నగ్నముని అనగానే సమస్త అస్థవ్యస్థ వ్యవస్థలపై ధిక్కార స్వరంతో ప్రారంభించిన దిగంబర కవితోద్యమం, సామాన్యులను విపత్కర పరిస్థితులలో ఆదుకోని అసమర్ధ అరాచక ప్రభుత్వం అసలు స్వరూపం ఏమిటో చిత్రించిన ఆధునిక తొలి రాజకీయ తాత్త్విక కావ్యం ‘కొయ్యగుర్రం’, పౌరుల సర్వ హక్కులను హరిస్తూ అక్రమంగా విధించిన ఎమర్జెన్సీపై రచించిన విలోమ కథలు మొదలైనవి గుర్తుకొస్తాయి. విలోమం అంటే సక్రమం కానిది, పెడదారి పట్టినది. ఇది విలువలకు సంబంధించినది. ముఖ్యంగా మన నాయకులు అనుసరిస్తున్న రాజకీయవిలువల గురించినది. దాని ప్రభావం సమాజంపై ఎంత భయంకరమైన ప్రభావం చూపిస్తుందో తెలిపేది. ఈ నేపథ్యంలో వచ్చినదే నగ్నముని కథ ‘ఆకాశ దేవర’.
సున్నాను కనిపెట్టి ప్రపంచానికి లెక్కలు నేర్పిన ఈ దేశంలో, శూన్యంలో నుంచి డబ్బు ఎలా సంపాదించవచ్చో ‘మిస్టర్ కారష్’ అనే కాపురుష్, కాలిక పురుష పాత్ర ద్వారా ‘ఆకాశ దేవర’లో నివ్వెర పరచాడు నగ్నముని. శూన్యం అంటే ఏమీ లేనితనం. ఈ ఏమీ లేనితనాన్ని గౌతమ బుద్ధుడు ప్రవచించినట్టు అస్తిత్వపు రాహిత్యంగా ఎలా మలచవచ్చో ‘మిస్టర్ కారష్’ అనే నెగిటివ్, కార్నివోరస్ పాత్ర ‘ఆకాశ దేవర’లో ఆకాశమై ఆవిష్కరించింది. రూపాయి కరెన్సీ నోటు మీద ‘ఈ నోటు తెచ్చేవారికి ఒక రూపాయి చెల్లిస్తా’మని వాగ్దానం చేస్తూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఉంటుంది. అలాంటి నోట్లను వేన వేలుగా శూన్యం నుంచి పుట్టించాలంటే వానికి ఈ సమాజపు ఆర్ధిక పోకడ తెలిసి ఉండాలి. మనుషుల మనస్తత్వాలు, క్రూరమైన తర్కం, అంతకంటె క్రూరమైన ఆచరణ తెలిసి ఉండాలి. అన్నింటికీ మించి అడ్డమొచ్చిన ప్రతివాణ్ణీ నిర్దాక్షిణ్యంగా తొక్కుకుంటూ పోయే మొరటు పోడ ఒకటి ఉండి తీరాలి.
వాటన్నింటి ప్రతి రూపమే ఆకాశ దేవరలోని ‘కారష్’. డిమాండు, సప్లైల వ్యత్యాస రహస్యాన్ని ఎప్పటికప్పుడు ఆకళింపు చేసుకొని అడుగు వేసేవాడే ప్రపంచపు రారాజు. దేవుడి పేరుతో మార్కెట్ ఎలా సృష్టించవచ్చో, ఆ మార్కెట్‌కు ‘బూమ్’ ఎలా పెంచవచ్చో, దానికి ‘స్లంప్’ (ఆర్ధిక దుస్థితి) అన్నది లేనే లేదు అనే రహస్యాన్ని కూడా ఎరిగినవాడు కారష్. ఈ వ్యాపారానికి పోటీ లేదు. ఉన్నా కారష్ వంటి వ్యక్తులకు అదేమంత పెద్ద విషయం కాదు.
రెండు వర్గాల మధ్యనో, లేదా రెండు కంపెనీల మధ్యనో రాయబారం కారష్ జోక్యంతో ముగిసిన రోజున గ్లాసులు ఘల్లు మంటాయి. ప్రతి వ్యాపారానికి ముడి సరకులున్నట్టుగానే ఈయన వ్యాపారానికి ఒక ముడి సరకు ఉంది. దానిపేరు అబద్ధం. ఒకప్పుడు ఉనికిలో ఉన్న నిజాన్ని ఇప్పుడు అబద్ధంగా, లేదా అబద్ధాన్ని నిజంగా చేయడమనే దశను దాని నిజంతో సంబంధం లేకుండానే అబద్ధాన్ని సృష్టించి, ఆ స్వయంభువునే అసలు సిసలు నిజంగా జనం రక్తంలోకి ఎక్కించే కొత్త కళను ఔపోసన పట్టిన వాడు. ‘మాన్యుఫాక్చరింగ్ కన్సెంట్’ కళలో ఆరి తేరినవాడు.
మనుషులు మహా శూన్య గర్భంలోకి డబ్బులు విసరడం, ఆ డబ్బులు ఒక నెట్‌వర్క్ ద్వారా కారష్‌కు చేరడమూ, ఆ శూన్య గర్భం ఆకాశ దేవర చుట్టూ ఒక వ్యాపార వలయం సృష్టించడమూ అంతా ఒక మహా మాయ. శూన్య యోగం, ద్రవ్య సృష్టి. ఈ సూపర్ నెట్‌వర్క్‌కు బీజం వేసిన తీరు కథంతా పూర్తయ్యాక కానీ తేటతెల్లం కాదు. ఈ ‘సుప్రాటెక్నో నెట్‌వర్క్’ సృష్టించడం, మార్కెట్ మాయలో ఆరితేరిన వారు తరచూ ఈ ఫీట్లు చేస్తూండడం మనం గమనిస్తున్నదే. కథా శైలితో నగ్నముని ఆ తీరుని బొమ్మ కట్టించిన వైనం బాగుంది. ఉదాహరణకి, ఒక యజమాని దగ్గర పనిచేసే నౌకరు అతని వాచీని కొట్టేశాడు. దాన్ని చాలా ఖరీదుకు అమ్మాడు. ఆ వాచీ కోసమే అతడు దొంగ అయ్యాడు. దానికోసమే అతను నమ్మక ద్రోహి అయ్యాడు. దానికోసమే అతడు అన్నీ అయ్యాడు. అయితేనేం, అందువల్లనే కదా అతనికి కావలసినంత డబ్బు వచ్చింది, లేదా కావల్సినంత డబ్బొస్తుంది కాబట్టి అతనలా చేశాడు. ఏదో విధంగా డబ్బయితే వచ్చింది కదా. ఇదే అతని తత్వం, నేటి ప్రపంచ తత్వమూ. అలాగే ఈ తత్వాన్ని ఒంటబట్టించుకున్న నేటి ప్రపంచం ఒక నీతి బాహ్యమైన అబద్ధపు కాల్పనిక వర్తులంలో గిరికీలు కొడుతుంది. ఈ రోజు పాతకాలపు విలువలతో కూడిన హీరో లేడు. అందరూ ప్రతినాయకులే. ప్రతి నాయకత్వంలో తనకంటూ ఒక శైలిని ఏర్పరచుకొని ఎంత ఎక్కువగా, ఎంత నిర్లజ్జగా, ఎంత క్రూరంగా దోపిడీ (తప్పు… దాన్ని సంపాదన అనాలేమో!) చేయగలిగితే వాడే నాయకుడు. వాడే అసలు సిసలు హీరో. కారష్ కూడా అట్లాంటి హీరోయే. మిస్టర్ కారష్ ఒక గట్టర్ బోయ్, ఒక స్లమ్ డాగ్, ఒక క్రూరుడు. కారష్ ఒక నీతి బాహ్య వ్యాపారి. అంతెందుకు, కారష్ ఒక ‘కార్నివోరస్’ మాంసభక్షకుడు. అది నరమాంసమైనా సరే. పదేళ్ళకే అనాథ. న్యూస్ పేపర్ వేయడం, వాల్‌పోస్టర్లు అంటించడం దగ్గర్నుంచి అన్ని పనులూ చేస్తూ పేవ్‌మెంట్ మీద బతికాడు. అయితే మిస్టర్ కారష్ ఒక ఆశా జీవి. ఒక సంక్లిష్ట వ్యక్తి. అతనికి ఈ సమాజ దైన్యం పట్ల స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. స్ర్తీ పురుషుల మధ్య ప్రేమ, సెక్స్ దగ్గర్నుంచి ఈ దేశంలో జరిగే ఎన్నికలు, అవినీతి, ప్రజాప్రతినిధుల అసమర్ధత, పరిపాలనలో అరాచకత్వం- ఒకటేమిటి, ‘ఈ సమాజమనేది ప్రజాస్వామ్య కసాయి వెంట నడిచే గొర్రె’ అంటాడు. ‘సంక్షేమానికో కసాయి భాష’ ఉందంటాడు. నిజానికి అతను అట్లా మాట్లాడుతున్నప్పుడు అతనిలో ఒక విలన్ కాక హీరో కనబడతాడు. నగ్నముని విలోమ కథలు రాసి 35 ఏళ్ళు దాటింది. ఆనాడు సమాజం విలోమ గమనంలో ఎలా నడుస్తోందో చెప్పాడు. ఈ 35 ఏళ్ళ తర్వాత కూడా తన గమనాన్ని మార్చుకోకుండానే ఇంకా, ఇంకా దిగజారుతోన్న వైనాన్ని తనదైన శైలిలో అధిక్షేపించాడు.
నేడు ఉదయం, వార్తాపత్రిక తెరవగానే కనబడే కారష్‌లు కోకొల్లలు. ఒక మంత్రి కావచ్చు, ఒక పొలిటికల్ బ్రోకర్ కావచ్చు, ఎవరైనా సరే వారు అబద్ధాలను అమ్ముతుంటారు. కోట్లకు పడగలెత్తుతారు. ఒక్కో అబద్ధం విలువ కోటి నుంచి పది కోట్ల రూపాయల దాకా ఉండొచ్చు. ఈ అబద్ధాలను అమ్మడానికి వారికి విలువలేం ఉండవు. అన్నిటినీ వినియోగించుకుంటారు. ‘నిజాన్ని పాతిపెట్టి ఆ సమాధిపై నిలబడి ప్రచార యంత్రం మాట్లాడుతుంది’ అంటాడు కారష్. అంతేకాక ప్రచార యంత్రం కక్ష్యకు వెలుపల ఉండేవారి సంఖ్య బహు తక్కువ అనే సత్యాన్ని గ్రహించినవాడు. అబద్ధాలతో లేని చరిత్రను జరిగినట్టు సృష్టించే కాల్పనిక యంత్రాలెన్నో. నేడు డబ్బుతో డబ్బును కొనే దశను దాటి, ప్రచారంతో డబ్బు చేయలేని పనులెన్నో చేయగలననే సత్యాన్ని గ్రహించినవాడు కారష్.
ఈ మధ్య ఒక సినిమాలో- దేవాలయంలో అడుక్కునే ఒక పాత్ర ‘ఇన్‌ఫర్మేషన్ ఈజ్ వెల్త్’ అంటుంది. ఇన్ఫర్మేషన్‌ను అబద్ధాలతో నింపితే డబ్బే డబ్బు. దేవుళ్ళకు కొదువ లేని ఈ దేశంలో దేవుణ్ణి సరకుగా చేసుకుని లెక్కకి మిక్కిలి కారష్‌లు ఎలా సంపాదిస్తున్నారో నిత్యానుభవమే. ఒకడు దేవుని పేరు చెప్పి కొట్టేస్తాడు. ఇంకొకడు నేనే కలియుగ దేవుణ్ణంటూ బంగారు దేవాలయం నిర్మించుకుంటాడు. ధనమూలం మిదం జగత్, జగన్మూల మిదం ధనం. మహా శూన్య గర్భంనుంచి నగ్నముని సృష్టించిన ఒక సింబాలిక్ సెటైర్. నదుల్లోకి, కాలువల్లోకి డబ్బులు విసిరేసే జనం- దేవుడి పేరు చెబితే శూన్యంలోకి విసరలేరా?నగ్నముని రాసిన ఈ ‘ఆకాశ దేవర’ సాహిత్యరూపమేదో నాకు తెలియదు. ఇది కథో, నవలికో, పెద్ద కథో ఏదైనా కావచ్చు. సైజు కొలమానం కాదు. మిస్టర్ కారష్ అనే ఒక ‘నైవ్ నెరేటర్’తో కథను నడిపిన తీరు చాలా బాగుంది. అబద్ధపు పునాదులమీద కట్టిన పాశ్చాత్య ఆర్ధిక ప్రపంచం కుప్ప కూలిన తీరును కళ్ళారా వీక్షించాము.
‘ది గ్రేప్స్ ఆఫ్ రాత్’కు ముందు మాట రాస్తూ రాబర్డ్ డిమాట్ ఆ నవల గురించి “The grapes of warth has a home grown quality, part naturalistic epic, part jeremiad, part captivity narrative, part road novel, part transcendal gospel’. ఈ లక్షణాలు ఆకాశదేవరకు కూడా ఉన్నాయనుకుంటాను. ఏ సాహిత్యమైనా ఆనాటి కాల పరిస్థితులను ప్రతిబింబించకపోతే, మానవ మెదడులో గూడు కట్టుకున్న శూన్యాన్ని రూపు కట్టడంలో విఫలమైతే అది సాహిత్యం కానే కాదు. కేవలం కాలక్షేపపు కాల్పనికం మాత్రమే. మొత్తంగా ఆకాశ దేవర ఒక “political allegory’.