ఆకాశానికి నిచ్చెనలు వేయ వచ్చేమో 

Spread the love

పంజగుట్ట దగ్గర మొదలు పెట్టి వొక దాని తరువాత వొకటి ఫ్లై వోవర్స్ దాటుకుంటూ వో ఆరేడు మైళ్ళు ప్రయాణించాక  రైల్ నిలయం వెనక వైపు అడ్డ గుట్ట బస్తీలు, కాలనీలలో మలుపులు తిరుగుతూ కొండ యెక్కుతు కొంత దూరం వెళ్ళాక యెదురవుతుంది బుద్ధుని  ఆవరణ… ప్రభాతపు వెలుగులో నిశ్శబ్దంగా వుంది. ఆగి కొద్దిసేపు శాంతిగాలుల్ని నింపుకుని  పక్కగా యెడమ వైపు తిరిగాక చిన్నిచిన్ని యిళ్ళు. వుదయపు పనుల్లో బిజీబిజీగా వున్న స్త్రీలు. అప్పటివరకు కనిపించిన హై  రైజ్  బిల్డింగ్స్ ఆగి పోతాయి. ఆ పైన కొన్ని బంగళాలు. అవి  కూడా దాటి కొద్ది దూరం వెళ్ళగానే వొక సన్నటి మెట్ల దారి లోయలోకి మళ్ళుతుంది. 

నగరమొక్కటే. యెత్తుపల్లాలే అనేకం. సన్నగా కిందకి వెళ్ళుతున్న ఆ మెట్ల దారి మధ్యలో నీలిరంగు పైపులు. అటూయిటూ లక్కపిడతల్లా యిళ్ళు. 

నగరమొక్కటే.  వొక పక్క మాల్స్  ఫ్లై వోవర్స్, మెట్రో రైల్ ,  వొకళ్ళ నో యిద్దరి నో మోసుకుంటో పడవ ల్లాంటి  పెద్ద పెద్ద కార్లు –  ఆ పక్కనే కిక్కిరిసిన బస్సు లు షేరింగ్ ఆటోలు బిక్కు బిక్కు మంటూ టూ వీలర్స్ తూలుకుంటో షేరింగ్ ఆటోలు. వొక పక్క గేటెడ్ కమ్యునిటీలు, అపార్ట్మెంట్ సముదాయాలు ఆ  అంచునే బస్తీల్లో రేకులు కప్పుకున్న యిళ్ళు, స్లాబ్ పోసుకున్న యిళ్ళు, పరదాలు చుట్టుకున్న యిళ్ళు. యీ రెండు ప్రపంచాలు వొకే నగరంలో పక్కపక్కనే వుంటాయి. వొకరికొకరు పూర్తిగా అపరిచితులు కారు. వెలిగిపోతున్న యిళ్ళల్లో పని, డ్రైవర్స్ గా, డెలివరీ బాయ్స్ గా, నర్సులుగా వంట మనుషులగా యిలా అనేకానేక వుద్యుగాలలో చీకటి గుయ్యారాల్లో వుండే వాళ్ళే కుదురుకుంటారు.  

నగరమొక్కటే.  అందరిని అక్కున చేర్చుకుంటుంది. పల్లెల నుంచో, పట్టణాల నుంచో వలస వచ్చే వారు తమతో చిన్ని చిన్ని పెట్టెల్లోనో, సంచుల్లోనో, మూటల్లోనో కట్టుకునే బట్టలు, మరిన్ని వస్తువులని తెచ్చుకుంటారు.  వారి మనస్సుల్లో పుట్టి పెరిగిన యిల్లూ, ఆ జ్ఞాపకాలు వాళ్ళ మనస్సులో మెదుల్తూనే వుంటాయి. వాటిని తాము నివాసముంటున్న చోట తిరిగి ప్రతిష్టించాలనుకుంటారు. నగరం తనను తాను విస్తరించుకుని వెడల్పు అవుతూనే వుంటే  కనీస సౌకర్యాలు కూడా లేని చోట్ల యిటువంటి సెంటిమెంట్ల కి చోటెక్కడ ?

పిల్లలకు ఆడుకోడానికి స్థలం వుండాలి. స్నేహితులను కలవటానికి చోటు కావాలి. చదువుకోడానికి లైబ్రెరీ వుండాలి. ఆధునిక సమాజంలో ఆధునికంగా అందుబాటులోకి వస్తున్న ఆటలు, పాటలు, సాహసాలూ పిల్లలందరికీ అందుబాటులో వుండాలి.

వాన నీరంతా యిళ్ళల్లోకే వస్తుంటే యెండ వేడి అంతా యింట్లోకే  వస్తోంటే యివన్నీ యెలా కుదుర్చుకునేది ? 

యిలా ఆలోచిస్తూ నడుస్తుండగానే  అత్యాశ్చర్య జనకమైన దృశ్యం యేదురయింది.

 యేడాది పొడవునా పూసే  మందారాలు , నిత్య మల్లెలు, నందివర్ధనాలు, పింక్ బిళ్ళ గోరింటలు యేదో వొకటి  ప్రతి యింటి ఆవరణలో వున్నాయి.  వేసవి సాయంకాలాల్లో యింటి ముందు అరుగు మీద మల్లెల పరిమళాల నడుమ కబుర్లు చెప్పుకోడానికి మల్లెపువ్వుల పొదలకి పాదులు చేసారు. వాకిట్లో తులసి కోటల గూళ్ళలో వెలిగే దీపం. 

మిగిలిన నగరపు ఆధునిక  నివాసాలకి యీ బస్తీకి మధ్య తేడా – పొడవైన  పైప్ లైన్ లకి అటూయిటూ  కళ్ళాపి జల్లిన వాకిళ్ళలో ముగ్గులు, పూల మొక్కలు, నల్ల పలక బోర్ద్స్ మీద గీసిన బొమ్మలు, నేర్పిస్తున్న అక్షరాలు, అంకెలతో తీగల మీద ఆరుతున్న రంగురంగుల రోజువారి బట్టలతో  తళతళలాడే కళకళ. అంచలంచలుగా పొదరిళ్ళ కిటికీల్లోకి వీచే గాలి, సాగే వెలుతురు.   

మామిడి చెట్టు, రావి చెట్టు పైకి వేలాడుతున్న కేబుల్ వైర్లు వారికి కావాల్సిన వినోదము, సమాచారము వారికి అందుతున్నాయని సూచిస్తున్నాయి. 

వుదయం వేళ పనులకి వెళ్ళుతున్న వారి చేతుల్లో వారివారి సామానులున్న చేతి సంచులే కాకుండా మరో బ్యాగ్ కనిపిస్తే యేమిటని కుతూహలంగా అడిగితే యింట్లోని  చెత్త.  యింటి ముందో… పక్కనో దారిలోనో చెత్తని పడైకుండా అంతా యిలా చెత్తని పైనున్న డస్ట్ బిన్ లో పడేస్తున్నారు. గొప్ప క్రమశిక్షణ. పరిసరాల శుభ్రతపై యెంత బాధ్యత. పూల పరిమళాలు, పోపుల గుబాళింపు కలిసి పోతున్నాయి.   

అసలిదంతా యెలా సాధ్యమయిందని కుతూహలంతో ఆరా తీస్తే… తెలిసినవి మనసుని కదిలించే వివరాలు. 

లాక్ డౌన్ రోజుల్లో హైదరాబాద్ అర్బన్ ల్యాబ్ బాధ్యులు  – విప్రో ఫౌండేషన్ సహకారం తో వొక చిన్న పోటీ నిర్వహించారు. రెండు మూడు లక్షల ఖర్చు తో  చేయగలిగే టట్టు నగరం లో నీటి సమస్యల కు యేదైనా చిన్న పరిష్కార మార్గం  చూపించగలిగితే దానికి అయే పూర్తి ఖర్చు తాము భరిస్తాము అన్నది పోటీ సారాంశం. దీనిని వొక సవాలు గా తీసుకుని యెనిమిది గ్రూప్ లు పోటీ పడితే అందులో వొకటి యెన్నికైయింది.  ఆ యెన్నికైన బృందం అరోరా డిజైన్ స్కూల్ విద్యార్థులు – వాళ్ళ వెనక ప్రొఫెసర్ పింగళి ప్రవీణ్. 

గుట్ట మీద నుంచి కిందికి వాలులో వున్న యిళ్ళ మధ్యన పై నుంచి కిందకి, కింద నుంచి పైకి రావడాకి మెట్లు నిర్మించాలి అన్నది ప్రతిపాదన.  వొకసారి మెట్లు కట్టిన తరువాత  వాన నీరు, పైపులలో నుండి కారిపోతున్న నీరు  వృధా కాకుండా తగినట్టు మెట్ల మధ్యన నీటి వొక చానెల్ యేర్పాటు చేయాలి. యిలా యిళ్ళ  మధ్యన మెట్లు కట్టే  ముందు  అక్కడ నివసించే వాళ్ళకి అసలు యేం కావాలనుకుంటున్నారో తెలుసుకోవాలని వాళ్ళందరిని కలిసి తరిచి తరిచి అడిగారు. 

రోజు పూజ చేసుకోడానికి పువ్వులు కావాలని చాలమంది, వూరిలో తమ జీవితాలతో మమేకమైన  అరుగు కావాలని, ముగ్గు వేసుకోడానికి వాకిలి కావాలని, తమలోని సృజనాత్మన్ని మెరుగుపరచుకోడానికి, పిల్లలకి చదువు చెప్పడానికి బ్లాక్ బోర్డ్ కావాలని అడిగారు. వారి ఆకాంక్షలకి అనుగుణంగా వొక్కకటి ప్లాన్ చెయ్యటం మొదలుపెట్టారు. 

చూస్తుండగానే వొకరిద్దరితో మొదలైన పని వొకరొక్కరిని కలుపుకుంటో వడి వడి గా ముందుకు సాగింది. వో యువ ఆర్క్టె టెక్ట్ వాళ్ళ అమ్మగారికి మొక్కలంటే యిష్టం. తోట పని మీద అవగాహనా వుంది.  పిల్లలకు మొక్కల పెంపకం  నేర్పిస్తానని ఆమె వచ్చారు.  యీ పని వాళ్ళని మీరు అజమాయిషీ చేయలేరు నే సహాయం చేస్తానని వొక ఆర్చిటెక్ట్ తండ్రి ముందుకొచ్చారు.  

మధ్యలో వర్షాకాలం లో సగం కట్టిన మెట్లు కొట్టుకుపోతాయేమోనని  రాత్రికి రాత్రి కాపలా కాయటానికి యెందరో రావటం లాంటి యిలా మరుపురాని ఘట్టాలు యెన్నో. కొండ వాలున యెక్కడో వుంటారు… అబ్బా! జారి  పడితే కష్టమని బంధువులు, స్నేహితులు వదిలేసుకున్న వారి జీవితంలోకి బిలబిలమని మనుషులు వచ్చేశారు. 

మెట్లు కడుతుండగానే వూత కర్ర పట్టుకుని దిగి వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్న డెభై యేళ్ళ తాత – “కొండ మీద నేను కింద వాడు నా స్నేహితుడిని కలుసుకుని యెనిమిదేళ్ళయింది. యిదిగో మీ వలన యివాళ కలుసుకున్నాను వాడిని” అన్నారు.

“యెన్ని రకాలుగా ప్రయత్నం చేసినా యిలాంటి యింట్లో వుంటున్నానని పిల్లనివ్వటలేదెవ్వరూ.  యిక యిప్పుడు నాకు ఖాయం గా పెళ్ళి  అవుతుంది” అంటూ  సంబర పడిన యువకుడు. 

అరుగు మీద కుట్టుకుంటూనో, కాయగూరలు కట్ చేసుకుంటునో, రిలాక్స్డ్ గా కబుర్లు చెప్పుకుంటూనో  సాయంత్రం పనుల నుంచే వచ్చే వారిని పలకరించుకోవటంతో సమూహల నడుమ స్నేహం పెరగటం చూసాము. మెట్లు మొదలవ్వటానికి ముందు వున్న రచ్చబండ దగ్గర వో లైబ్రెరీ, లెర్నింగ్ సెంటర్ వున్నాయి. అన్నిటికంటే ఆశ్చర్యం వొకప్పుడు కింద నుంచి పైకీ పై నుంచి కిందకీ వెళ్ళటమే అసాధ్యమైన ఆ బస్తీలో యిప్పుడు టూ వీలర్స్ మీద ప్రయాణం. మెట్లు కట్టటం అనే వొకే వొక్క ఆలోచన స్తబ్ధుగా వున్న అక్కడి ప్రజల జీవితంలో తీసుకొచ్చిన చలనం అపురూపం. 

మెట్లు కట్టి దాదాపు మూడేళ్ళు దాటి పోయాయి. యిప్పటికీ పువ్వు పూచిన ప్రతిసారి ఫోటో తీసి సంబరంగా పంపిస్తాడు వో బుల్లి పిల్ల వాడు.  పుస్తకాల సంచులు వీపున వేసుకుని చెంగు చెంగున దూకుతారు  రెండు జడల  ఆడపిల్లలు. అక్కడున్న వో అరుగు మీద కూర్చుంటే యిక్కడకి వచ్చే ముందు ప్రభాతపు వెలుగులో ఆగి కొద్దిసేపు నింపుకున్న శాంతిగాలులు మరింత మృదువుగా వీచాయి. మనసంతా సంతోషం. 

యిదేదో మంత్ర దండం తిప్పితే వచ్చిన మార్పు కాదు.  సున్నితంగా, ఆర్భాటాలకు పోకుండా, పనితనంతో  మెలకువతో నలుగురు కలిసి పని చేస్తే వచ్చిన మార్పు. ప్రభుత్వాలు, కార్పొరేట్ నిధులు మాత్రమే యిలాంటి పనులు చేయాలని ఆశించకుండా మనమన పరిధిలో యిలాంటి పనుల్లో మనమూ మనకి వీలైన పద్దతులతో మమేకమై మన చుట్టూ వున్న యీ ప్రపంచాన్ని మరింత సౌకర్యవంతంగ, ఆరోగ్యకరంగా, అందంగా చేసుకోవచ్చు. చిన్న స్థాయి లోనే స్మాల్ యిస్ బ్యూటిఫుల్ అని అనుకుని మొదలు పెడితేనే అయే పని. ఆనందం అంటే మరేమిటో కాదు మనుషులే. తారతమ్యాలు వున్నచోట అవసరమైన మెట్లు ని కట్టే ప్రయత్నం లో వ్యవస్థ లో వున్న సమస్యలు అర్థం అవుతాయి. మెట్లు కట్టిన తరువాత  పది మంది జీవితాలు మెరుగవుతాయి. “A thing of beauty is a joy forever” జాన్ కీట్స్  గారన్న అందమైన ఆనందం యిలాంటివేనేమో


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *