పగలు మెరిసే నక్షత్రాలం

అడుగు తీసి అడుగు వేసినప్పుడల్లా
కాలి కింద కదులుతున్న సంకెళ్ళ చప్పుడు
సతీ సహగమనాలు అంతఃపుర నిర్బంధాలు
కన్యాశుల్కాల ఉచ్చులు తెంపుకుని ఎగిరే ఆత్మస్థైర్య పద్యాలం

అబలలు ఏడుమల్లెలెత్తు సుకుమారులు 
అభూత కల్పనలు చెరిపేయండి
వంటింటి కుందేళ్ళు ఇంటి బావికప్పలు
అరిగిపోయిన విశేషణాలు విసిరేయండి
వాస్తవం కళ్ళజోడు పెట్టుకుంటే మేలు

ఎండిన పంటలు అందని ఎరువులు
పురుగుల మందులు భోంచేసిన రైతులు
అప్పుల ఉరితాళ్ళకు వేలాడే పిరికిపందలు
బాల్యంలో తండ్రి యవ్వనంలో భర్త
వృద్ధాప్యం లో కొడుకు పాత వాసన కొట్టే శ్లోకాలు
చిన్నప్పుడు అమ్మఒడికోసం అల్లాడే పసిపాపలు
తారుణ్య సీమలో సహచరి పరిష్వంగం కోసం
ముసలితనం భూతం భయపెడుతున్న వేళ
ఊతకర్ర అర్థాంగి కోసం ఆరాటం
మగమహారాజులని
పురుషాధిక్య సింహాసనాలెక్కించినా
కన్నునొచ్చినా కాలునొచ్చినా
ఒంటరితనం బెంగల గుహలో కూరుకుపోయి చిక్కిశల్యమైన అభాగ్యులు 
ఆత్మహత్యల రుతువులో
అకాల మృత్యువు వరించినపుడు
రెక్కలు రాని పిల్లలకు రెక్కలు మొలిపించి
కుటుంబం కాడిని మోసిన ధీరులం

యౌవన రుతువు పెనుభారమై
జూలు విదిల్చిన కోర్కెల గుర్రానికి కళ్ళెం బిగించి
ఒంటరి స్త్రీలపై మోహపు చూపుల మత్తు జల్లే
పితృస్వామ్య వ్యవస్థలో
ధైర్యం తాడుపై గమ్యాన్ని చేరే సాహసమూర్తులం

మహిళలు మాన్యులంటూనే
దేహపుస్తక పుటలు కొరుక్కు తినే
చెదపురుగుల
పాతరాతియుగాల
భావజాలాలను బుల్డోజర్ తో తోక్కేసి
అంతరిక్ష సీమల పట్టపగలే మెరిసే నక్షత్రాలం
Mandarapu Hymavathi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *