‘భూమిక’ The Role ఎ ఫిల్మ్‌ బై శ్యాం బెనెగల్‌

Spread the love

S M I T A P A T I L

A Barometer for Accomplishment

మహారాష్ట్రలో ఓ మారుమూల కుగ్రామం.

ఒక అందమైన దేవదాసీ, వయసులో పెద్దవాడైన

ఓ బ్రాహ్మడు (బి.వి.కారంత్‌) భార్యాభర్తలు .

వాళ్ళకో పదేళ్ళ కూతురు ఉష. శాస్త్రీయ సంగీతంలో ఆరితేరిన ఉష అమ్మమ్మ కూడా వాళ్ళతోనే.

దిగువ మధ్యతరగతి కుటుంబం. పెద్దాయనకి జబ్బు. కేశవ్‌ (అమోల్‌ పాల్‌కర్‌) అనే యువకుడు వాళ్ళకి అండగా వుంటాడు. సాయపడుతుంటాడు.

ఉష గట్టిది. మొండిది. మాటవినే రకం కాదు. సరదాకి అన్నట్టు కేశవ్‌ ఉషని పట్టుకుని, నన్ను పెళ్ళి చేసుకుంటావా? అంటాడు.

నేను చేసుకోను…చేసుకోనని తెగేసి చెబుతుంది. అమ్మమ్మ పాడే ‘‘మోందర బాజు బాజురే’’ పాట వింటూ, శ్రావ్యంగా ఆలపిస్తుంది.

పెద్దాయన జబ్బుతో చనిపోతాడు.

ఉష గనక సినిమాల్లో పాటలు పాడితే బతుకు బావుంటుందని కేశవ్‌ వాళ్ళని వొప్పిస్తాడు. బతుకు తెరువుకి మరో గత్యంతరం లేదు. ఇదంతా బ్లాక్‌ అండ్‌ వైట్‌లోనే వుంటుంది. నలుపు తెలుపూ గ్రామం నుంచి ఉష లంగాపట్టుకుని పరిగెత్తుకుంటూ మల్టీకలర్‌లోకి వచ్చేస్తుంది. కట్‌ చేస్తే ముంబై. తిప్పలు పడ్డాక సినిమా అవకాశాలు వస్తాయి. చిన్నారి ఉష, టీనేజ్‌ స్మితా పాటిల్‌గా వికసిస్తుంది.

ఇక సినిమా వూపు అందుకుంటుంది . కేశవ్‌, ఉష మేనేజర్‌గా మారతాడు. సినిమా అవకాశాలు వస్తుంటాయి. చురుకైన అందమైన ఉష మీద కేశవ్‌కి మొదటి నుంచీ ఆశ. ‘అతను మన కులంవాడు కాదు’ అంటుంది తల్లి. కుటుంబానికి చేసిన సహాయానికి ప్రతిఫలంగా తల్లి వద్దన్నా ఉష అతన్ని పెళ్ళి చేసుకుంటుంది. వాళ్ళకో కూతురు. సినిమాలు మానేసి ఇంటిలోనే వుండిపోతానంటుంది ఉష.

మరో ఆదాయమార్గం లేదు గనక సినిమాల్లో నటించాల్సిందే అంటాడు భర్త. తప్పదిక….

ఓరోజు సినిమా హీరో రాజన్‌ (అనంత్‌నాగ్‌) ఉషని ఇంటి దగ్గర కార్లో దింపుతాడు. కేశవ్‌ చూస్తాడు. అనుమానం, అతనితో ఆమెకి సంబంధం వుందేమోనని! భార్యని అడుగుతాడు. విసిగిస్తాడు. వేధిస్తాడు. కొడతాడు. నేను తెచ్చే డబ్బుతో బతుకుతూ, నన్నే హింసిస్తావా? అని ఇంట్లోంచి విసురుగా వెళిపోతుంది. నిజానికి రాజన్‌తో ఆమెకి సంబంధం వుంటుంది. అతని దగ్గరికే వెళుతుంది. రాజన్‌ ఆమెని మనస్ఫూర్తిగా ఇష్టపడతాడు.

ఉష స్టార్‌ హీరోయిన్‌ అయిపోతుంది. నిర్మాతలు వెంపర్లాడుతుంటారు. రాజన్‌తోనూ కొన్ని అపార్థాలు, అపోహలు… అప్పుడు ఓ సినిమా డైరెక్టర్‌ (నసీరుద్దీన్‌ షా) పరిచయం అవుతాడు. వాళ్ళు చేరువౌతారు. తర్వాత ఒక హోటల్లో వుంటున్న ఉషకి

ఎదురు గదిలోంచి అమ్మమ్మ పాట వినిపిస్తుంది. తలుపుకొట్టి, లోపలికి వెళుతుంది. పెద్ద భూస్వామి అమ్రిష్‌ పురి వుంటాడు. దిగులుతో, మానసిక ఘర్షణతో ఎటూ తేల్చుకోలేని స్థితిలో వున్న ఉష అతనికి దగ్గరవుతుంది. గోవా దగ్గరలోని తన గ్రామానికి ఉషని తీసుకుని వెళతాడు.

‘‘నా రెండో భార్యకి పక్షవాతం. మంచంమ్మీంచి కదల్లేదు. పదేళ్ళ కొడుకు, అమ్మ వున్నారు’’ అని చెబుతాడు అమ్రిష్‌పురి. ‘నీకు ఇష్టం అయితేనే రా’ అంటాడు. గత్యంతరం లేక వెళుతుంది.

అదో కోటలాంటి పెద్ద గడీ. అక్కడ ఆ భూస్వామిని కాదనే వాళ్ళెవరూ లేరు. అతను వుంచుకున్నామెగా ఉషని అందరూ గౌరవిస్తారు. అతని తల్లితో, రెండోభార్యతో, కొడుకుతో ఒక సంప్రదాయ బద్ధమైన జీవితానికి అలవాటుపడుతుంది ఉష. భూస్వామి పదేళ్ళ కొడుక్కి ఉష నచ్చుతుంది. పక్కవూళ్లో సంతలాంటి ఒక సంబరానికి కార్లో వెళదాం

అంటాడు కుర్రాడు. ఆ ఇంటి ఆడవాళ్ళు ఎవరూ బయటికి వెళ్ళకూడదు. అది కట్టుబాటు.

ఆడది గడప దాటితే కొంపలు మునిగిపోవూ! సంప్రదాయాన్ని కాదని బైటికి వెళ్ళడానికి వీల్లేదు అంటాడు అమ్రిష్‌పురి. ఉష వాదిస్తుంది.

చెంప పగిలేట్టు కొడతాడు. అవమానం తట్టుకోలేకపోతుంది. మాజీ భర్త కేశవ్‌కి లెటర్‌ రాస్తుంది. అతను వచ్చి ఉషని తీసుకువెళ్ళిపోతాడు. ‘‘ఇంటికి రావేమోనని నీకోసం హోటల్‌ రూం బుక్‌ చేశాను అంటాడు. హోటల్లో ఆమె ఒక్కతే.

తోడుగా ఒంటరితనం!

ఒకటి, రెండు, మూడు, నాలుగు… బంధాలన్నీ తెగిపోయాయి. అది విముక్తో? విషాదమో?

దిగులు. ఏమీ తోచని తనం. ఫోన్‌ రింగవుతుంది. పాత ప్రియుడు రాజన్‌ పలకరిస్తాడు. రెండు

మాటలు మాట్లాడి, ఇక వూరుకుంటుంది.

ఉషా… ఉషా… ఉషా… అతను పిలుస్తూనే వుంటాడు, ఆమె రెస్పాన్డ్ కాదు . . రిసీవర్ పెట్టే స్తుంది . దేనిమీదా ఆసక్తిలేని ఒక విరక్తి….

సినిమా అయిపోతుంది.

తెగించి, ధిక్కారంతో, ధైర్యంగా స్వేచ్ఛగా బతికిన ఉష, ఆమె భవిష్యత్తు ప్రశ్నగా మిగిలిపోతాయి.

***

ఇది నిజంగా జరిగిన కథ. 1940 ప్రాంతాల్లో మరాఠీ, నాటకాలు, సినిమాల్లో స్టార్‌గా వెలిగిన హన్సా వాడ్కర్ అనే ఆమె జీవిత కథ. ఆమె తన ఇష్టం వచ్చినట్టు బతికింది. సంప్రదాయమూ, కట్టుబాట్లని విసిరికొట్టింది. కొన్ని సూపర్‌హిట్‌ మరాఠీ సినిమాలతో ఖ్యాతి పొందిన ఆమెని అరుణ్‌ సాధూ అనే జర్నలిస్టు అనేకసార్లు ఇంటర్వ్యూ చేసి లోకల్‌ పత్రికలో రాశాడు. ‘‘అడిగితే, చెబుతాను’’ అనే పేరుతో 1970లో ఆమె జీవిత కథ రాశాడు. ఈ సెలబ్రెటీ బయోపిక్‌కి శ్యాం బెనెగల్‌ పెట్టిన పేరే ‘భూమిక’. ఇందులో పల్లెలో ఉష బాల్యాన్ని బ్లాక్‌ అండ్‌ వైట్‌లో, ఇప్పటి జీవితాన్ని మల్టీకలర్‌లో చాలా ఎఫెక్టివ్‌గా తీశాడు దర్శకుడు. ఈ నాన్‌ లీనియర్‌ నేరేటివ్‌ …కథకి గొప్ప అందాన్ని ఇచ్చింది.

గోవింద్‌ నిహ్లనీ ఫొటోగ్రఫీ ..ఆ పాత ఇళ్ళూ,

ఇరుకు మెట్లూ, ఆ పురాతన కాలానికి మనల్ని లాక్కుపోతుంది. మృదువైన, సున్నితమైన సంగీతంతో వనరాజ్‌ భాటియా వెన్నాడతాడు. ‘మోందర బాజు బాజురే…’ అనే క్లాసికల్‌, రిపీట్‌ అవుతూ, ఆలాపన విరజాజి తీగలా మనల్ని చుట్టుకుంటూ వుంటుంది. ఆ అద్భుతమైన పాటని కిరానా ఘరానా అగ్రశ్రేణి గాయకుడు ఉస్తాద్‌ కరీంఖాన్‌ కూతురు సరస్వతి రాణె, ఆమె మనవరాలు మీనా ఫతేర్‌ పెకర్‌ పాడారు. మరో మంచి పాట ‘‘తుమ్‌హరె బినా జీనాలగే ఘర్‌మే’’…. ప్రీతీసాగర్‌ ఎంత సొగసుగా పాడిందో !

కొన్ని సన్నివేశాల్లో సంగీతానికి బదులు

నేపద్యం లో రేడియో వార్తలు వినిపిస్తుంటాయి. ప్రధానమంత్రి జవహర్లాల్‌ నెహ్రూ మాట్లాడుతూ

అని ఒకసారి, ఈరోజు మార్షల్‌ స్టాలిన్‌ చనిపోయారు అని మరోసారి, పాకిస్తాన్‌లో సైనిక తిరుగుబాటు యాహ్యఖాన్‌ నాయకత్వంలో ..

అని ఇంకోసారీ… దీనివల్ల సినిమాకథ 1950-60 ప్రాంతాల్లో జరిగినదని ప్రేక్షకుడికి రిజిస్టర్‌ అవుతుంది.

ఉష ఇంట్లోంచి వెళ్ళిపోయేటపుడు

భూస్వామి భార్య అంటుంది : ” మంచాలు మారతాయి . వంటిళ్లు మారతాయి .

మగాళ్ళ ముసుగులు మారతాయి .

మగాళ్ళు మాత్రం మారరు “

నాటకాల్లో డాన్సులు వేసి , తర్వాత సినిమాల్లో హీరోయిన్లు అయిన వాళ్ళని, వేశ్యలు గానో ,

పిలిస్తే వచ్చే వాళ్ళు గానో సమాజం చూస్తుంది.

వాళ్ళ జీవన విషాదాన్ని

భూమిక లో పవర్ఫుల్ గా ప్రజెంట్ చేశాడు బెనెగల్.

1977 నవంబర్‌ 11న ‘భూమిక’ రిలీజయింది. అంటే 46 ఏళ్ళయింది ఇప్పటికి! ఈ సినిమాలో నటించిన అమోల్‌పాలేకర్‌, అనంత్‌నాగ్‌, నసీరుద్దీన్‌షా, అమ్రిష్‌పురి… అప్పటికి చాలా యంగ్‌గా, ప్రామిసింగ్‌గా వున్నారు.

నాటికి స్మితాపాటిల్‌ వయసు కేవలం 22 ఏళ్ళు.

ఈ టాలెంటెడ్‌ ఆర్టిస్టులందరికీ ‘భూమిక’ ఒక Landmark film.

గాయపడినా, కోపంతో వూగిపోయినా, ఎదురు తిరిగినా, గొడవ పెట్టుకున్నా… ఎమోషన్ని తేలిగ్గా, సహజంగా పలికించే స్మితాపాటిల్‌ మొహమూ, ఆ విప్పారే విశాలమైన కాటుక కళ్ళూ మనం ఎప్పటికీ మరిచిపోలేని ఒక కళాత్మక అనుభూతిని ప్రసాదిస్తాయి. ఆమె తన సందిగ్ధంలో కీ , సంఘర్షణలోకీ , కన్నీళ్లు కురిసే చీకటి దారుల్లోకీ మనల్ని లాక్కుపోతుంది సౌందర్యంతో!

ఆ పట్టుదలా, మొండితనమూ, ఒక fit of emotationలో భర్తనో, ప్రియుణ్ణో వదిలి సుడిగాలిలా చెలరేగి వెళ్ళిపోయే తెగువా… హన్సవాడ్కర్‌ లోకి పరకాయ ప్రవేశం చేస్తుంది, ఆమె ఆత్మలో లీనం అయిపోతుంది స్మితా పాటిల్‌!

చిన్న వయసులోనే జాతీయ ఉత్తమ నటి

అవార్డు సాధించింది.

న్యూవేవ్‌, పేరలల్‌, ఆర్ట్‌ ఫిల్మ్స్‌లోనూ, పచ్చి కమర్షియల్‌ సినిమాల్లోనూ భారతీయ వెండితెరని వెలిగించి స్మితాపాటిల్‌ గొప్పనటిగా నిరూపించుకొంది.

నాలాగా స్మితాపాటిల్‌కి మీరూ పిచ్చి ప్రేమికులైతే, వీలైతే ఈ సినిమాలు చూడండి :

సత్యజిత్‌రే …‘సద్గతి’.

శ్యాంబెనెగల్‌ …మంథన్‌, నిశాంత్‌, భూమిక. గోవింద్‌నిహలానీ… ‘ఆక్రోష్‌’.

కేతన్‌మెహతా …‘మిర్చిమసాలా’!

కేవలం పది సంవత్సరాల్లోనే 80 సినిమాల్లో నటించిందామె. రాజ్‌బబ్బర్ని పెళ్ళిచేసుకుంది. ప్రసవించే సమయంలో కామెర్లు రావడం వల్ల 31 ఏళ్ళకే చనిపోయింది స్మితాపాటిల్‌.

ఆమె కొడుకు ప్రతీక్ . వాడివి అచ్చూ అమ్మకళ్ళే! ఒకటి రెండు సినిమాల్లో నటించినా హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు.

ఆమెని స్మరించుకుంటూ, ప్రపంచ కళల రాజధాని పారిస్‌లో స్మితాపాటిల్‌ ఫిలిం ఫెస్టివల్‌ జరిపారు.

ఇది ఒక భారతీయ నటికి దక్కిన అరుదైన గౌరవం.

super hero shyam benegal

రాబోయే డిసెంబర్‌ 14కి శ్యాం బెనెగల్‌కి 90 ఏళ్ళు వస్తాయి. హైద్రాబాద్‌లో తిరుమల గిరిలో 1934లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. వాళ్ళనాన్నది కర్నాటక (కొంకణి). Ace photographer గోవింద్‌ నిహలానీ, Greatest music composer వనరాజ్‌ భాటియా, సృజనాత్మక రచయిత్రి, స్క్రీన్‌ప్లే స్పెషలిస్టు షామాజైదీ (M.S. సత్తుభార్య) స్మిత, షబానా ఆజ్మి, అమోల్‌పామీర్‌, నసీరుద్దీన్‌షా, ఓంపురి, అమ్రిష్‌పురి వంటి కొన్ని డజన్ల మంది పరిపూర్ణమైన కళాకారుల్ని పోగుచేసి ఒక చోట చేర్చడంలో శ్యాంబెనెగల్‌ కంట్రిబ్యూషన్‌ అనితర సాధ్యమైనది.

ఆర్ట్‌ ఫిలిం అందాన్నీ, కమర్షియల్‌ ఎలిమెంట్‌నీ కలిపి, భారతీయ సినిమాని కొత్త దారుల్లో నడిపించిన అసమాన దర్శకుడు శ్యాంబెనెగల్‌.

గుజరాత్‌లోని ‘ఆనంద్‌’లోని సహకార పాల

ఉత్పత్తిదారుల సంఘం సాధించిన విజయాన్ని సెలబ్రేట్‌ చేస్తూ ‘మంథన్‌’ అనే సినిమా తీశాడు.

ఇరవై సంవత్సరాలు మాత్రమే వున్న మెరుపుకళ్ళ నవయవ్వన స్మితా పాటిల్ని చూడాలి.. ఆ సినిమాలో…… వొట్టు కళ్ళు పేలిపోతాయ్‌!

Taadi prakesh

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *