ప్రొద్దున్నే, ఇంకా మసక చీకటుండంగానే, లేచి పాలు పితకడానికి గిన్నె తీసికొని , వెనుక తలుపు తెరిచి , చంద్రు వెలుపలికి వస్తూనే, దినమూ ‘కుయ్’ మైని, మై మీదికి ఎగిరి, నాకే రూబీ ఉండలేదు. ‘రూబీ, ఒరే రూబీ, ఎక్కడ్రా దొంగ నాయాలా’ – అనుకుంటూ వెలుపలికి వస్తూనే కోళ్ల గూట్లో నుండి కోళ్ల కూతలు వినిపించాయి. అక్కడేదో చూచి, గాబరపడి గుర్, గుర్ అని రూబీ నేల గీకుతా, అటువేపు మళ్ళీ. మళ్ళీ ముందుకూ, వెనక్కీ పోవడం కనిపించింది.
‘ఇయ్యాలకల్లా గూట్లో నుంచి దబ, దబ రెక్కలు కొట్టుకుంటూ ఎలపల కొచ్చే కోళ్లు, ఇంగా గూట్లోనే ఉండాయె’ అనుకొని, అంతలోనే , ‘అమ్మ ఇంకా యాల్నో లేసినట్లు లేదే’ అనుకుంటూ రూబీ ని దూరాన్నుంచే గదరి ఆ దిక్కుకు అడుగేసినాడు చంద్రు . అతను గదరినా ఏమీ పట్టించుకోని రూబీ గుర్ మాత్రం ఎక్కువైంది . ఈ సద్దు కు సుమతి కూడా పరుగెత్తుకొచ్చింది. చీకట్లో అక్కడేమవుతోందో సరిగా కనపడలేదు. కోళ్లు పంజరాల్లోంచి, మక్కెన గంపల్లోంచి బయటకొచ్చి కొక్కో , కొక్కో అని చెల్లా చెదురుగా అటూ, ఇటూ బిరబిర పరుగెత్తడానికి తన్నులాడుతున్నాయ్. గూటి తడికె జరపుతానే , బయటి కి రావడానికి కాచుకొని వుండిన పుంజులు రెండు పట పట రెక్కలు కొట్టుకుంటూ బయటికి పరుగెత్తికెళ్లాయ్. . ఆడే నిల్సుకొన్న సుమతి ని “బుడ్డి ఎత్తక రా, అదేమో సూద్దాం” అనిచంద్రు “రూబీ రా” అని పిలువసాగినాడు .చంద్రు ను చూసి ధైర్యం తెచ్చుకున్న రూబీ గూటి లోపల తల దూర్చి దేన్నో కరిచి పట్టుకొని లాగ సాగింది . అంతలో నే దీపం పట్టుకొచ్చిన సుమతి ఒక నిమిషం దిగ్భ్రమ చెందినా , రూబీ ధైర్యం వాళ్లకు ఆశ్చర్యం కలిగించింది. అది తల్లి కోడిని మింగడానికి పంజరం లో దూరిన పామును కరిచి పట్టుకొని సగం ప్రా ణం తీసేసింది.చంద్రు పక్కనే వున్న కట్టె తో ఒక్క ఏటు వేయగానే కుయ్యో అని అరుస్తూ నెత్తురు కారుతున్న పామును వదలి వెలుపలికి పారిపోయింది రూబీ .చంద్రు అదే కట్టెతో తోసుకుంటూ బయటికి తెచ్చి అటూ ,ఇటూ తిప్పి చూస్తే తెలిసింది అది గోధుమ నాగు పామని.చంద్రు అక్కడే వున్న ఒక బండ ఎత్తి పాము తల మీద వేసి చంపాడు. పెళ్ళాన్ని పిలిచి “సుమతీ ! కోళ్లు బయటికిడిసి తడి కేయ్. అమ్మ లేసిందేమో సూడు . టేమయితండాది , నేను దూడను వదుల్తాను” అని దాని తలుగు తీసేసినాడు . సుమతి గింజుకొంటున్న తల్లి కోడిని ఎత్తుకొని కుత్తుక దగ్గిర చిమ్ముతున్న నెత్తురు అక్కడే పడివున్న తుండు గుడ్డ తో తుడిచి , దాని నోరు తెరిచి రెండు , మూడు గుటకలు నీళ్లు పోసింది. గుటకేసిన కోడి తలను పక్కకు వాల్చింది. ప్రాణం పోలేదు ఇంకా . దాన్ని అక్కడే మక్కెన గంప కింద మూసిబెట్టి , తల్లి కనపడక, ఏమయిందో తెలియక అటూ, ఇటూ జీవ్, జీవ్ అని పారాడుతున్న కోడి పిల్లల్నన్నింటినీ ఇంకో గంప క్రింద మూసి పెట్టి , తడిక ముందుకు వేసి , ‘అత్త ఇయ్యాల్దాకా పండుకోదు గదా , ఇయ్యాల ఏమయ్యిండాది’ అనుకుంటూ చూడ్డానికి ఆమె గదికి పోయింది.
అప్పుడే నురగ పాలు క్యాన్లల్లో నింపి , సైకిలుకు కడ్తా చంద్రు, సుమతి ని పిలిచి “అమ్మ ఇంకా లెయ్యలా ….సూస్తివా … పాలుమాలిందో , ఏమో?” అని అడిగినాడు . ముందంకణం లో కసువూడుస్తూ ” ఎందుకో , నిన్నట్నుంచి మెత్తగుండారు. ఇప్పుడు లేపుదామని చూసిన్యా , లేస్తాల్యా … ఇంగాయింత సేపు పండుకోనిల్యే . నువ్ డేరీ కి పాలేసీ వచ్చేయాలకు సరిపోతారుల్యే . నువ్ పో . ” – అంటూ చీర పైకెత్తి నడుములో దోపి , ఇంటి ముందర కలాపి చల్లడం మొదలెట్టింది. చాలా పేద తనం లో పెరిగిన సుమతి ఈ ఇంటికి కోడలుగా రావడానికి కారణమే వాళ్ళ అత్త గంగమ్మ. ఐదేళ్ల కిందట మారెమ్మ పండగకు హిట్నల్లి కొప్పల్ లో పిన్నింటి కి వచ్చిన సుమతి , పిన్ని కూతురితో ‘చలివిండి’ తో హారతి ఇవ్వడానికి మారమ్మ గుడికి వచ్చింది. చూడ్డానికి అంతేమీ పుట్టువడి లేని సుమతి సన్నగా , పొట్టిగా ఉండేది. మామూలు నూలు లంగా వేసికొని , రెండు జడల్లో మల్లెపూలు ముడుచుకొని ‘చలివిండి’ కి అలంకరించిన పూలు సరిజేస్తున్నింది . అక్కడే వుండిన గంగమ్మ “ఎవరే ఈ పిల్ల సౌభాగ్యా?” అని అడిగితే , “మా పెద్దమ్మను హీరెకొప్పళ కు ఇచ్చినారు కదా ; ఆమె కూతురు ; ఎస్.ఎస్.ఎల్.సి డుంకీ కొట్టింది; రెన్నాళ్లు ఈడుండి పోనీ అని ఇడిసిపెట్టి పోయింది పెద్దమ్మ” అని మూతి తిప్పుకొని పోయింది ఆ పిల్ల. మాచంద్రుకు ఇట్లాటి పిల్లే కావాలని తీర్మానం చేసి , చెప్పంపిస్తే వాళ్ళ బీదతనం వల్ల ఇప్పుడే పెళ్లి చేయడానికి వీలు కాదు – అని తెలిసి గంగమ్మ ‘ ఆళ్ళు ఏమిచ్చే పనిల్యే; ఈ ఇంటికొ చ్చినప్పుడు , నేను మాత్రం ఏమి తెచ్చిన్యా ? అయినా ప్యాదరికం లోనే సంసారం ఈడ్చుకొచ్చి, ఇప్పుడు మారెమ్మ దయతో బాగుండలేదా ?’ అన్జెప్పి సుమతిని ఇంటికి తెచ్చుకుంది. అందుకే అత్తంటే సుమతి కి అమ్మన్నంత ప్రేమ.
మాఘ మాసపు చలిలో సైకిలు తొక్కొని మూడు మైళ్ళ దూరం లో వున్నడైరీ కి పాలు వేయడానికి వెళ్లిన చంద్రానికి పొలం గట్ల మీది నుండి వీచే చల్లగాలి గాని , పక్షుల కల,కలారావం గాని పట్ట లేదు. ఎందుకో అంతర్ముఖి గా వుండినాడు. అతని మనస్సునిండా అమ్మను గురించిన ఆలోచనే. వొళ్ళు వణికే చలిలో గూడా అతనికి చెమటలు పట్టాయ్ . డైరీ వస్తూనే , యాంత్రికంగా పాలు పోసి , ఒక్క ఊపున సైకల్లో వెనక్కి వస్తూనే….. కూతురు తల దువ్వి జడ వేస్తున్న సుమతి ని క్యాన్లు కడుగమని చెప్పి, మొగసాల దాటి ఇంట్లోకెల్లి అమ్మ కోసం వెతికాడు. అమ్మ గదిలో కెలితే మేలుకొనే వున్న అమ్మ గుడ్లప్పగించి పైకప్పు చూస్తూ పడుకొని వుంది. అది జూసి అతనికి పోయిన ప్రాణం లేచివొచ్చినట్లయింది. ‘అమ్మ ఎప్పుడూ పాలుమాలేదే గాదు. ఎట్టా పరిస్థితుల్లోగూడా ఆమె ఒళ్ళు సెడిపోయేదిగాదు; ఉన్నట్టుండి ఏమైందా’ అని దిగులు పడుతూ ఆమె పక్కనే కూర్చొని, “యాలమ్మా! ఏమైంది?” అని అడిగాడు. చంద్రాన్ని చూసి
”ఏం లేదు నాయనా! యాల్నో గుండెల్లో సులుక్కు మంటుండాది. …లేసే దానికే కాల్యా. ఇంకా రోన్సేపు పడుకుంటా. … సరిపోతాది “అని,
“పిల్లలు ఇస్కూల్ కి పోయిండారా?” అని అడిగింది గంగమ్మ.
“పోతాండారు” అనిచంద్రు చెప్పగానే
“ఆ మూలింటి నింగి వస్తాది. ఆరు నాళ్ళ ముందర వచ్చి పోయింది; వస్తే నన్నూటయాభై రూపాయలియ్యి. ద్యావుని పోటో ఎ న్కాలా కాగితపు సంచి లో సుట్టిపెట్ఠిన్యా … “అని మళ్ళీ వొళ్ళు వాల్చింది. ఇంట్లో, చేన్లో ఎప్పుడూ పని వెతుక్కొని చేసే అమ్మ ఇలా పడుకొని వుండడం అతనిలో సంకటం రేపింది.
సన్నని, ఎత్తైన గంగమ్మ కొప్పు బిగించి కట్టి, పాదరసం మాదిరి అటూ, ఇటూ తిరుగు తూ ఉంటే చూడ ముచ్చట. ఏరోజూ, ఏ పని చేయడానికి కూడా ఆమె వెనకడుగు వేయలేదు. చంద్రు అయ్య భైరే గౌడ పోయి నాల్నించి, సంసారం పగ్గాలు పట్టుకొని అందరినీ ముందుకు నడిపించిన గట్టి ఇల్లాలు. ఇద్దరు కూతుళ్లకూ పెళ్ళిజేసి, కొడుకు చంద్రానికి సుమతి ని కోడలుగా చేసికొని, సుమతి పుట్టింటి వాళ్ళు ఆర్థికంగా అంత సదుపాయంగా లేనందువల్ల, కోడలి ఇద్దరు పిల్లల ప్రసవాన్ని, బాలింతతనాన్ని కూడా స్వయంగా తను ఒక్కతే నిభాయించింది. ఎంత కష్టమొచ్చినా, ఎవ్వరి దగ్గిరా చేయి చాచని స్వాభిమాని. భైరే గౌడ చనిపోయినప్పుడు ఇద్దరు కూతుళ్లు హై స్కూల్ లో చదువుతుండినారు.చంద్రు ఐదో తరగతి లో వుండినాడు. మొగుడు చనిపోయినా క్రుంగిపోక ఇంటి బాధ్యత చేపట్టింది. పిల్లలకు అన్నం, బట్టల కొరత లేకుండా సాకింది. రెండు ఆవులు పెంచుకుని, మోయలేనంత గడ్డి కోసుకొని , మగవాడిలాగా మోసుకొని వచ్చి ఇంటికి తెచ్చి వేసేది. ఆమెకు రాని పనే లేదు. పొలం పని లో తీరిక దొరికినప్పుడంతా అప్పడాలు, వడియాలు, మజ్జిగ మిరపకాయలు చేసి కొంత కూతుళ్ళకు పంపించేది. తెరపి దొరికినప్పుడు పాత బట్టలతో సంచి కుట్టి మనుమళ్లకు ఇచ్చి ఆనందించేది. పోయిన వానా కాలం లో కప్పు మీది పది పెంకులు ప గిలిపోతే, వాటిని సరిపడచడానికి మూలింటి శంకర్ని పిలిస్తే , అతను ‘ఈరోజు-రేపు’ అని సాకులు చెప్పి దాటవేస్తుంటే, తానే స్వయంగా నిచ్చెన వేసికొని పైకెక్కి పెంకులు సరి చేసింది. ఆ రకంగా ఏదో పని చేస్తూ ఉత్సాహంగా వుండే గంగమ్మ, ఒక్క సారిగా మంపరం గా పడుకోవడం, కొడుకు కోడళ్ళిద్దరినీ దిగులు పడేలా చేసింది.
సంజె పొద్దులో డైరీ కి పాలు వేయడానికి వెళ్ళినప్పుడు రోడ్డుకు రెండు పక్కలా బుల్ డోజర్లు మన్ను తోడి ఒక పక్కకు వేయడాన్నిచంద్రు గమనించాడు. సైకిల్ను కష్ట పడి తోసుకొని పోయి, గుంత మీద వేసిన పలక మీద సైకిల్ క్రింద పడకుండా సర్కస్ చేసి , రోడ్డు దాటి క్యాన్లు మోసుకొని పోయి , పాలు వేసి వచ్చాడు. అందరికీ వచ్చిపోయేందుకు ఇబ్బందయ్యేది చూసి ‘సర్కారోళ్లకు బుద్ధే ల్యా ; దారి పెద్దగ సేస్తాం ; బై పాస్ రోడ్డు ఏస్తాం అంటారు. మా కష్టాలు పట్టిచ్చుకునేదెవరు?’ అని తిట్టుకుంటూ ఇంటికొస్తూనే సుమతి ని “అమ్మ ముద్ద మింగెనా; ఏంజేస్తంది?… రోంత బాగుందా , ఎట్లా? “ అని అడిగాడు. “ఏమో తెల్ల్య; మంకు గుండారు” అని జవాబిచ్చింది సుమతి. “పిల్లలు ఇస్కూల్ నుంచొచ్చి ఏమో రాసుకుంటున్నోళ్లు, వాళ్ళ జేజి పడుకోండేది జూసి ‘ జేజీ ! కత చెప్మని రోన్త సేపు పీడిచ్చిరి … ఇంతసేపూ; ఐనా ఆమె లేయల్యా….. ఆకలి లేదు, బువ్వొద్దు అన్న్యారు. పొద్దుగాల్నే పాలేసి వస్తానే, రోన్త ఆస్పత్రికి పిలచకపోండి” – అనింది . వాళ్ళ నాయన లాగే గట్టిగుండే చంద్రు చూడ్డానికి మొరటుగా కనిపించినా మనసు మెత్తన . అమ్మ చాలా మజ్జు గుండడం అరిగించుకోలేకపోయాడు; రాత్రంతా ఇదే చింతతో సతమతమయినాడు.
ఇంకా తెల్లారక ముందే చీకట్లో డైరీకి పాలు పోసొచ్చి, అమ్మ గదికి పోయినాడు… పక్కనే కూర్చొని , తల నిమురుతా “అమ్మా! ఏమయిండాదే నీకు, యాలిట్లా పడుకోనే వుండావ్ … ఉన్నట్లుండి ఏమాయనే ? ఏమి మింగక, తాక్క పడుకొండేది యాలా అని తెల్యక పాయ. నిన్న రొమ్ము నొప్పి కొడకా … అంటివి గదా, ఆస్పత్రికి పోయేస్తాం పద, లేయి “ – అన్నచంద్రు మాటలకు “ఏం కాలా నాయనా ! ఆస్పత్రికి పోయేచ్చేదేమొద్దు…. సరిపోతాది “- అంది. దాంతో కోపమొచ్చి చంద్రు “అయ్యో! ఒక సారి పోయేస్తాం పద” అని విసుక్కునే టప్పటికి అన్య మనస్కంగానే లేచి ముఖం కడుక్కొని బయల్దేరింది గంగమ్మ .
సర్కారీ ఆస్పత్రికి పొతే పాలు పితికే వేళ కు రాలేమని ప్రైవేట్ ఆస్పత్రికి తీసికెళ్ళినాడు. అక్కడ జనం ఎక్కువగానే ఉండడం చూసి, సర్కారీ ఆస్పత్రికి పోయేదే మేలా అని అనుకునే లోపల రిసెప్షనిస్ట్ తెల్లగా , మెరుస్తున్న విరిసిన పెదవులతో నవ్వగానే, వెలుపలికి పోయే మనస్సు మారి, కాళ్ళు ఆమె వైపే లాక్కెళ్లాయ్. ఆమె చెప్పినట్లు ఆరు వందలు కట్టి, అమ్మ పేరు రాయించి, కుర్చీలో కూర్చున్నాడు. , పదే, పదే తన అద్దాలు సరి చేసికుంటూ, పెదాల మీద రంగును చూసికుంటూ వంతు వచ్చిన వాళ్ళ పేర్లు పిలిచి లోనికి పంపిస్తోందామ్మాయ్. మామూలుగా పేట లో అమ్మాయిలు పెదాలకు ఎర్ర రంగు వేసికునేదే చూసిన చంద్రుని కి , ఆ అమ్మాయి పెదాల కు వేసికున్న గాఢమైన నీలి రంగు విచిత్రమనిపించి , ఆ అమ్మాయి నే దిట్టించి చూడ్డం మొదలెట్టాడు. దాన్ని గమనించిన ఆ అమ్మాయి భృకుటి ముడివేసి గుర్రు మని చూడ్డం తో తబ్బిబ్బయి మొహం పక్కకు తిప్పికొన్నాడు. అంతలోనే నీలి రంగు పెదాల అమ్మాయి “గంగమ్మ ఎవరు?” అని అడగడం తో, పళ్లికిలించి అమ్మను లోనికి తీసికెళ్ళాడు. డాక్టర్ అన్నీ నిదానంగా అడిగి తెలిసికొని, కొన్ని పరీక్షలు చేసి చూసి…… “ఏం లేదు. సరిగా భోంచేసినట్లు లేదు. అందుకే సివియర్ ఎసిడిటీ అయ్యింది. అందువల్లే గుండెల్లో నొప్పి కూడా వచ్చినట్లుంది. ఎందుకైనా మంచిది, ఈ .సి. జి. చేయించండి “అని చీటీ రాసి ఇచ్చాడు. ఎలాగు వచ్చాము గనుక ఈ .సి. జి. చేయించే వెళదాం అని తీర్మానించుకుని, అక్కడికి వెళ్లి అక్కడ జనసమ్మర్థం చూసి గాబరి పడ్డాడు చంద్రు. పిల్లలు, పెద్దలు అందరూ చీటీ చేత పట్టుకొని, వాళ్ళ బారి వచ్చేంత వరకూ జాతక పక్షుల్లాగా కాచుకు కూర్చున్నారు. గంగమ్మ పేరు వచ్చేటప్పటికి మధ్యాహ్నం రెండు గంటలయింది. మళ్ళీ ఆస్పత్రికి వాపసు వెళ్లి డాక్టర్ కు రిపోర్ట్ చూపిస్తే , డాక్టర్ “ ఏమీ కాలేదు. టైం ప్రకారం భోంచేయమనండి. మనసులో ఏదైనా చింత ఉందేమో కనుక్కోండి. దానికేమైనా పరిష్కారం చూడండి. ఒంట్లో ఇంకేమీ నలత లేదు “అని ఓ రెండు రకాల మాత్రలు రాసిచ్చినాడు. బస్సులో కూర్చొని వెనక్కి వచ్చేటప్పుడు చంద్రు “ఏమమ్మా నీ సింత ? దేని గురించి?? గమ్మున లోపల్లోపలే దిగులుపడుతే , మాకైనా ఎట్దెలుస్తది” అని వాపోతే , “దాచి పెట్టుకునేట్లేం లేదురా బిడ్డా ! అట్లాటిదేం లేదు. నాకేంగాదు. సరిపోతాది. నీ క్యాల దిగులు” అని కొడుకుని సముదాయించింది . రోడ్డు కు రెండు పక్కలా బుల్ డోజర్ నేల త్రవ్వేది చూసి , ఒక్క క్షణం కళ్ళనీళ్లు పెట్టుకొని , చీరె కొంగు తో తుడుచుకుంది.
బై పాస్ రోడ్డు చేస్తామని తమ పొలం సగం తీసుకుంటున్నట్లు తెలుపుతూ నోటీసు పంపించి , సర్వేయర్ పొలంలో రోడ్డుకు వదలాల్సిన స్థలానికి గురుతులు వేసి పోయినప్పుడు చంద్రు కు ఆదుర్దా కలిగింది. దానికి బదులుగా నష్ట పరిహారం ఇస్తారని తెలిసి మనసు కాస్త కుదుట పడింది. ఆ విషయమంతా నెలకిందటే అమ్మకు చెప్పాడు
బై పాస్ రోడ్డు సొడ్డు తో ఊర్లో రోజూ ఏదో ఒక రామాయణం. ఇంకా చేతికే రాని పరిహార ధనం పంచుకునే విషయం పై, ఒక అన్నదమ్ముల మధ్య గొడవ చేతులు దాటి తార స్థాయి కి చేరి, అక్కడే పడివున్న మచ్చుతో నంజప్ప తన అన్న నింగే గౌడు చేయి నరికినాడు. అతన్ని పెద్దాస్పత్రిలో చేర్చినారు. నరికిన చేయి ని ఆస్పత్రికి తీసు కొని పోయినా, దాని అతికించేందుకు వీలు కాదని, దాన్ని చెత్త కుండీలో పారేసినారు. విషయం తెలిసి పోలీసోళ్ళు నంజప్పను జైల్లో వేసినారు. రామలక్ష్మణుల్లాగా కలసిమెలిసి వున్న అన్నతమ్ములు కొట్లాడుకుని చచ్చి పోయింది చూళ్లేక రంగేగౌడ వాళ్ళ పొలం లో చెట్టు కు ఉరేసుకుని చనిపోయినాడు. ఇలాంటివే కాదు; కొంత మంచి కూడా జరిగింది. పటేలోళ్ళ ఇంట్లో శంకరన్న కూతురు శాంభవిని చూసి, పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుని వుండిన వరుని వైపు వాళ్ళు – వరదక్షిణ గురించి న చర్చలు సక్రమం గా జరుగలేదని అలిగి , పెళ్లి ఆగిపోయి ఆరు నెలలయింది. బై పాస్ రోడ్డు వల్ల నష్ట పరిహారం మీది ఆశతో, కొందరు మధ్యవర్తుల ప్రమేయం తో ఆగిపోయిన పెళ్లి మళ్ళీ సరి పోయింది. అంతే కాకుండా, చిన్న చిన్న విషయాలకు దూరమైన – ఊరిలోని బంధువులు, అన్నీ మరిచి, మళ్ళీ ఒకరింటికిఒకరు వచ్చిపోయేది ఎక్కువయింది. మొత్తం మీద బై పాస్ రోడ్డు చెడ్డోళ్లను గూడా మంచోళ్ళను చేసి ఒక రకమైన ఇంద్రజాలమే చేసింది.
బస్సు వూరు దగ్గిరకు వస్తూ ఉండగా “ కాదురా అబ్బీ ! మన భూమి, ఆస్తంతా అర్ధంబర్ధం పోతే , ఏమిరా అబ్బీ! చేసేది? సర్కారుకు మన పొలమే కావాల్సి వచ్చెనా?” అని మొదలు బెట్టింది గంగమ్మ. ఏదో తెలియని ఆవేశం ఆమెను ముంచెత్తింది. చివరగా “అబ్బీ! ఎం .ఎల్.ఏ శంకరప్ప కు సెప్పి ఇది నిలిపెక్కాదా …… పటేలు కు బాగ తెలుసంట కదా ఆయన? “ అనింది. “ లేదు తల్లో! అది అయ్యేల్యా…. మందొక్కరిదే గాదు, రోడ్డు పోయే దారిలో ఎవరెవరి భూములుంటే ఆయన్నీ పొయ్యేదే. అందుకే గదా పరిహారం అని వాళ్ళు దుడ్లి స్తాండేది. దుడ్లొస్తే ఆయగదా! ఇంగ్యాలా యోసెన జేసేది.” అన్నాడు చంద్రు. “దుడ్లతోనే అన్ని సరిపోవురా అబ్బీ! ఆ పొలం లో మీ అప్పని గోరీ వుంది. ఆ జమీన్ తో ఇద్దరు ఆడపిల్లల పెళ్లి జేసిన్యా. నీ బతుక్కి ఒక దారి జేసిన్యా. మీ యప్పడు నన్ను లగ్గమాడినప్పుడు, మీ సిన్నాయన లందరూ, మీ యప్ప అందరికంటే పెద్దోడని, మాగానంతా వాళ్ళు తీసేసుకోని , అన్నీ తుప్పలున్న ఈ మెట్ట భూమి ఇచ్చిన్న్యారు . పాపం, మీ యప్ప – తోడబుట్టినోళ్లు బాగుంటే సాలని, మనకెట్లైతే అట్లా అని , కాయకష్టమే నమ్మి , ఈ బీడు భూమి తవ్వి, దున్ని సొంపుగా పంట పండేట్లా జేసిన్యాడు. ఎన్నో నాళ్ళు చేను లోనే గుడిసేసుకొని కావలికాస్తా పండుకొంటిమి. ఆయన పోయినాక ముగ్గురు పిల్లలను సాకి సంతరియ్యాలంటే ఈ పొలమే దేముడు. అబ్బీ! నువ్వు మీ అక్కలు ఆ చెట్టుకు ఉయ్యాలేసుకొని ఆడిన ఆటలు, కుసీ గా ఏసిన కేకలు పొలం నిండా వుండాయిరా. దీనికంతా వాళ్ళిచ్చే చిల్లర దుడ్లు తూగుతాయా రా…. అయినా, ఆల్లకు ఇయన్నీ ఏం లెక్క. ఇయన్నీ యోసనజేసి మన వొళ్ళు చెడుపుకోవడం తప్ప ….” కంటినిండా నీళ్లు తిరిగాయ్ ఆమెకు. పొలం దున్నుతుంటే నాగలి నుండి వదిలించుకు పోయిన ఎద్దు ను పట్టుకోబోతే, ఎద్దు కొమ్ముతో పొట్టలో గుచ్చడం వల్ల, పొలం లోనే గిలగిలా తన్నుకొని చనిపోయిన అయ్య మతికొచ్చి కళ్ళముందే నిలిచినట్లైందిచంద్రు కు. అమ్మను ఊరడించేలోగా వూరే వచ్చింది. బస్సు దిగిన ఇద్దరూ – రోడ్డు కిరుపక్కలా భూమి తోడి, పెద్ద చెట్లను వేర్లతో సహా పెకలించి క్షణ మాత్రం లో తుండు, తుండు చేస్తున్న యంత్రాలను చూస్తూ- ఇంటి వైపుకు అడుగులేశారు. అంతలో కొడుకును ఆపి గంగమ్మ “అబ్బీ! ఎట్లైనా పొలం లో కంబాలు ఏసినారంటివి గదా, ఒకసారెల్లి సూశోస్తాం పదరా….. మనస్స్యాలనో పీకుతా వుంది.” అని పొలం దిక్కు మొగం చేసింది. పొలం దగ్గిరవుతూనే 24 కొబ్బరి చెట్లు, మర్రి చెట్టు, బైరేగౌడ గోరీ -అన్నీ చేర్చుకుని -ఇంకా ముందుకే -గుర్తు గా నాటిన స్తంభాలు కన్పించాయ్. ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా గంగమ్మ సమాధి ముందర కూర్చొని మనసు తీరా ఏడ్చింది. ఏం చెయ్యాలో తెలియని చంద్రు, కాస్సేపు ఏడ్చిన తరువాత ఊరడిల్లుతుందనే అభిప్రాయం తో అమ్మను తన పాటికి తనను ఏడవనీ అని వదిలేసాడు. అక్కడే వున్న మర్రిచెట్టు ఊడను పట్టుకొని ఒరిగి నిల్చుకున్నాడు. ఆమె దుఃఖం తగ్గకపోగా ఎక్కువవడం చూసి “అమ్మా! పాలు పితికే టేమ్ ఆయనే; లెయ్” అని లేపి తీసుకెళ్లి పోయాడు. అతను ఇల్లు చేరే లోపల సుమతి దూడను వదలి…. వీళ్ళ కొరకే వేచివుండింది. “నువ్ రోన్సేపు పండుకో; మనసుకు సమాధానమయితాది. నేను పాలు పితికి డేరికి వేసొస్తా” అని చెప్పి కదిలాడు. బకెట్ నిండి పోయింది కూడా గమనించకుండా పరధ్యానంగా పాలు పితుకుతున్న అతన్ని చూసి సుమతి “ఏలిట్లా ! బకెట నిండినా ఇంకా పితికాతావుండావు; అయ్యో రామా! ఎక్కడుంది ధ్యాస” అని కిసుక్కుమని నవ్వింది.
“ఆ! ఏమీ లేదే అమ్మీ!” అని పాలు కారియర్ కు నింపి “అమ్మను రోంత జూస్కో ; యాల్నో ఆమె మనసు సరి లేదు” అని డేరీ కి పోయినాడు.
ఇదైన కొన్ని రోజుల్లోనే, ఒక రోజు సాయంకాలం ఇంటికి వచ్చిన చంద్రు అచ్చెరువొందాడు. అమ్మ తన మనుమలు ఇద్దరికీ ఏడు కొండల రాజకుమారి కథ చెబుతూ వుండింది. మొగసాల్లోకే నాటుకోడి కూర ఘమ, ఘమలు తెలుస్తున్నాయి. చంద్రు కు అమ్మ చేసే నాటుకోడి కూర చాలా ఇష్టం. ఆమె చేతిలో ఏం మంత్రముందో, సగం కొబ్బరి కాయి తురిమి, తగినంత నాటు నూగులు కలిపి , కాస్త ఎండు మిరపకాయ్ , వెల్లుల్లి ఏసీ రోట్లో రుబ్బుతా ఉంటే … ఇంట్లోంతా ఘమ,ఘమలు, నోట్లో నీళ్లు. కుతకుతలాడుతున్న నీటికి ఈ మసాలేసి, ముక్కలు, ముక్కలు చేసిన కోడి మాంసం ఏయగానే, దాని వాసన పక్కన వీధులదాకా వ్యాపించేది. ఇరుగుపొరుగు వాళ్ళను పిలిచి కోడికూర తినిపిస్తోండిరి.
‘అబ్బా! ఆమె మనసు సరిపొయిన్ది ‘ అని సంతోష పడ్డాడు చంద్రు. “ఏంది మ్మా ఇసేసం; బల్ వాసన పెట్టిండావ్” అంటే
“అదేరా అబ్బీ! పొలిమేర మారమ్మకని పుంజును వదిల్న్యాం గదా? మంగళవారం ఆడికి పోయేదానికయితుందో లేదో అని ఆ తల్లి పేరుసెప్పి కోసేస్తిని” అని చిన్నగ నవ్వింది . కానీ ఆ నవ్వులో ఏదో వెలితి కనిపించింది.
“పోనీలే, నువ్ సరిపోయినవ్ గదా; ఆసాడం వచ్చిన్యాక ఇసేసంగా పూజ వుంటాదిలే అప్పుడు పోయస్తాంలే; రా తిందాము … అందరం కూసోని తిని ఎన్ని నాల్లాయే “ అన్నాడు. వెనక వీధి లో కుక్కలు కుయ్యోమనేది విని సుమతి కి భయ మయ్యింది. మొన్న రంగేగౌడ ఉరేసుకున్న ఎనకటి రోజు ఇట్లే మొరిగినాయి.
‘ఈ పాడు కుక్కలు ఏల ఇట్లా కుయ్యోమంటయ్యో, దాన్ల కొంపకూలా, పడి సాయా ‘ అని తిట్టుకుంటూనే అందరికీ వడ్డించింది.
చంద్రు గురక సద్దుకో, కుక్కలు కుయ్యోమన్నెందుకో సుమతికి నిద్ర పట్లేదు. కుక్కలు ఇలా కుయ్యోమనేది ఎవరి చావుకో సూచన అని ఆమె ప్రగాఢ నమ్మకం.
ఎప్పటిలాగే డైరీ నుండి వెనక్కి వచ్చేటప్పుడు, సైకిల్ పొలం దిక్కు తిప్పాడు చంద్రు. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన పొలం చూసి వాడి ముఖం మాడిపోయింది. నాయన సమాధి గాని, చెట్ల గుర్తు గానీ తెలియనంతగా సమతలమయ్యింది పొలం. బరువైన మనస్సుతో సైకిల్ ఎక్కి ఇంటి దారి పట్టాడు. ఇల్లు కాసింత దూరం లో ఉండంగానే పిల్లి ఒకటి ఎదురొచ్చింది. ‘థూ, పాడుగానూ … అపసకునం ‘ అనుకుంటూ సైకిల్ కొద్దిసేపు నిలిపాడు. తరువాత భయపడుతూనే వెళ్లిన అతనికి ఇంటి ముందు జనం గుమికూడి వున్నది చూసి, నుదుట చెమటలు పట్టాయి. మొగసాల్లోనే అమ్మను పడుకోబెట్టినారు. సుమతి తలకొట్టుకుంటూ ఏడుస్తోంది. అతడి వూహ తప్పు కాలేదు. ఒక్క క్షణం కళ్ళు చీకట్లు కమ్మినట్లై అక్కడే కుప్పకూలినాడు.