అర్జంటు రవాణా

Spread the love

కాన్‌స్టాంటినోపుల్ లో “మెజి డాల్టన్ ” లంగరు నేసి, కుడి వైపున నిచ్చెన దిగవేసిన వెంటనే ఒక చిన్న పడవ దాని వద్దకువచ్చింది. నెత్తిమీది ఫెజ్‌ టోపీకి గల జిడ్డు  తోక తన గద్దముక్కుమీదికి వ్రేలాడే టర్కిష్‌ పోస్టుమాన్‌ వణకే నిచ్చెన యెక్కి వచ్చి టెలిగ్రాం  అందించినాడు.

         కాప్టెన్  జిబ్బిన్స్‌ తానే డెక్కుమీద దాన్ని అందుకొని రసీదులో పెన్సిల్‌తో సంతకం గీకి పోస్టుమాన్‌కు ఒక పియ్యాస్ట్ర్ యిచ్చి, టెలిగ్రాంతో  తన కాబిన్‌లోకి వెళ్ళినాడు. 

            అక్కడ అతను తీరికగా ““నేవిగట్‌” పొగాకు పైపులో కాస్త నింపుకుని,పైపు  అంటించి,పలుసార్లు పీల్చి, టెలిగ్రాం మూత చించినాడు.  

          టెలిగ్రామ్  న్యూఆర్లియన్స్ లోని కంపెనీ అధిపతి నుంచి వచ్చింది. “మెజి డాల్టన్”ను న్యూఆర్లియన్స్‌నుండి  ఒదేస్సకూ, తిరిగి న్యూఆర్లియన్స్‌కూ పయాణంమీద పంపిన లెన్‌స్బి అండ్‌ సన్‌ కంపెనీ త్వరగా సరుకు నింపుకొని ఓడ వేగంగా తిరిగి రావాలని పట్టు బట్టుతున్నదనీ, దేనికోసం “మెజి డాల్టన్‌” దూరపు రష్యాకు పోయిందో ఆ పొద్దు తిరుగుడు  పూల చెక్కకు త్వరలో మంచి డిమాండు వచ్చేటట్లు వుందనీ కంపెనీ అధిపతి టెలిగ్రామ్ లో  తెలియజేసినాడు. 

            కాప్టెన్  భుజాలు కుదించి దట్టంగా పాగ వదలి నోట్‌ ఒక మూలనుంఛి మరొక మూలకు “పైపు కదలించి, “Goddam!” అనే మాటను పండ్ల సందుననుండి నెమ్మదిగా ఉమ్మేసినాడు.

            అతనికి జ్ఞాపకం వచ్చింది – పిసినారి అధిపతి బొగ్గుకు టన్నుకు రెండు సెంట్లకు  లోగి, స్టీమర్‌ బొగ్గు బంకర్లను     బొగ్గుకు బదులు దుమ్ముతో నింపినాడు; అందువలన యెదురు గాలికి అట్లాంటిక్  మహాసముద్రం  దాటేటప్పటికే అవసరమైనంత ఆవిరి పీడనం నిలవడం కష్టంగా వుంది. 

            యిలా వుండగా స్టీమరు ఉచిత వేగంతో నడవడం అసంభవం, కానీ ఉత్తరువు వచ్చింది; మరి ఉత్తరువులు నిర్వర్తించడం కాప్టెన్ కు  మామూలు. కనుక అతను గంట వాయించి స్టీవర్డును పిలిచి, ప్రధాన మెకానిక్‌ ఓహీడ్డీ ని రమ్మన్నాడు.

            ఒక నిముషంలో  పొట్టి క్రాపు యెర్ర తలకాయ నాకిట్లో దూరి,ప్రసన్నమైన నీలి కన్నులతో యిరుకు కాబిన్‌నూ, కాప్టెన్ నూ పరికించి పుట్‌బాల్‌ ఆటగాళ్ళ స్వెటరూ, యీత డ్రాయరూ ధరించిన గూని దేహాన్ని లోపలికి యీడ్చింది.

    “యేమిటి,నన్ను రమ్మన్నారట?” అని బద్దకపు కంఠంతో అడిగింది తలకాయ.  “యీ పాపిష్టి యెండలకు ప్రాణం  పోతున్నది. స్నానాల తొట్టిలో కూర్చొని లేవడం లేదు. తిరిగిపోయిన తర్వాత, ఉత్తరాది మార్గానికి బదిలీ చేయమని మన అధిపతిని అడుగుతాను.” ఓహిడ్డీ పొట్ట మీదికి డ్రాయర్‌ యెగలాగి మళ్ళీ అన్నాడు : “క్లాన్ డైక్ లో పుట్టి సగం జీవితం ఫర్‌ సంచిలో బతికినవాళ్ళకు యిలాంటి యెండలలో నిమ్మళంగా వుండడం యెంత కష్టమో తెలుసా?” 

            “మీకొక శుభవార్త చెప్తాను,” అన్నాడు కాప్టెన్, “ఆదివారం దాకా యిక్కడ వుండి,సిబ్బంది తమ డబ్బును సాని కొంపల్లో తగలేయడానికి అవకాశం యిచ్చి, ఒదేస్సకు పోకముందు ఒడకు అవతలి వైపున రంగువేయిద్దామని ముందు అనుకున్నాం. కానీ, యిదిగో, అధిపతి నుండి టెలిగ్రాం వచ్చింది…త్వరగా రమ్మని. అంటే,మనం రాత్రికి బయలుదేరుతున్నాం. ఒదేస్స అలాస్కా కాకపోయినా,యిక్కడికన్నా చల్లగా వుంటుందిలే.”

  “యెందుకింత తొందర?”ఓహిడ్డీ అడిగినాడు, తానూ కెప్టెన్ పొగాకుతో తన పైపు నింపుకుంటూ.

  “లెన్‌స్బి కంసెనీవాళ్ళకు యెరువు త్వరగా కావాలట. మార్కెట్‌లో మంచి డిమాండు వుంది.”

మెకానిక్‌ సాలోచనగా తవ నగ్నమైన మోకాలిమీద చరచినాడు.

“మరి  ఫ్రెడ్, మన బాయిలర్లు  శుభ్రం చేసుకోడానికి ఒదేస్సలో  మనం కాస్త ఆగాలి” అన్నాడు అతను.

కాప్టెన్  ముఖంలో నిర్లక్ష్యం  పోయి, అశ్చర్య రేఖ తోచింది. అతను నోట్లో నుండి పైపు తీసినాడు.

“యిదేమిటి ?గత ప్రయాణంలో మనం అంతా శుభ్రం చేసినాము.త్వరగా పోవలసినప్పుడు,యీ గలీజు పని మళ్ళీ మొదలుపెట్టడమెందుకు?”

ఓహిడ్డీ ఆష్ ట్రేలో వుమ్మేసి వికటంగా యికిలించినాడు.

“మీ నోటి నుండి చంటిబిడ్డ లాంటి అమాయకమైన ప్రశ్నలు వస్తున్నాయి.బొగ్గు చూసినారా?”

 “చూసినాను”,అన్నాడు కెప్టెన్ నిర్లిప్తంగా.

  “అయితే మీరడిగేది యేమిటి? యిలాంటి మిశ్రమం నీటి గుర్రపు పేగుల్లో దొరుకుతుంది. మసి పేరుకుని సగం గొట్టాలు పని చేయడం లేదు. బాగా శుభ్రం చేయకపోతే మనం తిరిగిపోలేము. ముఖ్యంగా బరువు వేసుకుని,అసలు పోలేము.”

  “యిదేమీ బాగాలేదు. మనకు బోనస్ పోతుందన్నమాట. యీ గలీజు పని సాధ్యమైనంత త్వరగా ముగించండి. ఒక నిముషం మనం నష్టపడలేము.”

  “ప్రయత్నిస్తాను. ఒదేస్సలో బీకోవ్ అనే అతను వున్నాడు తెలుసా?అతనికి తగినంత డబ్బు యిస్తే,అసాధ్యమైనది ఏదైనా చేస్తాడు.”

  కాప్టెన్ కు తృప్తి కలిగింది. అతని ముఖ కండరాలు కుదుటపడి,నిర్లక్ష్యపు భంగిమ ధరించినాయి.

  “సరే.మిమ్మల్నే నమ్ముకుంటాను. ఆరుగంటలకల్లా అందరూ ఓడ మీదనే వుండాలని చెప్పండి. ఆలస్యం చేసిన వాళ్ళ కోసం ఆగం. మనం తిరిగి వచ్చిందాకా అడుక్కుతింటారు. మనం పొద్దు గూకకముందే బయలుదేరాలి,ఫిరంగి ప్రేల్చకముందే -లేకపోతే ఉదయం దాకా యిక్కడ ఆగవలసి వుంటుంది.”

  “సరే,అలాగే”అన్నాడు మెకానిక్.

                                        2

            పొద్దు గూకే వేళ, అలల కొనలు ముదురు కుంకుమ కాంతులు ప్రతిఫలించే వేళ,”మెజి డాల్టన్” యిరుకు బాస్ఫరస్ ద్వారం దాటి,గిరుక్కున మలుపు తిరిగి,ఉత్తరపు దారి పట్టింది.

            కాప్టెన్  జిబ్బిన్స్‌ బంగారు చారల నీలి టోపీని నుదుటిమీదికి దిగలాగి, చేతులు జేబుల్లో  పెట్టుకొని వంతెనమీద నిలబడినాడు.

            అలల కొనలు ముదురు కుంకుమ. కాంతులు ప్రతిఫలించే వేళ, ప్రపంచ సముద్ర

మార్గాలలో  వేల ఓడలు పయనిస్తుంటాయి. సకల సముద్రాల  చిలుము ముద్దుల రాపిడితో అరిగిన మట్లు గల పాత సరుకుల ఓడలూ, తేలిక ఓడలూ  విస్తారమైన అట్లాంటిక్  ఓడలూ, ఆరంతస్తుల మహాకాయులూ కదలగా, వాటి దర్పానికి లొంగి, వాటి ముందర వున్న నీరు గీపెట్టుతూ సవినయంగా దారియిస్తుంది. రాత్రిపూట, మిలమిలలాడే నక్షత్ర  రంగవల్లులకింద, ఆ ఓడలు తమ విద్యున్నయనాల రంగుల దీప్తులతో ప్రపంచాంధకారంలోకి చూపులు సారిస్తూ సముద్ర మార్గాలలో  పయనిస్తాయి.

            బాంకుల, ఆఫీసుల, ఓడల కంపెనీల యిచ్చ,పెట్టుబడి క్రూరమైన,  నిష్కరుణమైన, సడలుబాటు లేని యిచ్చ, వాటిని నీలి కడలి లోతులో నడిపిస్తుంది, తరుముతుంది.

            దిగ్మండలపు నీలి  అస్పష్టతలో  దేవతా కథలలోని దేశాల యెండమావులు లేస్తున్నాయి. అ దేవతా కథలలోని దేశాలలో బాంకులకూ, ఆఫీసులకూ అంత అవసరమైన సరుకులు కుప్పలు కుప్పలుగా వున్నాయి. తిట్లకింద, కొరడాల ఝుంకారాలకింద పసుపు, నలుపు రంగుల బానిసలు ఉత్పత్తిచేసిన బట్టలనూ, సుగంధ ద్రవ్యాలనూ, దూదినీ, ముడి ఖనిజాలనూ,పండ్లనూ,రబ్బరునూ అవే తిట్ల కింద,కొరదాల ఝుంకారాల కింద అలాంటి బానిసలే ఓడల యినప కడుపుల్లో నింపుతున్నారు. ఊగే క్రేనులు  ఓడల బోలు యినప కడుపుల్లో నింపుతాయి,ఆ ఓడలు యెర్రగీత దాకా సముద్రపు నున్నని లోతుల్లోకి మునిగేటట్లు చేస్తూ.

            పొగమంచులో, అలల్లో, నక్షత్రాల   వలగుండా, తుఫానుల గర్జనలగుండా ఓడలు ఆ బరువును దూరపు రేవులోకి జాగ్రత్తగా  మోసుకపోతాయి. కోలాహలపు వీధులన్నిటిలోనూ,పచ్చని  తెరలతో సగం మూయబడిన పెద్ద కిటికీల వెనుక దురాశ రాజ్యం చేసే గదులలో వేల కొలది గణక యంత్రాల నిగూఢ, నిర్లిప్త  కార్యకలాపాలు ఆగకుండా సాగుతాయి.

            పైననుండి గొలుసులలో వ్రేలాడే  దీపాలు యెత్తెన ఆఫీసు బల్లలమీదా, బట్టల మీదా, లెక్కల పుస్తకాలమీదికీ, దస్త్రాలమీదికీ వంగిన నిస్తేజపు, కళ్ళద్దాల ముఖాల మీదా మృత్యుదీప్తిని సమంగావెదజల్లుతాయి.  యీ మనుషులు ఆఫీసు పుస్తకాల కాగితంలాగే కరకుగా వుంటారు, వాళ్ళు పెదవులు కదలించినప్పుడుు అవి పుస్తకంలో కాగితాలు తిప్పినట్టు కరకరలాడుతాయి. కాగితంమీద అంకెల రేఖలు పెరుగుతుంటాయి. అవి ఓడలు మోసుకపోయే సరుకుల నొసటి రాతను నిర్ణయిస్తాయి – దిగ్మండలపు నీలి నీడవెనుక విలసిల్లే దేవతా కథా దేశాల కవ్వించే వినోదకర పరిమళాలతో, మెత్తని పొత్తిళ్ళలో భద్రపరచబడిన సరుకుల నొసటి రాతను.

            ఆఫీసులలోని మనుషులు యీ పరిమళాలను ఆఘ్రూణించరు. వాళ్ళెరిగిన వాసన ఒక్కటే – భూమండలంకోని సకల భాషలలోనూ నిరామయమైన అంకెలూ, చిన్న మాటలూ రాయబడిన  కరకరలాడే రంగు కాగితపు వాసన.

            ఓడల కడుపులలో పెట్టిన సరుకులను బాంకివాళ్ళు లెక్కలపుస్తకాలలో రాసుకొని ఈ సరుకులను. రంగు కాగితాలగానూ,గుండ్రని  లోహపు బిల్లలుగానూ మారుస్తారు.యీ ఆశ్చర్యకరమైన రూపాంతరీకరణను నిర్వహించడానికి వాళ్ళు తొందరపడతారు. స్టాక్‌ ఎక్స్‌చేంజి చలువరాతి మందిరాలలో నిర్లిప్తమైన బ్రోకర్‌ చెయ్యి సుద్దముక్కతో  బ్లాక్  బోర్డు మీద రాసే అంకెలు భద్రమైన సౌభాగ్య స్థా`యిలో నిలిచివుండడం వాళ్ళ లక్ష్యం.

            దురాశా పీడితమ్లైన ఉత్తరువుకు లోబడి, ఓడ యంత్రాలు  తమ ఉక్కు కండరాలతో శ్రమిస్తూ, తళతళలాడే తమ మోకాళ్ళనూ, మోచేతులనూ వంచుతాయి, గొట్టాలు శుభ్రమైన సముద్రాకాశంలోకి తమ  విషపు పొగను రెట్టింపుగా ఉమ్మేస్తాయి ప్రొపెల్టర్లు  వేగంగా తిరుగుతాయి, కాప్టెన్ లు  ఓడ వేగం గురించి డ్యూటీలోవున్న ఆఫీసరును మళ్ళీ మళ్ళీ అడుగుతారు.

            కాప్టెన్ లు  అనుభవంగలవాళ్ళు, యెప్పుడూ ప్రశాంతంగా వుంటారు, జిబ్బిన్స్‌ లాగే.  అతనిలాగే వాళ్ళు తమ బంగారు చారల నీలి టోపీలను నుదుటిమీదికి దిగలాగి, చేతులు జేబులో పెట్టుకొని,వంతెన  మీద నిలబడతారు. కనులు చిట్లించి వాళ్ళు తెల్లని నురగల  మధ్య వున్న దారిని చూస్తారు. యితరులెవ్వరికీ కనిపించనిదానిని.

   చదునైన పచ్చని న్యూఆర్లియన్స్‌ తీరంనుండి ఒదేస్స తీరపు ప్రకాశవంతమైన,మెత్తని, పసుపురంగు శిలలదాకా వున్న దారి కూడా కాప్టెన్ జిబ్బిన్స్‌కు కనపడుతుంది.సరుకులను రంగు కాగితాలుగానూ, లోహపు బిల్లలుగానూ నూర్చే పద్దతి కూడా అతనికి స్పష్టంగా తెలుసు. ఆ కాగితాలలోనూ, బిల్లలలోనూకొంత భాగం కాప్టెన్  కూ, సిబ్బందికీ    చెల్లింపబడుతుంది. తన కాగితాలలో అధిక భాగాన్ని కాప్టెన్  గడ్డురోజులలో తన కుటుంబపోషణ కొరకు యెత్తి పెట్టుకుంటాడు. యెత్తి పెట్టుకోడానికి యేమీ లేని సిబ్బంది, యింటి మీద బెంగ కలిగినప్పుడు పానశాలల్లోనూ,సానికొంపల్లోనూ డబ్బు తగలేస్తారు. రంగు కాగితాలు ముందుగా యేర్పాటైన  యీ ప్రదక్షిణం పూర్తిచేసి బాంకులకు తిరిగివచ్చి, మళ్ళీ దస్త్రాలలో నమోదై,మళ్ళీ సరుకులుగా రూపొంతరం చెందుతాయి.

            ఓడలు యీ సరుకులను మళ్ళీ తమ కడుపులలో వేసుకొని, మళ్ళీ సముద్ర మార్గం  పట్టుతాయి. ఆ మార్గం నిండా ప్రమాదాలూ,యెదురుచూడని ఘటనలూ వుంటాయి. వాటి మూలంగా కాప్టెన్ కూ,సిబ్బందికీ చావు రావచ్చు, ఉద్యోగం పోవచ్చు. మొదటి దానికంట రెండవది భయంకరమైనది.

    అందువల్ల కాప్టెన్  జిబ్బిన్స్‌ తన పొట్టి వాటర్‌ ప్రూఫ్  కోటును బిగదీసుకుంటూ,రాత్రిపూట మూడుసార్లు డెక్కు మీదకు వచ్చి, నురుగులు గక్కే నీటిపైన డెక్కుమీద విచారంగా మ్రోగే రాగి పెట్టె యేమి చూపుతున్నదని డ్యూటీలో వున్న ఆఫీసర్‌ను అడిగినాడు.

                                                            3

            కొయ్య ఓవర్‌ బ్రిడ్జి  కింద పాము మెలికల్లా  పోయే రైలు కమ్మీల కావల ఒక రోడ్డు వుంది, ఆ రోడ్డు వెంబడి పొగచూరిన మొరసరాళ్ళ యిరుకు యిండ్లు వున్నాయి, రేయింబగలూ వాటిని ఆవరించివుంటాయి యెడతెగకుండా బారులు తీరి సోయే ధూమ్ర వర్ణపు గూడ్సు రైళ్ళ పొగా,గర్జా ధ్వనీపచ్చని మసక నీటిని ఒరుసుకుంటూ  వున్న గట్టుమీది మొరపరాతి చప్టా మీదికి ఆ రైళ్ళు సరుకులు దించుతూ, అక్కడినుండి సరుకులు యొత్తుకుంటూ వుంటాయి.

            ఆ యిరుకు యిండ్లలో ఒకదాని వాకిలిమీద బంగారు రంగు అక్షరాల బోర్డు  యిలా వుంది: “ఓడల బాయిలర్లను శుభ్రపరచే ఆఫీసు. యజమాని పి. కె. బీకొవ్‌.”

            ఆఫీసులో,రాతబల్ల వెనుక వుంటాడు స్వయంగా బీకోవ్. ఆ వ్యాపార సంస్థను అతనొక్కడే నడుపుతాడు.విశాలమైన,నిశ్చలమైన కుర్చీలో అతను సింహాసనం మీద రాజాధిరాజాలా ఉదయంనుండి రాత్రి దాకా కూర్చొని వుంటాడు. అతను కాక ఆఫీసులో మరెవరూ వుండరు,రెండు చిత్రపటాలను వదలేస్తే:చక్రవర్తి రెండవ నీకొలస్ దీ,క్రోన్ ష్టాడ్ట్ కు చెందిన సెంట్ ఇవాన్ దీ.

   చక్రవర్తి చిత్రపటానికి రెండు చోట్ల తుపాకిగూండ్లు తగిలినాయి. అది రెండేండ్ల  క్రితం జరిగింది,తిరుగుబాటు చేసిన యుద్ధనౌక “పాత్యోమ్కిన్” * ఓదెస్స రేవుకు వచ్చినప్పుడు. నౌక రేవులో రెండు రోజులుండి,అధికార్లను భయకంపితులను చేసి,నగరంలో కనివిని యెరుగని విప్లవ తుఫాను చెలరేపి,దక్షిణంగా వెళ్ళింది.భయం నుండి తేరుకుని అధికారులు నూర్గవరోధాల యోధుల,పౌరుల రక్తంలో నగరాన్ని ముంచేసినారు. ఆగ్రహంతో నల్ల నూర్ణ ముఠాలు **కిరాతకమైన హత్యాకాండ ప్రారంభించినాయి. అప్పుడు ఓదెస్స చెడతాగిన ఆకతాయిలు బీకోవ్ ఆఫీసుకు వచ్చి, ఊరేగింపులో తీసుకపోవడానికి రాజు పటం కావాలని అడిగినారు.అది తమకు బాగా ఉపయోగపడుతుందని వాళ్ళ ఉద్దేశం-దానిని అడ్డం పెట్టుకుని,శిక్షాభయం లేకుండా దోపిడీలు చేయవచ్చు.

  కానీ జరిగింది వేరు. హత్యాకాండ యెంత స్థాయికి వెళ్ళిపోయిందంటే, బీద పేటలనుండి ధనవంతుల పేటలకు విస్తరించి, యూదులు కానివాళ్ల యిండ్లను ముంచేసే ప్రమాదం వుండింది. మళ్ళీ భయకంపితులైన అధికారులు హత్యాకాండను నిర్దాక్షిణ్యంగా అణచివేయడానికి అప్పటికే ఉత్తరువు తీసినారు. ఆ గుంపు బీకోవ్ ఆఫీసు మోటు తిరుగుతుండగానే మూడుసార్లు కాల్పులు జరిగినాయి. హాత్యాకాండవాదులు పారిపోవడమూ,వాళ్ళలో ఒకడు రాజు పటాన్ని దుమ్ములో పడవేయడమూ బీకోవ్ కు కిటికీ గుండా కనిపించింది .

  ఆశ్విక భటులు దౌడుతీస్తూ  దాటిపోయిన తర్వాత,అంతా ప్రశాంతంగా వున్నప్పుడు,బీకోవ్ పందికొక్కులా ప్రాకుతూ బయటకు వచ్చి,చిత్రపటాన్ని ఆఫీసులోకి తీసుకుపోయినాడు.దాని అద్దం పగిలిపోయింది, రెండు తుపాకి గుండ్లతో చక్రవర్తి విరూపం చెందినాడు-ఒకటి అతని చెవిలో ఒక ముక్కను తెంచేసింది,మరొకటి సరిగ్గా అతని ముక్కు

      ———————————–

* “పాత్యోమ్కిన్”  నల్ల సముద్రపు రష్యన్ నౌకాదళానికి చెందిన యుద్ధనౌక. 1905 జూన్ 14-24 న ఆ నౌకలోని నావికులు విప్లవ తిరుగుబాటు చేసినారు.

   **నల్లనూర్ణ ముఠాలు- విప్లవోద్యమంలో పోరాడడానికి జారిస్టు పోలీసులు నిర్మించిన రాజరికవాద ముఠాలు. వాళ్ళు విప్లవకారులను హత్య చేసేవాళ్ళు,ప్రగతిశీల మేధావుల మీద దాడి చేసేవాళ్ళు, యూదులమీద హత్యాకాండలు జరిపేవాళ్ళు.

      ————————————-

    రంధ్రంలో తూటు పొడిచింది. క్రమశిక్షణ చేత నిర్బంధించబడిన యిద్దరు అజ్ఞాత సైనికులు తమ చక్రవర్తి చిత్రపటం మీద కసి తీర్చుకున్నారు.

   బీకోవ్  విషాదంగా నిట్టూర్చి,కొత్త పటం కొనాలని అనుకున్నాడు.కానీ అతను డబ్బుకు చింతించి,పటాన్ని బాగా పరిశీలించి,దానితోనే సరిపుచ్చుకోవచ్చని నిర్ణయానికి వచ్చినాడు. ముక్కులోని తూటును అతను లెక్కపెట్టలేదు,యెలాగైనా అది ప్రకృతి సిద్ధమైనది గనుక;కానీ చెవికి అతను కాగితం ముక్క అతికించి,తగిన రంగు పెన్సిలుతో దాని మీద రుద్దినాడు.

            అలా చక్రవర్తి  గోడమీద వ్రేలాడుతూ, ఆఫీసులోని దుమ్ము నిండిన గాలిని ఒంటి ముక్కుతోనే పీలుస్తూ వుండినాడు. యెప్పుడూ పెరట్లో  ఆడుకొంటూ, బీకోవ్ వద్ద పనిచేసే కురవాళ్లు చిత్రపటాన్ని  చూసి,దానికి అమర్యాదకరమైన పేరు పెట్టినారు:ఒంటి ముక్కు నీకొలస్.

            బీకొవ్‌ వ్యాపారం పెద్దది, రేవులో అందరికీ తెలిసినది. చిత్రచిత్రమైన వివిధ ప్రాంతాలనుండి వందల కొలది ఓడలు యేడాది పొడవునా ఒదేస్స రేవుకు నస్తాయి. కొన్ని ఓడలమీద ఆ ఓడల పేరూ, అవి యే రేవునుండి వస్తున్నదీ యెలాంటి భాషలో రాయబడి వుంటాయంటే,యెప్పుడూ కైపులో  వుండే భాషాతత్వశాస్త్ర  విద్యార్థి హ్లుప్  – చరికాలంలో కూడా కాళ్ళకు బూట్లకు  బదులు తాతార్‌ ఫెల్ట్  టోపీలు కట్టుకునేవాడు  – కూడా వాటిని చదవలేడు.

            ఆవిరి ఓడలు సముద్రమార్గాలు గడవడానికి చాలా కాలం పడుతుంది; వాటి బాయిలర్‌ గొట్టాలు  -అగ్నిని నిశ్వసించే పేగులు – గలీజు పట్టి ఉప్పూ, మసీ యెక్కుతాయి. ఓడలు ముందుకు. సాగాలంటే, దాని పోత యినుము కడుపుకు చికిత్స చేయాలి. దాని పేగులు శుభ్రం చేయాలి,ఉప్పూ,మసీ తుడిచెయ్యాలి. యి చిల్లర పనికి ఓడను డాకులో పెట్టడం ఉచితం కాదు. కనుక దానిని నీటిమీదనే శుభ్రం  చేస్తారు. అక్కడే జబ్బుపడిన ఓడలకు వాటి కడుపు డాక్టర్ బీకోవ్ చికిత్స చేస్తాడు.

  యీ పనికిగాను అతనికి ఒక గుంపు గుంపే కురవాళ్ళు వుండినారు.

            యిరుకు బాయిలర్‌ గొట్టాలు గలీజుపట్టిన తర్వాత మరింత యిరుకౌతాయి; పెద్దవాళ్ళు వాటిలోపలికి దూరలేరు, పదే౦డ్ల కుర్రవాడైతే సరిగ్గా దానికి సరిపోతాడు. కుర్రవాడు  మసి నిండిన గొట్టంలోకి జలగలా దూరి, ఉక్కిరిబిక్కిరి చేసే దుర్గంధపు  యిరుకు గొట్టంలో యీ కొననుండి ఆ కొనకు ప్రాకుతూ ఉక్కు రేకుతో ఉప్పును గోకేస్తాడు,అవసరమైతే   ఉలి ఉపయోగిస్తాడు.

  యీ కుర్రవాళ్లు బీద శివార్లనుండి వస్తారు. వాళ్ళకు బీకొవ్‌ రోజుకు పదిహేను కోపెక్కులు యిస్తాడు – భోజనం వాళ్ళదే.

   ——————————

 * ఒక రూబుల్లో నోరు కోపెక్కులు.

  జబ్బుపడిన ఓడల మెకానిక్కులు బీకొవ్ ఆఫీసుకు వస్తారు, అతను ఆర్డరు తీసుకుని, రిజిస్టరులో రాసుకుంటాడు,చేతగాని అస్తవ్యస్తపు చేతిరాతలో. రాయడం అతనికి కష్టమైన పని;కష్టపడి ,చాలా పట్టుదలతో నేర్చుకున్నాడు అతను. రాసేటప్పుడు సిరాను అతని గడ్డం అటూ యిటూ నెరపుతుంది. ఆర్డరు తీసుకుని,అతని పెరటి కిటికీ తెరచి శక్తి కొలది కేక వేస్తాడు.

  “సేన్కా,మీష్కా,సాష్కా,ఆలోష్కా ,పనికిమాలిన కుర్రకుంకల్లారా పనికి రండి! త్వరగా రండి,ఊ..వేగం!”

                  4

   ఓహిడ్డీ తెల్ల సూటూ,పాలిష్ చేసిన రంగు బూట్లు ధరించి,చేతికర్ర పట్టుకుని,కనివిని యెరుగనంత  ఐస్ క్రీమ్ ఆరగించిన తర్వాత, పార్కులో నుండి విశాలమైన మెట్లు దిగి,దుమ్ము నిండిన వీధిలో బయలుదేరినాడు.అతనివెంట లైజర్ త్స్వీ బెల్ వుండినాడు.

   ఓదెస్సకు వచ్చే ఓడల కెప్టెన్ లకూ, మెకానిక్కులకూ అందరికీ తెలుసు లైజర్. అతను రకరకాల పనులు చేసిపెట్టేవాడు-బ్రహ్మాండమైన ఓడలు క్యూ తప్పించి డాకులోకి వచ్చే యేర్పాట్లు చేయడం మొదలుకుని, గట్టి నేల మీద ఆనందం పొందదలుచుకున్న నావికులకు తేలిక మనస్సు కలిగి,యిష్టపడే ఆడపిల్లను సంపాయించి పెట్టడం వరకూ.

    పై పనులకు గాను రేవు బ్రోకర్ కు అవసరమైనంత మేరకు,లైజర్ కు అన్ని భాషలూ తెలుసు. అతను దయా దాక్షిణ్యం లేకుండా అపశబ్దాలు పలికేవాడు,కానీ యెదుటివాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పేవాడు. కొత్త నగరంలోని వీధుల్లో దారితప్పిన నావికులకు అతను రక్షరేకుగా వుండేవాడు. ఒకసారి,ఉద్రేకం కలిగినప్పుడు అతను అన్ని భాషలూ కలిపి మాట్లాడేవాడు. అప్పుడు యెదుటి వాళ్ళకు ఒక్క ముక్క కూడా అర్థమయ్యేది కాదు.

  బీకొవ్ ఆఫీసుకి లైజర్ ఓహిడ్డీను తెచ్చేవాడు. మెకానిక్కు ఆ ఆఫీసుకు ఒంటరిగా రాగలడు-ఓదెస్స పెవ్ మెంటు దాటడం అతని జీవితంలో మొదటిసారి కాదు గనుక. కానీ లైజర్ లేకుండా బీకొవ్ తో యెలాంటి సంభాషణైనా జరపడం అసాధ్యం. బీకొవ్ కి యింగ్లీషులో తిట్లు మాత్రమే వచ్చు. యిక మెకానిక్కుకు తిండి యెంత ముఖ్యమో అంత ముఖ్యమైన మూడు  రష్యన్ మాటలు తెలుసు: “నమస్తే”, “బాగున్నావా”, “నీవు అందగత్తెవు,నీవంటే నాకు ఇష్టం.”మరి వ్యాపార సంభాషణకు ఈ మాటలు చాలావనేది స్పష్టం.

     ఆగంతకుని కెదురుగా బీకొవ్ దిట్టంగా లేచి నిలబడి, తన బలిసిన,నల్లని వెంట్రుకలు నిండిన, పొట్టి వ్రేళ్ళ చేయి చాచినాడు.ఓహిడ్డీ చురుకుగా ఆ చేయి నొక్కినాడు. లైజర్ తొందరగా, జాగ్రత్తగా, అతని వ్రేళ్ళు కాసేపు పట్టుకున్నాడు.

     “యెలా వున్నారు?”అని అడిగినాడు లైజర్, మృదువుగా చిరునవ్వు నవ్వుతూ. కానీ ఆ చిరునవ్వు వెనుక జీవితంలో కష్టాలు పడిన పిరికివాడి ఆందోళన ఉంది.

    “యెలాగో బతుకుతున్నాం. మరి నీవెలా వున్నావ్,కోడీ?”

   “కోడేమిటి?కోడినైతే రోజూ ఒక గింజ యింటికి పట్టుకెళ్లి,పిల్లలకు పెట్టేవాణ్ణి. నేను కోడిని కాదు కదా, మరి యేమిటో చెప్పడానికి కూడా సిగ్గౌతున్నది…యీ రోజు నేనేమైనా సంపాయించవచ్చు. మీకు నేను వ్యాపారం తెచ్చినాను గనుక….చాలా గొప్పవాడు…..యీ బీదవానికి మీరేదైనా యిస్తారు,అతనూ ఇస్తాడు.

     “యిది యేం పని?”బీకొవ్ అడిగాడు,ఆర్డరు పుస్తకం తెరుస్తూ.

      “యేమిటి మీరడిగేది? యిది రాజాలాంటి పని. యీయనకు  రెండు రోజుల్లో బాయిలర్ శుభ్రం చేయాలి. యీయన తన అమెరికాకు త్వరగా తిరిగి వెళ్ళాలి. యెందుకంటే యీయనకు అర్జంటు రవాణా వుంది,నాకు జన్మలో వుండనిలాంటిది.”

    “రెండు రోజులా? రెండు రోజులకు రెండు రోజుల్లాగే డబ్బు చెల్లించాలి”,అన్నాడు బీకొవ్ గంభీరంగా.

      “నేను కాదన్నానేమిటి? యీయన చెల్లించాలి! నాకంటే కాస్త ధనవంతుడులే. చెల్లించడానికి ఒప్పుకుంటాడు.”

   “ఒప్పుకుంటే ఒప్పుకుంటాడు. యెంతవుతుందో చెప్పు అతనికి….”అంటూ బీకొవ్ అతనికి ఒక మొత్తం చెప్పినాడు.

    లైజర్ యెగిరిపడి, పాలిపోయినాడు.

   “ఓయ్,ఓయ్ “గొణిగినాడు అతను, “దారుణమైన మొత్తం యిది. నాకు ఉచ్చరించడానికే సాధ్యం కాదు.”

    “అతనికి యిష్టం లేకపోతే అక్కరలేదు”,అన్నాడు బీకొవ్ అదే కంఠంతో.

   “పని కసాలాగా ఉంది,నాకు యితర్లు దొరుకుతారు.”

  లైజర్ చేతులు వెలకిల వేసి,మెకానిక్కుకు యింగ్లీషులో ఆ మొత్తం చెప్పినాడు. లైజర్ కు అచ్చెరువు కలిగిస్తూ, ఓహిడ్డీ ఏ మాత్రం చలించకుండా టూకీగా జవాబిచ్చినాడు, “Very Well!”అంటూ  అతను మాత్రం యింకా యిలా అన్నాడు, “రెండు రోజుల్లో పని పూర్తి కాకపోతే, ఆలస్యమైన ప్రతిరోజుకూ మొత్తంలో యిరవై అయిదు శాతం పట్టుకుంటాము.”

“పట్టుకోనీ”,అన్నాడు బీకొవ్,పుస్తకంలో ఆర్డరు రాసుకుంటూ. “వాళ్లేమీ పట్టుకోలేరు,నేను చెప్పిన సమయానికే పని పూర్తి అవుతుందిగా.”

  మెకానిక్ టేబుల్ మీద అడ్వాన్సు పెట్టి, రసీదు తీసుకుని,లైజర్ కు కమిషన్ గా అయిదు డాలర్లు పడవేసినాడు. మరొకసారి అతను బీకొవ్ తో కరచాలనం చేసి,ఆఫీసులోనుండి బయటకు పోయినాడు,వివరాలు యేర్పాటు చేయడానికి లైజర్ ను అక్కడే వదిలి.

    పేవ్ మెంటు మీద చప్పుడు విని అతడు ఆగినాడు. అయిదుగురు అపరిశుభ్రమైన,చింపిరి బట్టల కుర్రవాళ్లు కోటుగుండీని రోడ్డు మీద పడవేసి ,దాని వెనుక ఒంటి కాలితో యెగురుతూ, తొక్కుడు బిల్లా ఆడుతూవుండినారు.

     ఓహిడ్డీకి యీ ఆట తెలియదు. అతను దానిని ఆసక్తితో చూస్తూ వుండినాడు. కుర్రవాళ్లలో ఉంగరాల జుట్టు గల చిన్న కుర్రవాడు తక్కినవాళ్ళ కంటే చాకచక్యంగా యెగురుతూ,విజయంతో ప్రతిసారీ నవ్వుతూ వుండినాడు. చివరి యెగురుతో గుండీని చదరంలో నుండి బయటకు నెట్టి, తల యెత్తి అతను మెకానిక్కును చూశాడు. అతని పెదవులు విడివడినాయి,పాల తెలుపు పళ్ళు కనబడేటట్లు అతని నోరు చిరునవ్వుతో తెరుచుకుంది. అతను ఓహిడ్డీ వద్దకు పరిగెత్తుకుంటూ పోయి,కోతి చెయ్యి లాంటి చిన్న మురికి చేతిని చాచి, యింగ్లీషులో బిగ్గరగా అన్నాడు:  

  “కాప్టెన్,కాప్టెన్! గివ్ మి షిలింగ్ ఇఫ్ యూ ప్లీస్, గుడ్ బై! హౌ డూయూడూ! * నీ దుంప తెగ!|”

    ఓహిడ్డీ చిరునవ్వు నవ్వినాడు. ఆ కుర్రవాడు చెప్పిన చివరి మాటలు అతనికి అర్థం కాలేదు. న్యూఆర్లియన్స్ రేవులోని యిలాంటి కుర్రకుంకాలు అతని మనసులో మెదిలి, సుఖప్రదమైన స్వదేశపు గాలి తగిలినట్లయింది.

       అతని చేయి జాకెట్ జేబులోకి పోయింది, తళతళ మెరిసే డాలర్ ను కుర్రవాని చాచిన చేతిలో పెట్టింది. మెరుపు వేగంతో నాణెం కుర్రవాని దవుడలోకి అదృశ్యమైంది. అతను పల్టీ కొట్టి, చేతులమీద నడుస్తూ, గాలిలో కాళ్ళు ఆడిస్తూ, హిప్ ,హిప్, హుర్రా!”అని అరచినాడు.

   ఓహిడ్డీ యింకా బాగా చిరునవ్వు నవ్వినాడు. లేచి కాళ్ళ మీద నిలబడిన కుర్రవాని మురికి జుట్టు అతను నిమిరి, తనకు వచ్చిన రెండు మాటలు పలికినాడు, “నమస్తే,బాగున్నావా.”

   కుర్రవాళ్లు పగలబడి నవ్వినారు. వాళ్ళల్లో ఒకడు నేల మీద  ఉమ్మేసి, ఉద్రేకంగా అరిచినాడు, “చూడండిరోయ్.అతనికి మన భాష వస్తుంది,కుక్కమూతి వెధవకు!”

    —————————————-

  • “కాప్టెన్ ,దయచేసి షిల్లింగు యివ్వండి,సెలవు!బాగున్నారా?”

   ఓహిడ్డీ యింకొక మాట చెపుదామనుకున్నాడు. కానీ,అందమైన ఆడపిల్లకు చేసే ప్రేమ ప్రకటన యిక్కడ ఉచితం కాదని,అతను వూరక గొంతు సవరించుకున్నాడు.

   యీ ఇబ్బంది పరిస్థితినుంచి అతన్ని రక్షిస్తూ బీకొవ్ మెట్ల మీదనుంది బిగ్గరగా అరచినాడు.

   “పేత్కా!…సాన్కా!…యెలకా!…రండి పనికి!”

  మెకానిక్ సవినయంగా టోపీ తీసి, కుర్రవాళ్ళకు నమస్కరించి,రేవు వైపు నడిచినాడు.

   5

  బీకొవ్ కుర్రవాళ్ళల్లో పదకొండేళ్ళ  మీత్క పసిద్ధుడు, “’యెలక’” అనే  మారు పేరు గలవాడు. మెకానిక్‌ ఓహిడ్డీ వద్ద కొత్త డాలర్‌ నాణెం  సంపాయించింది అతనే. 

            మీత్క యెక్కడివాడై౦దీ, యెవరివాడైందీ, అతని వంశ నామం యేమైందీ యెవరికీ తెలియదు. రెండేండ్ల క్రితం  ఒక శరద్రాత్రి అతను ఓవర్‌ బ్రిడ్జి కింద తీవ్రమైన  జ్వరంతో, సగం చచ్చిన స్థితిలో బీకొవ్‌కు దొరికినాడు. అతను కుర్రవాణ్ని యింటికి తెచ్చి, చికిత్స చేసి, తిండీ, బట్బా యిస్తూ తన వ్యాపారంలో పెట్టుకున్నాడు.

   తక్కిన కుర్రవాళ్ళ కందరికీ కుటుంబాలు వుండినాయి. వాళ్ళు రేవులోని దారిద్ర్య  దేవత బిడ్డలు, రేవులో కూలిపని చేసుకునే శివార్ల  దిమ్మరుల పిల్లలు.  కానీ మీత్కకు ఒదేస్సలో గానీ, చుట్టూ వేయి మైళ్ళలోపల గానీ యెవ్వరూ లేరు. అన్ని ప్రశ్నలూ  వేసి అతనివద్ద నుండి రాబట్టుకోగలిగే వివరమల్లా ఒక్కటే- అతని తల్లికి నీలం స్కర్టు వుండిందని. మరి, ప్రపంచంలో నీలం స్కర్టులు చాలా వున్నాయి. రేవులో తనను వదలేసిపోయిన తల్లిని యీ గుర్తుతో వెదకి పట్టుకోవడం మీత్కకు సాధ్యమయ్యేది కాదు. 

            మీత్కకోసం బీకొవ్‌ పెట్టిన ఖర్చులు వ్యర్ధం కాలేదు. బీకొవ్ ఆఫీసుకు మీత్క బంగారు నిధి అయినాడు. కుర్రవానికి యెముకలే లేనట్లుంది. అతని పల్చని, చిన్న శరీరం యెలా వంగి, మడిగి ముద్దలా అయ్యేదంటే, అలా చేస్తే మామూలు మనిషి  యెముకలు పటపట విరుగుతాయి.    బీకొవ్  వ్యాపారంలో యిది అన్నిటికంటె ముఖ్యమై నది,  యితర కుర్రవాళ్ళకు చేతగానిచోట  మీత్క పనిలోకి దిగేవాడు. మహా యిరుకైన గొట్టా లలో అతను ఈల్‌ చేపలా కదలేవాడు. యంత్రాన్ని పగలగొట్ట కుండా యెవరూ చేయి పెట్టలేని మూలల్లోకీ, వంపుల్లోకీ ఆతను పాకగలిగేవాడు. ఒకసారి అతను మూడు మూరల కొక వలయం వంతున పాములాగ చుట్టలు చుట్టుకొన్న ఒక రెఫ్రిజిరేటర్‌ గొట్టం గుండా ప్రాకినాడు. యీ పనితో అతని పేరు రేవు అంతటా పసిద్ధి కెక్కింది. బీకొవ్  పోటీదార్లు మీత్కకు రెండంతలు కూలి యిస్తామని పలుసార్లు అన్నారు, అతను తమదగ్గర పనిచేయడానికి ఒప్పుకుంటే. అతను తన పల్చని. ముక్కు చిట్లించి – అతనికి ““యెలక” అని పేరు రావడానికి ఆ పల్చని ముక్కు కూడా ఒక కారణం – కరకుగా జవాబిచ్చినాడు:

             “మా యజమానికి నేను యెందుకు బద్మాష్‌లాగా కనపడాలి. నాకు ఆయన చికిత్స చేసి, తిండీ,బట్టా యిస్తున్నాడు. అయన్ను మూతిమీద కొట్టినట్లు నేనెందుకు ప్రవర్తించాలి?  ఆయన దగ్గర నాకు బాగానే వుంది.” 

            పోటీదార్లు తిట్టుకుంటూ వెళ్ళిపోయినారు. ఒకసారి మీత్కను చంపడానికి కూడా ప్రయత్నం. జరిగింది. యీ ఉద్దేశంతో  పదిమంది కుర్రవాళ్ళు అతనితో తగవు పెట్టుకొని, అతనిమీద కోటు కప్పి తన్నాలని పథకం వేయబడింది. కొట్లాట జరుగుతుండగా “చిహాచెవ్” ఓడకు చెందిన నావికులు సకాలంలో అడ్డుపడి, రక్తసిక్తమైన మీత్కను రక్షించినారు.

             “యెలక” అలా బీకొవ్‌ దగ్గరే వుండిపోయినాడు, తన మొదటి యజమానికి విశ్వాసంగా, బీకొవ్ యితర కుర్రవాళ్ళను. కాసింత తప్పు కనిపిస్తే తరుచు శరీరంమీద యెక్క డంటే అక్కడ తన్నేవాడు  కానీ అతను మీత్య ఒంటి మీద యెప్పుడూ చేయివేయలేదు – దానికి కారణం కారుణ్యభావం కాదు, మీత్కలాంటి  మాణిక్యానికి అపాయం కలిగితే తనకు కలగబోయే నష్టాన్ని అతను గుర్తించడమే.

     అతను చాలా లాభదాయకమూ, పెద్ద మొత్తం వచ్చేదీ అయిన “మెజి డాల్టన్ ” బాయిలర్లు శుభ్రం  చేసే అర్జంటు  సనికి ఆర్డరు తీసుకొని, ఆ పనికి మీత్యనూ, అతనివెంట మరికొందరు కుర్రవాళ్ళనూ పంపాలని నిశ్చయించుకున్నాడు; మీత్క ఒక్కడే పదిమంది పని చేయగలడని అతనికి  తెలుసు. అతను కుర్రవాళ్ళకు రేకులూ, ఉలులూ, సుత్తెలూ యిచ్చి, ఓడ యెక్కడున్నదీ చూపించడానికి వాళ్ళవెంట లైజర్‌ను పంపినాడు.

        ఓహిడ్డీ తిరిగి ఓడచేరి, కాప్టెన్     జి బ్బిన్స్ కాబిన్‌లో పత్యక్షమైనాడు.

       “ఛీ,” అంటూ అతను లోపలికి వచ్చినాడు, నొసలు తుడుచుకుంటూ. ఒదేస్స యీ యేడు ఉష్ణమండలం  లాగుంది. నా ఒళ్ళులో రసమంతా యెండిపోయింది. దయయుంచి మీ షెర్రీ  కాస్త యివ్వండి, తాగుతాను.”

       “తీసుకోండి,” అన్నాడు. జిబ్బిన్స్  ఒక గ్లాసునిండా షెర్రీ పోస్తూ. “బాయిలర్ల పని యేమైంది?”       “యేర్పాటు చేసినాను. రెండు రోజుల్లో  పని పూర్తిచేస్తానని బీకొవ్ మాట యిచ్చినాడు.” 

      “సరే, మన యజమానివద్దనుండి మరో  టెలిగ్రాం వచ్చింది. మన ప్రయాణ కాలంలో మరో రెండు రోజులు తగ్గించగలిగితే, రెట్టింపు బోనస్‌ యివ్వడానికి ఒప్పుకున్నాడు. మనకు బోలెడు డబ్బు వస్తుంది. నా పిల్లల భవిష్యత్తు  కోసం నేను కొంత డబ్బు బాంకిలో వేస్తాను.” 

      మెకానిక్‌ షెర్రీ  దిగమింగినాడు. 

      “నాకు డబ్బెందుకు? నాకు పిల్లలు  లేరు…. మీ విషయం సరేననుకోండి. నేను వెళ్ళి బేతింగు డ్రెస్  వేసుకోవాలి. యీ వేడిలో బతకలేను.” 

      అతను వెళ్ళిపోయినాడు. కాప్టెన్ జిబ్బిన్స్   మంచం వద్దకు పోయినాడు. ఆ గోడమీద ఒక లావుపాటి  స్త్రీ, యిద్దరు పిల్లలు గల ఫోటో వుండింది. అతను మమకారంతో  దానివైపు చూసి, నిట్టూర్చి, మంచంమీద పండుకొని నిద్రపోయినాడు.

    6

ఓహిడ్డీ  నీళ్ళు పోసుకోవడం ముగిసేటప్పటికి, ఫైర్ మన్‌ కాబిన్‌ తలుపు తెరచుకొని, జిడ్డు పట్టిన మురికి గౌనులో ప్రత్యక్షమైనాడు.

       “మిస్టర్‌ ఓహిడ్డీ, బాయిలర్లు శుభ్రం  చేయడానికి వచ్చినారు.”

       “వాళ్ళను యింజన్‌వద్దకు తీసుకపో, నేను వెంటనే వస్తాను,” అన్నాడు మెకానిక్‌, టవల్‌తో ఒళ్ళు తుడుచుకుంటూ.

      అతను డ్రాయర్‌ తొడుక్కొని, టవల్‌ కొయ్యకు తగిలించి, డెక్కుమీదనుండి వెళ్ళి గవాక్షంవద్దకు వచ్చి, గణగణ మోగే యినప నిచ్చెనగుండా  తేలికగా యింజన్‌గదిలోకి దిగినాడు.

      కుర్రవాళ్ళు చేతులులేని తార్‌పాలిన్‌ నంచులు తొడుక్కున్నారు, గొట్టాలు శుభ్రం  చేసేటప్పుడు ఒళ్ళు గీచుకపోకుండా వుండడానికి.

      లైజర్‌ త్స్వీబెల్‌ వినయంగా మెకానిక్కుకు నమస్కరించినాడు.

       “యిప్పుడే పని మొదలుపెడతారు. కుర్రవాళ్ళు చురుకైనవాళ్ళు. బాగా పనిచేస్తారు.” అన్నాడు. అతను.

      కంఠధ్వని విని కుర్రవాళ్ళలో ఒకడు అటు తిరిగినాడు. యింజన్‌గది చీకటిలో అతని తెల్లని కండ్లు తళతళలాడినాయి. మెకానిక్‌ తాను డాలరు యిచ్చిన కుర్రవాణ్ని గుర్తు పట్టినాడు.

       అతను కుర్రవానికి కన్ను గీటి, “నమస్తే, బాగున్నావా?” అన్నాడు.

      “మీరు భయపడకండి, బాబాయ్‌. మేము శుభ్రం  చేస్తాం, రండర్రా , యిక వెళ్దాం,” అన్నాడు. మీత్క.

      అతను ఉలీ, సుత్తే జేబులో వేసుకొని, గోకుడు రేకు చేత పట్టుకొని, మెకానిక్కుకు చిరునవ్వుతో సెలవు చెప్పి, గొట్టంలో తల దూర్చి లోపలికి దూరినాడు.

      ఓహిడ్డీ కొద్ది నిముషాలు అక్కడే  నిలబడినాడు.  యితర కుర్రవాళ్ళు  గొట్టాలలోకి దూరి అదృశ్యమైందాకా. తరువాత అతను వినయంగా త్స్వీబెల్‌నైపు తిరిగి, అతన్ని కాఫీకి ఆహ్వానించినాడు. లైజర్‌ అతని వినయానికి హర్షించి, అతనివెంట నిచ్చెన యెక్కి పోయినాడు.             అతను అమెరికా దేశస్థుని  శుభ్రమైన గదిలో కూర్చున్నాడు, తియ్యని కాఫీ తాగినాడు, బిస్కట్లు  తిన్నాడు, ధైర్యం  చేసి ఒక గ్లాసు మద్యం కూడా తాగినాడు. అది తాగిన తర్వాత అతనికి తన మురికి గుహ జ్ఞాపకం వచ్చింది. ఆ గుహలో నిత్యం ఆకలిగొన్న రహిల్‌ తొమ్మిదిమంది పిల్లలతో కూర్చొనివుంటుంది. దగ్గిరలో వున్న పోలీసు స్టేషన్‌లోని పోలీసు యిన్‌స్పెక్టరుకు లైజర్‌ నెలకు పది రూబుళ్ళు యివ్వాలి, అతనితో బాధ లేకుండా వుండడానికి. యింకా అయిదు  రూబుళ్ళు సార్జెంటుకూ, మూడు రూబుళ్ళు జవానుకూ యివ్వాలి. యిదంతా జ్ఞాపకం వచ్చి అతని మనస్సు బరువెక్కింది. అతను తన్ను తాను మరచిపోయి, తన బాధలను తన వచ్చీరాని  యింగ్లీషులో  మెకానిక్‌వద్ద  వెళ్ళబోసుకోవడం మొదలు పెట్టినాడు, అమెరికా దేశస్థుడు  వినయంగా విన్నాడు, కానీ అతనికి విసుగు పుట్టినట్టుంది. చివరకు లైజర్‌ యిది గమనించి, తికమక పడి, తొందర తొందరగా లేచినాడు, సెలవు తీసుకోడానికి.

       యింతలో కాబిన్‌ తలుపు భళ్ళు న తెరుచుకుంది.   వాకిట్లో ఫైర్ మన్‌ కనిపించినాడు.     “క్షమించండి, మిస్టర్‌ ఓహిడ్డీ. యింజన్ వద్దకు త్వరగా రండి.”

       “యెందుకు?” అన్నాడు మెకానిక్‌అయిష్టం  కనబరుస్తూ.

      “యిబ్బంది యేర్పడింది. ఒక కుర్రవాడు గొట్టంలో  యిరుక్కున్నాడు. బయటికి రాలేకున్నాడు.”

              “డామిట్‌!” అని తిట్టుకుంటూ మెకానిక్‌ కాబిన్‌లోనుండి బయటికి వురికినాడు.              యింజన్‌గదిలో  మెషీనిస్టులూ, యితర ఫైర్‌మన్‌లూ, కుర్రవాళ్ళూ, అందరూ గొట్టం ముఖంవద్ద గుమికూడి వుండినారు. 

            “యేమిటి సంగతి? యెందుకందరూ యిక్కడ గుంపైనారు? యెలా జరిగింది?” అని కోపంగా అడిగినాడు. ఓహిడ్డీ.

              “కుర్రవాడు గొట్టంలోకి దూరంగా ప్రాకినాడు. హఠాత్తుగా కేకలు వేయసాగినాడు. మేము పరుగెత్తుకుంటూ వచ్చినాము. మాకు అతని కేకలు అర్ధం కావడం లేదు. వాడు యిప్పుడు యేడుస్తున్నాడు. వాడు యిరుక్కొని బయటికి  ప్రాకలేకున్నాడు.”

             “యేమిటిది?” మెకానిక్‌వెంట దిగివచ్చిన లైజర్‌ అన్నాడు. “అబ్బాయిలూ, యేమిటిది చెప్పండి.” 

            “మీత్క గొట్టంలో యిరుక్కున్నాడు.”

              “లోపలికి ప్రాకినాడు, బయటికి ప్రాకలేకున్నాడు.”

            “యేడుస్తున్నాడు.” 

            “బయటికి లాగాలి,” అంటూ కుర్రవాళ్ళు ఉమ్మడిగా అరచినారు.

             లైజర్‌ గొట్టం ముఖంవద్ద తల ఆనించి, మెత్తని యేడుపు విని, ఆందోళనగా అన్నాడు:     “యెలకా ” యేమిటి దీని అర్ధం? యేమైంది నీకు? నాకూ మన యజమానికీ యెంత అవమానం, నీ కాళ్ళు విరగా!”

              యేడుపుతో రాచిన “యెలక”” సన్నని గొంతు గొట్టంలో నుండి వినవచ్చింది.

   “యిరుక్కపోయినాను, లైజర్‌గారూ, దేవుని తోడు, నా తప్పేమీ లేదు. గొట్టం వెంబడి ప్రాకినాను…. నా చెయ్యి యెలాగో వడదిరిగి శరీరంకింద యిరుక్కుంది…. వూడదీసుకోలేకున్నాను. చాలా నొప్పిగా వుంది.” మీత్క మళ్ళీ యేడ్వసాగినాడు.

             లైజర్‌ చేతులు చరచినాడు.

             “చేయి యిరుక్కుందా? యింత జిత్తు యెక్కడైనా చూసినారా? అది యిరుక్కోకుండా వుండడానికి కదా నీకు డబ్బు యిచ్చేది – యెలా యిరుక్కుంటుంది? బయటికి రా వెంటనే, నీ యమ్మ కడుపు కాలా!” 

            గొట్టంలో  సవసవ శబ్దమై, యేడుపు వినవచ్చింది.

             “ఓ… రాలేను… నొప్పి,” లోపలినుండి కంఠధ్వని వచ్చింది.

              లైజర్‌ యెగిరిపడినాడు.

             “నా గొంతుకు ఉరి పెట్టాలనుకున్నావా, పనికి మాలిన వెధవా?” అని అతను గొట్టంలోకి కేకవేసినాడు. “వెంటనే బయటికి రా. లేకపోతే బీకొవ్‌తో చెప్తాను. ఆయన వచ్చి నీ చెవులు వడబిండుతాడు, పిచ్చి వెధవా.” 

            “రాలేను.”

              “ఓయ్‌? రాలేడట! యిలాంటిది విన్నారా మీరు? పేత్కా, గొట్టంలోకి దూరి, వాని రెండు కాళ్ళూ పట్టుకో, మేము యిద్దరినీ బయటికి లాగుతాము, దూరు, పనికి మాలిన వెధవా! భగవంతుడా, యీ కుర్రవాళ్ళతో నాకు యెన్ని కష్టాలు పెట్టినావురా!” 

            పేత్క గొట్ట్రంలోకి దూరినాడు.

             “వాని కాళ్ళు పట్టుకో! గట్టిగా!  వదలిసపెట్టవద్దు,”” లైజర్‌ ఆజ్ఞాపించినాడు.

            “పట్టుకున్నావా? అబ్బాయిలూ, మీరు పేత్క కాళ్ళు పట్టుకోండి. అతన్ని బయటికి  లాగండి.”

            కుర్రవాళ్ళ నవ్వుతూ, గొట్టం లోనుండి బయటికి కనపడే సేత్క మురికి వుత్త కాళ్ళు పట్టుకొని, లాగడానికి ప్రయత్నించినారు. హఠాత్తుగా గొట్టంలో నుండి హృదయవిదారకమైన మీత్క చావు కేక వినవచ్చింది. 

            “ఓ, వదలండి… నొప్పి… నా చేయి విరిగిపోతుంది.” 

            కుర్రవాళ్ళు కలవరపడుతూ, గొట్టంలోనుండి బయటికి కనపడే కాళ్ళు వదలిపెట్టినారు. లైజర్‌ పాలిపోయినాడు. 

            “మీరు కంగారు. పడకండి, మిస్టర్‌ మెకానిక్‌,” అన్నాడు అతను ఓహిడ్డీతో.

            “యిది చిన్న విషయం…. నేను యిప్పుడే బీకొవ్‌ను తీసుకొస్తాను. అతను క్షణంలో వాణ్ని బయటికి లాగేస్తాడు.” 

            అతను నిచ్చెన వద్దకు  పరుగెత్తి, గబగబా పైకెక్కినాడు, ఓహిడ్డీకి గౌరవం కలిగించేటంత వేగంతో.

యేడ్చే గొట్టం చుట్టూ తక్కినవాళ్ళు నిశ్శబ్దంగా నిలబడినారు.

             “గొట్టంలో నూనె పోయాలి. అది జిడ్డుగా వుంటే కుర్రవాణ్ని సులభంగా బయటికి తీయవచ్చు,” అన్నాడు మెషీనిస్టు.

             ఓహిడ్డీ గొట్టం ముఖంవద్ద  వంగినాడు. తనకు న్యూఆర్లియన్స్‌ను జ్ఞాపకం చేసిన తెల్ల పండ్ల కుర్రవెధవే గొట్టంలో యిరుక్కోవడం అతనికి బెంగ కలిగించింది. అతనికి కడుపులో దేవినట్టుండింది. యేవిధంగా అయినా సరే కుర్రవానికి సాయం చేయాలనే గాఢమైన కాంక్షతో అతను తన అసమర్థతను  తిట్టుకుంటూ, హార్థికంగా గొట్టంలోకి కేక వేసినాడు.

             “హలో! నమస్తే, బాగున్నానా?”

            కుర్రవాళ్ళు  నవ్వినారు.  గొట్టంలో నుండి యేడుపుతో కూడిన జవాబు వచ్చింది!  ““బాగలేను… చేయి నొస్తున్నది… విరిగిపోయినట్టు.”

             ఓహిడ్డీకి అర్థం కాలేదు. అతనికింకా ఆందోళన యెక్కువై,  యింజనుగదిలోని యిరుకు జాగాలో అటూయిటూపచారు చేయసాగినాడు. 

      7

            బీకొవ్‌ బరువుతో పోత యినుము నిచ్చెన దడదడలాడి వణికింది. 

            ఆందోళనపడిన ఓహిడ్డీ వైపు  చూడకుండా అతను నిశ్శబ్దంగా గొట్టం చుట్టూ గుమికూడిన కుర్రవాళ్ళను చూస్తూ గర్జించినాడు.

             “యేమిటిది? పనిచేయకుండా వుందామనుకున్నారా? పని యెవరు చేస్తారనుకున్నారు? దూరండి గొట్టాల్లోకి. మెడ పట్టి గెంటేస్తాను,గాడిద కొడుకుల్లారా .”

  “ ‘యెలక’  యిరుక్కుపోయినాడు,బీకొవ్ గారూ”,అని పేత్క జాలిగా చెప్పినాడు.

బీకొవ్ చేయి ఆ కుర్రవాని చెవి  పట్టుకుని పిండింది.

      “యింకా ఉపన్యాసా లిస్తున్నావా, పనికి మాలిన వెధవా! యిరుక్కుపోయినాడట! యెలా యిరుక్కపోతాడో చూస్తాను. వెంటనే వెళ్ళండి గొట్టాలలోకి. పని సకాలంలో జరక్కపోతే, మీరు డబ్బిస్తారా, గాడిద కొడుకుల్లారా?” 

      కుర్రవాళ్ళు గొట్టాలలో అదృశ్యమైనారు. 

      బీకొవ్‌ దురదృష్టపు  గొట్టం ముఖం సమీపించి, అరిచినాడు: 

      “మీత్కా, యేమిటిది బద్మాష్‌! దొంగ వేషాలు. వేయదలచుకున్నావా? వెంటనే వచ్చేసెయ్‌ బయటికి.” 

      “బీకొవ్‌గారూ,  కోపగించుకోకండి. చేతనైతే వస్తాను, కానీ చేతకాదు. నా చేయి పూర్తిగా వడదిరిగింది.” దుర్భలమై న కంఠం లోపలినుండి వినవచ్చింది. 

      బీకొవ్‌ కందగడ్డ అయినాడు.

       “నాదగ్గర వేషాలు వేయవద్దు, దొంగ వెధవా. రా బయటికి, లేకపోతే నీ మూతి పగలగొడతాను.”

       గొట్టంలో నుండి యేడుపు వచ్చింది. 

      “నన్ను చంపడం మేలు. యీ బాధ భరించలేను. నొప్పి.”

       బీకొవ్‌ తల గోక్కున్నాడు. 

      “చూడు, వీడు నిజంగా యిరుక్కున్నాడు. కాలికి తాడు గట్టి లాగాలి.” 

      లైజర్‌ జాగ్రత్తగా అతని దగ్గరికి వచ్చినాడు.

        “ఓ, యెంత దురదృష్టం, యెంత దురదృష్టం, కాళ్ళు పట్టి లాగడానికి యిందాకా ప్రయత్నించినాము, లాభం లేదు… గొట్టం జిడ్డు అయ్యేటట్లు నూనె పోయమని మెషీనిస్టు అంటున్నాడు.” 

      “పో, మూర్యుడా,” బీకొవ్ తిట్టినాడు.

       “అది నాకు తెలుసు, నీవు చెప్పకున్నా. నూనె తెమ్మని యింగ్లీషువాళ్ళతో చెప్పు.”

       విశాలమైన భుజాలుగల కెనడా ఫైర్ మన్‌ బకెట్‌తో చిక్కని నూనె తెచ్చినాడు. బీకొవ్  కోటు విప్పి, బకెట్‌ను వూపి, గొట్టంలో నూనె పోసినాడు. 

      “పొడుగు బ్రష్ ,” అని అతను ఆజ్ఞాపించినాడు, భయపడిపోయిన లైజర్‌కు.

       అది అందుకొని అతను గొట్టంలో దూర్చినాడు.

         “యింకొక బకెట్‌!”

       రెండవ బకెట్‌ నూనె గొట్టంలో పోయబడింది. 

      “పేత్కా, గాడిద కొడుకా తాడు తీసుకొని, వాని కాలికి కట్టు.” 

      పేత్క  గొట్టంలోకి  దూరినాడు. అతని మురికి చెక్కిళ్ళమీద చెమటా, కన్నీళ్ళూ యేకధారగా కారుతూవుండినాయి. ఆతను భయంతో, “యెలక”” పట్టు జాలిలో వణకినాడు, త్వరలో అతను బయటికి వచ్చినాడు, ఒళ్ళంతా నల్లగా, నూనెతో జిడ్డుగా.

“కట్టినాను”” అతను గొణిగినాడు.

      బీకొవ్‌ తాడు కొసను తీసుకొని, తన చేతికి చుట్టి, గుంజినాడు. గొట్టం భయంకరమైన యేడుపుతో మూలిగింది.

       “యేడవాకు,” బీకొవ్‌ పిచ్చిగా అరచినాడు. “దొర కొడుకూ! కాస్త ఓపిక పట్టు. బయటికి తీస్తాను.”

            రెండవసారి అతను తాడు గుంజినాడు. యింజనుగది అంతా భరించరాని యేడుపుతో నిండిపోయింది. బీకొవ్‌ మూడవసారి తాడు గుంజేలోపల ఓహిడ్డీ  అతని భుజం పట్టుకొని, గది మూలన వున్న బూడిద కుప్పమీదికి తోసినాడు. మెకానిక్‌ పెదవులు వణకుతూ వుండినాయి.       “కుర్రవాణ్ని హింసించడానికి నేను ఒప్పుకోనని చెప్పండి,” అతను లైజర్‌తో బిగ్గరగా అన్నాడు.

            బీకొవ్ పిచ్చి కోపంలో యెరుపెక్కి లేచినాడు.

              “అలా అయితే, అతన్నే యూ పని చేయమని చెప్పు. అతని కిష్టం  లేకపోతే, గొట్టం పగలగొట్టాలి.”

             లైజర్‌ భయంతో కొయ్యబారి, అనువాదం చేసినాడు.

             ఓహిడ్డీ తల ఆడించినాడు. 

            “సరే, వెళ్ళి కాప్టెన్ తో చెప్తాను.” 

            అతను నిచ్చెనవద్దకు పోయి, గవాక్షం గుండా అదృశ్యమై నాడు. బీకొవ్  మరొకసారి తాడుపట్టే లాగాలనుకున్నాడు. గానీ, కెనడా మనిషే పిడికిలి బిగించి, బెదరించినాడు. బీకొవ్‌ నిశ్చలంగా నిలబడినాడు. 

            ఓహిడ్డీ  తల గవాక్షం  వద్ద  కనిపించింది.

             “మిస్టర్‌ త్స్వీబెల్‌, పైకి రండి. మిస్టర్‌ బీకొవ్‌ను కూడా తీసుకొని రండి. కాప్టెన్‌ మీతో మాట్సాడాలట.”

             బీకొవ్‌ ఉమ్మేసి, తిట్టుకుంటూ పైకి పోయినాడు. 

            కాప్టెన్  జిబ్బిన్స్‌ కనుబొమలు ముడివేసి, గవాక్షం దగ్గర నిలబడివుండినాడు. యేమి జరిగిందో చెప్పమన్నాడు అతను. లైజర్‌ చెప్పింది విని అతను నిర్లిప్తంగా,మెల్లగా అన్నాడు:

              “కంపెనీ యజమానుల అనుమతి, సరుకు యజమానుల అనుమతీ లేకుండా గొట్టం పగలగొట్టడానికి నేను ఒప్పుకోను. న్యూఆర్లీయన్సుకు యిప్పుడే అర్జంటు టెలిగ్రాం పంపిస్తాను. యీమధ్యలో కుర్రవాణ్ణి యెలాగైనా బయటికి తీయడానికి ప్రయత్నించండి.”

              బీకొవ్‌ చెడ్డకోపంతో మళ్లీ కిందికి పోయినాడు. గొట్టంలో మళ్లీ నూనె పోసినారు. మొదట ఊకించి తాడు  గుంజినారు, తరువాత మెల్లగా,జాగ్రత్తగా మళ్లీ లాగినారు. లాగినప్పుడల్గా ప్రతిసారీ “యెలక”కు భరించరాని నొప్పి కలిగింది, యింజన్‌గది దారుణమైన యేడుపుతో నిండింది. కుర్రవాడు యేడుస్తూ, తనను తక్షణమే చంపెయ్యమని  కోరుతూ వుండినాడు. 

            సాయంత్రం దాకా యిలా సాగింది. సాయంత్రం  బీకొవ్‌ తనకు వచ్చిన తిట్లన్నీ  అయిపోయినాక వెళ్ళిపోయినాడు. ఫైర్‌మన్‌లు మెల్లగా  ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, గొట్టంలో నుండి వచ్చే సన్నని యేడుపు విన్నారు. 

            “వాడు చాలా కాలంపాటు తట్టుకోలేదు,” అన్నాడు కెనడా మనిషి.

            “గొట్టం పగల గొట్టాలి.”

             “జిబ్బిన్స్‌ అనుమతి యివ్వడు,” అన్నాడు మరొక ఫైర్ మన్‌.

             “వెధవా!” అని కెనడా మనిషి పిడికిలితో గొట్టంమీద గుద్దినాడు.

8

             ఉదయం కాప్టెన్ జిబ్బిన్స్  కు యజమానినుండి అతని అర్జంటు టెలిగ్రాం కు  జవాబు వచ్చింది. 

            అతను టెలిగ్రాం  చదువుతుండగా, ప్రతి  మాటకూ అతని ముఖం కొయ్యబారి పోయింది. యెలాంటి ఆలస్యమూ అనుమతింపబడదనీ, దానికి యావత్తు బాధ్యత జిబ్బిన్స్ మీద వుంటుందనీ యజమాని తెలియజేసినాడు. 

            “కంపెనీ ప్రయోజనాలను యింతకంటే జాగ్రత్తగా కాపాడగల కాప్టెన్  మాకు యెప్పుడైనా దొరుకుతాడు,” అని  టెలిగ్రాం  ముగిసింది. 

             కాప్టెన్  జిబ్బిన్స్‌ కండ్లు మూసుకున్నాడు. అతనికి తన భార్యా, యిద్దరు పిల్లలూ గుర్తుకొచ్చినారు. అతని ముఖం టకటకలాడింది. అతను  టెలిగ్రాం  చించివేసి, డెక్కు మీదికి పోయినాడు. అక్కడ ఓహిడ్డీ  ముందర నిలబడి బీకొవ్‌ చేతులు వూపుతూ యేదో ఉద్రేకంగా త్స్వీ బెల్ తో  వివరిస్తూ వుండినాడు. త్స్వీ బెల్ కాప్టెన్  వైపు తిరిగి అతని ముఖంలోకి పిరికిగా చూసినాడు.  “మిస్టర్‌ కాప్టెన్ , జవాబు వచ్చిందా?”

             “వచ్చింది,” సమాధాన మిచ్చినాడు జిబ్బిన్స్‌.

             “ఒక గంట ఆలస్యం కూడా ఒప్పుకోనని మిస్టర్‌ బీక్‌వ్‌లో చెప్పండి. యీ రోజు సాయంత్రం పొయ్యి అంటించి తీరాలి, ఉదయం మేము బయలుదేరుతాము. లేకపోతే, కంపెనీకీ, నాకూ కలిగే నష్టాలన్నీ బీకొవ్ చెల్లించాలి.” 

            బీకొవ్‌ పిడికిళ్ళు బిగించి, తీవ్రమైన శాసనార్థాలు వెలిగక్కినాడు. 

            “ముదనష్టపు  ముండాకొడకా!  గొట్టంలోనే చావదలచుకున్నావటరా, గాడిద కొడకా!”

            లైజర్‌ అదిరిపడినాడు. 

            “యేమిటి మీరనేది బీకొవ్‌గారూ? మీరనేది వినడానికి కూడా దారుణంగా వుంది. కుర్రవాడు  యేమి పాపం చేసినాడని ఆ పాడు స్థలంలో  చావాలి?”

             “యేట్లో పడి చావు!” బీకొవ్ కోపంగా అరిచినాడు. 

కాప్టెన్ జిబ్బిన్స్‌ పోబోయినాడు, కెనడా మనిషి అతన్ని ఆపి, యిలా అన్నాడు:

  “క్షమించండి. గొట్టం పగలగొట్టడానికి సిబ్బంది అనుమతి అడుగుతున్నారు. ఆగడానికి వీలులేదు. కుర్రవానికి యిప్పటికే ఊపిరి సరిగా ఆడడం లేదు. మనం…”

   కాప్టెన్ బుగ్గలు కొద్దిగా యెర్రబడినాయి. కంఠం హెచ్చించకుండా అతను స్థిరంగా అన్నాడు:

“నేను ఒప్పుకోను.”

“యిది హత్య,” అంటూ కెనడా మనిషి కాప్టెన్ ను సమీపించినాడు, మీద పడేవానిలాగ, “యిలాంటిది జరగడానికి మేము ఒప్పుకోము, మీ అనుమతి లేకుండానే మేము గొట్టం పగలగొట్టుతాము.”

 “యెంత సాహసం!” అన్నాడు. జిబ్బిన్స్‌, కంఠం యింకా తగ్గించి. “ఓడమీద తిరుగుబాటు అంటే యేమిటో తెలుసా? దానికి సంబంధించిన చట్టం తెలుసా? అంత సాహసమే!… నీ ప్రాణానికి పైసా విలువ కూడా యివ్వను, స్పష్టమైందా? ”  కెనడా మనిషి ముఖం యెర్రబడింది. అతను కోపంగా ఒక చూపు చూసి, గిరుక్కున తిరిగి, గవాక్షంగుండా. అదృశ్యమైనాడు.

            “వాళ్ళను ఒక కంట కనిపెట్టుకొని వుండండి, ఓహిడ్డీ. సిబ్బందికి బాధ్యత మీదే,” అని చెప్పి జిబ్బిన్స్‌ తన గదికి పోయినాడు.

    బీకొవ్‌, త్వ్వీబెల్‌ ఇంజన్‌గదికి పోయినారు. వాళ్ళ పిలుపులకు మీత్క జవాబు చెప్ప కుండా మూలుగుతూ వుండినాడు. మధ్యాహ్న భోజనానికి గంట

మోగింది. అందరూ వెళ్ళిపోయినారు. బీకొవ్  గొట్టం వద్ద వంగి, చాలా సేపు విన్నాడు. తరువాత లేచినిలబడి, టోపీ నొసటిమీదికి లాక్కొని, లైజర్‌ను తనవెంట రమ్మని ఆజ్ఞాపిస్తూ  కాప్టెన్ వద్దకు వెళ్ళినాడు.

 “యేం? కుర్రవాణ్ని బయటికి తీసినారా?” అడిగినాడు జిబ్బిన్స్‌, బీఫ్‌స్టీక్‌ తింటూ.

 “యేమీ లాభంలేదు, మిస్టర్‌ కాప్టెన్ యెంత ఘోరమో,” అంటూ లైజర్‌ మొదలు పెట్టినాడు, కానీ బీకొవ్ అతన్ని అడ్డగించినాడు. బీకొవ్ రెండు చేతులూ టేబుల్‌మీద పెట్టినాడు, అతని యెర్రని ముఖం హఠాత్తుగా పాలిపోయింది.

   “అతనితో చెప్పు, లైజర్‌,” అని అతను మెల్లగా ప్రారంభించినాడు, అతని మాటలు త్స్వీ బెల్ కు తప్ప యెవరికీ అర్ధం కాకపోయినప్పటికీ,  “కురవాణ్ణి బయటికి తీయడానికి  వీలులేదు. కానీ, నేను నష్టాలు చెల్లించలేను.. నావద్ద అంత డబ్బు యెక్కడిది? కుర్ర వానితో సహా పొయ్యి అంటించుకొమ్మను.”

            లైజర్‌ కంపించినాడు.

            “ఓ! బీకొవ్‌గారూ! యిలాంటి  హాస్యం ఎలా ఆడగలరు?అగ్గిలో కుర్రవాణ్ని చంపమని  నేను అమెరికన్‌ కాప్టెన్ తో యెలా చెప్పగలను? అతనితో మీరే మాట్లాడండి, నా చేత  కాదు. అలాంటి పని చేస్తే దేవుడు నన్నూ, నా పిల్లలనూ విసర్జిస్తాడు.”

 బీకొవ్ అతనికి దగ్గరగా టేబుల్ మీద వంగినాడు.

 “విను లైజర్”, అతను గుసగుసగా చెప్పినాడు. “నేను నీతో హాస్యమాడడం లేదు. యెవడో గాడిద కొడుకు కోసం నేను బికారిని కాదలచుకోలేదు. యిక నా శపథం యిది.నేను చెప్పమన్నట్లు నువ్వు కాప్టెన్ కు చెప్పకపోతే, నేను పోలీస్ ఇన్స్పెక్టర్ వద్దకు వెళ్ళి చెప్తాను, నీవు వీధిలో ఊరేగింపులో యెర్రజండా పట్టుకుని, ‘జార్ నశించాలి!’ అని కేకలు వేసిన సంగతి.

  లైజర్ ఒళ్ళు జలదరించింది,కానీ అతను పోరాటం కొనసాగించినాడు.

  “అయితే యేం?”అన్నాడు తన దుర్భలమైన అనారోగ్యపు చిరునవ్వుతో.

   “పోలీస్ ఇన్స్పెక్టరు యేమీ అనడు.అప్పుడు ప్రతి యూదుడూ ఊరేగింపులో యెర్ర జండా పట్టుకుని తెలివితక్కువ కేకలు వేసినాడు.”

 “ష్లి కెర్ మాన్ గుర్తున్నాడా?”

  త్స్వీబెల్   మూలిగినాడు. పోలీస్ స్టేషన్ లో దెబ్బలు తిని, ఒళ్ళు విరూపమైన ష్లికెర్ అతనికి జ్ఞాపకం వచ్చినాడు. అతను నిట్టూర్పు విడిచి,ఇలా అన్నాడు:

  “పాత సంగతులు లేవనెత్తడం న్యాయం కాదు,బీకొవ్ గారూ…సరే,కాప్టెన్ తో చెప్తాను.”

  బీకోవ్ మాటలు తర్జుమా చేసేటప్పుడు అతని చేతులూ,పెదవులూ వణుకుతూ వుండినాయి. కాప్టెన్ జిబ్బిన్స్ నిశ్శబ్దంగా విన్నాడు, అతని నున్నని ముఖంలో ఒక్క రేఖ కూడా చలించలేదు. అతను నోట్లో నుండి పైపు బయటకు తీసి యిలా అన్నాడు:

  “మిష్టర్ బీకొవ్ తో చెప్పండి,అది అతని వ్యవహారం.అతని కుర్రవాడు,అతని వ్యవహారం. అతని యిష్టం వచ్చినట్లు చేయనీ….సిబ్బందికి తెలియకుండా చేయగలిగితే,లోకాన్ని మోసగించగలిగితే. నేనేమీ వినలేదు,యేమి వినదలచుకోలేదు. కానీ సాయంత్రం పొయ్యి అంటించాలి.”

  బీకొవ్ పెదవులు బిగపట్టి, త్స్వీబెల్ తో  కలిసి బయటకు పోయినాడు. నిశ్చలమైన సముద్రం మీదనీలి నీడలు పడుతూ వుండినాయి. సాయంకాలపు నిశ్శబ్దాన్ని నీటి కాకుల కూతలు మాత్రమే భంగం చేస్తూ వుండినాయి. బీకొవ్ త్స్వీబెల్ వైపు తిరిగి కస్సుమంటూ బెదిరించినాడు: 

   “ఒక్క మాట యెవరితోనైనా అన్నావా-జ్ఞాపకం పెట్టుకో,నీ పని ముగిస్తాను.”

          9

యింజన్‌గదిలో కుర్రవాళ్ళు తప్ప యెవరూ లేరు, అమెరికన్లు భోజనానికి వెళ్ళి యింకా తిరిగి రాలేదు. కుర్రవాళ్ళు గొట్టం దగ్గర నిలబడి వుండినారు. పేత్క ఆ గొట్టంలోకి తల దూర్చి వుండినాడు. బీకొవ్‌ అతన్ని వెనకనుండి పట్టుకొని పైకి యెత్తినాడు.

        “యెందు కిక్కడున్నారు? యేమి చేస్తున్నారు? అందర్నీ చంపేస్తాను, వెధవ ముండా కొడుకుల్లారా!”

   “మా పని పూర్తిచేసినాం. గొట్టాలన్నీ  శుభ్రం చేసినాం.  ‘యెలక’ కోసం  ఆగినాం గానీ మా పని గంట క్రితమే అయిపోయింది,” అన్నాడు పేత్క, బీకొవ్‌ వైపు బెదరు  చూపులు చూస్తూ.

    బీకొవ్‌ చుట్టూ చూసి, పేత్కను దగ్గరగా లాక్కుని అన్నాడు:          “గొట్టంలోకి దూరు ‘యెలక’ వద్దకు. యిదుగో యీ తాడు తీసుకొని నీ కాలికి కట్టుకో. యింగ్లీషువాళ్ళు తిరిగివచ్చినప్పుడు, నిన్ను గొట్టంలోనుండి బయటికి లాగుతాను. నీవు యేడుస్తూ వుండు. నీవు ‘పేత్కవు కాక, ‘యెలక’ వై నట్టు.”  “యెందుకు?”

 “ప్రశ్నలు అడగవద్దు. నిన్ను బయటికి లాగినప్పుడు సంతోషంతో కేకలువెయ్‌, లేదా రెండు నిముషాల్లో నిన్ను పాతిపెడతాను. మీరందరూ నోరు మూసుకొని వుండండి!” అని అతను తక్కిన ముగ్గురు కుర్రవాళ్ళకూ కేకవేసినాడు.

    పేత్క గొట్టంలోకి అదృశ్యమైనాడు. పైననుండి మనుషులు నిచ్చెన దిగివచ్చే చప్పుడు వినవచ్చింది. 

         త్స్వీబెల్‌ సాహసించి బీకొవ్‌ చేయి పట్టుకున్నాడు.

   “అమాయకుడైన పసివాణ్ని నిజంగా మీరు బలిపెట్టుదలచుకున్నారా?” బీకొవ్ అతనివైపు చూసినాడు.

   “మీరెందుకు యింత జాలిపడుతున్నారో యెవరికి తెలుసు!” అన్నాడు అతను ఆశ్చర్య పడుతున్నట్టు.“అందువల్లనే కావాలి మిమ్మల్ని అన్ని దేశాలలోనూ తన్నేది.” హఠాత్తుగా ద్వేషంతో మండుతూ అతను యింకా అన్నాడు:“వాడు మీవాడా? యేం? నీకేమి సంబంధం? నాకు దొరికినాడు వాడు,వాని బాధ్యత నాది. వానికి యెవరూ లేరు, యిల్లు వాకిలీ లేదు, వాణ్ని గురించి యెవరూ అడగరు. యెవరైనా అడిగితే, యింగ్లీషువాళ్ళతో వెళ్ళిపోయినాడని చెప్తాను. పో యిక్కడనుండి!”

     లైజర్‌ పక్కకు పోయినాడు. ఫైర్ మన్‌లు తిరిగివచ్చి గొట్టం సమీపించినారు. బీకొవ్ తాడు లాగసాగినాడు. పేత్క మొత్తుకున్నాడు, తాడు జరగసాగింది.

            “లాగండి!… లాగండి!” అని బీకొవ్‌ కేకలు వేసినాడు. ఫైర్‌మన్‌లు తాడు కొన పట్టుకొని లాగినారు. ముందు పేత్క కాళ్ళు వచ్చినాయి, తరువాత శరీరం వచ్చింది, చివరకు పేత్కయే గొట్టంలోనుండి కింద పడినాడు. పేత్క ముఖం బొగ్గు ముక్కలతో నిండిన యినప నేలమీద పడింది. నొసటికి గట్టి దెబ్బ తగిలి అతను నిజంగానే యేడవసాగినాడు. ఫైర్ మన్‌లు సంతోషంతో కుర్రవాణ్ని యెత్తుకొని డెక్కుమీదికి పోయినారు. డెక్కుమీద ఒక ఫైర్‌మన్‌ పేత్క నొసలు తుడిచి, అతని ముఖం కడగాలనుకున్నాడు. కానీ బీకొవ్ కుర్రవాణ్ని లాక్కొని గాంగ్వేమీదికి వేగంగా మోసుకపోయినాడు. చప్పుడు విని యేమిటో తెలుసుకోవాలని కాబిన్‌లోనుండి బయటికి వచ్చిన ఓహిడ్డీ అతనికి దారిలో యెదురై నాడు.

  “యేమిటది?” అని అడిగినాడు మెకానిక్‌.

  కెనడా మనిషి ఉద్విగ్నంగా జవాబు చెప్పినాడు, కుర్రవాణ్ని బయటికి తీసినారని.

 ఓహిడ్డీ బీకొవ్‌ను సమీపించినాడు. కుర్రవానికి నాలుగు మంచి మాటలు చెప్పి, అతని తల నిమురాలని ఓహిడ్డీ అనుకున్నాడు. పేత్క తల తిప్పి,నోరు తెరచినాడు. అతని నల్లని, చెడిన పండ్లు మెకానిక్కుకు కనపడినాయి. 

     అతను పేత్క తలమీదనుండి చేతిని తొలగించి, బీకొవ్‌ కుర్రవానితో సహా మోటు తిరిగి అదృశ్యమైoదాకా వాళ్ళను ఆశ్చర్యంతో చూస్తూ వుండినాడు. మెకానిక్‌ అక్కడి నుండి పోయి యింజన్‌గదిలోకి దిగినాడు. అక్కడ కుర్రవాళ్ళు తమ సామానులన్నీ తీసుకొని వెళ్ళిపోడానికి సిద్దంగా వుండినారు.

       ఓహిడ్డీ వాళ్ళు పోయిందాకా ఆగి, కొక్కెం తీసుకొని గొట్టంలో  లోపలికి పెట్టినాడు. దానికి మెత్తని పదార్థం యేదో అడ్డం తగిలింది. నీటిలోనుండి వచ్చినట్ళు వినపడీ వినపడని మూలుగు అతనికి వినపడింది.

     అతను కొక్కెం విసరి పారవేసి, నాలుగు అంగలో నిచ్చెన యెక్కినాడు. డెక్కుమీద అతను వేగం తగ్గించి, కాప్టెన్ కాబిన్‌ తలుపు తట్టినాడు.

     జిబ్బిన్స్‌ ఆశ్చర్యంతో మెకానిక్‌ వైపు చూసినాడు. మెకానిక్‌ నీలి కండ్లు విప్పారి వుండినాయి, అతని పాలిపోయిన ముఖంమీద చెమట కారుతూవుండింది.

    “యేమైంది మీకు?” అని కాప్టెన్ అడిగినాడు.

    “ఫ్రెడ్ , నేరం జరిగింది. ఆ బద్మాష్‌ మనల్ని మోసగించినాడు. అతను మరొక కుర్రవాణ్ని గొట్టంలో నుండి బయటికి తీసినాడు. మొదటి కుర్రవాడు గొట్టంలోనే వున్నాడు. అతనిప్పుడు యేడ్వను కూడా యేడ్వలేడు.”

   కాప్టెన్ జిబ్బిన్స్‌ తల కిందికి వాల్చినాడు.

     “నేనలా అనుకున్నాను, ఓహిడ్డీ!మెకానిక్‌ యెగిరిపడినాడు.

            “యేమిటీ? మీకు తెలుసా?”

 “తెలీదు, కానీ అలా అనుకున్నాను.” కాప్టెన్ జిబ్బిన్స్‌ పైపు అంటించుకున్నాడు. “మనకు మార్గాంతరం లేదు. రేపు ఉదయం మనం బయలుదేరాలి. సాయంతం మీరు పొయ్యి అంటించండి.”  “కుర్రవాడో?”

  “వినండి ఓహిడ్డీ! నేను యజమాని  ఉత్తరువును నెరవేర్చకపోతే, నా ఉద్యోగం పోతుంది, మరొక కంపెనీలో యెక్కడా చేరలేను. నాకు భార్యా, పిల్లలూ వున్నారు. మీకు కుటుంబం లేదు. యిది నేరం, నాకు తెలుసు, సాధారణ నీతి దృష్ట్యా చూస్తే, కానీ నేను యీ విషయం సొంత నీతి దృష్ట్యా చూస్తున్నాను. నేనూ మనిషినే ఓహిడ్డీ , నా పిల్లలు నాకు ప్రియమై ననాళ్ళు.. మీరు. అవివాహితులు, యిది.కెప్పుడూ అర్ధం కాదు , నా పిల్చలకు యేమౌతుందో అని తలచుకొని, యీ ఘోరకృత్యానికి నేను ఒడిగట్టుతున్నాను. నా పిల్లలు యీ పిల్లవాని లాగా సంఘ బాహ్యులూ, బిచ్చగాళ్ళూ కావడం నా కిష్టం లేదు.”

    “మరి సిబ్బంది?”

   “సిబ్బందికి యేమీ తెలియదు, మీరు చెప్పకపోతే, మీరు చెప్పవద్దు ఓహిడ్డీ, నా పిల్లలు కూడా నాశనం కావాలని మీరు కోరరుగదా, ఆ కుర్రవాణ్ని యెలాగూ కాపాడలేము. యిక రెండు మూడు గంటలలో అతను ఊపిరాడక చచ్చిపోతాడు…. సాయంతం పది గంటలకు పొయ్యిలో బొగ్గు వేద్దాం. యిది ఉత్తరువు.”

    ఓహిడ్డీ కణతలు నొక్కుకున్నాడు. అతని తల రబ్బరు బంతిలా ఉబుకుతూ ఉబుకుతూ బ్రద్దలౌతున్నట్ను వుండింది.

 “సరే, నేను మౌనంగా వుంటాను. భగవంతుడు నన్నూ, మిమ్మల్నీ క్షమించుగాక.”

                                                10

    “మెజి డాల్టన్‌” పూర్తి సరుకుతో పండ్రెండు గంటలకు బయలుదేరింది. రేవు నిర్మానుష్యంగా వుండింది. గిడ్డంగి గోడవద్ద మాత్రం పాత కోటులో ఒక వ్యక్తి, వంగి దాక్కొనివుండినాడు.

     లైజర్‌ త్స్వీబెల్‌ ఓడకు సెలవు చెప్పడానికి వచ్చినాడు; యెందుకంటే,అతనికి తొమ్మిదిమంది ఆకలిగొన్న పిల్లలు గనుక, పిల్లల పట్ల అతనికి జాలి గుండె, యెవరికీ అక్కర లేనిది, వుండింది గనుక.

    ఓడ బయలుదేరిన తర్వాత అతను రేవు గోడవద్దనుండి   వెళ్ళిపోయినాడు, వంగిన వీపున యెవరికీ కనపడని మహా భారం మోస్తూ.

            “మెజి డాల్టన్‌” నిరపాయంగా బాస్ఫరస్ జలసంధీ , జిబ్రాల్టర్‌  జలసంధీ దాటింది. ఇంజన్లు సక్రమంగా పనిచేస్తూ వుండినాయి. ఒదేస్సలో వేసుకొన్న బొగ్గు శ్రేష్ఠమైనది. సిబ్బంది. సక్రమంగా పనిచేస్తూ వుండినారు,  ఓహిడ్డీ మాతం ప్రతి ఉదయం తప్ప తాగి తన గదిలో పండుకొనేవాడు.

     జిబ్రాల్టర్‌ తర్వాత ఓడ తెల్లని నురుగు నిండిన విశాలమైన అట్లాంటిక్ మహాసముద్రలో ప్రవేశించి, అయిదు వందల యేండ్ల క్రితం మొండి జినోవావాడు* కనిపెట్టిన మార్గం వెంట ప్రయాణించింది.

   ఓడ మహాసముద్ర  ప్రయాణం పారంభించిన మొదటి రాత్రే,వాచ్‌మన్‌ల కనుల ముందరే  ఓహిడ్డీ సముద్రంలో దూకినాడు. తుఫాను వాతావరణం వుండినందున, సముద్రంలోకి  పడవను దింపడం  ప్రమాదకరంగా వుండింది. మెకానిక్‌ మరణించినట్టు కాప్టెన్ జిబ్బిన్స్‌ ఓడ దినచర్య పుస్తకంలో రాసుకున్నాడు.

    “మెజి డాల్టన్‌” అట్లాంటిక్ మహాసముద్రంలో పదకొండు రోజులు ప్రయాణించింది. పండ్రెండవ రోజున ఓడ న్యూఆర్లయన్స్‌ రేవు చేరి, రేవుగోడవద్ద ఆగింది.   

      యజమాని కంపెనీ అధిపతితో కలిసి ఓడవద్దకు వచ్చినాడు. వేగంగా, జయప్రదంగా , జరిగిన ప్రయాణానికి గాను కాప్టెన్ జిబ్బిన్స్‌కు కృతజ్ఞత తెలపడానికి వాళ్ళు డెక్కుమీదికి పోయినారు.

     “బోనస్‌ కాక, మీకొక పత్యేకమైన బహుమతి యిస్తాము. లెన్‌స్పి కంపెనీ కూడా మీ సేవకు బహుమతి యిస్తుంది… మరి, ఒదేస్సలోని యిబ్బందిని యెలా పరిష్క రించినారు?”

   కాప్టెన్ జిబ్బిన్స్‌ తల వంచినాడు.  “కృతజ్ఞుణ్ని., అది యేమీ లేదు లెండి. చెప్పవలసిందేమీ లేదు,” అన్నాడు కాప్టెన్.

     అతను మామూలు లాగే బంగారు చారల నీలం టోపీ పెట్టుకొనివుండినాడు, అతని నోట్లో చాలా చాలా పండ్ల కచ్చులు తిన్న కాప్టెన్ ల పైపు వుండింది. కాప్టెన్ జిబ్బిన్స్‌ ముఖం నున్నగా, నిశ్చలంగా వుండింది.

      ఆ రాత్రి సిబ్బంది నగరంలోకి పోయినప్పుడు ఓడమీద యిద్దరు వాచ్‌మన్‌లు మాత్రమే వుండినారు. కాప్టెన్ జిబ్బిన్స్‌ యింజన్‌గదిలోకి దిగిపోయినాడు. అతను పెద్ద కొక్కెం తీసుకొని గొట్టం లోపలికి దూర్చి, దానితో చాలాసేపు లోపల కలబెట్టినాడు. దానిని అతను వెనక్కి లాగినప్పుడు, అతని కాళ్ళవద్ద చిన్న తలపుర్రె,యెముకలూ పడినాయి. కాప్టెన్ మళ్ళీ కొక్కెం దూర్చి లాగినాడు. యీసారి గలగల శబ్దంతో యేదో నేలమీద పడింది. అతను

 ——————–

 * కోలంబస్‌

వంగి, చిన్న రేకు పెట్టె తీసుకున్నాడు. అది వేడికి సొట్టలు పోయి వుండింది. చేతి రుమాలు జేబులోనుండి కత్తి, తీసుకొని, దానితో అతను పెట్టె తెరచినాడు. దానిలో అతనికి కొన్ని రాగి గుండీలూ, నల్లగా కమలిన డాలరూ  కనిపించినాయి. జిబ్బిన్స్‌ పెట్టె మూసి జేబులో వేసుకొన్నాడు. తరువాత మోకాళ్ళమీద వంగి చేతిరుమాలు పరచి దానిలో యెముకలూ, తలపుర్రె పెట్టినాడు. డెక్కుమీదికి వచ్చి అతను చుట్టిన చేతిరుమాలును నీళ్ళలోకి పారి వేసినాడు.  తన కాబిన్‌లో బల్ల వరకు వచ్చి, విస్కీ సీసా తీసుకొని గ్లాసులో పోసినాడు, నింపిన గ్గాసు నోటిదగ్గరికి తీసుకొన్నాడు, కానీ తాగలేదు. ఒక నిముషం అలా నిలబడి, చేతితో ముఖం చరచి, కిటికీదగ్గరికి వెళ్ళి విస్కీ బయటికి పోసినాడు.

    మరుదినం ఉదయం కాప్టెన్ తనకు బాగా తెలిసిన కంసాలివద్దకు పోయి, తన వెండి పాగాకు పెట్టెకు ఆ డాలరును అతికించమని కోరినాడు.  “యెక్కడి దీ డాలరు?” అని అడిగినాడు కంసాలి, డాలర్‌ను తన మెత్తని చేతిలో అటూ యిటూ తిప్పుతూ.

   కాప్టెన్ జిబ్బిన్స్‌ కనుబొమలు ముడివేసినాడు.

    “నాకు చెప్పడం యిష్టం లేదు. అదొక విషాద కథ, కానీ యీ నాణ్యాన్ని జ్ఞాపకార్థo గా వుంచుకోవా లనుకున్నాను.” అతను వినయంగా కంసాలివద్ద సెలవు తీసుకొని, వీధిలోకి పోయినాడు. భార్యనూ, పిల్లలనూ చూస్తానని అతనికి సంతోషంగా వుండింది. అర్జంటు రవాణాకుగాను తనకు బోనస్‌ వచ్చిందని వాళ్ళతో చెప్తాడు.

    అతను ప్రశాంతంగా, భవిష్యత్తును గురించి నిస్సందేహంగా వుండినాడు. వీధిలోని కోలాహలపు గోలగుండా యిండ్లు దాటిపోయినాడు. మందమైన గాజు కిటికీల వెనక, గణక యంత్రాల టకటకలమధ్య, నిర్జీవమైన నిగూఢమైన దురాశ పని సాగుతూవుండింది.

   *      *    *

బోరిస్ లవ్రేన్యోవ్ 1891లో హెర్సొన్లో పుట్టాడు. సముద్రమూ, ప్రమాదభరితమైన సాహసకృత్యమూ; అతని పుస్తకాలలో ఎప్పుడూ కలిసివుంటాయి. దీనికి మూలం ఏమిటంటే, అతను హైస్కూలులో ఐదవ తరగతి విద్యార్థిగా వుండగా రేఖాగణితంలో హీనమైన మార్కులు వచ్చాయి. అప్పుడతను అలెగ్జాండ్రియాకు పారిపోయి, ఒక విదేశ వర్తక నౌకలో రెండు నెలలు పని చేశాడు; తరువాత అతన్ని బలవంతంగా యింటికి తీసుకపోయారు.

యింటినుండి పారిపోయినాడంటే, అతనికి కుటుంబంతో ఘర్షణ వచ్చినందువల్ల కాదు. అది అతని కాల్పనికవాదంవల్లా, చురుకైన స్వభావంవల్లా జరిగింది.

“అర్హంటు రవాణా” అనే కథ పాత రష్యన్ సాహిత్యపు మానవతావాద, వాస్తవికవాద ధోరణులను కొనసాగించి, గత కాలపు క్రూర ఆచారాలను వర్ణిస్తుంది. “యెలక” అనే మారుపేరు గలిగి, బాయిలర్ శుభ్రం చేసే పదకొండేండ్ల కుర్రవాని ఘోర మరణం గురించిన కథలో రచయిత ఆస్తిపరులయొక్కా, వాళ్ల గులాముల దృష్టిలో మానవ ప్రాణానికి గం తృణప్రాయమైన విలువను కన్నులకు కట్టినట్లు చిత్రిస్తాడు.

యీ కథ నల్ల సముద్రపు రేవు పట్టణమైన ఒదేస్సలో జరుగుతుంది. సోవియట్ పాఠకునికి యీ మాట మొదటి రష్యన్ విప్లవపు ప్రారంభాన్ని, “పాత్యోమ్కిన్” యుద్ధ నౌకలో 1905లో జరిగిన తిరుగుబాటును, జ్ఞాపకం చేస్తుంది.

నిశితమైన విషయంపట్ల అనురక్తి, దానిని ఒక క్రమంలో యేర్పాటుచేసే సామర్థ్యమూ బౌరీస్ లవ్రేన్యోవ్ ప్రజ్ఞలో అవినాభావపు భాగం. “సాహిత్యం ఉద్రేకపరచాలి, గగుర్పాటు కరిగించాలి, పుస్తకమంతా ‘ఒక్క గుటక’లో చదవాలి’ – యిలా సూత్రీకరించినాడు అతను.

బోరిస్ లవ్రేన్యోవ్ 1959లో మరణించాడు. చివరి రోజులదాకా అతను సాహి త్యంలో చురుకుగా కృషిచేసాడు. 1924లో రచింప బడిన “నలభై ఒకటవవాడు” అతని ప్రజ్ఞ యొక్క, ఆసలైన మణిపూసగా నిలుస్తుంది.

బోరిస్ లవ్రేన్యోవ్

Spread the love

One thought on “అర్జంటు రవాణా

  1. ఇలాంటి కథలు మళ్ళీ ప్రచురించి నాలాంటి బలహీనుల్ని మరింత బేలగా ఎందుకు మారుస్తారండి. అప్పుడెప్పుడో మొదటిసారి చదివినప్పుడే గుండె జారిపోయింది. ” అర్జంటు రవాణా ” కథని మళ్ళీ చదవడం అంటే వేదనని కౌగిలించుకోవడమే. కన్నీళ్ళని తాగడమే. కొన్ని కథలు, కొన్ని పాత్రలు మానని గాయాలై జీవితాంతం సలుపుతూ ఉంటాయి. అలాంటి పాత్రల్లో ఈ కథలోని మీత్క ఒకడు. మీత్క నాణాన్ని.. తుమన్యాన్ కథ గిఖోర్ లో గిఖోర్ తన చెల్లి కోసం దాచుకున్న రంగురంగుల గుడ్డ పీలికల్నీ గుర్తుచేసుకుంటే కడుపులో ఎవరో చెయ్యి పెట్టి దేవినట్టు ఉండటంతో పాటూ, నా కాలేజీ రోజుల్లో మిత్రుడొఖడు తను పాడిన “పాలబుగ్గలా జీతగాడా ” పాటలోని ఒక చరణం గుర్తొస్తుంది .

    “బేగం బజారు లోనా పది పైసల కొకడబ్బా ..
    మోయలేకా మోయలేకా మల్లిగాడూ మోసే డబ్బా ..”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *