తీర్పు చెప్పే రోజు

Spread the love


ఉదయం పదకొండు గంటలు అవుతోంది. అప్పటికే వాతావరణం ఉక్క బోస్తోంది. గాలి కదలడం లేదు. బ్రిటీష్ కాలం నాటి నల్ల రాతి పలకలతో కట్టిన పాత భవనం మౌనంగా విచారంగా నిలబడి వుంది. ఆవరణ అంతా పాత చెట్ల నీడలు పరుచుకున్నాయి. నేరేడు చెట్టు మీద కాకి ఉండి ఉండి అరుస్తోంది. జాగర్తగా వింటే పిచ్చుకల కువకువలు కూడా వినపడతాయి.

‘ఇంకెంతసేపు పడుతుంది?’ అని అడిగాడు సుందర్, కానిస్టేబుల్ ప్రకాశాన్ని. ‘చెప్పానుకదా సార్ ఈరోజు తీర్పు ఇచ్చేస్తారు. బెంచ్ మీదకి పిలవరు సార్. మనకు సాయంత్రం అవ్వొచ్చు’ అన్నాడు తాపీగా. ‘మీరు బయటకు వెళ్లి ఆచెట్లక్రింద ఎక్కడైనా కూర్చోండి సార్ ‘ అన్నాడు ప్రెకాశం. ఉస్సురుమంది ప్రాణం. బ్రతుకు ఇన్ని మలుపులు తిరుగుతుందని ఊహించలేదు సుందర్. కోర్టు ఆవరణ లో పడిగాపులు పడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ‘ఏమిచేస్తాం! కష్టం వచ్చి మీదపడ్డాక అనుభవించాల్సిందే.’ అని నిట్టూరుస్తూ, కొంచెం దూరంగా వున్న చెట్ల క్రింద వున్న సిమ్మెంట్ బెంచీల దగ్గర చోటు చూసుకొని కూర్చున్నాడు.

       సుందర్ కు ఇప్పుడు మద్య వయస్సు. ఊళ్ళో వ్యవసాయ కుటుంబం. చదువుకోన్న తరువాత హైదరాబాద్ లో మంచి ఉద్యోగం లో చేరాడు. కొంతకాలానికి వ్యాపారం కూడా ప్రారంభించాడు. తండ్రి ఊళ్ళో పరపతి కలవాడే. కొంత కాలానికి అయనపోవడం తో పొలాలు చూసుకోవడానికి తప్పనిసరిగా ఊరు రావాల్సి వచ్చింది. పొలాలు అమరకానికి ఇచ్చి, అమ్మను తీసుకొని హైదరాబాద్ వెళ్లిపోదామానుకొన్నాడు. కానీ ఆరోజుల్లోనే కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు వచ్చాయి. ఊళ్ళో జనం చాలామంది వచ్చి ‘ మీ నాన్నగారికి మంచి పేరుంది. మిమ్మల్ని సొసైటీ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవం చేసుకొంటాం అని బ్రతిమాలారు. తను ఎటూ తెల్చుకోలేక తటపాటాయిస్తూ ఊఁ అన్నాడు. కానీ తరువాత ఎన్నికలు వచ్చాయి. ఇక తప్పదుగా.. ఎన్నికలు కొలహలం గా జరిగాయి. గొప్ప మెజారిటీ తో గెలిచాడు. డబ్బు కూడా తీసుకోకుండా ఓట్లేసిన జనం అభిమానానికి పొంగిపోయాడు. వారి ఆశలను కొంతైనా తీర్చాలనిపించింది. సొసైటీ సొమ్ముతో అప్పులిద్దామంటే, డబ్బు నిల్వలు తక్కువగా వున్నాయి. జిల్లా సహకార బ్యాంకు కు చాలాసార్లు తిరిగాడు. చివరికి ఎస్ సి కార్పొరేషన్ లోన్లు కొన్ని మాత్రం తెచ్చుకో గలిగాడు. తన్ను నమ్ముకున్నవారి కొందరికీ లోన్లు ఇవ్వడం కస్టమయ్యింది. స్టాఫ్ ను గుడ్డిగా నమ్మాడు. కొన్ని అవకతవకలు కూడా జరిగాయి. ఇంకేముంది ప్రత్యర్థి వర్గాల వాళ్ళు పేపర్లకెక్కరు. అది తిరిగి తిరిగి ఎంక్వయిరీ, తరువాత కేసు దాకా పోయింది. తన టర్మ్ పూర్తి అయ్యిన తరువాత హైదరాబాద్ వెళ్ళిపోయాడు. కానీ మరో పది సంవత్సరాలకు కేసు సెషెన్స్ కోర్టుకు వచ్చింది. ఆంటే సుమారు పదిహేను సంవత్సరాలకు ట్రయిల్స్ ప్రారంభం అయ్యాయి. కేసు మరో నాలుగు సంవత్సరాలు జరిగింది. ఓపికతో వాయిదాలకు హాజరైయ్యాడు సుందర్. ఇప్పుడు చివరకు జెడ్జిమెంట్ డే వచ్చింది.

