గురజాడ అప్పారావు గారు (1862-1915) వలసపాలనకాలంలో పుట్టి,ఆ కాలంలోనే 53 ఏళ్ళు జీవించి , ఆ కాలంలోనే కన్నుమూశారు.అనేక బాధ్యతలు, అనారోగ్యాలు మధ్యనే 30 ఏళ్ళు సాహిత్య రచన చేశారు. ఆయన రాసింది 1500 పుటలు. ఆయన సాహిత్యం మీద వచ్చిన విమర్శ, జరిగిన పరిశోధన కనీసం 25000 పుటలు ఉంటుంది. ఇదొక చరిత్ర. గురజాడ 1915 లో మరణించినా ఆతర్వాతే ఆయన జీవిస్తున్నాడు అని దేవులపల్లి కృష్ణశాస్త్రి అన్నమాట నిజమైంది. అలాగే గురజాడ అభిప్రాయాలు 21 వ శతాబ్దానివి అన్ని రాచమల్లు రామచంద్రారెడ్డి మాటా నిజమైంది. వేమూరి వెంకట రామనాథం అనుకుంటాను, గురజాడ మేధావి రచయిత అన్నారు. అది వాస్తవమని రుజువైంది.
గురజాడ కాలం చెల్లిన రచయిత కాదు. కాలాన్ని తన వెంట నడిపిస్తున్న రచయిత. గురజాడకు కాలం చెల్లాలంటే , మన సమాజం చాలా మారాలి. విప్లవాత్మకంగా మారాలి. కానీ మన సమాజం గురజాడ దాకా కాదుకదా, వేమన దాక కూడా రాలేదు. గురజాడ దాకా రావడమంటే
1. మనసమాజం మనిషిని వాస్తవంగా నమ్మాలి.
2. మతాలు, మతవిశ్వాసాలు పోవాలి.మతాలు ఉన్నాయి గనుక మతసామరస్యం ఉండాలి
3. విగ్రహారాధన పోవాలి.
4. సాంఘిక వివక్ష పోవాలి.
5.1. అస్పష్టత నశించాలి.దళితులను సాటి మనుషులుగా గుర్తించాలి
5.2. స్త్రీలను గౌరవించే సంస్కారం రావాలి. భార్యలను స్నేహితురాండ్రుగా భర్తలు గుర్తించాలి.
6. సమాజం వైజ్ఞానికం కావాలి
7. అవకాశవాద రాజకీయాలు పోవాలి.
8. అవినీతి నశించాలి.
9. దేశమంటే మనుషులేననే జ్ఞానం కలగాలి.
10. సమాజం ప్రేమ పునాది మీద పునర్నిర్మాణం జరిగింది.
11. కులాంతర మతాంతర వివాహాలు విరివిగా జరగాలి.
12. ప్రకృతి పరిణామాలను భారతీయులంతా నిర్భయంగా శాస్త్రీయంగా వీక్షించి అర్థం చేసుకోవాలి
13. వంచన, మోసం , స్వక్షేమవాదం నశించాలి.
14. సామాజిక వ్యవస్థలన్నీ సామాన్యులకు, అమాయకులకు, నష్టపోయిన వారికి అండగా నిలవాలి
15. విద్యావిధానం శాస్త్రీయమూ,ప్రయోజనాత్మకమూ కావాలి.
16. టాక్ లెస్ డూ మోర్. మాటలు తగ్గించి పని పెరగాలి.
17. గతాన్ని నెమరువేసుకుంటూ, జీవితాలను వృధా చేసుకోకుండా వర్తమానం గురించి ఆలోచించాలి.
18. ఇన్నాళ్ళు జరిగిన నష్టాన్ని ఇకనైనా పూరించుకుంటూ ముందుకు పోవాలి.
19. జనాన్ని మౌఢ్యం లోకి నెట్టేసి భయపెట్టే దుర్మార్గం పోవాలి.
20. ప్రశ్నను ఆహ్వానించాలి. ప్రశ్నను గౌరవించాలి. ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ప్రశ్నను ప్రజాస్వామ్యానికి జెండాగా ఎగురవేయాలి.
ఇన్ని జరగాలి గనుక గురజాడ కాలం చెల్లిన రచయిత కాదు. ఆయనతో మనకాలపు సమాజానికి ప్రాసంగికత ఉంది.
