ఆదాయం కంటే ఆనందం ముద్దు

Spread the love

‘పాలపుంతకి సైతం పాదయాత్ర చేస్తాను’ అని ‘భ్రమణకాంక్షలో రాసుకొన్నాను. కానీ సరిహద్దులు దాటి ప్రయాణాలు చెయ్యటానికి నాకు కొంచెం సమయం పట్టింది. తెలిసిన మిత్రుల ద్వారా గత సంవత్సరం నేపాల్‌ వెళ్ళాను. యాత్రా సాహిత్యం ద్వారా తెలుగు పాఠకలోకానికి దగ్గరయ్యాను కానీ మిగిలిన ప్రపంచాన్ని అందుకోలేకపోయాను. రాయటంతో పాటుగా, బొమ్మలు వేయటంలో కూడా నాకు అనందం ఉంది కాబట్టి, ఆ బొమ్మల ద్వారానే ప్రపంచానికి దగ్గర కావటం సులభం అని తెలుసుకొని, భూటాన్‌ దేశం వెళ్ళటానికి నిశ్చయించుకొని, ముందుగా ఆదేశంలోని చిత్రకారులతో ఇంటర్‌నెట్‌ ద్వారా పరిచయం పెట్టుకొన్నాను. మయేష్‌ తమాంగ్‌ అనే శిల్పి, సోనమ్‌ ఛోపెల్‌ అనే చిత్రకారుడు నాకు ఆహ్వానం పలికారు. వెంటనే నేను విశాఖపట్నం నుండి ఖాట్మండు చేరుకొని పాతమిత్రుల్ని పలుకరించి, అక్కడ నుండి కాకరబిత్తా మీదుగా సిలిగురిలోని టెన్సింగ్‌ నార్కే బస్‌స్టాండుకి వెళ్ళి, భూటాన్‌ బార్డర్‌లో ఉన్న జయగాం అనే టౌన్‌కి ప్రయాణమయ్యాను.

            ఆ దారి పొడవునా వంపుగా పెరిగే వెదురు పొదలూ, నిటారుగా నింగిలోకి ప్రయాణించే పోక చెట్లూ పచ్చని పతాకాల్ని ఎగుర వేస్తూనే ఉన్నాయి. ఎర్రని సిమోల్‌ పూల చెట్ల మీద, నల్లని బుల్‌ బుల్‌ పిట్టలు తమ సంగీతంతో వసంతానికి వన్నెలు అద్దుతూ ఉన్నాయి.

            సాయంత్రానికి జయగాం చేరుకొన్నాను. దానికి ఆనుకొనే ఉంటుంది “ఫుంత్‌ షూలింగ్‌” టౌన్‌. అక్కడ నుండి Royal Kingdom of Bhutan మొదలవుతుంది. సరిహద్దు గేటు దాటి లోపలికి వెళ్ళాను. బజార్ల నిండా విదేశీ యాత్రికులు, స్థానికులు, భారతీయులు సమపాళ్ళలో కనిపిస్తున్నారు. భూటాన్‌ చేరుకోవటానికి ఈ పుంత్‌షూలింగ్‌ ఒక్కటే సరైన భూమార్గం. డార్జిలింగ్‌, సిక్కిమ్‌, కలకత్తా, తింపూల నుండి ఇక్కడికి నేరుగా బస్‌లు కూడా ఉన్నాయి.

            పొట్టిగా, తెల్లగా, ఎర్రని బుగ్గలతో చాలా అందంగా ఉండే భూటానీ పిల్లలు ఎంతో ముద్దొస్తున్నారు. సరిహద్దుల్లో ఏర్పడిన కొండల వరుసల మధ్య ఉన్న కనుమ ముందు ఈ టౌన్‌ ఏర్పడింది. కనుచూపుమేరా చుట్టుతా కొండల వరుసలే. అన్నీ వంపు సాంవుల రోడ్డు. భూటాన్‌ వాన్తుకళారీతిలో నిర్మించిన అద్భుతమైన భవనాలు మనకి ఎంతో ఆనందాన్ని కలుగజేస్తాయి.

            ప్రతి కొండ మీదా ఇళ్ళు కట్టుకొన్నారు. కొండ వాలుల్లో కనిపిస్తున్న కాలిబాటల వైపు నా మనసు లాగింది. అక్కడ ఏ రోడ్డుని పట్టుకొని నడిచినా, ఏదో ఒక వింత ప్రదేశంలోకి చేరుకుంటాం మనం. కాలి బాటలు మనల్ని వాటి వెంట తిప్పుకొని ఎన్నో వింతల్ని చూపిస్తూ మురిసిపోతుంటాయి.బౌద్ధమందిరాల ముందు ఉన్న పెద్ద ప్రార్ధనా చక్రాలు నిరంతరం ‘ఓమ్‌ మణి పద్మేహం’ అంటూ తిరుగుతూనే ఉంటాయి.

            బార్డర్‌ పాస్‌ ఇచ్చే ఇమ్మిగ్రేషన్‌ ఆఫీసులో ఆ సాయంత్రానికి అప్లికేషన్‌ తీసుకొని బజార్లన్నీ బాగా తిరిగి, ఒక ఇండియన్‌ హోటల్లో ఆకలి తీర్చుకొని, ధర్మశాలకి చేరుకొన్నాను రాత్రికి.

            తెల్లవారగానే ఇమ్మిగ్రేషన్‌ ఆఫీసుకి పరుగులు తీశాను. అక్కడ నాకంటే ముందే చాలా మంది పాస్‌ (వీసా)ల కోసం గుంపులుగా ఉన్నారు. వారిలో ఎక్కువ మంది కూలీలు, కాంట్రాక్టర్లు. ఉత్తరప్రదేశ్‌ నుండి వచ్చిన ఒక లేబర్‌ కాంట్రాక్టరుతో పరిచయం అయింది. “అయ్యా! నేను మూడు నెలల నుండి తిరుగుతున్నాను ఈ రోజు నా ఫైలు మీద సంతకం అవుతుంది” అంటూ ఆనందంగా చెబుతున్నాడు. భూటాన్‌ వెళ్ళే భారతీయ యాత్రికులకి పాస్‌పోర్టు అక్కరలేదు. రెండు ఫోటోలు, ఒక గుర్తింపు కార్డు ఉంటే చాలు. అప్లికేషన్‌ నింపి ఏడవ నెంబరు క్యూ వద్దకి చేరుకున్నాను. అక్కడి భూటాన్‌ ఆఫీసరు నన్ను చూడగానే “ఒంటరిగా వెళ్ళే వారికి పాస్‌లు ఇవ్వటం లేదు. మీరు ఏదైనా గ్రూపులో చేరండి ఇస్తాం” అన్నాడు.

            ఇంతలో ఒక పెద్దావిడ వచ్చినా పాస్‌పోర్టుని పరిశీలించి చూస్తుండగా, నా వద్ద మిగిలిన కాగితాలు ఇచ్చాను. ఆ భూటాన్‌ ఆఫీసర్‌ వెంటనే నా అప్లికేషన్‌ మీద తొమ్మిది రోజులకి బార్డర్‌ పాస్‌ స్టాంప్‌ వేశాడు. ఆనందంగా బయటికి వచ్చాను.

            వెంటనే బస్‌స్టాండ్‌కి వెళ్ళి తింపూకి టికెట్‌ తీసుకొన్నాను. నా బస్‌ రెండుగంటలకి వస్తుందట. తింపూకి ఏడుగంటల ప్రయాణం. ఛార్జీ నూట ఎనభై ‘నూ’లు. వారి ‘నూ’ మన రూపాయికి సమానమే. వారి టైం మనకంటే ముఫ్పె నిముషాలు ముందుగా ఉంటుంది. బస్‌స్టేషన్‌ పేరు “భూటాన్‌ రోడ్‌ సేఫ్టీ & ట్రాన్స్‌పోర్టు సర్వీస్‌” అని ఉండటంలో వారు ప్రయాణీకుల భద్రతకి ఇస్తున్న ప్రాముఖ్యత అర్థమైంది. బస్‌స్టాండ్‌లో ఒక మిలిటరీ వ్యక్తి పరిచయమై “నా పేరు గ్యాంబో. Welcome to Bhutan.బై బై అంటూండగానే వారి బస్‌ బయలు దేరింది. తరువాత వచ్చిన బస్‌లో నేనూ బయలు దేరాను.

            ఐదు నిముషాల్లోనే ఆకాశమంత ఎత్తులో ఉన్న రోడ్డు మీదకి చేరుకొన్నాం. గంటకి ముప్పై కి.మీ. కంటే వెళ్ళలేవు ఈ చిన్న బస్సులు. ‘పూర్‌ విజిబిలిటీ’, ‘ల్యాండ్‌ స్లైడ్ ఏరియా’ బోర్డులు ఒక ప్రక్కన మొదలైయ్యాయి. అద్భుతమైన ప్రకృతి.పిట్టల గొడవ బస్‌లోకి కూడా వినిపిస్తూనే ఉంది. బుద్ధిష్టు మందిరాలు అక్కడక్కడ దూరంగా తళుక్కుమంటున్నాయి. పైకి వెళ్ళే కొద్దీ పుంత్‌షూలింగ్‌ పక్కనున్న నది కూడా పూర్తిగా కనిపించి, బస్సు మరొక మలుపు తిరగ్గానే మాయమైంది. చుట్టు పక్కలా ఉన్న కొండలమీద దట్టంగా అడవులు ఉన్నాయి. కొండవాలు ప్రాంతాల్లో మెట్ల పద్ధతి వ్యవసాయం ఉంది.

            భూటాన్‌ కొండల మీద వేగంగా ప్రవహించే సెలయేర్లు ఎక్కువ. కొండలన్నీ బూడిద రంగులోనే ఉన్నాయి. అవి పొరలుగా ఉండటం వలన వర్షపు నీళ్ళు తాగి, సారవంతంగా తయారై దట్టమైన సవన్నాగడ్డి, వెదురు అడవులు అక్కడ పుట్టుకొచ్చాయి. చాలా చోట్ల నీటి ద్వారా విద్యుత్‌ శక్తిని తయారు చేసే ‘పవర్‌ ప్లాంటు’లు ఉన్నాయి. కొన్ని చోట్ల డ్యాములూ ఉన్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్తును తయారుచేసేందుకు తగిన అవకాశాలు ఉన్న ప్రదేశం ఇది.

            జేడూ పట్టణం చేరేసరికి అద్భుతమైన వాస్తు కళానైపుణ్యంతో నిర్మించిన భవన సముదాయం రోడ్డు పక్కనే కనిపించింది. అది రాయల్‌ భూటాన్‌ యూనివర్సిటీ. కొద్దిగా చదునైన భూమి ఉంటే చాలు, అక్కడ ఒక గ్రామం ఏర్పడిపోతుంది. ఎంత ఎత్తుగా కొండలు ఉన్నా, పైపైకి ప్రయాణిస్తూనే ఉంటాయి వారి నివాసాలు. ఆ కొండల మీద ప్రార్ధనా మందిరాలు గుంపులుగా దర్శనమిస్తుంటాయి. నిముషానికి మూడు మలుపులు లేకుండా రోడ్డు ఎక్కడా లేదు. దూరంగా ఉన్న కొండల మీదుగా వచ్చే వాహనాలు; ఏవో పెద్ద కీటకాలు మెల్లగా పాకుతూ పోతున్నట్లుగా కనిపిస్తుంటాయి. వందల మెలికలు తిరుక్కొంటూ, జాగ్రత్తగా ముందుకి పోతూనే ఉంటుంది రోడ్డు. అక్కడక్కడా జలపాతాలు కనిపిస్తుంటాయి. క్రీ.శ. 1811వ సంవత్సరంలో థామస్‌ మానింగ్‌ అనే బ్రిటిష్‌ యాత్రికుడు భూటాన్‌ గుండా టిబెట్‌ వెళుతున్నప్పుడు ఇలాంటి దారుల్లోనే ప్రయాణం చేశాడు.

