మౌనమేలనోయి..

Spread the love

ఎన్ని ఉత్తరాలు 
రాశానో తెలుసా... 
క్షణాలతో రాజీపడుతూ 
పుడమిని నమ్ముకున్న రైతు 
సాగుభూమిలో విత్తనాలు చల్లినట్టు 
ఫలితం కనిపిస్తుందన్న నమ్మకంతో !

తపించే మనసుని చూస్తే 
తపస్సు చేసే హృదయం కనిపించలేదా ? 
కరుణించిన వరుణదేవుడిలా 
నాపై ప్రేమచినుకులు కురిపించలేవా ? 
చుట్టూరా కట్టుకున్న 
మంచుకోటను వీడి చూడు... 
మనసులో దాచుకున్న బొమ్మ 
నీదేనని చెప్పకనే చెబుతుంది... 
ఎదురుచూస్తూ ఎదురుచూస్తూ 
ఏకాంతం శత్రువులా మారింది !

మననం చేసుకో.... వొక్కమారైనా 
మన్నించ లేనిదంటూ ఒకటుందా ? 
మరుజన్మకై వేచిచూడలేను... 
మరునిమిషాన్ని కానుకగా ఇస్తానంటే 
కదిలే వాక్యమై పలకరిస్తాను... 
ఐక్యమయ్యే కవిత లల్లుకుంటాను 
చరిత్రపుటల్లో నిలిచిపోయేలా..!!
జంగం స్వయంప్రభ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *