“ఈ ప్రపంచంలో బొత్తిగా జీవకారుణ్యం కరువైంది” అన్నది ఎలుక.
“ఓ అలాగా?” అని తెచ్చిపెట్టుకున్న సంభ్రమాశ్చర్యాలతో దేవుడు ఒక చిరునవ్వు నవ్వాడు.
ఆ సాయం సంధ్య, సముద్రతీరప్రాంతంలో గాలి మంద్రంగా వీస్తూ పరవళ్ళు తొక్కుతోంది. చెన్నై మందవెలిలోని, మూడవ క్రాస్ వీధిలోని 25 వ ఇంటి నంబరులో ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి వెనుకభాగంలో నూతి కింద, పనసచెట్టు నీడలో తినేసి తీరుబడిగా పడక్కుర్చీలో సేద తీరుతున్న పార్టీ సభ్యుడిలా దేవుడు వయ్యారంగా కూర్చోనున్నాడు. నూతిగట్టుపైనున్న బోనులో ఆ ఎలుక చిక్కుకొనుంది.
ఆ చిట్టెలుక బోను ఉచ్చులను పట్టుకుని, భయం నిండిన పూసకళ్ళతో దేవుడితో ఇలా విన్నవించుకుంది. “అవును, ఈ ప్రపంచంలో బొత్తిగా జీవకారుణ్యం కరువయ్యింది. ఎందుకో ఈ మనుష్యులకు ఎలుకలను చూస్తే చిర్రెత్తుకొస్తుంది. ప్రేమ, జీవకారుణ్యం, మానవత్వం, స్నేహం అని వీళ్ళందరూ సొల్లుమాటలు మాట్లాడుతారు. ఆఖరికి పిల్లులు, పాములు కూడా ఎలుకలను ప్రేమించే రోజొకటి వస్తే వస్తుందేమో కానీ, అయితే మనిషి మాత్రం ఎప్పుడూ ఎలుకలను అసహ్యించుకుంటూనే ఉంటాడు. మనిషి చిలుకలు, మైనాలు, పావురాలు, మేకలు, ఆవులు, కుక్కలు, పిల్లులు ముంగిస, పాము, పులి అంతెందుకు ఆఖరికి మొసలిని కూడా పెంచితే పెంచుతాడేమోగాని, ఎందుకో మనిషికి ఎలుకలంటే మాత్రం పొసగనే పొసగదు.
“ఎంతైనా ఈ మనుష్యుల్ని అని ఏ ప్రయోజనంలే, ఈ ప్రభుత్వాలే మాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంటే. టీవీల్లోనూ, రేడియోల్లోనూ “పులులను కాపాడండి, ఎలుకలను చంపండి” అనే నినాదాలను ఏకధాటిగా ప్రచారం చేస్తూ అందరిని మాకు వ్యతిరేకంగా ఉసిగొల్పుతోంది. కొన్ని తూర్పు ఆసియా దేశాల్లో ఎలుకలను చంపితే, తలా ఒక ఎలుకకు ఇంతా అని నగదు కూడా ప్రకటించారు. పులులను చంపితేనేమో శిక్షలు. ఎలుకలను చంపితేనేమో నగదు కింద బహుమానమా? ఇదేం న్యాయం అంటాను?”
“ఇలా చూడు జీవకారుణ్యం, జీవకారుణ్యం అని ఓ తెగ హైరానా పడుతున్నావు. జీవకారుణ్యం అన్నది అనవసరంగా జ్ఞాపకాల్లో మెదిలే కలల శకలం లాంటిది. అందువల్ల దమ్మిడీ ప్రయోజనంలేదు. కనుక కారుణ్యం చూపించాలని మనం ఎవరిని బలవంతపెట్టకూడదు. హింసే స్వాభావికమైనది; అసంకల్పితమైనది. మానవుడు బొద్దింక తరువాత అత్యుత్సాహంతో చంపాలనుకునేది మిమ్మల్నే” అన్న దేవుడు “అది సరేగానీ, ఇంతకీ నువ్వెలా ఇందులో చిక్కుకున్నావు?” అని శ్రద్ధగా అడిగాడు.
“ఆ దిక్కుమాలిన మసాలా వడే ఈ సమస్యలన్నింటికి మూలకారణం. సంఘ వాజ్మయకాలం నుండి ఈ రోజు వరకు తమిళనాడులోని కోటానుకోట్ల వడలు కాల్చడంతో పాటు, మరోపక్క తింటూ వస్తున్నారు. అయితే మసాలా వడను తిని మరణాన్ని ముద్దాడేవి మాత్రం బహుశా మా ఎలుకజాతే కాబోలు. నిన్న రాత్రి నేను కూడా అది తినడం వలనే అమాంతం కళ్ళు తిరిగి ఇందులో చిక్కుకుపోయాను” అంది ఎలుక.
“తరుచూ మీ ఎలుకలకు ఏదో ఒకటి తినాలని వుంటుంది. నిజం చెప్పాలంటే ఆ తప్పంతా నాదే. మీ పేగుల అమరికను నేను కాస్త మార్చి రూపొందించుండాల్సింది. అయినా దేశ ఆహార ఉత్పాదనలో పది నుంచి పన్నెండు శాతం మీరే భుక్కేస్తుంటే ఇంకేం చెయ్యాలి చెప్పు?”
ఎలుక బుంగమూతి పెట్టుకుని ఇలా అంది “భగవంతుడైన మీరు కూడా ఇవన్నీ నమ్ముతున్నారా? గ్రామీణ పంటపొలాల్లోనూ, ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన గిడ్డంగుల్లోనూ బాగా దొంగ తిండికి రుచిమరిగి బలిసి కొట్టుకునే ఎలుకలు, మేమూ ఒకటైపోతామా ఏమిటి? అవి వేరే జాతి, మేము వేరే జాతి. మేము సర్వోత్కృష్టమైన, ఉత్తమ జాతి ఎలుకలం. కుక్కలు, గుర్రాల్లో మాత్రం జాతుల తారతమ్యాలు మాట్లాడే ఈ మనుష్యులు ఎలుకల విషయం వచ్చేసరికి మాత్రం అంతా ఒకే జాతి కింద తేల్చి పారేస్తారేం. మేము నగరంలో ఉండే ఎలుకలం; పైగా అమాయకులం. ఇంటి వెనుకభాగంలో దొరికే చిన్నా చితకా దొరికినవి తిని పొట్టపోసుకుని మనుగడ సాగిస్తుంటాం. గతంలో ఊహ తెలియని వయస్సులో మా పిల్లలు సబ్బులు, బట్టలు కొరికేవి. (అందులో మరీ ముఖ్యంగా లైఫ్ బాయ్ సబ్బు, దాని ఆకారంలో మార్పులు చేర్పులు చేశాక అవి బొత్తిగా వాటి జోలికే వెళ్ళడం లేదు.) ఇదేం మరీ అంత క్షమించలేనంత పాపం ఏమి కాదు. పోతే, మా వలన ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బందీ ఉండదు.
“ఉదాహరణకు నన్నే తీసుకోండి. నేను చాలా సౌమ్యుడిని. ఈ ఇంట్లో, నా కలుగు ఈ నూతి వెనుకే వుంది. ఎన్నో నెలలుగా ఇక్కడే ఆవాసముంటున్నాను (నాకు ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ మాంసాహారులు. అందువలన నన్ను వదిలేసి ఎదురింట్లోని షిప్ క్యాప్టెన్ ఇంటికి వెళ్ళిపోయారు.) పగటిపూటగానీ, నాకు ఆకలి వెయ్యనప్పుడుగానీ, ఈ ఇంట్లోకి అడుగు పెట్టింది లేదు. రాత్రుల్లో మాత్రం వంటగది కుళాయి గొట్టం గుండా లోపలికి దూసుకెళ్ళి ఏదైనావుంటే తినేసి వచ్చేవాడిని. ఇందులో ఆశ్చర్యపడవలసిన విషయం ఏమిటంటే దరిదాపుగా ఈ ఇంట్లో తినేందుకు ఏదీ దొరకదు. ఒక ఎంగిలిమెతుకు దొరికితే ఒట్టు. ఎంతైనా ఆ ఇంటావిడ చేతిమహత్యం అలాంటిది. వేరే గత్యంతరం లేక నేను ఏ టమోటా బుట్టనో, బియ్యం డబ్బానో, తోసే పరిస్థితి నెలకొంటుంది. ఒక ఇంటి ఇల్లాలు అయ్యుండి మరీ ఇంత దారుణమా? మరీ గీసి గీసి నాలుక్కి రాసుకుని తినేలా వండుతోంది. పోయినవారం మూడు లీటర్ల నూనె జాడీని అనుకోకుండా తోసేశాను. ఇంట్లోవాళ్ళకు ఆ కోపమే నా మీద.
“అన్నట్టు మర్చిపోయే ముందు మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. నేనొక స్వచ్ఛమైన వైష్ణవుడ్ని. ముఖాన నామమోక్కటే తక్కువగానీ, తప్పితే తక్కిన వైష్ణవ సంప్రదాయాలన్నింటిని తు.చ.తప్పకుండా ఆచరిస్తాను. శాఖాహారమే భుజిస్తాను. తులసీ దళాన్నే ప్రసాదంగా స్వీకరిస్తాను. గృహస్థాశ్రమంలో ఉంటూనే బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాను. మీకు సందేహమనిపిస్తే ఎదురింటిలో కాపురముంటున్న నా పెళ్ళాన్ని అడిగి తెలుసుకోండి. ఆమెపై నా చెయ్యి పడి ఎన్ని రోజులవ్వుతుందోనని. ఈ మాట ఎందుకంటున్నానంటే, నేను మీ సేవకుడిని, భక్తుడినని మీరు తెలుసుకోవాలనే. అంటే ‘నేనే దేవుడిని’ అని విర్రవీగుతూ, బీరాలు పోయే పొగరుబోతు అద్వైతుడిని అయితే నేను కాను. కనుక ఎలాగైనా దయతలచి ఈ గండం నుండి మీరే నన్ను గట్టెక్కించాలి ప్రభు” అంది ఎలుక.
భగవానుడు ఎలుకవైపు వాత్సల్యంతో చూసి, ఒక నవ్వు నవ్వాడు.
“మీరే చెప్పండి ప్రభో! నన్ను చంపేందుకు మూడు లీటర్ల నూనె జాడీ ఒక కారణమా?”
“ఓ నా ప్రియమైన ఎలుక, మరణమన్నది కారణాలతో సంభవించుట లేదు. కారణాలు, హేతువులు ఇవన్నీ మనుష్యులు మరణాన్ని తర్కించేందుకు కల్పించుకున్న ఒక యుక్తి మాత్రమే. ఎందుకు నువ్వు కూడా ఒక సామాన్య మానవునిలా ఆలోచిస్తున్నావు? మరణమన్నది ఎన్నిక ; పొడుపుకథ లాంటి ఎన్నిక. అంతే! దీనిని ఎప్పుడు, ఎవరు, ఎందుకు ఎన్నుకుంటారని నాక్కూడా తెలియదు. ఈ పనస చెట్టును చూడు. ఇది ఎళ్ళవేళలా తన ఎండుటాకులను రాలుస్తోంది; కొన్నిసార్లు చిగురాకులను కూడా రాలుస్తోంది. ఈ ఆకులు రాలేందుకు కారణమెవ్వరు అంటే ఎవ్వరికీ తెలియదు. నువ్వు కాకిని కారణం చూపిస్తావు; నేను గాలిని కారణం చూపిస్తాను. అయితే అవీ రెండూ కాదు.
“మరణం సమస్త జీవులకు సహజమైనది. జననం అని ఒకటుంటే, మరణం అనేది కూడా నిశ్చయంగా ఉంటుంది. మరణానికి మాత్రం ఎందుకు నువ్వు ఓ తెగ దిగులు పడిపోతున్నావు? మరణమన్నది ఒక రూపాంతరం మాత్రమే. ఒక వైష్ణవ ఎలుక అయినటువంటి నీకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను” అన్నాడు దేవుడు.
“నిజమే ప్రభో! మరణం గురించి నేను దిగులు పడలేదు. మీరు కోరుకుంటే , నేను తక్షణమే ఈ మరణాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను. అయితే నేను చావాలనే రాసి పెట్టుంటే, నన్ను ఏ పాము నోటికో చిక్కేలా చెయ్యండి, లేదా ఏదైనా పిల్లి నోటికి పట్టివండి. పోనీ అదీ కాదకుంటే ఏదైనా లారీ టైరు కింద పడి చచ్చేలా చెయ్యండి. అంతే గానీ, ఈ ఇంట్లోవాళ్ళ చేతుల్లో మాత్రం నన్ను చావనివ్వకండి. అదే ఎన్నో రెట్ల మహాపాతకం. వీళ్ళ గురించి మీకు తెలియదు. దరిద్రపుగొట్టు వెధవలు, దుర్మార్గులు. పైగా ఈ ఇంట్లో ఒక ముసల్ది ఉంది. అందులోనూ ఆ ముసలి దానికి ఎలుకలను చంపడమంటే బాదం హల్వా తిన్నంత సంబరం. ఆ ముసల్ది ఎలుకల్ని చంపే విధానానికి, గరుడపురాణంలో ప్రత్యేకంగా ఇంకో అధ్యాయాన్ని చేర్చాలి, ముసల్ది అంతటి క్రూరమైన ఒక ‘టెక్నీక్’ ను పాటిస్తోంది.
“ఎలుకలు బోనులో చిక్కుకొంటే చాలు, ముసల్దానికి మాహదానందంగా ఉంటుంది. పెందలకాడనే ఒక సత్తుగిన్నెలో సలసలకాగే నీళ్ళను తీసుకువచ్చి, ఇదిగో ఈ నూతిగట్టు కింద చతికలబడుతోంది. తరువాత సావకాశంగా ఎలుక బోనును నిలబెట్టి, బోడి నోటితో ముసి ముసి నవ్వులుబోతూ, ఒక ప్రత్యేకమైనటువంటి గరిటెతో కొంచెం కొంచెంగా గురిచూసి ఎలుకల మీద ఉడుకు నీళ్ళు పోస్తూ మహదానందం పొందుతోంది. అన్నట్టు బతికిపోయాను, ఆ ముసల్ది ఈ రోజు ఊరిలో లేదు. అయితే ముసల్దాని అల్లుడు మాత్రం ఇంటిపట్టునే ఉన్నాడు. వాడూ మరీ అంత మంచోడేం కాదు.
“ఆడొక రచయిత, ఇంటి ముందుభాగంలో ఒక పుస్తకాల కొట్టు పెట్టుకున్నాడు. ఆధునిక తమిళ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను అందులో అమ్ముతుంటాడు. ఆడ్ని వెదుక్కుంటూ పాఠకులు, విదేశాల నుండి పెద్ద పెద్ద విద్యావంతులు వస్తుంటారు. సాహిత్యం, చిత్రలేఖనం, తాత్వికత ఇలా గుక్కతిప్పుకోకుండా ఏదో ఒకటి వసపిట్టలా వాగుతూనే ఉంటాడు. అయితే ఆడిలాంటి వాళ్ళకు కూడా నా మీద ఇసుమంత జాలి, దయా లేవు. ఈ రోజు నన్ను ఈ నూతిగట్టు మీద ఇలా పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సమయం మూడు కావొస్తోంది. నేనేమో ఒక పక్క వేసవి మండుటెండల్లో సలసలా మాడిపోతుంటే, వాడేమో ఇంకో పక్క నన్ను చంపేందుకు మీన మేషాలు లెక్కబెడుతూ కూర్చున్నాడు, దొంగముఖం వెధవ! ఎలుకబోనును ఒక పెద్ద ప్లాస్టిక్ సంచిలో వేసుకుని, ఇదిగో ఇక్కడ నిలబడి ఉందే 91 వ సంవత్సరం టీవీఎస్ చాంప్ మోడల్. దానికి తగిలించుకుని గాంధీ విగ్రహం వెనుకకు తీసుకువెళ్ళి బంగాళాఖాతంలో కలిసే మెరీనా బీచులో ముంచి చంపేస్తాడు. ఇదే సమకాలీన తమిళ కథల గురించి మాట్లాడమని చెప్పండి, వెంటనే క్షణం గ్యాప్ ఇవ్వకుండా లొడలొడమని వాగుతాడు. ఇదే ఎలుకల్ని ఎందుకు చంపుతున్నావురా అని యథాపలంగా అడిగి చూడండి; వెధవ కిక్కిరుమనకుండా మూసుకుపడుంటాడు .
“అన్నట్టు ప్రభో! వీడి గురించి నేను మీకో రహస్యం చెప్పాలి. వీడికి మానసిక ఒత్తిడి జబ్బు వుంది. ఎప్పుడూ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనతోనే తిరుగుతుంటాడు. లౌకిక జీవితంపై ఎటువంటి ఆస్వాదన లేనివాడు. పాపభీతితో తిరుగుతుంటాడు. ఏదో పేరుకి పెద్ద రచయిత అని చెప్పుకుతిరుగుతాడేగానీ, ఆడేం పెద్దగా రాయడు. తన తోటి రచయితలు జయమోహన్, పుదుచ్చేరి కన్నన్ వంటివారు చెప్పినట్టు, ఏడాది పొడుగునా ఒక కథ పట్టుకుతిరుగుతాడు. వీడు అలా రాసే ఒకటీ, అరా కథలను కూడా ఎవ్వడు చదవను కూడా చదవడు. మించిపోతే వాడికంటూ ఒక 300 నుండి 400 మధ్య పాఠకులు మాత్రమే ఉంటారు. ఎనిమిది కోట్లమంది తమిళులు ఉన్నటువంటి రాష్ట్రంలో కేవలం 400 మంది మాత్రమే చదవతగిన రీతిలో కథలు రాసేటోడు ఉంటే ఎంతా, పోతే ఎంత? దాని వలన దేశానికి పెద్దగా ఒరిగేదేమిలేదు. వాడు నడిపే పుస్తకాలకొట్టు కూడా నష్టాల్లో నడుస్తోంది. పైగా పనికి వెళుతున్న భార్యకు కూడా భారంగా ఉంటున్నాడు. దీనికి తోడు పేరు పొందిన రచయితల గురించి ఉన్నవీ, లేనివి కల్పించి చిలువలు వలవులుగా గాలివార్తలు మోస్తుంటాడు. వీటన్నింటికంటే కూడా ముఖ్యమైన విషయం, వీడొక నాస్తికుడు” అంది ఎలుక.
దేవుడు మౌనంగా వింటూ వచ్చాడు. ఎలుక చెప్పుకుంటూ పోసాగింది.
“స్వామీ! మీరు నన్ను అపార్ధం చేసుకోనంటే నేనొకటి చెబుతాను. నన్ను చంపే బదులు ఈ రచయితగాడిని చంపేస్తే ఎలా వుంటుంది? నేను మరణాన్ని చూసి భయపడుతున్నాను అని మీరు మరోలా అనుకోవద్దు. నేను చచ్చేందుకు కూడా సిద్ధమే. అయితే నేను ఈ రోజు చావదలుచుకోలేదు అంతే; పైగా ఈ రచయితగాడు ఎప్పుడైనా చచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. నేను నా పిల్లలు పెరిగి పెద్దయ్యేవరకు, ఇంకొన్ని రోజులు బ్రతకాలని కోరుకుంటున్నాను. కనుక దయచేసి ఇది కాస్త ఆలోచించండి. ఈ రచయితగాడిని కావాలంటే ‘సఫా’ చేసేయ్యండి. నాకు సహాయం చేయడంతో పాటుగా ఆధునిక తమిళ సాహిత్యాన్ని ప్రత్యక్షంగా గట్టెంక్కించిన వారవుతారు. మూడువేల ఏళ్ళనాటి ప్రాచీనమైన తమిళ బాష, వీడు లేకపోయినంత మాత్రాన, ఇప్పటికిప్పుడు ముందుకెళ్ళదా ఏంటి? అందువలన మరేం బాధపడవలసిన అవసరం లేదు.
భగవానుడు లేచి నిలబడి ఇలా అన్నారు.
“నువ్వు అర్ధం పర్ధం లేకుండా మాట్లాడుతున్నావు. మనిషి చావును త్వరితం చెయ్యడంలో ఎటువంటి అవరోధాలు లేవు. పైగా అది అప్పటి ధర్మం కూడాను.”
“ధర్మాధర్మలు గురించి మీకు తెలియనిదేముంది. అయితే ఊరికే చెబుతున్నాను. చావుకు సిద్ధపడిన ఒక నాస్తికుడిని చంపడంలో ఎటువంటి తప్పూ లేదు. పైగా అసురులను, దేవతలు చంపడం ఎలా అధర్మం అవుతోంది?” కాస్త తంత్రంగా మాట్లాడింది ఎలుక.
“క్షమించు మిత్రమా! యుగం మారేటప్పుడు యుగధర్మం కూడా మారుతోంది. నేనూ నిమిత్తమాత్రుడినే” అన్నాడు భగవానుడు.
“అలా అయితే నేను ఈ రోజు చావడం ఖాయమా? నాబోటి వారిని చంపే హక్కు మనుషులకు ఎందుకు ఇచ్చారు?” అని అమాయకంగా అడిగింది ఎలుక.
“నేను ముందే అన్నట్టు మనిషి ప్రాథమికంగా ఒక హంతకుడు. ఒక శత్రువు. అతడు ఎవరో ఒకరిని ప్రతిఘటిస్తూనే వుండాలి. లేకుంటే కనీసం ఎవరినో ఒకరిని చంపుతునైనా ఉండాలి. అదే అతని మనోధర్మం; దానిని మార్చేందుకు నాకు శక్తి లేదు” అన్నాడు భగవంతుడు.
“మీ మనోధర్మం నోట్లో మట్టికొట్టుకుబోను” అంది కోపంగా ఎలుక.
“ఆవేశపడమాకు, నువ్వనుకున్నట్టు మానవ జీవితం కూడా అంత ఉన్నతమైనదేం కాదు, ఎంతో దుర్లభమైనది. ఎన్నో అబద్ధాలతో నిండిపోయినది. నీ జీవితానికి సరితూగే మృత్యుభయం కలిగినది. ఒక్క క్షణం నువ్వీ మనుష్యులను ఎలుకలుగా ఊహించుకొని చూడు. నీకే నవ్వొస్తోంది” అని దేవుడు అనగానే ఎలుక వెంటనే ఆలోచనలో పడింది.
“ఎలుక ప్యాంట్లు తొడుక్కుని, ఆఫీసులకు వెళ్ళడం, వీధులెమ్మట తిరగడం, ఆడ ఎలుకలను బైకులో ఎక్కించుకుని ఊర్లెమ్మట తిరగడం…అంత గొప్పగా ఏం లేదు” అంది ఎలుక.
“ఇది మాత్రమేనా? ఇంకా అందవిహీనమైనది; మానవ జీవితం ఏదో అలా సాగిపోతుంది. మానవజాతి క్రమశిక్షణారాహిత్యాన్ని గొప్పగా నెత్తిన పెట్టుకోసాగింది. పద్ధతులను పక్కన పెట్టదలిచాడు మనిషి. మనిషి జీవితం చుక్కాని లేని నావలా అగమ్యగోచరంగా మారింది. నీ జీవితం వారి కంటే ఎన్నో రెట్లు ఉన్నతమైనది.”
ఎలుక ఇలా అడిగింది “అది సరేగానీ ఆఖరు మాటగా ఏమంటారు స్వామీ? మీరు ఇంతకీ నన్ను కాపాడగలరా? లేరా?
“నేను మాటివ్వలేను’ అన్నాడు దేవుడు.
“అలా అంటే నేను నీట మునిగి చావలిసిందేనా?” అంది ఎలుక.
“నాకు తెలియదు. అయితే మరణం సంభవించే తరుణమన్నది వాస్తవానికి మరణమే కాదు. ఆఖరి నిముషంలో ఏమైనా జరిగే అవకాశముంది” అని చిలిపిగా ఒక్క నవ్వు నవ్వాడు దేవుడు.
“ఎగతాళి చెయ్యమాకండి ప్రభో! బోనులో చిక్కుకున్న నన్ను ఇంకెవరు కాపాడగలరు? ఇక మీరు కూడా చేతులెత్తేస్తే చావడం తప్ప నాకింకో మార్గం లేదు” అంది ఎలుక.
“సాధ్యాసాధ్యాలకు, ఫలితాలకు నడుమ ఏదో ఒక చిన్న విరామమైన వుంటుంది” అన్నాడు దేవుడు.
కాస్సేపు దేవుడినే పరీక్షగా చూసిన ఎలుక, చటుక్కున ఉత్సాహం పుంజుకొంది. ఆపై అన్నీ అవగతమైన ధోరణిలో “అవునవును చిన్న విరామమైనా ఉంటుంది కదూ! …మంచిది మహానుభావా మంచిది” అని దేవుడిని చూసి కన్ను గీటింది ఆ చిట్టెలుక.
తటాలున ఇంట్లో నుండి ఆ రచయిత ఒక పెద్ద ప్లాస్టిక్ సంచితో బయటకొచ్చాడు. నేరుగా నూతిగట్టు దగ్గరకు వెళ్ళి ఎలుకబోనును సంచిలో పెట్టుకున్నాడు. దేవుడు అక్కడి నుండి అంతర్ధానమయ్యేందుకు సంసిద్ధుడయ్యాడు.
ఈ రోజు ఆ రచయిత మెరీనా బీచ్‌కి వెళ్ళేందుకు బదులు, చివరినిముషంలో మనసు మారి, పరిశుద్ధ జాన్ స్కూలుకు ఎదురుగా ఉన్నటువంటి మురికివాడకు వెళ్ళి, ఎలుకను వదిలేందుకు మలుపు తిరుగుతున్నటువంటి మొదటి లింక్ రోడ్డులో వేగంగా రాబోయే లారీని తను గమనించబోడన్నది తెలియక తన బండిని స్టార్ట్ చేశాడు.
పనస చెట్టు నుండి ఒక ఆకు కింద రాలుతోంది. దానిని ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. ఆఖరికి ఆ దేవుడు సైతం.
***
“మనిషి ప్రాథమికంగా ఒక హంతకుడు. ఒక శత్రువు. అతడు ఎవరో ఒకరిని ప్రతిఘటిస్తూనే వుండాలి. లేకుంటే కనీసం ఎవరినో ఒకరిని చంపుతునైనా ఉండాలి. అదే అతని మనోధర్మం;;;”