టాటూ

గెలవమని తెల్సికూడా
ఆఖరిబంతి ని కసిదీరా కొట్టాలని 
ఎదురుచూసే బ్యాట్స్మెన్ లాగా ఉంది ఎండ
కాంక్రీట్ ని తిన్న బలంతో
కదన రంగంలో మొదట నిలబడ్డ యోధుడి లాగా ఉంది ఫ్లయ్ఓవర్
ప్లాట్ఫార్మ్ మీద నిద్రపోతున్న యాచకుడు
దుప్పటిని ముడుచుకుని కప్పుకున్నట్టుగా రోడ్డు పక్కన చాలీ చాలని నీడ
వారం తిరగ్గానే వడ్డీ వసూళ్లు కోసం వచ్చి
తీక్షణంగా చూసే అప్పులవాడిలా ఎదురుగా సిగ్నల్ ఎర్రలైటు
చూపువేటు దూరంలో 
ఎవరిదో భుజం మీద వాలిన
ఒక సీతాకోక చిలుక
భుజం కదిలినప్పుడల్లా 
అదికూడా ఎగురబోతున్నట్టు
కదులుతున్న భ్రమ
రెక్కల్లో మూడు రంగులు రెండు వైపులా
మిగతా అంతా ఆకుపచ్చటి నలుపు
అనర్గళంగా ప్రవహించే ఒక స్త్రీ మూర్తి
వీపు మీద ఒక శాశ్వత నిశ్చల చిత్రాన్ని చూశాను....
చూస్తున్నాను....
చూస్తూనే ఉన్నాను....
ఆమె ..... 
వెళ్లిపోతూ తనతో సీతాకోకచిలుకను 
తీసుకుపోయింది
ఈ సాయంత్రమంతా నా కళ్ళ ముందు 
ఎన్నో ఎన్నెన్నో ఊహాకోక చిలుకలు....
Anil Dani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *