పున్నమి రాత్రుల ప్రయాణాలలో
మనతోపాటు ప్రయాణించే చందమామలా
ఎప్పుడూ ఒక నిఘాకన్ను మన వెన్నంటే వుంటుంది ,
.
వధ్యశిలమీద నిలబెట్టినపుడల్లా
నిందారోపణల సాక్ష్యాల కోసం
మన బంధుగణం , మిత్రబృందంలోనే
కోవర్టులు నియమించబడతారు .
ప్రతి మాటా రకరకాల విపరీతార్ధాలతో చేరిపోతూ వుంటుంది.
.
ఫోన్స్ కి రహస్యపు స్పీకర్లు అమర్చబడి వుంటాయి
మాటాడే ప్రతిమాటా రికార్డు చేయబడుతుంది
సౌండ్ మిక్సింగుల ఎడిటింగులతో
తయారయిన కంటెంట్
నిశ్శబ్ధంగా ఒక ఫోల్డర్‌లో దూరిపోతుంది.
.
నేరారోపణ రుజువుచేయుటకోసం
మనకోసమొక తెహల్కా డాట్ కామే స్పృష్టింబడుతుంది.
మన ప్రతి చర్య పైనా దర్శకత్వపు ప్రతిభతో
డాక్యుమెంటరీ తయారుచేయబడుతుంది
.
అవసరమయినప్పుడు
ట్రంపుకార్డులా బయటకు తీయడానికి
మనం మాట్లాడేమాటలన్నీ
మస్తిష్కపు పొరల్లో ఎటూ బద్రపరచబడి వుంటాయి .
.
పూర్తిగా అవసరాలు తీరిపోయి
వట్టిపోయిన గోవులా మారిపోయిన మరుక్షణం
మనమీద ఫైనల్ ఛార్జ్ షీట్ ప్రిపేరవుతుంది
.
మనకే తెలియని మన విషయాలు
వాటికి ఆపాదించబడిన అర్ధాలు,
చూసి ఆశ్చర్యపోతుండగానే
అంతిమతీర్పు వెలువడుతుంది,
.
మనకోసం ఒక న్యాయస్థానం
కల్పించగలిగినపుడు మాత్రమే
మనమేదైనా నిరూపించుకోగలమని
అర్ధమయ్యాక,
ఇక అప్పుడు ..
మెడ వెనుక వెన్నుపూస విరిగే శబ్ధం కోసం ఎదురుచూడడమొక్కటే
మనం చేయవలసింది.