అధ్యాయం- 22
కోర్షునోవుల ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకున్న గుర్రాలు, మిగిలిన వాటి బలాన్ని,శక్తిని తిరుగు ప్రయాణంలో మెలఖోవుల ఇంటి దగ్గరకు వెళ్ళేటప్పుడు ఉపయోగించాయి. వాటి మూతుల చుట్టూ కట్టిన రంగురంగుల దారాలు అప్పు రొప్పుతున్నప్పుడు వస్తున్న నురగతో నిండిపోయాయి. తాగి,మత్తుగా తూలుతూ వాటిని నడిపే వారు జాలి లేకుండా కొరడాతో విదిలిస్తూనే ఉన్నారు.
చివరకు ఆ బండ్లు పాంటెలి ఇంటి ముందు ఆగాయి. గేటు దగ్గరే ముసలి దంపతులు ఉన్నారు. వెండి-బూడిద కలగలిపిన రంగులో మెరుస్తున్న గడ్డంతో పాంటెలి;అతని పక్కన పెదవులు బిగించుకుని ఇలినిచ్న ఉన్నారు.
గ్రెగరి,నటాల్య బండి దిగి వారి వైపుకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవడానికి ముందుకు కదిలినప్పుడు, చుట్టూ ఉన్న వారు అరుస్తూ, గోధుమ గింజలను వారి మీదకు విసిరారు,వివాహ వేడుకలో భాగంగా. వారిని ఆశీర్వదిస్తూ, పాంటెలి కన్నీళ్ళు పెట్టుకున్నాడు; మళ్ళీ వెంటనే తన బలహీనతను అందరి ముందు ప్రదర్శించినందుకు ఆందోళన పడ్డాడు.
వరుడు,వధువు ఇంటి లోనికి ప్రవేశించారు.
వోడ్కా తాగడం వల్ల,ప్రయాణం మరియు సూర్యుని వేడి వల్ల ఎర్రబడ్డ ముఖంతో ఉన్న దర్య వేగంగా వచ్చి వసారాలో కూర్చుని,వంట గదికి-వసారాకు మధ్య గెంతులేస్తూ తిరుగుతూ ఉన్న దున్యక్ష మీద అరిచింది.
‘పెట్రో ఎక్కడున్నాడు?’
‘నేను చూడలేదు.’
‘ఎవరో ఒకరు ఇప్పుడు పురోహితుడిని పిలుచుకు రావాలి,సరైన సమయానికి మాయమైపోయాడు.’
అప్పటికే ఎక్కువ వోడ్కా తాగి మత్తులో ఉన్న పెట్రో, గుర్రాలు తొలగించిన ఓ బండిలో మూలుగుతూ పడుకుని ఉన్నాడు. దర్యా గాలిపటంలా వేగంగా అతని దగ్గరకు వెళ్ళింది.
‘తిని,తాగి,ఇలా పడిపోయావా…పనికిమాలినవాడా! వెళ్ళి పురోహితుడిని తీసుకురావాలి…లే!’
‘మంటల్లో దూకి చావు! నేను నీ నుండి ఆజ్ఞలు తీసుకోను! నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు!’ అతను నేల మీద పక్షుల రెట్టలు,ఎందుగడ్డి ఉన్న చోట చేతితో కెలుకుతూ అన్నాడు.
దర్య ఏడుస్తూ, తన రెండు చేతి వేళ్ళను అతని నోట్లోకి దూర్చి,అతని నాలుకను సరిచేసి,అతనికి ఉపశమనం కలుగజేసింది. ఆ తర్వాత బావిలోని నీరు ఓ బకెట్ లో నింపి అతని తల మీద పోసింది,తర్వాత అతని పక్కనే ఉన్న గుర్రం గుడ్డతో అతన్ని పొడిగా తుడిచి, వెంటనే పురోహితుడి దగ్గరకు పంపించింది.
ఒక గంట తర్వాత గ్రెగరి చర్చిలో కొవ్వుత్తుల వెలుగులో మెరిసిపోతున్న నటాల్య పక్కన నిలుచుని ఉన్నాడు. మైనం పక్కన పడి ఉన్న ఓ కొవ్వొత్తిని చేతిలోకి తీసుకుని, ఆ గోడ వైపు తిప్పాడు. దాని మీద ఎన్నో నీడలు, కొన్ని గుసగుసలాడుతున్నవి..వాటిని చూస్తూ…తన మనసులో తిరుగుతున్న ఒకటే మాటను మళ్ళీ మళ్ళీ అనుకున్నాడు… ‘నువ్వు కూడా తృప్తి పొందావు…నువ్వు కూడా తృప్తి పొందావు.’ అతని వెనుక ఉబ్బిన ముఖంతో ఉన్న పెట్రో దగ్గుతూ ఉన్నాడు, ఎక్కడో గుంపులో ఉన్న దున్యక్ష కళ్ళ వైపు చూశాడు, ఎన్నో తెలిసిన ముఖాలు,తెలియని ముఖాలు; వినసోంపుగా లేని స్వరాల నుండి వస్తున్న ప్రార్థనా గీతాలు, చర్చ్ ఫాదర్ దగ్గర చెప్పుకుంటున్న మాటలు అతనికి దూరం నుండి వినబడుతున్నట్టు అనిపించాయి. ఆ రోజు కీచు గొంతుతో ఉపన్యాసం ఇస్తూ ఉన్న ఫాదర్ విస్సారోయిన్ చుట్టూ తిరిగాడు,ఎప్పుడైతే పెట్రో అతని కోటు పట్టుకుని వెనక్కి లాగాడో అప్పుడో ఆ చర్య విరమించుకున్నాడు. ఆ తర్వాత ఆడవాళ్ళ జడల నీడలను కూడా గోడ మీద చూస్తూ నిలబడ్డాడు అసహనంగా.
‘ఉంగరాలు మార్చుకోండి’,ఫాదర్ విస్సారోయిన్ ఎటువంటి ఆసక్తి,ఉత్సాహం లేకుండా గ్రెగరి కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు.
వాళ్ళు అలాగే చేశారు. ‘ఇది త్వరగా అయిపోతుందా?’ గ్రెగరి పెట్రో వైపు చూస్తూ అడిగాడు.
‘అవును, అయిపోతుందా?’, చిన్నగా నవ్వుతూ పెట్రో బదులిచ్చాడు.
గ్రెగరి తడిగా ఉన్న తన భార్య పెదాలను మూడుసార్లు ముద్దు పెట్టుకున్నాడు, ఆ చర్చి ఆవరణ అంతా ఆరిపోయిన కొవ్వుత్తుల వాసనతోనూ, బయటకు వెళ్ళే హడావుడిలో ముందుకు తోసుకుంటున్న జనాల తోపుల్ల ధ్వనితోనూ నిండిపోయింది.
నటాల్య పొడుగైన చేతిని గట్టిగా పట్టుకుని, గ్రెగరి చర్చి మెట్ల గుండా బయటకు నడిచాడు. ఎవరో కింద పడిపోయిన అతని టోపీని తల మీద పెట్టారు. దక్షిణ దిక్కు నుండి గాలి మాచిపత్రి చెట్ల వాసనను మోసుకువచ్చింది . పచ్చిక బీడుల నుండి చల్లగాలి వీస్తూ ఉంది.డాన్ నది ప్రాంతంలో ఎక్కడో నీలంగా ఓ మెరుపు మెరిసినట్టు అనిపించింది.వాన పడేలా ఉంది. ఆ చర్చి గోడల వెనుక నుండి ఓ బెల్లు కొట్టిన శబ్దం,అక్కడ మనుషుల మాటల ధ్వనిలో కలిసిపోయి వినిపిస్తూ ఉంటే, గుర్రాలు వేగంగా ముందుకు దుముకుతున్నాయి.
* * *
అధ్యాయం- 23
కోర్షునోవుల కుటుంబం పెళ్ళికొడుకు, పెళ్ళి కూతురు చర్చికి వెళ్ళాక వచ్చింది. చాలా సార్లు పాంటెలి గేటు బయటకు వచ్చి వీధి వైపు చూశాడు. కానీ అక్కడక్కడ ఇరువైపులా ముళ్ళపొదలతో ఉన్న ఆ రోడ్డు ఖాళీగానే కనిపించింది. అతను తన దృష్టిని డాన్ వైపుకు మళ్ళించాడు. అడవిలోని చెట్లు పచ్చగా ఉంటే, నది దగ్గర పెరిగే నీటి మొక్కలు నదికి అటువైపు ఎత్తుగా పెరిగి ఉన్నాయి.
ఆ సంవత్సరం ముందే వచ్చిన వసంతకాలం, కొద్దిగా ఉన్న వెలుగుతో కలిసి ఆ గ్రామాన్ని,డాన్ నది ప్రాంతాన్ని,బీడు బయళ్ళను, దూరంగా ఉన్న అడవిని, గడ్డి మైదానాలను;అంతటిని చెట్టు నీడలా కప్పేసినట్టు ఉంది. రోడ్డు రహదారితో కలిసే చోటులో ఉన్న మందిరం గోపురం కూడా ఆ నీడలో కలిసిపోయినట్టు అనిపిస్తుంది.
చిన్నగా వినవచ్చిన బండి చక్రాల చప్పుడు, కుక్కల మొరుగుడు ఆ వృద్ధుడి చెవుల్లో పడింది. రెండు బండ్లు అప్పుడే వీధిలోకి ప్రవేశించాయి. మొదటి బండిలో మిరోన్, లుకినిచ్న వెనుక కూర్చుని ఉన్నారు. వారికి ఎదురుగా చక్కగా ఉతికిన తన యూనిఫార్మ్ మీద తను సాధించిన క్రాసులను,పతకాలను ధరించి గ్రీక్షా తాతయ్య కూర్చున్నాడు. ఆ బండిని మిట్కా నడుపుతున్నాడు. అతను ఆ బండిని ఎంత చక్కగా నడుపుతున్నాడంటే తను కూర్చున్న చోటు నుండి కదలకుండా, సీటు కింద ఉన్న కొరడా తీయకుండా, బండికి కట్టి ఉన్న ఆ నల్ల గుర్రాల మీదే భారాన్ని వదిలేసి,కులాసాగా ఉన్నాడు. రెండవ బండిని మిఖే నడుపుతున్నాడు. ముందుకు,వెనక్కి కదులుతూ; గుర్రాలను పదేపదే కొరడాతో అదిలిస్తూ ఉన్నాడు. కనుబొమ్మలు ఒత్తుగా లేని అతని ముఖం ఎర్రగా కందిపోయి,అతని టోపీ పై నుండి చెమట కారుతూ ఉంది.
పాంటెలి వారిని చూసి గేటు తెరవగానే,ఆ రెండు బండ్లు ఒకదాని తర్వాత ఒకటి ఆ వాకిట్లోకి ప్రవేశించాయి.
ఇలినిచ్న వసారాలో నుండి తల్లిబాతులా ఎగురుతున్నట్టు వస్తూ ఉంటే ఆమె గౌను అంచులు ఆ వసారా మెట్లకు ఉన్న మట్టి,దుమ్ముకు రేపుతూ ఉన్నాయి.
‘ప్రియమైన బంధువులారా! మీకు స్వాగతం! మా ఈ చిన్న గృహానికి మీరు రావడం ఎంతో గౌరవం మాకు!’ అంటూ ఆమె, తన ఆకారాన్ని కొద్దిగా కిందకు వినయంగా వంచింది.
పాంటెలి తన తలను ఒకవైపుకి తిప్పి, రెండు చేతులు చాచాడు.
‘మిమ్మల్ని చూడటం సంతోషంగా ఉంది బంధువులారా!రండి,లోపలికి రండి.’ తర్వాత ఆ బండ్ల నుండి గుర్రాలను విప్పి, వాటికి నేరు-దాణా పెట్టమని తన ఇంట్లో వారికి ఆజ్ఞాపించి, తన వియ్యంకుడి దగ్గరకు వచ్చాడు.
మిరోన్ తన ప్యాంటుకు ఉన్న దుమ్మును ఓ చేతితో దులుపుకుంటూ ఉన్నాడు. తర్వాత అతను తన వియ్యకుడి చేతిలో చేయి వేయగా,ఆ ఇద్దరు కలిసి ఇంట్లోకి నడిచారు. వృద్ధుడైన గ్రీక్షా,ఆ బండి ప్రయాణపు కుదుపులకు అలసిపోయి వెనుక మెల్లగా నడుస్తూ వస్తున్నాడు.
‘రండి,లోపలికి రండి ..’, అంటూ ఇలినిచ్న ఆయన్ని నెమ్మదిగా భుజం మీద తట్టింది.
‘మీ ఆత్మీయ ఆతిథ్యానికి ధన్యవాదములు…ఒక్క నిమిషం,నేను వస్తున్నాను.’
‘మీ అందరి కోసం మేము ఎప్పటి నుండో వేచి చూస్తున్నాము. లోపలికి రండి. నేను మా ఇంట్లో ఉన్న వాడని చీపురుకట్టను మీ యూనిఫార్మ్ మీద ఉన్న దుమ్ము దులపడానికి తెస్తాను. ఈ రోజుల్లో దుమ్ము విపరీతంగా ఉంటుంది, దాని వల్ల సరిగ్గా గాలి కూడా పీల్చుకోలేకపోతున్నాము.’
‘అవును, ఇది నిజంగానే కాస్త వాతావరణంలో తేమ తగ్గి పొడి ఉండటం వల్ల జరిగేది. అందుకే చాలా దుమ్ముగా ఉంది. మీరు ఇబ్బంది పడొద్దు,నేను ఇప్పుడే వస్తాను’ అని గ్రీక్షా తాతయ్య వెంటనే పక్కనే ఉన్న షెడ్డులోకి దాని పక్కనే ఉన్న కిటికీ గుండా మాయమైపోయాడు.
‘ఎందుకు ఆ ముసలాయన్ని అంతలా కాల్చుకు తింటావు, బుద్ధి లేని గాడిద!’, అప్పుడే వాకిట్లోకి వచ్చిన పాంటెలి భార్య మీద మండిపడ్డాడు.
‘వృద్ధుడిగా ఆయనకు కొన్ని అవసరాలు ఉంటాయి. పాపం ఆయన భార్య …ఆ దేవుడి దగ్గరకు ….నువ్వు ఎంత మూర్ఖురాలివి!’
‘అది నాకు ఎలా తెలుస్తుంది?’ఇలినిచ్న ఇబ్బంది పడుతూ అంది.
‘నీకు తెలియాలి లేదా గ్రహించాలి. జరిగింది చాలు. ఇక వెళ్ళి పెళ్ళికూతురి తల్లికి మర్యాదలు అందుతున్నాయో లేదు చూడు.’
ఆ సమయానికే అక్కడ అతిథుల కోసం వేసిన బల్లలన్నీ కూడా అప్పటికే తాగి ఉన్న అతిథులతో నిండిపోయి,వారి మాటలతో కోలాహలంగా ఉంది. పెళ్ళికూతురి తల్లిదండ్రులను వేరే గదిలో కూర్చోబెట్టారు. కొత్త జంట త్వరగానే చర్చి నుండి ఇంటికి వచ్చారు. పెద్ద సీసా నుండి వోడ్కా గ్లాసులో పోస్తూ,పాంటెలి కన్నీరు పెట్టుకున్నాడు.
‘సరే, బంధువులారా, ఇది మన పిల్లల కోసం. వారికి అంతా మంచి జరుగుగాక,మనం అనుకున్నట్టే…. వాళ్ళు ఎప్పుడు మంచి ఆరోగ్యంతో,సంతోషంతో ఉండాలని కోరుకుందాము.’
ఒక లోటాలో గ్రీక్షా తాతయ్యకు వోడ్కా నింపి ఇస్తే, కేవలం సగం మాత్రమే ఆయన నోట్లోకి వెళ్తే, మిగిలిన సగం దట్టంగా ఉన్న ఆయన మీసం మీద నుంచి, యూనిఫార్మ్ మీదకు ఒలికిపోయింది. కొందరూ చీర్స్ చెప్పుకుని, గ్లాసులు శబ్దం చేసి తాగితే,కొందరూ అదేమి లేకుండా మామూలుగా తాగారు. ఆ వాతావరణమంతా సందడిగా ఉంది. నికిఫోర్ కొలోవీడిన్, కోర్షునోవుల కుటుంబానికి దూరపు బంధువు,అలాగే అటామన్ రెజిమెంట్ లో గార్డ్స్ మెన్ గా పని చేశాడు. ఆయన టేబుల్ కి చివర కూర్చున్నాడు. ఆయన తన చేతిని పైకెత్తి, రెండు వేళ్ళు తెరిచి, ‘ఇది చేదుగా ఉంది!’, అని అరిచాడు.
‘అవును, ఇది చేదుగా ఉంది!’ఆ అరుపును అక్కడ ఉన్న మిగిలినవారు కూడా అందుకున్నారు.
‘ఓ…ఎంత చేదుగా ఉంది!’ కిక్కిరిసినట్టు ఉన్న వంటగది నుండి కూడా బదులు వచ్చింది.
తనకు పెద్దగా ఆసక్తి కలిగించకుండా, కాంతిహీనంగా ఉన్న భార్య పెదవులను గ్రెగరి ముద్దు పెట్టుకుని,చుట్టూ చూశాడు.
ఎర్రటి ముఖాలు,మసకబారిన కళ్ళు,అశ్లీలమైన చూపులు,నవ్వులు. ఆనందంగా నములుతున్న నోళ్ళు, బల్ల మీద పెట్టి ఉన్న గ్లాసుల్లో ఉన్న మందును తాగుతూ కొంత పెదాల నుండి కిందకు జారిపోతూ బల్ల గుడ్డ మీద పడుతూ ఉన్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే, విందు మహారంజుగా సాగుతుంది.
నికిఫోర్ కొలోవీడిన్ ఊడిన పళ్ళతో ఉన్న తన నోటిని తెరిచి, మరలా తన చేతిని పైకి ఎత్తాడు.
‘ఇది చేదుగా ఉంది!’
మూడు బంగారపు సన్నని గీతలు-ఆయన సేవలకు చిహ్నంగా ఆ మూడు గీతలు;ఆయన ధరించిన నీలపు గార్డ్స్ మెన్ యూనిఫార్మ్ మడతల్లో ఇరుక్కుపోయాయి.
‘చేదు!చే-దు!’
గ్రెగరి అసహ్యంతో నికిఫోర్ కొలోవీడిన్ నోటి వైపు చూశాడు. ఆయన ‘చేదు’ అనే పదం పలుకుతూ ఉంటే, ఎర్రగా ఉన్న నాలుక పళ్ళ మధ్య ఉన్న సందులో నుండి బయటకు వస్తూ ఉంది.
‘నీకు నా ముద్దులు’, పెట్రో తన పెదవుల నుండి జడల్లా జారుతూ ఉన్న మీసాలను పట్టుకుని మత్తుగా అన్నాడు.
వంటగదిలో దర్య, తాగడం వల్ల గులాబీ వర్ణంలోకి మారిన ముఖంతో,మత్తుగా, ఒక పాట అందుకుంది. మిగిలిన గొంతులు కూడా ఆ పాట అందుకోవడంతో ముందు గది వరకు అది వినిపించసాగింది.
ఇక్కడే నది ఉంది, ఇక్కడే పడవ ఉంది
ఇక్కడే మనల్ని కలవడానికి పడవ నడిపే వాడున్నాడు….
ఇంకా ఎన్నో గొంతులు కలిశాయి,తర్వాత ఖ్రిస్టోన్య బృందం కూడా పాట అందుకుంది.
ఎవరైనా విందు ఏర్పాటు చేస్తే
మా కడుపులు పగిలేలా తాగుతాము
పడకగది నుండి కొన్ని స్త్రీల గొంతులు కూడా పాడసాగాయి:
నన్ను నేను కోల్పోయాను , నా జీవితం వృధా అయ్యింది
అప్పుడు స్పష్టమైన,సంతోషమైన ఓ స్వరం వినిపించింది.
అప్పుడు ఓ పెద్ద మనిషి గొంతు, గోడ మీద కొడుతున్న సుత్తి పోటులా, ఆ గొంతులకు తోడయ్యింది:
నన్ను నేను కోల్పోయాను , నా జీవితం వృధా అయ్యింది
అప్పుడు స్పష్టమైన,సంతోషమైన ఓ స్వరం వినిపించింది
అప్పుడే నేను తోటల్లో తిరిగాను
ఎత్తుగా ఉన్న బెర్రి చెట్ల మధ్యలో ఉన్నాను.
‘ఎంత మంచి సందర్భం ఇది జనులారా!’
‘ఆ కాల్చిన మటన్ తినండి.’
‘నీ కాళ్ళు నీ దగ్గరే పెట్టుకో-నా భర్త ఇటువైపే చూస్తున్నాడు,కనబడటం లేదా?’
‘చే-దు!’
‘అబ్బా ఆ తోడి పెళ్ళికొడుకు తోడి పెళ్ళికూతురితో ఎలా కలిసిపోతున్నాడో, మంచి రసికుడే!’
‘ఓ…వద్దు…నువ్వు తింటున్న ఆ మటన్ ముక్కలు నాకు వద్దు..నాకు పంది మాంసం ఇంకా ఇష్టం…అది భలే ఉంటుంది!’
‘ప్రోక్షా,నా స్నేహితుడా…రా …అలా రోడ్డు దాకా వెళ్ళొద్దాం.’
‘పొగ కాల్చుకోవాలా?’
‘సేమ్యన్ గోర్దిచ్!’
‘ఆ?’
‘సేమ్యన్ గోర్దిచ్!’
‘ఓ…బాగా తిను!’
వంటగది నేలంతా గజిబిజిగా ఉంది,ఆడవాళ్ళ ఎత్తు మడమల చెప్పుల టక్కు టక్కులు, ఒక గ్లాసు నేల మీద పడి పగిలిపోవడంతో వచ్చిన ధ్వనిలో కలిసిపోయింది. గ్రెగరి వంటగదిలో ఉన్న అతిథుల తలలవైపు చూశాడు; అక్కడి స్త్రీలు అరుపులు,కేకల మధ్య చుట్టూ తిరుగుతూ నాట్యం చేస్తున్నారు. వాళ్ళు అలా చేస్తూ ఉంటే, లావుగా ఉన్న వారి పిరుదులు ఊగుతూ ఉన్నాయి (అక్కడ ఉన్న వారిలో ఎవరూ సన్నగా లేరు, ఒక్కొక్కరు ఐదారు గౌన్లు వేసుకున్నట్టు ఉన్నారు). వారు తమ చేతిలోని రుమాళ్ళను ఊపుతూ,మోచేతులు ఆడిస్తూ నృత్యం చేస్తున్నారు.
కోసాక్కులు వాయించే ఓ వాద్య పరికర ధ్వని కూడా మధ్యలో వినవచ్చింది. దాన్ని వాయిస్తూ,ఒకతను నవ్వుతూ,ఆ పాటకు లయగా ఆ వాయిద్యాన్ని జోడించే ప్రయత్నం చేస్తున్నాడు.
‘గుండ్రంగా నిలబడండి! గుండ్రంగా!’
‘స్త్రీలారా, దారి ఇవ్వండి!’వెచ్చగా ఉన్న వారి పొట్టల మధ్య నుండి వెళ్తూ పెట్రో బతిమలాడాడు.
ఒక్కసారిగా ఉత్సాహం వచ్చిన గ్రెగరి, నటాల్య వైపు చూసి కన్ను కొట్టాడు.
‘పెట్రో వారితో కలిసి నాట్యం చేస్తాడు, చూడు!’
‘అతను ఎవరితో ఉన్నాడు?’
‘నీకు కనబడటం లేదా? మీ అమ్మతోనే!’
లుకినిచ్న తన ఎడమ చేతిలో ఓ చేతి రుమాలు ఉంచుకుని, రెండు చేతులను పిరుదుల మీద ఉంచింది.
‘నువ్వు వెళ్ళు, లేకపోతే నేను మొదలుపెడతాను!’
పెట్రో ఆమె దగ్గరకు చిన్న చిన్న అడుగులతో నృత్యం చేస్తూ వెళ్ళి,ఆమెతో కలిసి ఓ నృత్య కదలిక చేసి వెంటనే తిరిగి, తన స్థానంలోకి వచ్చాడు. లుకినిచ్న, బురద పైన నడుస్తున్నట్టు,తన గౌనును పైకి లాక్కుని, బూటు లోపల ఉన్న కాలి బొటన వేలుతో భూమిని చిన్నగా తన్ని,ఆ గుంపులో ,స్త్రీలా కాకుండా పురుషుడి శైలిలో నృత్యం చేయసాగింది.
వాయిద్యకారుడు మెల్లగా ఆ పరికర శ్రుతిని తగ్గించాడు, అది గమనించి పెట్రో మళ్ళీ నృత్యానికి సిద్ధమయ్యాడు. అరుస్తూ,గొంతుకు కూర్చుని, తన కాళ్ళను ముందుకు వెనక్కి ఆడిస్తూ, వాటితో నేలను లయబద్ధంగా తన్నుతూ; ఇది చేస్తున్నంత సేపు తన మీసపు ఓ అంచును తన పళ్ళ మధ్య పెట్టుకున్నాడు. అతను ఎంత వేగంగా తన కాళ్ళతో నృత్యం చేస్తున్నాడంటే దానిని ఎవరు అనుకరించలేనట్టుగా ఉంది, ఆ వేగంలో అతని ముంగురులు ఎగురుతూ ఉంటే ముచ్చటగా ఉంది చూసేవారికి.
అతని నృత్యాన్ని చూడటానికి అతని చుట్టూ గుమిగూడిన జనం వల్ల ఇప్పుడు గ్రెగరికి పెట్రో కనిపించడం లేదు. అతనికి కదులుతున్న కాళ్ళ చప్పుడు, తాగుబోతుల మాటలు తప్ప ఇప్పుడూ ఇంకేమి వినిపించడం లేదు.
చివరలో మిరోన్ ఇలినిచ్నతో ఒక గంభీరమైన వ్యాపారవేత్త శైలిలో అన్ని పనులు చేసినట్టే నృత్యం చేశాడు.
పాంటెలి ఒక స్టూలు మీద ఎక్కి, తన కుంటి కాలును ఊపుతూ, నాలుకను చప్పరించాడు. అతని కాళ్ళ బదులు పెదవులు,చెవి పోగు నృత్యం చేస్తున్నాయి.
బాగా నాట్యం చేయగలిగిన వారు, అసలు మోకాళ్ళు కూడా వంచలేని వారు పోటీ పడి చేశారు.
నృత్యం చేసే అందరికి చప్పట్లు,అరుపులతో ప్రోత్సాహం,సూచనలు లభించాయి.
‘మా మాట పోయేలా చేయకు!’
‘ఇంకా బాగా చేయి!అద్భుతం!’
‘అతని కాళ్ళతో బాగా చేయలేకపోయినా, వెనక్కి మాత్రం భలే వంచుతున్నాడు శరీరాన్ని.’
‘ఇంకా వేగంగా చేయాలి!’
‘మా వైపే గెలిచేలా ఉంది.’
‘ఇంకా బాగా చేస్తావా,లేకపోతే…’
‘అప్పుడే అలసిపోయావా,గాడిద? బాగా చేస్తావా లేకపోతే ఈ సీసాతో ఒకటి ఇచ్చుకోమంటావా!’
అప్పటికే తాగి తూలుతూ ఉన్న గ్రీక్షా తాతయ్య తన పొరుగున ఉన్న అతని భుజం మీద చేయి వేసి,అతని చెవిలో ఏదో గుసగుసలాడుతున్నాడు.
‘ఏ సంవత్సరంలో నువ్వు పదవీ స్వీకారం చేశావు?’
ఓక్ చెట్టులా ధృఢంగా ఉన్న అతని పొరుగువాడు,అతన్ని పక్కకు జరిపి, ‘ముప్పై తొమ్మిదిలో’,అన్నాడు.
‘ఏ సంవత్సరం?ఆ?’గ్రీక్షా తాతయ్య తన ముడతలు పడిన చెవి చుట్టూ ఓ చేయి అడ్డంగా పెట్టుకుంటూ అడిగాడు.
‘నీకు చెప్పా కదా,ముప్పై తొమ్మిది.’
‘మరి నీ గురించి చెప్పు?’
‘బక్లానోవ్ రెజిమెంట్ లో సర్జెంట్ జనరల్ గా చేశాను. ఇంకా నేను …నేను క్రాస్ని యార్ గ్రామంలో పుట్టాను.’
‘నువ్వు మెలఖోవుల కుటుంబానికి బంధువువా?’
‘ఏమిటి?’
‘నీకు వారితో బంధుత్వం ఉందా అని అడుగుతున్నాను.’
‘అవును,నేను వారికి తాతయ్యను అవుతాను.’
‘నువ్వు బక్లానోవ్ రెజిమెంట్ లో ఉన్నావా ?’
ఆ వృద్ధుడైన పొరుగువాడు గ్రీక్షా తాతయ్య ముఖంలోని పాలిపోయిన తన కళ్ళతో చూస్తూ,నోట్లో మిగిలిపోయి ఉన్న ముద్దను నములుతూ, తల ఆడించాడు.
‘అంటే నువ్వు కౌకాసియన్ యుద్ధంలో కూడా పాల్గొన్నావా?’
‘నేను స్వర్గస్తులైన బక్లనోవ్ గారితోటే కలిసి పని చేశాను,ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక. మేము కౌకాసియులను ఓడించాము కూడా…..మా రెజిమెంటులో అరుదైన కోసాక్కులు ఉండేవారు. అప్పట్లో గార్డుల ఎత్తులో ఉన్నవారిని మాత్రమే తీసుకునేవారు,కానీ ఇప్పట్లో అంత ఎత్తు ఉన్న కోసాక్కులు అరుదుగా ఉంటున్నారు. ఆ రోజుల్లో అటువంటి వారు ఉండేవారు,నాయనా… ఒకరోజు చెలెంజిస్కీ గ్రామంలో, స్వర్గస్తులైన మా జనరల్, హిజ్ ఎక్సలెన్సీ, నన్ను కొరడాతో కొట్టాడు…’
‘నేను టర్కీ యుద్ధంలో ఉన్నాను కదూ… హా?అవును,ఉన్నాను’,గ్రీక్షా తాతయ్య, తన ఛాతీ మీద రుద్దుకుంటూ, తను ధరించిన క్రాసులు,పతకాలు శబ్దం చేస్తూ ఉండగా అన్నాడు.
‘మేము ఆ గ్రామాన్ని ఉదయానికి ఆక్రమిస్తే, మధ్యాహ్నానికి బాకా ఊదారు..’
‘మేము కూడా వైట్ జార్ కింద పని చేశాము. రోషిచ్ దగ్గర ఒక యుద్ధం జరిగితే, మా రెజిమెంట్ లోని పన్నెండు మంది కోసాక్కులు,ఆ జానీసరీలతో (టర్కీ సైన్యంలో మహారాజు రక్షకులుగా 14-19 శతాబ్దాల మధ్య పని చేసినవారిని జానీసరీలుగా వ్యవహరిస్తారు) యుద్ధం చేశారు …’
‘అప్పుడు బాకా ఊదారు’, ఆ బక్లానోవ్ మనిషి, గ్రీక్షా తాతయ్య చెప్పేది వినిపించుకోకుండా కొనసాగించాడు.
‘ఆ జానీసరీలు కూడా కొన్ని విషయాల్లో మా అటామన్ గార్డ్స్ మెన్ లానే ఉన్నారు. ఆ,ఉన్నారు కదూ,ఉన్నారు’, గ్రీక్షా తాతయ్య తడబడుతూ,తన చేతిని అసహనంతో ఊపసాగాడు. ‘వారు వారి జార్ ప్రభువు సేవలో ఉంటారు,వారు తలల మీద తెల్ల సాక్స్ ధరిస్తారు.తెలుసా? వాళ్ళు తలల మీద తెల్లటి సాక్సులు ధరిస్తారు.’
‘అప్పుడు నేను నా పక్కనే ఉన్న నా సహచరుడితో, “చూస్తుంటే మనం ఓడిపోయేలా ఉన్నాము,అక్కడ ఉన్న తివాచీని గోడ కిందకు చేర్చు.మనం వెళ్ళేటప్పుడు తీసుకువెళ్దాం.”
‘నాకు రెండు జార్జి పతకాలు వచ్చాయి. నా ధైర్యానికి ఎన్నో ప్రశంసలు కూడా లభించాయి. టర్కీలో పేరొంది తప్పించుకున్న ఖైదీని ప్రాణాలతో పట్టుకున్నాను..’
గ్రీక్షా తాతయ్య ఏడుస్తూ, ఎముకల గూడులా ఉన్న తన పిడికిలితో ఎలుకబంటిలా ఉన్న బల్కానోవ్ మనిషి వీపు మీద తట్టాడు; కానీ అతను మాత్రం చికెన్ ముక్కలను చెర్రీ జెల్లీలో ముంచుకున్నాడు, ముల్లంగి సాస్ లో ముంచుకోబోయి; తర్వాత సూప్ తో అలికినట్టు ఉన్న ఆ బల్ల మీద ఉన్న గుడ్డ వైపు జీవం లేని కళ్ళతో చూశాడు. అప్పుడు వణుకుతున్న పెదవులతో అన్నాడు, ‘దెయ్యం ఆ పాపం నేను చేయడానికి ప్రేరేపించింది,నాయనా…’
ఆ వృద్ధుడి కళ్ళు ఆ బల్ల గుడ్డ మీద ఉన్న తెల్లటి గీతలవైపు తీక్షణంగా చూశాయి; అది వోడ్కా మరియు సూప్ లతో మరకలు అంటిన
బల్ల గుడ్డలా కాకుండా,కౌకాసియన్ తెల్ల పర్వతాల వలె అతనికి కనిపించింది అది. ‘అంతకుముందు వరకు నేను నా జీవితంలో ఏది దొంగతనం చేయలేదు…మేము ఆ గ్రామాలను ఆక్రమించినప్పుడు,ఆ ఇళ్ళల్లో విలువైనవి ఎన్నో ఉండేవి,అయినా ఎప్పుడూ వాటి వైపు కన్నెత్తి కూడా చూడలేదు….కానీ ఏదైనా దయ్యం ఆవహిస్తేనే అలా తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది… అలాగే ఇక్కడ కూడా …ఆ తివాచీ నా కంట్లో పడింది….అది గుర్రం మీద వేయడానికి బావుంటుందని నాకనిపించింది…’
‘అంతకుముందు అలాంటివి మేము ఎన్నో చూసాము. మేము విదేశాల్లో కూడా పని చేశాము’, గ్రీక్షా తాతయ్య అతని కళ్ళలోకి చూసే ప్రయత్నం చేశాడు, కానీ ఆ కళ్ళ చుట్టూ ఉన్న గుంటలు ఎంత లోతుగా ఉన్నాయంటే, వాటిని దాటి ఆ కళ్ళల్లో భావం చదవడం సాధ్యం కాలేదు.
అతని దృష్టిని ఆకర్షించడానికి గ్రీక్షా తాతయ్య ఓ కొత్త ట్రిక్ ను ప్రయోగించాడు, తను చెప్పేదానిలో ఆసక్తికరమైన అంశాన్ని చెప్పడం ఆరంభించాడు; మొదట ఉన్న విషయాలు వదిలేసి.
‘అప్పుడే మేజర్ తెర్సింత్సేవ్ నుండి ఆజ్ఞ వచ్చింది: “సైన్యం అంతా ముందుకు కదలండి!”
అప్పుడు ఆ బక్లనోవ్ మనిషి కొరడా దెబ్బ పడిన గుర్రంలా తల పైకెత్తాడు;బిగుసుకున్న తన పిడికిలిని బల్ల మీద ఉంచి గుసగుసగా అన్నాడు, ‘ఈటెలు,కత్తులతో సిద్ధంగా ఉండండి, బక్లనోవ్ సైనికుల్లారా!…’ అతని స్వరం హఠాత్తుగా పెరిగింది, అప్పటివరకు నిస్తేజంగా ఉన్న అతని కళ్ళు వయసు ప్రభావితం చేయలేని ఒక రకమైన అగ్నితో వెలిగినట్టు కాంతివంతంగా అయ్యాయి. ‘బల్కనోవ్ యోధుల్లారా! గొప్ప సైనికుల్లారా!’అతను అరిచాడు, ఆ అరుపుకి అతని పచ్చటి చిగుళ్ళు బయటపడ్డాయి, ‘మీ శత్రువు మీదకు లంఘించండి!’
ఒక రకమైన యవ్వన మెరుపుతో అతను గ్రీక్షా తాతయ్య కళ్ళలోకి చూశాడు, అప్పటికే మరకలతో నిండి ఉన్న తన యూనిఫార్మ్ తో తన బుగ్గల మీద నుండి కారుతున్న కన్నిటిని తుడుచుకుంటూ.
ఆ మాటలతో గ్రీక్షా తాతయ్య కూడా ఉత్సాహం పుంజుకున్నాడు.
‘మాకు ఆ ఆజ్ఞ ఇచ్చి ఆయన తన ఖడ్గం గాల్లోకి ఎత్తాడు. ఆయన అలా చేయగానే మేమందరం గుర్రాల మీద ముందుకు ఉరికాము. అప్పుడు ఆ జానీసరీలు ఈ ఆకారంలో ఏర్పడ్డారు’, అంటూ ఆ బల్ల గుడ్డ మీద తన చేతి వేలితో దీర్ఘ చతురస్రాకారం గీశాడు. ‘అప్పుడు వాళ్ళు మా మీదకు ఈటెలు పిచ్చిగా ప్రయోగిస్తున్నారు. మేము రెండుసార్లు వారి పై దాడికి దిగినా వాళ్ళు మమ్మల్ని తరిమి కొట్టారు. అప్పుడు అడవిలో నుండి ఇంకో సైన్యం వారిది మా మీద దాడికి దిగింది.అప్పుడు మేము మా వ్యూహం మార్చుకుని తిరుగుదాడి ఆరంభించాము. వాళ్ళు మా వెంట బడినా సరే…ఎవరైనా కోసాక్కుల దాడి ముందు నిలబడగలరా?లేదు ..ఎప్పటికీ నిలువలేరు!అప్పుడు వాళ్ళు అడవిలోకి వెన్ను చూపి పారిపోయారు….అప్పుడు నేను నా ముందు గోధుమ రంగులో ఉన్న గుర్రం మీద పారిపోతూ ఉండటం చూశాను. అతను యవ్వనంలో ఉన్నాడు,అతని మీసాలు నల్లగా ఉన్నాయి, నన్ను తిరిగి చూసి, పిస్తోలు ఉంచే తోలు సంచిలో నుండి తీశాడు. ఆ సంచి గుర్రం జీనుకు కట్టబడి ఉంది. నా వైపు ఒకసారి కాల్చాడు కానీ అది గురి తప్పింది. అప్పుడు అతన్ని ముక్కలు ముక్కలు చేద్దామనుకున్నా…కానీ నా మనసు మార్చుకున్నాను…పాపం,అతను కూడా మనిషే కదా!అప్పుడు నేను కుడి చేత్తో అతని నడుము చుట్టూ పట్టుకుని బండి మీద నుండి కిందకు లాగాను. అప్పుడు అతను పిచ్చివాడిలా నా చేతిని కొరికాడు,కానీ నేను ఖైదు చేసి తీసుకువెళ్ళాను.’
గ్రీక్షా తాతయ్య తన పొరుగువానివైపు గర్వంగా చూశాడు. అప్పటికే ఆ వృద్ధ సైనికుడు గ్రీక్షా తలపై పడుకుని,అంత గందరగోళంలో కూడా ప్రశాంతంగా నిద్ర పోతూ గురకలు పెడుతున్నాడు.
* * *
రెండవ భాగం
అధ్యాయం-1
సెర్జి ప్లాటోనోవిచ్ కు ఘనమైన పూర్వీకుల వైభవమే ఉంది.
ఒకటవ పీటర్ కాలంలో అజోవ్ బ్రిగేడ్ సైన్యం ఒక పెద్ద పడవలో బండ్ల నిండా బిస్కట్లు, గన్ పౌడర్ తో డాన్ నది వైపు ప్రయాణిస్తూ ఉంది. అప్పట్లో చిగొనాకి పట్టణంలో, నది ఎగువ భాగంలో ఉండే బందిపోట్లైన కోసాక్కులు, ఖోప్యోర్ ఉపనది దగ్గర, ఆ సైన్యం రాత్రి నిద్రలో ఉన్నప్పుడు, పడుకున్న రక్షకులను చంపి,ఆ బిస్కట్లు మరియు గన్ పౌడర్ దొంగిలించి, పారిపోయారు.
ఈ విషయం తెలిసిన జార్ ప్రభువు వొరొనేజ్ నుండి సైన్యాన్ని పిలిపించాడు. వెంటనే ఆ సైన్యం రంగంలోకి దిగి,ఆ పట్టణం మొత్తం తగలబెట్టి, ఆ పని చేసిన కోసాక్కులకు ఓటమి రుచి చూపించింది. అంతే కాకుండా మేజర్ యకిర్కాతో పాటు ఇంకో నలభై మంది ఖైదీలను ఉరి తీసి, వారి శరీరాలను ఆ నదిలో వదిలేసింది. ఈ చర్య వారు చేసింది ఇటువంటి పనులు చేస్తూ ఉండే కోసాక్కుల గుండెల్లో దడ పుట్టించడానికే.
ఏ చోటునైతే ఆ సైన్యం తగలబెట్టిందో, అదే పట్టణంలో మిగిలిన ప్రాంతాల్లో ఉన్న కోసాక్కులు స్థిరపడ్డారు. మరలా ఆ స్టానిట్సా పెరిగింది, దాని చుట్టూ రక్షణగా ప్రాకారాలు కూడా ఏర్పడ్డాయి. ఆ రోజుల్లోనే నికిత మొఖోవ్ అనే సన్నకారు రైతు వొరొనేజ్ నుండి జార్ కు కన్ను,చెవిగా ఉండటానికి ఆ ప్రాంతానికి వచ్చాడు. అతను ఆ ప్రాంతంలో వర్తకుడిగా మారాడు. కోసాక్కులకు ఉపయోగపడే అనేక రకమైన వస్తువులు అతను అమ్మేవాడు. పిడి బాకులు, పొగాకు,చెకుముకి రాళ్ళు; వాటితో పాటు అతను స్మగ్లింగ్ సరుకు కూడా అమ్మేవాడు. సంవత్సరానికి రెండు సార్లు వొరొనేజ్ కు కావల్సిన సరుకులు తీసుకువచ్చే నెపంతో వెళ్ళినా,అసలు కారణం మాత్రం ఆ స్టానిట్సా అంతా ప్రశాంతంగా ఉందని,ఆ కోసాక్కులు ఏ కుట్ర చేయడం లేదని ప్రభువుకి చెప్పడానికే.
ఈ నికిత మొఖోవే మొఖోవ్ వర్తక కుటుంబానికి పూర్వీకుడు. ఆ వంశం,కుటుంబం కోసాక్కుల నేలలో వేరులా దిగిపోయి, తన విత్తనాలను సమృద్ధిగా వృద్ధి చేసుకుంటూ, ఆ స్టానిట్సా ప్రాంతంలో రోడ్డు పక్కన ఉండే కలుపు మొక్కలా పీకడానికి వీలు లేకుండా పెరిగిపోయింది. వారి పూర్వీకులకు వొరొనేజ్ గవర్నర్ ఈ స్టానిట్సా కు పంపేటప్పుడు సూచనలతో ఇచ్చిన ఉత్తరం ఇప్పుడు సగం కాలిపోయి ,పాడైపోయినా ఆ కుటుంబం నేటికి దానిని గొప్ప ఆస్తిగా భద్రపరుచుకుంది. సెర్జి ప్లాటోనోవిచ్ తాతయ్యగారి కాలంలో, ఒక మంట వల్ల ఆ ఉత్తరం ఉంచిన పెట్టె కాలిపోకపోతే ఇప్పటికీ కూడా ఆ ఉత్తరం చెక్కుచెదరకుండా ఉండేది.ఆ తాతగారు, పేకాటలో ఉన్న ఆస్తులను దుబారా చేసి, మళ్ళీ మెల్లగా నిలదొక్కుకుంటున్న సమయంలోనే జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో ఉన్నది కూడా ఊడ్చుకుపోయింది. ఈ ఘటన వల్ల సెర్జి ప్లాటోనోవిచ్ మరలా తన జీవితాన్ని, కొత్తగా మొదలు పెట్టాల్సి వచ్చింది. పక్షవాతం వచ్చిన తండ్రి మరణించాక, ఆయన్ని పాతిపెట్టి, పంది జుట్టు, గొర్రె ఊలు కొంటూ;షూ లేసుల వ్యాపారం మొదలుపెట్టాడు. ఐదేళ్ళపాటు నోటికి-చేతికి అన్నట్టు జీవితం గడుపుతూ, కోసాక్కుల దగ్గర వ్యాపారం చేస్తూ ఒక్క కోపెక్కు కూడా విడిచిపెట్టేవాడు కాదు. తర్వాత హఠాత్తుగా అతను ఎదిగిపోయాడు, అప్పటివరకు, రోడ్ల మీద తిరుగుతూ అమ్ముకుంటూ తిరిగిన సెర్జి కాస్త ఒక్కసారిగా ‘సెర్జి ప్లాటోనోవిచ్’ గా మారిపోయాడు. సూది,దారాలు,కుట్టు పనికి కావాల్సిన వస్తువులు అమ్మే చిన్న కొట్టు తెరిచాడు, సగం పిచ్చి పట్టిన ఓ పురోహితుడి కూతురిని వివాహం చేసుకున్నాడు; వచ్చిన కట్నం చిన్న మొత్తమే అయినా, దానితో తన వ్యాపారాన్ని పెంచుకున్నాడు. బట్టల వ్యాపారంలో అడుగు పెట్టడానికి మంచి ముహూర్తం కోసం చూస్తున్నాడు. కోసాక్కుల సైనిక ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి,గ్రామంలో ఉన్న ప్రజలందరూ సారం లేకుండా బీడు పడి డాన్ నదికి ఎడమ వైపున ఉన్న చోటు నుండి కుడి వైపుకి తరలి వెళ్ళిపోతున్నారు. క్రాస్నోకుట్స్కాయా కు ఉన్న యవ్వనవంతుడైన స్టానిట్సా మెరుగు వేగంతో ఆ కొత్త ప్రాంతాన్ని కొత్త భవనాలతో అభివృద్ధి పరిచాడు. అప్పటి వరకు ఎస్టేట్లగా ఉన్న ప్రాంతంలోకి, చిర్, చోరన్య,ఫ్రొలోవ్క నదీ ప్రాంతాల భాగానికి,వాటి పక్కన పచ్చిగడ్డి మైదానాల్లోకి; ఉక్రేనియా ఒప్పందాలను అనుసరించి ఆ కోసాక్కుల గ్రామాలు విస్తరించాయి. అప్పటి వరకు ఆ గ్రామస్తులు ఏది కావాలన్నా దాదాపుగా యాభై వెరస్టులు లేదా అంతకన్నా ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చేది. కానీ ఇక్కడ,హఠాత్తుగా, వారి ఇళ్ళకు ఎదురుగా, ఓ పెద్ద షాపులో ఖరీదైన చెక్కలతో చేసిన అరల్లో సర్ది ఉన్న రకరకాల బట్టలు వాళ్ళకు దర్శనం ఇస్తూ ఉన్నాయి. సెర్జి ప్లాటోనోవిచ్ నాదస్వరం ఊదే వాడిలా పూర్తి ఉత్సాహం,శక్తితో వ్యాపారాన్ని పెంచుకుంటూ ఉన్నాడు. బట్టలతో పాటు వ్యవసాయ వర్గానికి కావాల్సిన వస్తువులు కూడా అతను అమ్మడం ఆరంభించాడు. గుర్రపు జీనులు,కిరోసిన్ , ఉప్పు,బట్టలు కుట్టుకోవడానికి అవసరమయ్యే చిన్న చిన్న వస్తువులు;ఇలా ఎన్నో అమ్మేవాడు. తర్వాత వ్యవసాయానికి కావల్సిన పరికరాలను కూడా అమ్మే వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. నాగళ్ళు, విత్తనాలు చల్లే యంత్రం, కోత కోసే పనిముట్లు; వాటిని అక్సాయి ఫ్యాక్టరీ నుండి కొని తెచ్చి తన షాపులో చక్కటి పెద్ద అరల్లో నిలుచోబెట్టి ఉంచాడు. పచ్చగా ఉన్న ఆ అరల తలుపు వల్ల వేసవికాలంలో కూడా అక్కడ చల్లగానే ఉండేది. పర్సులో ఎంత ఉంది అని లెక్కబెట్టుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేదు ఎందుకంటే ఇప్పుడు సెర్జి ప్లాటోనోవిచ్ వ్యాపారంలో బాగా సంపాదిస్తున్నాడు. మూడేళ్ళ తర్వాత ధాన్యపు గిడ్డంగిని కూడా తెరిచాడు, అతని మొదటి భార్య మరణించాక, స్టీమ్ ఇంజిన్ తో నడిచే పిండి మర భవనాన్ని కూడా ప్రారంభించాడు.
చిన్నగా గోధుమ రంగులో, నల్లటి వెంట్రుకలతో ఉండే అతని పిడికిలి, తటార్ స్కీ గ్రామంలోనూ,ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ పట్టు సాధించింది. ఆ ప్రాంతంలో కొందరు రైతులు తప్ప దాదాపుగా అందరూ కాషాయపు గీతలు చుట్టూ గీసి ఉన్న పచ్చటి కాగితాలు ఇచ్చినవారే.అవి తాము తీసుకున్న అప్పు చెల్లిస్తామన్న హామీ దస్తావేజులు. (ఉదాహరణకు కూతురి పెళ్ళి సమయంలో డబ్బు అవసరం ఉండటం వల్ల,అదే సమయంలో వరి ధర తక్కువ పలకడం వల్ల, ‘ప్లాటోనోవిచ్,అప్పు ఇవ్వు’,లాంటి అడగడాలు). అనేక సందర్భాల్లో ఎందరో అతని దగ్గర అప్పు పడ్డవారే. మిల్లు దగ్గర తొమ్మిది మంది పని చేస్తూ ఉంటే, షాపులో ఏడుగురు, ఇంకో నలుగురి పనివాళ్ళు ఇంట్లో ఉన్నారు. అంటే మొత్తం మీద ఇరవై మంది దాకా ఉన్నారు. మొదటి భార్య వల్ల అతనికి ఇద్దరు పిల్లలు కలిగారు; లిజా అనే అమ్మాయి; ఆమె కన్నా రెండేళ్ళు చిన్నవాడైన, అల్లరివాడైన వ్లాదిమిర్. అన్నా ఇవానొవ్న అతని రెండో భార్య. సన్నగా, సూటిగా ఉండే ముక్కుతో ఉండే ఆమెకు సంతానం లేదు.ఆమె తనకు ముప్పై ఐదు ఏళ్ళు వయసు వచ్చేవరకు వివాహం చేసుకోలేదు. అందుకే ఆలస్యం వల్ల ఆమెలో కలిగిన ప్రేమ,ద్వేషం అంతా కూడా అత్తారింట్లో ఉన్న పిల్లలపై చూపిస్తూ ఉంటుంది. ఆ సవతి తల్లి తనలో పేరుకుపోయిన భావాలను వదిలించుకునే ప్రక్రియలోనే పిల్లలను భాగం చేయడం వల్ల, వారి పెంపకం అంతంతమాత్రంగానే సాగేది. ఇక వారి తండ్రికి వారిని పట్టించుకునే తీరిక కూడా ఉండేది కాదు. ఆ తల్లి, తండ్రి కన్నా గుర్రాలశాలను చూసుకునే నికిత లేకపోతే వంట మనిషే బాగా ఆ పిల్లలను చూసుకునేవారు. వ్యాపారం,ప్రయాణాల వల్ల ప్లాటోనోవిచ్ కు అస్సలు తీరిక చిక్కేది కాదు.ఇప్పుడు మాస్కోలో ఉంటే, తర్వాత నిజ్నీలో, ఆ తర్వాత ఉర్యుపీనిక్సాయా లోనే ఉండేవాడు లేకపోతే స్టానిట్సా వ్యవహారాల్లోనే మునిగి తేలేవాడు. ఎవరి మార్గదర్శకం లేకుండానే ఆ పిల్లలు పెరిగారు. సవతి తల్లిలో ఆ పిల్లల పట్ల సున్నితత్వం ప్రదర్శించలేదు; ఆమె అంత పెద్ద ఇంటిని చూసుకునే హడావుడిలో ,వారి లోపలి జీవితాలు గురించి తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. ఆ అక్కాతమ్ముళ్ళు ఒకరికొకరు అపరిచితులుగానే పెరిగారు,వారి వ్యక్తిత్వాలు కూడా ఎంతో భిన్నంగా ఉన్నాయి. ఇంట్లో ఒకరికొకరు ఎదురుపడేది కూడా చాలా తక్కువగా ఉండేలా ఆ ఇద్దరూ పెరిగారు. వారిద్దరూ ఒకే కుటుంబం అనే నమ్మకం కలిగించలేనంతగా ఆ ఇద్దరు పెరిగారు. వ్లాదిమిర్ నిరాసక్తంగా,తన మనసులోని విషయాలు ఎవరితో పంచుకోకుండా, ఎప్పుడూ ముఖం చిట్లించుకుంటూ, సంవత్సరాలతో పాటు అతను కూడా గంభీరంగా తయారవ్వసాగాడు. తన వంటమనిషి,పనిమనిషితో ఆత్మీయత పెంచుకున్న లిజా,వారి సంభాషణల ద్వారా లైంగిక జీవితం గురించి తెలుసుకుంటూ, దాని పట్ల ఆసక్తి పెంచుకుంది. లిజా ఇంకా సిగ్గు పడుతూ,అప్పుడే యవ్వనంలో ప్రవేశించిన యువతి అయినప్పటికి వారు ఆమెలో అనవసరమైన ఆసక్తిని రేకెత్తించి,మార్గాలను ఆమెకే వదిలేశారు.ఆమె అడవిలోని పొదల్లో పెరిగే ముళ్ళ చెట్టులా ఆమె పెరగసాగింది.
ఏ మాత్రం తొందర లేకుండా అనేక సంవత్సరాలు గడిచిపోయాయి.
ముసలివాళ్ళు ఇంకా వృద్ధులు అవుతూ ఉంటే,యవ్వనంలో ఉన్నవారు మిసమిసలాడుతున్నారు.
ఓ సాయంత్రం టీ తాగుతూ తన కూతురిని చూసిన సెర్జి ప్లాటోనోవిచ్ ఆశ్చర్యపోయాడు. అప్పుడే హై స్కూల్ చదువు పూర్తి చేసుకున్న తన కూతురు అంతలోనే అందగత్తె అయిన యువతిలా మారిపోయిందా అని అనుకున్నాడు. ఆమెను చూసి అతని చేతిలో ఉన్న కాషాయ రంగు టీ ఉన్న సాసర్ ను వదిలేశాడు. ఆమె అచ్చం తన తల్లిలా లేదు?దేవుడా! ఎంత దగ్గరి పోలికలు!’హే,లిజా,ఒకసారి ఇటువైపుకి తల తిప్పు అమ్మాయి!’ బాల్యం నుండి చూస్తున్న తన కూతురికి తల్లి పోలికలు అంతలా రావడం ఇన్నాళ్ళు గమనించకుండా ఎలా ఉండిపోయాననుకున్నాడు.
…వ్లాదిమిర్ మిఖోవ్, ఇప్పుడు తన ఐదవ సంవత్సరం హైస్కూలులో చదువుతున్నాడు. ఎత్తైన భుజాలతో,పాలిపోయిన పసుపు రంగులో ఉన్న శరీర ఛాయతో ఉన్న అతను ఆవిరి ఇంజనుతో నడిచే మిల్లు వాకిట్లోకి నడిచాడు. అతను,అతని అక్క ఈ మధ్యనే ఇంటికి వేసవి సెలవులలో వచ్చారు. అతను తన అలవాటు ప్రకారం మిల్లుకి వెళ్ళాడు. అక్కడ పిండి ముఖం మీద పడి ఉన్న జనాలను చూస్తూ , అక్కడ ఉండే యంత్రాల ధ్వనులను వినడం అతనికి ఇష్టం. అంతేకాదు,అతను ఆ ఆవరణలో అడుగుపెట్టగానే, అక్కడ ఉండే కస్టమర్స్ మరియు పనివాళ్ళు,వారిలో వారు గుసగుసగా, ‘అతనే యజమాని కొడుకు, వారసుడు’ అని అనుకుంటుంటే అది వినడం, అతని ఇగోను సంతృప్తి పరుస్తూ ఉంటుంది.
ఆ వాకిట్లో ఉన్న పశువుల పేడ ఉన్న గుట్టలు, బండ్ల మధ్యలో నుండి జాగ్రత్తగా ద్వారం వైపుకి నడిచాడు. అప్పుడు అతనికి తను ఇంజన్ గదిలోకి వెళ్లలేదని గుర్తుకు వచ్చింది. వెంటనే వెనక్కి వెళ్ళాడు.
ఇంజిన్ గదిలో ఎర్ర ఆయిల్ ట్యాంక్ దగ్గర టిమోఫీ ఉన్నాడు, నావ్ అనే ముద్దుపేరుతో పిలవబడే ఇంకో పనివాడు, టిమోఫీ సహాయకుడిగా ఉన్న కుర్రాడు అయిన దవ్యాడ్కా కూడా ఉన్నాడు,అతని పళ్ళు తెల్లగా ఉన్నాయి. వారు వారి పైజామాలు మోకాళ్ళవరకు లాక్కుని ఓ గుంటలో ఉన్న తడి మట్టిని తొక్కుతున్నారు.
‘ఓ… యజమానిగారు!’ నావ్ వెటకార ధోరణిలో పలకరించాడు.
‘శుభమధ్యాహ్నం.’
‘శుభ మధ్యాహ్నం, వ్లాదిమిర్ సెర్జేయేవిచ్!’
‘నువ్వు ఏం చేస్తున్నావు?’
‘మట్టి తొక్కుతున్నాను’, దవ్యాడ్కా వెకిలి నవ్వు నవ్వుతూ, పేడ వాసన వస్తున్న ఆ గుంటలో తన కాళ్ళను పైకి కిందికి తొక్కుతూ అన్నాడు. ఓ అమ్మాయిని ఈ పనికి పెడితే ఎక్కడ డబ్బు ఖర్చు అవుతుందో అని,మీ నాన్న మాతోనే ఈ పని చేయిస్తున్నాడు. మీ నాన్న పెద్ద పీనాసి, ముసలి పీనాసి!’, మళ్ళీ అన్నాడు.
ఆ మాటలకు వ్లాదిమిర్ కు కోపం వచ్చింది. ఎప్పుడూ వెటకారంగా నవ్వుతూ, ఎప్పుడూ వ్యంగ్యంగా మాట్లాడే దవ్యాడ్కా అంటే అతనికి ఓ రకమైన అయిష్టత ఏర్పడింది. అతని తెల్ల పళ్ళు కూడా వ్లాదిమిర్ కు నచ్చలేదు.
‘పీనాసి?’
‘అవును. ఆయన ఓ భయంకరమైన మనిషి. తన పెంట తానే తింటాడు’, దవ్యాడ్కా నవ్వుతూ వివరించాడు.
ఆ మాటలకు నావ్, టిమోఫీ అంగీకరిస్తున్నట్టు నవ్వారు. ఆ మాటలు,నవ్వులు వ్లాదిమిర్ కు అవమానంగా అనిపించాయి. అతను గంభీరంగా తన ముఖాన్ని గంభీరంగా మార్చుకుని దవ్యాడ్కాను అడిగాడు.
‘నీకు నువ్వు చేస్తున్న పనితో సంతృప్తి కలగడం లేదా?’
‘ఇక్కడ ఈ గుంటలోకి వచ్చి, ఈ మట్టి తొక్కు,అప్పుడు నీకు తెలుస్తుంది. ఏ వెధవకు ఈ పని వల్ల సంతృప్తి కలుగుతుంది? మీ నాన్న ప్రయత్నించాలి ఇది చేయడం; అప్పుడే ఆయన బాణ పొట్ట కాస్త తగ్గుతుంది!’
ఆ గుంటలో గుండ్రంగా తిరుగుతూ దవ్యాడ్కా తన కాళ్ళను పైకి ఎత్తుతూ తొక్కుతూ ఉన్నాడు. ఏ రకమైన హానిని సూచించకుండా ఇప్పుడు అతని నవ్వు ఉత్సాహంగా ఉంది. తన మనసులోనే తను ఏ సమాధానం చెప్తే బావుంటుందో ఆలోచించుకుంటూ,చివరకు ఓ సమాధానం బావుంటుందని అనిపించడంతో అది చెప్పడానికి వ్లాదిమిర్ సిద్ధపడ్డాడు.
‘సరే అయితే,’, అంటూ, ఓ నిమిషం తన మాటలను జాగ్రత్తగా మరలా ఆలోచించుకుంటూ,’నేను నాన్నతో నీకు ఈ పని చేయడం ఇష్టం లేదని చెబుతాను’,అన్నాడు.
వ్లాదిమిర్ పక్కనుండి దవ్యోడ్కా ముఖం వైపు చూసి అతని ముఖాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. దవ్యోడ్కా పెదాలు వణుకుతూ ఉంటే,అతను బలవంతపు నవ్వుతో ఉంటే, మిగిలిన ఇద్దరు తమ ముఖాలు చిట్లించుకుని ఉన్నారు. ఒక్క నిమిషం పాటు ఆ ముగ్గురు ఆ మట్టిని మౌనంగానే తొక్కారు. కాసేపటి తర్వాత దవ్యోడ్కా తన దృష్టిని బురదతో ఉన్న తన కాళ్ళ మీద నుండి మళ్ళించుకుని పశ్చాత్తాపంతో ,అలాగే ఎలాగైనా ఒప్పించాలన్న స్వరంతో, ‘నేను హాస్యానికి అన్నాను,వ్లాదిమిర్….కేవలం అది హాస్యానికి అన్నదే.’
‘నేను నాన్నకు నువ్వు ఏమన్నావో అదే చెప్తాను.’
తనకు తన మీద, తండ్రి మీద, దవ్యోడ్కా జాలిగా నవ్విన నవ్వు మీద కలిగిన అసహ్యం వల్ల కన్నీళ్ళు కళ్ళల్లో నిండబోతుంటే, వ్లాదిమిర్ ఆ ఆయిల్ ట్యాంక్ ముందుగా నడిచిపోయాడు.
‘వ్లాదిమిర్! వ్లాదిమిర్ సర్జెయేవిచ్!’ దవ్యోడ్కా భయంతో ఆ గుంటలో నుండి పైకి ఎక్కి, తన మోకాళ్ళ పైకి ఉన్న పైజామాను కిందకు లాక్కుని అరిచాడు.
వ్లాదిమిర్ ఆగాడు. దవ్యోడ్కా రొప్పుతూ,అతని దగ్గరకు పరిగెట్టుకుంటూ వెళ్ళాడు.
‘మీ నాన్నకు చెప్పొద్దు.నేను కేవలం సరదాగా అన్నాను.నన్ను క్షమించు. నేను పెద్ద వెధవను. నా మాటల్లో ఏ హాని లేదు,నిజాయితీగా చెప్తున్నా!అది కేవలం హాస్యానికి అన్నదే.’
‘సరే,నేను చెప్పను!’ వ్లాదిమిర్ దాదాపుగా అరుస్తున్నట్టే ఆ మాటలు అని, ముఖం చిట్లించుకుని, గేటు వైపుకు వెళ్ళిపోయాడు.
దవ్యోడ్కా పట్ల ప్రదర్శించిన జాలి వల్ల గెలిచినట్లు అనిపించింది వ్లాదిమిర్ కి. ఓ రకమైన తృప్తితో అక్కడ ఉన్న తెల్ల కంచె వైపు నడిచాడు. ఆ మిల్లు వాకిటికి దగ్గరలో మిల్లు లోపల ఓ మూల నుండి సుత్తితో కొడుతున్న శబ్దం, అతని చెవులను తాకింది. ఇనుము మీద అలా కొట్టినట్టు మూడు సార్లు వినిపించింది.
‘ఎందుకు వాడికి క్షమాపణ చెప్పావు?’ నీవ్ వెటకారంగా అడుగుతున్న మాటలు అతనికి వినిపించాయి. దానికి వెటకారంగా నవ్వాడు దవ్యోడ్కా. ‘అది అంటుకోకు,అది పాడవ్వదు’,వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళ మాటల్లో తన పట్ల పరిహాసం కనిపించింది వ్లాదిమిర్ కు.
గుంట నక్క! వ్లాదిమిర్ కు ఒక్కసారిగా కోపం వచ్చింది. వీడు ఇంతే ….మారడు! వీళ్ళు కూడా ఇలానే మాట్లాడుకుంటూ ఉంటారు. ‘నేను నాన్నకు ఈ విషయం చెప్పాలా? వద్దా?’ అతను ఆలోచించుకుంటే వెనక్కి తిరిగి చూశాడు. తెల్లటి పళ్ళతో నవ్వుతూ ఉన్న దవ్యోడ్కా ముఖం చేసి నిర్ణయం తీసుకున్నాడు. ‘నేను చెప్తాను’,అని.
షాపు బయట ఒక గుర్రం,దానికి అమర్చి ఉన్న బండి ఒక గేట్ పోస్టుకు కట్టి ఉంది.అగ్ని మాపక దళం కేంద్రమైన ఒక షెడ్ పై కప్పుపై బూడిద రంగులో ఉన్న పిచ్చుకలను దూరం నుండి చిన్న పిల్లలు అరుస్తూ అదిలిస్తూ ఆడుకుంటున్నారు. వరండా నుండి ఒక గంభీరంగా ఉన్న బోయార్ష్కిన్ అనే విద్యార్ధి స్వరంతో పాటు బొంగురుగా ఉన్న ఇంకో గొంతు కూడా వినవచ్చింది.
వ్లాడిమీర్ వాకిటి ముందు ఉన్న మెట్లు ఎక్కాడు. వాకిలి అంతా పాకి ఉన్న అడవి ద్రాక్ష చెట్టు, నీలం రంగులో పెయింట్ వేసి ఉన్న పై కప్పు నుండి తన పచ్చటి తీగలతో వేలాడుతూ, అతను ముందుకు వెళ్తూ ఉంటే ఊగుతూ ఉంది.
బోయార్ష్కిన్ నున్నగా ఊదా రంగులో ఉన్న తన తల ఊపుతూ, యవ్వనంలో ఉన్నప్పటికి గడ్డంతో ఉన్న స్కూల్ మాస్టర్ తో మాట్లాడుతూ ఉన్నాడు.
‘నేను ఆయన్ని చదివినప్పుడు, ఒక కోసాక్కు రైతు కొడుకుగా, రాచరిక-జమిందారీ వైభవం ఉన్న వారి పట్ల సాధారణంగానే నాకు విముఖత ఉన్నప్పటికి కూడా; క్షీణిస్తూ ఉన్న ఆ సమాజాన్ని చూస్తే నాకు జాలి వేస్తూ ఉంటుంది. ఆ సమయంలో నాకు నేనే కులీన వర్గీయుడిని, భూస్వామిని అయిపోతాను.ఆదర్శవంతంగా ఉండే ఆ వర్గ స్త్రీలు,వారి ఆసక్తుల పట్ల నాకు ఎంతో ఆరాధన ఉంది. ఓ కుర్రాడా! నీవు మంచి తెలివైన వాడివి. దీని వల్ల నీ నమ్మకం మారుతుంది.’
బలాండా తను ధరించిన పట్టు శాలువాకు ఒక వైపు ఉన్న దారాలను తిప్పుతూ, వ్యంగ్యంగా నవ్వుతూ, ఎదురుగా ఉన్న శిష్యుడి ఎర్ర చొక్కా వైపు చూస్తూ అన్నాడు. లిజా ఒక పడక కుర్చీలో కూర్చుని ఉంది, ఆమె వాలకం చూస్తేనే ఈ సంభాషణ పట్ల ఆమెకు ఏ మాత్రం ఆసక్తి లేదని తెలిసిపోతుంది. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నదానిలా లేకపోతే లేదా ఏదో వెతుకుతున్నట్టు ఉన్న కళ్ళతో ఆమె బోయార్ష్కిన్ నున్నగా ఉన్న ఊదా రంగు తలవైపు నిరాసక్తంగా చూసింది.
వ్లాడిమిర్ ముందుకు నడిచి, కొద్దిగా వినయంగా శరీరాన్ని కిందకు వంచి తండ్రి చదువుకునే గది తలుపు మీద చిన్నగా తట్టాడు. సెర్జీ ప్లాటోనోవిచ్ ఒక సోఫాలో కూర్చుని, జూన్ నెల రష్యన్ పత్రిక ‘రుస్కోయి బోగాత్ స్వో’ పేజీలు తిప్పుతున్నాడు. పసుపు పచ్చ అంచు ఉన్న ఓ కత్తి నేల మీద పడి ఉంది.
‘ఏంటి విషయం?’
‘నేను మిల్లు నుండి తిరిగి వస్తూ ఉంటే, అతను సందేహంగా మొదలుపెట్టినా, దవ్యాడ్కా వెకిలిగా నవ్విన నవ్వును గుర్తు తెచ్చుకుని, అలాగే బిగుతుగా ఉన్న కోటును ధరించి లావైన శరీరంతో ఉన్న తండ్రి వంక చూస్తూ, తను చెప్పదలచుకున్నది చెప్పాడు, ‘నేను దవ్యాడ్కా మాట్లాడుతూ ఉండగా విన్నాను …’
సెర్జీ ప్లాటోనోవిచ్ శ్రద్ధగా కొడుకు చెప్పింది విన్నాడు.
“అతన్ని పనిలో నుంచి తీసి వేద్దాము. ఇక నువ్వు వెళ్ళు.” మూలుగుతూ,నేల మీద పడి ఉన్న కత్తి తీసుకున్నాడు.
ఆ ప్రాంతంలో ఉన్న మేధావులు అందరూ తరచుగా మొఖోవుల ఇంట్లో సాయంత్రాలు కలిసేవారు. వారిలో బోయార్ష్కిన్ ఓ మాస్కో సాంకేతిక కళాశాలలో విద్యార్ధి, బలాండా తన అహంకారంతోనూ, క్షయ వ్యాధితోనూ కృశించిపోయిన ఓ స్కూల్ మాస్టర్; అతని భార్య మార్ఫా జెరాసిమనోవ, కూడా ఓ టీచర్, లావుగా,ఉత్సాహంగా ఉంటుంది;ఎప్పుడు ఆమె లోపల ధరించిన పెట్టికోటు బయటకు కనిపిస్తూనే ఉంటుంది; ఒక పిచ్చివాడిలా ఉంటూ చవక సెంటు వాసనతో ఉండే బ్రహ్మచారి అయిన ఓ పోస్ట్ మాస్టర్. యవ్వనంలో ఉన్న లెఫ్టినెంట్ అధికారి అయిన యెవజెని లిస్ట్ నిట్స్కి కూడా అప్పుడప్పుడు తన ఎస్టేట్ నుండి వచ్చేవాడు. అతను తన ఎస్టేట్ లో భూస్వామి,కులీన వర్గీయుడు అయిన తన తండ్రితో కలిసి ఉండేవాడు. మొఖొవుల వాళ్ళందరూ కలిసి వరండాలో కలిసి కూర్చుని, ఒక టీ తాగి, ఒక లక్ష్యం లేకుండా అనేక విషయాల మీద మాట్లాడుకున్నారు. ఎప్పుడైతే ఆ సంభాషణలు వేడెక్కి దారి తప్పుతాయో,అప్పుడు ఎవరో ఒకరు అక్కడ ఉన్న ఖరీదైన గ్రామఫోన్ ను పెడతారు.
అప్పుడప్పుడూ పండుగల సమయాల్లో సెర్జి ప్లాటోనోవిచ్ వేడుకలు చేయడానికి ఇష్టపడేవాడు. ఆ సమయాల్లో తన అతిథులను ఆహ్వానించి, ఖరీదైన మద్యం, బటాయిస్క్ నుండి ప్రత్యేకంగా తెప్పించిన చేప మాంసం, ఇంకెన్నో వంటకాలు ఏర్పాటు చేసేవాడు వారి కోసం. ఇవి లేనప్పుడు పీనాసిలానే జీవితం సాగించేవాడు. అతనికి ఉన్న ఒకే ఒక్క వ్యాపకం పుస్తకాలు. సెర్జి ప్లాటోనోవిచ్ కు చదవడం ఎంతో ఇష్టం, అలాగే చదువుతూ ఆ అక్షరాల లోతును తనదైన బుర్రతో మధించడం ఇంకా ఇష్టం.
ప్లాటోనోవిచ్ భాగస్వామి యెమెల్యాన్ కాన్ స్టాంటినోవిచ్ అట్యోపిన్, దట్టమైన జుట్టుతో,గెడ్డంతో, లోతుకుపోయిన కళ్ళతో ఉండేవాడు. అతను ఎప్పుడో ఓ సారి ప్లాటోనోవిచ్ ను చూడటానికి వచ్చేవాడు. ఉస్ట్ -మెడ్ వేదిత్సా అనే కాన్వెంట్ లో ఒకప్పుడు నన్ గా ఉన్న స్త్రీను వివాహం చేసుకున్నాడు. వారి వివాహమైన పదిహేను ఏళ్ళల్లో ఆ భార్యాభర్తలు ఎనిమిది మంది పిల్లలను భూమి మీదకు తీసుకువచ్చారు,మరియు అతను ఎక్కువ సమయం ఇంట్లోనే గడిపేవాడు. అట్యోపిన్ తన వృత్తిని రెజిమెంటల్ క్లర్క్ స్థాయి నుండి మొదలు పెట్టాడు. ఆ తర్వాత పై అధికారులతో మంచిగా ఉంటూ, వారిని కాకా పడుతూ ఎదిగాడు. అతను ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు మునివేళ్ళపై నడిచేవారు,అలాగే గుసగుసగా మాట్లాడుకునేవారు. ఉదయం స్నానాలు చేశాక,ఆ పిల్లలంతా భోజనాల గదిలో గోడ గడియారం ఉన్న గోడ కింద వాళ్ళ అమ్మ ముందు నిలబడి ఉండేవారు. ఎప్పుడైతే తండ్రి పొడి దగ్గు శబ్దం వారికి వినబడేదో అప్పుడు వాళ్ళు, ఒక లయ లేకుండా,అయిష్టంగా, ‘దేవుడా ఈ ప్రజలను కాపాడు!’,అని అని ,తర్వాత, ‘మా నాన్నను కూడా’,అనేవారు.
వారు ప్రార్థన పూర్తి చేసే సమయానికి వారి తండ్రి సిద్ధమై అక్కడకు వచ్చేవాడు , గుంటలు పడి ముడతలు పడిన ముఖంపై పీక్కు పోయిన కళ్ళతో, వెంట్రుకలు లేకుండా మాంసం ముద్దలా ఉన్న చేతిని బిషప్ లా ముందుకు చాచి నిలబడేవాడు. అప్పుడు ఆ పిల్లలు ముందుకు వచ్చి ఆ చేతిని ముద్దు పెట్టుకునేవారు. అప్పుడు అతను తన భార్య బుగ్గపై ముద్దు పెట్టుకుని, తత్తరపడుతూ, ‘టీ పెట్టావా?’ అని అడిగేవాడు. అతను ప్రతి మాట పట్టిపట్టి మాట్లాడేవాడు.
‘పెట్టాను, యెమెల్యాన్ కాన్ స్టాంటినోవిచ్.’
‘నాకు ఒక కప్పులో పోసి ఇవ్వు.’
అట్యోపిన్ షాపులో అకౌంట్లు చూసేవాడు. అతను పేజీలకు పేజీలు డెబిట్,క్రెడిట్ లెక్కలు తన గుమాస్తా చేతిరాతతో రాసేవాడు. ఆ తర్వాత సమయంలో స్టాక్ ఎక్స్ ఛేంజ్ వార్తలు చదువుతూ, తన ముక్కు మీదకు జారిపోయే కళ్ళద్దాలను సరి చేసుకుంటూ, అక్కడ ఉన్న పని వారితో మర్యాదగా ఉండేవాడు.
‘ ఇవాన్ పెట్రోవిచ్, ఈయనకు కావలసినవి చూపించు. ఈయనకు థోరిడా కాటన్ కావాలంటా.’
అతని భార్య అతన్ని ‘యెమెల్యాన్ కాన్ స్టాంటినోవిచ్’ అని, పిల్లలు ‘పాపీ’అని, షాపులో వాళ్ళు ‘నత్తిగాడు’అని పిలిచేవారు.
ఆ ఊరిలో ఉండే ఇద్దరికి సెర్జి ప్లాటోనోవిచ్ అంటే పాత కోపాల వల్ల పడేది కాదు. వాళ్ళే ఫాదర్ విశారియోన్ ,రెవరెండ్ ఫాదర్ పాన్ క్రాటి. ఈ ఇద్దరికీ కూడా ఒకరంటే ఒకరికి కూడా పడేది కాదు. ఫాదర్ పాన్ క్రాటి,తన గొప్పతనం గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉండేవాడు, అతనికి తన పొరుగువాడైన ఫాదర్ విశారియోన్ కు హాని కలిగించడంలో సిద్ధహస్తుడు. ఫాదర్ విశారియోన్ భార్య మరణించింది, అతను ఉక్రేనియా దేశస్థుడైన ఓ పనివాడితో కలిసి ఉంటున్నాడు. ఆ పని వాడి గొంతు కీచుగా ఉన్నా, మంచి హాస్య స్వభావం కలవాడు. అతనికి కూడా వారికి పొరుగున ఉంటూ గర్వాన్ని,అతిశయాన్ని ప్రదర్శించే రెవరెండ్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు.
ఆ అందరిలో ఒక్క స్కూల్ మాస్టర్ బలాండాకు తప్ప అందరికీ కూడా సొంత ఇల్లులు ఉన్నాయి. మొఖోవ్ ఇల్లు ధృఢంగా కట్టబడి, నీలం రంగులో పెయింటింగ్ వేయబడి,ఆ కూడలికే అందంగా ఉండేది. దాని ఎదురుగానే రెండు తలుపులతో, అక్షారాలు పాతబడిపోయిన సైన్ బోర్డుతో ఉన్నది, ‘ఎస్. పి. మొఖోవ్ మరియు వై.కె.అట్యోపిన్’ షాపు.
ఆ షాపు పక్కన ఒక షెడ్డు,అక్కడి నుండి యాభై గజాల దూరంలో చర్చి చుట్టూ ఉన్న ఓ చిన్న ఇటుకల గోడ, అలాగే పైన ఉన్న గోపురం వల్ల ఆ చర్చి ఓ పండిపోయిన ఉల్లిపాయలా ఉంది. ఆ చర్చి వెనకాల తెల్లగా సున్నాలు వేసి ఉన్న గోడలతో ఓ పాఠశాల, దాని పక్కన చక్కటి రెండు ఇల్లులు; అందులో ఒకటి లేత నీలం రంగు కంచెతో సహా వేసి ఉన్నది; అది ఫాదర్ పాన్ క్రాటి కి చెందినది. రెండవది మొదటి దానికి భిన్నంగా గోధుమ రంగులో ఉన్న ఇల్లు ముందు కంచె, లోపల చక్కటి బాల్కనీతో ఉంది, అది ఫాదర్ విశారియోన్ కు చెందినది. వింతగా కట్టబడిన అట్యోపిన్ రెండు అంతస్తుల ఇల్లు ఈ మూల నుండి ఆ మూల వరకు ఉంది. దాని వెనుక ఓ పోస్ట్ ఆఫీసు, తాటాకుల కప్పుతో ఉన్న కోసాక్కుల పొలాలలో ఉన్న పశువుల శాలలు,వెనుక ఏటవాలుగా ఉన్న మిల్లు కప్పు పైన టిన్ను రేకులతో చెక్కిన కోడిపుంజు బొమ్మ తుప్పి పట్టి ఉంది.
ఆ గ్రామంలో వారు మిగిలిన ప్రపంచంతో సంబంధం లేకుండా తమ ఇంటికే పరిమితమై బ్రతికేవారు. ఒకవేళ సాయంత్రాలు బయటకు వెళ్ళే పని లేకపోతే,తలుపులు మూసుకుని,వాకిళ్ళలో కాపలా కుక్కలను వదిలేవారు. రాత్రుళ్ళు నిశ్శబ్దంగా ఉండే ఆ గ్రామంలో కేవలం రాత్రిళ్ళు కాపలా కాసే వాచ్ మెన్ లు గుసగుసగా మాట్లాడుకునే మాటలు,కర్రతో వారు నేలను కొట్టే చప్పుడు మాత్రమే వినవచ్చేది.
* * *