గోర్కీ సాహిత్యవ్యాసాలు మొదటిసారి చదివినప్పుడు అందులో ఆయన టాల్ స్టాయి గురించీ, చెకోవ్ గురించీ రాసుకున్న జ్ఞాపకాలు నన్ను చాలా కదిలించాయి. ఒక సాహిత్యకారుడు మరో సాహిత్యకారుడి గురించి రాయదలుచుకుంటే ఎలా రాయాలో ఆ జ్ఞాపకాలు ఒక నమూనా. అందులో ఆయన చెకోవ్ గురించి రాస్తూ ఇలా అనుకుంటాడు:
చెహోవ్ ని గురించి చాలా రాయవచ్చు. దానికి సూటి అయిన వివరణ కావాలి, మరి నా లోపం అదే. ఆయన్ని గురించి, ఆయన తన ‘స్తెప్ మైదానం’ రాసుకున్నట్టుగా రాయాలి. అది పరిమళభరిత, స్వచ్ఛవాయువులు వీచే యెంతో రష్యన్ కథ. ఆలోచనాయుతంగా, తీరని అస్పష్టమైన కోరిక గల కథ. యేవళ్ళదేనా ఆత్మకథ.
ఆర్వియార్ అనువాదం చేసిన ఈ వ్యాసాలు 1985లో పుస్తకరూపంలో వచ్చింది. ఆ వ్యాసాలు చదివినవెంటనే చెకోవ్ రాసిన స్టెప్పీ కథ చదవాలని ఎంతగా కొట్టుకుపోయానో చెప్పలేను. కాని ఆ కథ తెలుగు అనువాదాల్లో దొరకలేదు. ఆ రాదుగ పబ్లిషర్సే చెహోవ్ కథలు ఇంగ్లిషు అనువాదాలు నాలుగు సంపుటాలు 1987 లో తీసుకొచ్చారు. ఆ పుస్తకాలు నా చేతికి రాడానికి 1991 దాకా ఆగవలసి వచ్చింది. ఆ సంపుటాలు తెరవగానే అన్నిటికన్నా ముందు చదివింది, స్టెప్పీ కథనే. పెద్ద కథ. నవలిక అనవచ్చు. ఆ కథ చదవగానే అది నా కథనే అనిపించింది. ఎందుకంటే ఆ కథలో ఎగోర్ చిన్నప్పుడే తన తల్లికి, తండ్రికి దూరంగా ఎక్కడో ఒక బోర్డింగు స్కూల్లో చేరడానికి వెళ్ళే ప్రయాణం తాలూకు కథ అది. ఆ ప్రయాణం సుదీర్ఘమైన రష్యన్ గడ్డిమైదానాల గుండా సాగుతుంది. ఆ ప్రయాణకథ చదవగానే నాకు నా చిన్నప్పుడు మా ఊరు వదిలిపెట్టి ఎక్కడో దూరంగా ఒక గురుకుల పాఠశాలలో చేరడానికి చేసిన ప్రయాణమే గుర్తొచ్చింది. నా ‘కొన్ని కలలు కొన్ని మెలకువలు’లో నేను తాడికొండ స్కూల్లో చేరినప్పటి అనుభవాల్ని తలుచుకుంటూ చెకోవ్ స్టెప్పీ కథనే గుర్తుచేసుకున్నాను.
స్టెప్పీ కథ చదగానే వెంటనే ఆ కథని తెలుగులోని అనువదించాలనుకున్నాను. చెకోవ్ ఎటువంటి లలిత, మృదుల భాషతో, రంగుల్తో, ముద్రల్తో ఆ కథ చెప్పుకొచ్చేడో అటువంటి తూలికాతుల్యమైన తెలుగులో ఆ కథని అనువదించాలని అనుకున్నాను. కథ అనువదించకుండానే దానికి ఏ శీర్షిక పెట్టాలో కూడా మనసులో సిద్ధం చేసుకున్నాను. ‘గరిక పచ్చ మైదానం’. అదీ ఆ శీర్షిక. ఎందుకని ఆ పేరు? ‘గరికపచ్చమైదానాల్లో, తామరపూవుల కోనేరుల్లో, తల్లి సందిటా, తండ్రి కౌగిటా, దేహధూళితో, కచభారంతో, న్రోళుల వ్రేళులు, పాలబుగ్గలు, విశ్వరూపమున విహరిస్తుండే పరమాత్మలు మీరేనర్రా!’ అని మహాకవి తన ‘శైశవగీతి ‘ కవితలో వాడిన మాట. స్టెప్పీ అనే పదానికి అది సమానార్థకం అవునో కాదో తెలియదుగాని, స్టెప్పీ కథకి మాత్రం అంతకన్నా మెరుగైన శీర్షిక మరొకటి ఊహించలేకపోయాను.
1991 నుంచి ముప్ఫై ఏళ్ళు గడిచిపోయాయి. ఆ కథలో మొదటి వాక్యం కూడా అనువాదం చెయ్యలేదు. కాని ఎప్పుడేనా స్టెప్పీ అనే మాట విన్నప్పుడో, విస్తారంగా వ్యాపించిన పచ్చికబయళ్ళను చూసినప్పుడో, చిన్నప్పుడే ఇల్లు వదిలి హాస్టల్లో చేరే పిల్లల్ని చూసినప్పుడో ఆ కథ మనసులో మెదిలి, ఈ వారం మొదలుపెడదాం, ఇదిగో, ఈ నెలాఖరుకు పూర్తి చేసేద్దాం అని నాకు నేను చెప్పుకుంటూ ఉండేవాణ్ణి.
కాని, ఇంక ఇప్పుడు ఆ అవసరం లేకుండా చేసారు కుమార్ కూనపరాజు, అరుణా ప్రసాద్ గార్లు. ఆంటోన్ చెకోవ్ కథలు-1 పేరిట చెకోవ్ కథల్లోంచి వంద కథలు తెలుగులో వెలువరించి ఏడాది తిరక్కుండానే ఆంటోన్ చెకోవ్ కథలు-2 తీసుకొచ్చారు. ఇందులో, ఇదుగో నేనెంతోకాలంగా తెలుగులోకి తెద్దామనుకున్న స్టెప్పీ కథ కూడా ఉంది. తెలుగు వాళ్ళు ఎంత భాగ్యవంతులు! వాళ్ళ కోసం తమ ధనాన్నీ, కాలాన్నీ వ్యయపరిచి ఈ కథనీ, ఇటువంటివి యాభై కథల్తో చెకోవ్ ని తెలుగు లోకి తేవడం ఒక వ్రతంగా పెట్టుకున్నవాళ్ళున్నారు తెలుగుజాతికి!
చెకోవ్ కథలు-1 వెలువరించినప్పుడు కుమార్ ఆ పుస్తకానికి నాతో ముందుమాట రాయించారు. ఈ రెండో సంపుటం వెలువరిస్తున్నామని చెప్పి దానికి కూడా ముందుమాట రాయమని అడిగారుగాని, రాయలేకపోయాను. కాని రాజు గారికి నా మీద ఉన్న నిష్కారణ ప్రేమకి హద్దుల్లేవు. మొన్న ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈ చెకోవ్ కథలు-2 ఆవిష్కరించే భాగ్యం నాకు అందించారు.
గోర్కీ రాసుకున్నట్టే చెకోవ్ గురించి చాలా రాయవచ్చు. మొన్న ఆవిష్కరణ సభలో చాలానే మాట్లాడేను కూడా. ఎందుకంటే, చెకోవ్ జీవించి కథలు రాసినకాలానికీ, నేడు మనం భారతదేశంలో జీవిస్తున్న కాలానికీ చాలా పోలికలు ఉన్నాయి. చెకోవ్ తన జీవితకాలంలో ముగ్గురు చక్రవర్తుల్ని చూసాడు. వాళ్ళల్లో రెండవ అలెగ్జాండర్ ఉదారుడు, సంస్కర్త. సెర్ఫ్ డమ్‌ని రద్దుచేసినవాడు. కాని ఆయన ఉగ్రవాదుల దాడిలో మరణించాడు. ఆయాన్ తర్వాత సింహాసనాన్ని అధిష్టించిన మూడవ అలెగ్జాండర్ సంస్కరణలకి స్వస్తి చెప్పి, రూసిఫికేషన్ మొదలుపెట్టాడు. మన దేశంలో కూడా తొంభైల సంస్కరణ దశ గడవగానే మన పాలకులు కూడా ఒక ‘రూసిఫికేషన్’ మొదలుపెట్టారు. ఇటువంటి కాలం సహజంగానే ద్వంద్వ ప్రమాణాలకీ, ద్వంద్వనీతికీ, ఆత్మవంచనకీ పతాకకాలంగా మారుతుంది. ఒకప్పుడు రష్యాలో ఇటువంటి కాలాన్ని ధిక్కరిస్తో ఒక టాల్ స్టాయి, ఒక చెకోవ్, ఒక గోర్కీ వంటి వారు రచనలు చేసారు. కాని మన దేశంలో ఇప్పుడు అటువంటి రచయితలు కనబడకపోగా కనీసం అటువంటి రచయితలు అవసరమని నమ్మేవాళ్ళు కూడా కనిపించట్లేదు.
ఇదుగో, చెకోవ్ కథలు-1 సంగతే తీసుకోండి. కిందటేడాది రాజు గారు ఈ పుస్తకం వెలువరించినప్పుడు నేను నా ఇంట్లో దాచుకున్న ఆస్తినంతటినీ ఎవరో వీథిలో పరిచేసినట్టుగా అనిపించింది. అంతదాకా నేను మాత్రమే చదువుకున్న కథలు, అపురూపంగా దాచుకున్నవాటిని రాజుగారు దోసిళ్లతో వీథిపొడుగునా విరజిమ్మారనిపించింది. కానీ ఏడాది గడిచింది. ఆ పుస్తకం మీద ఒక సమీక్ష గాని, చర్చ గాని, చివరకి ఫేస్ బుక్ లోనో, ఇన్స్టా లోనో చిన్నపాటి పోస్టుగాని ఎవరూ పెట్టగా నేను చూడలేదు. ఆ కథలు చదివితే కదా, మనం ఎటువంటి కథలు రాయవలసి ఉండీ రాయడం లేదో మనకి తెలిసేది! మన చుట్టూ ఉన్న సమాజంలో, మనుషుల్లో మనం చూస్తున్న డొల్లతనాన్నీ, దివాలాకోరుతనాన్నీ కథలుగా ఎలా మార్చవచ్చో తెలిసేది! కథకుల్లో అగ్రేసరుడని ప్రపంచమంతా కొనియాడుతున్న ఒక మహాకథకుడి కథలు తెలుగులోకి వచ్చాక కూడా, వాటిని చదవకుండా, వాటి గురించి మాట్లాడుకోకుండా, కథకులు కథలు రాస్తున్నారంటేనూ, కథాసంపుటాలు వెలువరిస్తున్నారంటేనూ ఏమనుకోవాలి?
ఇదుగొ, ఈ రెండో సంపుటం ఉంది. ఇందులో చెకోవ్ మొదటి దశలో రాసినవీ, ఆయన అత్యంత పరిణత దశలో రాసినవీ కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా The Steppe (1888), Lights (1888), The Story of an Unknown Man (1892), The Black Monk (1894), In the Ravine (1900) అనే ప్రసిద్ధమైన అయిదు పెద్ద కథలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకం వెల ఆరువందలు. కానీ ఈ అయిదు కథలే వేసి వెయ్యి రూపాయలు ధరపెట్టినా కూడా ఈ పుస్తకం కొనుక్కుని దాచుకోవలసిందే అని చెప్పగలను.
స్టెప్పీ కథ గురించి ఇంతకుముందే రాసాను. అది ఒక పసితనపు కళ్ళతో రష్యాని చూసిన కథ అయితే, The Black Monk ఒక ఉన్మాది కళ్ళతో రష్యాని చూసిన కథ. ఇక్కడ ఉన్మాదం, లేదా అనారోగ్యం లేదా భ్రమ, చిత్తచాంచల్యం ఏదైనాగానీ, చెకోవ్ స్వయంగా వైద్యుడై ఉండికూడా ఆ మాటని పరిపూర్ణ ఆరోగ్యమనే అర్థంలో ఆ కథ రాసాడు. మనుషులు సౌకర్యవంతమైన సాధారణ దైనందిన జీవితాన్ని కోరుకుంటో, దానికోసమే బతుకుతో ఎలా మృతప్రాయులుగా మారిపోతారో, ఆ సామాజిక ప్రవృత్తిమీద ఎక్కుపెట్టిన విమర్శ అది. మాజికల్ రియలిజం అనే మాట పుట్టడానికి కనీసం అరవయ్యేళ్ళముందు రాసిన మాజికల్ రియలిస్టిక్ కథ అది.
ఇంకా చాలా రాయాలని ఉంది. కాని ఇక్కడితో ఆగుతాను. ఆగే ముందు, చెకోవ్ గురించి గోర్కీ రాసుకున్న ఈ వాక్యాల్ని మరో సారి తలుచుకుంటాను. గోర్కీ ఇలా అంటున్నాడు:
‘చెహోవ్ సమక్షంలో సాదాగా, మరింత సత్యపూరితంగా, నిసర్గతత్త్వంతో వుండాలని ప్రతి వాళ్ళకీ తెలియకుండానే కోరిక పుడుతుందేమోననుకుంటాను. ..చెహోవ్ తన యావజ్జీవితమూ పరిశుద్ధాత్ముడిగానే వున్నాడు. యెప్పుడూ ఆంతరంగికంగా అమలినంగానే వున్నాడు… అలాంటి మనిషిని గుర్తు చేసుకోవడం యెవళ్ళకేనా హాయినిస్తుంది. హఠాత్తుగా ఉల్లాసం దర్శించినట్లు వుంటుంది. జీవితపు పరమార్థాన్ని మళ్ళీ అది అందిస్తుంది.’
ఆంటోన్ చెకోవ్ కథలు-2, అనువాదం: అరుణా ప్రసాద్, సాహితి ప్రచురణ, వెల రు.600/- కావలసినవారు 0866-2436643 లేదా 9849992890ని గాని లేదా sahiti.vja@gmail.comని మెయిల్ ద్వారాగాని సంప్రదించవచ్చు.