని , చూస్తూ అన్నాడు ఆ ఆఫీసర్.

       ‘అక్కడ ఉన్న పెట్టె తాళం చెవి నాకు కావాలి.’

        ‘అసలు నేను ఏం తప్పు చేశానని మీరు ఇలా వచ్చారు,ఇన్స్పెక్టర్?’

       ‘దాని గురించి మాట్లాడటానికి ఇంకా చాలా సమయం ఉంది. సాక్షులారా!ఇటు వైపు రండి!’

      స్టోక్ మాన్ భార్య పక్క గదిలో నుండి చూస్తూ, ఆ గది తలుపు కొద్దిగా తెరిచి ఉంచింది. ఒక గుమాస్తాతో పాటు ఇన్స్పెక్టర్ ఆ గదిలోకి వెళ్ళాడు.

      ‘ఏంటి ఇది?’ ఆ ఆఫీసర్ పసుపు పచ్చ అట్టతో ఉన్న ఓ పుస్తకాన్ని తీసుకుంటూ అడిగాడు.

      ‘ఓ పుస్తకం’,స్టోక్ మాన్ భుజాలు ఎగరేస్తూ జవాబిచ్చాడు.

     ‘నీ వెటకారాలు ఇంకో సందర్భం కోసం ఉంచుకో,ఇప్పుడు మాత్రం నా ప్రశ్నలకు నువ్వు సరైన సమాధానాలు చెప్పాలి.’

     స్టోక్ మాన్ వస్తున్న నవ్వును ఆపుకుంటూ అక్కడే ఉన్న పొయ్యి కట్టను ఆనుకుంటూ నిలబడ్డాడు. ఆ పోలీస్ చీఫ్ అధికారి, ఇన్స్పెక్టర్ వైపు ఒక సారి చూసి,వెంటనే స్టోక్ మాన్ వైపు దృష్టి సారించాడు.

‘నువ్వు దీనిని చదువుతున్నావా?’

‘నాకు ఆ విషయం పట్ల ఆసక్తి ఉంది’,పొడిగా సమాధానమిస్తూ, ఓ దువ్వెనతో రెండు భాగాలుఫ్గా తన గడ్డాన్ని దువ్వుకున్నాడు స్టోక్ మాన్.

‘అవునా!’

      ఆ అధికారి కొన్ని పేజీలు తిరగేసి,దాన్ని బల్ల మీదకు విసిరేశాడు;దాని పక్కనే ఉన్న ఇంకో పుస్తకం వైపు చూశాడు,దాన్ని చూసి పెట్టేశాడు;తర్వాత మూడవ దాని అట్ట చూస్తూ,స్టోక్ మాన్ వైపు తిరిగాడు.

    ‘నువ్వు ఈ రకమైన సాహిత్యాన్ని ఎక్కడ ఉంచుతావు?’

      స్టోక్ మాన్  ఏదో గురి పెట్టి చూస్తున్నట్టు తన ఎడమ కన్ను మూసుకుని, ‘నా దగ్గర ఉన్నవన్నీ ఇక్కడే ఉన్నాయి’,అన్నాడు.

     ‘నువ్వు అబద్ధం చెప్తున్నావు!’ఆ పుస్తకాన్ని విసిరేస్తూ గట్టిగా అన్నాడు ఆ అధికారి.

   ‘నాతో ….’

   ‘మొత్తం వెతకండి!’

     తన ఖడ్గాన్ని సరిచేసుకుని ఆ పెట్టె దగ్గరకు వెళ్ళాడు ఆ అధికారి. అక్కడ మశూచి వల్ల ముఖమంతా స్ఫోటక మచ్చలు ఉన్న ఓ కోసాక్కు అక్కడ జరుగుతుంది చూసి భయపడుతూనే,అక్కడున్న పెట్టెలో  బట్టల్లో వెతుకుతూ ఉన్నాడు.

      ‘నాతో మర్యాదగా ప్రవర్తించండి’,స్టోక్ మాన్ ఆ వాక్యం పూర్తి చేస్తూ, గురి పెట్టినట్టు చూస్తూ ఉన్న తన కన్నుతో ఆ అధికారి ముక్కు మధ్యనే చూస్తూ ఉన్నాడు.

   ‘నిశ్శబ్దంగా ఉండు.’

  వాళ్ళు ఆ ఇంట్లో స్టోక్ మాన్ కాపురం ఉంటున్న పోర్షన్ లో ఏ చిన్న చోటు కూడా వదలకుండా అంతా గాలించారు. ఆ వర్క్ షాప్ కూడా మొత్తం వెతికారు. ఆ పోలీస్ ముఖ్య అధికారి ఆఖరికి గోడలను కూడా తన వేళ్ళతో కొట్టి చూశాడు.

     స్టోక్ మాన్ ను కార్యనిర్వహణ భవనానికి తీసుకువెళ్ళారు. స్టోక్ మాన్ ఒక చేతిని తన పైజమా జేబులో పెట్టుకుని,ఇంకో చేతిని ఊపుకుంటూ వీధి మధ్యలో నడుస్తూ ఉంటే,అతని వెనుక ఒక కోసాక్కు గార్డు నడుస్తూ ఉన్నాడు. ఆ పక్కనే నడుస్తూ ఉన్న ఇన్స్పెక్టర్ తన టోపీని తలకు పెట్టుకున్నాడు.

   అందరికన్నా చివరిలో స్టోక్ మాన్ ను విచారణ చేశారు. తన చేతులకు అంటుకున్న గ్రీజు మరకలను తుడుచుకునే సమయం ఇవ్వకుండా తీసుకురాబడిన ఇవాన్ అలెక్సెయేవిచ్, ఇబ్బందిగా నవ్వుతూ ఉన్న దవ్యాడ్క,తన భుజాల మీదుగా జాకెట్ కప్పిన నేవ్, మికెల్ కొషివోయ్,అప్పటికే విచారణ అయిపోయి,ముందు గదిలో కూర్చుని ఉంటే,వారి వెనుక ఒక కోసాక్కు గార్డు ఉన్నాడు.

   స్టోక్ మాన్ బల్లకు ఇవతల వైపు నిలబడి చూస్తూ ఉంటే,అటువైపు ఉన్న ఇన్స్పెక్టర్ తన చేతిలో ఉన్న గులాబీ రంగు ఫైల్ ను చూస్తూ ఉన్నాడు.

    ‘నేను నిన్ను మిల్లులో జరిగిన హత్య గురించి అడిగినప్పుడు, నువ్వు ఎందుకు ‘సోషల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ పార్టీ’సభ్యుడివి అన్న విషయాన్ని నా దగ్గర దాచావు?’

      స్టోక్ మాన్ ఏ జవాబు ఇవ్వకుండా ఆ ఇన్స్పెక్టర్ తల వైపు చూస్తూ ఉన్నాడు.

      ‘అయితే అదే నిజమని నిర్ధారణ అయిపోయింది.ఇక దీనికి తగ్గ అపరాధ రుసుము నువ్వు కట్టాల్సి వస్తుంది ‘,అన్నాడు ఆ మొండి నిశ్శబ్దంతో చిరాకు పడ్డ ఆ అధికారి.

    ‘దయచేసి మీ విచారణ మొదలుపెట్టండి’,స్టోక్ మన్ నిరాసక్త స్వరంతో అని,పక్కనే ఉన్న స్టూల్ వైపు చూస్తూ తన కూర్చోవచ్చా అని కళ్ళతోనే అడిగాడు.

  ఆ ఇన్స్పెక్టర్ ఏ జవాబు ఇవ్వకుండా విముఖతతో అతని వైపు చూస్తూ,మరలా తన చేతిలో ఉన్న కాగితాలు చూడటంలో మునిగిపోయాడు.స్టోక్ మాన్ శాంతంగా ఆ స్టూల్ మీద కూర్చున్నాడు.

    ‘నువ్వు ఎప్పటినుండి ఇక్కడ ఉంటున్నావు?’

    ‘పోయిన సంవత్సరం నుండి.’

    ‘ఏ సంస్థ ఆదేశాల మేరకు నువ్వు ఇక్కడ ఉంటున్నావు?’

    ‘ఏ ఆదేశాలు లేవు.’

    ‘నువ్వు ఎన్నేళ్లుగా ఆ పార్టీలో సభ్యుడిగా ఉన్నావు?’

     ‘మీరు దేని గురించి మాట్లాడుతున్నారు?’   

‘నేను అడుగుతున్నాను ‘,’నేను’అనే పదాన్ని నొక్కి పలుకుతూ, ‘నువ్వు ఎన్నాళ్ళుగా ఆర్ ఎస్ డి ఎల్ పి సంస్థ సభ్యునిగా ఉన్నావు?’

   ‘నేను అనుకోవడం…’

   ‘నువ్వు ఏమి అనుకుంటున్నావు అన్న దాని గురించి నాకసలు ఆసక్తి లేదు. నా ప్రశ్నకు జవాబు చెప్పు. నువ్వు నిజాలు దాచి పెడితే అది నీకే హాని చేస్తుంది.’ ఆ ఇన్స్పెక్టర్ అక్కడ బల్ల మీద ఉన్న చిన్న కాగితాన్ని తన చేత్తో  తీసి, ‘ఇది రోస్తోవ్ నీ పార్టీ గురించి విచారణలో చెప్పింది.’

   స్టోక్ మాన్ ఆ కాగితాన్ని ఆ కళ్ళతోనే పరికించి చూసి,ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండి,తన మోచేతిని రుద్దుకుంటూ,’1907 నుంచి’,అని ధృఢంగా చెప్పాడు.

    ‘సరే.అయితే ఇక్కడకు నిన్ను పార్టీ వారు పంపారనన్న విషయాన్ని నువ్వు ఒప్పుకోవా?’

     ‘అవును.’

     ‘అయితే నువ్వు ఇక్కడకు ఎందుకు వచ్చావు?’

    ‘ఇక్కడ మెకానిక్ నైపుణ్యాలకు  చోటు ఉందని తెలిసి వచ్చాను.’

   ‘మరి ఈ జిల్లానే ఎందుకు ఎన్నుకున్నావు?’

   ‘అదే కారణం.’

    ‘అయితే నువ్వు ఈ మధ్య కాలంలో ఆ పార్టీతో సంబంధాలు కలిగి ఉన్నావా?’

    ‘లేదు .’

   ‘వారికి నువ్వు ఇక్కడ ఉన్నావని తెలుసా?’

   ‘తెలిసి ఉండొచ్చు.’

    అక్కడ ఉన్న చిన్న కత్తి లాంటి దానితో పెన్సిల్ ను చెక్కుతూ ఆ ఇన్స్పెక్టర్ తన పెదవులను తడి చేసుకున్నాడు. అతను స్టోక్ మాన్ వైపు చూడలేదు.

   ‘నువ్వు ఆ పార్టీ సభ్యులెవరితో అయినా మాట్లాడుతూ లేదా కలుస్తూ ఉన్నావా?’

     ‘లేదు.’

    ‘అసలు ఏ పని మీద మిల్లులో పని చేసేవారు నీ ఇంట్లో సమావేశమయ్యేవారు?’

      స్టోక్ మాన్ విచిత్రంగా అనిపించిన ఆ ప్రశ్నకు తన భుజాలు ఎగరేశాడు.

    ‘మేము మాములుగానే చలికాల సాయంత్రాల్లో కలుసుకునే వాళ్ళము. …ఊరికే సరదాకు అంతే…మేము పేకాట ఆడేవాళ్ళము.’

   ‘అలాగే చట్టం నిషేదించిన పుస్తకాలు కూడా చదివేవారు’, ఇన్స్పెక్టర్ అందుకున్నాడు.

   ‘లేదు.వాళ్ళంతా నిరక్ష్యరాసులు.’

   ‘కానీ ఆ ఇంజిన్ మెన్ మరియు మిగిలినవారు కూడా ఈ విషయాన్ని ఖండించకుండా ఒప్పుకున్నారు.’

   ‘అది నిజం కాదు.’

  ‘నీకు అసలు ఏం జరగబోతుందో కొద్దిగా కూడా తెలియదు అనుకుంటా….’అని ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఉంటే స్టోక్ మాన్ నవ్వాడు.దానితో ఆ అధికారి తను చెప్పబోతున్న విషయాన్ని ఆపేశాడు. కోపంతో రేగిపోయాడు. ‘నీకు అసలు బుద్ధి లేదు! నువ్వు ఏది ఒప్పుకోకుండా నీకు నువ్వే హాని చేసుకుంటున్నావు. చాలా స్పష్టంగా తెలిసిన విషయం ఏమిటంటే నిన్ను నీ పార్టీ వారు కోసాక్కుల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెంచడానికి పంపించారని. నువ్వు ఎందుకు ఇంకా ఈ దాచిపెట్టే ఆట ఆడుతున్నావో నాకు తెలియడం లేదు. దీని వల్ల నీకు పడే శిక్ష తగ్గదు.’

    ‘ఇవన్నీ కేవలం మీ ఊహలు మాత్రమే. నేను సిగరెట్ కాల్చుకోవచ్చా? ధన్యవాదములు.కానీ మీ ఊహలను బలపరిచే సాక్ష్యాలు ఏమి లేవు.’

    ‘నువ్వు ఈ పుస్తకాన్ని  నిన్ను చూడటానికి వచ్చే వారికి చదివి వినిపించేవాడివా?’ ఒక చిన్న పుస్తకం మీద తన చేతిని ఉంచుతూ ఆ ఇన్స్పెక్టర్ అడిగాడు. దాని మీద నలుపుతెలుపుల్లో ‘ప్లేఖనోవ్’అనే శీర్షిక ఉంది.

   ‘మేము కవిత్వం చదివేవాళ్ళము’,స్టోక్ మాన్ సిగరెట్టును గట్టిగా తన రెండు చేతి వేళ్ళ మధ్య పట్టుకుంటూ అన్నాడు.

   ఆ తర్వాతరోజు ఉదయం ,ఆకాశం దట్టమైన మేఘాలతో కప్పి ఉండగా, ఓ రెండు గుర్రాల గుర్రపు బండి ఆ గ్రామం నుండి బయటకు వెళ్ళింది. దాని వెనుక స్టోక్ మాన్  తన కోటును పైకి లాక్కుంటూ,నిద్రకు తూలుతూ ఉన్నాడు. ఖడ్గాలతో ఉన్న ఇద్దరు కోసాక్కు గార్డులు అతనికి ఇరువైపులా కూర్చుని ఉన్నారు. వారిలో ముఖం మీద స్ఫోటక మచ్చలు ఉన్నవాడు,స్టోక్ మాన్ మోచేతిని గట్టిగా పట్టుకుని,అతని ముఖంలోకి భయంగా చూస్తూ ,ఇంకో చేత్తో గట్టిగా ఖడ్గాన్ని  పట్టుకున్నాడు.