             తాడేపల్లిగూడెం సెషెన్స్ కోర్టులు, పాత తాలూకా ఆఫీసు ప్రాంగణం లో వున్నాయి. ఈ నాలుగు సంవత్సరాలలో అక్కడ అన్నీ పరిచయం అయ్యాయి. ప్రొద్దుటే గౌతమి ఎక్సప్రెస్ కు దిగి రూమ్ తీసుకోవడం, కోర్ట్ టైమ్ కు అక్కడే ఎదురుగా వున్న అమ్మన్న హోటల్ లో, కానిస్టేబుల్, పాత సెక్రటరీ, క్లర్క్ లకు టిఫిన్లు పెట్టించడం, రాత్రికి మరల ట్రైన్ కు పోవడం అలవాటుగా మారిపోయింది. గవర్నమెంట్ వైపు నుంచి అప్పటి ఉద్యోగస్థులు కొంత మంది చనిపోవడం, మరికొంతమందికి అనారోగ్యాలు, ఇలా సరిఅయిన సమాధానాలు చెప్పేవారులేక కేసు వీగిపోయే స్థితికి చేరింది. తనే  ఖర్చులు పెట్టుకొని మిగిలిన వాళ్లకు కూడా క్రాస్ ఎక్సమినేషన్స్ పూర్తి చేయించాడు. కానిస్టేబుల్, పబ్లిక్ ప్రసిక్యూటర్ వీరందరి సహకారం తో కేసు ఓ కోలిక్కి వచ్చింది. ఈ రోజే తీర్పు ఇచ్చే రోజు. తనపై వున్న ఈ కేసు కొట్టేస్తారనే ధీమా ఉన్నప్పటికీ, ఏదో చిన్న ఆందోళన వెంటాడుతూనే వుంది.

        లాయర్ భూషణం గారి జూనియర్  కనిపించాడు. పెద్దాయనికి బాగాలేదని ఇంటికాడే ఉండిపోయారని, కేసు మానేజ్ చేయడానికి కొంచెం ఎక్కువ ఖర్చు అయ్యిందని, రేపు మీతో మాట్లాడతారని చెప్పాడు. ఇప్పటికే చాలా అయ్యింది, ఇంకా ఎంత పిండుతాడో అని భయం వేసింది.

        ఓ బెంచీ పైన కూర్చున్నాడు సుందర్. చివర ఎవరో ఇద్దరు ఆడమనుషులు కూర్చుని వున్నారు. వాళ్ళ మాటల్లో తెలుస్తోంది. ఏదో విడాకుల కేస్ అని. అమ్మాయి కళ్ళు లోపలికి పోయాయి. చింపిరి జుట్టు, కమిలిపోయిన శరీరం, నలిగిపోయి మాసిపోయిన నేత చీర, ఎండిపోయిన చెట్టులాగా, దిగాలుగా వుంది. సంకలో పిల్ల. పక్కనే వాళ్ళ అమ్మ, పొట్టిగా నల్లబడిపోయింది, జుట్టంతా ముగ్గుబుట్ట.  ఆవిడ ఈ పిల్ల అత్తగార్ని  తిడుతోంది. “కట్నాలు దొబ్బి, ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందని రాచి రంపన్నపెట్టి బయిటికి గేంటేసారు. ఇదేమి న్యాయం చెప్పండి అయ్యగారూ!” అని సుందర్ ని అడిగింది ఆవిడ. తనకు ఏమీ చెప్పాలో తెలీక బిక్కమొహం వేసాడు. ఏదో సముదాయంచాలనుకున్నాడు, ఇంతలో వాళ్లకు పిలుపొచ్చింది. వాళ్ళు ఆదరాబదరా కోర్టు లోనికి వెళ్లిపోయారు. సాయంత్రం దాకా సమయాన్ని ఎలాగడపాలి అని సుందర్ అనుకుంటుండగా, తనఊరువాడే సుబ్బారావు కనిపించాడు. “అయ్యగారూ తమరు ఇలా ఇక్కడ” అని ఆశ్చర్యపోతూ అడిగాడు. ” ఏమీలేదు, అప్పులిచ్చిన లోన్ల గురించి గొడవ. ఈ రోజుతో అయిపోతుందిలే” అన్నాడు సుందర్. “మరి నీ కేసు ఏమిటి?” అని అడిగాడు సుందర్. “అన్నదమ్ముల కుటుంబాల మద్య ఎప్పటినించో తగువులు వున్నాయండి. ఈ సంవత్సరం భోగి రోజున పెద్ద గొడవయిపోయిందండి. ఆడోళ్ళకి మొగోళ్ళకి కూడా తలలు పగిలాయండి..ఇప్పుడు ఉస్సురుమంటూ కోర్టులు చుట్టూ తిరుగుతున్నామండి. అంతా అరసెంటు స్థలం కోసమేనండి. ఊళ్ళో సరిగా తెర్పుచెప్పే నాథుడే లేడండి.” అని తల ఎలాడేసాడు సుబ్బారావు.” దీనికి తగ్గట్టు నెల కితం నాలుగు పాడి గేదెలను పచ్చగడ్డి కోసమని రెడ్డిసీమ తోలుకెలతన్నానండి. సందటేల లోడులారి గుద్దేసిందండి. అనాలుగు అక్కడికక్కడే సచ్చిపోనాయి. నాదశేమి బాలేదండి” అని కళ్ళమ్మట నీళ్లుపెట్టుకున్నాడు సుబ్బారావు. “సరే ఏమిచేస్తాం,బాధపడకు.. ఇన్సూరెన్స్ వచ్చిందా!” అని అడిగాడు సుందర్. “లేదండి కట్టలేదండి” అన్నాడు దిగాలుగా. “నువ్వుకట్టకపోయినా లారీకి తర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది. నా లయార్ కి చెబుతా, ఆరోజు కేసు వివరాలు పోలీస్ స్టేషన్ లో తీసుకొని లాయర్ గారికి ఇయ్యి” అన్నాడు సుందర్. సుబ్బారావు కళ్ళల్లో మెరుపు.. లాయర్ వివరాలు తీసుకొని దండాలు పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. పక్క ఊరు ప్రసాదరాజు గారు “ఎంతవరకూ వచ్చిందోయ్ సొసైటీ కేసు?” అని పలకరించారు సుందర్ ని. “ఏదో సాగుతోండండి!” అన్నాడు ముక్తసారిగా. “పాత కలెక్టర్, కొల్లేరులోని ఆన్సర్వే భూముల్లో చెర్వులు తవ్వామని మాపై కేసులు పెట్టాడు. ఆ గ్రామాల వడ్డీల దగ్గర లీజుకు తీసుకునే తవ్వాం. కొత్తవాడు వచ్చినప్పుడల్లా, పర్యావరణం.. తొక్క..అని మాచెర్వుల గట్టులు కొట్టేయడం, మా మీద కేసులు పెట్టేయడం మామూలయ్యిపోయింది.” అన్నాడు చిరాకుగా. “చదువుకున్నోడు కదా, నీకు తెలుస్తుందిలే!” అని నవ్వేసాడు. ఆయనకో నమస్కారం చేసి భోజనానికి బయలుదేరాడు సుందర్.

           ఇంతలో విడాకులు కేసు వాళ్ళు చెట్టు కింద బెంచీ మీద కనిపించారు. “ఈ రోజే తీర్పు ఇస్తారంటండి సాయంత్రం దాకా వుండమాన్నారండి.” అంది అపెద్దావిడ. భోజనం చేసారా అని అడిగాడు సుందర్. ఇంటి కాడిన్నించి తెచ్చుకున్న చద్దన్నం తిన్నామండి” అంది ఆవిడ. ఇంతలో చంటిపిల్ల గుక్కపెట్టి ఏడుస్తోంది. తల్లి జొ పెడుతూ దూరంగా తీసుకు వెళ్ళిపోయింది. నెమ్మదిగా నడుచుకొంటూ బయిటికి వస్తుంటే కానిస్టేబుల్ వచ్చాడు. సుందర్ చెవిలో గుసగుసలాడాడు. కోడిపందెం గాళ్ళను పట్టుకొన్నారు, పది కోళ్లు కూడా దొరికాయి. జెడ్జి గారు లంచ్ సమయం లో పాట పెడతారు, మీరేమైన పడుకుంటారా? ఓసారి కోళ్లను చూద్దాం రండి” అన్నాడు.

దూరంగా వేపచెట్టు కింద కట్టేసారు. “ఇవి  పీలగా వున్నాయి మామూలు నాటుకోళ్ళే” అన్నాడు సుందర్. పళ్ళికిలించాడు కానిస్టేబుల్. “అసలు వాటిని మార్చేసుంటార్లెండి” అన్నాడు. బజారులో నాటుకోళ్లు కూడా ఎక్కువరేటే పలుకుతున్నాయి. మాములుగా కోర్టు స్టాఫ్ పాడేసుకొంటారు సార్, కానీ జడ్జి గారికి తెలియ కూడదు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను.” అన్నాడు. “నన్నోదిలేయ్ బాబూ, అసలే ఈరోజు తీర్పు ఇస్తున్నారు. ఆవిడ గుర్తుపడితే అంతేసంగతులు” అన్నాడు సుందర్. “సర్లెండి ఎవర్నో చూసుకుంటాలెండి” అని వెళ్లిపోయాడు కానిస్టేబుల్.

             భోజనం చేస్తున్నా మనస్సంతా గతంలో జరిగిన ట్రయిల్స్ పైకి మళ్ళింది.

రెండు నెల్ల క్రితం రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ ను క్రాస్ ఎక్సమినేషన్ చేశారు జెడ్జి గారు. అప్పటికే చాదస్తం వచ్చేసినట్టుంది. పెద్దాయన అనే గౌరవంతో దగ్గర్లో కుర్చీ లో కూర్చోబెట్టారు.”ఈ లోన్లు తీసుకున్న లబ్ధిదారులను మీరుచూశారా? ” అని అడిగారు జెడ్జి గారు. “లేదు చూడలేదు” అన్నారాయన. “మరి మీరు స్వయాన్న గుర్తించి ఆమోదించి సంతకం చేసారనివుంది ఇక్కడ.” అడిగారు జెడ్జి. ఆయనకు కోపం వచ్చేసింది. “జిల్లాలో కొన్ని వందల ఫైల్స్ సంతకాలు చేస్తాం. వేల లబ్ధిదారులను గుర్తించడం అసాధ్యం. క్రింది అధికారులను నమ్మి సంతకాలు చెయ్యడం తప్ప వేరే మార్గం లేదు.” అన్నాడు అయన కొంచెం స్వరం పెంచుతూ. జెడ్జి గారు కలగ చేసుకొంటూ “మీరు స్వయంగా తనిఖీ చేసి ఆమోదించానని సంతకం చేశారు. మీరు పెద్దవారైపోయారు. సాధారణంగా జరిగే ప్రక్రియ గురించి నాకు చెప్పొద్దు. ఇలాగయితే మీరు మరో కేసులో ఇరుక్కుంటారు. ఇక మీరు వెళ్లొచ్చు” అని చికాకు పడింది ఆవిడ. ఓ రకంగా ఆయనకు సహాయం చేసినట్టు అయ్యింది.

    మరోసారి, పిటీషన్ పెట్టిన ఓబులేసు వంతొచ్చింది. “ఆ ఎదురుగా వున్న మాజీ సొసైటీ ప్రెసిడెంట్, సెక్రెటరీ, గుమస్తా, వీళ్ళు నీకు తెలుసా!”అని జెడ్జి అడిగారు. ఓసారి అతను అటు తిరిగి చూసి “తెలియదండి” అన్నాడు. మరి పిటీషన్ నువ్వే పెట్టావుకదా, ఈసంతకం నీదేనా? ” అని అడిగారు. “నాకు సంతకం రాదండి” అన్నాడు చేతులు కట్టుకొని,  వొంగి వొంగి.  జెడ్జి గారు చిన్నగా నవ్వుకొని ఏదోరాసుకొన్నారు. బయిటికి వచ్చిన ఓబిలేసు సుందర్ దగ్గరికి వచ్చి, ” అయ్యా మీకు అన్నాయం చేసానండయ్యా, చెమించాలి. పిల్లలు చదువుకుంటున్నారయ్య తమరు ఏదైనా సాయం చెయ్యాలండయ్య, అని పడి పడి నమస్కారాలు చేసాడు.

ఇలా జరిగినవన్నీ ఆలోచిస్తూ కోర్టుకు తిరిగొచ్చాడు. రోడ్డు మీద ఎండ ఎక్కువగా వుంది. చెట్ల నీడల్లో కొంతమంది తిరుగు తున్నారు. వాయిదాలు అయ్యిపోయాక జనం తగ్గారు. మధ్యాహ్నం చాలా భారంగా గడిచింది. సాయంత్రపు నీరెండలు చెట్ల ఆకుల్లోంచి వాలుగా పడుతున్నాయి. ఇతర కేసుల వాద ప్రతివాదాలు కూడా అయ్యిపోయాయి. చాలా మంది వెళ్లి పోయారు. చిరు చీకటి నెమ్మదిగా ఆలమకొంటోంది. లైట్లు కొన్ని వెలిగాయి. ఇంతలో కానిస్టేబుల్ ప్రకాశం వచ్చి “మన కోర్టు లో కరెంటు పోయింది. జెడ్జి గారు కువ్వొత్తుల వెలుగు లోనే తీర్పు రాస్తారు” అన్నాడు. “సార్ మధ్యాహ్నం రెండు నాటు కోళ్లు నేను తీసుకన్నా సార్, ఈ తీర్పు అయ్యాకా మా ఇంటికాడ భోజనం చేద్దురు అన్నాడు.”  “నీకో దండం ముందు తీర్పు అవ్వనీయవయ్య బాబూ!” అని నమస్కారం చేసాడు సుందర్. రాత్రి తొమ్మిది గంటలకు పిలుపు వచ్చింది. జెడ్జి గారి ఛాంబర్ కు వెళ్లారు వీళ్ళు. ఆమె అందరి పేర్లు కనుక్కొని ” మీపై ప్రభుత్వం చేసిన అభియోగాలకు సరైన సాక్ష్యాదారాలు లేకపోవటం వల్ల కేసు కొట్టివేయడమైనది.” అన్నారు. వీళ్ళు ఆశ్చర్యం, ఆనందం నుండి తెరుకునే లోపే “ఇక మీరు వెళ్లొచ్చు, తీర్పుపూర్తి పాఠం మూడు రోజుల్లో కోర్టు గుమస్తాదగ్గర తీసుకోండి.” అన్నారు. హుషారుగా బయిటికి వచ్చిన సుందర్ అందరికీ డబ్బుపంచే సరికి నీరసపడ్డాడు.

        రాత్రి పది గంటలయ్యింది. రోడ్లు పై రాద్దీ తగ్గిపోయింది. బ్యాటరీ లైట్ వెలుగులో ఆపిల్స్, నారింజపళ్ళు అమ్మే షాపు కనిపించింది. అతన్ని అడిగాడు సుందర్ ” మధ్యాహ్నం కోళ్లు పాడింది నువ్వేనా?”  “అవునండి.. కానీ నాకోసం కదండీ.. కోర్టు స్టాఫ్ కోసమండి.. లేకపోతే నా బండి ఇక్కడ పెట్టనివ్వరు కదండీ ” అన్నాడు అతను. రోడ్డు కి ఆవల విడాకులు కేసు వాళ్ళు కనిపించారు. అటువైపు వెళ్లి “అరె ఇంకా ఇక్కడే వున్నారు? మీ కేసు తీర్పు వచ్చిందా” అని పెద్దావిడను అడిగాడు. “లేదండి ఇప్పటి దాకా ఉంచి రేపు రమ్మన్నారండీ. అంది ఆవిడ. ఇప్పుడు మావూరు బస్సులేమి లేవండి.” అంది దిగాలుగా. ఆమె కూతురు, చంకలో వున్న పిల్ల, సుందర్ వంక కళ్ళు పద్దవి చేసి చూస్తున్నారు. “సరే ఏదైనా ఆటో కట్టించుకొని వెళ్లిపోండి” అని కొంత డబ్బు ఆమె చేతిలో పెట్టి, రూమువైపుకు నడిచి వెళ్ళిపోయాడు.

          రాత్రి పదిన్నర అయ్యింది. రైల్వే స్టేషన్ లో మూడో నెంబర్ ఫ్లాట్ ఫార్మ్ పై దూరంగా ఓ బెంచీ పై కూర్చున్నాడు సుందర్. పెద్దగా ప్రయాణికులు కనిపించడం లేదు. వాతావరణం కొంచెం చల్లబడింది. ఆకాశం లో చుక్కలు విచారం వున్నాయి. తెలియని ఆవేదన సుందర్ మనసులోనికి పాకుతోంది. జేబులు కొట్టే సూరిగాడికి సంవత్సరం శిక్ష పడిందంట, మధ్యాహ్నం చీర కొంగులు అడ్డుపెట్టుకొని భయంగా చూస్తున్న ఆ నలుగురు ఆడోళ్ళకి వ్యభిచారం కేసుపై మూడునెలలు శిక్ష, విటులు మాత్రం డబ్బులిచ్చి జారిపోయారు. అరసెంటు కోసం రక్తాలు చిందుతున్నాయి, చచ్చిపోయిన గేదెల రక్తం నల్లని తారరోడ్డు పై పారుతోంది. ఇంతలో చంటిపాప ఏడుపు.. ఆగని ఏడుపు.. మరోపక్క కొల్లేరును పిండుకొంటున్న రాజుగారి వెకిలి నవ్వు.. మనస్సంతా తుఫాను హోరు.. ఇంతలో సెక్రటరీ భూషణం ఫోను చేసాడు. ఈ సమయం లో ఫోన్ ఏమిటి అనుకుంటూ ఎత్తాడు. “సార్ ఇందాకే మన లాయర్ వెంకటేశం గారు హర్ట్ ఎటాక్ తో పోయారంట. గుమస్తా చెప్పాడు ” అన్నాడు భూషణం. “ఇప్పుడేమి చేయగలం. వీలైతే పదకొండో రోజు వస్తాలే” అని ఫోన్ పెట్టేసాడుసుందర్.

మనస్సు కొంచెం ఊరట చెందినట్లు అనిపించింది. ఇంతలో గౌతమి ఎక్సప్రెస్ వస్తున్నట్లు ఏనౌన్స్మెంట్ వచ్చింది. బెర్త్ మీద పడుకొన్న సుందర్ కి ఎప్పటికో పట్టిన నిద్ర..

పీడ కల.. ఆ పసిపాప పిచ్చిగా నవ్వుతోంది.. గేదెలు రోడ్డుమీద పరిగెడుతున్నాయి. జేబులు కొట్టేవాళ్ళు తనొంక గుర్రుగా చూస్తున్నారు. నీడల్లో తిరుగు తున్న వేశ్యలు మొఖం మీద పరదా పక్కకు తొలగించి తుపుక్కున ఎర్రని ఉమ్మి ఉశారు.  సుబ్బారావు పడి పడి నమస్కారాలు చేస్స్తున్నాడు   అందరూ అడుగుతున్నారు, మీద పడి రక్కుతున్నారు. ‘మాక్కూడా నాయ్యం కొని పెట్టమని.’ హటాత్తు గా మెలుకువ వచ్చింది. మొఖమంతా చెమటలు పట్టాయి. రైలు పోతూనే వుంది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *