యెంకిపాటల గాలిదుమారము

Spread the love

యొంకిపాటలు యే రోజున కవి సంకల్పగర్భాన పడ్డవో కాని పుట్టిననాటి నుండీ బాలగ్రహాలు, బాలారిష్టాలు అడుగడుగున వెంటాడుతునే వున్నవి. వెనకటికి నక్క ‘పుట్టి మూడు వారాలు కాలేదు గాని ఇంత గాలిదుమారం ఎన్నడూ ఎరగనన్న’ ట్లవుతున్నది. వ్రాసినపాటలు కొద్ది అయినా వాదప్రతివాదాలు పత్రికలనిండా గాడిదమోతబరువులవుతున్నవి. ఈ విషయము తెలుసుకొని వ్రాసేదానికన్న ఎవరి స్వంతసిద్ధాంతాల ఖాతాకు వారు యెంకిపాటలను జమకట్టడమో ఖర్చురాసుకోవడమో జరుగుతున్నది. ఈ గాలిదుమారమువల్ల వూరికే దుమ్మురేగుతున్నదే గాని సత్యమేమిగోచరించుట లేదు. గ్రామ్యవాదులు ఎంకిని దేవతగాను, గ్రాంథికవాదులు దానినే బ్రహ్మరాక్షసిగాను వర్ణించి అనేకరకాల వికారాలు పొందుతున్నారు. దుమారము ఇంకా నోట్లోను ముక్కులోను కొట్టుతూనే వున్నది. కాని కొంచెం ప్రాణాయామం చేసి యోగదృష్టిలో ‘సత్యం యేమిటా’ అని చూసేవాడికి యా ఆందోళనమంతా కల్పితమనీ కృత్రిమమనీ అనవసరమనీ స్పష్టముకాక మానదు.

            నేను తనకు గురువునని చెప్పుకోవడము మా వాడికి (యెంకిపాటల కర్తయగు చి. నండూరి వేంకటసుబ్బారావుకు) కొంత సరదా, గురుత్వానికి రెండుమూడర్థాలున్నవి. వయస్సున పెద్దలైనవారిని గురుజనులంటారు; విద్యాబుద్దులు నేర్పినవారిని గురువులంటారు. గురుత్వము మాంద్యమునకు కూడా పర్యాయపదముగా వైద్యులు వాడుతుంటారు. కాబట్టి యే కారణమును బట్టి గురుత్వమును నాకాపాదించాడో మావాడు? మెచ్చుకొన్నప్పుడు ఆధ్యికసూచకమగు గురుత్వము, మెచ్చనప్పుడు మాంద్య సూచకమగు గురుత్వము నా కాపాదింపబడునేమో; పూర్వ మొక గడుసువాడు “నలుగురూ సుబ్బక్క మొగుడు సుబ్బక్క వెుగుడంటే కాబోలు ననుకొని సుబ్బక్కమొగుణ్జైనాను, కాకపోతే నా గంతాబొంతా నాకు పారేయండి పోతా”నన్నట్లు నేను వీలుగానున్నంత వరకు సుబ్బారావు గురువునే అనుకొని శిష్యవాత్సల్యముతో “యెంకి పాటల”ను గూర్చి చిరస్నేహలబ్దమైన విషయ పరిజ్ఞానంతో విమర్శిస్తాను. అది మా వాడికి గాని ఇతరులకు గాని  కంటగింపుగా ఉంటే నా గురుత్వానికి పావుటావు దాఖలు చేసి నా స్వంత జవాబుదారిమీదనే జవాబు చెబుతాను.

            ఈ మధ్య వచ్చిన తామరతంపరలో బయటపడ్డట్లు యెంకి సువర్ణయగములోను పుట్టలేదు; లోహమండూరాల యుగములోనూ  పుట్టలేదు, పాషాణయుగములోను పుట్టలేదు. 20వ శతాబ్దములో 1918వ సంవత్సరములో తిరువళిక్కేణి శివరామన్  వీధిలో పుట్టింది, ఎనిమిదేండ్లువచ్చి ఇప్పటికి కన్య అయింది. కాబట్టే పెళ్ళిబేరాల కీచులాటలు జాస్తి అవుతున్నవి. అప్పటికే గ్రామ్య   గ్రాంధికవాదాల దుమారము కొట్టికొట్టి గురజాడ అప్పారాయకవిశేఖరులు నవీనఫక్కీని ముత్యాలసరాలను తేటతెలుగు మాటలలో  కొత్తపాతల మేలుకలయిక క్రొమ్మెరుంగులూ జిమ్మగా గుచ్చి ఆంధ్రకవితాలలామమెడలో అలంకరించిపోయినాడు. ఆయన  పద్ధతినే అనుసరింతామని నేనూ, నా మిత్రులు వింజమూరి రంగాచారి, అధికార్ల సూర్యనారాయణగార్లూ కొంత పెనగులాడుతూ వుండేవాళ్ళము. మరొకపక్కనుంచి రాయప్రోలు సుబ్బారావు, అబ్బూరి రామకృష్ణారావు, వేంకటపార్వతీశ్వరాది కవివరుల ‘ప్రాచీనాధునాతన కవిత్వములకు రాకపోకలవడటముకు వంతెనలుకట్టడం ప్రారంభించారు. ఇంకొక వైపునుండి ‘పూర్వపండితులు వాల్మీకి రామాయణాలు, సంస్కృతపురాణాలు, నాటకాలు, ప్రబంధాలు శరపరంపరగా కురిపించారు. నాలుగోవైపునుండి వల్లూరి జగన్నాథరావుగారి కోడిపాటలు, గొల్లపాటలు, విస్కీపాటలు, మొదలైనవీ, ఛల్‌ మోహనరంగాపాటలూ సముద్రతరంగాల లాగున ముంచుకొనివచ్చి కాలేజి ‘కారిదార్ల’ నిండ బొబ్బిరిల్లిపోతూ వుండేవి.

            మనవాడికి జనవశీకరణము చేసుకొనగల సంగీతచాతుర్య ముండడమువల్లను, కాకినాడలో కొంతకాలము విద్యాభ్యాసము చేసినందువల్లను, వల్లూరు జగన్నాథరాయాదుల పాటలను తోడి విద్యార్థులకు కాలేజి కారిడార్లలోను, సముద్రపుటొడ్డునా, ఇతరత్రాను పాడి వినిపించి వారి నానందింపచేసి వారి మెప్పు పొందటం నిత్యకృత్యంగా ఉండేది. సంగీతమా సద్యః ఫలము! పాటలా Ballads, ఇక విద్యార్ధులు పరవశులు కావడానికి అభ్యంతరం ఏమిటి? కాని పెంపుడుపిల్లలతో మా వాడికి తృప్తి కలుగలేదు. కావ్య సంతానము కనవలెనని సరదా ఆదుర్దా లెక్కువయినవి. అప్పుడప్పుడూ నా మీద చిరాకు కలిగినప్పుడు వ్రాసిన సూటి పోటి పద్యాలూ అధికార్ల కవితో కూడా పార్థసారథి మీద వ్రాసిన జంటపద్యాలూ మినహాయిస్తే,”గుండె గొంతుకలోన కొట్లాడుతాదీ” అన్నది మొట్టమొదట వ్రాసినది. దీని భావమేమో తిరుమలేశుడికే యెరుక. నా! “ని అధికారకవికి ఒకరకంగా అర్థమైనది. ఇంకొక మిత్రుడికి ఈ మధ్య దీనిలోని సరస్వతీసాంత్వనము గోచరించింది. కాని అప్పటికి కవికూడ దీనిసంగతి సందర్భాలు గమనించినట్లు కనిపించలేదు. ఏదో కథ చెప్పుతూ వచ్చేవాడు. అప్పటికి యెంకికి నామరూపాలు యేర్పడలేదు. ఈ మధ్య పాటలన్నీ కలగాపులగపుసమన్వయంచేసి యెంకిని పతివ్రతనుగా చూపించటానికి ఈ పాటను సరస్వతీసాంత్వనముగా అన్వయించటానికి చూచారుగాని అది అభూతకల్పన, పునాది లేని ఆకాశసౌధము. తరువాత వ్రాసినది నాయుడుబావ పాటేనని నాకు జ్ఞాపకము. ఆ పాటలో

“నరుకు లేవి కావలె సంతన పిల్లా”

నే నురుకుతాల ఇంటికాసి నాయుడుబావా”

   అనే చరణముండేది. అది నాకెంతో కర్ణకలోరంగా వుండేది. కానీ అందరూ విని సెబాసంటూనే వుండేవాళ్ళు. కాని పోనుపోను ఆ చరణం మా వాడికి బాగుండలేదు కాబోలును. “నీవు మరమ మిడిసి మనసియ్యి నాయుడుబావా! ” యని మార్చి కొంత సాధువు చేసినాడు. అప్పటికి కూడ యెంకికి నామకరణము కాలేదు. యెంకి పెరు మొట్టమొదట “జామురేతిరివేళ” అను పాటలోనే కనిపించింది. అప్పటిరూపంలో ఆ పాట “వొయ్యారి తే గుండు నా యెంకే” అని తూరుపుకాపువాళ్ళ భాష కనురూపంగా ప్రయోగములు చేశాడు కవి. కాని ఆ శబ్దధ్వని బాగుండకపోవటంచేత “వొయ్యార మొలికించు నా యెంకీ” అని దిద్ది విమర్శకుల విమర్శనమును కొంతవరకు మన్నించినందుకు సంతోషించవలసిందే, అదేమి కర్మమో గాని నాకీపాట నాటినుండీ నేటివరకు రుచించలేదు. పండితప్రకాండులు చాలమంది దీనిని మెచ్చుకొన్నారట. కాని ఇందు భావసౌందర్యమేమో నాకు గోచరించుట లేదు, చీకటిలోనుండి వచ్చిన పండితుల కొక్కమారు  కన్నులు మిరుమిట్లు గలిగినవో, లేక, నా కందరాని నిగూఢసారస్యమిందేమైనా వున్నదో ! అటు తరువాత ఆ యేడే “యెంకిముచ్చట్లు”  “యెంకితో తిరుపతి” “యేటిదరి నా యెంకి” “యేడుంటివే యెంకి?” అనే పాటలు కూడ బయలుపడ్డవి.

       ఈ పాటలను గూర్చి అప్పుడు నేను మా వాడికి చెప్పిన అభిప్రాయమే ఈనాటికి కూడా స్థిరంగా నా మనసులో పాతుకొనిపోయింది. నేను ఈ యేలపాటల నుద్ధరించామని బులపాటము పడ్డవాళ్లలో వొకడినే గాని దీనికి గల ప్రధానమైన అభ్యంతరమేమిటంటే పాటకపు జనుల జీవితంలో లీనమైతేనే తప్ప సరియైన యేలపాటలు వ్రాయలేము. నా “నల్లసరుకులో నాణెములేదా” అనే పాట చాలామంది మెచ్చుకొన్నా నాకు దానిమిద అభిమానం తక్కువ. పాటకజనుల జీవితంలో లీనముకాకుండా పైపైన దేవులాడినంత మాత్రనే విశేష ప్రయోజనముండదు. అట్లా లీనమైపోవడానికి మనకు లీనతాసంబంధమైన అహంకారము యావత్తూ పటాపంచలు కావలసి వుంటుంది. చేలో పనిపాటలు చేస్తూ వ్రాసిన రాబర్టుబరన్‌ (Robert Burn)యేలపాటలకు టెన్నిసన్‌ వ్రాసిన (Tennyson) North English Ballads కూ సారస్యమందునా, గాంభీర్యమందునా హస్తిమశకాంతరము గలదు. బరన్స్‌ పాటలు ప్రాణము కలవి; హృదయపుటము చాచుకొని వచ్చినవి; పుట్టురత్నాలవంటివి. టెన్నిసను వ్రాసిన నార్తుఇంగ్లీషు బాలడ్సు జనుల మాట, యాస, యధారూపముగా ప్రదర్శించుచున్నప్పటికీ జీవములేక, భావోద్వేగము లేక కృత్రిమరత్నములవలె ఉన్నవి. పల్లెటూరిప్రజల జీవితమునే కవితావస్తువు చేయవలెనని పెనుగులాడిన వర్డ్స్ వర్తు (Wordsworth ) అంతవాడే, ఆ ఫక్కీలో సరియైన కవితాసృష్టి కవికి పరకాయప్రవేశశక్తి లేనిదే అలవడదు. అట్టి శక్తిలేని కవిత వ్యాఖ్యానప్రాయముగానే ఉంటుంది. అందుకనే కవి స్వకీయభావములను  వర్ణించుటయే వీలయిన కార్యము; నేలమీద సామువంటిది. కవి స్వకీయభావములను విసర్జించి ఇతర జనుల భావములను వెల్లడించయత్నించడము నేలవిడిచి సాముచేయటమువంటిది. అట్టి సాము ఇంద్రజాలికులుగాని చేయలేరు. ఈ సంగతులన్నీ గమనించే నేను మావాడితో “ఒరే, నీవీ పద్ధతి విడిచిపెట్టి నీ హృదయములో వుండే భావాలనే వర్ణించటం మంచిది. లేకపోతే పాటకజనుల జీవితములో యింకాలోతుగా దిగి వాళ్ళలో ఒకడివైపోయి వాళ్ళ జీవితమును కావ్యములో సృష్టించవలె కాని ఊరికే పైపై శృంగారపుదేవులాటలతో తృప్తి బొందబోకుమని హితోపదేశము చేశాను. ఏవేళ హితోపదేశము చేశానో గాని అప్పటికి కాస్త గునిసినా తరువాత కొన్నాళ్ళు అటా యిటాయని కొట్టుకలాడి చిట్టచివరకు (Lyrical Ballads)సిద్ధాంతము లేవదీసి, పాటలసమర్థన ప్రారంభించాడు. Lyrical Ballads తత్వము Eurasian తత్వముతో సమాన ప్రతిపత్తి గలదే, పోనుపోను యెంకిపాటలలో వర్ణితములైన విషయములు తన స్వకీయ జీవితానుభవములేననీ, ఎంకి నాయుడుబావలు కేవలము కాపువాండ్రుకారనీ, తన lyrical feelings స్వకీయ భావపరంపరల ballad సంప్రదాయమున కనుగుణముగా రచించుచుంటిననీ, అందుకని తన పాటలు lyrics కాని ballads గాని గాక lyrical ballads అనునొక నవీన కావ్యధోరణియని వాదించేవాడు. దానికి జవాబుగా “తమ్ముడా, నీ హృదయములోని నీ భావాలూ, నీ జీవితములోని అనుభవాలు వర్ణించటానికి నీకు కాపువాళ్ళభాష యెందుకురా; శుద్ధమైన గ్రాంథికభాషలో గాని, అది నియమశృంఖలాబద్ధమైన కారణం వల్ల ఉపయోగకరం కాకపోతే బ్రాహ్మణగ్రామ్యంలో గాని వ్రాయరాదా? బ్రాహ్మణదంపతులు తమ శృంగారభావాలు కాపువాళ్ళయాసమాటలతో వర్ణించటం అంత స్వారస్యంగా వుండకపోవటమే literary insincerity గా కూడ పరిణమిస్తుంది” అని నేను సమాధానం చెప్పినాను. ఆ సమాధానానికి అప్పుడు విరుగుడు సూచించలేకపోయినా యీ మధ్య కాన్ఫరెన్సులూ, పత్రికలూ, కాన్సర్టులూ మొదలైన వాటివల్ల ప్రచారమెక్కువైన కొద్ది అసలు కాపువాళ్ళ  బాష ఒక్కటే తెలుగనిన్నీ మిగిలినదంతా సంస్కృతసంబంధమైనందువల్ల తెలుగుగాదనీ అందుకనే స్వకీయభావాలను అసలు తెలుగైన కాపువాళ్ళ తెలుగులో వ్రాస్తున్నాననే విపరీతవాదములోకి తీవ్రవిమర్శనకు గురి అవుతున్నాడు.  భావానికీ భాషకూ అవినాభావ సంబంధము. భాష భావానికీ తొడుగు కాదు, అలంకారమూ కాదు. భావమే భాష, భాషే భావము. అందుకని ఉత్తమ జాతుల భావములు  ఉత్తమజాతులలో వ్యవహారమందున్న భాషలో వెలువడవు. తక్కువజాతులవారు తమ భావములను ఉత్తమ జాతుల వ్యవహారభాషలో ప్రకటింపటోతే వెనుకటికి   “పీట వడ్డించండి చెంబు వడ్డించండ”అని పలికిన పల్లెటూరి కాపువాని కథలాగవుతుంది. బెచిత్యానికి  కావ్యములో నిసర్గమైన స్థానమున్నది. ఔచిత్యముతప్పితే రసాభాసము తటస్థించి తీరుతుంది. కాబట్టి యే భావానికి తగిన భాష నాయా పట్ల వాడినవాడే సుకవి. అట్లు వాడని యెడల కవిత్వమునకు సాంకర్యదోషము వాటిల్లుతుంది. ఇక కాపువాళ్ళ తేలుగే అసలెనతెలుగనీ తదితరులది త్రెలుగుకాదనీ అనటం కుతర్మం. అసలు కావ్యభాష వ్యవహారభాషను యథారూపముగా అనుకరించవలెననటం సబబుగాదు. కావ్యానికి పరమావధి స్పష్టియొక్క అనుకరణం కాదు.కవి బ్రహ్మ తను సృష్టించు పాత్రల స్వభావమున  కనువయిన భాషనే ప్రయోగిస్తాడు. ప్రయోగిస్తాడేమిటి? అట్టి భాషలోనే ఆసృష్టి బయటికి  వస్తుంది. తిక్కన రచించిన మహాభారతమును అప్పలమ్మ యాసతెలుగులో వ్రాయటానికి సాధ్యమా? మానవబుద్ధి కందినంతవరకూ సాధ్యము కాదు. తిక్కన వ్రాసిన తెలుగు తెలుగు కాదనగలమా? పిచ్చివాడుగాని అట్లనడు. తెలుగు గ్రంథమనేది యేదయినా వుందంటే తిక్కన భారతమే. అందులో కొంత సంస్కృతము శరణుజొచ్చినాడు. తెలుగు తెలుగంటేయేమి? అచ్చతెలగా? అచ్చతెలుగే అయితే నూటికి తొంబదిమందికి పైగా తెలియనే తెలియదు. లేకపోతే తత్సమభూయిష్టమైన సంస్కృత సంబంధమైన మాటలను విద్యాగంధముగల కులీనులు యే ప్రకారముగా ఉచ్చరించి ప్రయోగిస్తారో ఆ ప్రకారమే ప్రయోగించటం మంచిది. కాబట్టి కేవలం కాపువాళ్ళతెలుగే అసలుతెలుగు కానేరదని చూపించాను. ఇక గ్రామ్యమేది, గ్రాంథికమేది, అనే విషయము తేలవలసి వుంది. చిన్నయ్యసూరి సూత్రాలప్రకారం వ్రాసిందే గ్రాంథికభాష అనే వాదానికి ముసలితనం వచ్చింది. దానితో పెనుగులాడనవసరం లేదు. ఇప్పుడు వాడుకభాష అంటే ఏమిటా అన్న మిమాంసే బలవత్తరముగా వుంది. ఇప్పటి వాడుక భాషాభిమానులు “వచ్చాయి, పోయాయి, కామాసు, సూశాడు నాకాసి” మొదలైన ప్రయోగాలతో కూడుకున్న యాసతెలుగే వాడు తెలుగనీ యే మాత్రము సలక్షణమైన ప్రయోగమున్నా అట్టి తెలుగు ‘పాత గ్రాంథిక’ తెలుగనీ  అందుకని నవీన కవిత్వమున ప్రయోగార్హము గాదనీ పట్టుపట్టీ పండితులతో కొట్లాటలకు దిగుతున్నారు. పండితులు ఆత్మరక్షణ కోసమై “వాడుక భాషా వాదులు” భాషను తగులబెట్టి బూడిదచేసి తూరుపార బట్టుతున్నారని చెడతిట్టుతున్నారు. ఈ రెండు దుర్వాదాలకీ మధ్య వుంది అసలైన నిజము. అదే మంటారా వినండి! శబ్దములు ప్రసిద్ధంగా వున్నంత వరకూ అది వ్యవహారభాషేననీ నా మతము. ఎక్కడివో పాతనిఘంటువులలో నుంచి ఆముదపు దీపము సహాయ్యముతో వెదికి వెదికి తెచ్చిన మారుమూల మాటలు గల బూజుపట్టిన భాష గ్రాంథిక భాష కానేరదు, అది పనికిమాలిన నీరసభాష. అందుకని వ్యవహారమందున్న పదజాలముతో కూడుకొన్నదే గ్రాంథిక భాష కావలెను. అట్టిదే ఇంగ్లీషులో (King’s English) అంటారు. కాని ఆంధ్ర సామ్రాజ్యము తాతలనాడే అంతరించిపోయినందున అట్టి (King’s English) మనకు సంక్రమించే అదృష్టము మాసిపోయింది. కాని రాజులూ రాజ్యాలూపోయినా విద్య మాత్రము మన్నులో గలిసిపోలేదు. మొత్తము మీద బ్రాహ్మణుల చలవవల్ల యే తాటాకు పుస్తకాల్లోనూ, యే దేవతార్చన పెట్టెల్లోనో, యే కుల్లాయి గుడ్డల మూటల్లోనో ఆంధ్ర విజ్ఞానము అంతరించకుండా పరంపరగా వస్తూనే వుంది. అట్టి విజ్ఞానము గురుముఖతా నిన్న మొదటిదాకా మన పెద్దలు చదువుకుంటూనే వుండేవాళ్ళు. నేటికి మన అక్షరాభ్యాసం A. B. C.D.లతో చేసే దుర్గతి వచ్చింది. కాబట్టి మన ప్రాచీన విజ్ఞానాన్ని చూస్తే హేళన,నిరాదరణ, తిరస్కారము కలుగుతున్నవి. న్యాయానికి మనకు అసలైన తెలుగు చదువుకొన్న శిష్టులు వ్యవహరించే తెలుగులోనే దొరుకుతున్నది.శిష్టులలో కూడా ప్రాంతీయమైన యాస యేదైనా వుంటే ఆ యాస తీసేస్తే మిగిలేదే  సరియైన వాడుక తెలుగు.అది పూర్ణముగా గ్రంథములలో ఉపయోగించదగినది. 

     ఇక శబ్దరూపాల సంగతి కొంచెము విచారించితే గాని వ్యవహారము కొసముట్టదు. శబ్దరూపాన్ని నిర్ణయించేవి పాత్రౌచితి, వృత్తరూపము, కావ్యరూపమున్నూ ఇద్దరు బ్రాహ్మణులు మాట్లాడుకొనే సందర్భములో, “యంటోయి యెంకడు మామా యేడ కౌల్లొతుండాన్‌” అనటం అసభ్యం, రసాభాసమూను. అట్లే సంస్కారుల నోట వ్యాకరణ యుక్తములైన ప్రయోగాలు . పలికించుటయును. ఇక సంస్కృత వృత్తరూపాలు వాడేపట్ల వ్యాకరణ సిద్ధప్రయోగాలే యెక్కువగా పొందుతవి గాని యాస తెలుగు పొందదు. కాన కవితలలో జనవ్యవహారంలో వున్న శబ్దరూపాలే ఎక్కువగా ఒదిగి అందమొప్పుతవి. ఇక కావ్యరూపము సర్వజనాదరపాత్రము కాదగిన శాస్త్రమో, పురాణమో, మహాకావ్యమో అయినప్పుడు అట్టి కావ్య గౌరవానికి వ్యాకరణ శుద్ధమైన రూపాలు సరిపోతవి గాని నేటి మనవాడుక తెలుగు రూపాలు పేలవమై పట్టిస్తవి. ఇవి అభిరుచికి సంబంధించిన విషయాలు గనుక రసజ్ఞులే వీని విలువను గ్రహించి నిర్ణయించగలరు. కవి తనయిచ్చవచ్చిన పాత్రను సృష్టించవచ్చును. అంతవరకు కవి నిరంకుశుడే. కాని ఒకసారి యేదోపంథా యేర్పరుచుకొన్న తరువాత ఆ పంథా విడిచిపెట్టి చెడతిరుగుడు తిరగరాదు. Hamlet లో Shakespeare  “There seems to be a method even in madness” అని చెప్పినట్లుగా వెర్రి వెంగళప్పకు కూడా వేదాంత ధోరణి ప్రత్యేకమైనది వున్నదని అందుకనే “అన్నమైతే నేమిరా, సున్నమైతే నేమిరా” అన్న పిచ్చివాడు పాడు పొట్టకు అన్నమే వేతామంటాడు గాని సున్నమే వేతామని సుతలామూ అనడుగద. కాబట్టి కవి తన యిచ్చవచ్చిన కావ్యపంథా యేర్పరచుకొని ప్రసిద్ధమైన శబ్దజాల ముపయోగిస్తున్నంత వరకూ, నీతికి నిలబడినంత వరకూ అతను వాడే భాష గ్రాంథిక భాషే.వ్యాకరణ యుక్తమైనా సరే కాకపోయినా సరే గ్రాంధిక  భాషే. వ్యాకరణ యుక్తమైనా సరే కాకపోయినా సరే గ్రాంథిక భాషే, ఈ రీతిగానే కవితా నేర్పరచుకొన్న కావ్యపంథను ప్రసిద్ధములై వ్యాకరణ యుక్తములైన ప్రయోగాల ద్వారా అనుసరిస్తుంటే అది కూడా వాడుక భాషే.వ్యాకరణయుక్తమైనంత మాత్రాన పాతబూజు తెలుగు కాలేదు. నవీన కవి కంఠీరవులకు ప్రయోగానర్హము కాలేదు. కాబట్టి ఈ సంగతి తెలిసినవాళ్ళకు అంగుళము అంగుళానికి అరవై తొమ్మిది వ్యాకరణదోషాలు వెదికే పండితుల శుష్కవాదాలు, గడ్డిపరకకు తుది మొద లెరుగనివాళ్ళు సైతము “కోవిధిః కోనిషేధః, నిరంకుశాః కవయః” అనే పెద్ద పెద్ద వాక్యాలు పట్టుకొని ప్రజ్ఞలకై పెనుగులాడే నవీనకవుల అరాచకమూ అపమార్గము ననుసరించటం వల్లనే వృద్ధి పొంది వాజ్మయ వినాశకరము లౌతున్న వని సహృదయులు గ్రహింపకపోరు. నిజంగా ఆలోచించి చూస్తే గ్రాంథిక భాషా, వాడుక భాషా రెండు వకటే. వాటికి వైరుధ్యము లేదు. ఎవళ్ళ బీజాలు వాళ్ళూదుకొని తమ తమ గొప్పలు చెప్పుకోవటానికే కొట్లాట చేస్తున్నారు గాని రసిక దృష్టితో విమర్శించేవారికి పాత్రౌచితి, వృత్తౌచితి, కావ్యౌచితి తప్పనంత వరకూ, ప్రయోగాలు ప్రసిద్ధములైనంత వరకూ వ్యాకరణయుక్త తెలుగుకూ శిష్టజన వ్యవహారములో వుండే తెలుగుకూ తారతమ్యముగాని, విరోధముగాని ఎంత మాత్రమూ లేదని స్పష్టమౌతుంది.

   కాబట్టి పై విషయాల ననుసరించి “యెంకి” ఎవతో, దాని కులగోత్రాదు లెట్టివో, దాని గుణగణాలెట్టివో దాని సరససల్లాపాలు ప్రణయగాథలు ఎంతవరకు రసౌచిత్యముగా వర్ణింపబడినవో, విమర్శించదలచినాను. సాధ్యమైనంత వరకు నిష్పక్షపాతముగానే విమర్శించటానికి ప్రయత్నిస్తాను.

    మొట్టమొదట “యెంకి” కులగోత్రాలు విచారించవలసి వున్నది. ఎంకి కాపుపడుచనీ, నాయుడుబావను పెళ్ళాడిందనీ, వారికి వ్యవసాయమే వృత్తి అనీ, వారి పవిత్ర దాంపత్య కథా కల్పనమే యెంకిపాటలలోని కావ్యవస్తువనీ, అసహాయోద్యమ వ్యవసాయికులైన Non cooperative agriculturist  దశిక సూర్యప్రకాశరావుగారు స్వర్ణయుగ మనే పేరుతో స్వర్ణాక్షరాలతో వ్యాసం వ్రాసి “భారతికి” సమర్పించారు. ఇక ఆంధ్ర కకార్లైల్ (Carlyle ) , ఆంధ్ర రస్కిన్‌ (Ruskin)ఆంధ్రనాటక (Encyclopedia)పురాణ కర్తలు పురాణం సూరిశాస్త్రిగారు తమ నిఖాలపురాణ వేదాంత వ్యాఖ్యాన వైఖరీసమేత వాదధోరణిని యెంకిని తీవ్రంగా పరామర్శచేసి యెంకి నాయుడుబావలు కేవలము జీవేశ్వరులేయనీ, యెంకి పాటలు వైష్ణవ మతబోధక గీతాలనీ, వేదాలూ, ఉపనిషత్తులూ, బ్రహ్మసూత్రాలూ, ఓమర్‌ ఖయ్యాం, బజారంచు రవికెపాట, కొత్తకోరంకి పాటలు  మొదలైన వాటన్నిటినీ ఎంకి పాటలతో తిలకాష్టమహిష బంధ సమన్వయంచేసి భూమ్యాకాశాలు కప్ప తాళాలు వాయించుతూ ప్రళయ తాండవం మొదలుపెట్టినారు.

   ఇక పూర్వాచార పరాయణులైన పొక్కులూరి లక్ష్మీనారాయణగారు యెంకి నాయుడుబావలు సంకర దంపతులనీ, ఎంకి  కాపుదే యనీ, నాయుడుబావ మాత్రము పండితుడైన కులీనుడనీ, కాపుగుంట సావాసానికి బ్రమసి నీచభాషలో తన శృంగార  సల్లాపాలు కావిస్తూ భ్రష్టుడైనాడనీ, ఇట్టి శృంగార మసభ్యమనీ, అవినీతికరమనీ, ఆంధ్రభాష కనర్ధదాయకమనీ “అపిగ్రాహరోదితి” ని మీంచారు. నాలుగో వేపునుండి పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రిగారు ఎంకినాయుడుబావలు సాక్షాత్తు శృంగార రసాధిష్టాన గాలు  దేవతలగు రతీమన్మథులేననీ; శృంగారరసము యొక్క పారమంతా యెంకీ నాయుడుబావలు ముట్టిచూచినారని కళాస్థానాదులు పరిశీలనం సాకల్యంగాచేసి ఘంటాపథంగా మారుమోగించారు. ఊర్ధ్వదిశనుండి మహోపాధ్యాయులు, అపర మల్లినాథులు,  వేదం వేంకటరాయ శాస్త్రులవారు, “చిన్నవాళ్ళు ఎందుకు గందరగోళం పడతారు?” నేను కథాసరిత్సాగరమథనం చేయగా కరణ  చేయగా రంభానలకూబరులే అలంకారశాస్త్ర విరుద్ధంగా శృంగార సల్లాపము చేసిన దోషాన కలియుగంలో  యెంకినాయుడుబావలుగా శాపవశాన పుట్టినారు. వీళ్ళకి “భుజగశయనా దుత్ధితే శార్జపాణౌ శాపాన్తో భవతి ఖలు శేషాన్‌ మాసాన్‌ గమయ చతురో లోచనే మిలయిత్వా” అని మేఘసందేశ వాక్యాలతో సాలంకారంగా సాంత్వనం చెప్పచూచారు. గుడు | ఆరోవెపు నుండి నేను కాస్తసాంరహస్యంగా మావాడిని “ఓరే తమ్ముడూ ఏమిటిరా యీ గందర గోళం? నిజంగా యెంకి ఎవతెరా? విమర్శనల కేమిటిగాని, నిజం నాకు కాస్త చెపుదూ” అని గుచ్చి గుచ్చి అడుగుతూ వచ్చాను. మావాడు జాలిగలిగించే అన్న డగ్గుత్తికతో “నేనే మెరుగుదనురా, ఇదంతా ఎవళ్ళ యిష్ట మెచ్చిన కులగోత్రాలలో వాళ్ళు యెంకిని కలుపుతున్నారు.కాని  ఎంకి వీళ్ళనుకొన్న వాళ్ళలో ఎవరూ కాదు. నా ప్రేమ రసానికాశ్రయము; నా శృంగారవాక్కుకు విశ్రామస్థానము; వలపులకు నిధానము. యెంకి ప్రాటలలోని భావాలన్నీ నా స్వకీయ జీవితానుభవాలే గాని వేరు కాదు. ఏదో నా స్వంతఘోషేగాని మరేమి కాదు” అని దీనంగా ఈ చిక్కులో నుంచి ఎల్లా విడబడగలనా అన్నట్లుగా చెబుతూ వుండేవాడు.  షేక్స్పియరు పడ్డ అవస్థలాంటి అవస్థలో పడ్డట్లున్నాడు మా చిరంజీవి సుబ్బారావు. నిజము కొంచెము సూక్ష్మంగా వుందని నా diagnosis.అదేమిటంటే మొట్టమొదటి రోజులలో అప్పుడుండే నాయురాండ్రపాటలూ, ఛల్‌మోహనరంగా పాటలూ, వల్లూరి  జగన్నాథరావుగారి ballads మొదలైన వాటి చలవవల్ల Inspiration అనగా అనే భావమేలెండి-మావాడు  ballads మాత్రమే ప్రాయవలెనని ప్రారంభించాడు. తూరువు కాపువాళ్ళ జీవితంలో ఎక్కువమజా (romance)వుందని మావాడి మతం. ఆ మతాని కనుగుణంగా తూరుపు కాపువాళ్ళ యాసతెలుగులోనే పాటలు వ్రాయటం ప్రారంభించాడు. కాని కవి  పుట్టింది కృష్ణాజిల్లా. పాటలలో అవలంచించింది, తూరుపు వాళ్ళ తెలుగు. ఇంగ్లీషుల్లో ‘Blood is thicker than water’ అనే లోకోక్తి వుందిగదా! అందుకనే ఎంత ప్రయత్నించినా కృష్ణాజిల్లా మాటలు కలగలుపు అక్కడక్కడా ఉండనే వున్నది.   విషయము శైలి ప్రశంసలో విశదంగా విమర్శిస్తాను. మొట్టమొదట యెంకిని కాపుదాన్నిగానే వర్ణించాడు. నాయుడుబావ  యెంకికి మగడా కాడాయన్న సంగతి యెంకి గుణగణాల ప్రశంసలో చెబుతాను. ఇప్పటికి వారు మొట్టమొదట భార్యాభర్తలుగా   సంకల్పింపబడలేదనీ సూచించి అనంతర కథాక్రమం ఎత్తుకొంటాను. కొన్నాళ్ళుపోయేసరికి ఆంధ్ర కావ్య జగత్తులో అభిరుచులు మారజొచ్చినవి. ఎవరి ప్రియురాండ్రను గూర్చి వారు అన్యాపదేశంగా మారుపేర్లతో పద్యాలు, పాటలు వ్రాయటం, స్వకీయంగా ప్రణయోదంతాలు రసవంతంగా వర్ణించటం బాగా ఆచారం అయిపోయింది. దానితో మావాడికి అల్లాంటి సరదాయే  కలిగింది. “ఎంకిసూపు” “ఎంకిపయనం” అనే పాటలతో పారంభమయిన ఈ పధ్ధతి  నేటివరకూ కవి పట్టుకొని వస్తూనే  వున్నాడు. అందుకనే ఇటీవల రచించిన పాటలు కాపుపడుచు మీదకన్న కులీనయైన “ఉత్తమా యిల్లాలి” నుద్దేశించి వ్రాసినట్లుగానే కనిపిస్తున్నవి. అయితే యీకులీనపేరు గూడా ఎంకి అనే ఎందుకు పెట్టినాడయ్యా కవి అనే ప్రశ్న కలుగుతుంది… అందులోనే వుంది గోసాయి చిట్కా యెంకి పేరు కొన్నాళ్ళు జనంలో అల్లుకుపోయింది. బాగానే విద్యార్థులు మొదలైన సహృదయులను ఆకర్షించింది. పోనీ ఆపేరే వుండనీ అనుకొని ఆ పేరుతోనే పాటలు యధాప్రకారంగానే తూరుపు కాపువాళ్ళ  యాసలోనే వ్రాయటం సాగించాడు. ” What is in a name?” అనలేదా Shakespeare?అయితే మా  నాగేశ్వరరావుపంతులుగారినే ఇప్పుడు అమృతాంజనం పేరు తీసివేసి ఆ మందునే ఇంకోపేరుతో అంత విరివిగా అమ్మకం  చేయమనండి. ఎన్నటికీ చేయరు. ఎందుకనీ? అది Business secret.ఒక పేరులో వున్న అదృష్టరేఖ మరొక పేరులో ఉండదు. Poetical business లోను అంతే ! ఎంకి పేరుకుండే theatrical glamour మరో పేరుకుంటుందా? అందులో | ballad ప్రపంచంలో శకాలు మారుతూ వుంటవి. వీథిభాగవతాల్లో కేతిగాడు బంగారక్కలది సామ్రాజ్యం. యేలపాటల్లో కొన్నాళ్ళు, మేనత్త మేనల్లుళ్ళు చంద్రమ్మ వెంకయ్యలదీ, కొన్నాళ్ళు నారాయణమ్మ బంగారుమామలదీ, కొన్నాళ్ళు అప్పనా తనామనాలది. మావాడి Lyrical Ballads ప్రపంచంలో యెంకి నాయుడుబావలది సామ్రాజ్యం. ఒక్కపెట్టున సామ్రాజ్యం వదలటం సామాన్యుల తరమా? అందుకనే ఆ పేరు మార్చటానికి తగినంత చురుకుగాని, సాహసంగాని, అవసరంగాని కలగనందున Statusquo నిలుపుదామని ఆ పేరు వుంచేశాడు. కాని ఆ యెంకికీ క్రొత్త యెంకికీ చాల భేదం వున్నది… అది రసికులు పరిశీలించకపోరు, పరిశీలించి కూడా ఏమో ఇద్దరూ స్త్రీ జాతిలో చేరిన వాళ్ళుకదా ఫరవా లేదని సరిపుచ్చుకుంటే  వాదే లేదు. సరిపుచ్చుకోలేనివాళ్ళకే ఈ రొట్టేకాడ కిచకిచలన్నీ. అయితే కులీన నాయికా నాయకులు హీనగ్రామ్యములో  శృంగార సల్లాపాలు చేస్తూవుంటే ఎబ్బెట్టుగా వుండదా? తప్పకుండా వుంటుంది, అందువల్లనే భాషలో గూడా మిశ్రమము వుంది. పొక్కులూరు లక్ష్మీనారాయణగారి వాదంలో ఇంతవరకు సత్యము వుంది. కాని ఆ సత్యమే వారు కొంచెము పరుషముగా చెపుటంవల్ల ప్రతివాది భయంకరుల పద్యశాపాలకూ, వచన శాపాలకు, గురికావలసి వచ్చింది. యెంకి నాయుడుబావలు… అనేక స్థలాలలో వ్యాకరణయుక్తమైన ప్రయోగాలూ చేస్తుంటారు. ఒలికించు, అనిపించు, తిట్టు, అంటి, సుకములు, దూరాన… నారాజు కేరాయి డౌనో! యీ రోజు నారాత లేరాల పాలో, ఈశుడు, వత్తును, పదములు ఇరికె, నేలాగు, పలికి, మొదలైన వ్యాకరణ యుక్తమైన ప్రయోగాలు కేవలపు కాపు దపంతల నోట సామాన్యముగా వస్తవని నేనూహించలేను. కాపు వాళ్ళు వ్యాకరణ ప్రయోగాలతో మాట్లాడితే పూర్వపు ప్రబంధ కవులు సమాస భూయిష్టమైన సంస్కృత జటిలాంధ్రములో కవిత్వం వ్రాశారంటే తప్పేమిటి? గ్రాంధిక భాషావాదుల దోషమేమిటి?’అల్లె’ ఉపమానార్థంలో  తూర్పుకాపులలో తక్కువగా ప్రయోగింపబడుతుంది;లా అనే శబ్దమే ఎక్కువ వాడుకలో ఉంటుందీ సందర్భములో, రకరకాల వాడుకభాషా పదములు మిశ్రమము చేయబడి వున్నవి. మొత్తముమిద తూరుపుకాపువాళ్ళ యాసే యెక్కువగా వున్నది. కానీ పాటలలో వున్న భావాలు, చాలా సున్నితములుగాను సంస్కారులకే సహజములుగా ఉన్నవి. అందుకనే ఈ మధ్య పాటలలోని యాసను  పూర్తిగా మార్చివేసి ఉన్నదున్నట్లుగా గ్రాంథికంగా వ్రాసినా యేమి అర్థబేధం కాని రసభేదంకాని కలుగటము లేదు. దానినిబట్టి ఈ మధ్య వ్రాసిన పాటలలోని తూరుపు తెలుగుకు చాలినంత Inevitability లేదనీ అది కృతకభాషయని, ప్రజారంజనకోసం – అవలంబింపబడిందనీ సృష్టమవుతుంది. ఈ విషయములో వారి అన్నగారున్నూ, కృతిభర్తయున్నూ అయిన శ్రీ భావరాజు వెంకట సుబ్బారావు పంతులు బి.యే., గారు శ్రీ వేదం వెంకటరాయ శాస్త్రులువారు ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. శ్రీ  వెంకటరాయ శాస్త్రులుగారు కావ్యరచనలో ఆరితేరిన గడుసరి కాబట్టి రసికులూ సంస్కారులూ అయిన రంభానలకూబరులే  యెంకినాయుడుబావలై అవతరించి యీ తీరుగా తూరుపు తెలుగులో సరససల్లాపాలు చేస్తున్నారని ఐతిహ్యం కల్పించి బట. పేరిగాడి సారాసెంబు తాటికథతో సమన్వయం చేసి సామరస్యం కలిపించటానికి ప్రయత్నించారు. మంచి సరసమైన  పోకడేయిది. కాని యిది నూజవీడు అభినవాంధ్ర కవిమిత్రగోష్టిలో విశేష మాదరణ గాంచి నట్టగుపించలేదు. కారణము స్వపక్షాభిమానమే. సాహిత్యములో Party politics గాని Theatrical glomour కావ్యనీతి poetry sincerity కి కట్టుబడి  వుండవలసిందే. అల్లా కట్టుబడి వుండని యెడల కాలమే వాటికి తగిన సత్కార సంస్కారములు చేస్తుంది. 

    పాటలశైలి యాస మినహాయిస్తే చాలారసవంతంగా వుంటుంది. శబ్ద కల్పన మహా సరసంగా చేస్తాడు మావాడు. మితభాషణమే ప్రధాన కావ్యగుణము. అది ఈ పాటలలో కొల్లగా వుంది. పలుకులలో జాతీయత విశేషంగా ఒప్పుతున్నది. స్వభావోక్తి కేవల మలంకారప్రాయముగా నిర్ణయించిన అలంకారికుల యభిప్రాయమెట్లయినా సరేగాని కావ్యానికి అందులో ముఖ్యముగా పాటలకు మితభాషణమూ, జాతీయతా రెండూ రెండు నేత్రాలవంటివి. అవిలేని కవిత్వము గుడ్డి యెద్దు చేలో  పాటల శైలి యాలపాటల శైలి అని కొందరి మతము. కాని యాలపాటల శైలిలో యీ పాటలలో వున్న బిగువు మృగ్యంగా  వుంటుంది. ప్రబంధకవుల వాచాలత యీ కవికి పట్టకపోవటం గొప్ప సుగుణము. భావనలో చాలా సౌకుమార్యమూ, ధ్వని  ప్రాధాన్యమూ ఉన్నందువల్ల పాటలు చిన్నవైనా భావము విశేషముగా విశాలముగా వుంటుంది.

      ఇక యెంకి నాయుడు బావల సంబంధాన్ని గూర్చి వెలువడిన వింత వ్యాఖ్యానాలకు కొంచెము సమాధాన మియవలసి వున్నది. యెంకినాయుడుబావలు భార్య భర్తలని నే నంగీకరింపను. “గుండె గొంతుకలోన కొట్లాడుతాది” అన్న పాటలో ” నాయికను నాయకుడు విటకాడులాగున అనుసరిస్తున్నట్లున్నదే కాని కుపితయైన బులిపింతలు, యిలుదూరిపోవటాలు, ఇసిరి కొట్టటాలు, అగ్గిచూడటాలు సంసార స్త్రీలకు ఉచితములైన లక్షణాలు కావు. మందో మాకో యెట్టి మరిగించిందనే అనుమానము సామాన్యముగా భార్యలపట్లగాక ఉంపుడు కత్తెలూ, వ్యభిచారిణులూ మొదలైనవారి పట్లనే కలుగుతుంది. ఈ  , అనుమానము “వొన లచ్చిమి” అనే పాటలో మరింత బలమౌతున్నది. నిజమైన సంసార స్త్రీయే అయితే చేలో పనిపాటలు చేయటానికి పోయి రాత్రి అక్కడే పరుండనెంచిన భర్తతో రతిసౌఖ్యమనుభవించటానికి “జాము రేతిరి యేళ జడుపు గిడువూమాని   సెట్టు పుట్టా దాటి” రానవసరమేమిటి? యెంకి నాయుడుబావల నివాసము చేలోనేనా లేకపోతే ఇల్లూ వాకిలీ వుందా?  యెంకి ఎక్కడ నుంచి వస్తున్నది? రాత్రివేళ శృంగార వాసన యేమాత్రమున్నా యెంకి  అభిసారిక అనే భావము ఈ పాటలో తప్పక స్ఫురింపకమానదు. సంసార స్త్రీ అయితే నిత్యమూ భర్తతో సుఖము లనుభవించే  వీలు కలదిగదా ! చంద్రుణ్ని సూర్యుణ్ని తిట్టవలసిన అవసరమేమిటి? నీలిచీర నీటుగా కట్టడం అప్పటికే ఆచారమైపోయింది. దానికేం లెండి. తెల్లివారింది మొదలు రాత్రివరకూ ఒకరి మొగ మింకొకరు చూచుకొనే భార్యాభర్తలకేనా అంతకాలు   కదపలేక ప్రోవటాలూ, కరిగినీరైపోవటాలూ, “నిన్న కులికి నీళ్ళకుండ మిదబడ్డాను; మొన్న కులికి మొగుడు మిదబడ్డాను;  నిత్యం కులికేవాళ్ళు ఎట్లా కులుకుతారోనే వోళమ్మా” అన్నదాని మౌగ్ధ్యములాగున్నది మన యెంకి మౌగ్ధ్యము.యెంకి  పరకీయమే యనీ అభిసారికే అని తెలపటానికీ రెండు పాటలే చాలినా ఇంకా మిగిలిన పాటల్లో కూడా చూపిస్తాను  బలవత్తరమైన నిదర్శనాలు. ‘ఎంకి ముచ్చ’ట్లనే పాట చిత్తగించదగును. “దొడ్డితోవ కలై తొంగి సూడంగానె తోట కాడె వుండు తొరగొస్త నంటాది”; “కోడి కూసేతలికి కొంప కెల్లాలి నీ కోసరమె చెపుతాను కోపమొద్దంటాది?; ఎంత సే పున్నాను యిడిసి పెట్టాలేవు, తగువోళ్ళలో మనకి తలవంపు లంటాది.” ఇవి సంసార స్త్రీ భర్తతో అనే సల్లాపాలేనా ! కొంప కెల్లాలంటుందే;ఎవడి కొంపకు? తగువోళ్ళలో తలవంపు లెందుకనో? పోనీ “రావొద్దె”అన్న పాట చిత్తగించండి!భార్యాభర్తలే అయితే అడుపుల్లోను  గట్లలోను, పుట్టలెక్కీ ఏళ్ళీదుకొనీ ఒకరినొకరి అనుసరించువలసిన పనియేమి లేదే!అందులో చేలో సుఖముగా కాపురము చేస్తూ వున్న కాపు దంపతుల జీవితానికీ అది అసహజమే;అందులో మరి నాయకుడే అనుసరిస్తున్నాడంటే నాయిక పరారి అయిపోయిందన్న సంశయము కూడా కలుగుతుందే?నాయకుడు నాయికకు కల్లకపటము  నారోపిస్తున్నాడే;తత్రాపి కాపువాండ్ర  దాంపత్య క్రమము అంటానికి ఆధారము అత్యాల్పల్పము కదా! “కటిగ్గుండెల నాయెంకి”అనే పాటలో అనుకూలుడైన నాయకుడు పక్షిలాగు కొట్లాడుతూ నాయిక క్షేమానికై దేవుడికి దణ్ణాలు  పెడుతూ ఉంటే నాయిక ఇరుగమ్మలక్కలతో ఎకసెక్కమ్ములు ఆడటం, వొన్నె చీరలు గట్టి వోసుగా తిరగటం,అమ్మలక్కలతోటి సెమ్మసెక్కాడటం,చీకుచింతా లేక పోకల్లె పండుకోవటం నాయికా నాయకుల దాంపత్యానుకూల్యమను పొషిస్తున్నదా?యెంకి కోపాలు వచ్చినప్పుడల్లా ఏ దేశమో వుంటే నాయకుడు యేడుస్తూ కలలో దాన్ని దర్శించి సంతృప్తిగనటమా? వింత దాంపత్యమే!

            పై పాటలలో వర్ణించబడిన నాయికకు నాయుడుబావతోనే వుండి అతని మాటే వింటూ, అతడు మరమిడిసి మనసిస్తే చాలు,అతడు పద్దాక నల్ల గుంటెసాలు, అతని నీడలోనే మేడకట్టి కాపురం జేయవలెనని సంకల్పించుకొన్న సత్తెకాలపు యెంకికీ ఎంత తేడా వున్నది? ఈ యెంకి గృహిణి;అందుకనే నాయకుని వియోగము సహించలేదు.నాయకుడు అన్నరోజు రాక మాట తప్పినప్పుడే  నీళ్ళు తెచ్చేటప్పుడూ, అద్దములో చూస్తున్నప్పుడూ, చల్లని వెన్నెల్లో చాపేసి కూర్చున్నప్పుడూ, నాయకుడు తనవద్దే వున్నట్లు భావించి వికారము పొందుతుంది.భర్త నీతైన వాడనే నమ్ము తన భాగధేయము ఎల్లాగుంటుందో అని పరిపరి విధాలా పరిదేవనం చేస్తూ వుంటుంది.ఏటి నురగల చూసి నాయకుడు అనుకూలుడే అనుకుంటుంది.చంద్రవంక పోగానే నాయకుడు తిరిగి వస్తాడునుకుంటుంది.ఈ యెంకే దూరాన తనరాజు కేరాయి డౌనో ఈ రోజు తన రాత లేరాల పాలో అని గుబులు బిగులు పడుతుంది.చీమ చిటుక్కుమన్నా, ఆవు లంబాయన్నా, తులిసెమ్మ వొరిగినా, తొలిపూస పెరిగినా యేదో భయపడి భర్త క్షేమము గూర్చి భయపడే ఉత్తమాయిల్లాలు; అందుకనే చాటు నుండి భర్త క్షేమలాభాలు విచారిస్తుంటుంది.కాని సభల్లో కెక్కటానికి జంకుతుంది.ముందువెనక జన్మల సంగతులు జ్ఞప్తికి తెస్తే సిగ్గుపడటం, తెల్లతెలపోవటం, కంటనీ రెట్టటం ఈ యెంకికి చుక్కతోనే కొండ లెక్కొత్తునన్న నాయకుడికోసమై   ఉత్కంఠ  తో ఎదురు చూస్తుంటుంది.ఈ యెంకికే చంకలో నెక్కి సంబరాల పడే పిల్లోడు పుట్టింది.ఈ యెంకినే కొద్దిలో వరహాల కొడుకు నెత్తేవని నాయకుడు మారువేసముతో ఆశీర్వదించింది. ఈ యెంకితోనే తిరుపతి, భద్రాద్రి మొదలైన తీర్ధాలు నాయకుడు సేవించింది.ఈ యెంకీ ఆ యెంకి  ఒకటనటము కుక్కను గోవనటము, నక్కను సామజమనటము వంటిదే అవుతుంది.ఈ యెంకి “ఇయం గేహే లక్ష్మీరియ మమృత వర్తిర్నయనయోః  “అన్న భవభూతి వాక్యానికి ప్రమాణముగా ఎన్నదగిన యిల్లాలు.మొదటి యెంకి పడుచుతనపు చాపల్యానికి వశుడైన నాయకుని విసికించి విసికించి ఉసురోసుకున్న అభిసారిక. ఏ యెంకి సొంపు ఆ యెంకిదే అని నేనూ అంగీకరిస్తాను. కాని ఇద్దరూ ఒక యెంకేనని అంగీకరించను. ఇద్దరుయెకు  లుద్భవించటానికి కారణము పైనే మనవిచేసాను. మొదటి యెంకి అసలు తూరుపు కాపువాళ్ళ యెంకి. రెండవ యెంకి పేరుకు మాత్రమే యెంకి. (నిజాని కెవరో రసికు లూహించుకోవలసి) రెండవ యెంకి పేరుకు మాత్రమే యెంకి. నిజానికెవరో రసికు లూహించుకోవలసి వుంటారు. మొదటి యెంకినోట తూరుపుకాపువాళ్ళ యాసతెలు గొప్పింది గాని రెండవ యెంకి  (యిల్లాలెంకి అంటా నీ రెండవ యెంకిని) నోట బాగా ఒప్పలేదు. ఇల్లా లెంకికి చాటేలా మాటేలా? చిన్నతన మేలా సిగ్గేలా? తనస్వంత భాషలోనే ఔచిత్యమైన ఫణితిలోనే మాట్లాడవచ్చునే!ఈ విషయములో కవి బుద్భుదప్రాయమైన theatrical glamour కాశపడి యిల్లాలెంకికి అన్యాయం చేశాడు. లేక యిల్లాలెంకికి ఘోషా యేమైనా కల్పించే వుద్దేశంతో ఈ కృత్రిమ  నామరూపాలు తాకించి మరుగుపరచ జూచాడో యేమో! కవి ఇద్దరు యెంకులను కాను నాయికలుగా వర్ణించినందువల్ల   మహాదోషము వాటిల్లుతుందేమో అన్న భయముతో ఇద్దరూ వొకటే అని సమర్థించజూడటం వృధాశ్రమ, హిందూ నాయకుడికీ బహు నాయికా పరిగ్రహణము ధర్మశాస్త్రమే అంగీకరిస్తున్నది. అట్లాంటి సందర్భములో కావ్యధర్మవేత్తలు జంకవలసిన  అగత్యమేమి లేదు. జంకి అవకతవక సమర్థనలు చేయటానికి ప్రయత్నించటం, సరస్వతీ సాంత్వనం అనటం, యెంకి  ఉపాస్యదేవత అనటం హాస్యాస్పదమయిన విషయం. భీరుడి లక్షణం గాని ధీరుడి లక్షణం కాదు. కవి అవసరమైతే నూతన ధర్మశాస్త్రం, జయదేవాది మహాకవులలాగు సృష్టించాలి గాని సామాన్య శాస్త్ర నియమాల ధాటికి జంకిపోకూడదు.

      నాయకుడు అనుకూలుడే. దక్షిణ నాయకుడి చిన్నెలు కొన్ని వున్నవి.మొదట పడుచుతనపు పాలపొంగులో బాహ్య సౌందర్యాన్ని చూసి బ్రమిసి, బ్రమిసి, చివరకు అలాంటి చిత్త వికారానికి కారణభూతురాలైన నాయికను ‘రావొద్దె రావొద్దె రావొద్దె యెంకీ!ఆ పొద్దె

మన పొత్తు లయిపోయి నెంకీ!’అని యౌవన  చాపల్య నిరర్హణము గావించి ఇంత యింటి వాడై యీల్లాలి పవిత్ర ప్రేమకు జొక్కి కోమాళ్ళ తండ్రియై శుభములందే స్థితికి వస్తున్నాడని స్పుటమౌతున్నది.పడుచుతనపు చాంచల్యానికి “యేడుoటివే యెంకి” “యెఱ్ఱి సరదాలు”, “యెఱ్ఱి ముచ్చట్లు” మొదలైన పాటలు తార్కాణాలు, మిగిలిన పాటలలో నాయుడు బావ బావైనాడు. తూరుపు కాపు వాళ్ళల్లో  మొగుణ్ణి మామా అనే పిలవటం ఆచారంగాని బావా అని కాదు.బావా అనే ప్రయోగము కులీనులకు సంబంధించినదే.ఫరవాలేదు లెండి.క్రొత్త యెంకి నాయుడు బావల మధ్య కీచులాటలు ప్రణయ కలహాలే కానీ ప్రమాదకరమైనవి కావు.ఒకరినొకరు రహస్యంగా చూసుకుంటూ ప్రణాయానందం పొందుతుంటారు.నాయకుడికి యిల్లాలెంకితో జీవిత మహాసముద్రములోను జీవితోన్నత చలాల పైన విహారం చేతామనే వాంఛ మెండుగా వుండటం శుభసూచకమే.అల్లా విహరించదలచినవారు యీ తూరుపు కాపు వాళ్ళ వేసాలు మాని అచ్చమైన దంపతుల్లాగ 20 వ శతాబ్దములో విహరించవచ్చునే.కృత్రిమ రూపాలతో సంచరిస్తూ కృత్రిమ భాషలో సల్లాపాలు చేస్తూ అనుమానాని కాస్పదు లయ్యే కన్నా నిజనామ రూపాలతో నిజ వేష బాషాదులతో యథేష్టముగా తెల్లవాడి బావుటా యెగురుతున్నంత వరకు తిరగవచ్చునే! భయమెందుకు? “Come out and” “bask in the open sunshine of God’s love” “Truth is beauty, beauty truth,that is all ye know and need to know on earth” “సత్యమేవ జయతే నానృతం”, ఇల్లాలెంకి నాయుడుబావలు పుత్రపౌత్రాభివృద్ధి గాంచి,ఆయురారోగ్యవంతులై వర్థిల్లెదరు గాక.

     యెంకిపాటల వృత్తధోరణిని గూర్చి ఒకటి రెండు మాటలు చెప్పవలసి వున్నది.పాటలలో చాలా భాగము ద్విపదమాతృకగాను పునాదిగాను కలిగిన ఛందోరీతులలో రచింపబడినది.సామాన్యపు యేలపాటలు గాన ధోరణి.ఇందు సంగీత చాతుర్యమెక్కువున్నది.విజాతీయమైన గాన ధోరణి కూడా చాలా వున్నది.పామరులైన కాపు వాళ్ళ పాటల ధోరణి కాక రాగాలాపన మొదలైన సంగీతపు తళుకులతో కూడిన గానఫణితి.ఈ విషయము కవి తన పాటలు పాడుతూ ఉండగా విన్నవాళ్ళకు సుస్పష్టము.యెంకి పాటలు కేవలము ఆకాశం నుండి ఊడిపడ్డవనీ అపూర్వములనీ నేను అంగీకరించకపోయినా ఈ కాలములో బయట వెలువడుతున్న డొంక తిరుగుడు కవిత్వాల కన్నా చాలా సరసంగా ఉన్నవి.పూర్వపు గానఫణితులే కాలనుగుణమైన మార్పు జెంది యీ రూపంగా వస్తున్నవని,వీటివల్ల ఉత్తరోత్రా భాషకు మేలే కలుగుతుందని నా నమ్మకము.తాత్కాలికపు ఉద్రేకాల వల్ల వింత సమర్థనలు వింత ఖండనాలు బయలుదేరుతున్నా నిలిచేవి పాటలే గాని విమర్శనాలు కావు.విమర్శనాలలో వుండే వైపరీత్యాలు చూపించి యెంతవరకు గుణమో నిరూపించటమే ఈ వ్యాసకర్త  యొక్క సంకల్పము.అది యెంతవరకు నెరవేరిందో రసికులే నిర్ణయించగలరు.అభిసారికయిన తూరుపు వాళ్ళ యెంకికీ నాకు యేమి విరోధాలు కాని వైమానస్యాలూ లేవు కాని దాని నిజస్వరూపం రసికులకు వ్యక్తం చేసి ఇల్లాలెంకి యొక్క గుణగుణాలు ఇనుమిక్కిలిగా ప్రదర్శించటమే నా ఆశయము.ఈ పాటలలో మిత్రులూ , సహృదయులూ,విమర్శకులూ మొదలైనవారు సూచించి కావించిన మార్పులెన్నో వున్నవి.వాటిని గూర్చి వ్రాయటం కొంతవరకు Breach of truth అని వదిలివేసినాను. వయస్సులో కాస్త పెద్దవాడిని కనుక మావాడి పట్ల చిరంజీవి శబ్దమూ ఏకవాచకము ఉపయోగించాను.అది వాడికే శుభకరము.ఇక వ్యాసములో నా మిత్రులలో కొందరి వాక్యాలు విమర్శించే పట్ల కొంత చనువుగా వ్రాశాను. అందుకు నా మిత్రులు కినియక Sporting spirit లో వాటిని అంగీకరింతురుగాక అని ప్రార్ధన.పెద్దలయిన వారి వాక్యముల విమర్శించుపట్ల కూడా చమత్కారమే అర్థించినాను కాని అపహాస్యము కాదని మనవి. ఇల్లాలెంకి మోటురూపము వదిలి, నిజసుకుమార రూపముతో వెలువడవలెను. అల్లా వెలువడకపోతే అభినవ తెనాలి రామలింగడు “నాజుకు లేరయా నండూరి సుబ్బయా”అని గేలిచేస్తాడు.

      *    *   *

బసవరాజు వేంకటప్పారావు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *