కేసు విచారణకు వచ్చిందనీ, తనను విజయవాడవచ్చి ఓసారి కలవమనీ అడ్వొకేట్ ఫోన్ చేసి చెప్పేసరికి రాఘవరావు గుండెల్లో రాయిపడ్డట్ట్లైంది. అది ఏడేళ్ళక్రితం హైకోర్టులో వేసిన కేసు. తను రెండునెల్లపాటు పుణెలో చిన్నకొడుకు దగ్గర ఉండి, కొద్ది రోజుల క్రితమే బెంగళూరులో ఉన్న పెద్దకొడుకు దగ్గరికి వచ్చాడు. ఇంతలో ఈ ఫోను! కంటిచూపు తగ్గడంతో ఈ మధ్య ఒంటరి ప్రయాణాలకు జంకుతున్నాడు. పైగా బెంగళూరునుంచి విజయవాడ చిన్నాచితకా దూరం కాదు. అడ్వొకేట్ ను ఓసారి కలసి మాట్లాడిరావడమే కనుక భార్యను వెంటబెట్టుకుని వెళ్లడానికి మనస్కరించలేదు. ‘ఫ్లైట్ లో వెళ్ళు, బుక్ చేస్తా’నని కొడుకు అన్నాడు కానీ; యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్ పోర్ట్ కు వెళ్ళడం; ఎస్కలేటర్లు ఎక్కడం, దిగడం…అదో పెద్ద తలనొప్పి అనిపించి, ‘వద్దు, రైలుకే బుక్ చేయి’ అన్నాడు, ప్రయాణానికి మానసికంగా సిద్ధమవుతూ.
నర్సాపురం వెళ్ళే స్పెషల్ ట్రైన్ లో టికెట్ దొరికింది. ఉదయం పదకొండు గంటలకు రైలు. ఆఫీసు పని ఒత్తిడివల్ల కొడుక్కి తీరిక ఉండదని తెలుసు కనుక, స్టేషన్ లో దింపుతానన్నా వద్దని చెప్పి రాఘవరావు ఆటో చేసుకుని కె. ఆర్. పురం స్టేషన్ కు చేరుకున్నాడు. బ్యాగ్ బుజాన వేసుకుని మనుషుల్ని తప్పించుకుంటూ స్టేషన్ లోకి వెళ్ళాడు. తను ఎక్కవలసిన రైలు ఆగే ఫ్లాట్ ఫామ్ నెంబర్ ఇంకా డిస్ప్లే కాలేదు. ఆ బోర్డువైపే చూస్తూ ఉండిపోయాడు. కాసేపటికి నెంబర్ డిస్ప్లే అయింది. మిగతా ప్రయాణీకుల గుంపులోంచి దారి చేసుకుంటూ మెట్లెక్కి ఫ్లాట్ ఫామ్ కు చేరుకున్నాడు. చివరి రెండు మెట్లు దిగబోతూ తూలిపడబోయాడు. కిందికి చూస్తే కింది మెట్టు బద్దలై అక్కడ ఖాళీ ఏర్పడింది. సరిగ్గా ఆ ఖాళీలో తన అడుగు పడింది. పెద్ద ప్రమాదం తప్పిందనుకున్నాడు. ఆ మెట్టును అలా ఉంచిన రైల్వేవారి బాధ్యతారాహిత్యం మీద కోపమొచ్చింది. ఇక మీదట జాగ్రత్తగా అడుగు వేయాలనుకున్నాడు. కంపార్ట్ మెంట్ నెంబర్ డిస్ప్లే కోసం ఎదురుచూస్తూ కాసేపు గడిపాడు. అది కూడా డిస్ప్లే అవడంతో ఆ చోటుకి చేరుకున్నాడు.
సో ఫార్ సో గుడ్ అనుకున్నాడు. తన పన్నెండో ఏట కాబోలు, విజయవాడ నుంచి అక్క, బావ ఉంటున్న ఏలూరుకు ఒంటరిగా రైలు ప్రయాణం చేసిన అనుభవం గుర్తొచ్చింది. అప్పుడు ధైర్యంగా రైలు ఎక్కాడే కానీ, తీరా రైలు కదిలాక కిక్కిరిసిన అపరిచితుల మధ్య భయంతో ముచ్చెమటలు పట్టాయి. ఎన్నో ఏళ్లనాటి జ్ఞాపకాల పొరల అట్టడుగున ఉన్న ఆ అనుభవం ఇప్పుడీ సమయంలో గుర్తురావడం అతనికి విస్మయం కలిగించింది. వృద్ధ్యాప్యం మరో బాల్యమని అందుకే అన్నారు కాబోలనుకున్నాడు.
ఇప్పుడీ ఒంటరి ప్రయాణం తనకో సవాలుగానూ; తను వేసే ప్రతి అడుగూ, దాటే ప్రతిఘట్టమూ ఒక విజయంగానూ అతనికి అనిపిస్తున్నాయి. మొబైల్ లో టైమ్ చూసుకుంటే పదిన్నర అయింది. రైలు రావడానికి ఇంకా అరగంట వ్యవధి ఉంది. రైలు వచ్చి తను అందులో పడగానే ప్రయాణంలో ఒక ముఖ్యఘట్టం పూర్తవుతుంది; రాత్రి పన్నెండు దాటాక విజయవాడలో దిగి, ముందే బుక్ చేసిన హోటల్ రూమ్ కు చేరుకునే తదుపరి ఘట్టంవరకూ తను నిశ్చింతగా ఉండచ్చనుకున్నాడు.
పదకొండయింది, రైలు రాలేదు. నిమిషాలు గడుస్తూనే ఉన్నాయి, రైలు రాలేదు. రాఘవరావు ఆశ్చర్యపోతున్నాడు. బెంగళూరు మెయిన్ స్టేషన్లోనే రైలు బయలుదేరుతుంది కనుక ఇంత ఆలస్యం కావడానికి వీల్లేదు. అదీగాక దూరప్రయాణం రైళ్ల విషయంలో చాలావరకు సమయపాలనను పాటిస్తారని ఇంతవరకూ అతను అనుకున్నాడు. ఇప్పుడా నమ్మకం తలకిందులైంది.
అంతలో తలెత్తి చూస్తే డిస్ప్లే బోర్డు మీద వేరే రైలు నెంబరూ, కంపార్ట్ మెంట్ నెంబరూ కనిపించాయి. రాఘవరావు ప్యానిక్ అయ్యాడు. ఇతర ప్రయాణీకుల్లో కూడా అదే కనిపించింది. అది నర్సాపురం వెళ్ళే రైలు కాదనీ, వేరే రైలనీ తెలిసాక తేలిక పడ్డాడు. మొత్తానికి గంట ఆలస్యంగా రైలు వచ్చింది. స్పెషల్ ట్రైన్ అనడంలోని అసలు అర్థం అప్పటికి బోధపడింది. రెగ్యులర్ రైళ్ళను ముందు సకాలానికి పోనిచ్చిన తర్వాతే స్పెషల్ ట్రైన్లకు పచ్చజెండా ఊపుతారన్నమాట.
రాఘవరావు రైల్లో పడి తన సీటుకు చేరుకున్నాడు. తనకు అలాట్ అయింది మధ్య బెర్తు. తనకు కుడివైపున కిటికీ దగ్గర బొద్దుగా ఉన్న ఒకాయన కూర్చుని ఉన్నాడు. నుదుట నామం ఉంది. బహుశా తనకన్నా అయిదారేళ్లు చిన్న అయుంటాడనుకున్నాడు. ఎదురు బెర్తు మీద అటు చివర చామనచాయలో ఉన్నఒక యువతి కూర్చుని ఉంది. ముఖాన బొట్టు లేదు. ఎంత వయసు ఉంటుందో ఊహకు అందలేదు. ఎదురుగా సైడ్ లోయర్ బెర్త్ మీద కూర్చుని ఉన్న ఓ యువకుడితో మాట్లాడుతోంది. చూడగానే సీరియస్ టైప్ అనిపించింది.
కొన్ని గంటలపాటు కలసి చేసే ప్రయాణంలో పక్కనా, ఎదురుగా ఉన్న తోటి ప్రయాణికులతో మరీ మాటల్లేకుండా గడపడం భారంగా ఉంటుంది కనుక రాఘవరావు నుదుట నామం ఉన్న వ్యక్తిని, “మీరు ఎక్కడిదాకా?” అని అడిగాడు. ఆయన ఒకసారి రాఘవరావువైపు పరిశీలనగా చూసి, “భీమవరం” అని ముక్తసరిగా సమాధానమిచ్చి ఊరుకున్నాడు. రాఘవరావు నిరుత్సాహం చెందాడు. ఆయన కూడా తనను అదే ప్రశ్న అడిగుంటే సంభాషణ కొంచెం ముందుకు వెళ్లేది. ఆయనకా ఉద్దేశం లేదని అర్థమై, రోజంతా ఈయన పక్కన ఎలా గడపాలా అనుకుని రాఘవరావు దిగాలు పడ్డాడు. అక్కడికీ మరో ప్రయత్నం చేసి చూద్దామని, “మీది లోయర్ బెర్తా?” అని అడిగాడు. ఈసారి ఆయన నోటితో కూడా జవాబు చెప్పలేదు, తల ఊపి ఊరుకున్నాడు. రాఘవరావు ఇక లాభం లేదనుకుని వెంట తెచ్చుకున్న న్యూస్ పేపర్ లోకి తలదూర్చాడు. రైలు కదిలింది.
పేపర్లో ఓ ఆసక్తికరమైన సమాచారం కంటపడింది. అలాంటప్పుడు పెన్నుతో అండర్లైన్ చేసుకోవడం అతనికి అలవాటు. పెన్ను బ్యాగ్ లో అడుగున ఎక్కడో పడేశాడు. నోరు తెరచి నుదుట నామం ఉన్నాయనను అడగడానికి సంకోచించి ఆయన చొక్కా జేబువైపు చూశాడు, పెన్ను కనిపించలేదు. చామనచాయ యువతి, యువకుడితో మాటలాపి మొబైల్ చూసుకుంటోంది. రాఘవరావు ధైర్యం చేసి, “మీ దగ్గర పెన్నుందా?” అని ఆమెను అడిగాడు. ఆమె వెంటనే తన హ్యాండ్ బ్యాగ్ తెరచి పెన్ను ఇచ్చింది. రాఘవరావు మళ్ళీ పేపర్లో మునిగాడు.
అంతలో ఇద్దరు యువతులు సూట్ కేసులతో, బ్యాగ్ లతో ఎదురు బెర్త్ వైపు వచ్చారు. ఒకామె బొద్దుగా, ఎర్రగా ఉంది; ఇంకొకామె కూడా అదే రంగులో, బక్కపలచగా ఉంది. ఆమె సామాను బెర్త్ కిందికి తోసి సర్డింది. ఇద్దరూ ఎదురు బెర్త్ మీద కూలబడ్డారు. మిగతా నలుగురు కొత్తవాళ్ళ మధ్యా కాస్త బెరుకు పడుతూ ఉర్దూలో మాట్లాడుకోవడం ప్రారంభించారు. బహుశా తెలుగు రాని ముస్లింలు అయుంటారని రాఘవరావు అనుకున్నాడు. అంతలో ఆ బక్కపలచని అమ్మాయి, పక్కనే ఉన్న చామనచాయ అమ్మాయితో తెలుగులో మాట కలిపింది; అది కూడా పక్కా గోదావరిజిల్లా యాసలో. మేమిద్దరం అక్కచెల్లెళ్లమనీ, వాళ్ళతో వాళ్ళ అమ్మ కూడా ఉందనీ, ముగ్గురికీ వేర్వేరు చోట్ల బెర్త్ లు అలాట్ అయ్యాయనీ, ఇక్కడి అప్పర్ బెర్త్ అక్కదనీ చెప్పింది. డిస్ప్లే బోర్డ్ మీద వేరే ట్రైన్ నెంబరూ, కంపార్ట్ మెంట్ నెంబరూ కనిపించడంతో తాను ఎలా ప్యానిక్ అయిందో చెప్పుకుంటూవచ్చింది; ఇప్పటికీ ఆ ఆందోళననుంచి తేరుకోనట్టే కనిపించింది. అక్క కూతురు ఈ మధ్యనే బెంగళూరులో ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరిందట, తన కూతురు ఇక్కడే ఇంటెర్న్ షిప్ చేస్తోందట.
మిగతావారిని కూడా మధ్యమధ్య ఓరగా చూస్తూ ఆ అమ్మాయి గలాగలా మాట్లాడుతూనే ఉంది. అక్క మాత్రం కొత్తవాళ్లతో బెరుగ్గానూ, ప్రథమమౌనంతోనూ ఉండే టైపులా కనిపించింది.
కాసేపటి తర్వాత, లంచ్ చేసి వస్తామని చెప్పి, అక్కను తీసుకుని ఆ బక్కపలచని అమ్మాయి తల్లి కూర్చున్నవైపు వెళ్లిపోయింది. రాఘవరావు పేపర్ మూసేసి పెన్ను చామనచాయ అమ్మాయికి ఇచ్చేసి ధన్యవాదాలు చెప్పాడు. అతనికీ ఆకలిగా ఉంది. భార్య పులిహోర, పెరుగన్నం ఉన్న రెండు డబ్బాలు, చిన్న మంచినీళ్ళ సీసా చేతిసంచీలో పెట్టి ఇచ్చింది. అపరిచితుల మధ్య ఒక్కడూ లంచ్ చేయడానికి రాఘవరావు మొహమాటపడ్డాడు. కాసేపటి తర్వాత నుదుట నామం ఉన్నాయన లేచి ఎటో వెళ్ళాడు. ఎదురుగా ఉన్న చామనచాయ అమ్మాయి సైడ్ లోయర్ బెర్త్ మీద ఉన్న యువకుడితో మళ్ళీ మాటల్లో పడింది. రాఘవరావు మొహమాటం చంపుకుని కిటికీవైపుకు జరిగి పులిహోర, పెరుగన్నం బాక్సులు తెరచి తినడం ప్రారంభించాడు. అంతలో నుదుట నామం ఉన్నాయన తిరిగి వచ్చి రాఘవరావు భోజనం చేస్తుండడం చూసి, యువకుడు కూర్చున్న సైడ్ లోయర్ బెర్త్ మీద కూలబడ్డాడు. రాఘవరావు భోజనం చేసి చేయి కడుక్కుని వచ్చాక, లేచి వచ్చి అతని పక్కన కూర్చున్నాడు. రాఘవరావు సీటు ఖాళీ చెయ్యబోతే వద్దని వారించాడు.
“వాటర్ బాటిల్స్ ఎక్కడా అమ్మి రావడం లేదు” అన్నాడు తనలో తను గొణుక్కుంటున్నట్టుగా.
“మీకు వాటర్ కావాలా?” అడిగింది చామనచాయ అమ్మాయి.
“అవును. గొంతు ఎండిపోతోంది. వాటర్ బాటిల్స్ అమ్మేవాడు కనిపించలేదు” అన్నాడు.
“అయ్యో, నా దగ్గర బాటిల్ ఉంది, ఇస్తాను ఉండండి” అంటూ ఆ యువతి క్యారీబ్యాగ్ లోంచి బాటిల్ తీసి అందించింది.
ఆయన మొహమాటపడుతూ అందుకుని ఓ గుక్కెడు నీళ్ళు తాగి, తిరిగి ఇవ్వబోయాడు.
“ఉంచండి. ఇంకా తాగండి. బాటిల్ మీ దగ్గరే ఉంచుకోండి. వాటర్ బాటిల్స్ వచ్చినప్పుడు కొంటాను” అని ఆ యువతి అంది.
“వద్దండి. వచ్చినప్పుడు నేను కూడా తీసుకుంటాను” అంటూ ఆయన బాటిల్ ఇచ్చేశాడు.
“నేను అటు జరుగుతాను, మీరు ఇటు వచ్చి లంచ్ చేయండి” అన్నాడు రాఘవరావు ఆయనతో.
“నా లంచ్ అయిపోయింది. మీరు కూర్చోండి” అన్నాడాయన.
బక్కపలచని అమ్మాయి లంచ్ చేసి ఒక్కతే తిరిగొచ్చింది. “స్పెషల్ ట్రైన్ అవడంవల్ల నేమోనండి, వెండర్స్ రావడం లేదు” అంటూ ఈసారి రాఘవరావుతో మాట కలిపింది. ఆ తర్వాత డిస్ప్లే బోర్డ్ మీద వేరే ట్రైన్ నెంబరూ, కంపార్ట్ మెంట్ నెంబరూ రావడంతో తను ఎలా ప్యానిక్ అయిపోయిందో మరోసారి ఏకరవుపెట్టి, స్పెషల్ ట్రైన్ల వల్ల ఇలాంటి అవస్థలుంటాయి కాబోలంది.
“నేనూ ప్యానిక్ అయ్యాను” అన్నాడు రాఘవరావు.
“నేనెప్పుడూ ఎక్కే రైలూ, దిగే రైలే. నాకివన్నీ అలవాటే” అంది చామనచాయ అమ్మాయి నవ్వుతూ.
“అవునా? ఇలాగే ప్రయాణాల్లో మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే అనుకున్నాను” అన్నాడు రాఘవరావు.
“చూసే ఉంటారండి. నా కింద ఎనభై స్కూళ్ళు ఉన్నాయి. వాటిని విజిట్ చేస్తూ ఉంటాను” అంది.
“అయితే మీరు కూడా ఎడ్యుకేషన్ ఫీల్డే అన్న మాట. నేను కూడా టీచర్ గా పని చేస్తున్నాను” అంది బక్కపలచని అమ్మాయి.
“అవునా? నేను కూడా టీచర్ నే కానీ, టీచర్లకు టీచర్ ని. లేటెస్ట్ టీచింగ్ మెథడ్స్, సబ్జెక్ట్స్ లో టీచర్లకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను” అంది చామనచాయ అమ్మాయి నవ్వేస్తూ.
“అయితే మీరు ఒకవిధంగా కన్సల్టెంట్ అన్నమాట” అన్నాడు రాఘవరావు.
“అవునండి. లేటెస్ట్ టీచింగ్ మెథడ్స్, సబ్జెక్ట్స్ లో టీచర్లకు శిక్షణ ఇవ్వడం నాకు పెద్ద పేసన్. మొదట్లో టీచర్లనుంచి ఎంకరేజ్ మెంట్ రాలేదు. క్రమంగా ఆ అవసరాన్ని గుర్తించారు. నా క్లైంట్ల సంఖ్య పెరిగిపోయింది. దాంతో ఎప్పుడూ ప్రయాణాల్లోనే ఉంటాను. ఇందులోనే నాకు ఎంతో తృప్తి ఉంది” అందా యువతి. ఆ తర్వాత, బక్కపలచని అమ్మాయివైపు తిరిగి, “మీరు ఎక్కడ పనిచేస్తున్నారు” అని అడిగింది.
“నేను వెస్ట్ గోదావరి జిల్లా పరిషత్ స్కూల్లో పనిచేస్తున్నాను(ఊరు పేరు చెప్పింది). బయాలజీ టీచర్ని. అంతకుముందు ఓ కార్పొరేట్ స్కూల్లో(పేరు చెప్పింది) ప్రిన్సిపాల్ గా పనిచేశాను” అంది.
“అవునా? నేను కూడా వెస్ట్ గోదావరి జిల్లా పరిషత్ స్కూల్లోనే పనిచేస్తున్నాను(ఊరు పేరు చెప్పాడు). హిందీ టీచర్ని” అన్నాడు నుదుట నామం ఉన్నాయన, మాట కలుపుతూ.
“అయితే మనందరం ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంటే అన్నమాట” అంది చామనచాయ యువతి గట్టిగా నవ్వేస్తూ. మాట మాటకీ నవ్వడం ఆమెకు అలవాటు కాబోలని రాఘవరావు అనుకున్నాడు. తర్వాత అతనివైపు తిరిగి “మీరేం చేసేవారూ?” అని అడిగింది.
“నేను కూడా జిల్లా పరిషత్ స్కూల్లో కొంతకాలం పనిచేశాను. తర్వాత జర్నలిజంవైపు వెళ్ళాను” అన్నాడు రాఘవరావు చిరునవ్వుతో.
“ఓహ్. అయితే మీరు కూడా మా డిపార్ట్ మెంటే నన్నమాట. బలే కలిశామే” అంది నవ్వేస్తూ చామనచాయ అమ్మాయి. ఆ తర్వాత, “జిల్లా పరిషత్ లో ఉద్యోగం వదిలేసి జర్నలిజం వైపు ఎందుకు వెళ్లారు?” అని అడిగింది కుతూహలంగా.
“ఏదో అలా జరిగింది” అన్నాడు రాఘవరావు చిరునవ్వుతో, దాని వెనక చాలా పెద్ద కథే ఉన్నట్టు ధ్వనిస్తూ .
“జర్నలిజం మీద ఎంత పేసన్ లేకపోతే మీరు అటువైపు వెడతారు? నేనూ మీలానే” అంది చామనచాయ అమ్మాయి.
“అందుకే కాబోలు. మీరు పేపర్ చదువుతూ అక్కడక్కడ అండర్లైన్ చేసుకుంటున్నారు” అన్నాడు నుదుట నామం ఉన్నాయన రాఘవరావువైపు కుతూహలంగా చూస్తూ.
రాఘవరావు నవ్వి ఊరుకున్నాడు.
ఎప్పుడూ ఏదో చదువుకోవడమో, రాసుకోవడమో తప్ప ఖాళీగా గడపడం ఎరగని రాఘవరావు పదమూడు గంటలపాటు రైల్లో ఎలా గడపాలా అనుకుని మొదట్లో బెంగ పడ్డాడు. విండో సీటు దొరికుంటే ఏ పుస్తకమో చదువుతూ కాలక్షేపం చేసేవాడు. మధ్య సీటు అందుకు సౌకర్యంగా ఉండదు. ఇప్పుడు గంటలను నిమిషాలుగా మలుస్తూ కాలం త్వరగానే దొర్లిపోతుందనిపించి తేలిక పడ్డాడు. ఆ అక్కచెల్లెళ్లిద్దరూ ఆకివీడులో దిగుతారనీ, సైడ్ లోయర్ మీద కూర్చున్న యువకుడూ, చామనచాయ అమ్మాయీ భీమవరంలో దిగుతారనీ మాటల సందర్భంలో తెలిసింది. ఆ యువకుడి పేరు తప్ప మిగితావాళ్ళ పేర్లు కూడా తెలిసాయి. చామనచాయ అమ్మాయి పేరు అనిత, తను క్రిస్టియన్; బక్కపలచని అమ్మాయి పేరు నస్రీన్, ముస్లిం; నుదుట నామం ఉన్నాయన పేరు నమ్మాళ్వార్. సైడ్ లోయర్ బెర్త్ మీద కూర్చున్న యువకుడు ఎప్పుడైనా అనితతో మాట కలపడం తప్ప మిగతా సమయంలో మొబైల్ లోకి చూస్తూ గడుపుతున్నాడు.
అనిత జర్నలిజం గురించి, పత్రికల పనితీరు గురించి, పత్రికల్లో ఉండే వివిధ విభాగాల గురించి కుతూహలంతో ప్రశ్నలు వేయడం ప్రారంభించింది. ఆమె ఆసక్తి రాఘవరావును ముగ్ధుణ్ణి చేసింది. ఆమె విద్యారంగం వైపు కాకుండా ఈ రంగంలోకి వచ్చున్నా ఇక్కడా రాణించి ఉండేదనుకున్నాడు. ఆమె ప్రశ్నలకు అతను జవాబు చెబుతుంటే అందరూ ఆసక్తిగా వింటూ ఉండిపోయారు.
అంతలో నమ్మాళ్వార్ మొబైల్ మోగింది. ఆయన స్పీకర్ ఆన్ చేసి మాట్లాడడం ప్రారంభించాడు. అవతల ఫోన్ లో ఆయన భార్య. “రైల్లో సౌకర్యంగానే ఉందా” అని అడిగేసరికి, “ఏం సౌకర్యం, మంచినీళ్లు లేవు” అంటూ అంతవరకూ ఉగ్గబట్టుకున్న అసంతృప్తిని ఒక్కసారిగా వెళ్ళగక్కాడు; అందుకు ఆవిడే బాధ్యురాలైనట్టు! దాంతో మిగతా వారి ముఖాల్లో గుంభనంగా నవ్వులు విరిసాయి. “అయ్యో, అలాగా, వాటర్ బాటిల్స్ అమ్మేవాళ్లు రాలేదా? వస్తారు లెండి. ఇంతకీ తిన్నారా లేదా? ఎంతవరకూ వెళ్లారు, మందు వేసుకున్నారా?” అంటూ అవతల ప్రశ్న మీద ప్రశ్న వేస్తుంటే ఆయన చికాకు పడుతూ ముక్తసరిగా సమాధానం చెప్పి ఫోన్ కట్ చేశాడు.
మాటల సందర్భంలో తెలిసిందేమిటంటే, బెంగళూరులో ఆయన బావమరిది, అత్తగారు ఉన్నారు. అత్తగారి మోకాలికి శస్త్రచికిత్స జరిగితే ఈయన భార్యను వెంటబెట్టుకుని బెంగళూరు వెళ్ళాడు. భార్యను అక్కడే వదిలేసి ఇప్పుడు ఒక్కడూ ఇంటికి తిరిగి వెడుతున్నాడు. తను డయాబెటిక్.
సంభాషణ డయాబెటిస్ వైపు, ఇతర ఆరోగ్యసమస్యలవైపు మళ్ళింది.
“నేను ఇరవయ్యేళ్లుగా డయాబెటిక్” అంది అనిత.
మిగతా ముగ్గురూ ఆమెవైపు ఆశ్చర్యంగా చూశారు. ఆరోగ్యంగా, చురుగ్గా, ఉత్సాహంగా కనిపించే ఆ అమ్మాయి డయాబెటిక్ అంటే నమ్మశక్యం కాలేదు.
“ప్రెగ్నెన్సీలో వచ్చింది. జాగ్రత్తలు తీసుకోలేదు. దాంతో సెటిలైపోయింది. ఇన్సులిన్ తీసుకుంటాను” అంది నవ్వుతూ, అదేదో చిన్నవిషయమైనట్టు.
రాఘవరావు ఆమె వయసు అంచనా వేయడానికి మొదటే ప్రయత్నించాడు కానీ అతని వల్ల కాలేదు. ఇప్పుడు ఇరవయ్యేళ్ళ కొడుకో, కూతురో ఉన్నారు కనుక నలభై దాటుంటుందనుకున్నాడు. కానీ చూడ్డానికి అంతకన్నా చిన్నదిగా కనిపిస్తోంది. ఆమె ఒడ్డూ, పొడవూ, ముఖకవళికల్ని చూస్తుంటే తన మేనగోడలు గుర్తొస్తోంది.
“టాబ్లెట్స్ కన్నా ఇన్సులిన్ మంచిది” అంటూ, ఎందుకు మంచిదో అనిత చెప్పుకుంటూ వచ్చింది. ఆ తర్వాత నమ్మాళ్వార్ వైపు తిరిగి, “డయాబెటిస్ ఒక డిజార్డరే తప్ప రోగం కాదండీ. దానికి భయపడక్కర్లేదు. ఎప్పుడూ యాక్టివ్ గా ఏదో పనిలో ఇన్ వాల్వ్ అవడమే దానికి అసలైన మందు. అందుకే నేనెప్పుడూ ఏదో ఒక యాక్టివిటీలో ఉంటాను. డయాబెటిక్ అన్న విషయాన్నే నా ఆలోచనల్లోకి రానివ్వను. డయాబెటిస్ ఉన్నవాళ్ళు పళ్ళు తినకూడదనీ, ఇంకోటి తినకూడదనీ అనడం కూడా తప్పే. అన్నీ తినాల్సిందే, లేకపోతే నీరసించిపోయి కొత్త రోగాలు తెచ్చుకుంటాం. నేనైతే అన్నీ తింటాను. అయినా షుగర్ కంట్రోల్ లోనే ఉంటుంది” అంటూ క్లాస్ తీసుకుంది.
నస్రీన్ కూడా ఉత్సాహంగా సంభాషణలోకి దిగిపోయింది. వాళ్ళ అమ్మ హెర్నియాతో ఎలా ఇబ్బంది పడిందో, ఆపరేషన్ ఎలా జరిగిందో, ఎలా పునర్జన్మ ఎత్తిందో చెప్పుకుంటూ వచ్చింది.
“నాకు షుగర్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ లే” వని రాఘవరావు అనేసరికి మిగతా ముగ్గురూ ఆశ్చర్యంగానూ, అడ్మైరింగ్ గానూ అతనివైపు చూశారు.
“మీరు మా అందరికన్నా ఆరోగ్యవంతులు, అదృష్టవంతులు” అని అనిత అంది.
“అందుకే మీరు స్మార్ట్ గా ఉన్నారు. మా నాన్న కూడా మీలానే బక్కపలచగా ఆరోగ్యంగా ఉంటారు” అంటూ నస్రీన్ మొబైల్ తెరచి గడ్డంతో ఉన్న వాళ్ళ నాన్న ఫోటో చూపించింది.
నమ్మాళ్వార్ మొబైల్ మళ్ళీ మోగింది. యథాప్రకారం స్పీకర్ ఆన్ చేశాడు. అవతల కొడుకు! “నాన్నా, ఎలా ఉంది ప్రయాణం, ఎంతవరకూ వచ్చావు?” అని అడుగుతున్నాడు. “ఏం ప్రయాణం, మంచినీళ్ళు దొరకడం లేదు. ట్రైన్ లోకి ఏదీ అమ్మి రావడం లేదు” అంటూ నమ్మాళ్వార్ మరోసారి రికార్డ్ ప్లే చేశాడు. మిగితావాళ్లు ఒకరి ముఖాల్లోకి ఒకరు చూసుకుని నిశ్శబ్దంగా నవ్వుకున్నారు. “అలాగా నాన్నా, నేను ఆర్డరిచ్చి నీకు ట్రైన్లో మంచినీళ్ళ బాటిల్ అందేలా చూస్తాను ఉండు” అని అనునయంగా అన్నాడు. వాళ్ళ సంభాషణ వింటుంటే తండ్రీ-కొడుకుల పాత్రలు తారుమారైనట్లు అనిపించింది.
రాఘవరావు మాట్లాడుతున్నాడన్న మాటే కానీ అరగంట నుంచీ అతని నాలుక పీకుతోంది. సాయంత్రం మూడున్నర దాటిందంటే టీ పడాల్సిందే, లేకపోతే దేని మీదా ధ్యాస నిలవదు. కానీ టీ, కాఫీ కేకలు ఎక్కడా వినిపించడంలేదు. ఇక ఉండబట్టలేక, “టీ, కాఫీలు అమ్మేవాడే కనిపించడం లేదు. ఇదే ఈ ట్రైన్ స్పెషాలిటీ కాబోలు” అన్నాడు దిగాలుగా.
అనిత వెంటనే అతని పరిస్థితిని అర్థం చేసుకుంది. “ఆంధ్రలోకి అడుగుపెట్టామండి. వచ్చే స్టేషన్ లో టీ దొరకచ్చు” అంది.
ఆ వచ్చే స్టేషన్ కోసం రాఘవరావు ఆశగా ఎదురుచూశాడు. స్టేషన్ వచ్చింది, వెళ్లింది, టీ అమ్మేవాడి జాడలేదు. మళ్ళీ వచ్చే స్టేషన్ దాకా ఆగాల్సిందే, అదెప్పటికొస్తుందో అనుకుంటూ డీలాపడిపోయాడు.
అంతలో మళ్ళీ నమ్మాళ్వార్ ఫోన్ మోగింది. స్పీకర్ లో అవతలి గొంతు వినిపిస్తోంది. ఈసారి కూతురు. “నాన్నా రైల్లో సదుపాయంగా ఉందా? ఎక్కడిదాకా వచ్చావు?” అని అడుగుతోంది. మళ్ళీ ఆయన రికార్డ్ ఆన్ చేశాడు. “ఏం సదుపాయమో ఏమిటో, మంచినీళ్లు దొరకడం లేదమ్మా” అన్నాడు. “అదేమిటి? రైల్లో వాటర్ బాటిల్స్ అమ్ముతారు కదా…” అంది కూతురు. “అమ్ముతారమ్మా. కానీ ఇందులో అమ్మడంలేదు. ఇదో దిక్కుమాలిన రైలు. పైగా స్పెషల్ రైలట” అన్నాడాయన నిస్పృహగా. “అలాగా? స్టేషన్లోనైనా దొరుకుతాయి నాన్నా. ఎవరి హెల్పైనా తీసుకో” అంది. “సరేలే” అంటూ ఆయన ఫోన్ కట్ చేశాడు.
ఇంకో స్టేషన్ వచ్చింది. ఈసారి రాఘవరావు లేచి కంపార్ట్ మెంట్ డోర్ దాకా వెళ్ళి టీ అమ్మేవాళ్ళు కనబడతారేమోనని ఆశగా వెదికాడు. ఎవరూ కనిపించలేదు. దూరంగా క్యాంటీన్ లాంటిది ఏదో కనిపించింది కానీ రైలు కదిలిపోతుందేమో నన్న శంకతో దిగి వెళ్లడానికి సాహసించలేకపోయాడు. అనుమానించినట్టే రైలు కదిలింది. ఉసూరుమంటూ వెనుదిరిగి చూసేసరికి కంపార్ట్ మెంట్ అవతలివైపునుంచి అనిత, నస్రీన్ వస్తూ కనిపించారు. ఇద్దరి చేతుల్లోనూ రెండేసి వాటర్ బాటిల్స్ ఉన్నాయి. వెంట కెటిల్ తో టీ అమ్మే కుర్రాడు!
రాఘవరావు కళ్ళు ఆనందంతోనూ, ఆశ్చర్యంతోనూ మెరిశాయి. “ఇదిగో, మీకు టీ వచ్చేసింది” అని అనిత రాఘవరావుతో ఉత్సాహంగా అని, ముందు అతనికి టీ ఇప్పించి, ఆ తర్వాత ఆ యువకుడితో సహా అక్కడున్న మిగతా ముగ్గురికీ సెర్వ్ చేయించి, అరడజను టీలకూ తనే డబ్బు చెల్లించింది. రెండు కప్పులు తన చేతుల్లో ఉంచుకుని రాఘవరావువైపే చూస్తూ, అతని కప్పు ఖాళీ కాగానే, “మీకు టీ సరిపోయి ఉండదు. మీకోసం ఎక్స్ట్రా కప్పు తీసుకున్నాను” అంటూ తన చేతిలో ఉన్న ఓ కప్పును అతనికి అందించి, ఆ తర్వాత తను టీ తాగడం ప్రారంభించింది. .
నిజంగానే రాఘవరావుకి మొదట ఇచ్చిన ఆ ఒక్క కప్పు టీ సరిపోలేదు. తన అలవాటు గురించిన ఆమె అవగాహనకు, ఆమె చూపిన కన్సర్న్ కు రాఘవరావు విస్మితుడవుతూనే ఆ రెండో కప్పు కూడా పూర్తిచేశాడు. అది గొప్ప సాయం కాకపోవచ్చు; కానీ సమయానికి అందిన సాయం. ఆ అమ్మాయి పట్ల కృతజ్ఞతతో అతని మనసు నిండింది. మేనగోడలు మళ్ళీ గుర్తొచ్చింది.
తనూ, అనితా తెచ్చిన వాటర్ బాటిల్స్ ను నస్రీన్ విండో దగ్గర ఉన్న స్టాండ్ మీద ఉంచి, “ఇదిగో, మీకు వాటర్ బాటిల్స్ రెడీ” అని నమ్మాళ్వార్ తో అంది. ఆ మాట అంటున్నప్పుడు చురుకైన ఆ కళ్ళల్లోని అల్లరి నవ్వును రాఘవరావు గమనించి తను కూడా నవ్వుకున్నాడు.
వాళ్ళిద్దరూ కలసి వెళ్ళి టీ అమ్మే కుర్రాణ్ణి, వాటర్ బాటిల్స్ నూ తీసుకురావడంలో ఏదో మిస్టరీ, గూడుపుఠాణీ ఉన్నట్టు రాఘవరావుకి అనిపించింది. అప్పటికే వాళ్ళిద్దరి మధ్యా చనువు ఏర్పడి, ఒకరిపై ఒకరు జోకులేసుకునేవరకూ వెళ్ళడం గమనించాడు కానీ; తన టీ సమస్యను, నమ్మాళ్వార్ మంచినీళ్ళ సమస్యను పరిష్కరించడానికి ఎప్పుడు కూడబలుక్కున్నారో అతని ఊహకు అందలేదు. వయసు మీద పడిన తమ ఇద్దరి బాగోగులూ చూసుకోవలసిన బాధ్యత ఆ రైల్లో ఉన్నంతసేపూ తమదే అయినట్టూ, ఆమేరకు ఇద్దరూ జాయింటుగా తీర్మానించుకుని రంగంలోకి దిగినట్టూ వారి ప్రవర్తనను బట్టి అతనికి అనిపించింది. అపరిచితులు కాస్తా కొన్ని గంటల్లో పరిచితులుగానే కాక, సన్నిహితులుగా మారిపోవడం అతన్ని ఆశ్చర్యపరిచింది.
రాఘవరావు మనసులో మళ్ళీ మేనగోడలు మెదిలింది. అనితను చూసీచూడగానే తన మేనగోడల్లా ఉందని అనుకున్నాడు కానీ, ఆ మాట ఆమెతో అనడానికి సంకోచించాడు. ఇప్పుడా మాట అనమని మనసు తొందరపెట్టింది. “నా మేనగోడలు అచ్చం మీలానే ఉంటుం” దంటూ వాట్సప్ లో ఉన్న మేనగోడలు ఫోటో అనితకు చూపించాడు. అనిత ఆ ఫోటోవైపు ఆసక్తిగా చూసి, “అవుననుకుంటా” అంటూ గట్టిగా నవ్వేసింది.
టీ పడిన తర్వాత మళ్ళీ కబుర్లు ఊపందుకున్నాయి. తన మంచినీళ్ళ సమస్య తీరినందుకు కాబోలు ఈసారి నమ్మాళ్వార్ మాటల్లో చొరవ చూపాడు. ఆవైపు అనిత, నస్రీన్ మాట్లాడుకుంటుంటే తను రాఘవరావుతో ముచ్చట్లు పెట్టుకున్నాడు. స్కూళ్ళలో పరిస్థితులు, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, విద్యార్థుల సంఖ్య వగైరా విషయాలు వాళ్ళ సంభాషణలో దొర్లాయి. కాసేపటికి టాపిక్ వ్యక్తిగత విషయాలవైపు వెళ్లింది. వాళ్ళ నాన్నగారు, అమ్మగారు, మరో ఇద్దరు దగ్గరి బంధువులతో కలసి కాశీయాత్రకు వెళ్లారట. వాళ్ళు ఎక్కిన ఆటో ఓ గుట్ట ఎక్కుతూ తిరగబడిందట. నాన్నగారు, ఇంకొకరు అక్కడికక్కడే చనిపోయారట. అమ్మగారు ప్రాణాలతో బయటపడ్డారట. మృతదేహాలను రప్పించడానికి అప్పుడు కేంద్రంలో మంత్రిగా ఉన్న ఒక తెలుగాయన సాయాన్ని అర్థించారట కానీ, సాయం లభించలేదట. తామే ఫ్లైట్ లో వెళ్ళి తీసుకొచ్చారట.
వింటూ రాఘవరావు ఆయన ముఖంలోకి పరిశీలనగా చూశాడు. అది మామూలు దుఃఖమూ, మామూలు ఆపదా కాదు; నిలుచున్నచోటే భూకంపం వచ్చి నిలువునా లోపలికి లాక్కునేంత ఘోరవిపత్తు. ఈ మనిషి ఎలా తట్టుకోగలిగాడో అనుకున్నాడు. ఆ దుఃఖం నుంచి బయటపడి ఈయన మామూలు మనిషి కావడానికి చాలా కాలమే పట్టి ఉండచ్చనిపించింది.
ఆ తర్వాత సంభాషణ నస్రీన్, నమ్మాళ్వార్ల మధ్యకు మారింది. ఇద్దరూ ఒకే జిల్లా పరిషత్ లో పనిచేస్తున్న టీచర్లు కావడంతో, ఇద్దరికీ తెలిసిన టీచర్ల పేర్లు మాటల్లో దొర్లుతున్నాయి. వాళ్ళల్లో మొయినుద్దీన్ అనే పేరు రాగానే నమ్మాళ్వార్ మొహం చాటంతయింది. మొయినుద్దీనూ, తనూ కలసి పనిచేశామనీ, తనకు ఎంతో ఆప్తుడనీ అంటూ ఉత్సాహంగా తమ ఇద్దరి స్నేహం గురించీ చెప్పుకుంటూవచ్చాడు. తను డయాబెటిక్ అని తెలుసు కనుక అతని కన్ను ఎప్పుడూ తన మీదే ఉండేదట. తను తిన్నాడా, మందు వేసుకున్నాడా దగ్గరనుంచీ అన్నీ ఆరా తీస్తూ ఉండేవాడట. వాళ్ళింట్లో చేసే ఖీర్ తనకు చాలా ఇష్టమట. తనకోసం ప్రత్యేకంగా ఖీర్ చేయించి తీసుకొచ్చేవాడట. ఈ వైష్ణవబ్రాహ్మణుడికీ, ఆ ముస్లింకీ మధ్య స్నేహబంధం గురించిన ఆ ముచ్చట్లు రాఘవరావుకు అబ్బురం గొలిపాయి.
అంతలో మళ్ళీ నమ్మాళ్వార్ ఫోన్ మోగింది. అవతల వాళ్ళ అమ్మగారు! ఆయన యథాప్రకారం మంచినీళ్ళ రికార్డ్ ప్లే చేస్తుంటే మిగతా నలుగురి మొహాల్లో మళ్ళీ నవ్వులు విరబూసాయి. రైల్లో మంచినీళ్లు దొరక్కపోవడం అనే దారుణం ఆయన బుర్రలో బలంగా ముద్రపడిపోయిందనీ, ఎదురుగా ఉన్న అన్ని బాటిళ్ళ మంచినీళ్లు కూడా ఆ ముద్రను తుడవలేకపోయాయనీ, జీవితంపట్ల సర్దుబాటుధోరణి కన్నా ఆయనకు ఫిర్యాదులే ఎక్కువ ఉన్నట్టున్నాయనీ రాఘవరావు అనుకుని నవ్వుకున్నాడు. కుటుంబసభ్యులు ఒక్కొక్కరే ఫోన్లు చేస్తూ ఆయన ప్రయాణం గురించి వాకబు చేస్తున్నారంటే, బహుశా ఆయనకు ఒంటరి ప్రయాణాల అలవాటు తక్కువనీ; ఆయనది, ఒకరిపట్ల ఒకరికి కన్సర్న్ ఎక్కువున్న కుటుంబం కూడా అయుంటుందనీ అనిపించింది.
చూస్తూ ఉండగానే సంభాషణ పిల్లలవైపు మళ్ళి, పిల్లల పెంపకంపై అనిత క్లాస్ తీసుకోవడం ప్రారంభించింది. తల్లిదండ్రులు ఎంత ఉద్యోగస్థులైనా పిల్లల్ని పట్టించుకోవాలనీ, రోజులో కొంతసేపైనా వాళ్ళతో గడపాలనీ, తను అదే చేస్తుంటాననీ, ప్రయాణాల్లో ఉన్నప్పుడు కూడా రోజూ సాయంత్రం టంచన్ గా మా అబ్బాయితో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాననీ చెప్పింది. ఇంట్లో ఉన్నప్పుడు తను అబ్బాయితోనే ఎక్కువ సమయం గడుపుతుందట. పరీక్షలప్పుడు కూడా అబ్బాయి చదువుకుంటూ ఉంటే తను పక్కనే ఉండి కంపెనీ ఇస్తుందట. అబ్బాయి ఎం.బి.బి.ఎస్. రెండో సంవత్సరంలో ఉన్నాడనీ, తనకిప్పుడు నలభయ్యారేళ్లనీ చెప్పింది.
రాఘవరావు ఆశ్చర్యంగా ఆమెవైపు చూశాడు. “అవునా? మీకు అంత వయసు ఉంటుందనుకోలేదు. మా మేనగోడలు వయసు కూడా సరిగ్గా అంతే ఉంటుం” దన్నాడు. ఆమె నవ్వి ఊరుకుంది.
సాయంత్రం ఏడు దాటింది. నస్రీన్ లేచి తల్లి, అక్క కూర్చున్న బెర్త్ దగ్గరికి వెళ్లింది. నమ్మాళ్వార్ ఫోన్ మళ్ళీ మోగింది. అవతల కొడుకు, “నాన్నా, డిన్నర్ కి ఆర్డరిచ్చి నీకు ట్రైన్ లోనే అందేలా చూస్తా” నని చెబుతున్నాడు. “త్వరగా వచ్చేలా చూడు. తినేసి పెందరాళే పడుకుంటా”నని తండ్రి చెప్పాడు. ఆర్డరిచ్చి ట్రైన్ లోనే అందించే ఏర్పాటు ఎలా చేస్తాడో రాఘవరావుకు అర్థం కాలేదు. తన కూడా డిన్నర్ ఏర్పాటు చూసుకోవాలన్న సంగతి గుర్తొచ్చి యథాలాపంగా నమ్మాళ్వార్ తో అనేసరికి, ఆయన వెంటనే మొబైల్ చేతిలోకి తీసుకుని, “ఉండండి, మీకు కూడా ఆర్డరివ్వమని మా వాడితో చెబుతా”నని చెప్పి కొడుక్కి ఫోన్ చేశాడు. అంతలో ట్రైన్ లోనే డిన్నర్ బుక్ చేసుకునే మనిషి వచ్చేసరికి సైడ్ లోయర్ మీద ఉన్న యువకుడు తనకూ, అనితకూ ఆర్డర్ చేశాడు.
కాసేపటి తర్వాత కొడుకు ఫోన్ చేసి, “ఆర్డర్ బుక్ కావడం లేదు నాన్నా, బుక్ అయ్యేటప్పటికి నీకు ఆలస్యమయిపోతుందేమో…” అని నొచ్చుకుంటూ నసిగాడు. దాంతో నమ్మాళ్వార్ ప్యానిక్ అయినట్టు కనిపించాడు. “అలాగా, ట్రైన్ లో బుక్ చేసుకునే అతను వచ్చి వెళ్లిపోయాడే…సరేలే ఏమైతే అదవుతుంది” అంటూ చికాకు పడుతూ ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత భార్యనుంచి, కూతురునుంచి ఫోన్లు… “డిన్నర్ కు ఆర్డరివ్వడం కుదర్లేదట, ఏం చేస్తా”రంటూ. “చేసేదేముంది, ఏమైనా దొరికితే తింటాను, లేకపోతే పడుకుంటాను” అని నమ్మాళ్వార్ రుసరుసలాడుతూ సమాధానం చెప్పి ఫోన్ కట్ చేశాడు.
అంతలో ట్రైన్ లో బుక్ చేసుకునే మనిషి రెండోసారి వచ్చేసరికి రాఘవరావు, నమ్మాళ్వార్ ఆర్డరిచ్చి ఊపిరి పీల్చుకున్నారు.
నస్రీన్ అక్కతో కలసి మళ్ళీ వచ్చింది. అక్క సైడ్ లోయర్ బెర్త్ మీద కూర్చుంది. మొదట్లో ఉన్న బెరుకు తగ్గి ఒకటీ అరా మాట కలపడం ప్రారంభించింది. రాఘవరావు ఆమె దృష్టికి ప్రత్యేకంగా ఆనినట్టున్నాడు, చెల్లెల్లానే చనువు తీసుకుని కాస్త అల్లరీ, హాస్యం మేళవిస్తూ, “మీరు స్మార్ట్ గా ఉన్నా”రంది. ఆడపిల్లల్లో అలాంటి అభిమానంతో కూడిన హాస్యాన్ని రాఘవరావు ఇష్టపడతాడు. మనస్ఫూర్తిగా నవ్వి ఊరుకున్నాడు.
పక్కన నమ్మాళ్వార్ అస్థిమితంగానూ, దీర్ఘాలోచనలోనూ ఉన్నట్టు కనిపిస్తున్నాడు. మధ్య మధ్య టైమ్ చూసుకుంటూ ఇక ఉండబట్టలేక, “ఎనిమిది దాటిపోతోంది. ఇంకా డిన్నర్ రాలేదు. వస్తే తిని పడుకోవాలి” అని గొణిగాడు. ఎనిమిది లోపలే తిని పడుకునే అలవాటు కాబోలని రాఘవరావు అనుకున్నాడు. అంతలో భోజనం బుక్ చేసుకున్న మనిషి పక్కనుంచి వెడుతుంటే ఆపి, డిన్నర్ ఇంకా రాలేదేమని అడిగాడు. “ఇంకో గంటైనా పడుతుం”దని అతను చెప్పేసరికి నమ్మాళ్వార్ ఇంకా డీలాపడిపోయాడు. మధ్యాహ్నం నుంచీ తనను వేధించిన మంచినీళ్ళ సమస్య స్థానాన్ని ఇప్పుడు డిన్నర్ ఆక్రమించుకున్నట్టూ; ఈసారి ఫోన్ మోగితే చాలు, డిన్నర్ పై రికార్డ్ ప్లే చేయడానికి సిద్ధమవుతున్నట్టూ కనిపించాడు.
అంతవరకూ ఆయన్నే కన్నార్పకుండా చూస్తూ, ఆయన పరిస్థితిని గమనిస్తున్న నస్రీన్ వెంటనే రంగంలోకి దిగిపోయింది. “డిన్నరే కదా, ఎందుకంత దిగాలుపడతారు? మనందరికీ సరిపోయినన్ని పరోటాలు తీసుకొచ్చాను” అంటూ బెర్త్ కిందనుంచి ఓ పెద్ద బ్యాగు బయటికి లాగి అందులోంచి ప్లేట్లు, పరోటాలు తీసి ఒక ప్లేట్లో పరోటాలు ఉంచి నమ్మాళ్వార్ ముందు పెట్టింది. వద్దు వద్దన్నా, ఆమె పట్టుబట్టేసరికి నమ్మాళ్వార్ తినడం ప్రారంభించాడు. రాఘవరావును కూడా తినమని బతిమాలింది కానీ, “నాకు అంత తిండిపుష్టి లేదమ్మా. ఆర్డరిచ్చాను కనుక ఎలాగూ వస్తుంది, రెండూ ఎక్కువైపోతాయి, ఏమీ అనుకోవద్దు” అంటూ సున్నితంగా తిరస్కరించాడు. అనితకు ఇవ్వబోతే ఆమె కూడా అదే మాట అంది. సైడ్ లోయర్ బెర్త్ మీద ఉన్న యువకుణ్ణి మాత్రం పట్టుబట్టి తినిపించింది. ఆ తర్వాత తల్లికి ఇచ్చి వచ్చి తనూ, అక్కా తిన్నారు.
నస్రీన్ ను చూస్తుంటే రాఘవరావులో ముచ్చటా, తెలియని అభిమానమూ పెనవేసుకుంటున్నాయి. ఏకకాలంలో పదిమందినీ కనిపెట్టి చూసుకోవడానికి ఆ అమ్మాయికి పది జతల చల్లని కళ్లున్నాయి కాబోలనుకున్నాడు. అమ్మాయిలా కాదు, అమ్మలా అనిపిస్తోంది. ఇంతమందిమీ ఇక్కడ కలుస్తామని ముందు తెలియకపోయినా “మనందరికీ సరిపోయే పరోటాలు తీసుకొచ్చా”నని తను అనడంలో పెద్దవాళ్లను కూడా పిల్లల్ని చేసి బులిపించే అమ్మతనమూ, ఆరిందాతనమే ధ్వనించాయి.
డిన్నర్ వచ్చి తినేసరికి తొమ్మిదయింది. ఏదో ఇంత తిని పడుకోవాలని ఏడున్నర నుంచే నమ్మాళ్వార్ తొందరపడుతున్నాడు కనుక తను ఇక లోయర్ బెర్త్ ఖాళీ చేసి మధ్య బెర్త్ లోకి వెళ్లాలని రాఘవరావు అనుకున్నాడు. అయితే, తను రెండు కళ్ళలో డ్రాప్స్ వేసుకోవాలి. ఇంటిదగ్గరైతే ఎవరో ఒకరు వేస్తారు కానీ ఒంటరి ప్రయాణాల్లో ఎవరు వేస్తారన్నది ఎప్పుడూ అతనికి ప్రశ్నార్థకమే. విజయవాడకు ఒంటరి ప్రయాణమనేసరికి వెంటనే భూతంలా భయపెట్టింది ఈ ప్రశ్నే. తిండి మానేసినా మానేయచ్చు కానీ, కంట్లో మందు మాత్రం మానకూడదని డాక్టర్ హెచ్చరిక.
కంటిమందు ఉన్న చిన్న అట్టపెట్టెను చేతిలో ఉంచుకుని, ఈ సమస్యనుంచి బయటపడడమెలా అన్న ఆలోచనతో రాఘవరావు సతమతమయ్యాడు. ఎవరినైనా వేయమని అడగడానికి మొహమాటం అడ్డొచ్చింది. అంతలో అతని చేతిలో ఉన్న అట్టపెట్టెపై నస్రీన్ కన్ను పడనే పడింది. “కంట్లో మందు వేయాలా?” అంటూ గబుక్కున లేచి ముందుకొచ్చి అతని చేతిలోని పెట్టెను అందుకుంది. “పడుకునే వేసుకోవాలమ్మా” అని రాఘవరావు మొహమాటంగా నసిగాడు.
దాంతో ఆమె మధ్యబెర్త్ ను కిందికి దించడానికి సిద్ధమైంది. ఆమె అక్కా, అనితా కూడా సాయపడదానికి ముందుకొచ్చారు. నమ్మాళ్వార్ అడ్డు తొలగుతూ లేచి ముందు బెర్త్ లోకి మారాడు. బెర్త్ ను కిందికి దింపి కొక్కేలు పెట్టారు. అనిత దిండు, దుప్పట్లు అందుకుంది. ముగ్గురూ కలసి దుప్పట్లు పరిచి ముడతలు లేకుండా సర్దారు.
అంతసేపూ ఆ ముగ్గురినే చూస్తూ మొహమాటపడిపోతూ రాఘవరావు నిట్రాయిలా నిలబడి ఉన్నాడే కానీ లోపల నిశ్శబ్దంగా తెలియని ఉద్వేగం ఉప్పెనలా ఎగిసిపడుతూనే ఉంది. కూతుళ్ళు లేని తను ఆ క్షణంలో తండ్రీ-కూతుళ్ల బంధాన్ని అనుభూతి చెందాడు. ఆ ముగ్గురిపై పితృవాత్సల్యంతో అతని మనసు ఆర్ద్రమూ, గొంతు గద్గదమూ అయిపోయాయి. “నాకు కూతుళ్ళు లేరమ్మా. మీ ఇద్దరిలోనూ కూతుళ్లను చూస్తున్నాను” అని నస్రీన్ తోనూ, ఆమె అక్కతోనూ అనకుండా ఉండలేకపోయాడు. ఆ వెంటనే అనితవైపు తిరిగి “ఇదిగో, ఈమె అచ్చం నా మేనగోడలే” అన్నాడు.
రాఘవరావు బెర్త్ మీద పడుకోగానే నస్రీన్ తన మునివేళ్ళతో అతని కనురెప్పలు తెరచి డ్రాప్స్ వేసింది.
అంతలో, విజయవాడ చేరేసరికి అర్ధరాత్రి ఒంటిగంట దాటుతుందన్న సంగతి గుర్తొచ్చి, మెలకువ రాకపోతే ఎలా అనుకున్నాడు రాఘవరావు. ఆ మాటే పైకి అనేసరికి, “అలారం పెట్టుకోం”డని నస్రీన్ అక్క సలహా ఇచ్చింది. నాకు మొబైల్ లో అలారం పెట్టుకోవడం రాదని రాఘవరావు అనేసరికి “మొబైల్ ఇవ్వండి, నేను పెట్టిస్తా”నని ఆ అమ్మాయి అంది.
అంతలో నస్రీన్ జోక్యం చేసుకుని, “నేను లేపుతాను. మీరు వర్రీ కాకండి” అంది. రాఘవరావు బెర్త్ కు పైన, అప్పర్ బెర్త్ ఖాళీగా ఉండడంతో టీసీని అడిగి తను ఆ బెర్త్ తీసుకుందట.
పది దాటాక నిద్రపట్టిన రాఘవరావు మెలకువొచ్చి టైము చూసేసరికి ఒంటిగంట దాటింది. నస్రీన్ అతని కదలికను గమనించి, “ఇంకో పది నిమిషాల్లో విజయవాడ వస్తుం” దని చెప్పింది. “అవునా” అంటూ రాఘవరావు లేచి బెర్త్ మీంచి కిందికి దిగి తలెత్తి యథాలాపంగా ఆమెవైపు చూశాడు. ఆమె తననే చూస్తూ కిందికి దిగడానికి సిద్ధమవుతోంది. ఆ కళ్ళు చూస్తే, తనను లేపడానికే అంతసేపూ ఆ అమ్మాయి నిద్రకాచుకుని ఉందా అన్న అనుమానం కలిగిందతనికి. దిండు పక్కనే ఉంచుకున్న చేతిసంచీలోంచి మొబైల్ తీసి ప్యాంటు జేబులో పెట్టుకుని, ఇంటి దగ్గరనుంచి తెచ్చుకున్న శాలువా మడతపెట్టి, సంచిలో సర్దాడు. కిందికి వంగి లోయర్ బెర్త్ కింద ఉన్న తన బ్యాగ్ తీయబోయేసరికి నస్రీన్ వారించి, “మీది ఒక్క బ్యాగేకదూ?” అని అడుగుతూ తనే బయటికి తీసింది.
ఈ హడావుడికి ఆమె అక్కా, నమ్మాళ్వార్, అనితా కూడా మేలుకున్నారు. నమ్మాళ్వార్ లేచి కూర్చోడానికి ప్రయత్నిస్తూ, “ఉంటానండి. జాగ్రత్తగా వెళ్ళండి” అన్నాడు. ఆ మాటల్లో ఉట్టిపడిన మార్దవాన్ని, కన్సర్న్ ను, గౌరవాన్ని, ఆప్యాయతను, స్నేహశీలాన్ని గమనించిన రాఘవరావు సాలోచనగా ఆయనవైపు చూశాడు. మొదట్లో ముభావం మనిషనీ, కలుపుగోలుతనం లేదనీ తను అనుకున్నది ఈయన గురించేనా అనుకొని నొచ్చుకున్నాడు. చూసీ చూడగానే వ్యక్తుల స్వభావం గురించి ఒక అంచనాకు రాకూడదని ఈ వయసులో కూడా పాఠం నేర్చుకోవలసివచ్చిందే అనుకుని సిగ్గుపడ్డాడు.
నస్రీన్, ఆమె అక్కా, అనితా కూడా జాగ్రత్తలు చెబుతూ వీడ్కోలు పలికారు. గుండెలోతుల్లో సందడి చేసే ఏవేవో భావాలను వారితో పంచుకోవాలనీ, వారికి కృతజ్ఞతాభారంతో బరువెక్కిన హృదయంతో వీడ్కోలు చెప్పాలనీ అతనికి అనిపిస్తోంది. కానీ స్టేషన్ సమీపిస్తున్న తొందరలో ఏమీ మాట్లాడలేకపోయాడు. “ఉంటాను” అని మాత్రం ఒక్కొక్కరికీ చెప్పి బ్యాగ్ అందుకోబోయాడు. నస్రీన్ వారిస్తూ తనే బ్యాగ్ అందుకుని తలుపువరకూ వెంట వచ్చి, బండి ఆగి రాఘవరావు దిగాక బ్యాగ్ అందించింది.
రాఘవరావు మరోసారి చెయ్యి ఊపుతూ నస్రీన్ కు వీడ్కోలు చెప్పి బ్యాగ్ బుజాన వేసుకుని చేతిసంచీ పుచ్చుకుని ముందుకు అడుగువేశాడు. యాంత్రికంగా అడుగులు పడుతున్నాయే తప్ప అతను ఆ పరిసరాల స్పృహలో లేడు. ఏవేవో ఉద్విగ్నభావపరంపరతో ఉక్కిరిబిక్కిరవుతూ తనలోంచి తను బయటికి రాలేకపోతున్నాడు. ముందురోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఇప్పుడీ ప్లాట్ ఫామ్ మీద దిగేవరకూ పన్నెండు గంటలకు పైగా ఆ కంపార్ట్ మెంటులో తను గడిపిన ఆ నాలుగు బెర్తుల నడిమి ప్రదేశం దానికదే పూర్తిగా భిన్నమైన మరో ప్రపంచానికి సంక్షిప్తరూపమనిపిస్తోందతనికి. ఆ కొన్ని గంటలపాటు ఆ ప్రపంచంలో, ఆ మనుషుల మధ్య ఆనందాహ్లాదాలూ, స్నేహవాత్సల్యాలూ నిండిన నూరేళ్ళ నిండుజీవితాన్ని గడిపిన అనుభూతి కలుగుతోందతనికి. ఇదంతా కలా, నిజమా అనిపిస్తోంది.
ఆ నలుగురూ, వారి కుటుంబాలూ తరతరాలపాటు సుఖసంతోషాలతో ఉండాలి; వాళ్ళ జీవితాలు ఈ రైలుప్రయాణంలానే అందరితో ఆదరాభిమానాలు పంచుకుంటూ ఒక వేడుకలా సాగిపోవాలి; వాళ్ళకు ఎన్నడూ ఏ కష్టమూ, ఏ దుఃఖమూ, ఎలాంటి లోటూ రాకూడదన్న మనఃపూర్వకమైన ఆశీస్సు మాటిమాటికీ అతని ఎద లోతుల్లోంచి తన్నుకు వస్తోంది. పెదవి చివరి మాటకు, ప్రగాఢమైన ఆశీస్సుకు ఉండే తేడా అతనికిప్పుడు తెలుస్తోంది. హృదయమనే అమృతభాండంలో తడిసి ముద్దైన ప్రేమవాత్సల్యాలూ, స్నేహసౌహార్దాల బరువుతో గొంతు గుడిలోంచి పలికే ఆశీస్సు గాలిమాటగా తేలిపోయేది కాదనీ; అత్యంత మహత్తు కలిగిన మంత్రాక్షరంగా మారి ఫలించితీరుతుందనే గట్టి నమ్మకం మొదటిసారి అతనికి కలుగుతోంది.
పొడవుగానూ, విశాలంగానూ పరచుకుని ఉన్న ప్లాట్ ఫామూ, అక్కడి జనసంచారమూ అలవాటుపడిన ప్రపంచంలోకి క్రమంగా అతన్ని తీసుకొస్తున్నాయి. ఆ నాలుగు బెర్తుల నడిమి ప్రపంచం కూడా ఈ ప్లాట్ ఫామ్ లానే పొడవుగానూ విశాలంగానూ పరచుకుంటూ జగత్తు అంతా నిండిపోతూ తనే జగత్తు అయిపోతే ఎంత బాగుండుననుకున్నాడు.