శ్రీశ్రీ వెంట నేను

Spread the love

శ్రీశ్రీ అనే రెండక్షరాలు వింటే మనసు పొంగిపోతుంది. కవిత్వం అంటే ఏమిటో తెలియని నా విద్యార్థి దశలో శ్రీశ్రీ కవితలు పాటల్లా నా ముందు వాలాయి. ‘మహాప్రస్థానం’ పుస్తకాన్ని ఎవరి చేతిలో చూసినా అదేదో అద్భుతాన్ని చూసినట్లు చూస్తూనే ఉండిపోయేవాడిని. శ్రీశ్రీ గురించి, శ్రీశ్రీ కార్యకలాపాల గురించి, కవిగా ఆయన ఎంతటి మహాకవో, ఎవరు మాట్లాడినా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినేవాడిని. ఇంటర్మీడియట్‌ (1978-80) కొత్తగూడెంలో చదువుకొనేప్పుడు మా పక్క రామచంద్రా కాలేజి ఫంక్షన్‌కు జ్వాలాముఖి ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడారు. ఆయన ఉద్వేగభరిత ప్రసంగం, మధ్య మధ్యలో శ్రీశ్రీ కవితల్ని వల్లె వేయడం, ప్రసంగానికి ఇంత అద్భుతమైన శక్తి వుందా అన్నట్లు ఆశ్చర్యపరిచినా శ్రీశ్రీ కవిత్వం విషయంలో మాత్రం నాకు ఆసక్తి పెరిగింది.ప్రసంగాన్ని తిరిగి ఒప్పచెప్పలేను, కానీ శ్రీశ్రీ కవితల్ని మాత్రం ఆయన మాటల్లో విన్నంతవరకు పెద్ద గొంతుతో పాడటం మొదలుపెట్టాను. ‘మరో ప్రపంచం..మరో ప్రపంచం.. మరో ప్రపంచం పిలిచింది’- నాలోకి అలా శ్రీశ్రీ ప్రవేశించాడు. ఇంటర్‌ పరీక్షల్లో తప్పాక, తిరిగి మా ఊరు వెళ్ళలేక కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్‌ యూనియన్‌ ఆఫీసులో(సి.ఐ.టి.యు అనుబంధం) ఆఫీసు బాయ్ గా చేరాను. తెల్లారగట్ల ప్రజాశక్తి దినపత్రికలు పంచడం, పగలంతా ఆఫీసు బాయ్ గా పని చేయడం,రాత్రిళ్ళు ఆఫీసులో పడుకోవడం… అక్కడే టేబుళ్ళ మీద దరువేసుకుంటూ పాటలు నేర్చుకోవడం రెండేళ్ళపాటు ఇలా సాగాక ఇంటర్‌ పూర్తయింది. పాట మాత్రం అదనంగా నాకు దక్కింది. కంజిర వాయిస్తూ ఊరేగింపుల్లో,మహాసభల్లో, విద్యార్థి సంఘాల ఎన్నికల్లో శ్రీశ్రీ కవితల్ని పాటలుగా పాడేవాడిగా గుర్తింపు పొందాను.

పుచ్చలపల్లి సుందరయ్య, మోటూరు హనుమంతరావు, లావు బాలగంగాధరరావు, సీతారాం ఏచూరి వంటి వారి ముందు శ్రీశ్రీ కవితల్ని గానం చేసే అరుదైన అవకాశం కలిగింది. ”పతితులారా… భ్రష్టులారా…బాధా సర్పదష్టులారా..ఏడవకండి,ఏడవకండీ”…అనే పాటను రాష్ట్ర మహాసభలో ఉద్వేగంగా పాడి వేదిక దిగుతున్నప్పుడు మోటూరు హనుమంతరావు గారు గుండెలకు హత్తుకున్న సంఘటనలెప్పటికీ మర్చిపోలేను.ఖమ్మం(1983)లో జరిగిన ఎస్‌.ఎఫ్‌.ఐ.రాష్ట్ర మహాసభల్లో శ్రీశ్రీ పాటల్ని కంజిర దరువుతో పాడినపుడు అప్పటి ఆలిండియా ఎస్‌.ఎఫ్‌.ఐ. నాయకుడు సీతారాం ఏచూరి ఇచ్చిన అభినందనలు ఎన్నటికీ మరువలేను. ఆ సభల్లో మహబూబ్‌నగర్‌ నుంచి ప్రతినిధిగా పాల్గొన్న నేటి వాగ్గేయకారుడు గోరటి వెంకన్న అప్పటి ఆ సందర్భాన్ని గుర్తు చేస్తున్నప్పుడు ఎంతో గర్వంగా అన్పిస్తుంది.

శ్రీశ్రీ పాటలు పాడటం వల్ల నాకు కలిగే ఆనందం ఒక ఎత్తైతే, శ్రీశ్రీ పాటలు పాడటం వల్లే నా జీవితం మలుపులు తిరిగిందనేది మరో వాస్తవం. ఇది విచిత్రంగా అనిపించవచ్చు కానీ,వాస్తవమని నా జీవితమే చెబుతుంది. ఇంటర్‌ పాసై డిగ్రీ చదవాలని వున్నా,. అంత స్తోమత లేని దశలో మా కారేపల్లిలో కమ్యూనిస్టు కుటుంబంగా వున్న కె.యల్‌.నరసింహారావు గారు,దుర్గాదేవి గారు నా శ్రీశ్రీ పాటలు విని,. నా గురించి తెలుసుకుని డిగ్రీ చదివించడానికి ఏర్పాటు చేశారు. వారి కుటుంబంలో నాకు మూడవ కొడుకుగా స్థానమిచ్చారు. మా అమ్మ కొండపల్లి దుర్గాదేవి నా పాటలు విని ఎంత మురిసిపోయేదో,. ఒకసారి మా అమ్మ హురాంబీని పిలిచి, ‘వీడు నా దగ్గరనే వుంటాడు బూబమ్మ, మంచి కొడుకును కన్నావ్‌’ అని అన్న ఆ మాటలు ఇవాళ్టికి ఆమె ముందు కృతజ్ఞతతో మోకరిల్లేట్లు చేస్తాయి. అలా శ్రీశ్రీ పాటల వల్ల డిగ్రీ, పి.జి. వరకు చదువుకునే అదృష్టం కలిగింది.

శ్రీశ్రీ సమాజాన్ని ఎంత మార్చాడో ఏమోకాని నా జీవితాన్ని గొప్ప మలుపు మాత్రం తిప్పాడు. డిగ్రీ, పీజీలు చదువుతున్నపుడు ఖమ్మం, హైదరాబాద్‌ ఉస్మానియా యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘ ఎన్నికల్లో పోటీ చేయడం, శ్రీశ్రీ పాటలు పాడటం, దాని వల్ల వచ్చిన గుర్తింపు అంతా యింతా కాదు. విద్యార్థి మహాసభల కోసం, విశాఖ, తిరుపతి, గుంటూరు,విజయవాడ వంటి ప్రదేశాలు వెళ్ళడం, శ్రీశ్రీ పాటలు పాడటం నేను ఎన్నడూ మరిచిపోలేని అనుభవాలు. ఆరుద్ర ముందు విశాఖలో పాడటం, సుందరయ్య విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవ సభలో ఎన్టీఆర్‌,ఆరుద్ర వంటి వారి సమక్షంలో శ్రీశ్రీ గీతాల్ని ఆలపించడం, వారి మెచ్చుకోలు ఇవన్నీ శ్రీశ్రీ వల్ల నాకు లభించిన జ్ఞాపకాలు. ఇంకో ముఖ్య విషయం, ఎం.ఏ.అయ్యాక తెలుగు పండిత శిక్షణలో చేరాను. అక్కడే శ్రీశ్రీ నా జీవితాన్ని ఇంకో మలుపు తిప్పాడు. నాకో జీవన సహచరిని ఇచ్చాడు. నా సహాధ్యాయి డా.పి.లక్ష్మి (శిలాలోలిత) నేను పాడే శ్రీశ్రీ పాటల్ని విని,నన్ను వలచింది. ఎం.ఫిల్‌ కోసం నా ఫీజుల్ని తనే కట్టి పరిశోధన పూర్తిచేసేట్లు సహకరించింది. శ్రీశ్రీ కవిత్వాన్ని నేను ఇష్టపడి, గానం చేయడం ద్వారా భవిష్యత్తును నిర్మించుకునే అవకాశం కలగడమే కాదు, చదువుకోలేని ఆర్థిక స్థోమత ఎప్పుడూ నాకు అడ్డంకిగా మారకుండా కాపాడింది. ఒక సాయంత్రం ప్రముఖ రచయిత్రి ఓల్గా గారి యింట్లో సాహిత్య మిత్రులం కలిశాం. ఎన్‌.వేణుగోపాల్‌ ‘కవితా ఓ కవితా’ను ఉద్వేగంగా కవితా పఠనం చేశాక, నేను ‘పతితులారా.. భ్రష్టులారా’ పాడాను. పాట పూర్తయ్యాక అందరి ప్రశంసలు అందుకుంటున్న సమయంలో, ఓల్గా గారు ప్రశంసాపూర్వకంగా నా నుదుటిమీద ముద్దు పెట్టుకోవడం నా పాటకు అదో అపురూపమైన అవార్డు. శ్రీశ్రీని పాడే అవకాశం సభల్లో ఈ మధ్యకాలంలో నాకు దొరకక పోయినా, ఆత్మీయుల సమక్షంలో, ఇంట్లో అవకాశం వచ్చినప్పుడల్లా పాడుకుంటూ శ్రీశ్రీని స్మరించుకుంటాను.

ఇంకా ఎన్నో విషయాలు చెప్పడానికి ఉన్నాయి. ఖమ్మం కవిమిత్రుల సాంగత్యం, వారితో అనుభవాలు, కవిత్వ చర్చలు, శ్రీ శ్రీ కవిత్వ సంబంధిత అంశాలు వాటన్నిటినీ రాయవలిసిఉంది. శ్రీశ్రీ మాటలేని, పాటలేని జీవితాన్ని నేను ఊహించుకోవటం కష్టం.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *