ఒకానొక అపరాత్రి
వాగై పొంగుతున్న వేళ
గుట్టుగా పొగిలే ఆ ఇంటిని
చీకటి అంచులు కప్పుకున్నాయ్
దోపుకున్న కొంగుని చీరి
గుండె మంట ఆర్పని
మందు సీసాలో వత్తి చేసి
ఆమె ఓ దీపం బుడ్డి వెలిగించింది
దీపశిఖ చివర హటాత్తుగా
ఓ మొరటు బీడీ పొగ ఆవరించింది
కసిగా వెగటుగా
అంటుకున్న గంధక స్పర్శ
ఆమె గాయపు దేహంమీద బుసలు కొడుతోంది
లోపల బద్ధలయ్యే
అగ్ని పర్వతపు సెగకి
కళ్ళలో ఉబికే
లావా నిప్పుదనం
అలలుగా తెగిపడినపుడు
లల్లాయి బుడ్డి
అందని నాడిలాగా కొట్టుకుంటోంది
ఇపుడైతే అంతా నిశ్శబ్దమే కానీ
తెల్లారితే నానా మాటలూ ఉసిళ్ల రొదలా రాలిపడతాయి
కొలిమిలో కణిక లా
లేచి వీచే గాలి
ఏదో రహస్యపు విధ్వంసం చెవిలో ఊదినట్టు
దీపాన్ని చీకటికి వార్చేసి
ఆమె బయటికి నడిచింది
పీలికైన కొంగు
దోపుకు అందదు కదా
వదిలేయడమే పదిలం
దీపం దావానలమై
ఎగిసి పడుతున్న కాంతిలో
స్వేచ్చగా ఎగిరే కొంగుతో
ఆమె ఇప్పుడు
వెలుగుతున్న కొత్త ఉదయం