నేను రాయడం యెలా నేర్చుకున్నాను

Spread the love

కామ్రేడ్స్,

   నాకు మాట్లాడే అవకాశం వచ్చిన ప్రతి పట్టణంలో నన్ను చాలా మంది  నోటి మాటగానో, రాత మూలకంగానో నేను రాయడం యెలా నేర్చుకున్నదీ చెప్పమని అడుగుతూ వుంటారు. అదే ప్రశ్నని యు.ఎస్‌.ఎస్‌.ఆర్‌. నాలుగు మూలల నుంచీ రచనలు చెయ్యడం ఆరంభించిన యువకులు తమ ఉత్తరాల్లో అడుగుతూ వుంటారు. “కథలు యెలా రాయాలి అన్న దాన్ని గురించి ఒక పుస్తకం సంకల్పితం చెయ్యమనో”, లేదా “సాహిత్య సిద్ధాంతాన్ని అభివృద్ధి చెయ్యమనో” లేదా “సాహిత్యంమీద ఒక పాఠ్యగ్రంథాన్ని ప్రచురించమనో” నన్ను చాలా మంది అడిగారు. నేను అలాంటి పాఠ్యగ్రంథాన్ని రాయలేను, అలాంటి పనిని చెయ్యలేను కూడా. అదీ కాకుండా అలాంటి ప్రస్తకాలు యిప్పటికే వున్నాయి; అవి, ఒకవేళ మరీ అంత బాగా లేకపోయినా, అంతో యింతో పనికి వస్తాయి.

   రాయడం నేర్చుకునే వాళ్ళకి సాహిత్య చరిత్రని గురించిన పరిజ్ఞానం వుండి తీరాలి. ఒక మనిషి వృత్తి యేదేనా కానీయండి, అతనికి దాని అభివృద్ధి చరిత్ర తెలిసి వండాలి. యేదేనా ఒక పరిశ్రమలో వున్న కార్మికులు, లేదా యింకా అయితే, ఒక ఫ్యాక్టరీలో వున్న కార్మికులు అది యెలా పుట్టింది, క్రమేపీ అభివృద్ధి చెందింది, యెలా ఉత్పత్తి మెరుగుపడింది తెలుసుకుని వున్నట్టయితే వాళ్లు సాంస్కృతిక చరిత్రలో తమ శ్రమ ప్రాముఖ్యం గురించిన మరింత అవగాహనతో, మరింత ఉత్సాహంతో యింకా బాగా పనిచేస్తారు,

 విదేశీ సాహిత్యం గురించిన పరిజ్ఞానం కూడా అవసరం, సాహిత్య సృజన అనేది సారంలో అన్ని దేశాలకీ, అందరు ప్రజలకీ ఒకటే. యిది వూరికే లాంఛనంగా, పై పై విషయాలకి, అంటే గోగొల్‌ “మృత జీవుల”కథాంశం పూష్కిన్ న్నుంచి వచ్చిందనీ, పూష్కినే బహుశా దాన్ని ఇంగ్లీషు రచయిత లారెన్స్ స్టెర్న్ రాసిన “ఏ సెంటిమెంటల్‌ జర్ని” నుంచీ తీసుకున్నాడనీ లాంటి వాటికి సంబంధించే కాదు. అలాగే వస్తువు విషయంలో గోగొల్‌ రాసిన “మృత జీవుల” కీ డికిన్స్ రాసిన “ది పిక్‌విక్‌ పేపర్స్‌”కీ వున్న పోలిక కూడా అంత ప్రాముఖ్యమైంది కాదు. ముఖ్యమైంది  యేమిటీ అంటే, యేనాటినుంచో ప్రతి చోటా మానవ హృదయాలని  వశం చేసుకునే  వల యెప్పుడూ అల్లుకుని వుంది, యిపుడు కూడా అల్లుకుని వుంది అనే వాస్తవాన్ని గుర్తించడం; మరోపక్క యెప్పుడూ, ప్రతిచోటా మానవుణ్ణి మూఢ నమ్మకాలనుంచీ, దురభిప్రాయాలనుంచీ, విముక్తం చెయ్యడమే తమ ధ్యేయంగా పెట్టుకున్న వాళ్లు యెప్పుడూ వున్నారు, యిప్పుడు కూడా వున్నారు అనీ గుర్తించడం. మనిషికి మురిపం కలిగించే చిన్న విషయాల్లో నిమగ్నమైన వాళ్లున్నట్టే చుట్టూతా వున్న జీవితంలోని అల్పత్వానికీ, నీచత్వానికీ వ్యతిరేకంగా యెదురు నిలిచిన తిరుగుబాటుదార్లూ యెప్పుడూ వున్నారనీ, యిప్పుడు కూడా వున్నారు అనీ గుర్తించడమూ  ముఖ్యమే. మానవులకి ముందుదారి చూపించి, ఆ పథంమీద సాగాలని బోధించి ఒప్పించిన తిరుగుబాటుదార్లు,  వర్గ సమాజం సృష్టించిన నీచపరిస్థితులతోటి, దురాశ,అసూయ,  శ్రమ పట్ల వైముఖ్యం లాంటి అసహ్యకరమైన చెడుగులతో శ్రామిక జనాన్ని భ్రష్టం చేసిన బూర్జువా సమాజంతోటి రాజీనీ, సామరస్యాన్ని బోధించిన వాళ్లమీద ‘అఖరి పోటీ జరిగే ఆ దినాన’ పై చెయ్యి సాధిస్తారని గుర్తించడం కూడా ముఖ్యం.

    మానవ శ్రమ, సృజనల చరిత్ర మానవుని చరిత్రకంటే యెంతో యెక్కువ ఆసక్తికరంగా, ప్రముఖంగా వుంటుంది. ఒక మనిషి వంద యేళ్లు రాకుండానే గతిస్తాడు. కాని అతని కృషి శతాబ్దాలు మనుతుంది. విజ్ఞానశాస్త్రవేత్తకి తన ప్రత్యేక విభాగ అభివృద్ధి చరిత్ర తెలిసినందువల్ల విజ్ఞానశాస్త్రపు అద్భుత విజయాలు, దాని శీఘ్ర అభివృద్ధి సాధ్యమయాయి. విజ్ఞానశాస్త్రానికీ, సాహిత్యానికి ఉమ్మడిగా వుండేది చాలా వుంది: రెండింటిలోనూ. పరిశీలన, తులనాత్మకత, అధ్యయనం ప్రముఖ పాత్ర వహిస్తాయి; విజ్ఞానశాస్త్రవేత్తా, రచయిత యిద్దరికీ కూడా భావనా శక్తీ, సద్యోజనిత జ్ఞానం వుండి తీరాలి.    

     భావనా శక్తీ  సద్యోజనిత జ్ఞానమూ వాస్తవాల గొలుసులోని  ఖాళీలని భర్తీ  చెయ్యడానికి ఉపకరిస్తాయి. ఆ రకంగా విజ్ఞానశాస్త్రవేత్త పరికల్పనలనీ, సిద్ధాంతాలనీ  రూపొందించుకోవడానికి వీలవుతుంది. అవి ప్రకృతి శక్తులలోకీ, దృగ్గోచర విషయాలలోకి మనసు చేసే  శోధనలని కొంచెం నిర్దుష్టంగా నడిపిస్తాయి. క్రమేపీ ప్రకృతి శక్తులనీ, దృగ్గోచర విషయాలనీ లొంగదీసుకోవడం ద్వారా మానవుడి మనసూ, యిచ్చా మానవ సంస్కృతిని నిర్మిస్తాయి. అదే వాస్తవానికి మన “అపర సృష్టి.”

     యీ ఉద్ఘాటన రెండు వాస్తవాల వాళ్ళ ధృవపడుతుంది:ఆ కాలంలో తెలిసిన ఇనుము, సీసం, గంథకం, పాదరసం మొదలైన మూలకాల అధ్యయనంపై ఆధారపడి ప్రఖ్యాత రసాయన శాస్త్రవేత్త ద్మీత్రి మెందెలేయెవ్  మూలకాల “ఆవర్తన పట్టిక” తయారుచేశాడు. అది ప్రకృతిలో అనావిష్కృత మూలకాలు యింకా చాలా వున్నాయని తెలియజేసింది. ఆయన ఈ అజ్ఞాత మూలకాల స్పెసిఫిక్ గ్రావిటీ కూడా సూచించాడు. వీటన్నిటినీ కూడా ఇప్పుడు కనిపెట్టడం జరిగింది. పైగా మెందెలేయెవ్ పద్ధతి ఆయనే అనుమానించని అనేకమైన ఇతర మూలకాలను కనిపెట్టడానికి సహాయపడింది.

   మరొక వాస్తవం: ఫ్రెంచి నవలా రచయితా, మహా రచయితలలో ఒకడూ అయిన బాల్టిక్ ఓ పుస్తకంలో కొన్ని గ్రంధుల గురించి రాశాడు. అప్పటిలో విజ్ఞాన శాస్త్రానికి తెలియని కొన్ని శక్తివంతమైన గ్రంథిస్రావాలు బహుశా మానవ శరీర నిర్మాణంపై ప్రభావం కలిగిస్తూ వుంటాయనీ, అనేక మానసిక శారీరక లక్షణాలకు కారణం అవుతాయనీ ఆయన అనుకొన్నాడట.కొన్ని దశబ్దాల తర్వాత, గతంలో తెలియకుండా ఉండిన కొన్ని గ్రంథులు మానవ శరీరంలో వున్నట్టు కనిపెట్టడం,ఆ రకంగా వినాళ గ్రంథులనే ముఖ్య సిద్ధాంతం యేర్పడ్డం జరిగాయి.విజ్ఞాన శాస్త్రవేత్తల, ప్రముఖ రచయితల సృజనాత్మక కార్యకలాపాలు అలా మిళితం కావడం అనేది యేమీ అరుదు కాదు. లొమొనోపోవ్, గ్యోతేలు కవులూ, విజ్ఞాన శాస్త్రవేత్తలూ కూడానూ, అలాగే నవలా రచయిత స్ట్రిండ్ బెర్గునూ. ఆయన “కేప్టెన్ కోల్ “అనే తన నవలలో వాతావరణం నుంచి నత్రజనిని తీయడం అనేదాన్ని  భవిష్యద్దర్శనం చేసిన తొలి వాళ్లల్లో ఒకడు.

     పాత్రలనీ, “నమూనా”లనీ సృష్టించడానికి సంబంధించిన సాహిత్య సృజనాత్మక కళ, భావనా శక్తినీ, నూతన అన్వేషణనీ అపేక్షిస్తుంది.తనకి పరిచయమైన ఒక దుకాణదారున్నో,ప్రభుత్వ ఉద్యోగినో లేదా శ్రామికున్నో చిత్రించడంలో రచయిత  కొంచెం అటూ యిటూగా ఒక వ్యక్తి ఫ్రోటోగ్రాఫ్ ని మాత్రమే విధేయంగా  తయారుచేసినట్లయితే,అది సామాజిక బోధనా ప్రాముఖ్యం తప్ప మరేంకాదు. అది మని జీవిత పరిజ్ఞానాన్ని గానీ, మన అవగాహనని గానీ విస్తరించడానికి దాదాపు యేమీ చెయ్యదు.

            అయితే, రచయిత ఒక యిరవై, యాభై లేకపోతే ఒక వంద మంది దుకాణదార్లకి, ప్రభుత్వ ఉద్యోగులకి, శ్రామికులకి ప్రత్యేకంగా వుండే అత్యంత విశిష్ట వర్గ లక్షణాలని, అలవాట్లని, అభిరుచుల్ని, హావభావాలని, విశ్వాసాలని, మాట తీరుని సంక్షేపించ గల సమర్థత చూపిస్తే, వాటిని ఒక్క దుకాణదారుడిలో ప్రభుత్వ ఉద్యోగిలో లేదా శ్రామికునిలో కేంద్రికరించి సూక్ష్మ రూపంలో ప్రదర్శించగల సామర్థ్యం చూపిస్తే ఆ రకంగా అతను ఒక నమూనాని సృష్టిస్తున్నాడన్న మాట, మరి అదే కళ. ఒక కళాకారుడికి అతని విస్తృత పరిశీలనలూ, పుష్కలమైన జీవితానుభవమూ వాస్తవాల పట్ల అతని సొంత దృక్పథాన్ని దాటిపోగల శక్తిని, అంటే వైయుక్తిక స్థితిని, దాటిపోగల శక్తిని తరచుగా యిస్తాయి. వ్యక్తిగతంగా బాల్జాక్ బూర్జువా సామాజిక విధానంకోరుకున్నవాడు, కాని తన రచనల్లో పెటీ బూర్జువాల నైచ్య, అసభ్య స్వభావాన్నిఆశ్చర్యకరమైన, నిర్దాక్షిణ్యమైన నగ్నత్వంతో చిత్రించాడు. రచయితలు తమ వర్గ, కాలాల నిష్పాక్షిక చరిత్రకారులైన సందర్భాలు చాలా వున్నాయి. అలాంటి సందర్భాల్లో వాళ్ల రచనలు, జంతువులు ఆహారం సేకరించుకుని, జీవించిన పరిస్థితుల్ని అధ్యయనం చేసి, అవి పునరుత్పత్తి కావడానికీ, అదృశ్యం కావడానికీ కారణాల్ని అధ్యయనం చేసీ, మనగలగడానికి అవి చేసే బర్బర పోరాటాన్ని వర్ణించే పండితులైన ప్రకృతి శాస్త్రవేత్తల నిష్పాక్షికతతో తుల్యమైనట్టుగా వుంటాయి.

     జీవన పోరాటంలో స్వయం రక్షణ అనే మానవుడి సహజ చోదన రెండు బలమైన సృజనాత్మక శక్తుల్ని అతనిలో పెంపొందించింది – అవబోధనా శక్తి, భావనా శక్తి. అవబోధనా శక్తి అంటే ప్రకృతి దృగ్గోచర విషయాల్ని సాంఘిక జీవిత వాస్తవాలని పరిశీలించి, పోల్చి, అధ్యయనం చేసే శక్తి అన్న మాట; ఒక్క ముక్కలో చెప్పాలంటే అవబోధనా శక్తి అంటే ఆలోచించడం అని. భావనా శక్తి కూడా, సారంలో, ప్రపంచాన్ని గురించిన ఆలోచనా విధానమే. కాని అలంకారాల్లో, కళాత్మకంగా  ఆలోచించడమన్న మాట.భావనా శక్తి అంటే విషయాలకీ, ప్రకృతి మూల శక్తులకీ మానవ లక్షణాలనీ, అనుభూతులనీ, ఆ మాటకొస్తే, అభిప్రాయాలనీ ఆపాదించే శక్తి అన్నమాట.

       గాలి “మూలుగుతోంది” లేదా “రోదిస్తుంది”అనడం, చంద్రుడి “వ్యాకులమైన వెన్నెల”అనడం, “గలగల”మనే సెలయేరు అనడం, “జలజల”మనే నీటిబుగ్గ అనడం లాంటి అనేకమైన మాటలని,ప్రకృతి దృగ్గోచర విషయాలని యింకా స్పష్టంగా చేసేటువంటి మాటలని అనడం వింటాం,మనం అంటాం.

      దీన్ని ఆన్త్రోపోమార్ఫిజం అంటారు. రెండు గ్రీకు పదాల నుండి యేర్పడింది; ఆన్త్రవస్ అంటే మనిషి,మార్ఫే అంటే రూపం లేక ప్రతిమ.మానవుడు తనకి గోచరమైన ప్రతిదానికీ మానవ లక్షణాన్ని ఆపాదించే మార్గం యిక్కడ కనిపిస్తుంది. అతను యీ లక్షణాలని వూహించుకుని వాటిని ప్రకృతి దృగ్గోచర విషయాలలోని, తన శ్రమలోని ప్రతీదానితో జత చేస్తాడు. సాహిత్యంలో ఆన్త్రోపోమార్పిజానికి స్తానం వుండకూడదనేవాళ్ళు, ఆ మాట కొస్తే అది సాహిత్యానికి అవరోధంగా వుంటుందని భావించే వాళ్లు వున్నారు. కాని యీ మనుషులే “ఎముకలు కొరికేచలి” అంటారు, “సూర్యుడు మందహాసం చేశాడు” అంటారు, “వసంతం వచ్చింది” అంటారు. “దుర్మార్గమైన వాతావరణం” అని కూడా అంటారు, వాతావరణానికి సంబంధించి నైతికపరమైన ప్రమాణాలని ఉపయోగ పెట్టడం కష్టమైనా.

   జంతువులకి గనక భావనా శక్తి వుండి వుంటే, దేవుణ్ణి సింహాలు ఒక బ్రహ్మాండమైన అజేయమైన సింహంగానూ, మూషికాలు ఒక మూషికంగానూ, యింకా అలా అలా భావించుకుంటాయని ప్రాచీన గ్రీకు తత్వవేత్త క్సెనొఫేన్ అన్నాడు. మశక దేముడు బహుశా మశకం గానే వుంటాడు, క్షయ క్రిమి దేముడు క్రిమి గానే వుండచ్చు. మానవుడు తన దేముణ్ణి సర్వజ్ఞునిగా, సర్వశక్తివంతునిగా సర్వోత్పాదకునిగా నిర్మించుకున్నాడు. యింకోలా చెప్పాలంటే తన సర్వోత్తమ ఆకాంక్షలన్నింటినీ తన దేముడికి అంటగట్టాడు. దేముడు కల్పితం మాత్రమే, “జీవితపు వేసట దారిద్య్ర సంభూతుడు, జీవితాన్ని సంపద్వంతంగా, సులభతరంగా, మరింత ధర్మబద్ధంగా, రమ్యంగా చెయ్యాలనే అస్పష్ట కామన సంభూతుడు. దేముణ్ణి నిత్య జీవిత కోలాహలంపైన పెట్టడం జరిగింది. యేమంటే పురుషుల, స్త్రీల అత్యుత్తమ గుణాలకి వాళ్ల శ్రమక్రమంలో ఉద్భవించిన కోరికలకీ జీవిత వాస్తవాలలో స్థానం లేకపోయింది. జీవిత వాస్తవం బొటాబొటీగా బతకడానికి చేసే శ్రమాన్విత పోరాట రంగంగా వుంది.

     తమ అత్యుత్తమ గుణాలు నిరాటంకంగా అభివృద్ధి చెందేటట్టుగా జీవితాన్ని పునర్ నిర్మించగలగడం యెలాగో శ్రామికజనపు నాయకులైన వాళ్లు గుర్తించినప్పుడు, దేముడు అతిరిక్తంగా మనిన విషయం కావడం మనకి కనిపిస్తుంది.తమలోని అత్యుత్తమైనదానిని భగవద్రుపంలో  మహనీయం చేసే అవసరం యింకెంత మాత్రం లేదు, యేమంటే అత్యుత్తమమైందాన్ని యిప్పుడు సజీవ,ఐహిక వాస్తవంగా మార్చగలవచ్చు.

    భగవంతుణ్ణి కూడా సాహిత్య “నమూనా”ల మాదిరిగానే,సంక్షేప నిర్దిష్ట రూప నియమానుసారంగా సృష్టించడం జరిగింది. వైవిధ్యభరిత వీరులు చేసిన విశిష్ట సాహస కృత్యాలని సంగ్రహించడం లేదా “సంక్షేపించడం”జరిగి, అప్పుడు ఏకవీరుని మూర్తిలో నిర్దిష్ట రూపం,అంటే ఒక భీముని రూపమో,రష్యన్ కల్పిత రైతు

వీరుడు ఇల్యా మూరొమెత్స్  రూపమో యివ్వడం జరిగింది. అలాగే యే వ్యాపారికేనా గానీ, కులీనుడికేనా గానీ, రైతుకేనా గానీ వుండే విశిష్ట లక్షణాలని “సంక్షేపించి” అప్పుడు యేదో వ్యాపారిగానో, కులీనుడిగానో, రైతుగానో నమూనా చెయ్యడం – జరుగుతుంది – యింకోలా చెప్పాలంటే ఒక సాహిత్య నమూనా సృష్టి అయిందన్న మాట. యీ రకంగానే ఫౌస్ట్, హామ్లెట్, డాన్ క్విక్సట్ సృష్టి అయారు. టాల్ స్టాయ్ మెతగ్గా, భగవద్భక్తి వున్న తన ప్లతోన్ కరతాయెవ్ ని, దొస్తాయేవ్స్కీ తన కరమాజొవ్ లనీ, స్విద్రిగైలొవలనీ , గొంచరోవ్ తన ఒబ్లోమొవ్ ని   సృష్టించారు.

     యీ మనుషులు వాస్తవంలో యెప్పుడూ వున్న వాళ్లు కారు. కాని అలాంటి వాళ్లు చాలా మంది వున్నారు, వూరికే యింకా అల్పత్వంతోనూ, యింకా తక్కువ అవిభాజ్య వేషంతోనూ వుంటారంతే. విడివిడి యిటుకలతో శిఖరాలనీ, గుళ్లనీ తాపీవాళ్లు కట్టినట్టే రచయితలు కొన్ని మానవ గుణాలని సంక్షేపించిన సాహిత్య నమూనాలని తయారుచేశారు. ఒక అబద్ధాలకోరుని మనం హ్లెస్తకోవ్  అంటాం, ఇచ్చకాలమారిని మొల్చాలిన్ ‘ అంటాం, వంచకుణ్ణి టాల్ టూఫ్ అంటాం, అసుయాపరుణ్ణి ఒథెల్లో అంటాం. యిలా యెన్ని పేరులైనా చెప్పుకుపోవచ్చు లెండి.

      సాహిత్యంలో రెండు రీతులు లేదా శాఖలు వున్నాయి: రొమాంటిసిజం, వాస్తవికత. వాస్తవికత అంటే జనాన్నీ, వాళ్ళ జీవిత స్థితి గతుల్నీ సత్య పూరితంగా, రంగు పులమకుండా ప్రదర్శించడం అని. రొమాంటిసిజానికి కొన్ని నిర్వచనాలని యివ్వడం జరిగింది కాని, అందరు సాహిత్య చరిత్రకారులకీ ఆమోదయోగ్యమైన సూటి, సర్వంకష నిర్వచనం రూపొందలేదు. రొమాంటిసిజంలో నిశితంగా విభేదం చూపించే ధోరణులని  రెండింటినీ -ఉదాసీన, క్రియాత్మక – వేరుపరచాలి. ఉదాసీన రొమాంటిసిజం  మానవుడి జీవితంలో -ఆ జీవితాన్ని ఆకర్షవంతం చేస్తూ – రాజీ కుదిరించే ప్రయత్నం చేస్తుంది. లేదా అతని ఆంతరంగిక జీవితపు వంధ్య ఆత్మ పరీక్షలోకీ, ప్రేమ, మృత్యువు యింకా అలాంటి వూహాతీతమైననీ,శాస్త్ర విజ్ఞానం వల్ల తప్ప చింతన వల్లా మననం వల్లా పరిష్కరించవీలుగానివీ అయిన “జీవితపు అపరిష్కృత సంస్యల”లోకీ నెట్టి,తద్వారా తన చుట్టూతా వున్న విషయాలనుంచి అతని దృష్టిని మళ్లిస్తుంది. క్రియాత్మక రొమాంటిసిజం జీవించడానికి మానవుడి యిచ్చని ధృఢతరం చెయ్యడానికీ,తన చుట్టూతా వున్న జీవితం మీద యెదురు తిరిగేటట్టు,ఆ జీవితం బలవంతంగా రుద్దే యే నియంతృత్వానికేనా వ్యతిరేకంగా అతను యెదురు తిరిగేటట్టు చెయ్యడానికీ కృషిచేస్తుంది.

            యేమైనా , తృప్తికలిగించేటంత కచ్చితంగా బాల్జాక్ ,తుర్గనెవ్, టాల్ స్టాయ్,గోగొల్, లెస్కోవ్ లేదా చేహొవ్ లాంటి ఉత్తమ శ్రేణి రచయితలు రొమాంటిసిస్టులా లేక వాస్తవికవాదులా  అని చెప్పడం కష్టం. యేమంటే గొప్ప చిత్రకారుడిలో వాస్తవికత, రొమాంటిసిజం మిళితం అయి ఉంటాయి. బాల్జాక్ వాస్తవికవాది కానీ ఆయను “మేక బెల్టు” లాంటి నవలను, వాస్తవికత అనేది ఆమడ దూరంలో ఉన్న నవలను రాశాడు.తుర్గనెవ్ కూడా, గోగొల్ నుంచి చేహొవ్, బూనిన్ దాకా మన ప్రముఖ రచయితల మాదిరిగా,  రొమాంటిక్ ధోరణిలోనే రాసాడు. రొమాంటిసిజం వాస్తవివాదాల యీ విలీనత మన గొప్ప సాహిత్యానికి వున్న వైశిష్ట్యం. అది దాన్ని మౌలిక ప్రజ్ఞతోటీ , శక్తితోటీ నింపింది. యీ సర్వ ప్రపంచ సాహిత్యంమీదా నిత్యం అధికం అయేటువంటి, బలమైనటువంటీ ప్రభావం కలిగిస్తున్నాయి.

      రొమాంటిసిజానికీ , వాస్తవికవాదానికీ మధ్య ఉన్న సంబంధం, మీకు స్పష్టపడుతుంది, యీ ప్రశ్నను మీరు పరిశీలిస్తే కామ్రేడ్స్: “రాయాలనే ప్రేరణ యెందుకు కలుగుతుంది?” యీ ప్రశ్నకు రెండు సమాధానాలు ఉన్నాయి. నాకు ఉత్తరం రాసిన ఒకరు, శ్రామికుని కూతురు అయిన 15 ఏళ్ల వయసు  వున్న ఆడపిల్ల, ఒక సమాధానం యిచ్చింది.. ఆమె ఒక ఉత్తరంలో ఇలా రాసింది.

     “నాకు పదిమేనేళ్లు. అయినా ఇంత చిన్న వయసులో కూడా నాలో రచయిత ప్రతిభ జాగృతం అయింది, దానికి కారణం అణగార్చే మందకొడి జీవితం.”

     “రచయిత ప్రతిభ” అనేదానికి బదులుగా రాయాలనే కోరిక అనడం “అణగార్చే మందకొడి జీవితాన్ని” కాంతివంతం చెయ్యడానికీ, సంపద్వంతం చెయ్యడానికీ మరింత సమంజసంగా ఉండేది. యీ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది: అలాంటి జీవిత పరిస్థితుల్లో యెవళ్లేనా యేమి రాయగలరు?

    యీ ప్రశ్నకు జవాబుని వొల్గా తీరంలో,ఉరల్స్ ప్రాంతంలో, సైబీరియాలో జీవించే అనేక జాతులు సమకూర్చాయి. నిన్నటికీ వాటిల్లో చాలా వాటికి వర్ణమాల లేదు. అయితేనేం మనకంటే యేనాడనగానో శతాబ్దాలకి ముందే వాళ్లు అడవి గర్భంలో,బాడవ బీళ్ల మధ్యలో ,ప్రాచ్య ప్రాంతపు ఊషర స్తెవ్ మైదానాల్లో,ఉత్తర ప్రాంతపు తండాల్లో పాటలూ,పద్యాలూ,వీరోచిత గాథలూ,దేముళ్ళని గురించిన పురాణాలూ సృష్టించి తమ ‘అణగార్చే మందకొడి జీవితాల’ని సంపద్వంతమూ,సౌందర్యవంతమూ చేసుకున్నారు. యిదంతా కూడా “మతపరమైన సృజనాత్మకత” అనే పేరుతో చలామణీ అవుతుంది గాని సారంలో యిదంతా కళా ప్రపంచానికి చెందినదే.

            నాకు ఉత్తరం రాసిన ఆ అమ్మాయి నిజంగా ప్రతిభను అభివృద్ధి చేసుకుంటే – అలా చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను- ఆమెబహుశా రొమాంటిక్  ధోరణిలో రాస్తుంది. ‘అణగార్చే మందకొడి జీవితాన్ని’ అందమైన ఊహాకల్పిత  వస్తువులతో శృంగారించి, మనుషులని ఉన్నదానికంటే బాగా చిత్రించబోతుంది. గోగొల్  “ఇవాన్‌ ఇవానొవిచ్‌ యెలా ఇవాన్‌ నికీఫారొవిచ్‌తో పోట్లాడాడు”, “పాత ధోరణి భూస్వాములు, “మృత జీవులు” లాంటివి రాసిన వాడు,కాని “తరాస్ బూల్బ” కూడా ఆయనే రాశాడు. మొదటి మూడూ కూడా ‘మృత ఆత్మల’తో వున్న ప్రజలని చిత్రిస్తాయి.యేమంటే అలాంటి వాళ్ళు గతంలో వున్నారు, యివాళ వున్నారు. యిలాంటి వాళ్ళని వర్ణించడంలో గోగొల్ వాస్తవికవాది.

         “తరాస్ బూల్బ”లో జపొరోజోయ్ కోసక్కులని భగవద్భక్తి వున్న వాళ్లుగా, వీరులూ శక్తిమంతులు అయిన మనుషులుగా, తమ శత్రువులని బల్లెం కొన మీద పైకి యెత్తే వాళ్ళుగా వర్ణించడం జరిగింది. బల్లెపు కొయ్యకాడ మనిషి బరువుకి విరిగిపోవడం స్పష్టమైన విషయము. గోగొల్ రాసినలాంటి  కోసక్కులు వాస్తవానికి యెన్నడూ వున్నవాళ్ళు కాదు, ఆ కథ యేదో  అందమైన అబద్ధం. అందులో, “రూడీ పాంకో” మరియు ఇతర కథలో లాగానే, గోగొల్ రొమాంటిసిస్టు . దానికి బహుశా కారణం యేమిటంటే ఆయన “మృత జీవుల” ‘అణగార్చే మందకొడి జీవితాల’ పరిశీలనలో విసిగిపోయి వుంటాడు. 

            చాలా విషయాల్లో మానవుడు యింకా పశువే. కాని అదే సమయంలో, సాంస్కృతికపరంగా,పచ్చికాయ లాంటివాడు. అతన్ని పొగిడి, కొంచెం మెరుగు పెట్టడం మంచిదే. అది అతని ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది. తన సృజనాత్మక శక్తులమీద విశ్వాసం పెంచుతుంది. మానవుణ్ణి పొగడ్డానికి యెంతో సమంజసత్వం వుంది, యేమంటే మంచిది అయిన ప్రతీదీ, సాంఘికంగా విలువైన ప్రతీదీ అతని శక్తి సంకల్పాలవల్లనే సృష్టి అవుతున్నాయి.

            యిప్పుడు యిక్కడ నాకు ఉత్తరం రాసిన యింకో అతని మొర. పదిహేడేళ్ల కుర్ర పనివాడు. “నాకు యెన్ని అనుభవాలు కలుగుతున్నాయంటే రాయకుండా వుండలేకపోతున్నాను.”

            యీ సందర్భంలో రాయాలన్న ప్రయత్నం జీవిత “దారిద్ర్యం” నుంచి కాదు, జీవత ఐశ్వర్యంనుంచి, అనుభవాల పౌష్కల్యం నుంచి, వాటిని వర్ణించాలన్న అంతరిక ప్రేరణ నుంచి వచ్చింది. నాకు ఉత్తరాలు రాసే యువకులలో చాలా యెక్కువ మందికి వాళ్లు జీవితానుభవాలతో సంపద్వంతంగా వుండబట్టీ, తాము చూసి, అనుభవించిన దాన్ని అందరికీ చెప్పాలని కోరిక వుండడం బట్టీ రాయాలని కోరుకుంటున్నారు. వాళ్ళల్లో నుంచి సుమారుగా వాస్తవికవాదులు పుట్టుకొస్తారు, కాని వాళ్ళ వాస్తవికవాదం కొంత రొమాంటిసిజంతో రంగరించుకుని వుంటుందని నాకు అనిపిస్తుంది. అది ఆరోగ్యవంతమైన ఆధ్యాత్మిక వెల్లువలో తప్పని సరీ, ధర్మమునూ. మనం యిప్పుడు సరిగ్గా అలాంటి దశలో జీవిస్తున్నాం.

            అంచేత నేను యెందుకు రాయనారంభించాను అనే ప్రశ్నకు నేను జవాబు చెప్తాను:’అణగార్చే మందకోడి జీవితపు’తాకిడి వల్లా, నేను ‘రాయకుండా వుండలేనట్టుగా’ అనుభవాలతో నిండిపోవడంవల్లా కూడానూ. మొదటి హేతువు నా  మందకొడి జీవితంలోకి “పామూ, గద్దల కథ”, “మండే హృదయపు కథ”,“సముద్ర పక్షి”లాంటి వాటిని ప్రవేశపెట్టే ప్రయత్నం నా చేత చేయిస్తే, రెండవది “ఇరవై ఆరుమంది పురుషులూ, ఒక అమ్మాయి,” “ఒర్లోవ్ దంపతులు”, “రౌడీ” లాంటి “వాస్తవిక” లక్షణం వున్న కథలని రాసేటట్టు చేసింది.

            మన “రొమాంటిసిజం” సమస్యకి సంబంధించి యీకింది విషయాన్ని గుర్తుంచుకోవాలి. చేహొవ్ “రైతులు”, “కనుమలో” అనేవీ, బూనిన్ రాసిన “గ్రామం”, రైతాంగం గురించిన ఆయన కథలు అన్నీనీ వెలువడే దాకా మన కులీన సాహిత్యం రైతుని మరో ప్రపంచపు యేదో రకమైన “క్రీస్తు సత్యాన్ని” కాంక్షించే గంగిగోవులాంటి, ఓర్మి వున్న మనిషిగా చిత్రించడానికి యిష్టపడ్డ సాహిత్యమే. ఆ సత్యానికి జీవితపు వాస్తవ విషయాలలో వేళ్లు లేవు. అయిన కూడా తుర్గేనెవ్ కథ “ఖోర్, కలినిచ్”లోని కలినిచ్, టాల్ స్టాయ్  “యుద్ధమూ – శాంతి”లో ప్లతోన్ కరతాయెవ్ లాంటి రైతులు దాన్ని గురించి కలగన్నారు. భూస్వామ్య దాస్యాన్ని రద్దు చెయ్యడానికి యిరవై యేళ్ల ముందర రైతుని “దేముడి సత్యాన్ని కలగనే గంగిగోవులాంటి, ఓర్మికలవాడిగా చిత్రించాలనే వైఖరి ద్యోతకం అయింది. అప్పటికే భూస్వామ్యదాస రైతాంగం తమ నిగూఢ శ్రేణులనుంచి ప్రతిభా సమన్వితులైన పారిశ్రామికవేత్తలని తయారుచేసినా, రైతాంగం జన్మ ప్రసాదించిన కవి, ప్రముఖ విజ్ఞాన శాస్త్రవేత్త లొమొనోసావ్ అనే మహా మేరుపు లాంటి వ్యక్తిని గురించి పత్రికల్లో తరచుగా వినబడుతూ వున్నా, సాహిత్యంలో అలా జరిగింది.

            నిన్నటి దాకా పౌర హక్కులు లేకపోయినా, ఉత్పత్తిదారులు, నౌకా నిర్మాతలు, వర్తకులు యిప్పుడు కులీనులతో సమంగా జీవితంలో పక్కపక్క తమ స్థానం ఆక్రమిస్తున్నారు. రాం లోని స్వేచ్చాయుతమైన వాళ్ళలాగా తమ పూర్వపు యజమానుల సరసన కూర్చుంటున్నారు. అలాంటి వాళ్ళని తమలోనుంచే తయారు చెయ్యడం ద్వారా రైతాంగం తమలో దాగి వున్న శక్తినీ, ప్రతిభనీ వెల్లడి చేసింది. కులీన సాహిత్యం  ఆ కాలపు నాయకుడిగా యీ కొత్త వ్యక్తిని, నిజమైన, స్ఫుటమైన, సంకల్ప శక్తి వున్నవాడిగా, జీవిత దాహం వుండి, నిర్మాతగా, సంపదలని కూడబెట్టే వాడిగా వ్యవహారదక్షునిగా గుర్తించి చిత్రించడంలో విఫలమైంది. తద్భిన్నంగా అణకువ వున్న భూస్వామ్యదాసుల్ని, ఆ సాహిత్యం ఆప్యాయంగా చిత్రించుకుంటూనే పోయింది. దయా హృదయుడూ, ఉదారవాదీ అయిన యజమాని భూస్వామ్యదాసులు విశ్వసించని తీరుని అద్భుతంగా వర్ణిస్తూ 1852లో లియో టాల్ స్టాయ్ “ఒక భూస్వామి జీవితంలో ఒక ఉదయం” అనే విచారగ్రస్తమైన స్కెచ్ ని  రాశాడు. 1862 నుంచి టాల్ స్టాయ్  రైతు బిడ్డలకి విద్యాబోధన మొదలుపెట్టాడు. విజ్ఞానశాస్త్రాన్నీ, పురోగతినీ ఆయన కాదనడం, సరిగ్గా బతకడం యెలాగో తెలుసుకోవాలంటే ప్రజలు రైతుల దగ్గరికి పోవాలని ఆయన బోధించడం జరిగింది. డెబ్బయవ దశకంలో ఆయన “ప్రజల కోసం” తన కథలని రాశాడు, రైతుల్ని భగవద్భక్తి వున్న వాళ్లుగా వర్ణిస్తూ. రైతుల్ని రొమాంటిసైజ్ చేశాడు, గ్రామీణ జీవితం వర ప్రసాదితం అయిందనీ, రైతులను భూమిని దున్నడం పవిత్ర శ్రమం అని బోధించాడు.ఆఖరికి  తన కథ “మనిషికి ఎంత నేల కావాలి?” అన్నదాంట్లో  మనిషి సమాధికి కావలసిన ఆరడుల నేలే అవసరం అని రాశాడు.

             అణకువగా,భగవద్భక్తి కలిగిన మనుషులను ఆర్థిక జీవితపు నూతన రూపాలను నిర్మించుకునే వాళ్ళుగా, పెటీబూర్జువాలుగా , బడా వ్యాపారులుగా , దురాశాపూరితులై పీడించే వాళ్ళుగా సల్తికోవ్-శ్చెద్రీన్, గ్లేబ్ ఉస్పేన్స్కీలు చిత్రించిన వాళ్లల్లాంటి మనుషులుగా  తయారుచేస్తున్నారు. అదే  సమయంలో తిరుగుబాటుదారులుగా , విప్లవకారులుగా  నిర్దిష్ట పరిస్థితులు  తయారుచేస్తున్నారు. ఏమైనా వీళ్ళందరిని  ప్రభు వర్గపు సాహిత్యం గమనించలేదు. మన సాహిత్యంలోని అత్యుత్తమ  నవలలో ఒకటైన “ఒబ్లోమొవ్”లో రచయిత గొన్ చరోవ్ సోమరితనంవల్ల దాదాపు యేదో బడుద్దాయిగా తయారైన రష్యన్ ప్రభువంశీకుణ్ణి ఒక జర్మన్ తోటి  తారతమ్యం చేసి చూపించాడు. గాని గొన్ చరోవ్ తను కలిసి జీవించి, అప్పటికే దేశ ఆర్థిక జీవితాన్ని నడపనారంభిస్తున్న పూర్వ భూస్వామ్యదాసులలో ఒకడిని కూడా అలా చూపించలేదు. అప్పట్లో కులీన వర్గ రచయితలు ఒక విప్లవకారుణ్ణి వర్ణిస్తే వాడు ఒక విదేశీయుడైన బల్గేరియనో లేదా మాటకి మాత్రం తిరుగుబాటుదారుడో అయివుండేవాడు రూదిన్ లాగా. తన కాలపు నాయకుడిగా, సంకల్పమూ, క్రియాశీలతా వున్న రష్యన్ మనిషి సాహిత్యంలో ప్రతిబింబించలేదు, సాహిత్యకారులు దృష్టిపథం  అవతలవున్నాడు. ఆ రష్యన్ వాడు బాంబుల సహాయంతో తను సుమారైన గోల చేస్తూ వున్నా. క్రియాశీల, ప్రయోజనపుష్ట రొమాంటిసిజం రష్యన్ కులీన వర్గం సాహిత్యానికి పరాయిది అని చూపించడానికి చాలా సాక్ష్యం వుంది. దానికి ఒక షిల్లెర్ని  తయారుచేసే శక్తి లేకపోయింది. “ది రాబ్బర్స్”కి బదులుగా అది “మృత జీవుల”, “జీవచ్ఛవం”, “మృతగృహాలు” “మూడు చావులు” యింకా అలాంటి  బోలెడు చావుల అద్భుతమైన వర్ణనని అందించింది. దొస్తాయేవ్స్కీ “నేరమూ శిక్షా” ముక్కాలు మువ్వీసం షెల్లెర్ “ది రాబ్బర్స్”కి వ్యతిరేకంగా రాసినదే కావచ్చు.

            క్రియాశీల సాంఘిక విప్లవాత్మక రొమాంటిసిజం రజ్నొచీనిత్సి  మేధావుల సాహిత్యానికి కూడా పరాయిదిగానే వుండింది. రజ్నొచీన్ని తమ అదృష్టంతోటీ, జీవిత నాటకంలో తన స్థానంతోటీనే యెక్కువ పట్టింపు. అతను నిరంకుశ ప్రభుత్వపు సమ్మెటకీ “ప్రజలు” దాయకీ మధ్యన వుండేవాడు.

            స్లెప్  చోవ్ రాసిన “గడ్డు రోజులు”, ఒసిపోవిచ్-నొవొద్వోర్స్కి రాసిన”కాకీ, కోకిలా యేదీ కాని ఒక జీవితంలో నుంచి ఒక సంఘటన” అనేవి, తమకి జీవితంలో వేళ్లు లేక, “కాకులూ, కోకిలలూ, కాకుండా వున్న వాళ్లుగా, లేదా ఆత్మ సంతృప్తిగల పశుబుద్ధులుగా మారిన మేధావి జనులని గురించి విషాదపు విధేయమైన, శక్తివంతమైన కథలు. ప్రతిభావంతమైన, ప్రముఖ మేధానిధి, కాని తగినంతగా ఆదరణ పొందని, రచయిత అయిన పొమ్యలోవ్స్కీ తన “మోలొతొవ్” “పశుబుద్ధుడి ఆనందం” అనే నవలల్లో అలాంటి వాళ్ళను చూపించాడు. సోషలిస్టు సంస్కృతిని నిర్మించే హక్కు కోసం శ్రామిక జనం రక్త తర్పణం కావించిన దేశంలో, పశుబుద్ధివాడుమ ఒక చవకబారు కలిమిని తనకి నిర్మించుకోవడానికి, ఓ మేరకి నెగ్గుకొస్తూ, ఆరంభించి, తిరిగి తల యెత్తుతూ వున్న మన రోజుల్లో యీ రెండు కథలూ సందర్భవశాత్తూ యింకా ప్రయోజనకరంగా వున్నాయి.

            ‘నరోద్నిక్కు’లైన రచయితలు గ్రామీణ జీవితాన్ని ఆదర్శవంతం చెయ్యాలన్న తమ పట్టుదలతోటి ఉన్నత వర్గపు రచయితల గొంతుని ప్రతిధ్వనించారు. నరోద్నిక్కులకి రైతు ‘మీర్’ అనబడే గ్రామీణ సమాజపు, సత్యం తప్ప మరేమీ తెలియని సహజ సోషలిస్టుగా కనిపించాడు. అద్భుత ప్రతిభావంతుడైన ప్రభువంశీకుడు హెర్జెన్ రైతాంగం పట్ల యీ దృక్పథాన్ని పెంపొందించిన మొదటివాడు. యీ ధోరణిని ఎన్.మిహైలోవ్ స్కీ అందుకున్నాడు. ఆయన “వాస్తవిక సత్యం”,”న్యాయమైన సత్యం”అనే రెండు సత్యాలను కనిపెట్టాడు. తమ రొమాంటిసిజం తమ ఉన్నత వర్గపు సహచరులతో ప్రతిభా లోపంలో మాత్రమే విభేదిస్తూ వుంటే, సరోద్నిక్కు రచయితలు “సమాజం” మీద కలిగించిన ప్రభావం దుర్బలమైంది, అల్ప కాలికమైందీని. మినాయ్, మిత్యాయ్  లాంటి వాళ్ల రైతు స్వాప్నికులు పొలికూష్క, కలినిచ్, కరతాయెవ్ యింకా అలాంటి పుణ్యరైతు పాత్రల నీరస నకళ్లు.

            యిప్పుడే చెప్పిన గ్రూపుకి దగ్గరగా వుండే యిద్దరు చాలా ప్రముఖ రచయితలున్నారు, కాని సాంఘికంగా చాలా దూరదృష్టి వున్న వాళ్లు, నరోద్నిక్కుల కంటే చాలా యెక్కువ ప్రతిభ కలవాళ్లు. నిజానికి నరోద్నిక్కులందర్నీ కలుపుకున్నా యింకా యెక్కువ ప్రతిభ వున్న వాళ్లు. వాళ్లు డి. మామిన్-సిబిర్యాక్, గ్లేబ్ ఉస్పేన్కీలు. పట్టణ జీవితానికీ, పల్లె జీవితానికీ, పారిశ్రామిక పనివాడికీ రైతుకీ మధ్యన వుండే తేడాని గుర్తించి, వర్ణించిన మొదటి వాళ్లు వీళ్లే. యిందులో ప్రత్యేకమైన వివేచన చూపించిన వాడు గ్లేబ్ ఉస్పేన్స్కీ, ఆయన రెండు ప్రముఖ గ్రంథాలని రాశాడు:“రాస్తేర్యాయెవ్ వీధి నీతులు”, “భూమాత శక్తి”. వీటి సామాజిక విలువ యింకా వుంది. మొత్తం మీద ఉస్పేన్స్కీ కథలు తమ బోధనాత్మక ప్రాముఖ్యాన్ని పోగొట్టుకోలేదు. తన చుట్టూతా వున్న జీవితపు విస్తృత పరిజ్ఞానాన్నీ, పరిశీలించే సామర్థ్యాన్నీ ఆయన నుంచి నేర్చుకోవడం మన యువ రచయితలకి మంచిది.

            నేను యిదివరకే ఉల్లేఖించిన కథలు “రైతులు,” “కనుమలో” అనే వాటిల్లోనూ, “నూతన భవంతి”లోనూ రైతుని యేవిధంగా ఆదర్శీకరించడానికీ చేహొవ్ తీవ్రమైన వ్యతిరేకత కనబరుస్తాడు. యీ ధోరణికి సంబంధించి యింకా యెక్కువ ద్వేషాన్ని ఇవాన్ బూనిన్ తన చిన్న నవల “గ్రామం”లోనూ, అలాగే తన రైతు కథల్లోనూ కనబర్చాడు. చాలా విశేషమైన సంగతి యేమిటంటే రైతు రచయిత ఇవాన్ వొలోనోవ్ – యితను చాలా ప్రతిభా వంతుడైన వర్గమాన రచయిత- గ్రామీణ జీవితాన్ని వూరికే తూర్పార బట్టేస్తూ వర్ణిస్తాడంటే. గ్రామీణ జీవితం,రైతు మనస్తత్వం లాంటి కథా వస్తువులు యెంతో సందర్బోచితమైనవీ,యివాళ ముఖ్యమైనవీ.ఈ విషయాన్ని మన యువ రచయితలు సంపూర్తిగా గ్రహించాలి.

       యిక్కడ చెప్పుకున్న దాన్ని బట్టి,జీవితం పట్ల క్రియాశీల దృక్పథాన్నీ,నూతన జీవిత రూపాలని నిర్మించుకోవడంలో ప్రేరణకి ఆధారంగా జీవించాలనే యిచ్చనీ, శ్రమ యోగ్యతనీ,మనం యెంతో కష్టపడి నిర్మూలించుకుంటూ వున్న దుష్ట వారసత్వపు పాత ప్రపంచం పట్ల పగనీ బోధించేదిగా  “రొమాంటిసిజాన్ని” మన సాహిత్యం యింకా తెలుసుకోలేదన్న విషయం స్పష్టం. యే సంస్కారహీనత పునరుద్దరణ నేనా గానీ, చిత్తశుద్ధితో నివారించాలని మనం కోరుకుంటున్నాం. అలాంటి పునరుద్ధరణ ద్వారా  వర్గ సమాజాన్ని, పరాన్న భుక్కులూ, కొల్లగొట్టేవాళ్లూ శ్రామికులనీ రైతులనీ అలా దోచుకుంటూ వుండడాన్ని మనం చిత్తశుద్ధితో నివారించాలని కోరుకుంటున్నాం. అలాంటప్పుడు యీ బోధన ప్రాణావసరం అవుతుంది. సోవియట్ యూనియన్ శత్రువులందరూ కలగంటూ వున్న “పునరుద్ధరణ” యిది. పూర్వపు వర్గసమాజాన్ని తిరిగి స్థాపించాలని శ్రామికవర్గాన్ని ఒత్తిడి చేసే ప్రత్యేక లక్ష్యంతోనే వాళ్లు సోవియట్ యూనియన్ మీద  ఆర్థిక దిగ్బంధనం విధిస్తున్నారు. శ్రామికవర్గానికీ, బూర్జువా వర్గానికీ మధ్యన వున్న వైరుధ్యాన్ని సమసింపజాలమనీ, సంపూర్ణ విజయమో, సర్వ నాశనమో మాత్రమే ఆ వైరుధ్యాన్ని పరిష్కరించగలవనీ శ్రామికుడైన రచయిత అయిన వాడు అత్యంత స్పష్టంగా గుర్తించి తీరాలి. ఆ విషాదకర వైరుధ్యం నుంచి, చరిత్రగతి శ్రామికవర్గం మీద నిర్దాక్షిణ్యంగా విధించిన కర్తవ్యపు గురుతర స్వభావం నుంచి, ఒక క్రియాశీల “రొమాంటిసిజం” సృష్టికామన, మనస్సంకల్పాల సాహసం, రష్యన్ విప్లవ శ్రామిక మానవుడిలో యెప్పుడూ ప్రత్యేకంగా వున్న విప్లవ గుణాలు, ఉత్పన్నం అయి తీరాలి.

            స్వేచ్ఛా పథం సులభమైంది కాదనీ, జీవితమంతా ముచ్చటైన మగువలతో కలిసి టీ  తాగుతూ గడపగలిగే కాలం యింకా రాలేదనీ, మన యువజనంలో సుమారుగా చాలా మంది అలవాటు పడినట్టుగా అద్దం ముందు నుంచుని స్వీయ సౌందర్యారాధనతో ముగ్ధులైపోవడానికి గాని సమయం రాలేదని నాకు తెలుసుననుకోండి. ప్రస్తుత జీవిత పరిస్థితుల్లో శాంతియుత యేకాంత జీవితం నిర్మితం కాలేదనీ, యెంచుకున్న భాగస్వామితోటో, లేక యేకాంత జీవితమో ఆనందాన్ని ప్రసాదించలేదనీ, సంస్కారహీన సంపద చిరస్థాయిగా వుండదనీ యేమంటే అలాంటి సౌఖ్యప్రదమైన దాని పునాదులు ప్రపంచంలో అన్ని చోట్లా కూలిపోతున్నాయనీ జీవిత వాస్తవాలు యింకా యింకా యెక్కువగా అవగతం అయేట్టు చేస్తున్నాయి. యెన్నో లక్షణాల వల్ల యిది నమ్మకంగా రుజువు అవుతోంది: ప్రపంచమంతా పశుబుద్ధులకి దాపురించిన విద్వేషం,నిర్వేదం, విపత్తు సూచన;యూరప్ సాహిత్యం నుంచి వచ్చే శోకన్నాలు; రేపటి గురించి తనకి వున్న భయాన్ని తొలగించుకోవాలనే నిష్పల ఆశతో సంపన్న పశుబుద్ధికలవాడు అవలంభించే తెగింపుతో కూడిన ఉల్లాసం, ఆఖరిగా నీచసుఖాల కోసం వ్యాధిగ్రస్తుల వెంపరలాట,లైగిక భ్రంశనలు,నేరం ఆత్మహత్యలు విస్తరించటం, “పాత ప్రపంచం” నిజంగా ప్రాణాంతక రుజాగ్రస్తంగా వుంది. దాని విషపూరిత వాయువులు సోకకుండా తప్పించుకోవడానికి మనం దాన్ని పరిత్యజించే వేగిరపాటు పడాలి.

            యూరోప్‌లో మనిషి మీద సాంఘిక నైతిక పతనం కమ్ముకుంటూ ఉంటే, మన దేశంలోని శ్రామిక జనంలో మన శక్తి మీద , సమిష్టి శక్తి మీద ధృఢ విశ్వాసం పెరుగుతోంది. శ్రేష్ఠతరమైన జీవిత పథం మీద తగిలే ఆటంకాలని అధిగమిస్తూ వుంటేనే యీ విశ్వాసం సర్వదా ఉత్పన్నం అవుతుందనీ, యిలాంటి విశ్వాసమే సృజనాత్మక శక్తులలో మహితమైందనీ, యువజనులరా, మీరు తెలుసుకోవాలి. ఆ “పాత ప్రపంచం”లో మానవత వున్నది ఒక విజ్ఞానశాస్త్రమేననీ అంచేత నిస్సంశయంగా విలువైందనీ కూడా మీరు తెలుసుకోవాలి. ఒక సోషలిజపు భావాలు తప్ప ఆ “పాత ప్రపంచం”లో చాలామణీ అయ్యే “భావాల”న్నీ మానవత్వం లేనివే. యేమంటే  యేదో ఒక రకంగా ఆ భావాలు, శ్రామికజన స్వేచ్ఛా సంస్కృతులని పణం పెట్టి వ్యక్తుల అధికారాన్ని, “ఆనందపు” అరాచకత్వాన్నీ స్థాపించి సమర్థించాలని చూసేవే. 

       నా యౌవనంలో జీవితానికి సంబంధించి ఎప్పుడూ అసంతృప్తి పడ్డట్టు నాకు గుర్తులేదు. నా చుట్టూతా ఉన్న వాళ్ళు గొణుగుతూ ఉండేవాళ్ళు. ఒకళ్ళకొకళ్లు సాయం  చేసుకొనుటకు ఇష్టంలేక, ఆ విషయాన్ని కప్పి పుచ్చుకునేందుకు వాళ్ళు అలా చేస్తున్నారని గుర్తించినప్పుడు నేను వాళ్ళను అనుకరించడం మానేశాను. యేరకమైన ప్రతిఘటనా యివ్వ లేనివాళ్లు, పని చేయలేని వాళ్లు,పని చేయాలని లేని వాళ్ళు,మాములుగా తోటి వాళ్ల కష్టం మీద సునాయసంగా గడిపెయ్యడానికి ఉన్ముఖులైన  వాళ్లునే అలా గొణిగే వాళ్ళల్లో అధికులు.

     మా రోజుల్లో జీవనసంభరణ భయం మాకు ఎక్కువగా ఉండేది.నేను వేరే సందర్భంలో  వర్ణించినట్టుగా చాలా కష్టభూయిష్టమైన పరిస్థితుల్లో జీవించి నా చిన్నప్పుడు మనుషులు ప్రదర్శించే పాశవికత్వాన్నీ, నేను అర్థం చేసుకోలేని పరస్పర విద్వేషాన్నీ చూసాను. కొంత మంది నడుములు విరిగిపోయేటట్టు పనిచెయ్యడమూ, మరింకొంత వారు సుఖ సంపదలతో తుల తూగడమూ చూసి ఆశ్చర్యపోయాను.తాము “భగవంతుడికి యెంత సన్నిహితంగా” వున్నామని భక్త వరేణ్యులు భావించుకుంటూ వున్నారో అంతగావాళ్లు తమ కోసం పనిచేసే వాళ్ళకి దూరంగా వుండటమూ, అంత నిర్దాక్షిణ్యంగా శ్రమించే వాళ్ళనుంచి బలవంతంగా రాబట్టుకునేటట్టు వుండడమూ నాకు చాలా చిన్నప్పుడే అర్థమయ్యాయి. మీకు చూసే అవకాశంలేని జీవిత హేయాలని యెన్నిటినో నేను చూశానని చెప్పితీరాలి. పైగా, యింకా యెంతో అసహ్యకరమైన రూపాల్లో చూశాను. యేమంటే యివాళ మీరు చూసే పశుబుద్ధి వాడు విప్లవం వల్ల అణిగిపోయాడు, తన సహజధోరణిపట్ల హక్కు వుందన్న విశ్వాసంతో మనలేడు. పశుబుద్ధి తను  బాగానే వున్నట్టూ,  తన శ్రమరహిత, సౌఖ్యప్రద జీవితం శాశ్వతంగా ఉండే వరం పొందినట్లు, పరమ ఖాయంగా భావించుకునివుండడం నేను చూశాను.

            అలాగే నేను విదేశీ నవల రచయితల అనువాదకులను, డికెన్స్, బాల్జాక్ లాంటి అద్భుత రచయితల నవలలని,అయిన్స్ వార్త్, బుల్ వేర్ -లిట్టన్, డ్యూమాలురాసిన చరిత్ర నవలను చదువుతున్నాను. దృఢ సంకల్పము, అకుంఠిత స్వభావములు ఉన్న వాళ్ళను అవి చిత్రించారు. వాళ్ళ సంతోషము, బాధలు నాకు తెలిసిన వాటి కంటే భిన్నమైనవి, వాళ్ళ వైరాలు ముఖ్యమైన భేదాల నుంచి ఉత్పన్నమైనవి.యేమయినా,నా చుట్టూతా నీచమైన, కనాకష్టమైన మనుషులు ఉన్నారు. వాళ్ళ దురాశ, వైషమ్యం, పగ, కచ్చలు, లిటిగేషన్లు యేదో పొరుగువాడి కొడుకు కోడిపెట్ట కాలు విరిచాడనో, కిటికీ అద్దం పగల గొట్టాడనో, లేకపోతే కాబేజీ పులుసు మరగ కాగిందనో, పాలు విరిగిపోయాయనోలాంటి వాటినుంచి పుట్టేవి. ఓ గజం గుడ్డ ముక్కకో, లేక ఓ పౌను పంచదార కొట్టువాడు యింకో కోపెక్కు యెక్కువ లాగేశాడని రోజుల తరబడి వలవలా యేడ్చేవాళ్లు. పొరుగువాడికి యే పిసరు దురదృష్టం కలిగినా వాళ్ళకి భలే సంతోషంగా ఉండేది, ఆ సంతోషాన్ని సానుభూతి ప్రదర్శించడం మాటున దాచుకునేవాళ్లు. సంస్కారహీనుల స్వర్గంలో ధగధగ మెరిసేది ఒక కోపెక్ నాణెం అనీ, మనుషుల మధ్య క్షుద్ర, నీచమైన శత్రుత్వానికి అది దారి తీయించేదనీ నేను బాగా గమనించాను. కుండలూ, దాకలూ, కోళ్లూ కొక్కిరాయిలూ, పొంగరాలూ, దేవళ దర్శనాలూ, పుట్టడాలూ కిట్టడాలు, తెగతాగడం తినడం – అదీ నేను బతికి పెరిగిన జీవితం. ఆ వెలపరం పుట్టించే బతుకు నాలో ఒకప్పుడు మొద్దుబార్చే మగతని కలిగించేది, యింకో సారి, మగతనుంచి మెలుకువ తెచ్చుకోడానికా అన్నట్టు, కొంటె పనులు చేసే ప్రేరణ కలిగించేది. ఒక పందొమ్మిదేళ్ల వ్యక్తి యీ మధ్యనే నాకు యిలా రాయడం జరిగింది:

       “వంటగదిలో,వూసులాడుకోవడంలో,బాధతో కుక్కలా అరిచే అరుపుల్లో వుండే చంపేంతటి విసుగుని నా శరీరంలోకి ప్రతి అణువూ ద్వేషిస్తుంది.”

     సరిగ్గా అలాంటి విసుగే నన్ను ధ్వంసం కావించే కొంటె పనులు చేసేటట్టు తరిమింది: యింటి కప్పు యెక్కి గుడ్డ పీలికలని పొగగొట్టాల్లో కుక్కేవాణ్ణి; మరిగే కాబేజీ పులుసులో గుప్పిల్ల కొద్దీ ఉప్పు పోసేవాణ్ణి; గోడ గడియారంలోకి దుమ్ము పోసేవాణ్ణి.మొత్తం మీద ఆకతాయితనం అని పిలిచే పనులని చేసేవాణ్ణి. దీనికి కారణం యేమంటే నేను సజీవ వ్యక్తిని అని అనుకోవాలనే కోరిక వున్నప్పటికీ, ఆ విషయం గురించి నమ్మకం కలిగించుకోవడానికి యితర మార్గాలు నాకు దొరకలేదు. చెట్లు గుబురుగా పెరిగిన పొదలూ కుళ్లిపోతూ వున్న ఆకులు నిండుగా వున్న అడివిలో మోకాలి దాకా కూరుకుపోయి దారి తప్పానేమో నాకు అనిపించేది.

             నాకు ఈ సంఘటన గుర్తు ఉంది:మేం వున్న వీధిలోనుంచే,సైబీరియాకి పంపాల్సిన నేరస్థుల గుంపుల్ని సాయుధ కాపలాతోటి జైలు నుంచి రేవు దగ్గరికి తీసికెళ్లేవాళ్లు . అక్కడ వొల్గా, కామా నదుల్లో వెళ్లే స్టీమర్ల మీద వాళ్ళను యెక్కించేవారు. మందకొడిగా, వెలవెల బోతూవుండే ఆ గుంపు అంటే నాకు వింత ఆకర్షణ కలిగేది. వాళ్ళు అరదండాల్లో వున్నా సాయుధ కాపలాలో వున్నా , యేదో గమ్యం వాళ్ళకి వుందనీ , నేనేమో కంతలోని ఒంటరి యెలకలాగా ఉంటూ, యిటికల నేల వున్న మురికి వంటింట్లో చాకిరీ చెయ్యాలి ఉంటుంది అనే వూహల వల్ల ఈ అనుభవం ఉత్పన్నం అయివుండవచ్చు. ఒక రోజున అరదండాలు వేసి శిక్ష పడ్డ వాళ్ళ పెద్ద గుంపుని నది కేసి తీసుకుపోతున్నారు. కాళ్ళు చేతులు బేడీలు వేసి కట్టేసిన ఇద్దరు నేరస్థులను కాలిబాట మీద నడిపించుకుపోతున్నారు. వాళ్లలో ఒకడు లావుగా ఉంటాడు, నల్లని గడ్డం ఉంది. అతని కళ్ళు గుర్రం కళ్లల్లాగా వున్నాయి. కమిలి వివర్ణమైన దెబ్బ మచ్చ నుదుటి మీద ఉంది. చెవి చీలిపోయి ఉంది – భయంకరమైన ఆకారం. కళ్ళు ఆ మనిషిమీదే లగ్నం చేసి, తనికి యెదురుగా నేను కాలిబాట మీదే వెళ్ళాను. ఉన్నట్టుండి అతను ఉల్లాసంగా ఉండే గొంతుకతో గట్టిగా నా కేసి అరిచాడు. “ఓయ్, కుర్రకుంకా, వచ్చి మాలో కలు!” అని.

      వింతగా అతని కేసి ఆకర్షితుణ్ణయి, నేను అతని దగ్గరకు పరిగెత్తాను.కాని సాయుధ కాపలావాడు నన్ను వెధవా అని తిట్టి వెనక్కి గెంటేశాడు. అతను గనక అలాచేసి ఉండకపోయినట్లే, నేనా భయంకరమైన మనిషిని యేదో కలలో మాదిరీ అనుసరించి వెళ్లిపోయి వుండే వాణ్ణి , వూరికే యేమంటే అతను నాకు తెలిసిన మనుషులలో మాదిరీ యేమీ సామాన్యమైంది లేకుండా వున్నాడు.అతను భయంకరంగా బేడీలు తగిలించి వున్నా గానీ మరోరకం జీవితం కేసి ఆకర్షితుణ్ణయినట్టు నేను భావించాను. ఆ మనిషినీ, అతని ఉత్సాహభరితమైన, దయాన్వితమైన గొంతుకనీ నేను త్వరగా మర్చిపోలేకపోయాను. అతనితోటి కలిసి వున్నదే ఆ రోజుల నాటి అంతే శక్తివంతమైన మరో మానసిక ముద్ర. నాకు యెలాగో ఓ లావాటి పుస్తకం దొరికింది. దాని మొదటి పేజీలు చిరిగి, యెక్కడ్నో పోయాయి. నేను దాన్ని చదవడం మొదలుపెట్టాను. ఒక పేజి వున్న కథకి సంబంధించి తప్ప నాకు యేం చాలూ మూలం తెలీలేదు. అందులో ఒక రాజు ఒక సాదా విలుకాణ్ణి మహారధుణ్ణి చేద్దామనుకుంటాడు. దానికి విలుకాడు పద్యంలో సమాధానం చెప్తాడు.

       అయితే నన్ను మామూలు రైతుగా మననీయండి

     మా తండ్రి కంటే,తనయుడూ అలాగే వుండాలి.

   తక్కువ తరగతి మనుషులు గొప్పవాళ్ళ కంటే

        ఘనమైన పనులు చెయ్యడం అధిక కీర్తికదా.

             నేను యీ యిబ్బందికరమైన పాదాలని రాసి పెట్టుకున్నాను. అవి నాకు చాలా కాలం ఒక పధికునికి చేతికర్రలాగా ఉపయోగపడ్డాయి. లేకపోతే అప్పట్లో “ఉత్తములైన” సంస్కార హీనులు అందించే నీచ సలహాలకీ, ప్రలోభాలకీ వ్యతిరేకంగా నన్ను కవచం కాపాడినట్టుగా ఉపకరించాయి. చాలా మంది యువకులకి వాళ్ల ఊహలని ఒక రకమైన చోదక శక్తితో, ఒక ఓడ తెరచాపల్ని గాలిలాగా, నింపే పాదాలు తగులుతూనే వుంటాయి.

            యీ పాదాలు షేక్స్పియర్ ముందు వాళ్లల్లో ఒకడైన రాబర్ట్ గ్రీన్ అనే 16వ శతాబ్దపు రచయిత “ది కామేడీ ఆఫ్ ది మెర్రి ఆర్చర్ జార్జ్ గ్రీన్ అండ్ రాబిన్ హుడ్” లోవని పదేళ్ల తర్వాత నాకు తెలిసింది. దీన్ని కనిపెట్టడం నాకు సంతోషం కలిగించింది. సాహిత్యం పట్ల తోధికమైన ప్రేమ కలిగింది. కష్ట భూయిష్ట జీవితంలో ప్రజలకి నిజమైన మిత్రంగా, సహకారిగా ప్రాచీన కాలంనుంచీ వున్నది సాహిత్యమే.

            అవును, కామ్రేడ్స్, జీవితపు క్రూరత్వ మొరటుతనాల భయానుభవం నాకు కొల్లలుగా వుండింది. ఒకసారి నేను ఆత్మహత్య చేసుకునే దాకా కూడా పోయాను. చాలా కాలం దాకా అది గుర్తుకు వచ్చినప్పుడల్లా సిగ్గుతోటీ, అసహ్యంతోటి నాకు నేనే దహించుకుపోయేవాణ్ణి.

            ప్రజలు చెడ్డగా వుండే దానికంటే యెక్కువగా అజ్ఞానంగా వున్నారనీ, నేను వాళ్ల వల్ల గాని, జీవితంవల్ల గాని జడుసుకోలేదనీ, కాని నా సాంఘిక, తదితరమైన నిరక్షరాస్యతవల్ల అనీ, జీవితంలో నాకు ఆత్మ రక్షణ లేకపోవడమూ, నిస్సహాయతవల్లనే అని గుర్తించినప్పుడే నాకా భయం పోయింది. విషయాలు వున్న తీరు సరిగ్గా అదీ. మరీ విషయాన్ని గురించి బాగా ఆలోచించాలి. యేమంటే మీలో కొంత మంది నుంచి వచ్చే మూలుగులూ,అసంతృప్తులూ వాళ్ళ ఆత్మరక్షణా లేమి నుంచీ, మానవుణ్ణి లోపలి నుంచి బయటి నుంచీ అణగదొక్కడానికి “పాత ప్రపంచం”వాడే ప్రతి దాని మీదా తిరుగుబాటు చేసే తమ శక్తిలో విశ్వాసం లేకపోవడం నుంచీ ఉత్పన్నం అవుతాయి.

  నాబోటి వాళ్ళం ఆ రోజుల్లో ఒంటరిగాళ్లo,సమాజానికి “సవతి బిడ్డలం.”తన శక్తిని గుర్తించిన చైతన్యం తొణికిసలాడుతూ,అధికారం హస్తగతం చేసుకుని, వ్యక్తుల ప్రయోజన పుష్ట శ్రమకి పూర్తి విలువ యివ్వడం నేర్చుకుంటున్న శ్రామిక వర్గానికి మీరు వందల సంఖ్యలో చెంది వున్నారు. యీ విషయాల్ని మీరు గుర్తించాలి:మన కార్మిక కర్షక ప్రభుత్వం అధికారంలో వుంది. నూటికి నూరు పాళ్లూ మీ సామర్థ్యాలని అభివృద్ధి హెసుకోవడానికి అది సహకరించి తీరుతుంది ,సహకరించగలది కూడా.  అది క్రమేపీ చేస్తున్న పని అదే. బూర్జువాలు – దానికీ, మీకూ బద్ద శత్రువులు దాని జీవితాన్నీ కృషినీ ఆటంకపరచకుండా ఉంటే యింకా యెక్కువ విజయవంతంగా ఆ పనిని చేస్తుంది.

            మీరు మీలోనూ, మీ శక్తిలోనూ ఒక విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఆటంకాలను అధిగమించడం ద్వారానూ  సంకల్పాన్ని దృఢపరచుకోవడం ద్వారానూ  సాధించే విశ్వాసం. మీరు మీలోనూ, మీ చుట్టు పక్కలా ఉన్న గతకాలపు నైచ్య నికృష్ట వారసత్వాన్ని నిర్మూలించడం నేర్చుకోవాలి యేమంటే మరోలా మీరు “పాత ప్రపంచాన్ని పరిత్యజించడం”యెలా చెయ్యగలరు? అది బోధించే రీతిలో మీకు ఆ శక్తీ, ఆచరించాలనే కొరికా లేనట్లయితే మీరా పాటను పాడలేరు.యెవళ్లకేనా గానీ స్వల్ప ఆత్మ విజయమేనా సరే యితోధిక బలాన్ని యిస్తుంది. శరీరాన్ని సుశిక్షితం చేసుకోవడం అధికతర ఆరోగ్యాన్నీ,నిలబడే శక్తినీ చురుకునీ మనిషికి యివ్వడం మీకు  తెలుసు. మనసుకీ, సంకల్పానికీ అదే శిక్షణను యివ్వాలి.

            అలాటి శిక్షణ ప్రసాదించగల అద్భుత విజయాలకు సంబంధించి ఒక దృష్టాంతం ఇదిగో: కొంత కాలం కితం బెర్లిన్లో ఒక ఆడమనిషిని ప్రదర్శనకి పెట్టారు. ఆమె చెరో చేతిలోనూ చెరో పెన్సిలూ పట్టుకుని, యింకో దాన్ని పళ్ల మధ్యన పెట్టుకుని యేకకాలమందు అయిదు భాషల్లో అయిదు మాటలని రాయగలిగింది. ఇది ఏదో నమ్మశక్యం కానిదిగా కనిపించవచ్చు. అంటే భౌతికంగా కష్టమనే దృష్ట్యానే కాకుండా ఆలోచనలో అసాధారణమైన విభజన చేసుకోవడం అవసరం అనే దృష్ట్యా కూడా. ఏమైనా ఆమె అలా చెయ్యడం మాత్రం నిజం. పై పెచ్చు, అస్తవ్యస్త బూర్జువా సమాజంలో అద్భుత శక్తి సామర్థ్యాలను ఎలా వృధా హెయ్యడం జరుగుతుందో కూడా యీ వాస్తవం తెలియచేస్తుంది.  నలుగురి దృష్టీ ఆకర్షించాలంటే చేతుల మీద వీధిలో నడవటం,యేమాత్రం ఉపయోగం లేని లేదా యేమాత్రం ఆచరణాత్మక విలువ లేని స్పీడు రికార్డులను స్థాపించడం,యిరవై మంది ప్రత్యర్ధుల తోటి యేకకాలమందే చదరంగం ఆడ్డం,వెర్రెత్తిపోయే సాముగరిడీలు అష్టావధానాలు చెయ్యడం అక్కడ ఉంటుంది. మొత్తం మీద భోగలాలసతతోటి వెక్కసం పుట్టి విసుగెత్తిన జనానికి గిలిగింతలు పెట్టడానికి ప్రచారం పొందే అట్టహాస ప్రదర్శనలని కనిపెట్టడం అక్కడ జరుగుతుంది.

            “సమాజపు” పరమ అజ్ఞానం విరోధిస్తూ వున్నా చర్చి తీవ్ర విద్వేషంతో పళ్లు పటపట కొరుకుతూన్నప్పుడు, పెట్టుబడిదార్ల దురాశ, కళా శాస్త్ర “పోషకుల” తిక్క కోరికలు వున్నప్పుడు మానవాళి శాస్త్ర సాంకేతిక కళారంగాల్లో నిజంగా సాధించిన విలువైందీ, శాశ్వతంగా ఉపయోగకరమైందీ అంతా కూడా కష్టభూయిష్టమైన పరిస్థితుల్లో పనిచేస్తూ వ్యక్తులు సృష్టించిందే అనే విషయాన్ని యువకులైన మీరు తెలుసుకుని తీరాలి. సంస్కృతిని సృష్టించిన వాళ్లల్లో చాలా మంది సామాన్య శ్రామికులు వున్నారని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకి మహత్తర భౌతికశాస్త్ర వేత్త ఫారడే,అనేకం కనిపెట్టిన ఎడిసన్ లాంటి వాళ్లు. మరమగ్గాన్ని కనిపెట్టిన ఆర్క్ రైట్, క్షురకారుడు. అత్యద్భుతమైన పింగాణీ కళానైపుణ్యం వున్న బెర్నార్డ్ పాలిస్సీ  కమ్మరి పని చేసేవాడు. యింతవరకూ ప్రపంచంలో అద్వితీయమని పేరు పొందిన మహా నాటక రచయిత షేక్స్పియర్ మామూలు నటుడు. మొల్యేర్ కూడా అంతే. మనుషులు తమ సామర్థ్యాలని అభివృద్ధి చేసుకోగలిగిన పద్ధతికి సంబంధించి వందలాది ఉదాహరణలు యివ్వవచ్చు.

            యిదంతా కూడా యివాళ మానవాళి హస్తగతం అయిన శాస్త్రీయ విజ్ఞాన, సాంకేతిక యంత్ర సాధనాల విస్తార సామగ్రి సమకూర్చే ఉపయోగాలు అనుభవించిన వ్యక్తులకి సాధ్యమైంది. మన దేశంలో సాంస్కృతిక కృషి యెంత సులభం అయిందో వూహించండి. యిక్కడ మనుషులని అర్థరహితమైన శ్రమనుంచి విముక్తి చెయ్యడానికి మనం కృషి చేస్తున్నాం. దుర్భరంగా దోచుకోవడం నుంచి శ్రామికులని విముక్తి చెయ్యడానికి కృషి చేస్తున్నాం. ఆ దోపిడీ వేగవంతంగా పతనమైపోయే ధనికవర్గాన్ని తయారుచేస్తుంది, శ్రామికవర్గాన్ని పతనం చేసే భయం కలిగిస్తుంది.

            మీరు ఒక మహత్తరమైన, అత్యంత స్పష్టమైన కర్తవ్యాన్ని యెదుర్కొంటున్నారు-“పాత ప్రపంచాన్ని పరిత్యజించడం”, నూతన ప్రపంచాన్ని సుష్టించడం అనే కర్తవ్యం. యిది ఆరంభమైంది. మన శ్రామిక వర్గం చూపించిన ఆదర్శం ద్వారా యీ క్రమం అన్ని వేపులా అభివృద్ధి చెందుతుంది.,అభివృద్ధి చెందుతూనే ఉంటుంది, పాత ప్రపంచం దీని దారిలో యే ఆటంకాలని పెట్టినా సరే. యీ కార్య సన్నద్ధులవ్వడం కోసం ప్రపంచమంతా శ్రామికులు నడుములు బిగిస్తున్నారు. వ్యక్తుల కృషి చుట్టూతా ఒక సానుభూతి వాతావరణం సృష్టి అవుతోంద. వాళ్ళు ఒక సమిష్టిలోని విడివిడి తునకలుగా యెంత మాత్రమూ భావించడం లేదు, దాని సృజనాత్మక సంకల్పాన్ని చాటే పథనిర్దేశకులుగా భావించుకుంటున్నారు.

   యిలాంటి లక్ష్యం పెట్టుకున్న తర్వాత, మొట్టమొదటి సారిగా యెంతో సాహసంతో అలా పెట్టుకున్నాక, “యేo చెయ్యాలి?”అనే లాంటి ప్రశ్నకి తావు లేదు.”బతకడం కష్టంగా వుంది” అంటారు కొందరు.నిజంగా అంత కష్టంగా వుందా?మీ అవసరాలు పెరగడం వల్ల, మీ తాత ముత్తాతలు యెన్నడూ కనీ వినీ యెరిగి ఉండని వస్తువులను మీరు కోరుకుంటూ ఉండటం వల్ల కదూ బతకడం కష్టంగా ఉందనిపించడం? బహుశా మీ కోరికలు అధికం అయ్యాయేమో?    

      మీలో చాలా మంది, సమష్టి కృషిలోని సంతోషాన్ని కవిత్వాన్ని అర్థం చేసుకుని పైసలని కూడబెట్టుకోవాలని వాంఛించకుండా, మానవుడిమీద, ప్రపంచంలోని మహత్తర అద్భుతమూ, ప్రపంచంలోని సకల అద్భుతాల సృష్టికర్త అయిన మానవుడిమీద పైసలు చెలాయించే దుష్ట అధికారాన్ని మట్టు పెట్టే కోరికతో వున్నారనీ నాకు తెలుసుననుకోండి.

     యిప్పుడు నేను రాయడం యెలా నేర్చుకున్నానూ అనేదానికి జవాబు చెప్తాను.

    నేను జీవితం నుంచీ, పుస్తకాల నుంచీ ఉభయత్రా అనుభూతుల్ని పోగుచేసుకున్నాను. మొదటి వాటిని ముడి పదార్థంతో పోల్చవచ్చు, రెండవ వాటిని సగం ఉత్పత్తి అయిన పదార్థంతో పోల్చవచ్చు. లేదా, ముతగ్గా అయినా సాదా మాటల్లో చెప్పాలంటే మొదటి సందర్భంలో నేను పశువుతో వ్యవహరించాల్సి వచ్చింది, తర్వాత సందర్భంలో మహా చక్కగా పదును చేసిన చర్మంతో వ్యవహరించాల్సి వచ్చింది. నేను విదేశీ సాహిత్యానికి చాలా యెక్కువగా రుణపడివున్నాను, ముఖ్యంగా ఫ్రాన్సు దేశపు సాహిత్యానికి.

    మా తాత క్రూరంగా, పిసినారిగా వుండేవాడు. కాని బాల్జాక్  “ఎజెనీ గ్రాండే” చదివే దాకా నేను ఆయన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయాను. ఎజెనీ తండ్రి వృద్ధగ్రాండే కూడా క్రూరంగా పిసినారిగా వుండి, మా తాతని పోలి వుండేవాడు. కాని అతను మా తాత కంటే యెక్కువ మొద్దుగా, తక్కువ ఆసక్తికరంగా వుండేవాడు. యీ ఫ్రెంచి మనిషితో పోలిస్తే, నేను ప్రేమించని ఓ ముసలి రష్యన్ మెరుగయ్యాడు. యిది ఆయన పట్ల నా దృక్పధంలో మార్పు తేలేదు కాని నేను ఒక గొప్ప ఆవిష్కరణని, అంటే, మనిషిలో నేను చూడని దాన్నీ, దేన్నో, పుస్తకాలు నాకు తెలియచేస్తున్నాయి అన్నదాన్ని, చేశాను.

      నీజ్ని  నోవ్ గొరొద్లోని తరహా జీవితాల్ని మనుషులు ఇంగ్లీషు,జర్మన్ రాష్ట్రాల్లో గడపడం లేదు గాని, అంతకంటే పెద్ద మెరుగు యేమి కాదని జార్జి ఇలియట్ నీరసపు నవల”మిడిల్ మార్చ్”, ఔయెర్ బాఖ్,ష్పిల్ హాగెన్ పుస్తకాలు నాకు తెలియచేసాయి. వాళ్లు అలాంటి విషయాలే మాట్లాడుకునే వాళ్లు -తమ ఇంగ్లీషు,జర్మన్ పైసలని గురించీ,ప్రభువంటే భయపడ్డమూ,ఆయన్ని ప్రేమించడమూ గురించి మాట్లాడుకునే వాళ్లు.కాని సరిగ్గా మా వీధిలో వాళ్లలాగానే ఒకళ్లనొకళ్లు ద్వేషించుకునే వాళ్లు. ముఖ్యంగా,యేదో ఒక రకంగా తమ చుట్టూతా వున్న అధిక సంఖ్యాకుల కంటే భిన్నంగా వుండి,వేరే తరహాగా వుండేవాళ్ళని. రష్యన్లకీ విదేశీయులకీ మధ్యన సారూప్యంగా వుండే అంశాల కోసం నేను వెదకడం లేదు. లేదు,నేను తేడాలు చూడబోయాను,అయినా కాని పొలికే కనిపించింది.

      దివాళా తీసిన వర్తకులు,మా తాత ఆప్తమిత్రులు,థాకరే నవల “వానిటీ ఫెయిర్” లోని మనుషుల మాదిరే,అదే విషయాలని గురించి మాట్లాడేవాళ్లు. నేను రాయడమూ,చదవడమూ స్తోత్రపాఠం నుంచి నేర్చుకున్నాను. నాకు ఆ పుస్తకం అంటే యిష్టం యేమంటే అది కమ్మని,సంగీత బాషలో వుంది. మా తాత యింకా యితర ముసలాళ్లూ తమ పిల్లల గురించి ఒకళ్ల కొకళ్లు పితూరీలు చెప్పుకుంటూ వుంటే దేముడికి అవిధేయుడైన కొడుకు ఆబ్ సాలెమ్ గురించి చక్రవర్తి డేవిడ్ చేసిన  పితూరీలు నాకు గుర్తుకు వచ్చాయి. మామూలుగా మనుష్యులూ,ముఖ్యంగా యువకులూ,పాడైపోయారనీ,యింకా బడుద్దాయిల్లాగా సోమరిగా తయారవుతున్నారనీ,భగవంతుడి పట్ల భయభక్తులు లేకుండా పోతున్నాయనీ ఆ ముసలాళ్లు అనుకునేటప్పుడు వాళ్లు నిజం చెప్పడం లేదనే నాకు అనిపించింది. డికెన్సు చిత్రించిన వంచకులు సరిగ్గా అలాంటి విషయాలనే అనుకునేవారు.

        చర్చి మనుషుల మధ్యన వాదాలని జాగ్రత్తగా విన్నాక,వాళ్లు మిగతా దేశాల్లోని చర్చి మనుషుల్లాగా మాటలని పట్టుకుని వేలాడుతున్నారనీ,చర్చి మనుషులందరికీ,మిగతావాళ్లని అణగదొక్కి వుంచడానికి మాటలన్నీ ఒక దారి అనీ,చర్చి వాళ్లలాగే వుండే రచయితలు వున్నారనీ నేను కనిపెట్టాను. ఆసక్తికరమైనా,యీ పోలికలో యేదో అనుమానాస్పదమైనది వుందని త్వరలోనే నాకు అనిపించింది.

       నా పఠనంలో ఓ పద్ధతీక్రమం లేవనుకోండి,ప్రతిదీ యాదృచ్చికంగా జరిగిందే. మా యజమాని సోదరుడు క్సవ్యే డె మొంటెపేన్,గబోరియా లాంటి వాళ్లు రాసిన ఫ్రెంచ్ “పసుపు అట్ట”చవకబారు నవలలని యిష్టంగా చదివేవాడు. వాటిని చదివిన తర్వాత “నిహిలిస్టుల -విప్లవకారుల”ని గురించి విద్వేషపూరిత వర్ణనలు చేస్తూ, వాళ్లని  పరిహసించే రష్యన్ పుస్తకాలు అతనికి తటస్థపడ్డాయి. నేను ఈ పుస్తకాలు కూడా చదివాను. నేను కలిసి బతికేటువంటి వాళ్లతోటి దాదాపు యే సంబంధమూ లేకుండా వుండే మనుషులని గురించీ,నన్ను వచ్చి తనతో కలవమని పిలిచిన ఆ నేరస్థునికి ఓ రకంగా సన్నిహితంగా వుండే మనుషులను గురించి చదవడం నాకు ఆసక్తికరంగా ఉండేది. “విప్లవత్వం”యీ మనుషుల్లో యెక్కడ వుందో నాకు అర్థం కాలేదనుకోండి,రచయితల ఉద్దేశం యిదే,యేమంటే రచయితలు అందరూ “విప్లవకారుల్నీ”ఒక రంగుతో పులిమేసే వాళ్లు.

   నాకు పొమ్యలోవ్ స్కీ “మోలొతొవ్”, “పశుబుద్ధుడి ఆనందం”తగిలాయి.పశుబుద్ధి జీవితంలోని “అణగార్చే మందకొడి జీవితం”,పశుబుద్ధి ఆనందంలోని క్షుద్రత్వం అవి నాకు తెలియచేసాయి. మబ్బుగా వుండే నిహిలిస్టులు వృద్ధి పొందుతూ వుండే “మోలొతొవ్”కంటే మెరుగని నాకు,అసప్ష్టంగానే అనుకోండి,అనిపించింది. పొమ్యలోవ్ స్కీ తర్వాత నేను జరూబిన్ రాసిన “రష్యన్ జీవితపు వెలుగునీడలు”అనే పరమ నీరస పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో నాకు ప్రకాశవంతమైన భాగం యేది కనిపించలేదు,కాని చీకటి పార్స్వాలు మాత్రం యింకా స్పష్టంగా, యింకా వెలపరంగా వుండేట్టు నాకు తెలిసాయి.

      నేను చెత్త పుస్తకాలని లెక్క లేకుండా చదివాను.కాని అవి కూడా నాకు ఉపయోగపడ్డాయి. జీవితంలోని అనాకర్షక భాగాలని గురించి కూడా ఆకర్షవంతమైన భాగాలల్లాగానే యెవళ్ళైనా తెలుసుకోవాలి.సాధ్యమైనంత అధిక జ్ఞానం సంపాదించుకోవాలి. అనుభవం యెంత వైవిధ్యాపూరిత మైందైతే అంత వర్థమాన దశని మనిషి సంపాదించుకుంటాడు,అతని దృష్టి పథం అంత విస్తృతమవుతుంది.

   నా మీద “పెద్ద”ఫ్రెంచి రచయితలు స్టెండాల్,బాల్జాక్,ఫ్లోబోర్ లు గాఢమైన రూపనిష్పాదక ప్రభావం కలిగించారు. ఆరభకులందరికీ యీ రచయితల పుస్తకాలని చదవమని నేను సలహా ఇస్తాను. వాళ్లు నిజంగా మేధావంతులైన కళాకారులు,రూపానికి సంబంధించి అందె వేసిన నిపుణులు,అలాంటి వాళ్లు రష్యన్ సాహిత్యంలో యింకా దర్శనమివ్వాల్సి వుంది.నేను వాళ్ల రచనలని రష్యన్ బాషలో చదివాను,అయినా కానీ ఫ్రెంచ్ రచనాలోని శక్తిని గ్రహించడానికి అది ఆటంకం కాలేదు.కుప్పలు తెప్పలుగా “పసుపు అట్ట” నవలల తర్వాత,మైయెన్ రీడ్ తర్వాత,ఫెనిమోర్ కూపర్,గుస్తావ్ ఎమార్, పొంసోన్ డ్యు టైరెల్ రచనల తర్వాత యీ మహా రచయితల కథలు నా మీద మంత్రదండం తిప్పినట్టు సమ్మోహక ప్రభావం కలిగించాయి.

  ఒక ట్రినిటీ ఆదివారం రోజున నేను సంబరం చేసుకునే వాళ్ల కంటపడకుండా ఒక మిద్దెమీద దాంకుని,ఫ్లోబెర్ “అమాయక హృదయం”చదవడం నాకు గుర్తుంది. ఆ కథాకథనం నాకు ఆశ్చర్యం కలిగించింది. యేదో చూపు,వినికిడి పోయిన వాడిలాగా అయింపోయినట్టు అనిపించింది. చుట్టూతా సందోహంగా వున్న పండగ వేడుకలన్నీ ఒక సామాన్య స్త్రీ,వంటలక్క,యే రకమైన ఘనకార్యాలు గాని,నేరాలు గాని చెయ్యని ఆవిడ మూర్తితొ కలిసిపోయాయి. సాదా మాటలు,నాకు అంతపరిచయమైన మాటలు,ఒక “సామాన్య” వంటలక్క జీవిత కథలో వాడిన మాటలు నన్ను అంతలా కదిలించి వేయడం అనేది అర్థం చేసుకోవడం నాకు కష్టంగా వుండింది. ఆ పుస్తకం నా మీద కలిగించిన ప్రభావంలో యేదో ఒక  రకమైన మంత్రమహిమని ఖచ్చితంగా నేను వివేచించినట్టే వుంది. కొన్నిసార్లు,ఒక ఆటవికునిలాగా, ఆ చేస్తున్నదేమిటైందీ     ఆలోచించకుండానే,యీ మంత్ర రహస్యం యేమిటైంది ఆ లైన్ల మధ్య కనిపెట్టడానికా అన్నట్టు నేను ఆ పేజీలని వెలుతురికి యెదురుగా పెట్టి చూశాను.

       నిగూఢమైన, రక్తదాహం గల నేరాలని వర్ణించే పుస్తకాలు నాకు డజన్ల కొద్దీ పరిచయమే,అయినా నేను స్టెండాల్ రాసిన “ఇటాలియన్ గాధలు”చదివినప్పుడు అదంతా యెలా జరిగింది నాకు బోధపడలేదు. క్రూరకృత్యాలనీ,పగ తీర్చుకునే హత్యలనీ వర్ణించిన మనిషి యిక్కడ వున్నాడు.అయినా గాని అతని కథలని నేను యేదో “ఋషుల జీవిత కథలు” అయినట్టూ,నరకంలో చిత్రహింసలు పడుతున్న వాళ్లని ఓదార్చడానికి దేవమాత అక్కడికి వెళ్ళిన కథ “మనదేవి కల”వింటున్నట్టూ చదివాను.

    బాల్జాక్ “మేక తోలు ముక్క” నవలలో బేంకర్ విందు యిచ్చిన వర్ణన వున్న పేజీలను చదువుతూ వుంటే నాకు పరమాశ్చర్యం కలిగింది. పాతికమంది అతిథులు అందరూ ఒకేసారి,నా చెవులు చిల్లులు పడిపోతాయా అన్నంత గందరగోళం లేపుతూ మాట్లాడేస్తారు అందులో.యింకా ముఖ్యం అయింది ఏమిటంటే నేను ఆ అతిథులు మాట్లాడింది వినడమే కాదు,వాళ్ళల్లో ప్రతి ఒక్కరినీ వాస్తవంగా చూశాను.బాల్జాక్ ఆ బేంకర్ అతిథుల రూప లావణ్య విశేషాలని వర్ణించకపోయినా నేను వాళ్ల కళ్లనీ, చిరునవ్వులనీ,హావ భావాలనీ చూడగలిగాను.

            మాటలతో ప్రజలని వర్ణించే కళ, వాళ్ల సంభాషణని సజీవంగా, శ్రవణ గ్రాహితంగా చేసే కళ, సంభాషణని సృష్టించడంలో పరిణతి చెందిన నైపుణ్యం గల బాల్జాక్ ,తదితర ఫ్రెంచి రచయితల నేర్పు యెప్పుడూ నన్ను ముంచెత్తేసేది. బాల్జాక్   పుస్తకాలు తైల వర్ణచిత్రాలతో చేసినవేమో ననిపించేది. నేను మొదటి సారి రూబెన్స్ చిత్రాలు చూసినప్పుడు నాకుతక్షణం బాల్జాక్  గుర్తుకు వచ్చాడు. దొస్తొయేవ్ స్కీ రాసిన తిక్క పుస్తకాలు చదివినప్పుడు, నవలా సాహిత్యపు యీ మహా నిపుణుడికి ఆయన చాలా రుణపడి వున్నాడని అనుకోకుండా వుండలేకపోయేవాణ్ణి. లేఖినితో గీసిన చిత్రాల్లాగా తీక్షణంగా వున్న బిగిగల గొన్ కూర్ సోదరుల నవలలూ నాకిష్టంగానే వుండేవి. మబ్బుగా వుండే రంగులతో, హత్తుకునేటట్టు గీసిన చిత్రాల్లాగా వుండే జోలా వ్యాకుల రచనలూ యిష్టంగానే వుండేవి. హ్యూగో నవలలు నన్ను ముగ్ధుణ్ణి చెయ్యలేదు. “1793వ సంవత్సరా”న్ని కూడా యేదో ఉదాసీనంగా చదివాను. తర్వాత మాత్రమే అనతోల్ ఫ్రాన్స్ రాసిన “దేవతల కాంక్ష” చూశాకనే ఆ ఉదాసీనతకి కారణం నాకు అర్ధం అయింది. యెన్నో విషయాలని అసహ్యించుకోవడం నేను నేర్చుకున్నాకనే నేను స్టెండాల్ రాసిన వాటిని చదివాను, అతని నిబ్బరమైన మాటా, సంశయాత్మక మందహాసం నన్ను నా ద్వేషంలో దృఢం చేశాయి.

            పైన చెప్పిన దాన్ని బట్టి తేలేది యేమిటంటే నేను రాయడం అనే దాన్ని ఫ్రెంచి రచయితల నుంచి నేర్చుకున్నాను. యిది యాదృచ్ఛికమే, కాని ఫలితాలు ప్రయోజనకరంగా వున్నాయి. అందుకనే మహా రచయితల గ్రంధాలని మూలంలోనే చదివి, మాటల కళని వాళ్ల దగ్గర్నుంచి నేర్చుకొనేందుకు గాను ఫ్రెంచి చదవమని నేను యువ రచయితలకి సలహా యిస్తాను.

            రష్యన్ సాహిత్యంలో మహా రచయితలైన గోగొల్, టాల్ స్టాయ్, తుర్గేనెవ్,గొన్ చరోవ్, దొస్తొయేవిస్కీ , లెస్కోవ్ల రచనలని నేను చదివింది చాలా తర్వాతనే. తన అద్భుతమైన భాషా సంపదతోటీ, జ్ఞానంతోటీ నా మీద నిశ్శందేహంగా లెస్కోవ్ ప్రభావం కలిగించాడు. రష్యన్ జీవితంలోకి చొచ్చుకుపోయిన సన్నిహితమైన పరిశీలనా దృష్టి గల గొప్ప రచయిత ఆయన. ఆయనకి మన సాహిత్యంలో రావాల్సినంత పేరు రాలేదు. తను లెస్కోవ్ కి యెంతో రుణ పడి వున్నానని చెహోవ్ అన్నాడు.

   రష్యన్ సాహిత్యమూ, విదేశీ సాహిత్యమూ-వీటి అభివృద్ధి గురించిన పరిజ్ఞానం రచయితకి విధిగా వుండాలని మళ్ళీ చెప్పడానికేయీ పరస్పర సంబంధాలనీ, ప్రభావాలనీ నేను పేర్కొన్నాను.

            దగ్గర దగ్గర యిరవై యేళ్ల వయసప్పటికే, జనానికి చెప్పగలిగిందీ, చెప్పి తీరవలసిందీ యెంతో నేను చూసినట్టు, విన్నట్టు, అనుభవించినట్టు నేను గుర్తించాను. మిగతా వాళ్ళ కంటే భిన్నంగా కొన్ని విషయాలను నేను తెలుసుకున్నట్టు, అనుభవించినట్టు నాకు అనిపించింది.అది నన్ను కలత బెట్టింది, అశాంతిగా వదరేటు వంటి  మానసిక స్థితిలో  పెట్టింది కూడా. తుర్గేనెవ్‌ లాంటి సిద్దహస్తులైన రచయితలు రాసినవి చదివేటప్పుడు కూడా ప్రధాన పాత్రల గురించి నేను బహుశా యేదో చెప్పగలనేమోననీ,ఉదాహరణకి “వేటగాని కథలు” నాయకుల గురించి తుర్గనెవ్‌ కంటే మరోలా చెప్పగలనేమోనని అనిపించింది. అప్పటికే కథాకథన నైపుణ్యం వున్న వాడినని నాకు పేరు వచ్చింది. ఓడరేవు కార్మికులు, రొట్టెలు తయారు చేసేవాళ్లు, తిరుగుబోతులు, తివాసీలు చేసేవాళ్లు, రైల్వే కార్మికులు, దేశద్రిమ్మరులు, మొత్తం మీద నేను యెవళ్ల మధ్య బతుకుతున్నానో వాళ్లంతా నేను చెప్పేవాటిని ఆసక్తిగా వినేవాషు. నేను చదివిన పుస్తకాల నుంచి విషయాలనీ తిరిగి చెప్పేటప్పుడు, తరుచుగా యితివృత్త సన్నివేశాలని మార్చేస్తున్నట్టూ, నేను చదివిన దాన్ని వక్రీకరిస్తున్నట్టూ, నా అనుభవంలో నుంచే సేకరించిన వాటిని జోడిస్తున్నట్టూ నాకు అవగతం అయింది. అలా యెందుకు జరిగిందంటే జీవిత, సాహిత్యాల వాస్తవాలు నా మనసులో పెన వ్రేసుకుపోయాయి. ఒక పుస్తకం మనిషి అంతగానూ ఒక దృగ్గోచర విషయం. అది సజీవ, భాషన వాస్తవం కూడా. అది మానవుడు సృష్టించిన, సృష్టిస్తూ వున్న విషయాలన్నిటి కంటే కూడా చాలా తక్కువ “విషయం.”

   నేను చెప్పేది విన్న మేధావులు నాకు యీ సలహాని యిచ్చారు: “మీరు ఠాసితీరాలి. ప్రయత్నించి చూడండి.”

     నేను తరుచుగా నన్ను అణగార్చినవో, లేక ఆనందపెట్టినవో ఆ సకల ఆ విషయాలనీ వ్యక్తం చెయ్యాలనే ప్రేరణతోటి వాగ్ధాటి దాడులని, మాటల రూరిని అనుభవించి మత్తెక్కి పోయేటట్టు వాణ్ణి. “నా గుండె గుబగుబ వదిలించుకోవాల”ని ఆత్రపడే వాణ్ణి. నా లోపలి ఉద్రిక్తతవల్ల నేను చిత్రహింస పడిన క్షణాలు వున్నాయి. – నా కంఠంలో ఉండ కొట్టుమిట్టాడిన క్షణాలు వున్నాయి. నా మిత్రుడు, గాజు వూదే అనతోలీ ప్రతిభ వున్న కుర్రాడనీ సహాయం యేం రాకపోతే నాశనమై పోతాడనీ అరవాలనిపించేది. సామాన్య వేశ్య థెరెసా చక్కని మనిషినీ ఆమె పడుపు వృత్తికి – దిగడం అన్యాయమనీ అరవాలని పించేది. ఆమె దగ్గరకి వెళ్లే విద్యార్థి కుర్రాళ్లు యీ  విషయాన్ని చూళ్లేదు, జీవనాధారం కోసం ముష్టి యెత్తుకునే ముసలామె మాతిత్సా,  పడుచుదనంతో వుండి బాగా చదువుకున్న మంత్రసాని యాకొవ్‌లేవా కంటే గట్టి బుర్ర వున్న మనిషని గ్రహించనట్టే.

            నా సన్నిహిత మిత్రుడు,విద్యార్థికి కూడా తెలియనంత రహస్యంగా నేను థెరెసాని గురించీ, అనతోలి గురించి పద్యాలు రాశాను. వసంత రుతువులో మంచు కరిగి రొట్టెలు చేసే వాళ్ళ నేల మాళిగలలోకి మురికి నీటిగా ప్రవహించేందుకు కాక మంచు కరుగుతుందని పద్యాలు,వోల్గా అందమైన నది అనీ;.జీవితం అనేది ఆత్మను వైకల్యపరిచే మురికి బాడవ, నిరాశ అని పద్యాలు రాశాను.

            పద్యాలు సునాయాసంగా రాసేసేవాణ్ణి.కానీ నేను రాసింది నాకే వెలపరంగా ఉన్నట్టు నాకు అనిపించింది. నేర్పు, ప్రతిభా లేనందుకు నామీద నాకే అసహ్యం కలిగేది. నేను పూష్కిన్, లేర్మిన్ తొవ్,నెక్రాసావ్ ల పద్యాలు కురొచ్కిన్ చేసిన బెరంజే అనువాదాలు చదివి,ఈ కవుల తోటి నాకు ఏమాత్రం సాదృశ్యం లేదని స్పష్టంగా గుర్తించాను. వచనం రాయాలని నిర్ధారణ చేసుకోలేకపోయాను అది నాకు పద్యం రాయడం కంటే కష్టంగా కనిపించింది. దానికి నిశిత దృష్టి, ఇతరులు చూడలేని విషయాన్ని చూసి పరిశీలించే శక్తి, సూటిగా వాడిగా ఉండే శైలి అవసరం. ఏమైనా వచన రచనలో ప్రయత్నం చేయ మొదలు పెట్టాను అయినా లయబద్ధమైన వచన సాధనాన్ని ఎన్నుకున్నాను,ఏమంటే మామూలు వచనం నా సామర్థ్యానికి మించిందిగా కనిపించింది. సాదా శైలి రాయాలన్న నా ప్రయత్నాల వల్ల. విచారకరము, పరిహాసా స్పదము అయిన ఫలితాలు దాపురించాయి. లయబద్ధమైన వచనంలోనే నేను “పాత ఓకు చెట్టు పాట”అన్న బృహత్తర పద్యం రాశాను. ఈ చెత్త రాతని ముక్కలు ముక్కలుగా ఖండించడానికి వి. కొరొలేన్ కొకి  డజను మాటలు సరిపోయాయి. “జీవిత సుడిగుండం “అనే పరిణామ సిద్ధాంతాన్ని చర్చించే వ్యాసం, నేను పొరపడకుండా ఉన్నట్లయితే “జ్ఞానం” అన్న పత్రికలో ప్రచురితమైందానికి సంబంధించి, నాకు కలిగిన ఆలోచనలని అందులో వ్యక్తం చేసినట్టు నాకు గుర్తు.  దానికి సంబంధించి నా జ్ఞాపక పేటికలో ఉన్న ఒక్కటీ “అనంగీకారం తెలియజేయడానికే నేను ఈ ప్రపంచంలోకి వచ్చాను” అన్న వాక్యం. నేను నిజంగా పరిణామ వాదాన్ని అంగీకరించలేదని చెప్పి తీరాలి.

   యేమైనా లయబద్ధమైన వచనం పట్ల నాకు ఉన్న పక్షపాతాన్ని కుదర్చడంలో కొరొలేన్ కొ నెగ్గలేకపోయాడు. ఐదేళ్ల తర్వాత నా కథ “తాత అర్కిప్”  ని పొగుడుతూ, నేను ఆ కథని పద్యాన్ని పోలిన దేనితోటో ముస్తాబు చేయకుండా ఉండాల్సిందని ఆయన అన్నాడు. మొదట్లో నేను ఆయన అన్నదాన్ని నమ్మలేదు కానీ తర్వాత ఇంటి దగ్గర చూద్దును కదా,మొత్తం ఒక పేజీ అంతా,పచ్చిక మైదానంలో కుంభ వృష్టిని గురించిన వర్ణన అంతా ఆ దిక్కుమాలిన “లయబద్ధ”వచనంలో రాసిందని  విచారభరితంగా గుర్తించాను. ఆ వచనం చాలా కాలం నా అడుగులని అనుసరించి, అవాంఛనీయంగా అనువు గాని చోట నా కథల్లోకి యింకిపోయింది…. మొత్తం మీద నేను ఒక “రమ్యమైన” శైలిని వాడ ప్రయత్నించాను. ఒక ఉదాహరణ: “ఆ తాగుబోతు, వదనంమీద మందహాసంతో, చలించే తన నీడని పరీక్షిస్తూ దీపస్తంభాన్ని ఆలింగనం చేసుకుని నుంచున్నాడు.” నేనే రాసినట్టుగా ఆ రాత్రి, సందర్భవశాత్తూ, గాలి లేకుండా, వెన్నెలగా వుంది. ఆ రోజుల్లో అలాంటి రాత్రిళ్లప్పుడు వీధి దీపాల్ని వెలిగించే వాళ్లు కారు. పైగా ఒక వేళ దీపాలు వెలిగినా గాలి లేకుండా వున్నప్పుడు ఆ మనిషి నీడ నిశ్చలంగా వుంటుంది. అలాంటి పొరపాట్లూ, తప్పులూ నా కథల్లో ప్రతిదాంట్లోనూ తగిలాయి, దానికి గాను నన్ను నేను తీవ్రంగా నిందించుకున్నాను.

    “సముద్రం చిరునవ్వు నవ్వుతోంది” అని రాశాను. చాలా కాలం అలా అనడం మంచిదనే అనుకున్నాను. అందాన్ని వెంటాడ్డంలో నేను యెప్పుడూ వర్ణనకి సంబంధించిన సూటిదనానికి దూరం అవుతూనే వుండేవాణ్ణి. విషయాలని తలకిందులు చెయ్యడం, మనుషులని తప్పుగా వర్ణించడం వుండేది.

    ‘మీ పొయ్యి అది వుండాల్సినట్టుగా వుండదు” అన్నాడు లియో టాల్ స్టాయ్ నా కథ “యిరవై ఆరుమంది పురుషులూ, ఒక అమ్మాయి”ని గురించి చెపుతూ. నేను వర్ణించినట్టుగా పొయ్యిలోని మంట రొట్టెలు కాల్చేవాళ్ల ముఖాలమీద వెలుతురు ప్రసరింపచెయ్యదుట. నా “ఫోమా గొర్దేయెవ్”లోని మెదీన్ స్కయా గురించి మాట్లాడుతూ “ఆమెకి మూడు చెవులున్నట్టున్నాయి – ఒకటి ఆవిడ చుబుకంమీద కూడా – చూడండి” అన్నాడు చేహొవ్. నిజంగా అదంతా అతినిజం, ఆమె దీపం యెదురుగా వుండే తీరు అంత తప్పుగా వుంది.

    కొన్ని తప్పులు చిన్నవిగానే కనిపించవచ్చును గాని అవి చాలా ముఖ్యమైనవి. యేమంటే అవి కళాత్మక సత్యాన్ని అతిక్రమిస్తాయి. మొత్తంమీద, “అల్పాక్షరముల అనల్పార్థ రచన” కోసం, మాటని పొదుపుగా వాడుతూ కూడా విస్తారమైన ఆలోచనా పరిధిని  పరివేష్టితం చెయ్యడం కోసం, మాటల ఉపకరణం ద్వారా సజీవ చిత్రాలని సృష్టించడం కోసం, ఒక పాత్ర ప్రధాన లక్షణాల్ని పదునుగా వివరిస్తూ తక్షణం పాఠకుని మనసు మీద ఆ పాత్ర నడవడిక, మాట తీరు చెక్కడం కోసం కచ్చితమైన మాటల్ని యెన్నుకోవడం చాలా కష్టం. మాటల మాధ్యమికం ద్వారా మనుషులకీ, వస్తువులకీ “చిత్రాత్మకత”ని యివ్వడం ఒక ఎత్తు.”యుద్ధమూ-శాంతి”లో లాగా వాళ్లు భౌతికంగా స్పర్శనీయం అవగలందుకు ‘త్రీ డైమెన్షన్స్’లో వాళ్ళని కళ్లకి కట్టినట్టు వర్ణించడం యింకో యెత్తు.

ఒకసారి మధ్య రష్యాలోని ఒక పట్టణపు రూపనఖ చిత్రాన్ని యివ్వాల్సి వచ్చినప్పుడు, నేను యీకింది దాన్ని రాయడానికి ముందు మూడు గంటలు తంటాలుపడ్డాను.

“బావురుమనే రోడ్లు అడ్డదిడ్డంగా పోతున్న సముద్ర తరంగాల్లా వుండే లోయ మధ్యలో రంగురంగుల పట్టణం ఒకూరొవ్ విశాలంగా, ముడతలు పడి వున్న అరచేతిలో ప్రకాశించే ఆటవస్తువులా కనిపించేది.”

నేను మహా బాగానే రాసానని అనుకున్నాను. కాని ఆ కథ ప్రచురితమైనప్పుడు అదంతా అలంకారం చేసిన అల్లం బిస్కట్టు లాగానో లేదా ఒక చాకొలెట్ పెట్టెమీద బొమ్మ లాగానో వుందని నేను గుర్తించాను.

మొత్తంమీద మాటలని మహా కంచు పదునుగా వాడాలి. మరో రంగంనుంచి యింకో సందర్భం యిదిగో. “మతం నల్ల మందు” అన్నారు. కాని నల్లమందుని డాక్టర్లు బాధని తగ్గించేందుకు వాడతారు, అంచేత అది మంచిదే. నల్లమందుని పొగాకు లాగా ధూమపానం చేస్తారనీ, ఆ ధూమపానం మనుషుల్ని చంపేస్తుందనీ, నల్లమందు సారాయికంటే విషపూరితమైందనీ ప్రజలకి తెలియదు.

నా దోషాలు యెప్పుడూ కవి విచారపూరిత మాటలని మనసుకి తెచ్చేవి: “మాటల చిత్రహింసని మించిన నిశితమైన చిత్రహింస ప్రపంచంలో లేదు.”

“మన బీద భాష శీతలంగా దారిద్య్రంతో వుంది.”  అని నాద్ సన్  కవి కామోసు అన్నాడు. భాషా “దారిద్ర్యాన్ని” గురించి అసంతృప్తి ప్రకటించని కవి అరుదు అనుకుంటాను.

            యీ ఫిర్యాదులు రష్యన్ భాషా “దారిద్ర్యా”నికి సంబంధించే కాదు, మామూలుగా మానవ భాషకే సంబంధించినట్టుగా నాకు కనిపిస్తుంది. అది కూడా మాటలు కనిపెట్టలేనీ, వ్యక్తీకరించలేనీ అనుభూతులూ, ఆలోచనలూ వుండటం వల్లనే. కాని, మాటలు కనిపెట్టలేని విషయాలని అలా వుంచినా, రష్యన్ భాష ఒక తరగని సంపద, ఆశ్చర్యం కలిగించే వేగంతో అది సంపద్వంతమవుతోంది. భాష పెరిగే వేగాన్ని రుజువు చెయ్యడం కోసం, గోగొల్, చేహొవ్, తుర్దేనెవ్ లూ, ఉదాహరణకి బూనిన్, దొస్తోయేవ్స్కీ యింకా లియోనీద్ లియోనొవ్ వాడిన మాటల సముదాయాన్ని పోల్చి చూడ్డం మంచిది. లియోనొవ్ తను దొస్తోయెవ్స్కీ నుంచి సాధించుకున్నానని పత్రికల్లో ప్రకటించాడు,కాని కొన్ని రకాలుగా -ఉదాహరణకి మనస్సుని అంచనా కట్టడంలో-లియో టాల్ స్టాయ్ నుంచీ సంక్రమింప చేసుకున్నాడనీ, అతను అని వుండేవాడు. యేమైనప్పటికీ, యీ రెండు లింకులూ కూడా యువరచయిత ప్రాముఖ్యాన్ని రుజువు చేస్తున్నాయి గాని అతని మౌలిక ప్రజ్ఞని యేరకంగానూ వక్రీకరించవు. అతను యే సందేహమూ లేకుండా, తన నవల “దొంగ”లో ఆశ్చర్యకరమైన భాషా సంపదని వెల్లడి చేశాడు. అతను అనేకం అధికమైన ఉచిత పదాలని సొంతం సృష్టించాడు. పైగా అతని నవలా నిర్మాణం సంక్లిష్టతలోనూ, కల్పనలోనూ స్ఫుటంగా వుంది. లియోనొవ్ తన సొంత సందేశం వున్నవాడనీ, యెంతో మౌలిక ప్రజ్ఞ వున్నవాడనీ నా అభిప్రాయం; అతను ఆ సందేశాన్నివ్వడం యిప్పుడే మొదలుపెట్టాడు, దొస్తొయేవ్ స్కీ గాని, మరెవరుగాని అతన్ని అందులో ఆటంకపరచలేదు.

భాషని ప్రజలు సృష్టిస్తారని మీకు గుర్తు చెయ్యడం ఉచితం యిక్కడ. సాహిత్య భాష అనీ, ప్రజల భాష అనీ అనడం వూరికే ఒకటి “ముడి సరుకు” అనీ, రెండవది సిద్ధహస్తులు మలిచింది అనీ చెప్పడమే. దీన్ని పూర్తిగా గుర్తించిన మొదటి వాడు పూష్కిన్. ప్రజలు సమకూర్చిన భాషణ సామగ్రిని ఉపయోగ పెట్టుకుని, వ్యవహరించాల్సిన తీరు చూపించిన మొదటివాడూ ఆయనే.

కళాకారుడు తన దేశాన్నీ, తన వర్గాన్నీ ప్రభావితం చేసే సర్వాన్నీ అతి సున్నితంగా గ్రహించేవాడు – దాని చెవి, కన్ను, గుండెకాయ. అతనిది తన కాలపు గొంతు. అతను యెంత వీలైతే అంతా తెలుసుకోవాల్సిన విధి వున్నవాడు. మరి అతను గతాన్ని గురించి యెంత బాగా తెలుసుకుంటే, వర్తమానాన్ని అంత బాగా అర్థం చేసుకోగలడు. అంత గాఢంగా నిశితంగా అతను మన కాలపు సార్వజనీన విప్లవత్వాన్ని, దాన్ని యెదుర్కొనే కర్తవ్యాల పరిధిని గ్రహిస్తాడు. ప్రజల చరిత్రకి సంబంధించిన పరిజ్ఞానం ముఖ్యం, అలాగే దాని సాంఘిక, రాజకీయ ఆలోచనా సరళకి సంబంధించిన జ్ఞానమూనూ. పండితులు – సంస్కృతి చరిత్రకారులు, మానవజాతుల శాస్త్రీయ వర్ణన చేసే వాళ్లూ – యీ ఆలోచన అద్భుత కథల్లోనూ, కల్పిత కథల్లోనూ, సామెతల్లోనూ, సూక్తుల్లోనూ వెల్లడి అవుతుందని వివరించారు. యెంతో బోధనాత్మకంగా, పరిపూర్తిగా వుండే రీతిలో ప్రజాబాహుళ్యం ఆలోచించే ధోరణిని సూక్తులు సామెతలూనే వాస్తవంగా వ్యక్తం చేస్తాయి. కొత్త రచయితలు వాటికి సంబంధించిన పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలి, మాటల పొదుపరితనాన్నీ, సూటిదనాన్నీ, ఆలంకారికతనీ అవి ఉత్కృష్టంగా బోధిస్తూ వున్నందువల్లనే కాదు యీ దిగువ కారణం వల్ల కూడా :సోవియట్ల దేశపు జనాభాలో అత్యధిక భాగం రైతులే. శ్రామికులు, పట్టణవాసులు, వర్తకులు, పూజారులు, అధికారులు, ప్రభువంశీకులు,ప్రసిద్ధ వైజ్ఞానికులు,కళాకారులు లాంటి వాళ్ళందరినీ మలిచిన మృత్తిక రైతు అంటే. ప్రభుత్వ చర్చిని నియమితం చేసిన వాళ్లా,చర్చి నుండి విడిపోయిన అనేక శాఖలా  నిరంతర పభవంలో రైతు మనసు వుండింది.యుగాలుగా రైతులకి సూక్తులూ,సామెతలూ లాంటివి తయారై సిద్ధంగా వున్న,స్థిరరూపాలలో ఆలోచించడమే నేర్పడం జరిగింది. వాటిల్లో అత్యధిక భాగం కుదించిన రూపంలో పొదిగిన చర్చి బోధనలు తప్ప మరేం కాదు….

            …..మొత్తంమీద, సామెతలూ, సూక్తులూ అనేవి శ్రామిక ప్రజలు కూడబెట్టుకున్న సాంఘిక చారిత్రక అనుభవాన్ని సంక్షిప్తంగా పొదివి పట్టుకున్నవే. గుప్పిడి ముడిస్తే వేళ్లు ముడుచుకున్నట్టుగా, రచయిత అనేవాడికి మాటలని కుదించడం నేర్పే సరంజామా పరమ అవసరం. అలాగే యితరులు కుదించిన వాటిని విస్తరించడమూనూ. అది కూడా ఆ కాలానికి విరుద్ధంగా వున్న, లేదా పాతబడిపోయిన అంతర్భూత అర్థాలని వెల్లడి చేసేటట్టు అలా చెయ్యాలి.

            నేను సామెతలనుంచి చాలా నేర్చుకున్నాను, లేదా వేరే మాటల్లో చెప్పాలంటే సూక్తుల పద్ధతిలో ఆలోచించడం నుంచి. యీకింది సంఘటన గుర్తుకు వస్తోంది: మా మిత్రుడూ కావలివాడూ అయిన యాకొవ్ సొల్దాతొప్కి జోక్ లంటే చెడ్డ సరదా. అతను ఒకసారి కొత్త చీపురు కట్టని వూపుతూ వీధి తుడుస్తున్నాడు. యాకొవ్ నా కేసి చూసి, హుషారుగా కన్ను గీటి, అన్నాడు:

            “నేనేం చేస్తున్నాగానీ తుదముట్టించడం అనేది వుండదు. నేను వూడ్చే కొద్దీ వస్తూనే వుంటుంది.”

             అతను వున్నదున్నట్టు చెపుతున్నాడని నేను గుర్తించాను. యిరుగుపొరుగు వాళ్లు వీధిని శుభ్రంగా వుంచుకున్నా, పక్క వీధులనుంచి గాలి దుమ్ముని తీసుకువస్తుంది. పట్టణంలోని అన్ని వీధులనీ శుభ్రంగా వుంచుకున్నా, ధూళి మేఘాలు పొలాలనుంచీ, చుట్టు పక్కల పట్టణాలనుంచీ వస్తూనే వుంటాయి. యెవళ్ళ యింటి చుట్టూతావాళ్లు శుభ్రంగా వుంచుకోవాలనుకోండి, కాని దాన్ని మొత్తం వీధికి, మొత్తం పట్టణానికి,మొత్తం ప్రపంచానికి విస్తరించినట్లయితే శ్రమకి ఫలితాలు యితోధికంగా వుంటాయి.

  యీ పద్ధతిలో ఒక సూక్తిని విస్తృతపరచవచ్చు. సూక్తులు యెలా పుడతాయీ అనేదానికి యిది ఒక ఉదాహరణ:ఒకసారి నీజ్ని నోవ్ గొరొద్ లో కలరా సోకినప్పుడు, డాక్టర్లు రోగిష్టి వాళ్లని హతం చేసేస్తున్నారని యెవడో పుకారు లేపాడు. గవర్నర్ అతన్ని అరెస్టు చెయ్యమని ఆర్డరు వేసి, అతన్ని కలరా రోగుల ఆస్పత్రిలో సహాయకునిగా పని చేసేటట్టు చేశాడు. తర్వాత ఆ పుకారు లేపిన వాడు గవర్నరు తనకి నేర్పిన గుణపాఠానికి కృతజ్ఞత చెపితే, గవర్నరుగారు బదులు చెప్పాట్ట:

            “సత్యం నీ మొహంమీద మొత్తుతున్నప్పుడు, నువ్వు అబద్దం ఆడ్డం మానేస్తావు.

            గవర్నరు ముతక మనిషి, కాని మొద్దు కాదు. అలాంటి విషయాలని అనగత సమర్థుడే. అదీగాక, ఆ మాటలని యెవడు అన్నాడో పెద్ద తేడా యేం వుంటుంది.

            నేను ఆలోచించడానికీ, రాయడానికి నాకు సహాయం చేసినవి అలాంటి సజీవ ఆలోచనలు. కావలి వాళ్ళనుంచీ, లాయర్ల నుంచీ, కులం పోగొట్టుకున్న వాళ్లనుంచీ అన్ని రకాల మనుషులనుంచీ, నేను నేర్చుకున్న ఆలోచనలకి సరిపోలినవే పుస్తకాల నుంచి నేర్చుకున్నవీనూ. కాని పుస్తకాలలో ఆ మాటలు వేరే వేషంతో వుంటాయి. అంచేత యీ రకంగా జీవిత వాస్తవాలు, సాహిత్య వాస్తవాలు ఒక దానికి ఒకటి పూరకం అయ్యాయి.

            సాహిత్యకారులు “నమూనా”లనీ, పాత్రలనీ సృష్టించే విధానాన్ని గురించి నేనిది వరకే చెప్పాను, కాని నేను బహుశా రెండు ఆసక్తికరమైన ఉదాహరణలని యిస్తాను.

            గ్యోతే రాసిన “ఫౌస్ట్” కళాసృష్టిలో ఉతృష్టమైంది. కళాసృష్టి సర్వదా కల్పిత కథ, వూహ. లేదా యింకా కచ్చితంగా చెప్పాలంటే జీవితం అందిస్తున్న దానికి జత చేసిన ఒక రకమైన వూహ, అదే సమయంలో ఆలోచనని ప్రతిమలలోకి అనూదితం చెయ్యడమూను. నేను మొట్టమొదటగా “ఫౌస్ట్”ని చదివినప్పుడు నాకు యిరవై యేళ్లు. ఆ తర్వాత కొంత కాలానికి జర్మన్ గ్యోతేకి ముందే రెండు వందల యేళ్ల క్రితం ఇంగ్లీషు నాటకకర్త క్రిస్తఫర్ మార్లో అనే ఆయన ఫౌస్ట్ ని  గురించి రాసాడని నాకు తెలిసింది. “పన్ త్వర్థోవ్స్కీ” అనే పోలిష్ నవల కూడా ఒక రకమైన ఫౌస్ట్ అనీ, అలాగే ఫ్రెంచ్ రచయిత పాల్ ముస్సే రాసిన నవల “ఆనందాన్వేషి” కూడాననీ తెలిసింది. ఒక మానవుడు సొంత ఆనందం కోసమూ, మిగతా వాళ్లమీదా, ప్రకృతి రహస్యాలమీదా అధికారం కోసమూ తన ఆత్మని సైతాన్ కి  అమ్మేసాడనే మధ్య యుగాల నాటి కథమీద ఆధారపడి ఫౌస్ట్ ని  గురించిన అన్ని పుస్తకాలూ పుట్టాయని నాకు తెలిసింది. క్షుద్ర లోహాలని బంగారంగా మార్చి,జీవితామృతాన్ని ఆవిష్కరించాలని దేవుళ్లాడిన రసవాదుల జీవితాన్నీ,ప్రయత్నాలనీ పరిశీలించడం నుంచి యీ కథ పెరిగింది. వీళ్ళల్లో నిజాయితీ వున్న స్వాప్నికులూ వున్నారు,యావలో పడికొట్టుకుపోయిన వాళ్లు వున్నారు,వాళ్లే గాక నాటు మనుషులూ,నాటు వైద్యులూ వున్నారు. “తిరుగులేని అధికారా”న్ని సాధించాలని యీ వ్యక్తులు చేసిన ప్రయత్నాల్లోని బోలుతనాన్నే మధ్యయుగం నాటి డాక్టర్ ఫౌస్ట్ సాహసాల  కథలో పరిహసించడం జరిగింది. అతనికి సర్వజ్ఞతానికి, అమరత్వానికి ప్రసాదించడం అనేది సైతాన్ శక్తికి మించినది అని రుజువైంది.

            దుఃఖతుడైన ఫౌస్ట్ పక్కన, ప్రజలందరికీ పరిచయమైన యింకో మూర్తి వుంది. అది ఇటలీ దేశంలో పుల్చినేల్లో, ఇంగ్లండ్లో పంచ్, టర్కీలో కరపేట్, మన దేశంలో పెత్రూష్క, జానపదుల తోలుబొమ్మల ప్రదర్శనలో, యెప్పుడూ పోలీసుల్ని, మతాధిపతులని, ఆఖరికి దయ్యాన్నీ మృత్యువునీ కూడా మాయ చేసేసి, తనే మృత్యువు లేకుండా అగ్రభాగంలో వుండే అజేయ వీరుడు. పాటక జనం యీ అమాయకపు,ముతక రూపంలో తమ మూర్తినీ మొత్తంమీద యేనాటికేనా గానీ తాము తామే, సర్వాన్నీ, ప్రతిదాన్నీ జయిస్తారన్న విశ్వాసాన్నీ దర్శించారు.

            యీ రెండు ఉదాహరణలూ నేనిదివరకే చెప్పినదాన్ని రుజువు చేస్తాయి: “పేరులేని” రచనలు, అంటే, యేమీ తెలియని ప్రజలు సృష్టించినవి, కూడా  సంగ్రహించే నియమాల్నీ, యే సాంఘిక గ్రూపుకేనాగానీ విశిష్టంగా వుండే అంశాలనీ, అలాగే యీ లక్షణాలని ఆ గ్రూపు ప్రతినిధి అయిన వ్యక్తిలో ప్రత్యేకం చేసే నియమాలనీ అంగీకరిస్తూనే వుంటాయి. ఒక కళాకారుడు విధేయంగా ఆ నియమాలని అనుసరిస్తే అతను “నమూనా”లని సృష్టించగలడు. యీ రకంగా షార్ల్ ది కస్ట్యోర్  తన “తిల్ ఉతెన్స్పీగిల్” లో ఫ్లెమింగ్ కి, జాతీయ నమూనాని, రొమేన్ రోలాన్ తన “కొలా బ్రున్యోన్”లో బర్గండీ మనిషిని, అల్ఫాన్స్ దదే తన “తార్తారియన్”లో ప్రొవనెల్ మనిషినీ సృష్టించారు. నిశితమైన పరిశీలనా, పోలికలూ తేడాలూ విచక్షణగా చూడగలిగే సామర్థ్యం, నిరంతర, అవిచ్ఛిన్న అధ్యయనం వుంటేనే అలాంటి “నమూనా” జనాన్ని కళ్లకు కట్టినట్టు వర్ణించడం జరుగుతుంది. కచ్చితమైన పరిజ్ఞానం లేని చోట, వూహని ఉపయోగించడం జరుగుతుంది. పది వూహల్లో తొమ్మిది ఖాయంగా తప్పే అవుతాయి.

            ఒబ్లోమొవ్, రూదిన్, ర్యజానొవ్ లాంటి పాత్రలకీ, నమూనాలకీ సమమైన పాత్రలనీ, నమూనాలనీ సృష్టించడంలో నేను సిద్ధహస్తుణ్ణి అని అనుకోను. అయినాగానీ,”ఫొమా గోర్దెయెవ్” రాయడానికి,తమ తండ్రుల జీవితాల తోటీ పని తోటీ సరిపడక,ఆ వైవిధ్యరహిత “అణగార్చే మందకొడి”జీవితంలో అర్థం తక్కువ అని అస్పష్టమైన అనుభూతి వున్న వర్తకుల యిళ్ల వంశోద్దారకులని చాలా డజన్ల మందిని చూడాల్సి వచ్చింది. ఫొమా గోర్దెయెవ్ లాంటి వాళ్ళ మధ్యనుంచి,తమకి అవమానకరమైన,విసుగుదల జీవితపు పాలపడిన వాళ్ళ మధ్యనుంచి,ఆలోచించడంమొదలుపెట్టిన వాళ్ళ మధ్యనుంచి ఒక పక్క తాగుబోతులు,రౌడీలు,భ్రష్టులు పుట్టుకొచ్చారు. యింకో పక్క సామాన్య సూత్రానికి మినహాయింపు అయి లెనినిస్టు “ఇస్క్రా”కి డబ్బు పెట్టిన ధనిక సవ్వ మొరోజొవ్ లాంటి, సోషల్ రివల్యూషనరీలకి ఆర్థిక సహాయం చేసిన పెర్మ్ ఓడ అధిపతి ఎన్.మెష్ కోవ్,కలూగ ఫాక్టరీ యజమాని గొన్ చరోవ్,మాస్కోకి చెందిన ఎన్. ష్మిడ్త్ యింకా అలాంటి వాళ్లు పుట్టుకొచ్చారు.అదే సాంఘిక వాతావరణం నుంచే చెరెపొవేత్స్ మేయరు అయిన మిల్యూతిన్ లాంటి సాంస్కృతిక నాయకులు, విజ్ఞానశాస్త్రాన్నీ, కళనీ, తదితర సాంస్కృతిక కార్యకలాపాలనీ పోషించడంలో యెంతో నేర్పునీ, భక్తినీ ప్రదర్శించిన వర్తకులు చాలా మంది మాస్కోనుంచీ, రాష్ట్రాలనుంచీ పుట్టుకొచ్చారు. ఫోమా సంరక్షకుడు మయాకిన్ కూడా చిల్లర లక్షణాలతో, లేదా “సామెతల”తో తయారైనవాడే. అక్కడ ఒక విచక్షణ ప్రదర్శించాననుకుంటున్నాను: 1905 తర్వాత రైతుల శ్రామికుల మృతకళేబరాలు మయాకిన్ల అధికారానికి దారి వేసినప్పుడు, యీ మయాకిన్లు శ్రామికవర్గానికి వ్యతిరేకంగా పోరాటంలో ప్రముఖ పాత్ర నిర్వహించారు, యివాల్టికి కూడా తమ పాత గూళ్లకి తిరిగి రావాలనే కలగంటూవున్నారు.

    నేను జీవితంలో “చిత్తయి పోయినవాళ్ల”ని గురించి యెందుకు రాసానని యువజనం నిన్ను అడుగుతూ వుంటారు.

    కారణం సాదా అయిందే. నాకు లాగా క్షుద్ర సంస్కారహీనుల మధ్య బతుకుతూ, యితరుల జీవరుధిరాన్ని పీల్చాలని ప్రయత్నిస్తూ ఆ రక్తాన్ని కోపెక్కులుగా ఆ కోపెక్కులని రూబుళ్లగా మార్చాలని చూసే వాళ్లు చుట్టుముట్టి వుండగా, నేను, నాకు ఉత్తరం రాసిన 19 యేళ్ల వ్యక్తిలాగా, “నా శరీరంలోని ప్రతీ అణువుతోనూ” మందకొడి ప్రజల మశ్చక సమ జీవితం పట్ల, రాగి అయిదు కోపెక్కు నాణేలు అన్నీ ఒక్కలాగే ముద్రించినట్టు ఒకళ్లనొకళ్లని పోలివున్న ఆ ప్రజల జీవితం పట్ల, ద్వేషం పెంచుకున్నాను.

   నాకు తిరుగుబోతులూ, ఆవారాగాళ్లు మామూలు గాడిలో లేని మనుషులుగా కనిపించారు. వాళ్లు ప్రజలతో విభేధించి వుండేవాళ్ళు. యేమంటే కులం పోగొట్టుకోవడం వల్లా, తమ వర్గం నుంచి బహిష్కృతమవ్వడం వల్లా వాళ్లు తమ పూర్వ వాసనలని వదిలించుకున్నారు. నీజ్ని నోవ్ గొరొద్ లోని ‘మిల్లియోంకా’అనే చోట వుండే చిట్టయిపోయిన వాళ్ళల్లో పూర్వం స్థితిమంతులుగా వున్న వెనుకటి నగరవాసులు;మా బంధువు అలెగ్జాండర్ కషీరిన్ ,ఒక సాధు స్వాప్నికుడు;టంటీని అనే ఒక ఇటాలియన్ చిత్రకారుడు;గ్లద్ కోవ్ అనే ఒకనాటి పాఠశాల ఉపాధ్యాయుడు;యెవరో ఒక బారన్ బి.; దోపిడీ నేరానికి జైలులో గడిపిన ఒకనాటి పోలీసు ఇన్స్పెక్టరు;యింకో పేరు మోసిన దొంగ ‘నికోల్క జనరల్‌’ అన్యోన్యంగా స్నేహంగా కలిసి మెలిసి  వుండేవాళ్లు రమారమియిరవై మంది నానా రకాల వాళ్లూ వున్న ఒక గుంపు కజాన్ లోని  సైక్లియాన్నీ జవోద్‌’లో వుండేది. వాళ్లల్లో రాద్లొవ్ లేదా రదునోవ్‌” విద్యార్థి వుండేవాడు; పది సంవత్సరాలు కఠిన శ్రమశిక్ష అనుభవించిన కాగితాల తయారికి పీలికలు  పోగుచేసే పెద్దాయన ఒకతను; గవర్నరుకి ఒకప్పుడు పరిచారకుడుగా వున్న గ్రాచిక్ ; యింజను డ్రైవరూ రొద్జియేవిచ్‌, బైలోరష్యన్‌ పూజారి కొడుకూ, పశువైద్యుడు దవీదొవ్ వుండేవాళ్లు. వాళ్లల్లో అధిక భాగం రోగిష్టులే. వంటికి సరిపడే దానికంటే అధికంగా తాగి కొట్లాడుకునే వాళ్లు. కాని వాళ్ళ మధ్యలో ఒక స్నేహభావం, పరస్పర సహకారం వుండేవి. వాళ్లు తాము యేది సంపాదించుకోగలిగినా లేదా కాజెయ్యగలిగినా ఆ  తిండి మీదా సారామీదా ఉమ్మడిగా బతికేవాళ్లు. తమ బతుకులు “సాదా జనం” కంటే కష్టతరంగా వున్నప్పటికీ, యీ మనుషులు వాళ్ళకంటే అధికులమని అనుకునే వాళ్లు. యేమంటే వాళ్లకి దురాశలేదు. వాళ్లు ఒకళ్లనొకళ్ళని అణగదొక్కుకునే వాళ్ళు కాదు, డబ్బు వెనకేసుకునే వాళ్లు కాదు. వీళ్లల్లో కొంత మంది కొంత సొమ్ము జాగ్రత్త  చేసుకుని వుండచ్చు యేమంటే వాళ్లు పాదుపరితనపు అవశేషాలనీ, “క్రమబద్ధ” జీవితం  పట్ల ప్రేమనీ యింకా నిలబెట్టుకున్న వాళ్లు. వాళ్ళకి దాచుకున్న సొమ్ము వుండి వుండవచ్చు. యేమంటే నేర్పూ, నెగ్గుకు వచ్చే అదృష్టమూ వున్న గ్రాచిక్‌ తరచుగా కొల్లగొట్టిన  దాన్ని “క్రోశ్రాధిపతి” రొద్జియేవిచ్‌ భద్రంగా దాచమని యిచ్చేవాడు. యీ చిత్తయిపోయిన  కూటానికి రొద్జియేవిచ్‌ ఒక రకమైన జనరల్‌ మానేజర్‌. అతన్ని అందరూ నమ్మేవాళ్లు. పైగా ఆశ్చర్యకరమైన మెతకదనమూ, దుర్బల సంకల్పమూ వున్న వ్యక్తి.

            యెన్నో దృశ్యాలని నేను గుర్తుచేసుకోగలను: ఓ సారి ఓ మిత్రబృందంలోని  ఒకతను తను కాజేసిన యెత్తు బూట్లని తీసుకువచ్చాడు. వాటిని అమ్మెయ్యాలని, ఆ  సొమ్ము సారామీద ఖర్చుపెట్టాలనీ ఉమ్మడిగా తీర్మానం చేశారు. అయినా, పోలీసు  దెబ్బలు తిని జబ్బుగా వున్న రొద్జియేవిచ్‌ బూట్ల పై భాగాన్నే అమ్మి,బూట్లు విరిగిపోయిన “విద్యార్థి”కి యివ్వాలని అన్నాడు. “వాతం పట్టి చచ్చిపోతాడు  అతను, మనిషి మంచివాడు” అన్నాడతను.

            బూట్లపై భాగం తీసేశాక, ఆ జైలుకెళ్లి వచ్చిన అపరాధి దాన్ని చెప్పుల  కింద మార్చాలన్నాడు – ఒక జత తన కోసం, రెండవది రొద్జియేవిచ్ కోసం. ఆ రకంగా  కాజేసిన ఆ బూట్లని యింతా చేసి సారాకింద మార్చడమే జరగలేదు. తను అందరి పట్లా స్నేహపూర్వకంగా వుండి,అందరికీ సాయం చేస్తాననీ, యెందుకంటే తనకి  “చదువుకున్న జనం” అంటే యిష్టమనీ  గ్రాచిక్ అన్నాడు.

            “నాకు చదువుకున్న మనిషంటే అందమైన ఆడదానికంటే యెక్కువ యిష్టం”అని అతను నాతో అన్నాడు. అతను వింత మనిషి, నల్లని జుట్లు, మంచి రూపు  రేఖలు, హృద్యమైన మందహాసం వున్నవాడు.మాములుగా మితభాషిగా, ఆలోచనామగ్నంగా వుండే అతను. కాని ఒకో అప్పుడు అడ్డూ ఆపూలేని, దాదాపు  పిచ్చెత్తి పోయినంత హుషారుగా వుండేవాడు: పాటలు పాడేవాడు, నాట్యం చేసేవాడు, తన ఘనకార్యాలని గురించి డబ్బా కొట్టేవాడు, యిక యొప్పటికీ తిరిగి రాకుండా యేదో యుద్ధంలోకి పోయే వాడిమల్లే అందర్నీ కాగలించుకునేవాడు. ఒకసారా కొట్టు కింద నేలమాళిగలో వుండే యెనమండుగురు ముష్టి వాళ్లని పోషించేవాడు; వీళ్లు శక్తులు ఉగిడిపోయిన వృద్ధ స్త్రీ, పురుషులు. కాని వాళ్లల్లో ఒక యేడాది చంటిబిడ్డ వున్న ఒక పడుచు పిచ్చి ఆమె కూడా వుండేది. అతను యీ రకంగా దొంగ అయ్యాడు;తనను యింకా గవర్నరుగారి నౌకరుగా వుండగానే ఒక రాత్రంతా తన ప్రియురాలితో గడిపేడు. పొద్దున్న యింటికిపోతూ, యింకా మత్తుగానే వున్న స్థితిలో పాలు అమ్మే ఒకామె దగ్గర్నుంచి బలవంతంగా ఓ కూజా లాక్కుని పాలు తాగేశాడు. పట్టుకున్నప్పుడు పెనుగులాడాడు. న్యాయాధికారి అతన్ని జైలుకి పంపించాడు. ఆ న్యాయాధికారికి ఉదారుడని పేరు వున్నా తన విధులని కఠోరంగా నిర్వర్తించేవాడు. జైలునుంచి వచ్చాక గ్రాచిక్‌, అతని అధ్యయన మందిరంలోకి చొరబడి, ఆయన కాగితాలన్నిటినీ చింపేసి,అలారం గడియారం, బైనాక్యులర్స్‌ కాజేసి మళ్లీ జైల్లో కూర్చున్నాడు. కన్నం వెయ్యడానికి విఫల ప్రయత్నం చేసి పహారా వాళ్లని తప్పించుకుని పారిపో ప్రయత్నించేటప్పుడు నాకు అతనితో పరిచయం అయింది. అతన్ని వెంటాడేవాళ్ళల్లో ఒకణ్ణి తొట్రు పడచేసి గ్రాచిక్‌ పారిపోవడానికి నేను సాయంచేశాను. అతనితోబాటు పారిపోయాను.

              యీ వెలివేసిన మనుషులలో వింత మనుషులు వుండేవాళ్ళు, నాకు అర్థం  కానిది వాళ్లల్లో చాలా వుండేది. నేను వాళ్ల పట్ల అనుకూలంగా వుండడం అనేది  వాళ్లు జీవితం మీద ఫిర్యాదు లేమీ చెయ్యకపోవడమన్న దాని వల్లనే. స్థితిమంతుల  కులాసా జీవితం అంటే వాళ్లకి అసూయ లేదు. దాన్ని గురించి పరిహాసంగా,యెత్తిపొడుపుగా మాట్లాడుకుంటూ, అందని ద్రాక్ష పళ్లు పుల్లన అనే భావమే  ద్యోతకం కానియ్యరు. తమ జీవితాలు బీదరికంతో వున్నా, కులాసాగా గడిపే వాళ్ళ కంటే తామే  మెరుగని, తాము యేదో గుర్తించినట్టుగా, వాళ్లు గొప్పగా భావించుకునే వాళ్ళు.

              నేను “చిత్తయి పోయినవాళ్లు”లో చిత్రించిన వసతి గృహపు కాపలావాడు, కువాల్ దా, అధ్యక్షతన వున్న కోర్టులో నేనను మొదటిగా చూసిన వాడు. జడ్జిగారు  అడిగిన ప్రశ్నలకి యీ బికారి సమాధానంయిచ్చిన హుందాతనం, పోలీసులు పోటీ సాక్ష్యం తెచ్చినప్పుడు అతను ప్రదర్శించిన యేవగింపు నాకు ఆశ్చర్యం కలిగించాయి.ఒదెస్సా ఆవారా మనిషి సరదాగా పరిహాసాలాడ్డమూ నాకు అంతే ఆశ్చర్యం కలిగించింది. “చెల్‌కాష్‌”లో నేను వర్ణించిన సంఘటన చెప్పింది అతనే. నికొలాయెవ్  పట్టణంలో ఒక హాస్పిటల్‌లో మేం కలుసుకున్నాం. అతని చిరునవ్వు నాకు బాగా  గుర్తు వుంది. అతని అద్భుతమైన తెల్లని పళ్లు కనిపించేవి.అతను పనికి పెట్టుకున్న ఒక  యువకుడు తనని మోసగించిన విధం చెపుతూ అతను తన కథ ముగించాడు:“అంచేత నేను అతన్ని ఆ డబ్బు తీసుకుని పోనిచ్చాను. ఫోరా, వెధవా, పోయి దాంతో  నీ యిష్టం వచ్చినట్టు చేసుకో”.

     అతను నాకు డ్యూమా “ఉదాత్త” నాయకుల్ని గుర్తుకు తెచ్చాడు. హాస్పిటల్  నుంచి బయటపడ్డాక, నాకు కొన్ని పుచ్చకాయ ముక్కలు పెడుతూ నన్నడిగాడు: “కొత్త  లాభసాటి వ్యవహారంలో నాతో కలుస్తారా మీరు? మీరు సరిపడే  వాళ్లని నా అభిప్రాయం.”

            అది వూరించేటట్టుగానే వుంది, కాని స్మగ్లింగ్‌ కన్నా, దొంగతనం కన్నా  ప్రయోజనకరమైన పనులు వున్నాయని నాకప్పటికే  తెలుసు.

            బహిష్కృతుల పట్లా, ఆవారాల పట్లా నాకు గల మొగ్గుకి సంబంధించిన  వివరణే నేను చెప్పింది అంతా – మందకొడి సంస్తారహీనులని కాకుండా  జీవితపు గాడికి బయటవున్న వాళ్లని, చిత్రించాలన్న నా కోరికని వివరించిందే. నేను  విదేశీ సాహిత్య ప్రభావం కింద కూడా వున్నాను. మొదటగా ఫ్రెంచి సాహిత్యం, అది రష్యా  సాహిత్యం కంటే యింకా యెక్కువ కళ్లకి కట్టినట్టూ, వర్ణ శోభితంగానూ వుంది. యేమైనప్పటికీ, మా పదిహేనేళ్ల లేఖరి రాసినట్టు “అణగార్చే మందకొడి జీవితాన్ని” నా వూహల ద్వారా ఉత్సాహభరితం చెయ్యడమనే నా కోరికే ప్రధాన కారణం.

               నేనిదివరకే చెప్పినట్టుగా ఆ కోరికని “రొమాంటిసిజం”అంటారు. కొంతమంది విమర్శకుల అభిప్రాయంలో నా రొమాంటిసిజం నా తాత్వికతలో వున్న  భావవాదపు ప్రతిబింబమే. ఆ అంచనా తప్పని నా అభిప్రాయం.

              మానవుడూ, జంతువులూ, మానవుడు సృష్టించిన సకల వస్తువులూ  “భావాల” అధీనంలో వుంటాయని తాత్విక భావవాదం బోధిస్తుంది. యివి మానవుడు  సృష్టించిన ప్రతిదానికి సంపూర్ణ ఆదర్శాలు. మానవుడి కార్యకలాపాలు ఆ  ఆదర్శాల మీదనే  ఆధారపడి వుంటాయి, అతని కృషి ఆ “భావాలని”అనుకరించడంలోనే వుంటుంది, వాటి ఉనికిని అతను యేదో అస్పష్టమైన తీరులో గ్రహిస్తాడు. యీ దృక్పధం ప్రకారం యెక్కన్నో పైన, మనకి పైన, సంకెళ్ల భావం, ఇంటర్నల్ కంబశ్చన్ ఇంజన్‌ భావం, క్షయ క్రిమి భావం, ఆధునిక తుపాకీ భావం, వికారపు కప్పను  గురించిన భావం, సంస్కారహీనునడు, మూషికం, మొత్తం మీద భూమ్మీద వుండే ప్రతి దానికీ, మానవుడు సృష్టించిన ప్రతిదానికీ సంబంధించిన భావం వుంటుందట.యిక యిక్కడనుంచి యీ భావాలన్నిటినీ సృష్టించిన వాడొకడు,యేదో కారణానికి,గద్దనీ పేనునీ, యేనుగునీ కప్పనీ సృష్టించిన వాడొకడు వుంటాడన్న  దాన్ని విధిగా  గుర్తించడమన్నది అనుసరించి వస్తుంది స్పష్టంగా.

    నాకు సంబంధించి మనిషికి బయట భావాలనేవి లేవు. నాకు సంబంధించి  మానవుడు – మానవుడే- సకల వస్తువులనీ, సకల భావాలనీ సృష్టించిన వాడు.అద్భుతాలని చేసేవాడు అతనే, ప్రకృతి శక్తుల భవిష్యత్‌ నాధుడు అతనే. మన ప్రపంచంలో అత్యంత సుందరమైంది మానవుడి శ్రమవల్ల సృష్టింపబడిందే,అతని  కుశలమైన హస్తాలవల్ల నిర్మితమయిందే. మన సకల ఆలోచనలు,భావాలు శ్రమ  క్రమంలో ఉత్పన్నమైనవే. కళా, విజ్ఞానశాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన చరిత్ర మనకి విశ్వాసం కలిగించేది యిది. వాస్తవాన్ని అనుసరించి వస్తుంది ఆలోచన. నేను మానవుడికి  నివాళ్లు అర్పిస్తున్నాను, యేమంటే మన ప్రపంచంలో  అతని హేతువు,అతని వూహ,అతని కల్పనల మూర్తి తప్ప నాకేం గోచరం కాదు.మానవుడి వూహలో కల్పితమే, ఫోటోగ్రఫీలాగా. తేడా యేమిటంటె కెమేరా వాస్తవమైన  దాన్ని చిత్రిస్తుంది. భగవంతుడు అనేవాడు మానవుడు సర్వజ్ఞుడుగా,శక్తివంతుడుగా, పరమ ధర్మ మూర్తిగా వుండగలిగి, వుండాలని కోరుకున్న జీవిగా తను ఊహించిన దాన్ని కనిపెట్టిన ఫోటోగ్రాఫే.

            “పవిత్రమైన” దాన్ని గురించి మాట్లాడాల్సిన అవసరం వుంటే, నేను పవిత్రంగా యెంచే ఒక్కటీ యేమిటంటే మానవుడు తన పట్ల తను చెందే అసంతృప్తి,యింత కంటే అధికుడుగా తయారవాలని అతను చేసే కృషి. మానవుడు తనే ఉనికి  కలిగించి, జీవితాన్ని బంధనం చేసే చెత్త అంతటినీ ద్వేషించడాన్నే పవిత్రంగా  భావిస్తాను. అసూయని, దురాశని, నేరాన్ని రోగాన్ని,యుద్దాలని ప్రపంచంలోని  ప్రజల మధ్య శత్రుత్వాలన్ని రూపు మాపాలనే అతని సంకల్పాన్ని పవిత్రంగా భావిస్తాను. అతని  శ్రమని పవిత్రంగా భావిస్తాను.

    *   *  *

గోర్కీ

Spread the love

One thought on “నేను రాయడం యెలా నేర్చుకున్నాను

  1. అద్భుతమైన వ్యాసం , మక్సీమ్ గోర్కీ ఒక్కరే విరచించగల లోతైన కఠోర వాస్తవాల సమాహారం, కొంత అనువాదం ఇబ్బంది గా వున్నా ఇది గోర్కీ మాట కనుక తలవంచాల్సిందే. సుధీర్ఘ వ్యాసం అందించిన మీకు ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *