కొత్త కథ 2024

Spread the love

19 కథల సమాహారంతో మహమ్మద్ ఖదీర్ బాబు సంపాదకత్వంలో వచ్చిన కొత్త కథ 2024 పుస్తకంలో అన్ని కథలు బాగున్నాయి అని ఒక్క మాట చెప్తే సరిపోదేమో. ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదివితే బాగుంటుంది అని ఆశపడడంలో తప్పేంలేదు. అందులో కొన్ని కథలు మ్యాజిక్ సృష్టిస్తే, కొన్ని కథలు మనోహరంగా అనిపిస్తాయి, మరికొన్ని కథలు ఆలోచనలో పడేస్తే, ఇంకొన్ని కథలు పాత జ్ఞాపకాన్ని వెలికి తెస్తాయి..

ఈ పుస్తకంలోని కొన్ని కథల గురించి…


ఈ కథ చదువుతున్నంత సేపు చాలా నెమ్మదిగా కుదురుగా ఉన్న పదాలన్నీ ఒకదానితో ఒకటి కబుర్లు చెప్పుకున్నట్టు, కథ మొత్తంలో ఎక్కడ కరుకు పదం ఒక్కటి కూడా తగలకుండా క్లాసిక్ సినిమాలా కథ పూర్తి చేయడం మాత్రం చాలా నచ్చింది. బహుశా కథ పూర్తి అయ్యాక కుందెన అంటే అని గూగుల్ సెర్చ్ చేసేవారు ఉంటారనడంలో సందేహం లేదు.

నాగతాత, బోడెవ్వ  ఇల్లు కాలిపోవడం అన్న సంఘటనతో మొదలైన కథ, ఊరి పోకడలనే కాదు పిల్లల్ని కని, సాకి ఇపుడు ఒంటరిగా, కాలిన ఇంటివాసాల మాదిరి మిగిలిన ఈ ముసలి జంట ఏమవుతుంది అనే ప్రశ్న ఊరి మధ్యన వదిలేసి ముగించిన కథ. కొన్ని కరిగిపోయిన జ్ఞాపకాలని, వడలిపోయిన పూల తీగను గుర్తుకు తెస్తూ కొన్ని జీవిత సత్యాలను మర్చిపోవడం కుదరదని చెప్పి వెళ్ళింది.

తెలియనితనం తెంపరితనం ఉన్న కాలాన్ని,నిక్కచ్చిగా చెప్పాలంటే ఎన్నో రంగుల కలలను అందించిన ఒకనాడు వదిలేసిన చందమామ పుస్తకాన్నిఅందించి వెళ్ళింది. ఈ కథలో ఏముంది అనేకంటే ఆ కథలో మనం ఉంటే బాగుంటుంది అనుకోవడం మాత్రం నిజం. అది నువ్వా .. నేనా అని కాదు. అది ఎవరి మనసు అరకు తగినట్టుగా వారికి చేరుతుందేమో. కథలో unknown ఫ్లేవర్ ఉంది. కథ పూర్తి అయ్యేసేరికి కురిసే వాన నీడన నిలబడి ఉండడం మాత్రం నిజం.

వన్ పర్సన్ కంపెనీ (రుబీనా పర్వీన్) కథ మొదలు పెట్టినప్పటి నుంచి ఏకబిగినా చదివించే శైలి, ఈ కథలో కావాల్సిన దానికంటే ఎక్కువే ఉంది. చదువుతున్నంత సేపు చివరికి ఏమైతుంది అనే ఆలోచన అంతర్లీనంగా మెదులుతూ ఉన్నప్పటికీ కూడా ఇలా జరగొచ్చు అని ఊహ మాత్రం కూడా అందకపోవడం ఈ కథకు ఉన్న ఒక స్పెషల్ ఎట్రాక్షన్. ఇదే కథ అబ్బాయి వర్షన్ నుంచి రాస్తే మామూలు కథ అనిపించేదేమో అమ్మాయి వర్షన్ నుంచి రాయడంతో యాక్సెప్ట్ చేయడానికి ఎంత మంది ఒప్పుకుంటారో అని అనిపిస్తుంది.

కొన్ని ఊర్లకి కాదేమో ఒక తరానికి బాగా తెలిసిన కథ, కథ చెప్పే విధానం చదివించే శైలి అపురూపంగా బాగుంటుంది. అందులో కథాంశం ఎంతమందికి పూర్తిగా తెలుసో తెలియదు కానీ తప్పించుకుపోయిన దేవర దున్నపోతు దారులు వెతుక్కుంటూ వెళ్లడం చెప్పే విధానం కచ్చితంగా నిజమే అనిపిస్తుంది. ఇందులో దున్నపోతు దాదాపుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలోకి దారి వెతుక్కుంటూ  వెళ్లిపోతుంది. ఈ విషయం పాఠకుడు కూడా రచయిత ఆలోచన అందుకోగలిగితే సస్పెన్స్ థ్రిల్లర్ కథ అవుతుంది లేదంటే ఫాంటసీ కథ అవుతుంది అనిపిస్తుంది.

ఈ కథలోని అంశం చెప్పడానికి వీలు కాదు.. కాదేమో చెప్పకూడదు. ఎవరికి వారు వాళ్ళ మనసును కథకు రాసిచ్చి చదువుకోవాలి. కథకు టైటిల్ గా పెట్టిన కథావస్తువుని మన ఆలోచన నుంచి మాయ చేసి కథ చివర వరకు తీసుకెళ్లడం నిజంగా ఓ అద్భుతం. కథ పూర్తి చేశాక wonderful అని అలవోకగా మెచ్చుకోలు రావడం సహజం, దానితో పాటు కథలోని కథానాయికి లక్ష్మిని రైక ఎలా మాయం అయింది అంటూ కథలో ఎలా జరిగిందో చెప్పని అంశం గురించి మొట్టికాయ వేసి అడగాలి అని కూడా అనిపిస్తుంది.

ఈ కథ గురించి ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి బహుశా మళ్లీ కథంతా నిడివితో ఒక విశ్లేషణ రాయాలేమో.. కథ మొదలు పెట్టినప్పుడు నుంచి అయిపోయే వరకు ప్రతి వాక్యాన్ని వంద కి.మీ స్పీడ్ పరిగెడుతున్న రైలులా గబగబా చదవాలని కళ్ళ కంటే ముందుగానే పదాలన్నీఆలోచనకు చేరాలని ఆతృత పెంచిన కథ. షేక్స్పియర్ రాసిన ‘మక్‌బెత్’ను ఏకప్రత్రాభినయం చేయడానికి విరంచి ఎన్నుకున్న వ్యక్తి శరత్, వీరి మధ్య సాగే రిహాల్సెస్ .. శరత్ ప్రతీ ఎమోషన్ లో ఒదిగి పోయే నేర్పు, నేర్చుకునే తీరు. ఈ కథ అంతా మనం చూసే నాటకానికి తెరవెనుక  జరికే మనకు తెలియని ఎమోషనల్ డ్రామా.  ఈ కథను రచయిత ఎలా సృష్టించాడో నా ఊహ పథానికి మాత్రం అందలేదు. Just it is miracle.

కథలో కనిపించే అమీనాబి అనే ఆవిడని చాలా సార్లు చూసినట్టు బాగా పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది చదివినంతసేపు. దానికి కారణం కథలోని మాటలు చాతుర్యం కావచ్చు. కథంతా మన ఇంటి పక్కన మన వీధిలోనో జరిగినట్టుగానే అనిపిస్తుంది. కథ అయిపోయేసరికి, ఒక చక్కటి రిలీఫ్. అవసరమైతే అమీనబి పక్కన తనకు తోడుగా మనం కూడా నుంచోవాలి  అన్న ఆలోచన రాకుండా కథ ముగించడం కష్టమే.

ఈ కథ మొదలు పెట్టినప్పుడు అక్కడ కుటుంబంలో అనుభవించేది అసలు సమస్యనో కాదో ఒక పక్కన ఒక పట్టాన అర్థం కాదు. ఎందుకంటే ఇలాంటివి తరచూ మనం బాధింపపడే చాలా సమస్యల్లో ఒకటి. ఒక గుడిలో నుంచి వచ్చే సుప్రభాతాలు, సమస్య ఎలా అవుతుంది అని అనుకునే వాళ్లు కోకొల్లలు.. నిజంగా దాని చేత బాధింపబడిన వాళ్లు ఎంతగా తల్లడిల్లిపోతారో సున్నితంగా సూటిగా చెప్పిన ఈ కథ, మనసుకి తగిలిన ఓ గాయపు జ్ఞాపకానికి ముడి పడడం అతి సహజం.

కథ మొత్తంగా రెండు కుటుంబాల మధ్య .. ముగ్గురు మనుషుల మధ్య గీత గీసినట్టుగా తీర్చిదిద్దిన కథ. గొప్పింటి మధుకర్ సరస్వతి జంట, ఆ ఇంట్లో పనిచేసే గంగ. ఈ ముగ్గురు చుట్టూ అల్లిన కథలో అనుకోని పరిస్థితుల్లో మనుషులు వ్యక్తిత్వం నిలబడడానికి ఎంతటి తెగింపు కావాలో నిక్కచ్చిగా చెప్పి, గంగా, సరస్వతి ఇద్దరినీ ఉన్నతమైన వ్యక్తులుగా తీర్పు చెప్పబడిన కథ. కథ పూర్తి అయిన తరువాత కథలో  తడబడిన నడతను సరిదిద్దుకున్న వ్యక్తిగా మధుకర్ ని పాఠకులు ఆక్సెప్ట్ చేసెట్టు ముగించడం కథకుడి ప్రత్యేక కథా నిర్మాణ ప్రక్రియ అని ఒప్పుకోవాలి.

కుటుంబం కోసం ఎక్కడో దూరదేశాన తన యవ్వనం అంతా కుటుంబం కోసం డబ్బుగా మార్చుకుని, పిల్లల బాధ్యతలు తీరి, జీవితపు మలిసంధ్యలో ఇల్లు చేరిన మైబుసాబ్ మనసు కథ. ఈ కథ సరళంగా సాగుతున్నప్పటికీ చదువుతున్నంతసేపు ఎక్కడో విషాదం ఎదురవుతుందేమో అన్న ఒక జంకు మదిలో తారట్లాడుతూ నీడలా.. వీడకుండా సాగుతుంది. కథ పూర్తి చేశాక సంద్రపు అలలు హోరు వినపడనంత నిశ్శబ్దం దళసరి గోడ మన చుట్టూ కట్టబడుతుంది.

మానవత్వం దారుల నుంచి మొదలైన కథ.. ఒకరు చేసిన తప్పు ఎన్ని కుటుంబాలని అల్లకల్లోలం చేసాయో అనే ఆలోచన పాఠకులకు వదిలేసి ఒ అరాచకపు చర్యతో ముగించే ఈ కథ మససుకి గుప్పెడు బాధా వీచికలు రాల్చి వెళుతుంది. ఈ కథ చివర చెప్పిన “బండి పెన్నేరు దాటి తంగేడు వనంలేకి  వచ్చింది… వనంలో తంగేడు పూలన్నీ వాడిపోయి ఉన్నాయి” అంటూ ముగించిన వాక్యాలు సముద్రమంత నిశ్శబ్దపు బాధను మనసులోకి వంచి వెళుతుంది.

ఈ కథ శైలి, కథ వస్తువు ఒక తరానికి సూదిలా గుచ్చినట్టు ఉంటే, మరో తరానికి పెదవులపై చిరునవ్వు పూయిస్తుంది. ఇప్పుడున్న ప్రతి ఒక్కరూ మదిలో తారట్లడే ఆలోచనలు అతి చక్కగా ఆవిష్కరించి, ఇంట్లో పని ఒక సమస్యేనా అనేవారికి, అనుకునే వారికి జెండర్ తో సంబంధం లేకుండా, సమస్యను అధిగమించడం తప్పనిసరి అని నిబంధన విధించినట్టు కథ పూర్తయ్యాక అనిపిస్తుంది. ఏదేమైనా కథ చివరాఖరుకు వచ్చేసరికి అందరిలో ఒక సమన్వయపు ఆలోచన కలిగించి వెళుతుంది అన్నది నిక్కచ్చిన నిజం. 

ఇది అందమైన ముగింపులు ఎరుగని ఎన్నో సైనికులు కథల్లో నుండి, ఒక చిన్న మలుపుతో సుఖాంతం చేయబడిన కథ. ఇక్కడ మేజర్ అర్జున్ కుటుంబం అనుభవించే వ్యధ, వ్యాకులత ఎటువంటి మాటలు గారడి లేకుండా నిశ్శబ్దమైన వాక్యాలతో, కుటుంబ సభ్యులను అదృశ్య సైనికులుగా నిలబెట్టిన తీరు.. కనుమరుగైన ఎన్నో కథలను కంటి ముందు నిలిపింది. 

కథ రెండు భాగాలుగా మనలను చేరుతుంది మొదలుపెట్టి చదువుతున్నపుడు కథలోని రెండు జంటలతో పాటుగా మనం అడవిలో వేటకు వాళ్ళతో పాటే ప్రయాణిస్తూ ఉంటాం. కథ చదువుతున్నట్టుగా ఉండదు చూస్తున్నట్టుగా ఉంటుంది. రెండవ సగం కథ చదువుతున్నపుడు ఒక జంటలోని జయమ్మ మనల్ని నిలబెట్టి ప్రశ్నిస్తున్నట్టు ఉంటుంది. ఈ కథ జీవితపు అంచుల్లో ఒదిగిన తెలియని ఓ స్పర్శ. కథ పూర్తయ్యాక, ఇది కథనే అని అనిపించదు గడిచిపోయిన ఓ నిజమని కచ్చితంగా నమ్ముతాము.

ఈ కథల పుస్తకానికి మార్కులు వేయాల్సి వస్తే 100కు 90 మార్కులు వేయొచ్చు మిగితా పది మార్కులు ఎక్కడికి వెళ్లాయి అని అడగద్దు ఎందుకంటే ఒక కథకు పది మార్కులు వేస్తే, మరో కథకు కచ్చితంగా 9 మార్కులే వేస్తాము. ఇది మనిషికున్న అలవాటు కదా.

R. Ramadevi

Spread the love

One thought on “కొత్త కథ 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *