మంచిరోజులొచ్చాయి సినిమా జెమినీ వారు తీశారు. వీరమాచినేని మధుసూదనరావుగారు దర్శకుడు.
ఆయన కమ్యునిస్టు …
ఈ సినిమాకు మాటల రచయిత బొల్లిముంత శివరామకృష్ణ.
కథ తమిళ కథకుడు దర్శకుడు మాలియం రాజగోపాల్ ది.
ఈ సినిమా మాతృక తమిళ సినిమా సవాలే సమాలి కి ఆయనే దర్శకుడు. శివాజీ , జయలలిత చేసిన పాత్రలను తెలుగులో నాగేశ్వరరావూ కాంచన అభినయించారు.
టూకీగా కథేంటంటే …
అనగనగా ఓ ఊరు, ఆ ఊళ్లో ఓ మోతుబరి జమీందారు, అతనికో పెద్ద పాలేరు, ఆ పాలేరుకు ఓ విప్లవకొడుకు.
తండ్రి “హాయిగా దొరల కాళ్లు పిసుకుతూ బతకకుండా వాళ్లకి ఎదురుతిరిగితే బతికేదెట్టారా “ అనే బాపతు.
కనుక ఆ పాత్రను గుమ్మడికి కట్టబెట్టారు మధుసూదనరావు.
ఇక అటేపు ఆ జమీందారుగారికి కూడా ఈ పాలేరు గుమ్మడికి ఉన్నట్టుగానే ఒక కొడుకు ఒక కూతురు ఉంటారు.
కొడుకు పాలేరు కొడుకులా కాకుండా … జమీందారు కన్నా రెండాకులు ఎక్కువ తిన్న దుర్మార్గుడు.
సాంప్రదాయం కాపాడుకోవాలి అనే స్పృహ అగ్ర కులాల్లో సారీ అగ్ర వర్గాల్లో ఎంత బలంగా ఉంటుందో ఇలాంటి సిన్మాలు చూస్తే గానీ తెలియదు.
ఇహ
కూతురుకి ఓబీ పాజిటివ్ అనే వ్యాధి ముదిరిపోయి ఉంటుంది.ఓబీ పాజిటివ్ అంటే ఒళ్లుబలుపు పాజిటివ్ గా అర్ధం చేసుకో ప్రార్ధన. ఈ పొగరుపట్టిన జమీందారీ అందమైన పట్నం అమ్మాయిని పల్లెటూరి హీరో అయిన పాలేరు కొడుకు అల్లరి పెట్టడం , బురదలో పడేయడం … మీద బురదేయడం లాంటి జులాయి పన్లన్నీ విప్లవం పేరుతో చేసేస్తూంటాడు.
ఆడియన్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు.సిన్మా సక్సస్సులో ఆ అమ్మాయిని హీరో వేధించే సన్నివేశాలు కీలకం అని కూడా నా భావన.
మళ్లీ కథలో పడితే –
ఊరి వ్యవహారాల్లో జమీందారు దోపిడీ దౌర్జన్యాలకు హీరో అడ్డం పడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే మొన్నటి రంగస్థలంలో ఆది పినిశెట్టిలాగా ప్రెసిడెంట్ ఎన్నికల్లో జమీందారుకు వ్యతిరేకంగా నామినేషను వేస్తాడు. రంగస్థలంలో కన్నేమో కరణానికి కొట్టేస్తానే … ముద్దేమో మునసబుకు పెట్టేస్తానే అని జిగేలురాణి అనడం తప్ప కరణం , మునసబులు కన్సించరు.
అంతా పెసిడెంటుగోరే…
అయితే ఈ సినిమాలో కరణం నాగభూషణం ఉంటాడు. అతనికి మనసులో పెసిడెంటుకు బుద్ది చెప్పాలనే కోరిక ఉంటుంది.అందుకని ఎప్పుడూ ఏకగ్రీవం అయ్యే పెసిడెంటు పదవికి పోటీనా … అంటూ సిట్యుయేషన్ను బాగా రెచ్చగొట్టేస్తాడు. ఈ ఎన్నికల్లో నువ్వోడిపోతే ఊరొదిలి పోతానని రాసివ్వాలని హీరోని డిమాండు చేస్తాడు కరణం.
మరి ఆయన ఓడిపోతే ఏం చేస్తాడో చెప్పాలని హీరోగారు గొడవకు దిగుతాడు. ఒకేళ నువ్వే గెలిస్తే … ఆయన తన కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తాడని తీర్మానించేస్తాడు కరణం. జమీందారు ఒద్దురా కరణమా అన్నా వినడు.తీరా ఎన్నికల్లో పాలేరు గెలుస్తాడు.
దీంతో ఈ ఓబీ పాజిటివ్ అమ్మాయిని తెచ్చి పాలేరు హీరోతో పెళ్లి చేస్తారు.నా ఇష్టానికి వ్యతిరేకంగా జరిగే ఈ పెళ్లికి నేనొప్పుకోనని ఆ జడ్డమ్మాయి అక్కడకీ అరచిచెప్తుంది. కానీ సాధ్వి అయిన ఆమె తల్లి జమీందారుగారి భార్య ఆ మాట తప్పంటుంది.
తన మాంగళ్యాన్ని కాపాడడానికి కూతుర్ని పాలేరును చేసుకోమంటుంది. ఆ సందర్భంగా మాంగళ్యం మహత్యం గురించి ఓ చిన్న క్లాసు కూడా పీకుతుంది. హీరోగారు జమీందారుతో చెప్పే విప్లవడైలాగుల్ని ఎంత గొప్పగా రాశారో ఈ పతివ్రతా డైలాగుల్నీ అంతకన్నా ఎక్కువగానే రాశారు అభ్యుదయ రచయిత బొల్లిముంత. ఇక హీరోగారి పేదింట్లో … పెద్దింటమ్మాయి కష్టాలు చూపిత్తారు. అవి చూసి మన కుర్రోళ్లకు బోల్డు సంతోషం.
… అంత అందమైన కాంచన లాంటి అమ్మాయే తాళి కట్టేస్తే … ఎట్టా కుక్కిన పేనులా పడుందో చూశారా … హాహాహా అన్న ఫీలింగు కలుగుతుంది.
మనం కూడా ఇట్టాగే చేయాలి అనే మోటివేషన్ కూడా పొందేస్తారు ఉచితంగా . సారీ అదే టిక్కెట్టుపై.
అంటే ఏమిటంటే –
సినిమా తొలి భాగంలో జమీందారు మీద హీరో తిరగబడితే … రెండో భాగంలో భార్య పాలిట వాడే జమీందారు అవుతాడు.
అదీ కిటుకు.
ఆ మొగుడి జమీందారీ తనం మీద భార్య తిరబడ్డ ప్రతిసారీ అది దుర్మార్గమనీ తప్పనీ కూడా చెప్తారు.
ఆడవారికి ఉపనయన సంస్కారం లేనట్టే … విప్లవాలు చేసే అధికారం కూడా లేదని దట్టూ పెళ్లాలకు అస్సలు లేదని చాలా స్పష్టంగా చెప్పేస్తాడు హీరో.
పైగా అణగి ఉండడం నేర్చుకోమంటాడు.
ఆ అమ్మాయి కోపంతో సరే నా అమ్మా నాన్నల కోసం నిన్ను పెళ్లాడానుగానీ అండీ మొగుడుగారూ
నన్ను ముట్టుకుంటే నాకు నేను అగ్గెట్టేసుకుంటాను అని బెదిరిస్తుంది.
నేలతో నీడ అన్నది నను తాకరాదని
భర్తతో భార్య అన్నది నను తాకరాదని
అని తమిళంలో కన్నదాసను తెలుగులో దేవులపల్లి దాశరథి బావురుమంటారు హీరో తరపున.
అంటరానితనము ప్రస్తావన కూడా తెచ్చేస్తారు ఈ పాటలో…
ఈ పాట విషయంలో ఓ మాట చెప్పాలి.
నేలతో నీడ అన్నది నను తాకరాదనీ
పగటితో రేయి అన్నది నను తాకరాదనీ
నీరు తన్ను తాకరాదని గడ్డిపరక అన్నది
నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది ||| నేలతో |||
చరణం 1 :
వేలి కొసలు తాకనిదే వీణ పాట పాడేనా
చల్లగాలి తాకనిదే నల్లమబ్బు కురిసేనా
తల్లితండ్రి ఒకరి నొకరు తాకనిదే
నీవు లేవూ, నేను లేనూ, లోకమే లేదులే ||| నేలతో |||
చరణం 2 :
రవికిరణం తాకనిదే నవ కమలం విరిసేనా
మధుపం తను తాకనిదే మందారం మురిసేనా
మేను మేను తాకనిదే మనసు మనసు కలవనిదే
మమత లేదూ, మనిషి లేడూ, మనుగడయే లేదులే ||| నేలతో |||
వరకూ దేవులపల్లి రాశారు.
కీలకమైన ఈ మూడో చరణం వీఎంఆర్ అనబడే వీరమాచినేని మధుసూదనరావుగారూ … తన విశాలాంధ్ర సహచరుడు దాశరథితో రాయించుకున్నారు.
చరణం 3 :
అంటరానితనము – ఒంటరితనము
అనాదిగా మీ జాతికి అదే మూలధనము
ఇక సమభావం, సమధర్మం సహజీవన మనివార్యం
తెలుసుకొనుట మీ ధర్మం, తెలియకుంటె మీ కర్మం ||| నేలతో |||
ఈ చరణం వింటే అంబేద్కర్ చాలడు మార్క్స్ మాత్రమే అని రంగనాయకమ్మగారి రచనన్నూ… కులం ఉపరితలాంశం అన్న ఒకప్పటి వాదనా గుర్తురావూ…
ఇక్కడ రాసింది ఆ అమ్మాయి గురించియే అయినప్పటికిన్నీ….
మహిళలు దళితులు అన్నారు కదండి అందుకని నాకు అలా అనిపించింది.
సరే ఎలాను ఇక్కడదాకా వచ్చేశాం కనుక ….
ఇక్కడే ఇంకో విషయం చెప్పాలి.
ఈ సిన్మాలోగానీ రంగస్థలంలోగానీ హీరో దళితుడు అన్నట్టుగా చిత్రణ ఉంటుందిగానీ క్లారిటీ ఉండదు.
ఈ మధుసూదనరావు సిన్మాలో అయితే జమిందారు పెద్ద కమ్మోరైతే మన హీరో చిన్న కమ్మ అన్నట్టుగా చూపించి-
కుల దృక్పధం తప్పు అనిన్నీ
వర్గ దృక్పధమ్మే మన కమ్యూనిస్టులకి శిరోధార్యమానిన్ని..
కూడా చెప్పేస్తారు .. మన
విరమాచినేని బొల్లిముంతలు.
ఇక మధుసూదనరావు సినిమాల్లో అధికంగా ఆత్మ సన్నివేశాలు ఉంటాయి.
అంటే ఒక పాత్ర ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు అంతరాత్మ ప్రబోదం చేయించడం ఈ పద్దతి.
అద్దంలో కనిపించి బోధ చేస్తూంటాయి ఈ అంతరాత్మలు. అలా మొగుడికి లొంగి ఉండద్దనీ … ఒక అంతరాత్మ ఎల్లార్ ఈశ్వరి వాయిస్ లో తెంపరిగా చెబితే…
లొంగి ఉండమనీ సుశీల గొంతులో మరో అంతరాత్మ ఉపదేశిస్తుంది …
ఆడవారి గురించి కమ్యూనిస్టులు కూడా ఎంత సనాతనంగా ఆలోచిస్తారో తెలియాలి అంటే నేడే చూడండి అన్నట్టు ఉంటుంది ఆ పాట సాహిత్యం.
ఇంత బ్రెయిన్ వాష్ జరిగాక …
ఫైనల్ గా తన భర్తను కాపాడుకోడానికి తండ్రి అన్నల మీదకే దండెత్తుతుంది ఆ అమ్మాయి.
అలా పాతివ్రత్య నిరూపణ చేసుకుని ఆవిడా , జమీందారు మీద విప్లవం చేసి హీరోగారూ కూడా ధన్యులమయ్యామని మురిసిపోతుండగా శుభం వేస్తాడు.
హీరో పాత్రలో తిరుగుబాటు …
హీరోయిన్ పాత్రలో లొంగుబాటు అదీ ఫార్ములా అన్నమాట …
హీరో గారు పెత్తందార్ల మీద తిరగబడ్డంత సేపూ ఆయన శ్రామికుల అనుకూలుడుగానూ …
పెళ్లాన్ని చావగొట్టేసమయాల్లో మాత్రం … పరమ సాంప్రదాయ వాదిగా కనిపించడం అనేది ఊరికే రాలేదు …
అలాగే …
గయ్యాళి భార్యల కథలూ … భర్తల్ని అస్సలు గౌరవించని భార్యల కథలూ కూడా తీసిన సందర్భాల్లో సైతం ప్రీ క్లైమాక్సులో ఆవిడ్ని వాళ్లాయనతో కొట్టిస్తే జస్టిఫికేషన్ అయినట్టుగా భావిస్తారు మన దర్శకుడుగార్లు.
ఇలా విప్లవ ఆదర్శ చిత్రాల్లో లింగ వివక్ష బలంగానే కొనసాగింది.
కొనసాగుతోంది ….
ఏదో అనిపించింది చెప్పేస్తే పోతుంది అనే తప్ప… కమ్యూనిస్టు సనాతన దాంపత్యోపనిషత్తును తప్పు పట్టాలని కాదు అని గమనించ ప్రార్థన