పల్లెతనపు పచ్చికలో సేదతీర్చే ‘ఇల్లింతపండ్లు’ కథలు!

Spread the love

మనిషి మనిషికి తను పొందిన అనుభూతులు, తను చూసిన నేపథ్యం వల్ల కలిగే అనుభవాలు భిన్నంగా ఉంటాయి. కానీ తన అనుభూతులను పాఠకుడి ఊహా నేత్రంలో తన అక్షర బలంతో,తను చెప్పే తీరులోనే ప్రత్యక్షం అయ్యేలా చేసే కథారచయిత కథలు చెప్పడంలో సఫలీకృతమయినట్లే. అటువంటి కథలు ‘ఇల్లింత పండ్లు’ కథలు అయితే; ఆ రచయితే హుమాయున్ సంఘీర్.’ఇల్లింత పండ్లు’ కథాసంపుటిలో పద్నాలుగు కథలున్నాయి, కానీ ఏ కథ కూడా ‘ఇల్లింత పండ్లు’ శీర్షికతో లేదు. సాధారణంగా కథాపుస్తక శీర్షిక ఎప్పుడు ఆ కథల్లోని ఒక పేరుగా ఉంటుంది.కానీ ఈ పుస్తక శీర్షిక అందుకు భిన్నం.అరుదుగా దొరికే అడవి పళ్ళు ఇల్లింత పండ్లు.ఎక్కడా విక్రయించని ఈ పళ్ళు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. తియ్యగా,పులుపుగా,వగరుగా ఉండే ఈ పళ్ళు అందించే ఈ భిన్న రుచుల సంగమంలానే ఈ కథలు కూడా రకరకాల అనుభూతులు పాఠకుల్లో కలిగిస్తాయని రచయిత ముందుమాటలో పేర్కొన్నారు. ప్రకృతితో,పల్లెతో మమేకమై అనేక దృశ్యాలను పాఠకుల కళ్ళకు కట్టేలా చేసే ఆ కథల ఆ భిన్నతను సూచించేదే ఈ పుస్తక శీర్షిక.

వివాహం బంధంలో భార్యాభర్తలు ఒకరిపై ఒకరు ప్రేమ పెంచుకుంటూ, తమకన్నా కూడా ఆ ప్రేమించిన వ్యక్తే ఎక్కువ అన్నట్టు జీవిస్తూ ఉండటం, దాన్ని ‘ఐడియలైజ్’ చేసే వాతావరణం చుట్టూ ఉండటం వల్ల అలానే కొనసాగుతూ వివాహంలో వ్యక్తి తనను తాను పట్టించుకుంటూ,ప్రేమించుకునే స్పేస్ లేని మానసిక ఆవరణ గురించి చర్చించే కథే ‘ప్రేమ.’ ప్రపంచవ్యాప్తంగా నేడు అనేక మానసిక సమస్యలకు కారణం ‘సెల్ఫ్ లవ్’ లేకపోవడమే అని ‘Heal yourself’ పుస్తకంతో ప్రసిద్ధి చెందిన లూయిస్ హే స్పష్టం చేశారు. వైవాహిక బంధంలో ఈ ‘సెల్ఫ్ లవ్’ అంశాన్ని సహజంగా అమర్చగలే కథా వాతావరణాన్ని ఏర్పరచడం కత్తి మీద సామే ఎందుకంటే ‘ప్రేమ-బాధ్యతల’ మధ్య బాధ్యతలే గొప్పవని నమ్మే సామాజిక సంస్కృతిలో మనం జీవిస్తున్నాము కనుక. రచయిత ఆ వాతావరణాన్ని నిర్మిస్తూనే ఈ కథలో ‘సెల్ఫ్ లవ్’ ఉండటం వల్ల ఆ బాధ్యతలను బరువుగా అనుకోకుండా ఎంతో ఆహ్లాదంగా నెరవేర్చవచ్చునని చెప్తూ; అది గాడి తప్పితే ఎలా ఉంటుందో అన్న సామ్యత కూడా ఈ కథలో ఉండేలా జాగ్రత్త తీసుకుని, తను చెప్పదలచుకున్న సున్నితమైన అంశానికి బలాన్ని చేకూర్చారు.అలాగే వివాహ పూర్వం లేదా వివాహమైన కొత్తలో భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ తర్వాత సన్నగిల్లడానికి,ఆ సన్నగిల్లిన క్రమాన్ని అర్థం చేసుకుని,బాధ్యతల వలయంలో చిక్కుకుపోయే జంటలను ఏ కోణంలో ఆలోచిస్తే మరలా ఆ ప్రేమ బలపడుతుందో అన్న కోణాన్ని ఊతంగా నిర్మించి కథానిర్మాణంలో తనకున్న నేర్పును స్పష్టం చేశారు.

రెండవ కథ ‘అనైతికం.’ సాధారణంగా నైతికత అంటే వ్యక్తి విలువలతో ముడిపడిన అంశంగా భావించే నేపథ్యంలో,దానికి భిన్నంగా మనిషి తోటి మనిషిని మనిషిగా చూడలేని తారతమ్యాలను తమ మనసుల్లో నిర్మించుకుని; మనిషికి మనిషికి మధ్య అసమానత్వ గోడలు నిర్మించే సంస్కృతే ‘అనైతికం’అని ఈ కథలో రచయిత స్పష్టం చేస్తారు. ముఖ్యంగా ఈ కథాసంపుటిలోని అనేక కథల్లో పల్లె వాసనలు, ఆ పల్లెను విడిచి వచ్చి పట్టణాల్లో ఉండేవారిని వేటాడే ఆ మధుర స్మృతులు,జ్ఞాపకాలు; ఒక భాగంగా ఉంటాయి. ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో చావు భయం కలుగుతుంది. ముఖ్యంగా పల్లెల నుండి పట్టణాలకు వలస వచ్చినప్పుడు, కులం-మతం ఆధారంగా మనుషులను వేరుగా చూసే సంస్కృతిలో అద్దె ఇళ్ళల్లో చావు సంభవిస్తే అనాథల్లా మారిపోతామేమో అన్న భయం కూడా కలుగుతుంది.ఆ భయం ఉన్న యేసులు కథే ఇది.

మూడవ కథ ‘బుటునా.’ మనిషికి అన్నిటి కన్నా ఎక్కువ భద్రత భావనను కలిగించేది డబ్బు అనడంలో అతిశయోక్తి లేదు. కానీ నచ్చిన దాని కన్నా డబ్బుతో కుటుంబానికి భద్రత ఇవ్వాలని తాపత్రయపడుతున్న నేటి యువత కోల్పోతున్న జీవితపు ఆనందాన్ని గురించి చెప్పే కథ ఇది. ఈ కథలో అనేక చోట్ల రచయిత వాక్యవిన్యాసాలు సూటిగా హృదయాన్ని తాకుతాయి.

‘రంగు కాగితాల కోసం తెల్ల కాగితాలతో కుస్తీ, కంప్యూటర్లకు జీవితాలు రాసిచ్చి టెక్నాలజీని మోసే గాడిదలా బతకడం నచ్చలేదు నాకు. మట్టికి దగ్గర అవ్వడం ఆధునికతలో తిరోగమనం అన్నవాళ్ళు ఉన్నారు. అయినా నేను మట్టిమనిషిగా బతకాలి అనుకున్నాను’, ఈ కథలో రచయిత ముఖ్య పాత్ర అనిసూ గురించి చెప్తూ రాశారు ఓ చోట. ఒక ఐటీ ఉద్యోగి తన మూలాలను వెతుక్కుంటూ, ఆ ఉద్యోగం వదిలేసి తన కుటుంబాన్ని ఆదుకున్న పాల వ్యాపారాన్ని పెద్ద స్థాయిలో చేయడమే కథ అయినా; అనీసు బాల్యంలో పల్లెలో ఆ బర్రెలతో ఆ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని ఎంతో లోతుగా రాశారు. మనలో చాలా మందికి ఇంట్లో పాడి సంపద ఉండటం,బాల్యంలో వాటిని చూస్తూ ఉండటం కూడా జరిగి ఉండొచ్చు.అలాగే వాటికి పేర్లు పెట్టుకుంటూ, వాటిని కుటుంబ సభ్యుల్లా అనుకుంటూ ఉండటం కూడా ఒక జ్ఞాపకంలా ఉండొచ్చు.ఆ జ్ఞాపకాలను తట్టి లేపే కథ ఇది. ఈ నేపథ్యంలో రచయిత ఆ బర్రెల గురించి ప్రతి వివరాన్ని రాయడం అబ్బురంగా అనిపిస్తుంది. ఇందులో ముఖ్య పాత్ర ఆ దారిలోకి వెళ్ళి విజయం సాధించాక, ‘జీవమున్న ఆనందాలను జీవితం పునఃస్థాపితం చేసుకున్నట్టు!’అని ముగింపులో ఆ పాత్ర మనసులో ఉన్న భావోద్వేగాలను స్పష్టం చేసేలా రాశారు. ఈ కథల్లో రచయిత సాధించిన గొప్ప నేర్పు, కథ ముగింపు గాఢతను పాఠకుడి మనసులో ముద్రించుకునేలా చేయగలగడం.

