మహాశివరాత్రినాడు మల్లికార్జునస్వామిని దర్శించాలని నేనూ మరి కొందరు యాత్రికులూ శ్రీశైలం అన్న దక్షిణకాశికి బయలుదేరాము. దీపాలు పెట్టేవేళకు కొండదగ్గరకు చేరాము, ఆనాటి సూర్యా స్తమయంవంటి దానిని నేటివరకూ నేనెప్పుడూ చూడలేదు. ఆకాశమంతా బంగారుమయ మయింది. ఆ వర్ణసమ్మేళనంలో మా చుట్టూవున్న గుట్టలూ రాళ్ళూ మిలమిల మెరిశాయి. మేమెక్కవలసిన శ్రీశైలం – ఆ పరమేశ్వరుడివలెనే ఉన్నతమై, మేఘాలనంటుతూ నిల్చుని వుంది. ఆకాశమంతటా చెదరివున్న మేఘాల మధ్యమధ్య నక్షత్రాలు తొంగిచూస్తున్నాయి.
ఆ కొండల అందాన్నిచూచి ఆనందిస్తున్న మాకు వాటిచుట్టూరా వెలుగుతూ పరుగెడుతూన్న రెండు కిరణాలవంటి జ్వాలలు కనిపించాయి. ‘కార్చిచ్చులంటే ఇవే కాబోలు’నని చర్చించుకున్నాము, చూస్తుండగానే ఆవి ఆ ప్రక్క కొండలోకి వెళ్ళి మాయమయ్యాయి. కాసేపటికి మళ్ళీ ప్రకాశవంతంగా కనపడి క్రమంగా చిన్నవయి అంతరించాయి. ‘కొరివిదయ్యాలు ‘అని వర్ణించారొకరు. కాని ఒక ఆంధ్రదేశపుయాత్రికుడు . “ఇది కొరివి దయ్యం కాదు, సాధారణంగా అవి సమతల ప్రదేశాలలోనే తిరుగుతుంటాయి. కాని ఈ జ్వాలలు వేరు. ఈ ప్రాంతంలో ఒకప్పుడు జరిగిన అపూర్వ సంఘటనే వీటికి కారణం” ఆన్నారు. మేమందరూ కుతూహలంతో “అదేవిటి చెప్పండి !” అని ఆయనను చుట్టుముట్టాము. ఆయన చెప్పసాగారు.
చాలారోజులకు ముందు జరిగినదిది. అప్పుడీ ప్రాంతమంతా పెద్ద అడవిగా,క్రూరమృగాలకు ఆలవాలమై వుండేది. ఎంతో ధైర్యం పున్నవారు గాని శ్రీశైల యాత్రకు పూనుకునేవారు కారు. అప్పుడు _ ఏనుగులుకూడా కొట్టుకుపోయేటంత వేగంగా ప్రవహించేవట కొండవాగులు, అదిగో కన పడుతున్నదే శ్రీశైలానికిదగ్గర ఒక గుట్ట, అక్కడ పూర్వం ఒకప్పుడు నందిదేవుడు అని ఒక సన్యాసి వుండేవారు. సందడిలేని ఆ ప్రశాంత ప్రదేశంలో ఆయన ఏకాంతవాసం చేస్తూండేవారు. ఒకరోజు ఆయన అలవాటుచొప్పున శ్రీశైలనాధుడివి దర్శించి తమచోటికి వస్తున్నారు. నిర్మలమైన తెల్లటి పుష్పం ఆయన చేతిలో వుంది. ఆలయంలో పూజారి ఇచ్చిన ప్రసాదాన్ని నోట్లో వేసుకుని పువ్వుల్ని జడలోకి తురుముకున్నారు, దారిలో ఆ వనమంతటా నిండిన వనంతకోభ ఆయనకు ఆనందం కలిగించింది. జింకలు భయమేమీలేకుండా ఆయనను సమీపిస్తున్నాయి. ప్రకృతి అంతా ఆనాడేదో ఒక విచిత్ర స్థితిలో వున్నట్లుంది. సన్యాసికి తాము చిన్నప్పుడు చదివిన కావ్యాలు గుర్తువచ్చాయి.
“ఇదేమి ! ఎన్నడూలేని కలవరమేదో నామనసు నావరిస్తున్నది ! నా వైరాగ్యానికి భంగం వాటిల్లుతుందా? ఓ వసంతమా! ఎవరి ఏకాగ్రతను, దీక్షను పాడుచేయడానికి ఈ ప్రయత్నమంతా ? ఆ కాముడినే దహించిన నా ఈశ్వరుడున్నాడులే. మనసా… స్థిరంగావుండు” అనుకున్నారు తమలో. ప్రక్కన చెట్లు కదలడంచూచి నందిదేవులు తిరిగిచూశారు. ఏదయినా క్రూరజంతువేమోనని సంశయించారు, అయితే ఒక అద్భుతదృశ్యం ఆయనను స్తంభింపచేసింది. రెండు మృదువయిన చేతులతో ముళ్ళపొదలను తొలగించుకువి ఒక కుర్రవాడు తమవైపు రావడం చూశారు.ఆ చిన్నవాడు మురికిగావున్న కాషాయవస్త్రాలు ధరించివున్నాడు. ఒంపులుతిరిగిన జుత్తు మెడమీద పడివుంది. ముళ్లను తొలగించుకుని రావడానికి అతడి చేత కాలేదు. ఆతడి కళ్ళల్లో ఏదో బెరుకుతనం; మనసు కరగించే చూపులవి.
దిగ్భ్రమంతో నిలచారు సన్యాసి, ఆ వనంలో గంధర్వునివంటి ఆ బాలకుడినిచూడగానే ఆయన మనసు తనంతట తానుగా అతడివైపు పరుగెత్తింది.“ఒకవేళ ఆ కుమారస్వామియే ఇట్లా వచ్చాడా? లేక మరెవరయినా దేవతా ? బాలకా! నీ రాక వలనేనా నేడు ప్రకృతి అంతా వినూత్నంగా శోభిస్తున్నది? నేను దేనితో స్వాగతమిత్తునయ్యా నీకు….” అవి ఏమేమో అనుకున్నారాయన. అయ్యో, ఆ కళ్ళలోని చూపు. ‘నన్నెవరయినా రక్షించరా?’ అని అడుగుతున్నట్లుంది.
ముళ్ళపొదలో చిక్కుకున్న కుర్రవాడినిచూచి “అబ్బాయీ! నువ్వు అక్కడే వుండు. నేనువచ్చి విడిపిస్తాను”అన్నారు. అతడట్లాగే నిలిచాడు. నందిదేవులు చాల ఒడుపుగా అతడిని పొదనుండి బయటకు రప్పించారు. అయినా అతడి సుకుమార శరీరంలో ఎన్నోచోట్ల రక్తపుచారలు కనుపించాయి. అతడి సిగలో వున్న రెండు అడవి పుష్పాలను చూచి అతడి సౌందర్యేచ్చకు సంతసించారు నందిదేవులు, బయటికిరాగానే బాలకుడు ఆయన పాదాల నమస్కరించాడు.
అతడు “స్వామీ: దగ్గరలో ఏదయినా. వూరుందా?’ అని అడిగాడు. ఆ అమృత సదృశమైన వాక్కు, ఆ సన్యాపిచెవులకు సంగీతంలా వుండింది,“నాయనా! ఈ నట్టడవిలో ఎవరయినా వుంటారా? నువ్వెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు?” అనీ అడిగారు… ఆ చిన్నవాడాయనను చూస్తూ తన మృదుమధుర స్వరంతో చెప్పసాగాడు.తానూ, తన తండ్రీ భద్రాచలంనుండి ఇల్లువిడిచి కేత్ర సందర్శనార్థం బయలుదేరి ఆరునెలలయిందనీ, శ్రీశైలం సమీపానికి రాగానే తనతండ్రి జబ్బుపాలయి. నడవ శక్తిలేక క్రింద పడిపోయారనీ, దిక్కేమీతోచక తల్లడిల్లుతుండగా, ఒకచోటినుండి పొగరావడం చూచి ఎవరయినా సాధువులుంటారేమోనని వెతుకుతూ వచ్చినట్లు చెప్పాడు. “మీ నాన్నగారెక్కడ వున్నారు? ” అని అడిగారు సన్యాసి. ఆ చిన్నవాడి సరళత ఆయనను ఆకర్షించింది. అతడాయనను పిలుచుకుని కొంత దూరంలో వున్న ఒక పొద దగ్గరికి వెళ్ళాడు.
సన్యాసి, మాట్లాడకుండా పడుకుని వున్న ఒక ముసలాయనను చూచారు. ఉండుడి ఆ వృద్ధుడు “అయ్యో!పార్వతీ!” అని కేకపెడుతున్నాడు. కుర్ర వాడు పరుగెత్తుకువెళ్ళి తండ్రి తలను తన ఒడిలో వుంచుకుని “నాన్నా: ఇంక భయం లేదు, దేవుడు మనకీ సాధువునిచ్చాడు. నువ్వు మెల్లగా లేచికూర్చో” అని ప్రేమతో అన్నాడు. ఈ దయనీయమైన దృశ్యాన్ని చూడగానే సన్యాసి మనసు ఆర్ధ్రమయింది.
ముసలాయన కళ్లుతెరిచి ఆయననుచూచి, చేతులెత్తి నమస్కరించి, “శ్రీశైలనాథా!నువ్వే ఈ రూపంలో వచ్చావు, నాజన్మ సఫలమయింది. ఇక నేను కన్నుమూసినా ఫరవాలేదు. ఈ పార్వతిని నీ కప్పగిస్తాను”అవి బలహీనమైన స్వర౦తో అన్నాడు. చీకటి పడసాగింది. ఇంకా ఆలస్యం చేస్తే కొండ శిఖరంపైవున్న తమ నివాసస్థలానికి పోవడం కష్టమవుతుంది. ఆ అబ్బాయి తన తండ్రినెలా తీసుకుపోవడం అని ఆలోచిస్తుండగా, నంది దేవులు ‘వత్సా ! నువ్వు చింతించకు. నేను మోసుకుని పోతాను. నువ్వు మీ సామానులన్నిటిని తీసుకుని రా!’ అన్నారు.
యవ్వనమూ, దేహదారుఢ్యమూ కలిగిన ఆ సన్యాసి వృద్ధుడిని సునాయాసంగా ఎత్తి భుజంమీద వేసుకున్నారు.
ముసలాయన సంకోచంతో-‘అయ్యో, నేను మిమ్మల్ని కష్టపెడుతున్నాను,” అన్నారు. సన్యాసి ఆ మాటలను పట్టించుకోక, “రా, పార్వతీ నాధా” అన్నారు.
తమ సామగ్రిని మూటకట్టి భుజానవేసుకుని బయలుదేరాడు బాలకుడు. ఉన్నట్లుండి అతడిదృష్టి నేలమీదకు ప్రసరించింది. “ఇదిగో, మీ మందార పువ్వు” అన్నాడు. ముసలా యనను ఎత్తుకుంటున్నప్పుడు సన్యాసి జడలో నుండి ఆ పువ్వు క్రింద పడింది, “అదలా వుండనీ! నువ్వు రా” అన్నారు నందిదేవులు.
“అదేమిస్వామీ; శివ నిర్మల్యం కదా, ఎవరికాలికయినా తగిలితే?” అని దానిని కళ్లకద్దుకుని తన సిగలో ముడుచుకున్నాడా అబ్బాయి. అతడిభక్తిని చూచి విస్మయమందిన సన్యాసి తనశ్రమ నొకింత మరచిపోయారు.
కొన్నినెలలు గడిచాయి. సన్యాసి చికిత్సవలన ముసలాయన ఆరోగ్యం కోలుకోసాగాడు. ఆ కొండలలోని ఊటల నీటివలన, ఆ గాలివలన ఆయన స్వస్థుడయ్యాడు. పార్వతినాథుడు ఆ కొండలలో కోనలలో గంధర్వకుమారునివలె విహరిస్తూ కాలం గడిపాడు. ఆ వనసౌందర్యమంతా అతడి వదనంలో ప్రతిఫలించింది. అతడి చిరునవ్వు ఆ కొండ యేటిగలగలను పోలి వుంది. ఆ చెట్లూ, పువ్వులూ, జింకపిల్లలూ అతడి నెచ్చెలులయ్యాయి.
ముసలాయనకు మళ్ళీ క్షేత్రాలు చూచిరావాలన్న కాంక్ష పొడసూపింది.ఎన్నిరోజులని ఒక సాధువు కు అతిథులుగా వుండడం ? “ఇకమీద ఇక్కడ వుండడం తగదు” అనుకుని అహోబిలానికి పయనమయ్యారు. సన్యాసి “మీరు పోవచ్చుగాని రానున్నది వర్షాకాలం; అహోబిలం చేరడం కష్టం” అన్నారు. వృద్ధుడు సరేనని, మరి రెండునెలలాగి వెళ్ల డానికి సమ్మ తించాడు. కొన్నినెలల సాన్నిహిత్యమే. సన్యాసికి పార్వతినాథన్ మీద ఎనలేని పేమ కలిగింది. కుర్రవాడి స్నేహపాశం ఆయనకు చుట్టుముట్టింది.
ఒకరోజు సన్యాసి తమ గుహకెదుట ఒకరాతిమీద కూర్చుని ఆలోచించ సాగారు, “అతడు వెళ్ళిపోతే ఇక్కడ ఏమున్నది?” అవి అనుకుంటున్నప్పు డాయన ఒళ్లు జలదరించింది. “ఆదిశంకరులు ఈ మోహాన్నే పాశం అన్నారు. ఇదింకా నా మననులో తిష్టవేసుకువి వుంది. దానిని త్రెంచివేయాలి” అనుకున్నారు. కొండల రాతిగుండెను చీల్చుకుని దూకిననీరు గలగలమని పారుతూంది. సన్యాసి ఆకాశాన్ని చూశారు. గుంపులు గుంపులుగా మేఘాలు, కొండలలో నీడ వ్యాపించసాగింది. అంతకుముందు వెలుగు నారగించిన చెట్లు చీకటిలో కరగనున్నాయి. ఇంకొంతసేపులో వాన కురవబోతున్నది, మనసులో ఏదో భారంతో నిట్టూర్చి, లేచి గుహలోకివెళ్ళ నుద్యుక్తుడయిన ఆయనకు…..కాస్త దూరంలో నీటిలో కాళ్ళాడిస్తూ ఆకాశం వైపు చూస్తూ కూర్చున్న పార్వతినాథన్ కనుపించాడు. సన్యాసి చూపు అతడి చూపులతో కలిసినపుడు అతడి మొహంమీద చిరునవ్వు వెలిగింది. అమ్మాయిలకు నహజమైన సిగ్గు అతడి ప్రతి అవయవంలోనూ తోచింది.
సన్యాసి అతడిని సమీపించి “నువ్వెందుకు ఒంటరిగా కూర్చున్నావు, పార్వతీ? “అని అడిగారు. “మీరేమో నన్నుగురించి పట్టించుకోరుకదా…. నామీద మీకెందుకో కోపం….” అన్నాడు పార్వతినాథన్. అతడి స్వరంలో ఎంతో ఆవేదన వినిపించింది, ఆ యువ సన్యాసి అతడిని సమీపించి, అతడి శిరస్సుపై చేతినుంచి “నాకెందుకు కోపం? నా మనసేమీ బాగులేదు. అందుకనే నీతో మాట్లాడలేదు” అన్నారు. “మేము వెళ్ళిపోతున్నాముగా, మీరింక ఒంటరిగా హాయిగా వుండవచ్చు” అన్నాడు పార్వతినాథన్. ఈ మాటలు సన్యాసి మనసున ములుకులై నాటాయి. ఆయన మొహం వాడింది. “స్వామీ ! మేము అహోబిలం చేరడానికి ఎన్నిరోజులవుతుంది?” “కనీసం మూడునెలలయినా పట్టవచ్చు. దారిలో ఎన్నోకష్టాలను ఎదుర్కోవలసి వుంటుంది” అన్నారు సన్యాసి.
“మేమువెళ్ళి ఇక్కడికే వచ్చేస్తాము: అప్పుడు నేను మీ శిష్యుడినయి పోతాను” అన్నాడు పార్వతి.
“ఛీ: ఇక్కడ ఎన్నోకష్టాలు…. నువ్వు మీవూరికి వెళ్ళి సుఖంగా బ్రతుకు,”
“అవేమీ వద్దు. నేను మీవద్దనే వుండి పోతాను.”
అప్పుడు జోరుగా వాన మొదలయింది, పార్వతి సన్యాసినిచూచి “రండి.గుహలోపలికి వెళ్ళిపోదాం” అన్నాడు.
హోరుమంటూ గాలీవానాకలిపి చెట్లమీద, వాగులమీద కొండ శిఖరం మీద తాండవనృత్యం చేయసాగాయి. ప్రకృతియొక్క. విలయతాండవం చూచి కుర్రవాడి హృదయం గంతులు వేసింది. జింకవలె గెంతుతూ అతడు తన జుత్తు గాలికి ఆడగా – గుహవైపు పరుగెత్తాడు. సన్యాసి దిగులుతో అతడి వైపు చూస్తూ—.”పార్వతీ! వెనక్కు వచ్చేయి” అని అరిచారు. రాళ్ల సందులలో దారులుచేసుకొని పారుతున్నాయి వాననీళ్లు. గాలి వేగంతగ్గి వాన అధికమయింది. చెట్లు తదేక ధ్యానంగా స్నానం చేస్తున్నట్లున్నాయి. కారు మబ్బులు కొండ శిఖరానికి అభిషేకం చేస్తున్నాయి. మెరుపులు శివుడి జడలో మెరుస్తున్నాయి.
వర్షాకాలం ముగిసింది. కుర్రవాడూ, ముసలాయనా అహోబిలానికి బయలుదేరారు. అబ్బాయి ‘వెళ్ళివస్తాను’ అని చెప్పనయినా చెప్పకుండా ఆ కొండలదారి వెంబడి చకచక నడవసాగాడు, అతడి తెలియరానితనావ్ని ఎత్తిచూపుతూ ముసలాయన.’పిల్లలందరూ ఇంతే’ నన్నారు.
“అవును. పిల్లలూ ఈ అడవిలో జింకలూ అంతే. వాళ్లెన్ని కొంగ పనులు చేసినా ముచ్చటగానే వుంటుంది. నాకు, ఈ ఇర్వురూ ఎప్పుడూ ఇష్టమే’…. అన్నారు సన్యాసి. ఆయన గుండెలలోవి గుబులంతా పగిలి ఆ మంటలలోకి వచ్చిందా అనిపించింది.
వారు కనుమరుగయ్యాక సన్యాసి తమ గుహను చేరారు, అప్పుడెవరో వస్తున్న శబ్దం వినిపించింది. ఆయన గుండె వేగంగా కొట్టుకుంది. అదే పాదాలసవ్వడి! పార్వతినాథన్ పరుగెత్తుకువచ్చాడు.
“ఎందుకు వెనక్కు. వచ్చావు?” అని అడిగారు నందిదేవులు.
“ఇక్కడో వస్తువు మరిచిపోయాను” అంటూ గుహలోనుండి వాడిన ఆకువంటి దానిని దేనినో చేతిలో తీసుకువచ్చాడు. “ఏమిటది?” అని అడిగారు సన్యాసి. సన్యాసి గుహలో ఒకమూలగా హోమాగ్ని నెమ్మదిగా మండుతూంది. ఒక పెద్ద సమిధను తీసి దానిలోవుంచి, పాల్గారే చిరునవ్వుమొగంతో, “ఈ పొగ గుర్తుగా నేను మిమ్మల్ని చేరగలిగాను. ఇంకో రెండేళ్లలో నేను తవ్పకుండా వస్తాను. అప్పుడుకూడా ఇది దారిచూపగలదు. ఇది ఆరిపోకుండా చూచుకోండి, మరవకండి” అని చెప్పాడు. ఇది అసాధ్యం, ఏదో కుర్రవాడు చెబుతున్నాడంతే అనిపించినా సన్యాసి తల ఊపారు. మొహంమీద నమ్మకం తాండవిస్తుండగా అబ్బాయి కొండలవెంబడి నడిచి మాయమయ్యాడు.
ఆ వైపే చూస్తూ నిల్చున్నారు సన్యాసి, ఆ కొండల అందమే నడిచివెళ్ళిపోయినట్లయింది. కోసేవారులేక చెట్ల మీద పువ్వులు దిగాలునడినట్లున్నాయి. ఆ బాలకుడి మందహాసాన్ని మోయకుండా వెళ్ళింది మందమారుతం. అన్నీ శూన్యం అనిపించాయి. అతడు అడవిలో ఎక్కడో దాగుకుని తటాలున పరుగెత్తివస్తున్నట్లు అనిపించింది సన్యాసికి.
“ఛీ! ఏమిభ్రమ! అతడిక్కడ లేడుకదా?” అనుకునేవారు. సూర్యుడు పడమట ఎప్పడు గుంకాడో సన్యాసికి తెలియదు. నక్షత్రమాలను ధరించిన రాత్రి ఆయన తలమీదుగా వెళ్ళింది. ఉషఃకాంతి ప్రసరించంగా కొండ చరియలన్నీ వెలిగాయి. ఊబలో స్నానంచేవి అర్ఘ్యం వదిలారు నందిదేవులు.
“ఈ వేళప్పుడు ఒక మధురస్వరం ఉదయగీతాన్ని ఆలపించేది; ఇప్పుడది ఎక్కడ ?”
కాలచక్రం దొర్లింది. వసంతకాలం, శరత్కాలం మొదలయిన బుతువులు వెళ్ళాయి, హోమాగ్ని, పొగను క్రక్కుతూ ఆరిపోకుండా మండుతూంది.
మళ్ళీ వర్షాకాలం మొదలయింది. దానితర్వాత, వేసవి అడుగుపెడుతూ వుంది. సన్యాసి ప్రార్ధన నెరవేరినట్లేనా? కుర్రవాడు ఆయనను మరిచిపోయి వుంటాడు, ఇపుడు బుద్ధి వచ్చి వుంటుంది. మండు టెండలు వచ్చాయి. కొండచుట్టూ తెల్లటి వేడి. ప్రకృతియొక్క పచ్చముసుగు ముగిసిపోయి, నీటివాగు ఒక చారగా మిగిలింది. ప్రకృతికి అలసటెక్కడిది? మళ్ళీ వాన మొదలయింది. మొదట తుంపరగా బయలుదేరి పెద్దగా అయింది, తొలకరి పడగానే ఎన్నో రంగురంగులపువ్వులు కనపడి మాయమయ్యాయి. పాత దుమ్మునంతటినీ చిమ్మి వేయడానికి కుండపోతగా వర్షించింది.
ఎండాకాలపు దాహంతీరింది ప్రకృతికి; అయినా ఈ హృదయతాపం శమించి ‘జ్ఞాన’మనే విత్తనం అంకురించదెందుకో …
ఆరోజు బాగా వర్షం కురుస్తూంది. సన్యాసి తమ గుహలోకి వచ్చి చూడగా హోమాగ్ని ఆరిపోయివుంది. “అ ఆరిపోయిందా? ఇవాల్టికి అతడువెళ్లి సరిగ్గా రెండేళ్ళయింది కదా? ఆవేళ అతడు రగిల్చి వెళ్ళిన వాంఛ అనే జ్వాల నేడారిపోయిందా? ఇది విముక్తికి సూచనా?” అనుకున్నారు. చాంచల్యం ముగిసి ఆయన వదనంలో శాంతి నెలకొంది. ధ్యానం ముగించి ఆయన కళ్ళు తెరిచే సరికి సూర్యుడు అస్తమించాడు, గోధూళి సమయపు మసక వెలుతురు, ఆయన బయటికి వచ్చిచూడగా, కాషాయం ధరించిన వ్యక్తి ఎవరో ఎదుట వున్న రాతిమీద కూర్చుని వుండడం కనవడింది. సన్యాసి శరీరం పులకించింది.
‘ఇది ఎవరు? ఆతడేనా?’ అనుకున్నారు.
‘స్వామీ’, అంది ఒక మంజుల స్వరం.
‘నువ్వెవరు?’
జవాబేమీ ఇవ్వకుండా ఆయన పాదాలనంటింది ఆ ఆకారం. ముఖం అదే, చాయ ఆదే! అయినా అతడివలె లేదే? ‘రెండు సంవత్సరాలలో ఇంత మార్పా?
‘పార్వతియా?’ అని అడిగారు నందిదేవులు.
‘మీరు నా అగ్నిని ఆర్పి వేశారెందుకు? నేడు నే నీ చోటుని కనుక్కోవడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా?’
సన్యాసి సంభ్రమంతో ‘నువ్వా?’అన్నారు. మళ్ళీ పరికించగా పార్వతీనాథుడి యొక్క పోలికలన్నీ ఈ పూబోడిలో కనుపించాయి.
సన్యాసి పాదాల దగ్గర కూర్చుని, ‘మా నాన్న మరణించారు; ఆరునెలలయింది. ఎన్నో అవరోధాలనధిగమించి నేను ఇక్కడికి వచ్చాను. మీరు నన్ను గుర్తుపట్టలేదా?” అంది ఆ కోమలి.
‘ఇవ్వాళే ఆరింది, రెండేళ్ళుగా మండుతున్న ఆ హోమాగ్ని. పాత పార్వతినాథన్ క్రొత్త పార్వతిగా మారినందువలననే అది ఆరిపోయినదేమో?”’
‘ఆడది అన్న కారణంచేత నాకు దారిలో ఎట్టి కీడూ జరగరాదన్న కారణం చేత నాన్న నాకు మగవాడి వేషం వేసి వుంచారు. ఆయన ఆ విషయం మీతో చెప్పలేదు. నేను మునుపూ ఇదే పార్వతినాథనే: ఇప్పుడూ ఆమెనే: నాన్న అహోబిలంలో మరణించారు, నేను ఒంటరిగా బయలుదేరాను.’
‘ఎందుకు వచ్చావు?’
“ఎందుకా? ఆ యువతిచూపులలో వేదన స్పష్టమయింది. “ఎందుకా? మీ దగ్గరికి రాక ఇంకెక్కడికి పోగలను ?”
సన్యాసి తల వంచుకున్నారు. ‘అయితే మీనాన్న నీకేమీ ఏర్పాటు చెయ్య లేదా?’ అని అడిగారు.
‘ఏర్పాటు చేశారు. కాని నాకది నచ్చలేదు. మీ శిష్యురాలిగా వుండడానికి నిశ్చయించాను.”
‘నువ్వు ఆడదానివికదా…. నిన్నెట్లా స్వీకరించను ?’
‘ఎందుకు స్వీకరించరాదు? ఆడవారు సన్యాసినులు కాకూడదా?’
‘నువ్వు మీ వూరికి పోవడమే మంచిది.’
‘పోకపోతే మెడబట్టి గెంటుతారా?’
‘అవును’ అన్నారు సన్యాసి జంకుతూ. కొండా కోనా చెట్టూ పుట్టా ఆ దృశ్యానికి మూగ సాక్షులుగా వున్నాయి.
‘పార్వతీ! నువ్వు భోజనం చెయ్యలేదుగా? వెళ్ళి స్నానం చేసిరా!తర్వాత మాట్లాడుదాము’, అన్నారు నందిదేవులు.
ఆ వనితామణి కదలలేదు. సన్యాసిపలుకులామె మనసుకు, ములుకులయ్యాయి. తన మనోరథం ఈదేరేవేళ ఈ ప్రాతికూల్యమూ, నిరాదరణా. ఆమెను దహించివేశాయి. కండ్ల నుండి నీరు బొటబొట కారింది. ఆమె పెదవులు కంపించాయి.
‘పార్వతీ, నోమాట విను’, అన్నాడు సన్యాపి.
శిల్పం వలె నిలిచి వున్న ఆమె-‘అయితే నా కిక్కడ వుండడానికి అనుమతి ఇస్తున్నారా? ఆమాట చెప్పండి. ఆ తర్వాత ఏదయినా తింటాను,’అని సన్యాసి చేతులుపట్టుకుని ఆయన కళ్ళల్లోకి చూచింది.
‘అట్లాగేలే । మవ్వు త్వరగా స్నావం ముగించి రా’, అన్నారు నందిదేవులు.
పార్వతి వాగులో స్నానంముగించి, సన్యాసి తినగా మిగిలిన పండ్లను తిని,నడచివచ్చిన అలసటచేత గుహలో పడుకుని నిద్రపోయింది ఆమె. నల్లటికురులు కారుమేఘాలవలె వ్యాపించాయి. వాటినడుము చంద్రబింబం పోలివుండింది ఆమెముఖం. ఆమె ప్రక్కగా కూర్చున్న సన్యాసి మనసులో ఎన్నో ఆలోచనలు బయలుదేరాయి. ‘ఛీ! నేను ఏకాంతాన్ని కోరి వచ్చిందెందుకు?….ఈమెను విడిచి పారిపోవాలి….అయ్యో! అట్లా చేస్తే ఈమె ఏమవుతుందో….మరి నా తపన్సంతా దండగవుతుందే! మనసా! కఠినంగా వుండు…..చెదరిపోకు” అని కృతనిశ్చయులై ఆయనలేచి పక్కనున్న కొం డమీదికి వచ్చారు. సన్యాసికీ, పార్వతికీ మధ్యనున్న పాతాళగంగలో వర్షపు నీరు సుళ్లు తిరుగుతూ కడువేగంగా పారుతూంది. “అయినా చావుని కూడా లక్ష్యం చేయని ప్రేమ వాహిని నది సాటికాదు! తాను ఈ ప్రక్క ఇక్కడ వుంటే ఆమెకెట్లా తెలియగలదు? ఈ కొండ సూటిగా ఎత్తుగా వుంది. ఈ గంగని దాటి రాగలదా ?” అనుకున్నారు సన్యాసి.
రాత్రి అయింది, తానున్నచోటు ఆమెకు తెలిసిపోతుందేమోనని నందిదేవులు నిప్పు ముట్టించలేదు. “అయ్యో! ఈ అమ్మాయి ఎందుకో నామనసున ఆరని చిచ్చును పెట్టింది. అది ఆరిపోతుందా?’ అనుకున్నారు. అకులు గలగలమంటే ఆమె వచ్చిందేమోనని ఉలిక్కిపడేవారాయన.
చూస్తుండగా కారుమబ్బులు క్రమ్ముకువచ్చి వర్షం కురవసాగింది. “ఇటువంటి సమయంలో పార్వతిని ఒంటరిగా వదలి వచ్చామే….ఆమె భయపడుతున్నదేమో….” అని ఆయన హృదయం ఉరుములకనుగుణంగా దడదడ కొట్టుకోసాగింది. ఎవరో అల్లంతదూరాన – ఆ ప్రవాహానికి సమీపంగా “ఓ”మని రోదిస్తున్నట్లు వినిపించింది. ‘దేవుడా; ఈ మనసుకు శాంతే లేదా?”’ అని విలపించారు సన్యాసి. వర్షం జోరుగా కురుస్తుంది. ఎక్కడ చూచినా నీళ్ళే!
ఆ కారుచీకటిలో ఒక మెరుపుమెరిసింది, ఆ వెలుగులో అవతలిఒడ్డున ఎవరో తల విరియబోసుకువి ‘అయ్యో!’ అని అరుస్తున్నట్లు వినిపించింది. అది ఆ పార్వతి గొంతులా వినిపించింది.
మళ్ళీ ఒక మెరుపు, అదిగో ఆమే, ఎదుటి ఒడ్డున నిల్చునుంది. ‘వెలుగు చూపండి…..నాకు దారి తెలియలేదే….మిమ్మల్ని ఎట్లాగయినా చేరితీరుతాను. ఒక్కసారి వెలుగు చూపండి….’ ఆమె ఇంకా ఏమో అన్నది గాని గాలి హోరులో అది వినిపించలేదు, ఒక్కక్షణం సన్యాసి మనసు చలించింది. మరుక్షణం దృఢమయింది, మళ్ళీ ఎదుటి ఒడ్డునుండి ‘కొద్దిగా వెలుగు: అయ్యో….నన్ను విడిచి పోకండి….ఇదిగో మిమ్మల్ని చేరుతున్నాను’ అన్నధ్వని వినిపించింది. సన్యాసి కేమీ వివిపించలేదు. నిప్పు నంటిద్దామని ఆయనచేతులు కదిలాయి. సరిగ్గా అప్పుడే దభాలున ఎవరో పడ్డ చప్పుడయింది, పార్వతి పాతాళగంగలో దిగింది. సన్యాసి మ్రానయి నిలిచిపోయారు. ఆ ప్రవాహం మధ్యనుండి అస్పష్టంగా-‘వెలుతురు…. వెలుతురు.మీరెక్కడ ? ఎక్కడ….’ అని వినిపించింది. ఆ చెట్లూ, కొండలూ‘ఎక్కడ ? ఎక్క… ఎ…ఎ.’ అంటూ ప్రతిధ్వనించాయి.
ఎదుట నదిలో సుడులు తిరుగుతూ ఎర్రటినీరు పొంగి ప్రవహిస్తూంది.సన్యాసి మొహంలో ఎన్నడూలేని ప్రశాంతి గోచరించింది. మండుతున్న సమిధను చేతబూని, పార్వతిని రక్షించడానికని ఆ నీటిలోకి దూకారు వెంటనే. కారుచీకటి కమ్ముకుంది. ఆన్నీ అదృశ్యమయ్యాయి.. వెల్లువ వేగంగా పరుగిడసాగింది.
ఆ స్త్రీ వెల్గించిన అగ్ని ఇంకా చల్లారలేదు. ఇద్దరూ ఆ వెల్గులలో ఒకరినొకరు వెతుకుతూ పరుగెడుతున్నారు; నేటికీ పరుగెడుతున్నారు.
ఎదుట శ్రీశైలం. ఆ ప్రక్కన కొండలూ గుట్టలూ మసకగా కనపడుతున్నాయి. ఈ నడుమ విశాలంగా పరచుకుని వున్న ఆకాశంమీద లెక్కలేనన్ని నక్షత్రాలు. అదిగో ఇంకా మండుతుంది వాళ్లు వెలిగించిన మంట. నది వెంబడి వెళ్తూంది, మళ్ళీ అదృశ్యమవుతూంది.
* * *
Excellent.