ఎన్ని సముద్రాలను దాటినా వేల నదులను ఈదినా నాదైన రోజు దొరకలేదు ఉదయాలు సాయంకాలాలు ఎప్పటిలాగే నిస్తేజంగా నిరాసక్తంగా మృదువుగా నవ్వే పూలను పలకరించే సమయం లేదు అందమైన వాక్యాలను కళ్ళలో వేసుకుని మురిసేంత విరామం లేదు ముందు రోజే పప్పు నాని మల్లెపూలలాంటి మెత్తని కుడుములు పొద్దున్నే నాలుకపై వాలాలి మూడు పూటలూ ఆకలి మంటలను చల్లార్చడానికి పలు రకాల కసరత్తులు చేయాలి ప్రణాళికలు వేయాలి రాత్రులు పొయ్యి కలలోకొచ్చి కలవరపెడుతోంది మరునాటి కారేజీ నిదురపోనీయకుండా కావలి కాస్తోంది ఈ వంటిల్లు నా వెనుకే… నేను దానిని ఆనుకునే…. గరిటెలు అట్లకాడలు కవచకుండలాలై నా శరీరభాగాలై నడుస్తూ ఆ నాదైన నా ఆధీనంలోని అపురూపమైన రోజు కోసం ఇంకెంత నడవాలి మరెంత ఎదురు చూడాలి కాలమా ఈ ప్రశ్నకు జవాబు చెప్పకుండా ఎందుకు ముఖం చాటేస్తున్నావు