దాదాపు పది పదిహేనేళ్ళ కిందట తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం వారు ఒక కథాసంకలనం తీసుకొచ్చారు. ‘కథలు-అలలు’ పేరిట తీసుకువచ్చిన ఆ సంకలనం సంపాదకుల్లో ఒకరుగా కె.రామచంద్రారెడ్డి నాకు పరిచయమయ్యాడు. అప్పట్లో ఆయన కాకినాడలో ఒక డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నట్టు గుర్తు. పరిచయమైన ఆ మొదటి సమావేశాల్లోనే అతనిలోని ఉత్సాహం, సాహిత్య పరిజ్ఞానం నన్ను చాలా ఆకట్టుకున్నాయి.
అప్పట్లోనే వొకసారి వాళ్ళ వూరికి సమీపంగా, పొలాల్లో ఉన్న ఒక దేవాలయానికి అతను నన్ను తీసుకువెళ్ళాడు. అది ఎప్పుడో ఏ తొమ్మిది, పదిశతాబ్దాల్లోనో ఎవరో చాళుక్యరాజు కట్టించిన శివాలయం. ‘చిన్నయ్య గుడి’ అని స్థానికులు పిలుస్తారట. ఆ దేవాలయం ఎదట ఒక చిన్న కొలను, అందులో నిండుగా విరిసిన తామరపూలు, చుట్టూ విరగపండిన వరిచేలు. ఆ సుందరదృశ్యాన్ని నాకు చూపించాలని అతను పడ్డ ఆరాటం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. అప్పటికి మా మధ్య పరిచయం స్నేహంగా కూడా మారలేదు. కాని ఒక పరిచయస్థుడు అట్లాంటి సౌందర్యాన్ని ఇష్టపడతాడని అనుకోగానే అతను ఆ శ్రమతీసుకోవడం నన్ను చకితుణ్ణి చేసింది. ఇప్పటికీ రామచంద్రారెడ్డిని తలుచుకోగానే ఆ ప్రాచీన శివాలయమూ, ఆ తామరపూల కొలనూ, పండిన పొలాల మీద పరుచుకున్న కొబ్బరిచెట్ల ఊదారంగు నీడలూ గుర్తొస్తాయి నాకు.
సాహిత్య, చారిత్రక, సామాజిక అధ్యయనాలతో పాటు, అతనిలోని ఈ సౌజన్యానికి ఎల్లల్లేవు కాబట్టే డేవిడ్ షూల్మన్ లాంటి బహుభాషావేత్తకి రామచంద్రారెడ్డి ఒక మంచి మిత్రునిగా మారిపోయాడు. వాళ్ళు కలిసి తెలుగు ప్రాచీనకావ్య పఠనం చేస్తూ వుంటారు. ఈ అధ్యయనం వల్లే అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు పర్యటించాడు రామచంద్రారెడ్డి. వూరికే సమావేశాల్లో ఫోటోలు తీసుకోవడానికి కాదు, పరిశోధన గోష్ఠులలో పాల్గొనడానికి.
షూల్మన్ తమిళభాషా చరిత్ర మీద తాను రాసిన, Tamil, A Biography (2016), ఒక హీబ్రూ యూనివర్సిటీ సంస్కృత ప్రొఫెసరుకూ, ఇద్దరు తెలుగు మిత్రులకూ అంకింతమిచ్చారు. ఆ ఇద్దరు తెలుగు మిత్రుల్లో రామచంద్రారెడ్డి ఒకరని తెలిసినప్పుడు నాకెంత గొప్పగా అనిపించిందో చెప్పలేను. ‘ప్రాచీన, ఆధునిక తెలుగు సాహిత్యాల్లో రసజ్ఞుడు’ అని షూల్మన్ తన వొక పుస్తకంలో రామచంద్రారెడ్డిని ప్రస్తుతించారు. తెలుగు ప్రాచీనకావ్య సాహిత్యానికి సంబంధించి దేశదేశాల యూనివర్సిటీలలో షూల్మన్, తను ఇచ్చే ప్రసంగాలలో రామచంద్రారెడ్డి అవగాహనను ప్రస్తావనకు తెస్తూవుంటారు.
ఒక సుప్రసిద్ధ ఇండాలజిస్టు, శాంతియోధుడు, ప్రాచ్యపాశ్చాత్యభాషావేత్త అయిన షూల్మన్ ప్రేమనీ, ప్రశంసనీ ఇంతగా కొల్లగొట్టుకున్నా కూడా రామాచంద్రారెడ్డి ఆ మాటలు ఎక్కడా రాసుకోడు, చెప్పుకోడు. అందుకని, ఇదుగో, ఈ నాలుగు వాక్యాలూ ఆయన గురించే రాసే అవకాశం నాకిన్నాళ్ళకు ఈ రూపంలో వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
2
ప్రసిద్ధ చలనచిత్రదర్శకుడు, రచయిత వంశీ 20004-05 మధ్యకాలంలో స్వాతి వారపత్రికలో ‘మా పసలపూడి కథలు’ పేరిట రాసిన 72 కథల మీద ఈ పుస్తకం ఒక సమగ్రపరిశోధన. డాక్టోరల్ సిద్ధాంత గ్రంథం. అయితే దానిలోని అకడమిక్ పరిభాషనూ, పట్టికల్నీ, పదజాలాన్నీ వీలైనంత పాఠకసన్నిహితంగా మార్చి రామచంద్రారెడ్డి ‘వంశీ మా పసలపూడి కథల కమామిషు’ పేరిట తీసుకువచ్చిన పుస్తకం ఇది.
పసలపూడి కథలు పత్రికల్లో ధారావాహికంగా వచ్చినప్పుడు మాత్రమే కాక, పుస్తక రూపంగా వచ్చాక కూడా విశేషమైన పాఠకాదరణ పొందాయి. గత ఇరవయ్యేళ్ళల్లో ఈ పుస్తకం ఇప్పటిదాకా పన్నెండు సార్లు పునర్ముద్రణ పొందింది. దేశవిదేశాల్లో ఉన్న తెలుగువాళ్ళకి అభిమాన గ్రంథంగా మారింది. ఎవరేనా తెలుగు ప్రాంతాలనుంచి అమెరికా వెళ్ళేటప్పుడు తీసుకుపోదగ్గ పుస్తకాల్లో తప్పనిసరి పుస్తకంగా మారింది.
విస్తృత జనాదరణ పొందిన రచనల్ని సాధారణంగా పండితలోకం అంతగా పట్టించుకోదు. అందులో తత్కాలీన అభిరుచిని దాటి అధ్యయనం చెయ్యవలసిన అంశాలున్నాయని గాని, లేదా పరిశీలించదగ్గ సత్యాలుంటాయనిగాని సాహిత్యవిమర్శకులు భావించరు. ఒకవేళ అటువంటి రచనల్ని తప్పనిసరిగా పరిశీలించవలసి వచ్చినా, వాటికి జనాదరణ ఎందుకు లభించిందన్న అంశాన్నే పట్టించుకోడం మీద దృష్టి పెడతారు తప్ప వాటిల్లో లోతైన సామాజిక-తాత్త్విక అంశాలున్నాయని భావించరు.
కాని రామచంద్రారెడ్డి పసలపూడి కథల్ని పరిశోధనకు ఎంచుకుని వాటిలోని జనామోద పార్శ్వాల మీద కన్నా కూడా ప్రాంతీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలమీద దృష్టిపెట్టాడు. అంతే కాకుండా చాలా అంశాల్ని చాలా లోతుగా పరిశీలించాడు. ఇంకా చెప్పాలంటే, పసలపూడి కథల్ని ఉదాహరణగా తీసుకుని స్వాతంత్య్రానంతరం తూర్పుగోదావరి జిల్లా మధ్యడెల్టా ప్రాంతంలోని కౌటుంబిక, గ్రామీణ, నాగరిక పరివర్తనను నిశితంగా పరిశీలించాడు. ప్రాంతీయ స్పృహతో వచ్చిన ఒక రచనను ఎలా సమీపించాలి, ఎలా అధ్యయనం చెయ్యాలి అన్న పద్ధతులకి ఈ సిద్ధాంత గ్రంథం ఒక ఒరవడి పెడుతున్నదని చెప్పవచ్చు.
ఒక ప్రాంతానికి సంబంధించిన జీవితాన్ని, సామాజిక పరిణామాన్ని చిత్రిస్తూ ఒక మాలికగా వచ్చిన కథాసంపుటాలు తెలుగులో కొత్తకాదు. అమరావతి కథల తర్వాత అటువంటి ఒక ప్రక్రియ తెలుగులో కొత్త జవసత్త్వాలు సంతరించుకుని, అంతదాకా తక్కిన తెలుగు సమాజానికి అంతగా పరిచయంలేని ఎన్నో జనజీవిత దృశ్యాల్ని ఐతిహాసిక ప్రమాణాల్తో చిత్రించడం మొదలయ్యింది. పసలపూడి కథల్ని వాటిలో ఒకటిగా చూస్తూనే, ఆ కథలు తక్కిన కథామాలికల కన్నా ఎక్కడ ప్రత్యేకంగా నిలబడుతున్నాయో రామచంద్రారెడ్డి ఈ పుస్తకంలో వివరించాడు.
ఈ ప్రత్యేకతను ఆయన నాలుగు అంశాల్లో పట్టుకున్నారు. అవి భాష, శిల్పం, వర్ణనలు, కథల శీర్షికల-పాత్రల-అప్రధాన పాత్రల పేర్ల ప్రస్తావనల్లోని విలక్షణత. ఈ ప్రత్యేకతల్ని ఆయన స్థాళీపులాకన్యాయంగా కాక, వీలైనంత సమగ్రంగా, కథల పేర్లతో పాటు వివరించడం ఈ రచనలోని నిజమైన పరిశీలన. ఈ నాలుగు అంశాల్లోనూ ఆయన చాలా లోతైన సూత్రాల్నీ, మామూలు కంటికి కనిపించని విశేషాల్నీ కూడా పట్టుకున్నాడు.
మొదట భాష సంగతి చూద్దాం. సాధారణంగా తెలుగు సాహిత్యలోకంలో ఒక అపోహ ఉంది. అదేమంటే గత శతాబ్దంలో పత్రికల్లోనూ, సమాచార ప్రసార సాధనాల్లోనూ ప్రామాణికభాషగా స్థిరపడ్డ తెలుగు, గోదావరి జిల్లాల భాష అని. కాని ఎవరేనా ఒక్కసారేనా గోదావరిజిల్లాలో రాజమండ్రినుంచి కాకినాడ దాకా ద్వారపూడి, అనపర్తి మీంచి బస్సులో ప్రయాణిస్తే అటువంటి అభిప్రాయం ఎంత పొరపాటో వెంటనే గ్రహిస్తారు.
తెలుగు మాట్లాడంలో తక్కిన ప్రాంతాల్లో ఎంత స్థానీయమైన యాస, కాకువు, ఉచ్చారణ వికల్పాలు ఉన్నాయో గోదావరిజిల్లాల్లో కూడా అంతే బలంగా ఉన్నాయి. అసలు గోదావరిజిల్లాల్లో గ్రామాల్లో మాట్లాడుకునే భాషకీ, శిష్టవ్యవహారికంగా పేరుపడ్డ ప్రామాణిక భాషకీ మధ్య ఉన్న దూరం, కళింగాంధ్ర, తెలంగాణా, రాయలసీమ ప్రాంతాల్లోని పలుకుబడికీ, ప్రామాణిక భాషకీ మధ్య ఉన్న దూరంలాంటిదే.
పసలపూడి కథల్లో భాష గోదావరి జిల్లాలోని భాష కూడా కంటే, మధ్య డెల్టా ప్రాంతంలోని పలుకుబడి ప్రధానంగా కనిపిస్తుందని చెప్తూ, ఆయా పదప్రయోగాల్ని వ్యాకరణసహితంగా రామచంద్రారెడ్డి వివరించిన తీరు బహుథా ప్రశంసనీయం. తెలుగు భాషలోని క్రియాపదాలు, నామవాచకాలు, విశేషణాలు ఎటువంటి అంతర్గత తర్కంతో యాసగా మారాయో ఆయన ఎన్నో ఉదాహరణల్తో వివరించేరు. ఇక కొన్ని పదప్రయోగాల్ని అర్థం చేసుకోడానికి భాషాజ్ఞానం, వ్యాకరణ జ్ఞానం ఒక్కటే చాలదు. స్వాతంత్య్రానంతరం గోదావరి జిల్లాల్లో జరిగిన సామాజిక పరిణామం గురించిన చెప్పుకోదగ్గ పరిజ్ఞానం లేకపోతే ఆ పదరూపాల్ని వివరించడం కష్టం. కావడానికి నేను కూడా గోదావరిజిల్లా వాణ్ణి అయినప్పటికీ, ఇందులో రామచంద్రారెడ్డి ప్రతి పదానికీ ఇచ్చిన వివరణల్ని గోదావరి జిల్లా సామాజిక చరిత్ర చదువుతున్నంత శ్రద్ధగా చదివాను. ‘గంటాగళాసు’, ‘స్వరాజ్యరెడ్డి’, ‘మేడచెల్లాయమ్మ’, ‘అనసూర్య’, ‘మాసరమ్మ’, ‘దబ్బిళించడం’, ‘పండించడం’, ‘దొర్చుకు తినడం’, ‘గిల్లుకోవడం’, ‘పాచిలు చెయ్యడం’, ‘పేరెల్లిపోవడం’, ‘ఇగణంలా ఉండడం’, ‘లేవరకం’, ‘పెద్దజబ్బు’, ‘తొలాట సినిమా’, ‘బిళ్ళారీ అద్దం’, ‘గోర్మిటీలు’, ‘శనపులస’, ‘గీర’, ‘ఓవల్ రైట్’, ‘గొల్లిగాడు’, ‘బొంబాయి’, ‘బెవారడం’, ‘పునాస’, ‘గ్యాసుబిళ్ళలు’, మొదలైన పదాల వివరణలు నన్ను మరింత అబ్బురపరిచాయి.
రెండవ అంశం శిల్పం. ‘పసలపూడి కథల్లో ముఖ్యమైన రెండు శిల్ప లక్షణాలు కనిపిస్తాయి. ఒకటి పాత్రల వ్యక్తిత్వ చిత్రణ, రెండోది కథనం’, అని చెప్తూ ఈ పరిశీలనకు సమర్థనగా కొన్ని కథల్ని వివరిస్తాడు. ‘కథకి అదనపు అందాన్నిచ్చే విశేషణాలు, వర్ణనలు అసంఖ్యాకంగా ఉన్నా వంశీగారి కథల్లో ప్రత్యేక శిల్ప విన్యాసం ఏమిటంటే పాఠకుడికి దగ్గరయ్యే అత్యంత సహజసుందరంగా కథను నిర్మించడం’ అంటాడు రామచంద్రారెడ్డి. అటువంటి వాస్తవిక, స్వాభావిక జీవన చిత్రణకు ఉదాహరణలుగా కొన్ని కథల్ని చర్చిస్తారు. ఆ తర్వాత ‘కథకుడికి జీవితం పట్ల ఉండే దృక్పథం కూడా శిల్పనైపుణ్యమే’ అని ఒక ప్రతిపాదన చేస్తారు. ఇది ఆలోచించవలసిన పరిశీలన.
పసలపూడి కథల్లో వర్ణనల పరిశీలన ఈ గ్రంథంలోని మూడవ అంశం. ఆ వర్ణనల్ని మానవస్వభావ వర్ణనలు, ప్రకృతి, పల్లెలు, పంటల వర్ణనలుగా వింగడించి ఒక్కో విభాగాన్నీ మరింత వివరంగా చర్చిస్తారు. ‘పసలపూడి కథల్లో కథా రచయిత ప్రత్యేకంగా ఎలాంటి బయటి ఉపమానాల్నీ పట్టుకుని చెప్పడం కనబడదు. ఆ సమయానుకూలంగా, సందర్భానుసారం అక్కడున్న వాతావరణాన్ని అలా చెప్పడం మాత్రమే ఉండటం చేత సదరు కాలాదులలోనికి పాఠకుడు సునాయాసంగా అప్రయత్నంగా ప్రయాణం సాగించేస్తాడు’ అంటారు ఒకచోట. నిజానికి ఉత్తమ సాహిత్యంలో వర్ణన, కథనం వేటికవి విడి విడి అంశాలుగా ఉండవు. చాలసార్లు వర్ణనలు కథావాతావరణాన్ని నిర్మించడానికీ, కథాగమనంలో వచ్చే మార్పుల్ని సూచించడానికీ, పాత్రల మనఃస్థితితో మనం మమేకం చెందడానికీ ఉపకరిస్తాయి. ఈ సంగతి తెలుసుకాబట్టే, రామచంద్రారెడ్డి పసలపూడి కథల్లో వంటల వర్ణనల గురించి రాస్తూ ‘భోజనం వంకన అక్కడి ప్రజల నడుమ అనురాగానికి ఆ సందర్భాలు ప్రతీకలు. అక్కడి మనుషుల మధ్య పెనవేసుకున్న సాంఘిక జీవనవిధానాల్ని ఆ భోజన పద్ధతుల ద్వారా వివరించే ప్రయత్నాలు అవి’ అని అనడం గమనించాలి.
పసలపూడి కథల్లో మానవసంబంధాలు, వ్యవసాయ సమాజం గురించి కూడా కొంతచర్చించేక, కథల పేర్లు-పాత్రల పేర్లు-వాటి వైచిత్రి మీద మరికొంత సూక్ష్మంగా వివరించేరు. కథల్ని పరిశీలించేటప్పుడు ఈ అంశాన్ని కూడా పరిశీలించవచ్చునని తోచడం ఒక విశేషంకాగా, ఇందులో ఆయన చేసిన చాలా పరిశీలనలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఉదాహరణకి, ఇవి ఒక ప్రాంతానికి చెందిన కథలు కాబట్టి, మరీముఖ్యంగా ఒక గ్రామానికి చెందిన మనుషుల, కుటుంబాల కథలు కాబట్టి, అవే పాత్రలు తిరిగి తిరిగి కనిపించడం సహజం. ఆయన ఆ పాత్రల్ని కథలవారీగా ప్రధాన, అప్రధాన పాత్రలుగా విడదీసి పేర్కొన్నాడు. సాధారణంగా తెలుగుకథలో అయిదుకి మించి పాత్రల పేర్లు చెప్పిన కథలు అరుదు అనీ, వంశీ కథల్లో అయిదుకు తక్కువగా పాత్రల పేర్లు చెప్పిన కథలు అరుదు అనీ అంటారు. పసలపూడి కథల్లో అయిదు మొదలుకుని పద్దెనిమిది పాత్రల వరకూ పేర్లతో సహా పాత్రలు కనిపిస్తాయని చెప్పడం గొప్ప పరిశీలన.
3
పసలపూడి కథలు పుస్తక రూపంగా వచ్చిన కొత్తలో మా ఇంటికి ఇద్దరు ప్రసిద్ధ కథకులు వచ్చారు. వారిద్దరూ ప్రజా జీవితాన్ని కథల్లో చిత్రించడంలో అసమానమైన ప్రతిభ చూపించిన రచయితలు. వారు మా ఇంట్లో టీపాయ్ మీద పసలపూడి కథలు పుస్తకం చూసి కించిత్ తూష్టీంభావం మొదట్లో వ్యక్తపరచడం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఆ కథలు రాసినది ఒక చలనచిత్ర దర్శకుడు కాబట్టి అందులో చెప్పుకోదగ్గ సాహిత్యవిలువలు ఉండకపోవచ్చుననే అభిప్రాయం ఆ చూపుల్లో వ్యక్తమయింది. ఈ పుస్తకంలో నా వ్యాసం కూడా ఉంది అని చెప్పి వాళ్ళ చేతికి ఆ పుస్తకం ఇచ్చాను.
నా దృష్టిలో నిజమైన సాహిత్య రసజ్ఞుడెవరంటే పుస్తకం రచయిత పేరుని బట్టినిగాని, ప్రాంతాన్నిబట్టిగాని, కులమతాల్ని బట్టిగాని అంచనా కట్టనివాడు. ఆ పుస్తకంలో మనుషులున్నారా, వాళ్ల సుఖదుఃఖాలున్నాయా, అవి నిజాయితీగా చిత్రణకి వచ్చాయా-వీటిని మాత్రమే అతడు పట్టించుకుంటాడు. అవి లేకపోతే లబ్ధప్రతిష్ఠుల రచనల్ని కూడా పక్కన పారేయడానికి అతడు సంకోచించడు.
గ్రీన్ రివల్యూషన్ నుంచి గ్లోబలైజేషన్ దాకా తూర్పుగోదావరిజిల్లాలో మధ్యడెల్టా ప్రాంతంలో సంభవించిన సామాజిక- సాంస్కృతిక పరిణామం ‘మా పసలపూడి కథలు’ ఇతివృత్తం. దాన్ని వంశీ ఎంతో అనితరసాధ్యంగా పట్టుకోగలిగాడు. ఆ కథన నైపుణ్యాన్ని రామచంద్రారెడ్డి ఎంతో కౌశల్యంతో ఈ పుస్తకంలో సమగ్రంగా వివరించేడు. కాబట్టి డేవిడ్ షుల్మన్ లానే మనం కూడా రామచంద్రారెడ్డిని ఒక connoisseur అని నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు.
(డా.కె.రామచంద్రారెడ్డి రచించిన సిద్ధాంత గ్రంథం ‘వంశీ మా పసలపూడి కథల కమామిషు’ పుస్తకంలోని ముందుమాట)

One thought on “ఈ పరిశీలన ఒక ఒరవడి”