టాలీవుడ్‌లో సుహాస్‌ ఎక్కువకాలం ఉండడు, ఉండనివ్వరు

Spread the love

#గొప్పోళ్లు నేరం చేసినా అది లోకకళ్యాణం కోసమే అంటార్రా…అదే మనలాంటి తక్కువోళ్లు మంచి చేసినా, దాన్ని క్షమించరాని నేరంగానే చూస్తారు రా సంజీవ్, మనం జైలుకు పోకూడదు, మనం ఉండాలి, ఇక్కడే ఉండాలి ఉండి తీరాలి. ఇక ముందు తప్పు ఎవరూ చేయకుండా ఉండాలంటే మనం ఉండాలి. తప్పు చేయాలంటే భయం పుట్టాలి. ఆ భయం మనల్ని చూసి పుట్టాలి. కథానాయకుడు చెప్పే డైలాగ్ గుర్తు పెట్టుకోండి. చాలా మాట్లాడుకోవాలి తర్వాత. వెండితెర పై కొన్ని అపురూపాలు ఆవిష్కృతమవుతాయి, ఇక తెలుగు స్క్రీన్‌ పై అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు పుడతాయి. “అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు, జరిగాక ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదని” చెప్తాడు కదా త్రివిక్రమ్‌… సరిగ్గా ఇలానే పుట్టిన ఓ అద్భుతం పేరే “అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్”. అద్భుతం మాత్రమే కానీ అత్యద్భుతం కాదు.

#కులం చల్లే కళ్లాపి, కులం పెంచి పోషించే పితృస్వామ్యాన్ని వెండితెర మీదకు ఎక్కించి, దాన్ని వీక్షకుల కంటితెర మీద ఆవిష్కరించాలంటే చాలా తెగింపు కావాలి. ఆ వైకుంఠపాళీలో సక్సెస్ అయింది “అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్” టీమ్‌. ఈ సినిమా కథ తెలియక, తెలుగు సినిమా పెద్దలు రిలీజ్ కు ఒప్పుకున్నారా లేక తెలిసే చూసీ చూడనట్లు వదిలేసారా అనేది తెలియక కాస్త నెర్వస్‌నెస్‌ను క్రియేట్ చేస్తోందిలే కానీ…. “దళితులు” ఇంకా ఎంతకాలం కులం గురించి మాట్లాడతారు? ఇంకెన్నాళ్లు కులవివక్ష నే వస్తువుగా తీసుకుని కథలు, కవితలు రాస్తారు? అనే ప్రశ్న కొంతకాలం నుంచి బాగా వినిపిస్తోంది. ఇందులో కన్సర్న్‌ కనిపించిందంటే మీ కళ్లజోడు అర్జెంట్‌గా మార్చాలన్నమాట. ఇందులో  “సాఫ్ట్ కార్నర్‌ టోన్” వీనుల విందుగా వినిపించింది అంటే లేట్ చేయకుండా ENT స్పెషలిస్ట్ వద్దకు ఎగేసుకు పరిగెత్తాలన్నమాట. ఎందుకంటే.. ఇంకెక్కడ ఉంది బాబు కులం? అంతా కలిసిపోయాముగా, వెలివాడ పిలగాడు మా వాడకట్టు పిల్లను చేసుకోవట్లే! ఊరి అవతల ఉన్నోళ్లు ఇప్పుడు అందరితో కలిసిపోయి ఉండట్లే? ఇంకా కులం కులం అంటారేమిట్రా అయ్యా అనే ప్రశ్నలకు ఏమాత్రం తక్కువ కానీ కన్సర్న్, సాఫ్ట్‌ టోన్స్ అవి కనుక. కాస్త కాన్సట్రేషన్‌ పెట్టి వింటే కడుపుమంట ఇట్టే తెలుస్తుంది. ఊరికి అవతల ఉండాల్సిన అలగా నా_కొ_డు_కులు, ముం_డ_లు ఇప్పుడు మా పక్కకే వచ్చారు కదరా? మాతో కలిసే చస్తున్నారు కదరా? ఏం చాలదా? మా నట్టింట్లోకి వచ్చి మా మంచాల మీద కూర్చోవాలా ఏమిటి? అనే వికృతపు విసురు సురుకు పుట్టిస్తది. కులం వేళ్లూనుకుని పోయి ఉన్న విషమస్తిష్కాలకు టాలీవుడ్‌లో కొదవ లేదు. అందుకే అసలు ఈ సినిమా రిలీజ్‌కు ఎట్టా ఒప్పుకున్నార్రా, ఎట్లా రిలీజ్ చేయ్యనివ్వగలిగారు అనేది నా నెర్వస్ నెస్‌ కమ్ క్యూరియాసిటీ.

#హీరో మంగలివాడు, హీరోయిన్ కమ్మోళ్ల పిల్ల. విలన్ హీరోయిన్‌కు తోడబుట్టినోడు కనుక అతడు కమ్మోడే! ఎదురు చెప్పి, తన పురుషాధిక్యత మీద దెబ్బ కొట్టిందనే కారణంతో ఆమెను (హీరో అక్కను) వివస్త్రను చేస్తాడు. కులం తక్కువది కాబట్టి బట్టలిప్పి వదిలేసాడే కానీ ముట్టుకోడు. అంటే  రే_ప్ చేయలేదు. అంత కుల_పి_చ్చి అని చూపించాలనుకున్నాడు కానీ… డైరెక్టర్‌ ఈ ఎస్టాబ్లిష్ మెంట్‌లో ఎన్నో చేదునిజాలను స_మా_ధి చేసాడు. పై చదువులు చదువుకుంటున్నారని కొందరిని, ఉద్యోగాలు చేస్తున్నారని కొందరిని, అప్పు తీర్చలేకపోతే సరే, వడ్డీ ఇవ్వకపోతే సరే పక్కలోకి వచ్చి కోరిక తీర్చలేదని కొందరు మహిళలను రే_ప్ చేసిన ఘటనలు ఈ దేశంలో కోకోల్లలు. అ_త్యా_చారం చేసాక… మా_నంలో గాజుపెంకులు కూరి, రోకలిబండలు దూర్చి, కారప్పొడి కుక్కి, ఇనుపరాడ్లతో పే_గు_లు బయటకు లాగి.. ఊరేగించిన కి_రా_త_కాలు ఎన్నో ఎన్నెన్నో.. బహుశా ఇది డైరెక్టర్‌కు తెలియదనుకుంటాను. ” నన్ను 10 మంది ఠాకూర్లు వంతులు వేసుకుని మరీ రే_ప్ చేసారు, నాకు 10 రోజుల పాటు న_ర_కం చూపించారు న్యాయం చేయండి సార్ అని ధర్మాసనాన్ని బాధితురాలు వేడుకుంటే…. ” మైలార్డ్… ఈమె క_డ_జా_తి మహిళ, ఠాకూర్లు వీళ్ల కులం గురించి మాట్లాడేందుకు ఇష్టపడరు. వీళ్లను ఇంటిలోనికి రానివ్వరు, ఈ జాతివాళ్ల నీడ కూడా నీ_చం_గా భావిస్తారు. అలాంటి ఠాకూర్లు ఈమెను రే_ప్ చేసారంటే ఎలా నమ్మాలి అని డిఫెన్స్ అడ్వొకేట్ వాదిస్తే, దాదాపు కన్విన్స్ అయినట్లు కనిపించిన ధర్మాసనం ఉన్న ధర్మదేశం మనది. బహుశా ఈ కేస్ డైరెక్టర్‌కు కొంచెం తెలిసి ఉండొచ్చు కాబోలు! 

#ఇక తన చెల్లిని మంగలి హీరో… ప్రేమించాడనే అక్కసుతో హీరో మీద పగ పెంచుకునే కమ్మ_విలన్…చేసే అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.హీరోకు గుండు కొట్టడం నుంచి వాళ్ల అక్క బట్టలు విప్పే వరకు అనేక దు_ర్మా_ర్గాలు ఉన్నాయి. కులం గురించి పూర్తిగా కాకున్నా కొంతమేరకు అంటే… తను పరిధులు విధించుకున్నంతవరకు బాగానే తీసాడు డైరెక్టర్‌. అందుకే ఇది అద్భుతం మాత్రమే కానీ అత్యద్భుతం కాదు. అయితే మర్చిపోకుండా మాట్లాడుకోవాల్సిన పచ్చినిజం ఏమిటంటే “అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్” సినిమాలో మంగలివాళ్ల మీద కమ్మోళ్లు చూపించే వివక్షను మాత్రమే చూపించారు కానీ… మంగలివాళ్లు దళితుల మీద చూపించే కులవివక్ష గురించి చూపించలేదు. మాల మాదిగలకు కటింగ్ చేస్తే కమ్మోళ్లు, రెడ్లు, బ్రాహ్మణులు ఎక్కడ తమకు పని ఇవ్వరో అనే భయంతో…. మంగలి మహారాజులు కొందరు దళితులకు హెయిర్ కటింగ్ చేయడమే మానేసారు. మాల మాదిగలు నిలదీస్తే “మంగళవారం” మీకు కేటాయిస్తమన్నారు. ఆరోజు మంగలోళ్లు దొరుకుతరా అసలు! మళ్లీ నిలదీస్తే…. మా షాపుల్లో కాదు ఊరి బయట చెట్టు కింద చేస్తమంటూ వేరే కత్తెర, కత్తులతో తల,గడ్డం గొరికిన దు_ర్మా_ర్గా_న్ని తన కడుపులో పదిలంగా దాచుకున్న చరిత్ర మన కన్నుల ముందే ఉంది. ఆధిపత్య కులాల తర్వాత, కొన్నిసార్లు ఆధిపత్య కులాల కన్నా అంటరానితనాన్ని చూపించేది BC లే. SCలతో కలిస్తే OCలు తమను దగ్గరికి రానివ్వరు అనే భయం మాత్రమే కాదు మాల మాదిగోళ్ల కన్నా తాము ఎక్కువ అని! ఇలా చెప్పుకుంటూ పోతే ఇది ఒడువని ముచ్చట! అందుకే కదా “నువ్వు తప్పించుకోలేని పె_ను_భూ_తం “కులం” అంటాడు బాబా సాహెబ్ . కాబట్టే “కులం’ ఉన్నంత వరకు మాట్లాడాలి, మాట్లాడితీరాలి, కులం గీసిన గీతలను, కులం చేసిన గాయాలను రాయాలి, రాసి తీరాలి అంటాను నేను! ఏది ఏమైనా సరే హీరో సుహాస్, శరణ్య యాక్టింగ్ సూపర్ బాస్! ముఖ్యంగా సుహాస్ స్టోరీ సెలెక్షన్ , క్యారెక్టర్‌లోకి పరకాయ ప్రవేశం చేసే అతని డెడికేషన్ కు హ్యాట్సాఫ్‌ అంతే! కానీ #టాలీవుడ్‌లో సుహాస్‌ ఎక్కువకాలం ఉండడు, ఉండనివ్వరు. Do You Know Why? సుహాస్‌ “దళితుడు” కనుక.

Vijay Sadhu

Spread the love

2 thoughts on “టాలీవుడ్‌లో సుహాస్‌ ఎక్కువకాలం ఉండడు, ఉండనివ్వరు

  1. నిప్పుని రాజేసే రివ్యూ. ఆలోచనల్ని గిలకొట్టే రివ్యూ.

  2. Suhas —great actor
    All his movies are super
    I agree —upper caste -rich people controls tollywood
    Plus family actors (varasathva natulu )—allu arjun got best actor award
    Big joke
    4 people running tollywood
    Suhas. Needs Backing
    ===buchi reddy gangula

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *