అధ్యాయం-11
ఆ తర్వాతి రోజు గ్రెగరి మొఖోవుని కలవడానికి వెళ్ళాడు. అప్పుడే ఆయన షాపు నుండి టీ తాగడానికి ఇంటికి వచ్చాడు. అతను అట్యోపిన్ తో కలిసి ఖరీదైన వాల్ పేపర్ ఉన్న తన భోజనాల గదిలో కూర్చుని, మంచి రంగుతో ఉన్న టీ తాగుతూ ఉన్నాడు. గ్రెగరి తన టోపిని బయట హాలులో ఉంచి,లోపలికి నడిచాడు.
‘నేను మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను,సెర్జి ప్లాటోనోవిచ్.’
‘హా, నువ్వు పాంటెలి మెలఖోవు కొడుకువి కదా?’
‘అవును.’
‘చెప్పు,నీకు నాతో ఏం పని?’
‘నేను మీ దగ్గర ఏదైనా ఉద్యోగం ఉందేమో కనుక్కుందామని వచ్చాను.’
తలుపు దగ్గర శబ్దం అవ్వడంతో గ్రెగరి తల తిప్పి చూశాడు. ఒక యవ్వన అధికారి లూయీటెంట్ దుస్తుల్లో,ఆ హోదాను సూచించే బ్యాడ్జితో, మడత పెట్టి ఉన్న న్యూస్ పేపర్ తో గదిలోకి ప్రవేశించాడు. గ్రెగరి అతన్ని గుర్తు పట్టాడు. అంతకు ముందు సంవత్సరం గుర్రపు పందెంలో మిట్కా కోర్షునోవు ఓడించిన ఆఫీసరు.
‘మీ నాన్న కన్నకొడుకు పట్ల మరీ ఇంత కఠినంగా వ్యవహరించి ఎందుకు బయట పని చేయడానికి పంపించాడు?’
‘నేను ఆయనతో కలిసి ఇప్పుడు ఉండటం లేదు.’
‘నువ్వు ఇల్లు వదిలేశావా?’
‘అవును.’
‘నిన్ను నేను సంతోషంగా తీసుకుని ఉండేవాడిని. నాకు మీ కుటుంబం గురించి బాగా తెలుసు,మీరు బాగా కష్టపడతారు.కానీ నా దగ్గర ఇప్పుడు ఖాళీ లేదు.’
‘ఇదంతా ఏమిటి?’పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంటూ, గ్రెగరి వైపు చూస్తూ అడిగాడు.
‘ఆ కుర్రాడికి పని కావాలంటా.’
‘నీకు గుర్రాలను చూసుకోవడం వచ్చా? నువ్వు గుర్రపు బండిని సరిగ్గా నడపగలవా?’తన టీలో చక్కెర కలుపుకుంటూ అడిగాడు.
‘హా, చూసుకోగలను.మా సొంతవి ఆరు దాకా ఉన్నాయి.’
‘నాకు గుర్రపు బండిని నడిపేవాడు కావాలి.నీకు ఎంత కావాలో చెప్పు.’
‘నాకు ఎక్కువ అవసరం లేదు.’
‘అలా అయితే మా నాన్నగారి ఎస్టేట్ కు రేపు ఉదయం రా. నీకు లిస్ట్ నిట్స్కి ఎస్టేట్ ఎక్కడో తెలుసో కదా?’
‘హా,నాకు తెలుసు.’
‘ఇక్కడ నుండి అది దాదాపు పన్నెండు వెరస్టుల దూరంలో ఉంది. రేపు ఉదయం అక్కడకు వచ్చేయి. మిగిలిన విషయాలు మనం అక్కడ మాట్లాడుకుందాము.’
గ్రెగరి ఒక్క నిమిషం మొహమాటపడుతూ, తన చేతిని తలుపు మీద ఉంచి, ‘నేను మీతో ఒక్కసారి వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటున్నాను సర్’,అన్నాడు.
లూయిటెంట్ అతని వెనుకే బయట కొద్దిగా చీకటిగా ఉన్న మూల వైపుకి నడిచాడు. వరండాకి దగ్గరలో ఉన్న ఒక కిటికీ నుండి అక్కడ కొద్దిగా వెలుతురు పడుతూ ఉంది.
‘ఏంటి విషయం?’
‘నేను ఒక్కడినే రావడం లేదు.నాతో పాటు ఒక స్త్రీ కూడా ఉంది.ఆమెకు కూడా నాతో పాటు ఏదైనా పని ఇవ్వగలరా?’గ్రెగరి కొద్దిగా సిగ్గుతో అడిగాడు.
‘ఆమె నీ భార్యా?’తన కళ్ళు పెద్దవి చేస్తూ అడిగాడు లూయిటెంట్,ఆ కొద్దిపాటి వెలుతురులో ఆయన ముఖం గులాబీ రంగులోకి కనిపిస్తూ ఉంది.
‘మరొకరి భార్య.’
‘హా,అయితే అవ్వని. అయితే ఆమెను వంటగదిలో పనికి పెట్టుకోవచ్చు. ఇంతకీ ఆమె భర్త ఎక్కడ?’
‘ఇక్కడే,గ్రామంలో ఉంటాడు.’
‘అంటే నువ్వు ఎవడి భార్యనో లేపుకొచ్చావా?’
‘తనే ఇష్టపడి వచ్చింది.’
‘ఎంత రొమాంటిక్ గా ఉంది! సరే,కానీ. రేపు రా.ఇప్పటికీ వెళ్ళు.’
ఉదయం ఎనిమిది గంటలకల్లా గ్రెగరి యాగ్డోనోయ్ లో ఉన్న లిస్ట్ నిట్స్కి ఎస్టేట్ కు చేరుకున్నాడు. ఆ ఎస్టేట్ శిథిల స్థితిలో ఉంది. ఒక పడిపోతున్న ఇటుక గోడ వెనుక ఆ వాకిట్లో అనేక పాత బిల్డింగ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అక్కడ ఉన్న ఒక లాడ్జి టైల్స్ పైకప్పుతో ఉంది, దాని పక్కన 1910 అనేది కూడా మధ్యలో చక్కగా టైల్స్ తో చెక్కి ఉంది,అక్కడే పని చేసే వారి కోసం క్వార్టర్స్,ఒక స్నానాల గది,గుర్రపు శాలలు,కోళ్ళ గూడులు, పశువుల పాక,ధాన్యపు కొట్టం,గుర్రపు బండ్లు పెట్టే ఇల్లు కూడా ఉన్నాయి. బయట వాకిలి నుండి వేరు చేసేలా ఉన్న ఒక చిన్న కంచె వెనుక పాతదై,కూలిపోయేలా ఉన్న ఆ ఎస్టేట్ వెనుక ఒక తోట ఉంది. అందులో పెరిగిన చెట్ల మీద పిచుకల పెట్టిన గూడులు ఉన్నాయి.
గ్రెగరి గేటు దగ్గరకు వచ్చేసరికి ఒక గుంపు వేట కుక్కలతో అతనికి ఆహ్వానం లభించింది. సగం కుంటుతూ, నాలుక బయట పెట్టి రొప్పుతూ, ఉన్న ఒక ముసలి స్త్రీ కళ్ళు ఉన్న ఒక కుక్క ముందుగా వచ్చి గ్రెగరి వాసన చూసింది,ఆ తర్వాత వంగిపోతూ ఉన్న తలను ఎత్తి అతన్ని అనుసరించింది. పని వల్ల క్వార్టర్స్ లో వంట మనిషికి అక్కడ పని చేసే ఒక యవ్వనంలో ఉన్న స్త్రీకి మధ్య పోట్లాట జరుగుతూ ఉంది. తలుపు దగ్గర పొగాకు కాలుస్తూ, ఒక ముసలి వ్యక్తి ఉన్నాడు. ఆ వంట మనిషి గ్రెగరిని లోపలకు తీసుకువెళ్ళింది. ఆ హాలంతా కుక్కల వాసనతో నిండిపోయింది. ఆట వస్తువులు,అవి పెట్టుకునే తోలు సంచి ఒకటి అక్కడ ఉన్న బల్ల మీద పెట్టి ఉంది.
‘చిన్న యజమాని గారు మిమ్మల్ని చూడాలంటున్నారు’,ఆ వంటమనిషి పక్క తలుపులో నుండి బయటకు చూస్తూ అతనికి చెప్పింది.
గ్రెగరి ఒక్కసారి కంగారుగా తన బూట్లవైపు చూసి,లోపలకు నడిచాడు.
ఆ లూయిటెంట్ కిటికీ పక్కన ఉన్న మంచం మీద కూర్చుని ఉన్నాడు. ఆ మంచం పక్కన ఉన్న చిన్న బల్ల మీద ఒక పొగాకు పెట్టె,దాని పక్కన సిగరెట్ ట్యూబులు ఉన్నాయి. ఒక ట్యూబులో పొగాకు నింపి, తన తెల్ల చొక్కా బొత్తాన్ని పెట్టుకుంటూ, ‘నువ్వు మరి త్వరగా వచ్చేశావు. మా నాన్నగారు కిందకు వచ్చేవరకు నువ్వు వేచి చూడాలి’,అన్నాడు.
గ్రెగరి తలుపు దగ్గర నిల్చున్నాడు. ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ఎవరో వస్తున్న పాదాల చప్పుడు హాలు దగ్గర నుండి వినిపించింది. ఒక గంభీరమైన,లోతైన స్వరం ఆ తలుపు మధ్యలో నుండి, ‘నువ్వు నిద్ర పోతున్నావా,యెవజిని?’అడిగింది.
‘లోపలకు రండి.’
నల్లటి బూట్లతో ఒక వృద్ధుడు ఆ గదిలోకి ప్రవేశించాడు. గ్రెగరి పక్క నుండి ఆయన వైపు చూశాడు. బండ ముక్కు, వెండి రంగులో ఉన్న మీసాలు,వాటి నిండా ఉన్న పొగాకు మరకలను గమనించాడు. ఆ వృద్ధుడు చాలా ఎత్తుగా,సన్నగా,బలిష్టమైన భుజాలతో ఉన్నాడు. ఆయన ధరించిన కోటు ఆ బక్కపల్చని ఆకారం మీద వదులుగా వేలాడుతూ ఉంది. ఆ కోటు కాలరు ఆయన మెడకు తగిలించిన బెల్టులా ఉంది. కళ్ళు లోతుకు పోయి ఉన్నాయి.
‘నాన్నా, గుర్రపు బండిని తోలే మనిషి గురించి చెప్పాను కదా,ఇతనే. మంచి కుటుంబం నుండి వచ్చాడు.’
‘ఏ కుటుంబం?’ఆ వృద్ధుడు అడిగాడు.
‘మెలఖోవుల కుటుంబం.’
‘ఏ మెలఖోవ్?’
‘అతను పాంటెలి మెలఖోవ్ కొడుకు.’
‘నాకు ప్రోకోఫీ తెలుసు. అతను నాతో కలిసి పని చేశాడు. నాకు పాంటెలి కూడా తెలుసు. అతనికి కుంటి కాలు ఉన్నది కదా? కోసాక్కు కదా?’
‘అవును,ఆయనకు కుంటి కాలు ఉంది,గ్రెగరి భక్తితో సమాధానం చెప్పాడు.
ఆ తర్వాత ఆ వృద్ధుడు తన తండ్రి చెప్పిన రష్యా-టర్కీ యుద్ధంలో నాయకుడిగా భావించే జనరల్ లిస్ట్ నిట్స్కి గురించిన కథల గురించి గుర్తు తెచ్చుకున్నాడు.
‘ఇంతకీ నువ్వు ఎందుకు పని అడుగుతున్నావు?’వృద్ధుడి గొంతు కంగుమంది.
‘నేను ఇప్పుడు మా నాన్నతో కలిసి ఉండటం లేదు,సార్.’
‘ఏ రకమైన కోసాక్కు జీవితం గడుపుతావు ఇలా పని చేసుకుంటూ నువ్వు? నువ్వు ఇల్లు విడిచి పెట్టినప్పుడు మీ నాన్న నీకు ఏమి ఇవ్వలేదా?’
‘లేదు సార్,ఏమి ఇవ్వలేదు.’
‘అయితే అది వేరే విషయం.ఇప్పుడు నీ భార్యకు కూడా పని కావాలా?’
అప్పుడే హఠాత్తుగా మంచం కిర్రుమన్న శబ్దం వినిపించింది. గ్రెగరి తన కళ్ళు అటు వైపు తిప్పాడు, లూయిటెంట్ చిన్నగా తల ఊపి కన్ను కొట్టాడు.
‘అవును,సార్.’
‘ఇంకా ఆ ‘సార్’లాంటి గౌరవాలు వద్దు. నాకు ఇష్టం ఉండదు. నీకు నెలకు ఎనిమిది రూబుళ్ళు ఇస్తాను. అది మీ ఇద్దరికి కలిపి. మీ ఆవిడ ఇక్కడ పనివాళ్ళకు, అప్పుడప్పుడు పని మీద వచ్చే వారికి వండవలసి ఉంటుంది. సరేనా?’
‘సరే.’
‘నువ్వు రేపటి కల్లా రా. ఇంతకుముందు ఉన్న గుర్రపు బండి నడిపేవాడు ఉన్న గదిలో నువ్వు ఉండవచ్చు.’
‘నిన్న ఏం వేటాదారు నాన్నా?’ తన పాదాల మీదకు రగ్గు లాక్కుంటూ అడిగాడు.
‘మేము గ్రేమ్యాచి లోయ దగ్గర ఒక నక్కను చూసాము, కానీ అది మన అడవిలోపలికి పారిపోయింది. కానీ అది తెలివైన ముసలి నక్క,మన కుక్కల నుండి తెలివిగా తప్పించుకుంది.’
‘కాజ్బెక్ ఇంకా కుంటుతూనే ఉందా?’
‘దాని కాలి బోను కాస్త విరిగినట్టు ఉంది. ఇక లే,యెవజిని. అల్పాహారం చల్లబడిపోతుంది.’
ఆ వృద్ధుడు గ్రెగరి వైపు తిరిగి, గట్టిగా ఒక చిటిక వేశాడు.
‘ఇక వెళ్ళు! మర్చిపోకు,రేపు ఉదయం ఎనిమిది కల్లా నువ్వు ఇక్కడ ఉండాలి.’
గ్రెగరి ఆ గేటు నుండి బయటకు నడిచాడు. ధాన్యపు కొట్టం వెనుక ఉన్న గోడ ముందు ఉన్న పచ్చికలో వెచ్చగా ఆ కుక్కలు పడుకుని ఉన్నాయి. ముసలి స్త్రీ లాంటి కళ్ళు ఉన్న కుక్క గ్రెగరిని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి, అతను గేటు దాటి, దగ్గరలో ఉన్న లోయ వరకు తల ఊపుతూ,అతని వెనుకే వచ్చి,ఆ తర్వాత వెనక్కి వెళ్ళిపోయింది.
* * *
అధ్యాయం-12
అక్సిన్య ఎప్పటికన్నా ముందే వంట పూర్తి చేసింది. పొయ్యి,చిమ్నిలు ఆర్పేసి,పక్కనే ఉన్న చిన్న కిటికీలో నుండి వాకిట్లోకి చూసింది. తమ కంచెకు,మెలఖోవుల కంచెకు మధ్య ఉన్న స్థలంలో పెట్టి ఉన్న కర్రలను చూస్తూ ఉన్నాడు పెట్రో. అతని పెదవుల పైన సగం కాల్చిన సిగరెట్టు ఉంది; ఆ కర్రల్లో నుండి తనకు పనికివచ్చే కర్ర కోసం చూస్తూ ఉన్నాడు. ధాన్యపు కొట్టం ఎడమ మూల వైపు పడిపోయి ఉంది. పనికొచ్చే కర్రలతో దాన్ని నిలబెట్టి అవసరమైతే అక్కడ వరకు కప్పు వేయాలని ఆలోచిస్తున్నాడు.
ఆ రోజు ఉదయం చెక్కిళ్ళపై ఓ రకమైన సిగ్గు,ముఖంలో యవ్వనపు వెలుగుతో అక్సిన్య నిద్ర లేచింది.ఆ మార్పు స్టీఫెన్ దృష్టిని దాటిపోలేదు; ఉదయం అల్పాహారం చేసే సమయంలో, ‘ఏమైంది నీకు?’అని అడిగాడు.
‘నాకా?’అక్సిన్య చెక్కిళ్లు ఎరుపెక్కాయి.
‘నువ్వు పొద్దుతిరుగుడు నూనె ఒళ్ళంతా పెట్టుకున్నట్టు వెలుగుతూ ఉన్నావు.’
‘పొయ్యి చాలా వేడిగా ఉంది…బహుశా ఆ వేడి వల్ల ముఖంలోకి రక్తం పొంగినట్లుంది.’
ఆమె తన తల పక్కకు తిప్పుకుని,కిటికీ వైపు తన దృష్టి మళ్ళించింది, మిఖేల్ కొష్వోయ్ సోదరి వస్తుందేమో చూసేందుకు.
ఆమె సాయంత్రం పొద్దు గూకేవరకు రాలేదు. ఆమెను చూసేసరికి ఇక ఆతురత పట్టలేక,లేచి నిలుచుంది.
‘నువ్వు నాతో మాట్లాడాలనుకుంటున్నావా,మాషా?’
‘ఒక్క నిమిషం బయటకు రా.’
స్టీఫెన్ పొయ్యి దగ్గరలో ఉన్న అద్దంలోకి తన ముఖాన్ని చూసుకుంటూ,దువ్వెన బయటకు తీసి తన ముంగురులు దువ్వుకుంటున్నాడు.
అక్సిన్య తన భర్త వైపు పరీక్షగా చూసింది.
‘మీరు ఎక్కడికైనా బయటికి వెళ్తున్నారా?’
స్టీఫెన్ ఒక్కసారిగా సమాధానమివ్వలేదు. అతను ఆ దువ్వెనను తన జేబులో పెట్టుకుని, పైనున్న గూడులో తను పెట్టిన చోటులో ఉన్న పేకాట కార్డ్స్ ను తీసుకున్నాడు.
‘నేను కాసేపు అలా అనికె దగ్గరకు వెళ్ళి వస్తాను.’
‘మీకు ఎప్పటికి ఈ పేకాట అంటే చిరాకొస్తుంది? ఇప్పుడే వెళ్తే పొద్దున్నే కోడి కూసే సమయం వరకు ఆడుతూనే ఉంటారు.’
‘ఇక చాలు,ఇప్పటికే చాలా సార్లు అన్నావు.’
‘మళ్ళీ అదే ఆటా?’
‘ఇక నస పెట్టకు అక్సిన్య. బార్లీ పెట్టిన గుర్రంలా ఎప్పుడూ సకిలిస్తూనే ఉంటావు.అక్కడ ఎవరో నిన్ను చూడటానికి వచ్చారు.’
ఆక్సిన్య వెంటనే అక్కడి నుండి వాకిట్లోకి వెళ్ళింది. గులాబీ రంగు శరీరవర్ణంతో ఉన్న మాషా ఆమెను తలుపు దగ్గర నవ్వుతూ పలకరించింది.
‘గ్రీషా మా ఇంటి దగ్గరే ఉన్నాడు.’
‘అయితే?’
‘నిన్ను చీకటి పడగానే రమ్మని చెప్పమన్నాడు.’
అక్సిన్య ఆమె చేతిని గట్టిగా పట్టుకుని తలుపు బయటకు లాగి,వాకిట్లోకి తీసుకుని వచ్చింది.
‘కొంచెం చిన్నగా మాట్లాడమ్మాయి. ఇంకేమి చెప్పాడు?’
భయంతో కంగారుపడుతూ, అక్సిన్య తలుపు వైపు చూసింది.
‘ఓ దేవుడా! నేనెలా వెళ్ళగలను?’,ఆమె తనలో తాను గొణుక్కుంటూ, ‘మరి అంత త్వరగానా…. సరే నేను వస్తానని చెప్పు …. అతను నన్ను ఎక్కడ కలుస్తాడు?’
‘మా ఇంటికి రా.’
‘ఓ,నేను రాలేను!’
‘సరే అయితే,నేను అతనితో చెప్తాను,అతనే వస్తాడు.’
స్టీఫెన్ తన యూనిఫార్మ్ వేసుకుని, లాంతరు దగ్గరకు వెళ్ళి సిగరెట్ వెలిగించుకున్నాడు.
‘ఆమె ఎందుకు వచ్చింది?’అడిగాడు భార్యను.
‘ఎవరు?’
‘ఆ కొషివోయిల అమ్మాయి.’
‘ఆమె నన్ను తనకో గౌను కుట్టమని అడగటానికి వచ్చింది.’
కాల్చేసిన సిగరెట్ ను నలిపేసి,స్టీఫెన్ తలుపు దగ్గరకు నడిచాడు.
‘త్వరగా నిద్రపో.నా కోసం ఎదురుచూడకు.’
‘సరే.’
ఆమె కిటికీ వరకు వేగంగా వెళ్ళి,అక్కడ మోకాళ్ళ మీద కూలబడి, మంచు పట్టిన ఆ కిటికీకు తన ముఖం ఆనించింది. స్టీఫెన్ మంచులో నడుస్తున్న అడుగుల చప్పుడు ఆమెకు వినిపిస్తూ ఉంది. అతను వాకిట్లో నిలబడి వెలిగించిన సిగరెట్ లో నుంచి ఒక రవ్వ గాలిలోకి ఎగిరి కిటికీ వైపుగా వచ్చి కింద పడి కాసేపట్లోనే ఆరిపోయింది. ఆ కిటికీలో నుండి ఎముక లాంటి అతని చెవి, టోపీ నుండి బయటకు కనిపిస్తూ, సిగరెట్ వెలుతురులో అతని బుగ్గ దగ్గర వెలుతురు ఉండటం ఆమె గమనించింది.
ఆమె తన బట్టల పెట్టెను గబగబా తెరిచి గౌన్లు,జాకెట్లు, చేతి రుమాళ్ళు,ఇంకా చేతికి వచ్చినవన్నీ ఒక శాలువాలో పెట్టి మూటలా కట్టింది. రొప్పుతూ, తన కళ్ళను పెద్దవి చేసి, ఆఖరి సారిగా వంటగది అంతా చూసి, దీపాలు ఆర్పేసి ముందింట్లోకి పరిగెత్తింది. గొడ్లను చూడటానికి మెలఖోవుల ఇంట్లో నుండి ఎవరో బయటకు వచ్చారు. అక్సిన్య ఆ అడుగుల చప్పుడు ఆగిపోయేవరకు ఆగి, తర్వాత వేగంగా తలుపు గొళ్ళెం తీసి, తన మూట పట్టుకుని డాన్ వైపుకి పరిగెత్తింది. ఆమె తలపై కట్టుకున్న చేతి రుమాలు నుండి వెంట్రుకలు ఆమె బుగ్గల మీదకు పడి చక్కలిగింతలు పెడుతున్నాయి. కొషివోయిల ఇంటి వెనుక సందు దగ్గరకు చేరుకునే సమయానికి ఆమె ఒంట్లో ఓపికంతా సన్నగిల్లిపోయింది. ఆమె కాళ్ళు బాగా బరువెక్కినట్టు అనిపించి, వాటిని ముందుకు కదిలించలేకపోయింది. గ్రెగరి ఆమె కోసం ఆ ఇంటి గేటు దగ్గరే వేచి చూస్తున్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా,ఆమె చేతిలోని మూటను తీసుకుని, పచ్చిక బీడుల వైపు నడక కొనసాగించాడు.
పంటలు నూర్చే కొట్టం దాటిన తర్వాత అక్సిన్య నడక వేగాన్ని తగ్గించి, గ్రెగరి భుజం మీద చేయి వేసింది.
‘ఒక్క నిమిషం ఆగు.’
‘ఎందుకు ఆగడం? చంద్రుడు వచ్చేలోపే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోతే మంచిది.’
‘ఆగు,గ్రీషా’,అక్సిన్య ఆగి,ముందుకు వంగింది.ఆమె భుజాలు వంగిపోయి ఉన్నాయి.
‘ఏమైంది?’ గ్రెగరి ఆమె దగ్గరగా వచ్చి అడిగాడు.
‘అది …నాకు నొప్పిగా ఉంది…..ఆ తర్వాతి రోజు ఏదో బరువైంది ఎత్తాను’, తడారిపోయిన పెదవులను తడి చేసుకుంటూ, బాధతో మెలికలు తిరుగుతూ,పొట్ట మీద చేయి పెట్టుకుని అంది. ఆమె అలా కొన్ని క్షణాలు నిలబడి,ఆ తర్వాత తన తలను చేతిరుమాలుతో కట్టి , ముందుకు నడిచింది.
‘ఇక నొప్పి తగ్గిపోయింది,మనం వెళ్ళవచ్చు.’
‘నువ్వు కనీసం నేను నిన్ను ఎక్కడకు తీసుకువెళ్తున్నానో కూడా అడగలేదు. బహుశా నేను నిన్ను ఎత్తైన కొండ నుండి కింద తోసేస్తే ఏం చేస్తావు?’ఆ చీకట్లో గ్రెగరి నవ్వుతూ అడిగాడు.
‘ఇప్పుడు ఏదైనా నాకు ఒకటే. నేను కోరుకుంది నాకు దక్కింది,అదే చాలు’,అక్సిన్య మాటలు ఆమె నవ్వులో కలిసిపోయాయి.
స్టీఫెన్ మాములుగానే అర్థరాత్రి వేళలో ఇంటికి తిరిగివచ్చాడు. అతను సరాసరి గుర్రాలశాలకు వెళ్ళి, గుర్రానికి గడ్డి వేసి,దాని పలుపు తాడు తొలగించి,వాకిట్లోకి నడిచాడు. ‘ఎవరితోనో కబుర్లు చెప్పడానికి వెళ్ళి ఉంటుంది’,అనుకుని తలుపు తీశాడు. వంటగదిలోకి వెళ్ళి, తలుపు గట్టిగా వేసి,అగ్గిపెట్టె వెలిగించాడు. పేకాటలో గెలిచాక(అప్పటికే వారు ఎన్నో సార్లు ఆడారు),అతను ప్రశాంతంగా,సంతోషంగా ఉన్నాడు. అతనికి నిద్ర ముంచుకొస్తుంది.ఆ అగ్గిపుల్ల వెలుగులో వంటగదిలో ఎక్కడపడితే అక్కడ పరిచి ఉన్న వస్తువులను చూసి, ఎందుకలా జరిగి ఉంటుందో ఊహించే ప్రయత్నం చేయకుండా వాటిని చూస్తూ ఉన్నాడు. ఆశ్చర్యపోకుండా,ముందు గదిలోకి వెళ్ళాడు. అక్కడ తెరిచి ఉన్న అక్సిన్య బట్టల పెట్టె అతన్ని వెక్కిరిస్తున్నట్టు కనిపించింది. ఆమె కంగారులో అక్కడే మర్చిపోయి వెళ్ళిన పాత స్వెట్టర్ నేల మీద పడిపోయి ఉంది. స్టీఫెన్ తన కోటును తీసి పక్కన వేసి ,వంట గదిలోకి లాంతరు కోసం వెళ్ళాడు. ఆ వెలుగులో ఆ గదిని చూడగానే అతనికి జరిగింది అర్థమైపోయింది. అతను ఆ లాంతరును కింద పడేసి, తనేం చేస్తున్నాడో తనకే తెలిసేలోగానే, గోడ మీద తగిలించి ఉన్న ఖడ్గాన్ని బయటకు తీసి, దాని పిడి చుట్టూ తన చేయి నల్లబడేoత గట్టిగా పట్టుకుని,నేల మీద ఉన్న అక్సిన్య నీలం-పసుపు రంగుతో ఉన్న స్వెట్టర్ ను గాలిలోకి ఎగరేసి, దానిని ఆ కత్తితో రెండు ముక్కలు చేశాడు.
బాధ,దుఃఖం,అవమానంతో ఇంకేం చేయాలో తోచక ఆ ముక్కలను పైకి విసిరేశాడు ముక్కలు ముక్కలు చేసి. ఆ తర్వాత ఆ ఖడ్గాన్ని ఒక మూలకు విసిరేసి, వంట గదిలోకి వెళ్ళి అక్కడ ఉన్న బల్ల మీద కూర్చున్నాడు. తన తల దాని మీద పెట్టి, తన చేతులతో బల్ల మీద ఉన్న గుడ్డను వణుకుతున్న చేతి వేళ్ళతో గట్టిగా పట్టుకున్నాడు.
* * *
అధ్యాయం-13
ఇబ్బందులు ఎప్పుడు ఒంటరిగా రావు. ఆ ఉదయం , హెట్కా నిర్లక్ష్యం వల్ల మిరోన్ పశువులశాలలోని ఎద్దు,మేలు జాతి ఆడ గుర్రం మెడ మీద పొడిచేసింది. హెట్కో పాలిపోయిన ముఖంతో,వణుకుతూ ఇంట్లోకి పరిగెత్తాడు.
‘అయ్యగారు! దారుణం జరిగిపోయింది! ఆ ఎద్దు …..ఆ ఎద్దు….’ఏడుస్తూ,ఉక్రేనియన్ బాషలో అన్నాడు.
‘అయ్యో ఆ ఎద్దుకి ఏమైంది? పద దాని దగ్గరకు వెళ్దాము!’మిరోన్ ఆదుర్దాగా అడిగాడు.
‘ఆ ఎద్దు మన ఆడ గుర్రాన్ని …….మెడ పొడిచేసింది….’
మిరోన్ కోటు కూడా వేసుకోకుండా వాకిట్లోకి పరిగెత్తాడు. మిట్కా బావి దగ్గర ఐదేళ్ళ ఆ ఎద్దును కంచె దగ్గర ఉన్న కర్రతో తిడుతూ బాదుతున్నాడు. ఆ ఎద్దు తల కిందకు వంచుకుని ఉంది, దాని మెడ వెనుక వదులుగా వేలాడుతూ ఉన్న చర్మం మీద మంచు పడుతూ ఉంది,నేల మీద తన గిట్టలను కదిలిస్తూ తల ఊపుతూ ఉంటే, వెండి రంగులో మేఘాల్లో ఉన్న మంచు,దుమ్ముతో కలిసి దాని తోక చుట్టూ ఆవరించి ఉంది. ఆ దెబ్బలకు భయపడే బదులు,అది చిన్నగా శబ్దం చేస్తూ,తల పైకి కిందకి ఊపుతూ,వెనుక కాళ్ళను దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న భంగిమలో ఉంచింది.
ఆ చిన్న శబ్దం కాస్తా క్రమంగా పెద్ద రంకెగా మారింది.మిట్కా దాన్ని తిడుతూ తల మీద,పక్కన కొడుతూనే ఉన్నాడు. అప్పటికే మిట్కాను ఆపడానికి వెనుక నుండి ప్రయత్నిస్తున్న అనికెని అతను గమనించనే లేదు.
‘వెనక్కి రా డ్మిట్రి!దేవుడా! అది నీ పొట్టలో పొడుస్తది. నేను చెప్తున్నా విను! మిరోన్ గ్రిగొరివిచ్ నువ్వు ఎందుకు నీ కొడుకును ఆపవు!’
మిరోన్ బావి వద్దకు పరిగెత్తాడు. కంచె దగ్గర తల వేలాడిపోతూ ఉంటే అక్కడ ఆ గుర్రం నుంచుని ఉంది. దాని డొక్కలు ఎగిరెగిరి పడుతున్నాయి, మూపురం వెనుక అంతా చెమట పట్టి ఉంది. దాని మెడ నుండి రక్తం దాని ఛాతీ ఎముకల మీదకు కారుతూ,నేల మీద ఉన్న మంచుతో కలిసిపోతూ ఉంది.ఆ బాధలో దాని వెంట్రుకలు కొన్ని పైకి లేచాయి, వణుకుతూ ఉంది.
మిరోన్ దాని ముందుకు వెళ్ళాడు. గులాబీ రంగులో దాని మెడ దగ్గర ఉన్న పెద్ద గాయం నుండి రక్తం ఆగడం లేదు. ఆ గాయం మనిషి చెయ్యి లోపలికి పెడితే దాని వాయు నాళం చేతికి తగిలేంత లోతుగా ఉంది. మిరోన్ ఆ గుర్రం ముంగురులు సరిచేసి,దాని మెడను పైకి లేపాడు. మెరుస్తూ ఉన్న దాని ఊదారంగు కన్ను యజమాని కంట్లోకి సూటిగా చూసింది,ఆ చూపు,’ఇప్పుడు ఎలా?’ అని మిరోన్ ను ప్రశ్నించినట్టు ఉంది. మిరోన్ ఆ మూగ ప్రశ్నను ఒక్క అరుపుతో సమాధానపరిచాడు. ‘మిట్కా! వాళ్ళను త్వరగా ఓక్ చెట్టు బెరడు తీసుకురమ్మని చెప్పు!’
హెట్కో ఓక్ చెట్టు బెరడు తీసుకురావడానికి పరిగెత్తాడు. మిట్కా తండ్రి పక్కన వచ్చి నిలబడి, ఆ ఎద్దు వైపు చూశాడు. అది నేలమీద ఉన్న మంచులో ముందుకు,వెనక్కి గిట్టలను దువ్వుతూ,రంకెలు వేస్తూ ఉంది.
‘దాని ముంగుర్లు పట్టుకో!’మిరోన్ కొడుకును ఆజ్ఞాపించాడు. ‘మికెయ్! త్వరగా వెళ్ళి పురికొస తీసుకురా లేకపోతే చావగొడతాను!’
వాళ్ళు ఆ గుర్రం నొప్పికి అరవకుండా ఉండటానికి కొద్దిగా జుట్టుతో ఉన్న దాని పై పెదవి భాగాన్ని తాడుతో కట్టేశారు.గ్రీక్షా తాతయ్య అప్పుడే అక్కడకు వచ్చాడు. సింధూరం రంగులో ఉన్న ఒక వేడి ద్రవాన్ని ఒక మగ్గులో అక్కడకు తీసుకువచ్చారు.
‘అంత వేడిగా వద్దు! దాన్ని కాస్త చల్లబరచండి! నీకు వినబడుతోందా మిరోన్?’
‘నాన్నా,మీరు ఇంట్లోకి వెళ్ళండి,లేకపోతే జలుబు చేస్తుంది.’
‘కానీ నేను దాన్ని చల్లబరచమని చెప్తున్నాను.మీరు ఆ గుర్రాన్ని చంపేయాలనుకుంటున్నారా ఏమిటి?’
వాళ్ళు ఆ గాయాన్ని కడిగారు. చల్లగా ఉన్న తన వేళ్ళతోనే మిరోన్ సూది,దారంతో దానికి కుట్లు వేశాడు. అది చాలా చక్కటి వైద్యంగా పని చేసింది. అతను ఆ బావి నుండి లోపలకు వచ్చే లోపలే,లుకినిచ్న ఇంట్లో నుండి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది, ఆమె వణుకుతూ ఉంది. తన భర్తను పక్కకు పిలిచింది.
‘నటాల్య ఇంటికి వచ్చేసింది! దేవుడా!’
‘అయితే ఇప్పుడు ఏమిటి?’ మిరోన్ కోపంగా అన్నాడు,మచ్చలతో పాలిపోయి ఉన్న ఆయన ముఖం ఇంకా పాలిపోయింది.
‘అది గ్రెగరి ….మన అల్లుడు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు!’ లుకినిచ్న కాకి రెక్కలు ఆడించినట్టు తన చేతులు ఆడిస్తూ ఏడుపు అందుకుంది. ‘ఇప్పుడు ఊరంతా ఇదే మాట్లాడుకుంటారు!ఓ దేవుడా,ఎంత దురదృష్టం!’
నటాల్య శాలువా కప్పుకుని ఉంది. చలికాలపు స్వెట్టర్ వంటగది మధ్యలో పడి ఉంది. రెండు కన్నీటి చుక్కలు ఆమె ముక్కు మధ్య ఆగిపోయాయి కిందకు జారడం లేదు. ఏడ్చి ఏడ్చి ఆమె ముఖమంతా ఎర్రబడిపోయింది.
‘నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?’తండ్రి ఆమె మీద అరిచాడు,వంటగదిలోకి ప్రవేశిస్తూనే. ‘నీ మొగుడు నిన్ను కొట్టాడా? ఏదైనా విషయంలో గొడవపడ్డారా?’
‘అతను నన్ను వదిలేశాడు’,నటాల్య వెక్కిళ్ళ మధ్య చెప్పింది,తర్వాత ఊగిపోతూ,తండ్రి ముందు మోకాళ్ళ మీద కూలబడింది.
‘ఓ, ప్రియమైన నాన్నా, నాకు ఇంకా జీవితంలో ఏమి మిగిలి లేదు. నన్ను ఇంటికి తీసుకువచ్చేయి. గ్రీషా ఆ స్త్రీతో వెళ్ళిపోయాడు. నేను ఇప్పుడు ఒంటరిదానిని అయిపోయాను! ఏదో బండి నా మీద నుండి వెళ్ళినట్టు ఉంది!’
ఆమె మాటలు మింగుతూ, తండ్రి గడ్డం వంక చూస్తూ అంది.
‘ఒక్క నిమిషం ఆగు!’
‘నేను ఇంకా అక్కడ ఉండలేను….. నన్ను ఇక్కడకు తీసుకువచ్చేయండి!’నటాల్య గోడ పక్కన ఉన్న పెట్టె దగ్గరకు వెళ్ళి,దాని పక్కన కూర్చుని, చేతుల్లో తల దాచుకుని ఏడ్వసాగింది. ఆమె చేతి రుమాలు వెనక్కి పడిపోయింది,దానితో ఆమె నల్లటి జుట్టు ఆమె చెవుల చుట్టూ పరుచుకుంది. ఆ పరిస్థితిలో కన్నీళ్ళు మే నెలలో వానలా ఉన్నాయి.ఆమె తల్లి కూతురి తలను తన పొట్ట దగ్గరకు లాక్కుని,ఓదార్చే ప్రయత్నం చేసింది.కోపంతో ఊగిపోతున్న మిరోన్ వాకిలి వైపుకి వెళ్ళాడు.
‘రెండు గుర్రాల బండి! త్వరగా కట్టండి!’
వాకిట్లో ఓ పక్కన అప్పుడే ఓ కోడిపెట్ట పైన ఎక్కిన పుంజు ఆ అరుపుకి భయపడి వెంటనే అక్కడి నుండి ధాన్యపు కొట్టం వైపు,కోపంగా అరుస్తూ పరిగెత్తింది.
‘త్వరగా!’ మిరోన్ వాకిలి ముందుకు వచ్చి మళ్ళీ అరిచి,లోపలికి వెళ్ళాడు. హెట్కో రెండు నల్ల గుర్రాల జతను బండికి కట్టి,వేగంగా వచ్చాడు.
మిట్కా,హెట్కో కలిసి నటాల్య వస్తువులు తీసుకురావడానికి వెళ్ళారు. ఆ గందరగోళంలో ఆ ఉక్రేనియన్ సేవకుడు ఒక పంది మీదగా బండిని పోనించాడు.అతను తనలో తానే ఆలోచించుకుంటున్నాడు, ‘ఇంత పెద్ద విషయం హడావుడిలో యజమాని ఆ గుర్రాన్ని మర్చిపోతాడేమో?’ ఆ ఆలోచన అతనికి ఎంతో సంతోషాన్ని కలిగించింది.
ఆ క్షణంలోనే అతనికి ఇంకో ఆలోచన కూడా వచ్చింది,’అయినా ఆ ముసలి దయ్యం అంత త్వరగా దాన్ని మర్చిపోడు!’అతని పెదవులు కోపంతో బిగుసుకున్నాయి.
‘త్వరగా పదరా వెధవా…లేకపోతే ఒక్కటిస్తా!’
ఆ మాటతో అతను కొరడాను ఆ గుర్రాల మీద ఝుళిపించాడు.
* * *
అధ్యాయం-14
లూయిటెంట్ యెవజెని లిస్ నిట్స్కి అటామన్ లైఫ్ గార్డ్స్ లో పని చేశాడు. తన తోటి ఆఫీసర్లతో కలిసి ఓ రేసులో పాల్గొన్నప్పుడు కింద పడటం వల్ల అతని ఎడమ చేయి విరిగిపోయింది. హాస్పటల్ లో కొంతకాలం గడిపి,ఆరోగ్యం కుదుటపడ్డాక యాగోడ్నోయ్ కు ఆరు వారాలు తిరిగి వచ్చాడు.
ఆ ముసలి జనరల్ ఒంటరిగా తన జీవితాన్ని ఎస్టేటులో గడిపాడు. ఆఖరి శతాబ్దపు ఎనభైల్లో వార్సా నగర శివార్లలో ఆయన తన భార్యను కోల్పోయాడు. కోసాక్కు జనరల్ వైపు ఫైర్ చేసిన బుల్లెట్లు ఆయన భార్యకు,బండి నడిపే వాడికి తగిలాయి. ఆ బండిలో బులెట్ల వర్షం కురిసినా సరే మొత్తానికి ఆ జనరల్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయన భార్య మరణించేటప్పటికి, ఆయన భార్య మిగిల్చిన ఆఖరి గుర్తు అయిన అతని కొడుకు యెవజినికి రెండేళ్ళ వయసు. ఈ ఘటన జరిగిన తర్వాత అతి కొద్ది సమయంలోనే రిటైర్మెంటు తీసుకుని,ఆర్మీ నుండి బయటకు వచ్చి, యాగోడ్నోయ్ (పది వేల ఎకరాల ప్రాంతంలో విస్తరించి ఉన్న అతని ఎస్టేటు అతనికి పూర్వీకుల నుండి వచ్చింది. 1812 లో యుద్ధంలో పాల్గొన్నందుకు దానిని ఆయన తాతయ్యకు ప్రభుత్వం ఇచ్చింది,అది సారతోవ్ ప్రావిన్స్ లో ఉంది)లో స్థిరపడి,అక్కడే ప్రశాంతంగా ఓ సాధువులా జీవితాన్ని గడుపుతున్నాడు.
యెవజినికి యుక్త వయసు రాగానే,అతన్ని క్యాడేట్ కార్ప్స్ కు పంపించి,తన జీవితాన్ని ఎస్టేట్ క వ్యవహారాలకే అంకితం చేసుకున్నాడు. చక్కటి పశువులను వృద్ధి చేసేవాడు, మేలైన జాతికి చెందిన ఇంగ్లాండ్ ,ప్రోవాల్స్క్ లలో ఉన్న ఆడగుర్రాలకు పుట్టిన వాటిని ఎన్నుకుని తీసుకువచ్చి,ఆ ప్రాంతంలో తనే కొత్త జాతి వాటిని వృద్ధి చేశాడు. ఆయనకు చెందిన భూమిలో కొంత కోసాక్కు అవ్వడం వల్ల వచ్చింది,మిగిలింది ఆయన పెంచింది. దానిలో ఆయన గుర్రాలను పెంచుతున్నాడు,పంటలు పండిస్తున్నాడు, లేదా వేరేవాళ్ళు ఆయన కోసం పండిస్తున్నారు. కొన్ని సార్లు వేట కుక్కలను తీసుకుని వెళ్ళేవాడు,లేకపోతే ఓ పెద్ద గదిలో తలుపు వేసుకుని వారాల తరబడి తాగుతూ ఉండేవాడు. ఏదో తెలియని ఉదర వ్యాధి వల్ల వైద్యులు ఆయన్ని ఎటువంటి ఘన పదార్ధాలు తినవద్దని సూచించారు. ఆయన ప్రతి ముద్దను నమిలి,అందులో ఉన్న ద్రవ పదార్ధాన్ని మింగి,ఆ ఘన పదార్ధాన్ని కుర్ర సేవకుడు వెనియమిన్ పెట్టిన వెండి పళ్ళెంలో ఊసేవాడు.వెనమిన్ అంతకుముందు ఒక చిన్న రైతు,ఎల్లప్పుడూ ఆ పెద్ద యజమాని వెంటే ఉండేవాడు.
వెనియమెన్ ఒక మూర్ఖుడు. అతని నల్లటి ముఖం,గుండ్రటి తల పైన జుట్టు ఏదో నల్లటి కుచ్చు అలంకారంలా ఉండేది తప్ప జుట్టులా అనిపించేది కాదు. అతను లిస్ట్ నిట్స్కి దగ్గర ఆరేళ్ళుగా పని చేస్తున్నాడు. మొదట్లో యజమాని పక్కన నిలబడి,వెండి పళ్ళెం పట్టుకుని,అతను ఊసేస్తూ ఉంటే చూడటం అతనికి కడుపులో తిప్పేసేది,కానీ క్రమంగా దానికి అతను అలవాటు పడిపోయాడు. సంవత్సరం తర్వాత ఒక రోజు, చక్కటి మాంసాన్ని ఆ యజమాని నమిలి,ఊసేస్తూ ఉంటే, ‘అబ్బా అంతా వృధా అయిపోతుంది!ఈయన తినలేడు కానీ నా కడుపు మాత్రం నకనకలాడిపోతుంది. తోట్టెలో పడ్డ కుక్కలా ఉంది ఈ పరిస్థితి. నేను ఆయన వదిలేసింది పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను.దీని వల్ల నాకు వచ్చే హాని ఏమి ఉంది?’అనుకున్నాడు. ఆ ప్రయత్నం చేశాక అతనికి యజమాని చేసే పని పట్ల ఏ మాత్రం విముఖత కలగలేదు. అప్పటి నుండి ఆ వెండి పళ్ళెంను అతను హాలులోకి తీసుకువెళ్ళి, గబగబా ఏదైతే వైద్యులు యజమాని మింగడాన్ని నిషేదించారో దానిని మింగేసేవాడు. బహుశా దీని వల్ల వేరే కారణాల వల్లో తెలియదు కానీ, అతను మంచి లావుగా,నున్నగా తయారయ్యాడు, అతని మెడపైన కొన్ని ముడతలు కూడా పడ్డాయి.
వెనియమిన్ కాకుండా ఆ ఎస్టేట్ లో నివసించే పనివాళ్ళు వంట మనిషి లుకేరియా, వృద్ధుడైన సాష్కా గుర్రాలశాల పనివాడు, పశువులను చూసుకోవడానికి టిఖోన్,అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన గుర్రపు బండ్లు నడిపే గ్రెగరి,అతని కూడా అక్సిన్య.లావుగా వంగిపోతున్న శరీరంతో,ముఖం మీద మచ్చలతో పసుపుపచ్చ ముద్దలా ఉండే లుకేరియా,అక్సిన్యను మొదటి నుండి వంట పని నుండి దూరంగా ఉంచింది.
‘నువ్వు యజమాని వేసవికాలంలో ఎక్కువ పనివాళ్ళను పెట్టినప్పుడు వంట పని చేద్దుగాని.అప్పటివరకూ నేను చూసుకుంటాను’,అంది.
ఆ పెద్ద ఇంటి గచ్చును వారానికి మూడు సార్లు కడిగి,శుభ్రం చేయటం, పక్షుల ఫారంలో మేత వేయడం,దానిని శుభ్రంగా ఉంచడం అక్సిన్య అక్కడ చేయాల్సిన పని. ఆమె అక్కడ అందరినీ,ఆఖరికి లుకేరియాను కూడా మెప్పించడానికి ఎంతో కష్టపడి పని చేసేది. గ్రెగరి రోజులో ఎక్కువ సమయంలో గుర్రాలశాలలో సాష్కాతో కలిసి గుర్రాల సంరక్షణలో గడిపేవాడు. సాష్కా తన యవ్వనం నుండి వెంట్రుకలు తెల్లబదేవరకు అక్కడే పని చేస్తూ ఉన్నాడు,కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు సాష్కా అన్న పేరుతో తప్ప ఇంకే పలకరింపు అతనికి వినిపించలేదు. అతన్ని ఎవరు తన తండ్రి పేరుతోనో,ఇంటి పేరుతోనో గౌరవంగా పిలవలేదు. సాష్కా లిస్ట్ నిట్స్కి తో కలిసి దాదాపు ఇరవై ఏళ్ళు పని చేసినా ఆయనకు కూడా సాష్కా ఇంటి పేరు తెలియదు. కుర్రాడిగా ఉన్నప్పటి నుండి సాష్కా గుర్రాలు నడుపుతూ ఉన్నాడు,కానీ క్రమక్రమంగా వయసుతో పాటు అతని కంటిచూపు,శక్తి మందగిల్లాయి. అందుకే అతను కేవలం గుర్రాలకు తిండి పెట్టడం,మరియు మిగిలిన చిన్న పనులకే పరిమితమయ్యాడు. జుట్టు అంతా పచ్చ-బూడిద రంగు మిళితమైన రంగులోకి మారిపోయింది. చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఒక బ్యాట్ వల్ల ముక్కుకు తగిలిన దెబ్బ వల్ల ముక్కు ఆకృతి కొద్దిగా మారి ఉంది.ఆ వృద్ధుడి ముఖంలో ఎల్లప్పుడూ చిన్న పిల్లల ముఖాల్లో ఉండే చిరునవ్వు కనిపించేది. దైవ దూతలా కనిపించే అతని ముఖం దెబ్బ తగిలిన ముక్కు వల్ల, కింద పదవి దగ్గర గాయం మచ్చ వల్ల పాడైంది. రష్యన్ సైన్యంలో (ఉక్రేనియన్లు ఎక్కువగా ఉండే బొగుచర్ ప్రాంతంలో సాష్కా ఒక రష్యన్)ఒకసారి ఇచ్చిన మందు పార్టీలో వోడ్కాకు బదులుగా తెలియక ఎక్కువ మోతాదులో ఆక్వా రెజియా గబగబా తాగేశాడు. ఆ ఘాటైన మందు అతని పై పెదవిని బుగ్గ వరకు మడత పడేలా చేసింది. అది మానిపోతూ,ఒక గులాబీరంగులో చిన్న మచ్చను మిగిల్చి,అక్కడ జుట్టు పెరగకుండా చేసింది. అది చూడటానికి తెలియని భూతమేదో సాష్కా గడ్డాన్ని నాకి,అక్కడ తన నాలుకను ఆ బుగ్గ మీదే వదిలినట్టుగా ఉంది. సాష్కా తరచుగా వోడ్కా తాగి,ఆ వాకిలి మొత్తం తనదే అదంతా అన్నట్టు తిరిగేవాడు. అటూ ఇటూ తిరుగుతూ తన యజమాని పడక గది కిటికీ దగ్గరకు వెళ్ళి,తన ముక్కు పైన వేలు పెట్టుకుని,
‘నికోలాయ్ లెక్సేచ్! మెలకువగా ఉన్నావా నికోలాయ్ లెక్సేచ్?’బిగ్గరగా అరిచేవాడు.
ఒకవేళ యజమాని ఆ గదిలో ఉన్నట్లయితే ఆ కిటికీ దగ్గరకు వచ్చేవాడు.
‘ఏమైందిరా ముసలి వెధవా మళ్ళీ నీకు?’కిటికీ దగ్గర నుండే గర్జించేవాడు.
సాష్కా తన పైజామాను పైకి లాక్కుంటూ, కన్నుకొడుతూ,చిన్నగా నవ్వేవాడు. అతని ముఖం మీద నవ్వే తాండవమాడేది,అది సగం మూసి ఉన్న ఎడమ కన్ను నుండి అతని మూతికి కుడి వైపున ఉన్న గులాబీ రంగు మచ్చ వరకు వ్యాపించేది. అది ఒక జిత్తులమారి నవ్వు తప్ప ఆహ్లాదకరమైనది కాదు.
‘నికోలాయ్ లెక్సేచ్,అయ్యా,మీకు తెలుసు!…’దాదాపుగా ఊగిపోతూ, మురికిగా ఉన్న తన చిటికెన వేలును పైకి పెట్టి బెదిరిస్తునట్టు ఊపేవాడు.
‘పోయి నిద్రపో’,ఆ యజమాని దయ చూపిస్తున్నట్టు ఆ కిటికీ నుండే నవ్వుతూ తన మీసాన్ని,పొగాకు అంటిన తన ఐదు చేతివేళ్ళతో సరిచేస్తూ అనేవాడు.
‘దయ్యం కూడా సాష్కాను మోసం చేయలేదు!’సాష్కా నవ్వుకుంటూ,కంచె వరకు వెళ్ళేవాడు. ‘నికోలాయ్ లెక్సేచ్, నువ్వు నాలాంటి వాడివే. మనం చేప,నీరు లాంటి వాళ్ళం. ఏ వాతావరణంలో అయినా కలిసే ఉంటాము. నువ్వు,నేను,మనం ధనవంతులం,మనమే!…..’సాష్కా తన చేతులు చాస్తూ అన్నాడు. ‘ఈ డాన్ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి మన గురించి తెలుసు. నువ్వు,నేను……’సాష్కా గొంతు ఉన్నట్టుండి దుఃఖంతో పూడుకుపోయేది,కానీ వెంటనే తేరుకుని, ‘మనం మంచి జత,దొరగారు,ప్రతి విషయంలోనూ,కానీ మన ముక్కులు మాత్రం చెత్తతో నిండిపోయాయి ….’
‘ఎందుకలా?’నవ్వుతూ అడిగాడు ఆ యజమాని.
‘వోడ్కా వల్ల’,సాష్కా కన్ను కొడుతూ,గులాబీ రంగు మచ్చను తుడుచుకుంటూ,
‘నువ్వు ఇంకా తాగకు నికోలాయ్ లెక్సేచ్,తాగితే మన పని అయిపోతుంది. అంతా బయటకే పోతుంది!’
‘ఇదిగో,నిన్ను కరిసిన ఆ కుక్క బొచ్చు తీసుకో.’
ఆ ముసలి జనరల్ ఆ కిటికీలో నుండి ఇరవై కోపెక్కులు విసిరేశాడు. గాలిలో ఉండగానే సాష్కా ఆ నాణేన్ని అందుకుని,తన జేబులో పెట్టుకున్నాడు.
‘సరే,గుడ్ బై, జనరల్’,నిట్టూరుస్తూ వెనక్కి తిరిగి,అన్నాడు.
‘గుర్రాలకు నీళ్ళు పెట్టావా?’నవ్వుతూ అడిగాడు జనరల్.
‘ఓ దయ్యమా!’సాష్కా ముఖం ఊదా రంగులోకి మారిపోయింది,అతని గొంతు తడబడింది,కానీ కోపంతో అరిచాడు.
‘సాష్కా గుర్రాలకు నీళ్ళు పెట్టకపోవడమా? హా,నేను చచ్చిపోతున్నా కూడా పాక్కుతూ వెళ్ళి నొప్పితో బాధపడుతూ కూడా వాటికి నీళ్ళు పెడతాను! నా గురించి ఏమనుకుంటున్నావు నీవు!’
వేగంగా అక్కడి నుండి నడుస్తూ, తిట్టుకుంటూ,పిడికిళ్ళు బిగిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సాష్కా. తాగినా,యజమానితో పిచ్చిగా మాట్లాడినా సరే సాష్కా దాని వల్ల తర్వాత ఎప్పుడు ఏ ఇబ్బంది పడలేదు. అతను ఏం చేసినా అతని పనికి ముప్పు రాలేదు ఎందుకంటే అతని లాంటి గుర్రపు బండ్లు నడిపేవాడు లేడు కనుక. వేసవి కాలంలోనూ,చలి కాలంలోనూ గుర్రపుశాలలో పడుకునేవాడు. సాష్కా అంతబాగా ఎవరూ గుర్రాలను చూడలేరు. అశ్వపాలకుడిగా ఉండేవాడు,వాటికి నాళాలు కూడా వేసేవాడు. మే నెలలో పచ్చికల్లోకి వెళ్ళేవాడు,అక్కడ ఉన్న గుట్టల్లో,లోయల్లో మూలికలు సేకరించేవాడు. అన్ని రకాల ఔషద మూలికలు గుర్రపు శాల గోడ మీద తగిలించి ఉండేవి; అడవి వెల్లుల్లి పాము కాటుకి,గుర్రాలకు వచ్చే డెక్క తెగులుకి,చిన్న చిన్న గాయాలకు, గుర్రాలకు వచ్చే అన్ని రకాల అనారోగ్యాలకు ఔషధాలు అక్కడ ఉండేవి.
సాష్కా అక్కడ వేసవి కాలంలో,చలి కాలంలో పడుకున్నప్పుడు ఆ ఔషధాల వాసనలు చుట్టుముట్టేవి. అక్కడ ఉన్న చెక్క బల్ల మీద ఉన్న ఎండు గడ్డి మీద గుర్రాల చెమటతో ఉన్న సాష్కా కోటు ఉండేది. అతనికి ఆ కోటు, గొర్రెల ఊలుతో చేసిన చిన్న రగ్గు మాత్రమే ఉన్నాయి,ఇంకే వస్తువులు లేవు.
బలంగా, ఎత్తైన పెదాలతో,తెలివి తక్కువగా ఉండే కోసాక్కు, టిఖోన్ లుకేరియాతో కలిసి ఉండేవాడు,అతనికి అకారణంగా రహస్యంగా సాష్కా పట్ల అసూయ పడేవాడు. నెలకోసారి మురికిగా ఉన్న సాష్కా చొక్కా పట్టుకుని,పాకల వెనుక, ‘ఒరేయ్! నా స్త్రీ వైపు కన్నెత్తి చూస్తే బావుండదు’,అరిచేవాడు.
‘అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుంది’,కన్ను కొడుతూ అనేవాడు.
‘దయచేసి ఆమెకు దూరంగా ఉండు’,అభ్యర్థనగా అనేవాడు.
‘నాకు ఆ ముఖం మీద మచ్చలు ఉండే ఆడవాళ్ళంటే ఇష్టం రా. నువ్వు నాకు అలాంటి ఆడదాన్ని చూపిస్తే తాగి గొడవ చేయకుండా ఒక మూల ఉంటాను. ఎన్ని మచ్చలు ఉంటే మగవాళ్ళంటే అంత ఇష్టం ఉంటుందిరా వెధవా నా కొడకా!’
‘నీ వయసుకి ఇది మర్యాదకరమైన పని కాదు…నువ్వు ఒక వైద్యుడివి, గుర్రాలకు వైద్యం చేస్తావు,నీకు అన్ని విద్యలు తెలుసు….’
‘నేను అన్ని విషయాల్లోనూ వైద్యుడినే!’ పరిహాసంగా అన్నాడు.
‘మర్యాదగా ఆమెకు దూరంగా ఉండు! అది తప్పు!’
‘అయినా నేను లుకేరియాను పొంది తీరతాను.ఆమెకు నువ్వు దూరంగా ఉండరా,వెధవా!నువ్వు ఉన్నా సరే,నేను దక్కించుకుంటాను. భలే బొద్దుగా ఉంటుంది. ఆ ముఖం నుండి కొంత సారం పోయింది అంతే,అందుకే ఆ మచ్చలు, నాకు అలాంటివాళ్ళే ఇష్టం!’
‘ఇక్కడే పడి చావు….ఇంకెప్పుడైనా నా దారికి అడ్డు వచ్చావంటే చంపేస్తాను’, తన చేతి సంచిలో నుంచి కొన్ని నాణేలు తీసి సాష్కాకు ఇచ్చేవాడు.
అలా నెలల తరబడి జరుగుతూనే ఉంది.
యాగ్డ్నోయ్ లో జీవితం చప్పగా,నిస్సారంగా గడుస్తూ ఉంది. ఆ ఎస్టేట్ ఒక ఎండిపోయిన లోయకు దగ్గరలో ఉంది,పచ్చిక మైదానానికి చాలా దూరంగా ఉంది. స్టానిట్సాతోనూ, గ్రామంతోనూ వసంతకాలం నుండి ఆ ఎస్టేట్ కు అసలు సంబంధమే ఉండదు. రాత్రుళ్లు అడవుల్లో నుండి తోడేళ్ళ గుంపులు ఇసుక కొండ నుండి పరిగెడుతూ ఆ ఎస్టేట్ తోటలోకి వచ్చేవి.గుర్రాలు భయపడి అరిచేవి వాటిని చూసి.టిఖోన్ వెంటనే యజమాని తుపాకి తీసుకుని వాటిని భయపెట్టడానికి పరిగెత్తేవాడు. లుకేరియా వెచ్చటి రగ్గును తన మెడ ,గుండ్రంగా ఉన్న శరీరం చుట్టూ కప్పుకుని,మచ్చల మధ్యలో ఉన్న కళ్ళతో చీకట్లోకి చూస్తూ, ఆ తుపాకి లో గుండు పేలిన శబ్దం కోసం వేచి చూసేది. ఆ క్షణాల్లో ఆమె అసహ్యంగా,బట్టతలతో ఉండే టిఖోన్ ను అందమైన,ధైర్యమైన యువకుడిగా ఊహించుకునేది.ఎప్పుడైతే పని వాళ్ళ గదుల తలుపు తెరుచుకున్నప్పుడు టిఖోన్ తనతో పాటు చల్లటి గాలిని లోపలికి తీసుకువచ్చేవాడు. అతనికి పడక సిద్ధం చేసి, చల్లగా ఉన్న అతనికి వెచ్చదనాన్ని పంచేది.
వేసవి కాలంలో యాగోడ్నై రాత్రి వరకు పని వాళ్ళతో సందడిగా ఉండేది. లిస్ట్ నిట్స్కి వంద ఎకరాల్లో ఎన్నో తృణధాన్యపంటలను వేశాడు.అవి పంటకు వచ్చే సమయానికి పని వాళ్ళకు బోలెడు పని ఉండేది. యెవజిని ఎప్పుడైనా వేసవి కాలంలో ఆ ఎస్టేట్ కు వస్తూ ఉండేవాడు. ఆ తోటల్లో తిరుగుతూ ఉండేవాడు,కానీ అతనికి బోర్ కొట్టేది. ఉదయాలు కొలను దగ్గర చేపలు పట్టేవాడు. అతను పొట్టిగా,దట్టంగా ఉండేవాడు. తన జుట్టును కోసాక్కుల పద్ధతిలో, ముంగురులను కుడి వైపుకి వచ్చేలా ఉంచుకునేవాడు. తండ్రి ఆఫీసర్ దుస్తులు అతని పొడుగు భుజలపైనా చక్కగా ఉండేవి.
గ్రెగరి,అక్సిన్య ఆ ఎస్టేట్ కు వచ్చి, తమ క్వార్టర్స్ లో స్థిరపడిన కొత్తలో, గ్రెగరి తన కుర్ర యజమానిలో అనేక విషయాలు గమనించాడు. వెనియమిన్ వారి గదిలోకి వచ్చి,తల కొద్దిగా వంచి,నవ్వుతూ, ‘చిన్న యజమాని నిన్ను చూడాలనుకుంటున్నారు,గ్రెగరి’,అనేవాడు.
గ్రెగరి గదిలోకి ప్రవేశించి,తలుపు దగ్గర నిలబడినప్పుడు, అతను ఒక కుర్చీ వైపు చూపిస్తూ, తన పెద్ద పళ్ళతో నవ్వేవాడు.
‘కూర్చో.’
గ్రెగరి ఆ కుర్చీకి ఒక మూల కూర్చునేవాడు.
‘నీకు మా గుర్రాలు నచ్చాయా?’
‘అవి చాలా బావున్నాయి.అందులో బూడిద రంగుది చాలా మెరుగైనది.’
‘దానికి బాగా వ్యాయామం ఉండేలా చూడు.అలా అని అది పడిపోయేలా చేయకు.’
‘సాష్కా తాత చెప్పాడు.’
‘స్టర్డీ సంగతి ఏమిటి?’
‘ఓ ఆ గుర్రమా?దాని మీద ఎంత ధర పెట్టిన ఎక్కువ కాదు. ఇప్పుడు దాని కాలి గిట్టకు ఒక చిన్న గాయం అయ్యింది. దానికి కొత్త బూట్లు తొడగాలి.’
లిస్ట్ నిట్స్కి అతని వైపు సూటిగా చూస్తూ, ‘నువ్వు ఈ మే లో క్యాంప్ కు వెళ్ళాలి కదా?’అడిగాడు.
‘అవును.’
‘నేను అటామన్ తో మాట్లాడతాను, నువ్వు వెళ్ళవలసిన అవసరం ఉండదు.’
‘మీ దయకు కృతజ్ఞతలు.’
కాసేపు అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది. లూయిటెంట్ తన పై చొక్కా బొత్తాన్ని తీసేసి, స్త్రీలా తెల్లా ఉన్న తన ఛాతిపై చేత్తో రుద్దుకున్నాడు.
‘నీకు అక్సిన్య భర్త వచ్చి ఆమెను తీసుకువెళ్తాడనే భయం లేదా?’
‘అతను ఆమెను వదిలేశాడు,ఆమెను ఎప్పటికీ తీసుకువెళ్ళడు.’
‘అది నీకు ఎవరు చెప్పారు?’
‘నేను గుర్రాలకు కావాల్సిన కొన్ని వస్తువులు కొనడానికి స్టానిట్సా వెళ్ళాల్సి వచ్చింది. నేను మా గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని కలిశాను అక్కడ. స్టీఫెన్ పిచ్చిగా తాగుతున్నాడని,అతనికి అక్సిన్య అక్కర్లేదనీ,ఆమె తనకు ఇష్టం వచ్చినట్టు చేసినా తనకు అక్కర్లేదని,తనకు ఆమె కన్నా మంచి భార్య దొరుకుతుందని అన్నాడని చెప్పాడు.’
‘అక్సిన్య మంచి రూపవతి’, లూయిటెంట్ ఆలోచిస్తున్నట్టు,అతని వైపు చూస్తూ,చిన్నగా నవ్వుతూ అన్నాడు.
‘అవును’, ఆ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్టు అన్నా,గ్రెగరి ముఖం చిట్లించాడు.
యెవజిని సెలవు దాదాపు అయిపోయింది. ఇప్పుడు అతని చేయి కూడా బాగుపడింది. దాన్ని చాలా తేలికగా ఎత్తగలుగుతున్నాడు,మోచేయి దగ్గర ఎటువంటి నొప్పి లేదు.
అతను అక్కడ ఉన్న ఆఖరి రోజుల్లో సగం రోజులు గ్రెగరి క్వార్టర్స్ లో వచ్చి కూర్చునేవాడు. అక్సిన్య గోడలను చక్కగా శుభ్రం చేసి,వాటికి సున్నాలు వేసింది. కిటికీలను కడిగి,తుడిచి,నేలను ఇటుక పొడితో శుభ్రంగా రుద్ది తళతళలాడేలా చేసింది. ఆ గదిలో స్త్రీ మాత్రమే తీసుకురాగలిగిన సంతోషం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్న చిన్న పొయ్యి ద్వారా ఆ గది సరిపడినంత వెచ్చగా ఉంది. లూయిటెంట్ తన దుస్తుల్లో బాగుండే నీలం రంగు కోటును భుజాల మీద వేసుకుని, పని వాళ్ళ క్వార్టర్స్ దగ్గరకు, సరిగ్గా గ్రెగరి గుర్రాలశాలలో పనిలో ఉన్నప్పుడే వెళ్ళేవాడు. మొదట అతను వంటగదిలోకి వెళ్ళి వంట మనిషితో హాస్యమాడి,తర్వాత మిగిలిన భాగంలోకి వెళ్ళిపోయేవాడు. పొయ్యి దగ్గర ఉన్న స్టూలు మీద కూర్చుని, తన భుజాలు ముందుకు వంచి,అక్సిన్య వైపు సిగ్గులేకుండా నవ్వుతూ చూసేవాడు. అక్సిన్య అతని సమక్షంలో చాలా ఇబ్బంది పడేది,చేయాల్సిన పని కూడా సరిగ్గా చేయలేకపోయేది.
‘ఇప్పుడు జీవితం ఎలా ఉంది,ప్రియమైన అక్సిన్య?’తన సిగరెట్టు పొగతో గదిని నింపేస్తూ అడిగాడు.
‘బావుంది,ధన్యవాదాలు.’
మౌనంగా తన కళ్ళతో తన కోరికను చెప్పే ఆ లూయిటెంట్ కళ్ళు చూసినప్పుడు అక్సిన్య ముఖం ఎర్రబడేది. సిగ్గు లేకుండా సూటిగా ఉండే ఆ కళ్ళు ఆమెకు కోపం తెప్పించేవి,అవి ఆమెలో ఎటువంటి ఆసక్తిని రేకెత్తించలేకపోయాయి. అతను అడిగే పనికిమాలిన ప్రశ్నలకు పొడిగా సమాధానం చెప్పి ఆ గది నుండి వీలైనంత త్వరగా బయటపడటానికి ప్రయత్నించేది.
‘నేను వెళ్ళి బాతులకు గింజలు వెయ్యాలి.’
‘ఇప్పుడు అంత హడావుడి ఏమి లేదు,నీకు బోలెడు సమయం ఉంది’,నవ్వుతూ అనేవాడు లూయిటెంట్,కాళ్ళు వదులైన పైజామాల్లో నుండి ఆడిస్తూ.
ఆమెను ఆపకుండా గత జీవితం గురించి ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు.కొన్ని సార్లు గంభీరమైన గొంతుతో తండ్రిలా,ఇంకొన్నిసార్లు కొంటెగా అడుగుతూ ఆమెను విసిగిస్తూ ఉండేవాడు.
గ్రెగరి పని పూర్తి చేసుకుని వచ్చాక, లూయిటెంట్ తన చూపులు తిప్పుకుని,గ్రెగరికి ఒక సిగరెట్టు ఇచ్చి బయటకు వచ్చేసేవాడు.
‘వాడు ఇక్కడకు వచ్చి ఎందుకు కూర్చున్నాడు?’ గ్రెగరి అక్సిన్య వైపు చూడకుండా కోపంగా అడిగాడు.
‘నాకు ఎలా తెలుస్తుంది?’బలవంతంగా నవ్వుతూ,లూయిటెంట్ కళ్ళల్లో కోరికను గుర్తు తెచ్చుకుంటూ అంది. ‘ఇలా వచ్చి,కూర్చున్నాడు’,అతని భంగిమను అనుసరిస్తూ చెప్పింది. . ‘నాకు విసుగు వచ్చేవరకు అలాగే ఉంటాడు.ఆ మోకాలు చూస్తుంటే చాలా పదునుగా ఉన్నట్టు అనిపిస్తుంది’, అంది కొనసాగింపుగా.
‘నువ్వు అతని వైపు చూస్తూ ఉన్నావా?’ ముఖం చిట్లిస్తూ గ్రెగరి అడిగాడు.
‘అదేం లేదు!’
‘అయితే,జాగ్రత్తగా ఉండు. వాడి మక్కెలిరగదంతాను తేడా వస్తే.’
అక్సిన్య నవ్వుతూ గ్రెగరి వైపు చూసింది,అతను సరదాగా అన్నాడో లేక నిజంగా అన్నాడో తేల్చుకోలేక.
* * *
అధ్యాయం-15
లెంట్ నాలుగవ వారానికి చలి తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టింది. డాన్ లో ఉన్న మంచు కొద్దిగా కరుగుతూ నీరుగా ప్రవహిస్తూ ఉంది. సాయంత్రాలలో కొండ మీదుగా గాలి వీచేది,సాంప్రదాయం ప్రకారం అది మంచుకి సంకేతమే అయినా, వాస్తవానికి అది నీరుగా మారిపోయే క్రమంలో ఉంది. ఉదయాలలో పట్టే చిన్నపాటి మంచు వల్ల చల్లటి గాలులు వీస్తూ ఉన్నా,మధ్యాహ్న సమయానికి భూమి మామూలుగా మారిపోయి మార్చ్ నెల ఆగమానాన్ని సూచిస్తున్నట్టు ఉంది.
మిరోన్ గ్రెగరివిచ్ నిశ్శబ్దంగా పొలం దున్నడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నాడు. రోజులు గడిచే కొద్ది ఆయన పాకలోనే ఎక్కువ సమయం గడుపుతూ, పాపాటాన్ని బాగు చేస్తూ, హెట్కో సాయంతో గుర్రపు బండికి కావాల్సినవి కూడా తానే సిద్ధం చేస్తూ ఉన్నాడు. లెంట్ నాలుగవ వారంలో గ్రీషా తాతయ్య ఉపవాసం మొదలుపెట్టాడు. ఆయన చర్చి నుంచి ఇంటికి,దాదాపుగా జలుబుతో తిరిగి వచ్చేవాడు.’ఆ ప్రీస్ట్ , నన్ను ఇలా గడ్డ కట్టుకుపోయేలా చేశాడు,ఆ వెధవ.వాడు ఈ సేవను నిర్వహించే పద్ధతి ఏమి బాగోలేదు, గుడ్లు ఉన్న బండిని నడిపినట్టు నడుపుతున్నాడు,దారుణంగా ఉంది’,అని ఇంటికి రాగానే కోడలికి ఫిర్యాదు చేసేవాడు.
‘ఈస్టర్ వారంలో నువ్వు ఉపవాసం ఉండొచ్చు కదా మావయ్యా ? అప్పుడు కాస్త వెచ్చగా ఉంది.’
‘నటాల్యను నా కోసం కొత్త మందమైన సాక్స్ అల్లమని చెప్పు.ఆఖరికి ఎంత పెద్ద తోడేలైనా నాలాగా వట్టి కాళ్ళతో ఉంటే ఇలానే గడ్డ కట్టుకుపోతుంది!’
నటాల్య తన పుట్టింటికి కొంతకాలం ఉండటానికి వచ్చినట్టే ఉంటుంది. ఆమె గ్రెగరి రాక కోసం ఎదురుచూస్తూ ఉంది,వాస్తవాన్ని అంగీకరించడానికి ఆమె సిద్ధంగా లేదు. రాత్రుళ్ళలో తను అనుభవిస్తున్న దానికి కోపం,దుఃఖంతో రగిలిపోయేది. అంతేకాకుండా తెలియకుండా ఆమె మనసులో పేరుకున్న ఓ భయం వల్ల ఆమె ఇంకా తట్టుకోలేని స్థితికి వచ్చింది. పెళ్ళి కాక ముందు తనదైన గదిలో అటూయిటూ అసహనంగా తిరుగుతూ ఉంది. ఆమె పుట్టింటికి వచ్చినప్పటి నుండి మిట్కా ఆమె వైపు అదోలా చూస్తున్నాడు. ఒకరోజు వసారాలో ఆమెకు ఎదురుగా వచ్చి, ‘గ్రీక్షా కోసం విరహంతో తపించిపోతున్నావు కదూ?’అని సూటిగా అడిగాడు.
‘నీకు అదెందుకు?’
‘నేను నిన్ను అతన్ని మర్చిపోయేలా చేయగలను….’
నాటల్య సూటిగా అతని కళ్ళల్లోకి చూసి,అక్కడ ఉన్న భావాన్ని గ్రహించి భయపడిపోయింది. అప్పటికే చీకటి పడ్డప్పటికి ఆ కళ్ళల్లో ఎంతో వింత మెరుపు కనిపిస్తూ ఉంది. ఆమె పక్కనే ఉన్న తాత గదిలోకి వెళ్ళి, గట్టిగా తలుపు వేసి,అక్కడే నిలబడి వేగంగా కొట్టుకుంటున్న తన గుండె చప్పుడు వింది. తర్వాతి రోజు మిట్కా వాకిట్లో ఆమెకు కనిపించాడు. అప్పటికే అతను పశువులకు గడ్డి పెడుతూ ఉన్నాడు,గాలిలో ఎగురుతున్న పురుగులు అతని ముఖం చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అప్పుడు నటాల్య పందుల తొట్టి దగ్గరకు వచ్చిన కుక్కలను తరిమేయడానికి అక్కడకు వచ్చింది.
‘మరి బెట్టు చేయకు,నటాల్య.’
‘నేను నాన్నను పిలుస్తాను!’ ఏడుస్తూనే, అతన్ని హెచ్చరిస్తున్నట్టుగా చేయి పైకి ఎత్తింది.
‘నీకు పిచ్చి పట్టింది!’
‘ఇక్కడ నుంచి పోరా,వెధవా!’
‘దేని గురించి ఇంత గొడవ చేస్తున్నావు?’
‘ఇక్కడ నుంచి పో మిట్కా! లేకపోతే నాన్నతో చెప్తాను! అసలు సొంత చెల్లిని ఆ దృష్టితో ఎలా చూడగలవు?నీకు సిగ్గు లేదా?ఇంకా ఇలాంటి పని చేసిన నిన్ను ఈ భూమి మింగేయకపోవడం దురదృష్టం!’
‘అది అలా జరగదులే.’ మిట్కా తన పిర్రల మీద చేతులు వేసుకుని,తన కాలితో భూమిని గట్టిగా తన్ని ఆ నిజాన్ని ధృవీకరిస్తున్నట్టు అన్నాడు.
‘నా దగ్గరకు రాకు,మిట్కా!’
‘ఇప్పుడు రాను,కానీ రాత్రికి వస్తాను.ఖచ్చితంగా వస్తాను!’
నటాల్య వణుకుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఆమె పెట్టె పక్కన పక్క పరుచుకుని,తన చెల్లిని కూడా తనతో పాటు పడుకోబెట్టుకుంది.
ఆ రాత్రంతా ఆమె నిద్ర పోకుండా,ఏదైనా జరుగుతుందేమోనని జాగురుకతతోనే ఉంది. ఏదైనా శబ్దం,అడుగుల చప్పుడు కోసం చూస్తూ ఉంది,అలా ఏదైనా వినవస్తే వెంటనే అరిచి గొడవ చేయడానికి తనను తాను సిద్ధం చేసుకుంది కూడా. కానీ ఆ నిశ్శబ్ద రాత్రిలో పక్క గదిలో పడుకున్న గ్రీషా తాతయ్య శ్వాస చప్పుడు,నిద్ర మధ్యలో చెల్లెలి శరీరం అప్పుడప్పుడు అటూయిటూ కదులుతున్న ధ్వని తప్ప ఏమి లేదు.
రోజులు దారపుబంతికి చుట్టుకుని ఉన్న దారంలా బంతి నుండి బయటకు వస్తూ, స్త్రీ దుఃఖంతో విషంలా మారిపోతూ ఉన్నట్టు గడచిపోతున్నాయి.
తన పెళ్ళి విషయంలో జరిగిన అవమానం నుండి ఇంకా తేరుకోకుండా ఉన్న మిట్కా ఎప్పుడూ ఆ ద్వేషాన్నే మనసులో నింపుకుని ఉంటున్నాడు. అతను సాయంత్రాలు బయటకు వెళ్ళి ఉదయాలు ఇంటికి వచ్చేవాడు,ఎప్పుడో ఒకసారి ముందే ఇంటికి వచ్చేవాడు. అతను భర్తలు దూరంగా ఉన్న స్త్రీలతో సంబంధం పెట్టుకున్నాడు.అలాగే స్టీఫెన్ తో కలిసి పేకాట ఆడటానికి తరచూ వెళ్ళేవాడు. ఇదంతా మిరోన్ గమనిస్తూనే ఉన్నా,ఆ సమయంలో మౌనంగానే ఉన్నాడు. ఈస్టర్ ముందురోజు నటాల్య మొఖోవ్ షాపుకు వెళ్ళినప్పుడు అక్కడ పాంటెలి తారసపడ్డాడు.ఆయనే ముందు ఆమెను పలకరించాడు.
‘నటాల్య ,ఒక్క నిమిషం ఆగు.’
నటాల్య ఆగి,ఆయన ముఖంలోకి చూసింది. ముందుకు వచ్చినట్టు ఉండే ఆయన ముక్కు ఆమెకు గ్రెగరిని గుర్తుకు తేవడంతో ఆమె దుఃఖం అధికమైంది.
‘ఏమ్మా …నువ్వు ఒకసారి ఇంటికి వచ్చి ఈ ముసలివాళ్ళను చూడొచ్చు కదా?’పాంటెలి ఆ సంభాషణను మొదలుపెటాడు. తానే స్వయంగా ఆమె పట్ల అపరాధం చేసినట్లు ఆయన బాధ పడుతూ ఆమె ముఖంలోకి సూటిగా చూడలేకపోయాడు.
‘మీ అత్తయ్య నిన్ను చూడాలనుకుంటుంది ,నువ్వు ఎలా ఉన్నావో అని బెంగ పెట్టుకుంది.’
నటాల్య కొద్దిగా తేరుకుంది. ‘సరే,ధన్యవాదాలు-‘అంటూ ఆమె ఒక్క నిమిషం ఆగిపోయి,’మావయ్య’ అనాలనుకుని, ‘పాంటెలి ప్రోకోఫోవిచ్’ తో ఆ వాక్యాన్ని ముగించింది.
‘నువ్వు వచ్చి మమ్మల్ని ఎందుకు చూడకూడదు?’
‘పొలంలో చాలా పని ఉంది.’
‘ఆ గ్రీషా గాడు…….’ ఆ వృద్ధుడు కోపంతో తన తలను అడ్డంగా ఊపాడు. ‘వాడు…మా పరువుని గంగలో కలిపేశాడు……అప్పుడే అంతా బావుంది అనుకున్నప్పుడు అలా చేశాడు!’
‘ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం మావయ్యా……..విధి వేరేలా ఉంది!’ ఆమె స్వరంలో బాధ ఉంది.
నటాల్య కళ్ళల్లో నీళ్ళు నిండి ఉండటం చూసిన పాంటెలి ఏం చేయాలో తెలియక తన పాదాలను ముందుకు వెనక్కి అన్నాడు. కన్నీటిని ఆపుకునే ప్రయత్నం చేస్తుంది ఆమె.
‘సరే,వెళ్లొస్తానమ్మా! వాడి గురించి బాధ పడకు,వాడొక పనికిరానివాడు,నీ చేతి చిటికెన వేలు విలువ చేయడు వాడు.వాడు తిరిగి రావచ్చు. వస్తే,వాడికి గడ్డి పెట్టి మామూలుగా చేస్తాను!’
నటాల్య తన తలను కిందకి దించుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. పాంటెలి ఇంకా తన పాదాలను అటుయిటూ కదిలిస్తూనే ఉన్నాడు. నటాల్య మూల వరకు వెళ్ళాక,వెనక్కి తిరిగి చూసింది. పాంటెలి కుంటుతూ కూడలి నుండి ఇంటి వైపుకి వెళ్తూ ఉన్నాడు.
* * *
అధ్యాయం-16
స్టోక్ మాన్ ఇంటి దగ్గర సమావేశాలు క్రమక్రమంగా తగ్గిపోసాగాయి. అప్పటికే వసంత కాలం వచ్చే సమయం అయ్యింది, పొలాల్లో పనులకు గ్రామమంతా సిద్ధమవుతూ ఉంది. మిల్లులో పని వాళ్ళయిన నేవ్,దవ్యడ్క , ఇంజన్ గదిలో పని చేసే అలెక్సేవిచ్ కొట్ల్యారోవ్ మాత్రమే వస్తున్నారు. ఓ గురువారం సాయంత్రం ఈస్టర్ పండుగ ముందు వాళ్ళు వర్క్ షాపులో కలుసుకున్నారు. స్టోక్ మాన్ బెంచీ మీద కూర్చున్నాడు. అతను అర్థ రూబులు వెండి నాణెంతో చేసిన ఓ గుండ్రటి ఆకారానికి తుదిమెరుగులు దిద్దుతున్నాడు. కిటికీ గుండా సూర్యకిరణాలు ఆ గదిలోకి పడుతున్నాయి,దాని వల్ల పచ్చ-గులాబీరంగు దుమ్ముతో కలిసిన లాంటి నీడ నేల మీద పడింది. ఇవాన్ అక్కడ ఉన్న రెంచీలతో ఆడుకుంటున్నాడు.
‘నేను తర్వాతి రోజు యజమానిని పిస్టన్ విషయం మీద కలిశాను. దాన్ని మిల్లెరోవోకు తీసుకువెళ్లాలి. అక్కడే దానిని సరిగ్గా బాగు చేస్తారు. ఇక్కడ మేమేం చేయగలము? దానిలో ఇంత పెద్ద పగుళ్ళు వచ్చాయి.’అక్కడ ఎవరికి ఉపయోగం లేకపోయినా ఇవాన్ తన చిటికిన వేలుతో ఆ పగులు ఎంత ఉందో చూపించే ప్రయత్నం చేశాడు.
‘మిల్లెరోవోలో ఫ్యాక్టరీ ఉంది కదా?’స్టోక్ మాన్,తన చేతులకు అంటుకున్న దుమ్ము దులుపుకుంటూ అడిగాడు.
‘అవును,దానిలో చాలా పెద్ద కొలిమి కూడా ఉన్నది.నేను పోయిన సంవత్సరం అక్కడకు వెళ్ళాను.’
‘పనివాళ్ళు చాలామంది ఉన్నారా?’
‘అబ్బో,బోలెడు మంది. దాదాపుగా నాలుగు వందల మంది.’
‘ఓహో …వాళ్ళు ఎలా ఉన్నారు?’ స్టోక్ మాన్ పని చేస్తూ,మధ్యలో అడుగుతూ ఉండటం వల్ల అతని మాటల మధ్య విరామం వచ్చింది.
‘ఓ , వాళ్ళు చాలా బాగున్నారు. వాళ్ళు శ్రామికులు కాదు……..వాళ్ళు అసలు ….చెత్త.’
‘ఎందుకు?’ స్టోక్ మాన్ పక్కన కూర్చుని, తన మోకాళ్ళ మధ్యలో చేతి వేళ్ళు పెట్టుకుని ఉన్న నేవ్ అడిగాడు.
ఆ నేలమీద పడి ఉన్న దుమ్ము అంతా దవ్యడ్కతల మీదే ఉంది,అతను అక్కడ ఉన్న పనిముట్లను కదిలిస్తూ,పక్కకు ఈడుస్తూ,అవి కిర్రుమంటుంటే నవ్వుతున్నాడు. అదేదో అతనికి ఓ మంచి ఉదయాన చెట్ల కింద నడుస్తూ ఉంటే రాలుతున్న చెట్ల ఆకుల శబ్దంలాను,ఆ వాతావరణం అంత అందమైన దృశ్యంగాను ఉన్నట్టు అతను ఆ గదిలో అటూయిటూ నడుస్తూ అల్లరి చేస్తున్నాడు.
‘ఎందుకంటే ,వాళ్ళు చక్కగా స్థిరపడినవారు. వాళ్ళల్లో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు,పెళ్ళాం, అలాగే వాళ్ళు కోరుకునేవి అన్నీ ఉన్నాయి. అంతే కాకుండా, వాళ్ళల్లో సగం మంది బాప్టిస్టులు. ఆ యజమానే స్వయంగా బోధకుడు,వాళ్ళు ఒకరికొకరు సాయం చేసుకుంటారు ,కానీ వాళ్ళ మీద ఎంత మురికి పట్టిందంటే నువ్వు దేనితోనూ దానిని వదిలించలేవు.’
‘బాప్టిస్టులా? వాళ్ళు ఎవరు,ఇవాన్ అలెక్సేవిచ్?’ దవ్యాడ్క ఆ తెలియని పదం వింటూ ఆగిపోయి అడిగాడు.
‘బాప్టిస్టులా? వాళ్ళు దేవుడిని వారి పద్ధతిలో ఆరాధిస్తారు. అంటే కొద్దిగా పాత విశ్వాసుల్లా అన్నమాట.’
‘ప్రతి వెధవ తన పిచ్చిలో తను బ్రతుకుతాడు’,నేవ్ అందుకున్నాడు.
‘సరే, నేను మొఖోవుని చూడటానికి వెళ్ళాను’, ఇవాన్ తన కథను కొనసాగించాడు. ‘నేను వెళ్ళేసరికి అక్కడ ఆయన నత్తోడు అట్యోపిన్ తో కలిసి కూర్చున్నాడు. నన్ను హాలులో ఉండమన్నాడు. నేను అక్కడే కూర్చుని వేచి చూస్తున్నాను. ఆ తలుపు నుండి వాళ్ళు మాట్లాడుకునేది నాకు వినిపిస్తూనే ఉంది.యజమాని,అట్యోపిన్ కు అంతా చెప్తున్నాడు. అతి త్వరలో జర్మన్లతో యుద్ధం జరగబోతుందని,అది తను ఏదో పుస్తకంలో చదివానని చెప్పాడు. మన ముసలి నత్తోడు ఏమన్నాడో తెలుసా? “నేను నువ్వు చెప్పేదానితో అంగీకరించను, ఈ యుద్ధం విషయంలో.”
ఇవాన్ అట్యోపిన్ ను ఎంత చక్కగా అనుకరించాడంటే దవ్యాడ్క పడిపడి నవ్వాడు,కానీ నేవ్ హేలనాపూరిత చూపును చూసి,మౌనంగా అయిపోయాడు.
‘ “జర్మనీ రష్యాతో యుద్ధం చేయదు ఎందుకంటే వాళ్ళు మన ధాన్యం మీదే ఆధారపడి ఉన్నారు” ‘, ఇవాన్ తను విన్న సంభాషణను చెప్పడం కొనసాగించాడు. ‘అదే సమయంలో ఇంకో గొంతు కూడా వినబడింది. మొదట్లో నేను గుర్తు పట్టలేదు,కానీ తర్వాత అది జనరల్ లిస్ట్ నిట్స్కి కొడుకుదని అర్థమైంది. “జర్మనీకి ఫ్రాన్స్ కు మధ్య ద్రాక్షతోటల గురించి యుద్ధం జరగవచ్చు”,అన్నాడు అతను, “కానీ దానికి మనకి ఏమి సంబంధం లేదు.”
‘నువ్వు ఏమి అంటావు, ఓసిప్ దవ్యోడ్విచ్?’ ఇవాన్ స్టోక్ మాన్ ను అడిగాడు.
‘నేనేమి ప్రవక్తను కాదు’, తను పని చేస్తున్న గుండ్రపువస్తువు వైపు చూస్తూ తప్పించుకునే విధంగా అన్నాడు.
‘వాళ్ళు మొదలుపెడితే, మనల్ని కూడా వదిలిపెట్టరు. మనల్ని జుట్టు పట్టుకుని ఈడ్చి గాల్లోకి ఎగరేస్తారు,మనకు నచ్చినా లేకపోయినా,నేవ్ అన్నాడు.
‘అసలు విషయం ఏమిటంటే ……..’స్టోక్ మాన్ మొదలుపెట్టాడు,నెమ్మదిగా ఇవాన్ చేతులను అక్కడ ఉన్న ఓ పనిముట్టు మీద నుండి తీస్తూ.
అతను గంభీరంగా ఆ సమస్య గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. నేవ్ బెంచీ మీద నుండి జారిపోతున్న కాళ్ళను పైకి లాక్కుని మరింత కులాసాగా కూర్చున్నాడు. దవ్యాడ్క నోరు వెళ్లబెట్టి చూస్తున్నాడు,అతని పళ్ళు బయటకు కనిపిస్తున్నాయి. చాలా క్లుప్తంగా స్టోక్ మాన్ పెట్టుబడిదారీ దేశాలు కాలనీల కోసం,మార్కెట్ కోసం చేసే పెనుగులాట గురించి చెప్పాడు. అతడు పూర్తి చేసే ముందరే ఇవాన్ మధ్యలోనే అడ్డుపడ్డాడు, ‘అసలు దీనికి,మనకు సంబంధం ఏమిటి?’
‘మీ తలలు మీలాంటి ఎన్నో తలలు వాళ్ళు తాగే సారావల్ల నొప్పిని అనుభవిస్తాయి’,స్టోక్ మాన్ చిరునవ్వుతో బదులిచ్చాడు.
‘చిన్న పిల్లాడిలా మాట్లాడకు’, నేవ్ ఇవాన్ ను వెక్కిరించాడు. ‘నీకు పాతకాలపు సామెత తెలుసు కదా, “యజమాని పడితే,పనివాళ్ళకు దెబ్బలు తగులుతాయి.”
‘హా.’ ఇవాన్ ఆలోచిస్తున్నట్టు కనుబొమ్మలు ముడివేస్తూ అన్నాడు.
‘అయినా ఈ లిస్ట్ నిట్స్కి ఎందుకు మొఖోవుల ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు? ఆయన కూతురు కోసమా?’ దవ్యాడ్క అడిగాడు.
‘కోర్షునోవుల కుర్రాడు ఆ పని ఎప్పుడో చేశాడుగా’, నేవ్ పరిహాసంగా నవ్వుతూ అన్నాడు.
‘ఇవాన్ అలెక్సేవిచ్ ఈ మాట విన్నావా? అసలు ఆ కుర్ర ఆఫీసరు అక్కడ ఎందుకు తిరుగుతున్నాడు?’
మోకాళ్ళ మీద కొరడా దెబ్బలు పడ్డట్టు ఇవాన్ మొదలుపెట్టాడు.
‘ఓ,నువ్వు ఏం చెప్పావు?’
‘నువ్వు నిద్ర పోతున్నావు,కదా? మనం లిస్ట్ నిట్స్కి గురించి మాట్లాడుకుంటున్నాము.’
‘అతను స్టేషన్ కు వెళ్ళే దారిలో ఉన్నాడు. హా,ఇక్కడ ఇంకో వార్త కూడా ఉంది. నేను బయటకు వచ్చినప్పుడు ఆ వాకిట్లో ఎవరిని కలిశానో తెలుసా? గ్రీష్కా మెలఖోవుని. అతను అక్కడ చేతిలో కొరడా పట్టుకుని నిలుచుని ఉన్నాడు. “నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు,గ్రెగరి?”నేను అడిగాను, “లూయిటెంట్ లిస్ట్ నిట్స్కి ను మిల్లెరోవోకు తీసుకువెళ్తున్నాను”,అని బదులిచ్చాడు.’
‘అతను వాళ్ళకు గుర్రపు బండ్లు నడిపేవాడిగా పనిచేస్తున్నాడు’, దవ్యాడ్క అన్నాడు.
‘ఆ ధనవంతులు వదిలేసిన ఎంగిలి ఏరుకుంటూ బ్రతుకుతున్నాడు.’
‘నువ్వు గొలుసుతో కట్టేసిన కుక్క లాంటి వాడివి నేవ్, నువ్వు ప్రతి వాడి మీద అరుస్తూనే ఉంటావు.’
ఆ మాటలు ఒక్క నిమిషం పాటు ఆగిపోయాయి. ఇవాన్ వెళ్ళడానికి లేచాడు.
‘ఏంటి సేవ చేయడానికి వెళ్తున్నావా?’ నేవ్ వెటకారంగా అన్నాడు.
‘నేను రోజు సరిపడినంత చేస్తాను.’
స్టోక్ మాన్ తన అతిథులను పంపించి, వర్క్ షాప్ మూసేసి ఇంటికి వెళ్ళాడు.
ఈస్టర్ పండుగ రోజు ఆకాశమంతా నల్లటి మేఘాలు కమ్ముకుని,వర్షపు చినుకులు మొదలయ్యాయి. ఆ గ్రామమంతా చీకటి పరుచుకుంది. ఆ రోజు సాయంత్రం సంధ్య దాటాక, ఒక పెద్ద శబ్దంతో డాన్ లోని మంచు గడ్డ విరిగింది,అందులో మొదటి ప్రవాహం నీళ్ళ బయటకు బలంగా వచ్చింది. ఆ మంచు అంతా ఒకేసారి విరిగి,దాదాపు ఆ గ్రామంలోని , గ్రామంలో ఉన్న చిన్నవాలు ప్రాంతంలో నుండి నాలుగు వెరస్టుల దూరం వరకు ప్రవహించింది ఆ చర్చిలో మొగుతున్న గంటల శబ్దానికి లయబద్ధంగా ఆ మంచు ఇంకా చిన్న చిన్న ముక్కలై, ఒడ్డు దద్దరిల్లేలా చేసింది. ఆ వాలు ప్రాంతం దగ్గర ఎక్కడైతే డాన్ ఎడమ వైపుకి తిరుగుతుందో,అక్కడకు కొనసాగింది. ఆ మంచు పగిలిన శబ్దంతో గ్రామమంతా దద్దరిల్లిపోయింది కాసేపు. ఆ గ్రామంలోని కొందరు కుర్రాళ్ళు చర్చి వాకిలిలో గుమికూడి ఉన్నారు,అప్పటికే కరిగిన నీరు అక్కడ కూడా మడుగులుగా పారింది. లోపల ఒక లయబద్దంగా చేస్తున్న ప్రార్థన మొత్తం ఆ ప్రాంతమంతా వినిపిస్తూ ఉంది. ఆ చర్చి కిటికీలు ఆ పండగ కోసం చక్కగా అలంకరించబడ్డాయి. చీకట్లో,ఆ వాకిట్లో, కుర్రాళ్ళు,అమ్మాయిలతో కలిసి గుసగుసగా మోటు పదాలతో సరసాలాడుతున్నారు.
చర్చి వార్డెన్ ఇల్లు అంతా ఈస్టర్ పండుగ కోసం చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన కోసాక్కులతో నిండిపోయింది. ఆ ప్రయాణపు బడలిక వల్ల కొందరు అక్కడ ఉన్న బెంచీల మీద,ఇంకొందరు కిటికీల దగ్గర,మరికొందరు నేల మీదకు నిద్రకు సోలిపోయారు.
పడిపోవడానికి సిద్ధంగా ఉన్న మెట్ల దగ్గర ఒక బృందం కూర్చుని ఉంది. వాళ్ళు పొగ తాగుతూ, వాతావరణం గురించి,పంటల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు.
‘మీ వాళ్ళు ఎప్పుడు పొలాలకు వెళ్తారు?’
‘వచ్చే సెయింట్ థామస్ రోజు నుండి.’
‘అందుకే మీరు అదృష్టవంతులు. మీది ఇసుక నేల కదా?’
‘అవును,కానీ ఈ వైపుగా అంతా ఉప్పుటేరులు కూడా ఉన్నాయి.’
‘సరే,ఇప్పుడు భూమి చక్కగా దాహం తీర్చుకుంటుంది.’
‘పోయినసారి దున్నే సమయంలో నేల అంతా వేడిగా,ఎండిపోయి,బీడుబారి పొయ్ ఉంది.’
‘దున్యా, ఎక్కడ ఉన్నావు? ‘, ఒక సన్నని,గంభీరమైన గొంతు ఆ మెట్ల కింద నుండి వినిపించింది.
చర్చి వాకిలి ముందు ఉన్న గేటు దగ్గర నుండి ఒక గొంతు గొణుగుతూ, ‘మీకు చక్కగా ఈ చలిలో ఉండటానికి చక్కటి చోటు దొరికింది. ఎందుకు మీరు ….ఇక్కడ నుండి పొండి, కుర్ర కుంకల్లారా. ఇంకెక్కడ చోటు లేదా!’
‘నీకు అక్కడ వెచ్చగా లేదా? అయితే మీ వాకిట్లో ఉండే ఆడ కుక్కను ముద్దెట్టుకో’, వెటకారంగా ఓ గొంతు ఆ చీకట్లో నుండి వినిపించింది.
‘కుక్కా! నువ్వు అక్కడే ఉండు,నిన్ను…’
పరిగెడుతున్న అడుగుల శబ్దం, ఎగురుతున్న గౌన్ల చప్పుడు ఆ గాలిలో కలిసిపోతున్నాయి.
ఆ పై కప్పు నుండి మంచు బిందువులుగా కిందకు జారుతూ ఉంది; మళ్ళీ ఓ చిన్నగా ఓ గొంతు వినవచ్చింది. ‘తర్వాతి రోజు నేను ప్రోఖోర్ నుండి కొంత పొలం కొనుక్కుందామని వెళ్ళాను. పన్నెండు రూబుళ్ళు ఇస్తానన్నా తీసుకోలేదు. అతను ఏది తక్కువ ధరకి చచ్చినా అమ్మడు ఎప్పుడు కూడా!’
ఎత్తైన,అందమైన స్త్రీ,చక్కగా అలంకరించుకుని, తన గౌను నేల మీద ఈడుస్తూ ఉంటే వచ్చే ధ్వని డాన్ వైపు నుండి వచ్చింది.
అర్థరాత్రి సమయంలో,చీకటి పడి ఏమి కనిపించని వాతావరణంలో మిట్కా కోర్షునోవు చర్చికి గుర్రం మీద హడావుడిగా వచ్చాడు. అతను వేగంగా ఆ గుర్రం దిగి,ఎగురుతూ ఉన్న ఆ గుర్రాన్ని గట్టిగా ఒకటి పీకాడు. ఒక్క నిమిషం అక్కడ నుంచి,దాని డెక్కల శబ్దం విన్నాడు, తర్వాత తన బెల్టు సరిచేసుకుని,వాకిట్లోకి నడిచాడు. అక్కడ తన టోపీ తీసేసి,సరిగ్గా దువ్వని తన తలను వంచి ప్రార్థిస్తున్నట్టు వంగి,అడ్డుగా ఉన్న స్త్రీలను పక్కకు తోసి,దారి చేసుకుంటూ వేదిక దగ్గరకు వెళ్ళాడు. మగవాళ్ళు దానికి ఎడమ వైపు ఉంటే,రంగురంగుల సీతాకోకచిలకల్లా స్త్రీలు కుడివైపు ఉన్నారు. మిట్కా తన తండ్రి మొదటి వరసలో ఉండటం గమనించి,ఆయన దేవునికి ప్రార్థన చేయబోతున్న సమయంలో ఆయన దగ్గరకు వెళ్ళి,మోచేతిని పట్టుకుని పక్కకు లాగి,చెవిలో గుసగుసగా, ‘నాన్నా,ఒక్క నిమిషం బయటకు రండి’,అన్నాడు.
మిట్కా ఆ గుంపుల్లో నుండి బయటకు వస్తూ ఉంటే అతని ముక్కు పుటాలు అదురుతూ ఉన్నాయి. వేడి సీసం వాసన, చెమట పట్టిన స్త్రీల శరీరాల వాసన, పెట్టెల్లో ఉండి ఆ పండుగకు బయటకు వచ్చిన బట్టల వాసన, తడిసిన లెదర్ బూట్ల వాసన, కలరా ఉండల వాసన, ఉపవాసంతో ఆకలి కడుపుల వాసన ఆ అదురుతున్న ముక్కు పుటాలను తాకి ఉక్కిరిబిక్కిరి చేశాయి.
బయట వాకిట్లోకి వచ్చాక తన ఛాతిని తండ్రి భుజాలకు ఆనిస్తూ, ‘నటాల్య చచ్చిపోతూ ఉంది!’అన్నాడు.
* * *
అధ్యాయం-17
యెవజినిని మిల్లరోవో స్టేషన్ కు తీసుకువెళ్ళి దింపాక, గ్రెగరి మట్టల ఆదివారం (పామ్ సండే) వరకు ఎస్టేట్ వరకు తిరిగి రాలేదు. మంచు అంతా కరిగిపోయి, రెండు రోజులు వరకు దారి అంతా వెళ్ళడానికి వీలు లేకుండా తయారైంది.
రైల్వే స్టేషన్ నుండి ఇరవై వెరస్టుల దూరంలో ఉక్రెనీయన్లు అధికంగా ఉండే ఓల్కొవి రాగ్ లో ఉన్న చిన్న నది దాటుతూ ఉంటే దాదాపుగా అతని గుర్రం మునిగిపోయింది. అతను ఓల్కొవి రాగ్ కు చేరుకునేసరికి దాదాపు సాయంకాలమైంది. మంచు అంతా కరిగి నీరు పొంగుతూ, అప్పటికే వీధుల్లో నీరు నిండి ఉంది.
ప్రయాణికులు మధ్యలో ఆగి తమ గుర్రాలకు మేత, నీళ్ళు పెట్టే సత్రం అవతలి వైపు ఉంది. రాత్రి అయ్యేసరికి ఇంకా నీటి మట్టం పెరగవచ్చునని భావించిన గ్రెగరి ఆ సమయంలోనే అవతలి వైపుకి దాటాలని అనుకున్నాడు.
అంతకు ముందు రోజు గట్టిగా గడ్డ కట్టి ఉన్న మంచు ఉన్న దారిలోకి గ్రెగరి వచ్చాడు;ఇప్పుడు నదిలో నీరంతా ఒడ్డు దాటి దారుల్లోకి ప్రవహిస్తూ ఉంది. ఎక్కడ అయితే మంచు నీరుగా మారిందో అక్కడ ఉన్న గుర్రపు బండ్ల ముద్రలతో ఉన్నాయి. రొప్పుతూ ఉన్న గుర్రం మీద నుండి ఒక్కసారిగా కిందకు దూకి అక్కడ దాటడానికి అనుకూలంగా ఉందో లేదో పరీక్షించాడు. అతను కళ్ళతోనే ఆ దూరం యాభై అడుగులకు మించి ఉండదని అనుకున్నాడు. అతను మరలా బండి దగ్గరకు వచ్చాడు. ఆ సమయంలో దట్టమైన కోటు ధరించిన ఓ ఉక్రెనియా వ్యక్తి ఆ ఒడ్డు దగ్గరలో ఉన్న తన ఇంటి లోపలి నుండి బయటకు వచ్చాడు.
‘ఇక్కడ దాటడానికి అనువుగా ఉంటుందా?’ గ్రెగరి పగ్గాలు అందుకుంటూ, వేగంగా ప్రవహిస్తూ ఉన్న నీటిని చూస్తూ అడిగాడు.
‘ఆ, చాలా మంది ఉదయం దాటారు.’
‘లోతు ఎక్కువ ఉందా?’
‘ఉండదు కానీ, బండిలోకి నీళ్ళు పోవచ్చు.’
గ్రెగరి వెంటనే పగ్గాలు అందుకుంటూ, కొరడాతో గుర్రాలను వెళ్ళడానికి సిద్ధం చేస్తూ,’పదండి!’ అని గట్టిగా అరుస్తూ, వాటిని కొరడాతో అదిలించాడు. ఆ నీటిని చూస్తేనే ఆ గుర్రాలు అయిష్టంగా, బలవంతంగా కదిలాయి.
‘పదండి!’ అని అరుస్తూ గ్రెగరి తన సీటు మీద నుండి నిలుచుంటూ, మరలా అరిచాడు.
ఎడమ వైపు ఉన్న స్టర్డి(గుర్రం పేరు)తల అటూఇటూ ఊపుతూ అతి కష్టం మీద వెళ్తూ ఉంది. బండికి ఒకవైపు అంతా నీరు నురగలు కడుతూ ఉండటం గ్రెగరి చూశాడు. మొదట గుర్రాల మోకాళ్ళ వరకు వచ్చిన నీరు, తర్వాత వాటి మెడల వరకు వచ్చేసింది. గ్రెగరి వాటిని వెనక్కి తిప్పడానికి ప్రయత్నించినా, అప్పటికే అవి అదుపు తప్పి, భయంతో సకిలిస్తూ, ఈదుతూ ఉన్నాయి. ఆ బండి గుండ్రంగా తిరగడం వల్ల ఆ గుర్రాలు, ప్రవాహానికి ఎదురీదాల్సి వచ్చింది. బండి బరువు పెరిగి వాటిని వెనక్కి లాగేస్తూ ఉంది.
‘హే.. హే… వాటిని ముందికి పోనివ్వు’, అంటూ వెనక నుండి ఉక్రెనియా వాడు అరుస్తూ, ఏదో కారణం వల్ల తన టోపీని ఊపుతూ ఉన్నాడు.
గ్రెగరి ఇంకా గట్టిగా అరుస్తూ, పిచ్చి పట్టిన వాడిలా వాటిని కొరడాతో ముందుకు పోనిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. నీటిలోకి మునిగి పోతూ ఉన్న బండి చుట్టూ నీరు సుడులు తిరుగుతూ ఉంది. హఠాత్తుగా బండికి నీటిలో పైన తేలుతూ ఏదో పెద్ద కుప్ప లాంటిది తగలడం వల్ల అది వెనక్కి తిరగబడింది.గ్రెగరి నీళ్ళలోకి మునిగిపోయాడు, అయినా పగ్గాలు మాత్రం వదలలేదు.అతని కోటు కింద నుండి, నీరు అతన్ని బలంగా లాగేస్తూ, మునిగిపోతూ ఉన్న బండి పక్కకు లాగేయ్యడం అతనికి తెలుస్తూనే ఉంది. అతను పగ్గాలు వదిలేసి, బండి వెనుక ఉన్న లోహపు కడ్డీని అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.అప్పుడే ఆ లోహం అంచు అతని చేతి కొసకు అందింది, అప్పుడే స్టర్డి నీటికి ఎదురీదుతూ అతని మోకాలి మీద గట్టిగా తన్నింది. ఒక్కసారి దిమ్మతిరిగినట్లు అయ్యి,అతను తన చేతులు మార్చి, బండికి ఒకవైపు పట్టుకున్నాడు. అతన్ని గుర్రాల నుండి దూరంగా ఆ ప్రవాహం లాగేస్తూ ఉంటే, అతని చేతి వేళ్లపై ఒత్తిడి పెరిగి, విపరీతమైన బాధ కలిగింది. ఆ చలిలో వణుకుతూ, చేతితో ముందుకు తడుముతూ ఉంటే, స్టర్డి ముఖం అతని చేతికి తగిలింది, అతను దాని ముఖంలోకి చూసినప్పుడు,ఆ గుర్రం అతని కళ్ళల్లోకి భయంతో చూసింది.
చేతిలోని పగ్గాలు పదేపదే జారిపోతూ ఉంటే, వెంటనే అతను మరలా దాన్ని గట్టిగా పట్టుకుంటూ, అలా మూడు నాలుగు సార్లు అయ్యాక, చివరకు అతని కాలు భూమికి తగిలింది.
‘పదండి!’ఓపిక తెచ్చుకుని, అరిచి, వాటిని అదిలిస్తూ ఉంటే, అతని వెనుక ఉన్న గుర్రం అతని పాదాల మీద తన్నింది.
ఆ గుర్రాలు పిచ్చి వేగంతో అతన్ని తొక్కుకుంటూనే, ఆ బండిని నీళ్ళలో నుండి బయటకు లాగాయి. బయటకు వచ్చాక కొన్ని అడుగులు ముందుకు వెళ్ళి, తడిసిన శరీరాలతో నిలబడి సేదతీరుతూ ఉన్నాయి. నొప్పితో ఒడ్డుకి వచ్చిన గ్రెగరికి చలి తనను కోసేస్తున్నట్టు అనిపించింది. అతను గుర్రాల కన్నా ఎక్కువగా వణికిపోతూ, పసిపాపలా బలహీనమైపోయినట్టు ఉన్నాడు. మరలా బలాన్ని పుంజుకుని, మరలా బండిని సరిగా ఉందో లేదో చూసుకుని,గుర్రాల తడి ఆరేవరకు ఆగి, వీధిలోకి పోనించాడు. అక్కడ తెరిచి ఉన్న మొదటి ద్వారం గుండా లోపలికి వెళ్ళాడు.
అదృష్టవశాత్తు అతనికి చక్కటి ఆతిధ్యమిచ్చే వ్యక్తి అవ్వడం వల్ల, ఆ యజమాని స్వయంగా గుర్రాలను అతని కొడుక్కి అప్పగించి, గ్రెగరి బట్టలు మార్చుకోవడానికి స్వయంగా సాయం చేసి, భార్య మీద అరిచి,ఆమెతో వాదించి పొయ్యి వెలిగించేలా చేశాడు. గ్రెగరి ఆ యజమాని బట్టలు వేసుకుని,ఆ పొయ్యి దగ్గర చలి కాచుకుని,తన బట్టలు పొడిగా అయ్యాక వాటిలోకి మారి, వేడి క్యాబేజి సూపు తాగి, ఆ రాత్రి అక్కడే పడుకున్నాడు. పూర్తిగా తెలవారకముందే అతను తర్వాత రోజు బయలుదేరాడు.
అతను వెళ్ళాల్సిన దూరం నూట ముప్పై ఐదు వెరస్టులు ఉంది, అతనికి ప్రతి నిమిషం విలువైందే. వరదలు వచ్చే ఆ కాలంలో దారిలో ఉన్న నదులు వేటి వల్ల అయినా ప్రయాణం కష్టతరం కావొచ్చు. అంతా ఉదయం మంచుతో కప్పబడి ఉంది, ఆ దారి గుర్రాలకు కష్టంగానే ఉంది.ఉక్రెనియులు ఉండే ప్రాంతానికి నాలుగు వెరస్టుల దూరంలో ఆగి, విశ్రాంతి తీసుకున్నాడు.ఆ గుర్రాలు బండిని లాగలేకపోతున్నాయి, వాటికి ఓపిక లేదని అతనికి అర్థమైంది. ఆ బండిని ఆ కూడలి వద్ద ఉంచేసి, ఒక గుర్రం మీద తాను ఎక్కి,పక్కన గుర్రాన్ని కూడా కొరడాతో అదిలిస్తూ ప్రయాణం కొనసాగించాడు. మట్టల ఆదివారం ఉదయానికి అతను యాగ్డోనోయ్ కు చేరుకున్నాడు.
వృద్ధ జనరల్ గ్రెగరి ఆ మొత్తం ప్రయాణం గురించి చెప్పిన ప్రతి వివరం విని, గుర్రాలను చూడటానికి వెళ్ళాడు. సాష్కా అలసిపోయి ఉన్న వాటిని గుర్రపు శాల వైపు నడిపిస్తూ ఉన్నాడు.
‘గుర్రాలు ఎలా ఉన్నాయి?’
‘నువ్వు ఏమనుకుంటున్నావు?’ సాష్కా తల ఊపుతూ, విసుక్కుంటూ, గొణుక్కుంటూ వాటిని లోపలికి నడిపించాడు.
‘అవి పనికిరాకుండా పోతాయా?’
‘అదేం లేదు. పెద్ద గుర్రానికి ఛాతి దగ్గర చిన్న గాయమైంది అంతే. పెద్దగా ఏం గాయాలు లేవు.’
‘పోయి, నిద్ర పో’, లిస్ట్ నిట్స్కి, దూరంగా నిలబడి యజమాని సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్న గ్రెగరితో అన్నాడు.
గ్రెగరి తన క్వార్టర్స్ కి వెళ్ళిపోయాడు. కానీ అతనికి ఆ ఒక్క రాత్రే విశ్రాంతి లభించింది. తర్వాతి ఉదయం నీలం రంగు దుస్తులతో, పెదవులపై చిరునవ్వుతో, వెనియమిన్ ప్రత్యక్షమయ్యాడు.
‘గ్రెగరి, యజమాని నిన్ను ఒక్కసారిగా చూడాలనుకుంటున్నారు!’
జనరల్ డ్రాయింగ్ రూములో పచార్లు చేస్తూ ఉన్నాడు. గ్రెగరి తలుపు దగ్గర నిలబడి, చిన్నగా రెండు సార్లు దగ్గాడు. జనరల్ అతని వైపు చూశాడు.
‘ఏం కావాలి నీకు?’
‘వెనియమిన్, మీరు నన్ను చూడాలన్నారని చెప్పాడు.’
‘హా, అవును. వెళ్ళి త్వరగా నీ గుర్రాన్ని, స్టర్డిని సిద్ధం చేయి. లుకేరియాకు వేట కుక్కలకు ఆహరం పెట్టవద్దని చెప్పు. మనం వేటకు వెళ్తున్నాము!’
గ్రెగరి వెనక్కి తిరిగి వెళ్తూ ఉంటే, జనరల్ మరలా అరిచాడు.’నీకు నేను చెప్పింది వినిపించిందా? నువ్వు కూడా నాతో పాటు వస్తున్నావు.’
ఆక్సిన్య ఒక పెద్ద బన్ను గ్రెగరి జేబులో వేస్తూ, అసహనంగా గొణిగింది. ‘నీకు ఆ ముసలి దయ్యం కనీసం తినడానికి కూడా సమయం ఇవ్వడం లేదు…. నీ చేత గొడ్డు చాకిరి చేయించుకుంటున్నారు.కనీసం తల పైన స్కార్ఫ్ అయినా వేసుకో, గ్రీషా.’
గ్రెగరి గుర్రాలను కంచె వద్దకు తీసుకువెళ్ళి, వేట కుక్కలను కూడా వదిలేసాడు.జనరల్ ముదురు నీలం రంగు వెయిస్ట్ కోటు వేసుకుని, దానిపై ఎంతో ఖరీదైన బెల్టును ధరించాడు.పైన గట్టి మూతతో ఉన్న ఫ్లాస్కు ఆయన భుజాల మీదుగా తగిలించి ఉంటే;కొరడా ఆయన బెల్టు నుండి కొరడా వేలాడుతూ, వెనుక తరుముతున్న పాములా ఉంది.
తన గుర్రాన్ని ఎక్కి గ్రెగరి, ఆ వృద్ధుడు ఎంతో ఉత్సాహంతో తేలికగా గుర్రం మీదకు తన సన్నటి శరీరంతో పైకి ఎక్కడం అబ్బురపడుతూ చూశాడు.
‘నా వెనుక రా’, లిస్ట్ నిట్స్కి అతన్ని ఆజ్ఞాపిస్తూనే, తన చేతిలోకి పగ్గాలు అందుకున్నాడు.
గ్రెగరి నడుపుతున్న నాలుగేళ్ళ వయసున్న గుర్రం వెనుక కాళ్ళ మీద పైకి లేచి, తల ఊపుతూ ముందుకు దౌడు తీసింది.దాని వెనుక డెక్కలకు బూట్లు వేసి ఉండకపోవడం వల్ల, మంచు మీద అది చలి భరించలేక ముందుకు వేగంగా కదిలింది. వృద్ధ జనరల్ స్టర్డి (గుర్రం పేరు) మీద కూర్చుని, లాఘవంగా దాన్ని నడుపుతున్నాడు.
‘మనం ఎక్కడికి వెళ్తున్నాము?’ గ్రెగరి గుర్రాన్ని సంభాలిస్తూ అడిగాడు.
‘ఓల్ షాన్ స్కీ లోయకు’, జనరల్ గంభీరస్వరంతో అన్నాడు.
గుర్రాలు మంచి వేగంతో పరిగెడుతున్నాయి.గ్రెగరి గుర్రం జనరల్ గుర్రంతో పోటీ పడి ముందుకు దౌడు తీస్తోంది.దాని చిన్న మెడను హంసలా వంపు వచ్చేలా వంచి, తన వేగాన్ని స్థిరంగా నిలుపుకుంటూ ముందుకు సాగింది. వాళ్ళు ఓ ఏటవాలు మార్గం దగ్గరకు వచ్చారు. జనరల్ స్టర్డి వేగాన్ని తగ్గించి మెల్లగా నడపసాగాడు.
వేటకుక్కలు గ్రెగరికి కొద్దిగా వెనుకగా పరిగెత్తుతూ వస్తూ ఉన్నాయి. పెద్ద ఆడ నల్ల కుక్క పరిగెడుతూ గుర్రం తోక చివరను తాకుతూ ఉంది. ఆ గుర్రం దాన్ని మధ్యలో ఓ సారి ఆగినప్పుడు తన్నే ప్రయత్నం చేసినా, ఆ కుక్క తెలివిగా దాని ఉద్దేశ్యం అర్ధం చేసుకుని తప్పించుకుని, గ్రెగరి కళ్ళల్లోకి చూసింది.
వారు తమ గమ్యానికి అరగంటలో చేరుకున్నారు. జనరల్ తన గుర్రాన్ని పిచ్చి మొక్కలు బాగా పెరిగిపోయి ఉన్న లోయ మార్గంలో తీసుకువెళ్తూ ఉంటే, గ్రెగరి అతన్ని పక్కనే వెళ్తూ, కింద తడిగా ఉందేమో అని జాగ్రత్తగా చూస్తూ వెళ్తున్నాడు.మధ్యమధ్యలో అప్పుడప్పుడు తన యజమాని వైపు చూస్తూ ఉన్నాడు. ఎత్తుగా పెరిగిన చెట్టు దగ్గర ఆయన నీడ ఎంతో పొడుగ్గా కనిపిస్తూ ఉంది. మధ్యమధ్యలో ఆయన గుర్రాన్ని కొరడాతో అదిలిస్తూ ఉంటే, ఆయన కోటు పొట్ట కింద అటూ ఇటూ కదులుతూ ఉంది. వేటకుక్కలు వారిని అనుసరిస్తూ గుంపుగా వస్తూ ఉన్నాయి.గ్రెగరి మధ్యలో ఎదురైన సరస్సును చూసి గుర్రాన్ని నెమ్మదిగా నడిపించసాగాడు.
‘అబ్బా!ఇప్పుడు ఒక సిగరెట్టు వెలిగించుకుంటే, భలే ఉంటుంది.నా పొగాకు సంచి వెతికి, సిగరెట్టు చుట్టే లోపు, నేను పగ్గాలు వదిలేస్తాను, ఏం కాదులే”, అని అనుకుంటూ, సంచిలో వెతుకుదామని అనుకున్నాడు గ్రెగరి.
‘దాన్ని వదలకు’, వెనుక నుండి జనరల్ కేక శిఖరం నుండి తుపాకి పేలిన చప్పుడులా మార్మోగింది.
గ్రెగరి తల ఎత్తి పైకి చూసేసరికి, జనరల్ ఎత్తుగా శిఖరంలా ఉన్న దారిలో, తన కొరడాను గాల్లో విసురుతూ, గుర్రాన్ని వేగంగా స్వారీ చేస్తూ వస్తూ ఉన్నాడు.
‘దాన్ని వెంబడించు!’
దుమ్ముతో బూడిద రంగులో ఉన్న ఓ తోడేలు, తడిగా, జారిపోయేలా ఉన్న ఆ ప్రాంతంలో సమీపంలో లోయ కింద భాగంలో ఉన్న రెల్ల పొదలవైపుకి వేగంగా పరిగెత్తుతూ ఉంది. అది ఒక్క గెంతు గెంతి, ఒక్క సారిగా ఆగి, వెనక్కి వేగంగా తిరిగి, అడవికుక్కల గుంపును చూసింది. ఆ గుంపు అంతా విడిపోయి ఒక్కో దిక్కు నుండి లోయ చివర నుండి,అడవి వరకు దూసుకు వస్తూ, దాన్ని వెంబడిస్తూ ఉన్నాయి.
వెంటనే ఆ తోడేలు పక్కనే ఉన్న దిబ్బ పైకి ఎలుక బొర్రె మీదగా దూకి, అడవి వైపుకి పరుగు పెట్టింది. ముసలి ఆడ కుక్క వేగంగా దాని వెనుక పడుతూ ఉంది. పొడుగ్గా, బూడిద రంగులో ఉన్న హాక్ అని పిలవబడే కుక్క, ఆ మొత్తం గుంపులోనే మేలు జాతిది. అది అన్నిటికన్నా వెనుక నుండి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంది.
ఆ తోడేలు ఒక్క నిమిషం ఏదో సంశయంతో ఆగిపోయింది. గ్రెగరి గుర్రం మీద స్వారీ చేస్తూ, లోయ దాటి వచ్చేసరికి, ఒక్క క్షణం అతని దృష్టి దాటి పోయింది ఆ తోడేలు.అతను కాస్త ముందుకు వచ్చేసరికి, ఆ తోడేలు ఏదో మసక నీడలా కనిపిస్తూ ఉంటే,కుక్కలు పచ్చిక మైదానంలో పరిగెడుతూ ఉన్నాయి. ఆ పక్కన ఎడమ వైపున లిస్ట్ నిట్స్కి ఒడ్డు వైపుకి స్వారీ చేస్తూ, స్టర్డిని కొరడాతో గట్టిగా అదిలిస్తూ వెళ్తున్నాడు. ఆ తోడేలు పక్కనే ఉన్న ఇంకో లోయ వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నా, అప్పటికే దాదాపుగా కుక్కలు దానికి సమీపంగా వచ్చేసాయి. గ్రెగరి ఉన్న చోటు నుండి ఒక చిన్న గీతలా కనిపిస్తూ ఉన్న హాక్ అప్పటికే ఆ తోడేలు కాలును పట్టుకుంది.
‘దాన్ని వెంబడించు!’ గ్రెగరికి ఆ అరుపు మరలా వినబడింది.
అతను తన గుర్రాన్ని గట్టిగా అదిలించి, ముందు జరుగుతున్న దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.అతని కళ్ళు మసగ్గా ఉంటే, గాలి రొదకు అతని చెవులకు ఏ శబ్దం వినిపించడం లేదు.ఆ వేట వాతావరణ ఉన్మాదంతో అతను గుర్రం మెడ విరిగేలా గట్టిగా కొరడాతో అదిలించి, పిచ్చిగా ముందుకు దౌడు తీసాడు. అతను ఆ లోయకు చేరేసరికి తోడేలు కానీ కుక్కలు కానీ ఏవి కనిపించలేదు. ఒక నిమిషం తర్వాత లిస్ట్ నిట్స్కి అక్కడకు వచ్చాడు. తన గుర్రం పగ్గాలు అందుకుంటూ,’అది ఎక్కడికి పోయింది?’ అని గట్టిగా అరిచాడు.
‘ నా లెక్క ప్రకారం, లోయలోకి వెళ్ళి ఉంటుంది.’
‘నువ్వు ఎడమ వైపుకి వెళ్ళు!… వెళ్ళు అటు!.. ‘
అలా చెప్తూనే లిస్ట్ నిట్స్కి కుడి వైపుకి గుర్రం మీద దౌడు తీసాడు. ఏటవాలు దారిలో మెల్లగా వెళ్ళి, అక్కడి నుండి వేగంగా గుర్రాన్ని నడిపించాడు గ్రెగరి. ఒక వెరస్టున్నర అతను చెమటతో రొప్పుతున్న గుర్రం మీద నోటికి, కొరడాకు పని చెప్తూ ముందుకు సాగిపోయాడు.
మెత్తగా, తడిగా కొద్దిపాటి నీరు కూడా ఉండటం వల్ల నేలను దాని డెక్కలు తగిలినప్పుడల్లా, నీరు పైకి చింది, గ్రెగరి పైకి చిందుతూ ఉన్నాయి.ఆ పెద్ద లోయ కొండ చివరకు వచ్చేసరికి, కుడి వైపుకి మళ్ళి, మూడు చిన్న ఇరుకు లోయలుగా చీలిపోయింది. గ్రెగరి మొదటి దాన్ని దాటి, ఏటవాలుగా ఉన్న మార్గంలోకి వెళ్తూ ఉంటే, అతనికి అక్కడ ఉన్న పచ్చికలో ఆ తోడేలును ఆ కుక్కలా గుంపు వెంబడించడం కనిపించింది.
‘ ఓక్, ఆల్డర్ చెట్లతో దట్టంగా ఉన్న ఆ లోయ మధ్యలో నుండి అవి ఇటువైపుకి వచ్చి ఉంటాయి’అని గ్రెగరి అనుకున్నాడు. ఆ ఏటవాలు దారి నుండి ముందు ప్రాంతానికి వచ్చిన ఆ తోడేలు ఓ వంద అడుగులు వాటి కన్నా ముందే ఉండి, ఈ సారి దట్టమైన పొదలతో ఉన్న ప్రాంతానికి పరుగులు తీస్తూ ఉంది.
కళ్ళ నుండి కారుతున్న కన్నీరును తుడుచుకుంటూ, గ్రెగరి గుర్రం మీద నుండి పైకి లేచి, ఆ తోడేలును చూస్తూ ఉన్నాడు. ఎడమ వైపుకి తిరిగి చూడగానే అవి తన ఇంటికి సంబంధించిన పొలాలు అక్కడే ఉన్నాయని స్ఫురణకు వచ్చింది. ఏ పచ్చిక బీడు భాగంలో అయితే అతను, నటాల్య వసంతకాలంలో కలిసి దున్నారో, అది ఇప్పుడు కూడా దున్నే ఉంది.అతను కావాలనే ఆ దున్నిన భూమి దగ్గరకు వెళ్ళాడు, గుర్రం కాస్త ముందుకు వెళ్ళి ఆగింది.అక్కడకు వెళ్ళేసరికి అతనిలో ఉన్న ఉత్సాహం చచ్చిపోయింది. అతను రొప్పుతూ ఉన్న గుర్రం మీద ఇంకా ముందుకు వెళ్తూ, జనరల్ సమీపంలో ఉన్నాడేమోనని చూస్తూ, మెల్లగా స్వారీ చేయసాగాడు.
దూరంలో ఎర్రలోయ దగ్గర, పొలంలో దున్నే వాళ్ళ కోసం ఉన్న పాక ఖాళీగా ఉండటం అతనికి కనిపించింది.ఆరు ఎద్దులు ఓ నాగలిని లాగుతూ ఉన్నాయి. ‘అవి మా ఊరివే అయ్యి ఉంటాయి. ఎవరి భూమి ఇది? అనికేదా?’గ్రెగరి అటువైపే చూస్తూ, ఆ ఎద్దులను, వాటి వెనుక ఉన్న వ్యక్తిని గుర్తించే ప్రయత్నం చేశాడు.
‘దాన్ని పట్టుకోండి!’
గ్రెగరి చూస్తూ ఉండగానే ఇద్దరు కొసాక్కులు వాళ్ళ నాగళ్ళు వదిలి, లోయ వైపుకి వెళ్తున్న ఆ తోడేలు వెంటపడ్డారు.
వారిలో పొడుగ్గా ఉండి, కొసాక్కులు ధరించే ఎర్ర టోపీని పెట్టుకున్న వ్యక్తి, ఆ నాగలిచక్రం మధ్యలో ఉన్న చిన్న ఇనుప కమ్మీని తీసి, దానిని గాలిలో ఊపుతూ వెళ్తున్నాడు.అయితే అప్పుడే ఊహించని విధంగా, ఆ తోడేలు ఆగి లోతుగా ఉన్న ఒక బొర్రలో కూర్చుంది. వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్న కుక్క సరాసరి వచ్చి ముందుకాళ్ళతో ఆ తోడేలు మీద పడింది. దాని వెనుకే ఉన్న ముసలి ఆడ కుక్క ఆ ఇసుకలో జారి పడబోయి, నిలదొక్కుకోబోయి అది తోడేలు తల దగ్గర పడింది. ఆ తోడేలు గట్టిగా తలతో అదిలించేసరికి అది గిరికి తిరిగి పక్కన పడింది. అప్పటికే కుక్కలన్నీ చుట్టుముట్టడంతో ఆ తోడేలు ఒక నల్ల బంతిలా దొర్లింది. జనరల్ కన్నా కొన్ని అడుగులు ముందు ఉన్న గ్రెగరి, జీను మీద నుండి కిందకు దూకి, తన కత్తిని బయటకు తీసాడు.
‘అక్కడే! కింద! గొంతు కింద కత్తి దించు!’ఇనుప కమ్మీ ఊపిన కొసాక్కు రొప్పుతూ అరిచాడు, అది గ్రెగరికి పరిచతమైనదిలా అనిపించింది.అతను గ్రెగరి పక్కన కూలబడి, తోడేలు పొట్ట దగ్గర పట్టుకున్న కుక్కను మెడ దగ్గర పట్టుకుని, పక్కకు పడేసి, ఆ తోడేలు పాదాలను తన పెద్ద చేతులతో పట్టుకున్నాడు. గ్రెగరి దాని స్వరపేటికను తడిమి, అక్కడ కత్తి దింపాడు.
‘కుక్కలు జాగ్రత్త! వాటిని దూరంగా ఉంచు!’గుర్రం మీద నుండి కిందకు దిగుతూ, నీలంలోకి మారిన ముఖంతో జనరల్ అరిచాడు.
కష్టం మీద వాటిని దూరంగా తరిమి గ్రెగరి జనరల్ వైపు చూశాడు.
ఎర్ర టోపిని ధరించిన స్టీఫెన్ అష్టకోవ్, కొద్ది దూరంలో నిలబడి, తన చేతిలో ఉన్న ఇనుప కమ్మీతో ఆడుతూ ఉన్నాడు.అతని కింద దవడ, కనుబొమ్మలు విచిత్రంగా ఉన్నట్టు గ్రెగరికి అనిపించింది.
‘ఓ కుర్రవాడా, ఎక్కడి నుండి?ఏ గ్రామం?’లిస్ట్ నిట్స్కి అతన్ని అడిగాడు.
‘టాటర్ స్కై’, స్టీఫెన్ కొద్ది విరామం తర్వాత జవాబు చెప్పి గ్రెగరి వైపు అడుగు వేసాడు.
‘ఏం పేరు?’
‘అష్టకోవ్.’
‘అయితే నా మాట విను. నువ్వు ఎప్పుడు ఇంటికి వెళ్తున్నావు?’
‘ఈ రాత్రికి.’
‘అయితే ఈ తోడేలును తీసుకుని రా’,జనరల్ తన కాళ్ళ దగ్గర చావు బాధతో పళ్ళు బయట పెట్టి, వెనుక కాళ్ళ మీద నిలబడిన తోడేలు వైపు చూస్తూ అన్నాడు.’దానికి ఎంతైనా నేను ఇస్తాను’, మాట ఇస్తున్నట్టు అంటూ, ఎర్రబడిన తన ముఖాన్ని స్కార్ఫ్ తో తుడుచుకుంటూ, పక్కకు నడిచి, తన భుజానికి ఉన్న ఫ్లాస్కును తీసాడు.
గ్రెగరి వెనక్కి తన గుర్రం దగ్గరకు వెళ్ళాడు. అతను గుర్రం మీదకు ఎక్కుతూ చుట్టూ చూశాడు. వణుకుతూ, స్టీఫెన్ అతని వైపు నడుస్తూ ఉన్నాడు, అతని పిడికిలి బిగసుకుని ఉంది.
* * *
అధ్యాయం-18
గుడ్ ఫ్రైడే రోజు రాత్రి కోర్షునోవుల పొరుగున ఉండే పెలాజియా మైదాన్నికోవ ఇంట్లో స్త్రీలందరూ సమావేశామయ్యారు. ఆమె భర్త,గవ్రిలా,ఆమెకు లాడ్జ్ నుండి తను ఈస్టర్ పండుగకు ఇంటికి వస్తున్నట్టు రాశాడు.పెలాజియా ఇంట్లో గోడలకు సున్నాలు వేసి, సోమవారం నాటికి ఇల్లంతా శుభ్రం చేసింది. గురువారం నుండే ఆమె భర్త కోసం ఎదురుచూస్తూ ఉంది. తల మీద ఏమి కప్పుకోకుండా ఆ ఇంటి కంచె దగ్గర, ఒంటరిగా నిలబడి,గర్భం వల్ల ఉన్న నీరసంతో ఉన్నా,ఆతురతతో వీధిలోకి అతను వస్తున్నాడేమోనని చూస్తూ ఉండేది. ఆమెకు త్వరలోనే ఒక బిడ్డ పుట్టబోతుంది,అది పవిత్రంగానే. అంతకుముందు వేసవి కాలంలో గవ్రిలా రెజిమెంట్ నుండి సెలవులకు ఇంటికి వచ్చాడు,తనతో పాటు ఆమె బట్టలు కుట్టించుకోవడానికి చక్కటి కాటన్ గుడ్డ కూడా తెచ్చాడు . అతను చాలా తక్కువ రోజులు ఉన్నాడు. ఆమెతో కేవలం నాలుగు రాత్రులు గడిపాడు. ఐదవ రాత్రి బాగా తాగి, పోలాండ్ ను,జర్మనీని బండబూతులు తిట్టాడు. ఆ తర్వాత చెక్కిళ్ళ మీద కన్నీళ్ళు కారుతూ ఉండగా కోసాక్కులు పాడే 1831 నాటి పోలాండ్ పాట అందుకున్నాడు. అతని స్నేహితులు,బంధువులు ఎవరైతే అతన్ని చూడటానికి వచ్చారో వారు కూడా అతనితో ఆ బల్ల వద్దే ఉన్నారు. వాళ్ళంతా రాత్రి భోజనానికి ముందు కడుపు నిండా వోడ్కా తాగి, తాము కూడా ఆ పాటను అందుకున్నారు.
వాళ్ళు పోలాండ్ చాలా ధనిక దేశమని చెప్పారు,
కానీ అది ఒక బికారి దేశమని మేము తెలుసుకున్నాము.
వాళ్ళు పోలాండ్ లో ఒక సత్రం ఉందని చెప్పారు ,
ఆ సత్రం,పోలాండ్ రాజుదని కూడా చెప్పారు.
అక్కడ ముగ్గురు మందు కొడుతున్నారు,
ఒకడు ప్రష్యన్,ఇంకొకడు పోలాండ్ వాడు, మరొకడు కోసాక్కు.
ప్రష్యన్ వోడ్కా తాగి దానికి సరిపడా ధర చెల్లించాడు.
పోలాండ్ వాడు తాగి, ధర కన్నా ఎక్కువ ఇచ్చాడు.
కోసాక్కు తాగాడు-ఆ సత్రం ఇదివరకటిలా పేదగా మారిపోయింది.
ఆ సత్రం చుట్టూ కోసాక్కు తిరుగుతూ ఉన్నాడు,
అక్కడ పని చేసే అమ్మాయి అతని దుష్టి తనపై ఉందని గమనించింది.
‘ఓ అమ్మాయి,వచ్చి నాతో ఉండు,
ప్రశాంతమైన డాన్ దగ్గరకు నాతో వచ్చి ఉండు,
డాన్ ప్రజలు మీలా బ్రతకరు ,
వాళ్ళు ఏ పని చేయరు,
విత్తనాలు చల్లరు ,నాట్లు వేయరు,కానీ ప్రతి రోజు ఆడంబరంగా ఉంటారు.’
రాత్రి భోజనాల తర్వాత గవ్రిల తన కుటుంబానికి వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయాడు, అప్పటి నుండి పెలాజియా పెరుగుతున్న తన కడుపు మీద ఒక కన్నేసి ఉంచింది.
తన గర్భం గురించి ఆమె నటల్యాకు ఈ కింది విధంగా వివరించింది:
‘గవ్రిలా ఇంటికి రాకముందు,నాకొక కల వచ్చింది. ఆ కలలో నేను ఒక పచ్చికలో నడుస్తూ ఉంటే,నా ముందు మేము పోయిన వేసవిలో అమ్మేసిన ఆవు ఎదురుగా నిలబడి ఉంది. అక్కడ అది నడుస్తూ ఉంటే దాని పొదుగు నుండి పాలు కారుతూ నేల మీద పడుతూ ఉన్నాయి. దేవుడా! అలా ఎలా పాలు వాటికవే వచ్చేస్తున్నాయి?అని నాలో నేనే అనుకున్నాను. ఆ తర్వాత డ్రోజ్ డికా అవ్వ మా ఇంటికి ఏదో పని మీద వస్తే ఈ కల గురించి చెప్పాను. అప్పుడే ఆమె ఒక మైనం ముక్కను పశువుల పాకకు తీసుకువెళ్ళు, ఒక కొవ్వొత్తిని విరిస్తే అదే వస్తుంది,దానిని ఒక ముద్దలా చేసి, ఆవు పేడలో పెట్టి,దాన్ని ఎక్కడో ఒక చోట పాతిపెట్టమని చెప్పింది. ఎందుకంటే ఏదో సమస్య త్వరలోనే రాబోతుంది అంది. సరే అని,కొవ్వొత్తి కోసం అంతా వెతికినా నాకు ఎక్కడా దొరకలేదు. ఇంట్లో ఒకటి ఉండాలి కానీ పిల్లలెవరో కలుగుల్లో నుండి ఎలుకలను తరిమేయ్యడానికి తీసుకుని ఉంటారననుకుంటున్నాను. అప్పుడే గవ్రిలా ఇంటికి వచ్చాడు,తనతో పాటు సమస్యను తెచ్చాడు.ఇంతకుముందు నా పెట్టికోట్ మూడేళ్ళ వరకు వదులుగానే ఉంది,కానీ ఇప్పుడు చూడు…’ పెలాజియా ఫిర్యాదు చేస్తున్న ధ్వనిలో తన గుండ్రటి పొట్ట వైపు చూపిస్తూ అంది.
భర్తకోసం ఎదురు చూస్తూ పెలాజియాకు ఒంటరిగా ఉన్న భావన కలిగింది,అందుకే ఆ శుక్రవారం రాత్రి తన పొరుగున ఉండే స్త్రీలను ఇంటికి ఆహ్వానించింది.నటల్య తను అల్లుతున్న స్వెట్టర్ తో సహా అక్కడికి వచ్చింది.(చలికాలంలో గ్రీషా తాతయ్య కోసం) ఆమె లేని ఉత్సాహం కొని తెచ్చుకుని,అక్కడ ఉన్న స్త్రీల హాస్యానికి అవసరానికి మించి నవ్వుతూ ఉంది,తన భర్త కోసం పడుతున్న బాధ వారికి తెలియకుండా ఉండాలని. పెలాజియా వెచ్చగా ఉండటం కోసం పొయ్యి కట్ట మీద కూర్చుని, తన కాళ్ళను ఊపుతూ, ఫ్రొస్య గురిచి పరాచికాలాడసాగింది.
‘నీ కోసాక్కును అలా ఎలా బాదావు,ఫ్రొస్య?’
‘ఎలానో నీకు తెలియదా? వెనక,తల మీద ఎక్కడ అందితే అక్కడ చితకబాదాను’
‘అది కాదు,అసలు అదంతా ఎలా మొదలైంది?’
‘ఎలానో మొదలయ్యింది’, సమాధానం చెప్పడం ఇష్టం లేనట్టు నిరాసక్తంగా అంది.
‘ఇంకో స్త్రీతో నీ భర్త పట్టుబడితే నువ్వు ఏం చేస్తావు? మౌనంగా ఉంటావా?’సన్నగా,ఎముకలు కనబడుతూ పొడుగ్గా ఉన్న స్త్రీ, కాషులిన్ వదిన అందుకుంది.
‘ఫ్రొస్య, దాని గురించి చెప్పు.’
‘ఎందుకు చెప్పాలి! అది తప్ప మాట్లాడటానికి నీకు వేరే విషయమే లేదా?’
‘అబ్బా,పర్లేదు.సిగ్గుపడకు,మనందరం స్నేహితులమే కదా.’
పొద్దుతిరుగుడు విత్తనాల పొత్తును నములుతూ ఉన్న ఫ్రొస్య వాటిని ఊసేసింది.
‘నేను అప్పటికే కొంత కాలం నుండి అతన్ని అనుమానిస్తూ ఉన్నాను. అప్పుడే నాకు అతను మిల్లు దగ్గర భర్త దూరంగా ఉన్న స్త్రీతో కలిసి ఉన్నాడని తెలిసింది. తెలియగానే,అక్కడికి వెళ్ళాను,నిజంగానే వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు.’
‘సరే,నటాల్య, నీ భర్త గురించి ఏదైనా వార్త తెలిసిందా?’ కాషులిన్ వదిన మాట మార్చింది.
‘అతను యాగోడ్నోయ్లో ఉన్నాడు’,నటాల్య మెల్లగా బదులిచ్చింది.
‘అతనితో ఇంకా కలిసి ఉండాలనుకోవడం లేదా నువ్వు?’
‘ఆమె అనుకుంటున్నా,అతనికి ఆ ఆసక్తి లేదు’, పెలాజియా మధ్యలో అందుకుంది.
ఆ మాటలతో రక్తం నటాల్య ముఖంలోకి పొంగింది . తన తలను అల్లుతున్న స్వెట్టర్ వైపుకి కిందకి వంచేసి ఒక్క నిమిషం అలానే ఉండి, తర్వాత తల ఎత్తి అక్కడున్న స్త్రీల వైపు చూసింది. అందరూ ఆమె వైపే చూస్తూ ఉండటం గమనించి, తన బాధను ఇక దాచుకోవడం సాధ్యం కాక,ఇక ఏం చేయాలో తెలియక,కంగారుపడుతూ ఉంటే ,వడిలో ఉన్న ఊలు కింద పడిపోయింది, కిందకు వంగి,అది అందుకుంది.
‘వాడిని చక్కగా వదిలించేసుకో,అమ్మాయి. నీకు ఇంకా మంచి వరుడే దొరుకుతాడు’, ఒక స్త్రీ సూచిస్తూ అంది,ఆమె గొంతులో నటాల్య పట్ల జాలి ధ్వనించింది.
తెచ్చిపెట్టుకున్న నటాల్య ఉత్సాహం కాస్త గాలికి ఆరిపోయే మంటలా అయిపోయింది. ఆ తర్వాత అక్కడ ఉన్న స్త్రీలు అప్పుడు గ్రామంలో ఉన్న విషయాల గురించి మాట్లాడుకోసాగారు. నటాల్య ఎలాగో ఆ పొద్దు గూకే వరకు అక్కడే ఆ స్వెట్టర్ అల్లుటూ కూర్చుంది. తర్వాత మనసులో ఏర్పడిన సగం నిర్ణయంతో ఇంటికి వచ్చింది. ఏ పరిస్థితిలో తాను ఉన్నానో తెలియక వచ్చిన సిగ్గు వల్ల (అప్పటికే ఆమె గ్రెగరి తనను శాశ్వతంగా వదిలేయలేదని, ఏదో ఒక రోజు వస్తాడని అతన్ని క్షమించడానికి సిద్ధంగా ఉంది)ఆమె ఏదో ఒకటి చేయాలని నిశ్చయించుకుంది. ఎలా అయినా గ్రెగరికి తన మనసులో ఉన్నది తెలియజేసి,అతని మనసు మారిందేమో తెలుసుకోవాలనుకుంది. ఆమె పెలాజియా ఇంటి నుండి వచ్చేసరికి బాగా చీకటి పడిపోయింది. ఆమె వచ్చేసరికి తాతయ్య తన గదిలో కూర్చుని పాత సువార్త చదువుతూ ఉన్నాడు, అప్పటికే దాని పేజీలు కొవ్వొత్తి మైనంతో అల్లుకుపోయి ఉన్నాయి. ఆమె తండ్రి వంటగదిలో చేపల ఎరను సిద్ధం చేస్తూ,మిఖే చాలా ఏళ్ళ క్రితం జరిగిన హత్య గురించి చెప్తూ ఉంటే వింటూ ఉన్నాడు. అప్పటికే తల్లి పిల్లలను నిద్ర పుచ్చి తాను కూడా నిద్రపోయింది,నల్లగా ఉన్న ఆమె పాదాలు గుమ్మం వైపు ఉన్నాయి. నటాల్య తన చలికోటును తీసేసి,ఇల్లంతా అటూయిటూ తిరిగింది. ముందున్న పెద్ద గదిలో ఎక్కడైతే జనపనార విత్తనాలు చల్లడం కోసం ఉంచారో,అక్కడ ఒక మూల నుండి ఎలుకలు తిరుగుతున్న శబ్దం వినిపించింది.
ఒక్క నిమిషం ఆలోచించుకుని,ఆమె తాతయ్య గదిలోకి వెళ్ళి, బల్ల పక్కన ఓ మూలన నిలబడి,అక్కడ పక్కన అరలో పెట్టి ఉన్న మత సంబంధ పుస్తకాలను చూస్తూ ఉంది.
‘తాతయ్యా,నీ దగ్గర కాగితం ఉందా?’
‘ఎటువంటి కాగితం ? ‘తన కళ్ళద్దాల పైన ముడతలు పడుతూ ఉండగా ఆయన అడిగాడు.
‘రాయడానికి పనికివచ్చేది ఏదైనా సరే.’
ఆ వృద్ధుడు తన సువార్త మొత్తం తిరగేసి,సెయింట్ రోజున వచ్చే తేనె,అగరొత్తుల మిళిత వాసన వస్తున్న ఒక కాగితం ఇచ్చాడు.
‘మరి పెన్సిల్?’
‘వెళ్ళి మీ నాన్నను అడుగు. వెళ్ళమ్మా. ఇక నన్ను విసిగించకు.’
నటాల్య తన తండ్రి గది నుండి ఓ పెన్సిల్ తెచ్చుకుంది. తర్వాత ఒక బల్ల పక్కన కూర్చుని,ఆలోచనలతో కుస్తీ పడుతూ, అప్పటికే ఎప్పటి మనసులో తిరుగుతున్న ఆలోచనలతో సంఘర్షిస్తూ ఉండేసరికి గుండెలో చిన్నపాటి నొప్పి వచ్చినట్టు అనిపించింది ఆమెకు.
తర్వాతి ఉదయానికి హెట్కోకి వోడ్కా ఇప్పిస్తానని మాట ఇచ్చి , ఒక ఉత్తరంతో యాగోడ్నోయ్ కు పంపించింది.
‘గ్రెగరి పాంటెలెవిచ్!
నువ్వే చెప్పు నేను ఎలా బ్రతకాలో,నా జీవితం నాశనం అయ్యిందో లేదో చెప్పు. నువ్వు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయావు. నేను దీనికి నిన్ను ఎప్పటికీ నిందించలేదు,ఎప్పటికైనా నువ్వు తిరిగి వచ్చి నా ఈ బాధను తొలగిస్తావని ఎదురుచూస్తూ ఉన్నాను.కానీ నువ్వు గ్రామం నుండి దూరంగా వెళ్ళి,శ్మశాన నిశ్శబ్దాన్ని పాటిస్తున్నావు.
నా మీద కోపంతో నన్ను వదిలేశావనుకున్నాను,కోపం తగ్గాక వస్తావనుకున్నాను. నేను ఎప్పుడూ మీ ఇద్దరి మధ్యకు రావాలనుకోలేదు. ఈ విషయంలోమనమిద్దరం బాధపడటం కన్నా నేను ఒక్కదాన్నే బాధ పడినా పర్వాలేదనుకున్నాను. ఆఖరిసారిగా దయ చూపి,దీనికి జవాబు రాయి.నాకు ఏ విషయం స్పష్టంగా తెలిస్తే ,నేను ఏదో ఒకటి నిర్ణయించుకోగలను,కానీ ఇప్పుడు ఏది తేలని స్థితిలో ఉన్నాను.
నా మీద కోప్పడకు గ్రీషా.
-నటాల్య.’
తను తాగబోయే వోడ్కా గురించి ఆలోచించుకుంటూ,హెట్కో గుర్రం మీద బయల్దేరాడు. అతనికి కోసాక్కులకు ఉండే గుర్రాలను నడిపే నేర్పు లేదు. అతను వీధిలో వెళ్తూ ఉంటే ఆడుకుంటూ ఉన్న పిల్లలను చూస్తే అతని భృకుటి ముడిపడింది. అతన్ని చూడగానే వాళ్ళు అల్లరిగా అరవసాగారు.
‘అదిగో జుట్టోడు …ఉక్రేనియన్ గాడు!’
‘జుట్టోడు ….జుట్టోడు!’
‘నువు కింద పడిపోతావు.’
‘ఆ కంచె దగ్గర ఉన్న కుక్కను చూడు.’
అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి దాదాపు సాయంత్రమైపోయింది.వస్తూ,తనతో పాటు ఒక చిన్న కాగితాన్ని కూడా తెచ్చాడు. నటాల్య వైపు చిన్నగా కన్ను కొడుతూ,తన జేబులో నుంచి అది తీసి ఆమెకు ఇచ్చాడు. ‘ఆ దారి గతుకులుగా ఉంది చిన్నమ్మాయిగారు!అక్కడకు వెళ్ళేసరికి ఈ హెట్కో ప్రాణం పోయినంత పనయ్యింది!’
ఆ కాగితంలో ఉన్నది చదివేసరికి నటాల్య ,ముఖం పాలిపోయింది. ఏదో పదునైనది ఆమె గుండెలో బాకులా చిన్నగా నాలుగుసార్లు దిగబడినట్లు అనిపించింది.
ఆ కాగితంలో ఉన్న నాలుగు పదాలు: ‘ఒంటరిగా జీవించు. గ్రెగరి మెలఖోవ్.’
ఆమె ఒంట్లో ఉన్న శక్తి అంతా సన్నగిల్లుతుంటే,ఆమె ఎలాగో బలం కూడదీసుకుని తన గదిలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయింది. అప్పుడే ఆమె తల్లి పొయ్యి వెలిగించి వంట మొదలుపెట్టింది, వంట పూర్తైతే ఈస్టర్ కోసం కేకులు చేయడానికి సమయం ఉంటుందని.
‘ఇటు రా నటాల్య! నాకు కొంచెం సాయం చేయి!’ఆమె కూతురిని పిలిచింది.
‘అమ్మా! నాకు తలనొప్పిగా ఉంది,కాసేపు పడుకుంటాను.’
లుకినిచ్న తలుపు సందులో నుంచి చూస్తూ, ‘నువ్వు, పచ్చడి నూనె నోట్లో వేసుకో రాదు? వెంటనే అంతా సరైపోతుంది.’
నటాల్య తన పెదాలను తడి చేసుకుంటూ మౌనంగా ఉండిపోయింది.
ఆమె ఆ సాయంత్రం వరకు తన తల మీదుగా ఒక పట్టు శాలువాను కప్పుకుని,చలికి వణుకుతూ ఉంది.ఆమె తండ్రి,తాతయ్య చర్చికి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటే, ఆమె వంటగదిలోకి వచ్చింది. ముందుకు జుట్టు పడి,ముఖం మీద పట్టిన చెమట బిందువులు ఆమె మెడ కిందకు జారాయ,ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి.
తన పెద్ద కోటు బొత్తాలు పెట్టుకుంటూ, తండ్రి ఆమె వైపు పరీక్షగా చూశాడు.
‘ఈ సమయంలో అనారోగ్యాలు వస్తూ ఉండటం సహజమే అమ్మాయి. మాతో కలిసి ఉదయం సేవకు రా.’
‘నేను తర్వాత వస్తాను నాన్నా.’
‘అంతా అయిపోయాకా?’
‘కాదు.నేను ముందు మంచి బట్టలు వేసుకోవాలి. రెడీ అయ్యాక,బయల్దేరి వస్తాను.’
ఆ ఇంట్లో ఆ ఇద్దరూ ఆడవాళ్ళను వదిలి ఆ మగవాళ్ళు వెళ్ళిపోయారు. నటాల్య మంచం దగ్గర ఉన్న బట్టల పెట్టెలో ఉన్న అనేక బట్టలను అసహనంగా చూస్తూ, తన మదిలో ఏర్పడిన సగం నిర్ణయంతో సతమతమవుతూ,తనలో తాను గొణుక్కుంటూ ఉంది. ఆమె తల్లి ఏ బట్టలు వేసుకోవాలో అర్థం కాక కూతురు అలా ఉందని అనుకుని,ఆమెకు సాయంగా వచ్చింది.
‘నా నీలం గౌను వేసుకో,అమ్మాయి. అది నీకు ఇప్పుడు చాలా బావుంటుంది.’
ఆ ఈస్టర్ పండుగకు నటాల్యకు కొత్త బట్టలేమీ కుట్టించలేదు. పెళ్ళి కాకముందు తనకు బిగుతుగా ఉండే నీలం గౌనును కూతురు ఇష్టపడటం గుర్తు తెచ్చుకుంటూ,కూతురు కొత్త బట్టలు లేకపోవడం వల్ల అలా ఉందని అనుకుంటూ ఆ సూచన చేసింది.
‘నువ్వు అది వేసుకుంటావా?నేను తెస్తాను.’
‘లేదు,నేను ఇది వేసుకుంటాను.’ నటాల్య జాగ్రత్తగా పచ్చ గౌనును బయటకు తీస్తూ, దాన్ని చూస్తూనే ఆమెకు ఒక విషయం గుర్తుకు వచ్చింది. అదే గౌనును గ్రెగరి ఆమెను చూడటానికి వచ్చినప్పుడు వేసుకుంది,ఆమెను చూస్తూనే అతను గాల్లో ఆమెకు పంపిన ముద్దును గుర్తు తెచ్చుకోగానే,ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. ఆమె వణుకుతూ ఒక్క సారిగా బాధతో పెట్టె పక్కన కూలబడిపోయింది.
‘నటాల్య! ఏమైంది?’ లుకినిచ్న ఆదుర్దాగా అడిగింది.
గొంతు దాకా వచ్చిన ఏడుపుని దిగమింగుకుని,ఆమె నవ్వే ప్రయత్నం చేసింది. అది ఒట్టి గాలి మాత్రమే బయటకు వచ్చిన కృత్రిమ నవ్వు అని అర్థమైపోతూ ఉంది.
‘ఈ రోజు నాకు అదోలా ఉంది.’
‘అవును. నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను.’
‘ఏం గమనించావు,అమ్మా? ‘చిన్నగా ఏడుస్తూ అడిగింది ,తన చేతిలో ఉన్న గౌనును గట్టిగా పట్టుకుంటూ.
‘నువ్వు ఎప్పటికీ ఇలా ఉండిపోలేవు….నువ్వు మళ్ళీ పెళ్ళి చేసుకోవాలి.’
‘ఒకసారి చేసుకుంది చాలు!’
నటాల్య బట్టలు మార్చుకోవడానికి పక్కనున్న గదిలోకి వెళ్ళింది, తర్వాత వంటగదిలోకి చర్చికి వెళ్ళడానికి తగ్గట్టు ముస్తాబై వచ్చింది,సన్నగా ఉన్న శరీరంతో, పాలిపోయిన ముఖంతో ఆమె సంతోషంగా లేకపోవడం స్పష్టంగా కనిపిస్తూ ఉంది.
‘నువ్వు వెళ్ళు,నేను వస్తాను’,అంది తల్లి.
నటాల్య చేతి రుమాలుని తలకి కట్టుకుని వాకిట్లోకి వచ్చింది. గాలి డాన్ నదిలో తేలుతూ ఉన్న మంచు శబ్దాన్ని, కరిగిన మంచు వాసనను తీసుకువచ్చింది. ఎడమ చేతితో గౌను అంచులు పట్టుకుని,అప్పటికే కాస్త అక్కడ తేమగా ఉండటంతో జాగ్రత్తగా చర్చికి నడుచుకుంటూ వెళ్ళింది. ఆ దారిలో ఆమె తన స్థిమితాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేసింది. ఆమె పండగ గురించి,ఇంకేవో విషయాల గురించి ఆలోచించడానికి ప్రయత్నం చేసినా,చివరకు ఆమె మనసు మాత్రం జాకెట్ లోపల దాచిపెట్టిన గ్రెగరి రాసిన కాగితం మీదకే మళ్ళింది. బహుశా ఆమె,గ్రెగరి తనను తలుచుకుని నవ్వుకుంటూ ఉండి ఉంటారు అనుకుంది.
ఆమె చర్చి వాకిట్లోకి ప్రవేశించింది. ఆమె వెళ్ళే దారిలో కొందరు కుర్రాళ్ళు గుంపుగా నిలబడి ఉన్నారు.ఆమె వారి ముందు నడుస్తూ ఉన్నప్పుడు వారి మాటలు ఆమె చెవిన పడ్డాయి.
‘ఆ వెళ్తుంది ఎవరో చూశావా?’
‘హా,నటాల్య కోర్షునోవా.’
‘అందరూ ఆమెకు, భర్తకు ఏదో గొడవ అవ్వటం వల్ల,భర్త ఆమెను విడిచిపెట్టాడని అనుకుంటున్నారు.’
‘ఆ సోది చెప్పకు నాకు! ఆమె తన మామయ్య, కుంటి పాంటెలె తో ఏదో వ్యవహారం నడిపిస్తూ ఉందట.’
‘అంటే అందుకే గ్రెగరి ఇంటి నుండి వెళ్ళిపోయాడా?’
‘అవును. ఈ సారి ఆమె ……’
నటాల్యచర్చి మెట్లు ఎక్కుతూ ఉంటే ఆ మాటలకు ఆమె కాళ్ళు తడబడ్డాయి. ఆ గుసగుసలు ఆమెను రాయితో కొట్టినట్టు ఉంది. మెట్ల మీద నిలబడి నవ్వుతున్న అమ్మాయిల నవ్వులు చూసి, ఆమె ఇంకో గేటు నుండి, తాగినట్టు తూలుతూ,బయటకు వచ్చి,ఇంటికి పరిగెత్తింది. ఆమె ఇంటి గేటు వద్ద ఒక్క నిమిషం ఆగి,ఊపిరి పీల్చుకుని,అప్పటికే ఉబ్బిపోయి,రక్తం కారుతున్న పెదాలను కొరికింది. పక్కన ఉన్న పాక తలుపు సగం తెరిచి ఉన్నా,అందులో అంతా చీకటిగా ఉంది . అతి కష్టం మీద తన ఒంట్లో మిగిలి ఉన్న శక్తిని కూడదీసుకుని,దాని లోపలికి పరిగెత్తింది. ఆ పాక అంతా పొడిగా,చల్లగా, లెదర్ వాసనతో,ఎండిన గడ్డి వాసనతో ఉంది. ఈ ఆలోచన, భావోద్వేగం లేకుండా,కేవలం దుఃఖం మాత్రమే ఆమె గుండెను పట్టి ఉంది. ఆమె అందులో ఒక మూలకు నడిచింది. ఆమెకు అక్కడ ఓ కొడవలి దొరికింది,దాని కిందది తొలగించింది. (ఇప్పుడు ఆమె కదలికలు చాలా నెమ్మదిగా ఉన్నాయి)మెల్లగా తల వెనక్కి వాల్చి ఆ కొడవలితో గట్టిగా మెడ మీద కోసుకుంది. ఆ నొప్పి భరించలేక నేల మీదకు వాలిపోయింది,తను అనుకున్నది ఇంకా పూర్తి కాకుండానే,ఆమె మోకాళ్ళ మీద కూర్చుని,గబగబా పైన వేసుకున్న జాకెట్ ని (ఆమె మెడ నుండి కిందకు పారుతున్న రక్తం ఆమెను భయపెట్టింది)తీసింది. ఒక చేత్తో ముందుకు వచ్చిన రొమ్ముని వెనక్కి లాగి,ఇంకో చేత్తో ఆ కొడవలిని సూటిగా గుండెల ముందు పెట్టుకుంది. గోడ వరకు పాక్కుంటూ వెళ్ళి,ఆ కొడవలిని పదును పెట్టి,తల,చేతులు వెనక్కి పెట్టి ఎద ముందుకు తెచ్చింది.ఇంకా ఇంకా ముందుకు తెచ్చింది,కాసేపటికి క్యాబేజ్ తెగినట్టు ఆమె మాంసంలో అది చొచ్చుకుపోవడం ఆమెకు తెలుస్తూనే ఉంది ;అప్పుడు గుండెల నుండి చెప్పలేని నొప్పి ఆమె మెడ వైపుకి,పైకి విస్తరిస్తూ ఉంది.
అప్పుడే ఇంటి తలుపు దగ్గర చప్పుడైంది.లుకినిచ్న వాకిట్లో నుండి బయటకు నడిచింది. చర్చ్ గంటలు మోగుతూ ఉన్నాయి. డాన్ నది వైపు నుండి మంచు కరిగి,నీరుగా ప్రవహిస్తూ అజోవ్ సముద్రంలోకి కలిసిపోయింది.
* * *