శ్రీనివాస్ గౌడ్ గారి కథల పుస్తకం చేతికొచ్చిన దగ్గర నుంచి ఆపకుండా చదవాలని చాలా ప్రయత్నం జరిగింది. అయినా కథ వెనక ఒక్కసారి ఆగిపోయి మళ్లీ ఏదో మర్చిపోయినట్టు ఆ కాగితాన్ని వెనక్కి తిప్పి చూడటం, ఎక్కడో మన చుట్టూ మన కళ్ళముందే కదులుతున్న పాత్రలన్నీ మన ముందే మాట్లాడుకుంటూ వెళ్తున్నట్టు ఉంటాయి..
కొత్తగా ఏదో చెబుతున్నట్టేమీ ఉండదు, అలా అని కథేమీ మన ఊహకీ అందదు..ఇందులో ప్రత్యేకత భాష, మరియు ఎంచుకున్న ప్రాంతం పట్ల రచయిత స్పృహ చెప్పుకోదగ్గవి.
కథల్లోకి వెళ్తే…
కనుల చివర ఎక్కడో ఒత్తడికి గురి అయిన గుండె చప్పుడు ఏదో తడిగా తగులుతుంది.
కాసింత మట్టి వాసనల్లో నుండి నూనూగు
గరిక వాసనలు అద్ది వెళ్తుంటాయి.
కొరమీసాల కుమ్ములాటలు, చిన్న చిన్నగా అల్లుకున్న బంధాలమధ్య తండ్లాట ఎదురవుద్ది.
ఎందరో తల్లులు తమ రెక్కల్ని అడ్డుగా పెట్టుకుని తమ బిడ్డల్ని ఎలా కాపాడుకుంటూ వస్తున్నారో పీఠముడులన్నీ ఎట్లా కొంగున దోపుకుని తిరుగుతున్నారో లక్ష్మమ్మ పాత్రలో చెబుతూనే బాధ్యత లేని నాగయ్య వాలకాన్ని, కులం పేరు చెప్పకుండా మకిల అంటిన పంచాయతీ పెద్దల ఊసుల్ని పరిచయం చేసిన విధానం.. కథలోకి వేగంగా లాక్కెళ్ళిపోతుంది
మార్జినోళ్ళు అంటే ఏంటో అర్థం కాలా.. చూద్దాం అంటూ కదా మొదలెట్టా
కానీ కథ చదువుతూ ఉంటే మాత్రం కళ్ళ ముందు కదిలిన పాత్రల్ని చూసి అభివృద్ధి పేరుతో నగరం మధ్య జీవితాల్ని ఖాళీ చేపించి గీసిన మార్జిన్లే ఈకథ ఒక్కతాటిగా నిలబడకపోతే మార్జినోల్ల జీవితాలెట్లా గల్లంతయితాయో చెప్తూ కథలో సామాజిక స్పృహని ఎత్తి చూపిన తీరు నిజమే కదా అనిపిస్తుంది.
దేవుళ్ళ ఆటలో ఆర్భాటాల మధ్య నలిగిన సంధ్య అత్త జీవితానుభవం ఒకటైతే..
మనసున్న మనిషికి చీకటి జీవితాన్ని అంటించకూడదనుకునే భవానీ గడుసుతనం గురించి చదవాల్సిందే..
చీకటి నీడన లీల జీవితం క్షణాల్లో ఎంత నరకప్రాయం అయిపోయిందో కథ చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది.
తిరునాళ్లలో తిరుగాడే పోకిరి నాయాళ్ళ అడ్డా గురించి చెప్పినా.. రెటమతం మనిషి, వితండ వాదిలో కూడా ఆపద అంటే ఎంత విశాల హృదయం ఉంటదో చెప్పేస్తారు… వ్యవహార శైలి తెలియకపోతే మధ్యతరగతి జీవితాలు కూడబెట్టుకున్న పైసల్ని కాపాడుకోలేని కథల నడక బాగుంటుంది.
చీరాల రోడ్లో గల్లంతయిన గౌండ్ల సమాధుల్ని,, తులసమ్మ గొంతులో నిష్ఠూరాలిని ఒక తాటికి తేచ్చే కథచేయడం బాగుంటుంది.
మూగజీవాల్లో కూడా మనసు నొప్పిని చూసే రవణం పిన్ని కొడుకు లక్ష్మి కథ నిర్మాణం బాగుంటుంది..
గూడు చెదిరిపోయి రెక్క విరిగిన జీవితాలుంటాయి.. మత వివక్షల్లో యువతని ఎట్లా సాధనాలుగా మలుచుకుంటున్నారు కథగా మలిచిన తీరు బాగుంటుంది
ఏదేమైనా శ్రీనివాస్ గౌడ్ గారు మార్జిన్ లైన్ కి అండర్లో వుండే జీవితాల్లో వారు పొందే తృప్తిని అసంతృప్తిని పక్కన పెట్టి.. రియాలిటీ కి దగ్గరగా ఉండే జీవితాల్లోకి మనల్నీ లాక్కెళ్లిపోతారు.. కాస్త చెమట వాసనతో కష్టం తెలిసిన కలికుండలా కథలన్నీ కథలు చెప్తాయి..