   ఆ బండి వీధిలో నుండి వెళ్తూ ఉంటే దుమ్ము పైకి లేచింది. మెలఖోవుల ధాన్యపు కొట్టం ముందు ఉన్న కంచె దగ్గర చేతులు వెనక్కి పెట్టుకుని, తల చుట్టూ శాలువా కప్పుకున్న ఒక స్త్రీ నిలబడి వేచి చూస్తూ ఉంది.  ఆమె ముఖమంతా కన్నీళ్ళతో నిండిపోయింది, దీనంగా చూస్తూ అలాగే నిలబడిపోయింది ఆమె.

      ఆ దారి గుండా ఆ బండి వెళ్తూ ఉంటే, తన చేతులతో గుండెను బాదుకుంటూ దాని వెంట పరుగు పెట్టింది.

   ‘ఓసిప్!ఓసిప్! ఇప్పుడు నేను ఏం చేయను!’

   స్టోక్ మాన్ ఆమె వైపు తన చేయి ఊపబోయాడు,కానీ స్పోటకపు మచ్చలు ఉన్న గార్డ్ ఒక్కసారిగా ఎగిరినంత పని చేసి,పిడికిలి బిగిస్తూ, ‘మర్యాదగా కూర్చో! లేకపోతే  నిన్ను ముక్కలు చేస్తా!’అని  కీచు గొంతుతో అన్నాడు.

   ఆ గార్డు మొట్టమొదటి సారి తన సాధారణ జీవితంలో జారుకి వ్యతిరేకంగా ఉండే వ్యక్తిని కళ్ళారా చూశాడు.

      *    *   *

మంచు పట్టిన మాంకోవో దారి నుండి చాలా సేపు ప్రయాణం చేశాక రాడ్జివిలోవో చేరుకున్నారు వారంతా. గ్రెగరి ఆ ప్రయాణం గురించి గుర్తు చేసుకుందామని ప్రయత్నం చేసినా అతని జ్ఞాపకాల్లో దానికి సంబంధించినది ఏది ప్రత్యక్షం కాలేదు;కేవలం ఎర్ర రంగులో ఉన్న స్టేషన్ భవనాలు,బండి చక్రాలు కదులుతున్న చప్పుడు,ఎండుగడ్డి మరియు గుర్రాల వ్యర్థాల వాసన,అప్పుడప్పుడూ వ్యాన్ లోపలికి ద్వారా గుండా వచ్చే పొగ,పెద్ద పెద్ద మీసాలతో,ఉబ్బిన ముఖంతో వొరోనేజ్ ప్లాట్ ఫారం మీద నుంచున్న ఒక మిలిటరీ అధికారి ముఖం; ఇవి తప్ప అతని స్మృతుల్లో ఇంకేమి లేవు.

    పక్కగా ఉన్న స్టేషన్ దగ్గర దిగిన వారిని కత్తిరించిన జుట్టుతో,పొడుగైన కోట్లు ధరించి,అర్థం కానీ బాషలో మాట్లాడుతున్న  అధికారులు, మామూలు వాళ్ళు గుంపుగా కలిశారు. బండ్లలో ఉన్న గుర్రాలను కిందకు దింపడానికి కొంత సమయం పట్టింది. అక్కడ ఉన్న ఓ అధికారి మూడువందలకు పైగా ఉన్న కోసాక్కులను వెంటనే గుర్రాలపై వెటర్నరీ స్టేషన్ కు వెళ్ళాల్సిందిగా ఆజ్ఞాపించాడు. గుర్రాలను పరీక్షించడం, విధులను అనుసరించి వైమానిక దళ బృందాలుగా వారిని ఏర్పరచడం,ఇదంతా అయ్యేసరికి చాలా సమయం పట్టింది. ఎన్.సి. ఓ(మిలిటరిలో ఆఫీసరు ర్యాంకు ఉన్న అధికారులు)అటూ ఇటూ తిరుగుతున్నారు. గుర్రాల రంగులను,జాతులను అనుసరించి వాటికి కూడా ఒక్కో దళంలో ఉండేలా విభజించారు. మేలు జాతికి చెందినవి మొదటి దళంలో ,తర్వాత రెండో,మూడో,నాలుగు ,ఐదు,ఆరు రకాలుగా విభజించారు. గ్రెగరి గుర్రం నాలుగులో రకంలో ఉండేలా నిర్ణయం జరిగింది. తర్వాత అక్కడ ఉన్న సార్జెంట్ అధికారి కోసాక్కులను బృందాలుగా ఏర్పడేలా చేసి ఆ బృందానికి  కేటాయించబడిన చోటుకి వెళ్ళాల్సిందిగా ఆజ్ఞాపించాడు. ఆ ప్రదేశంలో ఉన్న వివిధ ఎస్టేట్ లు మరియు పట్టణంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో ఆ కోసాక్కులు ఉండాల్సిన ప్రదేశాలు ఉన్నాయి.

    ఉబ్బినట్టు ఉండే కళ్ళతో, ధరించిన యూనిఫార్మ్ మీద అతని హోదాను సూచించే చిహ్నాలతో,చీకూచింతా లేకుండా కులాసాగా ఉన్నట్టు కనిపించే సార్జెంట్ అధికారి కార్గిన్ గ్రెగరి పక్కగా గుర్రం మీద వెళ్తూ, ‘నీది ఏ స్టానిట్సా?’అని అడిగాడు.

   ‘వ్యోషేన్ స్కాయా.’

   ‘అంటే కుక్క*,అదే కదా?’

(*  అన్ని స్టానిట్సాలకు ఆ రోజుల్లో ముద్దుపేర్లు ఉండేవి. వ్యోషేన్ స్కాయాకి ఉన్న పేరు ‘కుక్క’-రచయిత)

    ఆ మాటలకు మిగిలిన స్టానిట్సాలకు చెందిన కోసాక్కులు గ్రెగరిని చూసి ఎగతాళిగా నవ్వుతూ ఉంటే అతను మౌనంగానే ఆ అవమానాన్ని దిగమింగాడు.

    ఆ దారి గుండా ముందుకు వెళ్ళాక ఒక రహదారి వచ్చింది. డాన్ ప్రాంతానికి చెందిన గుర్రాలు ఏవి కూడా అంతకు ముందు అలా తారుతో వేయబడిన రోడ్లను చూడకపోవడం వల్ల,మంచుతో కప్పబడిన నదిలోకి అడుగుపెట్టబోతున్నట్టు, వాటి చెవులు నిక్కబొడుచుకున్నాయి, ఒక్కసారిగా సకిలించాయి. కొద్దిసేపటికే ఆ బాటకు అవి అలవాటు పడిపోయి ముందుకు సాగిపోయాయి.ఆ చుట్టూ కొత్త ప్రదేశమైన పోలాండ్ లో దట్టంగా ఉండకుండా ఉన్న అడవి కూడా ఉంది. ఆ రోజు వాతావరణంలో తేమగా ఉంది. సూర్యుడు కూడా మేఘాల వెనుక దాక్కుని ఉన్నట్టు ఉన్నాడు,ఆ దృశ్యం డాన్ లో ఉండే వాతావరణానికి భిన్నంగా ఉంది.

     ఆ స్టేషన్ నుండి రాడ్జిలోవో ఎస్టేట్ నాలుగు వెరస్టుల దూరంలో ఉంది. సగం దారంతా అధికారులు, వారిని అనుసరించే బృందాల గుర్రాల దౌడ్లతోనే సమయం గడిచిపోయింది. వారు వెళ్ళిన అరగంట తర్వాత  మిగిలినవారు అక్కడకు చేరుకున్నారు.

  ‘ఇదేం గ్రామంరా?’ మిట్యాకిన్ స్కాయా స్టానిట్సాకు చెందిన ఒక యువ కోసాక్కు, సమీపంలో కనిపిస్తున్న ఒక తోటలో మోడుగా ఉన్న చెట్ల వైపు  చూపిస్తూ అడిగాడు.

   ‘గ్రామామా?కుర్ర వెధవ, నీకు తెలిసిన గ్రామాలను ఇక్కడ మర్చిపో. ఇదేమి డాన్ ప్రదేశానికి చెందిన మిలిటరీ ప్రాంతం కాదు.’

   ‘మరి అయితే ఇదేమిటి మామా?’

    ‘నేను నీ మామను కాదు!కానీ నువ్వు మంచి మేనల్లుడివే అవుతావు! ఇకపోతే అది యువరాణి యురసోవా నివసించే ఎస్టేట్.అక్కడే నాలుగవ బృందం ఉండేది.’

   గుర్రం మెడ నిమురుతూ, కొద్దిగా పైకి లేస్తూ, గ్రెగరి ఆ రెండు అంతస్తుల ఇంటి  వైపు, దాని చుట్టూ ఉన్న కంచె, బయట ఉన్న ఇంకొన్ని భవనాల వైపు చూశాడు. వాళ్ళు దాని చుట్టూ ఉన్న తోటలను దాటి ముందుకు వెళ్తూ ఉండగా, మోడుబారిన కొమ్మలు గాలితో తను వదిలిపెట్టి వచ్చిన  డాన్ ప్రాంతంలో గుసగుసలాడే బాషలోనే  గుసగుసలాడినట్టు అనిపించింది గ్రెగరికి.

     స్తబ్దుగా,ఏ ఉత్సాహం లేనటువంటి జీవితం అక్కడ ఉన్నట్టు కోసాక్కులకు అనిపించేది. అలవాటుపడిన పనులకు దూరంగా ఉండటం వల్ల, అక్కడ ఉన్న కోసాక్కులు తమ మనసుల్లో ఉంది పంచుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉండేవారు. ఒక పెద్ద, టైల్స్ వేసి ఉన్న బయటి భవనంలోనే ఆ బృందం నివాసం. కిటికీల దగ్గర ఉన్న చెక్క బట్టీల మీద వారు నిద్రపోయేవారు. గ్రెగరి పడుకునే బట్టీ దగ్గర గోడకు ఉన్న ఒక ఫ్రేము అటుయిటూ ఊగుతూ శబ్దం చేస్తూ ఉంటే,అక్కడ అతనితో పాటు నిద్రపోతున్న మిగిలిన వారి గురకల మధ్య ఆ ధ్వనిని కూడా వింటూ ఉంటే,ఏదో తెలియని బాధను తినేస్తున్నట్టు అతనికి అనిపించేది. లయబద్ధంగా ఉండే ఆ ధ్వని అతని గుండెల్లో బాకులు దింపుతున్నట్టు అతనికి అనిపించేది, అటువంటి సమయంలో అతనికి వెంటనే లేచి,గుర్రపుశాల దగ్గరకు వెళ్ళి,గుర్రమెక్కి, తన ఇంటి వరకు అలానే దాని మీద వెళ్ళిపోవాలని, ఏ స్పందన,సంతోషం లేని ఆ ప్రదేశాన్ని వదిలేయాలని అతనికి బలంగా అనిపించేది.

     ఉదయం ఐదు గంటలకు వారందరిని నిద్ర లేపేవారు, అప్పుడు వారు లేచి గుర్రాలను శుభ్రం చేయాలి ,వాటి పనులు చూడాలి. అరగంట తర్వాత వారు తమ గుర్రాలకు ఓట్స్ తినిపిస్తూ, ఒకరితో ఒకరూ ఏదో ఒక విషయం మీద మాట్లాడుకుంటూ ఉండేవారు.

    ‘అసలు ఇది పనికిమాలిన ప్రాంతంరా!’

   ‘ఇక్కడ ఉండలేకపోతున్నాము.’

     ‘ఆ సార్జెంట్ అధికారి -ఉన్నాడే-వాడో పంది! వాడు మన చేత గుర్రాల డెక్కలు కూడా శుభ్రం చేయిస్తున్నాడు.’

  ‘ఈపాటికి గ్రామంలో అయితే పాన్ కేక్స్ తింటూ ఉంటారు. ఇది ష్రోవేటైడ్ ….’

   ‘నాకు ఈ సమయంలో ఏ అమ్మాయితో అయినా గడపాలని ఉంది…’

   ‘నిన్న రాత్రి నాకొక కల వచ్చింది.నేను నాన్నతో కలిసి తోటపని చేస్తూ ఉంటే,చుట్టూ చాలామంది ఉన్నారు, పువ్వుల దగ్గర వాలే తుమ్మెదల్లా’,మెరుస్తున్న కళ్ళతో  వారిసంఖ్య మనసులో లెక్కబెడుతున్నట్టు ప్రోకోర్ జికోవ్ అన్నాడు. ‘పిచ్చి మొక్కలు కత్తిరిస్తూ ఉంటే అవి మా కింద పడిపోతూ ఉన్నాయి….’

    ‘మా ఆవిడ “ఈపాటికి నా మికోలా ఏం చేస్తూ ఉంటాడో?’అని అనుకుంటూ ఉంటుందేమో!’

    ‘ఓహో! నాకు తెలిసి ఈపాటికి మీ ఆవిడ మీ నాన్నతో సరసాలాడుతూ ఉంటుంది.’

    ‘నోర్మూయ్….’

     ‘తన భర్త తనతో కలిసి ఉండనప్పుడు ఏదో ఒక సంబంధం పెట్టుకోకుండా ఉన్న స్త్రీ ఉండనే ఉండదు.’

  ‘ఇప్పుడు నువ్వు దేని గురించి వాగుతున్నావు? ఏ స్త్రీ అయినా సుఖాలు పంచడంలో అద్భుతంగా ఉంటుంది. మనం ఇక్కడి నుండి వెళ్ళేసరికి మనకు కూడా అందిస్తుంది,ఇంకేంటి బాధ?’

   వాళ్లందరిలో కాస్త చురుగ్గా,హాస్యంగా ఉండే యెగోర్ జార్కోవ్ నవ్వుతూ,కన్ను కొడుతూ ఏదో సూచిస్తున్నట్టు ఆ సంభాషణలో అడ్డం వచ్చాడు.

  ‘నువ్వు అదే అనుకోవచ్చు. ఈ సమయంలో మీ నాన్న తన కోడలితో దొరికే ఏ ఒక్క అవకాశం కూడా వదులుకోడు. ఆయన ఒక కుక్క లాంటి వాడు. ఇదే ఇదివరకు కూడా జరిగింది…..’తన కళ్ళు తిప్పి,శ్రోతల కేసి చూస్తూ  తన మాటలు కొనసాగించాడు. ‘ఒక ముసలి వెధవ తన కోడలిని అనేక విధాలుగా వేధిస్తూ,ఆమెకు ఒక్క నిమిషం కూడా మనశ్శాంతి లేకుండా చేసేవాడు,అదే సమయంలో ఆమె భర్త ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పుడు వాడు ఏం ఆలోచించాడో తెలుసా? ఒక రాత్రి కావాలనే పశువుల కొట్టం దగ్గరకు వెళ్ళి దాని తలుపు తెరిచాడు, దాని వల్ల అందులో ఉన్న పశువులు బయట వాకిట్లోకి వచ్చాయి. అప్పుడు అతను గదిలో భార్యతో పడుకుని ఉన్న కొడుకుతో, “నువ్వు ఏంటిరా ఇలా చేశావు? ఆ తలుపు ఎందుకు తెరిచావు? ఇప్పుడు చూడు అవన్నీ వాకిట్లోకి వచ్చేశాయి. వాటిని లోపలికి తీసుకువెళ్ళు!’అన్నాడు. మీకు తెలుసా,ఆ ముసలోడు ఏమనుకున్నాడో? తన కొడుకు బయట ఉంటే కోడలి దగ్గరకు తను వెళ్ళవచ్చు అని. కానీ బద్ధకస్తుడైన ఆ కొడుకు తన భార్యతో గుసగుసగా, ‘నువ్వు వెళ్ళి ఆ పని చూడు’అన్నాడు. ఆమె బయటకు వెళ్ళింది. ఆమె భర్త దుప్పటి కప్పుకుని ఉన్నాడు. అప్పుడు ఆ ముసలోడు మెల్లగా ఆ గదిలోకి ప్రవేశించి,ఆ మంచం ఎక్కాడు. ఆ కొడుకు ఏమి వెధవ కాదు, మంచం పక్కనే ఉన్న బల్ల మీద ఉన్న అప్పడాల కర్రను చేతిలోకి తీసుకుని,సమయం కోసం వేచి చూస్తున్నాడు. ఎప్పుడైతే తండ్రి మంచం మీదకు ఎక్కి, తనను తన భార్య అనుకుని తడుముతున్నాడో అప్పుడు ఆ కర్రతో ఆయన బట్టతల మీద ఒకటి గట్టిగా ఇచ్చాడు. “పో! నువ్వు వాకిలి దాటి లోపలికి కూడా వచ్చేశావా,పశువా! అయినా దుప్పటి  ఎందుకు నములుతున్నావు నువ్వు!’ వాళ్ళు ఆ మధ్యే పుట్టిన ఒక దూడను ఇంటి లోపల ఉంచేవారు. అది రాత్రుళ్ళు అలా దుప్పట్లు నమిలేది. ఆ కొడుకు దూడ అనుకుని మాట్లాడుతున్నట్టు నటించాడు తండ్రి ముందు. ఆ తర్వాత కాసేపు అతను మౌనంగా ఉండటంతో ,ఆ ముసలోడు నెమ్మదిగా మంచం మీద నుండి దిగి కిందకు పాక్కుంటూ వెళ్ళి, తన తల మీద బాతు గుడ్డంత ఉన్న బొప్పిని తడుముకున్నాడు. కాసేపు అయ్యాక, ఆయన, ‘ఇవాన్, నీకు వినబడుతుందా?ఇవాన్’అని పిలిచాడు. ‘ఏంటి విషయం నాన్నా?’, ‘ఇప్పుడు నువ్వు గట్టిగా కొట్టింది ఎవరిని?’ ‘ఆ దూడను.’ అప్పుడు ఆ వృద్ధుడు ఏడుపు గొంతుతో, “నువ్వు మంచి రైతువి ఎలా అవుతావు,ఇలా పశువుల్ని బాదితే?”అన్నాడు.      

    ‘ఇలాంటి విషయాలు సృష్టించడంలో నువ్వు నేర్పరివిలే!’

      ‘కుక్క మొరుగుతున్నప్పుడే దాన్ని గొలుసులతో బంధించాలి.’

     ‘ఏంటి ఇది?ఇదేమైనా సంత అనుకుంటున్నారా? చెప్పిన పనులు చేయండి!’గట్టిగా సార్జెంట్ అధికారి అరుస్తూ సమీపంలోకి రావడంతో, తమలో తాము నవ్వుకుంటూ,హాస్యాలాడుకుంటూ,కోసాక్కులు అందరూ తమ గుర్రాల దగ్గరకు వెళ్ళిపోయారు. అల్పాహారం అయిన తర్వాత ఆ సార్జెంట్ అధికారి వారందరితో వారి పూర్వపు దినచర్యకు వ్యతిరేకంగా పెరేడ్ మైదానంలో కసరత్తులు చేయించేవాడు.

 ‘ఆ పొట్ట లోపలికి లాక్కో,పంది!’

  ‘కుడి వైపుకి మార్చింగ్ చేయండి…’

 ‘ఆగండి.’

  ‘మార్చ్!’

  ‘ఒరేయ్ ఎడమ వైపు ఉన్నవాడా, అలాగేనా నిలబడటం వెధవా?’

   ఆ కోసాక్కులను పర్యవేక్షిస్తున్న అధికారులు కొద్దిగా దూరంలో నిలబడి,ఆ పెద్ద మైదానంలో మార్చింగ్ చేస్తున్న వారిని చూస్తూ,పొగ కాల్చుకుంటూ,మధ్యమధ్యలో ఆజ్ఞలు జారీ చేస్తూ ఉండేవారు.

   హుందాగా,దర్జాగా, చక్కగా షేవింగ్ చేసుకుని, చక్కటి కోట్లు ధరించి ఉండే ఆ అధికారులను చూస్తున్నప్పుడు గ్రెగరికి వారికి తనకు మధ్య ఏదో అదృశ్యమైన, ఎక్కడానికి సాధ్యం కానీ ఏదో ఒక అడ్డు గోడ నిర్మించబడినట్టు అనిపించేది. ఆ గోడకు అవతల వైపు ఉన్న జీవితాలకు, కోసాక్కుల జీవితాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని; తెలివిగా,శుభ్రంగా,దర్జాగా, పేలు లాంటివి తలలో లేకుండా, అక్కడ ఎప్పుడు కోసాక్కుల మీద ఏ చిన్న తప్పు జరిగిన పిడి గుద్దులు కురిపిస్తూ ఉండే అధికారులంటే భయం లేకుండా  ఉండే జీవితం వారిదని అనుకున్నాడు.

     ఆ కోసాక్కులు అక్కడకు వచ్చిన మూడవ రోజు నాడు జరిగిన ఒక సంఘటన గ్రెగరి మనసు మీద,మిగిలిన కోసాక్కుల మీద ఒక బాధాకరమైన అనుభవం కలిగేలా చేసింది. ఆ రోజు వాళ్ళంతా గుర్రం మీద ఎక్కి అధికారుల ఆజ్ఞ మేరకు ముందుకు దౌడు తీస్తున్నారు. అప్పుడు వారిలో ఉత్సాహంగా, చురుగ్గా ఉంటూ,ఎప్పుడు ఇంటి గురించి కలలు కనే  ప్రోఖోర్ జోకొవ్,ముందుకు వెళ్తున్నప్పుడు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల సార్జెంట్ అధికారి గుర్రానికి అతని కాలు గట్టిగా తగిలింది. దాని వల్ల ఆ గుర్రం ఎడమ కాలు దగ్గర చర్మం చీరుకుపోయింది,కానీ దానికి కోపంతో ఆ అధికారి ప్రోకోర్ ముఖం మీద కొరడా విదిలించి, ‘పనికిమాలిన వెధవా! ఎటు వెళ్తుంది చూసుకునే జాగ్రత్త లేదా? దీనికి శిక్షగా గార్డ్ డ్యూటీ మూడు రోజులు చేయి’అని అరిచాడు.

    ఆ బృందానికి అధికారి అక్కడ ఉన్న వారికి సూచనలు ఇస్తూ. జరిగింది చూసి కూడా, ఏమి జరగనట్టు, తన ఖడ్గాన్ని సరిచేసుకుని,గట్టిగా ఆవులించి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ప్రోఖోర్ తన ముఖం పై నుండి బుగ్గ మీదకు కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ ఉంటే,అతని పెదవులు వణుకుతూ ఉన్నాయి.

    తన గుర్రాన్ని వరుసలో నిలబెట్టి గ్రెగరి,అక్కడ ఉన్న అధికారుల వైపు చూశాడు. వాళ్ళంతా అప్పుడు ఏం జరగనట్టే తమలో తాము కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇది జరిగిన ఐదు రోజుల తర్వాత, గ్రెగరి తన గుర్రానికి నీళ్ళు పెడుతున్న సమయంలో గ్రెగరి చేతుల్లో నుండి బిందె జారి బావిలో పడిపోయింది. డేగ కళ్ళతో అది చూసిన సార్జెంట్ అధికారి అతని మీద పిడికిలి ఎత్తబోయాడు.

   ‘చేతులు దించండి!’ కింద నీళ్ళను చూస్తూ కఠినంగా అన్నాడు గ్రెగరి.

   ‘ఏంటి? కిందకు దిగి ఆ బిందె తీసుకురా,వెధవా!లేకపోతే నీ ముఖం పగలగొడతాను!…’

   ‘నేను అది పైకి తీసుకువస్తాను,కానీ మీ చేతులు కాస్త దూరంలో ఉంచండి!’గ్రెగరి తల ఎత్తకుండా,నిదానంగా అన్నాడు.

   ఒకవేళ ఆ బావి దగ్గర ఇంకెవరైనా కోసాక్కులు ఉండి ఉంటే, ఆ సంఘటన ఇంకోలా పరిణమించేదేమో!బహుశా ఆ అధికారి గ్రెగరిని చితకబాదేవాడేమో! కానీ మిగిలిన వారంతా తమ గుర్రాల పనులు చూసుకుంటూ కంచెకు దగ్గరలో,పిలిస్తే వినబడని దూరంలో ఉన్నారు. ఆ అధికారి గ్రెగరికి సమీపంగా వచ్చి, కోపంతో కళ్ళు పెద్దవి చేసి, దూరంగా ఉన్న వారి వైపు ఒకసారి చూసి , ‘నువ్వు ఎవరనుకుంటున్నావు? ఇదేనా నీ పై అధికారులతో నువ్వు మాట్లాడే పద్ధతి?’అని గర్జించినట్టు అన్నాడు.

   ‘సమస్య పెద్దది చేయాలనుకోకు, సెమ్యోన్ యెగోరోవ్!’

   ‘నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? నేను నిన్ను చావబాదగలను!’

     ‘నేను ఇప్పుడే చెప్తున్నా, నువ్వు నన్ను కొడితే మాత్రం,నేను నిన్ను చంపుతా!అర్థమైందా?’ గ్రెగరి తన తల పైకెత్తి అన్నాడు.

   ఓ రకమైన ఆశ్చర్యంతో ఆ అధికారి తన నోరెళ్ళబెట్టుకుని అలానే చూస్తూ ఉండిపోయాడు. ఏం బదులివ్వాలో ఆయనకు అర్థం కాలేదు. శిక్షించాలన్న ఆవేశం ఇప్పుడు పోయింది. పాలిపోయినా,తీక్షణంగా ఉన్న గ్రెగరి ముఖం ఆ క్షణంలో ఆయనకు ప్రమాదకరంగా కనిపించింది. ఓడిపోయిన భావనతో ముందు ఉన్న బురదలో బూట్లతో నడుచుకుంటూ వెళ్ళాడు. కొద్ది దూరం వెళ్ళాక, వెనక్కి తిరిగి బెదిరిస్తున్నట్టు గ్రెగరి వైపుకి బిగించిన పిడికిలితో ఉన్న చేతిని పైకి  ఎత్తాడు.   

    ‘నేను నీ గురించి మీ అధికారికి ఫిర్యాదు చేస్తాను! తప్పకుండా చేస్తాను!’అన్నాడు.

     ఎందుకోగాని ఆ బెదిరింపును ఆయన తర్వాత నిజం చేయలేదు. కానీ తర్వాతి పక్షం రోజులు గ్రెగరిని వెంటాడుతూ,ప్రతి చిన్న విషయంలో తప్పులు వెతుకుతూ, ఎక్కువ పని చేసేలా చూస్తూ ఉన్నా, ఎప్పుడు గ్రెగరి కళ్ళల్లోకి సూటిగా చూసే ప్రయత్నం మాత్రం చేయలేదు.

    ఆ విసుగుపుట్టించే దినచర్య ఆ కోసాక్కుల జీవితంలో సారాన్ని గ్రహిస్తున్నట్టు వారికి అనిపిస్తూ ఉండేది. రోజంతా,సాయంత్రం వరకు కూడా,వారు పాదాల మరియు అక్కడ ఉన్న ఎత్తైన వాటి మీద ఎక్కే వ్యాయామాలతోనూ,గుర్రాలను శుభ్రం చేస్తూ వాటికి భోజనం పెడుతూ,వారికి దండగగా అనిపించే నిబంధనలను బట్టీ పట్టడంతోనే గడిచిపోయేది. పది తర్వాత రాత్రి కాపలాదారు వంతులవారిగా అప్పగించాక,వారందరూ ఒక వరుసలో ప్రార్థన కోసం నిలబడినప్పుడు, సార్జెంట్ అధికారి గుండ్రంగా ఉన్న తన పొట్ట ఊగుతూ ఉంటే,అటూ ఇటూ తిరుగుతూ, తన కీచు గొంతుతో, ‘మన దేవుడు….’అని మొదలుపెట్టేవాడు.

   ఇదే తంతు ప్రతి రోజూ కొనసాగేది. రోజులు మారుతూ ఉన్నా ఒక రకంగా అనిపించేవి.

  ఆ ఎస్టేట్ మేనేజర్ భార్య కాకుండా అక్కడ ఒక్క అమ్మాయి మాత్రమే ఆ ఎస్టేట్ మొత్తంలో ఉండేది.ఆమె పోలాండ్ కు చెందిన ఫ్రానియా,ఆం ఆ మేనేజర్ ఇంట్లో పని చేసే పనిమనిషి. మంచి యవ్వనంలో ఉంది. ఆమె ఇంటి నుండి వంటగదికి పని మీద తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న అధికార్లు మొదలుకుని అందరూ ఆమెనే చూస్తూ ఉండేవారు.

   ఒకరికొకరు సంజ్ఞలు చేసుకుంటూ, గట్టిగా నిట్టూరుస్తూ,అక్కడ బృందాలుగా ఉన్న వారందరూ ఆమె నడుస్తున్నప్పుడు గౌను పైకి లేస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండేవారు. ఆ అధికారుల మరియు కోసాక్కుల కోరికతో కూడిన చూపులతో,ఫ్రానియా ఆ మూడు వందల మంది కళ్ళ నుండి ప్రవహిస్తున్న కామంలో స్నానిస్తూ, తన పిరుదులు ఊపుతూ వయ్యారంగా వారి ముందు నడుచుకుంటూ ఆ ఇంటి నుండి వంటగది వైపుకి వెళ్తూ,వారి వైపు ముఖ్యంగా అధికారుల వైపు చూస్తూ నవ్వుతూ వెళ్ళేది. ఆమెను అందరూ కోరుకున్నా,గింగిరాల జుట్టుతో,శరీరమంతా జుట్టు ఉండే ఒక అధికారి మాత్రం ఆమెను పొందగలిగాడని చెప్పుకునేవారు.

   వసంతకాలంలో ఓ ఉదయం ఆ ఘటన జరిగింది. గ్రెగరి గుర్రపుశాల దగ్గర పనిలో ఉన్నాడు. అతను ఎక్కువ సమయం ఆ భవనానికి ఒక చివరన ఉండేవాడు. అక్కడ ఆ అధికారుల మగ గుర్రాలు ఒక ఆడ గుర్రం వెంటబడుతూ ఉండేవి. అది రాత్రి భోజన సమయం. గ్రెగరి అప్పుడే ఓ అధికారి తెల్ల గుర్రానికి మేత వేస్తూ ఒక పక్కగా ఎండుగడ్డి తింటూ ఉన్న తన గుర్రం వైపు చూశాడు. అది కూడా తన యజమాని వైపు చూసింది, కొన్ని వ్యాయామాలు చేస్తూ ఉండగా గాయపడిన తన ముందుకాలిని పైకి ఎత్తింది. దాని వైపు చూస్తూనే, అధికారి గుర్రాన్ని నిమురుతూ ఉన్న గ్రెగరికి ఆ గుర్రపుశాలలో ఓ వైపు నుండి పెనుగులాడుతూ,ఏడుస్తూ ఉన్న ఓ చిన్న అరుపు వినిపించింది. అతను ఆ శబ్దం వినిపించిన వైపుకి నడుస్తూ,ఇంకా వినిపిస్తున్న ఆ ధ్వనులకు ఆశ్చర్యపోయాడు. అతను ముందుకు వెళ్ళాక కొద్దిగా దూరంలో ఉన్న తలుపు గట్టిగా వేసిన శబ్దంతో పాటు,అక్కడంతా చీకటిగా అనిపించింది. తర్వాత, ‘తొందరగా పూర్తి చేయండి రా,త్వరగా’,అంటున్న ఒక గొంతు అతనికి వినిపించింది.

     గ్రెగరి వేగంగా ముందుకు నడిచాడు.

      ‘ఎవరది?’

      ఆ చీకటిలో గ్రెగరి అప్పుడే తలుపు దగ్గరకు తడుముకుంటూ వెళ్తున్న సార్జెంట్ అధికారి పోపోవ్ కు తగిలాడు.

   ‘గ్రెగరి,ఇది నువ్వేనా?’   గ్రెగరి భుజాలు తగలడంతో గుసగుసగా అడిగాడు.

     ‘ఆగండి. ఇక్కడ ఏం జరుగుతుంది?’

      ఆ సార్జెంట్ నవ్వును అప్పుకుంటూ, గ్రెగరిని పక్కకు లాగాడు.

     ‘ఇక్కడే ….ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు?’

     గ్రెగరి ఆ అధికారి చేతుల నుండి తన చేతిని విడిపించుకుని, ఆ తలుపు తెరిచాడు. రంగురంగుల ఈకలతో,కుక్క కొరకడం వల్ల సగం తోకతో ఉన్న ఓ కోడిపెట్ట,తర్వాతి రోజు ఉదయం వంటవాడు తనను యజమాని కోసం వండబోతున్నాడని తెలియక,అక్కడ ఏ చోట గుడ్డు పెట్టాలా అని అరుస్తూ, వెతుక్కుంటూ తిరుగుతూ ఉంది.

    తలుపు తెరవడం వల్ల ఒక్కసారిగా వచ్చిన వెలుగు వల్ల,కళ్ళు బైర్లు కమ్మినట్టై, గ్రెగరి తన చేతులను కళ్ళకు అడ్డంగా పెట్టుకుని,ఇంకా శబ్దాలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్న మూలకు తిరిగాడు. అతను గోడను తడుముకుంటూ నడుస్తూ ఉంటే; పై కప్పు నుండి వస్తున్న సూర్యకాంతి తలుపు దగ్గర ఉన్న  గుర్రాల నీళ్ళ తొట్టిలో పడుతూ ఉంది. సగం మూసి ఉన్న కళ్ళతో అతను ముందుకు నడిచాడు. వెంటనే అతను తన పైజమా సరిచేసుకుంటూ,తల ఊపుకుంటూ వస్తున్న జార్ఖోవ్  ఎదురొచ్చాడు.

       ‘ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు?’

           ‘త్వరగా నువ్వు కూడా వెళ్ళు!’అతను రొప్పుతూ,గ్రెగరి ముఖంలోకి చూస్తూ అన్నాడు. ‘ఇది అద్భుతంగా ఉంది. మన కుర్రాళ్ళు ఆ ఫ్రానియాను ఇక్కడకు తీసుకువచ్చారు. అక్కడ పడుకోబెట్టారు…’నవ్వుతూ చెప్తున్న అతని నవ్వు ఆగిపోయింది, గ్రెగరి గట్టిగా అతన్ని పక్కకు తోసేసరికి. ఆ మూలుగులు,ఏడుపు వినిపిస్తూ ఉన్న వైపుకి గ్రెగరి పరిగెత్తాడు. ఇప్పుడు చీకటికి అలవాటు పడిపోయిన అతని కళ్ళు ఇప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉందోనన్న భయంతో నిండిపోయాయి. . మొదటి బృందానికి చెందిన కోసాక్కులు అందరూ  గుర్రపు బట్టలు ఉన్న మూల నవ్వుకుంటూ నిలబడి ఉన్నారు. గ్రెగరి ముందుకు వెళ్ళాడు. అక్కడ ఫ్రానియా ఏ చలనం లేకుండా కింద పడి ఉంది,ఆమె తల చుట్టూ గుర్రాఔ బట్ట పెట్టి, చేతులు కట్టి ఉన్నాయి. , ఆమె గౌను చిరిగిపోయి, రొమ్ముల పైకి లాగి ఉంది.తెల్లగా ఉన్న ఆమె కాళ్ళు ఆ చీకటి నల్లదనంలో జాపి ఉన్నాయి. అప్పుడే ఒక కోసాక్కు ఆమె మీద నుండి పైకి లేచి, తన పైజామా బొత్తాలు పెట్టుకుంటూ,కొంటెగా నవ్వుకుంటూ, ఎవరివైపు చూడకుండా, తన తర్వాతి వాడికి దారి ఇచ్చేందుకు పక్కకు నడిచాడు. భయంతో గ్రెగరి ఒక్కసారిగా తలుపు దగ్గరకు ఉరుకుతూ, ‘సార్జెంట్ సార్!’అని అరిచాడు.

      అతను ఆ తలుపు దగ్గరకు వెళ్ళేలోపే వాళ్ళు అతన్ని పట్టుకుని, తమ చేతులతో అతని నోరు మూసేశారు. అతను వారిలో ఎవరిదో యూనిఫార్మ్ కాలర్ దగ్గర చించి, ఒకరిని కడుపులో తన్నాడు. కానీ అతన్ని వారు వెంటనే కింద పడేసి, ఫ్రానియాలానే అతని తలను గుర్రపు బట్టతో చుట్టి,చేతులు కట్టేశారు. వారు అతన్ని ఖాళీగా ఉన్న ఒక గుర్రాల నీళ్ళ తొట్టిలోకి విసిరేశారు, అతను ఆ సమయమలో తమ గొంతులు గుర్తు పట్టకూడదని వారు నిశ్శబ్దంగా ఈ పని చేశారు. ఆ పట్టు గుర్రపు బట్టలో ఊపిరి ఆడక,అక్కడ ఉన్న తొట్టెను కాళ్ళతో తన్నుతూ అరిచే ప్రయత్నం చేశాడు. ఒక మూల నుండి గుసగుసలు, కోసాక్కులు లోపలికి వెళ్తూ,బయటకు వస్తున్నప్పుడు తలుపు కిర్రుమంటున్న శబ్దం అతనికి వినిపిస్తూనే ఉన్నాయి. ఇరవై నిమిషాల తర్వాత అతని కట్లు విప్పారు. సార్జెంట్ అధికారి,ఇంకో బృందానికి చెందిన ఇద్దరు కోసాక్కులు తలుపు దగ్గర నిలబడి ఉన్నారు.

   ‘నువ్వు ఈ విషయం గురించి మౌనంగా ఉంటే మంచిది!’ ఆ అధికారి ఎటో చూస్తూ గ్రెగరితో అన్నాడు.

    ‘నువ్వు దీని గురించి ఎక్కడైనా వాగావని తెలిసిందో నీ చెవులు కోసేస్తాము’, ఇంకో బృందానికి చెందిన డోబోక్ అనే కోసాక్కు,నవ్వుతూ హెచ్చరించాడు.

  గ్రెగరి చూస్తూ ఉండగానే గుర్రపు బట్టల్లో ఫ్రానియాను ఓ మూటలా చుట్టి ,తొట్టి మీదగా ఎక్కి, అక్కడ గోడ దగ్గర ఉన్న ఓ పెద్ద రంధ్రం నుండి ఆ మూటను వారు బయటకు విసిరేశారు. ఆ గుర్రపుశాల పైనుండి చూస్తే తోట కనిపిస్తూ ఉంటుంది, అక్కడ ప్రతి గుర్రాన్ని కట్టేసే చోటు దగ్గర ఉన్న గోడ పైన ఒక కిటికీ ఉంది. అప్పుడు ఫ్రానియా ఏం చేస్తుందో అన్న కుతూహలంతో అక్కడ ఉన్న కోసాక్కులు కొందరు  ఆ కిటికీల నుండి బయటకు చూస్తూ ఉంటే,ఇంకొందరూ బయటకు వచ్చేశారు. జంతువులకుండే ఆ రకమైన కుతూహలం ఆ క్షణంలో గ్రెగరికి కూడా కలిగింది. ఒక కిటికీ చువ్వను పట్టుకుని పైకి ఎక్కి,అతను కూడా బయటకు చూడసాగాడు. ఆ గోడ పక్కనే పడి ఉన్న ఆ శరీరాన్ని ఎన్నో జతల కళ్ళు చూస్తూ ఉన్నాయి. వెనక్కి వాలి ఉన్న ఫ్రానియా, చుట్టూ ఉన్న మంచులో తన చేతి వేళ్ళను గట్టిగా పెట్టి అలానే కూర్చుని ఉంది. గ్రెగరికి ఆమె ముఖం కనబడలేదు, కానీ ఆ కిటికీల దగ్గర చేరి ఉన్న కోసాక్కుల శ్వాస చప్పుడు,వారి కాళ్ళ మధ్య ఎండుగడ్డి నలగడం వల్ల వచ్చే చప్పుడు అతనికి వినిపిస్తూ ఉన్నాయి.

      ఫ్రానియా అక్కడ చాలాసేపు అలానే ఉండిపోయాక,మెల్లగా మోకాళ్ళ మీద లేచే ప్రయత్నం చేసింది.కానీ ఆమె చేతులు అందుకు సహకరించకుండా వణుకుతూ ఉండటం గ్రెగరి స్పష్టంగా చూశాడు. ఎలాగో పాదాల మీద నిలబడే ప్రయత్నం చేసింది,ఆమె రూపమంతా ఛిద్రమై పోయి ఉంది,ఆ రూపంతోనే ఆమె ఆ కిటికీల వైపు ఒక్కసారి చూసింది.

    తర్వాత ఆ గోడ సాయంతో ఒక చేతిని దాని మీద ఆనించి, ఇంకో చేతిని అక్కడే దగ్గరలో నిలబెట్టి ఉన్న కర్ర లాంటి దాని మీద పెట్టి, ఎలాగో లేచి,మెల్లగా అక్కడ నుండి వెళ్ళిపోయింది.

   గ్రెగరి వెంటనే అక్కడ నుండి కిందకు దూకి, ఊపిరి ఆడకుండా ఉండటం వల్ల గొంతు దగ్గర మెల్లగా రుద్దుకున్నాడు.

   కొద్దిసేపటి తర్వాత  తలుపు దగ్గర ఎవరన్నారో గ్రెగరికి తెలియక పోయినా,ఎవరో మాత్రం హెచ్చరికగా, ‘నువ్వు ఈ విషయం గురించి ఎక్కడైనా చెప్పావో,దేవుడి మీద ఒట్టు,నిన్ను మేము ఖచ్చితంగా చంపేస్తాము.అర్ధమైందా?’ అన్నారు.

  డ్రిల్ చేస్తున్న సమయంలో గ్రెగరి బృంద అధికారి గ్రెగరి కోటు దగ్గర ఒక బొత్తా౦ లేకుండా ఉండటం గమనించాడు.

   ‘నీకు ఈ కొత్తవి ఎవరు నేర్పిస్తున్నారు?ఇదేమైనా కొత్త ఫ్యాషనా?’అని అడిగాడు ఆ అధికారి.

    గ్రెగరి ఆ బొత్తా౦ లేకపోవడం వల్ల ఏర్పడిన చిన్న రంధ్రం వైపు తల వంచి చూశాడు, అతనికి జరిగినదంతా గుర్తుకు వచ్చేసరికి, చాలా సంవత్సరాల తర్వాత అతనికి ఏడ్వాలని అనిపించింది.

          *       *     *

Mikhail Sholokhov
Author
Rachana Srungavarapu
Author & Translator

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *