“చీకటిపువ్వు” కథా సంకలనం చదివిన తరువాత చాలా కాలం ఒక సుదీర్ఘమైన ఆలోచనలో ఉండిపోయాను. అందుకే ఆ సంకలనం ఇచ్చిన అనుభవాన్ని అక్షరబద్దం చేయడానికి కూడా రెండు నెలలు పట్టింది. ఆ కథలకు, రాసిన రచయిత్రికి న్యాయం చేయగల శక్తి నాకు నిజంగా ఉందా అని నా మీద నాకు అనుమానం కలిగిన మొదటి సందర్భం ఇది.
ఈ పుస్తకం చదివిన తరువాత ఈ కథలు రాసిన కత్తి పద్మ గారిపై ఎంతో గౌరవం కలిగింది. స్త్రీల కథలు అంటే అర్ధం లేని లైంగిక స్వేచ్చ, విచ్చలవిడితనం, అనుభవం కోసం వన్ వైట్ స్టాండ్ లు అనే దిశగా ఒక వర్గపు ఆదునిక స్త్రీ భావజాలం పరుగెత్తడం కనిపిస్తుంది. వారి గొంతుకే ఇప్పుడు అన్ని వాదాలను డామినేట్ చేసే స్థాయిలో కూడా ఉంది. కాని పురుషాధిక్య సమాజంలో వివాహం నుండి ప్రేమ కోసమో అనుభవం కోసమనో బైటకు వచ్చిన స్త్రీకి మాత్రం దొరుకుతుంది ఏంటీ? మరో రకమైన దోపిడి తప్ప. స్త్రీ పట్ల ఆలోచనా ధోరణిలోనే సమాజంలో మార్పు రానంతవరకు ఏదో ఒక రీతిలో స్త్రీ వస్తువుగాl మాత్రమే మిగిలి పోతుంది. ఆమె మరో కొత్త కోణంలో దోపిడికి గురి అవుతూనే ఉంటుంది. ఈ నిజాలను అర్ధం చేసుకుని ఈ వ్యవ్యస్థలోని స్త్రీల జీవితాలను లోతైన ఆలోచనతో, భాద్యతతో, స్త్రీ జీవన సంఘర్షణపై గౌరవంతో ఈ పుస్తకంలో చర్చించారు రచయిత్రి. స్త్రీ చేసే తిరుగుబాటు, ఓ అడ్వెంచర్ కాదు ఓ ఆలోచనకు అంకురార్పణ అని, అది ఓ యుగానికి మార్గాన్ని చూపే దారి అన్న సామాజిక స్పృహతో, సమస్య మూలాలలోకి వెళ్ళి పందొమ్మిది స్త్రీ జీవితాలకు గౌరవాన్ని తెస్తూ ఈ కథా సంకటిని మనకు అందించారు. అందుకే ఇదో గొప్ప కథా సంకలనం అని అంగీకరించాలి. ముఖ్యంగా స్త్రీ సమాజానికి, స్త్రీల పక్షాణ నిలబడే వారందరికీ ఇదో గొప్ప ఆలోచనాత్మక పుస్తకం.
రచయిత్రికన్నా ఆమె చర్చించిన పాత్రలతో ప్రేమలో పడిపోయిన సందర్భం ఈ పుస్తకంతో చాలా రోజుల తరువాత నా జీవితంలో జరిగింది . నా చిన్నతనంలో యద్దనపూడి గారి ‘రాజశేఖరం’తో ప్రేమలో పడ్డాను. అదో అద్భుతమైన మత్తు. ఆ రోజుల్లో రాజశేఖరం ఆలోచనలు ఓ మైమరుపుతో కూడిన పారవశ్యాన్ని కలిగించాయి. ఇప్పటికి తలచుకున్నా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది ఆ ఫీలింగ్. కాని అనుభవం, అనుభూతి అంతగా మైమరపు కలగజేయదని జీవితం నేర్పింది. ఇది అర్ధం అయే సరికి సగం జీవితం గడిచిపోయింది. ఆ మత్తు ఎంత బావుండిందో అంతే ఇబ్బంది పెట్టింది కూడా. కాని పుస్తకం కలిగించిన మత్తు, పుస్తకంలో పాత్రలతో చేసిన కాల్పనిక ప్రయాణం జ్ఞాపకాలు ఇంకా మదిలో నిలిచే ఉన్నాయి. కొంత కాలం తరువాత మల్లాది వెంకట కృష్ణమూర్తి గారి “స్రవంతి” తో ప్రేమలో పడ్డాను. అదింకో రకమైన అనుభవం.
తరువాత వచ్చారు రావిశాస్త్రీ గారు నా జీవితంలోకి. అప్పుడు తెలిసింది కదిలించే పాత్రలు ఎలా ఉంటాయో. అవి ఇచ్చే అనుభవంలోని వేడి ఈ జన్మకు ఆరదు. రావిశాస్త్రీ గారి పాత్రలంటే నాకు చాలా ఇష్టం. వారి పాత్రలపై నాకు ఎంతో ప్రేమ గౌరవం కూడా. ఇప్పుడు ఈ “చీకటి పువ్వులోని” పాత్రల పై మళ్ళీ అంతటి తీవ్ర స్థాయిలో ప్రేమ కలిగింది. ఇందులో ప్రస్తావించిన స్త్రీ పాత్రలు భయపెడతాయి, ఇంతకు ముందు అనుభూతి చెందిన అన్ని రకాల మత్తులను ఇవి పూర్తిగా ఒదిలిస్తాయి. ఇది స్త్రీల చుట్టూ ఉండే నిజమైన ప్రపంచం. ఈ నిజాలను చూడండి, ఆలోచించండి అని ఎలుగెత్తి చాటుతాయి. ఎన్నో అనుభూతుల నుండి, కోరికలనుండి, ఎక్స్పెక్టేషన్ల నుండి మనం విముక్తి పొందడానికి కావలసిన జ్ఞానాన్ని అందించే అద్భుతమైన ఆ స్త్రీ పాత్రలను ప్రేమించే స్థితికి చేరడమే బహుశా జీవితంలో ఎదగడం కావచ్చు. అందుకే ఈ పుస్తకం చాలా మందికి చేరాలి. స్త్రీ స్వేచ్చ, స్త్రీ ఆత్మగౌరవ పోరాటానికి స్త్రీ ఆలోచనలలో రావలసిన మార్పుకోసం నేటి తరం వెతుక్కునే ప్రత్యాయమాన పద్దతులపై అవగాహన కోసం ఈ కథలు చాలా మంది చదవాలి. ఆర్ధికంగా కొంత ఉన్నతంగా ఉన్న వారు తమ ఆలోచనలలో ఈ సాధారణ మధ్య, దిగువ తరగతి స్త్రీల జీవితాలను చూడాలి. ఈ కథలలో ప్రస్తావించిన స్త్రీలను నేను మర్చిపోలేను, నా ఆలోచనలపై ఆ పాత్రలు చూపిన ప్రభావం విస్మరించలేను.
నా కంటూ కొంత భూమి కావాలి, తండ్రి కాదు, అన్న కాదు, భర్త కాదు కొడుకులు అంత కన్నా కాదు అని పోరాడే రవనమ్మ నాకు పిచ్చ పిచ్చగా నచ్చింది. ఆమెలో నాకు కనిపించింది నాలోని తెగింపు, నాలోని పొగరే. అందుకే రవనమ్మ నాకు అమ్మగా మారి నా ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగింది. ఎన్నో లెక్కలతొ కుటుంబం జరిపే పవిత్రమైన పెళ్ళిళ్లు చిదిమేసే స్నేహ హ్రుదయాలను ‘నైవేద్యం’ కథలో చూసి ఏడుపొచ్చింది. కోల్పోయిన కొన్ని అనుభూతులు కన్నీళ్ళ రూపంలో బైటికి వచ్చాయి. ఓ కథతో ఇలా నన్ను ఏడిపించిన పాపం, రావిశాస్త్రీ గారి తరువాత మళ్ళి కత్తి పద్మ గారిదే.
బూరె బుగ్గల పిల్ల సంసారం గురించి చదివిన తరువాత ఇక పవిత్రమని చెప్పే పెళ్ళి మంత్రాలలో నాకు ఏవో డప్పు శబ్దాలు కలిసి వినిపిస్తూనే ఉంటాయన్నది నిజం. ‘చికటి పువ్వు’ కథలోని “కాంత” మనుషులలో మంచితనం ఎక్కోడో ఓ చోట ఉండవచ్చనే ఆశను తాను చస్తూ నాలో కలిగించింది. ముఖ్యంగా నీతి అనే పదానికి గొప్ప అర్ధాన్నిచ్చింది. “ఎర్ర రాయి ముక్కుపుడక” కథలో రామూ అనే రామలక్ష్మి అచ్చంగా నా మానస సోదరే. “నా ఒంటిని ఇతగాడి కోసం వాడీసాను. ఆడు వాడలేదు. నేనే వాడీసాను. ఆ వాడకానికి డబ్బు కట్టాల్సిందే” అని నిలదీసి అడిగిన ఆమెను మించిన హీరోయిన్ మరొకరెవరు? మనం వాడేసిన శరీరాలకు అంత ధీటుగా అవతల నుండి వెల నిలదీసి తీసుకోవడం అందరికీ సాధ్యమయిన పనేనా. అసలు అందులో అంత ఆత్మగౌరవాన్ని చూడగలిగిన రామలక్ష్మి నిజంగా స్త్రీ రత్నమే.
“మట్టగిడస” కథలో సత్తేవమ్మలో నా బొమ్మే కనిపిస్తూ పోయింది. ఇది మొండి ముండరా అని ఆమెని తిట్టినవాళ్ళు నన్నుఅలాంటి ఓ సందర్భంలో అదే మాట అన్నవాళ్ళు ఒక్కరే మరి. ఈ పితృస్వామ్య వ్యవ్యస్థలో మనకు సమీప బంధువులు. ఇష్టం లేని పెళ్ళి వదిలించుకుని ఆ భర్తకు మళ్ళి పెళ్ళి చేసి కొడుకుతో ఒంటరి జీవితం మొదలెట్టిన ఆ సత్తేవమ్మ, భర్త చనిపోయినా చుక్క కన్నీరు కార్చని సత్తేవమ్మ, ఏ జన్మలోనో నేనే అనుకుంటాను.
“మా ఇసాపట్నం కొండ” లోని నూకాలమ్మతో ఒక్క రోజన్నా కలిసి గడపాలని గాఢంగా అనిపించింది. భర్తతోనూ కొడుకులతోనూ అనుభవించని దగ్గరితనాన్ని, గేదెలతోటి , కుక్కలతోటీ, కోళ్ళతోటి చిరవకు పాముతోటి కూడా అనుభవించగలిగి వాటి రక్షణ కోసం దేవుడిని కోరుకునే నూకాలమ్మ మనసు ఎవరికి అర్ధం అవుతుంది?
‘మంత్రసాని’ కథలో పందికి మంత్రసానితనం చేసి దాని పిల్లలకు రక్షణ ఇచ్చిన ఆ ఆవు గురించి విన్నప్పుడు తోటి స్త్రీ తల్లితనంలో అర్ధంలేని నీతులని వెతికే మానవ నైజం గుర్తుకువచ్చి, “మనిషేం అంత గొప్ప కాదు మిగతా జీవులన్నింటికన్నా ఎక్కువేమీ కాదు” అని ఒప్పుకోకుండా ఉండగలనా? “జైల్లో జాబిలమ్మ” కథలో రాంబాయి పడిన హింస తలచుకుంటే దుఖం తన్నుకు వస్తుంది. అంత హింసలోకూడా ఓ చల్లని ఓదార్పు ఆమెలో బ్రతుకు పట్ల అశను కలగజేయడం ఆ ఆశతో జైలునే తన ప్రపంచంగా ఆమె మార్చుకున్న విధానాన్ని గమనిస్తే, స్త్రీ ఎంత తొందరగా ఇతరులకు లొంగిపోతుందో కదా అనిపిస్తుంది. భ్రర్త క్రూరత్వాన్ని అతన్ని హత్య చేసి ఆమె తప్పించుకోగలిగింది. కాని సమాజ క్రూరత్వం ప్రియునిలో అనుమానంగా పెరుగుతూ ఉంటే దాన్ని గమనిస్తూ ఉండడం, తనపై అధికారులు జరిపే అత్యాచారాల్ని భరించడం, వీటన్నిటి మాటున నీకు నేను ఉన్నాను అన్న ఓ చిన్న భరోసా ఆమెలో నింపిన ధైర్యం ఇవన్నీ చదువుతుంటే “ఓ స్త్రీ ఇంకా సాటి మనిషి పై ప్రేమ చూపగల శక్తి నీలో ఉందా” అని అడగాలనిపిస్తుంది.
“ఒక మనిషికి డబ్బు ఇచ్చి ఇలాంటి నరకం పడటాన్ని పెళ్ళంటారా?” అన్న ఆలోచన ఆ ఆదిలక్ష్మి కి అంత తొందరగా వచ్చినందుకు సంతోషం అనిపించింది. పొట్టిదని కాపురం చేయని భర్తని మరచిపోయి జీవించిన ఆదిలక్ష్మి ప్రేమగా పెంచుకున్న కూతురుని పొడుగని సంబంధం వద్దన్న వారిని కడిగిన విధానం ఆనందం కలిగించింది. ఆ కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుని కూడా ఒంటరిగా మిగిలిపోవడాన్ని ఆమె నిర్లిప్తంగా చూస్తుండిపోయింది. మనవరాలు ప్రియ రంగు విషయంలో ఖంగు తిన్నప్పుడు “పెల్లినేప్పోతే మనాడోల్లం బతకనేవా” అని అడగగలిగిన ఆదిలక్ష్మి ఎంతో ఉన్నతంగా అనిపించింది, చదువుకున్న మాడ్రన్ ఒమెన్ కన్నా… “ఇలాగేడిసి సచ్చీ బదులు ఆ పెళ్లిని సంపలేరే మీ సదుకున్న ఆడోల్లందరూ గూడి” అన్న బాంబు కూడా పేల్చింది…
కూతుర్లను పెళ్ళి చేసి పంపడం గొర్లను పెంచి అమ్మేయడం లాంటిదనే వేదాంతాన్ని వినిపించిన ఆ తాత సుజాతకు ఏం నేర్పించాడొ కాని నాకు బోల్డంత సహాయం చేశాడు. కొన్ని ఏళ్ళుగ నా మనసు ఒప్పుకోలేని విషయాలను స్పష్టపరిచాడు. దొరకనంతవరకూ ఆడదాన్ని పూజించే మగాడు దరి చేరిన ఆడదాన్ని చులకనగా తీసిపడేయడాన్ని చూసినప్పుడు ధనమ్మ అనుభవించిన ఓటమి గురించి స్త్రీ కోణంలో ఇంత లోతుగా చర్చించిన కథ ‘సమరమే’ అని ఒప్పుకోవలసి వచ్చింది. ఒంటరి స్త్రీగా తలఎత్తుకుని బ్రతక గలిగే స్థితిలో, ఓ మగడి పంచన తోడు కోరుకుని, ఆశపడి చేరితే ఆమె జీవితం దిగజారిన వైనం, చివరకు జీవన యుద్దం కోసం సిద్దపడిన ఆమె ధైర్యం మనకు ముచ్చటగొల్పుతాయి. “కడుపున పుట్టిన ఆడ ఎదవలకి గుండెలు రాకుండానే గుండెల మీద పుస్తులు ఏలాడదీయించేసి, కొడుకులకి మాత్రం బూవులు రిసిస్ట్రీషన్లు సేవించే గలరా? అని బంధువర్గాన్ని నిలదీసే ఎర్రి ఎర్రయమ్మ గురించి చదివి గట్టిగా సంతోషంతో ఈల వేయాలనిపించింది. ఆ బలవంతపు పెళ్ళితో తాను కన్న సంతానాన్ని కూడా వదులుకుని ఓ గొర్రెపిల్ల పై మమకారంతో ఒంటరిగా తృప్తిగా జీవిస్తున్న ఆమెకు ఆ ఆనందాన్ని కూడా దూరం చేసి గుండె పగిలి చచ్చే స్థ్తితి తెచ్చిన మనుష్యుల మీద రోత కలిగింది.
భర్త అప్పు తీర్చడానికి దుబాయ్ వెల్లి కష్టపడుతుంటే అప్పు తీర్చమని ఎవరో అడిగారని కోపంతో భర్త ఆత్మహత్య చేసుకున్నాడని విని పాపమ్మ దూర దృష్టితో ఆలోచించి, అనవసరమైన సెంటిమెంట్లకు లొంగక, ముందు అప్పులు తీర్చి, తన జీవితాన్ని చక్కదిద్దుకున్న విధానానికి ఆమె చూపిన అవసరమైన కాఠిన్యానికి ఆమెకు నమస్కరించాలనిపించింది. మారిటల్ రేప్ ని అర్ధం చేసుకోలేని సమాజం, భర్తకి దూరంగా కొడుకు సంరక్షణలో జీవించడాన్ని కూడా తప్పు పట్టే చట్టాన్ని ఎదుర్కోవడానికి మలివయసులో సిద్దపడే పావని కథ మరో విప్లవం.
చెదిరిన పెళ్ళితో ఒంటరి అయిన జీవితానికి ఓ ఆధారం చూపని పుట్టిల్లుని ఎదిరించి స్వతంత్రంగా బ్రతకాలని ముందుకు అడుగేస్తుంది పార్వతి. కాని ప్రేమ, పెళ్లి మత్తులో పడి జీవితాన్ని చేజార్చుకుంటుంది. చివర్లో “తన అయిదోతనానికి గుర్తింపుగా తనకు సుట్టాలు పెట్టిన రవికెల గుడ్డలన్నీ లాగీసుకుని ఎలిపోతున్నాడా” అని ప్రియుడుగా స్వీకరించిన మగాడిని తలచుకుని ఆమె ఏడ్వడం కడుపు దేవేసిన ఫీలింగ్.
జీవితం అంటే తెలియని వయసులో ఇష్టం లేని పెళ్ళితో పట్నం చేరిన మల్లేశ్వరిని తన ఉచ్చులో బిగించి ఆమె కాపురాన్ని, జీవితాని నాశనం చేస్తాడు వాసు. అతనిపై తిరగబడబోయే ముందు మల్లేశ్వరి గడిపిన జీవితం గురించి చదివితే ఒళ్ళు గగ్గుర్పొడుస్తుంది.
ప్రేమ కోసం అర్రులు చాచే స్థితిలో జీవిస్తూ, ఎవరినో నమ్మి ఆ ప్రేమ కోసం కన్న బిడ్డల్ని సైతం కాదనుకుని చివరకు ఆ మగవాడి మోసానికి గురయి పిచ్చాసుపత్రి పాలవుతుంది అనసూయ. కాని ఇక్కడ అనసూయ కొడుకు చూపించిన విజ్ఞత, సమస్యను చూసిన కోణం ఆశ్చర్యపరుస్తుంది. కుటుంబం అనే బంధంలోనూ, ప్రేమ అనే బంధంలోనూ ఓడిపోయి కేవలం ఆడదానిగా మిగిలిపోయిన భవాని ఎప్పటికీ సమాజంలో మారని స్త్రీ బానిసత్వ జీవితానికి ప్రతీక.
ఈ స్త్రీలందరూ అపారమైన ధైర్యసాహసాలు కలిగినవారు. ఒంటరిగా తమ జీవితాలను నిర్మించుకోగల శక్తి ఉన్నవారు. కాని కుటుంబం, పెళ్ళి, మాతృత్వం లాంటి చిక్కు ముళ్ళ మధ్య చిక్కుకుని నలిగిపోతూ నిత్యం దోపిడికి గురవుతున్నవారు. వీరి పట్ల ఎవరికీ సానుభూతి ఉండదు. ఎందుకంటే వారిలోని తెగింపు, మొండితనం, సమాజాన్ని ఎదిరించే నైజం మాత్రమే అందరికీ కనిపిస్తాయి. అలాంటి సందర్భాలలో రచయిత్రి వారి పక్షాన నిలబడి వారి కథలలో ప్రపంచం చూడడానికి ఇష్టపడని కోణాలను, విస్మరించే అంశాల వైపుకి పాఠకుల దృష్టి మళ్లిస్తారు. దీనికి వారి కథన శైలి ఎంతో దోహదం చేస్తుంది. అందుకే ఆ పాత్రలలోని తెగింపు, ప్రశ్నించే నైజం మనలను సూటిగా తాకుతాయి. ఈ కథల ప్రభావం నుండి తేరుకోవడం చాలా కష్టం. ఈ పుస్తకం చదవక ముందు, చదివిన తరువాత మనం ఒకేలా ఉండం, ఉండలేం. ఒక్కసారి “చీకటి పువ్వు” చదివి మీలో వచ్చి చేరే ఆలోచనల ఝరికి అహ్వానం పలకండి.
![](https://udayini.com/wp-content/uploads/2024/03/66-150x150.jpg)