పునరుజ్జీవించిన కళాకారులు – ప్రయాణికులు

Spread the love

            ఆంధ్రాయూనివర్సిటీ ఫైన్‌ ఆర్ట్స్‌ డిపార్ట్‌మెంట్‌కి మొదటి హెడ్‌ ఆఫ్‌ ద డిపార్ట్‌మెంట్‌ (1976-88)గా పన్నెండు సంవత్సరాల పాటు సేవలు అందించిన ప్రొఫెసర్‌. వై.వి. లక్ష్మయ్య గారికి, రోమ్‌ నగరంలో ఏడు సంవత్సరాల పాటు ఆర్టిస్టుగా పనిచేసిన అనుభవం ఉంది. 1984వ నంవత్సరంలో నాకు, డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం ఇచ్చి, నా దేశ దిమ్మరితనాన్ని తాత్కాలికంగా తగ్గించి, నా జీవితానికి ఒక మార్గాన్ని చూపించిన లక్ష్మయ్య మాష్టారు గారిని నిత్యం స్మరించుకొంటాను.

            రోమ్‌ నగరంలోని మ్యూజియంలు, చిత్ర, శిల్బ కళాసంపద గురించి నిత్యం నాకు చెబుతుండేవాడు ఆయన. ఇటలీ దేశంలో గో చదువుకోవాలని నాకు ఎంతో కుతూహలంగా ఉండేది. ఉద్యోగంలో చేరటంతో ఆ అవకాశాన్ని కోల్పోయాను. అందువలన లక్ష్మయ్య గారి ఉపన్యాసాలు నాకు చాలా ఇష్టంగా ఉండేవి.

            ప్రపంచ ప్రఖ్యాతి చెందిన శాస్త్రవేత, శిల్పి చిత్రకారుడు, వాస్తు శిల్పి,సంగీతకారుడు, అపర మేధావి అయిన లియోనార్డో డావిన్సి (1452-1519), మహాశిల్పి  మైకేలాంజిలో (1475-1564), దేవుడు లాంటి చిత్రకారుడు రాఫెల్‌ (1483-1520)లాంటి ధన్యజీవులు నివసించిన రోమ్‌ నగరం గురించి ఆయన వర్ణిస్తూ ఉంటే, అవన్నీ నేను ఎప్పుడు చూస్తానా అనుకొనే వాడిని.

            ఇటాలియన్‌ సాంస్కృతిక పునరుజ్జీవనానికి తమవంతు కృషి చేసి, ఇతర దేశాల వారిని చైతన్య పరచిన శక్తిమంతులు తిరిగిన ప్రదేశం రోమ్‌ నగరం. స్థల,కాలాదుల పరిధుల్ని దాటుకొని, చరిత్ర తెరల్ని చీల్చుకొంటూ ఆ రోజుల్లోకి మరలా వెళ్ళగలిగితే ఎంతో బాగుంటుంది అని కళాకారులందరూ ఊహించుకొంటారు.

            మైకేలాంజిలో పాలరాతి శిల్పాన్ని చెక్కుతూ ఉంటే, ఆ వేగానికి పైకి లేస్తున్న ధూళి, ఒక మంచు తుఫాన్‌ని తలపించేదనీ, డావిన్సి రెండు చేతులతోనూ రాయగలగటమే కాకుండా, రెండు బ్రష్‌లు తీసుకొని వాటితో రెండు భిన్నమైన చిత్రాలు గీసేవాడనీ, వృత్త లేఖిని లేకుండానే బ్రష్‌తో సంపూర్ణ వృత్తాన్ని గీయగలిగినవాడు రాఫెల్‌ అనీ, లక్ష్మయ్య వివరిన్తుంటే మా అందరికీ ఆశ్చర్యమనిపించేది. అలాంటి గొప్ప వారికి జన్మనిచ్చిన రోమ్‌ నగరాన్ని చూడాలని ఎప్పటి నుండో ఆశ.

            సాంస్కృతిక పునరుజ్జీవనానికి త్రిమూర్తులుగా ఈ ముగ్గురూ మానవ ఇతిహాస చరిత్రలో నిలిచిపోయారు. మోనాలీసాని చిత్రించిన డావిన్సి; ఇరవై నాలుగు సంవత్సరాల వయసులోనే 6x 7 అడుగుల పాలరాతి ‘పీతా’ (Pieta ) శిల్పాన్ని చెక్కిన మైకేలాంజిలో; “స్కూల్‌ ఆఫ్‌ ఏథెన్సు” అనే చిత్రంలో అనాటి మేధావులందరినీ మనకి చూపించిన రాఫెల్‌, ఈ ముగ్గురూ జీవించిన రోమ్‌ నగరాన్ని ఎంతో ఇష్టపడ్డాను. చీకటినిండిన మధ్య యుగాల నాటి ఆలోచనలకి తెరదించి, వెలుగులు చిమ్మే ఆధునిక యుగానికి ఆవ్వానం వలికిన రినైజాన్సు (Renaissance) ఉద్యమంలో మానవతా వాదానికి అగ్రస్థానం ఇచ్చిన బొకాషియో, డాంటే, మాకియవల్లీ లాంటి వారికి జన్మనిచ్చిన దేశం ఇటలీ. అలాంటి అద్భుతమైన దేశాన్ని చూడగలిగే అవకాశం రావటానికి ఇన్నాళ్ళు పట్టింది నాకు.

            స్వీడన్‌లో నాకు పరిచయం అయిన బెర్నాదెత్తే మేడం వల్లనే ఇదంతా సాధ్యమైంది. “ఆది! నీకు మా అన్నయ్య సహాయం చేస్తాడు ఇటలీ దేశంలో” అని ఆనాడే చెప్పింది. నేను యూరప్‌ యాత్రకి ప్లాన్‌ చేస్తున్నాను అని తెలియజేయగానే, “నేనూ మా అన్నయ్యను చూసి చాలా కాలమైంది. అయితే ఇద్దరం రోమ్‌లో కలుద్దాం” అని మెసేజ్‌ పెట్టింది మేడం. నేను నార్వే దేశంలో బయలుదేరిన రెండు గంటల తర్వాత మేడంని రోమ్‌ ఎయిర్‌పోర్టు (లియోనార్డో డావిన్సి)లో కలిశాను. “ఆది! యు ఆర్‌ లక్కీ’ అంటూ ఎంతో సంతోషపడింది.

            “వియాకాసియా” కొండ ప్రాంతంలో మేము ముందుగానే బుక్‌ చేసిన గెస్ట్‌ హౌస్‌కి చేరుకొన్నాం బస్‌ మీద. పరిసరాల్లో అన్నీ ఎత్తుగా గొడుగులాగా విస్తరించి ఉండే పోప్లార్‌చెట్టు. అయితే దూరంగా ఊరించే ఎర్రరంగు చర్చి డోమ్‌ల మీదకే మనసులాగుతూ ఉంది.

            2013వ సంవత్సరం జనవరి నెలలో మేడమ్‌ విశాఖపట్నంలో ఉన్నప్పుడు అనుకొన్న నా ఇటలీ ప్రయాణం త్వరలోనే నిజమైనందుకు ఆనందించాను. ఆవిడ నా కంటే నాలుగు సంవత్సరాలు పెద్ద. ఆమె నాకు అక్కయ్యతో సమానం.

            తెల్లారి పదిగంటల కల్లా రోమా టెర్మినీ (రైల్వేస్టేషన్‌)కి చేరుకొని అక్కడ నుండి, మెట్రో మీద ఫ్లామినివో, సాగ్నా స్టేషన్ల మీదుగా వెళ్ళి, మేడం గారి అన్నయ్య పనిచేస్తున్న శాన్‌ జియోవాని చర్చి ప్రాంతాల్లోకి చేరుకొన్నాం.

            వెడల్పయిన, పురాతన రోమన్‌ రోడ్డమీద నడుస్తూ ఉంటే ఒక చారిత్రక అనుభూతికి లోనయ్యాను. ప్రస్తుతం రోడ్లన్నీ విపరీతమైన రద్దీగా ఉన్నాయి. స్థానికుల కంటే విహార యాత్రికులే ఎక్కువ. ఎండాకాలం కావటంతో అందరూ హాలిడేకి వచ్చారు. దాదాపు ఇండియాలో ఉన్న వాతావరణమే ఉంది. నల్లజుట్టు స్థానికులు, చదరంగా ఉన్న ఇంటి పైకప్పులు, విపరీతమైన ఎండలు.

            ఎత్తెన ఒక పురాతన ఆర్చిని దాటుకొని ‘శాన్‌జియోవాని’ చర్చిలో అడుగుపెట్టాం. బెర్నాదెత్తే అన్నయ్య మాకు స్వాగతం పలికాడు. “ఐయామ్‌ జాన్‌, మీ ప్రయాణాల గురించి, ఇండియా గురించి మా చెల్లెలు ఎన్నో విషయాలు చెప్పింది. గ్లాడ్‌ టు సీ యూ” అంటూ వారి చర్చి గురించి ఇటాలియన్‌ – ఇంగ్లీషు భాషల్లో ఉన్న రెండు చిన్న బ్రోచర్లు అందించాడు.

            కాస్తంత పొట్టిగా, తెల్లగా, చర్చి యూనిఫాంలో ఉన్న పాస్టర్‌ జాన్‌ పట్ల నాకు గౌరవం కలిగింది. అంత వయసులో కూడా ధృఢంగా ఉన్నాడు. టంగ్‌మంటున్న స్వరం.

            నన్ను హాల్లో కూర్చోమని చెప్పి, వాళ్ళ అన్నయ్యతో పాటుగా ప్రార్ధనా మందిరంలోకి వెళ్ళింది మేడం.

            ఈ చర్చి చాలా పెద్దది. అద్భుతమైన శిల్ప సౌందర్యం, ఎత్తైన సీలింగ్‌. మెయిన్‌ హాల్లో ఉన్న పన్నెండు స్తంభాలకి, పన్నెండు అపోస్తలుల (Apostles) పాలరాతి శిల్పాలు అమర్చారు. ఒక్కొక్కటి పన్నెండు అడుగుల ఎత్తులో ఉన్నాయి. అద్భుతమైన వాటి శైలి, రినైజాన్సుని తలంపుకి తెచ్చింది. ఐరోపాలోని అతి పురాతన కాథలిక్‌ చర్చి ఇది. కీ॥శ॥ నాలుగో శతాబ్దంలో మొదలు పెట్టిన దీని నిర్మాణం 18వ శతాబ్ధం వరకూ సాగింది. అందుకేనేమో అన్నారు. “Rome was not built in a day” అని.

            ఇంతలో మేడం బయటికి వచ్చింది. “ఆది! నువ్వు ఇక్కడ ఉండేందుకు పర్మిషన్‌ దొరికింది. అయితే ఐదు రోజులకి మాత్రమే” అని చెప్పింది. ఇక్కడ ఒక నెల రోజులు అయినా ఉందామనుకొన్నాను. కొంచెం నిరాశపడ్డాను. మళ్ళీ మేడం అందుకొని, “మనం ఉంటున్న వియా కాశియా ప్రాంతాల్లో ఉన్న ప్రొవిన్షియల్‌ చర్చిలోనే ఉండాలి నువ్వు” అంది.

            “దానికేం ఇబ్బంది లేదు. రోమ్‌లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. నా కలల నగరాన్ని పరిచయం చేశారు. ఇది నాకు చాలా ఎక్కువ” అని చెప్పగానే కాస్త నవ్వు ముఖం పెట్టింది.

            “ఆది! నువ్వు ఒకే చోట ఉండే బదులుగా దేశం అంతా తిరగటం మంచిదే అనుకో. రేపే నేను ఇంటికి వెళ్ళాలి. తొంభై రెండు సంవత్సరాల వయసున్న మా నాన్న గారు ఫ్రాన్సు నుండి నా ఇంటికి వస్తున్నారు”.

            “మేడం! మీరు నాతో కనీసం మూడు రోజులైనా ఉంటారనుకొన్నాను”.

            “రోమ్‌ నాకు కొత్తది కాదుగా! You better discover the city by yourself ” అంటూ తనతో పాటుగా తెచ్చుకొన్న చిన్న గైడ్‌, మ్యాప్‌ నాకు గిఫ్ట్‌గా ఇచ్చింది మేడం.

            అలా కబుర్లు చెప్పుకొంటూ చర్చి బయటికి వచ్చి బంగ్లాదేశ్‌ వారి షాపులో రెండు పిజ్జాలు తిని, కొలీషియం మాన్యుమెంట్‌ వైపుగా దారి తీశాం. మేడం నాతో ఈ ఒక్కరోజు ఉంటుంది. రేపటి నుండి ఒక్కడినే ఉండాలి.

            ఇటలీలో ఉన్న నా స్నేహితులకి నా గురించి ఎలా తెలియజేయాలా? అని ఆలోచిస్తూ ముందుకెళ్ళాను. పదిహేను నిముషాల తర్వాత వచ్చిన మలుపులో పెద్ద గుండ్రని, శిథిలావస్థలో ఉన్న ఎత్తైన నిర్మాణం కళ్ళ ముందుగా మెదిలింది. ఆ దారిలో రెండు వైపులా చారిత్రక నిర్మాణాలే. అన్ని చోట్లా విపరీతంగా యాత్రికులే.

            “అదే కొలీషియం. దీన్ని ఫ్లావియన్‌ యాంఫీ థియేటర్‌ అని కూడా అంటారు” మేడం వివరించింది. మానవ చరిత్రలో అతి ఘోరమైన గ్లాడియేటర్‌ క్రీడలు జరిగిన ప్రదేశం ఈ కొలీషియం. వందల మంది వర్యాటకులు దేన్నో వెతుక్కొంటున్నట్టుగా హడావుడిగా తిరుగుతున్నారు.

            రోమన్‌ రాజులకి వ్యతిరేకంగా ఉన్న క్రిష్టియన్‌ పౌరుల్ని చంపకుండా, వారిని ఈ కొలీషియం లోనికి తీసుకు వచ్చి బంధిఖానాలో పెట్టి, ఆకలితో ఉన్న సింహాలకి ఆహారంగా వేసేవారు. ప్రాణ భయంతో వాళ్ళు పరుగులు తీస్తుంటే సింహాలు వెంటబడి వారిని చీల్చి వేసేవి. ఈ కృూరమైన వినోదాన్ని ప్రజలకి చూపించి, భయభ్రాంతుల్ని చేసి, అందరూ రాజుకి అణిగి మణిగి ఉండాలి అని శాసించే వాళ్ళు. మూడు అంతస్థుల్లో నిర్మించిన ఈ భవనాల ఎత్తు యాభై మీటర్లు. దానికి ఉన్న ఆర్చిలు మొత్తం ఎనభై.

            ఈ బంధీలకి కొన్నిసార్లు కత్తులు ఇచ్చి “ఎవరు గెలిస్తే వారిని విడుదల చేస్తాం” అని ప్రకటించేవారు. ఆ విధంగా వారి మధ్యలో వైరాన్ని రగిల్చి రక్తపాతాన్ని సృష్టించేవారు. ఆ గెలిచిన వాడి మీదకి మరో బంధీని పంపి, అదే మాట మళ్ళీ చెప్పేవారు. ఇలా కత్తులతో ద్వంద్వ యుద్ధాలు చేసుకొనేవారినే గ్లాడియేటర్‌ అని పిలిచేవారు.

            రోమన్‌ రాజుల నిరంకుశ పరిపాలనా విధానాల మీదకి ప్రజల దృష్టి వెళ్ళకుండా వారికి ఇలాంటి వినోదాన్ని అందించేవారు. ఇలాంటి “ఆటస్థలాలు” రోమ్‌ సామ్రాజ్యం అంతటా ఉన్నాయి. రాజధాని నగరం కాబట్టి ఇక్కడ అన్నిటి కంటే పెద్ద కట్టడాన్ని నిర్మించారు. ఆర్కియాలజీవారు ఐదారు భాషల్లో దీని చరిత్ర అంతా పెద్ద బోర్డుల మీద రాసి ఉంచారు.

            క్రీ॥శ॥ 80వ సంవత్సరంలో టైటస్‌ అనే రోమన్‌ రాజు ఈ భవనాన్ని ఉపయోగంలోకి తెచ్చాడట. ఆ సందర్భంగా వందరోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో ఐదువందల జంతువులని వధించి, ఆ రక్తమాంసాలతో ప్రజలకి విందులు చేశారట. వృత్తాకారంగా ఉన్న ఈ స్టేడియంలో డెబ్బై వేల మంది కూర్చొనే అవకాశం ఉంది. స్పార్టకస్‌ లాంటి యుద్ధవీరులు ఇక్కడ చేసిన తిరుగుబాటు గురించి ప్రపంచానికి తెలుసు.

            అయితే క్రమేణా మార్పులు జరిగి కీ॥శ॥ 380 వ సంవత్సరం నాటికి రక్తపాత వినోదాలు అంతరించాయి. చివరి కాన్‌స్టాన్ టైన్ రాజు క్రిష్టియన్‌ మతాన్ని ఆదరించి, గ్లాడియేటర్‌ క్రీడలకి శాశ్వతంగా స్వస్తి చెప్పి మంచి పరిపాలకుడుగా పేరు తెచ్చుకొన్నాడు.

            కొలీషియం బయట ఏర్పాటు చేసిన లాన్‌ మీద గులాబీ తోటల్ని పెంచుతున్నారు. అవి చూడగానే నాకు అనాటి రక్తపు మడుగులు గుర్తుకి వచ్చాయి. వారి ఆత్మశాంతి కోసం  ప్రజలు అర్పించిన వుష్పగుచ్చాలు అయి ఉంటాయి అనుకొన్నాను.

            “ఆది! ఇవన్నీ నువ్వు తర్వాత చూద్దువు గానీ త్వరగా బయలుదేరు!” అంటూ మేడం నన్ను వేగంగా నడిపించింది.

            “క్రైమ్‌ రేటు విపరీతంగా ఉంది. జాగ్రత్త అనే బోర్డులు ప్రతిచోట పెడుతున్నారు. నార్వేతో పోల్చుకుంటే సిగరెట్లు తాగే అమ్మాయిలు తక్కువే. బస్‌కీ, మెట్రోకి పనికి వచ్చే పాసులు కొనుక్కొని వెనక్కి తిరిగి మరలా శాన్‌జియోవాని చర్చి దగ్గరకి వచ్చాం. నగరంలోకి ఎనభై సంవత్సరాల వయసున్న అజ్‌నవూర్‌ అనే ఫ్రెంచి  గాయకుడిని ఆహ్వానించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరోవైపు “లేడీగాగా” షో కోసం టిక్కట్ట్లు అమ్ముతున్నారు. ‘గే విలేజ్‌’ గురించి పెద్ద ఫ్లెక్స్‌ బోర్డులతో ప్రచారం చేస్తున్నారు.

            మెట్రో మీద ఇంటిదారి పట్టాం. కంపార్టు మెంటుల్లో కొందరు గాయకులు ‘లైవ్‌ షో’ ఇస్తున్నారు. వారితో పాటుగా చిన్నపాటి స్టీరియోసెట్‌ ఉండటం వలన దూరానికి కూడా వినిపిస్తున్నాయి వారి పాటలు. ఇలాంటి గౌరవనీయులైన గాయక భిక్షకులని ఐరోపా అంతటా చూస్తున్నాను.

            స్థానిక ఇటాలియన్లు ఇంగ్లీషులో మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నారు. మెట్రో మారి బస్సెక్కాం; అన్నిటికి ఒకే టిక్కట్టు కాబట్టి. నా పక్క సీట్లో ఉన్న రోమన్‌ జంటిల్‌మెన్‌ని పరిచయం చేసుకొన్నాను.

            “మీ దేశపు రామాయణం మాకు చాలా ఇష్టం” అన్నాడు.

            “డాంటేకి ఇండియాలో చాలా మంది అభిమానులు ఉన్నారు” అని నేను చెప్పాను.

“కాళిదాసు, అజంతా చిత్రాలు మాకు తెలుసు!” అతడు అన్నాడు.

“మీ మైకేలాంజిలో, బొకాషియో మా కెంతో ఇష్టం” అన్నాను నేను.

గెస్ట్‌హౌసుకి చేరుకొన్నాక, ప్రావిన్సియల్‌ చర్చిని వెతికాం. దగ్గరలోనే కన్పించింది.

చర్చి చిన్నదే అయినా చుట్టూ ఉన్న తోట నాకు బాగా నచ్చింది. ఇక్కడ  ఐదు రోజులు గడపటం చాలా సులభం. ఒక యువకుడు వచ్చి నా గది చూపించి “బోనస్సీరా’ (Good Evening) చెప్పాడు. నా బ్యాగ్‌ జాగ్రత్తగా పెట్టుకొన్నాను.

“ప్రొఫ్‌ ఆది! నీ ఖర్చుల కోసం ఈ రెండు వందల యూరోలు పక్కన ఉంచుకో. యాత్ర పూర్తయ్యాక ఎలాగూ లిడింగో వస్తావు కదా! అప్పుడు మనం ఐలాండ్‌ క్రూయిజ్‌కి వెళదాం” అని చెప్పి నాలుగు ఎర్రనోట్లు నా జేబులో పెట్టింది మేడం.

            నా వద్ద మూడు వందల యూరోలు సిద్ధంగానే ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందీ లేదు. ఆవిడ ఫ్లైట్‌ ‘రేపుటదయం తొమ్మిది గంటలకి “ఆది! సెయింట్‌ పీటర్స్‌లో పీతా (Pieta)ని చూడటం మర్చిపోవద్దు” అంటూ నాకు బై బై చెప్పి నడుచుకొంటూ వెళ్ళిపోయింది. నేను చర్చిలోనే ఆగిపోయాను.

            ఇటలీలో ఉన్న నా స్నేహితులకి ‘ఇ-మెయిల్‌’ చెయ్యాలి. రోమ్‌ నుండి వెళ్ళాక నాకు ఎనిమిది రోజులు ఇటలీలో ఉండే అవకాశం ఎవరిస్తారో తెలియదు. గత రెండు నెలల నుండి మిత్రులకి నా యాత్ర గురించి చెప్పాను. అందరికంటే బాగా రెస్పాండ్‌ అయిన వ్యక్తి అత్తిలివో. ఆయన రైల్వేలో పనిచేసి రిటైర్‌ అయ్యాడు. రిసెప్షన్‌లో ఉన్న నెట్‌ నుంచి ఆయనకి మెయిల్‌ చేశాను. నా ఫోన్‌కి రోమింగ్‌ పెట్టుకో లేదు. ఇన్‌కమింగ్‌ కాల్స్‌ ఫ్రీగా వచ్చే మెసేజ్‌ సౌకర్యం మాత్రమే ఉంది. గంట తరువాత నాకు ఫోన్‌ వచ్చింది. “డియర్‌ ఆది! నీకు రోమ్‌లో ఇబ్బందిగా ఉంటే రేపే బయలుదేరు. నేను పడోవా స్టేషను వరకూ వస్తాను” అని చెప్పటంతో నాకు ధైర్యం వచ్చింది. నన్ను ఎప్పుడూ, కనీసం స్కైప్‌లో కూడా చూసి ఎరగని ఒక విదేశీయుడు నన్ను తన ఇంటికి ఆహ్వానించటం చాలా ఆశ్చర్యంగా ఉంది.

            అత్తిలివో ఉండేది పడోవా దగ్గరలోని విసెంజా సిటీలో. రిటైర్‌ అయ్యాక చాలా పెద్ద ఇల్లు తీసుకొన్నారట. “పిల్లలకి రెక్కలొచ్చి తలా ఒక దిక్కుకి ఎగిరిపోయారు” అని చెప్పింది వాళ్ళావిడ. వెనిస్‌ నగరం కూడా అక్కడికి చాలా దగ్గరే. మార్కోపోలో సొంత ఊరు చూసే అదృష్టం కలుగుతుంది.

            నాకు మరొకరు గుర్తుకి వచ్చారు. ఆమె పేరు క్రిష్టీ. ఢిల్లీలోని ఫ్రెంచి ఎంబసీ స్కూల్లో టీచర్‌. ఆమె విశాఖపట్నం వచ్చినప్పుడు నా వద్ద కొన్ని పెయింటింగ్స్‌ కలెక్ట్‌ చేసుకొంది. కళాభిమాని. రెండు నెలల క్రితం నాకు మెయిల్‌ చేస్తూ “డెలివరీ కోసం ఇటలీ వెళుతున్నాను. ఆరు నెలల వరకూ ఇండియాకి రాను” అని రాసింది. మరి ఇటలీలో ఆమె ఎక్కడ ఉండేది నాకు తెలియదు.

            వెంటనే ఆమెకు మెయిల్‌ పెట్టాను. ఆవిడకి కుక్కలంటే ఎంతో ప్రేమ. నిజాముద్దీన్‌లో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వారి బెడ్‌రూంలో మూడు తెల్లని శునక రాజాల్ని చూశాను.

            తెల్లారి నేను మొబైల్‌ చూసుకొంటే అందులో క్రిష్టీ ఇచ్చిన మెసేజ్‌ ఉంది. “లుంగోటవేరీ, 150, బజర్‌ 23, రోమ్‌ సిటీ.” చాలా బాగుంది. క్రిష్టీ ఇక్కడే రోమ్‌ నగరంలోనే ఉందన్నమాట. మేడం ఇచ్చిన మ్యాప్‌లో ఆ అడ్రసు, మెట్రో నెంబరు వెతికి పట్టుకొని ఒకటిన్నర యూరోతో బులుగు రంగు టిక్కట్‌ తీసుకొని బయలుదేరాను. అడ్రసు తెలుసుకోవటం కష్టమైంది. లుంగోటవేరీ అంటే ‘టైబర్‌ నది వొడ్డున’ అని అర్థం. ఏ వైపుగానో చెప్పలేదు. నేను ఫోన్‌ చేద్దామంటే వీలుకాలేదు. ఒక షాపులో కుర్రాణ్డి అడగ్గానే అతడు మాట్లాడి నన్ను ఆ రోడ్డు వరకూ దించి వెళ్ళాడు.

            ఆ ఇంటి తలుపు తెరవగానే చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నాకు ఆహ్వానం పలికింది నా బొమ్మలే.

            “హాయ్‌ ఆది! మేము ఢిల్లీ నుండి వస్తూ నీ పెయింటింగ్స్‌ కూడా తెచ్చుకొన్నాం.” అంటూ ఎత్తుగా ఉన్న తన కడుపు మీద తడుముకొంటూ, నాకింకా రెండు వారాల పాటు ఈ బాధ తప్పదు” అంటూ నవ్వుకొంది. ఆమె భర్త నాకు వెల్‌కం చెప్పాడు. నేను వెళ్ళేటప్పుడు వొట్టి చేతులతో వెళ్ళకుండా 12 x 12 అంగుళాల సైజులో నేను కొత్తగా వేసిన డ్రాయింగులు రెండు తీసుకెళ్ళాను. “ఈ చిన్న బహుమతి మీ కోసం” అంటూ క్రిష్టీకి ఇచ్చాను.

            “ఆది! నీకు తెలిసిన మంచి ఇండియన్‌ పేర్లు నాలుగు చెప్పండి. మా పాప కోసం” అన్నారు ఆ దంపతులు. నేను కాసేపు ఆలోచించి “రాణి, దేవి, సాహితి, కీర్తి”  అని చెప్పాను.

            “నేను కూడా ఒక్కసారి నెట్‌లో చూస్తాను” అంటూ వెంటనే ‘ఐ ఫోన్‌” ఓపెన్‌ చేసింది.

            లంచ్‌ వారింట్లోనే చేశాను. మరో ఇద్దరు స్రీలు కూడా ఉన్నారు ఇంట్లో. నేను బయలుదేరబోతుంటే క్రిష్టీ భర్త నా దగ్గరగా వచ్చి “మీరు కూడా ఈ చిన్న బహుమతిని తీసుకోవాలి అంటూ నాకు వంద యూరోల నోటు అందించాడు. అతనికి మనస్సులోనే కృతజ్ఞతలు తెలియజేసుకొన్నాను. నేను చర్చి గదికి చేరేసరికి రాత్రి ఎనిమిది గంటలయ్యింది.

            నా చేతిలో ఇంకా నాలుగు రోజులు ఉన్నాయి. వీటిని జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అనుకొన్నాను. తెల్లారి పదకొండు గంటలకల్లా మేడమ్‌ ఇచ్చిన నింగిల్‌ పేజీ మ్యాప్‌ తీసుకొని, మేము ఇద్దరం వెళ్ళిన రూట్‌లోనే, ఆ నెంబర్లు అన్నీ జాగ్రత్తగా గుర్తు పెట్టుకొంటూ వెళ్ళి శాన్‌ జియోవానీ దిగి, కొలీషియం దారిలో ముందుకెళ్ళి, అక్కడ ఉన్న ట్రేజాన్‌ స్థంభం వద్దకి త్వరగా చేరుకొన్నాను. క్లాస్‌రూంలో విద్యార్థులకి నేను ఐరోపా కళా చరిత్ర పాఠాలు చెబుతున్నప్పుడు వర్ణించిన బ్రేజాన్స్‌ కాలమ్‌, ముఫ్పై ఐదు మీటర్ల ఎత్తులో కళ్ళముందు కన్పించగానే విస్తుపోయాను.

            ట్రేజాన్‌ రాజు డేషియన్‌ యుద్ధాల్లో(A.D . 101 – A.D 106) విజయం సాధించినందుకు చిహ్నంగా ఈ స్థంభాన్ని చెక్కించాడు. క్రీ॥శ॥ 133 నాటికి దీని మీద శిల్పాలు చెక్కటం పూర్తవుతుంది. దీని వాస్తు శిల్పి అపోలో దారోస్‌ దెమాస్కస్‌. డేసియన్‌ యుద్ధాలకి సంబంధించిన దృశ్యాలని ఆ స్థంభం చుట్టూతా శిల్పాల్లో చూపటం దీని ప్రత్యేకత. వాటిని కొలుచుకొంటూ పోతే ఆరువందల ఇరవై ఐదు అడుగుల పొడుగు ఉంటాయి. అ దృశ్యాల్ని ఫోటో తీసి ప్రదర్శన కోసం ఏర్పాటు చేశారు.

            ఆ పరిసరాల్లో అన్నీ చారిత్రక నిర్మాణాలే. రోడ్డుకి అవతలి వైపున తెల్లని పర్వతం మాదిరిగా, చాలా ఎత్తులో రెండవ విక్టర్‌ ఇమ్మానుయెల్‌ మాన్యుమెంట్‌ మెరిసిపోతూ ఉంది.

            రెండో విక్టర్‌ ఇమ్మానుయెల్‌ (1820 – 1878) అంటే ఇటలీ ఏకీకరణ కోసం శ్రమించిన యుద్ధవీరుడు. ఇటలీకి మొదటి రాజుగా పట్టాభిషేకం చేసుకొన్నవాడు. అతని పేరు మీద నిర్మించిన ఈ భవనం అంతా ఒక మ్యూజియంలాగా ఉంటుంది. దాదాపు ఇటలీ చరిత్ర అంతా ఇక్కడే భద్రపరచబడింది.

            రోమ్‌ నగరం అంతా చిన్న కొండల మీదే నిర్మించబడింది. ఆ కొండలు మొత్తం ఏడు. మన తిరుపతి గుర్తుకొచ్చింది. ఈ రోమ్‌ నగరం క్రీ॥పూ॥ 753వ సంవత్సరంలో రోములస్‌, రేమస్‌ అనే అన్నదమ్ముల చేత నిర్మించబడింది అని ఒక పురాణం చెబుతూ ఉంది. ఆ అన్నదమ్ములకి ఒక ఆడ తోడేలు తన పాలు ఇచ్చి పెంచిందనే గాథ కూడా ప్రచారంలో ఉంది. ఆ గాథని వర్ణించే శిల్పాలు నగరంలో అనేకచోట్ల ఉన్నాయి. ముఖ్యంగా టైబరు నది మీద ఉన్న వంతెనకి రెండు ప్రక్కలా ఐదు అడుగుల ఎత్తులో నిలబడి ఉన్న “తోడేలు పాలు తాగుతున్న రోములస్‌, రేమస్‌ శిల్పాలు’ కనిపిస్తాయి.

            ట్రేజాన్‌ స్థంభం పక్కగా సాగిపోయే పెద్ద రోడ్డు నేరుగా పియజా దెల్‌ పాపాలో వరకూ పోతుంది. ఈ మార్గాన్ని వియాదెల్‌ కోర్సో అంటున్నారు. ఆ చివర వచ్చే పాపాలో వద్ద లియోనార్డో డావిన్సి మ్యూజియం ఉంది. ఈ మధ్యదారిలో యాత్రికులని ఆకర్షించి, డబ్బులు చేసుకొనేందుకు వందలమంది కాచుకొని కూర్చున్నారు. గాలిలో తేలిపోయే స్వామీజీలు (వాళ్ళు కూర్చొన్న ఇనుప దిమ్మ కనిపించకుండా దాన్ని ఒక డిజైన్‌ గుడ్డతో కప్పుతారు) ఆ దారిలో ఎక్కువ.

            రోమ్ లోని చాలా ప్రదేశాల్లో గతకాలపు నిర్మాణాలూ, నమకాలీన భవనాలు కలసిపోయి జీవిస్తున్నట్లుగా ఉంటాయి. అలా చేయటం వలన పురాతన నిర్మాణా లకి యాత్రికుల తాకిడి ఎక్కువైనా, అవి ప్రాణంతో ఉన్నట్లుగా ఉంటాయి. మరింత శిథిలంకాకుండా చూసుకోవచ్చు.

            ఇటలీ నుండి మనదేశానికి వచ్చిన నికోలో కోంటి (1395-1469) అనే ప్రయాణికుడు హంపీ విజయనగరాన్ని రోమ్‌ నగరంతో పోల్పాడు. రోమన్‌ వారి నాణేలు దొరకని భారతదేశ తీరం లేదు. నౌకల మీద రోమను దేశీయులు తరచుగా ఇండియాకి వచ్చేవారు ఆరోజుల్లో.

            అదే దారిలో లియోనార్డో డావిన్సి మ్యూజియం చేరుకొన్నాను. అయన ఒకప్పుడు అనాటమీ పాఠాలు ఎక్కడ నేర్చుకొన్నాడో, ఎక్కడ శవాల్ని పరీక్షించి అధ్యయనం చేశాడో, అదే భవనాన్ని ప్రస్తుతం అతని మ్యూజియంగా మార్చారు. పిండోత్పత్తి గురించి ఆయన చేసిన పరిశోధనలు ఈనాటి వైద్య శాస్త్రవేత్తలకి పాఠాలుగా ఉన్నాయి. ఆ రోజుల్లోనే డావిన్సి వ్యతిరేక దిశలో అక్షరాలని రాయగలిగేవాడు. వాటిని అద్దంలో చూసుకొని చదువుకోవాల్సి వచ్చేది. విమానాలని కూడా డిజైన్‌ చేశాడు. చిత్రకారుని కంటే శాస్త్రవేత్తగా గుర్తింపు తెచ్చుకొన్న డావిన్సి, అరవై ఏడు సంవత్సరాలకే మరణించటం ప్రపంచానికి పెద్ద లోటు.

            ఆ సాయంత్రం నేను వెళ్ళే దారిలో ఒక చోట ముస్సోలినీ మాన్యుమెంట్‌ చూశాను, బైబరు నది ఒడ్డు మీద. ప్రస్తుతం అక్కడ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మించారు. మన  Flying Sikh (Milka Singh) 1960వ సంవత్సరంలో రోమ్‌ ఒలంపిక్స్‌లో పాల్గొనటం గుర్తుకి వచ్చింది.

            చర్చిలో నేను ఉంటున్న గదులు చిన్నవి. చైనాలోని మోనాష్టరీలో ఉన్నప్పటి రోజులు మననం చేసుకొన్నాను. ప్రార్ధనలు ఇక్కడ కూడా చేయించేవారు, భోజనాలు చేసే ముందుగా. వారి మనోభావాల్ని గాయపరచకుండా ఉండేందు కోసం “Be  a Roman in Rome”అనుకొని, ప్రార్ధనలు పలక్కపోయినా లేచి నిలబడి, మనసులో మాత్రం “Be a human everywhere”అనుకొనేవాడిని.

ఆ రాత్రి డిన్నర్‌ సమయంలో ఒక వెనిస్‌ మాంక్‌ కలిశాడు.

“మీ వెనిస్‌లో మార్కోపోలో మెమోరియల్‌ లేదా అతని నివాసం ఎక్కడ ఉందో చెప్పగలరా?” అని అడిగాను.

“మల్లిబ్రాన్‌ అనే పాత సినిమా హాలు పక్కన ఉందని విన్నాను. దాని పక్కన ఒక బ్రిడ్జి కూడా ఉంటుంది”.

            “మరి, అతని పేరు మీద మరేదైనా మెమోరియల్‌ ఉందా?

            మా నగర విమానాశ్రయానికి ‘మార్కోపోలో’ అనే పేరు ఏనాడో పెట్టుకొని ఆయన్ని గౌరవించారు.

            మార్కోపోలో ఇంటిని ఎప్పుడు చూద్దామా అనే ఆత్రుత నాలో ఎక్కువైపోతూవుంది.

            మన రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలోని వేటపాలెం దగ్గర ఉన్న మోటుపల్లి ఓడరేవుని దర్శించుకొన్న మార్కోపోలో చరిత్ర అంతా చిత్రాల్లో వేసి, వెనిస్‌లో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయాలని ఒకప్పుడు అనుకొన్నాను.

            “మీరు వెనిస్‌ వెళ్ళే పనైతే అక్కడ చర్చిలో రెండు రోజులు ఉండే ఏర్పాటు చేయగలను” అని హామీ ఇచ్చాడు మిత్రుడు.

            “ముందు నేను విసెంజాకి వెళ్ళాలి. తరువాత మీతో మాట్లాడుతాను” అని అతని మొబైల్‌ నెంబరు తీసుకొన్నాను.

            మనం ధైర్యంగా ముందుకి పోతూ ఉంటే మనకి సహాయం చేసే వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు అని పూర్తిగా నమ్మకం కుదిరింది నాకు.

            ఈ రోజు మైకేలాంజిలో పీతా విగ్రహం చూడటానికి సెయింట్‌ పీటర్స్‌ బాసిల్లికాకి బయలుదేరాను. ఇటలీలో అన్నిటికన్నా గొప్ప నిర్మాణం అది. వాటికన్‌ సిటీ అందం అంతా ఇక్కడే ఉంది. ఆ చర్చిని అతి సుందరంగా డిజైన్‌ చేసిన వారిలో డొనాతో బ్రమాంటే, మైకేలాంజిలో, రాఫెల్‌, బెర్నిని ముఖ్యులు. దీని పాడవు ఏడు వందల ముఫ్పె అడుగులు, వెడల్పు ఐదు వందలు, ఎత్తు నాలుగు వందల యాభై రెండు అడుగులు ఉంటుంది.

            వాటికన్‌ సిటీలో ఉన్న ఈ అద్భుతాన్ని చూడటానికి సంవత్సరం పొడవునా ప్రజలు వస్తూనే ఉంటారు. రోజుకి కనీసం పదిహేను వేల మంది ఆ పరిసరాల్లో తారట్లాడుతూ ఉంటారు. ఎండాకాలంలో అయితే ఎనభై వేల మంది వరకూ ఉంటారు. అందుకేనేమో “All roads leads to Rome” అన్నారు.

ఇలాంటి గొప్ప కట్టడాన్ని క్రీశశ॥ 1506వ సంవత్సరంలో మొదలుపెట్టి 1626 వ సంవత్సరం నాటికి పూర్తి చేయగలుగుతారు. ఈ నిర్మాణానికి మూలం సెయింట్‌ పీటర్‌ సమాధి. గలీలి ప్రాంతానికి చెందిన పీటర్‌, క్రీస్తుకి ఉన్న పన్నెండు మంది శిష్యుల్లో మొదటివాడు. మొదట్లో అతడు చేపలు పట్టుకొని జీవించేవాడు.

ఆ తరువాత శిష్యులందరికి నాయకత్వం వహించి రోమ్‌లో మొదటి పోప్‌గా అంగీకరించబడతాడు. రోమన్‌ రాజైన నీరో పరిపాలన కాలంలో ఆత్మార్పణ చేసుకొన్నాడు.

అందువలన రోమ్ నగరంలోనే అతడికి సమాధిని నిర్మించారు. సెయింట్‌ పీటర్స్‌ చర్చిలో అతడి కంచు విగ్రహం “స్వర్గ ద్వారాలకి తాళాలు పట్టుకొని ఉన్నట్టుగా” ఉంటుంది.

            క్రిష్టియన్‌ ప్రపంచంలో ఇలాంటి పెద్ద కాథలిక్‌ చర్చి మరెక్కడా లేదు.

            చర్చి పై భాగాన ఉన్న అర్ధచంద్రాకారపు గోడమీద బెర్నిని డిజైన్‌ చేసిన నూట నలభై పాలరాతి విగ్రహాలు ఉన్నాయి.

            అయితే భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన మధురై దేవాలయం కూడా అదే కాలంలోనే (1623 – 1655) నిర్మించబడింది. అయితే మధురై గోపురం ఎత్తు నూట డెబ్బై అడుగులు మాత్రమే.

            నేను ఇంత గొప్ప చర్చిని చూసి ఆనందిస్తున్న సమయంలో ఇక్కడ జరిగిన ఒక బాధాకరమైన సంఘటన గుర్తుకొచ్చింది.

            “స్త్రీలు చర్చిలో పాటలు పాడకూడదు” అనే నియమం ఉండేది, మధ్యయుగాల నాటి ఐరోపా దేశాల్లో. అందువలన మగవాళ్ళు మాత్రమే పాడేవారు. అయితే వారికి యవ్వన దశ  దాటాక వారి స్వరం ఖఠినంగా మారిపోవటాన్ని గమనించిన చర్చి వారు, ఒక అమానుషమైన ఆలోచన చేశారు.

            నిరు పేదలుగా, అనాధలుగా ఉన్న మగ పిల్లల్ని చేరదీసి, వారికి సంగీతం నేర్పించి, వారు యవ్వన దశకి చేరబోయే ముందుగా వారి వృషణాలని తొలగించేవారు.

            ఇలా చేయటం వలన ఆ యువకుల స్వరపేటికలో కొత్త మార్పులు రాకుండా ఎప్పటిలాగే మార్ధవంగా, మధురంగా స్త్రీ  స్వరం మాదిరిగానే ఉండిపోతుంది. ఎక్కువసేపు రాగాలాపన చేయగలిగిన శక్తి కూడా కలిగేది. ఇలాంటి పాటగాళ్ళని “కాస్ట్రెట్టి” అని పిలిచేవారు. అదొక విషాద చరిత్ర.

            చర్చిలో పాటలు పాటడం ఒక దైవ కార్యం కాబట్టి, పేద మగపిల్లల్ని తల్లిదండ్రులే స్వయంగా చర్చికి అమ్మేసేవారు. చివరికి క్రీ॥శ॥ 1870వ సంవత్సరంలో ఈ దారుణాన్ని చట్ట విరుద్ధంగా భావించి ఆపేశారు.

            ఈ రోజు నెదర్‌లాండ్‌ రాజు చర్చికి వస్తున్నాడట. అందువలన ముఖ్యమైన దారిని మూసి, వేరే మార్గంలో మమ్మల్ని పంపుతున్నారు. ఆయనతో వచ్చినవారు నడుపుతున్న విలాసవంతమైన కార్లు ఒక వైపుగా మాకు కనిపిస్తూనే ఉన్నాయి. పగానీ జోండా, లంబోర్గినీ లాంటి విలాసవంతమైన కార్లని గుర్తుపట్టాను.

            సెయింట్‌ పీటర్స్‌ చర్చి విశాలమైన ద్వారాలు దాటుకొని లోపలకి వెళ్ళిన తరువాత దివ్యలోకాల్లోకి వెళ్ళిన అనుభూతి కలిగింది. చర్చి అంతా క్రాస్‌ (సిలువ) ఆకారంలో ఉండటం దాని విశేషం. కుడి వైపుకి ఉన్న ద్వారం పక్కనే మైకేలాంజిలో చెక్కిన పీతా (శిలువ మీద నుండి దించిన క్రీస్తుని, తన ఒడిలో పెట్టుకొని దుఃఖిస్తున్న మేరీమాత) విగ్రహం ఉంది. బుల్లెట్‌ ప్రూప్‌ చేయబడిన గాజు గదిలో ఉంచారు ఆ శిల్పాన్ని. తేనెటీగల మాదిరిగా ప్రజలు ఆ విగ్రహం చుట్టూ మూగిపోతున్నారు.

            సగం మంది పీటర్‌ కోసం వస్తుంటే మరో సగం మంది పీతాని చూడటం కోసం వస్తున్నట్టు అనిపిస్తుంది.

            ఈ విగ్రహాన్ని దర్శించటం కోసం ఎప్పుడూ వందల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. మైకేలాంజిలో రెండు సంవత్సరాల పాటు కష్టపడిన ఫలితం ఈ “పీతా విగ్రహంగా రూపు దిద్దుకొంది. 6×7  అడుగుల పరిమాణంలో ఉన్న ఈ పాలరాతి విగ్రహాన్ని ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో చెక్కటం ఒక చిత్రమే. అయితే దీన్ని చూసిన విమర్శకులు మాత్రం “ముప్పై మూడు సంవత్సరాల వయసున్న ఏసుక్రీస్తు తల్లికి, కనీసం యాఖై సంవత్సరాల వయను ఉండాలి కదా? ఆమె ముఖంలో ముసలితనవు జాడలు ఎక్కడా కానరావు, అది పారపాటు” అని విమర్శిస్తారు.

            దానికి సమాధానంగా మైకేలాంజిలో “పవిత్రత, స్వచ్చత ఉన్న స్రీ ఆమె. ఆ పవిత్రమైన శరీరాన్ని తాకటానికి వయస్సు భయపడి, నమస్కరించి దూరాన్నుంచే వెళ్ళిపోయింది” అని చెప్పి విమర్శకుల కళ్ళు తెరిపించాడు. అప్పటి నుండి మైకేలాంజిలోని IL Divino (దేవుడు) అని పిలుస్తుండేవారు రోమన్‌ ప్రజలు. మైకేలాంజిలో సంతకం పెట్టిన శిల్పం ఇది ఒక్కటే.

            1964వ సంవత్సరంలో ఈ శిల్పాన్ని న్యూయార్క్‌లో ప్రదర్శనకు పెట్టినప్పుడు (ప్రేక్షకుల్ని కన్వేయర్‌ బెల్ట్‌ మీద తీసుకుపోయారట. మామూలుగా అయితే కదలకుండా నిలబడి అలా చూస్తూ ఉండిపోతారని.

            మైకేలాంజిలో ఆరో సంవత్సరంలో ఉండగానే వాళ్ళ అమ్మ మరణిస్తుంది. ఒక గ్రామంలో తండ్రితో పాటుగా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పరిసరాల్లోని రాతిగనుల్లో పనిచేస్తున్న ఒక కూలీ భార్య మైకేలాంజిలోకి పాలిచ్చి పెంచుతుంది. “నా దాది వద్ద తాగిన పాలే నాకు రాతిని చెక్కటం నేర్చించాయి. రాతి మీద ప్రేమని ఆ తల్లిపాలతో కలిపి తాగాను” అని మైకేలాంజిలో చెప్పుకొన్నాడు.

            అలాంటి మహాశిల్పి మైకేలాంజిలో ‘డేవిడ్‌’ శిల్పాన్ని కూడా చెక్కి ప్రపంచంలోని అందరి దృష్టిని ఆకర్షించాడు. రాత్రిపూట కూడా తలకి కాండిల్‌ కట్టుకొని, ఆ వెలుతురులో ఏడు అడుగుల ఎత్తులో ఉన్న డేవిడ్‌ శిల్పాన్ని ఒక్కడే చెక్కాడట. తన శిల్పాలు అన్నీ ఒక్క చేతిమీదగానే చెక్కబడ్డాయి. రఫ్‌ వర్క్‌ మొదలుకొని పూర్తయ్యే వరకూ మొత్తం తనే చెక్కేవాడు. అది ఒక తపస్సుగా, భగవంతుడు తనకి ఇచ్చిన అవకాశంగా భావించి “దేవుని సేవలో జీవితాన్ని గడిపిన కళాజీవి మహాశిల్పి  మైకేలాంజిలో.

            ఆనాడు రెండు రొట్టె ముక్కలు, ఒక వెన్న ముక్కతో మాత్రమే జీవించిన మైకేలాంజిలో చెక్కిన శిల్పాలు ఈనాడు రోమ్‌ నగరానికి మిలియన్ల ఆదాయం తెచ్చి పెడుతున్నాయి.

            చిరిగిపోయి, దుమ్ము కొట్టుకొన్న బట్టల్లో కన్పించే మైకేలాంజిలో ఏదో ఒక పనివాడుగానే తనను భావించుకొన్నాడే కానీ గొప్పశిల్పిగా ఎప్పుడూ చెప్పుకోలేదు.పాలరాతిలో ప్రాణాన్ని, పవిత్రతని, పరిమళాన్ని నింపగలిగిన మైకేలాంజిలోని “దేవుడు” అని అందుకే పిలిచేవారు.

            మైకేలాంజిలో డిజైన్‌ చేసిన సెయింట్‌ పీటర్స్‌ డోమ్‌ చివర వరకూ, చెమట్లు కక్కుతూ చేరుకొని, రోమ్‌ నగరాన్ని పూర్తిగా చూడగలిగాను. అక్కడ నుండి వెనుక ద్వారంలో కిందికి వచ్చి మైకేలాంజిలో కంచు విగ్రహం పెట్టినచోట తోటి ప్రయాణికుడి చేత ఫోటో తీయించుకొని ఆనందపడ్డాను. ఫ్లారెన్స్‌ నగరంలోని స్టూడియోలో పనిచేస్తున్నప్పుడు అతనంటే గిట్టని ‘తోర్రిగియానో’ అనే సవాపాటి, మైకేలాంజిలోని సుత్తితో ముక్కుమీద కొట్టటంతో అది శాశ్వతంగా చితికిపోయింది. అప్పుడు మైకేలాంజిలో వయసు పదిహేను సంవత్సరాలు. ఈ కంచు శిల్పంలో తన ముక్కు చితికినట్టుగానే చేశారు. అ విగ్రహం పక్కన కాసేపు నమస్కరిస్తూ నిలబడ్డాను. చివరగా గేటు దాటి బయటికి వస్తున్నప్పుడు ఆ ముఖద్వారపు తలుపు మీద ఆధునిక ఇటాలియన్‌ శిల్పి  గియాకోమో మంజు (1908-1991) కంచులో ఉబ్బెత్తుగా చేసిన “గేట్స్‌ ఆఫ్‌ డెత్‌” అనే శిల్పాలను చూడగలిగాను.

            ఫ్లారెన్సు నగరంలో ఉన్న బాప్టిస్టరీ చర్చి తలుపుల మీద గిబర్టీ శిల్పి చేసిన కంచు రిలీఫ్‌ శిల్పాలకి “Gates of Paradise ”అనే పేరుంది. దానికి భిన్నంగా సమకాలీన విషయాల్ని తీసుకొని మంజు ఇలా తయారుచేశాడు. పోప్‌కి ఈ శిల్పి మంజుకి ఉన్న స్నేహ సంబంధాల వలన, ఈ థీమ్‌తో ఉన్న శిల్పాలకి ఇక్కడ స్థానం దొరికిందని ప్రజల ఊహాగానం.

            వాటికన్‌ సిటీలో ముఖ్యంగా చూడాల్సింది ‘సిస్టైన్‌ ఛాపెల్‌ మ్యూజియం’. ఆ వైపుగా వెళుతుంటే మ్యూజియం టిక్కట్టు అమ్ముతున్న బంగ్లాదేశ్‌ యువకులు కనిపించారు. సాయంత్రం అయింది. మ్యూజియంలోకి వెళ్ళినా ఎక్కువ సమయం గడుపలేను.

            “ఒక టిక్కెట్‌ ఇరవై యూరోలు మాత్రమే” అంటూ కేకలు వేసి అమ్ముతున్నారు. ప్రేక్షకులు వందల సంఖ్యలో సాగిపోతూనే ఉన్నారు.

            రేపు ఉదయాన్నే రావటం మంచిదనుకొని టిక్కట్లు అమ్మే కుర్రాడిని పరిచయం చేసుకొని నా కార్డు ఇచ్చాను.

            “ప్రొఫెసర్‌ ఫ్రం ఇండియా! ఓహో” అంటూ సంతోషించాడు. “సార్‌! మీకైతే ఈ టిక్కెట్‌ పదహారు యూరోలకే ఇస్తాను. నా పేరు సోహెల్‌. మాది బంగ్లాదేశ్‌. యూనివర్సిటీలో పార్ట్‌ టైం ఇంగ్లీషు టీచరుగా పనిచేస్తూ, ఈ టూరిస్టు కంపెనీలో ఉంటున్నాను” అంటూ తన కార్డు అందించాడు. సోహెల్‌ ఎమ్‌.బి.ఎ. వరకూ చదివి ఇలా కష్టపడి జీవిస్తున్నట్లుగా అర్థం చేసుకొన్నాను.

            “నాకో సహాయం చేయగలవా సోహెల్‌?”

            “మీరు ఉండటానికి గదికావాలా సార్‌?”

            “కాదు. మీరు పనిచేస్తున్న యూనివర్సిటీలోని ఫైన్‌ ఆర్ట్స్‌ డిపార్ట్‌మెంట్‌ వారికి నన్ను పరిచయం చేయాలి. నా చిత్రాలతో అక్కడ ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయటానికి అవకాశం ఉంటుందేమో తెలుసుకోవాలి.”

            “అంతదూరం పోనక్కర లేదు. ఇక్కడికి దగ్గరలోనే నాకు తెలిసిన ఒక ఆర్ట్‌ గ్యాలరీ ఉంది. రేపు ఉదయం పది గంటల్లోపు ఇదే ప్రదేశానికి మీరు బొమ్మలు తీసుకొని రాగలిగితే పరిచయం చేస్తాను” అని ఆ గ్యాలరీ ఉన్న రోడ్డు నెంబరు చెప్పాడు. అంతలోనే తను అందుకొని “మీకు రూం కావాలంటే మాతోపాటే ఉండొచ్చు. రోజుకి ఇరవై యూరోలు; పుడ్‌తో సహా” అంటూ ‘బై బై’ చెప్పి టూరిస్టులతో

బేరం చేసుకొంటున్నాడు.

            నేను అసలు ఊహించకుండానే ఈ అవకాశం వచ్చింది. మేడమ్‌ వద్ద తీసుకొన్న రెండు వందల యూరోలు విసెంజా వెళ్ళటానికి సరిపోతాయి. ఖర్చులకి డబ్బులు అవసరం. మూడు వందల యూరోలు నా జేబులో ఉన్నా, బొమ్మలు అమ్మి సంపాదించుకోవటంలో ఉన్న ఆనందం వేరు.

            మర్నాడు తెల్లవారక ముందే నేను తెచ్చుకొన్న చిన్న సైజు పెయింటింగ్స్‌ అన్నీ జాగ్రత్తగా సర్దుకొని, 2X2 అడుగుల కాన్వాస్‌ బొమ్మలు రెండు మాత్రమే ఒక కాగితంలో చుట్టుకొని వెళ్ళాను. దారిలోని ఒక షాపులో ఒక యూరోకి రెండు పెద్ద యాపిల్‌కాయలు కొని ఆకలి తీర్చుకొన్నాను.

            వాటికన్‌ మ్యూజియానికి వెళ్ళే లైను పెరిగి పోతూ ఉంది. సిస్టైన్‌ ఛాపెల్‌లోని “School of Athens” ముఖ్యంగా చూడాలి. నిన్న సాయంత్రం కలుసుకొన్న ప్రదేశంలోనే నిలబడ్డాను, నిన్న వేసుకొన్న డ్రస్‌లోనే. గ్యాలరీ సంగతి తర్వాత చూడవచ్చు. ముందు లైనులో నిలబడదాం అనుకొంటూ ఉండగానే ‘హలో ప్రొఫెసర్‌’ అంటూ నా వెనుక నుండి సోహెల్‌ ఇంకో మిత్రుడుతో వచ్చాడు. “ఇతడు లోకల్‌ పెయింటర్‌. పేరు అంతోనివో. ఇతనితో పాటు గ్యాలరీకి వెళ్ళిరండి” అని చెప్పాడు.

            “ఇంత పెద్ద లైనుంది. నాకు టిక్కెట్‌ దొరుకుతుందంటారా?” సోహెల్‌ని అడిగాను.

            “మా కంపెనీ ఏజెంట్‌ ద్వారా వేరే మార్గంలో పంపిస్తాను. టికెట్‌ మాత్రం మా వద్దే కొనండి” అనగానే పదహారు యూరోలు ఇచ్చాను.

            గ్యాలరీకి వెళ్ళగానే నా రెండు చిత్రాల్ని వారికి ఇచ్చి “నేను సిటీలో ఇంకా రెండు రోజులు ఉంటాను. మీరు ఎంతకి అమ్మినా ఫరవాలేదు” అని చెప్పగానే ఆమె “మ్యూజియం నుండి తిరిగి వచ్చేటప్పుడు కలవండి” అంటూ తన బిజినెస్‌ కార్డు అందించింది.

            అది చాలా చిన్న గ్యాలరీ. టూరిస్టులు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో ఉన్న గ్యాలరీలు అన్నీ ఇలాంటివే ఉంటాయి. ఆ రెండు చిత్రాలకి నాకు వంద యూరోలు వస్తే చాలు అనుకొన్నాను.

            సోహెల్‌ మిత్రుడు గ్యాలరీ వద్దే శెలవు తీసుకొన్నాడు. నన్ను సోహెల్‌ ప్రత్యేకమైన మార్గంలో మ్యూజియంలోకి పంపాడు. ఐదు నిముషాల్లో మ్యూజియం మధ్యలో ఉన్నాను.

            “రోమ్‌ నగరాన్ని గాబరాగా ఒక్కరోజులో చూసినా, తీరిగ్గా నెల రోజులు చూసినా రెండుసార్లూ బాధే మిగులుతుంది” అనేది ఇక్కడ సామెత.

            ఐదు వందల సంవత్సరాల కళాకృషిని, గంటల్లోను, రోజుల్లోనూ చూడటం ఎవరికీ సాధ్యం కాదు.

            సిస్టైన్‌ ఛాపెల్‌లో సీలింగ్‌ మీద మైకేలాంజిలో చిత్రించిన బైబిలు బొమ్మలే దాని అందం అంతా.ముప్ఫై  సంవత్సరాలుగా ప్రపంచ కళాచరిత్ర పాఠాలు చెబుతున్న నేను తలదించుకొని పుస్తకాల్లోని బొమ్మలే చూశాను, ఇన్నాళ్ళకి తల పైకెత్తుకొని ఆ సీలింగ్‌ మీద వేసిన అద్భుతమైన చిత్రాల్ని చూడగలిగాను.

            “Painting is a female job” అంటూ గిర్జాండియో స్టూడియో నుండి బయటికి వచ్చి, బెర్తోల్డో శిల్పి స్టూడియోలో చేరిపోతాడు మైకేలాంజిలో. అయితే రెండవ పోప్‌ జూలియస్‌ ఆజ్ఞ ప్రకారం ఇలా సిస్టైన్‌ ఛాపెల్‌లో పెయింటింగ్‌ చేయవలసి వస్తుంది. ఆ విధంగా ప్రపంచంలో ఒక అద్భుతాన్ని సృష్టించగలిగాడు మైకేలాంజిలో. తాను మచ్చు కట్టుకొని, అంత ఎత్తులో మెడనొప్పిని లెక్క చేయకుండా పెయింట్‌ చేస్తున్నపుడు, పోప్‌ వచ్చి ఏవో సలహాలు ఇవ్వబోతాడు. కోపంతో “నా పని చెడగొట్టకండి” అని అర్థం వచ్చేలా ఒక రంగు డబ్బాని ఆయన ముఖం మీద పడేలా వదలగానే ఆ ఛాయలకి మరి ఎప్పుడూ రాకుండా పోతాడు పోప్‌.

            సీలింగ్‌ మీద చిత్రాల్లో అన్నిటి కన్నా గొప్పది Creation of Adam. వాలిపోయిన Adam ఎడమ చేతి చూపుడు వేలులోకి; దేవుడు తన కుడి చేతి వేలుతో శక్తినీ, ప్రాణాన్నీ ప్రవహింపజేస్తున్నట్టుగా ఉంటుంది. రాఫెల్‌ చిత్రం “School Of Athens”  ముందు ఎంతసేపు నిలబడినా తనివి తీరదు.

            రోమన్‌ రాజులు క్రిష్టియన్‌ పౌరుల్ని అసహ్యించు కొన్నంత కాలం నగరాల్లో రక్తం ప్రవహించింది. రోమన్‌ రాజులు వారిని ప్రేమించడం మొదలుకాగానే కళాకారులు పుట్టుకు వచ్చారు. యుద్ధవీరులు కనుమరుగైపోయారు. కరకురాతిలాంటి రాజుల హృదయాలని కరిగించింది కళాకారులే.

            “పోప్‌ జూలియస్‌ సమాధి శిల్పాలను చెక్కటానికి నా యవ్వన కాలం అంతా ఉపయోగించాను” అంటాడు మైకేలాంజిలో. ఈ మహాశిల్పి  జీవితాన్ని ఆధారం చేసుకొని రాయబడిన ‘Agony and Ecstacy’ అనే పుస్తకాన్ని మరొకసారి చదువుకొని ఆనందించాను.

            మా లక్ష్మయ్య మాష్టారు తాను చదువుకొన్న ‘గుబ్బియో కాలేజీ’ నుండి ఒంటరిగా వచ్చి ఈ మ్యూజియంను చూసినట్లు నాకు చెప్పాడు.

            సాంస్కృతిక పునరుజ్జీవనం జరిగిన ఈ రోమ్‌ నగరాన్ని దర్శించటం వల్ల నాకు మరింత కొత్త శక్తి, ఆలోచనలు కూడా వచ్చాయి.

            వాటికన్‌ మ్యూజియాన్ని వదలి వస్తుంటే ఐరోపా కళాచరిత్ర పాఠశాల నుండి తిరిగి వస్తున్నట్లు అనుభూతి చెందాను.

            రెండుసార్లు ఆ వాటికన్‌ మ్యూజియం అంతా పరుగుల మీద కలయ తిరిగి బయటికి వచ్చి నేరుగా గ్యాలరీకి వెళ్ళాను. అప్పటికే అక్కడ సోహెల్‌ మిత్రుడు నాకోసం ఎదురు చూస్తున్నాడు. ‘సిన్యోరో, బేన్‌ వెనూతో'(Welcome) అంటూఆవిడ నన్ను పిలిచి “మీ రెండు పెయింటింగ్స్‌కి నేను నూట ఇరవై యూరోలు ఇస్తున్నాను. ఓకేనా” అంటూ మూడునోట్లు  అందించింది. ఆమెకి నా ఈ మెయిల్‌ ఇచ్చి నేరుగా సోహెల్‌ వద్దకి వెళ్ళి అతనికి ఇరవై యూరోలు గిఫ్ట్‌గా అందజేశాను.

“నాకు మరో సహాయం కావాలి సోహెల్‌?” అని అడిగాను.

“వేరే గ్యాలరీలు పరిచయం చేయమంటారా?”

            “కాదు. నేను ఉంటున్న చర్చి గదిని రేపు రాత్రికి ఖాళీ చేయాలి. ఎల్లుండి ఉదయం ఆరు గంటలకి విసెంజాకి ట్రెయిన్  ఉంది నాకు. కాబట్టి రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో రాత్రి ఉండేందుకు గది కావాలి?”

            “మా బంగ్లాదేశ్‌ పనివారితో పాటుగా ఉంటానంటే ఐదు యూరోలు. మీల్స్‌తో కలిపి సరేనా?”

            “చాలా బాగుంది. వారితో కూడా పరిచయం అయినట్లుగా ఉంటుంది” అంటూ వారి అడ్రస్‌ తీసుకొన్నాను.

రోమ్‌లో నేను చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి.

            రాత్రి ఏడు గంటలకి తీరుబడిగా అలా నడుచుకొంటూ వత్తావియన్‌ మెట్రో స్టేషనకి వెళ్ళాను. మెట్రో టన్నెల్‌లో ఒక బ్లాక్‌ వీరుడు అద్భుతంగా అకాడియన్‌ వాయిస్తున్నాడు. బొమ్మలు అమ్మిన సంతోషంలో అతడి దగ్గరకి వెళ్ళి మూడు యూరోలు చేతికి అందించాను.

            మరుసటిరోజు రోములో నాకు చివరిరోజు. రోమియోలాగా అలా తిరుగుతూనే ఉన్నాను. సిటీ బాగా తెలిసిపోయింది. మూడు యూరోలతో నగరం అంతా తిరిగి గదికి వెళ్ళవచ్చు. ఎత్తుగా ఉన్న క్యాపిటల్‌ ప్రాంతంలోని మ్యూజియం ముంగిట్లో మార్కస్‌ అరిలియస్‌ చక్రవర్తి కంచు విగ్రహాన్ని పది అడుగుల ఎత్తులో పెద్ద దిమ్మె మీద స్థాపించారు. ఆ ప్రాంగణాన్ని డిజైన్‌ చేసిన వ్యక్తి మైకేలాంజిలో. ఎదురుగా ఉన్న మ్యూజియంలో చక్రవర్తి నీరో విగ్రహాన్ని కూడా ప్రదర్శనకి పెట్టారు.

            నీరో (A.D. 37 – A.D. 68) తన తల్లినీ, చిన్నాన్ననీ కూడా చంపినటువంటి క్రూరుడు. రోమ్‌ నగరానికి నిప్పు అంటించి హాయిగా ఫిడేలు వాయించుకొంటూ ఆనందించిన రాక్షసుడు. అందుకేనేమో ముఫ్పై సంవత్సరాల వయస్సులోనే ఆత్మహత్య చేసుకోవలసి వచ్చింది. ఇ

            నా పక్కన ఒక బెల్జియం జెంటిల్‌మెన్‌ నన్ను గమనించి “ఇండియా?” అని ఆశ్చర్యపోతూ షేక్‌ హ్యాండిచ్చాడు.

            నీరో విగ్రహాన్ని అతడు పరిశీలనగా చూస్తూ “నా వద్ద ఉన్న బ్రోచర్‌లో నీరో గురించి కొన్ని వింత విషయాలు ముద్రించారు. చెప్పమంటారా!” అన్నాడు. అతడి ఇంగ్లీషు కాస్త ఇబ్బందిగా అనిపించింది. “ప్లీజ్‌ చెప్పండి” అన్నాను.

            “క్రీ॥శ॥ 65 వ సంవత్సరంలో తన భార్యను కూడా హత్య చేశాక “ఎరాస్వారస్‌’ అనే బానిస యువకుడిని పెళ్ళి చేసుకొని అతడి వృషణాలను తొలగించి వేశాడట. అందుకే ప్రజలు నీరో మీద తిరుగుబాటు చేసి ఉంటారు!” అని చెప్పాడు.

            మైకేలాంజిలో చెక్కిన మరో గొప్ప శిల్పం మోజస్‌ది. సాన్‌ పియట్రా వింకోలి అనేచోట ఉన్న చర్చిలో ఉంది అది.

            లుంగోటెవేరే మార్గంలో టైబర్‌ నదికి రెండువైపులా తిరిగాను. అటు ఇటు వెళ్ళటానికి ఎక్కడబడితే అక్కడ వంతెనలు ఉన్నాయి. సిటీలోనే దాదాపు పన్నెండు వంతెనలు నిర్మించారు. ఒకచోట చిన్న దీవి కూడా ఉంది.

            సాయంత్రానికి నా బ్యాగు సర్దుకొని సోహెల్‌ ఇచ్చిన అడ్రసుకి చేరుకొన్నాను. అది టెర్మినీకి దగ్గరలోనే ఉంది. ఆ పెద్ద గదిలో బంగ్లాదేశ్‌ యువకులు విశ్రాంతి తీసుకొంటున్నారు. ఇద్దరు మాత్రం భోజనానికి సిద్ధమవుతున్నారు. నన్ను చూడగానే వారిలో ఒకరు సోహెల్‌కి ఫోను చేశారు. “మీరంతా ఈ హోటల్లోనే పనిచేస్తున్నారా?” అని అడిగాను.

            “అవును సార్‌. రోమ్‌లో మా బంగ్లాదేశ్‌ వాళ్ళు దాదాపు పదివేల మంది ఉన్నారు.

            “ఇంతమంది ఎలా వచ్చారు?”

            “భోజనం చేస్తూ మాట్లాడుకొందాం, రండి” అంటూ రోటీలు పెట్టారు ప్లాస్టిక్‌ ప్లేటులో.

            “గత ఇరవై సంవత్సరాలుగా వివిధ పద్ధతుల్లో ఎంతోమంది వస్తూనే ఉన్నారు. చిన్న చిన్న పనులు చేసుకొని బ్రతికేవారు ఎక్కువ. టూరిస్టులు తిరిగే ప్రదేశాల నిండా మా వాళ్ళు ఏవో అమ్ముకొంటూనే ఉంటారు” అంటూ హిందీలో వివరించాడు.

            “మిమ్మల్ని రెగ్యులర్‌ సిటిజన్‌గా చేయటానికి ప్రభుత్వం వారు ఒప్పు కోవటం లేదా?”

            “నాలుగు లేదా ఐదు సంవత్సరాలకి ఒకసారి అలాంటి ప్రకటన వస్తుంది. అప్పటి వరకూ మేము ఇక్కడ నుండి కదిలే పనిలేదు”.

            “ఆసియా వారు ఇక్కడ ఎక్కువగా ఉంటున్నారని విన్నాను. మీరందరూ సమైక్యంగా ఉంటున్నారా లేదా?”

            “మాతో పాకిస్థానీ వారు కలుస్తున్నారు కానీ, శ్రీలంక వారు కలవటం లేదు. అదీ మా సమస్య. శ్రీలంక వారు ముఫ్పై నుండి యాభై వేలమంది వరకూ ఉంటున్నారు. వారు తమ పిల్లల్ని మాత్రం ఇంగ్లీషు మీడియంలో చదివిస్తున్నారు; ఇటాలియన్‌ భాషకి విలువ తక్కువ అంటూ. అయితే పాకిస్థాన్‌ వారు యాభైవేలమంది ఉన్నారు. వారికి సాంత ఇళ్ళు ఎక్కువ. ప్రతి ఒక్కరూ కూడా ఐదు సంవత్సరాలకి ఒకసారి వచ్చే రెగ్యులర్‌ పర్మిట్‌ కోసం ఎదురుచూస్తూ ఉండటమే!” అంటూ వివరాలు ఇచ్చారు.

“ఐతే మీరందరూ ఇంటికి వెళ్ళటం ఎలాగా?”

“ఐదు సంవత్సరాలు ఉంటే తప్పకుండా పర్మిట్‌ కార్డు వస్తుంది. అప్పటి వరకూ మేము ఇక్కడ సర్దుకొని ఉండాల్సిందే.”

            నాకు ఆకలి తీరింది కానీ, వీళ్ళ కథలు వింటూంటే మనసు అదోలాగా అయింది. వేకువజాము వరకూ ఏదో విధంగా స్టేషన్‌లోనే మేలుకొని ఉండవచ్చు అనుకొని వారికి ఐదు యూరోలు ఇచ్చి బయలుదేరాను.

            రోమా టెర్మినీ ముందున్న బన్‌స్టాప్‌లో రాత్రంతా అలా కూర్చొని ఆలోచించుకొంటూ, పచార్లు చేస్తూ ఉన్నాను. వేకువ జామున ఒక యూరోతో టాయిలెట్‌ ముగించుకొని, ఆరు గంటలకి వచ్చిన స్పీడ్‌ ట్రైన్‌ నెంబరు “9408” మీద ప్రయాణమయ్యాను. పడోవా స్టేషన్‌కి నాలుగు గంటలు పట్టింది. అక్కడ నుండి విసెంజాకి మరో లోకల్‌ రైలు పట్టుకొన్నాను. స్టేషన్‌కి మిత్రుడు అత్తిలివో బదులుగా ఆయన భార్య లిప్సీ, కుమార్తె అనిత వచ్చారు.

            నా గడ్డం చూసి సులభంగానే గుర్తు పట్టారు.

            విసెంజా టౌన్‌ చాలా అందంగా ఉంది. అన్నీ ఎర్ర పెంకుల ఇళ్ళు. ఐదో ఫ్లోర్‌ మీద ఉన్న అత్తిలివో ఇంటి నుండి చూస్తుంటే దూరంగా పచ్చదనం కప్పుకొన్న పర్వతాలు కనువిందు చేస్తున్నాయి. రోమ్‌ నగరానికి, ఈ విసెంజాకి అసలు పోలికే లేదు. గందరగోళం నుండి పచ్చని పార్కులోకి వచ్చినట్టుగానూ; తారు రోడ్డుమీద నుండి కాలిబాటల్లోకి వచ్చినంత ఆనందంగానూ ఉంది.

            “మేము రిటైర్‌ అయి మూడు సంవత్సరాలు అయింది. మాకు ఇద్దరు అమ్మాయిలు. వారికి పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి. ఇక్కడికి దగ్గరలోనే ఉంటున్నారు. ఈమె నా పెద్ద కూతురు అనిత” అంటూ వివరాలు చెప్పింది లిప్సీ మేడం.

“రెండో  అమ్మాయి ఏంచేస్తూ ఉంది?”

“ఆమెకి ఇద్దరు పిల్లలు. అమ్మాయి నాలుగో తరగతి, అబ్బాయికి  ఆర్థోపెడిక్‌ సమస్య. అదే ఆవిడకి బాధ కల్గించే విషయం. మా మనవడిని తీసుకొని అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటుంది” అంటూ కుటుంబ వివరాలు చెబుతూ ఉండగానే అత్తిలివో లోపల గదిలో నుండి బయటికి వచ్చాడు.

            “అమికో” (స్నేహితుడా) అంటూ ఆప్యాయంగా కౌగలించుకొని నాకోసం కేటాయించిన గది చూపించాడు.

            ఇల్లంతా చిన్న పెయింటింగ్స్‌తో అలంకరించబడి ఉంది. చివరి ఫ్లోరు కావటం వలన గాలి విపరీతం. పూలకుండీలు నిండుగా అమర్చారు.

            తల్లీ కూతుళ్ళు ఇద్దరూ నిముషాల్లో భోజనం సిద్ధం చేశారు. “మీ ఇంట్లో నేను సరిగ్గా ఎనిమిది రోజులు ఉంటాను. అప్పటివరకూ నన్ను భరించవలసి ఉంటుంది” అని చెబుతుండగానే లిప్సీ మేడమ్‌ అందుకొని; “మాకు తోడుగా ఒక నెల రోజులు ఉండిపోయినా ఫరవాలేదు సిన్యోరో” అని చెప్పి నా కోసం బ్రెడ్‌, ప్రూట్‌, వీట్‌తో తయారుచేసిన ఇటాలియన్‌ తరహా వంటకం అందించింది.

            అత్తిలివోకి వయసు మీద పడటంతో పాటుగా వినికిడి శక్తి బాగా తగ్గిపోతూ ఉంది. అన్నీ భార్య చూసుకోవలసిందే. “ఆది, నువ్వు లిడెప్లా భాష నేర్చుకో. ప్రపంచం అంతా సులభంగా పరిచయం అవుతుంది” అని చెబుతున్నాడు.

            భోజనం తర్వాత అనిత ఇంటికి వెళ్ళిపోయింది. సాయంత్రం నాలుగు గంటలకి లిప్సికా  నన్ను తీసుకొని “ఓల్డ్  సిటీ చూపిస్తాను, రండి!” అంటూ బయలుదేరింది.

            విసెంజా అందమైన పట్నం. విశాలమైన పార్కులు, తక్కువ మంది జనం, ఎక్కువగా పాలరాతి విగ్రహాలు, చెట్టు ఉంటున్నాయి. ప్రతిచోటా పువ్వులే. వంతెన మీదా, ఇళ్ళ బాల్కనీల్లో, షాపుల ముందు రకరకాల పూలకుండీలు అమర్చారు. అలా తిరుగుతూ ఉంటే ఏవో పువ్వుల మీదనో, నవ్వుల మీదనో నడచిపోతునట్టుగా ఉంది. చిన్న వంతెనల కింద నీటిలో ఈదులాడే బాతులు, నీటి కాలవల్లో ఈదే పెద్ద చేపలు కూడా నిర్భయంగా తిరుగుతున్నాయి.

            అలాంటి రెండు చిన్న వంతెనలు దాటాక ఓల్డ్‌ విసెంజా సిటీ చేరుకొన్నాం. పాత రోమన్‌ రోడ్లు కన్పించాయి. మధ్యలో కొంచెం ఉబ్బెత్తుగా ఉండి రెండు చివర్లలో వంగిన ఆనాటి రోమన్‌ రోడ్లు ఈ పాత విసెంజా పట్నంలో ఇంకా అలాగే ఉన్నాయి.

            “ఆది, చూడండి! మా రోడ్లు. వీటి గురించి వుస్తకాల్లో చదువుకొని ఉంటారు కదూ!”

            “అవును మేడం! అప్పియస్‌ క్లాడియస్‌ అనే ఆఫీసర్‌ మొట్టమొదటి రోమన్‌ రోడ్డుని నిర్మించినట్టుగా విన్నాను. వీటి మీద నడుస్తూ ఉంటే రోమన్‌ పౌరసత్వం వచ్చినట్టుగా ఉంది. ఇవి క్రీ.పూ॥ 300 సంవత్సరాల నాటివి. రోమన్‌ రాజులకి ఇరవై తొమ్మిది హైవేలు ఉండేవట. వాటిల్లో మీ నగరంలో గుండా వెళ్ళిన బాట ఇది. నాలుగు లక్షల కి.మీ. దూరం సాగిపోయిన ఈ రోడ్లు మిలటరీ పనుల కోసమే వేశారట” అంటూ వివరించాను. ఎన్నో సుందరమైన భవనాలు, మెలికలు తిరుగుతూ ఉన్న రోడ్లు దాటుకొంటూ, యాండ్రియా పల్లాడియా సెంటర్‌కి వెళ్ళాం. ఇదొక గొప్ప నిర్మాణం. ఆ పక్కనే పల్లాడియో నిలువెత్తు పాలరాతి విగ్రహం కనిపించింది. దాని చుట్టుతా చిన్న హోటళ్ళు. అంతటా విదేశీ యాత్రికులు విపరీతంగా తిరుగుతున్నారు.

            “మా సిటీకి ఇదే పెద్ద సెంటర్‌. దీన్ని చూడకుండా ఎవరూ ఉండలేరు తెలుసా?” అంటూ కళ్ళు పెద్దవి చేసి వర్ణిస్తూ ఉంది లిప్సీ.

            ఇటాలియన్‌ రినైజాన్సు కాలంలో జీవించిన ప్రఖ్యాత వాన్తుశిల్పి  పల్లాడియో (1508-1580). ఈ విసెంజాకి “సిటీ ఆఫ్‌ పల్లాడియో’” అనే పేరు కూడా ఉంది. ఎందుకంటే తాను స్వయంగా నిర్మించిన ఇరవై మూడు భవనాలు, విల్లాలు ఇక్కడ ఇంకా సజీవంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సిటీ జనాభా లక్షాయాభై వేలు మాత్రమే. పదకొండవ శతాబ్ధం నుండి ఉన్న మ్యూజియంలు, చర్చిలు కూడా ఉన్నాయి అందుకే ఈ పట్టణం “వరల్డ్‌ హెరిటేజ్‌ సిటీ” గా గుర్తించబడింది.

            “ఆది! ఈ పల్లాడియో భవనం నిర్మించక ముందు ఇక్కడ బంగారుషాపులు ఉండేవి. రాజు గారు వారిని ఖాళీచేసి వేరే చోటకి వెళ్ళమంటే “మా వ్యాపారాలు వదలుకొని వేరీచోట బ్రతకటం కష్టం” అనే నిర్ణయం తీసుకొంటారు. అందువలన పల్లాడియో ఆ సమస్యని పరిష్కరిస్తూ వారి దుకాణాలు, ఇళ్ళు అన్నీ అలాగే ఉంచి, స్థంభాలు వేసి, వారి ఇళ్ళ మీద నలభై అడుగుల ఎత్తులో రెండు అంతస్థుల భవనం నిర్మించాడు. ఆనాటి పురాతన ఇళ్ళ గుర్తులు ఇంకా మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఇలా రండి చూద్దురు” అని చెప్పి అక్కడ ఉన్న కొన్ని పాత స్థంభాల గుర్తుల్ని చూపించింది.

ఈలోగా అత్తిలివోకి రెండు సార్లు ఫోను చేసింది మేడం.

            “ఇక్కడ ఆఫ్రికా దేశీయులు ఎక్కువగా కన్పిస్తున్నారు. వారి వలన మీకు ఏమైనా ఇబ్బంది ఉందా?” నేను అడిగాను.

            “ఆఫ్రికా వాళ్ళు ఎప్పుడూ బిక్షగాళ్ళుగా కనిపించరు. ఖాళీగా కూర్చోరు. సోమాలియా దేశం నుండి పడవల మీద రాత్రికి రాత్రే బయలుదేరి ఇక్కడికి వస్తున్నారు ఉద్యోగాల కోసం! కొన్ని పడవలు దారిలో మునిగిపోయినా సరే వారి వలసలు ఆగటం లేదు.”

            దారిలో కనిపించిన ఒక చర్చి వద్దకి వెళ్ళాం. అక్కడి వాస్తుకళలో మొరాకో దేశపు వాస్తు లక్షణాలు కలిసిపోయినట్టుగా ఉంది. శతాబ్దాల నుండి ఆఫ్రికా దేశస్థులు చాలా మంది ఇక్కడ నివాసం ఏర్పరచుకొన్నందువలన ఇలాంటి మిశ్రమశైలి కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి పురాతన వాస్తు నిర్మాణాల మధ్యలో నడచిపోతూ ఉంటే నిజంగానే, ఒక శిధిలమైన స్వప్నంలోకి ప్రయాణమైనట్టుగా ఉంది. మొదటి ప్రపంచయుద్ధంలో బాగా దెబ్బతిన్న ఈ నగరం తన ఆర్థిక బలంతో ఒక శతాబ్ధి కాలంలోనే ఉన్నత స్థితికి చేరుకో గలిగింది.

            రెండు మూడు రోజుల పాటు అలా నగరం అంతా నడుచుకొంటూ తిరిగాను. ఎలాంటి ట్రాఫిక్‌ ఇబ్బందీ లేదు. ఈ రోమన్‌ రోడ్లమీద హాయిగా కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకొంటూ నడవగలం. నగరాన్ని పురాతనంగా ఉంచటానికి చాలా కృషి చేస్తున్నారు.

            ఒకసారి పల్లాడియన్‌ సెంటర్లోని పాత పుస్తకాల షాపులో SAINT అనే పుస్తకాన్ని కొన్నాను ఒక యూరోతో. తీరా ఇంటికి వచ్చాక చూస్తే, దాని పేరు PORNO SAINT  అని ఉంది. అది మోనాపొజ్జి (1961 – 1994) అనే ఇటలీ దేశపు నగ్న నటి విషాదగాధ. ఐదు అడుగుల పది అంగుళాలు ఎత్తుగా ఉండే ఈ అందగత్తె మొదట్లో చాలా ఫ్యాషన్‌ కంపెనీలకి సగం దుస్తుల్లో మోడల్‌గా పనిచేసింది. అయితే చివరికి విసిగిపోయి పూర్తిగా బట్టలు విప్పేసి వంద నీలి చిత్రాల్లో నటించి, ఇటలీ దేశపు  రాత్రి జీవితాన్ని సరికొత్తగా నిర్వచించింది. ఈ నీలి ఇల్లాలు మరణించినప్పుడు పత్రికలన్నీ ఆమెను సెయింట్‌ పీటర్స్‌ డోమ్‌ కన్నా ఎత్తుగా పాగిడి, ఒక బూతు దేవతగానూ, శృంగారానికి దివ్యత్వాన్ని అద్దిన అభినవ వీనస్‌గానూ వర్ణించారు.

            అప్పటి వరకూ “మోనాపొజ్జి మా అక్క” అని చెప్పుకొంటున్న సైమోన్‌ అనే యువకుడు “మోనాపొజ్జి మా అమ్మ” అంటూ బావురుమంటాడు.

            కేవలం ముఫ్ఫైమూడు సంవత్సరాలకే మరణించిన ఈ మోనాపాజ్జిని తలచుకొంటూ ఇటలీ ప్రజలు అందరూ కూడా బాధపడ్డారు. ఆమె మరణించటానికి సంవత్సరం ముందు భర్తతో సహా ఇండియాలో కొన్ని రోజులు యాత్ర చేయటం నాకు నచ్చిన విషయం.

            అత్తిలివో ఇంట్లోని ఓపెన్‌ బాల్కనీలో ఉన్న తోటకి నేను నీళ్ళు పోసి, అంతా శుభ్రం చేస్తూ ఉండేవాడిని. లిప్సీకి కాస్త శ్రమ తగ్గించినట్టువుతుందని నా ఐడియా. ఆ పూల చెట్లు మీద ఎండ ఎక్కువగా పడుతున్నప్పుడు, తన గొడుగు తెచ్చి వాటికి పట్టేది లిప్సీ.

            ఆమెకి అరవై సంవత్సరాలు అయినా పరుగులు తీస్తూ పని చేసేది. ఎంత నీట్‌గా ఉండేదంటే కిచెన్‌ బేసిన్‌లో ఒక నీటి చుక్క ఉంటే ఎంతో బాధపడేది. గోధుమలు, మొక్కజొన్నలతో ఆహారం తయారు చేయటానికి ఇష్టపడుతుంది అమె.

“మీకు ఇతర పంటలు ఏమీ ఉండవా?”

“మాకు ఆలివ్‌, ద్రాక్ష తోటలు ఎక్కువ!”.

“మీ నగరం ఇలా ప్రఖ్యాతిలోకి రావటానికి ముఖ్యమైన కారణాలు ఏమైనా ఉన్నాయా?”

“నిజానికి మా నగరం బంగారానికి, వజ్రాలకి ప్రఖ్యాతి గాంచింది. అందుకే ఇంత అభివృద్ధి సాధించింది! ఒకప్పుడు మా వాళ్ళు ఇతర దేశాలకి వలస వెళ్ళేవారు. ఇప్పుడు చాలామంది మా నగరానికే వచ్చి జీవిస్తున్నారు!” అని చెప్పింది.అత్తిలివో మాత్రం “ఆది, హాయిగా ఇంట్లో ఉండి, ఫ్రూట్స్‌ తింటూ లిడెప్లా భాష నేర్చుకోవచ్చు గదా” అంటూ కంప్యూటర్‌ ముందు కూర్చొన్నాడు.

            ఒక రోజు ఉదయం నేను లిప్సీ సైకిళ్ళ మీద బయలుదేరాం. “సిన్యోరో! ఈరోజు మీకు ఒక ప్రదేశం చూపిస్తాను. అది మీకు బాగా నచ్చుతుంది” అంది.

“అది నాకు నచ్చుతుందని మీకు ఎలా తెలుసు? మేడమ్‌!”

            ఆమె నాతో ఏమీ మాట్లాడకుండా పల్లాడియన్‌ భవనం పక్కగా ఉన్న ఒక వీధిలోకి తీసుకుపోయింది. ఎంతో సౌందర్యంగా కనిపిస్తున్నాయి ఆ ఇళ్ళు. ఒక చిన్న ఇంటి ముందే సైకిళ్ళు ఆపేశాం. పూలకుండీల అలంకరణతో అంతా పండుగ చేసుకొన్నట్లుగా ఉంది. “ఆది! అలా తలపైకెత్తి ఆ రెండో అంతస్థు మీద ఉన్న పాలరాతి ఫలకం మీద అక్షరాలు చదువుకో” అని ఎంతో గౌరవంగా చెప్పింది.

            ఆ ఫలకం రెండు అడుగుల కంటే పెద్దది కాదు. దుమ్ము కొట్టుకుపోయి లేత పసుపు రంగులోకి మారింది. ఒక్కొక్క అక్షరాన్నే పలుకుతున్నాను. Antonio Figafetta, Compagno De Magellon.

            “మేడమ్  ఇది నమ్మలేక పోతున్నాను. ఇది ఫిగఫెట్టా నివసించిన భవనమా!” నేను ఆశ్చర్యపడుతుంటే ఆవిడకి నవ్వు ఆగటం లేదు.

            సప్త సముద్రాల మీద ప్రయాణం చేసి భూమి గుండ్రంగా ఉందని నిరూపించిన యాత్రికుడు ఫెర్డినాండ్‌ మాజిలాన్‌ (1480 – 1521)తో పాటుగా ఉన్న రచయిత ఈ ఫిగ ఫెట్టా. అతడు నివసించిన నగరం విసెంజా అని నాకు తెలియదు. మాజిలాన్‌ గురించి నా ‘మహా యాత్రికులు’ పుస్తకంలో రాసినప్పుడు ఫిగఫెట్టా గురించి లోతైన అధ్యయనం చేయక పోవటమే దీనికి కారణం.

            కీ॥శ॥ 1519వ సంవత్సరంలో 270 మందితో మొదలు పెట్టిన ఆ ప్రపంచయాత్రలో చివరికి పద్దెనిమిది మంది మాత్రమే మిగులుతారు. ఆ అదృష్టవంతుల్లో ఒకడు ఫిగఫెట్టా. ఆ గొప్ప యాత్ర గురించిన అనుభవాలని పుస్తక రూపంలో పెట్టిన ఘనత ఇతనికే దక్కింది ఆ గ్రంథం పేరు ‘Report on the first voyage around world.’ దానిలో మొదటి వాక్యాలు ‘God has permitted me to see and suffer in the long and Perilious navigation which i have performed

నాకు బాగా గుర్తు.

            సెయింట్‌ పీటర్స్‌ బాసిల్లికాలో పొందిన అనుభూతిని మరలా ఇక్కడ పాందగలిగాను. అక్కడ కళా ప్రపంచాన్ని గురించి తెలుసుకుంటే, ఇక్కడ ప్రయాణాల ప్రపంచాన్ని గురించి తెలుసుకున్నాను.

            ఫిగఫెట్టా (క్రీశ॥ 1491-1531) జీవించిన పరిసరాల్లోకి వచ్చినందుకు ఎంతో ఆనందపడ్డాను.

            మరణించిన మాజిలాన్‌ గురించీ, నౌకను క్షేమంగా స్పెయిన్‌ దేశానికి తీసుకు వచ్చిన ఎల్‌ కానో గురించీ తెలియజేసిన పుస్తకం రాసింది ఈ ఫిగఫెట్టా.

            అలాంటి గొప్ప వ్యక్తి నివసించిన నగరాన్ని అతని ఇంటిని దర్శించుకొనే భాగ్యం కలిగింది నాకు. ప్రపంచ యాత్ర చేసిన ఫిగఫెట్టా ఎంత అదృష్టవంతుడో కదా! అనుకొన్నాను. అయితే ఈ ఇద్దరూ జీవించింది చాలా కొద్ది కాలమే.

            “ఫిగఫెట్టా విగ్రహాన్ని ఎక్కడైనా ఏర్పాటు చేశారా? మేడమ్‌!”

            “నేను చెప్పానా! నీకు బాగా నచ్చే ప్రదేశానికి తీసుకు వస్తానని. ఇప్పుడు అతని విగ్రహం వద్దకి వెళదాం రండి” అంటూ అదే రోడ్‌లో ముందుకు వచ్చాక కుడివైపుకి తిరిగి స్టేషన్‌ బాట పట్టుకొన్నాం. సరిగ్గా రైల్వేస్టేషను ముందు ఉన్న పార్కులో ఇరవై అడుగుల ఎత్తులో, నావతో సహా ఉన్న ఫిగఫెట్టా విగ్రహం మరోసారి నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది.

నన్ను అక్కడ నిలబెట్టి చాలా ఫోటోలు తీసింది మేడమ్‌.

“నాకు ఇంత సహాయం చేసినందుకు మీకు నా పెయింటింగ్‌ ఒకటి గిఫ్ట్‌గా ఇస్తాను మేడం” అన్నాను.

“అలాంటివి నాకు వొద్దు, మా ఇల్లంతా పెయింటింగ్‌లే కదా!”

“మరి ఏంకావాలి?”

“మీ ఇండియన్‌ పద్ధతిలో నాకు పుడ్‌ తయారు చేయటం నేర్పండి చాలు!” అందావిడ.

“నాకు స్వయంపాకం చేసుకోవటంలో ముప్పె సంవత్సరాల అనుభవం ఉంది. ఈ సాయంకాలం మీకు మంచి పప్పుచారుతో అన్నం తినిపిస్తాను రండి” అంటూ బజార్లోకి వెళ్ళి, బంగ్లాదేశ్‌ వాళ్ళ షాపులు వెతికి అక్కడ పప్పు దినుసులు, బియ్యం కొనుక్కొని ఇంటికి వెళ్ళాం.

            వాళ్ళ పెద్ద అమ్మాయికి ఫోన్‌ చేయగానే, తన కొడుకుతో సహా వచ్చింది. బియ్యం ఉడికే లోపుగానే, ఒక స్టీలు గ్లాసుని పప్పుగుత్తిగా ఉపయోగించి ఉడికిన కందిపప్పుని మెత్తగా చేయగలిగాను. వెల్లుల్లిపాయలు వగైరాలతో తాలింపు వేయగానే నలుగురూ పళ్ళాలు తీసుకొని సిద్ధంగా కూర్చున్నారు డైనింగ్‌ టేబుల్‌ వద్ద. “వావ్‌,వావ్‌ అంటున్నారు అ ఘుమఘుమలకి అందరూ. నా పళ్ళెం సిద్ధం చేసుకొని రైస్‌ పెట్టుకొనేసరికే పప్పుచారునంతా స్పూన్‌లతో పీల్చి పడేశారు వారు. నేనొక పెద్ద రొట్టెని వేడి చేసుకొని, ఆలివ్‌ ఊరగాయతో కడుపు నింపుకొన్నాను.

            “ఆది, ‘పోప్‌ చారు’ చాలా బాగుంది” అని చెప్పింది. “అమ్మా! మీ పోప్‌ వింటే ప్రమాదం. “పప్పు అని పలకండి” అని వివరించాను.

            “ఇటలీ స్త్రీ  అంటే ఇల్లు అంతా బాగా శుభ్రం చేసుకొని, వంటలు చేసుకొంటూ ఉండాలి. ఇంటికి రాణి అంటే ఆమే కదా” అంది లిప్సీ.

అత్తిలివో మెల్లగా అందుకొని “ఐతే నేను రాజుని” అన్నాడు.

“ఆ రాజుని కూడా తిప్పే రాణిని నేనే కదా, ఆది! ఇటలీలో తలకాయ మగవాడిదైనా, దాన్ని తిప్పే మెడకాయ మాత్రం స్త్రీమూర్తే” అంటూ ముసిముసిగా నవ్వింది. “ఇండియాలో కూడా అంతేనమ్మా” అని నేను తెలియజేయగానే అందరం నవ్వుకొన్నాం.

            ఆ మరుసటిరోజు వెనిస్‌ బయలుదేరాను. రోమ్‌లో పరిచయం అయిన మాంక్‌ నెంబరుకి ఫోన్‌ చేసి మేడంతో మాట్లాడించాను.

            వెనిస్‌ ఇక్కడికి అరవై కి.మీ. దూరం. అందరూ San Marco Churchని చూడటానికి వెళ్తారు. నేనైతే కేవలం మార్కోపోలో ఇల్లు చూద్దామనే బయలుదేరాను.

            విసెంజా స్టేషన్‌లో రైలెక్కాను. ప్రతి కంపార్టుమెంటు నిండా ప్రేమికులే కనిపిస్తున్నారు. పడవలాంటి ప్రియుల వొడిలోనే ఆ ప్రేయసిలు ఊగిపోతున్నారు.

            వెనిస్‌ రేల్వేస్టేషను పేరు “శాంతా లూసియా” ఎదురుగా లేత బులుగు రంగులో చర్చి డోమ్‌ మెరిసిపోతూ, గ్రాండ్‌ కెనాల్‌లో తన ముఖం చూనుకొని అలంకరించుకొంటూ ఉంది. గ్రాండ్‌ కెనాల్‌లో రకరకాల పడవలు విహరిస్తున్నాయి. వరదలాగా యాత్రికులు సాగిపోతున్నారు. గొండోలా వడవల మీద షికార్లు మొదలవుతున్నాయి. అన్నిచోట్లా పొడుగాటి క్యూలే ఉన్నాయి. నడుస్తూ వెళ్ళే

వాళ్ళు పెద్ద వంతెన దాటాలి. చిన్న చిన్న దీవుల్ని కలుపుకొంటూ నిర్మించిన ఈ నీటి నగరం ఆడ్రియాటిక్‌ సముద్రతీరంలో ఉంది. సముద్రం మీద ఊగిపోతున్న పెద్ద బల్లకట్టులాగా ఉంటుంది ఈ నగరం. దాదాపు నూట పద్దెనిమిది దీవుల్ని కలిపి నిర్మించిన నగరం ఈ వెనిస్‌. మొత్తం జనాభా రెండు లక్షలకి దాటదు. నిజానికి ఇదొక పెద్ద లాగూన్‌ (ఉప్పునీటి కయ్య).

            అలా నడుచుకొంటూ వెళ్ళే వారితో కలసిపోయాను. అన్నీ చిన్న సందులు, ఎలాంటి వాహనం తిరిగే వీలు ఉండదు. గ్రాండ్‌ కెనాల్‌ని చూడగానే కెనలెట్టో (1697-1768) అనే ఇటాలియన్‌ చిత్రకారుడు గుర్తుకి వచ్చాడు. కొంతదూరం వెళ్ళాక రిలాటో బ్రిడ్జి వచ్చింది. ఇది గ్రాండ్‌ కెనాల్‌ని దాటేందుకు నిర్మించారు. ఆ ఎత్తు నుండి చూస్తే దాదాపు వెనిస్‌ అంతా కన్పిస్తుంది. అక్కడ నుండి ఈ దీవికి సెంటర్‌ మొదలవుతుంది.

            “మార్కోపోలో ఇంటికి దారి చెప్పండయ్యా?” అని అడిగితే “మార్కో టెంపుల్‌కి దారి చూపిస్తున్నారు. విపరీతమైన జనం “మల్లిబ్రాన్‌ ధియేటర్‌ పక్కనే ఉంటుంది ఆయన నివాసం” అని మాంక్‌ చెప్పిన మాటల్ని గుర్తు పెట్టుకొని చాలా సందులు తిరిగాను. రెండు గంటల పరిశోధన తర్వాత ఒక గొండోలా నడిపే అతడు కరెక్ట్‌ అడ్రస్‌ చెప్పగలిగాడు. అయినాసరే మరో రెండు చిన్న వీధులు దాటాల్సి వచ్చింది.

            నాలుగిళ్ళ చావిడి లాంటి ఒక పెద్ద భవనం, పాత మల్లిబ్రాన్‌ ధియేటర్‌ వెనుక వైపుగా వచ్చింది. అక్కడ ఒక లేడీ గైడ్‌ పదిమంది టూరిస్టులకి ఇంగ్లీషులో మార్కోపోలో గురించి చెబుతూ ఉంది. హమ్మయ్య! అని గుండెల నిండుగా గాలి పీల్చుకొని ఆ పక్కన ఉన్న వంతెన మీద కాసేపు కూర్చొని ఎదురుగా కన్పిస్తున్న ఫలకం మీద మార్కోపోలో పేరు చూస్తూ ఆనందించాను. మొదటి అంతస్థు గోడలకి రెండు అడుగుల పాలరాతి ఫలకం తాపడం చేసి ఉంది. కెనాల్‌లో గొండోలా ఆగిన ప్రతిసారీ కొందరు యాత్రికులు వచ్చి అక్కడ నిలబడి ఫోటోలు తీసుకొంటూ ఉన్నారు. ఈ చిన్న కెనాల్‌ మీదుగా గ్రాండ్‌ కెనాల్‌ని సులభంగా చేరుకోవచ్చు. ఎత్తైన ఆ భవనాల నీడలు, నీటి తొణుకుల్లో కరిగిపోతుండగా మరో గొండోలా వస్తుంది. మహా యాత్రికుడు మార్కోపోలో గురించి మరోసారి అందరూ చెప్పు కొంటారు. ఆ ప్రదేశంలో మార్కోపోలో విగ్రహం ఒకటి పెడితే బాగుంటుంది. అలా

ఎందుకు చేయలేకపోయారో అర్థం కావటం లేదు. మోటుపల్లి తీరం నుండి మార్కోపోలో ఇంటి వరకూ రాగలిగినందుకు ఆనందించాను.

            క్రీ॥శ॥ 14వ శతాబ్ధానికి పూర్వం మార్కోపోలో చూసినంత ప్రపంచాన్ని ఎవరూ చూడలేకపోయారు. నేల మీదా, నీటి మీదా కూడాను. రోమ్‌ నగరం నిండా విగ్రహాలుండగా యాత్రికుల దేవుడికి తన ఇంటి వద్ద విగ్రహం లేకపోవటం నాకు బాధ అనిపించింది. గంటసేపు ఆ పరిసరాల్లో తిరిగి మరలా శాన్‌మార్కో చర్చికి వెళ్ళే ప్రజా ప్రవాహంలో కలిసిపోయాను.

            వెనిస్‌కి రోజుకి అరవై వేల మంది యాత్రికులు వస్తున్నారట. దారిలో ఒకచోట చేపల మార్కెట్‌ ఎదురైంది. అందరూ యాత్రికుల మీద బ్రతికేవారీ. పెద్ద ఆక్టోపస్‌ చేపల్ని వేలాడతీశారు ఒకచోట. అది ఇంకా కదులుతూనే ఉంది. ఎరాస్మస్‌ స్కాలర్‌షిప్‌ మీద ఇక్కడికి వచ్చిన ఒక అర్ట్‌స్టూడెంట్‌ గ్రాండ్‌ కెనాల్‌ ఒడ్డుమీద పెయింట్‌ చేస్తూ కనిపించింది. బరువులు మోయటానికి, చిన్న తోపుడు బళ్ళమీద సామాన్లు తేవటానికి బంగ్లాదేశ్‌ వారే ఉన్నారు. పిజ్ఞారియాలు, తబఛేరియాలు,కెఫటేరియాలు దాటుకొని పోతూనే ఉన్నాను.

            పావురాయి పిట్టలు విపరీతం. షాపింగ్‌ చేసే వాళ్ళే ఎక్కువ. ఒకరినొకరు చూసుకోవటంతోనే సగం కాలం గడిచిపోతూ ఉంది. ఒకరికి మించిన ఫ్యాషన్లు ఒకరు ప్రదర్శిస్తున్నారు. ఇంద్రలోకం మాదిరిగా ఉంది. శాన్‌ మార్కో ప్రాంగణం అంతా భవనాలు, అమ్మాయిలు, గొండోలాలు. దేన్నీ పూర్తిగా చూడలేకపోతున్నాను. పిచ్చిపట్టినట్టుగా షాపింగ్‌ చేస్తున్నారు జనం.

            అత్యంత విశాలంగా ఉన్న శాన్‌ మార్కో ప్రాంగణంలో వేలమంది యాత్రికులు తిరుగుతూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ఆడ్రియాటిక్‌ తీరం మీద అలలు ఏకంగా కాంపౌండ్‌లోకే ఎగిరివస్తున్నాయి.

            వెనిస్‌కి వచ్చే ప్రతి యాత్రికుడికి గమ్యస్థానం ఈ శాన్‌మార్కో చర్చి. సముద్రాన్ని కాస్తంత వెనక్కి జరిపి కట్టినట్లుగా ఉంటుంది. ఎదురుగా సముద్రంలో ఉన్న పెద్ద క్రూయిజ్‌ నౌకలు కొండల మాదిరిగా కదలకుండా ఉన్నాయి.

            పక్కనున్న వ్యక్తి నాతో అంటున్నాడు “ఇవి చూసి మీరు ఆశ్చర్యపోతున్నారా” అని.

            “అవును, వెనిస్‌కి రావటం ఇదే మొదటిసారి” అన్నాను.

            “గతవారం నుండీ నేను ఇక్కడ మా ఫ్యామిలీతో ఉంటున్నాను. M.S.C. Divina అనే క్రూయిజ్‌ నౌక వచ్చింది పోయిన వారం. అది చూస్తే మీరు ఆనందపడేవారు.

“నిజమా! అంత పెద్దదా?”

            “అవును, దాని పొడుగు వెయ్యి అడుగులు. నాలుగు వేల ఐదు వందలమంది యాత్రికులు దాంట్లో ప్రయాణం చేశారు. ఇక్కడికి సంవత్సరానికి ఆరువందల యాభై షిప్‌లు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. నిజానికి వెనిస్‌ని సముద్రం మీదుగా చూస్తే గాని ఈ నగర సౌందర్యం బయటపడదు”.

            ఇతడు చెబుతుంటే ఈ రాత్రికి ఇక్కడ ఉండాలనిపిస్తూ ఉంది. నాకు వెంటనే మాంక్‌ ఇచ్చిన అడ్రస్‌ గుర్తుకొచ్చింది.

            గొప్ప కళాకారులు, సౌందర్యారాధకులు నివసించటానికి ఇష్టపడే ప్రదేశం ఇది. ఈ శాన్‌ మార్కో చర్చి నిర్మాణం. క్రీ॥శ॥ 9వ శతాబ్దంలో మొదలై పదకొండవ శతాబ్ధం నాటికి పూర్తయ్యింది. సముద్రం మీద చేసిన విదేశీ వ్యాపారం వలన వెనిస్‌ అత్యంత ఐశ్వర్యవంతమైన దేశంగా మారిపోయింది. దానికి తగ్గట్టుగానే శాన్‌ మార్కో చర్చి డోముల్ని బంగారంతో తాపడం చేయించారు. అప్పటి నుండి దాన్ని ‘The Church of Gold’అని పిలుస్తారు.

            మ్యూజియం క్యూలో పరిచయం అయిన ఒక రష్యా పౌరుడు శాన్‌ మైఖేల్‌ ఐలాండ్‌ గురించి తెలుసా?” అని అడిగాడు.

            “దాన్ని గురించి అసలు నేను వినలేదు” అన్నాను.

            “మ్యూజియం చూశాక నేను అక్కడికి వెళ్ళాలి. అది సమాధుల కోసం ప్రత్యేకంగా కేటాయించిన దీవి” అని వివరించాడు. క్యూ మెల్లగా సాగిపోతూ ఉంది. సాయంత్రం ఇక్కడే అయిపోయేలాగుంది. మరి అతడు ఆ దీవికి ఎలా వెళ్తాడో తెలుసుకోవాలనుకొన్నాను.

            “నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ నీటి నగరంలో సమాధుల కోసం అంత శ్రద్ధ తీసుకొన్నందుకు” సంభాషణ సాగించాను.

“శాన్‌ మైఖేల్‌ దీవిలో మా రష్యా దేశానికి చెందిన ఇద్దరి గొప్పవారి సమాధులు ఉన్నాయి. వాటిని నేను తప్పనిసరిగా చూడాలి!”

“వాళ్ళ పేర్లు తెలుసుకోవచ్చా?”

“సంగీతకారుడు ఇగోర్‌ స్ట్రావిన్ స్కీ , నోబెల్‌ బహుమతి పొందిన జోసెఫ్‌ బ్రాడ్‌స్కీ .”

            ఈ ఇద్దరి గురించీ నాకు తెలుసు. వాటిని చూడాలని నాకూ అనిపించింది. ఇంతలో నా ముందున్న మరో యాత్రికుడు అందుకొని “ఎజ్రా పౌండ్‌ సమాధి కూడా అక్కడే ఉంది సిన్యోరో” అన్నాడు.

“డెడ్‌బాడీలని అక్కడి వరకు ఎలా తీసుకెళతారు?”

“వాటి కోసం ప్రత్యేకంగా Funeral Gondola ఉంటాయి!”

            మ్యూజియం చూడటానికి సమయం మించిపోవటంతో నాముందు క్యూలో ఉన్న పదిమంది వెనక్కి తిరిగారు.

            “రేపు ఉదయం మీరు అక్కడికి వెళ్ళే పనైతే నేనూ మీతో వస్తాను” అని ఆ రష్యన్‌ పెద్దాయనకి చెప్పగానే ‘య్యా, ష్యూర్‌ అంటూ ఇద్దరం కార్డులు మార్చుకొన్నాం. “ఇక్కడే కలుద్దాం అనుకొని విడిపోయాం.

            నాకు ఇంతకంటే మంచి అవకాశం రాదు. ఎలాగూ మాంక్‌ చెప్పిన అడ్రస్‌ నా వద్ద ఉంది. లేకపోతే ఈ వెనిస్‌లో ఒక రాత్రి ఉండటానికి డోర్మిటరీ అయినాసరే యాభై యూరోలు అవుతుంది. అందుకే ఎక్కువమంది పడోవాకి వెళ్ళి మళ్ళీ తెల్లారి వస్తుంటారు.

            ఆ మాంక్‌ ఇచ్చిన అడ్రసు తెలుసుకొని అక్కడికి వెళ్ళాను. ఒక ప్రీస్ట్‌ కనిపించాడు. కేవలం చిన్న సందుని ఆనుకొని ఉన్న చర్చి. దానిలో గదులు వేరేగాలేవు. చర్చి ఆవరణలోనే పడుకోవాలి. బాత్‌రూం అయితే ఉంది. పక్కనే సైడ్‌ కెనాల్‌. అతడు నాతో ఎక్కువగా మాట్లాడలేదు. ఆ చర్చిని నడిపిస్తున్న ముసలివ్యక్తి తన గదిలో పడుకొన్నాడు. నాకు మాత్రం గుడ్‌ నైట్‌ చెప్పాడు. ఒక పిజ్ఞా తిని పడుకొన్నాను.

            ఎలా నిద్రపోయానో నాకే తెలియదు. వచ్చేటప్పుడు ఓవర్‌కోట్‌ తెచ్చుకొన్నాను కాబట్టి సరిపోయింది.

            తెల్లారగానే పరుగులు తీస్తూ శాన్‌ మార్కో చర్చి వద్దకి వచ్చాను. రాత్రికి పగలుకి తేడా లేకుండా యాత్రికులు వస్తూనే ఉన్నారు. కాశీలో దశాస్వమేధ ఘాట్‌లో ఎప్పుడూ జన సందోహం ఉన్నట్టుగా ఇక్కడా అంతే. ప్రేమకు ఒక వేళాపాళా లేనట్లే ఈ వెనిస్‌ నగర దర్శనానికీ లేదు.

            పొడవాటి పూల కొమ్మలపై పిట్టలు ఊగినట్టుగా, ఆడ్రియాటిక్‌ సముద్ర అలలపై చిన్న గోండోలాలు కనిపించాయి.

            పావురాళ్ళ గుంపులు అలలతోపాటే వెనక్కీ ముందుకు ఎగురుతున్నాయి. రష్యా మిత్రుడు తొమ్మిది గంటలకి వచ్చాడు. మరో ఇద్దరు కూడా కలిశారు. శాన్‌ మార్కో చర్చి నుండి పడవలు లేవు. అందువలన మేము రిలాటో బ్రిడ్జి వద్దకు నడుచుకొంటూ వచ్చాం. అందరం కలిసి ఒక గొండోలాను మాట్టాడుకొన్నాం. మనిషికి ఇరవై యూరోలు తీసుకొన్నాడు. అక్కడ నుండి పదినిముషాల్లో శాన్‌ మైఖేల్‌ దీవికి చేరుకొన్నాం. రెండు కి.మీ. దూరమే. వెనిస్‌ని సముద్రం మీద నుండి చూసే అవకాశం కలిగినందుకు సంతోషించాం.

            ఈ దీవికి సిమెట్రీ ఐలాండ్‌ (సమాధుల దీవి) అనే పేరు కూడా ఉంది. వెళ్ళగానే ఎదురుగా పెద్ద డోమ్‌తో చర్చి కనిపించింది. దీన్ని రినైజాన్సు కాలంలో (1469) నిర్మించారట. వెనిస్‌ పౌరుల సమాధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన దీవి ఇది. ఐతే కొన్ని పరిస్థితుల్లో విదేశీయులకి కూడా ఇక్కడ స్థలం దొరుకుతుంది.

            మేము వెళ్ళేసరికే అక్కడ చాలామంది పుష్పగుచ్చాలు పట్టుకొని తమకు కావాల్సిన వాళ్ళ సమాధి నెంబర్లు, పేర్లు వెతుకుతున్నారు. ప్రతి సమాధి వద్ద చర్చి నిర్వాహకులు పూలు అమరుస్తారు. అంతా ఒక పెద్ద తోటలాగా ఉంది. ఒక జాతి మొక్కకే వందల రకాల పుష్పాలు వికసించినట్టుగా ఉంది వాటిని చూస్తుంటే. అన్నీ లైనుల్లో ఉన్నాయి. అంతా ఒక గ్రాఫ్‌ షీట్‌ లాగా ఉంది. స్ట్రావిన్ స్కీ  సమాధి రెండు అడుగుల కంటే ఎత్తు లేదు. అక్కడ చాలా ఎక్కువ పుష్పగుచ్చాలే ఉన్నాయి. రష్యన్‌ మిత్రుడు తాను తెచ్చిన ‘బొకే’ని అక్కడ ఉంచి, రెండు నిముషాలు మౌనం పాటించి కొన్ని ఫోటోలు తీసుకొన్నాడు. నేనూ ఆ సమాధికి నమస్కరించాను. స్ట్రావిన్ స్కీ కి పికాసో వేసిన స్కెచ్‌లు గుర్తుకు వస్తున్నాయి.

“మీకు అతనంటే ఎంతో ఇష్టం లాగుంది?”

“అవును! నేను సంగీత ప్రియుణ్ణి. పైగా బ్యాలే నాకు ప్రాణం”.

            ఆ పక్కనే ఎత్తుగా ఉన్న ఒక సమాధి వద్దకి వెళ్ళిన మిత్రుడు “మిష్టర్‌, ఇక్కడ మరో రష్యన్‌ కళాకారుడి సమాధి ఉంది చూడండి” అన్నాడు.

ఆ సమాధి తల భాగంలో ఆరు అడుగుల ఎత్తులో ఫలకం ఉంది.

“అవును. అది డిగిలెవ్‌ సమాధి. అతడే ‘బ్యాలే రూసీ’కి స్థాపకుడు!”

డిగిలెవ్‌ సమాధి పాతది లాగా ఉంది. నేనూ దగ్గరకి వెళ్ళాను.

“అవును డిగిలెవ్‌ (1872-1929) ప్రదర్శించిన బ్యాలేలకి సంగీతాన్ని సమకూర్చిన వాడే స్ట్రావిన్  స్కీ (1882-1971). పారిస్‌లో 1910-1913వ సంవత్సరాల్లో డిగిలెవ్‌ ప్రదర్శించిన మూడు బ్యాలేలకి సంగీతాన్ని స్వరపరచటం వలన ప్రపంచ ప్రఖ్యాతి అయ్యాడు స్ట్రావిన్ స్కీ. అప్పటికి స్ట్రావిన్ స్కీ  వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే.”

“చాలా కుతూహలంగా ఉంది ఈ కళాకారుల చరిత్ర”.

తర్వాత జోసెఫ్‌ బ్రాడ్‌స్కీ సమాధి వద్దకి చేరుకొన్నాం. ఆ సమాధుల మధ్య ఉన్న తక్కువ ఖాళీ స్థలాల్లో జాగ్రత్తగా నడవాల్సి వచ్చింది. మాతో ఉన్న మూడో వ్యక్తి స్పానిష్‌ దేశస్థుడు.

“నేను బ్రాడ్‌స్కీ (1940-1996) రచనలు చదివాను” అన్నాడు అతడు.

నాకు మాత్రం అతడు రాసిన Travel Poetry  గుర్తు.

“Always Pick a house

with baby cloths hanging out in the yard,

Deal only with the over fifty crowd” అనే కవితని చెప్పాను.

            “ఇక్కడ కొత్తగా కడుతున్న సమాధుల్ని పది సంవత్సరాలకంటే ఎక్కువ కాలం ఉండనివ్వరు! మీకు తెలుసా?” అని మాతో వచ్చిన స్పానిష్‌ కుర్రాడు చెప్పాడు. కొత్త సమాధులు తవ్వటానికి స్ధలం లేదు కాబట్టి, పాత సమాధుల్ని తవ్వి, వాటి అస్థికల్ని తీసి ఒక చిన్న చెక్కపెట్టెలోకి మార్చి, వాటిని Ossuar అనే వేరే గదుల్లో భద్రంగా దాస్తారు. ఈ సమాధి గోతిలో మరో కొత్త శవపేటికని పాతిపెడతారు. మా గొండోలా తిరిగి వచ్చే సమయం దగ్గర పడటంతో ఎజ్రాపాండ్‌ సమాధి చూడకుండానే జెట్టీ దగ్గరకి చేరుకొని తిరిగి రిలాటో వద్ద దిగి ఎవరి మార్గాన వాళ్ళం వెళ్ళిపోయాం.

            రిలాటో వంతెన పక్కన ఉన్న కాస్తంత ఖాళీ ప్రదేశంలో గ్రాండ్‌ కెనాల్‌ వొడ్డు మీద గంటసేపు కూర్చొన్నాను, నా పాదాలు ఆ ప్రవాహంలో తడుపుకొంటూ. ఒక నల్లని కోర్‌మోరాంట్‌ పక్షి నా పక్కనే వేట చేస్తూ ఉంది. ఆ ప్రదేశాన్ని వదల్లేని కొందరు అమ్మాయిలు ఆ గచ్చుమీద పడి దొర్లుతూ ఉన్నారు, బికినీలు వేసుకొని. వొడ్డుకి కొట్టుకొంటున్న అలలు తుళ్ళిపోయి వారి మీద ముత్యాల వర్షం కురిపిస్తూ ఉంటే ఆనందిస్తున్నారు.

            విసెంజా చేరీనరికి సాయంత్రం అయింది. కొండ ప్రాంతాల్లో ఈ ఉదయం వర్షం పడటం కారణంగా రాత్రికి చలి బాగా వేసింది.

            ఈ రోజు జూలై నెల పదకొండవ తేదీ. నా తిరుగు ప్రయాణం మొదలైంది. విసెంజాలో ఇన్నాళ్ళు ఉండటానికి నహాయం చేసి, అన్నం పెట్టిన అత్తిలివో దంపతులకి ఎప్పటికీ బుణపడే ఉంటాను. “మీరు తప్పని సరిగా ఇండియా వచ్చి మా ఇంట్లో ఉండాలి” అని వారికి చెప్పాను.

            “ఆది, మేము ఎప్పటికి ఇండియా రాలేము. ఆత్తిలివోకి అనారోగ్యం అని నీకు తెలుసు. అతన్ని తీసుకొని నేను అంత దూరం ప్రయాణం చెయ్యలేను.మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు. మరోసారి వెనిస్‌లో విహరించవచ్చు. విష్‌ యు ఎ హ్యాపీ జర్నీ మై డియర్‌ మోడ్రన్‌ మార్కోపోలో” అంటూ లిప్సికా నా రెండు బుగ్గల మీద ముద్దులు పెట్టి గట్టిగా కౌగిలించుకొంది. నేను ఆమె పాదాలకి నమస్కరించాను.

            విసెంజా స్టేషను ముందున్న పార్కులోని ఫిగఫెట్టా విగ్రహం వద్దకి మళ్ళీ వెళ్ళాను. అక్కడ నుండి రైలు మీద రోమా టెర్మినీ (స్టేషన్‌) చేరుకొని నేరుగా ఎయిర్‌పోర్టుకి వెళ్ళి ఫ్రాన్స్‌ దేశానికి బయలుదేరాను.

   *     *     *

Dr. Adinarayana Machavarapu

మాచవరపు ఆదినారాయణ, ప్రకాశం జిల్లా చవటపాలేనికి చెందినవాడు. సాధారణమైన కుటుంబం. తోడూ నీడగా పేదరికం. చచ్చీచెడీ చదువుకున్నాడు. స్వతహాగా ఆర్టి్స్టు. బొమ్మలు వేస్తాడు. ఆంధ్రా యూనివర్శిటీలో ఫైన్ ఆర్ట్స్ లెక్చరర్ గా జాయిన్ అయ్యాడు. అక్కడే ప్రొఫెసర్ గా ఎదిగాడు. చూస్తే యితనో మంచి రచయితనీ, భావుకుడనీ అనిపించదు. ఇండియా అంతా నడిచి తిరిగాడు. సొంత కాళ్లని మాత్రమే నమ్ముకున్న మనిషి. ‘భ్రమణ కాంక్ష’ అనే చిన్న పుస్తకం రాశాడు.  ప్రపంచ యాత్ర ప్లాన్ చేసిన ఆది ఆరు ఖండాల్లో 14 దేశాల్లో తిరిగాడు. ఈ సారి ‘భూ భ్రమణ కాంక్ష’ అని 385 పేజీల ట్రావెలాగ్ రాశాడు. మన చెయ్యి పట్టుకుని దేశ దేశాల్లో తిప్పి అక్కడి సంస్కృతి, కళలు, కవిత్వం, ప్రకృతి శోభనీ కళ్ల ముందు పరిచి చూపిస్తాడు. చాలా అందమైన భాష, చదివించే శైలి. వచన కవిత్వం లాంటి కొన్ని వాక్యాలతో మనల్ని కొండలపైని ఎత్తైన చెట్ల మీదికి తీసుకెళ్లి అక్కడి నుంచి విదేశీ వెన్నెల ఆకాశంలోకి విసిరేస్తాడు. ‘‘అమ్మా నాన్నలతో సమానమైన ఏనుగుల వీరాస్వామి కోసం’’ అంటూ యీ పుస్తకాన్ని ఆ మహా యాత్రికునికి అంకితం యిచ్చాడు.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *