***
రష్యన్ రచయిత ఫ్యోదర్ మీఖలోవిచ్ దోస్తోయేవ్ స్కీ పుట్టి 2021 నవంబర్11 నాటికి 200 సంవత్సరాలయింది. “నేరము- శిక్ష” ,పేదజనం శ్వేతరాత్రులు, ఇడియట్, బ్రదర్స్ కరమజోవ్ నవలతో ప్రపంచ సాహిత్య పునాదుల్ని పెకలించిన ‘నేరస్తుడు’ దోస్తోయేవ్ స్కీ
ఆ మహారచయితని స్మరించుకుంటూ హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో నవంబర్ 13 సాయంకాలం ఒక సాహిత్యసభ జరిగింది. రచయిత కూనపరాజు కుమార్ దోస్తోయేవ్ స్కీ మూడు పుస్తకాలను అనువాదం చేయించారు. వాటిని విజయవాడ ‘సాహితీ’ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఆ పుస్తకావిష్కరణ సభకి ముఖ్య అతిథిగా తిరుపతి నుంచి వచ్చిన మధురాంతకం నరేంద్ర ఎంతో అద్భుతంగా ప్రసంగించారు.
నరేంద్ర గారిని ఇంటర్వ్యూ కావాలన్నాను. “ఎందుకూ మాట్లాడుకుందాం రండి ” అన్నారాయన. ఇంగ్లీష్ లిటరేచర్ నుంచి శరత్, జయకాంతన్ దాకా, జిడ్డు కృష్ణమూర్తి నుంచి శ్రీపాద, పెద్దిభొట్ల సుబ్బరామయ్య దాకా నరేంద్ర విస్తృతంగా మాట్లాడారు. హైదరాబాద్ లకడికాపూల్ లోని హోటల్లో, ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడిన వాటిల్లో ప్రధానమైనవి :
టాల్ స్టాయ్ ఆనాకెరినినా, శరత్ శ్రీకాంత్ ఒక కొత్త mould లో వచ్చిన భిన్నమైన నవలలు. నిజానికి ఆనా చనిపోవడంతోనే ఆ నవల అయిపోవాలి. కానీ, ఆ తర్వాత లెవిన్ జీవితం గురించి ఏకంగా 275 పేజీలు రాస్తాడు టాల్ స్టాయ్. శ్రీకాంత్ లో ఎన్నో లూజ్ ఎండ్స్ ఉంటాయి. అయితే, అది చెవుల్లో ఒక ఆర్కెస్త్రాలా వినిపించే నవల, ఆ సంగీతం వేరు.
స్టీన్ బెక్ రాసిన grapes of wrath కూడా typical documentory లా ఉంటుంది. జెనరల్ గా అది తప్పు అంటారు. ఆయన కాదంటాడు. వాళ్ళకి జీవితం ముఖ్యం. తర్వాతే కళ. దోస్తోయేవ్ స్కీ అయితే ఒక మహాసముద్రమే. బ్రదర్స్ కరమజోవ్
ఒక విప్లవం. కాఫ్కా, కామూలకి అదే మూలం.
విలియం ప్యాక్నర్ కి అయితే ఈ నవలే బైబిల్!
ఇ. ఎం. ఫాస్టర్ ప్రాఫెసీ…only dostoyevsky.
విషయానికి విస్తృతి కల్పిస్తాడు దోస్తోయేవ్ స్కీ. బ్రదర్స్ కరమజోవ్ పితృహత్య గురించిన డిటెక్టివ్ నవల. హాస్యం ఉండదు. ఈ రచయిత ఎంటర్టైనర్ కాదు. ఈ నవలలో 11 రిపిటిషన్స్ ఉంటాయి. అవి అవసరం. జీవితకాలంలోనే మరణాన్ని నరకాన్ని చూసినవాడు దోస్తోయేవ్ స్కీ. మనిషిని చదివినవాడు. ప్రేమించినవాడు. మనిషి ఒంటరిగా ఉంటే సాదించేదేమీ లేదు.సంఘజీవి కావాలి. కరమజోవ్ బ్రదర్స్ ప్రతిమనిషికీ, మానవజాతికీ ప్రతినిధులుగా ఉంటారు. దోస్తోయేవ్ స్కీ రాసే విషయాలు నమ్మశక్యంగా ఉండవు. అస్పష్టంగా, అబ్సర్డ్ గా ఉంటాయి. విషాదహాస్యం (గ్రాటెస్క్యూ humour)ఉంటుంది. ఏసుక్రీస్తుని నిలదీస్తాడు. నువ్వు inadequate అంటాడు. ఏసు ఉనికినే ప్రశ్నిస్తాడు. మానవత్వానికీ దైవత్వానికీ తేడా లేదంటాడు. దీనికోసం ఏసుక్రీస్తునే ఎదిరిస్తాడు.
ఆత్మక్షాళన కోసమూ,ఒక నిర్వికారమైన దశని అనుభవించడం కోసమూ బ్రదర్స్ కరమజోవ్ చదవాలి. చివరికి కరుణ తప్ప ఏ ఫీలింగూ ఉండదు. అంతులేని నీచత్వానికి ఓడిగట్టేవాడూ మనిషే. కరుణతో కరిగిపోయేవాడూ అతనే. ఎన్నోరకాల ఎమోషన్స్ ని డీల్ చేస్తాడు. పాఠకుడికి చాలా టఫ్ గా ఉంటుంది. మనం దొరికిపోతాం దోస్తోయేవ్ స్కీకి. పశువు మనిషంత కళాత్మకంగా, క్రూయెల్ గా ఉండదు. Raw feelings ని రాస్తాడు. ఒక ఆధ్యాత్మిక ప్రయాణం అది. మానవాళి మీద నమ్మకం కలుగుతుంది. దోస్తోయేవ్ స్కీని చదవడానికి రెండు అర్హతలు ఉండాలి. 1. వినయం, 2. సహనం.
ఈయన నవలల్లో కలలకి ప్రాధాన్యం ఉంటుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ కి గురువు దోస్తోయేవ్ స్కీ.
ఆయన రచనల అనువాదం తేలిక పనికాదు. అనువాదాలంటే ఎంబ్రాయిడరీని వెనుకవైపు నుంచి చూసినట్టు ఉంటుంది. అన్నీ వేలాడే దారాలే కనిపిస్తాయి. బ్రదర్స్ కరమజోవ్ చదువుతుంటే మన శరత్ చంద్ర చటర్జీ ‘విప్రదాసు’ గుర్తొస్తుంది అంటారు నరేంద్ర.
***. ***
అప్పుతీర్చడం కోసం, పబ్లిషర్ ఒత్తిడి వల్ల, దోస్తోయేవ్ స్కీ క్రైమ్ అండ్ పనిష్మెంట్, గ్యాంబ్లర్ నవలలు రెండూ రాసాడు. వేగంగా రాసుకుపోవడం వల్ల శిల్పం దెబ్బ తింటుంది. హర్రీడ్ గా రాసింది హామ్లెట్. ఒక క్లాసిక్ అలాగే పుడుతుంది.
Classic గురించి చెబుతూ మార్క్ ట్వైన్ “which everybody wants to have read. But none wants to read” అన్నారు.
మహారచయితలు penetrating looks తో gloomy గా ఉంటారు. పరమజాలితో చూస్తుంటారు. టాల్ స్టాయ్, దోస్తోయేవ్ స్కీ, శరత్
నవ్వుతున్న ఫోటోలు మనం ఎక్కడా చూడం.
రచయితలుగా శరత్, తెన్నేటి సూరి నాకు బాగా ఇష్టం. సూరి, చంఘిజ్ ఖాన్ని ఇప్పటికీ అనువాదం అనుకునే మూర్ఖులు ఉన్నారు. గార్షియా మార్క్వెజ్, స్టీన్ బెక్, జాక్ లండన్ గొప్పరచయితలు.
జాక్ లండన్ని తక్కువ చేస్తారు లెఫ్టిస్టులు. అది అన్యాయం. మార్క్ ట్వైన్ అనగానే అంతా ‘టామ్ సాయర్’ అంటారు గానీ, దానికంటే గొప్పది హకల్ బేరీ ఫిన్. అయినా, అవి ఆకాశంలో నక్షత్రాల్లాంటివి… ఒకటి గొప్పది మరొకటి కాదు అని చెప్పలేం!
ఎడ్గార్ ఆలెన్ పో నాకు అబ్సెషన్. పో, ఒనీల్ నన్ను భయపెట్టేవారు. వాళ్ళు ముంచేస్తారు. మార్క్వెజ్ love in times of colhera మూడుసార్లు చదివాను.chronicle of a death foretold కూడా .
గ్రాహంగ్రీన్, విలియం గోల్డింగ్ నచ్చుతారు. గోల్డింగ్ మొదటి నవల ‘lord of the flies’ aligory. దానికి నోబెల్ ప్రయిజ్ వచ్చింది. అది most fascinating narrative. శరత్ శ్రీకాంత్ లో నాలుగు దశలుంటాయి. జీవితంలో ఉండే నిమ్నోన్నతాల్ని, స్త్రీల త్యాగశీలతని చూపించాడు. శరత్ నవల్లోనూ loose ends ఉంటాయి.
దోస్తోయేవ్ స్కీ, శరత్ లు బొమ్మా బొరుసు.
శరత్, జిడ్డు కృష్ణమూర్తికి దగ్గరగా వస్తాడు.
*** *** ***
మధురాంతకం నరేంద్రకి 64 ఏళ్ళు.తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో 30 ఏళ్ళు ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేశారు. ఎస్వీ కాలేజీ ప్రిన్సిపాల్ గా రిటైరయ్యారు. వంద కథలు, అయిదు నవలలు రాసిన నరేంద్ర, చాలా easy గా, హాయిగా పోజు బేషజం లాంటివి లేకుండా సన్నిహిత మిత్రులతో కబుర్లు చెబుతున్నంత lively గా మాట్లాడతారు. దేనికీ ఆశ్చర్యపోవడం, కోపం తెచ్చుకోవడం, రెచ్చిపోవడం వుండదు. ఇంగ్లీష్ లిటరేచర్ తెగ చదివి ఉండటం వల్ల (ఉద్యోగమూ అదే మరి!) Annecdotes అరుదైన కొటేషన్ల లాంటివి ఎన్నో చెబుతూ అలవోకగా ఒక లిటరరీ జర్నీలోకి తనవెంట లాక్కుపోతాడు.
నరేంద్ర కబుర్లపోగు. మాటలా? కావవి!
నిప్పుల్లా కాలుతున్న నిజాయితీ. కాస్త పొట్టిగా, బట్టతలతో, సాధారణమైన మధ్యతరగతి వాడిలా ఉండే యీ మనిషి అస్సలు రచయితలా కనిపించడు. ఆయన ప్రపంచ నవలలు, రచయితల పేర్లు చెబుతూ, కోట్ చేస్తూ, గొప్ప కథలని గుర్తు చేస్తూ ఉంటే, ఈ దిక్కుమాలిన జీవితంలోనే ఇంత చదువుకోవచ్చా? అనిపిస్తుంది.
” భలే మనిషిని కలిశాం. మరిచిపోలేని quality time spend చేసాం అని కూనపరాజు కుమార్, నేనూ సంతోషంగా చీర్స్ చెప్పుకున్నాం.
*** *** ***
ఇంగ్లీష్ లెక్చరర్ అనేది చాలా demanding job.
we are forced to read అన్నారాయన.
*** *** ***
I don’t search for anything, i find అన్నాడు పికాసో.
రైటర్స్, పెయింటర్స్, మ్యూజిషియన్స్ నుంచి మనం నేర్చుకోవాలి. చెహోవ్, మొపాసా, ఓ హెన్రీలే కాదు. 44 ఏళ్లు మాత్రమే జీవించిన ఎడ్గార్ ఆలెన్ పో ని కూడా చదువుకోవాలి.
బ్రదర్స్ కరమజోవ్ సినిమా ఉంది.హీరో యూల్ బ్రినర్ మిత్యా పాత్ర వేసాడు.చూసి తీరాలి.
డైరెక్టర్: రిచర్డ్ బ్రూక్స్.
రష్యా పోవాలండీ, చచ్చిపోయేలోగా ఓసారి, బెంగాలీలూ, రష్యన్లూ…వాళ్ళవెనకొక కల్చర్ ఉంది!
రష్యన్లు నాస్తికులు అయితే, వాళ్ళు నాస్తికత్వాన్నే మతం చేసేస్తారు అన్నాడు దోస్తోయేవ్ స్కీ. ఇప్పటికైతే ఉత్తమమైంది మార్క్సిజమే. అయితే మార్క్సిజాన్ని మనం మతం చేసేసాం.
ఒక రావిశాస్త్రి లాగా,ఒక దోస్తోయేవ్ స్కీలాగా బతకాలి. మన రవీంద్రనాథ్ ఠాగూర్ short story pioneers లో ఒకరు. ఆయన కథని భారతీయం చేసాడు. ఎడ్గార్ ఆలెన్ పో కథ the fall of the love of usher అలాంటి ఒక్క కథ ఉంటే చాలు…దానికి భాష్యకారులుంటారు. 20th century interpretation అనే సీరీస్ ఉంది. ప్రతీ క్లాసిక్ మీదా అలా అలాంటివి ఉన్నాయి. శామ్యూల్ బెకెట్, ఇలియెట్ మీదా ఉన్నాయి.
వాళ్ళు విమర్శల్ని పుస్తకం వేస్తారు.
ఇక్కడైతే మన ఠాగూర్ మీద ఏమీ ఉండదు…ఇలా ఇష్టాలు చెప్పుకుంటూ, సున్నితంగా చురకలు వేస్తూ చుట్టూ ఒక సాహిత్యావరణం సృష్టించారు నరేంద్ర.
*** *** ***
“ఇంతకీ ఎందుకు రాస్తాం అంటే ఒక epipheny కోసం…రాయెద్దులెండి,
*******
ఎంత రచయిత ఐనా జీవితం ముందు పోజు కొట్టకూడదు : మధురాంతకం నరేంద్ర part-2
————————————————————–
ఇలా స్పష్టంగా మాట్లాడతాడాయన.
సాహిత్యం, సమాజం, జీవితం పట్ల – అందులో
ఉండే వివిధ అంశాలూ, లోటుపాట్ల పట్ల –
ఒక క్రిస్టల్ క్లియర్ క్లారిటీ.
ఇటీవల ‘మనోధర్మపరాగం’ రాసి, కళావంతుల జీవితాల్లోని చీకటి కోణాల్ని, కళాకాంతుల్ని మన కనులముందు పరిచి, దేవదాసీ ఆత్మగీతాన్ని ఆలపించిన మధురాంతకం నరేంద్ర తేటనీటి వూటలాంటి మనిషి. అనవసర సంశయాలూ, భయలూ, గందరగోళాలు లేని సరళ రేఖ లాంటి రచయిత. వాస్తవం ఎక్కువగా కల్పన తక్కువగా ఉండే కథలంటే ఇష్టం ఆయనకి. కొమ్ములు తిరిగి, ఖ్యాతిగాంచి, విస్మరించదగని ఎంత పెద్ద రచయిత అయినా, నిలిచే కథలు నాలుగైదే ఉంటాయి. మహారచయితలు ఎవరైనా అందరికీ తెలిసినవి కొన్నికథలే ఉంటాయి.
వాళ్ళు రాసింది బాగుందిగనక నిలబడింది.
మనం చెబితే నిలబడుతుందా?
రచయిత శరత్ చంద్ర అంటే నాకు అసూయ.
30 నవలలు రాశాడు. అంతా బంగారమే. చాలా పుస్తకాలు రాశాడని కాదు. శరత్ వి జీవితాన్ని చూసినవాడి కళ్ళు. మంచి సాహిత్య సృజన చేసినవాడు, మంచిమనిషి అయ్యుండాలి. అంతేకాదు, ఎన్నోత్యాగాలు చేసివుండాలి. శరత్ రాయడమేకాదు, మురికివాడల్లోనే బతికాడు. మెజారిటీ మనుషులలో మమేకం అయ్యుండకపోతే మంచిరచయిత కాలేడు” అని చెప్పారు.
హోటల్లో relaxed గా ఉన్న నరేంద్ర, భుజంమీద చెయ్యేసి కబుర్లు చెబుతున్న మిత్రుడిలా సాహితీ వృక్షాల చల్లని నీడల్లో మమ్మల్ని నడిపించారు. జ్ఞానం అనే పెద్దమాటలు లేకుండా, చీకటి పడుతున్న వేళ మా అరచేతుల్లో చిరువెన్నెల దీపాలు వెలిగించారు. కూనపరాజు కుమార్, కొర్రపాటి శేషు, ప్రశ్నలు అడుగుతూ నేను…
*** *** ***
ప్రపంచంలో ఉన్నదంతా ప్రాంతీయ సాహిత్యమే!
టాల్ స్టాయ్ నుంచి రాచకొండ విశ్వనాథశాస్త్రి దాకా అంతా ప్రాంతీయ రచయితలే, ఎవరైనా సరే, జీవితం ముందు పెద్దపోజు కొట్టకూడదు.
స్కీం అంటూ ఏమీ ఉండదు.
కేశవరెడ్డి రచయితగా కంటే గొప్పమనిషి.
గొప్పమనిషి కంటే గొప్పరచయిత.
నాకు చాలా సన్నిహితులు. మా ఇంట్లో ఉండేవాడు. ‘అతడు అడవిని జయించాడు’ రాసిన కొత్తలో, నన్ను ‘తెలుగు హెమింగ్వే’ అనాలి అనేవాడు. తర్వాత ఆ మాట అనలేదు. కేశవరెడ్డి ‘మూగవాని పిల్లనగ్రోవి’ అల్టిమేట్ క్లాసిక్. ఆయన ‘మునెమ్మ’ రాసి ఉండకూడదు. కేశవరెడ్డి ‘magnum opus’
మాత్రం రాలేదు.
నామిని సుబ్రహ్మణ్యంనాయుడి, ‘పచ్చనాకు సాక్షిగా’ remarkable’. తర్వాత ఎందుకో ఆ స్థాయిలో రాయలేకపోయాడనిపించింది.
వడ్డెర చండీదాస్ ఫిలాసఫీ ప్రొఫెసర్. నాకు బాగా తెలిసినవాడు. ఆయన హిమజ్వాల, అనుక్షణికం రెండూ మంచి నవలలు. ఆ రెండూ నాకు ఇష్టం. గీతాదేవి, కృష్ణచైతన్యతోనూ, వాళ్ళ నాన్నతోనూ ఉంటుంది.
It includes many moral and ethical issues. చండీదాస్ లో క్రమంగా జీవితేచ్ఛ పోయింది. చివరి రెండేళ్లు అసలు మాట్లాడనేలేదు. I am engulfed by silence అన్నాడు.
జీ. ఆర్ .మహర్షి ‘ఆంధ్రా నెపోలియన్’ చాలా మంచి నవల. సెటైర్ బాగా రాస్తాడు.
విశ్వనాథ ‘వేయిపడగలు’ – most frightening book (రివైవలిస్ట్ నాన్సెన్స్ అని ఆయన చెప్పదల్చుకున్నారేమో!)
తెలుగులో ఉన్నంతమంది మాస్టర్ స్టోరీటెల్లర్స్ ప్రపంచంలో మరేచోటా లేరు.
the best : శ్రీపాద, చలం, కోకు, రావిశాస్త్రి, బుచ్చిబాబు, ఆర్. వసుంధరాదేవి, మధురాంతకం రాజారామ్, పెద్దిబొట్ల సుబ్బరామయ్యా, కాళీపట్నం రామారావు, కొలకలూరి ఇనాక్ మనకు ఉన్నారు. ఇంతా చేస్తే గురజాడ అయిదు కథలే రాశారు.
అన్నీ మాస్టర్ పీస్ లే. ‘దిద్దుబాటు’ అని అంటారు గానీ, ‘దేవుళ్ళారా మీ పేరేమిటి’ ఒక అద్భుతం.
పెద్దిబొట్ల ముసురు, ఇంగువ, నీళ్లు…ఇంకా ఎన్నో గొప్ప కథలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా పెద్దిబొట్ల పలికించేది కరుణరసం. తెలుగు కథకుల్లో భవభూతి మన పెద్దిభొట్ల.
మనకి విమర్శ తక్కువ. రాచమల్లు రామచంద్రారెడ్డి, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, సీ. ఆర్. రెడ్డి, ఆర్. ఎస్. సుదర్శనం, కెవియార్…అంతా రాయలసీమ నుంచే వచ్చారు. వల్లంపాటి వెంకటసుబ్బయ్య, కేతు విశ్వనాథ రెడ్డి, సింగమనేని నారాయణ నాకు బాగా తెలిసినవాళ్ళు. అయితే క్రిటికల్ ఎనాలసిస్ అనేది మనకి తెలీదు. పొగడ్డమో, తిట్టడమో! అంతే! అసలు చదివితే కదా!
*** *** ***
గుంటూరు శేషేంద్రశర్మ మనకి ఒక వరం. ఆయన కవిత్వం నాకు ఇష్టం. 1976 – 79 సంవత్సరాల్లో తిరుపతి వెంకటేశ్వరా యూనివర్సిటీలో శేషేంద్ర వారంరోజుల పాటు ఉపన్యాసాలతో ఊగించారు. చేతిలో కాగితం ముక్క ఉండేది కాదు.
అవి నిజంగా గొప్ప ఉపన్యాసాలు.
Personification of Poet లా ఉంటారు.
నర్తనశాల, పాండవ వనవాసం లాంటి ఉత్తమ చిత్రాలు తీసి ద్రౌపదిని మన అమ్మాయిని చేసేశారు. ఎం. వీ. రమణారెడ్డి, ‘తెలుగింటికొచ్చిన ద్రౌపది’ అని ఎంతో చక్కగా రాశారు. తిక్కన, ద్రౌపదిని ఎలా తెలుగింటి అమ్మాయిని చేశాడు అనేది డా. రమణారెడ్డి పరిశోధనాంశం.
సంపూర్ణ కుటుంబ కథాచిత్రం!
——————————————-
మా ఇంట్లో అందరూ రాసేస్తారు. చిన్నకథలు రాయడం సహజంగా వచ్చేసినట్టు! అయితే నా favorite storyteller మాత్రం మా నాన్నగారే! ఆయన మొత్తం 350 కథలు రాశారు. అందులో ఉత్తమ కథలు పది ఉంటాయి. మొత్తం కథలతో ఎమెస్కో వాళ్ళు లైబ్రరీ ఎడిషన్ వేస్తున్నారు. ఆయనవి వ్యక్తిత్వ వికాసం కథల్లా ఉంటాయి. అవి ఉపయోగపడతాయి. రాజారామ్ మనుషుల్లో మంచినే చూసారు. నాలాంటివాడి కంటే మా నాన్నే అవసరం సమాజానికి. ఆయన కథలు,
చిన్నప్రపంచం సిరివాడ, త్రిశంకుడి స్వర్గం కథలు రష్యన్ లోకి అనువాదం అయ్యాయి. చలం జీవితాదర్శం, సొదుం జయరాం కథలు కూడా కొన్ని రష్యన్ లోకి అనువాదం అయ్యాయి.
మా నాన్నకి బిట్టర్ క్రిటిక్స్ మేమిద్దరమే (నరేంద్ర, మహేంద్ర). ఒకే పద్దతిలో రాస్తారేం అని విమర్శించేవాళ్ళం. సాహిత్య శిల్పం కంటే జీవితశిల్పం గొప్పదని మాకు అర్థం అయింది. తమ్ముడు మహేంద్ర, రాజారామ్ గారు, మీలో ఎవరు బెటర్ రైటర్ అని అడిగితే, అలా ఏం లేదు ఎవరి పద్దతి వాళ్ళది అన్నారు. మహేంద్ర స్వర్గసీమకి స్వాగతం (నవల), కనిపించని కోయిల (కథ), పర్వవేల తరంగాలు (కవిత) అచ్చయ్యాయి.
తలకోన దగ్గర ఎర్రవారిపాలెంలో గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గా మహేంద్ర పనిచేసేవాడు. దోమకుట్టి… మలేరియా వచ్చి… నిష్కారణంగా చనిపోయాడు
39 ఏళ్ళకే .. అని చెబుతూ, నిశీమ్ ఎజెకిల్ రాసిన night of a scorpion కవితని గుర్తుచేశారు. అందులో తల్లికి తేలుకుడుతుంది.
మొదట్లో అంటే 15 ఏళ్ల వయసులో 25 కథలు దాకా రాశాను. పేరు చూసుకోవడం కోసం! నాన్న డెమోక్రాట్ చాలా స్వేచ్ఛ ఇచ్చేవాడు. ఆయనవల్లే రాయగలిగాం. నేను వంద కథలు, అయిదు నవలలు రాశాను. నవలలు: 1. సహగమనం, 2. భూచక్రం
3.ఆమ్ స్టర్ డామ్ లో అద్భుతం, 4. కొండ కింద కొత్తూరు 5. మనోధర్మపరాగం.
ఇందులో best ఏది? అనడిగితే
“నేను బాగా రాసేది ఇంకా రాయబోయేదే” అన్నారు.
కొత్తనవలేమన్నా రాస్తున్నారా?
రాయలసీమ, తొండనాడు ప్రాంతం గురించి 500 పేజీల నవల రాస్తున్నాను. పూర్తి కావొచ్చింది. చిత్తూరులోని నెల్లూరు ఉత్తరప్రాంతం, వేలూరు, చెంగల్పట్టు, విల్లుపురం జిల్లాలు, కంచి రాజధాని! పల్నాడు లాగే తొండనాడు. అంటే తొండమాన్ చక్రవర్తి పాలించిన ప్రాంతం ( దొమ్ములు చేసినయట్టి …తొండమాన్ చెక్కురవర్తి…కొండలలో నెలకొన్న కొనేటిరాయడు వాడు…ఇచ్చట గుర్తుకు రావలెను) అన్నీ గుళ్ళే ఉంటాయి గనక తొండనాడుని ‘దేవభూమి’ అంటారు. కులం, మతం, సామాజిక, సాంస్కృతిక, ట్రాన్స్ఫర్మేషన్ ని రాసాను. అనేక ప్రశ్నలు లేవదీసిన భూమి గనక ఆ నవలకి ‘ప్రశ్నభూమి’ అని పేరు పెడదాం అనుకుంటున్నా.
నైవేలిలో ఉంటున్న మా చెల్లి మంజుల కూడా కథలు రాసింది. మా అమ్మకూడా రెండు కథలు రాసింది. ఆంధ్రజ్యోతి సండేలో వచ్చాయి. ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు పబ్లిష్ చేసాడు. (‘కురసం’ …కుటుంబ రచయితల సంఘం అని ఒకటి పెట్టుకోవాల్సింది. ఇంకెక్కడైనా ఉందా?)
నా తొలినవల ‘సహగమనం’ భారతిలో అచ్చయింది.
‘భారతి’ లాంటి పత్రిక అరుదైనది. గ్రంథ సమీక్షల్ని, సాహిత్య విమర్శస్థాయికి తెచ్చింది. శివలెంక శంభుప్రసాద్ గొప్పవ్యక్తి. ఆర్.ఎస్.సుదర్శనంతో ‘సాహిత్య దృక్పథాలు’ రాయించింది శంభూప్రసాద్ గారే. అది సుదర్శనం గారి మాన్యుమెంటల్ వర్క్.
‘ భారతి’ రజతోత్సవ సంచికకి ఒక రచన పంపాలని కోరుతూ, గుడిపాటి వెంకట చలానికి శంభుప్రసాద్ గారు ఒక ఉత్తరం రాసారు. “ఇంతకాలం అవసరం రాని వాణ్ణి,ఇప్పుడు కావాల్సి వచ్చాడా చలం?” అని గుడిపాటి వారు ఆగ్రహించారు. “అవును. మీ రచన లేకపోతే మా రజతోత్సవ సంచికకి నిండుదనం రాదు దయచేసి పంపండి” అని శంభుప్రసాద్ అర్ధించాడు.
చలం అప్పుడు రాసిందే ‘ఓ పువ్వు పూసింది’
కవిత్వం రాసారా?
40 కవితలు ఉన్నాయి. కవిత్వం రాయాలంటే (అడాసిటీ) ఉండాలి. పుస్తకం తెద్దామనే కోరిక ఉంది.
వెంకట పార్వతీశ్వర కవుల ‘ఏకాంత సేవ’ చాలా మృదుమధురంగా ఉంటుంది.
అది ‘తెలుగుగీతాంజలి’ అన్నారు కృష్ణశాస్త్రి.
బాల గంగాధర్ తిలక్ బాగా ఇష్టం. గౌరవం.
పొయిటిక్ సెన్సిబిలిటీస్ బాగా ఉన్నకవి.
శ్రీశ్రీ ఎందుకో నాకు పట్టలేదు. అన్నీ మాటలే అనిపిస్తాయి. ఆరుద్ర ‘సినీవాలి’ ఒక musical thought. రేడియో నాటకాలు పది రాసాను. రూపాంతరం, పాఠాంతరం – రెండూ పుస్తకాలుగా వచ్చాయి. నిరీక్షణే జీవితం, అది existencial reality – beket నాటకం వెయిటింగ్ ఫర్ గోడో లో చెప్పింది అదే.
*** *** ***
1998 లో మహేంద్ర చనిపోవడాన్ని, నాన్న తట్టుకోలేకపోయారు. ఏడాది తర్వాత 1999 మార్చిలో (69 ఏళ్ళు) రాజారామ్ కన్నుమూశారు. అది నాకు పెద్ద విషాదం.
ఆ సమయంలో నన్ను జిడ్డుకృష్ణమూర్తి కాపాడాడు. “ఆకురాలిపోవడం కంటే గొప్పదేం కాదు మరణం” అన్నాడాయన. కృష్ణమూర్తి, వర్తమానంలో జీవించమన్నాడు. “ఏం చెయ్యాలో అదే చెయ్యి. అర్థంగాని విషయాల కోసం తాపత్రయం వద్దు. వాటిని పట్టించుకోనవసరం లేదు. నీకు శరీరం ఉంది, దాని గురించి ఆలోంచించు” అన్నారాయన.
*** *** ***
Dreams are more important than sleep అన్నాడు ఓషో.
పలాయనమే…అది కూడా అవసరం ఒక్కోసారి.
నరేంద్ర గారిని ఎలా గుర్తుపెట్టుకోవాలని అనుకుంటున్నారు?
గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటే ప్రపంచం గుర్తు పెట్టుకుంటుంది.
మనం జీవిస్తాం, అంతే!
*** *** ***
మీ కులం?
సాహిత్యం, రచయితలు, జీవితం గురించి మాట్లాడుకుంటున్నాం. మధ్యలో ఈ కులం ఏంటి? నా కులం ఏదైతే మీకేంటి? అని కోప్పడిపోలేదు నరేంద్ర. “మమ్మల్ని కరణాలు అంటారు. లెక్కలు రాసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. చాలామంది టీచర్లుగా ఉన్నారు. ఐతే మేం బ్రాహ్మలం కాదు. శూద్రులమే . తమిళనాడులో మేం బీసీ లం, ఇక్కడ ఓసీ లం. మేం తెలుగువాళ్ళమే”
జయకాంతన్ని కలిసి మాట్లాడారు కదా! అలాంటి గొప్పవాళ్ళని ఇంకెవరినన్నా కలిశారా?
ఎవరిని కలవలేదో చెప్పుకుంటే సరిపోతుందనుకుంటాను.
చిత్తూరులో ఉండీ చలాన్ని చూడలేదు. తిరువణ్ణామలై మాకు చాలా దగ్గర. అయినా ఎందుకో వెళ్ళలేదు. ఎంతో దగ్గరలోనే ఉన్నా జిడ్డుకృష్ణమూర్తినీ చూడలేదు. గొప్పరచయిత బుచ్చిబాబుని చూడలేకపోయాను.
లిటరేచర్ లో most fascinating character రచయితే!
తాడి ప్రకాష్
PS.. 1982 చివరలో రచయిత పతంజలి గారితో కలిసి రేణిగుంట నుంచి మధురాంతకం రాజారామ్ గారి ఇంటికి కొటాల వెళ్ళాను ఒక పూట ఆయనతో గడిపాము. రాజారామ్ గారితో కలిసి భోంచేసాం. కథలు, సాహిత్యం… ఆ మాటలే నడిచాయి… ప్రకాష్.
నరేద్రను పారదర్శకంగా దర్శింపజేశారు. పైన ఇంటర్వ్యూ అన్నారు కానీ నరేంద్రలోకి తాడి ప్రకాష్ గారు పరకాయ ప్రవేశం చేసి, నరేంద్ర మెదడు అరలన్నీ గాలించి దొరికినంత జ్ఞానభాండాగారాన్ని రాబట్టుకునొచ్చి మాకు పంచినట్టుంది. గొప్ప అనుభూతి కలిగించిన ఇంటర్వ్యూ కాని ఇంటర్వ్యూ ఇది. ప్రకాష్ గారికి, ఉదయిని సంపాదకులకు ధన్యవాదాలు.