కజిక

ఎప్పుడు ఇలా టైం మారిందో  గుర్తుచేసుకోడానికి ప్రయత్నించా.

స్మార్ట్ వాచ్ పాడైందనుకొని మాములు రిస్ట్ వాచ్ పెట్టుకున్నా.
అది కూడా చేతికి పెట్టుకున్న క్షణం నుండి పనిచేయడం మానేసింది. చిత్రంగా అనిపించింది.

స్మార్ట్ వాచ్ ని తీసి చూసా.

అది డిసెంబర్ రెండు 12.20 AM గా చూపిస్తుంది. సరిచేయడానికి ప్రయత్నించా.

మారినట్లే మారి కాసేపటికి మళ్ళీ అదే టైం చూపిస్తోంది.

ఈ విషయం ఎవరికైనా చెప్పాలనిపించింది. వాళ్ళకి నార్మల్ గానే కనిపిస్తే నన్ను పిచ్చిదాన్ని అనుకుంటారేమో!

ఎవరైనా అలా అనుకుంటారేమోనని ఎన్నిసార్లు నోర్మూసుకొని లేదా కళ్ళుమూసుకొని బతికానా అన్నది లెక్కపెట్టా. లెక్కలేనన్నిసార్లు జరిగింది.

అయినా ఎవరినో అడిగే అవసరమేంటి. డిసెంబర్ నెల దాటి 8 నెలలయ్యింది. ఇప్పుడు హఠాత్తుగా అసలీ వాచ్ ఎందుకిలా విచిత్రంగా ప్రవర్తిస్తోందో. మొబైల్ తీసి చూసా, నేను చూడగానే ఆటోమేటిక్ గా డేట్ డిసెంబర్ రెండుగా చూపిస్తుంది.

ఎందుకు, ఎందుకు, ఎందుకిలా మారుతుంది?

****

డిసెంబర్ రెండున ఏమి జరిగిందా అని ఆలోచించా. ఆ రోజు శ్యామ పుట్టినరోజు. వాడు ఎఫ్ఎం రేడియోలో  పనిచేస్తున్నాడు. వాడికి కాల్ చేశా. పుట్టినరోజో లేదా ఏదైనా షాకింగ్ న్యూస్ ఉంటే తప్ప పలకరించని నేను కాల్ చేయడంతో “ఏంటి విషయం” అంటూ ఆతృతగా అడిగాడు ఎత్తి ఎత్తగానే.

“లాస్ట్ ఇయర్ పుట్టినరోజు విష్ చేశానా నీకు?”

“నేనా రోజు నీ కాల్ కోసం ఎదురుచూశా. ఎంతకూ రాకపోవడంతో చివరికి  ఆ రాత్రి  నేనే కాల్ చేసా. “ఓ ప్రత్యేకమైన స్నేహితుడ్ని కలిసాను. చేయాలనిపించలేదు. అయినా పుట్టిన రోజులదేముంది ఎప్పుడూ వచ్చేవేగా” అన్నావు (గొంతులో దాగని నిష్టూరం). ఎక్కువ మాట్లాడలేదు. పొడిపొడిగా చాలా విచిత్రంగా మాట్లాడావు. ఆ రోజు అది నీ గొంతులా అనిపించలేదు. చాలా కరకుగా ఉంది. మాట్లాడుతుండగానే  పెట్టేసావు. తర్వాత నిన్ను కలిసినప్పుడు కనీసం ఆ ప్రస్తావన కూడా రాలేదు. ఆ సంభాషణ గురించి మాట్లాడలేదు. ఆ విషయాన్ని  నేను కూడా ఎత్తలేదు.”

నా లోపల ఎక్కడో సముద్ర హోరు మొదలైన చప్పుడు. 

సుడిగాలి చుట్టుకొని అమాంతం నన్ను ఎత్తుకెళ్లి మాయం చేసినట్లు అనిపించింది.
“ఆ స్నేహితుడు ఎవరో చెప్పానా?”

“నిన్ను అడిగే ధైర్యం కూడా చేయలేకపోయా. అంత కరుకుగా ఉంది నీ గొంతు.”

ఇంక శ్యామతో మాట్లాడటం అనవసరం అనిపించింది. మళ్లీ ఫోన్ చూశా. ఫోన్‌ క్యాలెండరులో కూడా అదే రోజు చూపిస్తుంది. అది గురువారం. ఆ రోజు ఏం చేశానా అని ఆలోచించా. ఏదీ గుర్తుకు రావడం లేదు. ఆఫీస్ లో కనుక్కున్నా. లాస్ట్ ఇయర్ డిసెంబర్ రెండున సిక్ లీవ్ తీసుకున్నా అని చెప్పారు. లాభం లేదని ముందురోజు చేసిన పనులని గుర్తుచేసుకోడానికి ప్రయత్నించా.

డిసెంబర్ ఒకటి, ఇండియా నుంచి వచ్చిన ఎస్‌కె తన ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్ లో పార్టీకి ఇన్వైట్ చేసాడు.

డిన్నర్‌ టైంలో ఓ సర్వర్ చాలా చిత్రంగా కనిపించాడు. కొత్తగా వచ్చిన మెక్సికన్‌లా ఉన్నాడు. అతని కళ్ళలో ఏదో స్థిరత్వం. ఆ చూపులు ఒక్కసారి చూస్తే మరిచి పోయేట్లు లేవు. అంతకు మించి నన్నేదో గుర్తించినట్లు ప్రత్యేకంగా నావైపు చూస్తున్న చూపు. అతడి నవ్వే దవడలు. లోపల భారంగా మోస్తున్న ఏదో బరువుని గట్టిగా పట్టి ఊపుతున్నట్లున్నాయ్. నాకు అసహనంగా అనిపించింది. ఎంత అహంకారం ఇతడికి. నా లోపలికి తరచి  చూస్తున్నాడు. టేబుల్ పైన స్పూన్ కింద పడేసాడు అన్న వంకతో గొడవ పెట్టుకున్నా. సాస్ వేడిగా లేదని “హే మెక్సికన్” అని పెద్దగా కోపంగా అరిచా. అతను అలాగే రెండుక్షణాలపాటు నిల్చుండిపోయాడు. నా ముఖంలోకి నిరసనగా నిస్సహాయంగా చూసి వెళ్ళిపోయాడు.

నాకది ఒక గొడవగా, లోపల ఇబ్బందిగా అనిపించింది. అదుపుతప్పి రెండు మాటలు ఎక్కువే మాట్లాడినట్లున్నా.

లోపల ఏదో అలజడి.

అతడ్ని  ఎక్కడో  చూసినట్లు ఉంది.

ఓ వారం క్రితం నా కారుకి తగిలి క్రిందపడ్డ గ్రే వూల్ఫ్ గుర్తుకు వచ్చింది. రెండు క్షణాలు తరువాత లేచి వెళ్ళిపోయిందది. పోతూ పోతూ వెనక్కి తిరిగి చూసి మంచుకొండల్లోకి కుంటుకుంటూ వెళ్ళిపోయింది. ఈ మెక్సికన్‌ చూపు ఆ గ్రే వూల్ఫ్ చూపులా ఉంది. ఆ గ్రే వూల్ఫ్ ఆ రోజు ఎంతగా గాయపడిందో!?

**

పార్టీ పూర్తయ్యేసరికి రాత్రి పదకొండు దాటింది. ఆ సమయంలో ఫ్రోజెన్ బ్యూటీలా ఉంటుంది మోంటానా. ఈ కొండల్లో గ్రే వూల్ఫ్ లు తిరుగుతూ ఉండటం సహజం. గడ్డకట్టే ఆ చలిలో మోంటానా రోడ్లపై వచ్చే ఎత్తుపల్లాలలో జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ ఎక్కడైతే ఆ గ్రే వూల్ఫ్ ని ఢీ కొట్టానో అక్కడ కారు ఆపాను.

రెండు నిమిషాలు కిందకి దిగాలనిపించింది. మంచు, కొండలమీద రాసులు పోసినట్లుగా ఉంది. చెట్ల మీద తెల్లటి వెలుగు. ఆకాశంలో చంద్రుడు కనిపించలేదు. కానీ సన్నటి ఆకుపచ్చని కాంతి ఏదో అక్కడంతా వ్యాపిస్తున్నట్లుగా అనిపించింది. విండో కిందకి దించాలనిపించినా ఉండే సహజమైన చిన్నపాటి భయం నన్ను కిందకి దిగకుండా ఆపింది.

అప్పుడు చూసాను. ఎదురుగా ఉన్న చెట్ల మధ్య నుంచి ఆ మెక్సికన్ సర్వర్, ఆ గ్రే వూల్ఫ్ కలిసి నడుస్తూ వస్తున్నారు.

అది భ్రమా? నిజమా? అని ఆలోచించుకొనేలోపు బండి ముందుకు పోనిచ్చానో! అక్కడే ఉండిపోయానో!

**

ఆ డిసెంబర్ రెండు నేను శ్యామాతో మాట్లాడటం నిజం. కానీ ఆ రాత్రి చెట్ల మధ్య వాళ్లు కనిపించాక ఆ రోజంతా ఏం జరిగిందో ఏమైందో ఎంత ఆలోచించినా గుర్తుకురావడం లేదు. ఈ ఎనిమిది నెలల కాలం నేను మర్చిపోయిన, మాయమైపోయిన ఆ రోజు ఇలా నా ముందు ఈ రోజు ప్రత్యక్షమవ్వడం ఏమిటో!

ఆ మెక్సికన్ని కలిస్తే ఏమన్నా తెలుస్తుందేమో!
కలిసి ఏమి అడగాలి? ఏమి మాట్లాడాలి? ఏదీ సరిగ్గా తేల్చుకోలేకపోయా.

ఆఫీస్ వాళ్ళకి లీవ్ మెస్సేజ్ పెట్టి రెస్టారెంట్ కి బయలుదేరా.

అక్కడి వాళ్లు మెక్సికన్ సర్వర్ లు ఎవరూ లేరని తేల్చి చెప్పారు. నేటివ్ అమెరికన్ ట్రైబ్ నుండి అప్పుడప్పుడు కొందరు టెంపరరీగా శీతాకాలంలో పనిచేసి వెళ్తుంటారని చెప్పారు. అతను మెక్సికన్ కాదని, నేటివ్ అమెరికన్ అని అర్థమైంది. అక్కడి చాలా మందికి నేటివ్ అమెరికన్స్ మీద ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. ఇంకొందరికి చులకన భావం ఉంటుంది. నా వరకు నాకు వాళ్ళు ఒక ప్రత్యేకమైన మనుషులు. ఇంకా నాగరికత అలవర్చుకోవడానికి ఇష్టపడని మనుషులు. అక్కడ పనిచేసిన వారిలో బెస్ట్‌ ఎంప్లాయిస్‌ ఫోటోలు ప్రతి నెలా రెస్టారెంట్‌ బోర్డులో పెడుతుంటారు వాటిలో అతను ఉన్నాడేమో చూడమని చెప్పారు. అందులో అతని ఫోటో కనపడింది.

“అతను కజిక. ప్రతి చలి కాలంలో మూడు నెలలు పనిచేసి వెళుతుంటాడు. అతనిది కొండల్లో ఉన్న చిన్న గ్రామం, చెరోకీ  ట్రైబ్ కి చెందినవాడు” అని చెప్పారు.

ఆ రోజు నేను చూసింది నిజమేనా!?

ఎందుకో హఠాత్తుగా నిస్సత్తువగా అనిపించింది. అక్కడే కూర్చుండి పోయా. అలా ఎంత సేపు ఉన్నానో తెలియదు.

**

నా చిన్న వన్ బెడ్ ఫ్లాట్ లో పని కంప్లీట్‌ చేసుకొని బ్లాక్ కాఫీ తీసుకొని బాల్కనీలో కూర్చున్నా. వెన్నెల వెండిలా మెరుస్తోంది. మోంటానా కొండల గాలి మెత్తగా తాకుతోంది. కింద పిల్లలు పరిగెడుతూ ఆడుతున్నారు.

ఈ సమస్య నా అంతటా నేను తెచ్చుకుంది కాదు. దానంతట అదే వచ్చింది? కాబట్టి దానికదే తేల్చుకుంటుందని అకస్మాత్తుగా అనిపించింది. మనసులో ఏదో తెలియని ప్రశాంతత.

ఆకాశంలో నిండు చందమామను చూస్తూ ఉండి పోయాను.

ఏదో కాల్ వచ్చి ఆగిపోయింది. నాకు అక్కడి నుంచి లేవాలనిగాని, ఫోన్ ఎత్తాలనిగాని అనిపించలేదు.

కళ్లు మూతలు పడుతున్నాయి.

**

కజిక, గ్రే వూల్ఫ్, నేను కలిసి మంచుకొండల్లోకి నడుస్తూ వెళ్తున్నాం. ఆ దారి చంద్రుడ్ని తాకుతున్నట్లుగా ఉంది. కజిక తన ఊలు కోటు తీసి నాకిచ్చాడు. ముగ్గురం మంచుకొండల్లో ఆడుకొన్నాం. అలిసిపోయాం. కజిక, గ్రే వూల్ఫ్ మా ఇంటి దాకా వచ్చి నన్ను వదిలిపెట్టారు. నవ్వుతూ నా నుంచి వీడ్కోలు తీసుకొని చంద్రుని వైపు వెళ్తున్నారు. వారికి వెన్నల దారి చూపుతుంది. నా లోపల బాధా భారం పెరిగిపోయాయి. ఒక్కసారిగా అక్కడే కూలబడి వెక్కి వెక్కి ఏడ్చాను. ఎంతసేపు ఏడ్చానో తెలీదు. ఎవరో పాట పాడుతున్నారు. అన్నీ చిత్రమైన శబ్దాలే. అర్థం కాకపోయినా ఏదో ఆర్ద్రత లోపల నుంచి కోస్తునట్టు, మళ్లీ ఆ పాటే దానిని తేలిక చేస్తున్నట్టు రెండూ ఆ శబ్దాల్లో మిళితమై ఉన్నాయి.

హఠాత్తుగా వణికించే చల్లని గాలి నన్ను చుట్టుకుంది. చంద్రుడు మబ్బుల మధ్యలోకి తప్పుకున్నాడు. చీకటి  శబ్దాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. సన్నని గొంతు ఏదో చెప్తోంది. “ఏమీ జరగలేదు. నువ్వు వినడమే మిగిలి ఉంది” అని.

ఆ రాత్రి ముందుకు జరిగిపోతోంది. చంద్రుడు వచ్చి వెళుతున్నాడు. సన్నటి ఆకుపచ్చని వెలుతురు కొండల్లో..!  

Srisudha Modugu

పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన శ్రీసుధ మోదుగు 'రెక్కల పిల్ల, 'డిస్టోపియ' వంటి కథా సంకలనాలతోపాటు 'అమోహం', 'విహారి', 'గొంగళి పురుగుల సామ్రాజ్యం' మొదలైన కవితా సంకలనాలు తెచ్చారు.. వీరి 'అమోహం' కవితా సంకలనానికి ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డ్, (2017), 'అంతర్హిత' నవలకి శ్రీ జొన్నలగడ్డ రాంభొట్ల సరోజినమ్మ స్మారక పురస్కారం వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *