అధ్యాయం-17
వరి ఇంకా పూర్తిగా కుప్ప నూర్చి ఇంటికి తీసుకురాకముందే గోధుమ కాలం వచ్చేసింది. సారవంతమైన భూమి దగ్గర, కొండ ప్రాంతం దగ్గర ఆకులు ముడుచుకుపోయి, పచ్చ రంగులోకి మారితే; కోతలు అయిపోయిన చోట ఉన్న చెట్ల కాండాలు ఎండిపోతూ ఉన్నాయి.
ఈ సారి పంట బాగా పండింది. ధాన్యం పై నుండి చూస్తేనే నిండుగా, ఎప్పటికన్నా పుష్కలంగా ఉన్నట్టు కనిపిస్తుంది.
తన భార్యతో చర్చించాక పాంటెలి తన కొడుకు పెళ్ళి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాడు. ఒకవేళ కోర్షునోవులతో పెళ్ళి ఖాయం అయితే, ఆగస్టులో చర్చిలో జరిగే ఆఖరి పండుగ వరకు పెళ్ళిని వాయిదా వేయాలన్నదే ఆ నిర్ణయం.
అప్పటికి కోర్షునోవుల నుండి సమాధానం అడగలేదు; ఇప్పుడు ఇంకా పంట కోతల పనితో పాటు, రాబోతున్న పండుగ సన్నాహాలు కూడా చూసుకోవాలి.
వారు శుక్రవారం నాడు మూడు గుర్రాలతో కోతకు వెళ్ళారు. పాంటెలి వెనుక ఉండి, బండిని బాగు చేస్తున్నాడు, దానిలో తర్వాత ధాన్యం తీసుకురావాలి కనుక. పెట్రో,గ్రెగరి కోత యంత్రంతో ముందుకు కదిలారు.
ముందు సీటులో పెట్రో కూర్చున్నాడు. దానిని పట్టుకుని నడుస్తూ ఉన్నాడు గ్రెగరి, అతని ముఖం విచారంగా ఉంది. కండరాలు దవడల నుండి బుగ్గ వరకు బిగుసుకుంటున్నాయి. తమ్ముడి మొహం చూడగానే పెట్రో అతను కోపంగా,మనసు ఏం బాగోలేకుండా ఉన్నాడని,ఆ స్థితిలో ఉన్నప్పుడు అతను ఏం ఆలోచించకుండా,ఏ పిచ్చి పని చేయడానికైనా సిద్ధంగా ఉంటాడని గ్రహించాడు. అయినప్పటికి గోధుమ వర్ణంలో ఉన్న తన మీసాలను మెలి తిప్పుతూ, తమ్ముడితో పరిహాసలాడసాగాడు.
‘ఆమె నాకు చెప్పింది,నిజంగా చెప్పింది!’
‘అయితే సరే,చెప్తే చెప్పని’, గ్రెగరి మీసం కింద భాగాన్ని కొరుకుతూ గొణిగినట్టు అన్నాడు.
‘నేను అప్పుడే కూరగాయల తోట నుండి వెళ్తున్నాను. అప్పుడు ఏం విన్నానో తెలుసా?మెలఖోవుల పొద్దుతిరుగుడు చెట్ల ఉన్న చోట నుండి మాటలు వినిపించాయి’,అని ఆమె చెప్పింది.
‘ఇక ఆ విషయం వదిలేయ్ పెట్రో.’
‘ఆ గొంతులు వినబడేటప్పటికి కంచె పై నుండి నేను తొంగి చూశాను’, అని కూడా చెప్పింది.
గ్రెగరి కళ్ళు పదేపదే అదురుతున్నాయి.
‘నువ్వు ఆపుతావా లేదా?’
‘నీకేమైంది?నన్ను పూర్తిగా చెప్పని.’
‘జాగ్రత్త,పెట్రో. లేకపోతే ఇప్పుడు కొట్టుకోవాల్సి వస్తుంది’, గ్రెగరి బెదిరిస్తున్న స్వరంలో అని వెనుక ఆగిపోయాడు.
పెట్రో కనుబొమ్మలు ఎగరేసి,గుండ్రంగా తిరిగాడు. ఇప్పుడు అతని వీపు గుర్రాల వైపుకి, ముఖం గ్రెగరి వైపుకి ఉంది.
‘అవును,నేను కంచె గుండా చూశాను. అక్కడ ఆ ఇద్దరూ ఉన్నారు, ఒకరి చేతులు ఒకరు పట్టుకుని’,అని ఆమె కొనసాగించింది.
‘ఎవరు వాళ్ళు?’ అడిగాను నేను.
‘అక్సిన్య అష్టకోవా,నీ తమ్ముడు’,అంది ఆమె.
‘సరే’,అన్నాను నేను…
ఆ యంత్రం వెనుక ఉన్న చిన్న పంగలకర్ర లాంటిది గ్రెగరి అందుకుని పెట్రో మీదకు దూకాడు. పెట్రో ఒక్కసారిగా పగ్గాలు వదిలేసి, తన సీటు నుండి కిందకు దూకి,గుర్రాల ముందు నుండి పరిగెత్తాడు.
‘ఓ…నీకేమైంది? దయ్యం పట్టిందా? పిచ్చి పట్టినట్టు చేస్తున్నావు…’
తోడేలులా గుర్రుమంటూ,ఆ పంగలకర్ర ను పెట్రో మీదకు విసిరాడు. పెట్రో కిందకు జారి మోకాళ్ళ మీద కూర్చున్నాడు.అది అతని తల మీదుగా నేల మీద రెండు అంచుల లోతులో దిగింది.
గుర్రాల పగ్గాలు అందుకున్న పెట్రో ముఖం నల్లబడింది.
‘ఒరేయ్! కాస్త ఉంటే నన్ను చంపేసేవాడివి!’
‘అవును.’
‘నువ్వు ఒక వెధవ్వి! పిచ్చి పట్టిన దయ్యానివి!మీ నాన్న జాతి అయిన ఆ కొండ మనుషుల పోలికలు వచ్చాయి నీకు!’
గ్రెగరి నేల లో దిగబడిన పంగలకర్ర ను బయటకు లాగి,అప్పటికే కదిలిన యంత్రాన్ని అనుసరించాడు.
పెట్రో తమ్ముడిని రమ్మన్నట్టుపిలుస్తూ చేయి ఊపాడు.
‘ఇటు రా…నాకు అది ఇవ్వు.’
పెట్రో పగ్గాలను ఎడమ చేతిలోకి మార్చుకుంటూ, పంగలకర్రను ఒక చేతిలోకి తీసుకుని, గ్రెగరి వీపు మీద దానితో గట్టిగా రుద్దాడు.
‘దీనిని నేను సరిగ్గా ఉపయోగించలేకపోయాను!’, పెట్రో తమ్ముడి వైపు చూస్తూ అన్నాడు.
ఒక నిమిషం తర్వాత ఆ ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుని,సిగరెట్లు వెలిగించి, పగలబడి నవ్వుకున్నారు.
కోతలు అయిపోయాక, పనల మోపు కట్టుకుని అటువైపు నుండి ఇంటికి వెళ్తున్న ఖ్రిస్టోన్య భార్య గ్రెగరి తన అన్న మీద పంగలకర్ర విసరడం చూసింది. ఆమె తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని ఉన్నా,మధ్యలో గుర్రాలు,కోత యంత్రం అడ్డు రావడంతో ఏమి చూడలేకపోయింది. తన ఇంటి దగ్గర ఉన్న సందులోకి వెళ్ళగానే, ఆమె తన పొరుగున ఉండే స్త్రీ దగ్గరకు వెళ్ళి అరిచి చెప్పింది.
‘క్లిమోవ్న! పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆ పాంటెలికి చెప్పు అతని కొడుకులిద్దరూ ఫోర్కులతో కొట్టుకుంటున్నారని. ఆ గ్రీక్ష ఎంత ఉన్మాదంగా చేశాడో తెలుసా… వాడు పెట్రోను పంగలకర్ర తో పొడిచాడు,పెట్రో కూడా గట్టిగా కొట్టాడు,అక్కడ రక్తం ఏరులై ప్రవహిస్తుంది.
చిరాకు పెడుతున్న గుర్రాల మీద అరవడం విసుగొచ్చి, దాని బదులు పెట్రో గట్టిగా ఈల వేస్తున్నాడు. దుమ్ముతో నల్లగా మారిన తన పాదాన్ని కోత యంత్రం కింద కడ్డీ మీద ఉంచి,దానిని కదిలిస్తూ కోత కోసిన దానిని యంత్రం నుండి కిందకు దులుపుతున్నాడు. గుర్రాల వెనుక దోమలు మూగుతూ,రక్తం పిలుస్తూ ఉంటే,అవి తోకలు ఊపుతూ,అసహనంగా అటూఇటూ కదులుతున్నాయి.
ఆ పొలాలు ఉన్న దారంతా ఆ గ్రామం ప్రజలు అటూ ఇటూ పంటల హడావుడితో తిరుగుతూనే ఉన్నారు. కోత యంత్రాల కత్తులు పండిన పంటను కోస్తూ ఉంటే,అదంతా ఆ ప్రదేశమంతా ఆ ధాన్యంతో నిండిపోయింది. గుర్రాలను అదిలిస్తూ ఉన్న రైతులు చేసే ధ్వనులను అక్కడ బొర్రల్లో ఉన్న ఉడుతలు తమ అరుపులతో అనుకరించాయి.
‘ఇంకో రెండు కోతలు కోసి, మనం సిగరెట్ కాల్చుకుందాం!’పెట్రో కోత యంత్రం చేస్తున్న చప్పుడులో నుంచి తమ్ముడి వైపు చూస్తూ అరిచాడు.
గ్రెగరి సరే అన్నట్టు తల ఊపాడు. కోత పని వల్ల గ్రెగరి పొడిబారిపోయి,పగిలిపోయి ఉన్న తన పెదాలను అతి కష్టం మీద తెరవగలుగుతున్నాడు. ఊపిరి తీసుకునేందుకు ఒక్క నిమిషం ఆగి, యంత్రం మీద తన పట్టుని పంగల కర్ర మీదకు మార్చుకున్నాడు,దాని వల్ల ఏపుగా పెరిగిన గోధుమలను తేలికగా కోయవచ్చని. ఛాతీ దగ్గర అతనికి దురదగా అనిపించింది, టోపీ కింద నుండి చెమట కారుతూ ఉంది. వారు గుర్రాలను ఆపి,మంచి నీళ్ళు తాగి,సిగరెట్లు వెలిగించుకున్నారు.
‘ఎవరో గుర్రం మీద రహదారి గుండా వస్తున్నారు’, పెట్రో ఎండకు తన చేతులను కళ్ళ పైన పెట్టుకుంటూ అన్నాడు.
గ్రెగరి అటువైపు చూసి, ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశాడు.
‘అది నాన్నా.’
‘నీకు పిచ్చి పట్టినట్టుంది. ఆయన ఏ గుర్రం మీద వస్తాడు? మన గుర్రాలన్నీ ఇక్కడే కోత యంత్రాన్ని లాగుతున్నాయి కదా.’
‘ఆయనే.’
‘నువ్వే ఊహించుకుని చూస్తున్నావు,గ్రీషా!’
‘నిజంగా ఆయనే!’
ఒక నిమిషం తర్వాత కొద్దిగా దూరంలో ఓ గుర్రం, కొన్ని సెకండ్లకు దాని మీద స్వారీ చేస్తున్న వ్యక్తి కనిపించాడు.
‘నిజంగా నాన్నే!’ పెట్రో ఆశ్చర్యం,భయం కలగలిపిన స్వరంతో అన్నాడు.
‘ఇంట్లో ఏదో జరిగి ఉంటుంది’, వారిద్దరి మనసులో ఉన్న ఆలోచనను గ్రెగరి బయటపెట్టాడు.
దాదాపుగా ఓ రెండు వందల గజాల దూరంలో ఉన్నప్పుడు పాంటెలి అంతకుముందు కన్నా వేగంగా గుర్రాన్ని స్వారీ చేయసాగాడు.
‘మీ ఇద్దరి తోలు వలిచేస్తాను …వెధవల్లారా!’ వారిని చేరుకోకముందే గట్టిగా అరుస్తూ, కొరడాతో గుర్రాన్ని గట్టిగా అదిలించాడు.
‘ఆయనకు ఏమైంది?’పెట్రో కంగారులో తన మీసాన్ని కొరుకుతూ అన్నాడు.
‘ఎందుకైనా మంచిది,ఆ యంత్రం వెనక్కి వెళ్దాం. దేవుడి సాక్షిగా చెప్తున్నా…ఆయన ఖచ్చితంగా ఆ కొరడా మన మీదే వాడేలా ఉన్నాడు. మనం అసలు విషయం తేల్చుకునే లోపు మన చర్మాలు వలిచేస్తాడు’,గ్రెగరి నవ్వుతూ అంటూ,తను చెప్పిన సూచన ప్రకారం యంత్రం వెనక్కి వచ్చాడు.
రొప్పుతూ ఉన్న గుర్రం కోతల కుప్పలు ఉన్న చోటుకి వచ్చేసరికి వేగం తగ్గించింది. పాంటెలి ఆయాసపడుతూ, కొరడాను తన తల పైన తిప్పుతూ ఉన్నాడు.
‘ఇక్కడ ఏం చేస్తున్నారురా వెధవల్లారా?’
‘కోత కోస్తున్నాము’, పెట్రో తండ్రి చేతిలోని కొరడా వంక భయంగా చూస్తూ చెప్పాడు.
‘ఎవడు ఎవడిని పంగలకర్రతో పొడుచుకున్నారు?దేని గురించి కొట్టుకుంటున్నారు?’
గ్రెగరి తండ్రి వైపుకి తిరిగి,అతను మాట్లాడుతున్నప్పుడు గొంతు దగ్గర కనిపిస్తున్న శ్వాసలను లెక్కిస్తూ ఉన్నాడు.
‘ఏ దుంగలకర్ర? దేని గురించి మాట్లాడుతున్నారు? ఎవరు కొట్టుకుంటున్నారు?’ పెట్రో కళ్ళు అదురుతూ ఉండగా తండ్రి వైపు చూస్తూ అడిగాడు.
‘అదే ….ఆ స్త్రీ… పరుగెత్తుకుంటూ వచ్చి అరిచింది, “నీ ఇద్దరు కొడుకులు పంగల కర్రలతో పొడుచుకుంటున్నారు!” ‘దాని సంగతి ఏమిటి?’ పాంటెలి అసహనంగా తన తిప్పి,పగ్గాలు వదిలేసి,రొప్పుతూ ఉన్న గుర్రం మీద నుండి కిందకు దిగాడు. ‘అందుకే నేను ఫెడ్కా స్యోమిష్కిన్ గుర్రం తీసుకుని వచ్చాను.అర్థమైందా?’
‘కానీ ఇది ఎవరు చెప్పారు?’
‘ఒక స్త్రీ!’
‘ఆమె చెప్పిందంతా అబద్ధం. ఆమె బండిలో పడుకుని అలా కల కన్నదేమో!’
‘ఆ ముసలి పీనుగ!’కీచుగా అరుస్తూ,గడ్డం పీక్కున్నాడు.
‘ఆ బక్కచిక్కిన ముసల్ది క్లిమోవ్న! దేవుడా! నేను ఆ ముసలి దయ్యాన్ని చంపేస్తాను!’ నేలను గట్టిగా తన్నుతూ, తన ఎడమ కాలితో కుంటుతూ నడిచాడు.
గ్రెగరి మౌనంగా తండ్రి పాదాల వైపు చూస్తూ,ముసిముసిగా నవ్వుకుంటున్నాడు. పెట్రో చెమట పట్టిన తన ముఖాన్ని తుడుచుకుంటూ తండ్రి మీదే దృష్టి నిలిపాడు.
అటూ ఇటూ కాసేపు తిరిగి,పాంటెలి నెమ్మదించాడు. తర్వాత కోత యంత్రం మీద ఎక్కి, పొలంలో కాసేపు తిరిగి,ఆమెను ఇంకా తిడుతూనే తీసుకువచ్చిన గుర్రం మీద ఎక్కాడు. అతను రహదారి గుండా స్వారీ చేస్తూ, ఇంటి దారి పట్టాడు. అతను తెచ్చిన కొరడా మాత్రం కుప్పల దగ్గరే ఉండిపోయింది. పెట్రో దాని వైపు తమ్ముడికి చూపిస్తూ,తల ఊపుతూ అన్నాడు.
‘మనకు కొద్దిలో తప్పిపోయింది కదా,కుర్రాడా! ఇది కొరడానా? ఇది కొరడా కాదు-కత్తిలా ఉంది-దీనితో ఒక మనిషి తల నరకొచ్చు!’
* * *
అధ్యాయం-18
కోర్షునోవులు ఆ గ్రామంలోనే ధనవంతులుగా పేరు పొందారు. 14 జతల ఎద్దులు, గుంపుల కొద్ది గుర్రాలు,మేలు జాతిగా ఎన్నదగ్గ ప్రోవాల్స్క్ జాతికి చెందిన గుర్రం సంతతి అయిన ఆడగుర్రాలు,
పదిహేను ఆవులు,ఎన్నో ఎద్దులు,కొన్ని వందల గొర్రెలతో పశుసంపద సమృద్ధిగా ఉన్న కుటుంబం
అది. వీటితో పాటు ఎవరి కన్ను అయినా చెదిరేలా ఉండే విషయాలు ఎన్నో ఉన్నాయి. వారి ఇంటి
విషయానికి వస్తే ఏ విషయంలోనూ మొఖోవులకు తీసిపోకుండా,ఇంకా వైభవంగా ఉంటుంది.
ఇనుప కప్పుతో చేసిన ఆ ఇంట్లో ఆరు గదులు, ఏ వాతావరణంలో అయినా ధృఢంగా ఉండేలా కట్టిన
గోడలు, ఈ మధ్యనే కొత్త టైల్స్ అమర్చిన బయటి డాబా;నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పండ్ల
మరియు కూరగాయల తోటలు. ఇంతకన్నా ఎక్కువ ఏ మనిషికి కావాలి? పాంటెలి తన కొడుకు
చూడటానికి మొదటి సంబంధం చూడటానికి వెళ్ళినప్పుడు ఆయన పిరికితనానికి, అయిష్టతకు
బలమైన కారణం ఇదే. కోర్షునోవులు తప్పకుండా తమ కూతురికి గ్రెగరి కన్నా మంచి వరుడినే
తీసుకురాగలరు. పాంటెలి వారు తిరస్కరిస్తారేమోనన్న భయంతోనే వారిని కలవడానికి అస్సలు
ఇష్టపడలేదు. కానీ ఇలినిచ్న, ఇనుముకు పట్టిన తుప్పులా, ఆయనకు విముఖత ఉన్నా,ఆ పెళ్ళి
సంబంధం మాట్లాడటానికి వెళ్ళేలా చేసింది. రహస్యంగా గ్రెగరిని,ఇలినిచ్నను, ప్రపంచాన్ని
తిట్టుకుంటూనే వెళ్ళడానికి ఒప్పుకున్నాడు పాంటెలి.
వారు ఆదివారం వరకు వేచి చూద్దామని నిర్ణయించుకున్నారు. ఈ మధ్యలో పచ్చటి పై కప్పుతో
విశాలంగా ఉన్న కోర్షుకోవుల ఇంట్లో నిశ్శబ్ద యుద్ధమే జరిగింది. పెళ్ళి వారు చూడటానికి వచ్చి
వెళ్ళిపోయాక,తల్లి ప్రశ్నకు బదులుగా ఆ అమ్మాయి, ‘నేను గ్రీక్షాను ప్రేమిస్తున్నాను.నేను పెళ్ళి
చేసుకుంటే అతన్నే చేసుకుంటాను’,అంది.
‘భలే మొగుడిని ఎన్నుకున్నావు తెలివిమాలినదానిలా!’అన్నాడు తండ్రి నిరసనగా.
‘చూడటానికి జిప్సీలా ఉన్నాడు,వాడి గురించి ఏవేవో చెప్పుకుంటున్నారు. వీడెనా నీకు తగిన భర్త,నా
బంగారుతల్లి?’
‘నాకు అతను తప్ప ఎవరూ వద్దు నాన్నా.’ నటాల్య కళ్ళు ఎర్రబడ్డాయి,కన్నీళ్ళు చెక్కిల్ల మీదకు
జారాయి.
‘నేను ఇంకెవరిని పెళ్ళి చేసుకోదల్చుకోలేదు. లేకపోతే నేను మెడ్ వెదిత్సా ఆశ్రమంలో సన్యాసినిగా
చేరిపోతాను .’
‘అతను తిరుగుబోతు,అమ్మాయిల వెంట పడతాడు,ముఖ్యంగా సైనికుల పెళ్ళాలను వదిలిపెట్టడు.
మొత్తం గ్రామం అంతా అతని గురించే మాట్లాడుకుంటూ ఉంది’, తన ఆఖరి అస్త్రాన్ని తండ్రి
ప్రయోగించాడు.
‘నేను పట్టించుకోను.’
‘నేను కూడా అస్సలు పట్టించుకోను. అలా అయితే నా భుజాల మీద ఉన్న భారం కూడా
వదిలిపోతుంది.’
ఆ ఇంటి పెద్ద కూతురు నటాల్య ఆ తండ్రికి ప్రియమైన కుమార్తె,అందుకే కూతురిని ఆయన
బలవంతపెట్టదలచుకోలేదు.
అంతకుముందు వసంత కాలంలో పెళ్ళిళ్ళు పేరయ్యలు ఎన్నో సంబంధాలు తెచ్చారు. ఎక్కడో
దూరంగా ఉన్న సుట్కాన్ నదీ ప్రాంతం దగ్గర ఉండే ధనవంతులైన కోసాక్కుల నుండి
ఖోపోర్,చిర్(ఇవి డాన్ నది ఉపనదులు)ప్రాంతాల వరకు ఎన్నో పెళ్ళి సంబంధాలు వచ్చాయి. అవేవీ
నటాల్యకు నచ్చలేదు;అందుకే ఆ పేరయ్యల శ్రమ వృధా అయిపోయింది.
కోసాక్కులకు ఉండే ధైర్యంతో, మాతృభూమి మీద ప్రేమతో, కష్టపడే తత్వంతో ఉన్న గ్రెగరిపట్ల
మిరోన్ గ్రిగొరీవిచ్ కు సదాభిప్రాయమే కలిగింది. కొన్నాళ్ళ క్రితం ఒక గుర్రపు పందెంలో అతను
గెలవడాన్ని స్వయంగా చూశాడు. కానీ ఆస్తి,అంతస్తుల్లో తనతో తులతూగలేని స్థితిలో ఉండటమే
కాకుండా;అతని గురించి వినవస్తున్న పుకార్ల వల్ల ఈ సంబంధం ఎందుకో మిరోన్ కు సమ్మతంగా
అనిపించలేదు.
‘అతను బాగా కష్టపడతాడు,ముఖం కూడా చక్కగా ఉంది చూడటానికి’, లుకినిచ్న భర్త చెవిలో రాత్రి
గుసగుసలాడుతూ,భర్త ఛాతీ మీద ఉన్న జుట్టును నిమిరింది. ‘ఇంకా నటాల్యకు అతను బాగా
నచ్చేశాడు…..ఈడుజోడు కూడా బాగుంటుంది.’
మిరోన్ భార్య ఎద వైపుకి తిరిగి, ‘ఇక నన్ను వేధించకు!తనను ఎవరికిచ్చి పెళ్ళి చేసినా నేను
పట్టించుకోను. ఆ దేవుడు నీకు కొంచెం కూడా బుర్ర పెట్టలేదు!’ “అతను చూడటానికి చాలా అందంగా
ఉన్నాడు…”హేళనగా అన్నాడు. ‘అతని ముఖంలో ఏమైనా పంటలు పండుతాయా?’
‘నేను పంట గురించి కాదు ఆలోచిస్తుంది.’
‘అయినా వాడి ముఖం ఎలా ఉంటే నీకు ఎందుకు? ఒకవేళ వాడు సరైన వాడైతే అప్పుడు
ఆలోచించాలి. నిజాయితీగా చెప్పాలంటే, టర్కీల కుటుంబంలో మన పిల్లను ఇవ్వడం
సాంప్రదాయానికే వ్యతిరేకం. మన వాళ్ళలోనే ఇవ్వాలని ఉంది నాకు…’గర్వంతో అన్నాడు.
‘వాళ్ళది బాగా కష్టపడే కుటుంబం,బాగానే బతుకుతున్నారు’,అతని భార్య ఇంకా గుసగుసలాడుతూనే ఉంది,ఓ చేయి అతని వీపు మీద వేసి,ఇంకో చేత్తో అతని చేతిని సున్నితంగా పట్టుకుని.
‘నన్ను వదులు,వదులుతావా లేదా! నీకు ఇక్కడ జాగా సరిపోవడం లేదా? దూడను ఆవు
పట్టుకున్నట్టు నన్ను ఎందుకు పట్టుకుంటున్నావు! నీకు నటాల్య విషయంలో ఏం చేయాలని ఉంటే
అదే చేయి. నీకు కావాలంటే ఆమెను ఓ వేశ్యతోనైనా వివాహం చేయి!’
‘కన్న బిడ్డల బాగు కోరి ఆలోచించాలి,ఆస్తుల గురించి పట్టించుకోకూడదు’,లుకినిచ్న వెంట్రుకలు
ఉన్న భర్త చెవిలో మెల్లగా గొణిగింది.
ఆమెను ఒక్కసారి విదిలించుకుని అతను గోడ వైపుకి తిరిగి పడుకున్నాడు. పడుకున్నట్టు గురక పెట్టాడు కాసేపటికి.
కోర్షునోవుల సంబంధం కుదిర్చిన మధ్యవర్తులు మళ్ళీ తమ ఇంటికి రావడం మెలఖోవులను
ఆశ్చర్యపరిచింది. త్వరగా ఆ కుటుంబమంతా పెళ్ళి వారింటికి బయల్దేరారు. ఆ సంతోషంలో ఇలినిచ్న
బండి మీద నుండి కాలు కింద పెట్టబోయినప్పుడు దాదాపు బండి తిరగబడినట్టు అయ్యింది. పాంటెలి మాత్రం కుర్ర పుంజుల ఒక అంగలో కిందకి గెంతాడు. కొద్దిగా కాలు నొప్పి పెట్టినా.అదేమి
పట్టించుకోకుండా ఇంట్లోకి నడిచాడు.
‘అదిగో వచ్చేశారు! ఆ దెయ్యం తెచ్చి ఉంటుంది’,మిరోన్ కిటికీలో నుంచి చూస్తూ చిన్నగా అరిచాడు.
‘అయ్యో దేవుడా! వంట చేసే హడావుడిలో నేను ఇంకా బట్టలు కూడా మార్చుకోలేదు’, లుకినిచ్న
కంగారుగా అంది.
‘నువ్వు ఏది చేయాలో అదే చేయాలి. వాళ్ళు నిన్ను చేసుకోవడానికి రావడం లేదు! అయినా నిన్ను
ఎవడు చేసుకుంటాడు!’
‘నువ్వు మొదటినుంచి రౌడీలానే ఉన్నావు,ఇప్పుడు ముసలివాడివి అయ్యాక ఆ బుద్ధులు ఇంకా
ఎక్కువయ్యాయి.’
‘ఇప్పటినుండి నోరు అదుపులో ఉంచుకో,ముసలి దయ్యమా!’
‘నువ్వు మంచి చొక్కా వేసుకుని,శుభ్రంగా ఉండొచ్చు కదా. నీ గూని మెడ వేలాడుతూ కనిపిస్తుంది.
నీకు సిగ్గుగా లేదా?ముసలోడా!’,అతని భార్య తిడుతూనే, అతనిని ఆసాంతం పరికించింది,అప్పటికే
పెళ్ళి వారు వాకిలిలోకి వచ్చేశారు.
‘నేను ఎలా ఉంటానో అలానే ఉంటాను. నేను చెత్త కుప్పలా ఉన్నా సరే వాళ్ళైతే ఈ సంబంధం
వదులుకోరు.’
‘మీ అందరూ బాగుండాలి!’ పాంటెలి గుమ్మం మీద నుండి పడబోతూ అన్నాడు. మరలా తన కీచు
గొంతుకు తనే సిగ్గుపడి,ఆ గోడ మీద ఉన్న దేవుడి పటం చూసి ప్రార్థించాడు.
‘శుభోదయం’, మిరోన్ తీక్షణంగా వారి వంక చూస్తూ అన్నాడు.
‘దేవుడి దయ వల్ల మంచి వార్త అందుకుని వచ్చాము.’
‘ఇంకా నిశ్చయం కాలేదు.’
‘నేను ఆ మంచి జరగడానికి దేవుడి మీదే భారం వేస్తాను.’
‘సరే.’
‘సరే,మిరోన్ గ్రిగొరీవిచ్, మీరు ఈ సంబంధం విషయంలో ఏమి ఆలోచించారో,ఏ నిర్ణయానికి
వచ్చారో తెలుసుకుందామని వచ్చాము.’
‘రండి,వచ్చి కూర్చోండి’, లుకినిచ్న తన పొడుగు గౌను ఆ నేలంతా తనతో పాటే ఇడుస్తూ, వారిని
ఆహ్వానించింది.
‘మీరు ఏమి ఇబ్బంది పడకండి.’
ఇలినిచ్న ఆ మాటలు జరుగుతూ ఉండగానే కూర్చుంది. మిరోన్ తన మోచేతిని, చక్కటి రంగుతో ఉన్న బట్ట పరిచి ఉన్న బల్ల మీద ఆనించి,మౌనంగా ఉన్నాడు. ఆ గుడ్డ నుండి తడిసిన రబ్బరుతో ఏదో కలిసినట్టు ఓ రకమైన వాసన వస్తుంది. ఆ గుడ్డ మధ్యలో రాచరిక వైభవానికి గుర్తుగా నికోలస్ చక్రవర్తి, తెల్లటి టోపీలు ధరించిన ఆ రాజ్య కుటుంబపు కన్యలు కలిసి ఉన్న బొమ్మ ఉంది.
ఆ నిశ్శబ్దాన్ని మిరోన్ చేధించాడు.
‘సరే ….మాకు ఈ వివాహం సమ్మతమే. మనం కట్నం విషయంలో ఒక మాటకు వస్తే వియ్యంకులం
కావచ్చు.’
అదే సమయంలో తన జాకెట్టు పై భాగంలో ఎక్కడి నుంచో ఇలినిచ్న తెల్లటి బ్రెడ్డు బయటకు తీసి,బల్ల
మీద పెట్టింది.
పాంటెలి ఆ శుభసందర్భాన్ని పురస్కరించుకుని క్రైస్తవ పద్ధతిలో ప్రార్థించబోయాడు,కానీ అలా
చేస్తున్నప్పుడు వయసుతో పాటు గట్టిపడి ముడతలు పడినట్టున్న అతని చేతివేళ్ళు ఒక వింత
ఆకారంలో వంకర తిరిగాయి;నల్లగా పెద్దగా ఉన్న అతని బొటనవేలు అనుకోకుండా యజమాని
గ్రహించకుండా చూపుడు మరియు మధ్య వేళ్ళ మధ్యలోకి వచ్చేసింది. ఆ లజ్జాపూర్వక చర్య నుండి
వెంటనే తేరుకుని, ఆ వృద్ధుడు తన నీలం రంగు కోటు జేబులో నుండి ఒక ఎర్ర బాటిల్ ను మూత
దగ్గర పట్టుకుని బయటకు తీశాడు.
‘ప్రియమైన బంధువులారా,ఇప్పుడు,దేవుడికి ప్రార్థన చేసి,ఒక గ్లాసు తాగి,మన పిల్లల భవిష్యత్తు
గురించి మాట్లాడుకుందాము.’
ఒక కన్ను మూసినట్టు పెట్టి, పాంటెలి మచ్చలతో ఉన్న వియ్యంకుడి ముఖంలోకి చూస్తూ, బాటిల్ మూత తెరిచాడు.
ఒక గంటలో ఆ ఇద్దరు ఎంత దగ్గరగా కూర్చున్నారంటే తారులా నల్లగా మెలి తిరిగి ఉన్న పాంటెలి గడ్డం,కోర్షునోవు గడ్డానికి తగులుతూ ఉంది. పాంటెలి ఊపిరి వదులుతూ ఉంటే ఉప్పు పెట్టిన దోసకాయల వాసన వస్తూ ఉంది. తను అనుకున్న కార్యాన్ని మొదలుపెట్టాడు.
‘నా ప్రియమైన బంధువులారా’,అతను చిన్న స్వరంలో మొదలుపెట్టాడు. ‘ఒకప్పటి నా
పూర్వస్నేహితుడా!’,’బంధువులారా’, అని గట్టి అరుపులోకి స్వరాన్ని మార్చాడు, అతను
మాట్లాడుతున్నప్పుడు ముందు పళ్ళు కనిపిస్తున్నాయి. ‘మీరు కోరినవి ఇవ్వడం నా శక్తికి మించిన పని.
ఒక్కసారి ఆలోచించు మిత్రమా! నువ్వు నా మీద ఎంత భారం వేస్తున్నావో. మేలు రకం బూట్లు-ఒకటి;
జంతువుల చర్మంతో చేసిన చక్కటి కోటు-రెండు; రెండు ఉన్ని దుస్తులు-మూడు; పట్టు శాలువా-
నాలుగు. ఎందుకు ఈ మంచి సందర్భాన్ని ఇలా చెడగొట్టడం!’
పాంటెలి తన చేతులు వెడల్పుగా చాచాడు.కోసాక్ లైఫ్ గార్డ్స్ లో పని చేసినప్పటి యూనిఫార్మ్ అలా చేయడంతో అది చిరిగిన శబ్దంతో,ఆ చిరుగు దగ్గర దుమ్ము రేణువులు కూడా గాలిలోకి లేచాయి.
మిరోన్ తన తల కిందకు దించి, ఆ బల్ల గుడ్డ మీదకు అప్పటికే దాని మీద పడ్డ వోడ్కా, దోసకాయ
ముక్కల నుండి చూస్తున్నాడు. దాని పైన చక్కగా అల్లికతో ఉన్న అక్షరాలను చదివాడు. ‘రష్యా
పాలకులు’,అతని కళ్ళు దాని కిందకు తిరిగాయి. ‘రష్యా సామ్రాజ్య చక్రవర్తి నికోలస్…’ మిగిలిన
అక్షరాలు ఒక బంగాళాదుంప తొక్క కింద ఉండిపోయాయి. అతను ఆ బొమ్మ వైపు చూశాడు: ఆ
చక్రవర్తి ముఖం ఖాళీ వోడ్కా సీసా కింద ఉంది. దాని వైపే చూస్తూ మిగిలిన శరీరంతో ఒక ఆకారాన్ని
ఊహించే ప్రయత్నం చేయబోతే,మిగిలిన శరీరం బొమ్మపై ఉన్న దోసకాయ విత్తనాల వల్ల సాధ్యం
కాలేదు.మిరోన్ కు తన రూపురేఖలతో ఉన్న కూతుళ్ళను తన టోపీ కింద తృప్తిగా నుండి ఆ
మహారాణి చూస్తున్నట్టు అనిపించింది. మిరోన్ కు అది చూస్తూ ఉంటే ఏడవాలనిపించింది. ‘నువ్వు
చాలా గర్వంగా ఉన్నావు,ఇప్పుడు.కానీ నీ కూతుళ్ళకు పెళ్ళి చేయాల్సిన సమయం వస్తుంది. అప్పుడు
నేను కూడా నిన్ను చూస్తాను.అప్పుడు ఇలా ఉండవు నువ్వు’,అని తనలో తానే ఆ రాణిని చూస్తూ
అనుకున్నాడు.
పాంటెలి ఇంకా అతని చెవిలో జోరీగలా రొద పెడుతూనే ఉన్నాడు. నిరాసక్తంగా తల పైకెత్తి మిరోన్
వింటున్నాడు.
‘మీకు నాణ్యమైన బూట్లు, మీ అమ్మాయికి మంచి కోటు-అంటే ఇక నుంచి మా అమ్మాయి కూడా
అనుకోండి-మేము మాకున్న పశువులన్నీ అమ్ముకోవాలి.’
‘మీరు అది కోపంతో అంటున్నారా?’ మిరోన్ తన పిడికిలితో బల్ల మీద కొడుతూ అన్నాడు.
‘లేదు,నాకేం కోపం లేదు…’
‘ఇంతకి ఇస్తారా,లేదా?’
‘ఒక్క నిమిషం ఆగు,మిత్రమా…’
‘నీకు అంత అయిష్టంగా ఉంటే,వదిలేద్దాం.’
మిరోన్ చెమట పట్టిన తన చేతులను బల్ల మీదకు చూసుకోకుండా పెట్టే సరికి అతని చేతులు తగిలి
అక్కడ ఉన్న గ్లాసులు నేల మీద పడ్డాయి.
‘మీ కన్న కూతురే మళ్ళీ అక్కడ కష్టపడి పనిచేసి ఈ నష్టాన్ని పూడ్చాలి.’
‘అయితే,తనే కష్టపడుతుంది.మీకు చేతనైతే ఆ డబ్బు ఇవ్వండి,లేకపోతే మీ దారి మీరు
చూసుకోండి.’
‘మా గొడ్డు అమ్మాలి…’ పాంటెలి తల ఊపుతూ అన్నాడు,అతని చెవిపోగు మెరుస్తూ ఉంది.
‘తప్పకుండా ధర కట్టాలి! మా అమ్మాయికి ఎన్నో పెట్టెల బట్టలున్నాయి,కాకపోతే మీరు మా పట్ల మీ గౌరవాన్ని చూపాలి,నిజంగా మీకు మా అమ్మాయి నచ్చినట్లైతే. అదే మన కోసాక్కుల సాంప్రదాయం. అది పూర్వం రోజుల నుండి ఉంది,మేము ఇప్పటికి పాటిస్తాము.’
‘నేను ఆ గౌరవాన్ని చూపిస్తాను!’
‘అయితే చూపించు.’
‘తప్పకుండా!’
‘ఇక కష్టపడే విషయానికి వస్తే అది వయసులో ఉన్న వాళ్ళే చూసుకుంటారు. వయసులో ఉన్నప్పుడు
కష్టపడాలి,అప్పుడే సుఖపడొచ్చు. కాబట్టి వాళ్ళ బతుకుల కోసం వాళ్ళనే కష్టపడని.’
ఆ ఇద్దరు తండ్రుల గడ్డాలు కలిసిపోయి ఒక కంచె చుట్టూ పెరిగే చిన్న కొమ్మల్లా ఉన్నాయి.
పాంటెలి అక్కడ మిగిలిపోయి ఉన్న దోసకాయ తిన్నాడు, అతని కళ్ళ నుండి ఆనందభాష్పాలు
కారుతున్నాయి.
ఆ ఇద్దరు భార్యలు ఒకరి పక్కన ఒకరు కూర్చుని,పక్క లోకమే పట్టనట్టు మాటల్లో మునిగిపోయారు. ఇలినిచ్న ముఖం చెర్రీలా ఎర్రబడితే, ఆమె కొత్త బంధువైన స్త్రీ ముఖం వోడ్కా వల్ల పచ్చగా ఉంది.
‘…..మా అమ్మాయి చాలా మంచిది. అలాంటి అమ్మాయి మీకు ఎక్కడా కనబడదు! మీకు వినయంగాఉంటూ,గౌరవం చూపే అమ్మాయి కావాలనుకుంటే తనకంటే సరైన అమ్మాయి ఎవరూ ఉండరు. ఎవరికైనా ఎదురుతిరిగి ఒక్క మాట చెప్పాలన్నా భయపడుతుంది.’
‘ఓ…’బుగ్గ దగ్గర చేయి పెట్టుకుని,ఆమె చెప్పే దానికి అడ్డు పడింది ఇలినిచ్న. ‘నేను వాడికి
ఎన్నిసార్లు చెప్పానో! ఆ తర్వాత ఆదివారం సాయంత్రం వాడు పొగాకు కట్టతో వెళ్తూ ఉంటే నేను
వాడిని హెచ్చరించాను కూడా. “నువ్వు ఎప్పుడు దానిని వదిలేస్తావురా? దీని వల్ల నేను ఎంత కాలం చెడ్డ
పేరు భరించాలి ఈ వయసులో?ఆ స్టీఫెన్ గాడు,ఒక్క దెబ్బతో నీ మెడ విరిచేస్తాడు!”
వంట గదిలో నుండి నటాల్య సోదరుడు మిట్కా, ఆ తలుపు పైన ఉన్న చిన్న రంధ్రం నుండి ముందు గదిలోకి చూశాడు. నటాల్య ఇద్దరు చెల్లెళ్ళు వారిలో వారే గుసగుసలాడుకుంటున్నారు.
నటాల్య మూల ఉన్న ఓ సోఫాలో కూర్చుని,తన జాకెట్టు అంచులతో కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంది.
తన కొత్త జీవితం తెలియని మనుషుల మధ్య ఎలా ఉంటుందో అన్న భయం ఆమెను ఆవరించింది.
పెద్ద వాళ్ళు మూడో వోడ్కా సీసా పూర్తి చేస్తూ; ఆ వివాహం ఆగస్టు మొదటి వారంలో జరిపించాలని నిర్ణయించుకున్నారు.
* * *
అధ్యాయం-19
కోర్షునోవుల కుటుంబం పెళ్ళి ఏర్పాట్లతో హడావుడిగా ఉంది. పెళ్ళి బట్టల కోసం తెచ్చిన గుడ్డలో ఆఖరి ముక్కలతో కంగారుగా పెళ్ళికూతురి లోదుస్తులు కుట్టిస్తున్నారు. నటాల్య రోజు సాయంత్రాలు తన కాబోయే భర్త కోసం ఊలుతో ఒక శాలువాను, గ్లోవ్స్ ను అల్లుతూ అంది.అది సాంప్రదాయం.
ఆమె తల్లి లుకినిచ్న ప్రతి రోజు ఉదయం నుండి పొద్దు పోయేవరకు కూడా స్టానిట్సా నుండి ప్రత్యేకంగా పిలిపించిన బట్టలు కుట్టే స్త్రీతో పాటు కుట్టు మెషీన్ దగ్గరే ఉండి,సూచనలు ఇస్తూ ఉంది. మిట్కా తండ్రితో కలిసి పొలం నుండి ఇంటికి వచ్చేవాడు. పొలానికి వెళ్ళేటప్పుడు వేసుకునే బూట్లు కూడా తీయకుండా,చేతులు కూడా కడుక్కోకుండా ,నటాల్య ఉన్న గదిలోకి వెళ్ళి ఆమె పక్కన కూర్చునేవాడు. ఆమెను ఆటపట్టిస్తూ సంతోషించేవాడు.
‘అల్లుతున్నావా?’ శాలువ కోసం అల్లుతున్న బట్ట వైపు చూస్తూ కన్ను కొడుతూ అడిగేవాడు.
‘అవును.అయితే ఏంటి?’
‘అయితే అల్లుతూ కూర్చో,దద్దమ్మా,అయినా ఇటువంటివి చేసినా వాడు నీ పట్ల కృతజ్ఞత
చూపించకుండా ముఖం మీద గుద్దుతాడు.’
‘ఎందుకు?’
‘కారణం ఏమి ఉండక్కర్లేదు. నాకు గ్రీషా గురించి తెలుసు,మేము చిన్నప్పటి నుండి స్నేహితులము.
వాడు నిజంగా కుక్కే-వాడు నిన్ను కరుస్తాడు కారణం చెప్పకుండానే.’
‘నాకు ఏమి తన గురించి తెలియదన్నట్టు ఇలాంటి కథలు చెప్పకు.’
‘నీ కన్నా నాకు బాగా తెలుసు. మేము ఇద్దరం ఒకే పాఠశాలలో చదువుకున్నాము.’
గట్టిగా నిట్టూరుస్తూ, మిట్కా ముందుకు వంగి, పొలం పనులు చేసి ఉండటం వల్ల కొన్ని చోట్ల
గీరుకుపోయి ఉన్న చేతులను చూస్తూ అన్నాడు.
‘అతనితో నీ జీవితం ఏమి బాగుండదు నటాల్య! దాని బదులు ఇక్కడే ఉండి ముసలిడానివి
అయిపో. అతనిలో నీకు ఏం నచ్చింది? చూడటానికి ఏం బావుండడు,కాకపోతే కొద్దిగా సరదాగా ఉంటాడు. అతన్ని దగ్గరగా చూస్తే నీకు సరిపోడని నీకే తెలుస్తుంది!
శాలువా వైపుకి వంగిన నటాల్య సోదరుడి మాటలతో విసిగిపోయి, రాబోతున్న కన్నీళ్ళను ఆపుకుంది.
‘కాకపోతే అసలు విషయం ఏమిటంటే వాడి మనసు మంచిది. అయినా ఇంకేం ఆలోచితున్నావు నీవు? నటాల్య,వాడు వద్దని ఒక మాట చెప్పు. నేను ఇప్పుడే గుర్రం మీద వెళ్ళి ఇక వాళ్ళు రానవసరం లేదని చెప్పి వస్తాను,’ఆపకుండా మిట్కా మాట్లాడుతూనే ఉన్నాడు.
ఆ సమయంలో ఆమెకు అండగా గ్రీక్షా తాతయ్య వచ్చాడు. ఆయన తన చేతి కర్రతో నేలను
కొడుతూ, గడ్డం నిమురుకుంటూ, ఆ గదిలోకి అడుగుపెట్టాడు.
‘ఒరేయ్ కుర్రవెధవా! నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?’ మిట్కా ను తన కర్రతో భుజం మీద తట్టి
అడిగాడు.
‘నేను తను ఎలా ఉందో చూద్దామని వచ్చాను తాతయ్యా’, మిట్కా బదులిచ్చాడు.
‘తను ఎలా ఉందో చూద్దామని వచ్చావా? నీకు చెపుతున్నాను…వెంటనే ఇక్కడి నుండి బయటకు
వెళ్ళు…వెంటనే!’
తాతయ్య తన కర్రను మిట్కా మీదకు ఎత్తేసరికి అతను ఆ గది నుండి బయటకు వెళ్ళాడు.
గ్రీక్షా తాత ఈ భూమి మీద అరవై తొమ్మిదేళ్ళ నుండి ఉన్నాడు. 1877 లో టర్కీలకు వ్యతిరేకంగా జరిగిన ప్రచారంలో ఆయన కూడా పాల్గొన్నాడు. ఒక సమయంలో ఆయన జనరల్ గుర్కోకి ఆర్డర్లిగా కూడా ఉన్నాడు.కానీ అతి కొద్ది సమయంలోనే ఆ అర్హత కోల్పోవడం వల్ల మరలా అతన్ని పూర్వ రెజిమెంట్ కే పంపేశారు. ప్లేవ్న,రొసిచ్ లలో అతని సేవలకు గుర్తింపుగా రెండు సెయింట్ జార్జ్ క్రాసులు,ఒక సెయింట్ జార్జ్ పతకం ఆయన్ని వరించాయి. ప్రోకోఫీ మెలఖోవ్ ఉన్న రెజిమెంట్ లోనే పనిచేశాడు. ఇప్పుడు తన ఆఖరి రోజుల్లో కొడుకు దగ్గర ఉంటున్నాడు.గ్రామంలో ఇప్పటికి ఆయన నిజాయితీ,దాతృత్వ గుణం వల్ల గౌరవం ఉంది, జ్ఞాపకాలతోనే జీవితం సంతోషంగా గడుపుతున్నాడు.
వేసవికాలంలో ఆయన ఇంటి చుట్టూ ఉన్న గోడ దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుని, నేల మీద తన కర్రతో గీస్తూ, తల కిందకు వంచి, కొత్త ఆలోచనలను, గతంలో జరిగిన వాటిని గురించి ఆలోచిస్తూ
ఉండేవాడు.
ఆయన ధరించే కోసాక్కుల టోపీ పైన కొంచెం చిరిగి ఉండటం వల్ల, ఓ నల్లటి నీడ ఆయన మూసిన కనురెప్పలపై పడేది. దాని వల్ల ఆయన బుగ్గల మీద గీతలు లోతుగా కనిపిస్తూ, బూడిద రంగులో ఉన్న ఆయన మీసం కాస్త నీలంలోకి మారినట్టు అనిపించేది. కర్రను గట్టిగా పట్టుకుని ఉండే ఆ చేతుల్లో నల్లటి రక్తం మెల్లగా కదులుతూ, మోచేతుల్లోకి ,ఉబ్బినట్టు ఉన్న నరాల్లో ప్రవహిస్తూ ఉండేది. ప్రతి సంవత్సరం ఆయనకు తన రక్తం ఇంకా చల్లబడుతున్నట్టు అనిపించేది. తనకు ఇష్టమైన మనవరాలైన నటాల్యకు ఎప్పుడు ఫిర్యాదు చేస్తూ ఉండేవాడు. ‘ఈ ఊలుతో అల్లిన సాక్సులు వేసుకున్నా,నా పాదాలు వేడిగా ఉండటం లేదు. నా కోసం కొత్తవి అల్లుతావా?’
‘ఇప్పటికే మనం వేసవి కాలం మధ్యలో ఉన్నాము,తాతయ్యా!’నటాల్య నవ్వుతూ పక్కన
కూర్చుని,ముడతలు పడ్డ ఆయన పెద్ద చెవి వైపే చూస్తూ అనేది.
‘అయితే అవ్వని,నా చిట్టి తల్లి,కానీ నా రక్తం మాత్రం భూగర్భంలో మట్టి ఎంత చల్లగా ఉంటుందో
అంత చల్లగా ఉంది.’
నటాల్య నరాలు బయటకు కనబడుతున్న ఆయన చేతుల వైపు చూస్తూ,చిన్నప్పుడు జరిగిన
సంఘటనను జ్ఞాపకం చేసుకుంది. ఆమె బాల్యంలో ఇంటి ముందు బావి తవ్వుతున్నప్పుడు,బకెట్ లో
ఉన్న తడి మట్టిని చేతి నిండా తీసుకుని,దానితో చిన్న చిన్న బొమ్మలు,కొమ్ములు ఉన్న ఆవు బొమ్మ
చేసింది. ఆ సమయమలో చల్లగా ఉన్న ఆ మట్టి తనకు కలిగించిన భావనను ఒక్కసారిగా గుర్తు
తెచ్చుకుని,భయంతో గోధుమ మరియు మట్టి రంగులో మచ్చలు ఉన్న తాతయ్య చేతులను చూసింది.
అవి చూస్తూ ఉంటే ఆయన నరాల్లో రక్తం ఎర్రగా కాకుండా, గోధుమ మరియు నీలం రంగు
మిశ్రమంగా ప్రవహిస్తున్నట్టు ఉంది.
‘తాతయ్యా,నీకు చావు అంటే భయమా?’ అడిగింది.
సన్నగా,ఎముకలు కనబడుతూ ఉన్న తన మెడను, తను ధరించిన వదులైన పాత యూనిఫార్మ్
కాలర్ నుండి విడుదల చేస్తున్నట్టుగా అడ్డంగా తిప్పి, తన మీసాన్ని సవరించుకున్నాడు.
‘నేను చావును ఓ అతిథిలా ఆహ్వానిస్తాను అమ్మా. ఇంకా సమయం వచ్చింది. నేను జీవితాన్ని చక్కగా
అనుభవించాను,జార్లకు సేవ చేశాను,తాగాల్సినంత వోడ్కా తాగాను’, తన పళ్ళన్ని కనిపించేలా
నవ్వుతూ ఉంటే,ఆయన కళ్ళ చుట్టూ ఉన్న ముడతలు వణుకుతున్నట్లు అనిపించింది.
నటాల్య ఆయన చేతులను ముద్దాడి అక్కడ నుండి వెళ్ళిపోయింది. కానీ ఆయన మాత్రం అక్కడే ఉండి ముందుకు వంగి తన కర్రతో నేలను గీస్తూ ఉన్నాడు. ఆయన యూనిఫార్మ్ అప్పటికే చాలా చోట్ల చిరిగిపోయి ఉన్నా,దాని కాలర్ మీద ఉన్న ఎర్రటి మచ్చలు మాత్రం నవ్వుతూ సవాలు విసురుతున్నట్టు ఉన్నాయి. నటాల్య వివాహ విషయం ఆయనకు తెలిసింది. బయటకు అభ్యంతరం చెప్పకపోయినా, లోపల మాత్రం ఆయనకు ఈ నిర్ణయం పట్ల బాధగా ఉంది. రోజు ఆయనకు భోజనం పెట్టేది నటాల్యనే. ఆయన బట్టలు ఉతికి, కావాల్సినవి అల్లి పెట్టేది ఆమె.అలాగే ఆయన బట్టలు ఇస్త్రీ చేసేది కూడా ఆమెనే. ఆ వార్త తెలిసిన రెండు రోజుల తర్వాత ఆమెతో ఇదివరకటిలా కాక తనకు ఆ నిర్ణయం ఇష్టం లేదన్నట్టే వ్యవహరించాడు.
‘మెలఖోవులు మంచి కోసాక్కులు. చనిపోయిన ప్రొకోఫీ గొప్ప ధైర్యవంతుడు. కానీ ఆయన
మనవళ్ళు ఎటువంటివారు,చెప్పండి?’
‘ఆయన మనవళ్ళు మరి చెడ్డవారు కాదు’, మిరోన్ తప్పించుకోవడానికి చెప్పాడు.
‘ఆ గ్రీక్ష ఒక పనికిరానివాడు. ఓ సారి నేను చర్చి నుండి ఇంటికి తిరిగి వస్తుంటే,నన్ను చూసి కనీసం
పలకరించలేదు కూడా. అసలు ఈ రోజుల్లో వృద్ధులంటేనే గౌరవం లేదు!’
‘అతను ప్రేమించదగినవాడు’, లుకినిచ్న తన కాబోయే అల్లుడిని సమర్థిస్తూ అన్నది.
‘ఏంటి? ప్రేమించదగినవాడా? అలాగే అనుకుందాం. ఒకవేళ నటాల్య ఇష్టపడితే….’
ఆ పెళ్ళి సంబంధం కుదర్చడంలో తాతయ్య పాత్ర దాదాపుగా ఏమి లేదు. ఆ రోజు తన గది నుండి బయటకు వచ్చి, బల్ల దగ్గర కూర్చుని,కష్టం మీద వోడ్కా తాగాడు. ఆ వోడ్కా వల్ల కాస్త వెచ్చగా
అనిపించినా,నిషా తలకు ఎక్కుతుందని అనిపించిన వెంటనే అక్కడ నుండి నిష్క్రమించాడు.
రెండు రోజుల పాటు కంగారుగా ఉన్న సంతోషంతో వెలిగిపోతున్న మనవరాలి ముఖం వైపు
చూశాడు,అప్పటి వరకు ఉన్న గట్టిదనం కాస్త ఆ ఆనందాన్ని చూడగానే మెత్తబడిపోయింది.
‘నటాల్య!’ఒకరోజు పిలిచాడు.
నటాల్య ఆయన దగ్గరకు వచ్చింది.
‘నువ్వు సంతోషంగానే ఉన్నావని అనుకుంటున్నాను,అవునా?’
‘నాకు ఏమి తెలియడం లేదు,తాతయ్యా’, నటాల్య ఒప్పుకుంది.
‘నీకే తెలియదా? నువ్వు మంచిదానివి. నీకు అంతా మంచే జరుగుతుంది…’, అంటూనే తన
మనసులో ఉన్న కోపాన్ని ఆపుకోలేక, ‘నేను చచ్చేదాకా ఆగలేకపోయావా పాడు పిల్లా…. నువ్వు
లేకపోతే నా జీవితం దుర్భరం అయిపోతుంది’,అన్నాడు.
మిట్కా వంటగదిలో నుండి ఆ సంభాషణను విన్నాడు.
‘నువ్వు ఇంకో వందేళ్ళు బతకొచ్చు తాతయ్యా. తనను అంతకాలం ఎలా ఆగమంటావు? నువ్వు అంత
త్వరగా పోవులే.’
గ్రీక్షా తాత ముఖం నల్లబడింది, గొంతుకేదో అడ్డం పడినట్టైంది. తన కర్రతో నేలను కొట్టి, తన
పాదాలతో గట్టిగా తన్నాడు.
‘నోర్మూయ్ కుర్రకుంకా! ఇక్కడ నుండి పో! దూరంగా పో!దుష్టుడా! రహస్యంగా
వింటున్నావా,దయ్యమా!’
మిట్కా పరుగెత్తుతూ,నవ్వుతూ బయటకు వెళ్ళిపోయాడు. ఆ వృద్ధుడు తిడుతూ, కోపంతో
ఊగిపోయాడు,ఆయన మోకాళ్ళు వణికాయి.
నటాల్యకు ఇద్దరు చెల్లెళ్ళు. మరిష్కా,ఎనిమిదేళ్ళ అమ్మాయి అయితే; గ్రిప్కా ఎనిమిదేళ్ళ అమ్మాయి.ఆ ఇద్దరూ అక్క పెళ్ళి రోజు కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
కోర్షునోవుల పొలంలోనే ఎప్పటినుండో పని చేస్తున్న కూలీలు మరీ ఉత్సాహాన్ని కనబరచలేదు. వారు ఆ పెళ్ళి వేడుకల సందర్భంగా గొప్ప విందును,రెండు రోజుల సెలవును కోరుకుంటున్నారు. వారిలో ఒకరి పేరు హెట్ బాబా. ఎత్తుగా ఉండేవాడు,ఉక్రేనియా నుండి వచ్చాడు. అతను సంవత్సరంలో రెండు సార్లు తాగేవాడు. ఆ సమయంలో అతను తన దగ్గర ఉన్నదంతా తాగడానికే ఖర్చు పెట్టేవాడు. కొంత కాలం నుండి అతనికి తాగాలన్న కోరిక పుట్టినా, ఈ పెళ్ళి సమయంలో తాగడానికే వేచి చూస్తున్నాడు.
రెండో అతని పేరు మిఖెయ్. మిగులిన్స్కాయ కు చెందిన కోసాక్కు. అతను ఈ మధ్యనే కోర్షుకోవుల దగ్గర చేరాడు. ఒక మంటలో స్వంత ఇల్లు కాలిపోవడం వల్ల ఈ పనిలో చేరాడు. హెట్కో(హెట్ బాబా ముద్దు పేరు)తో స్నేహం ఉండటం వల్ల తాగడానికి అతన్ని కూడా తీసుకుపోయేవాడు. అతనికి గుర్రాలంటే ఎంతో ఇష్టం;కానీ ఉన్నట్టుండి ఏడుస్తూ ఉంటే కన్నీరు అతని గోధుమ రంగు ముఖం మీద కారుతూ ఉండేది; ఈ చర్య మిరోన్ కు చిరాకు తెప్పించేది.
‘ఓ యాజమాని! నా ప్రియ పాత స్నేహితుడా! నువ్వు నీ కూతురికి వివాహం చేసేటప్పుడు, ఆ పెళ్ళి ఊరేగింపు గుర్రపు బండిని నన్ను తోలనివ్వు! ఈ మిఖెయ్ గుర్రాలను అద్భుతంగా నడుపుతాడు. నేను వాటిని మంటల్లో నడిపించినా వాటి ఒక్క వెంట్రుకకు కూడా ఆ మంట అంటుకోదు. నాకే నా సొంత గుర్రాలు ఉండేవి….’
ఎప్పుడూ బాధగా,ఎవరితో కలవకుండా ఉండే హెట్కో ఏదో కారణం వల్ల మిఖెయ్ తో స్నేహ బంధాన్ని పెంచుకున్నాడు. అతన్ని పదేపదే ఒక జోకు వేసి ఏడిపిస్తూ ఉండేవాడు.
‘మిఖెయ్,నేను అడిగేది నీకు వినబడుతుందా? నువ్వు ఏ స్టానిట్సాకు చెందినవాడివి?’,దాదాపుగా
తన మోకాళ్ళ వరకు ఉండే తన పెద్ద చేతులను రుద్దుకుంటూ అడిగేవాడు. వెంటనే తన స్వరాన్ని మార్చి,ఆ ప్రశ్నకు తానే బదులిచ్చేవాడు, ‘మిగులిన్స్కాయ.’ ‘నువ్వు ఎందుకు అంత బక్కగా ఉన్నావు?’
‘మేము అంతా అక్కడ అలానే ఉండేవాళ్ళము.’
తను పదేపదే వేసే ఈ జోకుకి తనే పగలబడి నవ్వుతూ,తన పొడుగైన కాళ్ళను కొట్టుకునేవాడు. అప్పుడు మిఖెయ్ ప్రేమ-ద్వేషం కలిసిన కళ్ళతో నున్నగా గడ్డం చేసి ఉన్న హెట్కా ముఖంలోకి చూస్తూ, ‘నన్ను వేధించకురా,గుడ్లగూబ’ అనో ‘చెవిలో జోరీగ’అనో అనేవాడు.
సెప్టెంబర్ మొదటి రోజున వివాహం జరిగేట్టు,మాంసం కూడా తినేందుకు వీలుగా నిర్ణయించబడింది. ఇంకా పెళ్ళికి మూడు వారాలు ఉంది. ఆమె ఒక ఊహాలో ఉంది.అందులో గ్రెగరి ఆమెను చూడటానికి వచ్చాడు. ముందు గదిలో గుండ్రపు బల్ల వద్ద కూర్చుని;నటాల్య మరియు ఆమె స్నేహితురాళ్ళతో కలిసి ఉపాహారం తిని, వెళ్ళడానికి లేచాడు. నటాల్య కూడా అతనితో కలిసి ఇంటి బయటకు వచ్చింది. అతను తన గుర్రానికి పశువులశాల దగ్గర నీళ్ళు పెడుతూ ఉంటే, ఆమె తన
జాకెట్టు పై భాగంలో చేయి పెట్టి ఏదో బయటకు తీసి,సిగ్గుపడుతూ,విరహంతో ఉన్న కళ్ళతో గ్రెగరి వైపు చూసి, కట్టలా ఉన్న ఒకదాన్ని అతనికి అందించింది. గ్రెగరి దానిని అందుకుని,ఆమె వైపు చూసి
నవ్వాడు.
‘ఏంటిది?’
‘మీరే చూడండి….పొగాకు కట్టలు పెట్టుకునేది.నేను మీ కోసమే స్వయంగా అల్లాను.’
గ్రెగరి ఆమెను ముద్దు పెట్టుకోవడానికి తన చేతుల్లోకి తీసుకున్నాడు,కానీ ఆమె అతన్ని పక్కకు
తోసేసింది,భయపడిన కళ్ళతో కిటికీ వైపు చూసింది.
‘ఎవరైనా చూస్తారేమో!’
‘చూస్తే చూడని.’
‘నాకు సిగ్గేస్తుంది..’
‘నీకు మొదటిసారి కనుక అలానే ఉంటుంది’,అతను వివరించాడు.
తర్వాత గుర్రం ఎక్కి అతను వెళ్ళిపోయాడు. నటాల్య వెళ్ళిపోతున్న అతన్నే,తన కళ్ళకు చేతులు అడ్డం పెట్టుకుని చూస్తూ ఉంది. అతను గుర్రం మీద కాల్మకుల పద్ధతిలో కూర్చుని,ఎడమ వైపుకి వంగి,స్వారీ చేస్తున్నాడు.
‘ఇంకా పదకొండు రోజులు ఉన్నాయి’,అని మనసులోనే లెక్కలు వేసుకుంటూ,తన ఊహకు తానే నవ్వుకుంది.
* * *
అధ్యాయం-20
పదునైన ఆకులతో గోధుమ మొలకెత్తుతూ చూస్తుండగానే ఎదిగిపోతుంది. ఒక నెలన్నరలో ఓ మనిషి దాని మధ్యలో నుండి నడిస్తే కనబడనంత ఎత్తు ఎదుగుతుంది. గోధుమ భూమి సారాన్ని పీల్చుకుని, పెద్ద చెవులతో విస్తరిస్తుంది. దాని పువ్వులు,చెవులు బంగారపు పుప్పొడితో కళకళలాడుతూ ఉంటాయి. క్రమక్రమంగా ఆ గింజ సువాసన ఉన్న పాలతో ఉబ్బుతుంది. ఇక రైతు పొలంలోకి అడుగుపెట్టగానే అతని గుండె కూడా ఆనందంతో ఉప్పొంగుతుంది. కానీ ఎక్కడినుండో, ఎవరికి మాత్రం ఎక్కడి నుంచో ఎలా తెలుస్తుంది? ఓ పశువుల మంద ఆ గోధుమ పొలం మధ్యలో తిరుగుతూ కనిపిస్తుంది. ఆ పెద్ద చెవులను, ఉబ్బిన గింజలను నేల మీదకు అణచివేస్తాయి. ఎక్కడెక్కడో పడుతూ, ఆ మధ్యలో విరిగిపోయి పనికిరానివిగా పడి ఉంటాయి ఆ గోధుమలు తర్వాత పనికిరాకుండా పోతాయి. ఆ రైతుకీ అది క్రూరమైన మరియు ఓ హృదయవిదారక దృశ్యం.
ఆక్సిన్య విషయంలో కూడా అదే జరిగింది. ఆమె ప్రేమ బంగారపు పుప్పొడిలా పక్వానికి వచ్చాక,అది క్రూరంగా గ్రెగరి బూటు కాళ్ళ కింద నలిపివేయబడింది. గ్రెగరి దాని పవిత్రను చెడగొట్టి,దాన్ని ధ్వంసం చేశాడు,ఇక అంతా అయిపోయినట్టే.
ఆమె మెలఖోవుల పొద్దుతిరుగుడు తోట నుండి తిరిగి వచ్చాక,ఆమె హృదయమంతా శూన్యంగా మారిపోయినట్టు, కలుపు మొక్కలు పెరిగి వదిలివేయబడిన పొలంలా ఉన్నట్టు ఆమెకు అనిపించింది.
ఆమె ఇంటికి తిరిగి వస్తూ, తన చేతి రుమాలు అంచులను కొరుకుతూ ఉంది,ఆమె గొంతంతా దుఃఖంతో నిండిపోయి,అది బయటకు ఏ రూపంలోనూ రాలేనట్టు అనిపించింది. ఆమె ఇంటి వసారాలోకి రాగానే కింద కూలబడి, కన్నీరు కారుస్తూ,ఏదో శూన్యం ఆవరించినట్టు ఉండిపోయింది. ఆ తర్వాత కొంతసేపటికి మామూలు మనిషి అయ్యింది. కానీ ఆమె గుండె లోపల ఏదో పొరలో బాధగా ఉంది.
అణగదొక్కబడినా సరే గోధుమ మళ్ళీ పైకి లేస్తుంది. మంచు మరియు సూర్యకాంతి భూమిలో
కూరుకుపోయిన ఆ కొమ్మలను పైకి లేపుతుంది. మొదట్లో అది ఏదో బరువు చేత వంగిపోయిన
మనిషిలా ఉన్నా,తర్వాత అది క్రమక్రమంగా పైకి నిటారుగా తల పైకెత్తినట్టు ఉదయపు వెలుగులో
ఎదుగుతూ, అదే గాలిలో ఇది వరకటి లాగే గర్వంగా తల ఎత్తుతుంది.
రాత్రి వేళల్లో భర్తను ఒక రకమైన ఉన్మాదంతో నిమురుతున్న సమయంలో,అక్సిన్య గ్రెగరి గురించి ఆలోచించేది. ఆ ఆలోచనల్లో ఆమె గుండెల్లో ఉన్న ద్వేషంతో పాటు ప్రేమ కూడా కలగలసిపోయేది.ఆమె తన ఆలోచనల్లో ఓ కొత్త రకమైన అవమానం గురించి ఆలోచించేది. నటాల్యను గ్రెగరి నుండి దూరం చేయాలని;ఆమె అదృష్టవంతురాలని,ఇంకా ప్రేమ వల్ల కలిగే ఆనందాన్ని కానీ బాధను కానీ ఆమె చవిచూడలేదని అనుకునేది. రాత్రుళ్లు గడిచే కొద్ది చీకట్లోకి చూస్తూ ఉన్న ఆమెలో ఆ ఆలోచన బలపడుతూ ఉండేది. వంకీలు తిరిగిన ముంగురులతో ఉన్న స్టీఫెన్ తల ఆమె కుడి భుజం మీద ఉండేది. ఆ నిద్రలో సగం తెరిచిన అతని నోరు, నల్లగా ఉన్న అతని చేయి భార్య ఎద మీద ఉండేది. అక్సిన్య అదే విషయం అనేక లెక్కలు వేసుకుంటూ పదేపదే ఆలోచించేది. ఒక్క విషయం మాత్రం ఆమె మెదడులో బలంగా నాటుకుపోయింది; ఎలా అయినా గ్రెగరి మనసు గెలుచుకుని,అందరికి దూరంగా వెళ్ళిపోవాలి. అతన్ని తన ప్రేమతో మాయ చేసి వశపరచుకోవాలి. ఆమె మనసు లోతుల్లో ఉన్న బాధను, ఒక తేనెటీగ కుట్టినట్టు, గాయాన్ని మళ్ళీ గాయపరుస్తున్నట్టు ఆమెకు అనిపించేది.
ఇది రాత్రి సమయంలో ఆమె లోకం. పగలు సమయంలో ఇంటి పనులు,పొలం పనులతో ఈ ఆలోచనలను లోపాలే సమాధి చేసేది. ఒకవేళ అనుకోకుండా గ్రెగరి ఎక్కడైనా ఆమెకు తారసపడితే,మాడిపోయిన ముఖంతో,అతని కోసం దహించుకుపోతున్న దేహాన్ని బలవంతంగా అతనికి దూరంగా లాక్కుపోతూ, అతని కళ్ళల్లోకి సిగ్గులేకుండా ఆహ్వానం పలుకుతున్నట్టు చూసేది.
తర్వాత గ్రెగరి ఆమె చూపుల్లో ఉన్న అర్థాన్ని గ్రహించేవాడు. అప్పుడు ఏ కారణం లేకుండా కోపిష్టిగా మారిపోయేవాడు. తన కోపాన్ని తల్లి మీద,చెల్లి మీద చూపించేవాడు. ఆ సమయంలో గొడ్డలి తీసుకుని వెనక పెరడులోకి వెళ్ళి,పళ్ళు బిగించి,చెమట కారుతున్న ముఖంతో,అక్కడ ఉన్న చెట్లన్నీ నరికేవాడు. ఒక వారంలో అది పెద్ద కుప్పలా మారేది. మెరుస్తున్న చెవి పొగుతో,క్రోధం నిండిన కళ్ళతో పాంటెలి కొడుకును బూతులు తిట్టేవాడు ఆ చర్యకు.
‘నువ్వు కొట్టిపెట్టిన కుప్పను చూడు,దయ్యం పీనుగ!రెండు కంచెలకు సరిపడా చెక్క ఉంది ఇప్పటికే! నువ్వేమైనా వీరుడవని అనుకుంటున్నావా,నీ దృష్టి సరిచేసుకో. నీ బోడి వీరత్వం బయట పొదల మీద ప్రదర్శించు. ఒరేయ్ ఆగరా! సమయం వచ్చినప్పుడు నువ్వు కొట్టలేనన్ని చెట్లు కొట్టాలి. ఆ పని నీకు అయిష్టంగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు!’
* * *
అధ్యాయం-21
పెళ్ళికూతురుని తీసుకురావడానికి ఏర్పాటు చేసిన వాహనానికి నాలుగు బండ్లు ఉండేలా,ప్రతి బండిని రెండు గుర్రాలు లాగేలా సిద్ధం చేశారు. మెలఖోవ్ వాకిట్లో కొత్త దుస్తులు ధరించిన జనం గుమికూడారు.
అందరిలో బాగా ముస్తాబైన పెట్రో, నల్ల జాకెట్ పైన, కింద నీలం రంగుతో పక్కల ఎర్ర గీతలు ఉన్న పైజామా ధరించి, రెండు తెల్ల చేతిరుమాళ్ళను ఎడమ చేతి చుట్టూ కట్టుకుని, లేత మొక్కజొన్న పీచు రంగులో ఉన్న తన మీసం పైన చెరగని చిరునవ్వుతో ఉన్నాడు. అతని స్థానం పెళ్ళికొడుకు పక్కన.
‘గ్రీక్షా … భయపడకు! తల పైకెత్తు, నోరు తెరుచుకుని కింద ఏం చూస్తున్నావు?’
బండ్ల చుట్టూ హడావుడిగా,గందరగోళంగా ఉంది.
‘మన తోడి పెళ్ళి కొడుకు ఏడి? వెళ్ళాల్సిన సమయం అయ్యింది.’
‘అన్నా!’
‘ఆ?’
‘అన్నా, నువ్వు రెండో బండిలో వెళ్ళు. వినపడుతుందా?’
‘బండ్లలో కూర్చోవడానికి వీలుగా సీట్లు పెట్టావా?’
‘ఇప్పుడు అవి లేకపోతే నువ్వేం కిందపడిపోవు కానీ ఇక బండెక్కు!’
చెర్రీ రంగు పట్టు గౌను వేసుకుని, విల్లో చెట్టు కొమ్మలా సన్నగా,మృదువుగా ఉన్న దర్య, తన
కనుబొమ్మలను పెన్సిల్ తో దిద్దుకుని, పెట్రో భుజం మీద చిన్నగా తట్టింది.
‘మనం బయల్దేరాల్సిన సమయమైంది, మావయ్యకి చెప్పు. అక్కడ వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు.’
పెట్రో తండ్రి దగ్గరకు వెళ్ళి, తండ్రితో గుసగుసగా మంతనాలు జరిపాక, పెట్రో తన తండ్రి సూచనలను
అమలు చేసే పనిలో పడ్డాడు.
‘పెళ్ళికొడుకు,ఇంకో ఐదుగురు నా బండిలో ఎక్కండి. త్వరగా ఎక్కండి. అనికే,నువ్వు బండి
పోనించు.’
ఆ సూచనను అనుసరించి వాళ్ళు బండి ఎక్కారు. గంభీరంగా,ఎర్ర బడిన ముఖంతో ఉన్న ఇలినిచ్న గేటు తెరిచింది. నాలుగు బండ్లు ఒక్కసారిగా గేటును దాటి, వీధిలోకి వేగంగా, ఒక దానితో ఒకటి పోటీ పడుతూ ముందుకు కదిలాయి.
పెట్రో గ్రెగరి పక్కన కూర్చున్నాడు. వాళ్ళిద్దరికి ఎదురుగా దర్యా, ఓ చేతి రుమాలు పట్టుకుని కూర్చుంది. బండ్లలో ఉన్న పెళ్ళి వారు పాటలు పాడుతూ, సంతోషంగా ఉన్నారు. కోసాక్కుల టోపీలకు ఉండే ఎర్రటి అల్లికలు,నలుపు-నీలం రంగుల్లో ఉన్న యూనిఫార్మ్ దుస్తులు,జాకెట్లు; తెల్లటి స్లీవ్స్ తో పురుషులు; ఇంద్రధనుస్సులోని రంగులతో శాలువాలు,గౌన్లతో స్త్రీలు; ఆ బండ్లు కళకళలాడుతున్నాయి. ఆ బండ్లు ముందు కదులుతూ ఉంటే వెనుక దుమ్ము రేగుతూ ఉంది. వాళ్ళు పెళ్ళి కూతురిని తీసుకురావడానికి వెళ్తున్నారు.
మెలఖోవుల పొరుగున ఉంటూ, గ్రెగరికి కజిన్ అయ్యే అనికె చేతిలో పగ్గాలున్నాయి. దాదాపుగా బండి మీద నుండి కిందకు పడిపోయేలా వంగుతూ,ఉత్సాహంగా అరుస్తూ, గుర్రాలను కొరడాతో అదిలిస్తూ, వాటిని ఇంకా వేగంగా ఉరికిస్తున్నాడు.
‘ఇంకోసారి కొట్టు! ఇంకా వేగంగా వెళ్ళాలి’, పెట్రో అరిచాడు.
హిజ్రాల ఉండే అనికె గ్రెగరి వైపు చూసి కన్ను కొట్టి, అమ్మాయిలా ఉన్న తన ముఖంలోకి చిరునవ్వు
తెచ్చుకుని, కొరడాతో గట్టిగా అదిలించాడు.
‘పక్కకు తప్పుకోండి’, ఇంకో బండిని నడుపుతున్న ఇల్యా ఓజోగిన్ ఆ బండిని దాటే క్రమంలో పక్క నుండి అరిచాడు. ఇల్యా గ్రెగరికి తల్లి తరపున మేనమామ వరుస అవుతాడు. ఆయన వెనకాల ఆనందంగా నవ్వుతూ,తనను వెక్కిరిస్తున్న, తన చెల్లెలు దున్యాక్ష ముఖం చూశాడు గ్రెగరి.
‘ఓ …లేదు,ఒక్క నిమిషం ఆగు’, అనికె అరుస్తూనే, తన పాదాల మీదకు వంగి,మళ్ళీ కొరడాతో
అదిలించాడు.
దానితో గుర్రాలు పిచ్చి ఊపందుకున్నాయి.
‘నువ్వు కిందకు పడిపోతాయి’, బండి వెనుక నుండి దర్యా అరిచింది.
‘గట్టిగా పట్టుకోండి!’పక్క నుండి ఇల్యా అరిచినా,ఆ అరుపు బండ్ల ధ్వనిలో వినబడలేదు.
అందంగా అలంకరించబడిన మిగిలిన రెండు బండ్లు వెనుక వస్తున్నాయి. ఎరుపు,నీలం, లేత పచ్చ రంగు బట్టలతో; జూలుకు పేపర్ పువ్వులు,రిబ్బన్లతోనూ;మెడలో గంటలతోనూ;గుర్రాలు కూడా అందంగా ఆ పెళ్ళికి అలంకరించబడ్డాయి. అవి అలసటతో రొప్పుతూ ఉంటే, వాటి నోట్లో నుంచి వస్తున్న నురగ, వాటి బట్టల మీదకు జారడం వల్ల;అవి తడిగా అయ్యాయి;అవి వేగంగా పరిగెడుతూ ఉంటే వాటి దుస్తులు గాల్లోకి ఎగురుతున్నాయి కొన్నిసార్లు.
కోర్షునోవుల ఇంటి ముందు గేటు వద్ద నిలబడి ఉన్న పిల్లల గుంపు అంతా ఆ ఊరేగింపు బండ్ల కోసం చూస్తూ ఉంది. రోడ్డు మీద దుమ్ము రేగడం గమనించిన వారు, ఉత్సాహంగా ముందుకు గెంతులు వేశారు.
‘వాళ్ళు వస్తున్నారు!’
‘అదిగో గుర్రాలు కనబడతున్నాయి!’
‘మేము వాళ్ళను చూసాము.’
అలా వాళ్ళ అరుపులకు హెట్కో మూడు సార్లు వచ్చి చూశాడు.
‘ఎందుకలా నా చుట్టూ అరుస్తూ,గెంతులు వేస్తారు? ఉష్, జోరీగల్లా రొద ఆపండి. మీ అరుపులతో
నాకు చెవుడు వచ్చేలా ఉంది!’
‘ఒరేయ్ ఉక్రేనియన్ రౌడీ! ఇటు రా,ఆడుకుందాము! టఫ్టీ!టఫ్టీ …టఫ్టీ’(ఉక్రేనియన్లను అవమానించే
పదమే ‘టఫ్టీ’, వారికి భుజాల వరకు ఉండే జుట్టును గురించి ఈ కామెంట్ చేస్తారు సాధారణంగా)ఆ
పిల్లలు ఆటపట్టిస్తూ, హెట్కో చుట్టూ తిరుగుతూ,గెంతులు వేశారు.
కిందకు చూస్తూ,ఆ పిల్లల ఉత్సాహాన్ని,ఆటకాయితనాన్ని చూసి నవ్వుకున్నాడు హెట్కో.
ఈ ఆటల మధ్య బండ్లు ఆ వాకిలి దాకా వచ్చేశాయి. ముందు పెట్రో, అతని వెనుక గ్రెగరి ఇంట్లోకి
నడిచారు. వారిని మిగిలిన వారు అనుసరించారు.
వసారా నుండి వంటగదికి దారి తీసే తలుపు మూసి ఉంది.
పెట్రో తలుపు తట్టాడు.
‘దేవుడా! మా మీద దయ చూపించు!’
‘ఆమెన్’, ఆ తలుపు అవతల నుండి సమాధానం వచ్చింది.
పెట్రో మరలా తలుపు తట్టి, అదే మాట మూడు సార్లు అంటే,మరలా అదే సమాధానం లోపల నుండి
వచ్చింది.
‘మేము లోపలికి రావచ్చా?’
‘రండి.’
అప్పుడు తలుపు తెరుచుకోబడింది.
తోడి పెళ్ళి కూతురు ఆ తలుపు ఎదురుగా ఉంది. ఆవిడ నటల్యా తల్లిలా భావించే స్త్రీ, అందగత్తె అయిన విధవ. ఎదురుగా ఉన్న పెట్రోను ఆవిడ పరిహాసంగా తన ఎర్రటి పెదాలతో నవ్వుతూ
పలకరించింది.
‘ఇదిగోండి, ఇది తాగండి,మీకు మంచి ఆరోగ్యం ఉండుగాక!’
వరి ధాన్యం నుండి చేసి,సరిగా పులియని మద్యం ఉన్న గ్లాసును అతనికి అందించింది. పెట్రో తన మీసాన్ని సరిచేసుకుని, అందరి నవ్వుల మధ్య,ఆ గ్లాసును ఖాళీ చేసి, ఓ దగ్గు దగ్గాడు.
‘సరే , నా ప్రియమైన తోడి పెళ్ళికూతురా, మంచి ఆతిథ్యమే ఇచ్చావు. ఒక్క నిమిషం ఆగు,నేను ఇంతకన్నా గొప్పదే ఇస్తాను, అలా వేచి ఉండు!’
‘మీ ఆజ్ఞను శిరసావహిస్తాను’, ఆ తోడి పెళ్ళికూతురి, తల కిందకు వంచి,వెంటనే తల ఎత్తి పెట్రో వైపు
చూస్తూ పరిహాసంగా నవ్వింది.
తోడి పెళ్ళికొడుకు, తోడి పెళ్ళి కూతురు,ఆ పరిహాస సంభాషణలో మునిగి ఉండగా, వరుడి బంధువులకు ముందు ఒప్పుకున్నట్టే,మూడు వోడ్కా గ్లాసులు అందించారు వధువు తరుపు వాళ్ళు నటాల్య అప్పటికే పెళ్ళిగౌనులో ముస్తాబై ఉంది. ఆమె టేబుల్ పక్కన చేతిలో అప్పడాల కర్రతో ఓ పక్క మరిష్కా ఉంటే, ఇంకో పక్క జల్లెడతో గ్రిప్కా ఉంది.
తాగడం వల్ల తూలుతూ, మత్తెక్కి ఉన్న పెట్రో ఆ ఇద్దరికీ ఒక్కో గ్లాసులో యాభై కోపెక్కులు పెట్టి ఇచ్చాడు. తోడి పెళ్ళి కూతురు మరిష్క వైపు చూసి కన్ను కొట్టింది,ఆ సైగ అర్థం చేసుకుని ఆమె అప్పడాల కర్రతో టేబుల్ మీద కొట్టింది.
‘ఇది సరిపోదు! దీనికి మేము పెళ్ళికూతురిని అమ్మము!’
పెట్రో మరలా కొన్ని వెండి నాణేలు మద్యం గ్లాసులో వేసి ఇచ్చాడు.
‘మేము ఆమెను పంపించము!’ గంభీరంగా కూర్చుని ఉన్న నటాల్య భుజం మీద తడుతూ గట్టిగా
అన్నారు ఆ చెల్లెళ్ళు.
‘ఎందుకు? మీకు నేను ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువే ఇచ్చాను!’
‘తనను వెళ్ళనివ్వండి,పిల్లలు’, నవ్వుతూ మిరోన్ వారికి ఆజ్ఞాపిస్తునట్టు చెప్పి, టేబుల్ వైపుకి
నడిచాడు. కాచిన వెన్న పెట్టిన అతని జుట్టు నుండి చెమట మరియు తడి పేడ వాసన వస్తూ ఉంది.
పెళ్ళికూతురి కుటుంబం,బంధువులు అందరూ లేచి నిలుచుని ఆయన అక్కడ కూర్చోవడానికి చోటు
చూపించారు.
పెట్రో తన దగ్గర ఉన్న చేతి రుమాలు ఒక కొస గ్రెగరి చేతుల్లో పెట్టి, వేగంగా టేబుల్ దగ్గరకు పెళ్ళి కూతురు ఉన్న చోటుకి కదులుతూ,తమ్ముడిని అనుసరించమన్నట్టు సైగ చేశాడు. నటాల్య ఆ రుమాలు రెండో కొసను కంగారుగా అందుకుంది.
అప్పటికే ఆ టేబుల్ చుట్టుపక్కల ఉన్న అతిథులు తమకు అల్పాహారంలో పెట్టిన మాంసాహారాన్ని గట్టిగా నములుతూ, తమ చేతులను తలలకు తుడుచుకుంటున్నారు. అనికె అప్పటికే ఓ బొమికతో ఉన్న ముక్కను నములుతూ ఉంటే, గడ్డం లేని అతని మూతి కిందకు, ఆ బొమిక చుట్టూ ఉన్న కొవ్వు కదులుతూ ఉంది.
లోపల కోపంతో, గ్రెగరి, తన మరియు నటాల్య స్పూన్స్ ఉన్న వైపు చూశాడు. అవి రెండు ఒక నాప్కిన్ తో కట్టేశారు. వాటి ఎదురుగా వేడివేడిగా పొగలు కక్కుతున్న ఉడకబెట్టిన చికెన్ పులుసు,నూడుల్స్; టేబుల్ మధ్యలో ఉండటం కూడా చూశాడు. అతనికి ఆకలిగా ఉంది;కడుపులో పేగులు అరుస్తున్నట్టు అనిపించింది.
ఇల్య పక్కన దర్యా కూర్చుంది. తన పెద్ద పళ్ళతో మటన్ ముక్కను కోరుకుతున్న ఆయన ఆమె చెవిలో గుసగుసగా ఏవో పరిహాసలాడుతున్నట్టున్నాడు,ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడింది. ఆమె సగం కళ్ళు మూసి నవ్వుతూ ఉంది.
ఎంతో వైభవంగా ఉంది ఆ విందు. మగవాళ్ళ చెమట, ఆడవాళ్ళ శరీర సువాసనలతో కలిసిన వాసనతో ఆ వాతావరణం అంతా నిండిపోయింది. చక్కటి పెట్టెల్లో కలరా ఉండల మధ్య పెట్టిన
గౌన్లు,కోట్లు,శాలువాలు మొత్తానికి ఒక మంచి సందర్భంలో ఇలా బయటకు వచ్చాయి.
గ్రెగరి నటాల్య వైపు చూశాడు. మొట్టమొదటిసారి అతను ఆమె పై పెదవి ఎత్తుగా,మందంగా ఉండి,
కింది పెదవి మీదకు జారిపోయినట్టు గమనించాడు. అంతేకాకుండా ఆమె కుడి బుగ్గ కింద,దవడ ఎముకకు సరిగ్గా కింద, గోధుమ రంగులో ఒక పుట్టుమచ్చ ఉంది. బంగారపు వర్ణంలో ఉన్న రెండు వెంట్రుకలు దాని మీద పడి ఉన్నాయి, ఎందుకో అది చూడగానే అస్సలు నచ్చలేదు అతనికి. అతనికి హఠాత్తుగా చక్కని ఉంగరాలు తిరిగిన జుట్టు మీద పడుతూ ఉండే అక్సిన్య గుర్తుకు వచ్చింది. అతను ఆ తలపులో ఉండగానే ఎవరో చెమట పట్టి ఉన్న తన చొక్కా వెనుకలో గడ్డి గింజలు పోస్తున్నట్టు అనిపించింది. అతను వణుకుతూ,బాధతో నములుతూ,తింటూ, పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఆ బల్ల చుట్టూ ఉన్న ముఖాల వైపు చూశాడు.
వాళ్ళు లేచి నిలబడ్డాక, పళ్ళు, గోధుములు కలిసిన వాసనతో తేన్పుతో ఒకాయన ముందుకు వంగి,
పెళ్ళికొడుకు బూటులోకి ఒక గుప్పెడు చిరుధాన్యాలు వేశాడు, వరుడుకి నరదిష్టి తగలకుండా
ఉండటానికి. వెళ్తున్న దారి అంతా ఆ ధాన్యాల వల్ల కాలు అంతా గీరుకుపోయి, చొక్కాకు బిగుతుగా
ఉన్న కాలర్ వల్ల మెడ అంతా బిగుసుకుపోయి; ఆ వివాహ పద్ధతులతో విసిగిపోయి, మెల్లగా తనలో
తానే తిట్టుకున్నాడు.
* * *
One thought on “డాన్ నది ప్రశాంతంగా ప్రవహిస్తోంది Part 2”