నాలుగవ కథ ‘జయమాలిని.’ స్త్రీలపై జరిగే అత్యాచారాలకు సమాజ స్పందన బయటకు ఒకలా కనిపించినా బాధితురాలు-బాధితుడి మతాల సమీకరణ ఎప్పుడు ముఖ్య ప్రాముఖ్యత వహిస్తుందనేది కాదనలేని సత్యం. ఈ విషయాన్ని పరోక్షంగా చెప్తూ, హిజ్రాల పై దాడి, వారిని దోచుకుంటూ,వారికి కనీస గౌరవం ఇవ్వని మనుషుల గురించి చెప్పే కథ ఇది. ఒక ప్రత్యేక ప్రపంచంగా ఏర్పడి థర్డ్ జెండర్ వాళ్ళు తమ సంతోషాలను,బాధలను,అనుభూతులను పంచుకుంటూ;సమాజం అంగీకరించని పరిస్థితుల్లో,అవమానాలకు గురవుతూనే, మనిషితనంలో ఎదగని మనుషుల మధ్య కూడా తమ సంస్కారాన్ని నిలుపుకునే వారి పట్ల పాఠకులకు ఈ కథ చదివితే గౌరవం రెట్టింపు కాక మానదు.

ఐదవ కథ ‘ఆత్మ కథ.’ సినీ రంగంలో కథా చౌర్యం గురించి చమత్కారంగా రాసిన కథ ఇది. ఈ చమత్కారంలో ఒకరి ప్రతిభను ఇంకొకరు క్యాష్ చేసుకుంటూ, పేరు ప్రఖ్యాతులు పొందే వారి పట్ల ఆక్రోశము కూడా ఉంది. సినిమా కలలతో వచ్చేవారు జాగ్రత్త పడాల్సిన అవసరం గురించి సున్నితంగా చేసే హెచ్చరిక కూడా ఉంది.

ఆరవ కథ ‘ఇబ్లీస్.’ ఈ కథ చదువుతుంటే ‘ఎంత గొప్ప కథ రాశాడు రచయిత!’అన్న భావన కలుగక మానదు. మతం మనిషిలో ఒకరి కోసం ఎంతో మంది ఉంటారన్న భరోసాను కలిగిస్తుంది. కానీ మతోన్మాదం మనిషిని రాక్షసుడిని చేస్తుంది. వ్యక్తికి మతం పట్ల గౌరవం ఉండాలి తప్ప, దాని కోసం మనిషిగా ఉండలేని వాతావరణాన్ని ఏర్పరిచే సంకెళ్లతో బంధి కాకూడదని, ‘మతం కన్నా మానవత్వం గొప్పదని’ చెప్పే కథ ఇది. దీనికి నేపథ్యంగా ‘మిలాదున్నబీ’పండుగ వేడుకలను తీసుకోవడం; పిల్లలను చిన్నప్పటి నుండే ఏది వాస్తవం?ఏది కాదు?ఏది మూఢ నమ్మకం? వంటి విషయాల గురించి తెలుసుకునేలా చేయలేకపోతే వారు ప్రమాదకరులుగా మారే అవకాశం ఉందని చాలా గట్టిగా చెప్పిన కథ ఇది.

ఏడవ కథ ‘కోపిన్ బియ్యం.’ సమాజంలో ఉన్న అసమానతలను భిన్న కోణంలో పరిచయం చేసే కథ ఇది.రేషన్ బియ్యం,దుడ్డు బియ్యం అని పిలుచుకుంటూ గ్రామాల్లో పేదవారు దాన్ని తినడం గురించి మనకు తెలిసిందే. తినే బియ్యం రకాన్ని బట్టి కూడా మనుషుల స్థాయిని నిర్ణయించే సమాజంలో బ్రతుకుతున్నామని, మనిషి తినే తిండికి కూడా సమాన గౌరవం ఇవ్వలేని సంకుచిత్వ మనసులే ఇంకా ఉన్నాయని రచయిత ఆవేదన పడిన కథ ఇది.

ఎనిమిదవ కథ ‘గుండె గది.’ కోవిడ్ సమయంలో మనుషులు మనుషులు కాకుండా మారిపోయిన తరుణంలో ఓ వృద్ధ జంట ప్రేమను,ఆ ప్రేమతో వారు కరోనాను జయించిన తీరును హృద్యంగా రాసిన కథ ఇది. తొమ్మిదవ కథ ‘చమ్కీ.’ ముస్లిముల కుటుంబాల్లో ముఖ్యంగా తల్లిదండ్రులు లేని ఆడపిల్లలను పైకి చూసుకునే బాధ్యత తీసుకున్నా,ఆ ముసుగులో వారిని వ్యాపార వస్తువులుగా మార్చుకునే వారి నుండి, ఇద్దరూ అక్కాచెల్లెళ్ళు ఎలా తప్పించుకున్నారో చెప్పే కథ ఇది.

పదవ కథ ‘చింత.’ ఈ కథ చింతపండు గురించి రాసింది. చింతపండుతో ఇన్ని జ్ఞాపకాలు,జీవితాలు ముడిపడి ఉంటాయా అని పాఠకులను ఆశ్చర్యపరిచే కథ ఇది. ‘నా భార్య జీవితకాలం నీళ్లోసుకున్న పులుపు ప్రీతురాలు’అని రచయిత ఈ కథలో కథకుడి భార్యకు చింతపండు అంటే ఎంత ఇష్టమో అన్న విషయం గురించి చెప్తూ రాశారు. ఏం చమక్కు ఉన్న వాక్యం! చింత గింజలతో ఆటలు,చింతగింజల గొలలు, చింత చెట్టు అంటే భయపడటం నుండి అనేక జ్ఞాపకాలను ఈ కథలో గొప్ప దృశ్యాలుగా ప్రత్యక్షమయ్యేలా రాశారు.

పదకొండవ కథ ‘దినార్ గాయం.’ దేశం కానీ దేశంలో సంపాదన కోసం యవ్వనమంతా కరిగించుకుని ఉండి, డబ్బు పరంగా లోటు లేకుండా కుటుంబాన్ని స్థిరపరిచి,వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ సంపాదనాపరుడికి మిగిలేది ఏమిటి? కోల్పోయిన యవ్వనం, కోల్పోయిన కుటుంబ అనుభూతులు, భార్యతో ముద్దు ముచ్చట్లు. ఈ నేపథ్యంలో దినార్ల కోసం మనసుకు అయ్యే గాయాలకు మందు లేదని చెప్తూ; ఎందరో భార్యాభర్తలు తమ యవ్వనాన్ని,నడి వయసును కోల్పోతూ చివరకు ‘ఏం మిగిలింది?’ అని బాధ పడే జీవితాలను పరిచయం చేసే కథ ఇది.

పన్నెండవ కథ ‘దేవ్లా నాయక్.’ ఒకరిని అనుకరిస్తూ, ఆ అనుకరణను తమ సొంత ప్రతిభగా నమ్మించే వారికి బుద్ధి చెప్పాలని ఘాటుగా రాసిన కథ ఇది. పదమూడవ కథ ‘నమిత.’ ఈ ‘ఇల్లింత పండ్లు’ కథల్లో స్త్రీ కేంద్రంగా రాసిన ఒకే ఒక్క కథ ఇది. స్త్రీల పై జరిగే అత్యాచారాలను ఖండిస్తూ రాసిన కథ ఇది. పద్నాలుగవ కథ ‘దిద్దుబాటు.’ ముస్లిం సంస్కృతిలో ఉండే రెండో పెళ్ళి గురించి, ఆ నేపథ్యం ఏర్పడిన పరిస్థితుల గురించి రాసిన కథ ఇది.

ప్రతి కథారచయిత కథల్లో భిన్నత ఉన్నా, కథన క్రమంలో మాత్రం ఒక భావమో,వాదమో లేక అభిప్రాయమో తప్పకుండా ఆ కథల్లో స్థిరంగా ఉంటుంది. సంఘీర్ గారి ఈ ‘ఇల్లింత పండ్లు’ కథల్లో, మనిషి ప్రకృతి నుండి దూరంగా జరగకూడదని, బాల్యంలో పల్లెటూరి జీవితంలో ఉన్న మధుర స్మృతులను వీలుంటే ఇప్పుడు కూడా పునరావృతమయ్యేలా చేసుకోగలిగితే ఆ అవకాశం వదులుకోకూడదని, బాల్యంలో చూసిన వాటిని గొప్ప జ్ఞాపకాలుగా మనసులో స్థిరపరుచుకుంటే,అవి ఓ కొత్త బలాన్ని ఇస్తాయన్న భావన ఉంది. సమాజంలో అసమానత్వం కులం,మతం,వర్గం వంటి వాటి మీద ఉండటం నాణేనికి ఒక వైపు అయితే ప్రతిభా చౌర్యం వల్ల జరిగే అన్యాయం వల్ల తలెత్తే అసమానత్వం ఇంకో వైపు ఉంది.బయటకు కనిపించకుండా జరిగిపోయే వీటిని గుర్తించి,ఎదిరించాలన్న వాదము ఉంది. అలాగే కుటుంబ పోషణ కోసమో లేక సమాజంలో హోదా కోసమో నచ్చిన వాటిని వదలకూడదని,పట్టుదలతో సాధించి జీవితాన్ని నిర్మించుకోవాలి అనే అభిప్రాయము ఉంది. ఈ కథల్లో అంతర్లీనంగా ఈ భావన,వాదం,అభిప్రాయం సమ్మేళనంగా లోతుగా గమనిస్తే కనిపిస్తాయి.

హుమాయున్ సంఘీర్ గారి మొదటి కథా సంపుటి ‘కామునికంత’కు ‘శ్రీమతి కొలకలూరి భాగీరథీ కథానిక పురస్కారం-2024’ ప్రకటించారు. ఇప్పటి రెండవ కథాసంపుటి కూడా పల్లెటూరి పచ్చికల్లో మన సేదతీరిస్తూ, అక్కడి జీవనంలో ప్రకృతితో మమేకమయ్యే ఆహ్లాదమైన భావనను కలిగిస్తాయి. గొప్ప కథా నేర్పుతో, వాక్య విన్యాసాలతో, పల్లెటూరి మనసులను స్వచ్చంగా బయలు పరిచే పదజాలంతో, లోతైన అంశాలను సున్నితంగా, ప్రశ్నించాల్సిన అంశాల పట్ల ఘాటుగా స్పందిస్తూ రాస్తున్న హుమాయున్ సంఘీర్ గారికి ఈ సందర్భంగా అభినందనలు. జీవితంలో మధురస్మృతులుగా మారే జ్ఞాపకాలను మీ గుండెగదుల్లో పదిలం చేసుకోవాలంటే మీరు కూడా ఈ ‘ఇల్లింత పండ్లు’ తప్పకుండా చదవండి.

Rachana Srungavarapu
Author & Translator

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *