గుండె నిండా గాయాలేనా! రాక్షస చేతలకు సమాధానమిద్దామంటే సున్నితమైన వీణేమో నా హృదయం తీగలు తెగుతున్నట్లు ప్రకంపనలు! పోనీలే పోనీలే అని సమాధానపరుస్తున్నది ఎవరెవరి సంతృప్తి కోసమో నేనో బాధాతప్త రహస్యంగానే మిగిలిపోవాలి కామోసు ఎవరెన్ని మాటలైనా చెప్పండి ద్వేషాలు మీ రక్త సంబంధాలు మాత్రమే కాదు మీ నరం లేని నాలుకను అంటి పెట్టుకున్న లాలాజలంతో పాటు ఊరే విషపు మాటల తుట్టె సగం ఆకాశం విరిగి వొరిగిపోయేదాకా సముద్రమంత సహనం కుంగి కుశించిపోయేదాకా దురహంకార మీసాల చేతబడులను సమాజం చచ్చుబడిపోయిన తన గుండెనప్పగించి చూస్తూనే ఉంటుంది నువ్వు చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయేందుకు నేనెప్పటికీ దృతరాష్ర్టుడి కౌగిలింత కన్నా బలమైన గాఢ నిద్రగానే మిగిలిపోవాలి రెప్పలకంటుకోని కలగానే కరిగిపోవాలి సంప్రదాయాల సన్నని దారంతో మీరు ద్వేషంతో పేనిన సుగంధభరిత ఉరితాడుని కదా నే వాడి రాలిపోయినా నవనాడులు తెగిపోతున్నా అనురాగభరిత అర్ధాంగిగా తనువు చాలించాలి ఆచారాల అంగట్లో పతివ్రతగా మిగిలిపోవాలి కూలిపోతున్న మనశ్సరీరాల సాక్షిగా నేనో పసిడికాంతుల పూజా పుష్పాన్ని!!