నీకు వీడ్కోలు పలికి
ఇంటికి తిరిగొస్తున్న దారంతా
ఆకాశం నుండి రాలిపడ్డ తోకచుక్కల్లా
నాకు నేనే కనబడకుండా
మాయమవుతుంటాను
ఆ రోజంతా నీ పేరే
హోమ్ వర్క్ లా
రాసుకుంటు ఉంటా
అడుగు తీసి అడుగు పెడితే
నీ ఊసులే
కళ్ళల్లో మెదులుతయి
నాలోని కదలికలు
కొద్దిరోజులదాకా
ఎంత వెతికినా దొరకవు
కొంత సమయం దాకా
అమ్మ చెప్పే ఏ మాట
చెవికెక్కదు
బొమ్మలన్న నయమేమో
వినపడకున్నా
చూడడానికి అందంగా కనబడుతాయి
నేను కనపడను
వినపడను
లోలోపలే దుఃఖాన్ని దిగమింగుకొని
అమ్మను ఇంకా బాధపెట్టొదని
ముఖానికింత నవ్వును పూసుకుంటాను
నువ్వు వస్తావనే ఆశతో
ఈ సంక్రాంతి పండగకి
అమ్మ,నేను
కొత్త ముగ్గులు నేర్చుకున్నాము
నువు వచ్చి వెళ్ళి
ఎన్నో రోజులు కాలేదని
ఈ మట్టిబుర్రలకు గుర్తుంటే కదా!
సకినాలు చుట్టేంతసేపు
అమ్మ మనసు నీ చుట్టే తిరుగుతున్నట్టుంది
ఏ పని చేస్తున్నా
తన కళ్ళు
నిన్నే వెతుకుతుంటాయి
మొన్నే ఇంట్లో
నీ పుట్టినరోజును
జరుపుకున్నాము
హ్యాపీ బర్త్డే అని
గీ పెట్టి అరిచినా
నువ్వయితే రావు కదా నాన్న
నా స్నేహితులు పిచ్చిమొద్దులు
వాళ్ళకేం తెలుసు
నువు సరిహద్దుల్లో
దేశానికి ఊపిర్లను ఊదే
పనిలో ఉన్నావని
నాన్న!
ఈ పండుగ పూట
ఏ మంచుపూల చెట్టుకింద
సంక్రాంతి ముగ్గువయినావు
ఈ దేశాన్ని రక్షించడానికి
కంచెవై మొలిచి
రోజుకో సారి
పుడుతూ చస్తూ
చస్తూ పుడుతూ
ఆ కాశ్మీర పూలవనంలోనే
బర్త్డే చేసుకుంటున్నావా ?
బీటలువారుతున్న హృదయాన్ని
నువు మిగిల్చి వెళ్ళిన జ్ఞాపకాలదారంతో
కుట్టుకోవటం
ఇది ఎన్నోసారో గుర్తుకులేదు
స్వేచ్ఛగా నవ్వుతూ వెళ్తున్న
ప్రతి ముఖాన్ని చూస్తుంటే
నువ్వు మీసాలు మెలేసినంత
గర్వంగా ఉంటది మాకు
దేశాన్నే
దేహంగా మలుచుకున్న
నిన్ను తలుచుకున్నప్పుడేమో
ఈ బాధలు
పువ్వుల్లా పలకరిస్తయి
ఇల్లును
అమ్మను
తమ్ముడ్ని
దగ్గరగా చూసినప్పుడు
నువ్వులేని ఆ క్షణాల్లో
మనసంతా
శూన్యాన్ని మింగి
నువ్వున్నప్పటి జీవితాన్ని
వెతుక్కుంటూ
నీ రాకకోసం
వేయికళ్ళతో వేచిచూస్తుంది
డా. తండ హరీష్ గౌడ్
- This author does not have any more posts.
బావుంది హరీష్ కవిత.
Tq sir
ఏ వస్తువునైనా కవిత్వం చేయగలవు.అభినందనలు హరీష్