ఊహల్లోనైనా ఊహించగలవా

సృష్టి స్థితి లయల్లో దగ్ధమైనా
చివరి చితా భస్మం నుండి 
తిరిగి పురుడు పోసుకుని 
జన్మకు ప్రతి సృష్టి తానై
నింగిలా నిలబడిందే గాని
నక్షత్రం లా రాలిపడలేదు

తను ఆఖరన్న ప్రతిసారీ 
మళ్లీ మొదలై
ఖేదాన్ని వేరుకు నీరు లా ఒంపి
తొలి పూతకు మారాకు వేసి
సజీవమైందే గాని తానెపుడూ
మరణించలేదు 

కాలం రేఖ మీది బ్రతుకు ఆటలో 
తడబడని తాను 
శిక్షలు హక్కులు పోరాటాల క్రమంలో 
అపుడపుడూ ఓడించి ఒరిసిన గాయం
చిమ్మింది ఎరుపైనా 

జీవన చిత్రం లో సప్త వర్ణాల 
దృశ్య కావ్యంగా రంగులద్దిందే గాని 
తానేమి నిస్సహాయంగా చేతులు 
ముడుచుకు కూచోలేదు

పిడికిలి బిగించి ఏ శపధాలు చెయ్యని తిను 
కొన్ని కాలాల తరబడి పుడమి పైని
రణక్షేత్రంలో సహనాన్ని ధరించి 
తనదైన క్షమైక నైజంతో
విజేత గానే నిలుస్తోంది 

అందుకేనేమో స్త్రీ తత్వాన్ని ఊహల్లో నైనా 
ఊహించడం ఎవరికైనా తరమా........ .
Ramanujam Sujatha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *