పూలలోకి

Spread the love

1

పూవుల గురించి మాట్లాడుకొంటూ

నడుస్తున్నారు ఆ వృద్ద దంపతులు

కనిపించే మొక్కల పేర్లు

వాటి పూల కబుర్లు చెప్పుకొంటూ

గాలిపటాల్లా తేలుతున్నారు

ఈ లోకం గొడవ పట్టనట్టు

పూల రంగుల్లోకి, ఆకుపచ్చని సారంలోకి

మునకలేస్తూ వెళ్లిపోతున్నారు

2

ఎన్ని చూసి వుంటారు

కడగండ్లు పడి వుంటారు

ఎన్నిసార్లు ఓడి ఉంటారు

ఒదిగి ఒదిగి చీకట్లు దాటి వుంటారు

చివరికిట్లా యుద్దాలు శమించిన ఒక ఉదయం

పూలలోకి కాసేపు తేలుతున్నారు

బ్రతకటాన్ని తమకంగా హత్తుకొంటున్నారు

3

ఏ పసిదనాల్లో

బడికెళుతూ పలకరించారో దారి పక్క పూలని

ఎన్ని ముళ్ళ తీగల మీదుగా

కాపాడుకొంటూ వచ్చారో వాటి జ్ఞాపకాలని

ఇన్నాళ్లకు చేరుకుంటున్నారు మళ్లీ

భార రహిత బాల్యాలలోకి

పచ్చని జీవితేచ్చలోకి

తమవైన ఏకాంత లోకాల్లోకి

సాంద్రమైన నిట్టూర్పు ల్లోకి..

B V V Prasad

Spread the love

One thought on “పూలలోకి

  1. కుటుంబాలకు దూరంగా
    దేశం కోసం పహారా కాస్తూ
    ఎప్పుడు వస్తారో
    దుస్తులుగా వస్తారో తెలియను
    జవానుల‌ పిల్లల హృదయాన్ని
    ఆర్తిగా ఆవిష్కరించిన కవిత…
    డా.తండ హరీష్ గౌడ్ గారికి హృదయపూర్వక అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *