మమ్ముక్కా… a.k.a. మమ్ముట్టి …(సెవంటీ ప్లస్) రెండు విభిన్న పాత్రల్లో నటించిన (protagonist and antagonist)లేటెస్ట్ సినిమా ఇది.
ఇది సినిమా కథన నేర్పులో ‘వాస్తవాధీన రేఖ’కు అటుఇటు నడిచే జానపద, మంత్రవాస్తవిక కథనంతో తీర్చిదిద్దబడిన, నడిచే సినిమా.
ఇదివరకు వచ్చిన ‘తుంబండ్’ అనే సినిమాతో పోలుస్తూ ‘ఈ కొత్త భారతీయ జాన్రాలోకి’ దీన్ని కూడా లాగి మరీ చేరిక చేస్తూ ఈ సినిమా గురించి మాట్లాడుతూ వున్నారు, సమీక్షలు చేస్తూ వున్నారు. అది అసమంజసం.
ఇటీవల మలయాళంలో వచ్చిన మూడు అచ్చమైన తాజా సినీ కథా గుచ్ఛాలలోనూ మమ్ముట్టి వుండటం, వాటిని బేతాళుడిలా భుజాన వేసుకుని తనే నడిపించడం ఒక అరుదయిన, ఒక అపురూప ఎంపికతో కూడకున్న అతను మాత్రమే చేయగలిగిన సాహసం; అస్సలు ఇటు ఊహించని చొరవ.
*
ఈ సినిమా 17 వ శతాబ్దంలో నడుస్తుంది… మలబారు నేలలో.
ఒక కారడవిలో వైపరీత్యం వల్ల దారి తప్పిన ఓ ‘తక్కువ కులం వాడు’ అనివార్యంగా చేరుకునే ఓ మూడంతస్తుల భవనంలో, చుట్టూ కథ అంతా జరుగుతుంది.
సినిమా మొత్తం ముచ్చటగా, ముప్పేట పేనిన మూడే మూడు పాత్రలు.
ఒకడు – ఆ భవన యజమాని.
రెండు – ఆ ఇంటి వంటవాడు, దాసీ పుత్రుడు.
మూడు – దారి తప్పిన ‘కింది కులం కళాకారుడు’.
అనూహ్య పరిణామాలలో దారి తప్పిన ఆ ‘కిందికులం’ యువకుడు ఎలా అధికారం అనూహ్యంగా దక్కించుకుంటాడు అనేదే ఈ జానపద కథ ఇతివృత్తం(వలయం.)
ఇంతకన్నా చెబితే ప్రేక్షకులకు వీక్షణ బిగి పోతుంది.
*
ప్రయత్నపూర్వకంగా monochrome (బ్లాక్ అండ్ వైట్ )లో తీసిన ఈ సినిమాలో కెమెరా పనితనం, ఫ్రేమ్ కంపోజిషన్, సౌండ్ డిజైన్ అనేవి మరో మూడు ప్రధాన పాత్రలను పోషించాయి.
*
నేను ఈ స్లో బర్న్ సినిమాని చూస్తున్నంత సేపూ నా మదిలో ఇంకో సినిమా సమాంతరంగా మెదులుతూ వుండింది.
అది ఆంద్రే తార్కవష్కీ తీసిన ‘స్టాకర్’.
స్టాకర్ సినిమాలో కూడా కథనం నడిపించేది మూడు ప్రధాన పాత్రలే.
ఒకడు – గైడ్.
రెండు – రచయిత.
మూడు – శాస్త్రవేత్త.
ఈ ముగ్గురూ ఒక మార్మిక ‘జోన్’ అనే చోట వున్న ఓ పవిత్ర ‘గది’కి చేరుకోవాలనుకుంటారు.
ఎవరి ఉద్దేశ్యాలు, ఆకాంక్షలు వారివి.
గైడ్ – ఆ గది చూడకపోతే తన జన్మ నిరర్థకం అనుకుంటాడు.
రచయిత – ఆ గదిని చూస్తే తన ప్రేరణకి ఇక మరణం లేదనుకుంటాడు.
శాస్త్రవేత్త – ఆ గదిని శాస్త్రీయంగా భౌతిక నియమానుసారం రుజువు చేసి వెలుగులోకి తీసుకోవాలనుకుంటాడు.
ఇవన్నీ చిందరవందర, తలకిందులు అవుతాయి సినిమా నడకలో.
ఆ మార్మిక గది గురించిన ఆత్మిక, ఆధ్యాత్మిక, కాల్పనిక, శాస్త్రీయతల గోష్ఠిని తార్కవష్కీ తన సినిమాలో బంధించిన, సృజించిన, తీర్చిన, దిద్దిన తీరు అజరామరం నేటికీ.
*
అందుకే స్టాకర్ సినిమా వెన్నులోంచే భ్రమయుగం సినిమా నడుస్తుంది అంటున్నాను.
పైగా సెట్ రూపకల్పనలోనూ(stalker scene as it is గా వాడారు), కెమెరా పనితనంలోనూ (long and delayed shot pattern), పాత్రల అస్తిత్వ సంభాషణ, సంశోధనలోనూ స్టాకర్ సినిమాతో చాలా దగ్గరి పోలికకు గురయ్యింది ఈ సినిమా.
*
ఇక సినిమా ఫ్రేమ్స్ కంపోజిషన్ లో అకిరా కురసావా తీసిన ‘రోషమాన్’ సినిమా గురుతకు రాకమానదు.
శిథిలమైన ఒక రాజభవనం…. డౌన్ యాంగిల్ లో శిథిల భవన దూలాలతో ఫ్రేమ్ కంపోజిషన్, వర్షంలో వైడ్, లాంగ్, డాలీ, ప్యాన్ షాట్స్… స్పష్టంగా స్ఫురణకు తెచ్చే ప్రేరణలు.
*
ఒక మూడంతస్తుల భవనం.
నేల, నేలమాళిగ, స్వర్గం.
వర్తమానం, గతం, భవిష్యత్తు.
కర్మ, పాపం, మోక్షం.
*
ఒక తాంత్రికుడి కుయుక్తులను ధిక్కరించడానికి వచ్చిన ఒక అగ్రకుల యువకుడు ప్రాణాలు కోల్పోయి, శరీరం మిగిలి, ఆత్మకు వేలాడుతూ వుంటాడు.
అతని రక్తసంబంధమే అయినా, దాసి పుత్రుడు అక్కడికి చేరుకుని తాంత్రికుడికి సేవకుడిగా ఊడిగం చేస్తూ వంటవాడిగా మిగిలిపోతాడు.
దారి తప్పిన మరో దళితుడు, కళాకారుడు తాంత్రికుడి వలయంలో చిక్కుకుని విముక్తి కోసం దేబిరించి, అనూహ్య పరిణామాల్లో అధికారం(ఉంగరం) చిక్కించుకుని నదికి ఆవలి తీరం చేరుతాడు.
*
ఆ మూడంతుస్తుల భవనంలో…
దైవం నిరాకరించబడుతుంది.
కులం నిర్వచించబడుతుంది.
విధి నిషేధాలు నేర్పించబడుతుంది.
ధిక్కరిస్తే శిక్ష అమలు చేయబడుతుంది.
వ్యవస్థలోకి తిరిగి వస్తే క్షమాపణ ఇవ్వబడుతుంది.
అయితే, ఇదంతా… సేటన్ (ప్రలోభం) అనే తాంత్రికుడి ఆవరణలోనే.
క్రైస్తవంలో, ఇస్లాంలో వున్నట్టు సైతాను(ప్రలోభం) హైందవ పురాణంలో ఒక పాత్రగా లేదు మరి.
*
ఎన్నో పొరలను, తాత్విక, ఆత్మిక విషయాలను అలవోకగా, చాలా పాసింగ్ గా మాట్లాడుతూ నడిచే ఈ సినిమా ఇటీవలి నిగూఢ, భార, లోతుల కదంబ మాలిక.
*
మలబారుకు విదేశీయులు గుర్రాలపై తుపాకులతో రావడంతో ఈ సినిమా ముగిసిపోతుంది. అయితే, చాలా చాకచక్యంగా మలబారుకన్నా ముందే ఈ నేలకు వచ్చిన సుల్తాను గుర్రాల పదఘట్టనలను ఎందుకని తన కథన నడకలో విస్మరించిందో నాకు బోధ పడలేదు. వారికీ చరిత్రలో అనివార్యంగా ఈ నేలపై దాదాపుగా 800 పేజీలు వున్నాయి కదా?
*
PS: ధర్మవీర్ భారతి రాసిన ‘అంధాయుగ్’ నాటకంలో కురక్షేత్రం ముగిసాక అశ్వథ్థామ మరణం తర్వాతే ద్వాపర యుగం పరిసమాప్తి అయి కలియుగం వస్తుంది, ఆ కలియుగం అరాచకాలకు శ్రీకారం అవుతుంది అనే చర్చను చేస్తాడు రచయిత. ఈ ‘భ్రమయుగం’లోనూ అంధాయుగ్ ఛాలయున్నాయి మరి నామటుకయితే.