మైలపిల్లి మైరావుడి వీరగాథ
‘సంఘటనలు కథలుగా మారకుండా చూసుకోవాలి. ఒకసారి కథలు అయ్యాయి అంటే రెండు సమస్యలు వస్తాయి. ఒకటి, కాదనలేవు. రెండు, నిరూపించలేవు.
పేదరాశి పెద్దమ్మ ఒంగోని తుడుస్తా ఉంటే వీపుకి ఆకాశం తగిలేదంట. చీపురు, చాట ఎత్తి కొడితే ఆకాశం అంత ఎత్తుకి పోయిందంట. ఆ పెద్దమ్మ కథల కాణాచి’ అని ప్రారంభమవుతుంది ప్రసాద్ సూరి నవల ‘మైరావణ’
ఇది విశాఖ జిల్లా తీరప్రాంతాల్లో చేపలు పట్టే బెస్త వాళ్ళ జీవిత కథ. వాళ్లలో వాడ బలిజలు అనే కులం ఉంది. ముఖ్యంగా, ఇది వాళ్ళ జీవన పోరాటం.
ఈ సమరంలో హీరో మైరావుడు. అతన్ని ఒక జానపద కథానాయకుడిని చేసి, అతన్నో గుర్రం ఎక్కించి, సముద్రతీరంలో, కొండ వాలుల్లో, పల్లెటూరి ప్రేమ గాలుల్లో కథను పరిగెత్తించాడు రచయిత.
ఇది రచయిత సొంత కథ.
తన బాల్యపు అడుగుజాడలివి. చదువు రాని తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు, వలలు అల్లడం, చేపలు పట్టడం… పేదరికంలోనే బతుకు తెల్లారిపోవడం, ధైర్యాన్ని కూడగట్టుకుని అక్కడే నిబ్బరంగా నిలిచి పోరాడటం – మన ముందు నిజాయితీగా పరుస్తాడు.
కథ చెప్పడానికి ఓ ప్రత్యేకమైన టెక్నిక్ ని
పనిగట్టుకుని వాడాడు. నాలుగు కథలను
కలిపి ఒక గట్టి తాడును పేనినట్టుగా కథనం నడిపించాడు. వాడబలిజల వెనుకబాటుతనమూ, సాహసోపేతమైన దుర్భర జీవితం ఒకటి.
కోరంగి మోటుపల్లి లాంటి మన ప్రాచీన రేవుల్లో ఓడనిర్మాణ సామర్థ్యము, అది క్రమంగా అంతరించిపోయిన విషాదమూ రెండు.
బర్మాకి వలస వెళ్లిపోయిన వాడబలిజల రాగ రంజితమైన రంగూన్ జీవితంలోని కన్నీటి వేదన మూడో కథ. దిగజారిన ప్రస్తుత రాజకీయాల నీచత్వాన్ని నిరసిస్తూ నడిచిన నాలుగో కథ.
మైరావణ వాస్తవానికి చాలా యాంబిషియస్ ప్రాజెక్టు. చరిత్ర, జీవితం, వలస, రాజకీయాలు అనే నాలుగు పాదాల మీద నవలని ఊపిరి సలపకుండా కదం తొక్కించిన తీరు పాఠకుణ్ణి ఆశ్చర్యపరుస్తుంది.
తీరాన్ని తాకి, ఇసుకని పలకరించి, వేగంగా వెనక్కి వెళ్లిపోయే కెరటాల మీద మెరిసే నురుగులాంటి ప్రసాద్ సూరి వచనంలో మనం తడిసి ముద్దయిపోతాం. చక్కని తెలుగు రాస్తూనే, ఇంగ్లీషు పదాలు వాడుతూనే, ఉత్తరాంధ్ర బెస్తవాళ్ళ మాండలిక సొగసుని సంగీతంలా వినిపిస్తూ కవ్విస్తూ కథ నడిపిస్తాడీ ఈ కుర్ర రచయిత.
పూలని కూర్చినట్టుగా అందమైన పదాలని మాలకట్టడమే నా వచన రచన అంటే? కాదు కదా! దానికో తాత్విక నేపథ్యం ఉంది.
మనం మర్చిపోవడానికి ఇష్టపడుతున్న మన
చరిత్ర ఉంది. అడవిగాచిన వెన్నెల లాంటి నిరక్షరాస్యుల జీవన చిత్రణలోని నైపుణ్యం ఉంది.
ఈ దుర్మార్గపు వ్యవస్థ అమానుషత్వం మీద
కసిగా మారుతున్న కోపం ఉంది. ప్రొటెస్ట్ ఉంది.
ఉపన్యాసం కాకుండా దానికి ఒక కళారూపం ఇచ్చే ప్రతిభ, నైపుణ్యం విరుపూ వెటకారం పుష్కలంగా ఉన్నాయి ప్రసాద్ కి. మనల్ని వెంటలాక్కుపోయే తెలుగు పద సోయగంతో, విషయ వివరణల్లో, ఆలోచనాత్మక శిఖరాల్లో లోయల్లో, విశ్లేషణ వివేచనా వివేకంలో మెరిసే సప్తవర్ణ మాలికల్లోని సౌందర్యం లాంటిదేదో ప్రసాద్ సూరి వాక్యంలో ప్రకాశిస్తూ ఉంటుంది. అలా దూకుడుగా రాస్తూనే, కొత్త విషయాలు చెబుతాడు. కొత్త తలుపులు ఏవో తెరుస్తాడు. వింత మాటల్ని పరిచయం చేస్తాడు. నాలుగు ఆలోచనాధారల్ని లాజికల్ గా మెయిన్ స్ట్రీమ్ లో కలిసే మేజికల్ విన్యాసాన్ని తన పొగరుబోతు వాక్యంతో పండిస్తాడు.
ఒకరోజు ఒక పెద్దచేప ఒక జాలరి వలలో పడింది. కాదు అది నా వలలో పడింది…అంటూ
ఇంకో జాలరి వచ్చాడు.
నువ్వా? నేనా? అని గొడవ జరుగుతుంది. పంచాయితీ పెట్టారు.
పంచాయతీ పెద్దలు ఎటూ తేల్చలేకపోతారు. అప్పుడు వాళ్ల మధ్య, తడి ఇసుక మీద మిలమిలా మెరుస్తున్న ఆ అందాల చేప చటుక్కున లేచి ‘నన్ను పట్టింది మైరావు డే’ అని చెప్పి పడిపోతుంది. పంచాయితీలో చేప మాటే నెగ్గుతుంది. అది మనందరికీ నచ్చుతుంది. చేప మాట్లాడడం ఏంటి! అని తర్కానికి పాల్పడం. అది ఒక జానపద సాంప్రదాయం కదా! అనుకుంటూ మనం కన్విన్స్ అవుతాం. ప్రసాద్ సూరి అప్రతిహత
వచన యాత్రలో ఇలాంటి చమత్కారాలెన్నో రసానందపు ఆవలి తీరానికి మనల్ని చేరుస్తాయి.
చేపల కూర తినడంలోని మజా, తాగుడు, తన్నుకోవడం, అక్రమ ప్రేమలూ, లేచిపోవడాలూ, ఆడదాని శరీరంపై మోజు, గుండెలు ఆర్చుకుపోయేలా ఏడ్చినా తీరని వేదన,
చీకటి తెరల్లోనే చితికిపోయిన బతుకుల్ని…
నెత్తురూ కన్నీళ్ళతో మాట్లాడించడం ఇతనికి
ఒక సరదా… మనకి మాత్రం అది నరకం.
***
నేను గాఢంగా మోహించిన సొలోమోన్ విజయ్ కుమార్ అనే దుమ్ము రేపే దళిత రచయిత ఈ పుస్తకానికి అర్థవంతమైన ముందుమాట రాశాడు.
“ బెస్తవారి నిజ జీవితాన్ని తెలుగులో ఈ నవలే తొలిసారిగా స్పష్టంగా చిత్రిస్తోంది. అపోహలు స్థిరపడి ఉన్న సమాజంలో చావుకు తెగించే వారి వేట జీవనాన్ని, కడుపు చేత పట్టుకొని బతికే వలస బతుకుని బయట ప్రపంచానికి తెలియని కోణాల నుంచి స్పష్టంగా చూపుతోంది ఈ నవల”
అన్నాడు విజయ్ కుమార్.
గుండె చెదిరే మునికాంతపల్లి కథల మొనగాడు
ఈ ఇజీ కుమారే.
***
మైరావణ అనే 175 పేజీల నవల గురించి ఎందుకింత ఇష్టంగా, మురిపెంగా, ముచ్చటించుకోవాలంటే దానికో ప్రత్యేకమైన కారణం ఉంది. 2022 నవంబర్ లో ఛాయా కృష్ణ మోహన్ బాబు ఈ నవలని ప్రచురించారు.
ప్రసాద్ మొదటి నవల ‘మై నేమ్ ఈజ్ చిరంజీవి’ కూడా ఛాయా పబ్లిష్ చేసిందే.
మైరావణ రాస్తున్నప్పుడు, ప్రసాద్ సూరి 20 ఏళ్లు దాటి 21 లో ప్రవేశిస్తున్న కుర్ర నాయాల. (ముద్దొచ్చినప్పుడు ఏలూరు నాయాళ్ళు అలాగే అంటారని, గమనించ ప్రార్థన) ఎటూ తేల్చుకోలేని
ఆ చిన్న వయసులో ప్రేమకథలో, పక్కింటి
పదోక్లాసు పిల్లపెదవుల మీద ప్రేమకవితలో రాసుకోవడం, న్యాయం. ధర్మం. అంతేగాని …
సముద్రపు లోతుల్లోంచి వెలికి తీసి, ఆ మృత్యు శీతల విషాదాన్ని కళ్ళ ముందు వాక్యాలుగా పరిచి, దాని ఆర్థిక, రాజకీయ, తాత్విక మూలాల్ని ఆత్రంగా వెతికి… ఇదేనా బతుకు? ఇంత దరిద్రంగా బతకాలా? మనుషులకు ఈ దురవస్థ కలిగించింది ఎవరు? అని పగిలిన గుండెతో, పొగిలే కన్నీళ్ళతో 20 ఏళ్ల కుర్రాడు ప్రశ్నిస్తే మనకు ఎలా ఉంటుంది!
మనం ఏమైపోవాలి?
ఒకరకంగా అలెక్స్ హేలీ రూట్స్ లాగానే తన మూలాల్ని వెతుక్కుంటూ వెనక్కి వెళ్లి కన్నీళ్ళ పర్యంతం కావడమే ‘మైరావణ’.
నవల చివరలో ప్రసాద్ ఇలా అన్నాడు …“నా చిన్నతనం నుంచి నేను ఒక విషయం గమనిస్తూ ఉండేవాడిని. మేం వాడోళ్ళం – అంటే మా కులం పేరు వాడ బలిజ. విశాఖపట్నం సముద్రతీరం అంతా మా వాళ్లే, మా ఊర్లే. మా వృత్తి చేపలు పట్టడం. చేపలు పట్టే వాళ్ళని చాలా పేర్లతో పిలుస్తారు.ప్రధానంగా బెస్తలు జాలర్లు అంటారు. కానీ, మా వాళ్లు తమని తాము వాడోళ్ళం అనే చెప్పుకుంటారు. జాలర్లని మాకంటే తక్కువగా పరిగణిస్తారు. అందుకు మేము పూర్వకాలంలో ఓడలు తయారు చేసే వాళ్ళమని, ఏదో ఒక కాలంలో, చేపలు పట్టుకునే వృత్తికి మారిపోయామని అంటారు. చేపలు పట్టుకోడానికి మారిపోయిన కాలం ఏమై ఉంటుంది? అని ఆలోచిస్తూ వెతుకుతూ ఉన్నప్పుడే ఈ మైరావణ నవల పుట్టిందన్నమాట.
ఇదొక Introspection …ఇదొక Resurrection.
1955 లో జవహర్ లాల్ నెహ్రూ నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణ ప్రారంభోత్సవానికి వస్తున్న సమయంలో, మాచర్లలో భారీ ఎత్తున డైనమైట్ స్టిక్స్ ఎందుకు దొంగిలించబడ్డాయి?
గుండెలు అవిసిపోయే ఆ అద్భుతమైన కుట్రని, ప్రసాద్ తెలుసుకొని మనకు చెప్పిన తీరు ఏ సంచలన క్లైమాక్స్ కి తక్కువది కాదు.
***
రచయిత రాత్రిపూట అలల మీద ఒక ఓడని చూస్తాడు “పైన చుక్కల ఆకాశం. కింద నల్లటి సముద్రం. విద్యుత్ దీపాల కాంతిలో గాల్లో పెట్టిన దీపంలా ఉంది ఓడ” అని రాస్తాడు ప్రసాద్ సూరి. అలాంటి ఎన్నో గాల్లో దీపాలని అర్ధరాత్రి విశాఖ సముద్రంలో చూసాను నేను.
కొన్ని పర్సనల్ విషయాలు :
ప్రసాద్ సూరి మంచి ఆర్టిస్టు.
హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ JNAFAU లో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, పెయింటింగ్ ఫోర్త్
ఇయర్ లో ఉన్నాడు. మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంది. నన్ను ఎక్కువగా కలుస్తాడు. జర్నలిస్టులు రచయితలైన తల్లావజ్జల శివాజీ, మందలపర్తి కిషోర్, డాక్టర్ బండి రఘు, ఆర్టిస్ట్ అన్వర్ మరికొందరిని రెగ్యులర్ గా కలుస్తుంటాడు.
మాజీ పోలీసు అధికారి రామశర్మ, ఆయన భార్య శాంత గారికి ప్రసాద్ దత్తపుత్రుడు. ఎప్పుడు ఫోన్ చేసినా ‘శాంతగారింట్లో భోజనం చేస్తున్నాను’ అంటుంటాడు. ఆబిడ్స్ లోనే JNAFAU కాలేజీ హాస్టల్ లో ఉంటాడు. సినిమాలు వెబ్ సిరీస్ లూ తెగ చూస్తుంటాడు. చారిత్రక కథా రచయిత సాయి పాపినేని గారితో చరిత్ర చర్చలు చేస్తుంటాడు.
‘రాస్తే గీస్తే అద్దిరిపోయే హిస్టారికల్ ఫిక్షన్ రాయాలి’ అంటాడు.
‘సినిమా తీసి చూపిస్తా’ అని ఎగిరెగిరి చెపుతుంటాడు. ప్రపంచాన్ని చిత్తుచేసే పనిలో బాగా బిజీగా ఉన్నాడు. పాపం ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, ఇప్పటికింకా 23 ఏళ్లే, సూరి అని పేరు మార్చుకున్న ప్రసాద్ సూరాడకి ….
ఈ డిసెంబర్ 12 కి ఇంకా 24 ఏళ్ళే.
ఈ ముక్కుపచ్చలారని రచయితకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
నా గురించి: ప్రసాద్ వాళ్ళ నాన్న చందర్రావు,
వాళ్ళ అమ్మ నూక రత్నం.
నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు.
వాళ్ల ఊరు రమ్మంటారు ‘ప్రసాద్ గాడిని మీరే చూసుకోవాలి’ అంటుంటారు’
ప్రసాదు సూరి చాలా ఏళ్ల క్రితం ఎలమంచిలిలో ప్యాసింజర్ రైలు ఎక్కి హైదరాబాద్ వచ్చి ఆర్టిస్ట్ మోహన్ ని కలిశాడు. చాలా రోజులు మోహన్ ఆఫీసులోనే ఉండిపోయాడు. మోహన్ 2017 సెప్టెంబర్ 21న చనిపోయాక ప్రసాద్ నాకు కళలూ , సాహిత్యము ప్రపంచానికి నిద్రపట్టకుండా చెయ్యడం ఎలా? అని తెగ లెక్చర్లు పీకుతున్నాడు.
ప్రస్తుతం, ఫైన్ ఆర్ట్స్ లో తన బ్యాచిలర్
డిగ్రీ పూర్తి చేస్తున్నాడు.
తెలుగులో, ఇప్పటిదాకా ఫైన్ ఆర్ట్స్ కాలేజీ నేపథ్యంలో నవలలు ఏవీ రాలేదు. ఆ లోటు తీరుస్తూ ‘ బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ – ఓ చిత్రకారుడి ప్రేమకథ’ అనే నవల రాస్తున్నాడు. అది మరో బ్లాక్ బస్టర్ అవుతుందేమో అని భయంతో వొణుకుతున్నాను.
అలాగే తన జీవితాన్ని మేలి మలుపు తిప్పిన,
మా అన్నయ్య ఆర్టిస్ట్ మోహన్ మీద ఇంగ్లీషులో మోనోగ్రాఫ్ రాస్తున్నాడు. అది త్వరలో వస్తుంది.
అలాగే ‘మైరావణ’ నవలని ఇంగ్లీషులో గ్రాఫిక్ నవలగా తెచ్చే పనిలో ఉన్నాడు.
ఇంకెంత… పదేళ్లు ఆగండి.
ప్రసాద్ సూరి అనే ఈ కుర్రవాడు తెలుగు అమితావ్ ఘోష్ కాకపొతే నేరుగా వచ్చి నన్నే తిట్టండి.
Mairaavana cover page
by Artist Prasad suri