“అబ్బూరి చలివేందిర”లో శ్రీశ్రీ

జలియన్ వాలాబాగ్ దురంతాల గురించి బుర్రకథగా అబ్బూరి రాస్తే బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించిందని వినటం తప్ప, ముఖమైనా చూసిందెవరు ఇప్పటిదాకా? అదైనా 1919 తర్వాతి విషయమే. అప్పటికే అబ్బూరి వారబ్బా యికి పాతికేళ్లవయస్సు (జననం 1896).

            గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగి బందరులోని నోబుల్ కాలేజీలో చదువుకుంటూ వచ్చిన ఈ అబ్బాయి పదనాలుగేళ్ల ప్రాయాన్నే హైస్కూలు దశలో జలాంజలి రాశారట. కవి వున్నట్టుండి రాజకీయజీవి అయ్యారంటే, ‘మట్టిలో నుంచి మాణిక్యాలు’ తయారించే మహాశక్తి స్వాతంత్ర్యపోరాటరూపంలో గుండెల్ని తట్టి, ధీరులకే  యోగ్యమయిన సహాయనిరాకరణోద్యమంగా సందర్శనం యిచ్చింది. ఒక సంవత్సర కాలం 1921 – 22 రాజకీయ ఆకాశం వురమని పిడుగుల పిండుతో మెరవని సత్యాగ్రహులదండుతో క్రిక్కిరిసిపోయింది. సంవత్సరాలలో స్వరాజ్యం తెచ్చి వొలిచి చేతబెడుతానన్నాడు కొత్తగా ‘మహాత్మా’ గిరీ పొందిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ.         

            మన బాలకవి మచిలీ బందరు సువాసనలు వదుల్చుకుని రెండేండ్లకాలం (1917 – 19) చేపలకూర లేందే ముద్దదిగని బెంగాలు రాష్ట్రంలో రవీంద్రుడి శాంతినికేతనంలో వున్నాడు. అలునా తెలుగుదనం విరగలేదు గనక అప్పటికే ‘మల్లికాంబ’ రాసి, యిప్పుడిక్కడ ‘ఊహాగానం’ చేశారు. తిరిగివచ్చాక దుగ్గిరాల గోపాలకృష్ణయ్యను అనుసరించి నడుస్తూవుండగా రాసిందే మొట్టమొదట్లో చెప్పిన బుర్రకథ. ఆ తర్వాత వుద్యమ పరమైన కవితను జానపదభణితులలో మరెన్నడూ రాసినట్టు దాఖలాలు లేవు. భావకవిత్వరశ్మి సోకి తళతళమనిపిస్తూ తెలుగు కవిత్వకళకు కొత్త వింత అందచందాలు తెచ్చి పెడుతుండే, రాజకీయ ఉద్యమ కవిత్వమా ?

            అటుపిమ్మట మైసూర్లో వుంటూన్నప్పుడు ‘నదీసుందరి’ రచన గాక  మరెన్నో. సి.ఆర్. రెడ్డిసారధిగా ఆంధ్ర విశ్వకళాపరిషత్ స్థాపన జరిగాక  మొదట తెలుగు బోధిస్తూ, తర్వాత పుస్తకాల మరుగుకువెళ్లి, మూడు దశాబ్దాలు ఆ స్థానానికి తానూ తనకి ఆ స్థానం సృష్ట్యాదినుంచీ జగత్ప్రళయం దాకా కొన సాగేవే ననిపించారు. అయితే ఈలోపల ఎంత లోకకథ జరిగిపోయిందని !

            జలియన్ వాలాబాగును లక్నో కాంగ్రెసు సమావేశానికి చుట్టు చుట్టరికం వుందేమోగాని జలియన్ వాలాబాగ్ బుర్రకథకీ “అప్రాప్త మనోహరికి” గల అను బంధాన్ని ఊహాగానం చేసినా వూహించుకోవడం కష్టమే. బందరులో “మౌనముద్రాలంకార ” ముట్నూరివారి సాంగత్యంలో ఆ పత్రిక అమృతాంజనం కోరకుండా  “రసమంజరి” శీర్షికను చొప్పించి చవులూరింపజెయ్యడమేగాక, పేరు  మార్చుకుని  “సూర్యరాజు  కథలు” కూర్చారు. అక్షరాల కూర్పుతాలూకు పనితనం అబ్బూరికి ఎందరో దీటురారు. అందుకే “వైతాళికులు”లో ముద్దుకృష్ణ అబ్బూరికి కీట్సును పోలికకోసం తెచ్చాడు. సాంప్రదాయిక సాంస్కృతిక వాక్కు నోటికీ తలకూ పట్టికూడా “తిక్కన పలుకు తెలుగు పలుకులు” కలకండ పలు లన్నంత అబ్బూరి రాశారంటే, ఛందస్సులలో పోకిళ్లు పోయారంటే,అబ్బూరిది సంకీర్ణప్రకృతి అనుకోవాలి. కవిత్వం, కధలు మాత్రమేగాక, “కన్యా శుల్కం” నాటకాన్ని ఎడిట్ చెయ్యకముందే, “నటాలి” స్థాపించి, యాంటన్ చెహోవ్ “సంపెంగతోట” కూడా రంగానికెక్కేలా ప్రయోక్త అయ్యారు.

            నేను రాయబూనిన దానికి పూర్వరంగమే ఇదంతా. చర్వితచర్వణం కూడానేమో ! అయినా, కానిచ్చానుగా : విల్లువదలిన అంబుని వెనక్కి రప్పించడం ఏంపని : రామబాణం అది. ప్రస్తుత విషయానికి వస్తాను. అదీ గత విషయం కావడమే విశేషం.

            ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నాకాయనతో తొలి పరిచయం. శ్రీ శ్రీ గురువుగానే గౌరవం. ఒకటి రెండు దఫాలు లైబ్రరీలో ఒకే ఒక్కమారు ఇంటివద్దా కలిశాను. Auden and After పుస్తకం “బారో” చేసి చదివి వూళ్లోని మిత్రుల చేతికిస్తే అది రూపుచెడీ ఫొటోలు పోయీ తిరిగివచ్చాక, లైబ్రరీ వుద్యోగులు దాన్ని ఆవికృతరూపంలో ‘రిసీవ్’ చేసుకోక అబ్బూరి వారివద్దకి తీసుకెళ్లారు.— మొదట నా మీద ఫిర్యాదునూ, తర్వాత సాక్షాత్ నన్నూ. ప్రసన్నమైన ముఖం తెలిచిరునవ్వులు, కాసింతలోనే బొమమడితో నన్ను కొంచెం భయపెట్టాయి. ఆయన తరణోపాయం చెప్పారు: “ఇంగ్లాండుకి రాసి కొత్తకాపీ తెప్పిస్తాం ఆఖర్చు  నువ్వు ఇచ్చుకోవాలి. ఈ కాపీ నువ్వుంచుకోవచ్చు”. “ధన్యోహమ్” అనుకున్నాను. అంత యిష్టం  ఆ పుస్తకం నాకు. ఎందుకంటే “హంగ్రీ థర్టీస్” కవులంతా యీ పుస్తకం అట్టల్లోపలేవున్నారాయె! ఆదినాళ్ళలోనే యం. యన్. రామ్ తన భార్యతో వాల్తేరు వచ్చి యానివర్సిటీలో సభ పెట్టినప్పటిదాకా గూడా అబ్బూరి రాయిస్టు అని నాకు తెలీదు. అంతెత్తు మనిషి రాయ్. మేము వెంపలి చెట్లలా నేలకంటుకున్నట్లు కూర్చున్నాం. ఆకారపుష్టి “యింప్రెస్” చేసిందిగాని చాలా Slow Speaker-thoughtfull కావచ్చు దాన్ని చెరిపేసింది.

            ఆ తర్వాత యింక కొంతకాలానికి గాని అబ్బూరి రాజకీయ అభినివేశమేవిటో నాకు తెలిసిరాలేదు. అప్పటికే నాది కమ్యూస్టు అభినివేశం. అయినా, యీ వ్యక్తి ఎంత సాధు సుందరమూర్తిగా కనిపించేవారంటే, నా ఆవేశం నాలోనే అణిగి, ఆయన ముందు నేనూ సాధుజీవినౌతున్నానా అని నాకే ఆశ్చర్యం వేసేది. హైదరాబాదు మలక్ పేటలోననుకుంటాను, చెరబండరాజుతో కలిసి ఆయన యింటికి వెళ్లాను. అప్పటికి విప్లవ రచయితల సంఘం ప్రారంభం కావడమేకాదు, మావాళ్లు కొందరు జైళ్లలో వున్నారు. రెండో మహాసభ “వీరశైవ” హాస్టలులో జరగాల్సివుంది. దాన్ని పౌరహక్కుల వేదికగా మార్చాలనుకుని, రివిజనిస్టుల మీద భ్రష్టయోగి (మా దృష్టిలో) అయిన యీ మాజీ కమ్యూనిస్టు మేధావిని కూడా మావత్తాసికి రమ్మన్నాం. మరుమాట లేకుండా వొప్పుకున్నారు. ఆ ప్రసంగం లఘుప్రసంగమేగాని, రికార్డు చేసివుంటే తెలిసేది అబ్బూరి గుండె బిగువూ, భావ స్వాతంత్ర్య ప్రీతీ, డెబ్భైయెనిమిదోయేట (1972) కూడా ఆయన ఈ సాహసిక చిత్తవృత్తీ , ప్రభుత్వ పశుత్వంపట్ల నిర్భయమైన, నిజాయితీగల ధిక్కార ధోరణి. “చలివేందిర” నుంచి చిచ్చరపిడుగు: “ధిక్కార మహాశంఖం” “నినదభీషణ శంఖము దేవదత్తమే” అనిపించింది. ఇది కనువిప్పూ, చెవితుప్పు  వదలడమూ :

            అప్పటికే అబ్బూరిపట్ల నేను అపచారం చేసివున్నానని ఆయనకు తెలీదు, నేటిదాకా నాకాగితం దాటి అచ్చుకి ఎక్కలేదూ. సందర్భం యేమిటంటే –

            అబ్బూరి ఛాయాదేవిగారి సంపాదకత్వాన వెలువడిన ‘కవిత’ (1)లో  ఆయన తనశిష్యుణ్ణి మాగురువునీ – శ్రీశ్రీని – మెత్తగా మందలించి ‘భయద మహాప్రస్థానము” మాని, చరిత్ర రథాన్ని వెనక్కు మళ్ళించమనే ధోరణిలో —

పయనమైన పదినాళ్లకె

పదినాళ్ళకె దారితప్పి

పోయావా నానేస్తం

ఆ : ఏదీ నీహస్తం ?

పొరపాటి తిరుగుబాటు

తిరుగుబాట తిరిగి చాటు :

అని కోరడం మాకు ముఖ్యంగా ఆవేశజీవినైన నాకేనేమో ? – కటువనిపించింది. ఆయన అందమైన హేళన-

రష్యాగురుధూపంలో

రమణీయపు శివమెత్తిన

రణాచారి గణాచారి

రణగుణాల ధ్వనులు రేగ

రష్యా ఋష్యాశ్రమమున

రాగిల్లిన కావ్యధార

తెలుగుసీమ పొలిమేరల

నెలయేళ్ళయి నాళికలయి

చిరకాలం ప్రవహించే

జీవనదీ మహిమలేక

అంతో యింతో శైత్యం

అంతకు మించిన పైత్యం

ఆందించిన మాట నిజం

ఔను నిజం : ఔను నిజం :

            నాలోంచి గణాచారి తత్వాన్నే రాబట్టింది. తానెలాగూ చెడ్డారు. శ్రీ శ్రీ నీ అతని ధ్వజచ్ఛాయల్లో కలాలుపట్టిన మాతరాన్నంతటినీ యిలా  యెద్దేవా చేస్తున్నారేవిటనిపించింది. కోపం తెప్పించింది. ‘క్రొత్త తిక్కన’ శీర్షికతో అలాంటి నడక తోనే నేను జవాబుగా రాసింది నా  వద్దే పడివుందని చెప్పాగా ముందే :

అసంబద్ధ రూపకల్ప

నాసక్తుడుగా, స్వాప్నిక

సౌందర్యోపాసి – పిపాసిగా

సరళ సుందరుండనగా –

గణన కెక్కినాడీతడు

అంటూ ఫిరాయింపుదారుగా చూపి,

రాయిని పూజించి, మణిని

ఆవలద్రోసిన నేర్పరి

అన్నాక,

నేడు అబ్బురంగా, తా

నతినవీన యువకుండుగ

భ్రమపడి దానినె సత్యం

బటంచు లోకం ముందర –

రాయిగారి కొంగ్రొత్తది

నవమానవ వాద బోధ

నంది, కావ్యరూపంలో

నిలిపినాడు యీ ఘటికుడు.

అని వైరభక్తి చూపాను. వర్గ సంఘర్షణే అరిష్టదాయక మనడం, బకాన్నీ మత్స్యాన్నీ మిత్రులనడమే, వృకాన్నీ గోవత్సాన్నీ సహజీవుల్ని చెయ్యడమే —

శాంతి, వర్గసామరస్య

స్వర్లోకం, సుశ్లోకం –

అని సిద్ధాంతపరం నేనీనాటికీ నిబద్ధుణ్ణి గావున్న మార్క్సిజం దృష్ట్యా, కల్పిత మానవ ఆదర్శవ్యక్తి భావంతోగూడిన నవ్యమానవతా వాదాన్ని విమర్శించబూనాను. కుర్రవాణ్ణి పుద్రేకినీ, కాస్తదురుసుగానే పోనిచ్చాను బండి. అయితే అదిలోకం బండి – నా ఒక్కడిదేం కాదు. చెప్పొచ్చిందేమిటంటే, సిద్ధాంతం భేదించినా, అబ్బూరిని అగౌరవించగల అయోగ్యత – అయోగ్యతే – గానీ, కోరికగానీ నాకులేదు గనకనే, మా 1972 నాటి మహాసభకు ఆయనను స్వయంగా పిలిచి మాట్లాడించి, ఎంతో గౌరవంతో తిప్పిపంపడం జరిగింది. జలగం హయాములో, నిజానికి 1946-50 లలోనే ఆయన కవిత నాకు ఎంతో మెప్పు కలిగించింది – ముఖ్యంగా ‘తిక్కన సోమయాజి’. ‘కాపుపాట’ ‘అప్రాప్త మనోహరికి’, యింకా హెచ్చుగా ‘పృథివీప్రశంస’, ‘కృష్ణపక్షం’ చదువుకుంటూ, నాగదిలో వెక్కి వెక్కి రోదించే నవయవ్వన మది నాకు. శ్రీ శ్రీ నుంచి వుత్తేజ వుద్రేకాల జంటగుర్రాలు వస్తే వాటినెక్కి సవారీపోదా మనిపించేరోజులు ప్రపంచం వైపు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య చాటువులు మళ్ళీ అబ్బూరిలో చోటుచేసుకుని నిలిచాయినీ, అయితే ‘ఆంధ్రరత్న’లో కనిపించే ఖండనమండనాదులు అబ్బూరిలో లలితహాస్యస్పర్శతో కరకుమొరుకుదనాన్నే కోల్పోయాయనీ, అటుపిమ్మట చాలా కాలం దాకా తెలీదు. ఆయన బిడ్డలూ అంతే. సౌజన్యమూర్తులు, సరసోక్తిప్రియులు, రాజు పనిచేస్తూవచ్చిన హైస్కూలులో సహృదయులు, చెరబండ అబ్బూరి పుత్రిక హెడ్ మిస్ట్రెస్  – నాకు పరిచయం లేదుగాని, వరదతో కాస్త, గోపాలకృష్ణతో యింకాస్త వుండేవి. ఈ భరోసాతోనే శ్రీ శ్రీ గురించి అడిగి తెలుసుకుందామని ఆయన వద్దకు వెళ్ళాను 1965 లోనే రిటెరైనా టైరైపోకుండా టైర్ చెయ్యకుండా – బోర్ కొట్టే సమస్యే లేదు- ఎంతో ఆప్యాయంగా ఆత్మీయతతో పిలిచి కూచోమని కాఫీ పెట్టించి జోకులతో రంగరించి, శ్రీ శ్రీ కవిత్వం భావకవిత్వం తాలూకు కుబుసం పూడ్చుకున్న దశకు చెందిన అంశాలతోబాటు, మొత్తం దేశంలో అభ్యుదయ రచయితల వుద్యమ ప్రారంభ కాలాన్ని కళ్ళకుకట్టించారు, తననోటిమాటలతో, రికార్డుకైనా అవసరం గనక ఆ వివరాలిస్తా నీదిగువ. అలాగే శ్రీ శ్రీ నాతో తన ‘విప్లవ’ కవిత్వ ప్రారంభ కాలం గురించి చెప్పిన విషయాల్లో అబ్బూరికి సంబంధించినవీ కొన్ని వున్నాయిగనక  వాటిని వీటితో జోడించాలి.