            సాయంత్రానికి కిన్‌లే అనే హోటల్‌ ముందు ఆగింది బస్సు. ఇక్కడ ప్రతి హోటల్‌కూ బార్‌ కలిసే ఉంటుంది. పోర్కు లేకుండా భోజనం దొరకటం కష్టం. నాతో పాటుగా బస్‌లో వస్తున్న ఒక బీహారీ యువకుడు “మీరు ముస్లింలా?” అని అడిగి “నేను తింపూలో కాంట్రాక్టరు వద్ద ఐదు సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను” అంటూ తన కుటుంబ వివరాలు చెప్పాడు. అతడి పేరు రేజావుల్‌. దారిలో రెండు చోట్ల చెక్‌ పోస్టులు వచ్చాయి. బార్డర్‌ పాస్‌లు ఉన్నవారు అక్కడ మరలా స్టాంపింగ్‌ వేయించుకోవాలి.

            కొండల పైకి వెళ్ళే కొద్దీ చీకటి ముసురుకొస్తూ ఉంది. చలి పెరిగింది. చీకటి ఎక్కువయ్యే కొద్దీ దాని ప్రయాణ భయం పాగొట్టుకోవటానికి, చుక్కల్ని తోడుగా తెచ్చుకొంటూ ఉంది. కొండల మీద ఇళ్ళల్లో లైట్లు మెరిసిపోతున్నాయి. నింగిలోని చుక్కలు కిందికి దిగి, కొండలమీదకి పరుచుకు పోతున్నట్లుగా ఉంది.

            తింపూ బస్‌స్టాండు చేరేసరికి రాత్రి తొమ్మిది గంటలైంది. రేజావుల్‌ సహాయంతో హోటల్‌ చేరుకున్నాను. అదే ‘తాషిక్‌ దె లేర్‌’ హోటల్‌. రోజుకి అద్దె ఐదువందల ‘నూ’లు. ఇదే అన్నిటికన్నా తక్కువ రేటు. “మీరు నాతోపాటుగా ఇక్కడే ఉండి రేపు వెళ్ళవచ్చుగదా” అన్నాను. “నేను తప్పనిసరిగా వెళ్ళి తీరాలి” అంటూ మెట్లు  దిగుతూ “మా తమ్ముడికి ఆరోగ్యం సరిగా లేదండి. అందుకే నేను ఈ పరాయి దేశంలో పనిచేస్తున్నాను” అంటూ వివరించి, “మీరు తప్పనిసరిగా మా బీహార్‌ రావాలి” అని చెప్పి శెలవు తీసుకొన్నాడు.

            హోటల్లోనే భోజనం చేశాను. అక్కడ పనిచేస్తున్న వారందరూ స్త్రీలే. ఓనరు కూడా ఒక వయసు  మళ్ళిన స్త్రీ. ఆవిడని చూడగానే పాల్‌ గాగిన్‌ చిత్రాలు గుర్తుకొస్తున్నాయి. బొద్దుగా, గుండ్రంగా ఉండే తహతియన్‌ సుందరిలాగా ఉంది ఆమె ఆకారం. గది లోపల గోడమీద ఉన్న ఒక పోస్టర్‌ నన్ను ఆకర్షించింది. దాని పేరు “The lamb shall play with the lion ” ఒక మేక పిల్ల, సింహం జూలు నిమురుతూ ఆడుకొంటూ ఉంటుంది. ఈ బొమ్మ వేసిన చిత్రకారుడి పేరు ఎడ్వర్డ్‌ హిక్స్‌. ఆయన ప్రఖ్యాతి చెందిన అమెరికన్‌ జానపద కళాకారుడు. “అందరూ కలిసి మెలసి ఉండాలి, ప్రేమించుకోవాలి” అనే తాత్త్విక భావాలకి రూపకల్పన చేసిన హిక్స్‌ చిత్రాలు ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇస్తూ ఉంటాయి. భూటాన్‌ ప్రజల ఆలోచనా సరళికి ఈ చిత్రం బాగా నచ్చి ఉంటుంది.నా గదిలో ఉన్న టివీలో భూటాన్‌ రాజు వాంగ్‌ఛుక్‌ చేస్తున్న ప్రసంగాన్ని వింటూ నిద్రలోయల్లోకి దొర్లిపోయాను.

            నన్ను ఆహ్వానించిన మిత్రుల అడ్రసు వెతకటానికి ఉదయమే బయలుదేరాను. కాని అది నా హోటల్‌ ఎదురుగానే ఉంది. దాని పేరు వాస్ట్‌ గ్యాలరీ. టవర్‌క్లాక్‌ సెంటర్‌లోని పెద్ద భవనం అది.

            గ్యాలరీ తెరవటానికి చాలా సమయం ఉంది. తింపూ రోడ్ల మీద తిరగటానికి ఇదే మంచి సమయం. పది దాటితే ఎలాగూ టూరిస్టుల ట్రాఫిక్‌ తప్పదు. ఆ పక్కనే ఉన్న ఖాళీ స్థంలో నిన్న జరిగిన “ఇండో-భూటాన్‌ ఫ్రెండ్‌షిప్‌ కార్‌ ర్యాలీ” బ్యానర్‌లు అహ్వానిస్తున్నాయి. ఉత్తరంగా ఉన్న కొండల మీద మంచు పేరుకుపోయింది. స్కూలు పిల్లలు విల్లో చెట్ల పక్కగా కబుర్లు చెప్పుకొంటూ సాగిపోతున్నారు. మరోపక్క పావురాళ్ళ గుంపులు శూన్యంలో గిరికీలు కొడుతున్నాయి.

            1960వ సంవత్సరం నాటికి ముందు ఈ తింపూ ప్రదేశం అంతా గ్రామాలతో నిండిపోయి ఉండేది. పాత రాజధాని పునఖాలో అభివృద్ధికి తగిన వసతులు లేకపోవటం వల్ల ఈ తింపూ ప్రాంతాన్ని ఎన్నుకొని అభివృద్ధి చేయటం మొదలు పెట్టారు. జిగ్మే సింగ్‌యే వాంగ్‌ ఛుక్‌ రాజు ఆధునిక భావాలతో ఉండటం వలన రాజధానిని ఇక్కడికి మార్చి తన ప్రజల్ని అభివృద్ధి పథం వైపుగా నడిపించాడు. నగరంలో ఎక్కడ చూసినా బౌద్ధుల ఆరామాలు, పెద్ద కోటలాంటి ఇళ్ళు, ఎత్తైన ప్రార్ధనా జెండాలు కనిపిస్తూ ఉంటాయి. ఎత్తైన తెల్లని గోడల మీద, ముదురు లక్క రంగులో ఉన్న చెక్కలతో చేసిన నిర్మాణాలు చాలా దూరం నుండే మనల్ని ఆకర్షిస్తాయి. అలాంటి భవనాల్లో తాషిజోంగ్‌ ఒక ప్రధానమైన భవనం.

            భూటానీయులు మాట్లాడే భాష పేరు జోంఖా. భూటాన్‌ని “Land of the Thunder Dragon” అని పిలుస్తారు. తింపూ నగర జనాభా మొత్తం డెబ్బైవేలకి మించదు. ఇక్కడ ఎలాంటి ఫ్యాక్టరీలు, కంపెనీలు లేవు. దేశం మొత్తం జనాభా ఇరవై లక్షలే. డెబ్బై శాతం ప్రజలు వ్యవసాయం మీద, మిగిలిన వారు టూరిజం మీదా జీవిస్తారు. పైగా భూటాన్‌ వారు సంవత్సరానికి రెండు వేల కంటే ఎక్కువమంది విదేశీయుల్ని వారి దేశంలోకి రానీయటం లేదు. నిజంగా వారి వలన ఎంతో ఆదాయం వస్తుంది. అయినా సరే మాకు “జాతీయ తలసరి ఆదాయం కంటే, తలసరి ఆనందం ముఖ్యం” అంటున్నారు. స్మోకింగ్‌ని పూర్తిగా నిషేదించారు. ప్లాస్టిక్‌ కూడా సరిహద్దులకి అవతలే ఉండిపోయింది. మన జేబులో సిగరెట్‌ ఉన్నా నేరమే. రెండు సిగరెట్‌ పెట్టెల్ని తన జేబులో ఉంచుకొన్నందుకు ఒక బౌద్ధ సన్యాసికి రెండు సంవత్సరాల జైలు శిక్ష వేసినట్టుగా నేను ఈ రోజే న్యూస్‌ పేపర్లో చదివాను. భూటాన్‌ వారు పూర్తి ఆధునికతను అంగీకరించటం లేదు. భౌద్దమత ధర్మాలకి, ఆధునిక నాగరికతకి మధ్య సమతుల్యాన్ని సాధించాలని వారి లక్ష్యం.

            బజార్లు తిరుగుతూ భూటాన్‌ గురించిన ఆలోచనలు చేస్తూ పదిగంటలకల్లా ఇండియన్‌ కల్చర్‌ సెంటర్‌ దాటి, వాస్ట్‌ గ్యాలరీకి చేరుకొన్నాను. కానీ నాకు ఆహ్వానం పలికిన వారు ఇద్దరూ ఊర్లో లేరు. ఒకరు శాంతినికేతన్‌లోనూ, మరొకరు థాయిలాండ్‌లోనూ ఉన్నారట. అక్కడ సెక్రటరీని కలుసుకొని నేను ఉండేందుకు ఏర్పాట్లు చేసుకొన్నాను.

కాసేపట్లోనే ప్రముఖ చిత్రకారుడు ఆషాకామా అక్కడికి రాగానే పరిచయం చేసుకొన్నాను. “మా గ్యాలరీ చూడటానికి ఇండియా నుంచి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది” అన్నాడు. ఈ వాస్ట్  స్టూడియోలో అషాకామా భూటాన్‌ యువకులకి చిత్రకళలో శిక్షణా తరగతులు ఏర్పాటు చేశాడు. చెక్కతో నిర్మించిన ఈ పాత భవనం చాలా ధృడంగా ఉంది. “ఇక్కడ మీరు ఎన్నాళ్ళైనా ఉండవచ్చు” అంటూ అక్కడి ఒక గది నాకు చూపించాడు.

            చుట్టూతా చిత్రాలు, మంచి ఆర్ట్‌ లైబ్రరీ, పక్కనే హోటల్‌ అంతకంటే ఏంకావాలి? ఇక్కడ మా స్నేహితుల కోసం ఒక ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసుకోవచ్చు అనిపించింది.

            సాయంత్రానికి కెజాంగ్‌ అనే ఫోటోగ్రాఫర్‌ పరిచయం అయ్యాడు.“Indian Embassy లో నా One Man Show జరుగుతూ ఉంది” అంటూ ఆహ్వాన పత్రిక అందించాడు.

            తరువాత నాకు పరిచయం అయిన మరో యువకుడు రించేన్‌. ఇతడు తింపూలోని Happy Valley Youth అనే సంస్థని నడిపిస్తున్నాడు. “నేను ఎక్కువగా మాట్లాడుతాను. కాబట్టి నాకు ఎక్కువమందితో పరిచయం ఉంది” అంటూ నా స్కెచ్‌బుక్‌లో చిన్న బొమ్మ కూడా వేశాడు. గ్యాలరీలో కూర్చొంటే చాలా మంది పరిచయాలు జరుగుతూ ఉంటాయి.

            సాయంత్రానికి తింపూలోని బజార్జు చూడటానికి వెళ్ళాను. దూరంగా కొండల మీద కూర్చొని ఉన్న బుద్ధుడి బొమ్మ వైపుగా నాపాదాలు కదులుతున్నాయి. ఆషాకామా నాకు ఫోన్‌ చేసి “ఈ రాత్రికి స్నేహితుడి ఇంట్లో పార్టీ ఉంది, ఎక్కడకీ వెళ్ళకండి” అని చెప్పగానే త్వరగా గ్యాలరీ చేరుకొన్నాను.

            ఆయనకారులో భార్య, ఏడు సంవత్సరాల కొడుకు కూడా ఉన్నారు. తన మిత్రుడి ఇల్లు చేరేసరికి చీకటి పడింది. అంత పెద్దఇంట్లో ఒక్కడే రెండు రివాల్వింగ్‌ హీటర్ల మధ్యన కూర్చొని పెయింటింగ్‌ వేస్తున్నాడు. ఆయన పేరు బిస్వాస్‌. భూటాన్‌లో ఇరవై ఐదు శాతం హిందువులు కూడా ఉన్నారు అని తెలిసింది.

            గతంలో ఆయన రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పని చేసేవాడు. కాని ప్రస్తుతం పుల్‌బెం ఆర్టిస్టుగా మారిపోయాడు. ఆయన నీటిరంగుల చిత్రాల్లో ఎక్కువగా భూటాన్‌ వాస్తుకళా నిర్మాణాలు సాక్షాత్కరిస్తుంటాయి.

            ఆయన వద్ద యాంగ్లింగ్‌ (గాలంతో చేపలు పట్టడం) మీద మంచి బుక్‌ కలెక్షన్‌ ఉంది. భోజనాల సమయానికి కామా చిన్నకొడుకు ఆ సోఫాలోనే నిద్రకొచ్చాడు. అయినా కాళ్ళకి ఉన్న స్కేట్స్‌ మాత్రం విప్పలేదు. బిస్వాస్‌ చాలా వినయంగా మాట్లాడుతూ తన చిత్రకళారీతుల గురించి వివరిస్తున్నాడు. ఆషాకామా భార్య మాత్రం నేను చెప్పిన మాటలకి కనుబొమ్మల్ని పైకగరేస్తూ విపరీతంగా నవ్వించేది; మధ్యలో “Oh My God” అంటూ, “ఇక నుండి నేను O.M.G మాత్రమే అనగలను గుర్తుపెట్టుకోండి” అంటూనే మరలా నవ్వేది. “ఆది భయ్యా! ఆప్‌ కా దాడీ బహుత్‌ అఛ్చాహై”ని మీ తెలుగులో ఎలా అంటారో చెప్పవా? అని బతిమలాడించుకొని చెప్పించుకొంది.

            నేను వెళ్ళే ముందుగా మా హోత నాకు ఒక చిన్న నీటిరంగుల చిత్రాన్ని బహుమతిగా ఇచ్చాడు. నేనేమో అతనికి నేపాల్‌ నుండి తెచ్చిన బుద్ధా బొమ్మని ఇచ్చాను. భూటాన్‌ వారి పేర్గు ఎక్కువగా వాంగ్‌ ధేమ్‌, దోర్జీ, కిన్‌లే, దోల్మా వాంగ్‌ ఛుక్‌ లాంటివే ఉంటాయి. వాళ్ళ రాజు గారి పేరు Wang Chuck కాబట్టి మామూలు ప్రజలు ఆ పేరు పెట్టుకున్నప్పుడు Chuck బదులుగా Chuk అని మాత్రమే రాసుకుంటారు. రాజంటే వారికి అంత గౌరవం.

            ఇళ్ళకి ముందు దిష్టిబొమ్మలాగా లింగాకారాన్ని వేలాడదీస్తున్నారు. గోడలమీద ఆ రూపాన్నే చిత్రిస్తున్నారు. భూటాన్‌ దెయ్యాల్ని బూతులు తిడితేగాని వెళ్ళవు కాబోలు.

            చుట్టూతా ఉన్న కొండల మీద విపరీతమైన చెట్టు, పక్షుల గుంపులు. అన్నీ అందమైన భవనాలే. ప్రతి ఇంటి పైకప్పుకి ఆకుపచ్చ రంగుని విధిగా వేస్తున్నారు. తింపూ నగరమంతా ఒక విశాలమైన లోయలో నిర్మించబడింది. ప్రజలు సాధారణంగా వారి జాతీయ దుస్తులే ధరిస్తున్నారు. మోకాళ్ళవరకు నల్లని మేజోళ్ళు, వదులుగా ఉండే కోటు, బూట్లు, టోపి వారి దుస్తులు.

            1959వ సంవత్సరం వరకూ భూటాన్‌ వారు విదేశీయుల్ని ఆహ్వానించలేదు. వారి నాగరికత నాశనం అయిపోయి విదేశీయుల ప్రాబల్యం ఎక్కువ అవుతుంది అనే భయంతో. కానీ ఆధునిక ప్రపంచపు ఒత్తిడిని తట్టుకోలేకపోవటం, పాత ప్రపంచపు అలవాట్లను కొనసాగించటంలో ఉండే ఇబ్బంది వలన కొత్తకాంతికి తలుపులు తీయాల్సివచ్చింది.

            భూటాన్‌ వారి మీద బ్రిటిష్‌ వారి ప్రాబల్యం క్రీ.శ. 1772వ సంవత్సరం నుండి మొదలైంది. అప్పుడు భూటాన్‌ వారు టిబెట్‌ సహాయం కోరగా, వారే స్వయంగా భూటాన్‌ని ఆక్రమించుకుందాం అనుకుంటారు. అందువలన భూటాన్‌ వారు బ్రిటిష్‌ వారితో సంధిచేసుకొన్నారు. క్రీ.శ. 1904వ సంవత్సరంలో బ్రిటిష్‌ వారు టిబెట్‌ మీదకి దండయాత్ర జరిపినప్పుడు, భూటాన్‌వారే స్వయంగా ఆంగ్లేయులకు సహాయం చేశారు. అందువలన ఆంగ్లేయులు భూటాన్‌ దేశాన్ని స్వయం ప్రతిపత్తిగల రాజ్యంగా ప్రకటించారు. బ్రిటిష్‌వారు 1947వ సంవత్సరంలో భారతదేశాన్ని వదిలి పెట్టి వెళ్ళిపోయినాసరే, విదేశీయుల వలన ఇబ్బందులు వస్తాయనే భయంతో 1959 వ సంవత్సరం వరకూ ఎవ్వరినీ భూటాన్‌లోనికి రానివ్వలేదు.

            భూటాన్‌లో డెబ్బైశాతం ప్రజలు వ్యవసాయం మీదే జీవిస్తుంటారు. బియ్యం, బంగాళాదుంపలు, మొక్కజొన్న, బార్లీ విపరీతంగా పండుతాయి. టింబర్‌ వారికి ముఖ్యమైన ఎగుమతి. జల విద్యుత్తు ద్వారా వారికి ఎంతో ఆదాయం వస్తుంది.

            Indian Embassy కి వెళ్ళి డైరెక్టరును కలుసుకొన్నాను. సమకాలీన భారతీయ కళాకారుల చేత ఒక షో ఏర్పాటు చేయటానికి పర్మిషన్‌ కూడా ఇచ్చారు. తరువాత ‘హ్యాండీ క్రాఫ్ట్‌ మ్యూజియం’కి వెళ్ళాను. వాల్‌నట్‌ చెక్కతో చేసిన చిన్న బొమ్మలు ఎంతో ముచ్చటగా ఉన్నాయి. తేలిగ్గా, అందంగా ఉన్న ఆ చిన్న బొమ్మల్లోనే ఎంతో పనితనం ఉంది. అంగుళం సైజులో ఉండే బొమ్మల్లో హావభావాలు కూడా చూపించారు. చెక్కతో చేసిన మాస్క్‌లు అన్నిటికంటే అందంగా ఉన్నాయి. వారి ఉత్సవాల్లో మాస్క్‌లు లేకుండా నాట్యం ఉండదు.

            పుస్తకాల షాపుల్లో బుద్ధిజం గురించి, రాయల్‌ కింగ్‌డమ్‌ గురించే ఎక్కువ సాహిత్యం ఉంది. ఒక టూర్‌ కండక్టర్‌ పరిచయమై “Snowman Trekking కి వెళ్ళండి” అవి సలహా ఇస్తున్నాడు. ఆ కొండ మార్గాల్లో ప్రయాణం చేయటానికి ఇరవై నాలుగు రోజులు పడుతుంది. ఈ ఆపరేటర్‌ చేసిన ఐరోపా బైకు ప్రయాణాల గురించి బాగా వివరించాడు.

            వాస్ట్ సూడియోకి రోజూ వచ్చేపోయే విదేశీ యాత్రికులతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఇక్కడికి గతంలో థాయిలాండ్‌ నుండి వచ్చిన వాంగ్‌థాంగ్‌ అనే చిత్రకారుడు వర్క్‌షాప్‌ నడిపించాడు. గ్యాలరీ పనులు చూస్తున్న అమ్మాయి పేరు కింగ్‌వాంగ్‌దేమ్‌. ఆమెకి చదరంగం అంటే ఇష్టం. నా రాజుకి ఛెక్‌ చెప్పకుండానే చంపేస్తూ ఉండేది. నేను మాత్రం “మీ రాజుని ఓడించటం నాకు ఇష్టం లేదు. స్మోకింగ్‌, ప్లాస్టిక్‌ లాంటి శత్రువుల్ని జయించి మిమ్మల్ని కాపాడుతున్నాడు” అని చెప్పి, ఆమె చేతుల్లో ఓడిపోతూ, ఆట నేర్పిస్తూ ఆనందించేవాడిని.

            “సార్‌! ఈ సారి వచ్చినప్పుడు మా ఊరుకి తీసుకెళ్తాను? వస్తారా?” అని అడిగింది. “జడల బర్రె మీద ప్రయాణం చేయాలనే కోర్కె తీరుస్తానంటే తప్పకుండా వస్తాను” అన్నాను.

            “మా గ్రామానికి వెళ్ళాలంటే రెండు రోజులపాటు నడవాలి”

            “అక్కడ మీ వాళ్ళు ఏం చేస్తుంటారు?”

            “వ్యవసాయం, యాత్రికులకి గుర్రాల్ని జడల బర్రెల్ని సరఫరా చేయటంతో పాటుగా కోర్టీసెప్‌లు ఏరుకొంటారు. దాంతో జీవితం గడిచిపోతుంది” అని చెప్పింది.

            ఈ కోర్టీసెప్‌లు అనే పురుగులు పద్నాలుగు నుండి పదిహేడు వేల అడుగుల ఎత్తులో ఉండే మంచుకొండల మీద ఉంటాయి. ఇవి ఒక రకమైన పురుగు మొక్కలు. చలికాలంలో పురుగులాగా, ఎండకాలంలో గడ్డిలాగా కనిపిస్తాయి. నిజానికి ఇవి “Himalayan Bat moth” అనే పురుగులు. ఇవి గొంగళి పురుగుల్లాగా ఉండి, పసుపురంగులో మెరుస్తూ మంచు కన్నాలలో కూరుకుపోయి ఉంటాయి. వైద్యానికి పనికి వచ్చే ఈ చిత్రమైన కోర్టీసెప్‌లకి హాంగ్‌ కాంగ్‌, సింగపూర్‌ దేశాల్లో మంచి ధర పలుకుతుంది. శీతాకాలంలో భూటాన్‌ ప్రజలు వాటి సేకరణలో ఉంటారు.

            ఒకరోజు సాయంత్రం ఆషాకామా వచ్చి “మనం ఇప్పుడు కొండల మీదకి వెళుతున్నాం రండి” అంటూ కారు ఎక్కించాడు. తూర్పు వైపున ఉన్న కొండల మీద బొత్తిగా చెట్టులేవు. “ఈ ప్రాంతాల్లో మొక్కల అవసరాన్ని గురించి మా కింగ్‌కి ఒక ప్రపోజల్‌ తయారు చేస్తున్నాను. అందుకోసమే ఈ ఫోటోలు తీస్తున్నాను” అంటూ వివరిస్తున్నాడు కామా. ఎత్తుగా కన్పించే కొండల మీద కొన్నిచోట్ల బౌద్ధ మందిరాలు ఉన్నాయి. అక్కడ మంచినీళ్ళ సౌకర్యం కూడా ఉంది. కొండవాలు ప్రాంతం అంతా ఎండిపోయింది. పీచ్‌ చెట్ల బులుగు రంగు పూలు, సాయంత్రపు కాంతిలో కేరింతలు కొడుతున్నాయి. ఎత్తైన దిబ్బల మీద వందల కొలదీ ప్రార్థనా జెండాలు పాతి ఉన్నాయి. నిలువుగా ఉండే ఆ ప్రార్ధనా జెండాల వెడల్పు రెండు అడుగులు. ఎత్తు పది నుండి యాభై అడుగుల వరకూ ఉంటాయి. ప్రతి పది కిలోమీటర్లకీ వీటిని చూడగలం. ఇక్కడ డెబ్బయి శాతం ప్రజలు బౌద్ధులు  కావటంతో వారి ప్రార్ధనా విధానాలే అమలులో ఉంటాయి.

            ఆషాకామాలో దాగి ఉన్న మరో కోణం పర్యావరణ పరిరక్షణ. “ఈ ప్రార్ధనా జెండాల కోసం చెట్లని నరకటం వలన సంవత్సరానికి పదిశాతం అడవి తగ్గిపోతూ ఉంది. నిజంగా బుద్ధుణ్ణి గౌరవించే వాళ్ళు ఈ పని చేయకూడదు. దీని వలన పుణ్యం కంటే పాపమే ఎక్కువగా జరుగుతుంది కదా!” అని చెబుతున్నాడు ఆయన. ఈ దృక్కోణంలో ఆలోచించే వారు కరువయ్యారు.

            అదే సమయంలో క్రింద ఉన్న లోయలో ఒక చోట దట్టంగా పాగ పైకి లేస్తూ ఉంది. ఎక్కడో నిప్పంటుకొంది. నిటారుగా ఆకాశం వైపుగా ప్రయాణిస్తున్న ఆ పొగని చూస్తే వేదకాలం నాటి యజ్ఞాలు గుర్తుకొచ్చాయి. “తమని రక్షించమని వృక్షాలు, ఆకాశ దేవతలకి పాగతో సందేశాలు పంపుతున్నట్లుగా ఉంది” అనుకొన్నాను.

            ఫోటోలు తీయటం పూర్తికాగానే మేమిద్దరం బుద్ధ విగ్రహం ఉన్న కొండమీదకి వెళ్ళాం. ఒక ఎత్తైన కొండని చదును చేసి, ఆ ఉపరితలం మీద బుద్దుని కంచు విగ్రహాన్ని నిర్మించారు. అద్భుతంగా ఉంది ఆదృశ్యం. దీని ఎత్తు నూట అరవై తొమ్మిది అడుగులు. వాస్ట్‌ స్టూడియో నుండి చాలా చిన్నదిగా అనిపించింది. చైనా ప్రభుత్వ సహాయంతో దాన్ని గత ఐదు సంవత్సరాలుగా నిర్మిస్తూనే ఉన్నారు.

            భూమిస్పర్శ ముద్రలో కూర్చొని ధ్యానం చేసుకొంటున్న ఈ మైత్రేయ బుద్ధ  విగ్రహం పరిసరాలని శాసిస్తున్నట్లుగా ఉంటుంది. చుట్టూతా యాభై ఎకరాల ఖాళీ  స్థలం. నేను తింపూ దాటి ఎటూ వెళ్ళలేక పోయానన్న బాధ తీరిపోయింది.

            తెల్లారి ఏడుగంటలకే నా ప్రయాణం. కాబట్టి డిన్నర్‌కి ఆషాకామా ఇంటికే వెళ్ళాను. దారిలో మాకు పూరవ్‌దోర్టీ అనే అతడు తోడై మా కారులోనే వచ్చాడు. అతనితో పాటుగా వారి ఏడు సంవత్సరాల కూతురు కూడా ఉంది.ఆషాకామా ఇల్లు చాలా విశాలంగా నిర్మించాడు. దానిలో అచ్చంగా తన చిత్రకళా సాధన కోసం పెద్ద గది. అన్నీ సగం పూర్తి చేసిన బొమ్మలే ఉన్నాయి.

            అందరం ఎంతో సంతోషంగా కబుర్లు చెప్పుకొన్నాం. O.M.G వంట పనిలో మునిగిపోయినా మధ్యలో వచ్చి మాటలు చెబుతూనే ఉంది. “నీ కోసం పోర్క్‌ స్పెషల్‌ వండాను. దాన్ని చౌమీన్‌తో తింటేనే బాగుంటుంది ఆది భయ్యా!” అంటూ ఒక పెద్ద పింగాణీ ప్లేటుకి నింపి నాముందు పెట్టింది.

            “మీరందరూ కూడా ఇండియాకి ఒకసారి తప్పకుండా రావాలి” అని చెప్పి నాబ్యాగులో ఉన్న బుద్ధుని బొమ్మ బహుమతిగా ఇవ్వబోయాను వారికి. O.M.G ఒప్పుకోలేదు సరికదా, “భయ్యా, We have Buddhas In Bath rooms.We want your traditional stuff” అని గట్టిగా చెప్పింది.

            నన్ను గ్యాలరీలో దించి వెళ్ళిపోతూ “మరలా వచ్చే సంవత్సరం తప్పనిసరిగా రావాలి” అంటూ అందరూ ఆహ్వానించారు. “మీ రాజు గారి పెళ్ళికి తప్పకుండా వస్తాను” అని వాగ్ధానం చేసాను.

            వేకువనే లేచి టవర్‌ క్లాక్  వద్ద కాసేపు తిరిగాను. బాధగా ఉంది. మంచుపడుతూ ఉంది. ఇళ్ళ చూరుల కిందకి చేరిన పావురాలు మాత్రం గురగురలాడుతూనే ఉన్నాయి. ఈ దివ్యమైన పర్వతాల ప్రపంచానికి మరలా ఎప్పుడు వస్తానో! సరిగ్గా ఆరున్నరకి బయలుదేరాను. పక్షుల గుంపులు రివ్వున ఎగిరి, టవర్‌క్లాక్‌ చుట్టూ తిరిగి నాముందుకు వచ్చి వాలిపోయాయి. వాటి మెడ మీద మెరుపులో

ఎంతో సౌందర్యం ఉంది.

            బస్‌ సరిగ్గా ఏడుగంటలకి పాగమంచుని చీల్చుకొంటూ లోయల అంచున దూసుకుపోతూ ఉంది.డ్రైవర్‌కి అలవాటైన దారి. నాకు బయట ఏమీ కనిపించటం లేదు. కుడివైపుగా కొండమీద ఉన్న మైత్రేయ బుద్ధ విగ్రహం  మంచు తెరల మధ్య తేలిపోతూ ఉంది.

                                                   *      *     *

Dr. Adinarayana Machavarapu

మాచవరపు ఆదినారాయణ, ప్రకాశం జిల్లా చవటపాలేనికి చెందినవాడు. సాధారణమైన కుటుంబం. తోడూ నీడగా పేదరికం. చచ్చీచెడీ చదువుకున్నాడు. స్వతహాగా ఆర్టి్స్టు. బొమ్మలు వేస్తాడు. ఆంధ్రా యూనివర్శిటీలో ఫైన్ ఆర్ట్స్ లెక్చరర్ గా జాయిన్ అయ్యాడు. అక్కడే ప్రొఫెసర్ గా ఎదిగాడు. చూస్తే యితనో మంచి రచయితనీ, భావుకుడనీ అనిపించదు. ఇండియా అంతా నడిచి తిరిగాడు. సొంత కాళ్లని మాత్రమే నమ్ముకున్న మనిషి. ‘భ్రమణ కాంక్ష’ అనే చిన్న పుస్తకం రాశాడు.  ప్రపంచ యాత్ర ప్లాన్ చేసిన ఆది ఆరు ఖండాల్లో 14 దేశాల్లో తిరిగాడు. ఈ సారి ‘భూ భ్రమణ కాంక్ష’ అని 385 పేజీల ట్రావెలాగ్ రాశాడు. మన చెయ్యి పట్టుకుని దేశ దేశాల్లో తిప్పి అక్కడి సంస్కృతి, కళలు, కవిత్వం, ప్రకృతి శోభనీ కళ్ల ముందు పరిచి చూపిస్తాడు. చాలా అందమైన భాష, చదివించే శైలి. వచన కవిత్వం లాంటి కొన్ని వాక్యాలతో మనల్ని కొండలపైని ఎత్తైన చెట్ల మీదికి తీసుకెళ్లి అక్కడి నుంచి విదేశీ వెన్నెల ఆకాశంలోకి విసిరేస్తాడు. ‘‘అమ్మా నాన్నలతో సమానమైన ఏనుగుల వీరాస్వామి కోసం’’ అంటూ యీ పుస్తకాన్ని ఆ మహా యాత్రికునికి అంకితం యిచ్చాడు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *