ఇది నా ఫార్మల్ ఎడ్యుకేషన్ గురించి కాదు సాహిత్యంతో నా పరిచయం గురించీ, పుస్తకాలతో నా ప్రయాణం గురించీ…
అసలు అక్షరాలు నాకు పరిచయమయ్యింది చెరువు గట్టు బళ్లో .ఆ బడి చెరువు గట్టున వుండేది కాబట్టి చెరువు గట్టు బడి అని పిలిచే వారందరూ .అక్కడి ఉపాధ్యాయులెవరో గుర్తు లేదు కానీ మట్టి నేల మీద మెత్తని మన్ను మీద వేసిన నేలబారు బల్లలపైన కూచోవడం గుర్తు.అక్కడ పిల్లలలో చాలా స్వతంత్ర భావాలుండేవి.కొంతమంది మట్టి కుప్పలుగా చేసి నెత్తి మీద పోసుకునే ఆటలాడితే ,ఇంకొంతమంది పక్క పిల్లల జడరిబ్బన్లు లాగుతూ వుండేవాళ్లు,మరికొంతమంది కళ్లూ చేతులూ తిప్పుతూ కబుర్లు చెబుతూ వుండేవాళ్లు.మేష్టార్ని పిల్లలూ పిల్లలని మేష్టారు యేమీ పట్టించుకునే వారు కాదు .ఎవరి లోకం వారిదే.
కొన్నాళ్లు బళ్లో అలా ఆటలాడుకున్నాక మా ఇంట్లో ఒక రోజు యేదీ అఆలు రాయి అన్నారు అంతే నేను అఆలు తల్లకిందులుగా రాసి పలక తిప్పి చూపించానట!
దాంతో మావాళ్లు ఇక ఈ బడి లాభం లేదని నన్నుఒక చిన్న మేష్టారి గారి బళ్లో వేశారు .ఈ మేష్టారు చిలకమర్తి వారి “గణపతి” లాగా యెంత కొడితే అంత బాగా చదువు వస్తుందని గాఢంగా నమ్మిన మనిషి .ఇక్కడ నేను చూచిరాతలు రాయడం ,శతకాలు వప్ప జెప్పడం అవీ బాగానే చేసేదాన్ని .నేను యెక్కువ శతకాలు చదివింది ఇక్కడే .టకటకా అప్పజెపుతున్నానని అందరికీ మామూలుగా చెప్పే సుమతీ శతకం,వేమన శతకం,కుమారీ శతకం తో పాటు దాశరథీ శతకం,భాస్కర శతకం,,కృష్ణ శతకం ఇంకా ఎన్నో శతకాలు నేర్పారు .కానీ లెక్కల దగ్గర నా గొంతు పట్టుకునేది. ,ఆ వీశలూ,మణుగులూ ,బారువు లూ లెక్కలు తప్పులు జేసి తొడపాశాలూ ,గిచ్చుళ్లూ భరించటం కష్టంగా వుండేది నా ప్రాణానికి(నా కంటే యెక్కువ మా అమ్మకి.రోజూ నాకు స్నానం చేయించేటప్పుడు నా ఒంటి మీద నల్లటి కదుములు చూసి ఆవిడ కళ్లు చెరువులయ్యేవి).ఒక రోజు మా క్లాసులో ఒక అబ్బాయి లెఖ్ఖ సరిగా చేయకపోతే మా మేష్టారు యెత్తిన నరసింహావ తారం చూసి దడుచుకుని ఇక ఆ స్కూలుకు వెళ్లనని మొండికేశాను.అప్పుడు మా పెదనాన్న నా లెఖ్ఖలపుస్తకం చూసి “ఇవేం లెఖ్ఖలు పాతకాలం లెఖ్ఖలు ఠాట్ ఈ బడి వద్దు దెయ్యాల బళ్లో చేరుద్దాం ” అన్నాడు.
అట్లా నేను దెయ్యాల బళ్లో పడిపోయానన్న మాట. దెయ్యాల బడంటే మరేం లేదుగర్ల్స్ స్కూలుకి మరో పేరు.అది అప్పట్లో ఒక పాడుబడిన పెంకుటింట్లో నడుస్తూ వుండేది అందుకే ఆ పేరు.
ఈ బడిలోకి రాంగానే హెడ్ మాస్టారు భ్రమర లింగం గారు నాకొక చిన్న పరీక్ష పెట్టి మూడవ తరగతి నుండీ అయిదో తరగతిలోకి జంప్ చేయించారు .ఆయన చాలా మెత్తగా ,మృదువు గా వ్యవహరించే వారు పిల్లలతో.చేతిలో బెత్తం ఆయనికి అలంకారప్రాయమే ఒక్కనాడూ ఆయనొక పిల్లనో పిల్లవాణ్ణో దండించగా చూడలేదు.అయిదో క్లాసులో వున్నప్పుడే మాకు ఒక పీరియడ్లో సంగీతం చెప్పేవారు.
మా సంగీతం మాస్టారు చాలా వృధ్ధులు మేమక్కడ చదివినన్నాళ్లూ ఆయన మాకు ముక్కు పొడుం పీలుస్తూ “మెల్లగ రావే కుందేలా” అనే ముక్కా,”రార వేణు గోపబాలా రాజిత సద్గుణ జయశీలా “అనే ముక్కా తప్పా రెండోది నేర్పలేదు.పైగా యెవరి దొడ్లో యేం కూరగాయలు పండుతాయో కనుక్కుని అవి తెచ్చిపెట్టమని ఆర్డర్ వేసేవారు.
దెయ్యాల బళ్లో చదువుకునే టప్పుడే మేము జడకోలాటం ఆడే వాళ్లం.పైన దూలానికి కొన్ని తాళ్లు వేళ్లాడుతూ వుండేవి వాటికి కోలాటం కర్రలు కట్టి పట్టుకుని కోలాటం ఆడుతూ ఆ తాళ్లని జడలాగా అల్లుకోవడం విప్పుకోవడం చేసేవారం చాలా యేళ్ల తర్వాత ఈ మధ్య అమెరికా వెళ్లినప్పుడు అక్కడ జర్మన్ సెట్లర్సు “బవేరియన్ ఫెస్టివల్ “అని పండగ చేసుకోవడం చూశాను. అందులో భాగంగా మంచి వయసులో వున్న ఆడపిల్లలు ఈ జడకోలాటం ఆడగా చూడటం భలే ముచ్చటగా అనిపించింది .అన్నట్టు “పాతాళ భైరవి” సినిమాలో రేలంగి “వినవే బాలా నా ప్రేమ గోల” అనే పాటలో “చెట్టాపట్టి జడకోలాటం తొక్కుడు బిళ్లా ఆడే నాతో “అని పాడతాడు గుర్తుందా ?అంటే ఇది ప్రాచీనమైన ఆటేననుకుంటా ఇప్పుడు పిల్లలెక్కడా ఆడుతున్నట్టు కనపడబడదు మరి.
నేను ఐదో తరగతి లో వున్నప్పుడే నెమ్మదిగా న్యూస్ పేపర్ లో వున్న అక్షరాలు కూడబలుక్కుని చదవడం చూసి మా ఇంట్లో వాళ్లు “దీనికి చదవడం వచ్చిందర్రోయ్ “అని అనుకోవడం ఒక జ్ఞాపకం .నాకు కొంచెం చదవడం వస్తోందని గ్రహించి మా నాన్న నాకోసం “బాలల బొమ్మల రామాయణం,భారతం,భాగవతం “కొని తెచ్చాడు.నాకు అది ఒక అపురూపమైన జ్ఞాపకం .నాకంటూ సొంతం గా పుస్తకాలు వుండటం,అందులో బొమ్మలు కూడా వుండటం భలే వుండేది.ఈ నాటికి కూడా ఆ పుస్తకాలు తలుచుకుంటే నా మనసు తియ్యగా అవుతుంది.
ఆ రోజుల్లో కొత్తగా చదవడం మొదలు పెట్టిన పిల్లలకు ఇంట్లో పెద్దవాళ్లు ఆ పుస్తకాలు ఆనవాయితీగా కొని పెట్టే వాళ్లనుకుంటా.ఇప్పుడు టీవీల్లో నర్సరీ రైములు చూపెడుతున్నట్టు.
ఆ తర్వాత మా ఇంట్లో అమ్మా వాళ్లు చదివే వార పత్రికలు ,మాస పత్రికలు చదవడం మొదలు పెట్టాను.ఆరోజుల్లో చక్కగా చదువుకునే సంస్కృతి ఒకటి వుండేది .ఏ వయసు వాళ్లయినా పుస్తకం పట్టుకుని చదువు కోవడం కన పడేది.
వాళ్ల వాళ్ల వయసుని బట్టీ అభిరుచిని బట్టీ పుస్తకాలు చదువుకుంటూ వుండేవాళ్లు.
చిన్న పిల్లలూ,బడికెళ్లే పిల్లలూ చదువుకునేందుకు చందమామ,బాలమిత్ర,బొమ్మరిల్లు,బుజ్జాయి అనే మాస పత్రికలూ ,పంచతంత్రమూ,తెనాలి రామలింగని కథలూ ,రష్యన్ పుస్తకాలూ వుండేవి.
చందమామ కి డిమాండ్ యెక్కువ వుండేది .పేరుకి పిల్లల పుస్తకమే గానీ ఇంటిల్లపాదీ చదివే వాళ్లు .అందులో వచ్చే సీరియల్స్ “శిథిలాలయం,కవలలు,కంచుకోట,అరణ్య పురాణం,దుర్గేశ నందిని “ఇవన్నీ చదువుతూ వేరే లోకాల్లో విహరించే వాళ్లం.బేతాళ కథలు సరేసరి ఒక్క సారి కూడా బేతాళ ప్రశ్నకు సరిఅయిన జవాబు తట్టేది కాదు .ఇవన్నీ రాస్తుంటే శంకర్ వేసిన విక్రమార్కుడి బొమ్మా”పట్టువదలని విక్రమార్కుడు చెట్టుపైనున్న శవాన్ని దించి భుజాన వేసుకుని” అన్న వాక్యాలూ కళ్లముందు కదులుతున్నాయి.నెలకొక్క సారి వచ్చే చందమామ కోసం నెలంతా యెంతగా ఎదురు చూసే వాళ్లమో !.ఇప్పుడు ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టి మరుక్షణం నుండే కామెంట్ల కోసం యెదురు చూడటం తలుచుకుంటే విచిత్రంగా వుంటుంది.ఆనాటి జీవనంలో వున్న నెమ్మదితనమూ,ఒక వస్తువు కోసం యెదురు చూసి అది పొందడంలో వున్న ఆనందమూ కోల్పోయామేమో అనిపిస్తుంది
కొంచెం పెద్ద పిల్లలూ హైస్కూలు కి వచ్చిన వాళ్లూ,యువకులూ కొంత చాటుగా చదివే పుస్తకాలు డిటెక్టివ్ నవలలు .చాటుగా యెందుకంటే స్కూలు పిల్లలు డిటెక్టివ్ నవలలు చదవడానికి తల్లిదండ్రులూ,టీచర్లూ ఒప్పుకునే వాళ్లుకాదు.అవి చదివితే చెడిపోతారు అనేవాళ్లు.
గృహిణులు యెక్కువగా చదివే పుస్తకాలు యేవంటే వారపత్రికలూ,మాసపత్రికలూ,నవలలూ.
మధ్యవయసు మగవాళ్లు చదివేది దినపత్రికలు.ప్రతి రోజూ దినపత్రిక చదివి అరుగుల మీద కూర్చుని రాజకీయాలు చర్చించుకునే గుంపులు కొన్ని వుండేవి. ఇంగ్లీషు చదవడం వచ్చిన మా పెదనాన్న లాంటి వాళ్లు రీడర్స్ డైజెస్ట్ ,ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ,మిర్రర్ లాంటి ఇంగ్లీషు పత్రికలూ,హిందూ పేపరూ చదివేవాళ్లు.
వయసు మళ్లిన బామ్మలూ,అమ్మమ్మలూ కూడా స్త్రీల వ్రతకథలూ,పాటల పుస్తకాలూ,కాశీమజిలీ కథలూ,సహస్రశిరఛ్ఛేద అపూర్వ చింతామణి,వచన భారతం,భాగవతం రామాయణం ,పురాణాలూ ఇలాంటివి చదివేవారు.
మొత్తం మీద యేదో ఒక పుస్తకం లేని ఇల్లూ యేదో ఒక పుస్తకం చదవని మనిషీ దాదాపు కనపడేవారు కాదు.
మళ్లీ నా చదువు దగ్గరికి వస్తే ఆరో క్లాసు చదువుతున్నప్పుడే వారపత్రికలూ మాసపత్రికలూ చదవడం మొదలు పెట్టాను.ఆ రోజుల్లో ఆంధ్ర జ్యోతి,ఆంధ్రప్రభ,ఆంధ్ర పత్రిక ప్రతి వారం వస్తూ వుండేవి.ఒకరింట్లో పత్రిక తెప్పిస్తే,ఇంకొకరింటో జ్యోతి,మరొకరింట్లోప్రభ తెప్పించి ఒకరిదొకరు పంచుకునే వారు
మాలాంటి పిల్లలం ఆ పత్రికలు చేరవేస్తూ వుండేవాళ్లం.అప్పట్లో వచ్చిన సీరియల్సు కొన్ని ఇప్పటికీ గుర్తే.
ఆంధ్ర జ్యోతిలో యద్దన పూడి సులోచనా రాణి “జీవన తరంగాలు” సీరియల్ గా వస్తూ వుండేది.కొమ్మూరి వేణు గోపాలరావుగారి “ఈ దేశంలో ఒక భాగమిది”,”ఒకే రక్తం ఒకే మనుషులు “సీరియల్స్ గా వచ్చినాయి.పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు ఆంధ్రజ్యోతి ఎడిటర్ గా వుండేవారు.ఆయన సారథ్యం లో ఆ వారపత్రిక చాలా ఆసక్తి కరంగా వుండేది.ఆయన పత్రికని చాలా బాగా నడిపేవారు .సంచలనాత్మకమైన సీరియల్ “హిమజ్వాల” (వడ్డెర చండీదాస్ )ప్రచురించింది ఆయనే.ఆ తర్వాత అదే రచయిత రాసిన “అనుక్షణికం” ప్రచురించింది కూడా ఆయనే.
చండీదాస్ గారు “నా నవలలని సీరియలీకరించి కీర్తినీ,అపకీర్తినీ మూటగట్టుకున్నారు పురాణం వారు” అని ఒకచోట రాశారని గుర్తు.
శర్మ గారు రా.వి.శాస్త్రి గారికి యెమర్జన్సీ సమయంలో అవసరానికి పత్రిక యాజమాన్యంచేత ధనసహాయం అందించి,బదులుగా కథలు రాయమని కోరారు.అదుగో అప్పుడు రాసినవే రా.వి .శాస్త్రి గారి “బాకీకథలు”
శాస్త్రి గారు రాసిన అద్భుతమైన నవల “రత్తాలు-రాంబాబు” కూడా జ్యోతిలోనే సీరియల్ గా వచ్చింది.పురాణం వారు,గొల్లపూడి మారుతీ రావు తోనూ,కొమ్మూరి వేణుగోపాలరావు తోనూ కలిసి ఒక గొలుసుకట్టు నవల రాశారు దాని పేరు “ఇడియట్ “అదీ జ్యోతిలోనే ప్రచురితమైంది.శర్మగారు “ఇల్లాలి ముచ్చట్లు” అనే కాలమ్ పురాణం సీత పేరుతో రాసే వారు.అందులో సమకాలీన రాజకీయాలమీద,సమస్యల మీదా చెణుకులుండేవి అవి బాగా పేలేవి.ఇవి కాకుండా నండూరి రామ్మోహనరావు గారు రాసే “నరావతారం”,”విశ్వరూపం”,”విశ్వదర్శనం” సీరియల్సుమానవ పరిణామ క్రమం గురించీ,ఖగోళ శాస్త్రం గురించీ,తత్త్వవేత్తలగురించీ, బోలెడంత విజ్ఞానాన్ని అందించేవి.
తెలుగువారు గర్వంగా ఇవి మాకథలు అని చెప్పుకోదగిన కథలు “అమరావతి కథలు”సత్యం శంకరమంచి గారిచేత వాటిని సింగిల్ పేజీ కథలు గా రాయించి వంద వారాలు ఆంధ్ర జ్యోతిలో ప్రచురించిన ఘనత కూడా పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారిదే
అట్లూరి హజరా గారితో “విరిసిన గులాబీ” అనే సీరియల్ రాయించారు .అదిచక్కని గులాబీ బొమ్మ తో వస్తూ వుండేది.ఆ బొమ్మ వేసింది ఆర్టిస్ట్ చంద్ర గారు అనుకుంటాను.
చలం గారి “మైదానం” సీరియల్ గా పునఃప్రచురించడం ఆ రోజుల్లో ఒక సాహసమే .అలాంటి సాహసాలు చాలా చేశారు శర్మగారు.
మొక్కపాటి నరసింహశాస్త్రి గారి “బారిష్టర్ పార్వతీశం” సీరియల్ వస్తున్నప్పుడు ఇంటిల్లపాదీ చదువుతూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ వుండేవాళ్లం.అందులోని జోకులు పదే పదే ఒకరితో ఒకరం పంచుకుంటూ వుండేవాళ్లం.
పురాణం వారు యేంచేశారంటే “బారిష్టర్ పార్వతీశం” రెండో భాగం కూడా మొక్కపాటి వారి తో రాయించి జ్యోతి లో ప్రచురించారు .అది మొదటి భాగమంత జనరంజకంగా లేదనుకోండి అది వేరే సంగతి.
నా దృష్టిలో శర్మగారు సమర్థుడైన సంపాదకుడు ,యెలాంటి శీర్షికలతో పాఠకుడి మనసుని రంజింపచేయాలో ,పాఠకుడి అభిరుచిని యెలా పెంపొందించాలో బాగా తెలిసిన వ్యక్తి.
ఆయన సారథ్యంలో ఆంధ్రజ్యోతి సర్క్యులేషన్ బాగా పెరిగిందనీ సుమారు లక్ష కాపీలు అమ్ముడయ్యేవనీ ఈ మధ్య వారి మేనల్లుడు బులుసు కామేశ్వరరావు గారు చెప్పగా విన్నాను.
ఇక ఆంధ్ర ప్రభ లో కూడా మంచి మంచి సీరియల్సూ కథలూ వస్తూ వుండేవి.విద్వాన్ విశ్వం గారు సంపాదకుడు గా వుండేవారు.నందుల సుశీలా దేవి,ఎ.అరవింద,కొలిపాక రమామణి,చివుకుల పురుషోత్తం,ఘండికోట బ్రహ్మాజీ రావు మొదలైన వారి రచనలు వస్తూ వుండేవి
విద్వాన్ విశ్వం గారి సంపాదకీయం “మాణిక్య వీణ” చదవడానికి సులువైన భాషలో వుండేది,కానీ చాలా విలువైన విషయాలుండేవి.
ఎ.అరవింద గారి “అవతలి గట్టు”,కొలిపాక రమామణి గారి”ఏటి ఒడ్డున నీటిపూలు”,చివుకుల పురుషోత్తం “ఏది పాపం” ప్రభలో నాకు గుర్తు వున్న సీరియల్స్ .చివుకుల పురుషోత్తం గారి సీరియల్ ఆరోజుల్లో చాలా సంచలనం రేపింది.ఆధ్యాత్మిక కోణంలో ఆ రచన సాగిందని గుర్తు.
ఆంధ్ర పత్రిక లో నేను చదివిన మంచి రచన డా”కేశవ రెడ్డి గారి “ఇన్ క్రెడిబుల్ గాడెస్ “అది చదివి చాలా చలించి పోయాను.ఆ తర్వాత ఆయన రచన యెక్కడ కనపడినా చదివేదాన్ని .”రాముడుండాడు రాజ్జిముండాది”,”స్మశానం దున్నేరు”,బానిసలూ-భగవానువాచ”,”అతడు అడవిని జయించాడు”,”చివరి గుడిసె”,”మునెమ్మ” అన్నీ చదివాను. నిజామాబాద్ వెళ్లినప్పుడు ఆయన్ని పరిచయం చేసుకున్నాను .అప్పుడప్పుడూ ఫోన్ లో మాట్లాడాను .ఆయన కొద్దికాలంలో పోతారనంగా ఫోన్ చేసి ఒక సారి రండమ్మా అని కూడా పిలిచారు .దురదృష్టం పోలేకపోయాను.
మన తెలుగు రచయితలలో యెన్నదగిన రచయిత డా”కేశవ రెడ్డి గారు అలా ఆంధ్ర పత్రిక ద్వారానే నాకు పరిచయమయ్యారు.
(సశేషం)
Chaalaa adbhuthamyna seershika . Very useful naalaanti paamarulaki. Schooldayslo maa intlo Telugu magazines chadavaniche vaallu kaadu . Only chandamama, bommarillu etc allowed. But anyhow hats off to your extraordinary memory power . Schooldays serials antha baagaa perlu, vaati rachayithalu gurthundatam great. Continue this article till you get tired .
Congrats for starting such a good work .,👍👍
Thank u prasuna
చాలా బాగుంది భార్గవీ . చాలా మరచిపోయిన విషయాలు గుర్తుకు వచ్చాయి . విద్వాన్ విశ్వం గారి సంపాదకీయం నాకు బాగా ఇష్టం గా ఉండేది ఆ కాలంలో . మిగతా భాగాల కోసం ఎదురుచూస్తున్నాను
Thank u suryam garu