విమానంలో అనౌన్సమెంట్ వినిపిస్తోంది . యువర్ కెప్టెన్ హియర్. A F 0191 రెడీ టు టేక్ ఆఫ్ . …… ఇంకా ఎదో కొనసాగింది. 18A విండో సీట్ లో కూచున్న పెద్దిగాడు ఇబ్బంది గా కదిలాడు. కొన్ని క్షణాల ముందే ఎయిర్ హోస్టెస్ తన బెల్ట్ బిగించి వెళ్ళింది. పెద్దిగాడికి ఎన్నో సందేహాలు . బెల్ట్ ఎందుకు బిగించారు. ఇంత పెద్ద విమానం గాలిలో ఎలా ఎగురుతుంది.? …ఒక వేళ కుప్ప కూలితే … ఆమ్మో ఇంకేమైనా ఉందా ? ఆ ఆలోచన రాగానే తన అంగీ జేబులో భద్రంగా పెట్టుకున్న ఎల్లాల సంజీవరాయుడి అర్చన కుంకుమ చేతితో తడిమి చూసుకున్నాడు . అప్పుడే తన వొళ్లో చాలా జాగ్రత్తగా తీసికెళ్ళుతున్న ‘బూట్ల’ అట్ఠ బాక్స్ వైపు అతడి చూపు మళ్లింది . ఎదో అవ్యాజమైన ఆప్యాయత అతని కళ్ళల్లో తొణికిసలాడింది . తన అనుమానాలకు కళ్లెం వేస్తూ “ఇంత మందికేమయితాదో , నాకూ అంతే ” అని సముదాయించుకుంటూ దేముడిని తలచుకొని ప్రార్థించుకున్నాడు . అప్పటికే విమానం ఆకాశంలోకి ఎగిరి , మేఘాల మధ్యగా దూసుకుపోతోంది . పెద్దిగాడి ఆలోచనలు మాత్రం వెనక్కి వెళ్లాయ్ .
జమ్మలమడుగు ప్రక్కన సాలెవారి ఉప్పలపాడు లో చెప్పులు కుట్టుకుని బ్రదికే కులం లో పుట్టాడు పెద్దిగాడు ; కలమళ్ళ మద్దిలేటయ్య కష్టపడి చదువు చెప్పినా మూడవ తరగతి దాటలేకపోయాడు. ‘పిల్లగానికి చదువబ్బలే ; చెప్పులు కుట్టుకునే బదకుతాడులే ‘ అని అయ్య గవిని పక్కన కూర్చవెట్టినాడు . వచ్చిపోయేవాళ్లు , పెద్దరెడ్లు వాని దగ్గిర చెప్పులు రిపేరు చేయించుకుని ‘లెక్క’ ఇచ్చేవాళ్లు . అయ్య తనకు చిన్న వయసులోనే తన చెల్లికూతురు నిచ్చి పెళ్ళిచేసినాడు. పెళ్లయిన రెండేళ్లకే అయ్య తీరిపోయినాడు . తిప్పమ్మ మొగుణ్ణి కంటికి రెప్పలా చూసుకునేది గాని వాళ్లకు పిల్లలు మాత్రం కాలేదు. పిల్లల కోసం ఎల్లాల సంజీవరాయునికి చెప్పులు కుట్టి ఇచ్చుకున్నాడు . ఇద్దరూ దేవళం సుట్టూ తడి బట్టలతో పొర్లు దండాలు పెట్టినారు. కొద్దిరోజుల్లోనే తిప్పమ్మ కు కొడుకు పుట్టినాడు . కానీ కొడుకునిచ్చినందుకు బదులుగా, పిల్లాణ్ణి కంటూనే తిప్పమ్మ ను తీసుకుపోయాడు దేముడు. పెద్దిగాడు కన్నీరు, మున్నీరుగా ఏడ్చాడు.
ఎల్లాల దేవుని దయవల్లే కొడుకు పుట్టినాడని నమ్మినాఁడు గనుక కొడుక్కి ఆ దేవుని పేరే పెట్టుకున్నాడు – సంజీవ్ అని . పెద్దిగాడికి కొడుకంటే ప్రాణం. వాడికేమయినా అయితే విలవిలలాడి పోయేవాడు. వాని ముద్దైన పసిపాదాలను ముద్దాడేవాడు . ఆ కాళ్ళతో తన ఛాతీ మీద ‘అడుగు’ ఏసినప్పుడు, రొమ్ముల మీద తన్నినప్పుడు పెద్దిగాడు ఆనందంతో మురిసిపొయ్యేవాడు . ఆ పాదాలకు చిన్న రాయి ముక్క గుచ్చుకున్నా పెద్దిగాడికి ప్రాణం పోయినట్లయ్యేది. అందుకే ఆ సుతిమెత్తని పాదాలకు సరిపోయేట్లు , లోన మెత్తగా , వెలుపల బలంగా ఉండేటట్లు తన పనితనమంతా ఉపయోగించి బూట్లు కుట్టి , తొడిగి , పిల్లోడు బుడి, బుడి అడుగులు వేస్తూ ఉంటే పొంగిపోయేవాడు . అది ఒక నిత్య చర్యగా మారి , పెద్దయ్యే అబ్బాయికి ప్రతి సంవత్సరం ఒక కొత్త జత కుట్టి , తొడిగించి , వాడు నడుస్తూ ఉంటే చూసి ఆనందించడం పెద్దిగాడికి ఆనవాయితీ గా మారింది . ప్రతి పుట్టిన రోజుకూ , తను మిగతా ఏ కానుకలు ఇచ్చినా , ఇయ్యకపోయినా కొత్త బూట్లు ఇవ్వాల్సిందే . ఇంకా పుట్టిన రోజు రెండు, మూడు నెలలు ఉండగానే పని ప్రారంభించేవాడు . ఆ బూట్లకు కావాల్సిన సామాగ్రి – ప్రాసెస్ చేసిన మంచి మన్నిక వచ్చే, రంగు గల్గిన , మెరిసే చర్మం గానీ , లోన పాదాలకు నొప్పి లేకుండా సుతిమెత్తగా వుండే ఇన్నర్ సోల్ గానీ , క్రింద జారకుండా మంచి గ్రిప్ నిస్తూ , అందంగా కనిపించే సోల్ గానీ , చాలా జాగ్రత్తగా తరచి,తరచి చూసి , కాస్త ధర ఎక్కువయినా సరే , కొనుగోలు జేసి కొడుక్కి బూట్లు తయారు చేసేవాడు . వేరే ఎన్ని పనుల ఒత్తిడి వున్నా , ఆ జత సమయానికి ముందుగా సిద్ధం కావల్సిందే . కొడుకు పాదాలపట్ల , వాటికి తొడగాల్సిన బూట్ల పట్ల పెద్దిగాడికి వెర్రి వ్యామోహం. ఈ సారే పుట్టిన రోజుకు తొడగలేకపోయాడు . ఆ ఆలోచన రాగానే- “పొద్దు పొడిచే లోగా పిల్లగానికి బూట్లు ఎక్కించేయనూ “ – అని తన వొడిలో వున్న బూట్ల పొట్లాన్ని ప్రేమగా తడిమి తనను తానే సముదాయించుకున్నాడు .
ఎందుకో చిన్నప్పటి నుండి సంజి గాడికి పాటలంటే చాలా ఇష్టం. ఆశ్చర్యం ఏమిటంటే , నాకు మా ప్రాంతంలో పాడుకునే పల్లె పదాలు, కొన్ని భజనలు తప్ప వేరే ఏమీ రాకపోయినా వాడు మాత్రం రేడియో లో విన్న పాటల్ని అలాగే పాడే వాడు.
చెప్పులు కుట్టించుకునేందుకు వచ్చే పెద్దిరెడ్డితో వెంట వచ్చే ఆయన కొడుకు సుబ్బారెడ్డి తో సంజీవ్ కు ‘స్నేహితం’ కుదిరింది . “పెద్దోళ్ళతో యవ్వారం మనకొద్దురా ” అని ఎంత చెప్పినా “దాని పాసుగుల్ల ” వాళ్లిద్దరూ కలిసి ఆడుకునేవారు ; పక్కనే వున్న స్కూలుకు కలిసి వెళ్లేవారు . అనుకున్నట్లే ఇక్కట్టు వచ్చి పడింది. వూరి ‘ద్యావర’ నాడు పెద్దమ్మ గుడికాడ సుబ్బిరెడ్డి సీసాతో సంజీవ్ మంచినీళ్లు త్రాగేది చూసి పెద్దిరెడ్డి చెప్పు కాలితో మొకం మీద తంతే సంజి గాని పై పెదవి చిట్లి రక్తం కారడం మొదలుబెట్టింది. అడ్డపడి , తనే ఇచ్చానని సుబ్బాడ్డి చెప్పినా , నాయన కాలు పట్టుకోబోయినా పెద్దిరెడ్డి కోపం తగ్గలే. “గబ్బు నా యాలా ! మా… నా కొడకా ! మా పిల్లోని బుడ్డికి నోరు పెడతావ్ . సియ్యలు తిని కొవ్వెక్కింది , నా కొడకా !” అని చెడామడా తిడుతూ పక్కనున్న పోతురాజు గాని కొరడా తో కొట్టబోయినాడు – పెద్దిరెడ్డి. అడ్డపడిన పెద్దిగాడికి , కాలు తన్నులూ , కొరడా దెబ్బలు తినక తప్పలేదు . పక్కన వాళ్ళు పట్టుకున్నా పెద్దిరెడ్డి తిట్టడం ఆపలేదు .- “అయ్యాలపొద్దు అయ్యేలోగా పొలిమ్యార దాటక పోతే , నా యాల ! చమడాలొలిపిస్తా” .
పొద్దుగుంకేలోగా జమ్మడక్క (జమ్మలమడుగు ) ఆస్పత్రికి పోయి కిరస్తానీ ఆస్పత్రిలో రత్నమ్మ పిల్లగాని మూతికి కుట్లేసిందీ, ఆస్పత్రి లోనే ఆ రాత్రికి గోడ కింద, వున్న ఒక్క బొంత పిల్లోనికి కప్పి రాత్రంతా జాగారం చేసిందీ -పెద్దిగాడికి అయన్నీ మతికొచ్చి తల చెడిపోయినట్లయ్యింది. నొప్పితో పిల్లోడు రాత్రంతా మూల్గుతూనే వున్యాడు . బొంత , బూట్లు చలి నుంచి పిల్లోన్ని కాపాడినాయి గాని , పెద్దిగాడికి జ్వరమొచ్చింది. జ్వరానికి ఎర్రనీళ్ళ మందు , కొరడా నొప్పులకు ఏదో పూతమందు రత్నమ్మ తో ఇప్పిచ్చుకొని ఉప్పలపాడుకు పోయి తన సామాన్లు , బిచాణా అంతా ఎత్తేసి , జమ్మడక్క బస్టాండ్ పక్కనే గోనె సంచీ గొడుగు మాదిరి కట్టి పని మొద లుబెట్టినాడు. మొదట్లో బస్టాండ్ లో పడుకున్నా,పట్నంలో యాపారం బాగనే పెరిగి, ఒక గుడిసె కు మారేంత పరిస్థితి వచ్చింది . . పిల్లోడు కూడా కష్టపడి చదువుకొని మంచి మార్కులు తెచ్చుకునేవాడు . క్రమేణా తన ఊరిని స్నేహితుణ్ని కూడా మరిచిపోయాడు. మూటిమీది గాయం మాత్రం మిగిలిపోయింది.
రోజులు గడచిపోయాయ్ .
పెద్దిరెడ్డి చనిపోవడమూ , కొద్దిరోజుల్లో సంజీవ్ పేట (ప్రొద్దుటూరు) లో ఇంజినీరింగ్ చేరడమూ, డాక్టర్ రత్నమ్మ రిటైర్ కావడమూ , తన గుడిసె మీద మరో రెండు వరసలు ఫుల్లు గడ్డి పరచడమూ జరిగిపోయాయ్ .
రాను, రాను పెద్దవాడవుతూ తెలుగులోనే గాదు , సంజి గాడు హిందీ లో, ఇంగిలీసులో కూడా పాడ్డం మొదలుబెట్టినాడు . అట్లా వాళ్ళ కాలేజీ లో పాడి మొదటి బహుమతి కూడా గెలుచుకున్నాడు. కాలేజు సభలో అందరి ఎదురుంగా తాను బహుమతి తీసుకునేది చూసేందుకు నన్ను కూడా రమ్మని బలవంతం చేస్తే , నేను పేట కు పొయ్యినా. పేట కెళ్ళినప్పుడు, ఇంకో పిల్లోడు వచ్చి నమస్కారం పెట్టినాడు. నేను గుర్తు పట్టలేదని అర్థం చేసుకొని ‘నేను సుబ్బారెడ్డిని – పెద్దిరెడ్డి గారి కొడుకుని ” అని పరిచయం చేసుకున్నాడు . ఏమనాలో తెలియక తొటుపటు పడుతూ ఉంటే, నా చేతులు పట్టుకొని ” నన్ను క్షమించండి … అంతా నావల్లే జరిగింది ..” అని ఇంకా ఏమో చెప్పబోతే, ” అంత మాటలెందుకులే అయ్యా! మీరు పెద్దోళ్లు” – అని ఆప బోయాను. “దేంట్లో; పేరులోనా …. మీకు , మా నాన్నకు ఏమిటి తేడా ?? చివర ఆ రెడ్డి అనే తోక తప్ప. ఆయన చేసింది ఎంతమాత్రమూ సబబు కాదు. కాకపోతే , అప్పుడు నేను చాలా చిన్నవాణ్ణి. పెద్దయ్యాక , మళ్ళీ మా స్నేహం కొనసాగింది – ఈ కాలేజీ లో చేరింతర్వాత. నేనే స్వయంగా మిమ్మల్ని క్షమాపణ అడిగేంతవరకూ , సంజీవ్ ను చెప్పొద్దన్నాను” – అని అంటుండగానే, మైక్ లో అందరికీ మళ్ళా ఒకసారి పాట వినిపించి , చప్పట్లు , సెబ్బాష్ ల మధ్య సంజి గాడు కూడా అంతలోనే ఆడికొచ్చినాడు .
తరువాత తరచుగా వస్తూ , మాకు తగినంత సాయం చేసేవాడు సుబ్బాడ్డి . ఇద్దరూ కోర్స్ పూర్తయింతరువాత పై చదువులు చదవాలనుకోవడమూ , దానికి బెంగుళూరు లోవిదేశాల్లో చదువు కొరకై ఏదో ఒక గుంపు సభకు పోవడమూ , సంజీవ్ కు మొత్తం కోర్స్ కి సహాయ ధనం వాళ్లే ఇస్తామనడమూ – అన్ని జరిగిపోయాయ్ . అక్కడికెళ్లి చదువుతే లక్షలు ఖర్చవుతాయని సుబ్బాడ్డి వద్దనుకున్నాడు. కానీ, సంజిగాడు , నేను ఒకర్నొకరు వదిలి ఉండడం కష్టం అని మేము గోడు పెట్టినా, ఇలాంటి అవకాశము, ఎంతో అదృష్టముంటేనే వస్తుందని మమ్మల్నిద్దరినీ ఒప్పించి, సంజీవ్ ను బెంగుళూరులో పారిస్ విమానం ఎక్కించి , నన్ను మళ్ళీ వూరికి తెచ్చేంతవరకూ అన్ని ఏర్పాట్లు సుబ్బాడ్డే చేసినాడు. వాడు వెళ్లేముందు అక్కున చేర్చుకుని గోడున ఏడ్చాను. హడావుడిగా కొత్తగా కుట్టిన బూట్లు తొడిగి , ఏదో నేనే వాణ్ని మోస్తున్నంతగా , ఆ బూట్లను చూసి తృప్తి పడినాను.
మొదట తరచుగా ఉత్తరాలు వ్రాసినా , రానురాను వాటి సంఖ్య తగ్గింది. అక్కడ రోజూ వారీ ఖర్చులకి సహాయ ధనం చాలదు గనుక కాలేజు వోటల్లో, వారం చివర్లో బయట కూడా ఏవో చిల్లర, మల్లర పనులు చేసికుంటూ, మిగతా యాలలో కష్టపడి చదువుతున్నాని, మంచి మార్కులు తెచ్చు కుంటున్నానని రాసేవాడు. ఎప్పుడు చదువైపోతుందా, ఎప్పుడు నిన్ను చూస్తానా అని అంగలార్చేవాడు. సుబ్బాడ్డి కొత్త సెల్ ఫోన్ లో ఎట్లా మనిషిని చూస్తూ మాట్లాడొచ్చో నేర్పిచ్చినాక ఆన్ని చూస్తూ మాట్లాడేది ఇంకా సులువయ్యింది. పోయిన వారం , అదేదో వోటల్లో రాత్రిపూట పాటలు పడే పని ఇచ్చినారని, కాస్త లెక్క మిగిలిచ్చుకొని నాకూ ఆ వూరు – అదే పారిస్ – చూపిస్తానని చెప్పుకొస్తూ , వాడు మురిసిపోతుంటే, నా మనసు కొండెక్కినట్లైంది .
ఆడు బాగా చదుకొని జమ్మడక్క బ్యాంక్ కు మేనేజరో, జిల్లా కలెక్టరో ఐతే ఎంత బాగుండును అనుకునేవాణ్ణి. సుబ్బాడ్డి అవన్నీ కావడానికి కొన్ని పరీక్షలు రాయాలి గానీ, అలాంటిదే ఏదైనా పెద్ద కంపెనీలో అధికారిగా ఖచ్చితంగా ఐతాడు -అని చెప్పేవాడు. నా ముసలి కళ్ళ నిండా ఎన్నెన్నో కలలు , ఆశలు; నా గురించి కాదు; ఆడి గురించే. వాడి కో మంచి ఇల్లు, మాట ఇనే మంచి పెళ్ళాం. పెద్దోళ్ల లాగా ఓ మోటార్ కారు . ఆడు నడుపుతా ఉంటే, కారు లో ఎనకాతల కూసొని, ఆడి పిల్లోళ్లను ఆడించుకుంటూ, ఎల్లాల కు, కొండ (తిరుపతి కొండ)కు పోయేస్తే, ఈ జనుమకు చాలు. తిప్పమ్మ బతికుంటే ఎంత సంబరపడేదో ! తిప్పమ్మ మతికొస్తూనే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
ఒక నాడు అయ్యాలపొద్దున్నే సుబ్బాడ్డి పారి వచ్చినాడు . ఆయబ్బి మొకం లో ఏమో సంతోషం . బుస పెడుతూనే చెప్పాడు. సంజి గాడి కాలేజువోళ్ళు , బాగా చదువుకునే పేద పిల్లల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళ తల్లితండ్రుల్లో -ఎవరో ఒకరిని – సంవత్సరానికి ఒక్క సారి చేసే సంబరాల్లో పాల్గొనేందుకుగాను పారిస్ కు పిలిపిచ్చి , అందరి ముందరా శాలువ కప్పుతారంట. ఇది వాళ్ళ పిల్లలకు కూడా చెప్పకుండా రగస్యంగా పిలిపించడమట . రానూ , పోనూ ఖర్చులు, ఇమానం లెక్క , ఆడ ఉండడానికి జాగా – అంతా వాళ్ళ ఖర్చే నంట . ఇనడానికి రెండు చెవులూ సాల్లే. కానీ, చదువు రానోన్ని , నేనెట్లా దేశం గాని దేశానికి పోయేది ? ఎప్పుడో ఆకాశంలో ఎగురుతుంటే తప్ప – చూడని ఇమానం లో ఎట్టా ఎక్కిపోయేది ? నా బదులు సుబ్బాడ్డి పోతే పోలె ? కానీ, కాలేజు అట్ట ఒప్పుకోదంట. ఒప్పుదల పత్రం సంతకం సేసి పంపిస్తే , ఇమానం చీటీ, ఆ దేశానికి పోయేందుకు సర్కారు అనుమతి చీటీ పంపిస్తారంట . సుబ్బాడ్డి ఇట్టా అద్దుష్టం అందరికీ దొరకదని నన్ను ఒప్పిచ్చినాడు. సన్మానం కంటే , సంజి గాన్ని చూసే వీలు, అక్కున కలుపుకొని కళ్లనీళ్లు పెట్టుకునే అద్దుష్టం వుంటాదని , నాకు ఆ వూరు చూపిచ్చేదానికి వాడూ రాత్రీపగలూ వొళ్ళు ఊనం చేసికునే కష్టం కూడా తప్పుతుందని నేనూ ఒప్పుదలిచ్చినా . మూడో తరగతికే సదువొదిలేసిన నాకు, పత్రం మీద వంకర టింకరగా చేవ్రాలు చేసేటప్పటికి , నా తల పాణం తోక్కొచ్చింది . ఎప్పుడో బ్యాంకులో అప్పు తీసికున్నప్పుడు చేవ్రాలు చేసిందే మరి! సుబ్బాడ్డే ఇమానం ఎక్కేంతవరకూ ,అని రకాల సాయం చేసినాడు . దాంతోనే ఈ పెయానం.
ఆణ్ణి చూస్తూనే , చేతుల్లోకి తీసికొని , ప్రేమగా జుట్టునిమిరి, వాని ముద్దైన కాళ్ళకి ఇప్పుడు తెచ్చిన కొత్త బూట్లు తొడుగుతేనే పాణానికి నెమ్మది. పైన కేబిన్ లో స్థలమున్నా, వొడిలో పెట్టుకున్న కొత్త బూట్లను , అతి సుతారంగా నిమిరాడు . బూట్లనే ఇంత సుతారంగా నిమిరితే , ఇక సంజీవ్ కాళ్ళను ఎంత ప్రేమగా , సున్నితంగా తాకుతాడో మరి!
అందరి ఎదురుంగా కాలేజు వాళ్ళు వాళ్ళ నాయనకు శాలువా కప్పేటప్పుడు , వాని కళ్ళల్లో జిలుగు సూస్తే, ఈ జల్మకు అదే సాలు. తిప్పమ్మ బతికుంటే , ఇదంతా ఇని , ఎంత సంబర పడేదో !
పెద్దిగాడు మనసులోనే ఎల్లాల సంజీరాయుణి కి , తిరుపతి తిమ్మప్పకు మొక్కున్నాడు. అతని మనసులో ఏదో ఆనందం, ముఖం లో ఏదో తెలియని కొత్త కళ; పెదవల మీద చిరునవ్వు తొణికిసలాడాయ్. ఆ ఆలోచనల్లో ఎప్పుడు నిద్రలోకి జారాడో , అతనికే తెలియదు.
విమానం ప్యారిస్ చేరిందని, ఎయిర్ హోస్టెస్ అనౌన్స్ చేస్తుండగా మెలుకువొచ్చింది . లేస్తూనే తడిమి చూసుకున్నది వొడిలోని బూట్లే.
విమానం లోని ఎయిర్ హోస్టెస్ పెద్దిగాడిని తలుపు వరకూ తీసికెళ్ళి , గ్రౌండ్ స్టాఫ్ లో ఒక అమ్మాయి కి అప్పగిస్తూ , అతనికి ఫ్రెంచ్ , ఇంగ్లీష్ రావని , లగేజ్ కలెక్ట్ చేసుకున్న తరువాత విమానాశ్రయం బయటి వరకూ తీసికెళితే , అక్కడ ఆయన్ను ఎవరైనా ‘ప్లకార్డ్’తో రిసీవ్ చేసికుంటారని చెప్పింది. ఆ అమ్మాయి ఏరో బ్రిడ్జి తరువాత బగ్గీలో కూర్చోబెట్టుకుని, సామాన్లు వచ్చే బెల్టు వద్దకు తీసికెళ్ళి , పెద్దగాడి పెట్టె రాగానే , బయటి వరకూ తీసికెళ్ళి అక్కడ ‘ప్లకార్డ్’ పట్టుకున్న ఓ అబ్బాయి ని చూపించింది . ఆ ప్లకార్డు మీద
తెలుగు లో పెద్ద , పెద్ద అక్షరాల్లో “పెద్దయ్య , జమ్మలమడుగు ” అని దాని క్రింద ఇంగ్లీష్ లో, ఫ్రెంచ్ లో
“ఎకోల్ సుపీరియర్ కామర్స్ డి పారిస్” (ESCP) అని వ్రాసి వుంది . ఆ అమ్మాయి , ఆ అబ్బాయికి సైగ చేసి పెద్దిగాన్ని చూపించి సాగనంపింది . ఆ అబ్బాయ్ పరుగు, పరుగునా వచ్చి , పెట్టె తన చేతిలోకి తీసికుంటూ ” అయ్యా! నా పేరు సుబ్బారాయుడు. మాదీ కడపే . నేను సంజీవ్ క్లాసుమేట్ ని . మిత్రుణ్ణి” – అని తనను తానే పరిచయం చేసుకున్నాడు . మరీ వేకువ గా రావడం వల్లో, నిద్ర లేమి వల్లో సుబ్బారాయుడి ముఖం వాడి పోయి వుంది. పార్కింగ్ లో వున్న కాలేజ్ కార్ లో పెట్టె డిక్కీలో పెట్టి , వెనక సీట్లో కూర్చోబెడుతూ ” పెద్దయ్యా! ప్రయాణం సజావుగా జరిగిందా ?” అని తెలుగు లో ప్రశ్నించాడు . అతను పట్టి ,పట్టి మాట్లాడినట్లు అనిపించింది.
పెద్దిగాడు ‘అవు’ నన్నట్లు తలా ఊపినా , కొడుకును చూడబోతున్నాను అన్న భావన తో అతడి మనసు పరవళ్లు తొక్కుతోంది.
“రగస్యం పాడుగానూ , పాసుగుల్లా ! ముందే తెలిసుంటే కొడుకు తనే వచ్చేవాడు . ఎంటనే అక్కున కలుపుకొని గుండె నిండా ఏడ్చి సంబర పడేవాణ్ణి గదా ! ఇంకా ఎంత సేపు కాసుకోవాల్నో ??”
ఇంకా దాదాపు నిర్మాంష్యుంగానే వుండే , విశాలమైన రోడ్డు, ఇరువైపులా పెద్ద భవంతులూ – ఇవేవీ పెద్దిగాడు పట్టించుకోలేదు. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ? కొడుకును, కొడుకు కళ్ళల్లో ఆ వెలుగును చూద్దామా – అన్న ఆదుర్దాయే హెచ్చు గా వుంది. సుబ్బారాయుడు కూడా మౌనంగానే వుండిపోయాడు .
కారు ఆగడంతో ఈ లోకం లోకి వచ్చాడు పెద్దిగాడు. ఎదురుగా ఓ పెద్ద భవంతి. కాస్త పాతదైనా రాజుల ఇండ్ల లాగా వుంది.
“అబ్బో! నాకు ఉండడానికి ఇంత పెద్ద వోటలా!!”- మనసులోనే ఆశ్చర్య పోయి, నోరు తెరుచుకుని చూస్తుంది పోయాడు . సుబ్బారాయుడు అతని చేయి పట్టుకుని దించబోయాడు . కానీ , పెద్దిగాడు నవ్వుకుంటూ ఉత్సాహంగా దిగాడు. హోటల్ పైన, పేరు కామోలు, ఏ దో పెద్ద బోర్డు వుంది. కానీ , అంత తెల్లవాఱుజామున్నే , ఆ భవంతి ముందర జన సమ్మర్థం బాగానే వుంది. హోటల్లో వుండే వారి సౌకర్యార్థం కాబోలు , కొన్ని అంబులెన్సులూ, యూనిఫామ్ లో వున్న కొద్ది మంది అటూ,ఇటూ తిరుగుతూ కనిపించారు.
సుబ్బారాయుడు పెద్దిగాని చేతిని పట్టుకొని, మెల్లిగా లోనికి తీసికెళ్ళాడు . పెద్దిగాడు బూట్ల పొట్లం వున్నా చేతి సంచీని గట్టిగా పట్టుకుని నడువ సాగాడు. భవంతి ప్రవేశిస్తూనే కుడివైపు వున్నలిఫ్ట్ లో, సుబ్బారాయుడు, పెద్దిగాన్ని క్రిందికి తీసికెళ్ళాడు . అక్కడ వున్న సెక్యూరిటీకి సుబ్బారాయుడు ఏదో కాగితం చూపించాడు. అతను వారిని కాస్త పొడవైన వసారాలో కొంత దూరం తీసికెళ్ళి, గోడపైన వున్నా ఓ మీటర్ లో ఏవో నంబర్లు నొక్కి ,సెక్యూరిటీ వాల్వ్ తిప్పి, ఓ పెద్ద తలుపును తెరిచాడు. తెరిచినా వెంటనే పొగమంచుతో కూడిన చల్లని గాలి, ఏదో వింతైన వాసనా గుప్పుమని బయటికి వ్యాపించాయి . సుబ్బారాయుడు వాంతి చేసుకున్నంత పనయ్ , నోరూ, ముక్కూ గట్టిగా మూసుకున్నాడు. లోపల ఒక రాక్ వైపు సెక్యూరిటీ దారి చూపిస్తుండగా, దాదాపు ఏడుస్తున్న గొంతుతో ” అయ్యా! కొద్దీ రోజులుగా సంజీవ్ రాత్రిపూట ఒక పబ్ లో పాటలు పాడి డబ్బు సంపాదిస్తున్న విషయం మీకు తెలిసే ఉంటుంది. నిన్న రాత్రి కూడా తను అక్కడ పాటలు పాడుతుండగా, మతోన్మాదులయిన కొందఋ ఉగ్రవాదులు కొందరు ఆ పబ్ పై దాడి చేశారు. మతపరమైన నినాదాలు చేస్తూ, యధేశ్చగా బాంబులు రువ్వారు; మెషిన్ గన్ లతో ఇష్టం వచ్చినట్లు , అక్కడున్న అందరి పైనా కాల్పులు జరిపారు. 57 మంది పైగా చనిపోయారు. 120 మందికిపైగా గాయపడ్డారు. చాలామంది శరీరాలు గుర్తు పట్టనానికికూడా వీలు లేకుండా చిన్నాభిన్నమయ్యాయ్. చనిపోయిన వారిలో మన సంజీవ్ కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మీరు ఒక సారి శవాన్ని చూసి ఆనవాళ్లు చెబితే , మిగతా కార్యక్రమం మొదలవుతుంది “. ఆ మాటలు వింటున్న పెద్దిగాడి వెన్ను చలికి వణికినట్లయ్యింది . ఏమనాలో తోచలేదు. ఐనా ఇంకా ఏదో ఆశ . దేవుని దయవల్ల ఇంకా సంజి గాడు బదికే ఉంటాడు. దేవుడు నా కలలు తుడిచెయ్యలేడు. గుండె రాయి చేసుకుని , మార్చురీ లోని ఒక కంపార్ట్మెంట్ నుండి చక్రాల స్ట్రెచర్ మీద వున్న శవాన్ని మెల్లిగా బయటి కి తీశాడు హెల్పర్ .
శవం మీది బట్టను మెల్లిగా తొలగించాడతను . ముక్కుకుపైగా , సగం పైన నుజ్జునుజయిన శవం ముఖం లో ఒకే ఒక గుర్తు ప్రస్ఫుటంగా , వెక్కిరించినట్లు కనిపిస్తోంది. చిన్నప్పుడు పెద్దిరెడ్డి చెప్పు కాలితో తంతే చిట్లి పగిలి, కుట్లుపడ్డా, కొంకర్లు పోయి మాయని మచ్చను మిగిల్చిన పైపెదవి. సందేహం లేదు ; సంజీవే ! పైన కప్పిన మొత్తం బట్టను తొలగించపోతే , ఒక వైపు కాలు మాత్రమే కనిపించింది. క్రితం సారి తాను తొడిగిన బూటు. పెద్దిగాడికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. చక్కున ఆ బూటు తీసి, మెల్లిగా ఆ పాదాన్ని నిమిరి, తను తెచ్చిన బూట్లల్లో ఒకదాన్ని తొడిగాడు . కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నా , బయటి రాకుండా ఆపుకుంటూ , రెండో బూటు కూడా తొడుగుదామని , రెండో కాలివైపు కూడా పై బట్టను తొలగించాడు. కాలు గానీ , బూటు గానీ , ఏవీ కన్పించలేదు. తునాతునకలైన ఎముక, రక్తసిక్తమైన మాంసపు ముద్ద .
కడుపులో తిప్పినట్లయింది. కళ్ళు తిరిగినట్లయ్యాయ్ . కళ్ళ ముందు ఎత్తైన ఎల్లాల సంజీవరాయుడు , వూర్లో చూసిన మసీదు , జమ్మాడక్క ఆస్పత్రి లో సిలువ అన్నీ గిఱ్ఱున తిరిగినట్లయింది. చేతిలోని బూటు , దాంతోపాటు పెద్దిగాడు కుప్పకూలిపోయారు. అతని అంగీ జేబులో భద్రంగా పెట్టుకున్న ఎల్లాల సంజీవరాయుడి అర్చన కుంకుమ కిందికి ఒరిగి పోయాయ్ .
ఒక మతం దేవుడు జన్మనిస్తే , మరో మతం దేవుడు దాన్ని తీసేసికున్నాడా ???