ఎంతసేపు నేను నదినంటావు కాని అన్నిసార్లు నేను సముద్రినే! అలలు,అలజడులు ఏ ఆత్మలను తట్టని ఆక్రందనలు ఏ కనుచూపుమేరకు కనిపించని కల్లోలాలు.. ఉఛ్వాస నిశ్వాసలల్లే ఆటుపోట్ల ఎగపోతల్ని నువ్వు ఎరిగుండవులే! నా అస్తిత్వం నీకు అడ్డనేమో! నన్ను నదిని చేసుంటావు! అన్నింటిని ఎదుర్కొన నా తోడొస్తానంటే చెప్పు! ఆగకుండా వచ్చి ఆలింగనమిస్తా! ఆ తీరానికి ఆనకట్టయిన కన్నీటి ఉప్పుగడ్డల్ని కరిగిస్తానని చెప్పు! నీతో కలిసేందుకై కమ్మగా కరిగిపోతా! ఆ నిద్రలేని అలలకు అమ్మలా జోలపాడతానను! నీ జట్టుకట్టి అడ్డుకట్టల ఆటకట్టించనూ! లేకపోతే నాకెందుకు చెప్పు! కమ్మని,నువ్వు నమ్మిన నదిని కాదని చుక్క దాహాన్ని తీర్చని ఉప్పగా నేనెందుకు?