సాహిత్యం వజ్రమైతే సానపట్టి పలకలు తీర్చేది విమర్శ

విమర్శ సమీక్ష, మీమాంస, సమాలోచన, అనుశీలన, పరిశీలన, క్రిటిసిజమ్ – ఇవన్నీ ఇంచుమించుగా సమానార్థకాలు.

            విమర్శ అంటే, – Examination, Scrutiny, Trial, విచారణ అని బ్రౌణ్యం. పరిశోధించు, పర్యాలోచించు, విచారించు, వివేకించు, వివేచించు, శీలించు, శోధించు అని ఆంధ్రవాచస్పత్యం.

            Criticism అంటే -To decide, To give an authoritative opinion. The art of judging the qualities and rules of an aesthetic object,whether in literature or the fine arts. ‘Encyclopaedia Britanica.’

“In the strict sence the word criticism means judgement”W.H. Hudson.

            ఒక గ్రంథంలోని, లేదా ఒక సాహిత్యప్రక్రియలోని బాగోగులు కూలంకషంగా విచారించి, విశ్లేషించి వివరించడమే విమర్శ. అది ఎంత ప్రజ్ఞావంతంగా పక్షపాతరహితంగా, పవిత్రవంతంగా, సహృదయపూర్వకంగా,సానుభూతిసహితంగా వుంటే సాహిత్యానికీ, సంఘానికీ అంత ఉపకారకారణమవుతుంది.

            “మంచివిమర్శ మంచిభావాలు నెలకొల్పుతుంది; ఒక మహాకావ్యం అవతరించడానికి అవకాశం కల్పిస్తుంది” అన్నాడు సుప్రసిద్ధ విమర్శకుడు అర్నాల్డు.

       విమర్శ అనడంతోటే సాధారణంగా కేవలం దుయ్యబట్టడమే అని కొందరి  అభిప్రాయం. ఆ దుయ్యబట్టే ఆవేశంలో అసహ్యంగా అవహేళన చెయ్యడానికిన్నీ,సంకోచించారు వారు. అదిగో అలా బయటపడినవే సంస్కృతంలో ‘దుర్జనముఖపేటిక’,’దుర్జనముఖ పాదుక’వంటి గ్రంథాలు, తెలుగులో ‘విమర్సాదర్శ విమర్సాదర్శము’, ‘కొత్త తెలుగు తమాషా’,’నేటికాలపు కవిత్వము’, ‘చెళ్ళపిళ్ళ వారి చర్లాటము’మొదలైనవి.

    ఒకప్పుడు ఈ రకం విమర్శకుల ఆవేశాలు కోర్టులకు లాగాయి;నడివీధిలో లడాయికి నడుము బిగించాయి.

  బాషకి ముందు సారస్వతముండదు. అలాగే సారస్వతానికి పూర్వం విమర్శ లేదు. సారస్వతం,మొదట పుడుతుంది.సారస్వతాన్ని వెన్నంటి విమర్శ వస్తుంది.ఇంకా చెప్పాలంటే సారస్వతంలో కావ్యమూ,విమర్శా జమిలి సంతానమేమో; కృత్యాద్యవస్థలో కవి కొంతవరకు విమర్శకుడే అవుతాడు.తన కృతికి తాను వేసుకున్న పథకం పర్యాలోకిస్తూ.

   ప్రాచీనకాలంలో విమర్శ లక్షణగ్రంథాలుగా దర్శనమిచ్చింది. ఆ లక్షణ గ్రంథాలే అనంతరం నిబంధనగ్రంథాలుగా,అనుశాసనాలుగా అధికారం చేజిక్కించుకున్నాయి. అప్పుడవి ‘కవి గజంకుశాలూ’, ‘కవి సర్పగారుడాలూ’ అయ్యాయి. సాహిటానికి సంకెళ్ళు తగిలించాయి.కవిత్వానికి గాట్లు పోశాయి. వాటిని ఉల్లంఘించిన కృతులను -అవి ఎంత గొప్పవయినా సరే-ఆంక్షవేశాయి.పోతనగారి భాగవతమంత మహాకావ్యానికే తప్పలేదు ఈ ఆంక్ష;దాని అపరాధమంతా బండిరాతో రకారానికి నేస్తం కల్పించడం.

   “బమ్మెర పోతరాజ కృత

             భాగవతమ్ము జగద్దితమ్ము గా,

   కిమ్మహి నేమిటం గొదువ ,

            ఎంతయు నారసి చూడగాను రే

   ఫమ్ములు బాలునుం గలసి

           ప్రాసములైన కతంబునం గదా

    ఇమ్ముగ నాదిలాక్షిణకు

        లెల్లరు మాని రుదాహరింపగన్ “

అన్నారు కాకనూరు అప్పనకవి. జంకూకొంకూ లేకుండా:

   ఈ సారస్వతఆంక్షలు తమ పరిధులు అతిక్రమించి కులాల మీదకు కూడా తమ కబంధహస్తాలు చూపాయి. ఈ అప్పకవే ఏమంటున్నాడో చూడండి:

   “ఉపమ గలిగిన సయ్యలు నొప్పియున్న

   అంఘ్రిభవుని కావ్యంబు గ్రాహ్యంబు గాదు.”

విమర్శ చేసేవాడు విమర్శకుడు. A  critic is one who exercises the art of criticism ‘Encyclopeadia Britanica.’

   అన్ని పక్షాలూ విచారించి, సరైన న్యాయం వ్యక్తీకరించే న్యాయాధిపతి వంటి వాడు కావాలి విమర్శకుడు; తన కేసు ఎలా అయినా గెలవాలని వాదించే న్యాయవాదివంటివాడు కాకూడదు. రసజ్ఞుడు కావాలి; కేవలం దోషజ్ఞుడు కాకూడదు.ప్రజ్ఞావంతుడు కావాలి; పక్షపాతంకలవాడు కాకూడదు. గుణగ్రాహి కావాలి; మచ్చరగొట్టు కాకూడదు.

ఎన్ని మంచి గుణాలుండినా పక్షపాతం వొదలని విమర్శకుడి విమర్శ కువిమర్శ అవుతుంది.

            సుప్రసిద్ధ ఆంగ్లసాహిత్యవేత్త జాన్సను బహుముఖ ప్రజ్ఞావంతుడయిన గొప్ప విమర్శకుడు. అయితే పక్షపాతదోషానికి  లోనయినప్పుడు అతడి విమర్శ మంచివిమర్శ కాలేకపోయింది. పోపు, అడిసను మొదలైనవారి గ్రంథాలు విమర్శించినప్పుడు అతడి విమర్శలో కనపడిన ప్రతిభ మిల్టను, గ్రేల రచనలు విమర్శించినప్పుడు కనపడలేదు. మిల్టనుతో రాజరీయంగానూ, గ్రేతో వ్యక్తిగతంగానూ వుండిన విభేదాలు అతడిలోని నిష్పక్షపాతబుద్ధిని కుంటుపరిచాయి.

            ఉన్నవీ లేనివీ దోషాలు ఎత్తిచూపడమే విమర్శ అని కొందరి ఊహ. దోషాలు మాత్రం పట్టేవాడు దోషజ్ఞుడయిన  పండితుడు కావచ్చునేమో కాని, విమర్శకుడు కాడు,

“సుకవుల సూక్తులందు సర

       సుల్ నెరసుల్ వెదుకంగబోరు మ

  క్షిక వితతుల్ ప్రణంబు బరి

      కించు గతి గొదవల్ గణించుటల్

  కుకవుల నైజబుద్ధి “

   అంటాడు కనుపర్తి అబ్బయామాత్యుడు.ఇక్కడ కుకవులంటే కువిమర్శలు అని అనుకోవాలి.

   కువిమర్శ వొక్కొక్కప్పుడు దారుణ పరిణామాలకు దారితీస్తుంది.

   “రచయిత గుణాలు మనస్సుకి పట్టించుకుని,వాటి వివరాలు పాఠకుడి ముందు పెట్టేవాడే విమర్శకుడు”అన్నాడు వాల్టర్ పేటరు.

  యయావరీయుడు విమర్శకులను  అరోచకి,సత్యణాభ్యవహారి, మత్సరి,తత్వాభినివేశి అని నాలుగురకాలుగా విభజించాడు.

    ఎంత మంచి కృతి అయినా అరోచకుడికి రుచించదు.మంచివీ, చెడ్డవీ అన్నీ దాగున్నాయంటాడు.సత్యణాభ్యవహారి ఈసుపట్టి ఎంత మంచికావ్యంలో అయినా తప్పులు వెదుకుతాడు మత్సరి.పక్షపాతం లేకుండా, పాలూనీళ్ళూ వేరు చేసే రాజహంసలాగ, కావ్యవిమర్శ చేస్తాడు తత్వాభినివేశి.

   ఈ నలుగురిలో చివరివాడే ఉత్తమ విమర్శకుడు.అతడే కావ్యశ్రమ గుర్తించగలుగుతాడు.సహజంగా అలాంటి విమర్శకుడు లభించడం దుర్లభమన్నారు విజ్ఞులు.

  శ్లో||    శబ్దానాం వివినక్త గుంఫవనవిధీ నామోదతే సూక్తిభి,

  స్సాంద్రం వేఢి రసామృతం విచియతే తాత్పర్య ముద్రాంచయః

   పుణ్యైసంఘటితే వివేక్తృ విరహా దంతిర్ముఖం తామ్యతాం,

కేషామేవ కదాచిదేవ సుధియాం కావ్యశ్రమజ్ఞో జనః

   తమ కావ్యాలు చక్కగా విమర్శ చేయగల సరసుడు లేడే అని విచారించే కవులలో ఎవరికో కొందరికే, ఎప్పుడో ఒకప్పుడే కావ్యపరిశ్రమ తెలిసిన విమర్శకుడు లభిస్తాడు.అలాంటి విమర్శకుడే శబ్దార్ధాలు చక్కగా వివేచించగలుగుతాడు.శబ్దాల కూర్పును ప్రశంసిస్తాడు. రసామృతం జుర్రగలుగుతాడు. తాత్పర్యం వివరిస్తాడు.(కావ్య మిమాంస. పం.ఆ)

  మంచి విమర్శకుడికి ముఖ్యమైన మూడు గుణాలు వుండాలంటాడు రీచర్డ్స్.

   The qualifications of a good critic are three, he must be an adept at experiencing, without eccentricities,the states of mind relevant to the work of art is judging. Secondly, he must be able to distinguish experiences from one another as regards their less superficial features. Thirdly, he must be a sound judge of values.

         -Principles of Literary Criticism

  “విమర్శకుడు కృతి విలువను ఖరీదు కట్టే షరాబు”అంటాడతాను.

  “సాహిత్యస్రష్ట అడివి శుభ్రపరిచి బాట వేస్తాడు;దానిని పరిరక్షించే నిరీక్షకుడు విమర్శకుడు” అంటాడు స్కాటుజేమ్స్.

   సాహిత్యం సముద్రమైతే, మునిగి ముత్యాలు తీసే జాలరి విమర్శకుడు.

  “విమర్శ వల్ల సాహిత్యంలో అభిరుచులు సువ్యక్తమవుతాయి”అన్నాడు T.S. Eliot.

  సాహిత్యం వజ్రమైతే సానపెట్టి పలకలు తీర్చేది విమర్శ.

   విమర్శ సాధారణంగా Speculative, Inductive,Judicial, Subjective అని నాలుగురకాలుగా విభజన చేశారు కొందరు.

ఆధునిక విమర్శమాత్రం అనంతమైన సిద్ధాంతాలను ఆకళించుకుంటున్నది.  

     అప్పుడప్పుడు ఒక కవి కృతులు ఒక విమర్శకుడు  ఉత్కృష్టమయినవని విమర్శిస్తే, వాటినే మరో విమర్శకుడు నికృష్టమైనవని నిరూపించడమూ కద్దు. వెనక ఇంగ్లాండు విమర్శకులు షేక్సియరు నాటకాలు ఉత్కృష్టమైనవంటే, ఫ్రాంసులోని విమర్శకులు అవే నాటకాలు అధమమైనవనీ – అసభ్యమైనవనీ, నికృష్ణమైనవనీ విమర్శించారు. మిల్టను రాసిన ‘పారడైజ్‌ లాస్టు’ సర్వోత్కృష్టకావ్యమనీ, ఒకరంటే అంత నికృష్ణకావ్యం మరొకటిలేదని మరొకరన్నారు. దిజ్ఞాగాచార్యుడు కాళిదాసు కావ్యాలు కాదంటే మల్లినాథుడు ‘సంజీవని’ స్పర్శతో బ్రతికించాడు. ఎంకిపాటలు ఎంతో గొప్ప కవిత్వమని పంచాగ్నుల ప్రభృతులంటే, “అబ్బే, అది కవిత్వమేకాదు పొమ్మన్నాడు బసవరాజు ; బూతులతో వెక్కిరించాడు దుగ్గిరాల.

    పాశ్చాత్యసాహిత్యంలో సంసర్గం కలుగకముందు, బహుపురాతనకాలం నుంచీ మనదేశంలో కావ్యశాస్త్రాలకు కొదువలేదు. కావ్యవిమర్శకు అవే కొలకర్రలప్పుడు. 

   సంస్కృత వ్యాకరణశాస్త్రం పురాతనమైంది. నిరుక్తం, ప్రాతిశాఖ్యం, నిఘంటువులూ కూడా ఈ సందర్భంలో విస్మరింపరానివి. యాస్కుడు అయిదారురకాల ఉపమాలంకారాలు వివరించాడు. పాణిని వాటినే పర్యాలోచించాడు. కావ్యాయనుడు పాణిని ననుసరించాడు. పతంజలి తన మహాభాష్యంలో పాణినిసూత్రాలు కొన్ని పరామర్శించాడు. తరువాతివారు వాటినే ఆధారం చేసుకున్నారు. 

    భరతుడి నాట్యశాస్త్రానికి ముందు కావ్యశాస్త్ర మెంతయినా వుండేదని పండితులంగీకరించిన సత్యం. భరతుడి రససిద్ధాంతం పురస్కరించుకుని లోల్లటుడు, శంకుకుడు, భట్టనాయకుడు, అభినవగుప్తుడు తమతమ వాదాలు వ్యాఖ్యానించారు. క్రమంగా రససంప్రదాయం, అలంకారసంప్రదాయం, వక్రోక్తి సంప్రదాయం, రీతి సంప్రదాయం, ధ్వని సంప్రదాయం మొదలైనవి శాస్త్రరూపంలోనే ఆవిర్భవించాయి.    

     భారతీయ సాహిత్యశాస్త్రసిద్ధాంతం ప్రకారం శబ్దం, అర్ధం, రసం – ఈ మూడింటితోనే కావ్యం పరిశీలించాలి.

       భామహుడి కావ్యాలంకారం, దండి కావ్యాదర్శం, ముమ్మటుడి కావ్యప్రకాశం, ఆనందవర్థనుడి ధ్వన్యాలోకం, విశ్వనాథుడి సాహిత్యదర్పణం, రాజశేఖరుడి కావ్యమిమాంస, క్షేమేంద్రుడి బౌచిత్యవిచారం, ఉద్భటుడి అలంకారసంగ్రహం, రుద్రటుడి కావ్యాలంకారం సుప్రసిద్ధమైనవి.

    తెలుగులో వీటినే అనుకరించడమో, అనువదించడమో అనుసరించడమో జరిగింది, పాశ్చాత్యసిద్ధాంతాలతో పరిచయం లభించేవరకు.

    పాశ్చాత్యసాహిత్యంలో క్రీస్తుకుపూర్వమే సాహిత్యవిమర్శ అవుపిస్తుంది.

    ఆరిస్టోఫెన్సు, సోక్రటీస్‌, ప్లేటో – ఈ ముగ్గురి అవతరణతో గ్రీకు సాహిత్యంలో విమర్శకు అంకురార్పణ జరిగింది. 

   ప్లేటో కొంత సాహిత్యవిమర్శ చేశాడు. సాహిత్యం బుద్ధికి సంబంధించింది కాదన్నాడతడు. అది భావావేశానికి సంబంధించిందన్నాడు. బుద్ధి ప్రేరణవల్లకాక భావావేశంవల్ల కవులు కావ్యరచన చేస్తారనీ, కనుక కావ్యానందం బౌద్ధికం కాదని ప్లేటో సిద్దాంతం, కాగా, సాహిత్యం సత్యదూరమైందనీ, నైతికదూరమైందనీ – అంచేత ఆదర్శరాజ్యానికి అది పనికిరాదనీ అతడి వాదన.

    అంతకుముందే – హోమరు నించి ప్లేట్‌ వరకు – ఆ మధ్యకాలంలో హేషియడ్‌, సోలోన్‌, సిమోనయిడ్‌, పిండార్‌ మొదలైనవారు రకరకాల కావ్యసిద్ధాంతాలు ప్రతిపాదించారు. అయినా విమర్శకుడిగా మొదటివాడు ప్లేటో మాత్రమే గణింపదగినవాడు.

    ప్లేటో నాటికి గ్రీకుసాహిత్యంలో స్వర్ణయుగం గడిచిపోయింది.

    ప్లేటో తరవాత అతడి శిష్యుడు అరిస్టాటిల్‌ అప్పటికుండిన సాహిత్యం అవలోకనం చేసి, సుప్రసిద్ధ కవుల కావ్యాలు పురస్కరించుకుని ‘పొయెటిక్సు’ (Poetics ) రాశాడు. ప్లేటో సిద్ధాంతాలు చర్చించాడు. తనకి తోచిన వాటిని సరసంగా సవరించాడు.అరిస్టాటిలును విమర్శకపిత అన్నారు.  తరువాతవారికి అతడి ‘పోయెటిక్సు’ ఆదర్శమయింది.తుదకి నిబంధనగ్రంథంగా తయారయింది.దాని ప్రభావం వల్ల రాను రాను సాహిత్యంలో అంతః సౌందర్యానికి  కాక, బాహ్య స్వరుపానికే ప్రాధాన్యం హెచ్చింది.

            అలంకారాదిశాస్త్రాలకు మన మధ్యకాలపు కవుల మల్లెనే వెనక  పాశ్చాత్య కవులు బానిసలయ్యారు.విమర్శకులున్నూ అదే దారిలో నడిచారు. నిబంధనలతోనే సాహిత్యాన్ని కొలిచారు.కట్టుబాట్ల పట్టాలు తప్పినవాటిని త్రోసి రాజన్నారు.

            క్రీస్తు తొలిశతాబ్ది ప్రాంతాన పడమటి సాహిత్యం విమర్శల ఇరుకుల్లో పడి నడిచింది. అదే సమయంలో గ్రీకు దేశం రోమనుల క్రింద పరాధీనమయింది.ప్రాచీన గ్రీకు సాహిత్యం అనాదృతమున్నూ అయింది.

   అప్పుడే డయోని అస్ ,హెలి కాన్సిస్ ,ప్లూటార్క్,లుసియన్ ,లాంగినస్ వంటి విమర్శకులు బయలుదేరారు. లాంగినస్ వీరిలో సుప్రసిద్ధుడు.’సదా సాహిత్యాభ్యాసం చేసే సహృదయుడే సరయిన విమర్శకుడు’అన్నాడు లాంగినస్.అతడి సిద్ధాంతాలు ప్లేటో,అరిస్టాటిల సిద్ధాంతాలకు కేవలం విరుద్ధమైనవి కావు.స్వతంత్రపద్ధతిలో అవి పూర్వసంప్రదాయాలకు నిర్వచనప్రాయాలని చెప్పవచ్చు.

  అనంతరం క్రీ.శ.13వ శతాబ్ది దాకా పాశ్చాత్య సాహిత్య విమర్శలో చెప్పుకోదగ్గ గొప్ప విషయం ఏది లేదు.డాంటే వరకూ కావ్యాలకు నియమాలు గుదిబండలయి దిగలాగాయి.విమర్శకులకూ అదే అవస్థ అనివార్యమయింది.

   కట్టుబాట్లలో కవిత్వం నిర్వీర్యమవుతుంది;నిర్జీవమవుతుంది.

   16-18శతాబ్దాల మధ్య ఈ నిబంధనల బంధాల్లోనుంచి బయటపడటానికే పాశ్చాత్యసాహిత్యం పెనుగులాడింది.

   పదహారో శతాబ్ది తుది వరకు ఆంగ్లసాహిత్యంలో విమర్శ తలెత్తలేదు.ఆ కాలంలో పుట్టినవి ఇంచుమించు అనుకరణలు.

    1553లో థామస్ విల్సన్ ‘ఆర్ట్ ఆఫ్ రెహ్టో రిక్’రాశాడు.అందులో కవుల గురించీ,పాఠకుల గురించి కొంత చర్చించాడు.

    1570లో రోజర్ ఏశ్చమ్ తన ‘స్కూలు మాష్టర్’లో కొంత విమర్శ రాశాడు.

   1579లో స్టివ్ గాసన్ ‘ది స్కూల్ ఆఫ్ అబ్యూజ్’అని వొక విమర్శగ్రంథం రాశాడు.’కవిత్వం అబద్ధాల పుట్ట’అన్నాడతను.కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి కూడా వొక సందర్భంలో ‘కవిత యన మృష…’అన్నారు.

16వ శతాబ్ది తుదిని ఇంగ్లాండులో ఫిలిప్సు సిడ్నీ జన్మించాడు.సంఘంలో కవిత్వానికి గౌరవస్థానం లేని దినాలవి అక్కడ.

   “ఏన్ అపాలజీ ఫర్ పోయిట్రీ “అనే విమర్శగ్రంథం ప్రకటించాడు సిడ్నీ.ఇటలీ విమర్శకుల ప్రభావం ఇతడి మీద బాగా పడింది.

  “కవిని రోమనులు ద్రష్ట అంటారనీ, గ్రీకులు స్రష్ట  అంటారనీ రాశాడు, సిడ్నీ ‘కవిత్వం నిరసింపరానిద’ని   నిరూపించాడు. ‘కావ్యం జ్ఞానానికి తల్లి’ అన్నాడు.’సభ్య  జగత్తుకి ప్రథమ జ్ఞానకిరణం కవితవల్లనే లభ్యమయిందని’ వాదించాడు. వివిధకోణాల్లోంచి విమర్శించి తన సిద్ధాంతం ప్రతిపాదించాడు. అరిస్టాటిలు సిద్ధాంతాలకు సిడ్నీ సిద్ధాంతాలు  నూతనోజ్జీవనం కలిగించాయి : అలంకారశాస్తాలూ, చంద్రశ్శాస్తాలూ మాత్రమే కవిత్వం కల్పించలేవన్నాడతడు, ‘పొడవాటి  గౌను వేసుకున్నంతమాత్రాన ప్రతివాడూ న్వాయవాది కాదు; అలాగే కేవలం ఛందస్సు తెలినినంతమాత్రాన ఎవరూ కవి అయిపోడు’అన్నాడు.

            సిడ్నీ విమర్శ తన ‘అర్కేడియా’ గ్రంథానికే వ్యతిరేకంగా వుండడం గమనించదగిన విషయం. రేఫ ద్విరేఫల నిబంధన చేసిన అప్పకవి తన నియమం తానే ఉల్లంఘించాడు మరి :

            మన యక్షగానాలూ, వీథినాటకాలూ, తోలుబొమ్మలాటలూ మొదలైనవాటిల్లో లాగ, ఆనాడు పాశ్చాత్య నాటకాల్లో అసభ్యహాస్యం ప్రదర్శించేవారు. దానిని సిడ్నీ  తీవ్రంగా విమర్శించాడు.

  సిడ్నీతో  చెప్పదగినవాడు బెన్‌ జాన్‌సన్‌. గ్రీకు, లాటిను భాషలలో గొప్పపండితుడితడు. “ఆంగ్ల విమర్శకులలో బెన్ జాన్ససను ప్రథమాచార్యుడు”అన్నాడు జార్జిసెంట్సుబరీ.

  అప్పటికే సాహిత్యంలో పాతసిద్ధాంతాలంటే  అసహ్యం వ్యాపించింది రసికలోకంలో. సాహిత్యానికి ప్రతిభ ప్రధానమైనది. ప్రతిభ లేకపోతే ప్రతిభను ఖండించడం ప్రమాదకరమని వాదించాడు  బెన్ జాన్సన్, ప్రయత్నంతో ప్రతిభను ప్రతిష్ఠించవచ్చని అతని సిద్ధాంతం.

            బెన్ జాన్సన్ క్లాసిక్ వాదాన్ని  అతిక్రమించి ముందడుగు వేసిన విమర్శకుడు డ్రయిన్. ఇతడు ‘ఎస్సే ఆన్ డ్రమెటిక్ పోయెసీ’ లో నలుగురు వక్తలతో సంభాషణ సాగించాడు. పానుగంటి ‘విమర్శాదర్శ విమర్శాదర్శము’, విశ్వనాథ హేతువాద యుగము’ ఇలా సంభాషణరూపకవిమర్శ రచనలే.

             డ్రయిడను “కల్పించిన నలుగురు వక్తలలో ‘క్రిస్టో ప్రాచీనకవుల్ని సమర్థిస్తాడు. ‘యూజీన్’ ఎలిజిబెత్తురాణి కాలం కావ్యాల్ని ముఖ్యంగా నాటకాల్ని సమర్థిస్తాడు. ‘లెసిడియస్’ ఫ్రెంచినాటకాలు మంచివంటాడు. ‘నియండరు’ ఇంగ్లీషునాటకాలు గొప్పవనని వాదిస్తాడు. స్వయంగా డ్రయిడను నియండరుపాత్ర ధరిస్తాడు. సాహిత్యంలోని వివిధమతాలు విపులంగా విమర్శించాడు డ్రయిడన్. నియమాలూ, నిబంధనలూ నిరసించడు. సంఘం మారినట్టే సాహిత్యమూ మారుతుందన్న  సత్యం ప్రతిపాదించాడు.

             డ్రయిడను సిద్ధాంతాలు మరింత ముందుకి తీసుకుపోయాడు ఫ్రెంచి విమర్శకుడు టేన్.             కాల్పనికయుగంలో తొలకరిగా చెప్పదగినవాడు విలియం బ్లేకు. ‘బుద్ధితో పుట్టేది కావ్యం కాదనీ, కావ్యానికి అలౌకికమైన ప్రేరణం కావాలనీ, కట్టుబాట్లలో కవిత్వం కనబడద’ నీ బ్లేకు వాదం. సనాతనంగా వస్తూన్న సిద్ధాంతాలకు బ్లేకు సిద్ధాంతం గొడ్డలిపెట్టయింది. దాంతో అభ్యాసంవల్ల కాక కళాసృష్టి రహస్యానుభూతి మూలంగా కలుగుతుందన్న భావం బలపడింది.

             “కావ్యానికి ఆధారం దివ్యశక్తి” అని బ్లేకు అంటే దానినే భావావేశం అన్నాడు వర్ద్సువర్తు. సుభోధకమయిన భాషా, సరళమయిన శైలీ కావ్యానికి కావాలన్నాడతడు. నిరలంకారమయిన శైలి మంచిదన్నాడు. వాడుక భాషే సహజమయిందనీ వాదించాడు.

            తన విమర్శలతో కాల్పనికసాహిత్యానికి పటిష్టం కల్పించినవాడు కోల్రిడ్జి, అనుభూతి, సరళత్వమూ, నిజాయితీలేనివాడు కవే కాదన్నాడతడు. హృదయమూ, మస్తిష్కమూ రెండు సాహిత్యానికి అవసరమన్నాడు కేవలం భావావేశం కవిత్వానికి చాలదనీ, అలాగే వొట్టి పాండిత్యము మాత్రమే పనికిరాదనీ అతడి సిద్ధాంతం. అంచేత ఆ రెంటి సమ్మేళనం కృతికర్తకి అవసరమన్నారు.

            విక్టోరియారాణి యుగం ఆరంభంలో ఆంగ్ల సారస్వతవిమర్శ మందకొడిగా వుండేది. అయితే మాత్యూ ఆర్నాల్డు, జాన్‌ రస్కిన్ వంటి విమర్శకులు అవిర్భవించడంతో విమర్శ ఉత్తమస్థాయినందుకుంది. ఆర్నాల్డు స్వయంగా గంథవిమర్శ చేయడమే కాదు, ఎలా  విమర్శచేయాలో ఇతరులకున్నూ నేర్పేవాడు. పాత సిద్దాంతాల పునాదుల మీదే  కొత్రసిద్ధాంతాలు ప్రతిష్టించాడు ఆర్నాల్డు. 

            ఇరవయ్యో శతాబ్ది నడిమిని జార్జి సెంట్సుబరీ, అలివర్‌ ఎల్టన్‌, వాల్టర్‌ రేలే, టి.ఇ. హుల్ము మొదలైన విమర్శకులు గోచరిస్తారు. హుల్ము మంచి వ్యుత్పన్నుడు. వెనకటి కావ్యసిద్ధాంతాలను గట్టిగా ఎదిరించాడితడు. కావ్యానికి కట్టుబాట్లు కూడదన్నాడు. ఫ్రీవెర్సు ప్రోత్సహించాడు.

            ఈ కాలంలో Symbolism, Imagism మొదలైన వాటితోపాటు సిగ్మండ్‌ ప్రాయడ్  మనో వైజ్ఞానిక సిద్ధాంతాలు సాహిత్యరంగంలోనూ  కల్లోలం కలిగించాయి. కావ్యకళ కలవంటిదని నిరూపించాడు ప్రాయడ్‌. అతడి ప్రభావంవల్ల కామవాసన గురించీ, అజ్ఞాత మనస్తత్వం గురించీ పెర్వర్షను గురించ  బోలెడంత సారసత్వం బయలుదేరింది. దానివల్ల మంచి కంటే చెడు  అధికమయిందన్నారు విమర్శకులు కొందరు.

            మహాయుద్ధం కారణంగా ప్రబలిన అశాంతి ఫలితంగా ఫ్రాన్సులో పుట్టిన డాడాయిజమ్ విధ్వంసకవాదంలోంచి అధివాస్తవికవాదం (Sur-realism) సాహిత్యంలో ప్రవేశించింది. ఇతర కళలలోనూ చోటు చేసుకుంది – 1930 లో వెలువడిన రెండు ప్రకటనపత్రాలలోనూ, 1936లో లండనులో జరిగిన ప్రదర్శనలోనూ దీని పరిపూర్ణస్వరూపం దర్శనమిచ్చింది. ఆంధ్రబ్రెతాఁ, పాల్ ఎల్వార్డులు దీని ప్రవర్తలు. ఆంధ్రబ్రెతాఁ విమర్శకులు ఈ ఉద్యమానికి వెన్నెముకగా పనిచేశాయి.

            మార్కు యధార్థవాదం సాహిత్యంలో విస్తృతంచేసిన విమర్శకుడు కాడ్వెల్, ఆయా యుగాలలో ఆయా అవకాశాల ననుసరించి కావ్యసృష్టి జరుగుతుందని నిరూపించాడతడు. పూర్వ ప్రస్తరయుగం, ఉత్తరప్రస్తరయుగం, సామ్రాట్టులయుగం, సామంతులయుగం, ధనికులయుగం, సామ్యవాదయుగం అని సాహిత్యయుగాలు విభజించి విమర్శించాడు.

             ఇలియట్, రిచర్డ్సుల విమర్శలతో విమర్శనాసాహిత్యచరిత్రలో కొత్తపుట తెరవబడింది. ఇలియట్ ఎంత ఆధునిక కవో అంత ఆధునిక విమర్శకుడు. అతడి Sacred wood రిచర్డ్సు రాసిన ‘ఫౌండేషన్ ఆఫ్ క్రిటిసిజమ్’, ‘మినింగ్ ఆఫ్ మీనింగ్’, ‘ప్రిన్సిపల్సు ఆఫ్ లిటరరీక్రిటిసిజమ్’, ‘పొయిటికల్ క్రిటిసిజమ్’ విమర్శలో విప్లవం సృష్టించాయి. ఇలియట్ తో  పాటు డి. హెచ్. లారెన్సు కూడా చెప్పదగినవాడు. ఈ ఇద్దరి రచనలప్రభావం ప్రపంచమంతటా ఆధునికరచయితల మీద కనిపిస్తుంది.

            ఈ సందర్భంలోనే ముర్రే, స్పిన్ గార్న్ , గ్రేవ్, రైడింగ్, ఏంప్సన్, రష్యాలో ఏంటోకోలస్కీ చుకోవస్కీ, పాస్టర్నాక్ మొదలైనవారినీ విస్మరింపరాదు.

            ఈనాడు మన భారతీయ సాహిత్యాలన్నిటిలోనూ విమర్శకు పాశ్చాత్యపద్ధతులే ప్రమాణంగా వున్నాయి. అందుకనే స్థాలీపులాక న్యాయంగా, బహుక్లుప్తంగా దానిని ఈ మాత్రం తడవడం జరిగిందిక్కడ.

             తెలుగులో సాహిత్యవిమర్శ లేదన్నవారికి లేదు; ఉందన్నవారికుంది. ఉన్నదయినా వుండవలసినంత లేదు; వుండవలసినట్టున్నూ లేదేమో అంతగా.

            నన్నయనాటికే దేశంలో ‘విద్యావిలాస గోష్ఠులు’ జరుగుతూ వుండేవికదా; అయినప్పుడు ఈ గోష్టులలో జరిగేది సాహిత్యవిమర్శకాక మరేమిటి? అయితే అవి సంస్కృతంలో లాక్షణిక గ్రంథాలుననుసరించి జరిగివుంటాయి  అనడంలో సందేహం లేదు. అంతకుముందుండిన దేశిసాహిత్యం వెన్నెలపాటలు, గొబ్బిపాటలు, తుమ్మెద పదాలు మొదలైనవి అంతరించడానికి అదే కారణం కావచ్చు. తెలుగుకి ప్రత్యేకమైన లక్షణగ్రంథాలు అప్పటికి లేవు; లేవేమో: అందుకని సంస్కృత నిబంధన గ్రంథాలే ఆధారమయాయి. మార్గ సాహిత్యం వెల్లువలా వచ్చి దేశిసాహిత్యాన్ని ముంచుకుపోయింది. కనక సంస్కృత లక్షణగ్రంథాలే అనుకరించడమూ, క్రమంగా అనువదించడమూ, అనుసరించడమూ జరిగింది.

       తెలుగుకి లక్షణం మొదట సంస్కృతంలో చెప్పడం జరిగింది. చిత్రమే; అయినా, అది తెలుగువారికోసమో, తెలుగురాని సంస్కృత పండితులకోసమో అన్నది వివేచించదగిన విషయం.

            నన్నయనించీ మనవారి అవతారికలలోనూ, ‘కందం చెప్పినవాడే కవి, ‘వింటే భారతమే వినాలి’ ‘అల్లసాని పెద్దన్న అల్లిక జిగిబిగి’ ‘ముక్కు తిమ్మనార్యు ముద్దుపలుకు’, ‘కవికీ కంసాలికీ సీసం తేలిక’ వంటి పలుకుబళ్ళలోనూ, పెద్దన ఉత్పలమాలిక వంటి పద్యాలలోనూ, వ్యాఖ్యానాలలోనూ, తుదకి నిబంధన గ్రంథాలలోనూ, కుకవినిందల్లోనూ విమర్శ సూత్రప్రాయంగా తొంగిచూసినా పడమటిగాలి సోకిన తరువాతగాని, ఈనాడు మనమనుకుంటూన్న పద్ధతిలో విమర్శ తెలుగులో లేదనే అంగీకరించాలి.

            ఒక శతాబ్దం నుంచీ పత్రికలు మన సాహిత్యంలో విమర్శకు దోహదం కల్పించాయి; ఉద్దండులయిన సాహిత్యవేత్తలు విమర్శకు నడుముకట్టారు. కడుతున్నారు. విమర్శాత్మకమయిన వ్యాసాలేకాదు గ్రంథాలుకూడా లేవనకుండా కొన్ని ప్రకటించారు.    ప్రకటిస్తున్నారు.

వఝుల చినసీతారామశాస్త్రిగారి ‘వసుచరిత్ర విమర్శ’, కట్టమంచి రామలింగారెడ్డిగారి ‘కవిత్వతత్వవిచారము’,పెండ్యాల వేంకటసుబ్రహ్మణ్యశాస్త్రి గారి ‘మహా భారత చరిత్రము’,కోరాడ రామకృష్ణయ్య గారి ‘ఆంధ్రభారతా కవితా విమర్శనము’, గొబ్బూరి వేంకటానంద రాఘవరావుగారి ‘నన్నయభట్టారక విజ్ఞాననిరతి’, దీపాల పిచ్చయ్యశాస్త్రిగారి ‘సాహిత్యసమీక్ష’, గిడుగు వెంకటరామమూర్తిగారి ‘ఆంధ్ర పండిత భిషక్కుల భాషాభేషజము’, పింగళి లక్ష్మీకాంతముగారి ‘సాహిత్యశిల్ప సమీక్ష మొదలైనవి వెలువడ్డాయి; వెలువడుతున్నాయి.

ఉత్తమ విమర్శగ్రంథాలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్యఅకాడమీ బహుమానాలు ప్రధానం చేస్తున్నది.  అయినా పాశ్చాత్యసాహిత్యాలతోగాని, తుదకు హిందీ వంటి ఇరుగుపొరుగు సాహిత్యాలతోగాని సరిపోల్చి చూసినప్పుడు విమర్శ విషయంలో మనము తలవంచుకోవలిసే వస్తున్నది.సాహిత్యం గురించి ఎంతో కొంత విమర్శవుండినా విమర్శగురించిన విమర్శ బొత్తిగా మనకు లేదు. వందేళ్ళ పురాతన పత్రికలను గాలించినప్పుడు ఈ లోపం నిజంగా దిగ్భ్రాతం పరిచింది.

            ప్లేటో, ‘రిపబ్లిక్’, అరిస్టాటిల్ ‘పోయెటిక్సు’ తెలుగులోకి వచ్చాయి. ప్రాంతీయభాషలనించి ‘కాళిదాస భవభూతులు’ వంటివి ఏ వొకటో రెండో అనువాదమయాయి. ఇలా అయినా ఉత్తమ విమర్శగ్రంథాలు పాశ్చాత్య భాషలనించీ, ప్రాంతీయభాషలనించీ తెలుగులో అనువాదం జరగడం అవసరం. ఈ పని సాహిత్య అకాడమి వంటి ప్రామాణిక సంస్థ నిర్వహించడమున్నూ అవసరం.

                                                   *     *    *

పురిపండా అప్పలస్వామి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *