అధ్యాయం-2
ఆగస్ట్ చివరిలో మిట్కా కోర్షునోవ్ అనుకోకుండా డాన్ నది దగ్గర లిజా మొఖోవను కలిశాడు. అప్పటికే దూరం నుండి పడవ నడుపుకుంటూ వస్తున్న అతని పడవకు ఏదో మొద్దు లాంటిది తగలడంతో, ఒక్క క్షణం ఆగాడు. లేత రంగులో పెయింటింగ్ చేసి ఉన్న ఓ పడవ అతనికి కనిపించింది. ఏదో కొండ నుండి వస్తూ ఉన్న ఆ పడవ ఒడ్డు వైపు వెళ్తూ ఉంది. బోయార్ష్కిన్ ఆ పడవను నడుపుతున్నాడు. నున్నగా గొరిగి ఉన్న అతని తల చెమటకు మెరుస్తూ, ఓ చిన్న చెట్టు కొమ్మల్లా ఉబ్బిన నరాలు అతని ఛాతీ మీద కనబడుతూ ఉన్నాయి.
మిట్కా మొదట లిజాను గుర్తు పట్టలేదు. ఆమె ధరించిన టోపీ, కళ్ళను పూర్తిగా కప్పి వేసింది. సూర్యకాంతి అరుదుగా తగిలిన తన చేతులను కట్టుకుంది.
‘కోర్షునోవ్!’ ఆమె అతని వైపు చూసి తల ఊపుతూ,ఆశ్చర్యంగా అరిచింది. ‘అంటే నువ్వు నాకు అబద్ధం చెప్పావన్న మాట’,అంది.
‘నేను నీకు అబద్ధం చెప్పానా?’
‘నీకు గుర్తు లేదా? నువ్వు నన్ను చేపలు పట్టడానికి తీసుకువెళ్తానని మాట ఇచ్చావుగా!’
బోయార్ష్కిన్ తెడ్లను వదిలేసి, తన వెన్నును నిటారుగా చేశాడు. ఆ పడవ ఒడ్డు దగ్గరకు వచ్చింది.
‘నీకు గుర్తు లేదా?’లిజా పడవలో నుండి బయటకు దూకి, నవ్వింది.
‘అస్సలు సమయం లేదు. చేయాల్సిన పని చాలా ఉంది’,మిట్కా వివరించే ప్రయత్నం చేశాడు, ఒక్కసారిగా ఆ అమ్మాయి అతని దగ్గరకు వచ్చేసరికి ఊపిరి ఆగినట్టు అనిపించింది.
‘లేదు,అదేం లేదు! నేను చెప్పిన మాటలను వెనక్కి తీసుకుంటున్నాను, యెలీజవెటా సెర్జియేవ్న. నీ కోసం నేను తప్పకుండా ఏదైనా చేస్తాను. చూడు మనం ఈ నదిలో ఎంత దూరం వచ్చామో. నా చేతులు బొబ్బలెక్కాయి. తప్పకుండా ఏదో ఒక రోజు వెళ్దాము’,అన్నాడు.
బోయార్ష్కిన్ ఆ ఒడ్డు మీద చెప్పులు లేని తన పెద్ద కాలును మోపి, తన ముఖానికి పట్టిన చెమటను తన టోపీతో తుడుచుకున్నాడు. సమాధానం చెప్పకుండా, మిట్కా దగ్గరకు వెళ్ళి, ఆమె తన చేయి చాపింది. అతను దానిని తడబడుతూనే అందుకున్నాడు.
‘అయితే చేపలు పట్టడానికి ఎప్పుడు వెళ్దాము?’ఆమె తన తల ఎగురవేస్తూ,కనుబొమ్మలు ముడుస్తూ మళ్ళీ అడిగింది.
‘నీకు వీలుంటే రేపే వెళ్దాము. పంట నూర్పులు పూర్తయ్యాయి.’
‘ఈ సారి మాట తప్పవుగా?’
‘లేదు.’
‘రేపు త్వరగా వస్తావా?’
‘పొద్దున్నే వెలుగు రాకముందే వస్తాను.’
‘ఎదురు చూస్తూ ఉంటాను.’
‘నేను తప్పకుండా వస్తాను,నిజంగా.’
‘వచ్చాక ఏ కిటికీ దగ్గరకు వచ్చి నన్ను లేపాలో నీకు తెలుసు కదా?’
‘నేను అది కనుక్కుంటాను’, మిట్కా నవ్వుతూ అన్నాడు.
‘నేను త్వరగానే ఇప్పుడు తిరిగి వెళ్ళిపోతాను. కొన్ని చేపలు పట్టడానికి వచ్చాను.’
మిట్కా తన పడవకు వేసే తాళంచెవితో ఆడుకుంటూ, ఆమె పెదాల వైపు చూశాడు.
‘నువ్వు వస్తున్నావా?’ ఒడ్డు దగ్గర ఉన్న ఓ ముత్యాన్ని తీసుకుని, దానిని చూస్తూ బోయార్ష్కిన్ అడిగాడు.
‘ఒక్క నిముషం.’
ఒక్క నిమిషం ఆమె నిశ్శబ్దంగా ఉండి, ఏదో గుర్తుకు వచ్చినట్టు నవ్వుతూ, ‘మీ ఇంట్లో ఎవరిదో పెళ్ళి జరిగింది, అవును కదా?’అని అడిగింది.
‘నా సోదరిది.’
‘ఎవరితో పెళ్ళి చేశారు?’ అతను సమాధానం చెప్పేలోపే ఆమె వింతగా నవ్వి,’తప్పకుండా రా!’ అన్నది. మొదట మొఖోవుల ఇంట్లో వరండాలో కలిసినప్పుడు ఆమె నవ్వు అతన్ని ఎలా సమ్మోహనపరిచిందో ఇప్పుడు కూడా అతనికి అదే అనుభూతి కలిగింది.
ఆమె అప్పటికే అతని నుండి తన పడవవైపు నడిచినా,అతని కళ్ళు మాత్రం ఆమెను వెంబడించాయి.
బోయార్ష్కిన్ మోకాళ్ళ మీద కూర్చుని పడవను ముందుకు తోసి,దానిలోకి ఎక్కాడు. లిజా నవ్వుతూ అతని తల వైపు చూసి, వీడ్కోలు చెప్పింది,అప్పటికి అతను తన చేతిలో ఉన్న తాళం చెవితోనే ఆడుకుంటూ ఆమెను చూస్తూ ఉన్నాడు.
వాళ్ళు అక్కడ నుండి ఓ పది గజాలు పడవలో ముందుకు వచ్చాక, ‘ఆ కుర్రాడు ఎవరు?’, బోయార్ష్కిన్ అడిగాడు.
‘నాకు తెలిసిన అతను.’
‘ఓ, అంటే మనసులో దాచుకోవాల్సిన విషయమా!’
ఈ మాటలు మాత్రం మిట్కాకు ఆ తెడ్ల శబ్దంలో నుండి వినిపించాయి కానీ దానికి ఆమె చెప్పిన సమాధానం మాత్రం అతనికి వినిపించలేదు. మిట్కా చూసినప్పుడు బోయార్ష్కిన్ తెడ్లతో పాటు ముందుకు వంగుతూ, నవ్వుతున్నాడు. కానీ మిట్కా వీపు అతనికి కనిపిస్తూ ఉండటం వల్ల ఆమె ముఖం మాత్రం కనిపించడం లేదు.ఊదా రంగులో ఉన్న ఒక రిబ్బను గాలి వల్ల ఆమె టోపీ నుండి భుజాల వరకు ఎగురుతూ ఉండటం చూసిన మిట్కాకు ఆ గాలి తనను కూడా చక్కలిగింతలు పెట్టినట్లు అనిపించింది.
మిట్కా ఎప్పుడు చేపలు పట్టడానికి వెళ్ళినా దానికి కావాల్సినవి సిద్ధం చేసుకుని ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ ఆ సాయంత్రం మాత్రం దానికి భిన్నంగా మర్నాడు చేపలు పట్టడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాడు. కొన్ని పిడకలను ముక్కలుగా చేసి, వంట గది వెనుక ఉన్న తోటలో మంట వెలిగించి, ఎర కోసం చిరు ధాన్యాలను ఉడకపెట్టాడు. అతను చేపలు పట్టడానికి అవసరమైనవి అన్నీ జాగ్రత్తగా పరిశీలించి పాతవి కాకుండా కొత్తవి సిద్ధం చేసుకుంటున్నాడు.
అతను చేస్తున్న ఈ సన్నాహాలను మిఖే చూశాడు. ‘నన్ను కూడా నీతో తీసుకువెళ్ళు,మిట్రీ ….నీకు సాయం అవసరం అవుతుంది’,అన్నాడు.
‘నేను చూసుకోగలను.’
మిఖే నిట్టూర్చాడు.
‘మనం చేపలను పట్టి చాలా కాలమైంది. ఇది చూస్తూ ఉంటే ఇప్పుడే ఏదో పెద్ద చేపను పట్టినట్టే అనిపిస్తుంది’, అన్నాడు మిఖే.
మిట్కా కోపంగా ఆవిర్లు వస్తూ ఉడుకుతూ ఉన్న ఎరను చూస్తూ,ఏమి బదులివ్వలేదు. అది సిద్ధమైపోయాక,అతను ముందు గదిలోకి వెళ్ళాడు.
గ్రీక్షా తాతయ్య కిటికీ దగ్గర కిటికీ దగ్గర కూర్చుని ఉన్నాడు. ముక్కు మీదకు కళ్ళద్దాలు పడుతూ ఉంటే,ఆయన సువార్త చదువుతూ ఉన్నాడు.
‘తాతయ్యా…’ ఆయనకు దగ్గరగా వెళ్ళి, మిట్కా పిలిచాడు.
ఆ వృద్ధుడి కళ్ళద్దాలలో నుంచి కళ్ళు ఎత్తి చూశాడు.
‘ఏమిటి?’
‘నన్ను మొదటి కోడి పుంజు కూసే సమయానికి నిద్ర లేపు.’
‘అంత పొద్దున్నే ఎక్కడికి వెళ్దామని అనుకుంటున్నావు?’
‘చేపలు పట్టడానికి.’
గ్రీక్షా తాతయ్యకు చేపలు అంటే ఇష్టం అయినప్పటికి కూడా ఆ సమయంలో అభ్యంతరపెట్టాడు.
‘మీ నాన్న రేపు జనపనార పని ఉందని చెప్పాడు. ఈ సమయంలో నువ్వు చేపలు పట్టడానికి పరిగెత్తడం ఏం బాగోదు!’
మిట్కా భుజాలు ఎగురవేసి, తాతయ్యను బోల్తా కొట్టడానికి ఓ కొత్త ఆలోచన చేశాడు.
‘వెళ్ళినా,వెళ్ళకపోయినా నాకు వచ్చే నష్టమేమి లేదు. నేను కేవలం మా తాతయ్యకు చక్కగా చేపలు వండిద్దామనుకున్నాను, ఒకవేళ జనపనార పని ఉంటే వెళ్ళలేనులే’, అన్నాడు తెలివిగా.
‘ఓయ్, ఒక్క నిమిషం ఆగు,ఎక్కడికి వెళ్ళిపోతున్నావు?’ ఆ వృద్ధుడు కంగారుగా తన కళ్ళద్దాలు సరిచేసుకుంటూ అడిగాడు. ‘నేను మిరోన్ తో మాట్లాడతాను. నేను ఇప్పుడే వెళ్తాను. అయినా చేపలు పట్టడం పెద్ద చెడ్డ విషయం ఏమి కాదు. అందులోనూ రేపు బుధవారం. సరే ఇక వెళ్ళు, నేను నిద్ర లేపుతాను, కుర్ర వెధవా. ఇంకేంటి అలా చూస్తున్నావు?’
అర్ధరాత్రి ఆ వృద్ధుడు మెట్ల గుండా తడుముకుంటూ, జారిపోతున్న తన పైజమాను ఒక చేత్తో పైకి లాక్కుంటూ, ఇంకో చేత్తో కర్రను పట్టుకుని నడిచాడు. ఆయన ఆ వాకిలి నుండి ధాన్యపు గిడ్డంగి వరకు వణుకుతున్న తెల్ల దయ్యంలా వెళ్ళి, తన చేతి కర్రను అతని భుజం మీద గుచ్చాడు.అప్పటికే మిట్కా, ఆ ధాన్యం పక్కగా ఓ చాప వేసుకుని, గుర్రు పెట్టి నిద్ర పోతూ ఉన్నాడు. ఆ ప్రదేశం అంతా నూర్చిన ధాన్యం వాసన, ఎలుకల పెంటల వాసన, సాలె పురుగుల వాసనతో కలిసిన గాలితో నిండి ఉంది. మిట్కా ఒక్కసారిగా నిద్ర లేవలేదు. తాతయ్య మళ్ళీ ఆ కర్రతో అతన్ని మెల్లగా తట్టి, ‘మిట్కా!మిట్కా! వెధవా!’ అని గుసగుసగా అన్నాడు.
మిట్కా తన కాళ్ళు పైకి లాక్కుని మళ్ళీ గురక పెడుతూ ప్రశాంతంగా నిద్ర పోయాడు. అసహనంతో తాతయ్య,పదునుగా లేని ఆ కర్ర చివరను అతని కడుపులో గట్టిగా గుచ్చాడు. మిట్కా ఒక్కసారిగా ఆ కర్రను లాక్కుని, పైకి లేచాడు.
‘నువ్వు కుంబకర్ణుడిలా నిద్ర పోతున్నావు. నిన్ను లేపడం చాలా కష్టమైపోయింది,వెధవా’,అని తాతయ్య తిట్టాడు.
‘సరే,తాతయ్య.నువ్వు చొక్కా వేసుకో’, తన బూట్లు వేసుకుంటూ, గుసగుసగా అన్నాడు.
అతను కూడలి వైపు నడిచాడు. అప్పటికే గ్రామంలో రెండవ సారి పుంజు కూసింది. ఫాదర్ విశారియోన్ ఇంటిని దాటుతున్నప్పుడు, అక్కడ ఉన్న కోళ్ళ గూడులో నుండి కోళ్ళు రెక్కలు ఆడిస్తున్న శబ్దం వినిపించింది. వెంటనే ఓ కోడి పుంజు గట్టిగా కూసేసరికి, భయపడినట్టు ఆ కోళ్ళు మెల్లగా ‘క్కో..క్కో’ అని అరిచాయి.
షాపు ముందు ఉండే వాచ్ మెన్ కింద మెట్టు దగ్గర కునికిపాట్లు పడుతూ పడుకుని ఉన్నాడు. వెచ్చదనం కోసం ముడుచుకుని పడుకున్నాడు. మిట్కా మొఖోవుల ఇంటి కంచె దగ్గరకు వచ్చి,అక్కడ తన ఎర పెట్టుకున్న సంచిని, గేలాన్ని జాగ్రత్తగా సర్దాడు.ఇంటి లోపలికి అడుగు పెట్టి చుట్టుపక్కల ఉన్న కుక్కలు అలికిడికి లేవకుండా,మెల్లగా నడుస్తూ,మెట్లు ఎక్కాడు.అతను చల్లగా ఉన్న తలుపు గడియను లాగాడు. కానీ అది లోపలి నుండి వేసి ఉంది. అతను మెల్లగా వరండా దగ్గర ఉన్న రైలింగ్ ను ఎక్కి, ఓ కిటికీ దగ్గరకు చేరుకున్నాడు. కొద్దిగా తెరిచి ఉన్న ఆ కిటికీ నుండి అతని నాసికలకు ఓ అమ్మాయి శరీరం నుండి వచ్చే మంచి వాసనతో కలిసిన ఓ సెంటు వాసన తాకింది. ఆమె నిద్రలో ఉందని అతను అనుకున్నాడు. కానీ కిటికీ మూసి ఉండటం వల్ల అతను ఎవరిని చూడలేకపోయాడు.
‘లిజావెట సెర్జెయెవ్న!’
అతని స్వరం చాలా పెద్దగా ఉంది. అతను కాసేపు వేచి చూశాడు.కానీ అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. ‘ఒకవేళ నేను వచ్చిన కిటికీ ఆమె గది కిటికీ కాదేమో? ఒకవేళ ఈ గదిలో పడుకున్నది ఆమె తండ్రి ఏమో? ఇక అయితే అంతే నా పని!అతను తన తుపాకితో నన్ను కాల్చి పారేస్తాడు అంతే’, ఆ కిటికీ అంచును పట్టుకున్న మిట్కా తనలో తానే అనుకున్నాడు.
‘లిజావెట సెర్జెయెవ్న, నిద్ర లే. చేపలు పట్టే సమయం అయ్యింది!’ఇంకోసారి ప్రయత్నించాడు.
‘ఒకవేళ ఇదీ అసలైన కిటికీ కాకపోతే నేనే చేపను అయిపోతాను’,అని తనలో తాను అనుకున్నాడు.
‘లే…ఇక లే’, విసుగుతో మళ్ళీ తన తలను కిటికీ దగ్గరకు తీసుకువెళ్లి అన్నాడు.
‘ఏమిటి?ఎవరది?’ ఆ నల్లటి శూన్యంలో నుండి గుసగుసగా ఓ స్వరం వినిపించింది.
‘నువ్వు చేపలు పట్టడానికి వస్తున్నావా? నేను, కోర్షునోవుని.’
‘ఓ! ఒక్క నిమిషం.’
ఆ గదిలో అలికిడి అయ్యింది. నిద్ర మత్తులో ఉన్న ఆ గొంతు నుండి మాటలతో పాటు పుదీనా వాసన కూడా వచ్చింది. అతను ఆ గదిలో ఏదో తెల్లగా కదులుతున్నట్టు కనిపించింది.
‘నేను కష్టమైన ఆమెతో పాటు లోపల గదిలో పడుకుంటాను కానీ చలిలో ఇక్కడ బయట మాత్రం ఉండను’, ఆ గదిలో నుండి వస్తున్న సువాసనలను పీల్చుకుంటూ అనుకున్నాడు.
ఒక తెల్ల చేతి రుమాలుతో కప్పుకుని ఉన్న ఒక తల కిటికీ దగ్గర ప్రత్యక్షమైంది. ఆమె ఆ కిటికీ పూర్తిగా తెరిచింది.
‘నేను ఈ కిటికీ నుండి బయటకు వస్తాను. నీ చేయి ఇవ్వు’,అన్నది.
‘అయితే రా’, సాయం చేశాడు మిట్కా.
బయటకు వచ్చేటప్పుడు అతని చేతి మీద వాలిన ఆమె అతని కళ్ళలోకి చూసింది.
‘నేను త్వరగా వచ్చేశానా?’
‘వచ్చావు.’
ఆ ఇద్దరూ డాన్ వైపు నడిచారు.
‘నేను హాయిగా నిద్ర పోతూ ఉన్నాను. ఇంకాసేపు పడుకునే దానిని. ఇంకా తెల్లవారనే లేదు’, ఆమె తన గులాబీ రంగు చేతితో కళ్ళను రుద్దుకుంటూ అంది.
‘ఇదే సరైన సమయం.’
కూడలి తర్వాత మొదటి సందులోకి తిరిగి వారు డాన్ నది దగ్గరకు వెళ్ళారు. ఆ రాత్రి నీరు పైకి రావడం వల్ల, ముందు పొడి నేలలో ఒక మొద్దుకు కట్టిన పడవ ఇప్పుడు నీటిలో తేలుతూ ఉంది.
‘మనం మన బూట్లు తీసేస్తే మంచిది’,లిజా దూరాన్ని మనసులోనే కొలుస్తూ,గట్టిగా నిట్టూరుస్తూ అంది.
‘నేను నిన్ను ఎత్తుకుని తీసుకుని వెళ్ళనా?’ మిట్కా సూచించాడు.
‘వద్దు…నేను బూట్లు తీసి వస్తాను.’
‘దాని కన్నా ఎత్తుకుని తీసుకు వెళ్ళడమే తేలిక.’
‘వద్దు…వద్దు’,ఆమె ఇబ్బంది పడుతూ అన్నది.
మిట్కా తన ఎడమ చేతిని ఆమె మోకాళ్ళ పైన గట్టిగా పట్టుకుని ఆమెను తేలిగ్గా ఎత్తుకుని,నీళ్ళలో పడవ వైపు నడిచాడు. ఆమె గోధుమ రంగులో ఉన్న అతని మెడ చుట్టూ తన చేతులు వేసి, సరదాగా నవ్వింది.
నదిలో ఆ గ్రామ స్త్రీలు బట్టలు ఉతికే రాయి అతని కాళ్ళకు అడ్డం పడకపోతే, అనుకోకుండా, ఓ లిప్త పాటు వారిద్దరూ ముద్దు పెట్టుకునే అవకాశమే ఉండేది కాదు. ఆమె నోరు పగిలిన మిట్కా పెదాలకు తగిలినప్పుడు,ఆమె గట్టిగా ఊపిరి పీల్చింది,పడవ వైపు నడుస్తూ ఉన్న మిట్కా కొన్ని సెకండ్ల పాటు, తన బూట్లలోకి నీళ్ళు వస్తూ,కాళ్ళు చల్లగా అయిపోయినా సరే, అలాగే కదలకుండా ఉండిపోయాడు.
పడవకు కట్టి ఉన్న మొద్దును తొలగించి, గట్టిగా ముందుకు తోసి,ఒక్క ఉదుటున పడవలోకి దూకాడు. ఓ చిన్న తెడ్డుతో ఆ పడవను నడపసాగాడు. నీళ్ళ శబ్దం మాత్రమే వినిపించేంత నిశ్శబ్దం ఉంది. ఆ నీటిలో నుండి పడవ మెల్లగా ముఖ్య ప్రవాహం దాటి, మెల్లగా అటువైపు ఒడ్డు దిశగా వెళ్తూ ఉంది. ఒక్క తెడ్ల శబ్దం,నీటి శబ్దం తప్ప ఇంకేమి వినపడటం లేదు.
‘నన్ను ఎక్కడకు తీసుకువెళ్తున్నావు?’ తన భుజం వైపు చూసుకుంటూ అడిగింది.
‘అటువైపుకి.’
ఒక ఇసుక బీచ్ లా ఉన్న ప్రాంతంలో పడవను ఆపాడు.ఆమెను అడగకుండానే, తన చేతుల్లోకి తీసుకుని, ఆమెను ఎత్తుకుని, ఓ పొద వైపుకి వెళ్ళాడు. ఆమె అతన్ని కొరికింది, గీరింది, రెండు మూడు సార్లు అరిచింది; ఇక ఆమెకు శక్తి లేక, కోపంతో కన్నీళ్ళు రాకుండా ఏడ్చింది.
వాళ్ళు తిరిగి వచ్చేసరికి తొమ్మిదయ్యింది. అప్పటికి ఆకాశం అంతా పసుపుపచ్చ-ఎరుపు రంగులతో మిళితమైనట్టు ఉంది. డాన్ దగ్గర గట్టి గాలులు వీస్తూ, గుర్రాలను కొరడల్లా అదిలిస్తున్నట్టు ఉన్నాయి. అలలు వస్తున్నప్పుడల్లా,పడవ అటూ ఇటూ ఊగుతూ, నురగతో ఉన్న నదిలోని నీరు పడవలో పాలిపోయినట్టు ఉన్న లిజా ముఖాన్ని గట్టిగా తాకుతూ,ఆమె కనుబొమ్మలను,చేతి రుమాలు నుండి జారిపోయిన జుట్టును తడిగా చేస్తున్నాయి.
ఆమె తల వంచుకుని కూర్చుంది. ఏడ్చినట్టు ఆమె కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ఎలాగో పడవలో పడిన ఒక పువ్వు కాడను నలుపుతూ ఉంది. మిట్కా ఆమె వైపు చూడకుండా పడవ నడుపుతూ ఉన్నాడు. అతని కాళ్ళ దగ్గర రెండు చేపలు పడి ఉన్నాయి.అందులో ఒక చేప కాషాయ రంగులో ఉంది. నోరు తెరుచుకుని,చావు బాధ పడుతూ ఉంది. మిట్కా ముఖంలో ఓ వైపు పశ్చాత్తాప భావన ఉన్నా, దానితో పాటు తృప్తిగా ఉన్నట్టు కూడా ఉంది.
‘నేను నిన్ను సెమ్యోనోవ్ ఒడ్డు దగ్గర దించుతాను. మీ ఇంటికి అక్కడ నుండి దగ్గర’,అతను పడవను నడుపుతూ అన్నాడు.
‘సరే’,అని గొణిగింది.
అప్పుడు ఆ ఒడ్డు దగ్గర ఎవరూ లేరు. డాన్ నది ఎగువ ప్రాంతంలో ఉన్న పచ్చిక బీడులో ఉన్న కూరగాయల పాదులు ఎర్రటి ఎండకు వాడిపోయి; చిన్నగా కాలిన పొదల వాసనను అక్కడి నుండి గాలి ఇక్కడకు మోసుకు వచ్చింది. పొద్దు తిరుగుడు పువ్వులను పిచ్చుకలు పాడు చేయడం వల్ల,అవి తలలు వాల్చి,కిందకు వంగిపోయి, విత్తనాలను భూమి మీదకు వదిలేశాయి. ఆ బీడు అంతా కొత్త గడ్డి మొక్కలు పెరగడం వల్ల పచ్చగా ఉంది. కొంత దూరంలో గుర్రపు పిల్లలు ఎగురుతూ ఉండటం వల్ల,వాటి మెడలకు కట్టిన గంటలు మోగుతూ ఆ ప్రాంతం అంతా ప్రతిధ్వనిస్తూ ఉంది.
మిట్కా పడవలో ఉన్న చేపలను తీసి లిజా పడవ దిగుతున్నప్పుడు ఆమె చేతికి అందించాడు.
‘ఇవిగో, తీసుకో, నువ్వు పట్టిన చేపలు.’
భయపడినట్టు ఆమె అతనివైపు చూసి,వాటిని తీసుకుంది.
‘సరే,నేను వెళ్తున్నాను.’
ఆ చేపలకు చిన్న కొమ్మ వాటి మొప్పల మధ్య నుండి కట్టబడి ఉంది. ఆమె వాటిని దూరంగా పట్టుకుని, జాలి-గందరగోళం కలిసిన భావనతో నడవసాగింది. ఆమె బయలుదేరే ముందు ఉన్న నమ్మకం అంతా కూడా ఆ పొద దగ్గరే కోల్పోయినట్టు ఆమె నడక స్పష్టం చేస్తూ ఉంది.
‘లిజావెట!’
ఆమె వెనక్కి తిరిగింది. ఓ రకమైన కోపం,ఆశ్చర్యం తీక్షణంగా చూస్తున్న ఆమె కళ్ళల్లో కనిపించింది.
‘ఒక్కనిమిషం ఇటురా.’
‘మనం కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరించాము….ఆ గౌను వెనుక! ఒక చిన్న మరక ఉంది-చాలా చిన్నదే’, ఆమె దగ్గరకు వచ్చాక,ఇబ్బంది పడుతూ, అన్నాడు.
ఆమె ముఖం అంతా కందిపోయినట్టు ఎర్రగా మారింది.
మిట్కా కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు.
‘వెనుక వైపు ఉన్న సందుల నుండి వెళ్ళు’, సలహా ఇచ్చాడు.
‘ఎలా వెళ్ళినా నేను కూడలి వైపు నుండే వెళ్ళాలి. నేను నల్ల గౌను వేసుకుని ఉంటే బాగుండేది’, ఆమె మిట్కా ముఖం వైపు బాధ,అసహ్యంతో చూస్తూ చిన్నగా అన్నది.
‘అయితే నేను ఆ మరకను ఆకుతో రుద్ది పచ్చగా చేస్తాను’, మిట్కా అదేదో చాలా సాధారణమైన విషయం అయినట్టు తేల్చేశాడు.అప్పటికే ఆమె కళ్ళల్లో నీళ్ళు నిండి ఉన్నాయి.
ఆ గ్రామం అంతా గుసగుసలాడుతున్న గాలిలా ఓ వార్త వ్యాపించింది.
‘మిట్కా కోర్షునోవ్ ఒక రాత్రి సెర్జి ప్లాటోనోవిచ్ కూతుర్ని బయటకు తీసుకువెళ్ళాడు!’
ఆవులను పచ్చికల్లోకి తోలేటప్పుడు, బావుల్లో బిందులతో నీళ్ళు తోడుతున్నప్పుడు, డాన్ నదిలో బట్టలు ఉతుకుతున్నప్పుడు, ఆ ఊరిలో స్త్రీలంతా ఈ విషయం గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ‘కన్న తల్లి లేకపోతే ఇలానే జరుగుతుంది.’
‘ఆ ఇంటి యజమానికి ఇంట్లో విషయాలు పట్టించుకోవడానికి తీరికే ఉండదు, ఆ సవతి తల్లి తన కళ్ళ ముందే జరుగుతున్నా ఏది పట్టించుకోదు.’
“దవ్యాడ్కా,ఆ వాచ్ మెన్ ఆ తర్వాతి రోజు ఏం చెప్పాడు అంటే, “నేను ఆ అర్థ రాత్రి గస్తీ తిరుగుతూ ఉన్నాను, అప్పుడు ఓ మనిషి కిటికీ పైకి ఎక్కిఉండటం చూశాను. నేను అతను దొంగనుకుని, ప్లాటోనోవిచ్ ఇంటికి పరిగెత్తాను. లోపలికి వెళ్ళి ‘ఎవరది? పోలీస్!’ అని అరిచాను.కానీ తీరా చూస్తే అది మిట్కా!”
‘ఈ రోజుల్లో అమ్మాయిలు ఇలానే తయారవుతున్నారు….’
‘మిట్కా పెద్ద నీతిమంతుడిలా మా మికిష్కా కు చెప్తున్నాడు,”నేను తనకు పెళ్ళి చేస్తాను”, అన్నాడు.’
‘ముందు వాడు చక్కగా ఉంటే ఎన్ని కబుర్లు అయినా చెప్పవచ్చు.’
‘అతను ఆమెను బలవంతం చేశాడట,మానభంగం అట….’
‘మేము ఈ కథ ముందే విన్నాము…’
ఇదే విషయం గురించి వీధుల్లోనూ,సందుల్లోనూ మాటలు జరుగుతూ ఉండేవి, దీనితో ఆ అమ్మాయికి అప్పటివరకూ ఉన్న మంచి పేరు కాస్తా ఓ మాయని మచ్చలా మారిపోయింది.
ఈ విషయం సెర్జి ప్లాటోనోవిచ్ ను క్రుంగదీసింది. ఓ రెండు రోజుల వరకు ఆయన షాపుకు కానీ,మిల్లుకు కానీ వెళ్ళలేదు. బయట ఉన్న అవుట్ హౌస్ లో నివసించే పని వాళ్ళు కూడా కేవలం వంట చేయడానికి మాత్రమే వచ్చేవారు.
మూడవ రోజు సెర్జి ప్లాటోనోవిచ్ బూడిదరంగు మచ్చలతో ఉన్న గుర్రాన్ని బండికి కట్టి స్టానిట్సా కు పోనించాడు, వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఎదురు వచ్చిన కోసాక్కులను చూసి కోపంగా ముఖం తిప్పుకున్నాడు. తర్వాత అతని ఆధ్వర్యంలో ఓ బండి ఇంటి వాకిటి నుండి బయటకు వచ్చింది. నోట్లో బీడీ పెట్టుకుని కాల్చుకుంటూ ఉన్న యెమెల్యాన్ పగ్గాలను చేతిలోకి తీసుకుని గుర్రాన్ని అదిలించాడు. అతని వెనుక బండిలో పాలిపోయిన ముఖంతో లిజా కూర్చుని ఉంది. అతని వీపు ఆమె వైపుకు ఉండటం వల్ల ఆమె సగం కనిపించకుండా ఉంది. తన ఒడిలో చిన్న సూట్ కేసు పెట్టుకుని, చిన్నగా నవ్వుతూ, గేటు దగ్గర నిలబడ్డ వ్లాడిమిర్ కు, తన సవతి తల్లికి చేయి ఊపి టాటా చెప్పింది. ఆ సమయంలో షాపు నుండి ఇంటికి కుంటుకుంటూ పాంటెలి ప్రోకోఫోవిచ్ వెళ్తూ ఉన్నాడు. బండిని చూసిన అతను,ప్లాటోనోవిచ్ ఇంట్లో గుర్రాలను చూసుకునే నికితను, ‘అమ్మాయి గారు ఎక్కడికి వెళ్తున్నారు?’ అడిగాడు.
అప్పటికే ఆ గ్రామం అంతా ఆ విషయం పట్ల చూపించే అతి కుతూహలం గురించి తెలిసిన నికిత, తనేదో గొప్ప విషయం చెబుతున్నట్టు, ‘మాస్కోకి చదువుకోవడానికి వెళ్తున్నారు’,అన్నాడు.
ఆ తర్వాత రోజు జరిగిన ఓ విషయం గురించి మాత్రం డాన్ ప్రాంతంలో పదే పదే అందరూ పశువులను తోలేటప్పుడు, బావుల దగ్గర,నలుగురు కలిసే అన్ని చోట్లా చెప్పుకున్నారు…..ఆ రోజు చీకటి పడే ముందు, పశువులు పచ్చిక బీడుల నుండి ఇంటికి చేరాక, మిట్కా సెర్జి ప్లాటోనోవిచ్ దగ్గరకు వెళ్ళాడు.(ఎవరికి కనబడకూడదని అతను ఆ సమయం వరకు ఆగాడు.) అతను మామూలుగా ఆయన్ని కలవడానికి రాలేదు, లిజాను వివాహం చేసుకుంటానని అడగటానికి వచ్చాడు.
దీని కన్నా ముందు అతను లిజాను మూడు నాలుగు సార్లు తప్ప ఎక్కువ చూడలేదు. ఆఖరి సారి వారిద్దరూ కలిసినప్పుడు ఈ సంభాషణ జరిగింది.
‘నీకు నన్ను పెళ్లి చేసుకోవాలని లేదా,లిజావెటా?’
‘అది అసాధ్యం!’
‘నేను నీతో మంచిగా ఉంటాను. నిన్ను చక్కగా చూసుకుంటాను. మాకు మా కోసం పని చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు చక్కగా కిటికీ దగ్గర కూర్చుని నీకు నచ్చిన పుస్తకాలు చదువుకోవచ్చు.’
‘నువ్వు ఒక వెధవవి.’
నిస్సహాయంతో నిశ్శబ్దంగా ఉండిపోయాడు మిట్కా. ఆ సాయంత్రం అతను ఎప్పటికన్నా ముందరే ఇంటికి వెళ్ళాడు. తర్వాతి రోజు ఉదయం, తన తండ్రికి తన మనసులోని మాటను చెప్పాడు.
‘నాన్నా,నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను.’
‘దేవుడా!’
‘నేను నిజంగానే అంటున్నాను.’
‘ఇప్పుడే తొందర ఏమోచ్చింది?’
‘ఎందుకు చేసుకోకూడదు?’
‘ఈ సారి నిన్ను కుట్టిన ప్రేమ దోమ ఎవరు? ఆ తెలివితక్కువ మార్ఫానా?’
‘సెర్జి ప్లాటోనోవిచ్ ఇంటికి సంబంధం మాట్లాడటానికి మనుషులను పంపించు.’
గుర్రపు బండి కట్టడానికి అవసరమైన పనిముట్లు ఉన్న బల్ల మీద కూర్చుని, చిన్నగా నవ్వాడు మిరోన్.
‘ఈ రోజు నువ్వు చాలా హుషారుగా ఉన్నావు.’
అదే మాట మీద మిట్కా పట్టుపట్టడం, తండ్రికి కోపాన్ని తెప్పించింది.
‘నువ్వు ఒక వెధవ్వి! సెర్జి ప్లాటోనోవిచ్ కు పది లక్షల పైన ఆస్తి ఉంది. అతను ఓ గొప్ప వ్యాపారి,మరి నువ్వు ఏమిటి? ……ఇక్కడ నుంచి పో, ఈ చెత్త వాగుడు వాగకు లేకపోతే నీ ప్రాణం తీస్తాను.’
‘కానీ మనకు కూడా 14 జతల ఎద్దులు, గొప్ప పొలం ఉంది!అంతే కాకుండా అతను ఓ చిన్న రైతుగా వచ్చాడు, కానీ మనం కోసాక్కులము.’
‘పో!’మిరోన్ గట్టిగా అరిచాడు. ఆయనకు వాదనలు పెంచడం ఇష్టం ఉండదు.
మిట్కాకు తను చెప్పేది విని,సానుభూతితో అర్ధం చేసుకునే వ్యక్తి తన తాతయ్యలో కనిపించాడు. తడబడుతున్న కాళ్లతో, చేతి కర్రతో ముందుకు వచ్చి, కొడుకుతో మాట్లాడే ప్రయత్నం చేశాడు.
‘మిరోన్!’
‘ఏంటి?’
‘ఎందుకు అలా అరుస్తున్నావు?ఆ అమ్మాయికి కూడా అబ్బాయంటే ఇష్టమైతే…’
‘నాన్నా, నువ్వు కూడా చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నావు. మిట్కా ఓ వెధవ, నువ్వు వాడికి రెచ్చగొడుతున్నావు.’
‘మాటలు జాగ్రత్తగా రాని!’ గ్రీక్షా తన చేతి కర్రను నేల మీద గట్టిగా కొడుతూ అన్నాడు.
‘మనం వాళ్ళకు సరిపోమా? ఒక కోసాక్కు కుటుంబం వాళ్ళు అతని కూతురిని సంబంధం అడగటం గొప్ప విషయం. అసలు అతను అలా ఇవ్వమని మనల్నే బ్రతిమాలతాడు కూడా. మన కుటుంబానికి ఈ జిల్లాలోనే మంచి పేరు ఉంది. మనమేమి అడుక్కునే తినే స్థితిలో లేము. మనకు ఓ మంచి పొలం కూడా ఉంది.నిజమేగా! నువ్వే అతని దగ్గరకు వెళ్ళు. వెనకడుగు వేయకు! అతనికున్న మిల్లును కట్నంగా అడుగు. సరేనా?’
మిరోన్ ఏం మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు. కానీ మిట్కా మటుకు సాయంత్రం వరకు చూసి, తర్వాత విషయాన్ని తన చేతిలోకి తీసుకోవాలని అనుకున్నాడు. మిట్కాకు తన తండ్రి పట్టుదల రంపపు పట్టు చెట్టు లాంటిదని, దానిని వంచవచ్చు కానీ విరగొట్టడం కష్టమని తెలుసు.
అతను సరాసరి మొఖోవుల ఇంటి వైపు తనలో తాను ఈల వేసుకుంటూ నడిచాడు. కానీ గేటు దగ్గరకు వచ్చేసరికి అతని ధైర్యం క్షీణించసాగింది. అక్కడ ఒక్క నిమిషం ఆగి, తర్వాత వాకిట్లోకి నడిచాడు. వరండా మెట్ల దగ్గర ఉన్న ఓ పనమ్మాయిని, ‘యజమాని ఉన్నారా?’అని అడిగాడు.
‘ఆయన టీ తాగుతున్నారు. మీరు కాసేపు వేచి ఉండాలి.’
అతను కూర్చుని, ఒక సిగరెట్ వెలిగించి, రెండు వేళ్ళ మధ్యలో ఉంచుకుని,దాన్ని తాగి, తర్వాత నేల మీద అస్తవ్యస్తంగా పడేసి నలిపేశాడు. సెర్జి ప్లాటోనోవిచ్ తన కోటును సరిచేసుకుంటూ వచ్చాడు; మిట్కాను చూడటంతోనే అతను కనుబొమ్మలు చిట్లించాడు.
‘లోపలికి రా.’
మిట్కా ఆయనతో పాటు లోపల గదిలోకి ప్రవేశించాడు.ఆ గది పుస్తకాలు,పొగాకు వాసనతో నిండి ఉంది. అతను ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ఉన్న ధైర్యం కాస్త ఆ గది తలుపు దగ్గరకు రాగానే మాయమైపోయినట్టు అతనికి అనిపించింది.
సెర్జి ప్లాటోనోవిచ్ తన బల్ల దగ్గరకు వెళ్ళి,అక్కడ ఉన్న కుర్చీలో కూర్చోగానే అది కిర్రుమంది.
‘చెప్పు’, ఆయన వేళ్ళు ఆ బల్ల మీద ఉన్న వస్తువుల మీద తచ్చాడుతూ ఉన్నాయి.
క్రోధంతో నిండిన ఆయన కళ్ళను చూడగానే, మిట్కా భుజాలు క్రుంగిపోయినట్టు అయ్యి,అతనికి ఓ క్షణం వణుకు వచ్చింది. ‘నేను ఎందుకు వచ్చానంటే, నాకు లిజావెటను ఇచ్చి పెళ్ళి చేస్తారేమో కనుక్కుందామని’, అని అడిగాడు.
నిరాశ,కోపం,భయం మిట్కా ముఖంలో కలిసిపోయి, మంచులా అతని ముఖం మీద చెమట పడుతూ ఉంది.
సెర్జి ప్లాటోనోవిచ్ ఎడమ కనుబొమ్మ అదిరింది, అతను పై పెదవిని కొరుక్కున్నాడు. ఒక్కసారిగా అతని శరీరం కొద్దిగా ముందుకు వంగింది.
‘ఏంటి …ఏంటి…..వెధవా…దరిద్రుడా….ఇక్కడ నుండి బయటకు పో…. పనికిమాలినోడా…నేను నిన్ను అటామన్ దగ్గరకు తీసుకువెళ్తాను…పో బయటకు…’
అలా అరుస్తున్నప్పుడు సెర్జి ప్లాటోనోవిచ్ బుగ్గల దగ్గర నరాలు బయటకు కనిపిస్తూ, నీలం రంగులో రక్తం అక్కడకు ప్రవహిస్తున్నట్టు మిట్కా గమనించాడు.
‘దయచేసి నన్ను అపార్థం చేసుకోవచ్చు….నేను కేవలం జరిగిన తప్పును ఆమె కోసం సరిచేయాలనే అనుకుంటున్నాను.’
రక్తమంతా ముఖంలోకి పొంగుతూ,కన్నీళ్ళు నిండిన కళ్ళతో ఉన్న సెర్జి ప్లాటోనోవిచ్ ఆ బల్ల మీద ఉన్న ఇనుప ఆష్ ట్రేని బలంగా మిట్కా మీదకు విసిరాడు. అది మిట్కా మోకాళ్ళకు గట్టిగా తగిలి,కింద పడింది. ఆ నొప్పిని భరిస్తూనే,మిట్కా ఆ గది తలుపు తెరిచాడు. నొప్పి బాధ, జరిగిన అవమానంతో రోషపడిన మిట్కా గట్టిగా అరిచాడు.
‘సరే,సెర్జి ప్లాటోనోవిచ్, ఈ విషయాన్ని నేను నీకే వదిలేస్తున్నాను. నేను కేవలం సరైన పని చేద్దామనుకున్నాను…… సరే ఆమె ఇప్పుడు ఎవరికి కావాలి? అందుకే నేను ఆమెను ఈ అవమానం నుండి తప్పిద్దామనుకున్నాను….అయినా ఎంగిలి ఎవరికి కావాలి?నమిలేసింది ఎవరు మాత్రం కోరుకుంటారు? ఆఖరికి కుక్క కూడా ముట్టదు.’
చేతి రుమాలను పెదాలకు అద్దుకుంటూ సెర్జి ప్లాటోనోవిచ్ బయటకు వెళ్తున్న మిట్కా వెంటపడ్డాడు. మిట్కా వాకిలిలోకి పరిగెత్తాడు. అక్కడ ఉన్న యెమెల్యెన్ ను చూసి సెర్జి ప్లాటోనోవిచ్ సైగ చేశాడు. గేటు వరకు మిట్కా వెళ్ళే లోపే నాలుగు కుక్కల గొలుసులు విప్పి అతని మీదకు వదిలాడు యెమెల్యెన్. తమ ఇంట్లో కొత్త వ్యక్తిని చూసిన ఆ కుక్కలు అతన్ని చుట్టుముట్టాయి.
1910 లో సెర్జి ప్లాటోనోవిచ్ నిజ్నీ నోవ్ గోరోడ్ నుండి ఒక మగ,ఒక ఆడ కుక్క పిల్లలను తీసుకువచ్చాడు. అవి నల్లగా, బొచ్చుతో, బలమైన పళ్ళతో ఉన్నాయి. ఒక్క సంవత్సరంలోనే అవి ఒక సంవత్సరం వయసు ఉండే ఆవు దూడ అంత పెరిగిపోయాయి.మొదట్లో అవి మొఖోవు ఇంటి వైపుగా వెళ్ళే స్త్రీల గౌన్లను చించేసేవి. తర్వాత అవి కాళ్ళ కింద కొరకడం నేర్చుకున్నాయి. ఎప్పుడైతే అవి ఫాదర్ పాన్ క్రెటి పాడి ఆవును,అట్యోపిన్ పందులను చచ్చేలా కరిసాయో, అప్పుడే సెర్జి ప్లాటోనోవిచ్ వాటిని కట్టేయమని పనివాళ్ళకు ఆజ్ఞ ఇచ్చాడు. వాటిని కేవలం రాత్రుళ్లు వదిలేవారు. అలాగే సంవత్సరానికి ఓ సారి వసంత కాలంలో మేటింగ్ కోసం కూడా వదిలేవారు.
మిట్కా వెనక్కి తిరిగే లోపే పెద్ద కుక్క బయాన్, అతని కోటులో తన పళ్ళు దించింది. మిగిలిన కుక్కలు అతని చుట్టూ గుంపు కూడి కాళ్ళు పీకుతున్నాయి. మిట్కా కింద పడకుండా ప్రయత్నిస్తూ,వాటిని తన చేతులతో ఎదుర్కుంటున్నాడు. యెమెల్యెన్ పొగాకు వెలిగించుకుని, వంట గదిలోకి వెళ్ళి, తలుపు గట్టిగా వేసుకోవడం, ఓ వైపు నుండి మిట్కా చూశాడు.
సెర్జి ప్లాటోనోవిచ్ ఆ వసారాలో ఓ మూల నుంచుని, రైలింగ్ కు ఆనుకుని, తన చిన్న తెల్ల పిడికిళ్ళను గట్టిగా రోమాలు నిక్కబొడుచుకునేలా బిగించాడు. తత్తరపడుతూనే,మొత్తానికి ఆ గేటు తెరిచి,ఆ కుక్కలు చేసిన గాయాలతో బయటకు వచ్చాడు. రోడ్డు మీద వెళ్తున్న కొందరు కోసాక్కుల సాయంతో బయాన్ ప్రాణం పోయేలా కొట్టి,మిగిలిన కుక్కలను కూడా బాదాడు.
అధ్యాయం-3
నటాల్య మెలఖోవుల ఇంట్లో చక్కగా ఒదిగిపోయింది. మిరోన్ తన పిల్లలను క్రమశిక్షణతో పెంచాడు; ధనవంతుడు అయినప్పటికి, వ్యవసాయంలో కూడా ఉండటం వల్ల, అతను తన పిల్లలను వ్యవసాయ పనుల్లో కూడా పట్టు ఉండేలా శిక్షణ ఇచ్చాడు. సహజంగానే కష్టపడే స్వభావం గల నటాల్య త్వరగానే తన అత్తమామల హృదయాలను గెలుచుకుంది. నిజం చెప్పాలంటే ఇలినిచ్నకు తెలివిగా వ్యవహరిస్తూ,ఎప్పుడూ బట్టలను మాత్రమే ఇష్టపడే పెద్ద కోడలు దర్య అంటే పెద్దగా ఇష్టం లేదు;అందువల్ల నటాల్య ఆమెకు ఇంకా బాగా నచ్చింది.
‘చక్కగా నిద్రపో,బంగారు తల్లి! అప్పుడే ఎందుకు నిద్ర లేచావు?’వంట గదిలో ఉన్న తివాచీ మీద గట్టిగా నడుస్తూ, ‘పో,వెళ్ళి నిద్రపో…లేకపోతే అందం కూడా చెడిపోతుంది’, అని ముద్దు చేసేది చిన్న కోడలిని.
ఉదయమే అత్తగారికి వంతలో సాయం చేద్దామని నిద్ర లేచిన నటాల్య ఆ మాటలతో మళ్ళీ వెనక్కి తిరిగి తన పడక గదిలోకి వెళ్ళిపోయేది.
ఇంటి పనుల విషయంలో ఎంతో కఠినంగా ఉండే పాంటెలి కూడా తన భార్యతో, ‘నటాల్యను నిద్ర లేపకు. తను రోజంతా పని చేసి అలిసిపోతూ ఉంటుంది. తను గ్రీక్షాతో కలిసి పొలం దున్నడానికి వెళ్తుంది. నువ్వు ఆ దర్య వెంటే పడు…. పందిలా బద్ధకంగా ఉంటుంది….బుగ్గలకు ఏదో ఎర్రది పులుముకుంటూ, కనుబొమ్మలు నల్లగా దిద్దుకుంటూ ఉంటుంది,ఆ దయ్యం’, అనేవాడు.
‘అవును, ఓ మొదటి సంవత్సరం తనకు కాస్త విశ్రాంతి ఇస్తేనే మంచిది’, ఇలినిచ్న తన కాపురం మొదటి రోజుల్లో చేసిన గొడ్డు చాకిరి గుర్తూ చేసుకుంటూ గట్టిగా నిట్టూరుస్తూ అన్నది.
గ్రెగరి క్రమంగా తన కొత్త వైవాహిక జీవితానికి అలవాటు పడి, కొంత కఠినత్వాన్ని వదులుకున్నాడు. కానీ వివాహమైన మూడవ వారానికే అతను కోపం మరియు భయంతో, తను ఇంకా అక్సిన్యను మరచిపోలేదని,ఆమె జ్ఞాపకాలు ఇంకా తన గుండెల్లో ముల్లులా గుచ్చుతూనే ఉన్నాయని గ్రహించాడు. ఆ నొప్పి త్వరగా వదిలేది కాదని అనిపించింది అతనికి. కొత్త భార్య సాంగత్యంలో ఆ నొప్పి తగ్గిపోతుందని మొదట్లో కొట్టిపారేసినా,ఆ గాయం ఇంకా మానే సూచనలు అతనికి సమీపంలో కనిపించడం లేదు. ఆ జ్ఞాపకాలు చేసిన గాయాలు ఇంకా రేగుతున్నాయే తప్ప మానడం లేదు. వివాహానికి ముందు పంట నూర్చే సమయంలో పెట్రో అతన్ని ఒక రోజు అడిగాడు.
‘మరి అక్సిన్య సంగతేమిటి, గ్రీక్షా?’
‘ఆమె సంగతి ఏముంది?’
‘నువ్వు ఆమెను విడిచి పెట్టినందుకు బాధ పడతావు.’
‘నేను విడిచిపెడితే, ఇంకొకడు తగులుకుంటాడు’, గ్రెగరి నవ్వుతూ అన్నాడు.
‘సరే,ఏదైనా ఆలోచించి చేయి’, పెట్రో తన గడ్డాన్ని సరి చేసుకుంటూ, ‘ఇప్పుడు నువ్వు అనుకున్నా,అంత త్వరగా వదిలెయ్యలేవు’,అన్నాడు.
‘వయసు పెరిగే కొద్ది, వేడి తగ్గిపోతుందిలే’,గ్రెగరి బదులిచ్చాడు.
కానీ రాత్రి సమయాల్లో భార్యకు దగ్గరై, యవ్వన ఉత్సాహంతో ఉన్నప్పుడూ, అతనికి భార్య నుండి ఊహించిన స్పందన వచ్చేది కాదు. ఓ బాధ్యతగా ఆమె అతనికి లొంగిపోయేది. నటాల్యకు అతను ఊహించిన కోరికలు ఉన్నట్టు అనిపించేది కాదు. ఆమె తల్లి నుండి నెమ్మదిగా ఉండే,స్పందించని రక్తాన్ని వారసత్వంగా పొందింది. అక్సిన్యతో అనుభవాన్ని గుర్తు తెచ్చుకుంటూ, గ్రెగరి నిట్టూరుస్తూ, ‘మీ నాన్న నిన్ను మంచులా పుట్టించినట్టున్నాడు,నటాల్య….నువ్వు ఎప్పుడూ చల్లగానే ఉంటావు’,అనేవాడు.
ఎప్పుడైనా గ్రెగరి ఎదురుపడినప్పుడు అక్సిన్య అతని వైపు చూసి ముసిముసిగా నవ్వుతూ, పరిహాసంగా మాట్లాడేది.
‘హలో, గ్రీషా! జీవితం ఎలా ఉంది? నీ కుర్ర భార్య నిన్ను బాగా ప్రేమిస్తుందా?’
‘బాగానే ఉంది’,అని బదులిచ్చి, తననే పట్టి పట్టి చూస్తున్న ఆమె చూపుల నుండి తప్పించుకోవడానికన్నట్టు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయేవాడు.
స్టీఫెన్ కు అతని భార్యకు మధ్య సయోధ్య కుదిరినట్టు ఉంది . అతను సారాయి కొట్టు దగ్గర తక్కువ సేపు ఉండేవాడు. ఒక సాయంత్రం ధాన్యం ఆడుతున్న సమయంలో, చాలా నెలల తర్వాత భార్యతో ప్రేమగా , ‘అక్సిన్యా, మనం కలిసి ఒక పాట పాడదాము,రా’,అన్నాడు.
వాళ్ళిద్దరూ ఆ ధాన్యపు కొట్టంలో ఒక గోడకు ఆనుకుని కూర్చున్నారు. స్టీఫెన్ సైన్యంలో ఉన్నప్పుడూ పాడే పాట ఒకటి అందుకున్నాడు, దానికి అక్సిన్య తన గొంతు కూడా కలిపింది. పెళ్ళయిన మొదటి సంవత్సరంలో పాడినట్టు లయబద్ధంగా,మధురంగా పాడుతున్నారు.
పెళ్ళయిన కొత్తలో పొలం నుండి ఇంటికి తిరిగి వస్తూ, సూర్యుడు కాషాయ వర్ణంలోకి మారి అస్తమిస్తున్న వేళ, స్టీఫెన్ గుర్రాలను అదిలిస్తూ,ఊగుతూ, విషాదకరమైన పాటను అందుకునేవాడు. భర్త భుజం మీద తల పెట్టుకుని అక్సిన్య కూడా ఆ పాటను అందుకునేది. గుర్రాలు బండిని లాగుతున్నప్పుడు, చక్రాలు కిర్రుమని చేసే చప్పుడుతో పాటు ఆ గ్రామంలోని పెద్ద వాళ్ళు ఆ పాటను కూడా వినేవారు కొంత దూరం నుండే.
‘స్టీఫెన్ చక్కటి స్వరం ఉన్న పెళ్ళాన్ని తెచ్చుకున్నాడు.’
‘ఎంత చక్కటి జంట!’
‘స్టీఫెన్ స్వరం కూడా చాలా చక్కగా ఉంది.’
ఇంటి అరుగుల మీద కూర్చుని,సూర్యోదయం అయిపోయేవరకు కబుర్లు చెప్పుకునే ఆ ఊరి వారంతా ఆ పాట గురించే మాట్లాడుకుంటూ ఉండేవారు.
‘వాళ్ళు పాడుతున్న పాట లోయ గురించి చెప్పేది.’
‘హే…ఆ పాట జార్జియాకు సంబంధించినది.’
‘కిర్యుష్కా కు ఆ పాట అంటే ఇష్టం ఉండటంలో ఆశ్చర్యం ఏమి లేదు,అతని ఆత్మ శాంతించు గాక!’
గ్రెగరి సాయంత్రాలు అష్టకోవుల ఇంటి నుండి వినబడే పాటలను వినేవాడు. పంట నూర్చే సమయంలో(ఆ రెండు కుటుంబాల ధాన్యపు కొట్టాలు ఒక దాని పక్కనే మరొకటి ఉండటం వల్ల) అతను అక్సిన్య ఎప్పటిలానే సంతోషంగా ఉన్నట్టు కనిపించేది. అది నిజమైనా కాకపోయినా అతనికి మాత్రం అలాగే అనిపించేది.
స్టీఫెన్ మెలఖోవులతో అస్సలు మాట్లాడటమే మానేశాడు. అతను పంట నూర్చడానికి ఆ పనిముట్లను భుజం మీద వేసుకుని,భార్యతో సరదాగా,హాస్యంగా మాట్లాడుతూ బయలుదేరేవాడు. భర్త పరిహాసానికి అక్సిన్య నవ్వుతూ ఉంటే ఆమె నల్ల కళ్ళు మెరుస్తూ ఉండేవి. కళ్ళు మూసుకుంటే గ్రెగరి కళ్ళ ముందు ఆమె పచ్చ గౌనే ప్రత్యక్షమయ్యేది,ఏదో తెలియని శక్తి అతని తలను స్టీఫెన్ ధాన్యపు కొట్టం వైపు తిరిగేలా చేసేది. పంట నూర్పుల సమయంలో ధాన్యాన్ని పాంటెలితో కలిసి పరుస్తున్న నటాల్య భర్త దృష్టిని గమనించి,ఎలా బాధతో,అసూయతో రగిలిపోయేదో గ్రెగరి గుర్తించలేకపోయాడు. అలాగే తను గుర్రాలను నడుపుతూ దూరం నుండే తమ్ముడు చూపును చూస్తున్న పెట్రోను కూడా గ్రెగరి చూడలేదు.
ఈ హడావుడిలో గ్రెగరి తనకు అర్థం కానిది ఏదో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు.
పంట నూర్పుల ధ్వనులు, గుర్రపు బండ్లు నడిపే వాళ్ళ అరుపులు, కొరడాల అదిలింపులు,అమ్మలక్కల కబుర్లుతో ఆ పంట కాలం గడిచిపోయింది. ఇప్పుడు గ్రామమంతా పంటలు పండి, సెప్టెంబర్ సూర్యకాంతిలో పంటలతో ఆ డాన్ ప్రాంతమంతా రోడ్డు మీద పడగ విప్పిన పాములా నిలబడినట్టు ఉంది. ప్రతి వాకిట్లో,కంచె వెనుక, ప్రతి కుటుంబంలోనూ కష్ట-సుఖాలు దోబుచులాడుతూనే ఉన్నాయి. గ్రీక్షా తాతయ్యకు జలబు చేసింది,అలాగే పంటి నొప్పి ఎక్కువైంది. సెర్జి ప్లాటోనోవిచ్ తన చదువుకునే గదిలో పుస్తకాల మధ్యలో తన తలను దూర్చి,పళ్ళు నూరుతూ, అవమానంతో బాధ పడుతూ ఉన్నాడు. స్టీఫెన్ గ్రెగరి పట్ల ఉన్న ద్వేషాన్ని రాత్రుళ్ళు గుర్తుకు తెచ్చుకుంటూ, తను కప్పుకున్న దుప్పటి చుట్టూ తన చేతిని గట్టిగా బిగించేవాడు,నటాల్య ధాన్యపు కొట్టం లోకి పిడకలు ఉన్న చోటుకు పరుగెత్తుకుంటూ వెళ్ళి,తన జీవితం నుండి దూరమైపోయిన సంతోషాన్ని తలుచుకుంటూ కుమిలిపోయేది. ఖ్రిస్టోన్య ఒక జాతరలో ఆవు దూడను అమ్మి,ఆ డబ్బుతో పూటుగా తాగేసి,తర్వాత తను చేసిన చర్యకు పశ్చాత్తాపపడ్డాడు. గ్రెగరి తన గుండెను మెలిపెడుతున్న గాయాన్ని తలచుకుంటూ గాఢంగా నిట్టూర్చేవాడు. అక్సిన్య తన భర్త ఎద మీద పడుకుని, తన కన్నీళ్ళతోనే అతని మీద ఉన్న ద్వేషాన్ని కడిగివేసేది.
మిల్లులో తన ఉద్యోగం పోగొట్టుకున్న దవ్యోడ్కా రాత్రుళ్ళు నేవ్ తో ఇటుక బట్టీ దగ్గర కూర్చుని, క్రోధంతో కళ్ళు ఎర్రబడుతూ ఉండగా, ‘వాళ్ళు చేసిన దానికి అనుభవిస్తారు. ఇది ఊరికే పోదు. త్వరలోనే వాళ్ళ పీకలు కోయబడతాయి. ఒక్క విప్లవం సరిపోదు ఇలాంటి వారికి!ఇంకో 1905 విప్లవం రావాలి,అప్పుడు కానీ వాళ్ళకు తగిన శిక్ష పడదు. అవును,అది జరిగే తీరుతుంది!’ చూపుడు వేలుతో బెదిరిస్తున్నట్టు అంటూ, ముందుకు జారిపోతున్న కోటును వెనక్కి లాక్కునేవాడు.
ఆ గ్రామంలో మెల్లగా రోజులు-రాత్రులుగా, వారాలు,నెలలుగా గడచిపోయాయి.బలమైన గాలులు వీస్తూ, కొండ వైపు నుండి అప్పుడప్పుడు ప్రతిధ్వనులు వినవస్తూ, ఏదో మంచిది కానిది జరగబోతుంది అన్నదానికి సూచనగా ఆ ప్రకృతి ఉన్నట్టు ఉంటే, డాన్ నదిలోని నీరు మాత్రం వీటితో సంబంధం లేకుండా ప్రవహిస్తూనే ఉంది.
అధ్యాయం-4
అక్టోబర్ నెల చివరిలో ఓ ఆదివారం నాడు ఫెడోట్ బొడోష్కోవ్ స్టానిట్సాకు ప్రయాణమై వెళ్ళాడు.
అతను వెళ్ళేటప్పుడు బుట్టలో ఏపుగా పెరిగిన నాలుగు బాతులను కూడా తీసుకువెళ్ళి అక్కడ మార్కెట్ లో అమ్మేశాడు. అలాగే అక్కడ ఓ షాపులో తన భార్య కోసం చక్కటి ప్రింట్ ఉన్న కాటన్ గౌను కొని,తిరిగి వెళ్ళబోతున్నాడు(అప్పుడే గుర్రం జీను సరిచేస్తున్నాడు). అప్పుడు ఆ ప్రాంతానికి అపరిచితుడు అయిన ఓ వ్యక్తి,అలాగే కోసాక్కు కానీ వ్యక్తి అతని ఎదురుగా నిలబడ్డాడు.
‘శుభ మధ్యాహ్నం!’ తన నల్ల టోపీ అంచును తాకుతూ, బొడోష్కోవ్ ను పలకరించాడు అతను.
‘మధ్యాహ్నం!’ ఫెడోట్ తన కాల్మక్ కళ్ళను చిన్నవి చేసి ఆ అపరిచితుడిని చూస్తూ గొణుగుతూ అన్నాడు.
‘మీరు ఎక్కడి నుంచి?’
‘ఓ గ్రామం నుండి, ఇక్కడి నుంచి కాదు.’
‘ఏ గ్రామం?’
‘టాటర్ స్కై.’
ఆ అపరిచితుడు తన జేబులో నుండి పైన బొమ్మ చెక్కి ఉన్న ఓ సిగరెట్ పెట్టె బయటకు తీసి,అందులో నుండి ఓ సిగరెట్ ఫెడోట్ ను తీసుకోమన్నట్టు, ముందుకు పెట్టి, తన ప్రశ్నలను కొనసాగించాడు.
‘మీ గ్రామం చాలా పెద్దదా?’
‘వద్దు. నేను ఇప్పుడే ఒకటి కాల్చాను. మా గ్రామమా? హా, చాలా పెద్దది. దాదాపుగా మూడు వందల గడపలు ఉంటాయి.’
‘అక్కడ చర్చి ఉందా?’
‘హా, ఉంది.’
‘కంసాలి ఉన్నారా?’
‘ఉన్నారు.’
‘అక్కడ మిల్లుకి వర్క్ షాప్ ఉన్నదా?’
నిలుచుని ఉన్న గుర్రాన్ని కొరడాతో అదిలిస్తూ, ఫెడోట్ అనుమానంగా ఆ అపరిచితుడి నల్ల టోపీ వంక, అతని చిన్న గడ్డం వంక చూస్తూ, ‘నీకు ఏం కావాలి?’ అని అడిగాడు.
‘నేను నా కుటుంబంతో సహా మీ గ్రామంలో స్థిరపడదామనుకుంటున్నాను. నేను ఇప్పుడే స్థానిక అటామన్ దగ్గరకు వెళ్ళి వచ్చాను. మీరు ఒక్కరే వెళ్తున్నారా?’
‘అవును.’
‘అయితే మీరు నాకు లిఫ్ట్ ఇవ్వగలరా? కాకపోతే నేను ఒక్కడినే లేను. నాతో పాటు నా భార్య, రెండు బరువైన పెట్టెలు ఉన్నాయి.’
‘నేను అన్నిటిని తీసుకువెళ్ళగలను.’
ఒక రెండు రూబుళ్ళు ఇచ్చేలా ఆ అపరిచితుడు ఒప్పందం చేసుకున్నాక, ఫెడోట్ తన గుర్రపు బండిని అతని కుటుంబం ఉన్న పిండి మర దగ్గరకు పోనించాడు. అక్కడ చిన్నగా ఉన్న ఓ స్త్రీని బండిలో ఎక్కేందుకు సాయం చేసి, సామానును కూడా బండిలో సర్దాడు.
వాళ్ళు స్టానిట్సాను దాటేశారు. ఫెడోట్ తన పెదాలు తడి చేసుకుంటూ, గుర్రాన్ని అదిలిస్తూ, తన తలను పదేపదే వెనక్కి తిప్పుతూ ఉన్నాడు, అతను కుతూహలంతో చచ్చిపోయేలా ఉన్నాడు. అతని వెనుక కూర్చున్న ఆ దంపతులు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు. ఆ మౌనాన్ని ఛేదించడానికి ఫెడోట్ అతన్ని ఒక సిగరెట్ అడిగి, ఆ తర్వాత, ‘మీరు ఎక్కడ నుండి వస్తున్నారు?’ అని అడిగాడు.
‘రోస్తోవ్.’
‘మీ స్వస్థలం అదేనా?’
‘ఏమడిగారు?’
‘నేను ఏం అడుగుతున్నానంటే: మీరు పుట్టింది అక్కడేనా?’
‘హా,అవును. మేము అక్కడి నుంచే వస్తున్నాము. మేము రోస్తోవ్ ప్రజలము.’
గోధుమ రంగులో ఉన్న ఫెడోట్ బుగ్గలు ముడతలు పడ్డాయి, దూరంగా కనిపిస్తున్న పచ్చిక మైదానంలో ఉన్న కలుపుమొక్కలను చూశాక. ఏటవాలుగా ఉన్న ఆ మైదాన దారిలో ముందుకు వెళ్తే ఒక కొండ ఉంది, అక్కడ గోధుమ రంగులో ఎండిపోయిన గడ్డి ఉంటే, దాదాపు అర వెరస్టు దూరం ముందే ఫెడోట్ కాల్మక్ కళ్ళు ఆ గడ్డి దగ్గర గుంపులుగా కదులుతూ ఉన్న బట్టమేక పిట్టలను పసిగట్టాయి.
‘నా దగ్గర తుపాకి లేదు కానీ, ఉంటే మాత్రం ఆ పిట్టలను కాల్చి పడేసేవాడిని, చూడండి అవి అలా అక్కడే తిరుగుతూ ఉన్నాయో’, గట్టిగా నిట్టూరుస్తూ,అటు వైపు చూపిస్తూ అన్నాడు.
‘నేను అయితే అలా చేయలేను’,ఆ అపరిచితుడు చిన్నగా కన్ను కొడుతూ నిజాయితీగా ఒప్పుకున్నాడు.
ఫెడోట్ ఆ పక్షులు అక్కడి నుండి మెల్లగా దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళేవరకు చూసి, తన బండిలో ఉన్న వారి వైపు తన దృష్టిని మళ్ళించాడు. ఆ మనిషి మధ్యస్థ ఎత్తుతో,సన్నగా ఉన్నాడు. అతని కళ్ళు మూసినప్పుడు, కళ్ళ కింద చిన్న సొట్ట పడుతూ ఉంది. అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు పదేపదే నవ్వుతున్నాడు. శాలువా కప్పుకుని ఉన్న అతని భార్య కునికిపాట్లు పడుతూ ఉంది. ఆ శాలువ వల్ల ఫెడోట్ ఆమె ముఖాన్ని సరిగ్గా చూడలేకపోయాడు.
‘ఎందుకు మీరు మా గ్రామంలో ఉండాలనుకుంటున్నారు?’
‘నేను ఒక మెకానిక్ ను. ఒక చిన్న వర్క్ షాప్ మొదలుపెట్టాలనుకుంటున్నాను. నాకు క్యాబినెట్లు చేయడంలో కూడా కొంత అనుభవం ఉంది.’
ఫెడోట్ పెద్దగా ఉన్న అతని చేతుల వైపు అనుమానంగా చూశాడు. ఫెడోట్ చూపును గమనించిన అతను, ‘కుట్టు మెషిన్లు అమ్మే ‘సింగర్ కంపెనీ’ కు నేను ఏజెంట్ గా కూడా పని చేస్తున్నాను’,అన్నాడు.
‘నీ పేరు ఏమిటి?’ ఫెడోట్ అడిగాడు.
‘నా పేరు స్టోక్ మాన్.’
‘అంటే నువ్వు రష్యన్ వి కాదా?’
‘నేను రష్యన్ నే. కానీ మా తాతయ్య లాట్వియాకు చెందినవాడు.’
తర్వాత అట్టే సమయం పట్టకుండానే ఫెడోట్, ఆ మెకానిక ఓసిప్ స్టోక్ మాన్ అంతకుముందు అక్సాయి ఫ్యాక్టరీలో,ఆ తర్వాత క్యూబన్ దేశంలో,ఆ తర్వాత ఆగ్నేయ రైల్వే వర్క్ షాపుల్లో పని చేశాడన్న విషయాలు తెలుసుకున్నాడు. అతి ఆతురత గల నాలుక వల్ల ఫెడోట్ ఆ అపరిచితుని జీవితం గురించి అనేక విషయాలు సేకరించగలిగాడు.
వాళ్ళు రాష్ట్ర అడవి ప్రాంతం సమీపానికి వచ్చేసరికి, వారి సంభాషణ ఆగిపోయింది. అక్కడ రోడ్డు పక్కన ఉన్న ఓ కాలువ దగ్గర, చెమటపట్టి, రొప్పుతూ ఉన్న గుర్రానికి నీళ్ళు తాగించాడు.అప్పటికే అలసిపోయి ఉన్న ఆ గుర్రం నిద్రకు జోగుతూ ఉంది. అప్పటికి ఇంకా గ్రామం ఐదు వెరస్టుల దూరంలో ఉంది.
తన మోచేతి చుట్టూ ఉన్న గుర్రపు కళ్ళెమును తీసి, తన పాదాలు పైకి పెట్టుకుని,ఫెడోట్ సౌకర్యంగా బండి మీదకు ఎక్కి,ఆ గుర్రాన్ని నిద్ర పోనివ్వకుండా ముందుకు దౌడు తీయించాడు.
‘గ్రామంలో జీవితం ఎలా ఉంది?’ బండి కుదుపులకు ముందుకు,వెనక్కి కదులుతూ అడిగాడు స్టోక్ మాన్.
‘బాగానే ఉంది.’
‘సాధారణంగా మీ కోసాక్కులు మీ జీవితం పట్ల సంతృప్తిగా ఉన్నారా?’
‘కొందరు ఉన్నారు,కొందరు లేరు. ప్రతి ఒక్కరూ అందరిని సంతృప్తి పరచలేరు.’
‘అవునవును’, ఆ మెకానిక్ ఆ మాటలతో ఏకీభవించాడు. కాసేపు విరామం తీసుకుని, అతను తను అడగాలనుకున్న ప్రశ్నలను నేర్పుగా,తెలివిగా అడగటం మొదలుపెట్టాడు.
‘అంటే,మీరు బాగానే ఉన్నారని అంటున్నావు,అంతేనా?’
‘అవును.’
‘సైన్యంలో పని చేయడం మీకు భారంగా అనిపిస్తూ ఉంటుంది.అవును కదా?’
‘సైన్యంలో పని చేయడమా? మాకు అది అలవాటు అయిపోయింది. అప్పుడే నిజంగా జీవితం అంటే ఎంతో తెలుస్తుంది….అక్కడ పని చేస్తున్నప్పుడే.’
‘కాకపోతే ఇందులో నష్టం కలిగించే విషయం ఏమిటంటే, కోసాక్కులే తమ ఖర్చులతోనే బట్టల ఖర్చుల నుండి చూసుకోవాలి.’
‘అవును …..చాలా భయంకరమైన విషయమది’,అంటూ ఫెడోట్ భళ్ళున నవ్వుతూ, పరీక్షగా ఆ స్త్రీ వైపు చూశాడు.ఆమె తన ముఖం తిప్పేసుకుంది. ‘మా వైపు అధికారులు చాలా దారుణంగా ఉంటారు….నేను సైన్యానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, నేను మాకున్న ఎద్దులను అమ్మి నా కోసం ఒక గుర్రాన్ని కొనాల్సి వచ్చింది. తీరా అక్కడకు వెళ్ళాక,ఆ గుర్రం పనికిరాదని తిరస్కరించారు,’ఫెడోట్ సంభాషణ కొనసాగించాడు.
‘తిరస్కరించారా?’ఆ మెకానిక్ ఆశ్చర్యంతో అడిగాడు.
‘అవును,వెంటనే.వాళ్ళు దాని కాళ్ళు సరిగ్గా లేవని అన్నారు. నేను వాళ్ళను ఒప్పించడానికి ప్రయత్నించాను. “నా పరిస్థితిలో ఉండి ఆలోచించండి. అది పందెం గుర్రంలా పరిగెడుతుంది. కాకపోతే నడకలో కొద్దిగా అలా కోడిపుంజులా ఉందే తప్ప,చాలా మంచి గుర్రం”అని వాళ్ళకు చెప్పాను. కానీ వాళ్ళు వినిపించుకోలేదు.మొత్తానికి అది అలా నాశనమైంది.”
అప్పటి నుండి ఆ సంభాషణ మంచి హుషారుగా మారింది. ఫెడోట్ ఎంతో ఉత్సాహంగా వేగంగా గుర్రాన్ని దౌడు తీయిస్తూ,ఆ గ్రామంలో ఉన్న జనాల గురించి మాట్లాడాడు. ఆ తర్వాత గ్రామంలో అటామన్లు ఎంత అన్యాయంగా పచ్చిక బీడులో నేలను పంచారో అని వారిని తిట్టాడు, తను పని చేస్తున్న రెజిమెంటు ఉన్న పోలాండ్ లో అది ఎంత న్యాయంగా జరుగుతుందో కూడా చెప్పాడు. దాదాపుగా మూసినట్టు ఉండే ఆ మెకానిక్ కళ్ళు జాగ్రత్తగా ఫెడోట్ నే గమనిస్తూ ఉన్నాయి. తన సిగరెట్ పెట్టెలో నుండి ఒక సిగరెట్ తీసి వెలిగించి,దానిని కాలుస్తూ,పదేపదే నవ్వుతూ, అతని కనుబొమ్మల మధ్య ప్రదేశం ఆ నవ్వుకు అనుగుణంగా మెల్లగా కదులుతూ, అతని లోపలి ఆలోచనలను బయటకు కనపకుండా కాపాడుతున్నట్టు ఉంది.
ఆ సాయంత్రం అయ్యేసరికి వారు గ్రామానికి చేరుకున్నారు.
ఫెడోట్ సలహాపై స్టోక్ మాన్ విధవైన లుకేష్క పోపోవ దగ్గరకు వెళ్ళి, ఆమె ఇంట్లో ఉన్న రెండు గదులు అద్దెకి తీసుకున్నాడు.
‘స్టానిట్సా నుండి ఎవరిని తీసుకువచ్చావు?’ ఫెడోట్ తన ఇంటి గేటు దగ్గరకు వచ్చేసరికి పొరుగింటావిడ అడిగింది.
‘ఒక ఏజెంట్ ను.’
‘ఏ రకమైన ఏజెంట్?’
‘ఓ ,ఎంత మూర్ఖపు స్త్రీవి నువ్వు! నేను నీకు చెప్పా కదా,అతను ఒక ఏజెంట్ అని. కుట్టు మెషిన్లు అమ్ముతాడు. అందంగా ఉన్న స్త్రీలకు అవి ఉచితంగా ఇస్తాడు. మర్యా ఆంటీ,కానీ అసహ్యంగా ఉండే నీలాంటి వారి దగ్గర మాత్రం డబ్బులు తీసుకుంటాడు.’
‘నీ లాంటి దయ్యాలు ఇలాగే మాట్లాడతాయి. ఆ కాల్మక్ కళ్ళు చూడు, ఎంత భయంకరంగా ఉన్నాయో…గుర్రాలు దడుచుకుని ఛస్తాయి!’
‘కాల్మక్ లు, టాటార్ లు ఒకేసారి ఈ పచ్చిక మైదానంకు వచ్చారు,మాట్లాడే ముందు నోరు అదుపులో ఉంచుకో!’ ఫెడోట్ గట్టిగా బదులిచ్చాడు.
స్టోక్ మాన్ ఒక్క రాత్రి కూడా అక్కడ గడపకముందే, వదంతులను ఇష్టపడే లుకేష్కా ఇంటి దగ్గర ఉన్న స్త్రీలు మొదలుకుని, గ్రామం మొత్తం స్త్రీలంతా దాని గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
‘నువ్వు విన్నావా?’
‘ఏంటది?’
‘ఆ కాల్మక్ ఫెడోట్ ఒక జర్మన్ ను తీసుకువచ్చాడట.’
‘నిజంగానా?’
‘ఓ దేవుడా! నువ్వే మమ్మల్ని కాపాడాలి! అతను కిరీటం లాంటి టోపీ ధరిస్తాడు, అతని పేరు శ్తోపోల్ లేకపోతే శ్తోకోల్ అనుకుంటా…’
‘అతను పోలీసు అనుకుంటా?’
‘కాదు,అతను ఒక సుంకరి,అమ్మాయి.’
‘లేదు,అవన్నీ అబద్ధాలు. అతను ఒక అకౌంటెంట్ అంటా,వాళ్ళు చెప్పుకుంటున్నారు,ఫాదర్ పాంక్రాటి కొడుకులా.’
‘నా ప్రియమైన పిల్లా…పాష్కా…త్వరగా లుకేష్కా దగ్గరకు వెళ్ళి అతని గురించి తెలుసుకుని రా.’
‘అమ్మాయి,త్వరగా పరుగెత్తుకుంటూ వెళ్ళు,సరేనా?’
తర్వాతి రోజు ఆ కొత్త వ్యక్తి అటామన్ దగ్గరకు వెళ్ళాడు.
తన ఆఫీసులోని ఉద్యోగులతో దాదాపుగా మూడేళ్ళు ఆఫీసును నడుపుతున్న ఫ్యోడోర్ మనిత్స్కోవ్, నల్లటి గుడ్డ కప్పి ఉన్న పాసుపోర్టును అటు,ఇటు తిప్పి చూశాడు. ఆ తర్వాత దానిని అక్కడ పని చేస్తున్న గుమాస్తా, యెగోర్ జార్కోవ్ జాగ్రత్తగా పరిశీలించాడు. ఆ ఇద్దరి ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకుని,సైగలు చేసుకున్నాక, తన పాత అధికార ధోరణిలో,ఆ అటామన్, తన భుజాలు ఎగురవేసి, ‘నువ్వు ఇక్కడ ఉండొచ్చు’,అన్నాడు.
ఆ కొత్త మనిషి వారికి నమస్కరించి అక్కడ నుండి బయల్దేరాడు. ఒక వారం పాటు బొర్రెలో దాక్కున్న ఎలుకలా అతను ఇంట్లో నుండి బయటకు రాలేదు. అక్కడ పాతబడిన వంటగదిలో తన వర్క్ షాపు ఏర్పాటు చేసుకుని,అక్కడ అతను గొడ్డలితో కొడుతున్న శబ్దం తప్ప ఇంకేమీ వినవచ్చేది కాదు. అప్పటికే ఆ ఊరిలోని స్త్రీలకు ఆసక్తి సన్నగిల్లి, కేవలం పిల్లలు మాత్రం ఆ ఇంటి కంచె చుట్టూ తిరుగుతూ, ఆ అపరిచితుడిని కుతూహలంతో ఆసక్తిగా చూసేవారు.
* * *
అధ్యాయం-5
పంటలు బాగా పండాలని, పశుసంపద వృద్ధి చెందాలని గ్రామం అంతా ప్రార్థించే రోజు ఇంకా మూడు రోజులు ఉందనగా, గ్రెగరి మరియు అతని భార్య, పొలం దున్నడానికి బయలుదేరారు. పాంటెలికి ఒంట్లో బావుండలేదు;అయినప్పటికి వారిని పంపించడానికి బయటకు వచ్చాడు, చేతి కర్రను ఆసరా చేసుకుని, వెన్ను నొప్పి వల్ల మూలుగుతూ ఉన్నాడు.
‘గ్రీక్షా, రెడ్ రెవైన్ కు అవతల వైపు ఉన్న రెండు భాగాలను దున్నండి’,అన్నాడు.
‘సరే,మరి విల్లో రెవైన్ దగ్గర భాగం సంగతి ఏమిటి?’ చేపలు పట్టినప్పుడు జలుబు చేయడం వల్ల, గొంతుకి బ్యాండెజ్ కట్టి ఉండటంతో, చిన్నగా అడిగాడు తండ్రిని.
‘అది సెలవు దినం తర్వాత. ఇప్పటికే చేయాల్సింది చాలా ఉంది. రెడ్ రెవైన్ దగ్గర దాదాపు పదిహేను ఎకరాల దాకా ఉంది. మరి అత్యాశపడకు.’
‘మాకు సాయంగా పెట్రో రాడా?’
‘అతను దర్యాతో కలిసి మిల్లుకి వెళ్తున్నాడు. అక్కడ రద్దీ మొదలవ్వక ముందే మనం గోధుమలు పిండి పట్టించాలి.’
ఇలినిచ్న అప్పుడే కాల్చిన రెండు బన్నులను నటాల్య బ్లౌజులో వేస్తూ, ‘మీరు వెళ్తూ దున్యక్షను కూడా ఎద్దులతో దున్నడానికి సాయంగా తీసుకెళ్ళకూడదు?’ అని గుసగుసగా అన్నది.
‘పర్లేదు,మేము చూసుకోగలము.’
‘సరే,ఇది మీకు సంబంధించినది,మీ ఇష్టానుసారం చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక!’
అప్పుడే దున్యక్ష ఆ వాకిలిలోకి నడిచింది,ఆమె సన్నటి శరీరం, నానబెట్టిన బట్టల బరువులో వంగిపోయినట్టు ఉంది.ఆమె ఆ బట్టలను డాన్ నదిలో ఉతకడానికి తీసుకెళ్ళడానికి బయల్దేరింది.
‘నా ప్రియమైన నటాల్య, ఆ రెడ్ రెవైన్ దగ్గర చాలా పాలకూర ఉంటుంది. కొద్దిగా తీసుకురావా!’
‘నేను చాలానే తెస్తాను!’
‘నువ్వు నోర్ముయ్యి,వదరుబోతా!’ పాంటెలి తన చేతి కర్రతో గట్టిగా నేల మీద కొడుతూ అన్నాడు.
మూడు జతల ఎద్దులు తలకిందులుగా ఉన్న నాగలిని రోడ్డు మీద లాగుతూ ఉంటే, వాతావరణపు వేడికి ఎండిపోయినట్టు ఉన్న భూమిపై ఆ ముద్రలు గట్టిగా పడ్డాయి. గ్రెగరి పెద్ద పెద్ద అంగలతో రోడ్డుకి ఒక వైపు నడుస్తూ, తన గొంతుకి కట్టి ఉన్న కట్టుని తడుముకుంటూ,దగ్గుతూ ఉన్నాడు. ఆహారం పెట్టి ఉన్న సంచిని వెనక తగిలించుకుని,నటాల్య అతని పక్కనే నడుస్తూ ఉంది.
చల్లగా,గడ్డకట్టినట్టు ఉన్న నిశ్శబ్దమేదో పచ్చిక మైదానమంతా పరుచుకున్నట్టు ఉంది. కొండకు మూపురంలా ఉన్న ప్రదేశంలో ప్రజలంతా భూమిని నాగళ్ళతో దున్నుతూ, అరుస్తూ,మాట్లాడుకుంటూ,సందడిగా ఉంటే; ఇక్కడ రోడ్డు వైపు మాత్రం ఎదుగుదల ఆగిపోయి మరగుజ్జులుగా ఉన్న మాచిపత్రి చెట్లు, అలాగే రోడ్లకు ఓ వైపు గొర్రెల మంద తినేసి వదిలేసిన పొదలు,ప్రార్థనలో ఉన్నట్టు వంగి ఉంటే, చల్లబడిన ఆకాశం సాలె గూళ్ళ దారాలతో అలంకరించబడినట్టు ఉంది.
గ్రెగరి,అతని భార్య వెళ్ళిపోయాక; పెట్రో,దర్య మిల్లుకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. పెట్రో ధాన్యపు కొట్టములో ఒక పెద్ద జల్లెడతో గోధుమల పొట్టు జల్లించాడు. దర్య గోధుమలను సంచిలో సర్ది, బండి దగ్గరకు తీసుకువెళ్ళింది.
పాంటెలి అప్పటికే గుర్రపు బండి సిద్ధం చేసి, గుర్రపు జీన్లు సరి చేస్తున్నాడు.
‘నీకు ఇంకా బయల్దేరడానికి ఎంత సమయం పడుతుంది?’
‘ఇప్పుడే వచ్చేస్తున్నాను’, పెట్రో ధాన్యపు కొట్టం నుండి బదులిచ్చాడు.
* * *
మిల్లు దగ్గర రద్దీగా ఉంది. ఆ ప్రదేశమంతా గుర్రపు బండ్ల శబ్దంతో, పిండి పట్టించే చోట ఇంకా కోలాహలంగా ఉంది. పెట్రో కళ్ళెం దర్యా చేతిలో పడేలా విసిరేస, బండి మీద నుండి కిందకు దూకాడు.
‘నా నంబర్ తొందరగా తీసుకుంటావా?’అక్కడ నంబర్లు తీసుకునే పని చూసుకుంటున్న నేవ్ ను అడిగాడు.
‘అంతా క్రమబద్ధంగా జరుగుతుంది.’
‘ఇప్పుడు ఎవరి పిండి ఆడిస్తున్నారు?’
‘ముప్పై-ఎనిమిది.’
పెట్రో గోధుముల సంచులు దింపడానికి బండి వద్దకు వచ్చాడు. ఆ సమయంలో ఆ పిండి పట్టించే చోటులో ఒక గొడవ మొదలైంది. ఒక కీచుగా,కోపంగా ఉన్న గొంతు అరిచింది, ‘నీ నంబర్ పిలిచినప్పుడు ఇక్కడ లేకుండా ఎటో పోయి,ఇప్పుడు మధ్యలో దూరితే ఊరుకుంటామా? వెనక్కి నడువు, లేకపోతే మక్కెలిరిగదీస్తాను!’
పెట్రో ఆ గొంతు గుర్రపు నాడా యాకోవ్ దిగా గుర్తించి,జాగ్రత్తగా విన్నాడు. కోపంతో అరుస్తున్న ఆ గొంతు మొత్తం ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తూ ఉంది.
ఓ గట్టి దెబ్బ ఒక్కసారిగా వినిపించింది. పెద్ద వయసులో గడ్డంతో ఉన్న ఒక ఉక్రేనియా దేశానికి చెందిన వాడు, తన నల్ల టోపీని సరిచేసుకుంటూ, వెనక్కి తగ్గాడు.
‘దేనికి?’తన గడ్డం సవరించుకుంటూ, అతను అరిచాడు.
‘నిన్ను కొడతాను.’
‘కాసేపు ఆగు!’
‘మికికోర్,వదిలేయ్!’
బలిష్టంగా, ఎత్తుగా,ధృఢంగా ఉన్న ఫిరంగులశాలలో పని చేసిన ఆ గుర్రపు నాడా యాకోవ్( అతను సైన్యంలో పని చేస్తున్న సమయంలో అతను ఓ గుర్రానికి నాడా పెడుతున్న సమయంలో అది ఎగిరి అతన్ని తన్నడంతో, అతని ముక్కు పగిలి,పెదాలు చీలి, గుండ్రటి మచ్చ నీలపు రంగులో దాని గోళ్ళతో దిగబడి ఉండిపోవడం వల్ల అతన్ని ఆ పేరుతో పిలుస్తారు) ఆ పిండి ఆడించే షెడ్డు నుండి బయటకు తన చొక్కా చేతులు సరిచేసుకుంటూ బయటకు పరిగెత్తాడు. గులాబీ రంగు చొక్కా తొడుక్కున్న ఒక పొడుగైన ఉక్రేనియాకు చెందినవాడు అతన్ని వెనుక నుండి బలంగా కొట్టాడు. ముందుకు పడబోయినా యాకోవ్ తనను తాను సంభాళించుకున్నాడు.
‘ఒరేయ్! ఇటురండి రా,మన కోసాక్కులను చావగొడుతున్నారు!’
ఉక్రేనియన్లు(వాళ్ళు ఆ ప్రాంతానికి ఒక సమూహంగా,అందరూ ఒకే జిల్లా నుండి వచ్చారు),కోసాక్కులు ఒక్కసారిగా ఆ మిల్లు నుండి గరాటు నుండి కిందపడే ధాన్యపు గింజల్లా బిలబిలామంటూ బయటకు వచ్చారు.
ముందు వాకిట్లో పెద్ద గొడవ మొదలైంది ఆ ఇరువురి మధ్య. కొట్టుకుంటున్న వారి శరీరాల రాపిడితో,అరుపులతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. పెట్రో తన చేతిలో ఉన్న సంచిని కింద పడేసి,చిన్నగా గుర్రుమని, మిల్లు వైపు మునికాళ్ళ మీద నడిచాడు. గోధుమల దగ్గర ఉన్న దర్యా, పెట్రో ఆ గుంపు మధ్యలో నుండి చొరబడి, అడ్డుగా ఉన్నవారిని తన్నుకుంటూ,చివరకు ఆ కొట్లాటలో ఒక గోడకు వెళ్ళి తగిలి,కింద పడిపోవడంతో భయపడ్డాడు. అప్పుడే మిట్కా కోర్షునోవ్ చేతిలో ఓ ఇనుప రాడ్ తో ఇంజిన్ షెడ్ మూల నుండి బయటకు వచ్చాడు.
గుర్రపు నాడా యాకోవ్ ను వెనుక నుండి కొట్టిన ఉక్రేనియన్ ఆ పెనుగులాటలో నుండి బయటకు వస్తూ ఉంటే, చిరిపోయిన గులాబీరంగు చొక్కా చేయి అతన్ని విరిగిపోయిన రెక్కలా అడ్డుపడసాగింది. కింద పాకుతూ,పెనుగులాడుతూ, నేల మీద చేతులు ఆసరాగా పెట్టుకుని,మొదట ఉన్న గుర్రపు బండిని ఎలాగో చేరుకుని, ఆ బండి ఇరుసు మధ్యలో ఉన్న కమ్మీని బలంగా లాగాడు. ఆ వాకిలి అంతా ఏడుపులు,మూలుగులతో నిండిపోయి,అందులోనూ దెబ్బలు పడుతున్న ధ్వని కూడా కలిసిపోయింది.
ముగ్గురు షుమిలిన్ సోదరులు ఇంటి నుండి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఒంటి చేయి అలెక్సి, ఎవరో గేటు వద్ద వదిలేసిన గుర్రపు కళ్ళాల మీద కాళ్ళు పడటంతో కింద పడబోయి,దగ్గరలో ఉన్న బండ్ల ఇరుసులకు ఉండే కమ్మీల వైపు వెళ్తూ, తన ఖాళీ ఎడమ చొక్కా చేతిని కడుపుకి రుద్దుకున్నాడు. అతని సోదరుడు మార్టిన్, తన కాలును తెల్లటి సాక్సులో దూర్చబోతుంటే, మిల్లు వైపు నుండి ఓ పెద్ద కేక వినబడటంతో,మార్టిన్ ఒక్క ఉదుటున పైకి లేచి,అలెక్సి కోసం లోపలికి పరిగెత్తాడు.
దర్య ఆ సంచులపై నుండి, నోరెళ్ళబెట్టుకుని,చేతులు నలుపుకుంటూ జరిగేది చూస్తూ ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్న స్త్రీలందరూ కీచులాడుకుంటూ,పెడబొబ్బలు పెడుతూ ఉన్నారు. గుర్రాలు వారి చెవులను నిటారుగా ఉంచుకుని నిలబడి ఉంటే , ఎద్దులు బండ్లకు వాటి మూపురాలను ఆనించి నిలుచున్నాయి. పాలిపోయి ముఖంతో ఉన్న సెర్జి ప్లాటోనోవిచ్ ఆ దారిలో కుంటుకుంటూ, పెదాలు తడారిపోతుండగా,అతని పొట్ట కోటు కింద కోడిగుడ్డులా ఊగుతూ ఉంటే,ముందుకు నడుస్తున్నాడు.చిరిగిపోయిన గులాబీ షర్టుతో ఉన్న ఉక్రేనియన్ బండి చక్రపు ఇరుసుతో మిట్కా కోర్షునోవు కాళ్ళ మీద కొట్టడం దర్య చూసింది. కానీ ఆ తర్వాతి క్షణమే అతను ఆ ఇరుసును కిందపడేసి తన మీద కలబడి పిడికిళ్ళతో గుద్దుతున్న ఒంటిచేయి అలెక్సితో తలబడ్డాడు. అక్కడ జరుగుతున్న పోరు దృశ్యాలన్నీ దర్య కళ్ళ ముందు రంగురంగుల మరమత్తుల పనుల్లా కనబడుతున్నాయి. మిట్కా కోర్షునోవు మోకాళ్ళ మీద నిలబడి తనకు దగ్గరలో ఉన్న ఇనుప కమ్మీని సెర్జి ప్లాటోనోవిచ్ వెళ్తున్న వైపు విసిరాడు, ఇది చూసిన దర్య ఏమాత్రం ఆశ్చర్యపోలేదు. దానితో ఆ వ్యాపారి నేల మీద చేతులు చాచుకుంటూ బొక్కాబోర్లా పడ్డాడు. అక్కడి నుండి పీతలా పాక్కుంటూ పిండి మర వైపు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేలోపు ఎంతోమంది తొక్కుళ్ళ మధ్య పూర్తిగా ఆకారం మారిపోయి వెళ్ళాడు. ఆ దృశ్యం చూడగానే పొట్ట పగిలేలా నవ్వుతూ ఉంటే కాటుక పెట్టిన ఆమె కళ్ళ దగ్గర ఉన్న వంపులు చెదిరిపోయాయి. ఆ నవ్వు కాస్త పెట్రో ఆ తోపులాట నుండి బయటపడే ప్రయత్నంలో ఓ బండి కింద పడి రక్తం కారుతూ బాధతో ఉండటం చూసి ఆగిపోయింది. ఒక్క పెద్ద ఏడుపుతూ పెద్ద అంగలతో అతన్ని చేరుకుంది. గ్రామం నుండి కోసాక్కులు గునపాలతో, కంచెల దగ్గర ఉండే పెద్ద కర్రలతో అక్కడకు వచ్చారు. చూస్తుండగానే గొడవ చాలా పెద్దదైపోయింది. తాగుబోతుల గొడవలకు, చిన్న చిన్న కొట్లాటల కన్నా ఇది చాలా భిన్నంగా ఉంది. ఒక కుర్రవాడైన ఉక్రేనియన్ తల పగిలి, తలంతా రక్తపు మడుగులో నిండిపోయి, రక్తంతో తడిసిన వెంట్రుకలతో అతని ముఖం కప్పబడి,పిండి మర గేటు దగ్గర పడి ఉన్నాడు, చూస్తూ ఉంటే అతనికి ఈ భూమి మీద నూకలు దాదాపు చెల్లిపోయినట్లే ఉన్నాయి.
ఉక్రేనియన్లు భయపడిన గొర్రెల్లా ఒక మందలా బండ్లు పెట్టే పాక దగ్గరకు పారిపోయారు. ఆ ఉక్రేనియన్లలో ఒక వృద్ధుడు ఒక పని చేసి ఉండకపోతే, పరిస్థితులు ఇంకా చేజారిపోయేవి ఉండేవి. అతను పక్కన ఉన్న ఓ పాకలోకి వెళ్ళి, పొయ్యి లో మండుతూ ఉన్న కట్టె బయటకు తీసుకుని వాకిట్లోకి వచ్చాడు. అప్పటికే పిండి ఆడించబడిన గోధుమలు ఉన్న పిండి మర దగ్గరకు వెళ్ళాడు ఆ కట్టెతో. అక్కడ దాదాపుగా వెయ్యి పూడ్ల(రష్యన్ కొలత, ఒక పూడ్ అంటే 36.1 పౌండ్లు లేదా 16.39 కేజీలతో సమానం) కంటే ఎక్కువే గోధుమ పిండి ఉంది. అప్పటికే సూర్యకాంతిలో అతని చేతిలో ఉన్న కట్టె ఇంకా మండుతున్నట్టు కనిపిస్తూ ఉంది.
‘నేను ఇదంతా తగలబెట్టేస్తాను!’, అతను ఆ పిండి ఆడించే పాక పైకి ఆ కట్టె ఎత్తి గట్టిగా అరిచాడు.
కోసాక్కులు కాస్త బెదిరి వెనక్కి తగ్గారు. అప్పటికే తూర్పు దిశ నుండి వేడి గాలులు వీస్తూ, ఆ బండ్లు ఉన్న పాక పై నుండి ఉక్రేనియన్ల గుంపు దగ్గరకు వచ్చింది. ఆ కట్టెలో ఒక్క రవ్వ అంటుకున్నా, ఆ గ్రామం అంతా తగలబడిపోతుంది.
ఆ కోసాక్కులంతా ఆ చర్యతో వెనక్కి తగ్గి తమలో తామే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళల్లో ఒకరిద్దరు మిల్లులోకి వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఆ ముసలి ఉక్రేనియన్ మాత్రం ఆ కాలుతున్న కట్టెని తన తల పైన తిప్పుతూ, అలాగే అరుస్తూ తిరుగుతూ ఉన్నాడు.
‘నేను ఈ ప్రాంతమంతా తగలబెట్టేస్తాను!మర్యాదగా ఇక్కడ నుండి బయటకు పొండి!’
ఎన్నో దెబ్బలతో ముఖమే మారిపోయి,అసలు ఆ గొడవకు మూల కారణమైన గుర్రపు నాడా యాకోవ్ అక్కడి నుండి మొదట బయటకు పారిపోయాడు. మిగిలిన కోసాక్కులు కూడా కంగారుగా అతన్ని అనుసరించారు.
ఉక్రేనియన్లు తమ సంచులను బండ్లలో వేసుకున్నారు.గుర్రపు పగ్గాలు అందుకుని, వేగంగా ఆ మిల్లు వాకిటి నుండి బయటకు వీధిలోకి వాటిని దౌడు తీయించారు.
ఆ తర్వాతి క్షణంలో ఒంటి చేయి అలెక్సి ఆ వాకిటి మధ్యలో నిలబడి, అతని చేతి కర్ర ఖాళీగా ఉన్న చొక్కా చేతి నుండి వేలాడుతూ అతని పొట్టకు తాకుతూ ఉంది. అతని కళ్ళు కోపంగా ఎర్రగా మారి,ముక్కు పుటలు అదురుతున్నాయి.
‘కోసాక్కులారా! గుర్రాల దగ్గరకు వెళ్ళండి.’
‘వాళ్ళను వెంబడించండి.’
‘వాళ్ళు ఆ కొండ దాటి ఉండరు ఇంకా!’
కుంటుతూ ఉన్నా, దానిని కూడా లెక్కచేయకుండా మిట్కా కోర్షునోవు గేటు బయటకు బండిని ఉరికించాడు. శాంతించిందనుకున్న ఆ పోరు మళ్ళీ కొత్తగా రాజుకుంది మిల్లు దగ్గర ఉన్న కోసాక్కులలో. అదే సమయంలో ఇంజిన్ షెడ్ ఉన్న గదిలో అప్పటిదాకా ఎవరు గమనించకుండా ఉన్న ఓ అపరిచితుడు, ఓ నల్ల టోపీ పెట్టుకుని బయటకు వచ్చాడు; తన కళ్ళతోనే అక్కడ గుంపుగా ఉన్న జనాల వైపు చూస్తూ, తన చేతిని పైకి ఎత్తాడు.
‘ఆగండి!’
‘నువ్వు ఎవరు?’గుర్రపునాడా యాకోవ్ కళ్ళు చిట్లిస్తూ అడిగాడు.
‘వాడు ఎక్కడ నుండి వచ్చాడు?’
‘కొట్టండి వాడిని!’
‘మీరంతా ఒక్క నిమిషం ఆగండి,నా పొరుగువారలారా!’
‘ముచ్చు మొహం వాడా! నువ్వు మాకు పొరుగువాడివి కాదు.’
‘నువ్వో ముజిక్ వి.’
‘నువ్వో వెధవ్వి.’
‘వాడికి ఒకటి ఇచ్చుకో,యాకోవ్.’
‘సరిగ్గా వాడి కళ్ళ మధ్య ఒకటి ఇవ్వు.’
ఆ అపరిచితుడు ఇబ్బందిగా ఒక నవ్వు నవ్వాడు. అతని ముఖంలో ఏ భయం కనబడటం లేదు. అతను తన టోపీని బయటకు తీసి, తన నుదురుకి పట్టిన చెమటను చేతితో తుడుచుకున్నాడు. ఆ నవ్వు ప్రమాదం లేనట్టు సాధారణంగా ఉంది.
‘అసలు ఇదంతా ఏమిటి?’తన చేతిలో ఉన్న టోపీని అక్కడ రక్తం తడిసి ఉన్న మిల్లు దగ్గర నేల వైపుకి చూపిస్తూ అడిగాడు.
‘మేము కొందరు జుట్టు వెధవలని (ఉక్రేనియన్లకు జుట్టు ఎక్కువ ఉంటుంది,వారిని ఎగతాళి చేయడానికి అలా పిలుస్తారు) చితకబాదాము’, ఒంటి చేయి అలెక్సి ప్రశాంతంగా అంటూ ఉంటే, అతని రెండు కళ్ళు అదురుతూ ఉన్నాయి.
‘కాని దేనికి?’
‘లైన్లో సరిగ్గా నిలబడకుండా ముందే ఎగబడినందుకు’, గుర్రపు నాడా యాకోవ్ వివరించాడు, ముక్కు కింద నుండి కారుతున్న రక్తాన్ని తన చేత్తో తుడుచుకుంటూ.
‘వాళ్ళు గుర్తుంచుకునేలా గట్టిగా ఇచ్చాము.’
‘ఇప్పటికీ మేము వాళ్ళను పట్టుకోగలము. వాళ్ళు ఆ కొండ దగ్గరలో దేనికి మంట పెట్టలేరు.’
‘మేము వాళ్ళను ఊరికే వదిలేశాము. వాడు అస్సలు అలా చేసి ఉండకూడదు.’
‘ఎవడైనా తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా చేస్తాడు.’
‘ఆ జుట్టోళ్ళకు పొగరెక్కువ’,అఫొంకా ఒజెరోవ్ నవ్వుతూ అన్నాడు.
ఆ అపరిచితుడు తన టోపీని అఫొంకా వైపు చూపించాడు.
‘నువ్వు ఎవరు?’
అఫొంకా నేల మీద ఉమ్మాడు.
‘నేను కోసాక్కును.మరి నువ్వు ఎవరివి,జిప్సివా?’
‘లేదు, మనిద్దరం రష్యన్లమే.’
‘అది అబద్ధం!’అఫొంకా గట్టిగా అన్నాడు.
‘కోసాక్కులు కూడా రష్యన్ల నుండే వచ్చారు. నీకు తెలుసా?’
‘నేను నీకు చెబుతున్నాను,కోసాక్కులు కోసాక్కుల నుండే వచ్చారు.’
‘పూర్వం కొందరు బానిసలు వాళ్ళ యాజమానుల దగ్గర నుండి పారిపోయి,డాన్ దగ్గర స్థిరపడ్డారు.అలా వాళ్ళే కోసాక్కులు అయ్యారు.’
‘సర్లేరా, నువ్వు నీ దారిలో పో’, ఒంటి చేయి అలెక్సి అతనికి సూచించాడు తన కోపాన్ని అణచుకుంటూ, తన చేతిని బిగిస్తూ, అప్పటి వరకు లేనంతా ఎర్రగా మారిన ముఖంతో అన్నాడు.
‘ఆ లంజా కొడుకులు ఇక్కడకు బతకడానికి వచ్చారు…..మమ్మల్ని ముజిక్కులా మార్చడానికి!’
‘అతను ఎవరు? అఫొంకా?’
‘ఎవరో ఇక్కడకు వచ్చిన వాడు. అతను ప్రస్తుతం ఆ మెల్లకన్ను లుకేష్కా దగ్గర ఉంటున్నాడు.’
ఆ రోజు ఇంకా ఉక్రేనియన్లను వెంబడించే పని తప్పిపోవడంతో,కోసాక్కులు అక్కడి నుండి ఇళ్ళకు పోయి,ఆ రోజు జరిగినదాని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు.
* * *
ఆ రాత్రి, దాదాపు ఎనిమిది వెరస్టుల దూరంలో ఉన్న పచ్చిక బీడులో, చలికి ఆగేలా ఉన్న మందపాటి కోటు వేసుకుని ఉన్న గ్రెగరి అసహనంతో నటాల్యతో అన్నాడు, ‘నువ్వు నాకు అపరిచితురాలిలా అనిపిస్తున్నావు . నువ్వు ఆ పైన ఉన్న చంద్రుడిలాంటి దానివి….అటు వెచ్చగా ఉండవు,ఇటు చల్లగానూ ఉండవు. నేను నిన్ను ప్రేమించడం లేదు,నటాల్య. కోప్పడకు. నీకు ఈ విషయం చెప్పాలని లేదు,కానీ మనం ఎప్పటికీ ఇలా ఉండలేము……నన్ను క్షమించు,నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఈ పచ్చిక బీడులా నా హృదయం కూడా శూన్యంగా ఉంది.’
నక్షత్రాలతో నిండిపోయిన ఆకాశంలో ,నీడల్లా ఉన్న మేఘాలు కదులుతూ ఉంటే, వాటిని చూస్తూ నటాల్య ఏమి మాట్లాడకుండా ఉండిపోయింది. ఆకాశంలో ఎగురుతూ ఉన్న వలస పక్షులు ఆ నీలపు ఆకాశానికి కట్టిన గజ్జెల్లా ఉన్నాయి.
వాడిపోయిన గడ్డి చావు, విషాదాల వాసనను మోస్తూ ఉంది. అక్కడికి దగ్గరలో ఎక్కడో పొలంలో వెచ్చదనం కోసం రాజేసిన మంట ఎర్రగా వెలుగుతూ ఉంది.
ఉదయం గ్రెగరి నిద్ర లేచే సమయానికి అతను ధరించిన కోటుకు మూడు ఇంచుల మందంలో మంచు పట్టి ఉంది. ఆ పచ్చిక బీడు అంతా తెల్లగా మెరుస్తున్న మంచుతో నిండిపోయి,అక్కడ అప్పటి వరకు గంతులు వేసిన కుందేలు పాద ముద్రలు ఆ మంచులో కనిపిస్తూ ఉన్నాయి.
* * *
అధ్యాయం-6
చాలా కాలం నుండి ఒక అనధికార నిబంధన ఉంది.అదేమిటంటే ఒకవేళ కోసాక్కులు ఒంటరిగా మిల్లెరోవో రోడ్డు మీద ప్రయాణిస్తూ ఉన్నప్పుడు యూక్రేనియన్లు తారసపడితే(యుక్రేనియన్లు నిజ్నీ-యబ్లోనొవొస్కీ ప్రాంతాల మీదుగా మిల్లెరోవోకి దాదాపు డెబ్భై ఐదు మైళ్ళ దూరం వరకు స్థిరపడ్డారు)వారికి దారిచ్చి,తప్పుకోకపోతే,ఆ కోసాక్కును కొట్టడం జరుగుతుంది. కనుక కోసాక్కులు ఎప్పుడు ఆ దారి గుండా వెళ్ళినా సరే, వాళ్ళు బండ్ల మీద గుంపులుగా వెళ్ళేవారు,అక్కడ ఏదైనా గొడవ జరిగినా సిద్ధంగా ఉండి,మాటకు మాట చెప్పేవారు తప్ప వెనక్కి తగ్గేవారు కాదు.
‘ఒరేయ్ జుట్టోడా!(యుక్రేనియన్లకు జుట్టు బాగా ఉండేది,అందుకనే వారిని వ్యంగ్యంగా అలా పిలిచేవారు)దారి నుండి పక్కకు తొలగు! దారివ్వకుండా ఈ కోసాక్కుల భూమి మీద బ్రతుకుదామనే అనుకుంటున్నావా?’
ఉక్రేనియన్లు కూడా ఇష్టం లేకపోయినా గోధుమలు ఆడించడానికి డాన్ ప్రాంతంలో ఉన్న పారమానోవ్ మిల్లు దగ్గరకు వచ్చారు. అక్కడ గొడవలు జరగడానికి కారణాలు ఏమి ప్రత్యేకంగా ఉండేవి కాదు, ఉక్రేనియన్లు కావడమే కోసాక్కులు గొడవ పడటానికి కారణం అయితే,కోసాక్కులు ఉండటమే ఉక్రేనియన్లు గొడవ చేయడానికి కారణం అయ్యేది.
అనేక శతాబ్దాల ముందు ఓ చేయి ఎంతో కష్టపడి ఆ కోసాక్కుల నేలలో కుల ద్వేష విత్తనాలను నాటింది. ఆ విత్తు పెరిగి,పెద్ద పంటనే ఇచ్చింది. ఆ నేల ఎప్పుడు కోసాక్కులకు, కొత్తగా వచ్చేవారికి అంటే వారు ఉక్రేనియన్లు అయినా రష్యన్లు అయినా సరే; మధ్య జరిగే రక్తపాతంతో తడిసింది.
మిల్లులో గొడవ జరిగిన రెండు వారాల తర్వాత ఆ గ్రామంలోకి ఒక పోలీసు అధికారి,ఇనస్పెక్టర్ కలిసి వచ్చారు.
మొదట విచారణకు స్టోక్ మాన్ ను పిలిచారు. కోసాక్కుల తెగకు చెందిన ఆ ఇనస్పెక్టర్, ఓ యువకుడు. అతడు తన బ్రీఫ్ కేసులో ఉన్న కొన్ని పేపర్లలో చూస్తూ ,స్టోక్ మాన్ ను కొన్ని ప్రశ్నలు అడిగాడు.
‘ఇక్కడకు రాక ముందు నువ్వు ఎక్కడ ఉండేవాడివి?’
‘రోస్తోవ్ లో.’
‘నువ్వు ఏ నేరం మీద 1907 లో జైలుకి వెళ్ళావు?’
పిల్లి కళ్ళలా ఒక్క నిమిషం స్టోక్ మాన్ కళ్ళు బ్రీఫ్ కేసు మీద, కిందకు వంచి ఉన్న ఇనస్పెక్టర్ తల మీద చుండ్రు ఉన్న ప్రాంతంలోనూ మెరిసాయి.
‘కొన్ని గొడవల్లో పాల్గొన్నందుకు.’
‘సరే….ఆ సమయంలో నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు?’
‘రైల్వే వర్క్ షాపులో.’
‘ఏ వృత్తి ?’
‘నేను మెకానిక్ ను.’
‘నువ్వు యూధుడివి కాదు కదా?లేకపోతే మారిపోయావా?’
‘లేదు,నేను అలా అనుకోవడం లేదు.’
‘నాకు నువ్వు ఏమి అనుకుంటున్నావు అన్నది అనవసరం. నువ్వు ప్రవాస శిక్షను అనుభవించావా?’
‘అవును.’
ఆ ఇనస్పెక్టర్ ఆ బ్రీఫ్ కేసు నుండి తన తలను పైకెత్తి,తన పెదవులను కొరుక్కున్నాడు.
‘నేను నిన్ను ఇక్కడ నుండి వెళ్ళిపొమ్మని సలహా ఇస్తున్నాను…..’, ఒక్క క్షణం ఆగి, ‘నువ్వు అలా చేసేలా చూస్తాను కూడా’,అన్నాడు.
‘నేను ఎందుకు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి ఇనస్పెక్టర్?’
సమాధానంగా ఇంకో ప్రశ్న అడిగాడు.
‘నువ్వు ఆ మిల్లులో గొడవ జరిగిన రోజున అక్కడ ఉన్న కోసాక్కులతో ఏమి మాట్లాడావు?’
‘అసలు నేను ….’
‘సరే,ఇక నువ్వు వెళ్ళవచ్చు.’
స్టోక్ మాన్ సరాసరి మొఖోవుల ఇంటి వరండా దగ్గరకు వెళ్ళాడు(అతను ఎక్కువ సమయం సెర్జి ప్లాటోనోవిచ్ ఇంటి దగ్గరే ఉండేవాడు,దాన్ని సత్రంలా భావిస్తూ),అక్కడ వెనుక చక్కగా పెయింట్ చేసి ఉన్న తలుపుల వంక చూశాడు.
* * *
అధ్యాయం-7
చలికాలం ఒక్కసారిగా రాలేదు. పంటలు,పశువులు బావుండాలని ప్రార్థించే సమయంలో పడిన మంచంతా కరిగిపోయి, పశువుల మందలన్నిటిని మేపడానికి వదిలారు ఆ గ్రామవాసులు. దక్షిణ దిక్కు నుండి గాలులు ఓ వారం వరకు వీచాయి,ఆ ప్రాంతమంతా వేడెక్కింది, భూమి కూడా మంచు నుండి కోలుకుని,ఆ ప్రాంతమంతా పచ్చ రంగులో ఉండే గడ్డి పెరిగింది.
ఆ వేడి వాతావరణం సెయింట్ మైఖేల్ డే వరకు కొనసాగింది, తర్వాత మంచు పడింది; క్రమక్రమంగా రోజులు చల్లబడ్డాయి, ఏడు ఇంచుల మందంలో మంచు కురిసింది, డాన్ ప్రాంతంలో కూరగాయల పాదులు ఉన్న చోట కుందేళ్ళ గుంపులు తిరుగాడిన కాలి ముద్రలు కనబడుతూ ఉన్నాయి.మంచు ఇంటి చుట్టూ ఉన్న కంచెల ఎత్తు వరకు కురిసింది. ఆ గ్రామంలో వీధులన్నీ ఖాళీగా ఉన్నాయి.
రోడ్ల పక్కన పిడుకలు వేసి మంట రాజేసి, దాని పక్కన మనుషులు ఉంటే;ఆ ప్రాంతమంతా ఆ పిడుకల మంట వాసన,మానవ శరీర వాసనలతో నిండిపోయింది. ఆ వాసనకు ఆకర్షితమైన కాకులు ఆ మంటల నుండి వచ్చిన బూడిద రోడ్ల మూలాల ఉన్న చోట వాలాయి.ఆ గ్రామంలో అన్ని వీధుల్లోకి తిరుగుతున్నట్టు కురిసిన మంచు ఆడపిల్లలు తలకు కట్టుకునే నీలపు రిబ్బనులా ఉంది.
ఒక రోజు కోసాక్కులు అందరూ కూడలిలో, పచ్చిక మైదానంలో చెట్లను చెక్క కోసం నరకడానికి పంపకాల కోసం సమావేశమయ్యారు. ఆ ఊరి పంచాయతీ ఆఫీసు వాకిట్లో తమ గొర్రెల లాంటి చర్మాలతో, కోట్లు ధరించి, మంచు కింద పడి బూట్లు కిర్రుమంటుంటే,అక్కడ గుంపుగా కూడారు. కానీ బయటి చలి వల్ల కొన్ని నిమిషాల్లోనే లోపలికి తరిమినట్టు వెళ్ళిపోయారు.వెండి రంగులో మెరుస్తున్న మీసాలతో ఆ గ్రామంలో పెద్ద మనుషులు అటామన్ మరియు గుమాస్తా ఎదురుగా ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు. వివిధ రంగుల్లో ఉన్న మీసాలతో ఉన్న యువకులు,అసలు మీసాలు లేని వారు,అందరూ చిన్న బృందంలా చుట్టూ గుమిగూడి, వెచ్చదనం కోసం ఒకరికొకరు ఆనుకుని, తమలో తాము గుసగుసలాడుకుంటున్నారు. అక్కడ ఉన్న గుమాస్తా రాతలతో అక్కడ ఉన్న పుస్తకం నిండిపోతూ ఉంటే, అటామన్ అతని భుజాల మీదుగా ఆ రాతలు చూస్తూ ఉంటే,ఆ గది మనుషుల మాటలతో నిండిపోయింది.
‘ఈ సంవత్సరం గడ్డి…’
‘ఆ పచ్చిక దగ్గర పశువుల గడ్డి బావుంటుంది,కానీ ఈ సారి ఏమి లేదు.’
‘పాతకాలంలో క్రిస్టమస్ వరకు అక్కడే పశువులను మేపేవారట.’
‘కాల్మకులకు అదే బాగానే ఉంటుంది.’
‘హా…’
‘ఆ అటామన్ మెడ అచ్చం తోడేలు మెడలా గట్టిగా ఉంది,అందుకే తల తిప్పలేకపోతున్నాడు అనుకుంటా.’
‘అది కాదు,కడుపు పగిలేలా తిని,అలా కదలలేకుండా ఉన్నాడు,దయ్యం!’
‘హలో మిత్రులారా….ఏంటి మీరు ఈ చలికాలాన్ని తరిమేద్దామనుకుంటున్నారా? అంత మందమైన చలికోట్లు వేసుకుని వచ్చారు?’
‘హా…కానీ ఆ జీప్సీగాడు తన కోటు ఇప్పటికే అమ్మేసుకున్నాడు.’
‘అయితే మీ కోసం ఓ కథ చెప్తాను,వినండి. పవిత్ర వారంలో ఓ సారి కొందరు జిప్సిలు పచ్చిక మైదానంలోకి వెళ్లారు. వాళ్ళకు కప్పుకోవడానికి ఏమి లేదు. అందులో ఒకడు చేపలు పట్టే వలలోకి దూరి పడుకున్నాడు. ఎప్పుడైతే చలి బాగా పెరిగిపోయిందో, వాడు నిద్ర లేచి,తన వేళ్ళను ఆ వల సందుల్లో పెట్టి, తన తల్లితో, ‘అమ్మా,బాగా చలిగా ఉంది’,అన్నాడు.
‘దేవుని దయ వల్ల అది తెగిపోలేదు.’
‘అలా అయితే దీన్ని మన ఎద్దుల కాళ్ళకు కడదాము.’
‘ఆ తర్వాత రోజు నేను వీల్లో చెట్లు కొన్ని కొట్టేశాను,మంచి సరుకు.’
‘ఓ జాకర్, ఆ కోటు బొత్తాలు సరిగ్గా పెట్టుకో లేకపోతే చలికి చచ్చిపోతావు.’
‘అవ్డెచ్,నువ్వు గ్రామపు ఎద్దును తీసుకోవాలనుకుంటున్నావని విన్నాను.’
‘లేదు నేను తీసుకోకూడదని అనుకుంటున్నాను. పరంకా మ్రిఖిన తీసుకుంటానని అన్నది. ‘నేను విధవను’,అంది ఆమె, ఆ ఎద్దు కూడా ఇంట్లో ఉంటే ఆమెకు కాస్త ఉత్సాహంగా ఉంటుంది. అందుకే నేను,’సరే,నువ్వే తీసుకో,దాని వల్ల నీ కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగేటట్లైతే’,అన్నాను.’
‘హా…హా…హా’
‘హొ !హొ!’
‘గౌరవనీయులైన పెద్దలారా!ఇక చెక్క నరికే సంగతి ఏమిటి…….నిశ్శబ్దంగా ఉండండి.’
‘ఒకవేళ ఆ ఎద్దు వల్ల కుటుంబ సభ్యులు పెరిగితే,నేను దానికి దేవుడిచ్చిన తండ్రిలా ఉంటానని చెప్పాను….’
‘నిశ్శబ్దం! నిశ్శబ్దం!’
సమావేశం మొదలైంది. ఆ ఆఫీసులో ఉన్న రాడ్ ను చేత్తో పట్టుకుని,దాన్ని పైకి కిందకి కదిలిస్తూ, ఆవిర్లు కడుతున్నట్టు వస్తున్న గాలిని పీల్చుకుంటూ, తన గడ్డం దగ్గర పట్టిన మంచు చుక్కలను తన చితికిన వేలును విదిలిస్తూ, అటామన్ అక్కడ పంపకాల నిమిత్తం పేర్లు పిలవడం మొదలుపెట్టాడు. ఆవిర్లు కక్కుతున్నట్టు ఉన్న గాలి ఆ గదంతా నిండిపోతూ ఉంది,ఎక్కువమంది కోసాక్కులు వెనుక తలుపు దగ్గరకు చేరడం వల్ల,వాళ్ళు శ్వాస క్రియ అక్కడ పెరగడం వల్ల.
‘మీరు చెక్క నరకడం గురువారం నాడు మొదలుపెట్టకూడదు!’, ఇవాన్ టోమిలిన్ అటామన్ మాటకు ఎదురుచెప్తూ అన్నాడు. అతను తన తలను నీలపు రంగు టోపిలోకి పైకి లాక్కుంటూ, తన చెవులను అసహనంగా రుద్దుకుంటూ ఉన్నాడు.
‘ఎందుకు?’
‘నువ్వు నోర్మూసుకో,టోమిలిన్!’
‘వీడి నోట్లో ఎద్దుల చెవులు పెట్టి కుడతాము.’
‘గురువారం నాడు సగం పైగా గ్రామస్థులు పచ్చికల్లోకి గడ్డి తెచ్చుకోవడానికి వెళ్తారు.అది తెలియదా మీకు?’
‘అలా అయితే ఆ గడ్డి ఆదివారం తెచ్చుకోండి.’
‘గౌరవనీయులైన పెద్దలారా!’
‘ఇప్పుడు ఏం చేద్దాం?’
‘ఆ గడ్డి గురించి పట్టించుకోకండి!’
అక్కడ గుమిగూడిన కోసాక్కుల మధ్య కాసేపు ఈ విషయం గురించి వాదనలు జరిగాయి.
వృద్ధుడైన మాట్వే కాషులిన్ విరిగిపోవడానికి సిద్ధంగా ఉన్న బల్ల మీదకి వంగి తన చేతి కర్రను టోమిలిన్ వైపు చూపిస్తూ కప్పలా బెకబెకలాడాడు.
‘గడ్డి విషయంలో ఆగవచ్చు. మిగిలిన వాళ్ళు చెప్పేదే నువ్వు కూడా విను…. ప్రతిదానిలోనూ వేలు పెడతావు. నువ్వు యవ్వనంలో ఉన్నావు,నీకు ఏమి తెలియదు,వెధవ్వి.నోర్మూసుకుని అతను చెప్పేది విను!’
‘హా, నువ్వు అంత ముసలోడివి అయ్యి కూడా ఇంకా పక్కోళ్ళు చెప్పినదే వింటావు’,మాటకు మాట బదులిచ్చాడు. వెనుక వరసలో కూర్చున్న ఒంటి చేయి అలెక్సి తన తలను పైకి ఎత్తి,ముందు జరిగేది తన కళ్ళు అదురుతూ ఉండగా చూస్తూ ఉన్నాడు.
దాదాపుగా ఆరేళ్ళనుండి ఆ వృద్ధుడైన కాషులిన్ కు,అలెక్సికి మధ్య గొడవ నడుస్తూ ఉంది. ప్రతి వసంత కాలంలో అలెక్సి ఆ వృద్ధుడిని బాదేవాడు, ఆ వృద్ధుడు అలెక్సి భూమిలో కళ్ళు మూసుకుని ఉమ్మితే పట్టేంత జాగాను తీసుకున్నందుకు.
‘నాలుక అదుపులో పెట్టుకో,వెధవా!’
‘నువ్వు నాకే అందె దూరంలో లేవు కానీ లేకపోతే నీ పీక నులిమేసేవాడిని!’
‘ఎందుకురా, ఒంటి చేయి వెధవా!’
‘వాగుడు కట్టిపెట్టి, నిశ్శబ్దంగా ఉండండి!’
‘నీకు చెత్త కావాలంటే బయటకు పో.’
‘వదిలేయ్ అలెక్సి,ఆ ముసలాడు పిచ్చి పట్టినట్టు వాగుతున్నాడు.’
‘వాడిని తీసుకెళ్ళి కూలర్ లో పడేయ్యాలి!’
‘వాడే మొదలుపెట్టాడు…’
‘రేపు వాడికి గట్టిగా ఒకటి ఇవ్వు, కానీ ఇప్పుడు మాత్రం నిశ్శబ్దంగా ఉండు.’
అటామన్ తన పిడికిలితో గట్టిగా బల్ల మీద కొట్టాడు,దానితో అది కిర్రుమంది.
‘మీరు నిశ్శబ్దంగా ఉండకపోతే బయటకు గెంటిస్తాను!’
మొత్తానికి ఆ గొడవ సద్దుమణిగి ,క్రమంగా ఆ గదంతా నిశ్శబ్దంగా అయిపోయింది.
‘గురువారం నాడు,సూర్యోదయ సమయానికి,మీ అందరూ చెట్లు నరకడానికి వెళ్ళాలి.’
‘పెద్దలారా.మీరేమంటారు?’
‘సరే,మీరు చేపినట్టు చేస్తాము!’
‘మంచిది.’
‘ఈ మధ్య రోజుల్లో పెద్ద మాటంటే పిల్లలకు లెక్క లేకుండా పోయింది.’
‘వాళ్ళు మన మాట వింటారు. లేకపోతే నాలుగు తన్ని వినేలా చేయలేమా? నా కొడుకు అలెక్సికి వాడి వాటా ఇచ్చినపుడు ,దాని గురించి నాతో గొడవ పడబోయాడు, నా మీద చేయి కూడా ఎత్తాడు. నేను అప్పుడు, “నిన్ను ఇప్పుడే అటామన్ దగ్గరకు ,పెద్దల దగ్గరకు తీసుకువెళ్ళి నాలుగు తన్నిస్తాను…”అన్నాను. వాడు భయపడి వెంటనే తోక ముడిచాడు.’
‘పెద్దలారా, ఇంకో ముఖ్య విషయం,మన స్టానిట్సా అటామన్ నుండి ఒక ఆజ్ఞ వచ్చింది.’ అక్కడి అటామన్ తన గొంతు సవరించుకుంటూ, వారి వైపు తల తిప్పాడు. అతని యూనిఫార్మ్ కాలర్ మెడ చుట్టూ బిగుసుకుని ఉంది. “ఈ శనివారం యువకులైన కోసాక్కులందరూ ప్రతిజ్ఞ చేయాలి. కనుక వారిని ఆ సమయానికి స్టానిట్సా అటామన్ కార్యాలయానికి సమయానికి వచ్చేలా చూడటం మీ బాధ్యత.’
పాంటెలి తన కుంటి కాలుని పైకెత్తి గోడకు ఆనించి, ఆ తలుపు దగ్గర ఉన్న కిటికీ దగ్గర నిలుచున్నాడు. మిరోన్ అక్కడ ఉన్న కిటికీ అరుగు మీద కూర్చుని, బొత్తాలు పెట్టుకుంటూ చలికోటును మీదకు లాక్కుంటూ,నవ్వుతూ ఉన్నాడు. అతని చిన్న కనుబొమ్మలు కొద్దిగా మంచువల్ల తడిసాయి,అలాగే ముఖం మీద ఉన్న మచ్చలు బూడిద రంగులోకి మారాయి. అక్కడ ఉన్న యువకులైన కోసాక్కులు ఓ బృందంలా ఏర్పడి,మధ్యలో ‘వదరుబోతు’గా పిలువబడే అవ్డేచ్ చెప్పేది వింటూ,నవ్వుకుంటూ,సరదాగా ఉన్నారు. గార్డ్ మెన్ దుస్తుల్లో మధ్యలో నిలబడి అతను ఉత్సాహంగా చెప్తున్నాడు.
పాంటెలి సమవయస్కుడైన అవ్డేచ్ గతంలో ఓ సారి ‘అటామన్ లైఫ్ గార్డ్’ గా పని చేశాడు. అతను అక్కడ ‘ఇవాన్ అవ్డేచ్ సిన్లిన్’గా వెళ్ళి వదరుబోతుగా తిరిగి వచ్చాడు. ఆ గ్రామం నుండి అటామన్ రెజిమెంటులో ఎంపిక కాబడిన మొదటి కోసాక్కు అతనే. అది అతని మీద విచిత్రమైన ప్రభావాన్ని చూపింది. అతను ఆ గ్రామంలోని మిగిలిన పిల్లల్లాగే కాస్త చమత్కార ధోరణిలో పెరిగాడు. అతను ఆ సైన్యం నుండి తిరిగి వచ్చాక,అది ఊహించలేనంత పరిణామంలో పెరిగిపోయింది. ఇంటికి తిరిగి వచ్చిన రోజు నుండి చక్రవర్తి దర్బారులో తన పని గురించి,సెయింట్ పీటర్స్ బర్గులో తన సాహసాల గురించి గొప్పగా చెప్పేవాడు. మొదట్లో అందరూ నోర్లు వెళ్ళబెట్టుకుని, అతను చెప్పేది నిజమని నమ్మి వినేవారు. కానీ తర్వాత ఆ గ్రామం పునాది పడినప్పటినుండి ఇలాంటి వదరుబోతును,అబద్ధాలకోరును చూడలేదని అనుకున్నారు. అతని ముఖం మీదే అందరూ నవ్వినా అతను సిగ్గుపడలేదు. అలాగే ఆ తర్వాత కూడా అతను ఆ అబద్ధాల కథలు చెప్పడం ఆపలేదు. ఎప్పుడైనా దొరికి పోయినప్పుడు,అతను తనను తాను సమర్థించుకోవడానికి పిచ్చి పట్టిన వాడిలా అరుస్తూ ఉండేవాడు. అలా కాకుండా అతన్ని చూసి జనాలు నవ్వుకుంటూ ఉంటే మాత్రం అతను తన ఊహా ప్రపంచంలోకి వెళ్ళిపోయేవాడు,చుట్టూ ఉన్న వారి నవ్వులను పట్టిచుకోకుండా.
అతను కష్టించి పని చేసే కొసాక్కు మరియు మంచి రైతు కూడా.అలాగే తన వ్యవహారాలన్నిటిని కూడా ఎంతో సున్నితంగా,తెలివితేటలతో నిర్వహించేవాడు. కానీ గార్డుగా తన సేవల గురించి కథలు చెప్పడంలో మాత్రం విపరీతమైన కల్పనలతో వర్ణించేవాడు;అందుకే జనాలు ఎప్పుడూ ఆ విషయంలో అతన్ని చూసి నవ్వుకుంటూ ఉండేవారు.
అవ్డేచ్ బృందం మధ్యలో నిలబడి,అప్పటికే కొంత చిరిగిపోయి ఉన్న తన బూట్లను అటూ ఇటూ ఊపుతూ,తన శ్రోతల వైపు చూసేవాడు.అప్పుడూ గంభీరమైన,లోతైన స్వరంతో మొదలుపెట్టేవాడు.
‘ఇప్పటి కొసాక్కులు ఒకప్పటి వారిలా లేరు. కేవలం వారిలో సగం తెలివితేటలే వీరికి ఉన్నాయి. వీరిని ఒక తుమ్ముతో సగంగా చీల్చివేయవచ్చు. ఇక పోతే ఆ పెద్ద కథను చిన్నగా చేసి చెప్పాలంటే,’వ్యోషేన్ స్కాయా స్టానిట్సా లో నాకు కొన్ని శవాల ఎముకలు చూసే అవకాశం వచ్చింది. వాళ్ళు నిజంగా ఆ నాటి కొసాక్కులు.’
‘ అవ్డేచ్,వాటిని నువ్వు ఎక్కడ తవ్వావు?’తన పక్కన ఉన్న వాడిని చూసి కన్ను కొడుతూ ,చక్కగా క్షవరం చేసుకుని ఉన్న ఒక కొసాక్కు అడిగాడు.
‘నువ్వు రాబోయే సెయింట్ దినం కోసమైనా ఒక్కసారి అబద్ధం చెప్పకుండా ఉండొచ్చు కదా?’, ముడతలు పడి ఉన్న తన చేతితో చెవి పోగు సరి చేసుకుంటూ, పాంటెలి మధ్యలో అడ్డు తగిలాడు. ఈ ఊదరగాడంటే పాంటెలికి ఏమాత్రం ఇష్టం లేదు.
‘నువ్వు ఒక్క అబద్ధం కూడా చెప్పను’, అవ్డేచ్ నిజాయితీగా అంటున్నట్టే ముఖం పెట్టి తల అటూఇటూ ఆశ్చర్యంతో ఊపుతూ ఉన్న అనికే వైపు చూస్తూ అన్నాడు.’మా బావ కోసం ఇల్లు కడుతున్నప్పుడు నేను ఎముకలు చూశాను. మేము పునాదులు వేస్తున్న సమయంలో ఓ సమాధి కనబడింది. అంటే పూర్వ కాలంలో ఈ డాన్ ప్రాంతంలో చర్చి పక్కన ఒక సమాధి ఉండేదనుకుంటా.’
‘అయితే ఎముకల సంగతి ఏమిటి?’పాంటెలి తలుపు దగ్గరకి వెళ్తూ అసహనంగా అడిగాడు.
‘ఇంత పెద్ద చేయి ఒకటి బయట పడింది అప్పుడు..’, ‘ఇంత పెద్ద చేయి ఒకటి బయట పడింది అప్పుడు..’, అవ్డేచ్ తన చేయి చాచి చూపిస్తూ,’ఒక తల కూడా, నిజంగా, నన్ను నమ్మండి-ఒక వంట పాత్ర అంత పెద్దగా ఉంది’,అన్నాడు.
‘చాల్లే అవ్డేచ్, ఇది ఆపి నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడు సెయింట్ పీటర్స్ బర్గ్ లో బందిపోటును ఎలా పట్టుకున్నావో చెప్పు’, మిరోన్ కిటికీ మూసి వేస్తూ, తన కోటును పైకి లాక్కుంటూ సూచించాడు.
‘అందులో చెప్పడానికి ఏముంది?’ అవ్డేచ్ హఠాత్తుగా వినమ్రంగా అన్నాడు.
‘మాకు చెప్పు!’
‘మాకు అది తెలుసుకునే భాగ్యం కలిగించు,!’
‘సరే, అది ఎలా జరిగిందంటే’, అవ్డేచ్ తన గొంతు సవరించుకుంటూ, తన ప్యాంటు జేబులో నుండి ఓ సంచిని తీసి, అందులో ఉన్న పొగాకును తన అరచేతిలో కొంత పొగాకు వేసుకుంటూ ప్రారంభించాడు. ఆ సమయంలో అతని ప్యాంటు జేబులో ఉన్న కొన్ని నాణేలు కింద పడ్డాయి. అయినా అతను పట్టించుకోకుండా తన శ్రోతల వైపే చూడసాగాడు.
‘ఒక గొప్ప ప్రతినాయకుడు కోట నుండి తప్పించుకున్నాడు. అధికారులందరూ అతని కోసం ప్రతి చోటా వెతుకుతున్నా అతన్ని పట్టుకోలేకపోయారు. వాళ్ళు అన్ని దిక్కుల్లో అతని కోసం వెతికారు. కానీ అతను అలా గాలిలోకి మాయమైనట్టు అదృశ్యమైపోయాడు.ఆ రోజు అర్ధరాత్రి, డ్యూటీ ఆఫీసర్ నన్ను గార్డ్ గదిలోకి పిలిపించాడు. నేను అక్కడికి వెళ్ళాక అతను నాతో ఏమన్నాడనుకున్నారు? “నువ్వు వెంటనే చక్రవర్తి గారి శయన మందిరానికి వెళ్ళు”, అన్నాడు. “ఆయన స్వయంగా నిన్ను చూడాలనుకుంటున్నారు.” ఆ మాట వినగానే నాకు ఎంతో భయం వేసింది, అయినా నేను లోపలికి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళి, ఒక మూల నిలబడి ఉంటే, ఆయన స్వయంగా నా భుజం మీద తట్టి, “ఇటు చూడు, అవ్డేచ్ , మన రాజ్యానికి ప్రమాదకరమైన శత్రువైన వ్యక్తి తప్పించుకుని పారిపోయాడు. నువ్వు అతన్ని పట్టుకుని తీరాలి, అతను ఎక్కడున్నా సరే. నువ్వు అతన్ని పట్టుకోలేకపోతే, ఎప్పటికీ నీ ముఖం నాకు చూపించాల్సిన అవసరం లేదు.” “నేను తప్పకుండా పట్టుకుంటాను, సార్ “, అని చెప్పను. నిజం చెప్తున్నాను, అది నాకు చాలా తలకాయ నొప్పి అయిపోయింది. అప్పుడు నేను అక్కడ ఉన్న గుర్రపు శాలలో మూడు మేలైన గుర్రాలను తీసుకుని బయలుదేరాను.’
అవ్డేచ్ ఒక సిగరెట్ వెలిగించుకుంటూ,తను చెప్పేది ఆసక్తితో వింటున్న శ్రోతల తలల వైపు చూస్తూ,సిగరెట్ పొగ తన ముఖం చుట్టూ వలయాకారంలో తిరుగుతూ ఉంటే,దాన్ని చూస్తూ కొత్త ప్రేరణ పొంది ఆ కథను కొనసాగించాడు. ‘ఆ రోజు ఉదయం నుండి రాత్రి వరకు నేను గుర్రం మీద స్వారీ చేస్తూ వెతుకుతూనే ఉన్నాను.మూడో రోజు మాస్కో దగ్గర,నేను అతన్ని పట్టుకున్నాను. అతన్ని నేను బండిలో ఎక్కించి వెనక్కి తీసుకువచ్చాను. నేను అర్ధ రాత్రి తిరిగి వచ్చేసరికి,నా శరీరమంతా దుమ్ము కొట్టుకుపోయి ఉంది. సరాసరి నేను చక్రవర్తి గారి దగ్గరకు వెళ్ళాను. కాకపోతే అక్కడ ఉన్న రాజ్యాధికారులు ఎంతోమంది నన్ను వెళ్ళకుండా అడ్డుకున్నారనుకోండి. కానీ నేను వాళ్ళను పట్టించుకోలేదు. నేను వెళ్ళి తలుపు తట్టాను.
‘నేను లోపలికి రావచ్చా,చక్రవర్తి గారు.”
“ఎవరది?”ఆయన అడిగారు.
“నేను,ఇవాన్ అవ్డేచ్ సిన్లిన్”,అన్నాను నేను.
ఆ తర్వాత నన్ను ఆయన యోగక్షేమాలు అడిగారు.
“మేరియా ఫ్యోడోర్ నోవా, మేరియా ఫ్యోడోర్ నోవా,త్వరగా లేచి సమోవర్ వెలిగించు. అవ్డేచ్ వచ్చాడు”,అని స్వయంగా చక్రవర్తి గారు అనడం నేను విన్నాను.
వెంటనే వెనుక నుండి పెద్ద పెద్ద నవ్వులు వినిపించాయి. పోయిన పశువుల లెక్కలు చదువుతూ ఉన్న ఓ గుమాస్తా తను ఓ తప్పిపోయిన గొర్రె గురించి చదువుతూ ఆ నవ్వులకు తడబడ్డాడు. నవ్వుతూ ఉన్న కొసాక్కుల వైపు అటామన్ తన తల కొంగలా ముందుకు వంచి మరి చూశాడు.
అవ్డేచ్ తన టోపీని తల ముందుకు లాక్కున్నాడు. అతని ముఖం సరిగ్గా కనబడటం లేదు.అతని కళ్ళు మాత్రం అతని శ్రోతల వైపు అటూ ఇటూ చూస్తూ ఉన్నాయి.
‘ఒక్క నిమిషం!’
‘హా …హా …హా!’
‘వీడి వల్ల చావు వచ్చి పడేలా ఉంది.’
‘హా ..హా ..హా..’
‘ఒరేయ్ అవ్డేచ్,బట్టతలోడా!’
“సమోవర్ ను వెలిగించు, అవ్డేచ్ వచ్చాడు!” అలా అనడం నీకు ఎలా అనిపించింది!’
ఆ తర్వాత అక్కడ బృందంగా ఉన్న కొసాక్కులు అందరూ నవ్వుకుంటూ చెక్క మెట్లు దిగారు. బయట మంచు కురుస్తూ ఉంది,అక్కడ స్టీఫెన్ అష్టకోవ్ మరియు గాలిమర యజమాని అయిన ఓ పొడుగ్గా ఉన్న కొసాక్కు కొట్టుకుంటూ ఉన్నారు.
‘ఆ గాలిమర గాడిని ఒక్కటి తన్ను!’చుట్టూ ఉన్న వారు అరుస్తూ ఉన్నారు. “వాడి తిత్తి తీయి,స్టీఫెన్!”
‘ఇక్కడ గొడవలు వద్దు! తెలివితక్కువ దద్దమ్మల్లారా!’ వృద్ధుడైన కాషులిన్ అరిచాడు, వారి దగ్గరకు వస్తూ.ఆ హడావుడిలో అతను తన ముక్కు మీద నుండి కిందకు మెరుస్తూ జారుతూ ఉన్న మంచు బిందువును కూడా గుర్తించలేదు.
* * *
అధ్యాయం-8
సమావేశం నుండి తిరిగి ఇంటికి వచ్చిన పాంటెలి సరాసరి తను,తన భార్య ఉండే పక్క గదిలోకి వెళ్ళాడు. ఇలినిచ్నకు కొద్ది కాలంగా ఆరోగ్యం బావుండటం లేదు. అలిసిపోయి,ఉబ్బినట్టు ఉన్న ముఖంలో ఆమె అనుభవిస్తున్న నొప్పి స్పష్టంగా తెలిసిపోతూ ఉంది. మెత్తటి పరుపు ఉన్న మంచం మీద లేచి కూర్చుని,వెనుక ఓ దిండు పెట్టుకుంది. తనకు అలవాటైన అడుగుల చప్పుడుకు, తల తిప్పి భర్త వైపు కఠినంగా చూసింది, అదే కఠినత్వం ఆమె ముఖాన్ని అప్పటికే చాలా కాలం నుండి అంటిపెట్టుకుని ఉంది. ఆమె తన దృష్టిని ఆ వృద్ధుడి గడ్డంలో చిక్కుపడ్డ వెంట్రుకల వైపు,అతని మీసం వైపు నిలిపింది,ఆమె నాసికలు అదిరాయి. ఆ వృద్ధుడి నుండి మంచు,గొర్రె చర్మం వాసన కలిసి ఓ వింత వాసన వస్తూ ఉంది. ‘ఈ రోజు బాగానే ఉన్నాడు’,అనుకుని, తృప్తిగా తను అల్లుతున్న గుడ్డను తన కడుపుపై పెట్టుకుంది.
‘చెక్క నరకడం గురించి వారు ఏమి నిర్ణయించారు?’
‘అది గురువారం నాడు జరిగేది’,పాంటెలి తన మీసాన్ని సరిచేసుకుంటూ అన్నాడు. ‘గురువారం, ఉదయాన్నే ఆ పనే జరుగుతుంది’, మంచం పక్కన ఉన్న పెట్టె మీద కూర్చుంటూ అన్నాడు.
‘అది సరే,నీకు ఎలా ఉంది?ఇప్పుడు కొంచెం మెరుగ్గా ఉందా?’
ఓ రకమైన అయిష్టత ఆమె ముఖంలో కనబడింది.
‘అలాగే ఉంది…. నా మోకాళ్ళలో నొప్పులు ఏమాత్రము తగ్గలేదు.’
‘నేను నీకు చెప్పాను కదా….మూర్ఖురాలా, వసంత కాలంలో నీళ్ళ జోలికి పోవద్దని. నీకు దేని వల్ల సమస్య వస్తుందో తెలిసినప్పుడు దానికి దూరంగా ఉండాలని కూడా తెలియదా!’, పాంటెలి నేల మీద తన చేతి కర్రను గట్టిగా అన్నాడు. ‘ఈ ఇంట్లో ఇంతమంది ఆడవాళ్ళు లేరా? ఆ జనపనారను,నిన్ను తగలబెట్టా! దేవుడా!నీకు ఇలా ఉన్నప్పుడే ఇలాంటి పనులు పెట్టుకోవాలా!’
‘మనం ఆ జనపనారను వృధా చేసే పరిస్థితిలో లేము. ఇంకెవరు ఉన్నారు ఇంట్లో? గ్రీషా,నటల్యా పొలం దున్నడానికి వెళ్తున్నారు. పెట్రో,దర్య ఎక్కడికో వెళ్ళిపోయారు.’
ఆ వృద్ధుడు ముందుకు వంగి, మూసి ఉన్న మోచేతుల దగ్గర తన ముఖాన్ని పెట్టి గట్టిగా గాలి పీల్చుకున్నాడు.
‘నటాల్య ఎలా ఉంది?’
అప్పటివరకూ నిరాసక్తంగా ఉన్న ఇలినిచ్న స్వరంలో ఒక్కసారిగా ఓ రకమైన దిగులు ఆవహించింది.
‘నాకేం చేయాలో తెలియడం లేదు. ఆ తర్వాతి రోజు కూడా ఆమె ఏడుస్తూ కనిపించింది. నేను ఆ రోజు వాకిట్లోకి వచ్చేసరికి,ధాన్యపు కొట్టం తలుపు తెరిచి ఉంది. నేను అక్కడకు వెళ్ళి తలుపు మూద్దామని అనుకున్నాను.అప్పుడు ఆమె చిరుధాన్యాల బస్తాల దగ్గర ఉంది.
‘ఏమైంది బంగారం?’అని అడిగాను.
‘తలనొప్పిగా ఉందమ్మా …’అంది.
‘ఆమె నుంచి నిజాన్ని ఆశించలేము,తెలిసిందేగా?’
‘ఒకవేళ తనకు ఆరోగ్యం బావుండలేదేమో?’
‘లేదు,నేను తనను అడిగాను. ఆమె మీద ఎవరో మంత్రం వేశారో లేకపోతే దీనికి కారణం గ్రీక్షా కావచ్చు.’
‘అతను ఆమెతో మళ్ళీ వ్యవహారమేమి మొదలుపెట్టలేదు కదా?’
‘ఓ దేవుడా! అలాంటిదేమీ లేదు. అయినా అలా ఎలా అనగలిగావు?’ఇలినిచ్న గుండెల మీద తన చేతులు పెట్టుకుంటూ ఆశ్చర్యంతో అంది. ‘నువ్వు స్టీఫెన్ గురించి ఏమనుకుంటున్నావు?అతను మరి అంత చేతకానివాడా? నాకు తెలిసి అటువంటిది ఏమి లేదు.’
ఆ వృద్ధుడు తన భార్యతో కాసేపు ఉండి, తర్వాత గదిలో నుండి బయటకు వచ్చాడు.
గ్రెగరి తన గదిలో చేపలను పట్టే కొక్కేలాను పదును పెడుతూ ఉన్నాడు. పంది మాంసపు కొవ్వును దానికి పూతగా పూస్తూ, ఒక్కొక్క దాన్ని చాలా జాగ్రత్త ఒక శుభ్రటి బట్టలో చుడుతూ ఉంది నటాల్య. ఆ గది వైపుగా బయటకు కుంటుతూ వెళ్తున్న పాంటెలి ఆమెను జాగ్రత్తగా గమనించాడు.ఎర్రబడి,లోతుకు పోయిన ఆమె బుగ్గలు,వాడిపోయిన వసంతకాలపు చెట్టు ఆకులా ఉంది. ఒక్క నెలలోనే ఆమె సన్నబడింది,అంతే కాదు ఆమె ముఖంలో ఏదో కొత్త మార్పు,ఆమె కళ్ళల్లో ఏవో తెలియని భావోద్వేగాలు కనబడుతూ ఉన్నాయి. ఆ వృద్ధుడు ఆ గది ద్వారం వద్ద ఆగిపోయాడు. ‘వీడు ఇలా అన్నమాట పెళ్ళాన్ని చూసుకుంటున్నది?’అనుకుంటూ వెనక్కి తిరిగి నటాల్య వైపు చూశాడు,నున్నగా దువ్విన ఆమె జడ బల్ల మీద ఆనుకుని ఉంది.
గ్రెగరి కిటికీ వైపుగా కూర్చుని ఉన్నాడు. అతను పదును పెడుతున్న కొద్ది అతని ముంగురులు ముందుకు ఎగురుతూ ఉన్నాయి.
‘ఆపరా’,పాంటెలి గట్టిగా అరిచాడు, అతని ముఖం కోపంతో ఊదా రంగులోకి మారిపోయింది, తన ఉద్రేకాన్ని అణచుకోవడానికి చేతికర్రను గట్టిగా నేలకు ఆనించాడు.
ఒక్కసారిగా ఉలిక్కిపడిన గ్రెగరి, తండ్రి వైపు ఆశ్చర్యంతో చూశాడు.
‘నేను రెండు వైపులా పదును పెడుతున్నాను,నాన్నా!’
‘అది కింద పడవేయ్! ఇక చెక్క నరకడానికి చేయాల్సిన పనులు చూడు!’
‘ఇది ఒక్క నిమిషం కూడా పట్టదు.’
‘అక్కడ మొద్దులన్నీ అక్కడ పనికిరాకుండా పోతూ ఉంటే ఈయన గారు కొక్కేలకి పదును పెడుతున్నాడు’, ఆ వృద్ధుడు శాంతంగా అన్నాడు. ఆ గది తలుపు దగ్గరే ఇంకో నిమిషం నిలబడి, ఏదో చెప్పాలనుకుని ఆగిపోయి,బయటకు వెళ్ళిపోయాడు. ఆ వృద్ధుడు తన కోపాన్ని పెట్రో మీద చూపించాడు.
గ్రెగరి తన కోటును వేసుకుంటూ, తండ్రి వాకిట్లో అరుస్తున్న అరుపులను విన్నాడు.
‘ఇంకా పశువులకు నీళ్ళు పెట్టలేదు! ఏం చేస్తున్నావురా,బద్ధకపు సన్నాసి? ఎవడ్రా ఆ కంచె దగ్గర ఉంది? దాన్ని పట్టుకోవద్దని చెప్పానా? పనికిమాలిన వెధవల్లారా,మంచి ఎండు గడ్డి అంతా తీసుకుపోతారు. అప్పుడు మేము మా ఎద్దులను దేనితో మేపాలి?’
గురువారం ఉదయం ఇంకా తెల్లవారడానికి రెండు గంటల ముందే ఇలినిచ్న దర్యను నిద్ర లేపింది.
‘నిద్ర లే, పొయ్యి వెలిగించాల్సిన సమయం అయ్యింది.’
దర్య పొయ్యి వైపు తన నెమ్మది నడకతో నడిచి, పై అరలో ఉన్న అగ్గిపుల్లలు తీసుకుని,పొయ్యి వెలిగించింది.
‘త్వరగా వంటి పూర్తి చేయి’,పెట్రో కూడా చిన్నగా అరిచాడు. అతను అప్పుడే నిద్ర లేచి,ముంగుర్లను సరిచేసుకుంటూ సిగరెట్ వెలిగించి,చిన్నగా దగ్గాడు.
‘వాళ్ళు ఎప్పుడు నటాల్యను నిద్ర లేపరు. ఆ సిగ్గులేనిది ఎంత సేపు కావాలంటే అంతసేపు నిద్ర పోతుంది. ఇప్పుడే నేనే అన్ని పనులు చేసి నడ్డి విరగ్గొట్టుకోవాలా?’ నిద్ర మత్తు వదలని దర్య గొణుగుతూ అంది.
‘అయితే వెళ్ళి తనను కూడా నిద్ర లేపు’,పెట్రో సూచించాడు.
నటాల్య అప్పటికే నిద్ర లేచింది. చలికి ఒక కోటు వేసుకుని, పాకలోకి కట్టెలు తేవడానికి వెళ్ళింది.
‘ఇంకొన్ని కట్టెలు తీసుకునిరా’,తోటి కోడలు ఆమెను ఆజ్ఞాపించింది.
‘దున్యాను వెళ్ళి నీళ్ళు తీసుకురమ్మని చెప్పు. నీకు వినబడుతుందా,దర్య?’
ఒళ్ళు నొప్పులతోనే వంటింట్లోకి వచ్చిన ఇలినిచ్న అడిగింది.
ఆ వంటగది తాజా ఈస్ట్, కట్టెలు,పిడకలు కాలుతున్న వాసనతో పాటు మానవ శరీర వెచ్చదనంతో కూడా నిండి ఉంది. దర్య వేలాడుతూ వదులుగా ఉన్న తన బూట్లతో,దారిలో ఉన్న ఇనుము కుండలు,పాత్రలకు కాళ్ళు తగిలిస్తూ,శబ్దం చేస్తూ; తన గౌను చేతులను పైకి లాక్కుంటూ, ముందుకు నడుస్తూ ఉంటే ఆమె చిన్న రొమ్ములు గులాబీ రంగు గౌను వెనుక వణుకుతూ ఉన్నాయి. వైవాహిక జీవితం ఆమె శరీర ఆకృతిని ఏమి చెడగొట్టలేదు. పొడుగ్గా,సన్నగా; విల్లో కొమ్మలా లేతగా,ఇప్పటికి ఆమె యవ్వనంలో ఉన్న అమ్మాయిలానే ఉంది. ఆమె భుజాలు ఎగురవేస్తూ ముందుకు నడుస్తూ ఉంటే, ఆమె పిర్రలు వెనుక ఊగుతూ ఉన్నాయి.భర్త మాటలకు ఆమె నవ్వుతూ ఉంటే మూసి ఉన్న ఆమె పెదవుల వెనుక ఉన్న పళ్ళు బయటకు కనబడుతూ ఉన్నాయి.
‘నువ్వు పిడకలను నిన్న సాయంత్రమే పొయ్యిలో పెట్టి ఉంటే బాగుండేది. రాత్రంతా ఎండి ఉండేవి’,ఇలినిచ్న విసుగ్గా అంది.
‘నేను మరిచిపోయానమ్మా’,దర్య నిర్లక్ష్యంగా అంది.
వాళ్ళు అల్పాహారం వండేసరికి ఉదయపు వెలుగు వచ్చేసింది. వృద్ధుడైన పాంటెలి హడావుడిగా కాలుతూ ఉన్నా తిన్నాడు. గ్రెగరి మెల్లగా నములుతూ ఉంటే,అతని దవడ ఎముకలు కదలడం బయటకు కనిపిస్తూ ఉంది. తండ్రి తన వైపు చూడనప్పుడు పెట్రో, అప్పటికే పంటి నొప్పి వల్ల కట్టు కట్టుకున్న దున్యాను ఆటపట్టిస్తూ ఉన్నాడు.
గ్రామంలో ఉన్న అందరూ దాదాపుగా ఎడ్ల కు చెక్కతో బండ్లను కట్టి,వాటి మీద బయల్దేరారు. అప్పుడే తెలవారుతున్న ఆ గ్రామంలో ఆ బండ్లు డాన్ వైపు దూసుకుపోతూ ఉన్నాయి. గ్రెగరి,పెట్రో ఆ బండిని సిద్ధం చేస్తున్నారు. నటాల్య పెళ్ళికి ముందు ఇచ్చిన మెత్తటి శాలువాను గ్రెగరి గొంతు చుట్టూ కప్పుకుని, మంచు పట్టి ఉన్న ఆ వాతావరణంలోని గాలి పీల్చుకున్నాడు. ఒక కాకి ఆ వాకిట్లో నిలబడి అరుస్తూనే ఉంది,దాని అరుపులు ఆ నిశ్శబ్దంలో ఇంకా గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. పెట్రో దాని వైపు ఒక్క క్షణం చూశాడు.
‘అది వెచ్చగా ఉండే దక్షిణం దిక్కుకేసి పోతుంది’,అన్నాడు.
గులాబీరంగులో ఉన్న ఒక చిన్న మేఘం వెనకాల, సంతోషంగా నవ్వుతున్న చిన్నపిల్ల నవ్వులా, అప్పుడే వెళ్లిపోతున్నట్టు ఉన్న చంద్రుడు చిన్న కాంతితో మెరుస్తూ ఉంటే, అప్పుడే చిమ్ని నుండి వస్తున్న పొగ, దూరంగా ఉన్న ఆ కాంతిలో కలిసిపోయి,బంగారపు వర్ణంలోకి మారిపోయింది.
మెలఖోవుల పొలం దగ్గర ఇంకా మంచు గడ్డ కట్టలేదు.పచ్చగా,మంచుగా మారి గట్టిపడ్డ నీరు మెల్లగా ఒడ్డు నుండి ముఖ్య ప్రవాహంలోకి ముందుకు సాగుతూ,అక్కడక్కడ నురగలు కడుతూ,ముందుకు సాగుతూ ఉంటే, అటువైపు అలలుగా లేస్తూ ఉన్నాయి. ఓ ప్రమాదకరమైన సరస్సు లాంటిది ఎడమ వైపు ఒడ్డుకి దగ్గరలో మంచు పట్టి ఉంది,దానిలో ఉన్న బాతులు ఆ చలికాలంలో బస చేస్తూ ఉన్నాయి.
కూడలి నుండి ఎడ్ల బండ్లు అన్ని ప్రయాణం కొనసాగించాయి.
పాంటెలి తన కొడుకుల కోసం ఆగకుండా ముసలివైన ఎద్దుల జతతో ఉన్న బండి మీద వేగంగా ముందుకు సాగాడు. కొంతసేపటికి గ్రెగరి,పెట్రో అతన్ని అనుసరించారు. నది దగ్గరకు వెళ్ళే ఏటవాలు దారిలో వారు అనికే ని కలిశారు. అతను తన కొత్త గొడ్డలిని బండికి ఒక వైపుకి పెట్టి, పొట్ట చుట్టూ,ఆకుపచ్చ రంగు బట్ట కట్టుకుని,ఎడ్ల పక్కన నడుస్తూ ఉన్నాడు. బక్కపలుచగా,అనారోగ్యంతో ఉన్నట్టు ఉన్న అతని భార్య బండి మీద కూర్చుని, బండి పగ్గాలు అందుకుంది.
‘ఓ పొరుగువాడా! నీ భార్యను కూడా తీసుకువస్తున్నావా’,కొంచెం దూరం నుండే పెట్రో అరిచాడు.
ఎప్పుడు సరదాగా ఉండే అనికే వెంటనే ఆ సోదరుల బండి దగ్గరకు రెండు గెంతుల్లో వెళ్ళాడు.
‘అవును,వెచ్చగా ఉంటుందని.’
‘అయినా ఆమె వల్ల నీకు సరిపడినంత వెచ్చదనం లభించదు.’
‘ఆమె లావవ్వాలని నేను ఓట్స్ పెడుతున్నాను,కానీ ఏ లాభం లేదు.’
‘మేము కూడా నువ్వు ఉండే భాగంలోనే చెక్క నరుకుతున్నామా?’గ్రెగరి బండి మీద నుండి కిందకు దూకుతూ అడిగాడు.
‘తప్పకుండా,నువ్వు నాకు వెలిగించుకోవడానికి ఒక సిగరెట్ ఇస్తే.’
‘ఉచితంగా ఏదైనా కొట్టేయ్యడంలో నీకు నువ్వే సాటి.’
‘ఈ ప్రపంచంలో అడుక్కునేవో లేక దొంగిలించేవో మాత్రమే ఎంతో మధురంగా ఉంటాయి’, అనికే స్త్రీలా ఉండే తన ముఖం ముడతలు పడేలా నవ్వాడు.
వారు కలిసి ప్రయాణం కొనసాగించారు. మంచు వల్ల అడవి అంతా తెల్లబడినట్టు ఉంది. అనికే తన బండిలోకి దూకి రోడ్డు పక్కగా ఉన్న చెట్ల కొమ్మలను కొరడాతో అదిలిస్తూ ఉంటే,ఆ చెట్లకు పట్టిన మంచు అంతా అతని భార్య మీద పడసాగింది.
‘నీకు ఆటలుగా ఉందా,దయ్యమా?’అతని భార్య వణుకుతూ,అరిచింది.
‘ఆమె ముక్కును తీసుకెళ్ళి మంచులో ముంచు’, పెట్రో ఎడ్లను కొరడాతో అదిలిస్తూ,అరిచాడు.
ఒక మలుపు దగ్గర వారికి స్టీఫెన్ అష్టకోవ్ ఎదురయ్యాడు. అతను బండి కట్టబడని ఎడ్లను వెనక్కి గ్రామంలోకి తీసుకువెళ్తున్నాడు. అతను ఆ ఎద్దుల జంటను నడిపిస్తూ ఉంటే, మంచుతో ఉన్న ముంగురులు అతని టోపీ కింద నుండ ముఖం మీదకు పడుతూ ఉంటే,అతని బూట్లు కిర్రుమంటున్నాయి.
‘ఏమైంది స్టీఫెన్ ? దారి తప్పావా?’దగ్గరలోకి వచ్చాక అనికె అరిచాడు.
‘అవును. దరిద్రం పట్టుకుని దారి తప్పాను. ఆ బండి ఒక మొద్దుకు తగిలి ఒక సగం మధ్యలోకి ఊడిపోయింది. నేను ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి…’ స్టీఫెన్ ఘాటుగా స్పందిస్తూ, పక్కనే ఉన్న పెట్రో ను చూసి తన కళ్ళను కోపంతో పెద్దవి చేశాడు.
‘మరి బండి వదిలేశావా?’ అనికె వెనక్కి తిరిగి,అరిచాడు.
స్టీఫెన్ అవునన్నట్టు చేయి ఊపి, కొరడాతో ఎద్దులను అదిలించి గ్రామం వైపు సాగిపోయాడు. అతను వెళ్తూ వెళ్తూ గ్రెగరి వైపు కోపంగా చూశాడు. కొద్దిగా ముందుకు వెళ్ళాక, గ్రెగరి రోడ్డు మధ్యలో స్టీఫెన్ వదిలేసిన బండిని చూశాడు. అక్సిన్య దాని పక్కనే నిలబడి ఉంది. ఆమె ఆ దారిలో వెళ్తూ ఉన్న బండ్ల వైపు చూస్తూ, తన ఎడమ చేతితో తన చలికాలపు ఫర్ కోటు అంచులను పట్టుకుని ఉంది.
‘దారి నుండి తప్పుకో లేకపోతే నీ మీద నుండే బండిని పోనిస్తాను. అబ్బా,ఎటువంటి భార్యవు,నాకు నీ లాంటి భార్య లేదే!’అని సరదాగా అనికె అన్నాడు.
అక్సిన్య నవ్వుతూ ఓ అడుగు వెనక్కి వేసి, విరిగిపోయిన బండి మీద కూర్చుంది.
‘నీకు మంచి భార్యే ఉంది.’
‘పంది బురదను అంటిపెట్టుకుని ఉన్నట్టు ఎప్పుడూ నాతోనే ఉంటుంది,లేకపోతే నీకు లిఫ్ట్ ఇచ్చేవాడిని.’
‘నీ దయకు కృతజ్ఞతలు.’
ఆమెను దాటుటూ ఉండగా, పెట్రో వెనక్కి తిరిగి గ్రెగరి వైపు చూశాడు. ఆమెను చూడగానే ఓ చిన్న చిరునవ్వుతో పాటు తమ్ముడి ముఖంలో ఓ రకమైన ఉద్వేగం,సంతోషం, ప్రతి కదలికలో ఓ మార్పు కొట్టిచ్చినట్టు పెట్రోకు కనబడ్డాయి.
‘ఓ పొరుగుదానా!నీకు శుభోదయం’, పెట్రో తన టోపిని చేత్తో పట్టుకుంటూ ఆమెను పలకరించాడు.
‘దేవుణ్ణి స్తుతించుగాక!’
‘అంటే మీకు ఏమైనా ఈ బండి వల్ల ప్రమాదం జరిగిందా?’
‘అవును,జరిగింది’,అక్సిన్య పెట్రోకి మెల్లగా సమాధానం చెప్తూ, గ్రెగరి దగ్గరగా రావడంతో,లేచి నిలుచుని,అతని వైపు తల తిప్పి, ‘గ్రెగరి పాంటెలెవిచ్,నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను’,అంది.
‘నా ఎడ్లను కూడా చూస్తూ ఉండు’, అన్న పెట్రోకి వినబడేలా అరిచి, గ్రెగరి ఆమె వైపుకి తిరిగాడు.
‘సరే ,సరే’పెట్రో అప్పటికే వగరైన పొగాకు మరకలతో ఉన్న మీసాన్ని అసహనంగా మెలివేస్తూ అన్నాడు.
ఆ ఇద్దరూ మౌనంగా ఒకరికొకరు ఎదురుగా నిలబడ్డారు. అక్సిన్య కంగారుగా చుట్టూ చూసి, తన నల్లటి కళ్ళను గ్రెగరి మీద నిలిపింది. సిగ్గు,ఆనందం వల్ల ఆమె చెక్కిళ్ళు ఎరుపెక్కి, పెదవులు తడారిపోయాయి. ఆమె ఊపిరి పీల్చుకుంటూ ఉంటే,ఎద ఎగిసిపడుతూ ఉంది.
చూస్తూ ఉండగానే పెట్రో బండి,అనికె బండి గోధుమరంగులో ఉన్న ఓక్ చెట్లను దాటి కనుచూపు మేరలో లేకుండా పోయాయి. గ్రెగరి సూటిగా ఆమె కళ్ళల్లోకి చూశాడు,అవి అసహనంగా కొట్టుకుంటూ ఉన్నాయి.
‘గ్రీక్షా,నీకు నాతో ఏమి చేయాలని ఉంటే అదే చేయి,కానీ నువ్వు లేకుండా నేను బ్రతకలేను’, ఆమె ధృఢంగా చెప్పి,అతని సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంది.
అతను ఏమి మాట్లాడలేదు. ఆ ప్రాంతం,చుట్టూ ఉన్న అడవి కూడా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దంలోనే అతని చెవిలో ఏవో ధ్వనులు వినిపిస్తున్నట్టు అనిపించింది. అప్పటివరకూ బండ్లు వెళ్ళిన దారి, బూడిదరంగులో ఉన్న ఆకాశం, నిద్రపోతున్నట్టు ఉన్న అడవి…..ఓ రకమైన నిషాలో మునిగిపోయిన గ్రెగరిని ఓ కాకి అరుపు ఈ లోకంలోకి తెచ్చింది. అతను పైకి చూశాడు. నల్లగా ఉన్న కాకి పైకి ఎగురుతూ, వీడ్కోలు పలుకుతున్నట్టు రెక్కలు ఆడిస్తూ, అక్కడి నుంచి నిశ్శబ్దంగా ఎగురుతూ వెళ్ళిపోయింది.
‘దానికి ఇక ఈ చలి బాధ ఉండదు. అది వెచ్చగా ఉండే ప్రదేశం వైపు వెళ్తూ ఉంది’, తన మాటలకు తానే ఆశ్చర్యపోతూ అన్నాడు.
మళ్ళీ మామూలైపోయి, సరదాగా నవ్వుతూ, ‘అయితే?’ అంటూ, మత్తుగా ఉన్న తన కళ్ళను కిందకు దించి,ఆమెను దగ్గరకు లాక్కున్నాడు.
* * *
అధ్యాయం-9
ఒక మెల్లకన్నుతో ఉండే లుకేష్కా ఇంట్లో స్టోక్ మాన్ ఉండే గదిలో సాయంత్రాలు వివిధ రకాల మనుషులు గుమిగూడేవారు. అక్కడకు ఖ్రిస్టోన్య వచ్చేవాడు. అలాగే మిల్లు నుండి గ్రీజు మరకలతో ఉన్న కోటును భుజాన వేసుకుని నేవ్, అప్పటికే మూడు నెలల నుండి ఖాళీగా ఉన్నా నవ్వుతూ ఉండే దవ్యాడ్క,ఇంజన్ దగ్గర పని చేసే ఇవాన్ అలెక్సెవిచ్ కొట్ల్యా రోవ్ వచ్చేవారు. చెప్పులు కుట్టే ఫిల్కా అప్పుడప్పుడు వచ్చేవాడు. కుర్రవాడై,అప్పటికి సైన్యానికి వెళ్ళని మిష్కా కొషెవి రోజూ అక్కడకు అతిథిలా వచ్చేవాడు.
మొదట వారు పేకాట ఆడేవారు. తర్వాత సన్నగా ఉన్న ఓ పుస్తకాన్ని, స్టోక్ మాన్ బయటకు తీసి, దాని నుండి నెక్రసోవ్ పదాలున్న పేజీలను తెరిచేవాడు. వారందరూ దానిని గట్టిగా చదివేవారు,అది బాగానే నడిచేది.తర్వాత నికిటినివి చదివేవారు. క్రిస్టమస్ సమీపిస్తున్న సమయంలో వారందరూ అప్పటికే కవర్ పేజీ పోయి, సగం చినిగిపోయిన పేజీలతో ఉన్న ఓ నోట్ బుక్ ను చదవాలను స్టోక్ మాన్ సూచించాడు. అప్పటికే చర్చి పాఠశాలలో చదువుకుని ఉండటం వల్ల, కొంత చదివి ఉన్న కొర్షినోయ్ ఆ క్షీణ దశలో ఉన్న ఆ పుస్తకాన్ని చూస్తూ, ‘నువ్వు ఈ పుస్తకంతో నూడుల్స్ చేసుకోవచ్చు, అంత వాడబడి చిరిగిపోవడానికి సిద్ధంగా ఉంది ఇది’,అన్నాడు.
ఆ మాటలకు ఖ్రిస్టోన్య పగలబడి నవ్వితే, దవ్యడ్క పళ్ళు కనిపించేలా నవ్వేవాడు. స్టోక్ మాన్ ఆ నవ్వులన్నీ అయ్యేవరకు ఆగి, ‘మా కోసం చదువు మిషా!అది చాలా ఆసక్తికరంగా ఉంది,ముఖ్యంగా కోసాక్కుల గురించి’,అన్నాడు.
సరిగ్గా దువ్వుకోకపోవడం వల్ల చిక్కులు పడి ఉన్న జుట్టుతో ఉన్న తలను టేబుల్ మీదకు వంచి,కోష్కేవోయ్ శీర్షికను గట్టిగా చదివాడు.
‘డాన్ కోసాక్కుల సంక్షిప్త చరిత్ర’చదివాక,అతను తన చుట్టూ ఉన్న శ్రోతల వంక చూశాడు.
‘చదువు’, ఇవాన్ అలెక్సివిచ్ అన్నాడు.
మొత్తం మీద దాన్ని పూర్తి చేయడానికి వారికి మూడు సాయంత్రాలు పట్టింది. మొదట వారు పుగచోవ్ గురించి,తర్వాత కోసాక్కుల స్వాతంత్ర్యం గురించి,స్టెంకారాజిన్, కొండ్రాటి బులావిన్ గురించి చదివి తర్వాత ఈ మధ్య కాలానికి వచ్చారు. ఆ అజ్ఞాత రచయిత కోసాక్కుల పేదరికం గురించి స్పష్టం చేస్తూ,వ్యంగ్యంగా రాశాడు. వారి పరిపాలన వ్యవస్థను,జారుల అధికారాన్ని, ఆ నియంతృత్వ పాలనలో తమకు తామే స్వచ్చందంగా సైన్యంలో చేరే కోసాక్కుల గురించి హేళనగా రాశాడు. దానితో అక్కడి వాతావరణం వేడెక్కి,వాదనలు మొదలయ్యాయి. బలమైన కండరాలతో,బలిష్టమైన శరీరంతో ఉన్న ఇవాన్ అలెక్సివిచ్ ఈ విషయంలో గట్టిగా వాదించాడు. కోసాక్కుల సాంప్రదాయాలు,పద్ధతులు అతని ప్రతి కణంలోనూ జీర్ణించుకుపోయింది. అతను కోసాక్కులవైపు మాట్లాడుతూ, ఖ్రిస్టోన్యను తీవ్రంగా వ్యతిరేకించాడు,అతను మాట్లాడుతూ ఉంటే కళ్ళు మెరుస్తున్నాయి.
‘నువ్వు అచ్చం ఒక ముజిక్(రష్యన్ పేద రైతులను ముజిక్ లు అంటారు,ఎక్కువగా ఈ పదం హేళన చేయడానికే వాడతారు)లానే పెరిగావు, ఖ్రిస్టోన్య. నువ్వు ఇక వాదించకు!నీలో బిందెల కొద్ది ఉన్న ముజిక్ రక్తంలో ఒక్క చుక్క కోసాక్కుల రక్తమే కలిసి ఉంది. నిన్ను మీ అమ్మ ఓ వొరోనేజ్ ప్రాంత గుడ్లు అమ్మేవాడి నుండి తీసుకువచ్చింది!’
‘నువ్వు ఒక వెధవ్వి! నువ్వొక పెద్ద పెద్ద వెధవ్వి!’ ఎత్తుగా ఉన్న గార్డ్స్ మెన్ అరిచాడు. ‘నేను నిజం కోసమే నిలబడుతున్నాను!’
‘నేను అటామన్ల రెజిమెంటులో పని చేయలేదు’, ఇవాన్ అలెక్సేవిచ్ సూటిగా బదులిచ్చాడు, ‘అక్కడే అందరు వెధవలు ఉండేది’,అన్నాడు ఘాటుగా.
‘అంతకన్నా వెధవలు మిగిలిన రెజిమెంట్లలో కూడా ఉన్నారు!’
‘నోర్మూసుకో ముజిక్!’
‘ముజిక్కులు కూడా మనుషులే,కాదంటావా?’
‘ముజిక్కులు ముజిక్కులే, వాళ్ళు బెరడుతో నిర్మితమై,దానిలో గడ్డితో నింపబడ్డారు!’
‘నేను అన్ని రకాల వారిని చూశాను,పీటర్స్ బర్గులో పని చేస్తున్నప్పుడు. ఓ హాస్యమైన విషయం జరిగింది ఓ సారి’,ఖ్రిస్టోన్య చెప్పుకుంటూ పోయాడు. ‘మేము జార్ భవనంలో అతని గది ముందు, గార్డులుగా రక్షణ కోసం నిలబడి ఉన్నాము. బయట ఉన్న గార్డుల్లో ఇద్దరు బయటి గోడకు ఒకవైపు,ఇంకో ఇద్దరూ ఇంకో వైపు పహరా కాస్తూ ఉండేవారు. మేము ఒకరికొకరం ఎదురైనప్పుడు,అంతా మాములుగానే ఉందా,లేకపోతే ఏమైనా విప్లవకారుల వల్ల ఇబ్బంది వచ్చేలా ఉందా అని కనుక్కుంటూ ఉండేవాళ్ళము. ‘అంతా నిశ్శబ్దంగా ఉంది’,అన్న సమాధానం రాగానే మా పనిలో మేము ఉండేవాళ్ళము. కానీ ఎప్పుడు మేము ఆగి,మాట్లాడుకునేవాళ్ళము కాదు,మా కళ్ళతోనే ఈ సంభాషణ జరిగిపోయేది. ఆ నైపుణ్యం వల్లనే మమ్మల్ని అక్కడ ఎంపిక చేశారు. ద్వారం దగ్గర ఉండే ఇద్దరూ ఒకేలా ఉండేవారినే ఎంచుకుంటారు. నల్లగా ఉంటే ఇద్దరూ నల్లగా ఉండేవారిని,రంగు ఉంటే ఇద్దరూ రంగు వారిని,అలాగన్నమాట!జుట్టు రంగు మొదలుకుని,ముఖాల రంగు వరకు అన్ని ఒకేలా ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు. దీని వల్లే నేను మంగలి దగ్గరకు వెళ్ళి నా గడ్డానికి రంగు వేయించుకోవాల్సి వచ్చింది. టెపిపికిన్ స్కాయా నుండి మా దళంలోకి వచ్చిన నికిఫోర్ మెశ్చర్యకోవుతో నన్ను జత పరిచారు. అసలు అతని జుట్టు,మీసం ఆ రంగులోకి ఎలా వచ్చాయో దేవుడికే తెలియాలి, మండుతున్నట్టు ఎర్రరంగులో ఉన్నాయి. ఏ దళంలోనూ కూడా అతనిలా ఉండేవారు ఎవరూ లేరు. మా లూయీటెంట్ బార్కిన్ నన్ను పిలిచి, “నువ్వు మంగలి దగ్గరకు వెళ్ళి,నీ గడ్డం,మీసాలకు రంగు వేయించుకుని రా”అని పంపాడు.” అలా చేశారు నాకు, ఎప్పుడైతే నేను రంగు వేయించుకున్నాక అద్దంలో నన్ను నేను చూసుకున్నానో, నా గుండె నా బూట్లలోకి జారిపోయింది. నాకు నేను మంటల్లో ఉన్నట్టు అనిపించింది! ఎప్పుడైతే నా గడ్డాన్ని పట్టుకున్నానో అప్పుడు నా చేతులు కూడా కాలాయి!’
‘ఇక ఆ సోది ఆపు! ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నావు నీవు?’ ఇవాన్ అలెక్సివిచ్ మధ్యలో అడ్డం వచ్చాడు.
‘ప్రజల గురించి,అది నేను చెప్పేది.’
‘అలా అయితే వారి గురించి చెప్పు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా నువ్వు నీ గడ్డం దగ్గరే ఉండిపోయావు –దాని వల్ల మాకు వీసమెత్తు కూడా ఉపయోగం లేదు.’
‘అదే నేను మీకు చెప్తున్నాను!ఒకసారి మేము గార్డులుగా పని మీద బయటకు వెళ్ళాల్సి వచ్చింది. నేను,నాతో పాటు ఒక నా స్నేహితుడు,అంతే. మేము బయట ఓ మూలకు వచ్చేసరికి విద్యార్థులు ఉన్నారు. గుంపులుగా ఉన్నారు! మమ్మల్ని చూడగానే అరవడం మొదలుపెట్టారు. మేము ఎక్కడ ఉన్నామో చూసుకునేసరికే వాళ్ళు మమ్మల్ని చుట్టుముట్టారు. “ఎక్కడికి బయల్దేరారు కోసాక్కులు?”, “మేము గార్డ్ డ్యూటీలో ఉన్నాము”,అని నేను సమాధానమిచ్చాను. “ఇప్పుడు మమ్మల్ని వెళ్ళనివ్వండి. మీ చేతులు గుర్రం మీద తీయండి”, అంటూ నేను నా కత్తి తీయబోయాను. “ఓ కోసాక్కు,ప్రమాదమేమి లేదు,నేను కామెన్ స్కాయా స్టానిట్సా కు చెందినవాడిని. నేను ఇక్కడ యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చాను”,అన్నాడు. మేము బయల్దేరుతూ ఉంటే ఒక పెద్ద ముక్క ఉన్న కుర్రాడు, తన వ్యాలెట్ లో నుండి ఒక టెనర్ (పది పౌండ్లకు సమానం) తీసి, “ఇది తీసుకోండి, ఒక గ్లాసు మద్యం తాగండి,మా నాన్న గౌరవార్థం”,అన్నాడు. ఆ నోటు మాకు ఇచ్చి,అతను తన వ్యాలెట్ లో నుండి ఒక ఫోటో బయటకు తీశాడు. “ఇదే మా నాన్నగారి ఫోటో,మీరు ఇది ఉంచుకోవచ్చు”,అన్నాడు. సరే అని,మేము దానిని తీసుకున్నాము,అదేమి సిగ్గు పడాల్సిన పని కాదు కదా. అరుపులు,కేకలతో ఆ విద్యార్థులు ముందుకు సాగిపోయారు. మేము నెవ్స్కి ప్రాస్పెక్ట్ వైపుకి వెళ్ళిపోయాము. అదే సమయంలో ఒక లూయీటెంట్ వెనుక ద్వారం నుండి తన సైన్యంతో సహా మా వద్దకు వచ్చాడు. “ఏం జరిగింది?”అని అడిగాడు. “ఆ విద్యార్థులు మమ్మల్ని చుట్టుముట్టి మాతో మాట్లాడుతూ ఉన్నారు. మా కర్తవ్యాన్ని అనుసరించి వారిపై దాడి చేసేలోపే వారే దారిచ్చారు,మేము ముందుకు కదిలాము”,అని బదులిచ్చాను. ఆ తర్వాత ఆ రోజు పని అయిపోయాక, మేము సెర్జెంట్ మేజర్ తో, “మేము ఈ రోజు పది రూబుళ్ళు సంపాదించాము,వీటితో హాయిగా తాగితేనే ,ఆ కుర్రాడి తండ్రి ఆత్మ శాంతిస్తుంది”అన్నాము. ఆ మేజర్ అప్పుడు వోడ్కా తీసుకువస్తే రెండు రోజుల వరకు తాగుతూనే ఉన్నాము,ఆ తర్వాత అక్కడ జరిగిన పన్నాగం మాకు అర్థమైంది. ఆ కుర్రాడు,మాకు తన తండ్రి ఫోటో బదులు, పెద్ద విప్లవకారుడైన ఒక జర్మన్ ఫోటో ఇచ్చాడు. నాకు ఆ విషయం తెలియదు. నా అంతరాత్మ చెప్పినట్టు విని,అతని గౌరవార్థం నేను ఆ ఫోటోను నా మంచం పక్కన ఉన్న గోడకు తగిలించాను. అతను చూడటానికి బాగానే ఉన్నాడు,పెద్ద గడ్డంతో,ఒక వ్యాపారిలా ఉన్నాడు చూడటానికి. ఆ లూయిటెంట్ అది చూసి, “నీకు ఈ ఫోటో ఎక్కడి నుండి వచ్చింది?”అని అడిగాడు. నేను జరిగింది ఆయనకు చెప్పాను. అప్పుడు ఆయన నా రెండు చెంపలు ఒక దాని తర్వాత ఒకటి పగలగొట్టి, “నీకు వాడు ఎవడో తెలుసా? వాళ్ళ నాయకుడైన కారల్..”,అబ్బా…ఆ పేరు ఇప్పుడు నాకు గుర్తుకు రావడం లేదు, ఏంటబ్బా …ఆ పేరు..’
‘కారల్ మార్క్స్?’ స్టోక్ మాన్ నవ్వు ఆపుకుంటూ సూచించాడు.
‘హా,అదే! కారల్ మార్క్స్!’ ఖ్రిస్టోన్య కూడా పగలబడి నవ్వాడు.
‘నన్ను సరిగ్గా పూర్తి చేయనివ్వండి. మీకు తెలుసా,కొన్ని సార్లు జార్విచ్ అలెక్సి గార్డ్స్ గదుల్లోకి ట్యూటర్స్ తో కలిసి వచ్చేవాడు. ఒకవేళ ఆయన దాన్ని చూసి ఉంటే? అప్పుడు ఏమి జరిగి ఉండేది?’
‘నువ్వేమో ముజిక్కులను పొగుడుతూ ఉంటావు. వాళ్ళు నిన్ను సరాసరి ముళ్ళ తోవలో పడేశారు’,ఇవాన్ అలెక్సివిచ్ నవ్వుతూ అన్నాడు.
‘అయినప్పటికి,మాకు అతని వల్లే ఒక టెనర్ విలువ చేసే మందు దొరికింది. మేము ఆ గడ్డం ఆయన కోసం తాగినా,ఆ మందు బావుంది.’
‘ఆయనకు చీర్స్ చెబుదాము’,స్టోక్ మాన్ ఒక వైపున పొగాకు మరకలు అంటిన తన సిగరెట్ పెట్టెను పట్టుకుంటూ,నవ్వుతూ అన్నాడు.
‘ఆయన ఏమి సాధించాడని చెప్పాలి?’కొషెవోయ్ అడిగాడు.
‘అది నేను ఇంకోసారి చెప్తాను. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది’,మిగిలిపోయిన సిగరెట్ పీకను కాళ్ళ కింద నలిపి వేస్తూ అన్నాడు స్టోక్ మాన్.
తర్వాత బాగా ఆలోచించి,గట్టిగా నిర్ణయించుకున్నాక అక్కడ ఓ పదిమంది కోసాక్కులు ఓ బృందంగా ఏర్పడి తరచుగా కలుసుకుంటూ ఉండేవారు. స్టోక్ మాన్ వారికి నాయకుడిగా వ్యవహరించేవాడు, తన లక్ష్యాన్ని రహస్యముగా ఉంచి,దానికి తగ్గట్టే వ్యవహరించేవాడు. చెదపురుగులు మెల్లగా చెక్కను తిన్నట్టు, అతను కూడా మెల్లగా అప్పుడు ఉన్న వ్యవస్థ పట్ల వారికి విముఖత,ద్వేషం కలిగేలా క్రమక్రమంగా చేయసాగాడు. ఒక అపరిచితుడిగా అతని పట్ల ఉన్న అపనమ్మకాన్ని వారి మనసుల్లో నుండి తొలగించాడు.
అతను వారిలో అసంతృప్తి జ్వాలలు రగిలించాడు. ఎవరికి తెలుసు నాలుగేళ్ళ సమయంలో బలహీనంగా,పగిలిపోయేలా ఉన్న గుడ్డులో నుండే ఒక బలమైన పిండం బయటకు వస్తుందని?
* * *
అధ్యాయం –10
డాన్ నది పై ప్రాంత స్టానిట్సాల్లో పురాతనమైనది అయిన వ్యోషేన్ స్కాయా స్టానిట్సా డాన్ నది ఎడమ వైపు ఒడ్డున ఉన్న ఇసుక తిన్నెల దగ్గర నిలబడినట్టు ఉంటుంది. మొదటి పీటర్ కాలంలో చిగోనాకి స్టానిట్సా ధ్వంసమైపోయినా, తర్వాత మెల్లగా ఒక కొత్త ప్రాంతంలో ఎదిగి, ‘వ్యోషన్ స్కాయా’ అనే కొత్త పేరు పెట్టబడింది. ఈ కొత్త పేరుకు అర్థం ‘సరిహద్దు గుర్తు’,అప్పట్లో వొరోనేజ్ నుండి అజోవ్ సముద్రం వరకు ఉన్న నీటి ప్రవాహం మధ్య సరిహద్దు గుర్తులా ఉండేది.
డాన్ నది వ్యోషేన్ స్కాయా దగ్గర వంగినట్టు ఉంటుంది. మొదట అది కొద్దిగా కుడివైపుకి వంగినట్టు అనిపించినా,కొద్దిగా ముందుకు వెళ్తే, బజ్కి గ్రామం దగ్గర ఆ వంపు కాస్త నిటారుగా అయిపోయి రాజసంగా నీలి మెరుపుతో ఉండే నీటితో కొండల కుడి వైపుకి,గ్రామాల మీదుగా,ఒంటరిగా ఉన్నట్టు ఉండే స్టానిట్సాల ఎడమ వైపు నుండి,తర్వాత అజోవ్ సముద్రంలోకి పయనిస్తుంది.
ఉస్ట్ -ఖోప్యోర్ స్కాయా దగ్గర అది ఖోప్యోర్ ను కలుస్తుంది,ఉస్ట్ మెడ్వెడిట్ స్కాయా దగ్గర మెడ్వేడిట్సా లో కలిసి, తర్వాత ఆ గ్రామాలు మరియు కింద ఉన్న స్టానిట్సా ల మీదుగా ప్రవహిస్తుంది.
వ్యోషేన్ స్కాయా ఇసుకలో కప్పబడినట్టు ఉంటుంది. ఎక్కువ తోటలు పచ్చదనం లేకుండా ఉంటుంది. ఆ కూడలిలో ఒక పురాతన చర్చి, కట్టి ఎక్కువ కాలం అవ్వడం వల్ల పాతబడి ఉంది. అక్కడ నుండి డాన్ నది ప్రవహించే మార్గంలోనే ఆరు వీధులు ఉన్నాయి.ఎక్కడైతే డాన్ నది బజ్కి గ్రామం దగ్గర వంపు తిరుగుతుంది,అక్కడ చీలిపోయే ఓ పాయ అక్కడ ఉన్న పోప్లార్ తోట దగ్గర ఒక సరస్సు లా ఏర్పడి, అదే అక్కడ నదిలా విస్తరించి ఉంది. ఆ సరస్సు చివరే,ఆ స్టానిట్సా ప్రాంతం కూడా అంతమైపోతుంది. చిన్న కూడలి దగ్గర, గుబురుగా ముళ్ళ పొదలు పెరిగిన వైపు,ఇంకో చర్చి,పచ్చటి పైకప్పుతో,అవతల వైపు ఉన్న పోప్లార్ తోట పచ్చరంగులా కనిపిస్తూ ఉంటుంది.
స్టానిట్సా వెనుక, ఉత్తరం వైపుగా ఒక పెరుగుదల లేకుండా ఉన్న పైన్ చెట్ల తోట,అక్కడి ఎర్ర ఇసుక నేలల వల్ల ఎర్రబడినట్టు ప్రవహించే నీరు, ఆ ఇసుకతో కలిసిపోతూ ముందుకు ప్రవహిస్తూ ఉంటాయి. మధ్యమధ్యలో ఒక గ్రామం,ఏదో ఒక తోట,అటూ ఇటూ ఎక్కడైనా విల్లో చెట్లతో ఆ ప్రాంతమంతా ఇసుక మధ్యలో ఒక ద్వీపంలా కనిపిస్తూ ఉంటుంది.
ఒక డిసెంబర్ ఆదివారం నాడు, ఆ పురాతన చర్చి దగ్గర ఉన్న కూడలిలో ఆ జిల్లాలో ఉన్న అన్ని గ్రామాల నుండి కుర్రాళ్ళైన ఐదు వందల కోసాక్కుల దాకా అక్కడ సమావేశమయ్యారు. అప్పటికే అక్కడ ప్రార్థన పూర్తయిపోయి,గంటలు మోగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్న ఓ సీనియర్ సర్జెంట్, తన హోదాలను సూచించే బ్యాడ్జిలను ధరించి ఉన్నాడు. ఆయన అందరిని రెండు వరుసలుగా ఏర్పడి నిలబడమని ఆజ్ఞ ఇచ్చాడు. వెంటనే ఆ కుర్రాలు మాటలు కట్టిపెట్టి, రెండు వరుసల్లో ఒకరి వెనుక ఒకరు నిలబడ్డారు. ఇంకొందరు అధికారులు అటుయిటూ తిరుగుతూ ఉన్నారు.
‘ర్యాంక్స్!’ఆ సీనియర్ సర్జెంట్ అధికారి అని గట్టిగా అని, ‘నలుగురు ఒక వరుసగా నిలబడండి’ అని మరలా అరిచాడు.
కొత్త కోటు ధరించి వచ్చిన అటామన్, దర్జాగా అక్కడికి నడిచాడు,అతని వెనుక మిలిటరీ పోలీస్ బృందం ఉంది.
గ్రెగరి మెలఖోవ్ మిట్కా కోర్షునోవు పక్కన ఉన్న వరుసలో నిలబడ్డాడు,వారిద్దరూ గుసగుసగా మాట్లాడుకుంటున్నారు.
‘నా బూటులో ఏదో దూరి కుడుతూ ఉంది’, మిట్కా ఫిర్యాదు చేస్తున్నట్టు అన్నాడు.
‘అది బయటకు తీసే పడేయ్,అప్పుడు నిన్ను అటామన్ ను చేస్తారు.’
‘వాళ్ళు మనల్ని కాసేపట్లో లోపలికి మార్చింగ్ చేయిస్తారనుకుంటా.’
అతని మాటలు నిజం చేస్తున్నట్టు, ఆ సీనియర్ సర్జెంట్ వెనక్కి ఒక అడుగు వేసి,పాదాల మీదగా తిరిగాడు.
‘కుడి వైపుకి తిరగండి!’
ఐదు వందల పాదాలు బూట్లలో నుండి భూమి మీద గట్టిగా శబ్దం చేస్తూ ఆ ఆజ్ఞను పాటించాయి.
‘కుడివైపు ఉన్న చక్రం దగ్గరకు మార్చింగ్ చేయండి.’
వెంటనే ఆ యువ కోసాక్కులందరూ తెరిచి ఉన్న గేటులోకి ఒక ప్రవాహంలా సాగిపోయారు,తమ టోపీలు తీసి. కాసేపటికి ఆ చర్చి అంతా ఆ అడుగుల చప్పుడుతో ప్రతిధ్వనించింది.
ప్రతిజ్ఞ చేసే సమయంలో ఒక్క మాట కూడా గ్రెగరి శ్రద్ధగా వినలేదు. అతను కాలిబూటులో ఉన్న పురుగు వల్ల ఇబ్బంది పడుతూ,అటూ ఇటూ ఆ కాలు కదిలిస్తూ,బాధగా ఉన్న మిట్కా మొహం వైపే చూస్తూ ఉన్నాడు.ఎత్తి ఉన్న గ్రెగరి చేయి నొప్పిగా అనిపించింది,అతని తలలో అనేక ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి. అతను శిలువ దగ్గరకు వెళ్ళి,దానిని ముద్దు పెట్టుకున్నప్పుడు,అప్పటికే ఎందరో ఆ పని చేసి ఉండటం వల్ల అది తడిగా ఉంది, అప్పుడు కూడా అతను అక్సిన్య గురించి,తన భార్య గురించి ఆలోచించసాగాడు. ఒక్క క్షణం ఒక జ్ఞాపకం వల్ల అతని ఆలోచనలు ఆగిపోయినట్టు అయ్యింది,అదే అడవిలో,చెట్ల పచ్చదనం మధ్యలో, అక్సిన్య నల్లటి కళ్ళల్లో కాంతి.
వాళ్ళు మళ్ళీ కూడలి దగ్గరకు వచ్చి వరుసలో నిలబడ్డారు. ఆ సీనియర్ సార్జెంట్ తన గొంతు సవరించుకుని,ప్రసంగాన్ని మొదలుపెట్టాడు.
‘ఇక నుంచి మీరు అల్లరిచిల్లరిగా తిరిగే బాలురు కాదు,కోసాక్కులు. మీరు ఇప్పుడు ప్రతిజ్ఞ చేశారు,దానికి తగ్గట్టు మీరు నడుచుకోవాలి. ఇప్పుడు మీరు కోసాక్కు యువకులు కనుక,మీ గౌరవానికి భంగం కలగకుండా ప్రవర్తించాలి,తల్లిదండ్రుల పట్ల వినయంగా ఉండాలి. ఇప్పటి వరకు మీరు అల్లరిచిల్లరిగా తిరుగుతూ,బాధ్యతా రాహిత్యంగా ఉన్నా;ఇప్పుడు మాత్రం సైన్యంలో మీ సేవ గురించే ఆలోచించాలి. ఇంకొక సంవత్సరంలో మీరు సైన్యానికి వెళ్ళాల్సి ఉంటుంది.’ఇక్కడి వరకు చెప్పి ఆ అధికారి గట్టిగా గాలి పీల్చుకుని,చేయి అటుయిటూ ఊపి,దానికి ఒక పట్టు గ్లోవు వేసుకుని,’ఈ లోపు మీ తల్లిదండ్రులు మీరు సైన్యానికి వెళ్ళడానికి కావల్సిన సామగ్రిని సిద్ధం చేసే ప్రయత్నం చేయాలి. వాళ్ళు తప్పకుండా మీకు మంచి గుర్రం ఉండేలా చూడాలి. సరే,ఇక మీరు మీ ఇళ్ళకు వెళ్లొచ్చు!’అంటూ ముగించాడు.
గ్రెగరి,మిట్కా వంతెన దగ్గర వారి గ్రామం నుండి వచ్చిన బాలుర కోసం ఎదురుచూసి,వారు రాగానే అంతా కలిసి బయల్దేరారు. వాళ్ళు నది ఒడ్డు వైపు దారిలో వెళ్తున్నారు. బజ్కి దగ్గరలో ఉన్న చిమ్నిల నుండి వస్తున్న పొగ ఆకాశంలోకి కలిసిపోతూ ఉంది,చర్చిలో నుండి గంటలు వినిపిస్తూ ఉన్నాయి. మిట్కా వెనుక కుంటుతూ వస్తున్నాడు.
‘ఆ బూటు తీసేయ్’,వారిలో ఒకడు అతనికి సూచించాడు.
‘తీసేసి ఈ మంచు చేత కరిపించుకోవాలా?’మిట్కా అంటూనే వెనుక మెల్లగా వస్తూ ఉన్నాడు.
‘సాక్సులు ఉంచుకో.’
మిట్కా ఆ మంచులో ఓ చోట కింద కూర్చుని,అసౌకర్యంగా ఉన్న బూటును తీసేసి,సాక్సుతోనే ఇబ్బంది పడుతూ నడుస్తూ ఉంటే,ఆ మంచులో ఆ కాలి ముద్రలు పడసాగాయి.
‘ఇప్పుడు ఏ దారిలో వెళ్దాం?’పొట్టిగా,లావుగా ఉన్న అలెక్సి బెష్నాయక్ అడిగాడు.
‘డాన్ మీదుగా వెళ్దాం’,మిగతా వారి బదులుగా గ్రెగరి అన్నాడు.
వాళ్ళు మాట్లాడుకుంటూ,నడుస్తూ,సరదాగా ఒకర్ని ఒకరు తోసుకుంటూ ముందుకు సాగారు.
నిశ్శబ్ద ఒప్పందంలా వారిలో ఒకరిని మంచులో కింద పడేసి మిగతా వారి అతని మీద పడసాగారు. బజ్కికి,గ్రోమ్కోవ్స్కి గ్రామానికి మధ్యలో మిట్కా డాన్ వైపుగా వెళ్తున్న ఒక తోడేలును చూశాడు గ్రెగరి.
‘చూడండ్రా-తోడేలు!అటు వెళ్తుంది.’
‘హలో!’
‘ఓహో!’
ఆ మాటల అలికిడికి ఆ తోడేలు కొన్ని గజాల దూరంలో అవతలి ఒడ్డుకి దగ్గరలో ఆగింది.
‘దాని వెంట పడదాం!’
‘బూ!’
‘బొచ్చు కుక్కలా ఉంది!’
‘మిట్కా,అది నిన్నే చూస్తూ ఉంది ఎందుకంటే నువ్వు ఒక్కడివే సాక్సుతో ఉన్నావని.’
‘అది చూడు ఎలా పక్కకు వంగి చూస్తుందో,నిటారుగా కూడా మెడ తిప్పలేకపోతోంది.’
‘లేదు,నిటారుగానే ఉంది.’
‘చూడండి …వెళ్ళిపోతుంది .’
ఒక రాయి నుండి చెక్కిన శిల్పంలా నిలబడి ఉన్న ఆ తోడేలు, వెంటనే తేరుకుని అక్కడ నుండి అవతలి ఒడ్డు వైపుకి వెళ్ళిపోయింది.
వాళ్ళు గ్రామం చేరుకునేటప్పటికి సాయంత్రం దాటిపోయింది. గ్రెగరి ఆ మంచులోనే తమ వీధిలో నుండి,ఇంటి ముందుకు వచ్చాడు. బయట వాకిట్లో ఓ మొద్దు అలాగే పడి ఉంది, కంచె దగ్గర ఉన్న మాచిపత్రి చెట్ల దగ్గర కొన్ని పిచ్చుకలు అరుస్తూ ఉన్నాయి. ఆ గాలి కాలుతున్న బొగ్గుల వాసన, పశువులపాక నుండి వచ్చే వాసనతో కలిసిపోయి ఉంది.
వసారాలోకి మెట్లు ఎక్కుతూ గ్రెగరి కిటికీ నుండి లోపలికి చూశాడు. సీలింగ్ నుండి వేలాడుతూ ఉన్న లాంతరు నుండి చిన్న పాటి వెలుగు వస్తూ ఉంది. పెట్రో తన కిటికీకి ఆనుకుని నిలబడి ఉన్నాడు. గ్రెగరి తన బూట్లకు అంటిన మంచును దులిపి,వంటగదిలోకి ప్రవేశించాడు.
‘హలో! నేను వచ్చేశాను.’
‘నువ్వు త్వరగా వచ్చేశావు. బయట బాగా చలిగా ఉంది కదా?’ పెట్రో మాటలు సహజంగా లేవు,కంగారుతో మాట్లాడినట్టు ఉంది.
పాంటెలీ తన మోకాళ్ళ మీద మోచేతులు పెట్టుకుని,తల కిందకు వంచుకుని కూర్చున్నాడు. దర్య కుట్టు మిషన్ దగ్గర పని చేస్తూ ఉంది. నటాల్య బల్ల దగ్గర నిలుచుని ఉంది. ఆమె వీపు గ్రెగరి వైపు ఉంది,ఆమె వెనక్కి తిరగలేదు. గ్రెగరి కళ్ళు ఆ వంటగదినంతా పరిశీలించి,చివరికి పెట్రో మీద నిలిచాయి. అతని ముఖంలోని ఆదుర్దాను గమనించిన గ్రెగరి ఏదో జరిగిందని గ్రహించాడు.
‘నువ్వు ప్రతిజ్ఞ చేశావా?’
‘హా.’
గ్రెగరి తన కోటును మెల్లగా తీస్తూ,తనలో తానే ఆ పరిస్థితికి గల కారణాలను ఊహించే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇలినిచ్న ముందు గదిలోనుండి వచ్చింది,ఆమె ముఖంలో భయం,ఆదుర్దా ప్రస్పుటంగా కనిపిస్తూ ఉన్నాయి.
‘ఇది నటాల్య విషయమే’,అనుకుంటూ గ్రెగరి బెంచి మీద తండ్రి పక్కన కూర్చున్నాడు.
‘వాడికి భోజనం పెట్టు’,ఇలినిచ్న గ్రెగరి వైపు చూస్తూ దర్యతో అన్నది.
దర్య కుట్టుపని ఆపి పొయ్యి దగ్గరకు వెళ్ళింది. కొన్ని రోజుల క్రితమే పుట్టిన గొర్రె పిల్లకు,దాని తల్లికి వెచ్చగా ఉంటుందని,అక్కడ ఉంచడం వల్ల,అప్పుడప్పుడు అవి చేసే ధ్వనులను మినహాయిస్తే ఆ గదంతా నిశ్శబ్దంగా ఉంది.
గ్రెగరి భోజనం చేస్తూ,నటాల్య వైపు చూశాడు,కానీ ఆమె ముఖం అతనికి కనబడలేదు. తను అల్లుతున్న సాక్సుల వైపుకి తల వంచి,పక్కగా కూర్చుని ఉంది. పాంటెలి మొదట ఆ నిశాబ్దాన్ని ఛేదించాడు.
‘నటాల్య పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది’,పాంటెలి గొంతు సవరించుకుంటూ అన్నాడు.
గ్రెగరి ప్లేటులో ఉన్న బ్రెడ్డు ముక్కలను ముద్దగా చేశాడు,ఏం మాట్లాడకుండా ఉన్నాడు.
‘ఎందుకు?’కింద పెదవి వణుకుతూ ఉండగా తండ్రి అతన్ని అడిగాడు.
‘నాకు తెలియదు’,గ్రెగరి లేచి నిలుచుని,కళ్ళు ఎగరేస్తూ బదులిచ్చి,ప్లేటు పక్కకు జరిపి,ముందుకు నడిచాడు.
‘కానీ నాకు తెలుసు’,తన స్వరాన్ని పెంచుతూ తండ్రి అన్నాడు.
‘గట్టిగా అరవకండి!’అంటూ ఇలినిచ్న మధ్యలో అందుకుంది.
‘నాకు తెలుసు ఎందుకో!’
‘ఇప్పుడు ఈ గొడవంతా అవసరం లేదు’,కిటికీ దగ్గర ఉన్న పెట్రో గది మధ్యలోకి వస్తూ అన్నాడు. ‘అది ఆమె ఇష్టం. ఇక్కడ ఉండాలనుకుంటే ఇక్కడ ఉంటుంది,లేకపోతే పుట్టింట్లో ఉంటుంది.’
‘నేను ఆమెను నిందించడం లేదు. అది అవమానమైనా,దేవుడి పట్ల చేసే పాపం అయినాసరే నేను ఆమెను ఈ విషయంలో ఏమి అనను;అసలు ఈ విషయంలో అనల్సింది తనను కాదు. ఈ వెధవను!’ ముందుకు నడిచి పొయ్యికి ఆనుకుని ఉన్న గ్రెగరి వైపు చూపిస్తూ అన్నాడు పాంటెలి.
‘కానీ నేనేం చేశాను?’
‘నీకు ఏమి తెలియదని తప్పించుకోవాలనుకుంటున్నావా? నువ్వు ఏం చేసావో నీకు తెలియదా?’
‘లేదు,నాకు తెలియదు.’
పాంటెలి ఒక్కసారిగా పైకి లేచి, బెంచి మీద చేత్తో గట్టిగా కొట్టి,వేగంగా గ్రెగరికి దగ్గరగా వచ్చాడు. నటాల్య కుడుతున్న సాక్సు ఆమె చేతిలో నుండి కిందకు జారిపోయింది,గట్టిగా శబ్దం చేస్తూ సూది కూడా కింద పడింది;వీటికి ప్రతిచర్యగా పొయ్యి మీద నుండి ఒక పిల్లి పిల్ల ఆ సాక్సు గుడ్డ మీదకు దూకింది.
‘అయితే ఇప్పుడు నేను చెప్పేది కూడా విను. నువ్వు నటాల్యతో కలిసి ఉండకపోతే,నువ్వు ఈ ఇంట్లో కూడా ఉండొద్దు.నీ ఇష్టం వచ్చిన చోటుకు పో! ఇదే నేను నీకు చెప్పేది!’,పాంటెలి స్థిరంగా అని,బెంచి దగ్గరకు వెళ్ళిపోయాడు.
మంచం మీద కూర్చుని ఉన్న దున్యాక్ష భయంభయంగా అటూఇటూ చూస్తూ ఉంది.
‘నేను కూడా ఇది మీకు చెప్పాలనుకుంటున్నాను,నాన్నా…దయచేసి కోపగించుకోవద్దు. నేను నటాల్యను వివాహం చేసుకోలేదు. మీరే నాకు ఆ వివాహం చేశారు. నేను ఆమెను పట్టుకుని వేలాడను. ఆమెకు సమ్మతమైతే పుట్టింటికి వెళ్ళినా పర్లేదు’,వణుకుతున్న స్వరంతో అన్నాడు గ్రెగరి.
‘నువ్వు బయటకు పో!’
‘నేను వెళ్తాను.’
‘ఇష్టం వచ్చిన చోట ఊరేగు!’
‘నేను వెళ్ళిపోతున్నాను.మీరు ఆవేశపడాల్సిన అవసరం లేదు!’గ్రెగరి మంచం మీద వేసిన తన కోటును వేసుకుంటూ అన్నాడు. తండ్రి లానే కోపంతో ఊగిపోతున్న అతని ముక్కుపుటలు అదురుతూ ఉన్నాయి.
ఆ ఇద్దరి శరీరంలో ప్రవహిస్తూ కలిసిపోయిన టర్కీ రక్తంలానే;ఆ ఇద్దరూ కొన్ని విషయాల్లో ఒకేలా ఉంటారు.
‘నువ్వు ఎక్కడికి వెళ్ళగలవు?’ఇలినిచ్న గ్రెగరి చేయి గట్టిగా పట్టుకుంటూ ఏడుస్తూ అడిగింది. కానీ అతను ఆమెను పక్కకు తోసేసి మంచం పక్కన పడి ఉన్న తన టోపీని వేగంగా అందుకుని బయటకు నడిచాడు.
‘ఆ కుక్కను పోనివ్వు బయటకు! బయటకు పోయి నాశనమైపోని! కావాలనుకుంటే నువ్వు కూడా బయటకు పో’,తలుపు బార్లా తెరుస్తూ ఉరిమాడు ఆ వృద్ధుడు.
గ్రెగరి వాకిట్లోకి వచ్చేటప్పటికి అతనికి నటాల్య ఏడుపు వినిపించింది.
ఆ రాత్రి అంతా మంచు కురుస్తూనే ఉంది. సూదిలా పదునుగా ఉన్న మంచు ఆ నల్లటి ఆకాశంలో నుండి డాన్ భూమి మీద పడుతూ,గట్టిగా శబ్దం చేస్తూ ఉంది. గ్రెగరి ఆ గేటు నుండి బయటకు రొప్పుకుంటూ పరిగెత్తాడు. ఆ గ్రామానికి మరో వైపు నుండి కుక్కలు మొరుగుతున్న శబ్దం వినిపిస్తూ ఉంది. చీకటి అక్కడక్కడ ఉన్న వెలుతురును క్రమక్రమంగా ఆక్రమిస్తూ ఉంది. స్టీఫెన్ ఇంట్లోని కిటికీల నీడను చూస్తూ ముందుకు నడిచాడు. ఎటు వైపు వెళ్ళాలో నిర్ణయించుకోకుండానే వీధిలోకి నడిచాడు.
‘గ్రీషా!’ దుఃఖంతో పూడుకుపోయిన నటాల్య ఏడుపు గేటు నుండి వినిపించింది.
‘నరకంలోకి పో! నాకు నువ్వంటేనే చిరాకొచ్చింది!’గ్రెగరి తనలో తానే గొణుక్కుంటూ,పళ్ళు కొరుక్కుంటూ ఇంకా వేగంగా నడిచాడు.
‘గ్రీషా,వెనక్కి వచ్చేయ్!’
అనిశ్చితంగా ఉన్న తన నడకతో పక్క సందులోకి వెళ్తున్నప్పుడు,అతనికి దూరం నుండి ‘నా ప్రియుడా గ్రీషా’అన్న చిన్న పిలుపు వినిపించింది.
అతను దాన్ని పట్టించుకోకుండా వేగంగా కూడలి దగ్గరకు వెళ్ళి,అక్కడ ఆగి,ఆ రాత్రి సమయంలో ఏ మిత్రుడి దగ్గరకు వెళ్ళి తల దాచుకోవచ్చో అని ఆలోచించసాగాడు.
చివరకు మైఖేల్ కొష్వోయ్ దగ్గరకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అతను ఊరి చివరిలో కొండ దగ్గర ఉంటాడు. అతను,అతని తల్లి ,పెళ్ళికాని సోదరి,ఇద్దరు తమ్ముళ్ళు అతని కుటుంబంలో ఉండేది. గ్రెగరి ఆ ఇంటి వాకిట్లోకి అడుగుపెట్టి,ముందు కిటికీ మీద గట్టిగా తట్టాడు.
‘ఎవరది?’
‘మైఖేల్ ఇంట్లో ఉన్నాడా?’
‘ఉన్నాడు.మీరు ఎవరు’
‘నేను,గ్రెగరి మెలఖోవ్.’
ఒక్క నిమిషం తర్వాత,గాఢ నిద్రలో ఉన్న మైఖేల్ తానే స్వయంగా నిద్ర లేచి,తలుపు తీశాడు.
‘గ్రీషా నువ్వా?’
‘అవును.’
‘ఇంత రాత్రి సమయంలో?ఏంటి విషయం?’
‘నన్ను లోపలికి రానివ్వు,ఒక నిమిషం మాట్లాడాలి.’
వసారాలోకి వచ్చిన మైఖేల్ మోచేతిని గట్టిగా పట్టుకుని,ఆ సమయంలో ఏం మాట్లాడాలో తెలియక తనను తానే తిట్టుకున్నాడు. చివరకు తడుముకుని, గుసగుసగా,’ఈ రాత్రికి నేను నీతో ఉండాలనుకుంటున్నాను.మా వాళ్ళతో నాకు గొడవ అయ్యింది. నీ గది అంత పెద్దది కాదని నాకు తెలుసు,కానీ ఎక్కడైనా నేను సర్దుకుంటాను.’
‘నేను నువ్వు పడుకునే ఏర్పాటు చేస్తాను. కానీ అసలు అక్కడ సమస్య దేని గురించి?’
‘అది తర్వాత అయినా చెప్పొచ్చు. నీ గది ఎక్కడా? నాకసలు ఏమి కనిపించడం లేదు.’
వాళ్ళిద్దరూ కలిసి ఓ బెంచి మీద గ్రెగరికి పడక ఏర్పాటు చేశారు.ఒక పడక మీద పడుకుని ఉన్న మైఖేల్ తల్లి,సోదరి ల గుసగుసలు తనకు వినపడకుండా ఉండటానికి కోటును తల పైకి లాక్కున్నాడు.
అసలు ఇంట్లో ఏం జరుగుతుంది?నిజంగానే నటాల్య ఇల్లు వదిలి వెళ్ళిపోతుందా? అతనికి జీవితం కొత్త మలుపు తిరగబోతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడ తల దాచుకోవాలి? వెంటనే ఓ ఆలోచన మదిలో మెదిలింది, ‘రేపు ఉదయం అక్సిన్యతో మాట్లాడి ఇద్దరం కలిసి కుబాన్ కు లేదా ఇక్కడ నుండి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాము’,అనుకున్నాడు.
కొండల మధ్య ఉన్న పచ్చికగడ్డి మైదానాలు, గ్రామాలు,స్టానిట్సాలు;అప్పటిదాకా అతనికి తెలియనివి,ఇష్టపడనివి అన్నీ కూడా గ్రెగరి కళ్ళ ముందు కదలాడాయి. ఆ కొండల వెనుక, దారి చివరలో,కథల్లో చెప్పినట్టు,నీలాకాశం ఆహ్వానం పలుకుతున్నట్టు,అక్సిన్య ప్రేమ అక్కడ పూసే ఒక పుష్పం అన్నట్టు అతనికి అనిపించింది ఆ ఊహలో.
ఏం జరుగుతుందో తెలియని అస్థిమితత్వంతోనే అతను నిద్ర పోయాడు. అతను నిద్రపోతూనే అప్పటికే సగంగా ఒక నిర్ణయం వైపు మొగ్గిన తన ఆలోచనలను ధృడపరచుకోవాలనుకున్నాడు. నీటిలో సజావుగా పోతున్న పడవలాగా అతని కలత నిద్రలో ఈ ఆలోచనలు సాగిపోతూనే ఉన్నా;మధ్యలో ఏదో ఇసుక ఒడ్డుకి వచ్చినట్టు అవన్నీ ఆగిపోయేవి,అసహనంతో అతను ఆ ఆలోచనలు ఇంకో దిశకు మళ్ళినప్పుడు మరలా మొదటికొచ్చేవాడు. ‘అసలు నేను ఏం చేయబోతున్నాను?ఏం జరగబోతుంది?’ అనే చింత అతన్ని వెంటాడుతూ ఉంది.
ఉదయం అతను నిద్ర లేచే సమయానికి అతనికి ఇంకో విషయం గుర్తుకు వచ్చింది. ‘అయ్యో! నేను సైన్యానికి వెళ్ళాలి కదా! నేను అక్సిన్యతో కలిసి అక్కడకు వెళ్ళలేను కదా!ఈ వసంతకాలంలో నేను క్యాంపుకు వెళ్తే,మరలా వేసవి కాలం చివరకు నా సర్వీస్ మొదలవుతుంది…….కానీ ఈ పరిస్థితిలో తను ఎలా!’
అతను అల్పాహారం చేశాక మైఖేల్ ను వాకిట్లోకి పిలిచాడు.
‘నా కోసం అష్టకోవుల దగ్గరకు వెళ్ళు మీషా. అక్సిన్యను సాయంత్రం అయ్యేలోపు పిండిమర దగ్గరకు రమ్మన్నానని చెప్పానని చెప్పు.’
‘మరి స్టీఫెన్ సంగతి ఏమిటి?’అనుమానంగా చూస్తూ అడిగాడు మైఖేల్.
‘అతని కోసమే ఏదో ఒక పని మీద వెళ్ళినట్టు నటించు.’
‘సరే,నేను వెళ్తాను.’
‘మర్చిపోకు,తనను తప్పకుండా రమ్మని చెప్పు.’
‘సరే.’
ఆ సాయంత్రం అతను పిండి మర దగ్గర కూర్చుని,పొగ కాలుస్తూ ఉన్నాడు. మిల్లు వెనుక గాలి వీస్తున్న శబ్దం వినిపిస్తూ ఉంది. అక్కడ దగ్గరలో ఒక తెగిపోయిన పరదా గాలికి అటుయిటూ ఎగురుతూ ఉంది. గ్రెగరికి అది ఎగరలేని ఒక పెద్ద పక్షి తన తల చుట్టూ ఎగురుతూ,రెక్కలు ఆడిస్తున్నట్టుగా అనిపించింది. ఇంకా అక్సిన్య రాలేదు. ఆ దక్షిణ దిక్కు అంతా సూర్యాస్తమయ వెలుగుతో కొద్దిగా కాంతివంతంగా ఉంది,కానీ దాదాపుగా చీకటిగానే ఉంది. తూర్పు దిక్కు నుండి బలమైన గాలులు వీస్తూ,విల్లో చెట్ల వెనకాల చిక్కుకుని ఉన్న చంద్రుడిని చీకటితో అడ్డుకుంటున్నట్టు ఉన్నాయి. మెల్లమెల్లగా ఆ చిన్న కాంతి కూడా చీకట్లో కలిసిపోయింది.
గ్రెగరి ఒకదాని తర్వాత ఒకటిగా మూడు సిగరెట్లు కాల్చాడు,ఆఖరి దాని పీకను కింద పడేసి,కాలితో నలిపి,చుట్టూ కోపంతోనూ,అలాగే దుఃఖంతోనూ చూశాడు. మిల్లు నుండి గ్రామం వైపు అనేక వాహనాలు వెళ్ళిన ముద్రలు ఆ దారిలో కనిపిస్తూ ఉన్నాయి. అతను లేచి నిలబడి,ఒళ్ళు విరుచుకున్నాడు. మెల్లగా మైఖేల్ ఇంటి వైపు నడవసాగాడు. అతను దాదాపుగా ఆ వాకిలి దగ్గరకు వచ్చేసరికి అతనికి అక్సిన్య ఎదురుపడింది.ఆమె పరుగెత్తినట్టో లేక వేగంగా నడిచివచ్చినట్టో ఆమెను చూస్తేనే తెలిసిపోతుంది. ఆమె ముఖం చెమట పట్టి ఉంది,అలసటతో ఉన్న ఆమె నోట్లో నుండి గాలి వదిలింది.
‘నేను నీ కోసం చాలాసేపు చూశాను,ఇక నువ్వు రావనుకున్నాను.’
‘ఇదంతా స్టీఫెన్ వల్లే. అతన్ని ఎలాగోలా బయటకి పంపించి వచ్చాను.’
‘నీ వల్ల చలికి గడ్డ కట్టుకుపోయాను!’
‘నేను నిన్ను వెచ్చబరుస్తాను’, పైన కప్పుకున్న కోటును తీసి,అతన్ని కౌగలించుకుంటూ అంది. ‘ఇంతకు ఎందుకు పిలిచావు?’
‘కాసేపు ఆగు,ఇక్కడ చుట్టుపక్కల జనాలు ఉండొచ్చు.’
‘నువ్వు ఇంటి నుండి వచ్చేశావా?’
‘నేను ఇల్లు వదిలి వచ్చేశాను. నిన్న రాత్రి మిష్కా దగ్గర ఉన్నాను….నేను వీధికుక్కలా బతుకుతున్నాను.’
‘ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు?’ అక్సిన్య ఆ కౌగలింత నుండి విడిపడి,మరలా కోటు ధరిస్తూ అడిగింది.
‘మనం ఆ కంచె పక్కకు వెళ్దాము.ఇలా దారి మధ్యలో ఎక్కువసేపు ఉండలేము.’
వాళ్ళు ఆ దారి మధ్యలో నుండి పక్కకు నడిచారు. గ్రెగరి అక్కడ ఉన్న మంచును కాలితో గట్టిగా తన్ని,కంచెకు ఆనుకుని నిలబడ్డాడు.
‘నీకు నటాల్య ఇంటికి వెళ్లిపోయిందేమో తెలుసా?’
‘లేదు,నాకు తెలియదు…..ఆమె వెళ్ళాలి.ఇలా ఎంతకాలం అక్కడ ఉంటుంది?’
గ్రెగరి చల్లగా ఉన్న ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని,ఆమె మోచేతిని గట్టిగా పట్టుకుంటూ, ‘ఇప్పుడు ఏం చేద్దాం?’అని అడిగాడు.
‘నాకు తెలియదు…నువ్వు ఏం చెప్తే అది చేస్తాను.’
‘నువ్వు స్టీఫెన్ ను వదిలేస్తావా?’
‘ఇప్పుడే వదిలేసి నీతో రమ్మన్నా వస్తాను.’
‘మనిద్దరం కలిసి పని చేసే చోటు ఏదైనా చూస్తాను.అక్కడే ఉండే ఏర్పాటు కూడా చేస్తాను.’
‘నువ్వు నాతో ఉంటే పందులదొడ్డిలో అయినా సంతోషంగా ఉంటాను గ్రీషా.’
వాళ్ళిద్దరూ కాసేపు ఒకరికి ఒకరు ఆనుకుని నిలబడ్డారు.గ్రెగరికి ఆమెను వదిలి వెళ్ళాలని లేదు. గాలి వీస్తున్న వైపు తన ముఖాన్ని పెట్టి, ముక్కు పుటలు అదురుతూ ఉండగా,కళ్ళు మూసుకున్నాడు. అక్సిన్య అతని భుజం మీద తన తల వాల్చి,అతనితో కలిసి జీవించే ఊహల మత్తులో మునిగిపోయింది;గ్రెగరి కళ్ళకు కనబడకపోయినా సంతోషంతో ఆమె పెదవులు నవ్వుతూ ఉన్నాయి.
‘నేను రేపు మొఖోవు దగ్గరకు వెళ్తాను.నాకు ఏదో ఒక పని దొరకొచ్చు’, గ్రెగరి ఆమె మోచేతి మీద తన పట్టు వదిలేస్తూ అన్నాడు.
అక్సిన్య ఏం మాట్లాడలేదు,తల కూడా ఎత్తలేదు. అప్పటివరకూ ఆమె పెదవులపై ఉన్న చిరునవ్వు కూడా మాయమైంది. వేటాడబడిన జంతువులా ఆమె కళ్ళల్లో ఒక్కసారిగా భయం,బాధ నిండిపోయాయి. ‘ఇప్పుడు తనకు చెప్పాలా?వద్దా?’ తన గర్భం విషయం గురించి అనుకుంటూ ఉంది. చెప్పాలి అని ఆమె అనుకున్నప్పుడు ఏదో తెలియని భయం వల్ల ఆ ఆలోచనను విరమించుకుంది. స్త్రీకి సహజాతమైన ఒక జాగ్రత్త వల్ల ఆమె అతనికి చెప్పే సమయం అది కాదని,దాని వల్ల గ్రెగరిని శాశ్వతంగా కోల్పోవచ్చని భయపడింది. ఆ బిడ్డ గ్రెగరిదో,స్టీఫెన్ దో తేల్చుకోలేని దశలో ఉన్న ఆమె,ఆ సమయంలో చెప్పకుండా ఉండటమే ఉత్తమమని అనుకుంది.
‘ఏంటి అలా ఉన్నావు?చలిగా ఉందా?’గ్రెగరి తన కోటును కూడా ఆమెకు కప్పుతూ అడిగాడు. ‘అవును…..నేను ఇక వెళ్ళాలి గ్రీషా. స్టీఫెన్ ఇక ఇంటికి వచ్చే సమయమైంది.’
‘ఎక్కడికి వెళ్ళాడు?’
‘అనికె ఇంటి దగ్గర పేకాట ఆడటానికి వెళ్ళాడు. తనను బయటకు పంపించడమే నాకు పెద్ద పనైపోయింది.’
వారిద్దరూ ముద్దు పెట్టుకున్నారు.ఆమె పెదవులపై ఉన్న వింతైన వాసన గ్రెగరి పెదవులపై నిలిచిపోయింది.
అక్సిన్య ఇంటికి బయల్దేరింది. ఆమె సందులోకి తిరిగి,ముందుకు నడిచేసరికే వాన మొదలైపోయింది. ఒక బావి దగ్గర,ఎక్కడైతే పశువులు బురదలో నడిచి కాలిముద్రలు వదిలాయో అక్కడ ఉన్న ఓ కంచెను పట్టుకుని ఆమె ఆగిపోయింది. ఆమె కడుపులో చిన్నపాటి నొప్పి ఆమెను ఆగేలా చేసింది. కాసేపటికి ఆ నొప్పి తగ్గి,ఆ కడుపులోని చిన్న జీవి అటూయిటూ కోపంతో తన్నుతున్నట్టు అనిపించింది.
* * *