అయితే ఒక్క చిన్న విష్కంభం:

            రైతురక్షణ సమితి, కూలి రక్షణ సమితి పేర్లతో తెలుగుదేశంలో గుంటూరు, తెనాలి, నెల్లూరు వగైరా స్థలాల్లో తొలి కమ్యూనిస్టులు అప్పటికే కదలబారారు. వీరికి పోటీగా నిడుబ్రోలులో “ఆచార్య” రంగా రైతాంగ విద్యాలయం నడిపి, “వాహిని” పత్రిక పెట్టి, రైతుకూలీల గురించి పద్యాలూ పాటలూ రాసేందుకు ప్రేరణ యిచ్చి “రైతు భజనావళి”ని 1934 నాటికే తెచ్చివున్నాడు. బందరు వద్ద గల ఎలమర్రునుంచి గద్దె లింగయ్య “ప్రభ” పేరిట “జాతీయ హాస్యరస పక్షపత్రిక పెట్టి, “ఆదర్శగ్రంథమండలి” పక్షాన పన్నెండు పుసకాలైనా తెచ్చివున్నాడు. ఇంకా లోగడ, మొదట నెల్లూరు కేంద్రంగా పుచ్చలపల్లి సుందరయ్య “కమ్యూనిస్టు కరపత్రం” పేరున కమ్యూనిస్టు మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది. కూలి సంఘాలు, సమ్మెలు…. యివి తమ కవుల్ని- పెండ్యాల లోకనాధం, శెట్టిపల్లి వెంకటరత్నం, గిరిరాజు రామారావు, చదలవాడ పిచ్చయ్య, తుమ్మల వెంకటరామయ్య, చివరికి కంభంపాటి సీనియర్ యింకా పెద్దిరెడ్డి తిమ్మా రెడ్డి వగైరా— ముందుకు తెచ్చివున్నాయి. ఇదంతా మేధావుల వ్యవహారం కాదు. ఇది ఉద్యమ ఫలితం. శ్రీశ్రీది గ్రంథపఠన ఫలితం. దానికి ప్రేరణ అబ్బూరిది. మరి అబ్బూరికి ప్రేరణ ? శ్రీ శ్రీది గానీ అబ్బూరిది గానీ జీవితం నుంచీ పోరాటం నుంచీ వచ్చిన ప్రేరణకాదు గనక “సెకండరీ” మీద పేర్కొన్న “అనామధేయ” కవులది “ప్రైమరీ” – నేరుగా జీవితంనుంచీ పోరాటం నుంచీ వచ్చింది. కాకుంటే ఇవి రెండూ ఒకానొక “పాయింటు” వద్ద తారసపడ్డాయి. “సృజన” (నెం 14, 1970 ఫిబ్రవరి) ‘శ్రీ శ్రీ సాహిత్య సమాలోచన సంచిక”లో, నవీన్, శ్రీపతి, వర వరరావుల ఇంటర్వ్యూ క్రమంలో శ్రీ శ్రీ ప్రకటించిన అభిప్రాయాలు చూద్దాం.

1. “మహాప్రస్థానం” గీతం రాసేనాటికి (12-4-1984 నాకు Marxism  తెలియనే తెలియదు. నేను Marxism ను తెలుసుకున్నది సాహిత్యం ద్వారానే గాని రాజకీయాల ద్వారాకాదు ( అయితే తన తొలి విప్లవకవిత “జయభేరి” అని శ్రీ శ్రీ అనివున్నాడు. అది 2-6-33న రాసినట్లుంది. అనుమానమేగనక గుర్తుంది.)

2. “మొదట్లో నన్ను ట్రాట్స్కీ బాగా ఇన్ఫ్లూయిన్స్ చేశాడు. తర్వాత అబ్బూరి రామకృష్ణా (Sic) రావు London Progressive  Writers ప్రచురించిన వాళ్ళ Manifesto ని చదవమని యిచ్చాడు. ఈ Manifesto నన్ను Marxist line లో పడవేసింది”.

            ” కవి వయస్సు  ఎప్పుడూ ముప్ఫై ఏళ్ళే” అనే ఇంకా పెద్ద యింటర్వ్యూని బటి “మరో ప్రపంచం” రచన నాటికి తనకింకా “రష్యా విప్లవం గురించి కూడ తెలీదు” ఫ్రెంచి సింబాలిస్టులు, సిసిల్ డెలిస్ (Sic) (Cecil Day Lewis) కొంచం ముందుకి పోయి చూశానుగాని “కవిత్వం ద్వారా నేను మరో ప్రపంచం చూశాను. అదే సామ్యవాద ప్రపంచం అని అప్పటికి నాకు తెలియదు. ఒక విధమైన సాంఘిక న్యాయం లభించాలని అన్యాయం, అధర్మం పోవాలని ఈనాడు మరికొంచెం ఎక్కువ రూపం తీసుకొని రష్యా, చైనా, క్యూబా దేశాల్లో కనిపిస్తున్నది, నేను భావించిన మరో ప్రపంచం”. లండన్ ప్రోగ్రెసివ్ రైటర్స్ మేని ఫెస్టో అప్పటి వర్ధమాన రచయితల సంఘం అబ్బూరి రామకృష్ణరావు గారు  చూశారు. అది చూసిన తర్వాత “పొలాలనన్నీ హలాల దున్నీ” గేయం రాశాను. ఆ మేనిఫెస్టో అలా దించేశావే అని అబ్బూరి రామకృష్ణరావుగారన్నారు …..ప్రగతిశీల సాహిత్య సంఘం అన్న పేరుతో హిందీలో వస్తున్న ఉద్యమ  ప్రభావంతో అభ్యుదయ రచయితలుగా మారారు”.

            శ్రీ శ్రీ జ్ఞాపకశక్తి యిప్పటికీ(1980) గట్టిదేగాని, అతనిదీ “సెకండ్ హేండ్ యిన్ఫర్ మేషన్” గనక నేరుగా అబ్బూరి వద్దకే పోవాలి — తప్పదు. లేకుంటే, శ్రీశ్రీ బెర్టోల్ఫ్ బ్రేహ్త్ పద్యాన్ని అనుకరించి “మహా ప్రస్థానం” రాశాడనో మరొకటనో అనుకోవలసి వస్తుంది. అనేక తరుమూలాల నుంచి వచ్చే జీవధారను శ్రీ శ్రీ తన కవితల్లోకి మలిపాడనుకుంటే ఏ చిక్కూ వుండదు. అంతమాత్రాన ఎవ్వడూ “కాపీయిస్టు” కాడు.

            1965లో నేను అబ్బూరిని హైదరాబాదులో శ్రీ శ్రీ భోగట్టా విషయమై కలిసి మాట్లాడానన్నానుగదా ముందే, ఆయన చెప్పిన సంగతి సందర్భాల సారమేమంటే-

            ఆంధ్రా యూనివర్సిటీలో హిస్టరీ శాఖలో పనిచేస్తూండిన హిరేన్ ముఖర్జీ (లండన్ ప్రోగ్రెసివ్ రైటర్స్ బృందానికి చెందిన మనిషి)తో కలిసి అబ్బూరి లక్నో కాంగ్రెసుకు వెళ్లారు, 1986లో. తాను అప్పటికే కమ్యూనిస్టుగాని హిరేన్ పార్టీలో లేడింకా. లక్నోలో ఆర్. కె. కపూర్ వగైరా వామపక్ష మేధావులు కలిసి మాట్లాడుకున్నారు. అక్కడే తనకు సజ్జాద్ జహీర్ (లండన్ ప్రోగ్రెసివ్ రైటర్స్ బృందం ముఖ్యుడు)తో తొలిపరిచయం ఏర్పడింది. విశాఖపట్నానికి తిరిగివచ్చి “వర్థమాన రచయితల సంఘం” స్థాపించేప్పుడు Manifesto తయారీలో శ్రీ శ్రీ హస్తం కూడా పడింది. మరో యింటర్వ్యూ సారాంశం…

            ఫ్రెంచి కవుల కవితా గ్రంథాలు గురించి చదివి (వాల్తేరులో) చాలా కొద్ది కాలంలోనే తన ప్రజ్ఞ వయస్సుకి మించిన ప్రజ్ఞ ప్రదర్శించ గలిగాడు శ్రీశ్రీ. సాహిత్యానికి తప్పనిసరిగా సామాజిక ప్రయోజనం వుండాలని గ్రహించారు. (ఒక యింటర్వ్యూలో తాను దీన్ని అబ్బూరి నుంచి గ్రహించానని చెప్పాడు కూడా) స్వవిషయం చెప్పిందేమిటంటే-

            బుఖారిన్ రచన “హిస్టారికల్ మెటీరియలిజం” చదివారు. లెనిన్ రచనల నుంచి కొన్ని భాగాలను (Passages) అనువదించసాగారు. ఒక పార్టీనే నెల కొల్పాలనుకొని బొంబాయిలో కోటంరాజు రామారావు (గొప్ప జర్నలిస్టు) ద్వారా డాంగేని, జోగ్లేకర్  ని కలిశారు. ఈ పాటికే ఆంధ్రప్రాంతంలో పార్టీవుందని, కొత్తది అనవసరమని, జోగ్లేకర్ చెప్పాక (తొలిరోజుల్లో పార్టీ రహస్యంగా వుండేది గదా 🙂 సుందరయ్యను కలవడం జరిగింది. తద్వారా ఒక పార్టిసెల్ లో  సభ్యుడు కాగలిగారు. విశాఖపట్నంలో “డాక్ వర్కర్స్ యూనియన్” కార్యకలాపాలతో తలదూర్చారు. కొన్ని కరపత్రాలూ రాశారు.

            లక్నో కాంగ్రెసు (నెహ్రూ అధ్యక్షుడు. తన ప్రసంగంలో వాచ్యంగా సోషలిజం ప్రస్తావన గట్టిగా తెచ్చాడప్పుడు). సభాప్రాంగణంలోనే ప్రగతిశీల రచయితల సంఘస్థాపన మున్షీ ప్రేమ్ చంద్  అధ్యక్షతన జరిగేముందు, వజీర్ హుసేన్ యింట్లో వామపక్ష రచయితలు విడిగా కలిశారు. రఘువంశ కిశోర్ కపూర్ ఆర్. కె. కపూర్ (అప్పట్లో ఆంధ్రా యూనివర్సిటీ ఇంగ్లీషు శాఖలో అసిస్టెంటు లెక్చరరు). హిరేన్ ముఖర్జీ, సోమంచి యజ్ఞన్న శాస్త్రి (S. M. Y. Sastry) అప్పుడు విద్యార్థి, తాను ఆ బృందంలో వున్నారు. ప్రేమ్  చంద్ హిందీలో చేసిన అధ్యక్షోపన్యాసానికి భాషా విషయమైన అభ్యంతరం తెలిపారు.

            జనాబ్ మొహమ్మద్ ఖాసిమ్ ఖాన్ (తర్వాతి రోజుల్లో శ్రీ శ్రీ నిరుద్యోగిగా బాధ పడుతున్నప్పుడు హైదరాబాదుకి పిలిపించి ‘లా’ డిపార్ట్ మెంట్ “రిఫార్మ్స్” నెక్షన్లో నౌకరీ యిప్పించి తాత్కాలిక జీవనాధారం చూపాడు.-  కె. వి. ఆర్.) కృష్ణశాస్త్రి కేమి, శ్రీ శ్రీ కేమి, ఆనాటి కవుల్లో ఆనేకులకేమి సంధానకర్తగా వుండిన ఉల్లి తిరుపతి (అరవిందుని శిష్యుడు)- వీళ్లతో శ్రీశ్రీ కి సాంగత్యం. “హల్లో తిరుపతీ ఉల్లి తిరుపతి” అని గేయం కూడా రాశాడట, శ్రీ శ్రీ. అప్పటికే శ్రీశ్రీకి మద్య పానం అలవాటుండేది.

            బెనారసులో మెడిసిన్ చదువుతూ చదువుతూ విశాఖపట్నానికి వచ్చేసిన  చండ్ర రాజేశ్వరరావును దగ్గరకు తీసి కమ్యూనిస్టుగా తీర్చిదిద్దింది కొంతవరకైనా తానే (బెనారసులోని ఆంధ్ర విద్యార్థులనేకుల మీద ఆర్. ఆర్. భరద్వాజ ప్రభావం వుండేది. కే. వి. ఆర్. 1937) దాకా కమ్యూనిస్టు వుద్యమ పరిధిలో వుండి పోయి, ఆ సంవత్సరం యం.యన్. రాయ్ ఆంధ్రప్రదేశ సంచార సందర్భంగా రాయిస్టు ప్రభావానికి లోనయ్యారు. (నెల్లూర్లో యువజనసంఘ కార్యకర్తలలో ముఖ్యులైన చుండి జగన్నాధం కూడా అలా రాయిస్టు అయిన వారే -కె. వి. ఆర్.) కాబట్టి కమ్యూనిస్టు వుద్యమంలోనూ, ముఖ్యంగా 1943లో తెనాలిలో జరిగిన అభ్యుదయ రచయితల సంఘ ప్రధమ సమావేశంలోనూ అబ్బూరి వారి పేరు “నస్మరంతి ” కావడం ఆశ్చర్యకరమేమీ కాదు. రాయిస్టులంటే కమ్యూనిస్టులు విరుచుకుపడేవారు. మీదను పేర్కొన్న “రష్యాగురు రూపం,” “రష్యా రుష్యాశ్రమం” వంటి మాటలు సూచించే స్టాలిన్ వ్యతిరేకత, అప్పటి సి. పి. ఐ. కార్యదర్శి జోషీ విధానాల గురించి యీసడింపు, మార్క్సిజాన్ని మానవీయత విషయంలో తలదన్ని పోగలదని తామనుకోసాగిన నవ్య మానవతావాదం_ యిలాంటివి శ్రీ శ్రీ కి అబ్బూరికి విరోధకారణాలు కాలేదు. ఎందుచేతనంటే, క్రోపాట్కిన్, బకూనిన్, ట్రాట్స్కీ, బుఖారిన్ వంటివాళ్ళనీ లెనిన్ – స్టాలిన్ నీ ముడివెయ్య గలిగిన సిద్ధాంత అపరిపక్వత లేదా భావాల అనిర్ద్వంద్వత, ఆస్పష్టత, శ్రీ శ్రీని ‘కమిటెడ్’ మార్క్సిస్టుగా మార్చలేదు. ఇంకా ‘వామపక్షసమైక్యత’ గురించి తనకు భ్రమలున్నాయంటేనే, శ్రీశ్రీకి స్పష్టమైన రాజకీయ అవగాహనలేదని తెలుసుకోవచ్చుగదా అందుకని అబ్బూరీ శ్రీ శ్రీ ఛలోక్తులాడుకునేవారు. పైగా, అబ్బూరి వరద (రాజేశ్వరరావు) శ్రీ శ్రీ కంటే చిన్న  వాడైనా చెలికాడే. ‘అభ్యుదయ’ కవుల్ని కూడా ఎద్దేవా చేస్తూ శ్రీ శ్రీ ఒక పద్యం చెప్పారు:

అభ్యుదయకవుల కొక్క డు

రభ్యాసము గలదటందు రది యెట్లన్నన్

సభ్యత చెడ స్టాలిన్ జో

షీభ్యామ్ నమో | యటండ్రు సిరిసిరిమువ్వా!

 ఈ పద్యం చదివితే ‘అభ్యుదయ’ కవులూ వారి రాజకీయ నేతలూ వూరు కుంటారా ? అందుచేత, ఒకవేపు హేళనచేస్తూనే వీర అభ్యుదయ కమ్యూనిస్టుల బెడద తప్పించుకునేందుకు వెనువెంటనే-

‘అని కొందరు దుర్మార్గులు

……………………………….       

అంటూ తెలివిగా (క్లెవర్ ) Mischievousగా తప్పించుకోవాలనుకున్నది శ్రీ శ్రీయా ? అతని ‘సిరిసిరి మువ్వా’ శతకంలో యీ పద్యాలు లేవు. చాటువు గానే చాటుగా వుండిపోయిందో సిరిసిరి మువ్వా పద్యాలకు అబ్బూరిని Intro రాయమని కోరితే,

అతివాస్తవికాగ్రేసరు

లతులిత శబ్ద ప్రయోజనాతీతులు పం

డితబీరులు అగు కొందరు

మతిచెడి విహరించుచుంద్రు మహిలో శ్రీ శ్రీ !

అని రాశానన్నారు నాతో. అచ్చులో వుందేమో, మొదటి ముద్రణ ప్రతిలో చూడాలి(ఇప్పుడది నా వద్దలేదు- కె. వి. ఆర్).

            ఇంకోమాటకూడా చెప్పారు నాకు అబ్బూరి. శ్రీ శ్రీ అభిమాని, వాణీ కుమార్ యం. యన్. రాయ్ కి  ‘మరోప్రపంచం’ గేయం చదివి వినిపించినప్పుడు, ఆయన ‘మారో ప్రపంచం’ అనేవారట. (సరిగ్గా, శిష్ట్లా ‘మారో’ శబ్దమే శ్రీ శ్రీ శబ్ద యింద్రజాలంలో ‘మరో’ గా రూపొందింది -కె. వి. ఆర్.)

గనక  శ్రీశ్రీ తాను కలిసి పునరపి అనువదించాలని నిర్ణయం. అనువాదం కాదు -అనుసరణే.  తనకు తీరుబాటులేక ఆ భారం శ్రీ శ్రీ మీద మోపారు. అయితే రెండం మాత్రమే పూర్తి అయ్యాక “నటాలి’ తో సంబంధం తెగి, శ్రీ శ్రీ మిలిట్రికి వెళ్లిపోయాడు. వరద పూర్తి చేసినా నారాయణబాబు పేరు జోడించాలనుకున్నారట గానీ శ్రీ శ్రీ వరదల పేరుతో పుస్తకం అచ్చయ్యాక, నారాయణబాబు అనువాదం తెనాలి ‘జ్యోతి’ లో వచ్చింది.

            నటాలి ప్రదర్శనలకు సంబంధించి అబ్బూరి ఒక ముచ్చట చెప్పారు.  మద్రాసు క్వీన్ మేరీస్ లో ‘కన్యాశుల్కం’ ప్రదర్శిస్తున్నారు. స్టేజి సామగ్రి బాధ్యత శ్రీ శ్రీది. నటులు వేషాలు వేసుకుంటున్నారు. ఇంతలో చేతులూపుకుంటూ ‘గ్రీన్ రూము’ లోకి శ్రీ శ్రీ ప్రవేశం. ‘మాష్టారూ, చేతికర్రా కత్తిపీటా దొరికాయి కావండీ !’ ఇదీ ఆయన నిర్వాకం. ఎలా ప్రదర్శించారో ఏమో చివరికి :

            ‘సంపెంగతోట’ వివాదం ముళ్లపొదలా పతిక్రల్లో అల్లుకుంది. నారాయణ బాబేమో ‘తమ్ముడూ!’ అని సంబోధిస్తూ, అబ్బూరివారికి తన అనువాద ఫక్కీ ఎందుకు సరిపడలేదో ఏ మార్పులు చేశారో ‘నవోదయ’ (1948 జనవరి) పత్రికలో రచ్చకెక్కారు. గ్రంథచౌర్యాన్నీ ఆపాదించారు. 1947 లోనే తెనాలి ‘ప్రజా సాహిత్య పరిషత్తు’ ప్రచురణగా శ్రీ శ్రీ అనుసరణ వెలువడింది. దరిమిలా శ్రీ శ్రీ ‘నవోదయ’లో ‘సంపెంగతోట’ శీర్షికతో జాబూ, దానికి నారాయణబాబు జవాబూ, చివరికి ‘అంపైర్’గా అబ్బూరివారి తుదితీర్పూ (నవోదయ’ 1949 ఫిబ్రవరి 8 వెలువడ్డాయి. సమదృష్టి చూపెడుతూనే, ఆయన శ్రీ శ్రీ రచనలను తాము ‘సాహిత్యదృష్టిలో’ ఎక్కువ అభిమానిస్తామన్నారు. తానూ శ్రీ శ్రీ కవితాభావ పరిణతికీ, ఉన్మీలనానికీ ఎలా కొంతైనా దోహదం చేసిందీ ప్రస్తావించారు. ‘నేటి కాలపు వాఙ్మయంలో మీకృతులు ఉత్తమోత్తమశ్రేణికి చెందినవని నా అభిప్రాయం’. అయితే ‘వారం వారం’ శీరికలో శ్రీ శ్రీ రాసింది ‘కొంత దూకుడుగా’ వుండటం వల్ల నారాయణబాబుగారికి కోపం వచ్చిందనుకుంటున్నానన్నారు. గ్రంథచౌర్యం మాట మాత్రం చాలా అసంబద్ధం అంటూ, రంగప్రయోగానికి తగిన పద్ధతిలో అనువదించాలని, ‘నటాలి’ వేసుకున్న పథకం నలుగురూ కలిసి పూర్తిచెయ్యదలచింది గనక, చౌర్యానికి వీలెలావుంటుందని ప్రశ్నించారు. తమలో తాము చర్చించుకున్నాకనే నారాయణబాబు అనువాదం ప్రారంభమయిందిగాని, అవి ఆయన స్వకపోల కల్పితాలేమీ కావన్నారు. పైగా ఆయన చాలావేగంగా రాయడం వల్ల, సంభాషణలు బిగువుగా లేనందువల్ల, ఆయన అనువాదం తనకు నచ్చని మాట నిజమే అయినా, ‘అంతమాత్రాన వారి గౌరవానికి గాని, వారి రచనా ప్రాశస్త్యానికిగాని యేమీ లోటు రాబోదు’ అని తమ మంచితనం ప్రకటించు కున్నారు. రెండు మూడు రోజులు ప్రయత్నించి నారాయణబాబు అనువాదాన్ని మార్చలేక శ్రీ శ్రీ ని స్వయంగా అనువదించమన్నానని గుర్తుచేశారు. ‘మనమందరమూ తల పెట్టిన నాటకాలేవీ కొనసాగకపోగా తుదకి వీధినాటకంలోకి దిగ వలసి వచ్చింది కదా అని విచారిస్తున్నాను’ అనడంలో హాస్యంతోకూడిన బాధను ఎంత లలితంగా ప్రకటించగలిగారో చూడవచ్చు. శ్రీ శ్రీ కి ‘జెలసీ’ అనీ, మరొక సాటి కవిని ఎక్కిరానివ్వడనీ నారాయణబాబు అభిమానులు గుసగుసలనుంచి గలాభాదాకా అంటూనే వస్తున్నారు. అది పరీక్ష లోగాని తేలదు. అబ్బూరి  విషయం పానకం- యీ వివాదం పుడ కే.

            మొత్తానికి రాజకీయాలేమైనా, మరొకదేమైనా, శ్రీ శ్రీ కి అబ్బూరి ‘చలి వేందిర’ కావడం ఆశ్చర్యకరం కానేకాదు. ఇద్దరూ మధ్య తరగతి రేడికల్ బుద్ది జీవులు. వారిదారులు చీలాయి. శ్రీ శ్రీ మాస్కోకి వెళ్ళముందే విస్కీ సేవిస్తూ ‘శ్రీస్కీ’ అనిపించుకోవాలని గుక్కిళ్లు మింగుతూనే, రెండో ప్రపంచ యుద్ధకాలంలో సోవియట్ వీరోచిత ప్రతిఘటకు అద్భుతమైన కవితాబింబం కల్పించాడు. అబ్బూరి నవ్యమానవతావాదం ఆకాశ వుద్యావనంగా మారి, తాను సరసుడు గనక రష్యా వ్యతిరేకతని సైతం గుడ్డిగా పెంచుకోకుండా, ఎక్కువగా మౌన ముద్రాలంకారుడు’ అయ్యాడు. సాంప్రదాయకతను నవ్యతలో, నవ్యతను మహా చారిత్రకోద్యమాలతో అనుసంధానించడంలో కొంతమేరకు కొద్దికాలం ప్రయత్నించి తర్వాత కవితా వైరాగ్యమే పొందారు. ముళ్ళపూడి వెంకటరమణగారిని సంబోధిస్తూ చెప్పసాగిన చాటువుల్ని తప్పిస్తే “వాణి” కోసం చరమ దశలోనూ ఆక్రోశించారు గాని, మళ్ళీ పూర్ణకవితా సాక్షాత్కారం పొందలేదు. ఒకరికి ఒకే ఒక యవ్వనం. అబ్బూరిది అలాంటిది. శ్రీ శ్రీ ది నిత్యయవ్వనం.

 *   *  * 

కె. వి. రమణారెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *