మన ఆదర్శాలు అనుభవంలోకి రాకపోతే చాలా బాధపడతాం.అందుకనే మన సాధన అంతా ఆదర్శసిద్ది కొరకై ఉంటుంది.
మనకీ జాతికీ ఉన్న బంధనాలు అవిచ్చిన్నములవడంచేత మన ఇష్ట పూర్తి అయే ధర్మాలతో జాతిని సంస్కరించుకొంటాం.
ఏ కాలంలో గాని జాతి పొందే అనుతాపం యొక్క గాదలే సారస్వతరూపేణా అవతరిస్తూ ఉంటాయి. ధర్మనిర్దేశం చేసి జాతిని ఆదర్శ జీవనోన్ముఖంగా దిద్ది సంస్కరించగలిగేది సారస్వతమే. అందువల్లనే, కవులు ఆ జాతికొఅకై భవిష్యత్తులో నివిష్టములై ఏ ఆదర్శ జీవన ధర్మాలున్నాయో గ్రహించి, వాని అనుభవంకోసం జాతిపొందవలసిన సంస్కారాల్ని విధిస్తూ, సారస్వతాన్ని సృష్టించడం పూర్వకాలంసుంచి ఆచారంగా ఉంది.
మన పూర్వుల అనుభవం మన ఇప్పటి సాధనకి ఉపకరిస్తుంది. అందుకనే ప్రాచీన సాహిత్యం విస్మృతి గర్భంలోపడి పోకుండా మనం కాపాడుకుంటున్నాం. కాని ధర్మముల యొక్క తత్వములయొక్క సత్యరూపాల్ని గూఢములైన సంజ్ఞారీతులు మనకు పూర్వ సారస్వత బ్రహ్మలు ప్రసాదించి ఉండడంచేత కొన్ని యుగాల దూరాన ఉన్న మనం వాటిని యధాతథంగా అర్ధంచేసుకోలేకపోవడం ఉంటుంది. అప్పుడు చాలా చిక్కులు వస్తాయి. అట్టి ప్రమాదాలనుండి రక్షించే నిమిత్తం మహాకవులు ఆ సంజ్ఞల సత్యతత్వాన్ని విశదంచేస్తూ ఆ గాధల్నే తిరిగి వ్రాస్తూ ఉండడం. అవి ప్రాచీన సాహిత్యంయొక్క భద్రవ్యాఖ్యలు అవుతాయి. అప్పుడు, జాతి, వానిని తన కాలముతోను అవసరములతోను సమన్వయం చేసుకొని ప్రవృత్తిలో ముందు అంజనేయడానికి ఆధారాల్ని నిరూపించుకోగలుగుతుంది.
ఒకప్పుడు సంఘం సత్యజగత్తునుండి రాలిపోయి నిర్జీవమైన ఒక యంత్రంవలె నడుస్తుoడేంది. చుట్టూ కొన్ని సున్నాలు గీసుకొని “ఇంతే జగత్తు సర్వం” అనుకొని ఒదిగి కూర్చుంటుంది. తనకోసం సర్వం పూర్వులే ఏర్పాటుచేసి ఉంచారు అనే అసంతృప్తి ఒకటి దానిమోద అధికారం చలాయిస్తూ ఉంటే కర్తవ్యం లేదనుకొని మన్నుదిన్నట్టుగా పడి ఉంటుంది యాతనా సర్పాలు బుస్సలుకొడుతూ మెదడులో మెలగుతూ ఉంటే అదేదో స్వప్న బాధ అనుకుంటుందేకాని మేలుకోలేదు. భగవంతుడు ప్రత్యక్షమై ‘నీకేం కావాలి’ అని వరదహస్తం ఇస్తే “ఏం కావాలో నీవే తెలుసుకొని ఇచ్చిపోదూ” అని మళ్ళీపడుకుంటుంది. ఈ రాస్తాకు దగ్గిరలోనే ఉంటుంది. ఇప్పుడు మన జాతికూడాను అని ఆలోచిస్తే తెలియకపోదు.
ఇట్లా జాతిపడే యాతనను ఆవేదనను తెలిసికొని శవీయమైన ఈ నిర్లక్ష్య అజాగ్రత్తనుండి దాన్ని ఉద్ధరించే సందేశాన్ని చైత్యన్యాన్ని దాని ప్రతి జీవనాడుల్లోకీ ఆయువుపట్టుల్లోకీ ప్రాణ కేంద్రాల్లోకి పంపి ఒక పునర్జాగృతిని కలిగించకలిగేది కవి. భవిష్యత్తు నందుబాట్లో ఉంచి బాధను మరిపించి మోహవేశం కలిగించే భద్రగానం చేస్తూ జాతికి వ్యంగ్యముగా చికిత్స చేయగలిగేది కవులే. వారే ఎప్పటికైనా యుగకర్తలు కాగలిగేదీని. కాని ఇటువంటివారు చాలా అరుదుగా ఉంటారు.
ఇప్పుడు మన జాతిపడే ఆవేదనను కాంక్షించే మోక్షమును తాము అనుభూతం చేసుకొని ఒక సందేశంతో సాహిత్యాన్ని ఉపాసించాలనే సత్యాన్ని స్మృతిలో ఉంచుకొని ఆంధ్ర సారస్వత ప్రపంచంలో జీవప్రతిష్ట చేస్తున్న సాధకకవులు కొందరు ఉన్నారు. అట్టివారిలో ఈ ‘సావిత్రి’ నాటకకర్తలగు శ్రీ గుడిపాటి వెంకటచలంగారు ఒకరు. మన సంఘాన్ని శుష్కింపజేస్తున్న బలీయమైన ఒక అనర్థకాన్ని, అలసత్వాన్ని సహించలేని అనుతాపం ప్రబలీయమైన ఒక పునర్జాగృతిని జాతియొక్క మూలంలోకి ఆవేశింపజేయాలనే సందేశం, ఈయన అన్ని రచనల్లోను ధ్వనిస్తూ ఉంటుందని ఆయన రచనలతో పరిచయం ఉన్న అందరికీ తెలుస్తుంది.
‘సావిత్రి’ నాటకాన్ని చదవడానికి ముందుగా మనం కొన్ని విషయాలు గమనించవలసి ఉంటుంది. సాంగంగా పరిశీలించడానికి ఈ ప్రవేశికలో అవకాశం లోపం అవడంచేత ముఖ్యమైన విశేషాల్ని మాత్రమే సూచించి ఊరుకోవలసి వస్తోంది.
దాంపత్య ప్రేమ విజయభేరీ మ్రోగించినప్పుడు, మన గీర్వాణులు, సారస్వతంలో భద్రంచేసికొన్న ఉత్తమరూపం సావిత్రి, ఎందుచేతనంటే, పవిత్ర ప్రేమబలంచేత భర్తతో సహగమనంచేసి తిరిగి భర్తని తెచ్చుకోగలిగింది. ఇంతకంటే ప్రేమ విజయానికి చరమస్థాయి ఏముంటుంది?
సావిత్రీ చరిత్రాంకితమైన ప్రేమయొక్క సత్యరూప అధ్యాయాలన్నీ సంస్కృత సారస్వతంలో సంజ్ఞాయవనికలమాటున మరుగుపడి ఉన్నాయి, అసలే ఒక కృతకజగత్తులో అలసత్వపు పొరలలో మణిగివున్న ఈనాటీ లోకానికి ఆ సంకేతాల్ని సరిగా అర్ధంచేసుకోగలగడం ఒక ఎత్తు, అర్ధమైతే ఆ సత్యాన్ని అంగీకరించగలగడం ఒక ఎత్తుగాను ఉంటుంది. కవి అట్లా ఉద్దేశించినా ఉద్దేశించకపోయినా ఈ నాటకం మట్టుకు, సావిత్రి భర్తని బ్రతికించుకోగలిగిన ఏ తెరలు కప్పిఉంచని సత్యప్రేమ రూపాన్ని చూపాలన్న ప్రయత్నం కనబడుతుంది. కాని ఆ సంకేతాల కది “తు,చ” తప్పని క్రమవ్యాఖ్య అనుకోడానికి వీలులేదు. నాటకం చదివితే మాత్రం తప్పకుండా “ఆ.. ఇల్లాగే సావిత్రి భర్తను బ్రతికించుకో గలిగి ఉండాలి” అని అనేస్తాం.
మొదట సావిత్రీ సత్యవంతుడు కలుసుకోడం చూడండి. సావిత్రి నుంచుని ఉండగా సత్యవంతుడు వచ్చి “నువ్వెవ్వరు” అంటాడు. సావిత్రి నోటివెంట “సావిత్రి” అని మాటవస్తుంది. పూర్తి అయిందో లేదో, సత్యవంతుడు ‘సావిత్రి ! నాకు తెలుసే యిదివరకు… ఇంక తెలీవలసింది లేదు’ అంటాడు. ఇది మనకి విచిత్రంగానే ఉంటుంది. ముందర ఆచారంగా వస్తూవున్న “ఒకరి నొకరు చూచుకోడంతోటే పడేసిగ్గు, పెదవులు తడుపుకోడం, దొంగ చూపులు. ఇవి ఏమి లేకుండా ఏమిటి ఇట్లా పలకరించడం? మోటుతనం అనుకొంటాం కాదూ మనం : కాని “జన్మాంతర సౌహృదం” అది ఎన్ని జన్మాంతరాల్నించో ఉన్న పరిచయం కాకపోతే మృత్యుంజయైన ప్రేమబంధం సావిత్రీ సత్యవంతులకెట్లా కలుగుతుంది. కవి ఇట్లా ప్రారంభించడంలో, మనం ప్రేమ మర్యాద అర్ధంచేసుకోవలసిన విధి బలంగా ఉందనిన్నీ దాన్ని గ్రహిస్తే ముందు ప్రతి అధ్యాయము సులభ గ్రాహ్యమౌతుందనీ జాగ్రత్త చెప్పినట్లు ధ్వనిస్తోంది.
సత్యవంతుని శవాన్ని ఒళ్ళో పెట్టుకొని ఏమిటో ఆవేదనపడుతుంది. ప్రార్థిస్తుంది, సంశయిస్తుంది, వట్టి అమాయకత్వం ఉంది. మరణచిహ్నలు తనకో సత్యవంతుడికో తెలిసికోలేదు. మళ్ళీ సాహసం చెంపలకు రంగునిస్తానంటుంది. పెదవుల కెరుపు తెప్పిస్తానంటుంది. ఆత్మవిశ్వాసం, ధైర్యం, వెనుకచూడని త్యాగం. “నా కొనవూపిరితోనైనా సరే నీలో ప్రాణం ప్రతిష్టిస్తాను. భయపడకేం ! ఆశ వదలకు” అంటుంది. “ఎందుకు వీల్లేదు” అని సావిత్రి అంటుంటే “అవును, ఎందుకు వీల్లేదు” అని
మనలో నించి కూడా ఎక్కడో వినబడుతున్నట్టుంది. ఇప్పుడే సావిత్రి సత్యవంతుణ్ణి బ్రతికించుకొన్నట్టుంటుంది.
ప్రాకృత స్రీ వలె ఎల్గెత్తి ఆక్రోశించి, చెట్టుల్ని,పుట్టల్ని,పిన్నల్ని,పెద్దల్ని,మొగుణ్ణి రక్షించమని మొత్తుకునే ప్రార్ధనల సావిత్రి, విచారించి చూస్తే భర్తని రక్షించుకో గలుగుతుందా? “ప్రేమ విధి కృత్యమును తప్పించగలుగుతుంది” అనే అపజయాన్నెరుగని విశ్వాసం “మృత్యువునైనా నవజీవనం తాగించి-అమృతంగా మారుస్తారు“అనే ధైర్యం, ఈ రెండూను సత్యవంతుణ్ణి బ్రతికించగలిగింది. సావిత్రి అట్లా చెపుతుంటే ఆత్మవిశ్వాసం ఆ ధైర్యం మనదైనట్లుగా ఆనందం లోపల్నుంచి ఉబికి వస్తుంది. ‘పతివ్రతాపరమ ధర్మము సహాగమనము” అని యముడంటే “అవును సహగమనమే చేస్తాను, పదండి, ప్రేమ లోబడదు, జయిస్తుంది“అంటుంది . సావిత్రి భర్తవెంట వెళ్ళి అతన్ని తిరిగి తెచ్చుకుంటుందట సావిత్రి, ఆ ఆర్ధ్రంలో, ఒక విధంగా ఆత్మహత్యకు పర్యాయపదంగా ఆచారంలో ఉన్న ఆ మాటను ప్రయోగించిన కవి విశాలహృదయం జలదరించదూ ?
ఇంక యముడు సావిత్రి ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తాడు. సావిత్రి దేనికి భయపడదు,అఖండమైన ప్రేమ బలం,ఆత్మవిశ్వాసం,ఆమె నయన ద్వారాన,కావాలి కాస్తూ ఉంటే ఆ ధీరస్వాంతాన్ని ఆదరకొట్టే ఏ విషయం ఆమె మనస్సీమలోకి అడుగుపెట్టగలుగుతుంది? యముడందుకునే ఆమె రక్షాకవాచానికే గురి చేశాడు,తన పరీక్షా బాణాన్ని, చంద్రికను సృష్టించి సత్యవంతుని ఆత్మని మాయాబద్ధం చేసి సావిత్రి ఎదుట వాళ్ళిద్దర్ని ప్రేమవృత్తిలో చూపించాడు. సావిత్రి చలించలేదు. సత్యవంతుణ్ణి క్షమించింది. మళ్లీ ఇంకోమాటు సత్యవంతుడు తన ప్రేమ నపవిత్రం చేస్తున్నట్లు యముడువెప్పి వెనక్కి తిరిగి చూడమంటే ‘అవసరము లేదు’ అని వెనక్కి తిరిగి చూడనే చూడదు, ఎందుకు చూడాలి? తన సత్యవంతుడెటువంటివాడని? “ఏ మార్పురాని మార్పురావడం అసంభవమైన” అటువంటివాడు. చివరికి రాక్షసమైన ఇంకో పరీక్షచేస్తాడు. భర్తను రక్షిస్తే పునర్జీవినిచేస్తే ప్రత్యుపకారంగా సావిత్రి తన సౌందర్యాన్ని యముని భోగాని కొకమారు. స్వాధీనం చెయ్యాలట! సావిత్రి ధైర్యాన్ని పగలకొట్టగలిగితే పగలకొట్టగలిగేది ఈ పరీక్షా ఘట్టమే. ఇంతకన్న భయంకరమైన అసహ్యమైన యమలోక పటం ఏం ఉంటుంది! సావిత్రి హృదయం చెదరలేదు. కాని చాలా ఆవేదన పొందింది. బాధపడ్డది. అంతే, కాని కర్తవ్యంనుంచి రాలిపోలేదు. ముందు భర్త బ్రతకడమేగా తనకి కావాలిసింది. సత్యవంతుడు బ్రతికినతరువాతగా తాను ప్రత్యుపకారం చెయ్యడం. తరవాత లోకాలన్నింటికి మృత్యుపీడ వదిలిపోయేట్టు యముణ్ణి నాశనం చెయ్యలేనా అనుకుంది. అందుకు ప్రయత్నించింది. అప్పుడూ యముడు, సావిత్రీవిజయం ఒప్పుకుంది. ప్రేమయొక్క సత్యవ్యవహార వైచిత్రాన్ని అర్ధం చేసుకోటానికి మనస్సాస్థ్ర్య౦ ఉండాలి. అది ఉంటే అనిర్వచనీయమైన ఆనందం కలిగిస్తుంది యీ సావిత్రీవిజయం. “సావిత్రి అంతటి మహపతివ్రతని యముడిచేత ఇట్లా అడిగించడమా” అని గిలగిల కొట్టుకుంటుంది గాని అమాయికలోకం, మళ్ళీ, “అమ్మా మా సావిత్రి జయించింది. యముడుకూడా మంచివాడే పాపం ” అనుకోకమానదు. సానపెట్టిన కొద్దీ రత్నం ప్రకాశిస్తుంది.
అయితే ఇంకొకసంగతి ఉంది; కవి దుర్బలుడైతే ఇటువంటి తీవ్రసమస్యల్ని తేనూ లేడు, తెస్తే సమర్థించుకోనూ లేడు. పయిగా పాఠకుల్ని కవుల్ని కూడా జాలి అనేది ఒకటి పీడిస్తుంది. మనం అభిమానించుకొనే పాత్రల్ని, కావ్యాల్లో అయితేమట్టుకేం, ఎక్కువ కష్టాల్లో చూడలేం. కానీ ధీరవృత్తి ఏమిటంటే లక్ష్యసిద్దికి అవసరమైతే ఏదైనా మానరు. భగవల్లీలా దృశ్యాలన్నీ చూపిస్తూ మహాభారతం వ్రాసుకు పోయిపోయి,మన త్రిలోక విజయుడైన గాండీవ,లీలామానుష విగ్రహుడైన ఆ శ్రీకృష్ణుని, చివరికి బోయిలచేత ఓడించడానికిగాని పాదంలో బాణంగ్రుచ్చి ఒకసామాన్య మృతిని పొందించడానికి గాని వ్యాసుడు జంకాడా? “వెంకటచలం సరస్వతి ఎప్పుడూ తీవ్రరూపంతో సాక్షాత్కరిస్తుంది. స్వచ్చ తేజస్సును చూస్తే మాత్రం కళ్ళు తిరిగిపోవూ”అని మేలమాడుకుంటూ వుంటారు మా స్నేహితులు కూడా. కాని మనం మాత్రం కవి న్యాయం ఆలోచిస్తే ఇటువంటి ప్రయత్నానికి స్వాగతం ఇయ్యాలని గోచరించకపోతుందా?
దాంపత్య ప్రేమ, ఎంత నిష్కల్మషమైందో, సంకోచరహితమైనదో,ఆత్మవిశ్వాసవర్ధకమై అఖండ సౌఖ్యాన్ని ఇస్తుందో మనకీ నాటకంలో కనబడుతుంది. స్త్రీత్వము సావిత్రీత్వమే కావాలి అని అనూహ్యమైన ఒక అజ్ఞాతమునుండి ప్రేమగానము ధ్వనిస్తుంది. ఇది ఈ నాటకానికి ఫలశ్రుతి.